Categories
యెహెజ్కేలు

యెహెజ్కేలు 19

1 మరియు నీవు ఇశ్రాయేలీయుల అధిపతులనుగూర్చి ప్రలాపవాక్యము నెత్తి ఇట్లు ప్రకటింపుము

2 –నీ తల్లి ఎటువంటిది? ఆడుసింహము వంటిది, ఆడుసింహములమధ్య పండుకొనెను, కొదమ సింహములమధ్య తన పిల్లలను పెంచెను;౹

3 వాటిలో ఒకదానిని అది పెంచగా అది కొదమసింహమై వేటాడ నేర్చుకొని మనుష్యులను భక్షించున దాయెను.౹

4 అన్యజనులు దాని సంగతి విని తమ గోతిలో దాని చిక్కించుకొని దాని ముక్కునకు గాలము తగిలించి ఐగుప్తుదేశమునకు దాని తీసికొనిపోయిరి.౹

5 తల్లి దాని కనిపెట్టి తన ఆశ భంగమాయెనని తెలిసికొని, తన పిల్లలలో మరియొక దాని చేపెట్టి దాని పెంచి కొదమసింహముగా చేసెను.౹

6 ఇదియు కొదమసింహమై కొదమ సింహములతోకూడ తిరుగులాడి వేటాడనేర్చుకొని మనుష్యులను భక్షించునదై

7 వారి నగరులనుఅవమానపరచి వారి పట్టణములను పాడుచేసెను; దాని గర్జనధ్వనికి దేశమును అందులోనున్న సమస్తమును పాడాయెను.౹

8 నలుదిక్కుల దేశపు జనులందరు దాని పట్టుకొనుటకు పొంచియుండి ఉరి నొగ్గగా అది వారి గోతిలో చిక్కెను.౹

9 అప్పుడు వారు దాని ముక్కునకు గాలము తగిలించి దానిని బోనులో పెట్టి బబులోను రాజునొద్దకు తీసికొనిపోయి అతనికి అప్పగించిరి; దాని గర్జనము ఇశ్రాయేలీయుల పర్వతములమీద ఎన్నటికిని వినబడకుండునట్లువారు దానిని గట్టి స్థలమందుంచిరి.

10 మరియు నీకు క్షేమము కలిగియుండగా నీ తల్లి ఫల భరితమై తీగెలతో నిండియుండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షావల్లివలె నుండెను.౹

11 భూపతు లకు దండములైనట్టి గట్టిచువ్వలు దానికి కలిగియుండెను, అది మేఘములనంటునంతగా పెరిగెను, విస్తారమైన దాని కొమ్మలు బహు ఎత్తుగా కనబడెను.౹

12 అయితే బహు రౌద్రముచేత అది పెరికివేయబడినదై నేలమీద పడవేయ బడెను, తూర్పుగాలి విసరగా దాని పండ్లు వాడెను. మరియు దాని గట్టిచువ్వలు తెగి వాడిపోయి అగ్నిచేత కాల్చబడెను.౹

13-14 ఇప్పుడు అది అరణ్యములో మిక్కిలి యెండిపోయి నిర్జలస్థలములలో నాట బడియున్నది. మరియు దాని కొమ్మల చువ్వలలోనుండి అగ్ని బయలు దేరుచు దాని పండ్లను దహించుచున్నది గనుక రాజదండమునకు తగిన గట్టిచువ్వ యొకటియు విడువబడ లేదు. ఇదియే ప్రలాపవాక్యము, ఇదియే ప్రలాపమునకు కారణమగును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZK/19-bfa000cc2bff91dd555c12053012cadf.mp3?version_id=1787—

Categories
యెహెజ్కేలు

యెహెజ్కేలు 20

1 ఏడవ సంవత్సరము అయిదవ నెల పదియవదినమున ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరు యెహోవా యొద్ద విచారణచేయుటకై నా యొద్దకు వచ్చి నా యెదుట కూర్చుండియుండగా

2 యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

3 –నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దలతో ఇట్లనుము – ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–నా యొద్ద విచారణ చేయుటకు మీరు వచ్చుచున్నారే. నా జీవముతోడు నావలన ఏ ఆలోచనయైనను మీకు దొరకదు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹

4 వారికి న్యాయము తీర్చుదువా? నరపుత్రుడా, వారికి న్యాయము తీర్చుదువా? వారి పితరులు చేసిన హేయకృత్యములను వారికి తెలియజేయుము.౹

5 ఎట్లనగా ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నేను ఇశ్రాయేలును ఏర్పరచుకొనిన నాడును, యాకోబు సంతతికి ప్రమాణముచేసిన నాడును, ఐగుప్తుదేశమందు నన్ను వారికి ప్రత్యక్ష పరచుకొని ప్రమాణముచేసి నేను మీ దేవుడనైన యెహోవానని నేను ప్రకటించిన కాలమున

6 వారిని ఐగుప్తుదేశములోనుండి రప్పించి వారికొరకు నేను విచారించినదియు, పాలు తేనెలు ప్రవహించునదియు, సకల దేశములకు ఆభరణమై నదియునైన దేశములోనికి తోడుకొని పోయెదనని చెప్పిన కాలముననే నేను ప్రమాణము చేసితిని.౹

7 అప్పుడు–నేను మీ దేవుడనైన యెహోవాను, మీలో ప్రతివాడు తన కిష్టమైన హేయకృత్యములను విడిచిపెట్టవలెను, ఐగుప్తీయుల విగ్రహములను పూజించుటచేత మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకుండవలెను అని నేను ఆజ్ఞాపించితిని.౹

8 అయితే వారు నా మాట విననొల్లక నామీద తిరుగుబాటు చేసి, తమకిష్టమైన హేయకృత్యములు చేయుట మానలేదు, ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట మానలేదు గనుక వారు ఐగుప్తీయుల దేశములో ఉండగానే నేను నా రౌద్రము వారిమీద కుమ్మరించి నాకోపము వారి మీద తీర్చుకొందునని యనుకొంటిని.౹

9 అయితే ఏ అన్యజనులయెదుట నన్ను నేను బయలు పరచుకొంటినో, యే అన్యజనులమధ్య వారుండిరో ఆ అన్యజనులలో వారున్న అన్యజనుల యెదుట వారికి నన్ను బయలుపరచుకొంటిని, నా నామమునకు దూషణ కలుగకుండుటకై ఆలాగు చేయుటమాని, ఆ జనులు చూచుచుండగా నా నామఘనతకొరకు నేను వారిని ఐగుప్తుదేశములోనుండి రప్పించితిని.౹

10 వారిని ఐగుప్తుదేశములోనుండి రప్పించి అరణ్యములోనికి తోడుకొని వచ్చి

11 వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేసితిని. ఎవడైన వాటిననుసరించినయెడల వాటినిబట్టి బ్రదుకును.౹

12 మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలిసికొనునట్లు నాకును వారికిని మధ్య విశ్రాంతిదినములను వారికి సూచనగా నేను నియమించితిని.౹

13 అయితే అరణ్యమందు ఇశ్రాయేలీయులు నామీద తిరుగుబాటు చేసి నా కట్టడల ననుసరింపక, తాము అనుసరించి బ్రదుకవలెనని నేనిచ్చిన విధులను తృణీకరించి, నేను నియమించిన విశ్రాంతిదినములను అపవిత్రపరచగా, అరణ్యమందు నా రౌద్రాగ్ని వారిమీద కుమ్మరించి వారిని నిర్మూలము చేయుదుననుకొంటిని.౹

