Categories
ఆమోసు

ఆమోసు 2

1 యెహోవా సెలవిచ్చునదేమనగా–మోయాబు మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ దానిని శిక్షింతును; ఏలయనగా వారు ఎదోమురాజు ఎముకలను కాల్చి సున్నముచేసిరి.౹

2 మోయాబుమీద నేను అగ్నివేసెదను, అది కెరీయోతు నగరులను దహించి వేయును. గొల్లును రణకేకలును బాకానాదమును వినబడుచుండగా మోయాబు చచ్చును.౹

3 మోయాబీయులకు న్యాయాధిపతియుండకుండ వారిని నిర్మూలము చేసెదను, వారితోకూడ వారి అధిపతులనందరిని నేను సంహరించెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

4 యెహోవా సెలవిచ్చునదేమనగా–యూదా మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ వారిని శిక్షింతును; ఏలయనగా వారు తమపితరులనుసరించిన అబద్ధములను చేపెట్టి, మోసపోయి యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి, ఆయన విధులను గైకొనక పోయిరి.౹

5 యూదామీద నేను అగ్ని వేసెదను, అది యెరూషలేము నగరులను దహించివేయును.

6 యెహోవా సెలవిచ్చునదేమనగా–ఇశ్రాయేలు మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ దానిని శిక్షింతును; ఏలయనగా ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులను అమ్మి వేయుదురు; పాదరక్షలకొరకై బీదవారిని అమ్మి వేయుదురు.౹

7 దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు; దీనుల త్రోవకు అడ్డము వచ్చెదరు; తండ్రియు కుమారుడును ఒకదానినే కూడి నా పరిశుద్ధనామమును అవమానపరచుదురు;౹

8 తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరచుకొని బలిపీఠములన్నిటియొద్ద పండుకొందురు. జుల్మానా సొమ్ముతో కొనిన ద్రాక్షారసమును తమ దేవుని మందిరములోనే పానము చేయుదురు.౹

9 దేవదారు వృక్షమంత యెత్తయినవారును సింధూరవృక్షమంత బలముగల వారునగు అమోరీయులను వారిముందర నిలువకుండ నేను నాశనము చేసితిని గదా; పైన వారి ఫలమును క్రింద వారి మూలమును నేను నాశనము చేసితిని గదా,౹

10 మరియు ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించి, అమోరీయుల దేశమును మీకు స్వాధీనపరచవలెనని నలువది సంవత్సరములు అరణ్యమందు మిమ్మును నడిపించితిని గదా.౹

11 మరియు మీ కుమారులలో కొందరిని ప్రవక్తలుగాను, మీ యౌవనులలో కొందరిని నాకు నాజీరులుగానునియమించితిని. ఇశ్రాయేలీయులారా, యీ మాటలు నిజమైనవికావా? ఇదే యెహోవా వాక్కు.౹

12 అయితే నాజీరులకు మీరు ద్రాక్షారసము త్రాగించితిరి, ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చితిరి.౹

13 ఇదిగో పంటచేని మోపుల నిండుబండి నేలను అణగ ద్రొక్కునట్లు నేను మిమ్మును అణగద్రొక్కుదును.౹

14 అప్పుడు అతివేగియగు వాడు తప్పించుకొనజాలకపోవును, పరాక్రమశాలి తన బలమునుబట్టి ధైర్యము తెచ్చుకొనజాలక పోవును, బలాఢ్యుడు తన ప్రాణము రక్షించుకొనజాలకుండును.౹

15 విలుకాడు నిలువజాలకపోవును, వడిగా పరుగెత్తువాడు తప్పించు కొనలేకపోవును, గుఱ్ఱము ఎక్కినవాడు తన ప్రాణమును రక్షించుకొనలేకపోవును.౹

16 మరియు ఆ దినమందు బలాఢ్యులలో బహు ధైర్యముగలవాడు దిగంబరియై పారిపోవును; ఇదే యెహోవా వాక్కు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/AMO/2-5943e1191f879edf6c6320e5f7e7c830.mp3?version_id=1787—

Categories
ఆమోసు

ఆమోసు 3

1 ఐగుప్తుదేశమునుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలీయులారా, మిమ్మునుగూర్చియు ఆయన రప్పించిన కుటుంబమువారినందరినిగూర్చియు ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి.౹

2 అదేమనగా భూమిమీది సకల వంశములలోను మిమ్మును మాత్రమే నేను ఎరిగియున్నాను గనుక మీరు చేసిన దోషక్రియలన్నిటినిబట్టి మిమ్మును శిక్షింతును.౹

3-4 సమ్మతింపకుండ ఇద్దరు కూడి నడుతురా? ఎర దొరకక సింహము అడవిలో గర్జించునా? ఏమియు పట్టుకొనకుండనే కొదమసింహము గుహలోనుండి బొబ్బ పెట్టునా?

5 భూమిమీద ఒకడును ఎరపెట్టకుండ పక్షి ఉరిలో చిక్కుపడునా? ఏమియు పట్టుబడకుండ ఉరి పెట్టువాడు వదలిలేచునా?

6 పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండునా? యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా?

7 తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించినదానిని బయలు పరచకుండ ప్రభువైన యెహోవా యేమియు చేయడు.౹

8 సింహము గర్జించెను, భయపడనివాడెవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నాడు, ప్రవచింపకుండువాడెవడు?

