Categories
యెహెజ్కేలు

యెహెజ్కేలు 39

1 మరియు నరపుత్రుడా, గోగునుగూర్చి ప్రవచన మెత్తి ఇట్లనుము–ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–రోషునకును మెషెకునకును తుబాలునకును అధిపతివైన గోగూ, నేను నీకు విరోధినైయున్నాను.౹

2 నిన్ను వెనుకకు త్రిప్పి నడిపించి, ఉత్తరదిక్కున దూరములో ఉన్న నిన్ను బయలుదేరదీసి ఇశ్రాయేలీయుల పర్వతములకు రప్పించి

3 నీ యెడమచేతిలోనున్న నీ వింటిని క్రింద పడగొట్టెదను, నీ కుడిచేతిలోనున్న బాణములను క్రింద పడవేసెదను,౹

4 నీవును నీ సైన్యమును నీతోనున్న జనులందరును ఇశ్రాయేలు పర్వతములమీద కూలుదురు, నానా విధమైన క్రూర పక్షులకును దుష్ట మృగములకును ఆహారముగా నిన్ను ఇచ్చెదను.౹

5 నీవు పొలముమీద కూలుదువు, నేనే మాట యిచ్చియున్నాను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹

6 నేను మాగోగు మీదికిని ద్వీపములలో నిర్విచారముగా నివసించువారిమీదికిని అగ్ని పంపెదను, అప్పుడు నేను యెహోవానై యున్నానని వారు తెలిసి కొందురు.౹

7 నేను యెహోవానై యున్నానని అన్యజనులు తెలిసికొనునట్లు ఇక నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగనియ్యక, నా జనులగు ఇశ్రాయేలీయులమధ్య దానిని బయలుపరచెదను.౹

8 ఇదిగో అది వచ్చుచున్నది, కలుగబోవుచున్నది, నేను తెలియజేసిన సమయమున అది జరుగును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹

9 ఇశ్రాయేలీయుల పట్టణములలో నివసించువారు బయలుదేరి, కవచములను డాళ్లను కేడెములను విండ్లను బాణములను గదలను ఈటెలను తీసికొని పొయ్యిలో కాల్చుదురు, వాటివలన ఏడు సంవత్సరములు అగ్ని మండును.౹

10 వారు పొలములో కట్టెలు ఏరుకొనకయు అడవులలో మ్రానులు నరుకకయునుండి, ఆయుధములు పొయ్యిలో కాల్చు చుందురు, తమ్మును దోచుకొనినవారిని తామే దోచుకొందురు, తమ సొమ్ము కొల్లపెట్టినవారి సొమ్ము తామే కొల్లపట్టుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

11 ఆ దినమున గోగువారిని పాతిపెట్టుటకై సముద్రమునకు తూర్పుగా ప్రయాణస్థులు పోవు లోయలో ఇశ్రాయేలుదేశమున నేనొక స్థలము ఏర్పరచెదను; గోగును అతని సైన్యమంతటిని అక్కడి జనులు పాతిపెట్టగా ప్రయాణస్థులు పోవుటకు వీలులేకుండును, ఆ లోయకు హమోన్గోగు అను పేరు పెట్టుదురు.౹

12 దేశమును పవిత్రపరచుచు ఇశ్రాయేలీయులు ఏడు నెలలు వారిని పాతిపెట్టుచుందురు.౹

13 నేను ఘనత వహించు దినమున దేశపు జనులందరు వారిని పాతిపెట్టుదురు; దానివలనవారు కీర్తి నొందెదరు; ఇదే యెహోవా వాక్కు.౹

14 దేశమును పవిత్రపరచుటకై దానిలోనున్న కళేబరములను పాతిపెట్టువారిని, దేశమును సంచరించి చూచుచు వారితోకూడ పోయి పాతిపెట్టువారిని నియమించెదరు. ఏడు నెలలైన తరువాత దేశమునందు తనికీ చేసెదరు.౹

15 దేశమును సంచరించి చూచువారు తిరుగు లాడుచుండగా మనుష్యశల్యమొకటియైనను కనబడినయెడల పాతిపెట్టువారు హమోన్గోగు లోయలో దానిని పాతిపెట్టువరకు అక్కడ వారేదైన ఒక ఆనవాలు పెట్టుదురు.౹

16 మరియు హమోనా అను పేరుగల ఒక పట్టణ ముండును. ఈలాగునవారు దేశమును పవిత్రపరచుదురు.

17 నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా–సకలజాతుల పక్షులకును భూమృగముల కన్ని టికిని యీ సమాచారము తెలియజేయుము–నేను మీ కొరకు వధించు బలికి నలుదిక్కులనుండి కూడి రండి; ఇశ్రాయేలీయుల పర్వతములమీద నొక గొప్ప బలి జరుగును, మీరు మాంసము తిందురు రక్తము త్రాగుదురు;౹

18 బలాఢ్యుల మాంసము తిందురు, భూపతుల రక్తమును, బాషానులో క్రొవ్విన పొట్లేళ్లయొక్కయు గొఱ్ఱెపిల్లలయొక్కయు మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తము త్రాగుదురు.౹

19 నేను మీ కొరకు బలి వధింప బోవుచున్నాను, మీరు కడుపార క్రొవ్వు తిందురు, మత్తు కలుగునంతగా రక్తము త్రాగుదురు.౹

20 నే నేర్పరచిన పంక్తిని కూర్చుండి గుఱ్ఱములను రౌతులను బలాఢ్యులను ఆయుధస్థులను మీరు కడుపార భక్షింతురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹

21 నా ఘనతను అన్యజనులలో అగుపరచెదను, నేను చేసిన తీర్పును వారిమీద నేను వేసిన నా హస్తమును అన్యజనులందరు చూచెదరు.౹

22 ఆ దినము మొదలుకొని నేనే తమ దేవుడైన యెహో వానైయున్నానని ఇశ్రాయేలీయులు తెలిసికొందురు.౹

23 మరియు ఇశ్రాయేలీయులు తమ దోషమునుబట్టి చెరలోనికి పోయిరనియు వారు విశ్వాసఘాతుకులైనందున నేను వారికి పరాఙ్ముఖుడనై వారు ఖడ్గముచేత కూలు నట్లుగా వారిని బాధించువారికి అప్పగించితిననియు అన్యజనులు తెలిసికొందురు.౹

24 వారి యపవిత్రతనుబట్టియు అతిక్రమ క్రియలనుబట్టియు నేను వారికి పరాఙ్ముఖుడనై వారికి ప్రతికారము చేసితిని.

25 కాబట్టి ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా –నా పరిశుద్ధ నామమునుబట్టి రోషముకలిగినవాడనై యాకోబు సంతతివారిని చెరలోనుండి రప్పించెదను, ఇశ్రాయేలీయులందరియెడల జాలిపడెదను.౹

26 వారు నాయెడల తాము చూపిన విశ్వాసఘాతకమును తమ అవమానమును తాము భరించుదురు. నేను అన్యజనులందరిలోనుండి వారిని సమకూర్చి వారి శత్రువుల దేశములోనుండి రప్పించిన తరువాత వారు సురక్షితముగాను నిర్భయముగాను తమ దేశములో నివసించునప్పుడు

27 వారియందు అన్యజనులనేకముల యెదుట నన్ను పరిశుద్ధపరచుకొందును.౹

28 అన్యజనులలోనికి వారిని చెరగా పంపి, వారిలో ఎవరిని ఇకను అచ్చట ఉండనియ్యక తమ దేశమునకు వారిని సమ కూర్చిన సంగతినిబట్టి నేను తమ దేవుడైన యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.౹

29 అప్పుడు ఇశ్రాయేలీయులమీద నేను నా ఆత్మను కుమ్మరించెదను గనుక నేనికను వారికి పరాఙ్ముఖుడనై యుండను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZK/39-38d6d16c8ff66e9688e177a5542f3340.mp3?version_id=1787—

Categories
యెహెజ్కేలు

యెహెజ్కేలు 40

1 మనము చెరలోనికి వచ్చిన యిరువదియైదవ సంవత్సరము మొదటి నెల పదియవ దినమున, అనగా పట్టణము కొల్లపోయిన పదునాలుగవ సంవత్సరమున ఆ దినముననే యెహోవా హస్తము నా మీదికి రాగా ఆయన నన్ను పట్టణమునకు తోడుకొని పోయెను.౹

2 దేవుని దర్శనవశుడనైన నన్ను ఇశ్రాయేలీయుల దేశములోనికి తోడుకొని వచ్చి, మిగుల ఉన్నతమైన పర్వతముమీద ఉంచెను. దానిపైన దక్షిణపుతట్టున పట్టణమువంటి దొకటి నాకగు పడెను.౹

3 అక్కడికి ఆయన నన్ను తోడుకొని రాగా ఒక మనుష్యుడుండెను. ఆయన మెరయుచున్న యిత్తడి వలె కనబడెను, దారమును కొలకఱ్ఱయు చేతపట్టుకొని ద్వారములో ఆయన నిలువబడియుండెను.౹

4 ఆ మనుష్యుడు నాతో ఇట్లనెను–నరపుత్రుడా, నేను నీకు చూపుచున్న వాటినన్నిటిని కన్నులార చూచి చెవులార విని మనస్సులో ఉంచుకొనుము; నేను వాటిని నీకు చూపుటకై నీవిచ్చటికి తేబడితివి, నీకు కనబడు వాటినన్నిటిని ఇశ్రాయేలీయులకు తెలియజేయుము.