14 అయితే నేను వారిని రప్పింపగా ఏ అన్యజనులు చూచిరో యే అన్యజనులలోనుండి నేను వారిని రప్పించితినో వారి యెదుట నా నామమునకు దూషణ కలుగకుండునట్లు నేననుకొనిన ప్రకారము చేయక మానితిని.౹

15 మరియు తమకిష్టమైన విగ్రహముల ననుసరింపవలెనని కోరి, వారు నా విధులను తృణీకరించి నా కట్టడల ననుసరింపక నేను నియమించిన విశ్రాంతిదినములను అపవిత్రపరచగా

16 ఇచ్చెదనని నేను సెలవిచ్చినట్టియు, పాలు తేనెలు ప్రవహించునట్టియునైన సకల దేశములకు ఆభరణమగు దేశములోనికి వారిని రప్పింపనని వారు అరణ్యములో ఉండగానే నేను ప్రమాణము చేసితిని.౹

17 అయినను వారు నశించి పోకుండునట్లు వారియందు కనికరించి, అరణ్యములో నేను వారిని నిర్మూలము చేయక పోతిని.౹

18 వారు అరణ్యములో ఉండగానే వారి పిల్లలతో ఈలాగు సెలవిచ్చితిని–మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు, వారి పద్ధతులనుబట్టి ప్రవర్తింపకయు, వారు పెట్టుకొనిన దేవతలను పూజించి మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకయు నుండుడి.౹

19 మీ దేవుడనైన యెహోవాను నేనే గనుక నా కట్టడల ననుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరించుడి.౹

20 నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలిసికొనునట్లు ఆ విశ్రాంతిదినములు నాకును మీకునుమధ్యను సూచనగా ఉండును.౹

21 అయినను ఆ జనులు సహా నా మీద తిరుగబడి, తామనుసరించి బ్రదుకవలెనని నేనిచ్చిన నా కట్టడలను అనుసరింపకయు, నా విధులను గైకొనకయు, నేను నియమించిన విశ్రాంతిదినములను అపవిత్రపరచిరి గనుక, వారు అరణ్యములో ఉండగానే నేను నా రౌద్రాగ్ని వారిమీద కుమ్మరించి నాకోపము వారిమీద తీర్చుకొందునని యనుకొంటిని.౹

22 అయితే నేను ప్రత్యక్షమైన అన్యజనులమధ్య నా నామమునకు దూషణ కలుగకుండునట్లు ఏ జనులలోనుండి వారిని రప్పించితినో ఆ జనులు చూచుచుండగా నా హస్తము వెనుకకు తీసి నా వాగ్దానము నెరవేర్చితిని.౹

23-24 మరియు వారు నా విధుల ననుసరింపక నా కట్టడలను తృణీకరించి, నేను విధించిన విశ్రాంతిదినములను అపవిత్రపరచి, తమపితరులు పెట్టుకొనిన విగ్రహములను పూజింప గోరగా, అన్యజనులలో వారిని చెదరగొట్టి సకలదేశములలోనికి వారిని వెళ్లగొట్టుదునని ప్రమాణము చేసితిని.౹

25 నేను యెహోవానని వారు తెలిసికొనునట్లు వారిని విస్మయము నొందింపవలెనని అనుకూలముకాని కట్టడలను తాము బ్రదుకుటకు ప్రయోజనకరములు కాని విధులను వారికిచ్చితిని.౹

26 తొలిచూలిని అగ్నిగుండముదాటించి బలి దానముల నిచ్చుటచేత తమ్మును తాము అపవిత్రపరచు కొననిచ్చితిని.

27 కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలీయులతో మాటలాడి ఇట్లు ప్రకటింపుము–ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా మీపితరులు నాయెడల అతిక్రమముచేసి నన్ను దూషించి

28 వారికిచ్చెదనని నేను ప్రమాణ పూర్వకముగా చెప్పిన దేశములోనికి నేను వారిని రప్పించిన తరువాత, ఎత్తయిన యొక కొండనేగాని, దట్టమైన యొక వృక్షమునేగాని తాము చూచినప్పుడెల్లను బలులు అర్పించుచు, అర్పణలను అర్పించుచు, అక్కడ పరిమళ ధూపము ప్రతిష్ఠించుచు, పానార్పణములు చేయుచు నాకు కోపము పుట్టించిరి.౹

29 మీరు పోవుచున్న ఉన్నతస్థలములేమిటని నేనడిగితిని; కాబట్టి ఉన్నతస్థలమను పేరు నేటివరకు వాడుకలో నున్నది.౹

30 కావున ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటింపుము–ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా–మీపితరుల రీతిని మీరును అపవిత్రులైతిరే వారు పెట్టుకొనిన విగ్రహములను అనుసరించుచు మీరును వ్యభిచారులైతిరే;౹

31 నేటివరకును మీరు అర్పణలను అర్పించి మీ కుమారులను అగ్నిగుండ దాటించునప్పుడు, మీరు పెట్టుకొనిన విగ్రహములన్నిటికి పూజజేసి అపవిత్రులగుచున్నారే; ఇశ్రాయేలీయులారా, నాయొద్ద మీరు విచారణ చేయుదురా? నా జీవముతోడు నావలన ఆలోచన మీకు దొరుకదు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు

32 –అన్యజనులేమి భూమిమీది యేజనులేమి చేయునట్లు మేమును కొయ్యలకును రాళ్లకును పూజచేతుమని మీరనుకొనుచున్నారే. మీరు ఇచ్ఛయించినదాని ప్రకారమెన్నటికిని జరుగదు.౹

33 నా జీవముతోడు నా రౌద్రము కుమ్మరించుచు, బాహుబలముతోను చాచిన చేతితోను నేను మీపైన అధికారము చేసెదను.౹

34 మరియు నేను రౌద్రము కుమ్మరించుచు, బాహుబలముతోను చాచిన చేతితోను మిమ్మును చెదరగొట్టిన ఆయా దేశములలోనుండియు జనులలోనుండియు నేను మిమ్మును సమ కూర్చి

35 జనములున్న అరణ్యములోనికి మిమ్మును రప్పించి, అక్కడ ముఖాముఖిగా మీతో వ్యాజ్యెమాడెదను; ఇదే యెహోవా వాక్కు.౹

36 ఐగుప్తీయులదేశపు అరణ్యములో నేను మీపితరులతో వ్యాజ్యెమాడినట్టు మీతోను వ్యాజ్యె మాడెదను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.౹

37 చేతి కఱ్ఱక్రింద మిమ్మును దాటించి నిబంధనకు లోపరచెదను.౹

38 మరియు నామీద తిరుగబడువారిని దోషము చేయువారిని మీలో ఉండకుండ ప్రత్యేకించెదను, తాము కాపురమున్న దేశములోనుండి వారిని రప్పించెదను గాని నేను యెహోవానని మీరు తెలిసికొనునట్లువారు ఇశ్రాయేలుదేశములో ప్రవేశించరు.౹

39 ఇశ్రాయేలు యింటివారలారా, మీరు నామాట వినని యెడల మీరు పెట్టుకొనిన విగ్రహములను, మీ కిష్టమైనట్టుగా పూజించుకొనుడి, గాని మీ అర్పణలచేతను మీ విగ్రహములచేతను నా పరిశుద్ధనామమును అపవిత్రపరచకుడి అని ప్రభువైన యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹

40 నిజముగా ఇశ్రాయేలీయుల ఉన్నతమైన కొండయగు నా పరిశుద్ధపర్వతమందు దేశములోనున్న ఇశ్రాయేలీయులందరును నాకు సేవచేయుదురు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అచ్చటనే నేను వారిని అంగీకరించెదను. అచ్చటనే మీ ప్రతిష్ఠితమైన యర్పణలను, మీ ప్రథమ ఫలదానములను, ప్రతిష్ఠితములగు మీ కానుకలనన్నిటిని నేనంగీకరించెదను.౹

41 జనములలోనుండి నేను మిమ్మును రప్పించునప్పుడును, మిమ్మును చెదరగొట్టిన ఆయా దేశములలోనుండి మిమ్మును సమకూర్చునప్పుడును, పరిమళధూపముగా మిమ్మును అంగీకరించెదను, అన్యజనులయెదుటను మీమధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకొందును.౹

42 మీపితరులకిచ్చెదనని నేను ప్రమాణ పూర్వకముగా చెప్పిన దేశమునకు, అనగా ఇశ్రాయేలీయుల దేశమునకు నేను మిమ్మును రప్పించునప్పుడు నేనే యెహోవానని మీరు తెలిసికొందురు.౹

43 అచ్చట చేరి మీ ప్రవర్తనను, మిమ్మును మీరు అపవిత్ర పరచుకొనిన మీ క్రియలన్నిటిని మనస్సునకు తెచ్చుకొని, మీరు చేసిన దుష్‌క్రియలనుబట్టి మిమ్మును మీరే అసహ్యించుకొందురు.౹

44 ఇశ్రాయేలీయులారా, మీ దుర్మార్గతనుబట్టియు మీ కాని చేష్టలనుబట్టియు కాక నా నామమునుబట్టియే నేను మీకీలాగున చేయగా నేనే యెహోవానని మీరు తెలిసికొందురు.

45 ఇదే యెహోవా వాక్కు మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

46 –నరపుత్రుడా, నీ ముఖము దక్షిణపుతట్టు త్రిప్పుకొని దక్షిణదేశమునకు ప్రకటింపుము, దక్షిణదేశపు అరణ్యమునుగూర్చి ప్రవచించి ఇట్లనుము

47 –దక్షిణదేశమా, యెహోవా మాట ఆలకించుము–ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–నేను నీలో అగ్ని రాజబెట్టెదను, అది నీలోనున్న పచ్చని చెట్లన్నిటిని ఎండిన చెట్లన్నిటిని దహించును, అది ఆరిపోకుండనుండును, దక్షిణదిక్కు మొదలుకొని ఉత్తరదిక్కువరకు భూముఖమంతయు దాని చేత కాల్చబడును.౹

48 అది ఆరిపోకుండ యెహోవానైన నేను దానిని రాజబెట్టితినని సమస్తమైనజనులకు తెలియబడును.౹

49 అయ్యో ప్రభువా యెహోవా–వీడు గూఢమైన మాటలు పలుకువాడు కాడా అని వారు నన్నుగూర్చి చెప్పుదురని నేనంటిని.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZK/20-96df6cc143dac1d23c93e93f410207cf.mp3?version_id=1787—

Categories
యెహెజ్కేలు

యెహెజ్కేలు 21

1 అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై . యీలాగు సెలవిచ్చెను

2 –నరపుత్రుడా, యెరూషలేముతట్టు నీ ముఖము త్రిప్పుకొని, పరిశుద్ధస్థలములనుబట్టి ఇశ్రాయేలీయులదేశమునుగూర్చి ప్రవచించి ఇట్లనుము

3 –యెహోవా సెలవిచ్చునదేమనగా–నేను నీకు విరోధినై తిని. నీతిపరులనేమి దుష్టులనేమి నీలో ఎవరు నుండకుండ అందరిని నిర్మూలము చేయుటకై నా ఖడ్గము ఒరదూసి యున్నాను.౹

4 నీతిపరులేమి దుష్టులేమి యెవరును మీలో ఉండకుండ దక్షిణదిక్కు మొదలుకొని ఉత్తరదిక్కువరకు అందరిని నిర్మూలము చేయుటకై నా ఖడ్గము దాని ఒరలోనుండి బయలుదేరియున్నది.౹

5 యెహోవానైన నేను నా ఖడ్గము మరల ఒరలోపడకుండ దాని దూసియున్నానని జనులందరు తెలిసికొందురు.౹

6 కావున నరపుత్రుడా, నిట్టూర్పు విడువుము, వారు చూచుచుండగా నీ నడుము బద్దలగునట్లు మనోదుఃఖముతో నిట్టూర్పు విడువుము.౹

7 –నీవు నిట్టూర్పు విడిచెదవేమని వారు నిన్నడుగగా నీవు –శ్రమదినము వచ్చుచున్నదను దుర్వార్త నాకు వినబడి నది, అందరి గుండెలు కరిగిపోవును, అందరి చేతులు బలహీనమవును, అందరి మనస్సులు అధైర్యపడును, అందరి మోకాళ్లు నీరవును, ఇంతగా కీడు వచ్చుచున్నది; అది వచ్చేయున్నది అని చెప్పుము; ఇదే యెహోవా వాక్కు.

8 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.౹

9 –నరపుత్రుడా, నీవు ఈ మాటలు ప్రకటనచేసి ఇట్లనుము–యెహోవా సెలవిచ్చున దేమనగా–అదిగో ఖడ్గము ఖడ్గమే కనబడుచున్నది, అది పదునుగలదై మెరుగుపెట్టియున్నది.౹

10 అది గొప్ప వధ చేయుటకై పదును పెట్టియున్నది, తళతళలాడునట్లు అది మెరుగుపెట్టియున్నది; ఇట్లుండగా నా కుమారుని దండము ఇతర దండములన్నిటిని తృణీకరించునది అని చెప్పి మనము సంతోషించెదమా?

11 మరియు దూయుటకు సిద్ధమగునట్లు అది మెరుగుపెట్టువానియొద్ద నుంచబడియుండెను, హతము చేయువాడు పట్టుకొనునట్లుగా అది పదునుగలదై మెరుగు పెట్టబడియున్నది.౹

12 –నరపుత్రుడా అంగలార్చుము, కేకలువేయుము, అది నా జనులమీదికిని ఇశ్రాయేలీయుల ప్రధానులమీదికిని వచ్చుచున్నది, ఖడ్గభయము నా జనులకు తటస్థించినది గనుక నీ తొడను చరచుకొనుము.౹

13 శోధనకలిగెను, తృణీకరించు దండము రాకపోయిననేమి? ఇదే యెహోవా వాక్కు.౹

14 నరపుత్రుడా, చేతులు చరచుకొనుచు సమాచారము ప్రవచింపుము, ఖడ్గము ముమ్మారు రెట్టింపబడినదై జనులను హతముచేయునదై యున్నది, అది గొప్పవాని అంతఃపురము చొచ్చి వాని హతము చేయునది.౹

15 వారి గుండెలు కరిగిపోవునట్లును, పడద్రోయు అడ్డములు అధికములగునట్లును, వారి గుమ్మములలో నేను ఖడ్గము దూసెదను; అయ్యయ్యో అది తళతళలాడుచున్నది, హతము చేయుటకై అది దూయబడియున్నది.౹

16 ఖడ్గమా, సిద్ధపడియుండుము; కుడివైపు చూడుము, ఎడమవైపు తిరుగుము, ఎక్కడ నీకు పని యుండునో అక్కడికి తిరుగుము

17 నేను కూడ నా చేతులు చరచుకొని నా క్రోధము తీర్చుకొందును; యెహోవానగు నేనే మాట ఇచ్చియున్నాను.