9 అష్డోదు నగరులలో ప్రకటనచేయుడి, ఐగుప్తుదేశపు నగరులలో ప్రకటనచేయుడి; ఎట్లనగా–మీరు షోమ్రోనునకు ఎదురుగానున్న పర్వతములమీదికి కూడివచ్చి అందులో జరుగుచున్న గొప్ప అల్లరి చూడుడి; అందులో జనులు పడుచున్న బాధ కనుగొనుడి.౹

10 వారు నీతి క్రియలు చేయ తెలియక తమ నగరులలో బలాత్కారముచేతను దోపుడుచేతను సొమ్ము సమకూర్చుకొందురు.౹

11 కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా– శత్రువు వచ్చును, అతడు దేశమంతట సంచరించి నీ ప్రభావమును కొట్టివేయగా నీ నగరులు పాడగును.౹

12 యెహోవా సెలవిచ్చునదేమనగా–గొల్లవాడు సింహము నోటనుండి రెండు కాళ్లనైనను చెవి ముక్కనైనను విడిపించునట్లుగా షోమ్రోనులో మంచములమీదను బుట్టాలువేసిన శయ్యలమీదను కూర్చుండు ఇశ్రాయేలీయులు రక్షింపబడుదురు.౹

13 ప్రభువును దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చునదేమనగా–నా మాట ఆలకించి యాకోబు ఇంటివారికి దానిని రూఢిగా తెలియజేయుడి.౹

14 ఇశ్రాయేలువారు చేసిన దోషములనుబట్టి నేను వారిని శిక్షించు దినమున బేతేలులోని బలిపీఠములను నేను శిక్షింతును; ఆ బలిపీఠపు కొమ్ములు తెగవేయబడి నేలరాలును.౹

15 చలికాలపు నగరును వేసవికాలపు నగరును నేను పడగొట్టెదను, దంతపు నగరులును లయమగును, బహు నగరులు పాడగును; ఇదే యెహోవా వాక్కు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/AMO/3-e165f07cd53e3d36ae5b575f2fc08cd7.mp3?version_id=1787—

Categories
ఆమోసు

ఆమోసు 4

1 షోమ్రోను పర్వతముననున్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధపెట్టుచు బీదలను నలుగగొట్టువారలారా –మాకు పానము తెచ్చి ఇయ్యుడని మీ యజమానులతో చెప్పువారలారా, యీ మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణమేదనగా

2 –ఒక కాలమువచ్చుచున్నది, అప్పుడు శత్రువులు మిమ్మును కొంకులచేతను, మీలో శేషించినవారిని గాలములచేతను పట్టుకొని లాగుదురు.౹

3 ఇటు అటు తొలగకుండ మీరందరు ప్రాకారపు గండ్లద్వారా పోవుదురు, హర్మోను మార్గమున వెలి వేయబడుదురు; ఇదే యెహోవా వాక్కు.

4 బేతేలునకు వచ్చి తిరుగుబాటు చేయుడి, గిల్గాలునకు పోయి మరి యెక్కువగా తిరుగుబాటు చేయుడి, ప్రతి ప్రాతఃకాలమున బలులు తెచ్చి మూడేసి దినముల కొక సారి దశమ భాగములను తెచ్చి అర్పించుడి.౹

5 పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి,స్వేచ్ఛార్పణనుగూర్చి చాటించి ప్రకటన చేయుడి; ఇశ్రాయేలీయులారా, యీలాగున చేయుట మీకిష్టమైయున్నది; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.౹

6 మీ పట్టణములన్నిటిలోను నేను మీకు దంతశుద్ధి కలుగజేసినను, మీరున్న స్థలములన్నిటిలోను మీకు ఆహారములేకుండ చేసినను మీరు నాతట్టు తిరిగినవారు కారు; ఇదే యెహోవా వాక్కు.౹

7 మరియు కోతకాలమునకుముందు మూడు నెలలు వానలేకుండ చేసితిని; ఒక పట్టణముమీద కురి పించి మరియొక పట్టణముమీద కురిపింపకపోతిని; ఒక చోట వర్షము కురిసెను, వర్షము లేనిచోటు ఎండిపోయెను.౹

8 రెండు మూడు పట్టణములవారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునకే పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయెను; అయినను మీరు నాతట్టు తిరిగినవారు కారు; ఇదే యెహోవా వాక్కు.౹

9 మరియు మీ సస్యములను ఎండు తెగులుచేతను కాటుకచేతను నేను పాడుచేసితిని, గొంగళి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను ద్రాక్షతోటలను అంజూరపు చెట్లను ఒలీవచెట్లను తినివేసెను, అయినను మీరు నాతట్టు తిరిగినవారు కారు; ఇదే యెహోవా వాక్కు.౹

10 మరియు నేను ఐగుప్తీయులమీదికి తెగుళ్లు పంపించినట్లు మీమీదికి తెగుళ్లు పంపించితిని; మీ దండు పేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికా రంధ్రములకు ఎక్కునంతగా మీ యౌవనులను ఖడ్గముచేత హతముచేయించి మీ గుఱ్ఱములను కొల్లపెట్టించితిని; అయినను మీరు నాతట్టు తిరిగినవారు కారు; ఇదే యెహోవా వాక్కు.౹

11 దేవుడు సొదొమ గొమొఱ్ఱాలను బోర్లదోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనముచేయగా మీరు మంటలోనుండి తీయబడిన కొరవులైనట్టు తప్పించు కొంటిరి; అయినను మీరు నాతట్టు తిరిగినవారు కారు; ఇదే యెహోవా వాక్కు.౹

12 కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీయెడల నేనీలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి.౹

