Categories
అపొస్తలుల కార్యములు

అపొస్తలుల కార్యములు 1

1 ఓ థెయొఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపొస్తలులకు పరిశుద్ధాత్మద్వారా ఆజ్ఞాపించిన౹

2 తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినమువరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటినిగూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని.౹

3 ఆయన శ్రమపడిన తరువాత నలువది దినములవరకు వారి కగపడుచు, దేవుని రాజ్యవిషయములనుగూర్చి బోధించుచు, అనేక ప్రమాణములనుచూపి వారికి తన్నుతాను సజీవునిగా కనుపరచుకొనెను.౹

4 ఆయన వారిని కలిసికొని యీలాగు ఆజ్ఞాపించెను–మీరు యెరూషలేమునుండి వెళ్లక, నావలన వినిన తండ్రియొక్క వాగ్దానముకొరకు కనిపెట్టుడి;౹

5 యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలోబాప్తిస్మము పొందెదరనెను.

6 కాబట్టి వారు కూడివచ్చినప్పుడు–ప్రభువా, యీ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించెదవా? అని ఆయనను అడుగగా ఆయన౹

7 –కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని యున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పనికాదు.౹

8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.౹

9 ఈ మాటలు చెప్పి, వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను, అప్పుడు వారి కన్నులకు కనబడకుండ ఒక మేఘము ఆయనను కొనిపోయెను.౹

10 ఆయన వెళ్లుచుండగా, వారు ఆకాశమువైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన యిద్దరు మనుష్యులు వారియొద్ద నిలిచి౹

11 –గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచుచున్నారు? మీయొద్దనుండి పరలోకమునకు చేర్చుకొన బడిన యీ యేసే, ఏ రీతిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి.

12 అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండనుండి యెరూషలేమునకు తిరిగి వెళ్లిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతిదినమున నడవదగినంత సమీపమున ఉన్నది.౹

13 వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతేఅనబడిన సీమోను, యాకోబు కుమారుడగుయూదా అనువారు.౹

14 వీరందరును, వీరితోకూడ కొందరు స్త్రీలును, యేసు తల్లియైన మరియయు ఆయన సహోదరులును ఏకమనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి.

15 ఆ కాలమందు ఇంచుమించు నూట ఇరువదిమంది సహోదరులు కూడియుండగా పేతురు వారి మధ్యనిలిచి ఇట్లనెను౹

16 –సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదానుగూర్చి పరిశుద్ధాత్మ దావీదుద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి యుండెను.౹

17 అతడు మనలో ఒకడుగా ఎంచబడినవాడై యీ పరిచర్యలో పాలుపొందెను.౹

18 ఈ యూదా ద్రోహమువలన సంపాదించిన రూకల నిచ్చియొక పొలము కొనెను. అతడు తలక్రిందుగాపడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నియు బయటికి వచ్చెను.౹

19 ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికందరికి తెలియ వచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమ అన బడియున్నది; దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా

20 –అతని యిల్లు పాడైపోవునుగాక

దానిలో ఎవడును కాపురముండక పోవునుగాక

అతని యుద్యోగము వేరొకడు తీసికొనునుగాక

అని కీర్తనల గ్రంథములో వ్రాయబడియున్నది.౹

21-22 కాబట్టి యోహాను బాప్తిస్మమిచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మనయొద్దనుండి పరమునకు చేర్చుకొనబడిన దినమువరకు, ఆయన మన మధ్య సంచరించుచుండిన కాల మంతయు మనతో కలిసియున్న వీరిలో ఒకడు, మనతోకూడ ఆయన పునరుత్థానమునుగూర్చి సాక్షియై యుండుట ఆవశ్యకమని చెప్పెను.౹

23 అప్పుడు వారు యూస్తు అను మారుపేరుగల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తీయ అను ఇద్దరిని నిలువబెట్టి౹

24 ఇట్లని ప్రార్థనచేసిరి–అందరి హృదయములను ఎరిగియున్న ప్రభువా,౹

25 తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన యీ పరి చర్యలోను అపొస్తలత్వములోను పాలుపొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనినవానిని కనబరచుమనిరి.౹

26 అంతట వారు వీరినిగూర్చి చీట్లువేయగా మత్తీయపేరట చీటి వచ్చెను గనుక అతడు పదునొకండుమంది అపొస్తలులతోకూడ లెక్కింపబడెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ACT/1-13fe834e0f84c97f746488d3eafd778a.mp3?version_id=1787—

0 replies on “అపొస్తలుల కార్యములు 1”

Praise God brother for your voice Kindly update it so that the audio is continued playing chapter after chapter means to the next chap automatically

Leave a Reply to Pastor Prema Kumar Cancel reply

Your email address will not be published. Required fields are marked *