18 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.౹

19 –నరపుత్రుడా, బబులోను రాజు ఖడ్గమువచ్చుటకు రెండు మార్గములను ఏర్పరచుము. ఆ రెండును ఒక దేశములోనుండి వచ్చునట్లు సూచించుటకై యొక హస్తరూపము గీయుము, పట్టణపు వీధి కొనను దాని గీయుము.౹

20 ఖడ్గమునకు అమ్మోనీయుల పట్టణమగు రబ్బాకు ఒక మార్గమును, యూదాదేశమం దున్న ప్రాకారములుగల పట్టణమగు యెరూషలేమునకు ఒక మార్గమును ఏర్పరచుము.౹

21 బాటలు చీలుచోట రెండు మార్గములు చీలు స్థలమున శకునము తెలిసికొనుటకు బబులోను రాజు నిలుచుచున్నాడు; అతడు బాణములను ఇటు అటు ఆడించుచు, విగ్రహములచేత విచారణచేయుచు, కార్యమునుబట్టి శకునము చూచుచున్నాడు.౹

22 –యెరూషలేము ఎదుట గుమ్మములను పడగొట్టుయంత్రములు పెట్టుమనియు, హతముచేయుదమనియు, ధ్వని ఎత్తుమనియు, జయధ్వని బిగ్గరగా ఎత్తుమనియు, గుమ్మములకు ఎదురుగా పడగొట్టుయంత్రములు ఉంచుమనియు, దిబ్బలు వేయుమనియు, ముట్టడి దిబ్బలు కట్టు మనియు యెరూషలేమునుగూర్చి తన కుడితట్టున శకునము కనబడెను.౹

23 ప్రమాణములు చేసికొనిన వారికి ఈ శకునము వ్యర్థముగా కనబడును; అయితే వారు పట్టబడునట్లువారు చేసికొనిన పాపమును అతడు వారి జ్ఞాపకమునకు తెప్పించును.

24 కాబట్టి ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–మీ అతిక్రమములు బయలుపడుటవలన మీ సమస్త క్రియలలోనుండి మీ పాపములు అగుపడునట్లు మీ దోషము మీరు మనస్సునకు తెచ్చుకొనినందునను, నేను మిమ్మును జ్ఞాపకము చేసికొనినందునను మీరు చెయ్యి చిక్కియున్నారు.౹

25 గాయపడినవాడా, దుష్టుడా, ఇశ్రాయేలీయులకు అధిపతీ, దోషసమాప్తికాలమున నీకు తీర్పువచ్చియున్నది.౹

26 ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–తలాటమును తీసివేయుము కిరీటమును ఎత్తుము, ఇది యికను ఇట్లుండదు. ఇకమీదట నీచుని ఘనునిగాను ఘనుని నీచునిగాను చేయుము.౹

27 నేను దానిని పడద్రోయుదును పడద్రోయుదును పడ ద్రోయుదును; దాని స్వాస్థ్యకర్త వచ్చువరకు అదియు నిలువదు, అప్పుడు నేను దానిని అతనికిచ్చెదను.

28 మరియు నరపుత్రుడా, నీవు ప్రవచించి ఇట్లనుము –అమ్మోనీయులనుగూర్చియు, వారుచేయు నిందనుగూర్చియు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా– హతము చేయుటకు ఖడ్గము ఖడ్గమే దూయబడియున్నది, తళతళలాడుచు మెరుగుపెట్టిన ఖడ్గము వధచేయుటకు దూయబడియున్నది.౹

29 శకునగాండ్రు నీకొరకు మాయా దర్శనములు చూచుచుండగను, వారు వ్యర్థమైన వాటిని మీకు చెప్పుచుండగను, దోషసమాప్తి కాలమున శిక్షనొంది హతులైన దుర్మార్గుల మెడల ప్రక్కన అది నిన్ను పడ వేయును.౹

30 ఖడ్గమును ఒరలోవేయుము; నీవు సృష్టింప బడిన స్థలములోనే నీవు పుట్టిన దేశములోనే నేను నీకు శిక్ష విధింతును.౹

31 అచ్చటనే నా రౌద్రమును నీమీద కుమ్మరించెదను, నా ఉగ్రతాగ్నిని నీమీద రగుల బెట్టెదను, నాశనము చేయుటయందు నేర్పరులైన క్రూరులకు నిన్ను అప్పగించెదను.౹

32 అగ్ని నిన్ను మ్రింగును, నీ రక్తము దేశములో కారును, నీ వెన్నటికిని జ్ఞాపకమునకు రాకయుందువు; యెహోవానగు నేనే మాట ఇచ్చియున్నాను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZK/21-7f9e14b6149c6f3399794f67fde5ca75.mp3?version_id=1787—

Categories
యెహెజ్కేలు

యెహెజ్కేలు 22

1 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.౹

2 నరపుత్రుడా, ప్రాణహానిచేయు ఈ పట్టణమునకు నీవు తీర్పు తీర్చుదువా? దానికి నీవు తీర్పుతీర్చునెడల అదిచేయు హేయక్రియలన్నిటిని దానికి తెలియజేసి యీలాగున ప్రకటింపవలెను.౹

3 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–నీ కాలమువచ్చునట్లు నరహత్యలుచేయు పట్టణమా, నిన్ను అపవిత్ర పరచుకొనునట్లు విగ్రహములు పెట్టుకొను పట్టణమా, నీవు చేసిన నరహత్యలచేత నీకు నీవే నేరస్థాపన చేసికొంటివి, నీవు పెట్టుకొనిన విగ్రహములచేత నిన్ను నీవే అపవిత్రపరచుకొంటివి,౹

4 నీకు నీవే శిక్ష తెప్పించుకొంటివి, శిక్షా సంవత్సరములు వచ్చుటకు నీవే కారణమైతివి. కాబట్టి అన్యజనములలో నిందాస్పదముగాను, సకలదేశములలో అపహాస్యాస్పదముగాను నిన్ను నియమించుచున్నాను.౹

5 సమీపస్థులేమి దూరస్థులేమి అందరును అపకీర్తి పొందినదానవనియు అల్లరితో నిండినదానవనియు నిన్ను అపహసింతురు.౹

6 నీలోని ఇశ్రాయేలీయుల ప్రధానులందరును తమ శక్తికొలది నరహత్యచేయుదురు,౹

7 నీలో తలిదండ్రులు అవమానమొందుదురు, నీ మధ్యనున్న పరదేశులు దౌర్జన్యము నొందుదురు, నీలో తండ్రిలేని వారును విధవరాండ్రును హింసింపబడుదురు,౹

8 నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను నీవు తృణీకరించుచున్నావు, నా విశ్రాంతిదినములను నీవు అపవిత్రపరచుచున్నావు.౹

9 కొండెములు చెప్పి నరహత్య చేయువారు నీలో కాపురమున్నారు, పర్వతములమీద భోజనము చేయువారు నీ మధ్య నివసించుచున్నారు, నీలో కామవికార చేష్టలు జరుగుచున్నవి.౹

10 తమ తండ్రి మానాచ్ఛాదనము తీయు వారు నీలో నున్నారు, అశుచియై బహిష్టయైన స్త్రీని చెరుపువారు నీలో కాపురమున్నారు.౹

11 ఒకడు తన పొరుగువాని భార్యనుకూడి హేయక్రియలు చేయును, మరియొకడు కామాతురుడై తన కోడలిని అపవిత్రపర చును, నీలో జనులు తండ్రి కుమార్తెయగు తమ సహోదరిని చెరుపుదురు.౹

12 నన్ను మరచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకొనువారు నీలో నున్నారు, అప్పిచ్చి వడ్డి పుచ్చుకొని నీ పొరుగువారిని బాధించుచు నీవు బలవంతముగా వారిని దోచుకొనుచున్నావు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.౹

13 నీవు పుచ్చుకొనిన అన్యాయ లాభమును, నీవు చేసిన నరహత్యలను నేను చూచి నా చేతులు చరచుకొనుచున్నాను.౹

14 నేను నీకు శిక్ష విధింపబోవుకాలమున ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా? సహించునంత బలము నీకుండునా? యెహోవానగు నేనే మాట ఇచ్చియున్నాను, దానిని నేను నెరవేర్తును, నీ అపవిత్రతను బొత్తిగా తీసి వేయుటకై

15 అన్యజనులలో నిన్ను చెదరగొట్టుదును, ఇతర దేశములకు నిన్ను వెళ్లగొట్టుదును.౹

16 అచ్చట అన్యజనుల ఎదుటనే నీ అంతట నీవే భ్రష్టుడవై నేను యెహోవానని నీవు తెలిసికొందువు.