13 పర్వతములను నిరూపించువాడును గాలిని పుట్టించువాడును ఆయనే. ఉదయమున చీకటి కమ్మజేయువాడును మనుష్యుల యోచనలు వారికి తెలియజేయువాడును ఆయనే; భూమియొక్క ఉన్నతస్థలము మీద సంచరించు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా అని ఆయనకు పేరు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/AMO/4-139762bf8991e674bbfba70729037354.mp3?version_id=1787—

Categories
ఆమోసు

ఆమోసు 5

1 ఇశ్రాయేలువారలారా, మిమ్మునుగూర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాట ఆలకించుడి.౹

2 కన్యకయైన ఇశ్రాయేలు కూలిపోయెను, ఆమె మరెన్నటికిని లేవదు; లేవనెత్తువాడొకడును లేక ఆమె భూమిమీద పడవేయబడియున్నది.౹

3 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–ఇశ్రాయేలు వారిలో వెయ్యిమందియై బయలు వెళ్లిన పట్టణస్థులలో నూరుమంది తప్పించుకొని వత్తురు; నూరుమందియై బయలువెళ్లిన పట్టణస్థులలో పదిమంది తప్పించుకొని వత్తురు.౹

4 ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చున దేమనగా–నన్నాశ్రయించుడి, నన్నాశ్రయించినయెడల మీరు బ్రదుకుదురు.౹

5 బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బెయేర్షెబాకు వెళ్లకుడి; గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడిపోవును, బేతేలు శూన్యమగును.౹

6 యెహోవాను ఆశ్రయించుడి; అప్పుడు మీరు బ్రదుకుదురు, ఆశ్రయింపనియెడల బేతేలులో ఎవరును ఆర్పివేయలేకుండ అగ్నిపడినట్లు ఆయన యోసేపు సంతతిమీదపడి దాని నాశనముచేయును.౹

7 న్యాయమును అన్యాయమునకు మార్చి, నీతిని నేలను పడవేయువారలారా,౹

8 ఆయన సప్తఋషీ నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు, కారుచీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటివలె మార్పుచేయువాడు, సముద్రజలములను పిలిచి వాటిని భూమిమీద పొర్లి పారజేయువాడు.౹

9 ఆయన పేరు యెహోవా; బలాఢ్యులమీదికి ఆయన నాశము తెప్పింపగా దుర్గములు పాడగును.౹

10 అయితే గుమ్మములో నిలిచి బుద్ధిచెప్పువారి మీద జనులు పగపట్టుదురు; యథార్థముగా మాటలాడు వారిని అసహ్యించుకొందురు.౹

11 దోషనివృత్తికి రూకలు పుచ్చుకొని నీతిమంతులను బాధపెట్టుచు, గుమ్మమునకు వచ్చు బీదవారిని అన్యాయము చేయుటవలన

12 మీ అపరాధములు విస్తారములైనవనియు, మీ పాపములు ఘోరమైనవనియు నేనెరుగుదును. దరిద్రులయొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అణగద్రొక్కుదురు గనుక మలుపురాళ్లతో మీరు ఇండ్లుకట్టుకొనినను వాటిలో మీరు కాపురముండరు, శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్లరసము మీరు త్రాగరు.౹

13 ఇది చెడుకాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును.౹

14 మీరు బ్రదుకునట్లు కీడు విడిచి మేలు వెదకుడి; ఆలాగు చేసినయెడల మీరనుకొను చొప్పున దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా మీకు తోడుగానుండును.౹

15 కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు, గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి; ఒక వేళ దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా యోసేపు సంతతిలో శేషించినవారియందు కనికరించును.౹

16 దేవుడును సైన్యములకధిపతియునైన ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–నేను మీ మధ్య సంచరింపబోవుచున్నాను గనుక రాజమార్గములన్నిటిలో అంగలార్పు వినబడును, వీధులన్నిటిలో జనులు కూడి–అయ్యో శ్రమ అందురు; అంగలార్చుటకు వారు సేద్యగాండ్రను పిలుతురు; రోదనముచేయ నేర్పుగలవారిని అంగలార్చుటకు పిలిపింతురు.౹

17 ద్రాక్షతోటలన్నిటిలో రోదనము వినబడును.౹

18 యెహోవా దినము రావలెనని ఆశపెట్టుకొనియున్నవారలారా, మీకు శ్రమ; యెహోవా దినము వచ్చుటవలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగుకాదు, అంధకారము.౹

19 ఒకడు సింహము నొద్దనుండి తప్పించు కొనగా ఎలుగుబంటి యెదురైనట్టు, వాడు ఇంటిలోనికి పోయి గోడమీద చెయ్యివేయగా పాము వాని కరచినట్టు ఆ దినముండును.౹

20 యెహోవా దినము నిజముగా వెలుగైయుండదు కాదా? వెలుగు ఏమాత్రమును లేక అది కారుచీకటిగా ఉండదా?

21 మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను; వాటిని నీచముగా ఎంచుచున్నాను; మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆఘ్రాణింపనొల్లను.౹

22 నాకు దహనబలులను నైవేద్యములను మీరర్పించినను నేను వాటిని అంగీకరింపను; సమాధానబలులుగా మీరర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను.౹

23 మీ పాటల ధ్వని నాయొద్దనుండి తొలగనియ్యుడి, మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సులేదు.౹

24 నీళ్లు పారినట్లుగా న్యాయము జరుగనియ్యుడి, గొప్ప ప్రవాహమువలె నీతిని ప్రవహింప నియ్యుడి.౹

25 ఇశ్రాయేలీయులారా, అరణ్యమందు నలువది సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించితిరా?

