Categories
మత్తయి

మత్తయి 12

1 ఆ కాలమందు యేసు విశ్రాంతిదినమున పంట చేలలో పడి వెళ్లుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి.

2 పరిసయ్యులదిచూచి– ఇదిగో, విశ్రాంతిదినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా

3 ఆయన వారితో ఇట్లనెను–తానును తనతోకూడ నున్నవారును ఆకలిగొని యుండగా దావీదు చేసిన దానిగూర్చి మీరు చదువ లేదా?

4 అతడు దేవుని మందిరములో ప్రవేశించి, యాజకులే తప్ప తానైనను తనతోకూడ ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను.

5 మరియు యాజకులు విశ్రాంతిదినమున దేవాలయములో విశ్రాంతిదినమును ఉల్లంఘించియు నిర్దోషులై యున్నారని మీరు ధర్మశాస్త్రమందు చదువలేదా?

6 దేవాలయముకంటె గొప్ప వాడిక్కడ నున్నాడని మీతో చెప్పుచున్నాను.

7 మరియు–కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరనుఅను వాక్యభావము మీకు తెలిసియుంటే నిర్దో షులను దోషులని తీర్పు తీర్చకపోదురు.

8 కాగా మనుష్య కుమారుడు విశ్రాంతిదినమునకు ప్రభువైయున్నాడనెను.

9 ఆయన అక్కడనుండి వెళ్లి వారి సమాజమందిరములో ప్రవేశించినప్పుడు, ఇదిగో ఊచచెయ్యి గలవాడొకడు కనబడెను.

10 వారాయనమీద నేరము మోపవలెనని–విశ్రాంతిదినమున స్వస్థపరచుట న్యాయమా? అని ఆయనను అడిగిరి.

11 అందుకాయన మీలో ఏ మనుష్యునికైనను నొక గొఱ్ఱెయుండి అది విశ్రాంతిదినమున గుంటలో పడినయెడల దాని పట్టుకొని పైకి తీయడా?

12 గొఱ్ఱె కంటె మనుష్యుడెంతో శ్రేష్ఠుడు; కాబట్టి విశ్రాంతిదినమున మేలుచేయుట ధర్మమే అని చెప్పి

13 ఆ మనుష్యు నితో నీ చెయ్యి చాపుమనెను. వాడు చెయ్యి చాపగా రెండవదానివలె అది బాగుపడెను.

14 అంతట పరిసయ్యులు వెలుపలికి పోయి, ఆయనను ఏలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచనచేసిరి.

15 యేసు ఆ సంగతి తెలిసికొని అచ్చటనుండి వెళ్లిపోయెను. బహుజనులాయనను వెంబడింపగా

16 ఆయన వారినందరిని స్వస్థపరచి, తన్ను ప్రసిద్ధిచేయవద్దని వారికి ఆజ్ఞాపించెను.

17 ప్రవక్తయైన యెషయాద్వారా చెప్పినది నెరవేరునట్లు (ఆలాగు జరిగెను) అదేమనగా –

18 ఇదిగో ఈయన నా సేవకుడు

ఈయనను నేను ఏర్పరచుకొంటిని

ఈయన నా ప్రాణమున కిష్టుడైన నా ప్రియుడు

ఈయనమీద నా ఆత్మ నుంచెదను

ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము

చేయును.

19 ఈయన జగడమాడడు, కేకలువేయడు

వీధులలో ఈయన శబ్దమెవనికిని వినబడదు

20 విజయమొందుటకు

న్యాయవిధిని ప్రబలము చేయువరకు

ఈయన నలిగిన రెల్లును విరువడు

మకమకలాడుచున్న అవిసెనారను ఆర్పడు

21 ఈయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అను నదే.

22 అప్పుడు దయ్యముపెట్టిన గ్రుడ్డివాడును మూగవాడునైన యొకడు ఆయనయొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థ పరచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయెను.

23 అందుకు ప్రజలందరు విస్మయమొంది –ఈయన దావీదు కుమారుడు కాడా, అని చెప్పుకొనుచుండిరి.

24 పరిసయ్యులు ఆ మాట వినివీడు దయ్యములకు అధిపతియైన బయెల్జెబూలువలననే దయ్యములను వెళ్లగొట్టుచున్నాడు గాని మరియొకనివలన కాదనిరి.

25 ఆయన వారి తలంపుల నెరిగి వారితో ఇట్లనెనుతనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడై పోవును. తనకుతానే విరోధముగా వేరుపడిన యే పట్టణమైనను ఏ యిల్లయినను నిలువదు.

26 సాతాను సాతానును వెళ్లగొట్టినయెడల తనకుతానే విరోధముగా వేరుపడును; అట్లయితే వాని రాజ్యమేలాగు నిలుచును?

27 నేను బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నయెడల మీ కుమారులు ఎవరివలన వాటిని వెళ్లగొట్టు చున్నారు? కాబట్టి వారే మీకు తీర్పరులైయుందురు.

28 దేవుని ఆత్మవలన నేను దయ్యములను వెళ్లగొట్టుచున్నయెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చియున్నది.

29 ఒకడు మొదట బలవంతుని బంధింపని యెడల యేలాగు ఆ బలవంతుని యింటిలో చొచ్చి అతని సామగ్రి దోచుకొనగలడు? అట్లు బంధించినయెడల వాని యిల్లు దోచుకొనును.

30 నా పక్షమున నుండనివాడు నాకు విరోధి; నాతో కలిసి సమకూర్చనివాడు చెదర గొట్టువాడు.

31 కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా–మనుష్యులుచేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు.

32 మనుష్యకుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదుగాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు.

33 చెట్టు మంచిదని యెంచి దాని పండును మంచిదే అని యెంచుడి; లేదా, చెట్టు చెడ్డదని యెంచి దాని పండును చెడ్డదే అని యెంచుడి. చెట్టు దాని పండువలన తెలియబడును.

34 సర్పసంతానమా, మీరు చెడ్డవారైయుండి ఏలాగు మంచిమాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానినిబట్టి నోరు మాటలాడును గదా.

35 సజ్జనుడు తన మంచి ధననిధిలోనుండి సద్విషయములను తెచ్చును; దుర్జనుడు తన చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను తెచ్చును.

36 నేను మీతో చెప్పునదేమనగా –మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటనుగూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసియుండును.

37 నీ మాటలనుబట్టి నీతిమంతుడవని తీర్పునొందుదువు, నీ మాటలనుబట్టియే అపరాధివని తీర్పునొందుదువు.

38 అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు–బోధకుడా, నీవలన ఒక సూచకక్రియ చూడగోరు చున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనెను.

39 –వ్యభిచారులైన చెడ్డ తరమువారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్తయైన యోనానుగూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియయైనను వారికి అనుగ్రహింపబడదు.

40 యోనా మూడు రాత్రింబగళ్లు తిమింగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్భములో ఉండును.

41 నీనెవెవారు యోనా ప్రకటన విని మారుమనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నీనెవెవారు ఈ తరమువారితో నిలువబడి వారిమీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనాకంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.

42 విమర్శ సమయమున దక్షిణదేశపురాణి యీ తరము వారితో నిలువబడి వారిమీద నేరస్థాపన చేయును; ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యంతములనుండివచ్చెను; ఇదిగో సొలొమోనుకంటె గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.