5 నేను చూడగా నలుదిశలమందిరముచుట్టు ప్రాకార ముండెను, మరియు ఆ మనుష్యునిచేతిలో ఆరు మూరల కొలకఱ్ఱయుండెను, ప్రతిమూర మూరెడు బెత్తెడు నిడివి గలది, ఆయన ఆ కట్టడమును కొలువగా దాని వెడల్పును దాని యెత్తును బారన్నర తేలెను.౹

6 అతడు తూర్పుతట్టున నున్న గుమ్మమునకు వచ్చి దాని సోపానములమీది కెక్కి గుమ్మపు గడపను కొలువగా దాని వెడల్పు, అనగా మొదటి గడప వెడల్పు బారన్నర తేలెను.౹

7 మరియు కావలిగది నిడివియు వెడల్పును బారన్నర, కావలి గదులకు మధ్య అయిదేసి మూరల యెడముండెను. గుమ్మముయొక్క ద్వారపు ప్రక్కకును మందిరమునకు బారన్నర యెడము.౹

8 గుమ్మపు ద్వారమునకును మందిరమునకును మధ్య కొలువగా బారన్నర తేలెను.౹

9 గుమ్మపు ద్వారము కొలువగా అది యెనిమిది మూరలై యుండెను, దానిస్తంభములు రెండేసి మూరలు; అవి గుమ్మపు ద్వారము మందిరపు దిక్కుగా చూచుచుండెను.౹

10 తూర్పు గుమ్మపు ద్వారముయొక్క కావలి గదులు ఇటు మూడును, అటు మూడును ఉండెను, మూడు గదులకు కొలత యొకటే. మరియు రెండు ప్రక్కలనున్న స్తంభములకు కొలత యొకటే.౹

11 ఆయా గుమ్మముల వాకిండ్లు కొలువగా వాటి వెడల్పు పది మూరలును నిడివి పదుమూడు మూరలును తేలెను.౹

12 కావలి గదులముందర మూరెడు ఎత్తుగల గోడ ఇరుప్రక్కల నుండెను, ఆ ప్రక్కను ఈ ప్రక్కను మూరెడు ఎత్తుగల గోడ యుండెను; గదులైతే ఇరుప్రక్కలను ఆరుమూరల ఎత్తుగలవి.౹

13 ఒకగది కప్పునుండి రెండవదాని కప్పువరకు గుమ్మమును కొలువగా ఇరువదియయిదు మూరల వెడల్పు తేలెను, రెండు వాకిండ్లమధ్య గోడను అదే కొలత.౹

14 అరువదేసి మూరలు ఎడముగా ఒక్కొక్క స్తంభము నిలువబెట్టబడెను. గుమ్మము చుట్టునున్న ఆవరణము స్తంభములవరకు వ్యాపించెను.౹

15 బయటి గుమ్మమునొద్దనుండి లోపటి గుమ్మపుద్వారమువరకు ఏబదిమూరలు.౹

16 కావలి గదులకును గుమ్మములకు లోపల వాటికి మధ్యగా చుట్టు నున్న గోడలకును ప్రక్కగదులకును కమ్ములు పెట్టబడిన కిటికీలుండెను, గోడలోని స్తంభములకును కిటికీలుండెను; ప్రతి స్తంభముమీదను ఖర్జూరపు చెట్లు రూపింపబడి యుండెను.

17 అతడు బయటి ఆవరణములోనికి నన్ను తీసికొనిరాగా అచ్చట గదులును చప్టాయు కనబడెను. చప్టామీద ముప్పది చిన్నగదులు ఏర్పడియుండెను.౹

18 ఈ చప్టా గుమ్మములవరకుండి వాటి వెడల్పున సాగియుండెను. అది క్రింది చప్టా ఆయెను.౹

19 క్రింది గుమ్మము మొదలుకొని లోపలి ఆవరణమువరకు ఆయన వెడల్పు కొలువగా ఇది తూర్పునను ఉత్తరమునను నూరు మూరలాయెను.౹

20 మరియు ఉత్తరపువైపున బయటి ఆవరణము చూచుచుండు గుమ్మపు నిడివిని వెడల్పును

21 దాని ఇరుప్రక్కలనున్న మూడేసి కావలి గదులను వాటి స్తంభములను వాటి మధ్యగోడలను అతడు కొలువగా వాటి కొలత మొదటి గుమ్మపు కొలత ప్రకారముగా కనబడెను, అనగా నిడివి ఏబదిమూరలు వెడల్పు ఇరువదియైదుమూరలు కనబడెను.౹

22 వాటి కిటికీలును వాటి మధ్యగోడలును ఖర్జూరపుచెట్లవలె రూపింప బడిన వాటి అలంకారమును తూర్పుద్వారముయొక్క కొలత ప్రకారముగా కనబడెను మరియు ఎక్కుటకై యేడు మెట్లుండెను, ఎదుటనుండి దాని మధ్యగోడలు కనబడుచుండెను.౹

23 ఉత్తరద్వారమున కెదురుగా ఒక టియు, తూర్పుద్వారమున కెదురుగా ఒకటియు, లోపటి ఆవరణమునకు పోవు రెండు గుమ్మములుండెను. ఈ గుమ్మమునకు ఆ గుమ్మమునకు ఎంతైనది అతడు కొలువగా నూరుమూరల యెడము కనబడెను.౹

24 అతడు నన్ను దక్షి ణపుతట్టునకు తోడుకొని పోగా దక్షిణపుతట్టున గుమ్మ మొకటి కనబడెను. దాని స్తంభములను మధ్యగోడలను కొలువగా అదే కొలత కనబడెను.౹

25 మరియు వాటి కున్నట్టుగా దీనికిని దీని మధ్యగోడలకును చుట్టు కిటికీ లుండెను, దాని నిడివి ఏబది మూరలు దాని వెడల్పు ఇరవదియైదు మూరలు.౹

26 ఎక్కుటకు ఏడు మెట్లును ఎదురుగా కనబడు మధ్యగోడలును ఉండెను. మరియు దాని స్తంభముల ఇరుప్రక్కలను ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారముండెను

27 లోపటి ఆవరణమునకు దక్షిణపుతట్టున గుమ్మమొకటి యుండెను, దక్షిణపుతట్టును గుమ్మమునుండి గుమ్మమువరకు ఆయన కొలువగా నూరు మూరలాయెను.

28 అతడు దక్షిణమార్గమున లోపటి ఆవరణములోనికి నన్ను తోడుకొనిపోయి దక్షిణపు గుమ్మమును కొలిచెను; దాని కొలత అదే.౹

29 మరియు దాని కావలిగదులును స్తంభములును మధ్య గోడలును పైచెప్పిన కొలతకు సరిపడెను; దానికిని దాని చుట్టు ఉన్న మధ్యగోడలకును కిటికీ లుండెను, దాని నిడివి ఏబది మూరలు దాని వెడల్పు ఇరువదియైదు మూరలు

30 చుట్టు మధ్యగోడల నిడివి ఇరువది యైదు మూరలు, వెడల్పు అయిదు మూరలు.౹

31 దాని మధ్య గోడలు బయటి ఆవరణముతట్టు చూచుచుండెను; దాని స్తంభములమీద ఖర్జూరపుచెట్లను పోలిన అలంకారముండెను; ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను.౹

32 తూర్పుతట్టు లోపటి ఆవరణములోనికి నన్ను తోడుకొనిపోయి దాని గుమ్మమును ఆయన కొలువగా పైచెప్పిన కొలత తేలెను.౹

33 దాని కావలిగదులకును స్తంభములకును మధ్యగోడలకును కొలత అదే; దానికిని దాని చుట్టునున్న మధ్యగోడలకును కిటికీలుండెను; నిడివి యేబది మూరలు, వెడల్పు ఇరువది యైదు మూరలు.౹

34 దాని మధ్యగోడలు బయటి ఆవరణముతట్టు చూచుచుండెను. ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని స్తంభములమీద ఖర్జూరపుచెట్లను పోలిన అలంకార ముండెను, ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను.౹

35 ఉత్తరపు గుమ్మమునకు అతడు నన్ను తోడుకొనిపోయి దాని కొలు వగా అదే కొలత యాయెను.౹

36 దాని కావలిగదులకును స్తంభములకును దాని మధ్యగోడలకును అదే కొలత; దానికిని దాని చుట్టునున్న మధ్యగోడలకును కిటికీలుండెను; దాని నిడివి యేబది మూరలు దాని వెడల్పు ఇరువదియైదు మూరలు.౹

37 దాని స్తంభములు బయటి ఆవరణముతట్టు చూచుచుండెను; ఆ స్తంభములమీద ఈ ప్రక్కను ఆ ప్రక్కను ఖర్జూరపు చెట్లనుపోలిన అలంకారముండెను; ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను.

38 గుమ్మముల స్తంభములయొద్ద వాకిలిగల గదియుండెను; అక్కడ దహనబలి పశువుల మాంసము కడుగుదురు.౹

39 మరియు గుమ్మపు మంటపములో ఇరుప్రక్కల రెండేసి బల్లలుంచబడెను; వీటిమీద దహనబలి పశువులును పాప పరిహారార్థబలిపశువులును అపరాధపరిహారార్థబలిపశువులును వధింపబడును.౹

40 గుమ్మముయొక్క వాకిలిదగ్గర ఉత్తరపుదిక్కున మెట్లు ఎక్కుచోటున ఇరుప్రక్కల రెండేసి బల్లలుండెను. అనగా గుమ్మపు రెండుప్రక్కల నాలుగేసి బల్లలుండెను. ఇవి పశువులను వధించుటకై ఉంచబడి యుండెను.౹

41-42 దహనబలి పశువులు మొదలగు బలిపశువులను వధించుటకై వినియోగించు ఉపకరణము లుంచదగిన యెనిమిది బల్లలు ఈతట్టు నాలుగు ఆతట్టు నాలుగు మెట్లదగ్గర నుండెను. అవి మూరెడున్నర నిడి వియు మూరెడున్నర వెడల్పును మూరెడు ఎత్తును గలిగి మలిచిన రాతితో చేయబడి యుండెను.౹

43 చుట్టుగోడకు అడుగడుగు పొడుగుగల మేకులు నాటబడియుండెను; అర్పణ సంబంధమైన మాంసము బల్లలమీద ఉంచుదురు.౹

44 లోపటి గుమ్మము బయట లోపటి ఆవరణములో ఉత్తరపు గుమ్మముదగ్గరనుండి దక్షిణముగా చూచు నొకటియు, తూర్పు గుమ్మము దగ్గరనుండి ఉత్తరముగా చూచు నొక టియు రెండు గదులుండెను.౹

45 అప్పుడతడు నాతో ఇట్లనెను–దక్షిణపుతట్టు చూచు గది మందిరమునకు కావలి వారగు యాజకులది.౹

46 ఉత్తరపుతట్టు చూచు గది బలిపీఠమునకు కావలివారగు యాజకులది. వీరు లేవీయులలో సాదోకు సంతతివారై సేవచేయుటకై యెహోవా సన్ని ధికి వచ్చువారు.౹

47 అతడు ఆ ఆవరణమును కొలువగా నిడివియు వెడల్పును నూరుమూరలై చచ్చౌకముగా ఉండెను. మందిరమునకు ఎదురుగా బలిపీఠముంచబడెను.