26 మీరు మీ దేవతయైన మోలెకు గుడారమును, మీరు పెట్టుకొనిన విగ్రహముల పీఠమును మీరు మోసికొని వచ్చితిరి గదా.౹

27 కాబట్టి నేను దమస్కు పట్టణము అవతలికి మిమ్మును చెరగొని పోవుదును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు; ఆయన పేరు సైన్యములకధిపతియగు దేవుడు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/AMO/5-8b184172e7cdcf8e835c3f58be77fc77.mp3?version_id=1787—

Categories
ఆమోసు

ఆమోసు 6

1 సీయోనులో నిర్విచారముగా నున్నవారికి శ్రమ, షోమ్రోను పర్వతములమీద నిశ్చింతగా నివసించువారికి శ్రమ; ఇశ్రాయేలువారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైనవారికి శ్రమ

2 కల్నేకు పోయి విచారించుడి; అక్కడనుండి హమాతు మహాపురమునకు పోవుడి, ఫిలిష్తీయుల పట్టణమైన గాతునకు పోవుడి; అవి ఈ రాజ్యములకంటె గొప్పవి గదా; వాటి సరిహద్దులు మీ సరిహద్దులకంటె విశాలమైనవి గదా.౹

3 ఉపద్రవ దినము బహుదూరముననున్నదనుకొని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములు స్థాపింతురు.౹

4 దంతపు మంచములమీద పరుండుచు, పాన్పులమీద తమ్మును చాచుకొనుచు, మందలో శ్రేష్ఠమైన గొఱ్ఱెపిల్లలను సాలలోని క్రొవ్వినదూడలను వధించి భోజనము చేయుదురు.౹

5 స్వరమండలముతో కలిసి పిచ్చిపాటలు పాడుచు, దావీదువలెనే వాయించు వాద్యములను కల్పించు కొందురు.౹

6 పాత్రలలో ద్రాక్షారసముపోసి పానముచేయుచు పరిమళ తైలము పూసికొనుచుందురు గాని యోసేపు సంతతివారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు.౹

7 కాబట్టి చెరలోనికి ముందుగా పోవు వారితోకూడా వీరు చెరలోనికి పోవుదురు; అప్పుడు సుఖాసక్తులుచేయు ఉత్సవధ్వని గతించును. యాకోబు సంతతివారికున్న గర్వము నాకసహ్యము; వారి నగరులకు నేను విరోధినైతిని గనుక వారి పట్టణములను వాటిలోని సమస్తమును శత్రువుల వశము చేసెదనని

8 ప్రభువైన యెహోవా తనతోడని ప్రమాణము చేసెను; ఇదే దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా వాక్కు.౹

9 ఒక కుటుంబమందు పదిమంది మనుష్యులుండినను వారు చత్తురు.౹

10 ఒకని దాయాది కాల్చబోవు వానితోకూడ ఎముకలను ఇంటిలోనుండి బయటికి కొనిపోవుటకై శవమును ఎత్తినప్పుడు ఇంటి వెనుకటి భాగమున ఒకనిచూచి –యింటిలో మరి ఎవరైన మిగిలియున్నారా? యని అడుగగా అతడు ఇంకెవరును లేరనును; అంతట దాయాదిట్లనును–నీవిక నేమియు పలుకక ఊరకుండుము, యెహోవానామము స్మరించకూడదు;౹

11 ఏలయనగా గొప్ప కుటుంబములు పాడగుననియు, చిన్న కుటుంబములు చీలి పోవుననియు యెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నాడు

12 గుఱ్ఱములు బండలమీద పరుగెత్తునా? అట్టిచోట ఎవరైన ఎద్దులతో దున్నుదురా? అయినను మాశక్తిచేతనే బలము తెచ్చుకొందుమని చెప్పుకొను మీరు, వ్యర్థమైన దానినిబట్టి సంతోషించు మీరు,౹

13 న్యాయమును ఘోరమైన అన్యా యముగాను, నీతిఫలమును ఘోరదుర్మార్గముగాను మార్చితిరి.౹

14 ఇందుకు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చునదేమనగా–ఇశ్రాయేలీయులారా, నేను మీ మీదికి ఒక జనమును రప్పింతును, వారు హమాతునకు పోవుమార్గము మొదలుకొని అరణ్యపు నదివరకు మిమ్మును బాధింతురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/AMO/6-7c6f56c415e1add6b78155b43dd271c2.mp3?version_id=1787—

Categories
ఆమోసు

ఆమోసు 7

1 కడవరి గడ్డి మొలుచునప్పుడు ప్రభువైన యెహోవా మిడుతలను పుట్టించి దర్శనరీతిగా దానిని నాకు కనుపర చెను; ఆ గడ్డి రాజునకు రావలసిన కోత అయిన తరువాత మొలిచినది.౹

2 నేలను మొలిచిన పచ్చికయంతయు ఆ మిడుతలు తినివేసినప్పుడు–ప్రభువైన యెహోవా, నీవు దయచేసి క్షమించుము, యాకోబు కొద్ది జనముగలవాడు, అతడేలాగు నిలుచును? అని నేను మనవిచేయగా

3 యెహోవా పశ్చాత్తాపపడి–అది జరుగదని సెలవిచ్చెను.