43 అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదలిపోయిన తరువాత అది విశ్రాంతివెదకుచు నీరులేని చోట్ల తిరుగుచుండును.

44 విశ్రాంతి దొరకనందున–నేను వదలివచ్చిన నా యింటికి తిరిగి వెళ్లుదుననుకొని వచ్చి, ఆ యింట ఎవరును లేక అది ఊడ్చి అమర్చియుండుటచూచి, వెళ్లి తనకంటె చెడ్డైవెన మరి యేడు దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును; అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును.

45 అందుచేత ఆ మనుష్యుని కడపటిస్థితి మొదటిస్థితికంటె చెడ్డదగును. ఆలాగే యీ దుష్టతరమువారికిని సంభవించుననెను.

46 ఆయన జనసమూహములతో ఇంక మాటలాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులును ఆయనతో మాటలాడ గోరుచు వెలుపల నిలిచియుండిరి.

47 అప్పుడొకడు –ఇదిగో నీ తల్లియు నీ సహోదరులును నీతో మాటలాడ వలెనని వెలుపల నిలిచియున్నారని ఆయనతో చెప్పెను.

48 అందుకాయన తనతో ఈ సంగతి చెప్పినవానిచూచి– నా తల్లి యెవరు? నా సహోదరు లెవరు? అని చెప్పి

49-50 తన శిష్యులవైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులును; పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహో దరియు, నాతల్లియుననెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/MAT/12-8b76b20178c7bac5b5958330fb5e10db.mp3?version_id=1787—

Categories
మత్తయి

మత్తయి 13

1 ఆ దినమందు యేసు ఇంటనుండి వెళ్లి సముద్ర తీరమున కూర్చుండెను.

2 బహుజనసమూహములు తన యొద్దకు కూడివచ్చినందున ఆయన దోనెయెక్కి కూర్చుండెను. ఆ జనులందరు దరిని నిలిచియుండగా

3 ఆయన వారిని చూచి చాల సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా – ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్లెను.

4 వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడెను; పక్షులు వచ్చివాటిని మ్రింగివేసెను

5 కొన్ని చాల మన్నులేని రాతినేలను పడెను; అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని

6 సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయెను.

7 కొన్ని ముండ్లపొదలలో పడెను; ముండ్లపొదలు ఎదిగి వాటిని అణచివేసెను.

8 కొన్ని మంచి నేలను పడి, ఒకటి నూరంతలుగాను, ఒకటి అరువదంతలుగాను, ఒకటి ముప్ప దంతలుగాను ఫలించెను.

9 చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను.

10 తరువాత శిష్యులు వచ్చి–నీవు ఉపమానరీతిగా ఎందుకు వారితో మాటలాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను

11 –పరలోక రాజ్యమర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు.

12 కలిగినవానికే యియ్యబడును, వానికి సమృద్ధి కలుగును; లేనివానికి కలిగినదియు వానియొద్దనుండి తీసి వేయబడును. మరియు–వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు నున్నారు.

13-15 ఇందునిమిత్తము నేను ఉపమానరీతిగా వారికి బోధించుచున్నాను.

ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందము లైనవి, వారు తమ కన్నులు మూసికొనియున్నారు గనుక మీరు వినుటమట్టుకు విందురుగాని గ్రహిం పనే గ్రహంపరు, చూచుటమట్టుకు చూతురు గాని యెంత మాత్రమును తెలిసికొనరు

అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెర వేరుచున్నది.

16 అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి.

17 అనేక ప్రవక్తలును నీతిమంతు లును మీరు చూచువాటిని చూడగోరియు చూడక పోయిరి, మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

18-19 విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమునుగూర్చిన వాక్యము వినియు గ్రహింపక యుండగా, దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడినదానిని యెత్తికొనిపోవును; త్రోవ ప్రక్కను విత్తబడినవాడు వీడే.

20 రాతినేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాని నంగీకరించువాడు.

21 అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని, వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగగానే అభ్యంతర పడును.

22 ముండ్లపొదలలో విత్త బడినవాడు వాక్యము వినువాడే గాని ఐహికవిచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును.

23 మంచినేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు; అట్టివారు సఫలులై యొకడు నూరంతలుగాను ఒకడు అరువదంతలుగాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించుననెను.

24 ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా పరలోకరాజ్యము, తన పొలములో మంచి విత్తనమువిత్తిన యొక మనుష్యుని పోలియున్నది.

25 మనుష్యులు నిద్రించుచుండగా, అతని శత్రువు వచ్చి గోధుమలమధ్యను గురుగులు విత్తిపోయెను.

26 మొలకలు పెరిగి గింజపెట్టినప్పుడు గురుగులు కూడ అగపడెను.

27 అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతనియొద్దకు వచ్చి –అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనమువిత్తితివి గదా, అందులో గురుగు లెక్కడనుండి వచ్చినవని అడిగిరి.

28 –ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు–మేము వెళ్లి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా? అని అతనిని అడిగిరి.

29 అందుకతడు –వద్దు; గురుగులను పెరుకుచుండగా, వాటితోకూడ ఒకవేళ గోధుమలను పెల్లగింతురు.

30 కోతకాలమువరకు రెంటినికలిసి యెదుగ నియ్యుడి; కోతకాలమందు గురుగులను ముందుగాకూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి, గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదుననెను.

31 ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను–పరలోకరాజ్యము, ఒకడు తీసికొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలియున్నది.

32 అది విత్తనములన్నిటిలో చిన్నదేగాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశపక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించునంత చెట్టగును.

33 ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను–పరలోకరాజ్యము, ఒక స్త్రీ తీసికొని పిండి అంతయు పులిసి పొంగువరకు మూడు కుంచముల పిండిలో దాచి పెట్టిన పుల్లని పిండిని పోలియున్నది.

34 నేను నా నోరు తెరచి ఉపమానరీతిగా బోధించెదను,

లోకము పుట్టినది మొదలుకొని మరుగుచేయబడిన సంగతులను తెలియజెప్పెదను

35 అని ప్రవక్త చెప్పినమాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులనన్నిటిని జనసమూహములకు ఉపమానరీతిగా బోధిం చెను; ఉపమానము లేక వారికేమియు బోధింపలేదు.

36 అప్పుడాయన జనసమూహములను పంపివేసి, యింటిలోనికి వెళ్లగా ఆయన శిష్యులాయనయొద్దకు వచ్చి–పొలము లోని గురుగులనుగూర్చిన ఉపమానభావము మాకు తెలియజెప్పుమనిరి.

37 అందుకాయన ఇట్లనెను–మంచి విత్తనము విత్తువాడు మనుష్యకుమారుడు;

38 పొలము లోకము; మంచి విత్తనములు రాజ్య సంబంధులు; గురుగులు దుష్టుని సంబంధులు;

39 వాటిని విత్తిన శత్రువు అపవాది; కోత యుగసమాప్తి; కోతకోయువారు దేవదూతలు.

40 గురుగులు ఏలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో ఆలాగే యుగ సమాప్తియందు జరుగును.

41 మనుష్యకుమారుడు తన దూతలను పంపును; వారాయన రాజ్యములోనుండి ఆటంకములగు సకలమైనవాటిని దుర్నీతిపరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు.

42 అక్కడ ఏడ్పును పండ్లుకొరుకుటయును ఉండును.