48 అతడు మందిరముయొక్క మంటపములోనికి నన్ను తోడుకొని వచ్చి మంటప స్తంభములను ఒక్కొక్కదాని కొలువగా అది ఇరుప్రక్కల అయిదేసి మూరలుండెను, గుమ్మము ఇరుప్రక్కల మూడేసి మూరల వెడల్పు.౹

49 మంటపమునకు నిడివి యిరువది మూరలు; ఎక్కుటకై యుంచబడిన మెట్లదగ్గర దాని వెడల్పు పదకొండు మూరలు, స్తంభములదగ్గర ఇరు ప్రక్కల ఒక్కొక్కటిగా కంబములుంచబడెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZK/40-2835b30dc8bcfbbdcf74c94abb0d9773.mp3?version_id=1787—

Categories
యెహెజ్కేలు

యెహెజ్కేలు 41

1 తరువాత అతడు నన్ను ఆలయమునకు తోడుకొని. వచ్చి దాని స్తంభములను కొలిచెను. ఇరుప్రక్కల అవి ఆరు మూరలాయెను, ఇది గుడారపు వెడల్పు.౹

2 వాకిలి వెడల్పు పది మూరలు, తలుపు ఇరుప్రక్కల అయిదేసి మూరలు, దాని నిడివిని కొలువగా నలుబది మూరలు, దాని వెడల్పు ఇరువది మూరలు.౹

3 అతడు లోపలికి పోయి వాకిలి స్తంభమును కొలువగా రెండు మూరలాయెను, వాకిలి ఆరుమూరలు; వెడల్పు ఏడు మూరలు.౹

4 –ఇది అతి పరిశుద్ధస్థలమని చెప్పి దాని నిడివిని కొలువగా ఇరువది మూరలును ఆలయమునకును దానికిని మధ్య వెడల్పు ఇరువది మూరలునాయెను.౹

5 తరువాత అతడు మందిరపు గోడను కొలువగా ఆరు మూరలాయెను, మందిరపు ప్రక్కలనున్న మేడ గదులను కొలువగా నాలుగేసి మూరలాయెను.౹

6 ఈ మేడగదులు మూడేసి అంతస్థులు గలవి. ఈలాగున ముప్పది గదులుండెను, ఇవి మేడ గదులచోటున మందిరమునకు చుట్టు కట్టబడిన గోడతో కలిసియుండెను; ఇవి మందిరపుగోడను ఆనుకొనియున్న ట్టుండి ఆనుకొనక యుండెను.౹

7 ఆ గోడ మేడగదులకు ఎక్కిన కొలది అవి మరి వెడల్పుగా పెరిగెను, పైకెక్కిన కొలది మందిరముచుట్టునున్న యీ మేడగదుల అంతస్థులు మరి వెడల్పగుచుండెను గనుక మందిరపు పైభాగము మరి వెడల్పుగా ఉండెను; పైకెక్కిన కొలది అంతస్థులు మరి వెడల్పుగా ఉండెను.౹

8 మరియు నేను చూడగా మందిరము చుట్టునున్న నేలకట్టు ఎత్తుగా కనబడెను, ఏలయనగా ఆ మేడగదులకు ఆరు పెద్దమూరలుగల పునాది యుండెను.౹

9 మేడగదులకు బయటనున్న గోడ అయిదు మూరల వెడల్పు; మరియు మందిరపు మేడగదుల ప్రక్కలనున్న స్థలము ఖాలీగా విడువబడి యుండెను

10 గదులమధ్య మందరిముచుట్టు నలుదిశల ఇరువది మూరల వెడల్పున చోటు విడువబడి యుండెను

11 మేడగదుల వాకిండ్లు ఖాలీగానున్న స్థలముతట్టు ఉండెను; ఒక వాకిలి ఉత్తరపుతట్టునను ఇంకొక వాకిలి దక్షిణపుతట్టునను ఉండెను. ఖాలీగా నున్న స్థలముచుట్టు అయిదు మూరల వెడల్పుండెను.౹

12 ప్రత్యేకింపబడిన చోటుకెదురుగానున్న కట్టడము పడమటితట్టు డెబ్బది మూరల వెడల్పు, దాని గోడ అయిదు మూరల వెడల్పు; గోడ నిడివి తొంబది మూరలు.౹

13 మందిరముయొక్క నిడివిని అతడు కొలు వగా నూరు మూరలాయెను, ప్రత్యేకింపబడిన స్థలమును దాని కెదురుగానున్న కట్టడమును దానిగోడలను కొలువగా నూరు మూరలాయెను.౹

14 మరియు తూర్పుతట్టు మందిరపు నిడివిని ప్రత్యేకింపబడిన స్థలమును కొలువగా నూరు మూరలాయెను.౹

15 ఈలాగున మందిరపు వెనుకటి భాగమున ప్రత్యేకింపబడిన స్థలమున కెదురుగా నున్న కట్టడమును దాని ఇరుప్రక్కలనున్న వసారాలను కొలువగా నూరు మూరలాయెను.౹

16 మరియు గర్భాలయమును ఆవరణపు మంటపములను గడపలను కమ్ములుగల కిటికీలను ఎదుటి మూడు అంతస్థుల చుట్టునున్న వసారాలను ఆయన కొలిచెను. కిటికీలు మరుగుచేయబడెను, గడపలకెదురుగా నేలనుండి కిటికీలవరకు బల్లకూర్పుండెను

17 వాకిండ్లకు పైగా మందిరమునకు బయటను లోపలను ఉన్న గోడ అంతయు లోగోడయు వెలిగోడయు చుట్టుగోడయు కొలతప్రకారము కట్టబడియుండెను.౹

18 కెరూబులును ఖర్జూరపు చెట్లును ఉండెను; దానికి రెండేసి కెరూబుల సందున ఖర్జూరపుచెట్టు ఒకటియుండెను; ఒక్కొక్క కెరూబునకు రెండేసి ముఖము లుండెను.౹

19 ఎట్లనగా ఈతట్టు ఖర్జూరపు చెట్టువైపున మనుష్యముఖమును ఆతట్టు ఖర్జూరపుచెట్టువైపున సింహముఖమును కనబడెను; ఈ ప్రకారము మందిరమంతటిచుట్టు నుండెను.౹

20 నేల మొదలుకొని వాకిలిపైవరకు మందిరపు గోడకు కెరూబులును ఖర్జూరపు చెట్లును ఉండెను.౹

21 మందిరపు ద్వారబంధములు చచ్చౌకములు, పరిశుద్ధస్థలపు ద్వారబంధములును అట్టివే.౹

22 బలిపీఠము కఱ్ఱతో చేయబడెను, దాని యెత్తు మూడు మూరలు, నిడివి రెండు మూరలు, దాని పీఠమును మూలలును ప్రక్కలును మ్రానితో చేయబడినవి; ఇది యెహోవా సముఖమందుండు బల్ల అని అతడు నాతో చెప్పెను.౹

23 మందిరమునకును పరిశుద్ధ స్థలమునకును రెండు వాకిండ్లుండెను.౹

24 ఒక్కొక వాకిలి రెండేసి మడత రెక్కలు గలది.౹

25 మరియు గోడలమీద ఉన్నట్లుగా మందిరపు వాకిండ్లమీదను కెరూబులును ఖర్జూరపుచెట్లును చెక్కబడి యుండెను, బయటి మంటపమునకు విచిత్రముగా చేసిన ఉబుకువాటుపని కనబడెను.౹

26 మరియు మంటపమునకును ఇరుప్రక్కల గోడలకును మందిరపు మేడగదులకును ఒరపాకులకును ఇరుప్రక్కల కమ్ములు వేసిన కిటికీలును ఖర్జూరపు చెట్లనుపోలిన అలంకారమును ఉండెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZK/41-0ac1140f5549d41fbfcac4ac0a4d6bac.mp3?version_id=1787—

Categories
యెహెజ్కేలు

యెహెజ్కేలు 42

1 అతడు ఉత్తరమార్గముగా నన్ను నడిపించి బయటి ఆవరణములోనికి తోడుకొని వచ్చి ఖాలీచోటునకును ఉత్తరముననున్న కట్టడమునకును ఎదురుగానున్న గదుల దగ్గర నిలిపెను.౹

2 ఆ కట్టడము నూరు మూరల నిడివిగలదై ఉత్తరదిక్కున వాకిలికలిగి యేబది మూరల వెడల్పుగలది.౹

3 ఇరువది మూరలుగల లోపటి ఆవరణమున కెదురుగాను బయటి ఆవరణపు చప్టా కెదురుగాను మూడవ అంతస్థు లోని వసారాలు ఒకదానికొకటి యెదురుగా ఉండెను.౹

4 గదులకెదురుగా పదిమూరల వెడల్పుగల విహారస్థలముండెను, లోపటి ఆవరణమునకు పోవుచు ఉత్తరదిక్కు చూచు వాకిండ్లు గల విహారస్థలమొకటి యుండెను, అది మూరెడు వెడల్పు.౹

5 వాకిండ్లకు వసారాలుండుటవలన పై గదులు ఎత్తు తక్కువగాను మధ్యగదులు ఇరుకుగానుండి కురచవాయెను.౹

6 మూడవ అంతస్థులో ఉండినవి ఆవరణములకున్న వాటివంటి స్తంభములు వాటికి లేవు గనుక అవి క్రిందిగదులకంటెను మధ్యగదులకంటెను చిన్నవిగా కట్టబడియుండెను.౹

7 మరియు గదుల వరుసనుబట్టి బయటి ఆవరణముతట్టు గదులకెదురుగా ఏబది మూరల నిడివిగల యొక గోడ కట్టబడియుండెను.౹

8 బయటి ఆవరణములోనున్న గదుల నిడివి యేబది మూరలుగాని మందిరపు ముందటి ఆవరణము నూరుమూరల నిడివిగలదై యుండెను.౹

9 ఈ గదులు గోడక్రిందనుండి లేచినట్టుగా కనబడెను, బయటి ఆవరణములోనుండి వాటిలో ప్రవేశించుటకు తూర్పు దిక్కున మార్గముండెను.౹

10 విడిచోటునకు ఎదురుగాను కట్టడమున కెదురుగాను ఆవరణపుగోడ మందములో తూర్పుతట్టుకొన్ని గదులుండెను.౹