4 మరియు–అగ్నిచేత దండింపవలెనని అగ్ని రప్పించి ప్రభువైన యెహోవా దానిని దర్శనరీతిగా నాకు కనుపరచెను. అది వచ్చి అగాధమైన మహా జలమును మ్రింగివేసి, స్వాస్థ్యమును మ్రింగ మొదలుపెట్టినప్పుడు

5 –ప్రభువైన యెహోవా, యాకోబు కొద్ది జనముగలవాడు, అతడేలాగు నిలుచును? మాని వేయుమని నేను మనవిచేయగా

6 ప్రభువైన యెహోవా పశ్చాత్తాపపడి– అదియు జరుగదని సెలవిచ్చెను.

7 మరియు యెహోవా తాను మట్టపుగుండు చేతపట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన యొక గోడమీద నిలువబడి ఇట్లు దర్శనరీతిగా నాకు కనుపరచెను.౹

8 యెహోవా–ఆమోసూ, నీకు కనబడుచున్నదేమని నన్నడుగగా–నాకు మట్టపుగుండు కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా– నా జనులగు ఇశ్రాయేలీయులమధ్యను మట్టపుగుండు వేయ బోవుచున్నాను. నేనికను వారిని దాటిపోను

9 ఇస్సాకు సంతతివారు ఏర్పరచిన ఉన్నతస్థలములు పాడైపోవును, ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠితస్థలములు నాశమగును. నేను ఖడ్గము చేతపట్టుకొని యరొబాము ఇంటివారిమీద పడుదును.

10 అప్పుడు బేతేలులోని యాజకుడైన అమజ్యా ఇశ్రాయేలురాజైన యరొబామునకు వర్తమానము పంపి–ఇశ్రాయేలీయులమధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు;౹

11 యరొబాము ఖడ్గముచేత చచ్చుననియు, ఇశ్రాయేలీయులు తమ దేశమును విడిచి చెరలోనికి పోవుదురనియు ప్రకటించుచున్నాడు; అతని మాటలు దేశము సహింపజాలదు అని తెలియజేసెను.౹

12 మరియు అమజ్యా ఆమోసుతో ఇట్లనెను–దీర్ఘదర్శీ, తప్పించుకొని యూదాదేశమునకు పారి పొమ్ము; అచ్చటనే బత్తెము సంపాదించుకొనుము అచ్చటనే నీ వార్త ప్రకటించుము;౹

13 బేతేలు, రాజుయొక్క ప్రతిష్ఠితస్థలము రాజధాని పట్టణమై యున్నందున నీ వికను దానిలో నీ వార్త ప్రకటనచేయకూడదు.౹

14 అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లనెను– నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్తయొక్క శిష్యుడనైనను కాను, కాని పసులకాపరినై మేడిపండ్లు ఏరుకొనువాడను.౹

15 నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి–నీవు పోయి నా జనులగు ఇశ్రాయేలువారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చెను.౹

16 యెహోవా మాట ఆలకించుము–ఇశ్రాయేలీయులనుగూర్చి ప్రవచింపకూడదనియు ఇస్సాకు సంతతి వారిని గూర్చి మాట జారవిడువకూడదనియు నీవు ఆజ్ఞ ఇచ్చుచున్నావే.౹

17 యెహోవా సెలవిచ్చునదేమనగా–నీ భార్య పట్టణమందు వేశ్యయగును, నీ కుమారులును కుమార్తెలును ఖడ్గముచేత కూలుదురు, నీ భూమి నూలుచేత విభాగింపబడును, నీవు అపవిత్రమైన దేశమందు చత్తువు; అవశ్యముగా ఇశ్రాయేలీయులు తమ దేశము విడిచి చెరగొనబడుదురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/AMO/7-2ef0d23b7d4fe9e164c985dfa2675555.mp3?version_id=1787—

Categories
ఆమోసు

ఆమోసు 8

1 మరియు ప్రభువైన యెహోవా దర్శనరీతిగా వేసవి కాలపు పండ్లగంప యొకటి నాకు కనుపరచి

2 –ఆమోసూ, నీకు కనబడుచున్నదేమని నన్నడుగగా–వేసవికాలపు పండ్లగంప నాకు కనబడుచున్నదని నేనంటిని, అప్పుడు యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా–నా జనులగు ఇశ్రాయేలీయులకు అంతము వచ్చేయున్నది, నేనికను వారిని విచారణచేయక మానను.౹

3 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును, శవములు లెక్కకు ఎక్కు వగును, ప్రతిస్థలమందును అవి పారవేయబడును. ఊరకుండుడి.౹

4 దేశమందు బీదలను మ్రింగివేయను దరిద్రులను మాపివేయను కోరువారలారా,౹

5 –తూము చిన్నదిగాను రూపాయి యెక్కువదిగాను చేసి, దొంగత్రాసు చేసి, మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య యెప్పుడై పోవునో, మనము గోధుమలను అమ్మకము చేయునట్లు విశ్రాంతిదినము ఎప్పుడు గతించిపోవునోయని చెప్పుకొనువారలారా,౹

6 దరిద్రులను వెండికి కొనునట్లును పాదరక్షల నిచ్చి బీదవారిని కొనునట్లును చచ్చు ధాన్యమును మనము అమ్ముదము రండని విశ్రాంతిదిన మెప్పుడైపోవునో అని చెప్పుకొనువారలారా, ఈ మాట ఆలకించుడి.౹

7 యాకోబుయొక్క అతిశయాస్పదము తోడని యెహోవా ప్రమాణము చేయునదేమనగా–వారిక్రియలను నేనెన్నడును మరువను.౹

