Categories
యెహోషువ

యెహోషువ 1

1 యెహోవా సేవకుడైన మోషే మృతినొందిన తరువాత, యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెను–నా సేవకుడైన మోషే మృతినొందెను.౹

2 కాబట్టి నీవు లేచి, నీవును ఈ జనులందరును ఈ యొర్దానునది దాటి నేను ఇశ్రాయేలీయులకిచ్చుచున్న దేశమునకు వెళ్లుడి.౹

3 నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను.౹

4 అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానదియైన యూఫ్రటీసు నదివరకును హిత్తీయుల దేశమంతయు పడమట మహా సముద్రమువరకును మీకు సరిహద్దు.౹

5 నీవు బ్రదుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ యెదుట నిలువలేక యుండును; నేను మోషేకు తోడై యుండినట్లు నీకును తోడైయుందును.౹

6 నిన్ను విడువను నిన్ను ఎడబాయను, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన యీ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు.౹

7 అయితే నీవు నిబ్బరముగలిగి జాగ్రత్తపడి బహు ధైర్యముగానుండి, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించునట్లు నీవు దానినుండి కుడికిగాని యెడమకుగాని తొలగకూడదు.౹

8 ఈ ధర్మశాస్త్రగ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు దివారాత్రము దాని ధ్యానించినయెడల నీ మార్గమును వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు.౹

9 నేను నీ కాజ్ఞయిచ్చియున్నాను గదా, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము, దిగులుపడకుము జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై యుండును.

10 కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఈలాగు ఆజ్ఞాపించెను–మీరు పాళెములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి

11 –మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనబోవుటకై మూడుదినములలోగా మీరు ఈ యొర్దానును దాటవలెను. గనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి.

12 మరియు రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపువారికిని యెహోషువ యీలాగు ఆజ్ఞాపించెను.౹

13 యెహోవా సేవకుడైన మోషే మీ కాజ్ఞాపించిన సంగతి జ్ఞాపకము చేసికొనుడి; ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగజేయుచున్నాడు; ఆయన ఈ దేశమును మీకిచ్చును.౹

14 మీ భార్యలును మీ పిల్లలును మీ ఆస్తియు యొర్దాను అవతల మోషే మీకిచ్చిన యీ దేశమున నివసింపవలెనుగాని, పరాక్రమవంతులును శూరులునైన మీరందరు యుద్ధసన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా

15 నది దాటి, యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకును విశ్రాంతి దయచేయువరకు, అనగా మీ దేవుడైన యెహోవావారికిచ్చు దేశమును స్వాధీనపరచుకొనువరకు మీరును సహాయము చేయవలెను. అప్పుడు తూర్పున యొర్దాను ఇవతల యెహోవా సేవకుడైన మోషే మీకిచ్చిన మీ స్వాస్థ్యమైన దేశమునకు మీరు తిరిగి వచ్చి దాని స్వాధీనపరచుకొందురు.౹

16 అందుకు వారు–నీవు మా కాజ్ఞాపించినదంతయు మేము చేసెదము, నీవు మమ్ము నెక్కడికి పంపుదువో అక్కడికి పోదుము;౹

17 మోషే చెప్పిన ప్రతిమాట మేము వినినట్లు నీ మాట విందుము; నీ దేవుడైన యెహోవా మోషేకు తోడైయుండినట్లు నీకును తోడై యుండును గాక.౹

18 నీమీద తిరుగబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయములో నీ మాట వినని వారందరు మరణశిక్ష నొందుదురు; నీవు నిబ్బరముగలిగి ధైర్యము తెచ్చుకొనవలెనని యెహోషువకు ఉత్తరమిచ్చిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOS/1-47eb2d508eea16dd6483ec806fe8a0c8.mp3?version_id=1787—

0 replies on “యెహోషువ 1”

Leave a Reply to A Baburao Cancel reply

Your email address will not be published. Required fields are marked *