43 అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునివలె తేజరిల్లుదురు. చెవులుగలవాడు వినునుగాక.

44 పరలోకరాజ్యము, పొలములో దాచబడిన ధనమును పోలియున్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచి పెట్టి, అది దొరికిన సంతోషముతో వెళ్లి, తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును.

45 మరియు పరలోకరాజ్యము, మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలియున్నది.

46 అతడు అమూల్యమైన యొక ముత్యమును కనుగొని, పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును.

47 మరియు పరలోకరాజ్యము, సముద్రములో వేయబడి నానావిధములైన చేపలను పెట్టిన వలను పోలియున్నది.

48 అది నిండినప్పుడు దానిని దరికి లాగి, కూర్చుండి, మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు.

49 ఆలాగే యుగసమాప్తియందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలోనుండి దుష్టులను వేరుపరచి,

50 వీరిని అగ్ని గుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లుకొరుకుటయును ఉండును.

51 వీటినన్నిటిని మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితి మనిరి.

52 ఆయన అందువలన పరలోకరాజ్యములో శిష్యుడుగాచేరిన ప్రతిశాస్త్రియు తన ధననిధిలోనుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడని వారితో చెప్పెను.

53 యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత, ఆయన అక్కడ నుండి వెళ్లి స్వదేశమునకు వచ్చి, సమాజమందిరములలో వారికి బోధించుచుండెను.

54 అందువలన వారాశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములును ఇతని కెక్కడనుండి వచ్చినవి?

55 ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లిపేరు మరియ కాదా? యాకోబు యోసేపు సీమోను యూదాయనువారు ఇతని సోదరులు కారా?

56 ఇతని సోదరీమణులందరు మనతోనే యున్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నియు ఎక్కడనుండి వచ్చెనని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడిరి.

57 అయితే యేసు ప్రవక్త తన దేశములోను తన ఇంటను తప్ప, మరి ఎక్కడనైనను ఘనహీనుడు కాడని వారితో చెప్పెను.

58 వారి అవిశ్వాసమునుబట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/MAT/13-8ca4d9123f75fd8b726aa056af4feb9a.mp3?version_id=1787—

Categories
మత్తయి

మత్తయి 14

1 ఆ సమయమందు చతుర్థాధిపతియైన హేరోదు యేసునుగూర్చిన సమాచారము విని

2 –ఇతడు బాప్తిస్మమిచ్చు యోహాను; అతడు మృతులలోనుండి లేచియున్నాడు; అందువలననే అద్భుతములు అతనియందు క్రియారూపకములగుచున్నవని తన సేవకులతో చెప్పెను.

3-4 ఏలయనగా–నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి యుండెను.

5 అతడు ఇతని చంప గోరెను గాని జనసమూహము ఇతనిని ప్రవక్తయని యెంచినందున వారికి భయపడెను.

6 అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారిమధ్య నాట్యమాడి హేరోదును సంతోష పరచెను

7 గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చెదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను.

8 అప్పుడామె తనతల్లిచేత ప్రేరేపింపబడినదై–బాప్తిస్మమిచ్చు యోహాను తలను ఇక్కడ పళ్లెములో పెట్టి నా కిప్పించుమని యడిగెను.

9 రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును, తనతోకూడ భోజనమునకు కూర్చున్నవారి నిమిత్తమును ఇయ్యనాజ్ఞాపించి

10 బంట్రౌతును పంపి చెరసాలలో యోహాను తల గొట్టించెను.

11 వాడతని తల పళ్లెములోపెట్టి తెచ్చి ఆ చిన్నదానికిచ్చెను; ఆమె తన తల్లియొద్దకు దాని తీసికొని వచ్చెను.

12 అంతట యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తికొనిపోయి పాతిపెట్టి యేసునొద్దకువచ్చి తెలియజేసిరి.

13 యేసు ఆ సంగతి విని దోనె యెక్కి, అక్కడనుండి అరణ్యప్రదేశమునకు ఏకాంతముగా వెళ్లెను. జనసమూహములు ఆ సంగతి విని, పట్టణములనుండి కాలినడకను ఆయనవెంట వెళ్లిరి.

14 ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి, వారిమీద కనికరపడి, వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను.

15 సాయంకాలమైనప్పుడు శిష్యు లాయనయొద్దకు వచ్చి ఇది అరణ్యప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను, ఈ జనులు గ్రామములలోనికి వెళ్లి భోజనపదార్థములు కొనుక్కొనుటకై వారినిపంపివేయ మని చెప్పిరి.

16 యేసు–వారు వెళ్లనక్కరలేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా

17-18 వారు– ఇక్కడ మనయొద్ద అయిదు రొట్టెలును రెండు చేపలును తప్ప మరేమియు లేదని ఆయనతో చెప్పిరి. అందు కాయన వాటిని నాయొద్దకు తెండని చెప్పి

19 పచ్చికమీద కూర్చుండుడని జనులకాజ్ఞాపించి, ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశమువైపు కన్నులెత్తి ఆశీర్వదించిఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను, శిష్యులు జనులకు వడ్డించిరి.

20 వారందరు తిని తృప్తిపొందిన తరు వాత మిగిలిన ముక్కలు పండ్రెండు గంపల నిండ ఎత్తిరి

21 స్త్రీలును పిల్లలును గాక తినినవారు ఇంచుమించు అయిదు వేలమంది పురుషులు.

22 వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయు నంతలో తన శిష్యులు దోనె యెక్కి తనకంటె ముందుగా అద్దరికి వెళ్లవలెనని ఆయన వారిని బలవంతము చేసెను.

23 ఆయన ఆ జనసమూహములను పంపివేసి, ప్రార్థనచేయుటకు ఏకాంతముగా కొండయెక్కి పోయి, సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను.

24 అప్పటికాదోనె దరికి దూరముగనుండగా గాలి యెదురైనందున అలలవలన కొట్టబడుచుండెను.

25 రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రముమీద నడుచుచు వారియొద్దకు వచ్చెను

26 ఆయన సముద్రముమీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి, భూతమని చెప్పుకొని భయముచేత కేకలువేసిరి.

27 వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి; నేనే, భయపడకుడని వారితో చెప్పగా

28 పేతురు–ప్రభువా, నీవే అయితే నీళ్లమీద నడిచి నీయొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను.

29 ఆయన రమ్మనగానే పేతురు దోనెదిగి యేసునొద్దకు వెళ్లుటకు నీళ్లమీద నడచెను గాని

30 గాలిని చూచి భయపడి మునిగిపోసాగి – ప్రభువా, నన్ను రక్షించుమని కేకలువేసెను.

31 వెంటనే యేసు చెయ్యిచాపి అతని పట్టుకొని అల్పవిశ్వాసీ, యెందుకు సందేహపడితివని అతనితో చెప్పెను.

32-33 వారు దోనె యెక్కినప్పుడు గాలి అణిగెను. అంతట దోనెలో నున్నవారు వచ్చి–నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి.

34 వారద్దరికి వెళ్లి గెన్నేసరెతు దేశమునకు వచ్చిరి.