8 ఇందునుగూర్చి భూమి కంపించదా? దాని నివాసులందరును అంగలార్చరా? నైలునది పొంగునట్లు భూమి అంతయు ఉబుకును, ఐగుప్తుదేశపు నైలునదివలె అది ఉబుకును, మిస్రయీము దేశపునదివలె అది అణగి పోవును.౹

9 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా– ఆ దినమున నేను మధ్యాహ్నకాలమందు సూర్యుని అస్తమింపజేయుదును. పగటివేళను భూమికి చీకటి కమ్మజేయుదును.౹

10 మీ పండుగ దినములను దుఃఖదినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును, అందరిని మొలలమీద గోనెపట్ట కట్టుకొనజేయుదును, అందరి తలలు బోడిచేసెదను, ఒకనికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును; దాని అంత్యదినము ఘోరమైనశ్రమదినముగా ఉండును.౹

11 రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును; అది అన్నపానములు లేకపోవుటచేత కలుగు క్షామముకాక యెహోవా మాటను వినకపోవుటవలన కలుగు క్షామముగా ఉండును; ఇదే యెహోవా వాక్కు.౹

12 కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై యీ సముద్రమునుండి ఆ సముద్రమువరకును ఉత్తరదిక్కునుండి తూర్పుదిక్కువరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు;౹

13 ఆ దినమందు చక్కని కన్యలును యౌవనులును దప్పిచేత సొమ్మసిల్లుదురు.౹

14 షోమ్రోనుయొక్క దోషమునకు కారణమగుదాని తోడనియు, దానూ, నీ దేవుని జీవముతోడనియు, బెయేర్షెబా మార్గ జీవముతోడనియు ప్రమాణము చేయువారు ఇకను లేవకుండ కూలుదురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/AMO/8-6e0612541e0b58b1d2dcf4ce7160071b.mp3?version_id=1787—

Categories
ఆమోసు

ఆమోసు 9

1 యెహోవా బలిపీఠమునకు పైగా నిలిచియుండుట నేను చూచితిని. అప్పుడు ఆయన నా కాజ్ఞ ఇచ్చిన దేమనగా–గడపలు కదలిపోవునట్లుగా పై కమ్ములనుకొట్టి వారందరి తలలమీద వాటిని పడవేసి పగులగొట్టుము; తరువాత వారిలో ఒకడును తప్పించుకొనకుండను, తప్పించు కొనువారిలో ఎవడును బ్రదుకకుండను నేను వారినందరిని ఖడ్గముచేత వధింతును.౹

2 వారు పాతాళములో చొచ్చి పోయినను అచ్చటనుండి నా హస్తము వారిని బయటికి లాగును; ఆకాశమునకెక్కి పోయినను అచ్చటనుండి వారిని దింపి తెచ్చెదను.౹

3 వారు కర్మెలు పర్వతశిఖరమున దాగినను నేను వారిని వెదకిపెట్టి అచ్చటనుండి తీసికొని వచ్చెదను; నా కన్నులకు కనబడకుండ వారు సముద్రములో మునిగి నను అచ్చటి సర్పమునకు నేనాజ్ఞ ఇత్తును, అది వారిని కరచును.౹

4 తమ శత్రువులచేత వారు చెరపట్టబడినను అచ్చట నేను ఖడ్గమున కాజ్ఞ ఇత్తును, అది వారిని హతము చేయును; మేలుచేయుటకు కాదు కీడుచేయుటకే నా దృష్టి వారిమీద నిలుపుదును.౹

5 ఆయన సైన్యములకధిపతియగు యెహోవా; ఆయన భూమిని మొత్తగా అది కరిగి పోవును, అందులోని నివాసులందరును ప్రలాపింతురు, నైలునదివలెనే అదియంతయు ఉబుకుచుండును, ఐగుప్తు దేశపు నైలునదివలెనే అది అణగిపోవును.౹

6 ఆకాశమందు తనకొరకై మేడగదులు కట్టుకొనువాడును, ఆకాశమండలమునకు భూమియందు పునాదులు వేయువాడును ఆయనే, సముద్రజలములను పిలిచి వాటిని భూమిమీద ప్రవహింపజేయువాడును ఆయనే; ఆయన పేరు యెహోవా.౹

7 ఇశ్రాయేలీయులారా, మీరును కూషీయులును నా దృష్టికి సమానులు కారా? నేను ఐగుప్తు దేశములోనుండి ఇశ్రాయేలీయులను, కఫ్తోరు దేశములోనుండి ఫిలిష్తీయులను, కీరుదేశములోనుండి సిరియనులను రప్పించితిని.౹

8 ప్రభువైన యెహోవా కన్ను ఈ పాపిష్ఠి రాజ్యముమీదనున్నది, దానిని భూమిమీద ఉండకుండ నాశనము చేతును. అయితే యాకోబు సంతతివారిని సర్వనాశముచేయక విడిచి పెట్టుదును; ఇదే యెహోవా వాక్కు.౹

9 నేనాజ్ఞ ఇయ్యగా ఒకడు ధాన్యము జల్లెడతో జల్లించినట్లు ఇశ్రాయేలీయులను అన్యజనులందరిలో జల్లింతును గాని యొక చిన్నగింజైన నేల రాలదు.౹

10 –ఆ కీడు మనలను తరిమి పట్టదు, మనయొద్దకు రాదు అని నా జనులలో అనుకొను పాపాత్ములందరును ఖడ్గముచేత చత్తురు.