11 మరియు వాటి యెదుటనున్న మార్గము ఉత్తరపుతట్టునున్న గదుల మార్గము వలె నుండెను, వాటి నిడివిచొప్పునను వెడల్పు చొప్పు నను ఇవియు కట్టబడెను; వీటి ద్వారములును ఆ రీతినే కట్టబడియుండెను.౹

12 మరియు మార్గపు మొగను దక్షిణపుతట్టు గదులయొక్క తలుపులవలె వీటికి తలుపులుండెను, ఆ మార్గము ఆవరణములోనికి పోవు నొకనికి తూర్పుగా నున్న గోడ యెదుటనే యుండెను.౹

13 అప్పుడాయన నాతో ఇట్లనెను – విడిచోటునకు ఎదురుగానున్న ఉత్తరపు గదులును దక్షిణపుగదులును ప్రతిష్ఠితములైనవి, వాటి లోనే యెహోవా సన్నిధికి వచ్చు యాజకులు అతిపరిశుద్ధ వస్తువులను భుజించెదరు, అక్కడ వారు అతిపరిశుద్ధ వస్తువులను, అనగా నైవేద్యమును పాపపరిహారార్థబలిపశు మాంసమును అపరాధపరిహారార్థబలిపశుమాంసమును ఉంచెదరు, ఆ స్థలము అతిపరిశుద్ధము.౹

14 యాజకులు లోపల ప్రవేశించునప్పుడు పరిశుద్ధ స్థలమును విడిచి బయటి ఆవరణములోనికి పోక అక్కడనే తాము పరిచర్యచేయు వస్త్రములను ఉంచవలెను; అవి ప్రతిష్ఠితములైనవి గనుక జనుల సంబంధమైన దేనినైనను వారు ముట్టునప్పుడు వారు వేరుబట్టలు ధరించుకొనవలెను.

15 అతడు లోపటి మందిరమును కొలుచుట ముగించి నన్ను బయటికి తోడుకొని తూర్పుతట్టు చూచు గుమ్మమునకు వచ్చి చుట్టును కొలిచెను.౹

16 తూర్పుదిశను చుట్టును కొలకఱ్ఱతో కొలువగా ఐదువందల బారలాయెను.౹

17 ఉత్తర దిశను చుట్టును కొలకఱ్ఱతో కొలువగా ఐదువందల బారలును

18 దక్షిణదిశను కొలకఱ్ఱతో కొలువగా ఐదువందల బారలును,౹

19 పశ్చిమదిశను తిరిగి కొలకఱ్ఱతో కొలువగా ఐదువందల బారలును తేలెను.౹

20 నాలుగుతట్లు అతడు కొలిచెను; ప్రతిష్ఠితమైన స్థలమును ప్రతిష్ఠితము కాని స్థలమునుండి ప్రత్యేకపరుచుటకై దానిచుట్టు నలుదిశల ఐదువందల బారలుగల చచ్చౌకపు గోడ కట్టబడి యుండెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZK/42-372252c8f7a09d972a878272129f8868.mp3?version_id=1787—

Categories
యెహెజ్కేలు

యెహెజ్కేలు 43

1 తరువాత అతడు తూర్పుతట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకొని రాగా

2 ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావము తూర్పుదిక్కున కనబడెను; దానినుండి పుట్టిన ధ్వని విస్తారజలముల ధ్వనివలె వినబడెను, ఆయన ప్రకాశముచేత భూమి ప్రజ్వరిల్లెను.౹

3 నాకు కనబడు దర్శనము, పట్టణమును నాశముచేయుటకై నేను రాగా నాకు కనబడిన దర్శనమువలె నుండెను. మరియు కెబారు నది దగ్గర నాకు కనబడిన దర్శనము వంటి దర్శనములు నాకు కనబడగా నేను సాగిలబడితిని.౹

4 తూర్పుతట్టు చూచు గుమ్మపుమార్గమున యెహోవా తేజోమహిమ మందిరములోనికి ప్రవేశించెను.౹

5 ఆత్మ నన్నుఎత్తి లోపటి ఆవరణములోనికి తీసికొని రాగా యెహోవా తేజోమహిమతో మందిరము నిండియుండెను.౹

6 మందిరములోనుండి యొకడు నాతో మాటలాడినట్టు నాకు శబ్దము వినబడెను. అప్పుడు నాయొద్ద నిలిచినవాడు నాతో ఇట్లనెను.౹

7 –నర పుత్రుడా, యిది నా గద్దె స్థలము, నా పాదపీఠము; ఇక్కడ నేను ఇశ్రాయేలీయులమధ్య నిత్యమును నివసించెదను, వారు ఇకను జారత్వముచేసి తమ రాజుల కళేబరములకు ఉన్నతస్థలములను కట్టి, తామైనను తమ రాజులైనను నా పరిశుద్ధనామమును అపవిత్రపరచకయుందురు, నాకును వారికిని మధ్య గోడ మాత్రముంచి

8 నా గడపదగ్గర వారి స్థలముల గడపలను, నా ద్వారబంధములదగ్గర వారి ద్వార బంధములను కట్టి, తాముచేసిన హేయక్రియలచేత నా పరిశుద్ధనామమునకు దూషణ కలుగుటకై వారు హేతువులైరి గనుక నేను కోపావేశుడనై వారిని నాశనము చేసితిని.౹

9 వారు జారత్వము మాని, తమ రాజుల కళేబరములను నాయొద్దనుండి దూరమునకు కొనిపోయినయెడల వారిమధ్యను నేనెల్లప్పుడును నివసింతును.

10 కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తాము చేసిన దోషములనుబట్టి సిగ్గుపడునట్లు ఈ మందిరమును వారికి చూపించుము, వారు దాని వైఖరిని కనిపెట్టవలెను.౹

11 తాము చేసినవాటన్నిటినిబట్టి వారు సిగ్గుపడినయెడల, మందిరముయొక్క వైఖరిని దాని యేర్పాటును బహిర్గమ స్థానములను అంతర్గమస్థానములను దానినిగూర్చిన మర్యాద లన్నిటిని విధులన్నిటిని దాని ఆచారములను క్రమములను వారికి కనుపరచి, వారు ఆ ఆచారవిధులన్నిటిని గైకొని ఆచరించునట్లువారు చూచుచుండగా వాటిని వ్రాయించుము.౹

12 ఆ మందిరమునుగూర్చిన విధి యేదనగా పర్వతము మీద దానికి చేరికైన స్థలమంతయు అతిపరిశుద్ధము, మందిరమునుగూర్చిన విధి యిదియే.

13 మూరల కొలచొప్పున బలిపీఠముయొక్క కొలత ఎంతనగా మూరెడు, అనగా మూరెడు జేనెడు బలిపీఠమునకు పీఠమొకటి యుండవలెను. దాని డొలుపు మూరె డెత్తును మూరెడు వెడల్పును చుట్టు దాని చూరు జేనెడు విచిత్రమైన పనిగలదిగాను ఉండవలెను.౹

14 నేలమీద కట్టబడిన డొలుపు మొదలుకొని క్రింది చూరువరకును ఎత్తు రెండు మూరలు, వెడల్పు మూరెడు మరియు చిన్న చూరు మొదలుకొని పెద్ద చూరువరకు నాలుగు మూరలు, దాని వెడల్పు మూరెడు.౹

15 దేవుని కొండయను భాగము నాలుగు మూరలు దేవాగ్నిగుండమునుండి పైకి నాలుగు కొమ్ము లుండెను,౹

16 దేవాగ్నిగుండము పండ్రెండు మూరల కొలత గలదై చచ్చౌకముగా నుండెను.౹

17 మరియు చూరు నిడి వియు వెడల్పును నలుదిశల పదునాలుగు మూరలు, దాని చుట్టునున్న అంచు జేనెడు, దాని చుట్టంతయు మూరెడు, డొలుపు ఒకటి యుండెను, దానికున్న మెట్లు తూర్పుతట్టుండెను.

18 మరియు అతడు నాతో ఇట్లనెను–నరపుత్రుడా, ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–ఈ బలిపీఠము కట్టబడిన పిమ్మట దానిమీద రక్తము చల్లి, దహనబలులు అర్పించుటకై విధులనుబట్టి ఈలాగున జరిగింపవలెను.౹

19 ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–పరిచర్యచేయుటకై నా సన్నిధికివచ్చు సాదోకు సంతానపు లేవీయులగు యాజకులకు పాపపరిహారార్థబలి అర్పించుటకై కోడెను ఇయ్యవలెను.౹

20 వారు దాని తీసికొని పాపపరిహారార్థబలిగా నర్పించి, బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము చేయుటకై దాని రక్తములో కొంచెము తీసి దాని నాలుగు కొమ్ములమీదను చూరుయొక్క నాలుగు మూలలమీదను చుట్టునున్న అంచుమీదను చమరవలెను.౹

21 తరువాత పాపపరిహారార్థబలియగు ఎద్దును తీసి పరిశుద్ధ స్థలము అవతలమందిరమునకు చేరిన నిర్ణయస్థలములో దానిని దహనము చేయవలెను.౹

22 రెండవదినమున పాప పరిహారార్థబలిగా నిర్దోషమైన యొక మేకపిల్లను అర్పింపవలెను; కోడెచేత బలిపీఠమునకు పాపపరిహారము చేసినట్లు మేకపిల్లచేతను పాపపరిహారము చేయవలెను.౹

23 దాని నిమిత్తము పాపపరిహారము చేయుట చాలించిన తరువాత నిర్దోషమైన కోడెను నిర్దోషమైన పొట్టేలును అర్పింపవలెను.౹

24 యెహోవా సన్నిధికి వాటిని తేగా యాజకులు వాటి మీద ఉప్పుచల్లి దహనబలిగా యెహోవాకు అర్పింపవలెను.౹

25 ఏడు దినములు వరుసగా పాపపరిహారార్ధబలిగా ఒక మేకపిల్లను ఒక కోడెను నిర్దోషమైన ఒక పొట్టేలును వారు సిద్ధపరచవలెను.౹

26 ఏడు దినములు యాజకులు బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము చేయుచు దానిని పవిత్ర పరచుచు ప్రతిష్ఠించుచు నుండవలెను.౹