35 అక్కడి జనులు ఆయనను గుర్తుపెట్టి, చుట్టుపెట్లనున్న ఆ ప్రదేశమంతటికి వర్తమానము పంపి, రోగులనందరిని ఆయన యొద్దకు తెప్పించి

36 –వీరిని నీ వస్త్రపుచెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి; ముట్టినవారందరును స్వస్థతనొందిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/MAT/14-2ba432c5b55f281e861b96b13f8cf8fc.mp3?version_id=1787—

Categories
మత్తయి

మత్తయి 15

1 ఆ సమయమున యెరూషలేమునుండి శాస్త్రులును పరిసయ్యులును యేసునొద్దకు వచ్చి

2 నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండ భోజనముచేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి

3 అందుకాయన మీరును మీపారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు?

4 –తలిదండ్రులను ఘనపరచుమనియు, తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలెననియు దేవుడు సెలచిచ్చెను.

5 మీరైతే– ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి –నావలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పినయెడల అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కరలేదని చెప్పుచున్నారు.

6 మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు.

7-9 వేషధారులారా –

ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది; మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు

అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి

10 జనసమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి;

11 నోటపడునది మనుష్యుని అపవిత్ర పరచదు గాని నోటనుండి వచ్చున దియే మనుష్యుని అపవిత్రపరచునని వారితో చెప్పెను.

12 అంతట ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియునా అని ఆయనను అడుగగా

13 ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెల్లగింపబడును.

14 వారి జోలికి పోకుడి; వారు గ్రుడ్డివారైయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపినయెడల వారిద్దరు గుంటలో పడుదురు గదా అనెను.

15 అందుకు పేతురు ఈ ఉపమానభావము మాకు తెలుపుమని ఆయనను అడుగగా

16 ఆయన మీరును ఇంతవరకు అవివేకులైయున్నారా?

17 నోటిలోనికి పోవునదంతయు కడుపులోపడి బహిర్భూమిలో విడువబడును గాని

18 నోటనుండి బయటికి వచ్చునవి హృదయములోనుండి వచ్చును; ఇవే మనుష్యుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా?

19 దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధసాక్ష్యములు దేవదూషణలు హృదయములోనుండియే వచ్చును

20 ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుగు కొనక భోజనముచేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పెను.

21-22 యేసు అక్కడనుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్లగా, ఇదిగో ఆ ప్రాంతములనుండి కనాను స్త్రీ యొకతె వచ్చి ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము; నా కుమార్తె దయ్యముపెట్టి, బహు బాధపడుచున్నదని కేకలువేసెను.

23 అందుకాయన ఆమెతో ఒక్క మాటయైనను చెప్పలేదు. అప్పుడాయన శిష్యులు వచ్చి–ఈమె మన వెంబడి వచ్చి కేకలువేయు చున్నది గనుక ఈమెను పంపి వేయుమని ఆయనను వేడు కొనగా

24 ఆయన–ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొఱ్ఱెలయొద్దకే గాని మరి ఎవరియొద్దకును నేను పంపబడ లేదనెను

25 అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి– ప్రభువా, నాకు సహాయము చేయుమని అడిగెను.

26 అందుకాయన–పిల్లల రొట్టె తీసికొని కుక్కపిల్లలకువేయుట యుక్తము కాదని చెప్పగా

27 ఆమె–నిజమే ప్రభువా, కుక్కపిల్లలు కూడ తమ యజమానుల బల్లమీదనుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను.

28 అందుకు యేసు –అమ్మా, నీ విశ్వాసము గొప్పది; నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను.

29 యేసు అక్కడనుండి వెళ్లి, గలిలయ సముద్రతీరమునకు వచ్చి, కొండెక్కి అక్కడ కూర్చుండగా

30 బహుజనసమూహములు ఆయనయొద్దకు కుంటివారు గ్రుడ్డివారు మూగవారు అంగహీనులు మొదలైన అనే కులను తీసికొనివచ్చి ఆయన పాదములయొద్ద పడవేసిరి; ఆయన వారిని స్వస్థపరచెను.

31 మూగవారు మాటలాడుటయును అంగహీనులు బాగుపడుటయును కుంటివారు నడుచుటయును గ్రుడ్డివారు చూచుటయును జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరచిరి.

32 అంతట యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి మూడుదినములనుండి నాయొద్ద నున్నారు; వారికి తిన నేమియు లేదు గనుక వారిమీద కనికరపడుచున్నాను; వారు మార్గములో మూర్ఛపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా

33 ఆయన శిష్యులు–ఇంత గొప్ప జన సమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్యప్రదేశములో మనకు ఎక్కడనుండి వచ్చునని ఆయనతో అనిరి.

34 యేసు మీయొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారి నడుగగా వారు–ఏడు రొట్టెలును కొన్ని చిన్న చేపలును ఉన్నవని చెప్పిరి.

35 అప్పుడాయన– నేలమీద కూర్చుండుడని జనసమూహమునకు ఆజ్ఞాపించి

36 ఆ యేడు రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను, శిష్యులు జన సమూహమునకు వడ్డించిరి

37 వారందరు తిని తృప్తి పొందినమీదట మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండ ఎత్తిరి.

38 స్త్రీలును పిల్లలును గాక తినినవారు నాలుగువేలమంది పురుషులు.

39 తరువాత ఆయన జనసమూహములను పంపివేసి, దోనెయెక్కి మగదాను ప్రాంతములకు వచ్చెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/MAT/15-532df30a766dd45ade89b659dd4ce613.mp3?version_id=1787—

Categories
మత్తయి

మత్తయి 16

1 అప్పుడు పరిసయ్యులును సద్దూకయ్యులును వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశమునుండి యొక సూచక క్రియను తమకు చూపుమని ఆయనను అడుగగా ఆయన ఇట్లనెను

2 –సాయంకాలమున మీరు–ఆకాశము ఎఱ్ఱగా ఉన్నది గనుక వర్షము కురియదనియు,

3 ఉదయమున– ఆకాశము ఎఱ్ఱగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు గదా. మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు గాని యీ కాలముల సూచనలను వివేచింపలేరు.

4 వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియ నడుగుచున్నారు, అయితే యోనానుగూర్చిన సూచకక్రియయేగాని మరి ఏ సూచక క్రియయైన వారి కనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్లిపోయెను.

5 ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి.

6 అప్పుడు యేసు–చూచుకొనుడి, పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండినిగూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను.

7 కాగా వారు మనము రొట్టెలు తేనందున గదా (యీ మాట చెప్పెనని) తమలో తాము ఆలోచించుకొనుచుండిరి.

8 యేసు అది యెరిగి–అల్పవిశ్వాసులారా మనయొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు?

9 మీరింకను గ్రహింపలేదా? అయిదు రొట్టెలు అయిదువేలమందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్లు ఎత్తితిరో అదియైనను

10 ఏడు రొట్టెలు నాలుగు వేలమందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్లు ఎత్తితిరో అదియైనను మీకు జ్ఞాపకము లేదా?

11 నేను రొట్టెలనుగూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండినిగూర్చియే జాగ్రత్తపడుడని చెప్పెను.

12 అప్పుడురొట్టెల పులిసిన పిండినిగూర్చి కాదుగాని పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి బోధనుగూర్చియే జాగ్రత్తపడవలెనని ఆయన తమతో చెప్పెనని వారు గ్రహించిరి.

13 యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి–మనుష్యకుమారుడెవడని జనులు చెప్పకొనుచున్నారని తన శిష్యులను అడుగగా

14 వారు కొందరు బాప్తిస్మ మిచ్చు యోహాననియు, కొందరు ఏలీయా అనియు, కొందరు యిర్మీయా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి.

