Categories
న్యాయాధిపతులు

న్యాయాధిపతులు 14

1 సమ్సోను తిమ్నాతునకు వెళ్లి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచెను.౹

2 అతడు తిరిగి వచ్చి–తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచితిని, మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవలెనని తన తలిదండ్రులతో అనగా

3 వారు–నీ స్వజనుల కుమార్తెలలోనేగాని నా జనులలోనేగాని స్త్రీ లేదనుకొని, సున్నతి పొందని ఫిలిష్తీయులలోనుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్లు చున్నావా? అని అతని నడిగిరి. అందుకు సమ్సోను–ఆమె నాకిష్టమైనది గనుక ఆమెను నాకొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పెను.౹

4 అయితే ఫిలిప్తీయులకేమైన చేయుటకై యెహోవాచేత అతడు రేపబడెనన్న మాట అతని తలిదండ్రులు తెలిసికొనలేదు. ఆ కాలమున ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను ఏలుచుండిరి.

5 అప్పుడు సమ్సోను తన తలిదండ్రులతోకూడ తిమ్నాతు నకుపోయి, తిమ్నాతు ద్రాక్షతోటలవరకు వచ్చినప్పుడు, కొదమసింహము అతని యెదుటికి బొబ్బరించుచువచ్చెను.౹

6 యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతనిచేతిలో ఏమియు లేకపోయినను, ఒకడు మేకపిల్లను చీల్చునట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు.౹

7 అతడు అక్క డికి వెళ్లి ఆ స్త్రీతో మాటలాడినప్పుడు ఆమెయందు సమ్సోనుకు ఇష్టము కలిగెను.౹

8 కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసికొని వచ్చుటకు తిరిగి వెళ్లుచుండగా, ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆవైపు తిరిగినప్పుడు, సింహపుకళేబరములో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా

9 అతడు ఆ తేనె చేతనుంచుకొని తినుచు వెళ్లుచు తన తలిదండ్రులయొద్దకు వచ్చి వారికి కొంత నియ్యగా వారును తినిరి. అయితే తాను సింహపుకళేబరములోనుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియజేయలేదు.౹

10 అంతట అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సమ్సోను విందుచేసెను. అచ్చటి పెండ్లికుమారులు అట్లు చేయుట మర్యాద.౹

11 వారు అతని చూచినప్పుడు అతని యొద్ద నుండుటకు ముప్పదిమంది స్నేహితులను తోడుకొని వచ్చిరి.౹

12 అప్పుడు సమ్సోను–మీకిష్టమైనయెడల నేను మీ యెదుట ఒక విప్పుడు కథను వేసెదను; మీరు ఈ విందు జరుగు ఏడు దినములలోగా దాని భావమును నాకు తెలిపినయెడల నేను ముప్పది సన్నపు నారబట్టలను ముప్పది దుస్తులను మీ కిచ్చెదను.౹

13 మీరు దాని నాకు తెలుపలేక పోయినయెడల మీరు ముప్పది సన్నపు నారబట్టలను ముప్పది దుస్తులను నాకియ్యవలెనని వారితో చెప్పగా వారు–మేము ఒప్పుకొందుము, నీ విప్పుడు కథను వేయుమని అతనితో చెప్పిరి.౹

14 కాగా అతడు–

బలమైనదానిలోనుండి తీపి వచ్చెను,

తిను దానిలోనుండి తిండి వచ్చెను అనెను.

మూడుదినములలోగా వారు ఆ విప్పుడు కథ భావమును చెప్పలేకపోయిరి.

15 ఏడవదినమునవారు సమ్సోను భార్యతో ఇట్లనిరి–నీ పెనిమిటి ఆ విప్పుడు కథభావమును మాకు తెలుపునట్లు అతని లాలనచేయుము, లేనియెడల మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి యింటివారిని కాల్చివేసెదము; మా ఆస్తిని స్వాధీన పరచుకొనుటకే మమ్మును పిలిచితిరా? అనిరి.౹

16 కాబట్టి సమ్సోను భార్య అతని పాదములయొద్దపడి యేడ్చుచు–నీవు నన్ను ద్వేషించితివిగాని ప్రేమింపలేదు. నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసితివి, దాని నాకు తెలుప వైతివి అనగా అతడు–నేను నా తలిదండ్రులకైనను దాని తెలుపలేదు, నీకు తెలుపుదునా? అనినప్పుడు ఆమె వారి విందు దినములు ఏడింటను అతనియొద్ద ఏడ్చుచువచ్చెను.౹

17 ఏడవదినమున ఆమె అతని తొందరపెట్టినందున అతడు ఆమెకు దాని తెలియజేయగా ఆమె తన జనులకు ఆ విప్పుడు కథను తెలిపెను.౹

18 ఏడవదినమున సూర్యుడు అస్తమింపకమునుపు ఆ ఊరివారు–

తేనెకంటె తీపియైనదేది?

సింహముకంటె బలమైనదేది?

అని అతనితో అనగా అతడు–

నా దూడతో దున్నకపోయినయెడల నా విప్పుడు

కథను విప్పలేకయుందురని వారితో చెప్పెను.

19 యెహోవా ఆత్మ అతనిమీదికి మరల రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో ముప్పదిమందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పినవారికి బట్టలనిచ్చెను.౹

20 అతడు కోపించి తన తండ్రి యింటికి వెళ్లగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకొనిన అతని చెలికాని కియ్యబడెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JDG/14-a1f4bf6bb926ac6ef0482d7ce1ed3c0d.mp3?version_id=1787—

0 replies on “న్యాయాధిపతులు 14”

Leave a Reply to KURAKUNTI MARTIN Cancel reply

Your email address will not be published. Required fields are marked *