17 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

18 –నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు నా దృష్టికి మష్టువంటివారైరి, అందరును కొలిమిలోని ఇత్తడియు తగరమును ఇనుమును సీసము నైరి, వారు వెండి మష్టువంటివారైరి.౹

19 కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–మీరందరును మష్టువంటివారైతిరి. నేను మిమ్మును యెరూషలేముమధ్యను పోగుచేసెదను, ఒకడు వెండియు ఇత్తడియు ఇనుమును సీసమును తగరమును పోగుచేసి కొలిమిలో వేసి దానిమీద అగ్ని ఊది కరిగించినట్లు

20 నాకోపముచేతను రౌద్రముచేతను మిమ్మును పోగుచేసి అక్కడ మిమ్మును కరిగింతును.౹

21 మిమ్మును పోగుచేసి నా కోపాగ్నిని మీమీద ఊదగా నిశ్చయముగా మీరు దానిలో కరిగిపోవుదురు.౹

22 కొలిమిలో వెండి కరుగునట్లు మీరు దానిలో కరిగిపోవుదురు, అప్పుడు యెహోవానైన నేను నా క్రోధమును మీమీద కుమ్మరించితినని మీరు తెలిసికొందురు.

23 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

24 –నరపుత్రుడా, యెరూషలేమునకు నీవీమాట ప్రకటింపుము–నీవు పవిత్రము కాని దేశ మువై యున్నావు

25 ఉగ్రతదినమందు నీకు వర్షము రాదు, అందులో ప్రవక్తలు కుట్రచేయుదురు, గర్జించుచుండు సింహము వేటను చీల్చునట్లువారు మనుష్యులను భక్షింతురు. సొత్తులను ద్రవ్యమును వారు పట్టుకొందురు, దానిలో చాలామందిని వారు విధవరాండ్రుగాచేయుదురు,౹

26 దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాక రించుదురు, నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను అపవిత్ర పరచుదురు, ప్రతిష్ఠితమైనదానికిని సాధారణమైనదానికిని భేదమెంచరు, పవిత్రమేదో అపవిత్రమేదో తెలిసికొనుటకు జనులకు నేర్పరు, నేను విధించిన విశ్రాంతిదినములను ఆచరింపరు, వారి మధ్య నేను దూషింపబడుచున్నాను.౹

27 దానిలో అధిపతులు లాభము సంపాదించుటకై నరహత్య చేయుటలోను మనుష్యులను నశింపజేయుటలోను వేటను చీల్చు తోడేళ్లవలె ఉన్నారు.౹

28 మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు, యెహోవా ఏమియు సెలవియ్యనప్పుడు–ప్రభువైన యెహోవా యీలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుచు, వట్టిసోదెగాండ్రయి జనులు కట్టిన మంటిగోడకు గచ్చుపూత పూయువారైయున్నారు.౹

29 మరియు సామాన్య జనులు బలాత్కారముచేయుచు దొంగిలించుదురు, వారు దీనులను దరిద్రులను హింసించుదురు, అన్యాయముగా వారు పరదేశులను బాధించుదురు.౹

30 నేను దేశమును పాడుచేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును, బద్దలైన సందులలో నిలుచుటకును, తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు.౹

31 కావున నేను నా క్రోధమును వారిమీద కుమ్మ రింతును, వారి ప్రవర్తన ఫలము వారిమీదికి రప్పించి నా ఉగ్రతాగ్నిచేత వారిని దహింతును; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZK/22-196566b65d6d1e861f7861c117af12a0.mp3?version_id=1787—

Categories
యెహెజ్కేలు

యెహెజ్కేలు 23

1 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

2 –నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన యిద్దరు స్త్రీలు కలరు.౹

3 వీరు ఐగుప్తుదేశములో జారత్వము చేసిరి, యౌవనకాలమందే జారత్వము చేయుచు వచ్చిరి, అక్కడ వారికి ఆలింగనమాయెను, అక్కడ వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి.౹

4 వారిలో పెద్దదాని పేరు ఒహొలా, ఆమె సహోదరి పేరు ఒహొలీబా. వీరు నాకు పెండ్లి చేయబడినవారై కుమారులను కుమార్తెలను కనిరి–ఒహొలాయను పేరు షోమ్రో నునకును, ఒహొలీబాయను పేరు యెరూషలేమునకును చెందుచున్నవి.౹

5 ఒహొలా నాకు పెండ్లిచేయబడినను వ్యభిచారముచేసి

6 తన విటకాండ్రమీద బహుగా ఆశపెట్టుకొని, ధూమ్రవర్ణముగల వస్త్రములు ధరించుకొనిన సైన్యాధిపతులును అధికారులును అందముగల యౌవనులును గుఱ్ఱములెక్కు రౌతులును అగు అష్షూరువారిని మోహించెను.౹

7 అది కాముకురాలిరీతిగా అష్షూరువారిలో ముఖ్యులగు వారందరియెదుట తిరుగుచు, వారందరితో వ్యభిచరించుచు, వారు పెట్టుకొనిన విగ్రహములన్నిటిని పూజించుచు అపవిత్రురాలాయెను.౹

8 మరియు ఐగుప్తులో నేర్చుకొనిన జారత్వమును ఇది మానకయుండెను, అచ్చ టనే దాని యౌవనమందే పురుషులు దానితో శయనించిరి, దాని చనులను ఆలింగనము చేసిరి, కాముకులై దానితో విశేషముగా వ్యభిచారము చేసిరి.౹

9 కావున దాని విటకాండ్రకు నేను దానిని అప్పగించియున్నాను, అది మోహించిన అష్షూరువారికి దానిని అప్పగించియున్నాను.౹

10 వీరు దాని మానాచ్ఛాదనము తీసిరి, దాని కుమారులను కుమార్తెలను పట్టుకొని దానిని ఖడ్గముచేత చంపిరి; యీలాగున ఆమె స్త్రీలలో అపకీర్తిపాలై శిక్ష నొందెను.