15 అందుకాయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారి నడిగెను.

16 అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువనిచెప్పెను.

17 అందుకు యేసు–సీమోను బర్ యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనేకాని నరులునీకు బయలు పరచలేదు.

18 మరియు నీవు పేతురువు; ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను.

19 పరలోకరాజ్యముయొక్క తాళపుచెవులు నీకిచ్చెదను, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను.

20 అటుపిమ్మట తాను క్రీస్తుఅని యెవనితోను చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను.

21 అప్పటినుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దలచేతను ప్రధానయాజకులచేతను శాస్త్రులచేతను అనేక హింసలు పొంది, చంపబడి, మూడవదినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా

22 పేతురు ఆయన చేయి పట్టుకొని ప్రభువా, అది నీకు దూరమగుగాక, అది నీ కెన్నడును కలుగదని ఆయనను గద్దింపసాగెను.

23 అయితే ఆయన పేతురువైపు తిరిగి సాతానా, నా వెనుకకు పొమ్ము; నీవు నాకు అభ్యంతర కారణమైయున్నావు; నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక యున్నావని పేతురుతో చెప్పెను.

24 అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరినయెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తి కొని నన్ను వెంబడింపవలెను.

25 తన ప్రాణమును రక్షించు కొనగోరువాడు దాని పోగొట్టుకొనును; నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించు కొనును.

26 ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి యియ్యగలడు?

27 మనుష్యకుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతోకూడ రాబోవుచున్నాడు. అప్పు డాయన ఎవని క్రియలచొప్పున వానికి ఫలమిచ్చును.

28 ఇక్కడ నిలిచియున్న వారిలోకొందరు, మనుష్యకుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచువరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాననెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/MAT/16-11fdb3eb736d9cc37967afaf5dd825cd.mp3?version_id=1787—

Categories
మత్తయి

మత్తయి 17

1 ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట బెట్టుకొని యెత్తయిన యొక కొండమీదికి ఏకాంతముగా పోయి వారి యెదుట రూపాంతరము పొందెను.

2 ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించెను; ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లనివాయెను.

3 ఇదిగో మోషేయు ఏలీయాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి.

4 అప్పుడు పేతురు – ప్రభువా, మన మిక్కడ ఉండుట మంచిది; నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలీయాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను.

5 అతడు ఇంకను మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక మేఘము వారిని కమ్ముకొనెను; ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నాను, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను.

6 శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా

7 యేసు వారియొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి, భయపడకుడని చెప్పెను.

8 వారు కన్నులెత్తి చూడగా, యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు.

9 వారు కొండ దిగి వచ్చుచుండగా–మనుష్యకుమారుడు మృతులలోనుండి లేచువరకు ఈ దర్శనము మీరు ఎవరితోను చెప్పకుడని యేసు వారికాజ్ఞాపించెను.

10 అప్పు డాయన శిష్యులు ఈలాగైతే ఏలీయా ముందుగా రావలెనని శాస్త్రులెందుకు చెప్పుచున్నారని ఆయన నడిగిరి.

11 అందుకాయన ఏలీయా వచ్చి సమస్తమును చక్కపెట్టు నను మాట నిజమే;

12 అయినను ఏలీయా యిదివరకే వచ్చెను; వారతనిని ఎరుగక తమ కిష్టము వచ్చినట్టు అతని యెడల చేసిరి. మనుష్యకుమారుడు కూడ ఆలాగే వారి చేత శ్రమలు పొందబోవుచున్నాడని మీతో చెప్పు చున్నాననెను.

13 అప్పుడాయన బాప్తిస్మమిచ్చు యోహా నునుగూర్చి తమతో చెప్పెనని శిష్యులు గ్రహించిరి.

14 వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయనయొద్దకు వచ్చి ఆయనయెదుట మోకాళ్లూని–

15 ప్రభువా, నా కుమారుని కరుణింపుము; వాడు చాంద్ర రోగియై మిక్కిలి బాధపడుచున్నాడు; ఏలాగనగా అగ్నిలోను నీళ్లలోను తరుచుగా పడుచున్నాడు;

16 నీ శిష్యుల యొద్దకు వానిని తీసికొని వచ్చితిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పెను.

17 అందుకు యేసు–విశ్వాసములేని మూర్ఖతరమువారలారా, మీతో నేనెంత కాలము ఉందును? ఎంతవరకు మిమ్మును సహింతును? వానిని నాయొద్దకు తీసికొనిరండని చెప్పెను.

18 అంతట యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదలి పోయెను; ఆ గడియనుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను.

19 తరువాత శిష్యులు ఏకాంతముగా యేసు నొద్దకు వచ్చి–మేమెందుచేత దానిని వెళ్లగొట్టలేక పోతి మని అడిగిరి.

20-21 అందుకాయన–మీ అల్పవిశ్వాసము చేతనే; మీకు ఆవగింజంత విశ్వాసముండినయెడల ఈ కొండను చూచి–ఇక్కడనుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును; మీకు అసాధ్యమైనది ఏదియు నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను.

22 వారు గలిలయలో సంచరించుచుండగా యేసు–మనుష్యకుమారుడు మనుష్యులచేతికి అప్పగింపబడబోవుచున్నాడు,

23 వారాయనను చంపుదురు; మూడవదినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి.

24 వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరషెకెలు అను పన్ను వసూలుచేయువారు పేతురునొద్దకువచ్చి– మీ బోధకుడు ఈ అరషెకెలు చెల్లింపడా అని యడుగగా–చెల్లించుననెను.

25 అతడు ఇంటిలోనికి వచ్చి మాటలాడకమునుపే యేసు ఆ సంగతి యెత్తి సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలుచేయుదురు? కుమారులయొద్దనా అన్యుల యొద్దనా? అని అడిగెను.

26 అతడు–అన్యులయొద్దనే అని చెప్పగా యేసు అలాగైతే కుమారులు స్వతంత్రులే.

27 అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి, గాలము వేసి, మొదట పైకివచ్చు చేపను పట్టుకొని, దాని నోరు తెరచినయెడల ఒక షెకెలు దొరకును; దానిని తీసికొని నా కొరకును నీకొరకును వారికిమ్మని అతనితో చెప్పెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/MAT/17-51392067915cfb0f4bc397fb7bca6ef2.mp3?version_id=1787—

Categories
మత్తయి

మత్తయి 18

1 ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా,

2 ఆయన యొక చిన్నబిడ్డను తనయొద్దకు పిలిచి, వారిమధ్యను నిలువబెట్టి యిట్లనెను

3 –మీరు మార్పునొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోకరాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

4 కాగా ఈ బిడ్డవలె తన్నుతాను తగ్గించుకొనువాడెవడో వాడే పరలోకరాజ్యములో గొప్పవాడు.

5 మరియు ఈలాటి యొక బిడ్డను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చు కొనును.

6 నాయందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో, వాడు మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడినవాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచి వేయబడుట వానికి మేలు.

7 అభ్యంతరములవలన లోకమునకు శ్రమ; అభ్యంతరములు రాక తప్పవు గాని, యెవనివలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ

8 కాగా నీ చెయ్యియైనను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరచినయెడల, దానిని నరికి నీయొద్దనుండి పారవేయుము; రెండు చేతులును రెండు పాదములును కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుటకంటె కుంటివాడవుగనో అంగహీనుడవుగనో జీవములో ప్రవేశించుట నీకు మేలు.