27 ఆ దినములు తీరిన తరువాత ఎనిమిదవ దినము మొదలుకొని యాజకులు బలిపీఠముమీద మీ దహనబలులను మీ సమాధానబలులను అర్పింపగా నేను మిమ్ము నంగీకరించెదను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZK/43-36d98e0f505e873d4acb7325e9381869.mp3?version_id=1787—

Categories
యెహెజ్కేలు

యెహెజ్కేలు 44

1 తూర్పుతట్టు చూచు పరిశుద్ధస్థలముయొక్క బయటి గుమ్మపు మార్గమునకు అతడు నన్ను తోడుకొని రాగా ఆ గుమ్మము మూయబడి యుండెను.౹

2 అంతట యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చెను–ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా ఈ గుమ్మముద్వారా ప్రవేశించెను గనుక ఏ మానవుడును దానిద్వారా ప్రవేశింపకుండునట్లు ఎన్నడును తీయబడకుండ అది మూయబడియే యుండును.౹

3 అధిపతి యగువాడు తన ఆధిపత్యమునుబట్టి యెహోవా సన్నిధిని ఆహారము భుజించునప్పుడు అతడచ్చట కూర్చుండును; అతడైతే మంటపమార్గముగా ప్రవేశించి మంటపమార్గముగా బయటికి పోవలెను.౹

4 అతడు ఉత్తరపు గుమ్మము మార్గముగా మందిరము ఎదుటికి నన్ను తోడుకొని వచ్చెను. అంతలో యెహోవా తేజోమిహమతో యెహోవా మందిరము నిండియుండుట చూచి నేను సాగిలపడగా

5 యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా–నరపుత్రుడా, యెహోవా మందిరమునుగూర్చిన కట్టడ లన్నిటిని విధులన్నిటిని నేను నీకు తెలియజేయుచున్నాను; నీవు మనస్సు నిలుపుకొని ఆ సంగతులన్నిటిని చూచి చెవినిబెట్టుము. మరియు పరిశుద్ధస్థలములోనుండి పోవు మార్గములన్నిటి ద్వారా మందిరములోపలికి వచ్చుటనుగూర్చి యోచించుము.౹

6 తిరుగుబాటుచేయు ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటింపుము–ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–ఇశ్రాయేలీయులారా, యిదివరకు మీరు చేసిన హేయక్రియలన్ని చాలును.౹

7 ఆహారమును క్రొవ్వును రక్తమును మీరు నా కర్పించునప్పుడు నా పరిశుద్ధస్థలములో ఉండి దాని నపవిత్రపరచునట్లు హృదయమందును, శరీరమందును సున్నతి లేని అన్యులను దానిలోనికి మీరు తోడుకొనిరాగా వారు మీ హేయ క్రియలన్నిటిని ఆధారముచేసికొని నా నిబంధనను భంగపరచిరి.౹

8 నేను మీకప్పగించిన నా పరిశుద్ధమైన వస్తువులను మీరు కాపాడక, వారు కాపాడవలెనని మీకు మారుగా అన్యులను ఉంచితిరి.౹

9 కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా – హృదయమందును, శరీరమందును సున్నతిలేని అన్యులై యుండి ఇశ్రాయేలీయులమధ్య నివసించువారిలో ఎవడును నా పరిశుద్ధస్థలములో ప్రవేశింపకూడదు.౹

10 మరియు ఇశ్రాయేలీయులు నన్ను విసర్జించి తమ విగ్రహములను అనుసరింపగా, వారితోకూడ నన్ను విసర్జించిన లేవీయులు తమ దోషమును భరించుదురు.౹

11 అయినను వారు నా పరిశుద్ధస్థలములో పరిచర్యచేయువారు, నా మందిరమునకు ద్వారపాలకులై మందిర పరిచర్య జరిగించువారు, ప్రజలకు బదులుగా వారే దహనబలి పశువులను బలి పశువులను వధించువారు, పరిచర్యచేయుటకై వారే జనుల సమక్షమున నియమింపబడినవారు.౹

12 విగ్రహముల ఎదుట జనులకు పరిచారకులై ఇశ్రాయేలీయులు తొట్రిల్లి పాపము చేయుటకు వారు కారకులైరి గనుక నేను వారికి విరోధి నైతిని; వారు తమ దోషమును భరించుదురు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.౹

13 తమ అవమానమును తాము చేసిన హేయక్రియలకు రావలసిన శిక్షను వారనుభవించుదురు; వారు యాజకత్వము జరిగించుటకై నా సన్నిధికి రాకూడదు, పరిశుద్ధ వస్తువులను గాని అతిపరిశుద్ధ వస్తువులను గాని ముట్టకూడదు.౹

14 అయితే నా మందిర సంబంధమైన పని అంతటిని దానిలో జరుగు పనులన్నిటిని విచారించుచు దానిని కాపాడు వారినిగా నేను వారిని నియమించుచున్నాను.

15 ఇశ్రాయేలీయులు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధస్థల సంరక్షణను కనిపెట్టు సాదోకు సంతతివారగు లేవీయులైన యాజకులు పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధిని నిలిచి, క్రొవ్వును రక్తమును నాకు అర్పించుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹

16 వారే నా పరిశుద్ధస్థలములో ప్రవేశింతురు, పరిచర్య చేయుటకై వారే నా బల్లయొద్దకు వత్తురు, వారే నేనప్పగించిన దానిని కాపాడుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹

17 వారు లోపటి ఆవరణపు గుమ్మములలోనికి వచ్చునప్పుడు జనుపనారబట్టలు ధరించుకొనవలెను. లోపటి ఆవరణపు గుమ్మములద్వారా వారు మందిరమున ప్రవేశించి పరిచర్యచేయునప్పుడెల్ల బొచ్చుచేత చేసిన బట్టలువారు ధరింపకూడదు.౹

18 అవిసెనార పాగాలు ధరించుకొని నడుములకు జనుపనారబట్ట కట్టుకొనవలెను, చెమట పుట్టించునదేదైనను వారు ధరింపకూడదు.౹

19 బయటి ఆవరణములోనికి జనులయొద్దకు వారు వెళ్లునప్పుడు తమ ప్రతిష్ఠిత వస్త్రములను తీయకపోవుటచేత జనులను ప్రతిష్ఠింపకుండునట్లు, తమ పరిచర్య సంబంధమైన వస్త్రములను తీసి ప్రతిష్ఠితములగు గదులలో వాటిని ఉంచి, వేరు బట్టలు ధరింపవలెను,౹

20 మరియు వారు తమ తలలు క్షౌరము చేయించుకొనకూడదు, తలవెండ్రుకలు పెరుగ నియ్యక కత్తెరతో మాత్రము వాటిని కత్తిరింపవలెను.౹

21 లోపటి ఆవరణములో చొచ్చునపుడు ఏ యాజకుడును ద్రాక్షారసము పానముచేయకూడదు.౹

22 వారు విధవ రాండ్రనైనను విడువబడినదానినైనను పెండ్లిచేసికొనకూడదుగాని ఇశ్రాయేలీయుల సంతతివారగు కన్యలనైనను, యాజకులకు భార్యలై విధవరాండ్రుగా నున్న వారినైనను చేసికొనవచ్చును.౹

23 ప్రతిష్ఠితమైనదేదో ప్రతిష్ఠితము కానిదేదో పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో కను గొనుటకు వారు నా జనులకు నేర్పునట్లు

24 జనులు వ్యాజ్యెమాడునప్పుడు నా విధులనుబట్టి వారికి తీర్పు తీర్చుటకై వారు తీర్పరులుగా నియమింపబడుదురు. నేను నియమించిన విధులనుబట్టియు కట్టడలనుబట్టియు నా నియామకకాలములను జరుపుదురు; నా విశ్రాంతిదినములను ఆచరించుదురు.౹

25 తండ్రిదియు తల్లిదియు కుమారునిదియు కుమార్తెదియు సహోదరునిదియు పెండ్లి కాని సహోదరిదియు శవమునుముట్టి అంటు పడవచ్చును, అయితే మరి ఏ మనుష్యశవమునుగాని ముట్టి అంటుపడకూడదు.౹

26 ఒకడు అంటుపడి శుచిర్భూతుడైన తరువాత ఏడు దినములు లెక్కించి

27 పరిశుద్ధస్థలములో పరిచర్య చేయుటకై లోపటి ఆవరణములోని పరిశుద్ధస్థలమునకు వచ్చినవాడు అతడు తనకొరకు పాపపరిహారార్థబలి అర్పింపవలెను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.౹

28 వారికి స్వాస్థ్యమేదనగా నేనే వారికి స్వాస్థ్యము, ఇశ్రాయేలీయులలో వారి కెంతమాత్రమును స్వాస్థ్యము ఇయ్యకూడదు, నేనే వారికి స్వాస్థ్యము.౹

29 నైవేద్యములును పాపపరిహారార్థబలిమాంసమును అపరాధ పరిహారార్థబలిమాంసమును వారికి ఆహారమవును, ఇశ్రాయేలీయుల చేత దేవునికి ప్రతిష్ఠితములగు వస్తువులన్నియు వారివి.౹

30 మీ ప్రతిష్ఠి తార్పణములన్నిటిలోను తొలిచూలు వాటన్నిటిలోను మొదటివియు, ప్రథమ ఫలములన్నిటిలోను మొదటివియు యాజకులవగును; మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకియ్యవలెను.౹

31 పక్షులలోను పశువులలోను తనకుతాను చచ్చినదానినిగాని చీల్చబడినదానిని గాని యాజకులు భుజింపకూడదు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZK/44-edf1ae1452b6021683b9c80e6f87a789.mp3?version_id=1787—

Categories
యెహెజ్కేలు

యెహెజ్కేలు 45

1 మీరు చీట్లువేసి దేశమును విభాగించునప్పుడు భూమిలో ఒక భాగమును ప్రతిష్ఠితార్పణముగా యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. దానికి ఇరువదియైదువేల కొల కఱ్ఱల నిడివియు పదివేల కొలకఱ్ఱల వెడల్పును ఉండవలెను, ఈ సరిహద్దులన్నిటిలోగానున్న భూమి ప్రతిష్ఠితమగును.౹

2 దానిలో పరిశుద్ధస్థలమునకు ఐదువందల కొల కఱ్ఱల చచ్చౌకము ఏర్పడవలెను; దానికి నలుదిశల ఏబది మూరల మైదానముండవలెను,౹