11 దాని చెల్లెలైన ఒహొలీబా దానిని చూచి కాము కత్వమందు దానిని మించి అక్కచేసిన జారత్వములకంటె మరి ఎక్కువగా జారత్వము చేసెను.౹

12 ప్రశస్త వస్త్రములు ధరించినవారును సైన్యాధిపతులును అధికారులును గుఱ్ఱములెక్కు రౌతులును సౌందర్యముగల యౌవనులును అగు అష్షూరువారైన తన పొరుగువారిని అది మోహించెను.౹

13 అది అపవిత్రురాలాయెననియు, వారిద్దరును ఏకరీతినే ప్రవర్తించుచున్నారనియు నాకు తెలిసెను.౹

14 మరియు అది యధికముగా వ్యభిచారము చేయవలెనని కోరినదై, మొలలకు నడికట్లును తలలమీద చిత్రవర్ణము గల పాగాలును పెట్టుకొని రాచకళలుగలవారై

15 సిందూరముతో పూయబడి గోడమీద చెక్కబడినవారై, తమ జన్మదేశమైన కల్దీయులదేశపు బబులోను వారివంటి కల్దీయుల పటములను చూచి మోహించెను.౹

16 అది వారిని చూచినవెంటనే మోహించి కల్దీయదేశమునకు వారి యొద్దకు దూతలను పంపి వారిని పిలిపించుకొనగా

17 బబులోను వారు సంభోగము కోరివచ్చి జారత్వముచేత దానిని అపవిత్రపరచిరి; వారిచేత అది అపవిత్రపరచబడిన తరువాత, దాని మనస్సు వారికి యెడమాయెను.౹

18 ఇట్లు అది జారత్వము అధికముగాచేసి తన మానాచ్ఛాదనము తీసి వేసికొనెను గనుక దాని అక్క విషయములో నేను ఆశాభగ్నుడనైనట్టు దాని విషయములోను ఆశాభగ్నుడ నైతిని.౹

19 మరియు యౌవనదినములందు ఐగుప్తు దేశములో తాను జరిగించిన వ్యభిచారము మనస్సునకు తెచ్చుకొని అది మరి ఎక్కువగా వ్యభిచారము చేయుచు వచ్చెను.౹

20 గాడిద గుఱ్ఱములవంటి సిగ్గుమాలిన మోహముగల తన విటకాండ్రయందు అది మోహము నిలుపుచుండెను.౹

21 యౌవనకాలమందు నీవు ఐగుప్తీయులచేత నీ చనులను నలిపించుకొనిన సంగతి జ్ఞాపకము చేసికొని నీ బాల్యకాలపు దుష్కార్యమును చేయవలెనని నీవు చూచుచుంటివి.

22 కావున ఒహొలీబా, ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–నీ మనస్సునకు ఎడమైపోయిన నీ విటకాండ్రను రేపి నలుదిక్కులు వారిని నీమీదికి రప్పించెదను.౹

23 గుఱ్ఱములనెక్కు బబులోనువారిని కల్దీయులను అధిపతులను ప్రధానాధికారులనందరిని అష్షూరీయులను సౌందర్యముగల శ్రేష్ఠులను అధిపతులను అధికారులను శూరులను మంత్రులను అందరిని నీమీదికి నేను రప్పించుచున్నాను.౹

24 ఆయుధములు పట్టుకొని చక్రములుగల రథములతోను గొప్ప సైన్యముతోను వారు నీమీదికి వచ్చి, కేడెములను డాళ్లను పట్టుకొని శిరస్త్రాణములు ధరించుకొని వారు నీమీదికి వచ్చి నిన్ను చుట్టుకొందురు, వారు తమ మర్యాదచొప్పున నిన్ను శిక్షించునట్లు నేను నిన్నుగూర్చిన తీర్పు వారికప్పగింతును.౹

25 ఉగ్రతతో వారు నిన్ను శిక్షించునట్లు నా రోషము నీకు చూపుదును, నీ చెవులను నీ ముక్కును వారు తెగగోయుదురు, నీలో శేషించినవారు ఖడ్గముచేత కూలుదురు, నీ కుమారులను నీ కుమార్తెలను వారు పట్టుకొందురు, నీలో శేషించినవారు అగ్నిచేత దహింపబడుదురు.౹

26 నీ బట్టలను లాగివేసి నీ సొగసైన నగలను అపహరించుదురు.౹

27 ఐగుప్తును నీవిక కోరకయు, అచ్చట నీవు చేసిన వ్యభిచారమిక మనస్సునకు తెచ్చుకొనకయు నుండునట్లు ఐగుప్తుదేశమందుండి నీవు చేసిన వ్యభిచారమును దుష్కార్యమును నీలో నుండకుండ ఈలాగున మాన్పించెదను.౹

28 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–నీవు ద్వేషించినవారికిని నీ మనస్సు ఎడమైన వారికిని నిన్ను అప్పగించుచున్నాను.౹

29 ద్వేషముచేత వారు నిన్ను బాధింతురు, నీ కష్టార్జితమంతయు పట్టుకొని నిన్ను వస్త్రహీనముగాను దిగంబరిగాను విడుతురు; అప్పుడు నీ వేశ్యాత్వమును నీ దుష్కార్యములును నీ జారత్వమును వెల్లడియగును.౹

30 నీవు అన్యజనులతో చేసిన వ్యభిచారమునుబట్టియు నీవు వారి విగ్రహములను పూజించి అపవిత్రపరచుకొనుటనుబట్టియు నీకు ఇవి సంభవించును; నీ అక్క ప్రవర్తించినట్టు నీవును ప్రవర్తించితివి గనుక అది పానము చేసిన పాత్రను నీ చేతికిచ్చెదను.౹

31-32 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–నీ అక్క పానము చేసిన, లోతును వెడల్పునుగల పాత్రలోనిది నీవును పానము చేయవలెను. అందులో పానము చేయ వలసినది చాలయున్నది గనుక ఎగతాళియు అపహాస్యమును నీకు తటస్థించెను.౹

33 నీ అక్కయైన షోమ్రోను పాత్ర వినాశోపద్రవములతో నిండినది, నీవు దానిలో నిది త్రాగి మత్తురాలవై దుఃఖముతో నింపబడుదువు.౹

34 అడుగుమట్టునకు దాని పానముచేసి పాత్రను చెక్కలు చేసి వాటితో నీ స్తనములను పెరుకుకొందువు; నేనే మాటయిచ్చియున్నాను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.౹

35 ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–నీవు నన్ను మరచి వెనుకకు త్రోసివేసితివి గనుక నీ దుష్కార్యములకును వ్యభిచారమునకును రావలసిన శిక్షను నీవు భరించెదవు.

36 మరియు యెహోవా నాకీలాగు సెలవిచ్చెను–నర పుత్రుడా, ఒహొలాకును ఒహొలీబాకును నీవు తీర్పు తీర్చుదువా? అట్లయితే వారి హేయకృత్యములను వారికి తెలియజేయుము.౹

37 వారు వ్యభిచారిణులును నరహత్య చేయువారునై విగ్రహములతో వ్యభిచరించి, నాకు కనిన కుమారులను విగ్రహములు మ్రింగునట్లు వారిని వాటికి ప్రతిష్ఠించిరి.౹

38 వారీలాగున నాయెడల జరిగించుచున్నారు; అదియుగాక ఆ దినమందే, వారు నా పరిశుద్ధస్థలమును అపవిత్రపరచిన దినమందే, నేను నియమించిన విశ్రాంతిదినములను సామాన్యదినములుగా ఎంచిరి.౹

39 తాము పెట్టుకొనిన విగ్రహములపేరట తమ పిల్లలను చంపిననాడే వారు నా పరిశుద్ధస్థలములో చొచ్చి దాని నపవిత్రపరచి, నామందిరములోనే వారీలాగున చేసిరి.౹

40 మరియు దూరముననున్నవారిని పిలిపించుకొనుటకై వారు దూతను పంపిరి; వారు రాగా వారికొరకు నీవు స్నానముచేసి కన్నులకు కాటుకపెట్టుకొని ఆభరణములు ధరించుకొని