11 పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగుచేసి దాని పోయిన చోట్లను బాగుచేసి, ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులనందరిని నా జనులు స్వతంత్రించుకొనునట్లు

12 పూర్వపురీతిగా దానిని మరల కట్టుదును; ఈలాగు జరిగించు యెహోవా వాక్కు ఇదే.౹

13 రాబోవు దినములలో కోయువారు దున్నువారి వెంటనే వత్తురు; విత్తనము చల్లు వారి వెంటనే ద్రాక్షపండ్లు త్రొక్కువారు వత్తురు; పర్వతములనుండి మధురమైన ద్రాక్షారసము స్రవించును, కొండలన్ని రసధారలగును; ఇదే యెహోవా వాక్కు.౹

14 మరియు శ్రమనొందుచున్న నా జనులగు ఇశ్రాయేలీయులను నేను చెరలోనుండి రప్పింతును, పాడైన పట్టణములను మరల కట్టుకొని వారు కాపురముందురు, ద్రాక్షతోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములువేసి వాటి పండ్లను తిందురు.౹

15 వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికిచ్చిన దేశములోనుండి వారు ఇక పెరికివేయ బడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/AMO/9-61889cb9f0a12ed604b95cf9f71298cb.mp3?version_id=1787—

Categories
ఓబద్యా

ఓబద్యా 1

1 ఓబద్యాకు కలిగిన దర్శనము. ఎదోమును గురించి ప్రభువగు యెహోవా సెలవిచ్చునది. యెహోవాయొద్ద నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను. –ఎదోము మీద యుద్ధము చేయుదము లెండని జనులను రేపుటకై దూత పంపబడియున్నాడు.౹

2 నేను అన్యజనులలో నిన్ను అల్పు నిగా చేసితిని, నీవు బహుగా తృణీకరింపబడుదువు.౹

3 అత్యున్నతమైన పర్వతములమీద ఆసీనుడవైయుండి కొండసందులలో నివసించువాడా – నన్ను క్రిందికి పడ ద్రోయగలవాడెవడని అనుకొనువాడా, నీ హృదయపు గర్వముచేత నీవు మోసపోతివి.౹

4 పక్షిరాజు గూడంత యెత్తున నివాసము చేసికొని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చటనుండియు నేను నిన్ను క్రింద పడవేతును; ఇదే యెహోవా వాక్కు.౹

5 చోరులేగాని రాత్రి కన్నము వేయువారేగాని నీ మీదికి వచ్చినయెడల తమకు కావలసినంతమట్టుకు దోచుకొందురు గదా. ద్రాక్ష పండ్లను ఏరువారు నీయొద్దకు వచ్చినయెడల పరిగె యేరు కొనువారికి కొంత యుండనిత్తురుగదా; నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి యున్నావు.౹

6 ఏశావు సంతతి వారి సొమ్ము సోదా చూడబడును; వారు దాచి పెట్టిన ధనమంతయు పట్టబడును.౹

7 నీతో సంధిచేసినవారు నిన్ను తమ సరిహద్దువరకు పంపివేయుదురు; నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారము చేయుదురు; వారు నీ యన్నము తిని నీ కొరకు ఉరి యొడ్డుదురు; ఎదోమునకు వివేచన లేకపోయెను.౹

8 ఆ దినమందు ఏశావు పర్వతములలో వివేచన లేకపోవునట్లు ఎదోములోనుండి జ్ఞానులను నాశముచేతును; ఇదే యెహోవా వాక్కు.౹

9 తేమానూ, నీ బలాఢ్యులు విస్మయ మొందుదురు, అందువలన ఏశావుయొక్క పర్వత నివాసులందరు హతులై నిర్మూలమగుదురు.౹

10 నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమునుబట్టి నీవు అవమానము నొందుదువు, ఇక నెన్నటికినిలేకుండ నీవు నిర్మూలమగుదువు.౹

11 నీవు పగవాడవై నిలిచిన దినమందు, పరదేశులు వారి ఆస్తిని పట్టుకొనిపోయిన దినమందు, అన్యులు వారి గుమ్మములలోనికి చొరబడి యెరూషలేముమీద చీట్లువేసిన దినమందు నీవును వారితో కలిసి కొంటివి గదా.౹

12 నీ సహోదరుని శ్రమానుభవదినము చూచి నీవు ఆనందమొంద తగదు; యూదావారి నాశనదినమున వారి స్థితినిచూచి నీవు సంతోషింపతగదు;౹

13 నా జనుల ఆపద్దినమున నీవు వారి గుమ్మములలోనికి చొరబడ దగదు; వారి ఆపద్దినమున నీవు సంతోషపడుచు వారి బాధను చూడతగదు; వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకొనతగదు;౹

14 వారిలో తప్పించుకొనినవారిని సంహరించుటకు అడ్డత్రోవలలో నీవు నిలువతగదు, శ్రమదినమందు అతనికి శేషించినవారిని శత్రువులచేతికి అప్పగింప తగదు.౹

15 యెహోవాదినము అన్యజనులందరిమీదికి వచ్చు చున్నది. అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే నీ నెత్తిమీదికి వచ్చును.౹

16 మీరు నా పరిశుద్ధమైన కొండమీద త్రాగినట్లు అన్యజనులందరును నిత్యము త్రాగుదురు; తాము ఇక నెన్నడు నుండనివారైనట్లు వారేమియు మిగులకుండ త్రాగుదురు.౹

17 అయితే సీయోను కొండ ప్రతిష్ఠితమగును, తప్పించుకొనినవారు దానిమీద నివసింతురు, యాకోబు సంతతివారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు.౹