3 కొలువబడిన యీ స్థలము నుండి ఇరువదియైదువేల కొలకఱ్ఱల నిడివియు పదివేల కొలకఱ్ఱల వెడల్పునుగల యొకచోటు కొలిచివేయవలెను. అందులో మహా పరిశుద్ధస్థలముగా ఉన్న పరిశుద్ధస్థల ముండును.౹

4 యెహోవాకు పరిచర్యచేయుటకై ఆయన సన్నిధికి వచ్చి పరిచర్యచేయుచున్న యాజకులకు ఏర్పాటైన ఆ భూమి ప్రతిష్ఠిత స్థలముగా ఎంచబడును; అది వారి యిండ్లకు నివేశమై పరిశుద్ధస్థలమునకు ప్రతిష్ఠితముగా ఉండును. మందిరములో పరిచర్య చేయుచున్న లేవీయులు ఇండ్లు కట్టుకొని నివసించునట్లు

5 ఇరువదియైదు వేల కొలకఱ్ఱల నిడివియు పదివేల కొలకఱ్ఱల వెడల్పును గల యొక ప్రదేశమును వారికి స్వాస్థ్యముగా ఇరువది గదులను ఏర్పాటు చేయవలెను.౹

6 మరియు పట్టణమునకై అయిదువేల కొలకఱ్ఱల వెడల్పును ఇరువదియైదువేల కొల కఱ్ఱల నిడివియుగల యొక ప్రదేశము ఏర్పాటు చేయవలెను. అది ప్రతిష్ఠితమగు భాగమునకు సరిగా ఉండవలెను, ఇశ్రాయేలీయులకందరికి అది స్వాస్థ్యముగా ఉండును.౹

7 మరియు ప్రతిష్ఠిత భాగమునకును పట్టణము నకై యేర్పడిన ప్రదేశమునకును ఎదురుగా వాటికి పడ మటగాను తూర్పుగాను, ప్రతిష్ఠితభాగమునకును పట్టణము నకై యేర్పడిన దేశమునకును ఇరుప్రక్కల అధిపతికి భూమి నేర్పాటుచేయవలెను. పడమటినుండి తూర్పువరకు దాని కొలువగా అదియొక గోత్రస్థానమునకు సరిపడు నిడివిగలదై యుండవలెను. అధిపతి యిక నా జనులను బాధింపక వారి గోత్రములనుబట్టి భూమి అంతయు ఇశ్రాయేలీయులకు నియమించునట్లు

8 అది ఇశ్రాయేలీయులలో అతనికి భూస్వాస్థ్యముగా ఉండును.

9 మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు –ఇశ్రాయేలీయుల అధిపతులారా, మీరు జరిగించిన బలాత్కారమును దోచుకొనిన దోపును చాలును; ఆలాగు చేయుట మాని నా జనుల సొమ్మును అపహరింపక నీతి న్యాయముల ననుసరించి నడుచుకొనుడి; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹

10 ఖరా త్రాసులను ఖరా పడిని ఖరా తూమును ఒక్కటే పడియు ఒక్కటే తూమును మీరుంచుకొనవలెను.౹

11 తూము పందుములో పదియవ పాలు పట్టునదై యుండవలెను, పందుము మీకు పరిమాణముగా నుండవలెను.౹

12 తులమొకటింటికి ఇరువది చిన్నముల యెత్తును, అరవీసె యొకటింటికి ఇరువది తులముల యెత్తును, ఇరువదియైదు తులముల యెత్తును పదునైదు తులముల యెత్తును ఉండవలెను.౹

13 ప్రతిష్ఠితార్పణలు ఈ ప్రకారముగా చెల్లింపవలెను. నూట ఎనుబది పళ్ల గోధుమలలో మూడు పళ్లవంతునను నూట ఎనుబది పళ్ల యవలలో మూడు పళ్లవంతునను చెల్లింపవలెను.౹

14 తైలము చెల్లించునదెట్లనగా నూట ఎనుబది పళ్ల నూనెలో పడియు ముప్పాతికవంతున చెల్లింపవలెను. తూము నూట ఎనుబది పళ్లు పట్టునదగును.౹

15 మరియు ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై నైవేద్యమునకును దహనబలికిని సమాధాన బలికిని మంచి మేపుతగిలిన గొఱ్ఱెలలో మందకు రెండువందలలో ఒకదానిని తేవలెను.౹

16 ఇశ్రాయేలీయులలోని అధిపతికి చెల్లింపవలసిన యీ అర్పణము ఈ ప్రకారముగా తెచ్చుటకు దేశమునకు చేరిన జనులందరును బద్ధులైయుందురు.౹

17 పండుగలలోను, అమావాస్య దినములలోను, విశ్రాంతిదినములలోను, ఇశ్రాయేలీయులు కూడుకొను నియామకకాలములలోను వాడబడు దహనబలులను నైవేద్యములను పానార్పణములను సరిచూచుట అధిపతి భారము. అతడు ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై పాపపరిహారార్థబలిపశువులను నైవేద్యములను దహనబలులను సమాధాన బలిపశువులను సిద్ధపరచవలెను.

18 ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–మొదటి నెల మొదటి దినమున నిర్దోషమైన కోడెను తీసికొని పరిశుద్ధస్థలము నిమిత్తము పాపపరిహారార్థబలి నర్పింపవలెను.౹

19 ఎట్లనగా యాజకుడు పాపపరిహారార్థబలి పశు రక్తము కొంచెము తీసి, మందిరపు ద్వారబంధములమీదను బలిపీఠవు చూరు నాలుగు మూలలమీదను లోపటి ఆవరణపు వాకిటి ద్వారబంధములమీదను ప్రోక్షింపవలెను.౹

20 తెలియక తప్పిపోయిన వారిని విడిపించునట్లుగా మందిరమునకు ప్రాయశ్చిత్తము చేయుటకై నెలయేడవ దినమందు ఆలాగు చేయవలెను.౹

21 మొదటి నెల పదునాలుగవదినమున పస్కాపండుగ ఆచరింపవలెను; ఏడు దినములు దాని నాచరింపవలెను. అందులో పులియని ఆహారము తినవలెను.౹

22 ఆ దినమున అధిపతి తనకును దేశమునకు చేరిన జనులందరికిని పాపపరిహారార్థబలిగా ఒక యెద్దును అర్పింపవలెను.౹

23 మరియు ఏడు దినములు అతడు నిర్దోషమైన యేడుఎడ్లను ఏడు పొట్టేళ్లను తీసికొని, దినమొక టింటికి ఒక యెద్దును ఒక పొట్టేలును దహనబలిగా యెహోవాకు అర్పింపవలెను; మరియు అనుదినము ఒక్కొక్క మేకపిల్లను పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను.౹

24 మరియు ఎద్దొకటింటికిని పొట్టేలొకటింటికిని తూము పిండిపెట్టిన నైవేద్యము చేయవలెను. తూము ఒకటింటికి మూడు పళ్ల నూనె యుండవలెను.౹

25 మరియు ఏడవ నెల పదునైదవదినమున పండుగ జరుగుచుండగా యాజకుడు ఏడు దినములు పండుగ ఆచరించుచు పాప పరిహారార్థబలి విషయములోను దహనబలివిషయములోను నైవేద్య విషయములోను నూనె విషయములోను ఆప్రకారముగానే చేయవలెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZK/45-78c94c97726470bfdb02a787392030e8.mp3?version_id=1787—

Categories
యెహెజ్కేలు

యెహెజ్కేలు 46

1 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–తూర్పుతట్టు చూచు లోపటి ఆవరణపు గుమ్మము, పనిచేయు ఆరు దినములు మూయబడియుండి, విశ్రాంతిదినమునను అమావాస్య దినమునను తీయబడియుండవలెను.౹

2 అధిపతి బయట మంటపమునకు పోవుమార్గముగా ప్రవేశించి, గుమ్మపు ద్వారబంధముల దగ్గర నిలువబడగా, యాజకులు దహనబలిపశువులను సమాధానబలిపశువులను అతనికి సిద్ధపరచవలెను; అతడు గుమ్మముదగ్గర నిలువబడి ఆరాధనచేసిన తరువాత వెలుపలికి పోవును, అయితే సాయంకాలము కాకమునుపే గుమ్మము మూయకూడదు.౹

3 మరియు విశ్రాంతిదినములలోను అమావాస్యలలోను దేశజనులు ఆ తలుపుదగ్గర నిలువబడి యెహోవాకు ఆరాధన చేయవలెను.౹

4 విశ్రాంతిదినమున అధిపతి యెహోవాకు అర్పింప వలసిన దహనబలి యేదనగా, నిర్దోషమైన ఆరు గొఱ్ఱెపిల్లలును నిర్దోషమైన యొక పొట్టేలును.౹

5 పొట్టేలుతో తూమెడు పిండిగల నైవేద్యము చేయవలెను, గొఱ్ఱెపిల్లలతోకూడ శక్తికొలది నైవేద్యమును, తూము ఒకటింటికి మూడు పళ్ల నూనెయు తేవలెను.౹

6 అమావాస్యనాడు నిర్దోషమైన చిన్న కోడెను నిర్దోషమైన ఆరు గొఱ్ఱెపిల్లలను నిర్దోషమైన యొక పొట్టేలును అర్పింపవలెను.౹

7 నైవేద్యమును సిద్ధపరచవలెను, ఎద్దుతోను పొట్టేలుతోను తూమెడు పిండిని గొఱ్ఱెపిల్లలతో శక్తికొలది పిండిని అర్పింపవలెను, తూము ఒకటింటికి మూడు పళ్ల నూనె నైవేద్యము చేయవలెను.౹

8 అధిపతి ప్రవేశించునప్పుడు గుమ్మపు మంటపమార్గముగా ప్రవేశించి అతడు ఆ మార్గముగానే వెలుపలికి పోవలెను.౹

9 అయితే దేశజనులు నియామక కాలములయందు యెహోవా సన్నిధిని ఆరా ధన చేయుటకై వచ్చునప్పుడు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వచ్చినవారు దక్షిణపు గుమ్మపు మార్గముగా వెళ్లవలెను, దక్షిణపు గుమ్మపు మార్గముగా వచ్చినవారు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వెళ్లవలెను. తాము వచ్చిన దారినే యెవరును తిరిగిపోక అందరును తిన్నగా వెలుపలికి పోవలెను.౹