9 నీ కన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; రెండు కన్నులు గలిగి అగ్నిగల నరకములో పడవేయబడుటకంటె ఒక కన్ను గలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు.

10 ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండ చూచుకొనుడి. వీరి దూతలు, పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడు పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను.

11-12 మీకేమితోచును? ఒక మనుష్యునికి నూరు గొఱ్ఱెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయినయెడల తొంబదితొమ్మిదింటిని కొండలమీద విడిచివెళ్లి తప్పిపోయినదానిని వెదకడా?

13 వాడు దాని కనుగొనినయెడల తొంబదితొమ్మిది గొఱ్ఱెలనుగూర్చి సంతోషించు నంతకంటె దానినిగూర్చి యెక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

14 ఆలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తముకాదు.

15 మరియు నీ సహోదరుడు నీయెడల తప్పిదము చేసినయెడల నీవు పోయి, నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము; అతడు నీ మాట వినినయెడల నీ సహోదరుని సంపాదించుకొంటివి.

16 అతడు విననియెడల, ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడునట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతనియొద్దకు పొమ్ము.

17 అతడు వారి మాటయు విననియెడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము; అతడు సంఘపు మాటయు విననియెడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము.

18 భూమిమీద మీరు వేటిని బంధింతురో, అవి పరలోకమందును బంధింపబడును; భూమిమీద మీరు వేటిని విప్పుదురో, అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

19 మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనినిగూర్చియైనను భూమిమీద ఏకీభవించినయెడల అది పరలోకమందున్న నాతండ్రివలన వారికి దొరకునని మీతో చెప్పుచున్నాను.

20 ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి యుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను.

21 ఆ సమయమున పేతురు ఆయనయొద్దకు వచ్చి– ప్రభువా, నా సహోదరుడు నాయెడల తప్పిదము చేసినయెడల నేనెన్నిమారులు అతని క్షమింపవలెను? ఏడు మారులమట్టుకా? అని అడిగెను.

22 అందుకు యేసు అతనితో ఇట్లనెను–ఏడుమారులుమట్టుకే కాదు, డెబ్బది ఏళ్ల మారులమట్టుకని నీతో చెప్పుచున్నాను.

23 కావున పరలోకరాజ్యము, తన దాసులయొద్ద లెక్క చూచుకొన గోరిన యొక రాజును పోలియున్నది.

24 అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు, అతనికి పదివేల తలాంతులుఅచ్చియున్న యొకడు అతనియొద్దకు తేబడెను.

25 అప్పు తీర్చుటకు వానియొద్ద ఏమియు లేనందున, వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను వానికి కలిగినది యావత్తును అమ్మి, అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించెను.

26 కాబట్టి ఆ దాసుడు అతని యెదుట సాగిలపడి మ్రొక్కి–నాయెడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా

27 ఆ దాసుని యజమానుడు కనికర పడి, వానిని విడిచిపెట్టి, వాని అప్పు క్షమించెను.

28 అయితే ఆ దాసుడు బయటకు వెళ్లి తనకు నూరు దేనారములుఅచ్చియున్న తన తోడిదాసులలో ఒకనినిచూచి, వాని గొంతుపట్టుకొని–నీవు అచ్చియున్నది చెల్లింపు మనెను

29 అందుకు వాని తోడిదాసుడు సాగిలపడి–నా యెడల ఓర్చుకొనుము, నీకు చెల్లించెదనని వానిని వేడుకొనెను గాని

30 వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించువరకు వానిని చెరసాలలో వేయించెను.

31 కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి, మిక్కిలి దుఃఖపడి, వచ్చి, జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి.

32 అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి –చెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని;

33 నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి యుండెను గదా అని వానితో చెప్పెను.

34 అందుచేత వాని యజమానుడు కోపపడి, తనకు అచ్చియున్నదంతయు చెల్లించువరకు బాధపరచువారికి వాని నప్పగించెను.

35 మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపనియెడల నా పరలోకపు తండ్రియు ఆప్రకారమే మీయెడల చేయుననెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/MAT/18-12a542058caa7d1e6ab80b0840818f6f.mp3?version_id=1787—

Categories
మత్తయి

మత్తయి 19

1 యేసు ఈ మాటలుచెప్పి చాలించిన తరువాత . గలిలయనుండి యొర్దాను అద్దరినున్న యూదయ ప్రాంతములకు వచ్చెను.

2 బహుజనసమూహములు ఆయనను వెంబడింపగా, ఆయన వారిని అక్కడ స్వస్థపరచెను.

3 పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయనయొద్దకు వచ్చి ఏ హేతువుచేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా? అని అడుగగా

4 ఆయన– సృజించినవాడు ఆదినుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించెననియు

5 –ఇందు నిమిత్తము పురుషుడు తలిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్ద రును ఏకశరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదువలేదా?

6 కాబట్టి వారికను ఇద్దరుకాక ఏకశరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచినవారిని మను ష్యుడు వేరుపరచ కూడదని చెప్పెను.

7 అందుకు వారు–ఆలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే యెందుకు ఆజ్ఞాపించెనని వారాయనను అడుగగా

8 ఆయన మీ హృదయకాఠిన్యమునుబట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను, గాని ఆదినుండి ఆలాగు జరుగలేదు.

9 మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరియొకతెను పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియు, విడనాడబడినదానిని పెండ్లిచేసికొనువాడు వ్యభిచారము చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితోననెను.

10 ఆయన శిష్యులు–భార్యాభర్తలకుండు సంబంధము ఇట్టిదైతే పెండ్లి చేసికొనుట యుక్తము కాదని ఆయనతో చెప్పిరి.

11 అందుకాయన అనుగ్రహము నొందినవారు తప్ప మరి ఎవరును ఈ మాటను అంగీకరింపనేరరు.

12 తల్లి గర్భమునుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు, మనుష్యులవలన నపుంస కులుగా చేయబడిన నపుంసకులునుగలరు, పరలోక రాజ్యమునిమిత్తము తమ్మును తామే నపుంసకులనుగా చేసికొనిన నపుంసకులునుగలరు. (ఈ మాటను) అంగీకరింప గలవాడు అంగీకరించును గాక అని వారితో చెప్పెను.

13 అప్పుడు ఆయన వారిమీద చేతులుంచి ప్రార్థన చేయవలెనని కొందరు చిన్నపిల్లలను ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి.

14 ఆయన శిష్యులు, తీసికొనివచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్నపిల్లలను అటంకపరచక వారిని నా యొద్దకు రానియ్యుడి; పరలోకరాజ్యము ఈలాటివారిదని వారితో చెప్పి

15 వారిమీద చేతులుంచి, అక్కడనుంచి లేచిపోయెను.

16 ఇదిగో ఒకడు ఆయనయొద్దకు వచ్చి బోధకుడా, నిత్యజీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగెను.

17 అందుకాయన మంచి కార్యమునుగూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచి వాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరినయెడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. అతడు –ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా

18 యేసు–నరహత్య చేయవద్దు, వ్యభిచరింప వద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తలిదండ్రు లను సన్మానింపుము,

19 నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను అనునవియే అని చెప్పెను.