41 ఘనమైన మంచముమీద కూర్చుండి బల్లను సిద్ధపరచి దానిమీద నా పరిమళ ద్రవ్యమును తైలమును పెట్టితివి.౹

42 ఆలాగున జరుగగా, అచ్చట ఆమెతో ఉండిన వేడుకగాండ్ర సమూహముయొక్క సందడి వినబడెను. సమూహమునకు చేరిన త్రాగుబోతులు వారియొద్దకు ఎడారి మార్గమునుండి వచ్చిరి, వారు ఈ వేశ్యల చేతులకు కడియములు తొడిగి వారి తలలకు పూదండలు చుట్టిరి.౹

43 వ్యభిచారము చేయుటచేత బలహీనురాలైన దీనితో నేనీలాగంటిని–అది మరెన్నటికిని వ్యభిచారముచేయక మానదు.౹

44 వేశ్యతో సాంగత్యముచేయునట్లువారు దానితో సాంగత్యము చేయుదురు, ఆలాగుననే వారు కాముకురాండ్రయిన ఒహొలాతోను ఒహొలీబాతోను సాంగత్యము చేయుచువచ్చిరి.౹

45 అయితే వ్యభిచారిణులకును నరహంతకురాండ్రకును రావలసిన శిక్ష నీతిపరులైనవారు వీరికి తగినట్టుగా విధింతురు; వారు వ్యభిచారిణులే, నరహత్యచేయ యత్నించుదురు.౹

46 ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–వారిమీదికి నేను సైన్యమును రప్పింతును, శత్రువులు వారిని బాధించుటకై దోపుడు సొమ్ముగా వారిని అప్పగింతును.౹

47 ఆ సైనికులు రాళ్లు రువ్వి వారిని చంపుదురు, ఖడ్గముచేత హతము చేయుదురు, వారి కుమారులను కుమార్తెలను చంపుదురు, వారి యిండ్లను అగ్నిచేత కాల్చివేయుదురు.౹

48 స్త్రీలందరు మీ కామాతురతచొప్పున చేయకూడదని నేర్చుకొనునట్లు మీ కామాతురతను దేశములో నుండకుండ మాన్పించుదును.౹

49 నేనే యెహోవానని మీరు తెలిసికొనునట్లు మీ కామాతురతకు శిక్ష విధింపబడును, విగ్రహములను పూజించిన పాపమును మీరు భరించుదురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZK/23-144711f14cf62cd1b4a01f55b3c31b17.mp3?version_id=1787—

Categories
యెహెజ్కేలు

యెహెజ్కేలు 24

1 తొమ్మిదియవ సంవత్సరము పదియవ నెల పదియవదినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

2 –నరపుత్రుడా, ఈదినము పేరు వ్రాసి యుంచుము, నేటిదినము పేరు వ్రాసి యుంచుము, ఈ దినము బబులోను రాజు యెరూషలేము మీదికి వచ్చుచున్నాడు.౹

3 మరియు తిరుగుబాటుచేయు ఈ జనులనుగూర్చి యుపమానరీతిగా ఇట్లు ప్రకటింపుము–ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–కుండను తెచ్చి దానిలో నీళ్లు పోసి దానిని పొయ్యిమీద పెట్టుము.౹

4 తొడజబ్బ మొదలగు మంచి మంచి ముక్కలన్నియు చేర్చి అందులో వేసి, మంచి యెముకలను ఏరి దాని నింపుము.౹

5 మందలో శ్రేష్ఠమైనవాటిని తీసికొనుము, అందున్న యెముకలు ఉడుకునట్లు చాల కట్టెలు పోగుచేయుము, దానిని బాగుగా పొంగించుము, ఎముకలను చాలునంతగా ఉడికించుము.

6 కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–నరహంతకులున్న పట్టణమునకు శ్రమ; మడ్డిగలకుండా, మానకుండ మడ్డిగలిగియుండుకుండా, నీకు శ్రమ; చీటి దాని వంతున పడలేదు, వండినదానిని ముక్కవెంబడి ముక్కగా దానిలోనుండి తీసికొని రమ్ము.౹

7 దానిచేత చిందింపబడిన రక్తము దానిలో కనబడుచున్నది, మట్టితో దాని కప్పివేయునట్లు దానిని నేలమీద కుమ్మరింపక వట్టి బండమీద దానిని చిందించెను.౹

8 కావున నా క్రోధము రానిచ్చి, నేను ప్రతికారము చేయునట్లు అది చిందించిన రక్తము కప్పబడకుండ దానిని వట్టిబండమీద నేనుండ నిచ్చితిని.౹

9 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా –నరహంతకులున్న పట్టణమునకు శ్రమ, నేనును విస్తరించి కట్టెలు పేర్చబోవుచున్నాను.౹

10 చాల కట్టెలు పేర్చుము, అగ్ని రాజబెట్టుము, మాంసమును బాగుగా ఉడకబెట్టుము. ఏమియు ఉండకుండ ఎముకలు పూర్తిగా ఉడుకునట్లు చారు చిక్కగా దింపుము.౹

11 తరువాత దానికి తగిలిన మష్టును మడ్డియు పోవునట్లు అది వేడియై మెరుగు పట్టువరకు వట్టిచట్టి పొయ్యిమీదనే యుంచుము.౹

12 అలసట పుట్టువరకు ఇంతగా శ్రద్ధపుచ్చుకొనినను దాని విస్తారమైన మష్టు పోదాయెను, మష్టుతోకూడ దానిని అగ్నిలో వేయుము,౹

13 నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే; నిన్ను శుభ్ర పరచుటకు నేను పూనుకొనినను నీవు శుభ్రపడకపోతివి, నా క్రోధమును నీమీద తీర్చుకొనువరకు నీవు శుభ్ర పడకయుందువు.౹

14 యెహోవానైన నేను మాటయిచ్చియున్నాను, అది జరుగును, నేనే నెరవేర్చెదను నేను వెనుకతీయను, కనికరింపను, సంతాపపడను, నీ ప్రవర్తననుబట్టియు నీ క్రియలనుబట్టియు నీకు శిక్ష విధింపబడును, ఇదే యెహోవా వాక్కు.

15 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

16 –నరపుత్రుడా, నీ కన్నుల కింపైన దానిని నీ యొద్దనుండి ఒక్కదెబ్బతో తీసివేయ బోవుచున్నాను, నీవు అంగలార్చవద్దు ఏడువవద్దు కన్నీరు విడువవద్దు.౹

17 మృతులకై విలాపముచేయక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడువుము, నీ శిరోభూషణములు ధరించుకొని పాదరక్షలు తొడుగుకొనవలెను, నీ పెదవులు మూసికొన వద్దు జనుల ఆహారము భుజింపవద్దు

18 ఉదయమందు జనులకు నేను ప్రకటించితిని, సాయంతనమున నా భార్య చనిపోగా ఆయన నా కాజ్ఞాపించినట్లు మరునాటి ఉదయమున నేను చేసితిని.౹

19 –నీవు చేసినవాటివలన మేము తెలిసికొనవలసిన సంగతి నీవు మాతో చెప్పవా అని జనులు నన్నడుగగా

20 నేను వారితో ఇట్లంటిని– యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.౹

21 –ఇశ్రాయేలీయులకు నీవీలాగున ప్రకటిం పుము–ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా– మీకు అతిశయాస్పదముగాను, మీ కన్నులకు ముచ్చటగాను, మీ మనస్సునకు ఇష్టముగాను ఉన్న నా పరిశుద్ధ స్థలమును నేను చెరపబోవుచున్నాను, మీరు వెనుక విడిచిన మీ కుమారులును కుమార్తెలును అక్కడనే ఖడ్గముచేత కూలుదురు.౹

22 అప్పుడు నేను చేసినట్లు మీరును చేయుదురు, మీ పెదవులు మూసికొనకయుందురు, జనుల ఆహారమును మీరు భుజింపకయుందురు.౹

23 మీ శిరో భూషణములను తలలమీదనుండి తీయకయు, మీ పాద రక్షలను పాదములనుండి తీయకయు, అంగలార్చకయు, ఏడ్వకయు నుందురు, ఒకని నొకరుచూచి నిట్టూర్పులు విడుచుచు మీరు చేసిన దోషములనుబట్టి మీరు క్షీణించి పోవుదురు.౹

24 యెహెజ్కేలు మీకు సూచనగా ఉండును, అతడు చేసినదంతటి ప్రకారము మీరును చేయుదురు, ఇది సంభవించునప్పుడు నేను ప్రభువైన యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు.