10 అధిపతి వారితో కలిసి ప్రవేశింపగా వారు ప్రవేశించుదురు, వారు బయలు వెళ్లునప్పుడు అందరును కూడి బయలువెళ్లవలెను.౹

11 పండుగదినములలోను నియామక కాలములలోను ఎద్దుతోగాని పొట్టేలుతో గాని తూమెడు పిండియు, గొఱ్ఱెపిల్లలతో శక్తికొలది పిండియు, తూము ఒకటింటికి మూడుపళ్ల నూనెయు నైవేద్యముగా అర్పింపవలెను.౹

12 యెహోవాకు స్వేచ్ఛార్పణమైన దహనబలినైనను స్వేచ్ఛార్పణమైన సమాధానబలినైనను అధిపతి యర్పించునప్పుడు తూర్పుతట్టు గుమ్మము తీయవలెను; విశ్రాంతిదినమున అర్పించునట్లు దహనబలిని సమాధానబలిని అర్పించి వెళ్లిపోవలెను; అతడు వెళ్లిపోయిన తరువాత గుమ్మము మూయబడవలెను.౹

13 మరియు ప్రతిదినము నిర్దోషమైన యేడాది మగ గొఱ్ఱెపిల్లను దహనబలిగా అర్పింపవలెను; అనుదినము ఉదయమున దానిని అర్పింపవలెను. మరియు అనుదినము ఉదయమున దానితో నైవేద్యము చేయవలెను.౹

14 అది ఎట్లనగా తూమెడు గోధుమ పిండిలో ఆరవ పాలును పిండి కలుపుటకు పడి నూనెయు నుండవలెను; ఇవి ఎవరును రద్దుపరచలేని నిత్యమైన కట్టడలు.౹

15 గొఱ్ఱెపిల్లలను నైవేద్యమును నూనెను అనుదినము ఉదయముననే నిత్యదహనబలిగా అర్పింపవలెను.

16 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–అధిపతి తన కుమారులలో ఎవనికైనను భూమి ఇచ్చినయెడల అది యతని కుమారునికి స్వాస్థ్యమైనందున అతని కుమారుల దగును. అది వారసత్వమువలన వచ్చిన దానివంటి స్వాస్థ్యము.౹

17 అయితే అతడు తన పనివారిలో ఎవని కైనను భూమి ఇచ్చినయెడల విడుదల సంవత్సరమువరకే అది వాని హక్కై తరువాత అధిపతికి మరల వచ్చును; అప్పుడు అతని కుమారులు అతని స్వాస్థ్యమునకు మాత్రము హక్కుదారులగుదురు.౹

18 జనులు తమ స్వాస్థ్యము ననుభ వింపకుండ అధిపతి వారి భూమిని ఆక్రమింపకూడదు; నా జనులు తమ భూములను విడిచి చెదరిపోకుండునట్లు అతడు తన భూమిలోనుండి తన కుమారులకు భాగముల నియ్యవలెను.

19 పిమ్మట అతడు గుమ్మపు మధ్యగోడమార్గముగా ఉత్తర దిశ చూచుచున్న యాజకులకు ఏర్పడిన ప్రతిష్ఠితమైన గదులలోనికి నన్ను తీసికొనిరాగా అచ్చట వెనుకతట్టు పశ్చిమదిక్కున స్థలమొకటి కనబడెను.౹

20 ప్రతిష్ఠితములగు వస్తువులను బయటి ఆవరణములోనికి కొనివచ్చి–యాజకులు జనులను ప్రతిష్ఠించుటకై వారు అపరాధపరిహారార్థబలిపశుమాంసమును పాపపరిహారార్థబలిపశుమాంసమును వండుచు నైవేద్యములను కాల్చుచుండు స్థలమిదియే యని నాతోచెప్పి

21 అతడు బయటి ఆవరణములోనికి నన్ను తీసికొనివచ్చి ఆవరణపు నాలుగు మూలలను నన్ను త్రిప్పగా, ఆవరణముయొక్క మూలమూలను మరియొక ఆవరణమున్నట్టు కనబడెను.౹

22 ఆవరణపు మూలమూలను ఆవరింపబడిన ఆవరణమొకటి కనబడెను. ఒక్కొక్కటి నలువది మూరల నిడివియు ముప్పది మూరల వెడల్పును గలిగి నాలుగును ఏకపరిమాణముగా ఉండెను.౹

23 మరియు ఆ నాలుగింటిలోను చుట్టు పంక్తిగానున్న అటకలుండెను, చుట్టునున్న అటకల క్రింద పొయిలుండెను.౹

24 –ఇది వంటచేయువారి స్థలము, ఇక్కడ మందిరపరిచారకులు జనులు తెచ్చు బలిపశుమాంసమును వండుదురని ఆయన నాతో చెప్పెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZK/46-93e5a52ea424a3c2cc35ef6ab71d427d.mp3?version_id=1787—

Categories
యెహెజ్కేలు

యెహెజ్కేలు 47

1 అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని . వచ్చెను; మందిరము తూర్పుముఖముగా ఉండెను, నేను చూడగా మందిరపు గడపక్రిందనుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడిప్రక్కను క్రిందనుండి పారు చుండెను,౹

2 పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపుమార్గముగా నన్ను నడిపించి చుట్టు త్రిప్పి తూర్పునకు పోవుదారిని బయటిగుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడిప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను.౹

3 ఆ మనుష్యుడు కొలనూలు చేతపట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్లి వెయ్యి మూరలు కొలిచి ఆ నీళ్లగుండ నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను.౹

4 ఆయన మరి వెయ్యి మూరలు కొలిచి నీళ్లగుండ నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ల లోతుండెను, ఇంక ఆయన వెయ్యిమూరలు కొలిచి నీళ్లగుండ నన్ను నడిపింపగా నీళ్లు మొల లోతుండెను.౹

5 ఆయన ఇంకను వెయ్యి మూరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాట లేనంత నది కనబడెను, దాట వీలులేకుండ ఈదవలసినంత నీరుగల నదియాయెను.౹

6 అప్పుడాయన నాతో ఇట్లనెను–నరపుత్రుడా, నీవు చూచితివిగదా అని చెప్పి నన్ను మరల నది యిద్దరికి తోడుకొనివచ్చెను.౹

7 నేను తిరిగిరాగా నదీతీరమున ఇరు ప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను.౹

8 అప్పుడాయన నాతో ఇట్లనెను–ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును, అప్పుడు సముద్రపునీళ్లు మంచినీళ్లు అగును.౹

9 వడిగా పారు ఈ నది వచ్చుచోట్లనెల్ల జలచరములన్నియు బ్రదుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుటవలన ఆ నీరు మంచి నీళ్లగును గనుక చేపలు బహు విస్తారములగును; ఈ నది యెక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రదుకును.౹

10 మరియు దానియొద్ద ఏన్గెదీ పట్టణము మొదలుకొని ఏనెగ్లా యీము పట్టణమువరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు; మహాసముద్రములోనున్నట్లు సకల జాతి చేపలును దానియందు బహు విస్తారముగా నుండును.౹

11 అయితే ఆ సముద్రపు బురద స్థలములును ఊబిస్థలములును ఉప్పుగలవైయుండి బాగుకాక యుండును.౹

12 నదీతీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకలజాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికిని రాలవు. ఈ నదినీరు పరిశుద్ధ స్థలములోనుండి పారుచున్నది గనుక ఆచెట్లు నెల నెలకు కాయలు కాయును, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును.

13 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–సరిహద్దులనుబట్టి ఇశ్రాయేలీయుల పండ్రెండు గోత్రముల ప్రకారము మీరు స్వాస్థ్యముగా పంచుకొనవలసిన భూమి యిది; యోసేపు సంతతికి రెండు భాగములియ్యవలెను.౹

14 నేను ప్రమాణముచేసి మీపితరులకు ఈ దేశము ఇచ్చితిని గనుక ఏమియు భేదములేకుండ మీలో ప్రతివాడును దానిలో స్వాస్థ్యమునొందును; ఈలాగున అది మీకు స్వాస్థ్యమగును.౹

15 ఉత్తర దిక్కున సెదాదునకు పోవు మార్గమున మహాసముద్రము మొదలుకొని హెత్లోనువరకు దేశమునకు సరిహద్దు.౹

16 అది హమాతునకును బేరోతా యునకును దమస్కు సరిహద్దునకును హమాతు సరిహద్దునకును మధ్యనున్న సిబ్రయీమునకును హవ్రాను సరిహద్దును ఆనుకొను మధ్యస్థలమైన హాజేరునకును వ్యాపిం చును.౹

17 పడమటి సరిహద్దు హసరేనాను అను దమస్కు సరిహద్దు పట్టణము, ఉత్తరపు సరిహద్దు హమాతు; ఇది మీకు ఉత్తరపు సరిహద్దు.౹

18 తూర్పుదిక్కున హవ్రాను దమస్కు గిలాదులకును ఇశ్రాయేలీయుల దేశమునకును మధ్య యొర్దానునది సరిహద్దుగా ఉండును; సరిహద్దు మొదలుకొని తూర్పు సముద్రమువరకు దాని కొలువవలెను; ఇది మీకు తూర్పు సరిహద్దు.౹

19 దక్షిణదిక్కున తామారు మొదలుకొని కాదేషునొద్దనున్న మెరీబా ఊటలవరకును నది మార్గమున మహాసముద్రమునకు మీ సరిహద్దు పోవును; ఇది మీకు దక్షిణపు సరిహద్దు.౹

20 పశ్చిమదిక్కున సరిహద్దు మొదలుకొని హమాతునకు పోవు మార్గమువరకు మహాసముద్రము సరిహద్దుగా ఉండును; ఇది మీకు పశ్చిమదిక్కు సరిహద్దు.౹

21 ఇశ్రాయేలీయుల గోత్రముల ప్రకారము ఈ దేశమును మీరు పంచుకొనవలెను.౹

22 మీరు చీట్లువేసి మీకును మీలో నివసించి పిల్లలు కనిన పరదేశులకును స్వాస్థ్యములను విభజించు నప్పుడు ఇశ్రాయేలీయులలో దేశమందు పుట్టినవారినిగా ఆ పరదేశులను మీరు ఎంచవలెను, ఇశ్రాయేలు గోత్రికులతో పాటు తామును స్వాస్థ్యము నొందునట్లు మీవలె వారును చీట్లు వేయవలెను.౹