20 అందుకు ఆ యౌవనుడు – ఇవన్నియు అనుసరించుచునే యున్నాను; ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగెను.

21 అందుకు యేసు–నీవు పరిపూర్ణుడవగుటకు కోరినయెడల, పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను.

22 అయితే ఆ యౌవనుడు మిగుల ఆస్తిగలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్లి పోయెను.

23 యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

24 ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుటకంటె సూదిబెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాననెను.

25 శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి ఆలాగైతే ఎవడు రక్షణపొందగలడని అడుగగా

26 యేసు వారిని చూచి ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను.

27 పేతురు–ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరకునని ఆయనను అడుగగా

28 యేసు వారితో ఇట్లనెను (ప్రపంచ) పునర్జననమందుమనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడైయుండునపుడు నన్ను వెంబడించిన మీరును పండ్రెండు సింహాసనములమీద ఆసీనులై ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి తీర్పుతీర్చుదురు.

29 నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్కచెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచి పెట్టిన ప్రతివాడును నూరురెట్లు పొందును; ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును.

30 మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/MAT/19-bd039ad8288d96a2ea9440f4e5ef669b.mp3?version_id=1787—

Categories
మత్తయి

మత్తయి 20

1 ఏలాగనగా–పరలోకరాజ్యము ఒక ఇంటి యజమానుని పోలియున్నది. అతడు తన ద్రాక్షతోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి

2 దినమునకు ఒక దేనారముచొప్పున పనివారితో ఒడబడి, తన ద్రాక్షతోటలోనికి వారిని పంపెను.

3 తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్లి సంత వీధిలో ఊరక నిలిచియున్న మరికొందరిని చూచి

4 –మీరును నా ద్రాక్షతోటలోనికి వెళ్లుడి, యేమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్లిరి.

5 దాదాపు పండ్రెండు గంటలకును, మూడు గంటలకును, అతడు మరల వెళ్లి, ఆలాగే చేసెను.

6 తిరిగి దాదాపు అయిదు గంట లకు వెళ్లి, మరికొందరు నిలిచియుండగా చూచి ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచియున్నారని వారిని అడుగగా

7 వారు ఎవడును మమ్మును కూలికి పెట్టుకొన లేదనిరి. అందుకతడు మీరును నా ద్రాక్షతోటలోనికి వెళ్లుడనెను.

8 సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్షతోట యజమానుడు తన గృహనిర్వాహకుని చూచి–పనివారిని పిలిచి, చివర వచ్చినవారు మొదలుకొని మొదట వచ్చిన వారివరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను.

9 దాదాపు అయిదు గంటలకు కూలికి కుదిరినవారు వచ్చి ఒక్కొక దేనారముచొప్పున తీసికొనిరి.

10 మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరకుననుకొనిరి గాని వారికిని ఒక్కొక దేనారముచొప్పుననే దొరకెను.

11-12 వారది తీసికొని – చివర వచ్చిన వీరు ఒక్కగంట మాత్రమే పనిచేసినను, పగలంతయు కష్టపడి యెండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ యింటి యజమానునిమీద సణుగుకొనిరి.

13 అందుకతడు వారిలో ఒకని చూచి స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే; నీవు నాయొద్ద ఒక దేనారమునకు ఒడబడలేదా? నీ సొమ్ము నీవు తీసికొని పొమ్ము;

14 నీ కిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకిష్టమైనది;

15 నాకిష్టమువచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపుమంటగా ఉన్నదాఅని చెప్పెను.

16 ఈ ప్రకారమే కడపటివారు మొదటివారగుదురు, మొదటివారు కడపటివారగుదురు.

17 యేసు యెరూషలేమునకు వెళ్లనైయున్నప్పుడు ఆయన పండ్రెండుమంది శిష్యులను ఏకాంతముగా తీసికొనిపోయి, మార్గమందు వారితో ఇట్లనెను.

18 –ఇదిగో యెరూషలేమునకు వెళ్లుచున్నాము; అక్కడ మనుష్యకుమారుడు ప్రధానయాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును; వారాయనకు మరణశిక్ష విధించి

19 ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువవేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు; మూడవదినమున ఆయన మరల లేచును.

20 అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయనయొద్దకు వచ్చి నమస్కారముచేసి యొక మనవి చేయబోగా

21 –నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామె నీ రాజ్యమందు ఈ నా యిద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ యెడమవైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను.

22 అందుకు యేసు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు; నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగ గలరా? అని అడుగగా వారు–త్రాగగలమనిరి.

23 ఆయన –మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడి వైపునను నా యెడమవైపునను కూర్చుండనిచ్చుట నా వశమునలేదు; నా తండ్రిచేత ఎవరికి సిద్ధపరచబడెనో వారికే అది దొరకునని చెప్పెను.

24 తక్కిన పదిమంది శిష్యులు ఈ మాట విని ఆ యిద్దరు సహోదరులమీద కోపపడిరి

25 గనుక యేసు తనయొద్దకు వారిని పిలిచి అన్యజనులలో అధికారులు వారిమీద ప్రభుత్వము చేయుదురనియు, వారిలో గొప్పవారు వారిమీద అధికారము చేయుదురనియు మీకు తెలియును.

26 మీలో ఆలాగుండకూడదు; మీలో ఎవడు గొప్పవాడై యుండగోరునో వాడు మీ పరిచారకుడై యుండవలెను;

27 మీలో ఎవడు ముఖ్యుడై యుండగోరునో వాడు మీ దాసుడై యుండవలెను.

28 ఆలాగే మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను.

29 వారు యెరికోనుండి వెళ్లుచుండగా బహుజనసమూహము ఆయనవెంట వెళ్లెను.

30 ఇదిగో త్రోవప్రక్కను కూర్చున్న యిద్దరు గ్రుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్లు చున్నాడని విని ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని కేకలువేసిరి.

31 ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారు ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని మరి బిగ్గరగా కేకవేసిరి.

32 యేసు నిలిచి వారిని పిలిచి– నేను మీకేమి చేయగోరుచున్నారని అడుగగా

33 వారు ప్రభువా, మా కన్నులు తెరవవలెననిరి.

34 కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను; వెంటనే వారు దృష్టిపొంది ఆయన వెంట వెళ్లిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/MAT/20-0769b6d10d819e2b62f1bb8165c47d7f.mp3?version_id=1787—

Categories
మత్తయి

మత్తయి 21

1 తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవచెట్ల కొండదగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి

2 మీ యెదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; వెళ్లగానే కట్టబడియున్న యొక గాడిదయు దానితోనున్న యొక గాడిదపిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నాయొద్దకు తోలుకొని రండి;

3 ఎవడైనను మీతో ఏమైనను అనినయెడల–అవిప్రభువునకు కావలసియున్నవని చెప్పవలెను, వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను.

4 ప్రవక్తవలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను, అదేమనగా

5 –ఇదిగో నీ రాజు సాత్వికుడై, గాడిదను

భారవాహక పశువుపిల్లైయెన చిన్న గాడిదను ఎక్కి

నీయొద్దకు వచ్చుచున్నాడని

సీయోను కుమారితో చెప్పుడి

అనునది.

6 శిష్యులు వెళ్లి యేసు తమకాజ్ఞాపించిన ప్రకారము చేసి

7 ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటిమీద తమ బట్టలు వేయగా ఆయన బట్టలమీద కూర్చుండెను.