18 మరియు యాకోబు సంతతివారు అగ్నియు, యోసేపు సంతతివారు మంటయు అగుదురు; ఏశావు సంతతివారు వారికి కొయ్యకాలుగా ఉందురు; ఏశావు సంతతివారిలో ఎవడును తప్పించుకొనకుండ యోసేపు సంతతివారు వారిలో మండి వారిని కాల్చుదురు. యెహోవా మాట యిచ్చియున్నాడు.౹

19 దక్షిణ దిక్కున నివసించువారు ఏశావుయొక్క పర్వతమును స్వతంత్రించుకొందురు; మైదానమందుండువారు ఫిలిష్తీయులదేశమును స్వతంత్రించుకొందురు; మరియు ఎఫ్రాయిమీయుల భూములను షోమ్రోనునకు చేరిన పొలమును వారు స్వతంత్రించుకొందురు. బెన్యామీనీయులు గిలాదుదేశమును స్వతంత్రించుకొందురు.౹

20 మరియు ఇశ్రాయేలీయుల దండు, అనగా వారిలో చెరపట్టబడినవారు సారెపతువరకు కనానీయుల దేశమును స్వతంత్రించుకొందురు; యెరూషలేమువారిలో చెరపట్ట బడి సెఫారాదునకు పోయినవారు దక్షిణదేశపు పట్టణములను స్వతంత్రించుకొందురు.౹

21 మరియు ఏశావుయొక్క కొండకు తీర్పుతీర్చుటకై సీయోను కొండమీద రక్షకులు పుట్టుదురు; అప్పుడు రాజ్యము యెహోవాది యగును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/OBA/1-e3debcc2324e875e66f9fa59ec7164b2.mp3?version_id=1787—

Categories
యోనా

యోనా 1

1 యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.౹

2 –నీనెవెపట్ట ణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నీనెవె మహా పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము.౹

3 అయితే యెహోవా సన్ని ధిలోనుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి, ప్రయాణమునకు కేవు ఇచ్చి, యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితోకూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను.౹

4 అయితే యెహోవా సముద్రముమీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుపాను రేగి ఓడ బద్దలైపోవుగతి వచ్చెను.౹

5 కాబట్టి నావికులు భయపడి, ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి, ఓడ చులకన చేయుటకై అందులోని సరకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా, ఓడ దిగువభాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయియుండెను

6 అప్పుడు ఓడనాయకుడు అతని యొద్దకు వచ్చి, –ఓయీ నిద్ర బోతా, నీకేమివచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండ ఆ దేవుడు మనయందు కనికరించునేమో అనెను.౹

7 అంతలో ఓడ వారు–ఎవనినిబట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేతము రండని యొకరితో ఒకరు చెప్పుకొని, చీట్లు వేయగా చీటి యోనామీదికి వచ్చెను.౹

8 కాబట్టి వారు అతని చూచి–యెవరినిబట్టి ఈ కీడు మాకు సంభవించెనో, నీ వ్యాపారమేమిటో, నీ వెక్కడనుండి వచ్చి తివో, నీ దేశమేదో, నీ జనమేదో, యీ సంగతి యంతయు మాకు తెలియజేయుమనగా

9 అతడు వారితో ఇట్లనెను – నేను హెబ్రీయుడను; సముద్రమునకును భూమికిని సృష్టికర్తయై ఆకాశమందుండు దేవుడైయున్న యెహోవాయందు నేను భయభక్తులు గలవాడనై యున్నాను.౹

10 తాను యెహోవా సన్నిధిలోనుండి పారిపోవుచున్నట్టు అతడు ఆ మనుష్యులకు తెలియజేసి యుండెను గనుక వారా సంగతి తెలిసికొని మరింత భయపడి–నీవు చేసిన పని ఏమని అతని నడిగిరి.౹

11 అప్పుడు వారు–సముద్రము పొంగుచున్నది, తుపాను అధికమౌ చున్నది, సముద్రము మామీదికి రాకుండ నిమ్మళించునట్లు మేము నీ కేమి చేయవలెనని అతని నడుగగా యోనా

12 – నన్నుబట్టియే యీ గొప్పతుపాను మీమీదికివచ్చెనని నాకు తెలిసియున్నది; నన్నుఎత్తి సముద్రములో పడవేయుడి, అప్పుడు సముద్రము మీమీదికి రాకుండ నిమ్మళించునని అతడు వారితో చెప్పినను

13 వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలముగా వేసిరిగాని గాలి తమకు ఎదురై తుపాను బలముచేత సముద్రము పొంగియుండుటవలన వారి ప్రయత్నము వ్యర్థమాయెను.౹

14 కాబట్టి వారు –యెహోవా, నీ చిత్తప్రకారముగా నీవే దీని చేసితివి; ఈ మనుష్యునిబట్టి మమ్మును లయము చేయకుందువు గాక; నిర్దోషిని చంపితిరన్న నేరము మామీద మోపకుందువు గాక అని యెహోవాకు మనవి చేసికొని

15 యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి; పడవేయగానే సముద్రము పొంగకుండ ఆగెను.౹

16 ఇది చూడగా ఆ మనుష్యులు యెహోవాకు మిగుల భయపడి, ఆయనకు బలి అర్పించి మ్రొక్కుబళ్లు చేసిరి.౹

17 గొప్ప మత్స్యము ఒకటి యోనాను మ్రింగవలెనని యెహోవా నియమించి యుండగా యోనా మూడుదినములు ఆ మత్స్యముయొక్క కడుపులో నుండెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JON/1-3d23c0d46965b8394a6dee008a3318e9.mp3?version_id=1787—