23 ఏ గోత్రములో పరదేశులు కాపురముందురో ఆ గోత్ర భాగములో మీరు వారికి స్వాస్థ్యము ఇయ్యవలెను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZK/47-28940105f8f625fdf7389782a3a6049e.mp3?version_id=1787—

Categories
యెహెజ్కేలు

యెహెజ్కేలు 48

1 గోత్రముల పేరులు ఇవి; దానీయుల కొకభాగము. అది ఉత్తరదిక్కు సరిహద్దునుండి హమాతునకుపోవు మార్గమువరకు హెత్లోనునకుపోవు సరిహద్దువరకును హసరేనాను అను దమస్కు సరిహద్దువరకును హమాతు సరిహద్దు మార్గమున తూర్పుగాను పడమరగాను వ్యాపించు భూమి.౹

2 దానుయొక్క సరిహద్దునానుకొని తూర్పు పడమరలుగా ఆషేరీయులకు ఒక భాగము.౹

3 ఆషేరీయుల సరిహద్దు నానుకొని తూర్పు పడమరలుగా నఫ్తాలీయులకు ఒక భాగము.౹

4 నఫ్తాలి సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా మనష్షేయులకు ఒక భాగము.౹

5 మనష్షేయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా ఎఫ్రాయి మీయులకు ఒక భాగము.౹

6 ఎఫ్రాయిమీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా రూబేనీయులకు ఒక భాగము.౹

7 రూబేనీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా యూదావారికి ఒక భాగము.

8 యూదావారి సరిహద్దును అనుకొని తూర్పు పడమరలుగా మీరు ప్రతిష్ఠించు ప్రతిష్ఠిత భూమియుండును. దాని వెడల్పు ఇరువదియైదు వేల కొలకఱ్ఱలు; దాని నిడివి తూర్పునుండి పడమరవరకు తక్కిన భాగముల నిడివి వలెనే యుండును; పరిశుద్ధస్థలము దాని మధ్య ఉండవలెను.౹

9 యెహోవాకు మీరు ప్రతిష్ఠించు ప్రదేశము ఇరువదియైదు వేల కొలకఱ్ఱల నిడివియు పదివేల కొల కఱ్ఱల వెడుల్పునై యుండవలెను.౹

10 ఈ ప్రతిష్ఠితభూమి యాజకులదగును. అది ఉత్తరదిక్కున ఇరువదియైదువేల కొలకఱ్ఱల నిడివియు పడమటి దిక్కున పదివేల కొల కఱ్ఱల వెడల్పును తూర్పుదిక్కున పదివేల కొలకఱ్ఱల వెడల్పును దక్షిణ దిక్కున ఇరువదియైదువేల కొలకఱ్ఱల నిడివియు ఉండవలెను. యెహోవా పరిశుద్ధస్థలము దాని మధ్య ఉండును.౹

11 ఇది సాదోకు సంతతివారై నాకు ప్రతిష్ఠింపబడి నేను వారి కప్పగించిన దానిని కాపాడు యాజకుల దగును; ఏలయనగా ఇశ్రాయేలీయులు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీయులు విడిచిపోయినట్లె వారు నన్ను విడిచిపోలేదు.౹

12 ప్రతిష్ఠిత భూమియందు లేవీయుల సరిహద్దుదగ్గర వారికొక చోటు ఏర్పాటగును; అది అతి పరిశుద్ధముగా ఎంచబడును.౹

13 యాజకుల సరిహద్దును ఆనుకొని లేవీయుల కొకచోటు నేర్పాటుచేయవలెను; అది ఇరువదియయిదు వేల కొలకఱ్ఱల నిడివియు పదివేల కొలకఱ్ఱల వెడల్పునైయుండును. దాని నిడివియంతయు ఇరువదియయిదు వేల కొలకఱ్ఱలును వెడల్పంతయు పది వేల కొలకఱ్ఱలును ఉండును.౹

14 అది యెహోవాకు ప్రతిష్ఠితమైన భూమి గనుక దానిలో ఏమాత్రపు భాగమైనను వారు అమ్మకూడదు, బదులుగా ఇయ్యకూడదు, ఆ భూమియొక్క ప్రథమ ఫలములను ఇతరులను అనుభవింపనియ్యకూడదు.౹

15 ఇరువదియయిదువేల కొలకఱ్ఱల భూమిని ఆనుకొని వెడల్పున మిగిలిన అయిదువేల కొలకఱ్ఱలుగల చోటు గ్రామకంఠముగా ఏర్పరచబడినదై, పట్టణములోని నివేశములకును మైదానములకును అక్కరకువచ్చును; దాని మధ్య పట్టణము కట్టబడును.౹

16 దాని పరిమాణ వివరమేదనగా, ఉత్తరదిక్కువ నాలుగువేల ఐదువందల కొలకఱ్ఱలు, దక్షిణ దిక్కున నాలుగువేల ఐదువందల కొలకఱ్ఱలు, తూర్పు దిక్కున నాలుగువేల ఐదువందల కొలకఱ్ఱలు, పడమటి దిక్కున నాలుగువేల ఐదువందల కొలకఱ్ఱలు.౹

17 పట్టణమునకు చేరిన ఖాలీస్థలము ఉత్తరపుతట్టున రెండువందల యేబది కొలకఱ్ఱలు, దక్షిణపుతట్టున రెండువందల ఏబది కొలకఱ్ఱలు, తూర్పుతట్టున రెండువందల ఏబది కొలకఱ్ఱలు, పడమటితట్టున రెండువందల ఏబది కొలకఱ్ఱలు ఉండవలెను.౹

18 ప్రతిష్ఠిత భూమిని ఆనుకొని మిగిలిన భూమి ఫలము పట్టణములో కష్టముచేత జీవించువారికి ఆధారముగా ఉండును. అది ప్రతిష్ఠితభూమినియానుకొని తూర్పుతట్టున పదివేల కొలకఱ్ఱలును పడమటితట్టున పదివేల కొల కఱ్ఱలును ఉండును.౹

19 ఏ గోత్రపువారైనను పట్టణములో కష్టముచేసి జీవించువారు దానిని సాగుబడిచేయుదురు.౹

20 ప్రతిష్ఠిత భూమియంతయు ఇరువదియయిదు వేల కొల కఱ్ఱల చచ్చౌకముగా ఉండును; దానిలో నాలుగవభాగము పట్టణమునకు ఏర్పాటు చేయవలెను.

21 ప్రతిష్ఠితస్థానమునకును పట్టణమునకు ఏర్పాటు చేయబడిన భాగమునకును ఇరు ప్రక్కలనున్న భూమిని, అనగా తూర్పుదిశను ప్రతిష్ఠితస్థానముగా ఏర్పడిన యిరువది యయిదువేల కొలకఱ్ఱలును పడమటి దిశను గోత్రస్థానములుగా ఏర్పడిన యిరువదియయిదు వేల కొలకఱ్ఱలునుగల భూమినియానుకొనుస్థానము అధిపతిదగును. ప్రతిష్ఠిత స్థానమును, మందిరమునకు ప్రతిష్ఠింపబడిన స్థానమును దానికి మధ్యగా ఉండును.౹

22 యూదావారి సరిహద్దునకును బెన్యామీనీయుల సరిహద్దునకును మధ్యగానున్న లేవీయుల స్వాస్థ్యమును పట్టణమునకు ఏర్పాటైన స్థానమును ఆనుకొను భూమిలో అధిపతి భూమికి లోగా ఉన్నది అధిపతి దగును.౹

23 తూర్పునుండి పడమటివరకు కొలువగా మిగిలిన గోత్రములకు భాగములు ఏర్పా టగును. బెన్యామీనీయులకు ఒక భాగము,౹

24 బెన్యామీనీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా షిమ్యోనీయులకు ఒక భాగము;౹

25 షిమ్యోనీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా ఇశ్శాఖారీయు లకు ఒక భాగము

26 ఇశ్శాఖారీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా జెబూలూనీయులకు ఒక భాగము,౹

27 జెబూలూనీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడ మరలుగా గాదీయులకు ఒక భాగము;౹

28 దక్షిణదిక్కున తామారునుండి కాదేషులోనున్న మెరీబా ఊటలవరకు నదివెంబడి మహాసముద్రమువరకు గాదీయులకు సరిహద్దు ఏర్పడును.౹

29 మీరు చీట్లువేసి ఇశ్రాయేలీయుల గోత్రములకు విభాగింపవలసిన దేశము ఇదే. వారివారి భాగములు ఇవే. యిదే యెహోవా యిచ్చిన ఆజ్ఞ.

30 పట్టణస్థాన వైశాల్యము ఎంతనగా, ఉత్తరమున నాలుగు వేల ఐదువందల కొలకఱ్ఱల పరిమాణము.౹

31 ఇశ్రాయేలీయుల గోత్రపు పేళ్లనుబట్టి పట్టణపు గుమ్మములకు పేళ్లు పెట్టవలెను. ఉత్తరపుతట్టున రూబేనుదనియు, యూదాదనియు, లేవిదనియు మూడు గుమ్మములుండవలెను.౹

32 తూర్పుతట్టు నాలుగువేల ఐదువందల కొలకఱ్ఱల పరిమాణము గలది. ఆతట్టున యోసేపుదనియు బెన్యామీనుదనియు దానుదనియు మూడు గుమ్మములుండవలెను.౹

33 దక్షిణపుతట్టు నాలుగు వేల ఐదువందల కొలకఱ్ఱల పరిమాణము గలది. ఆతట్టున షిమ్యోనుదనియు ఇశ్శాఖారుదనియు జెబూలూనుదనియు మూడు గుమ్మములుండవలెను.౹

34 పడమటితట్టు నాలుగువేల ఐదువందల కొలకఱ్ఱల పరిమాణముగలది. ఆతట్టున గాదుదనియు ఆషేరుదనియు నఫ్తాలిదనియు మూడు గుమ్మములుండవలెను.౹

35 దాని కైవారము పదునెనిమిదివేల కొలకఱ్ఱల పరిమాణము. యెహోవా యుండు స్థలమని నాటనుండి ఆ పట్టణమునకు పేరు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZK/48-78d9a28ce2371f21873ea9119a39b302.mp3?version_id=1787—