8 జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారిపొడుగునపరచిరి; కొందరు చెట్లకొమ్మలు నరికి దారిపొడుగునపరచిరి.

9 జనసమూహములలో ఆయనకు ముందు వెళ్లుచుండినవారును వెనుక వచ్చుచుండినవారును

–దావీదు కుమారునికి జయము

ప్రభువుపేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక

సర్వోన్నతమైన స్థలములలో జయము

అని కేకలు వేయుచుండిరి.

10 ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు–ఈయన ఎవరో అని కలవరపడెను.

11 జనసమూహము–ఈయన గలిలయలోని నజరేతువాడగు ప్రవక్తయైన యేసు అని చెప్పిరి.

12 యేసు దేవాలయములో ప్రవేశించి క్రయవిక్రయములు చేయువారినందరిని వెళ్లగొట్టి, రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్మువారి పీఠములను పడద్రోసి–

13 నా మందిరము ప్రార్థన మందిరమనబడును

అని వ్రాయబడియున్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసెడివారనెను.

14 గ్రుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయనయొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచెను.

15 కాగా ప్రధానయాజకులును శాస్త్రులును ఆయన చేసిన వింతలను, –దావీదు కుమారునికి జయముఅని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్నపిల్లలను చూచి కోపముతో మండిపడి

16 –వీరు చెప్పుచున్నది వినుచున్నావా? అని ఆయనను అడిగిరి. అందుకు యేసు– వినుచున్నాను;

బాలురయొక్కయు చంటిపిల్లలయొక్కయు నోట

స్తోత్రము సిద్ధింపజేసితివి

అను మాట మీరెన్నడును చదువలేదా? అని వారితో చెప్పి

17 వారిని విడిచి పట్టణమునుండి బయలుదేరి బేతనియకు వెళ్లి అక్కడ బసచేసెను.

18 ఉదయమందు పట్టణమునకు మరల వెళ్లుచుండగా ఆయన ఆకలిగొనెను.

19 అప్పుడు త్రోవప్రక్కను ఉన్న యొక అంజూరపుచెట్టును చూచి, దానియొద్దకు రాగా, దానియందు ఆకులు తప్ప మరేమియు కనబడలేదు గనుక దానిని చూచి–ఇకమీదట ఎన్నటికిని నీవు కాపు కాయ కుందువుగాక అని చెప్పెను; తక్షణమే ఆ అంజూరపుచెట్టు ఎండిపోయెను.

20 శిష్యులదిచూచి ఆశ్చర్యపడి–అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయెనని చెప్పుకొనిరి.

21 అందుకు యేసు–మీరు విశ్వాసముగలిగి సందేహపడకుండినయెడల, ఈ అంజూరపుచెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువు గాకని చెప్పినయెడల, ఆలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

22 మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేటిని అడుగుదురో అవి (దొరకినవని) నమ్మినయెడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పెను.

23 ఆయన దేవాలయములోనికి వచ్చి బోధించుచుండగా ప్రధానయాజకులును ప్రజల పెద్దలును ఆయనయొద్దకు వచ్చి ఏ అధికారమువలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారమెవడు నీకిచ్చెనని అడుగగా –

24 యేసు నేనును మిమ్ము నొక మాట అడుగుదును; అది మీరు నాతో చెప్పినయెడల, నేనును ఏ అధికారమువలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును.

25 యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడనుండి కలిగినది? పరలోకమునుండి కలిగినదా, మనుష్యులనుండి కలిగినదా? అని వారినడిగెను. వారు–మనము పరలోకము నుండి అని చెప్పితిమా, ఆయన–ఆలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని మనలనడుగును;

26 మనుష్యులవలననని చెప్పితిమా, జనులకు భయపడుచున్నాము; అందరు యోహానును ప్రవక్త అని యెంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని–మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి

27 అందుకాయన ఏ అధికారమువలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అదియు మీతో చెప్పను.

28 మీకేమి తోచుచున్నది? ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి. అతడు మొదటివానియొద్దకు వచ్చి కుమారుడా, నేడు పోయి ద్రాక్షతోటలో పని చేయుమని చెప్పగా

29 వాడు పోను అని యుత్తరమిచ్చెను గాని పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను.

30 అతడు రెండవవానియొద్దకు వచ్చి ఆప్రకారమే చెప్పగా వాడు అయ్యా, పోదుననెను గాని పోలేదు. ఈ యిద్దరిలో ఎవడు తండ్రి యిష్టప్రకారము చేసినవాడని వారి నడిగెను.

31 అందుకు వారు–మొదటివాడే అనిరి. యేసు సుంకరులును వేశ్యలును మీకంటె ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

32 యోహాను నీతి మార్గమున మీయొద్దకు వచ్చెను, మీరతనిని నమ్మలేదు; అయితే సుంకరులును వేశ్య లును అతనిని నమ్మిరి; మీరు అది చూచియు అతనిని నమ్మునట్లు పశ్చాత్తాపపడక పోతిరి.

33 మరియొక ఉపమానము వినుడి. ఇంటి యజమాను డొకడుండెను. అతడు ద్రాక్షతోట నాటించి, దాని చుట్టు కంచె వేయించి, అందులో ద్రాక్షలతొట్టి తొలి పించి, గోపురముకట్టించి, కాపులకు దాని గుత్తకిచ్చి, దేశాంతరము పోయెను.

34 పండ్లకాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసికొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులనంపగా

35 ఆ కాపులు అతని దాసు లను పట్టుకొని, యొకని కొట్టిరి యొకని చంపిరి, మరి యొకనిమీద రాళ్లు రువ్విరి.

36 మరల అతడుమునుపటి కంటె ఎక్కువమంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆప్రకారమే చేసిరి.

37 తుదకు నా కుమారుని సన్మానించెదరనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపెను.

38 అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వార సుడు; ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసికొందము రండని తమలోతాము చెప్పుకొని

39 అతని పట్టుకొని ద్రాక్షతోట వెలుపట పడవేసి చంపిరి.

40 కాబట్టి ఆ ద్రాక్షతోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులనేమి చేయుననెను.

41 అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి, వాటివాటి కాలములయందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతరకాపులకు ఆ ద్రాక్షతోట గుత్త కిచ్చునని ఆయనతో చెప్పిరి.

42 మరియు యేసు వారిని చూచి

–ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి

మూలకు తలరాయి ఆయెను.

ఇదిప్రభువువలననే కలిగెను.

ఇది మన కన్నులకు ఆశ్చర్యము

అను మాట మీరు లేఖనములలో ఎన్నడును చదువ లేదా?

43 కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్దనుండి తొలగింపబడి, దాని ఫలమిచ్చు జనులకియ్యబడునని మీతో చెప్పుచున్నాను.

44 మరియు ఈ రాతిమీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవనిమీద పడునో వానిని నలిచేయుననెను.

45 ప్రధానయాజకులును పరిసయ్యులును ఆయన చెప్పిన ఉపమానములను విని, తమ్మునుగూర్చియే చెప్పెనని గ్రహించి

46 ఆయనను పట్టుకొన సమయము చూచుచుండిరి గాని జనులందరు ఆయనను ప్రవక్తయని యెంచిరి గనుక వారికి భయపడిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/MAT/21-ab7b0bb5ea3d6ce692173702e1ab16bf.mp3?version_id=1787—