25 నరపుత్రుడా, వారి ఆశ్రయమును అతిశయాస్పదమును వారికి కన్నుల కింపైనదానిని వారు ఇచ్ఛయించు దానిని, వారి కుమారులను కుమార్తెలను నేను తీసివేయు దినమునందు నీకు సమాచారము తెలియజేయుటకై తప్పించుకొని వచ్చిన యొకడు నీయొద్దకు వచ్చును.౹

26-27 ఆ దినముననే నీవికను మౌనముగా ఉండక, తప్పించుకొని వచ్చిన వానితో స్పష్టముగా మాటలాడుదువు; నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొనునట్లు నీవు ఈ రీతిని వారికి సూచనగా ఉందువు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZK/24-493d99832e45231f6993370ee9430dde.mp3?version_id=1787—

Categories
యెహెజ్కేలు

యెహెజ్కేలు 25

1 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

2 –నరపుత్రుడా, అమ్మోనీయులతట్టు ముఖము త్రిప్పుకొని వారినిగూర్చి యీ మాట ప్రవచింపుము.౹

3 –అమ్మోనీయులారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–నా పరిశుద్ధస్థలము అపవిత్రపరచబడినప్పుడు, ఇశ్రాయేలీయుల దేశము పాడుచేయబడిన కాలమున యూదావారు చెరలోనికి పోయినప్పుడు, మీరు సంతోషమని చెప్పుకొనుచు వచ్చితిరి గనుక

4 నేను మిమ్మును తూర్పుననుండు మనుష్యులకు స్వాస్థ్యముగా అప్పగించెదను, వారు తమ డేరాలను మీ దేశములోవేసి మీ మధ్య కాపురముందురు, వారు మీ పంటలు తిందురు మీ పాలు త్రాగుదురు.౹

5 నేను రబ్బా పట్టణమును ఒంటెల సాలగా చేసెదను, అమ్మోనీయుల దేశమును గొఱ్ఱెల దొడ్డిగా చేసెదను, అప్పుడు నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు.౹

6 మరియు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా– మీరు చేతులు చరచుకొని కాళ్లతో నేలతన్ని ఇశ్రాయేలీయుల శ్రమను చూచి మీ మనస్సులోని తిరస్కారము కొలది ఉల్లసించితిరి గనుక నేను యెహోవానై యున్నానని మీరు తెలిసికొనునట్లు

7 నేను మీకు విరోధినై, మిమ్మును జనములకు దోపుడుసొమ్ముగా అప్పగింతును, అన్యజనులలో ఉండకుండ మిమ్మును నిర్మూలము చేతును, జనము కాకుండ మిమ్మును నశింపజేతును సమూలధ్వంసము చేతును.

8 మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–ఇతర జనములన్నిటికిని యూదావారికిని భేద మేమి యని మోయాబీయులును శేయీరు పట్టణపు వారును అందురు గనుక

9 తూర్పుననున్న వారిని రప్పించి, దేశమునకు భూషణముగానున్న పొలిమేర పురములగు బేత్యేషీమోతును బయల్మెయోనును కిర్యతాయిమును మోయాబీయుల సరిహద్దులోగానున్న పట్టణములన్నిటిని, అమ్మోనీయులనందరిని వారికి స్వాస్థ్యముగా అప్పగింతును;౹

10 జనములలో అమ్మోనీయులు ఇకను జ్ఞాపకమునకు రారు.౹

11 నేను యెహోవానై యున్నానని మోయాబీయులు తెలిసి కొనునట్లు నేనీలాగున వారికి శిక్ష విధింతును.

12 మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–ఎదోమీయులు యూదావారిమీద పగతీర్చు కొనుచున్నారు, తీర్చుకొనుటలో వారు బహుగా దోషులైరి గనుక ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా

13 –ఎదోముమీద నా చెయ్యిచాపి, మనుష్యులేమి పశువు లేమి దానిలో నుండకుండ నేను సమస్తమును నిర్మూలము చేయుదును, తేమాను పట్టణము మొదలుకొని నేను దాని పాడు చేయుదును, దదానువరకు జనులందరును ఖడ్గముచేత కూలుదురు.౹

14 నా జనులైన ఇశ్రాయేలీయులచేత ఎదోము వారిమీద నా పగ తీర్చుకొందును, ఎదోమీయుల విషయమై నాకోపమునుబట్టియు నా రౌద్రమునుబట్టియు నేను ఆలోచించినదానిని వారు నెరవేర్చుదురు, ఎదో మీయులు నా క్రోధము తెలిసికొందురు; ఇదే యెహోవా వాక్కు.

15 మరియు ప్రభువగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–ఫిలిష్తీయులు పగతీర్చుకొనుచు నాశముచేయుచు, మానని క్రోధముగలవారై తిరస్కారము చేయుచు పగతీర్చుకొనుచున్నారు గనుక

16 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–ఫిలిష్తీయులమీద నేను చెయ్యి చాపి కెరేతీయులను నిర్మూలముచేసెదను. సముద్ర తీరమున నివసించు శేషమును నశింపజేసెదను.౹

17 క్రోధముతో వారిని శిక్షించి వారిమీద నా పగ పూర్తిగా తీర్చుకొందును; నేను వారి మీద నా పగ తీర్చుకొనగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZK/25-32d68ca724e0e0df7d5f20b5696a01cb.mp3?version_id=1787—

Categories
యెహెజ్కేలు

యెహెజ్కేలు 26

1 మరియు పదకొండవ సంవత్సరము నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

2 –నరపుత్రుడా, యెరూషలేమునుగూర్చి–ఆహా జనములకు ద్వారముగానున్న పట్టణము పడగొట్టబడెను, అది నావశమాయెను, అది పాడైపోయినందున నేను పరిపూర్ణము నొందితిని అని తూరు చెప్పెను గనుక

3 ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా–తూరుపట్టణమా, నేను నీకు విరోధినైతిని, సముద్రము దాని తరంగములను పొంగజేయు రీతిగా నేను అనేకజనములను నీ మీదికి రప్పించెదను.౹

4 వారు వచ్చి తూరుయొక్క ప్రాకారములను కూల్చి దాని కోటలను పడగొట్టుదురు, నేను దానిమీదనున్న మంటిని తుడిచి వేయుదును, దానిని వట్టిబండగా చేసెదను.౹

5 సముద్రము దాని నావరించును, అది వలలు పరచుటకు చోటగును, నేనే మాట యిచ్చితిని, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు అది జనములకు దోపుడుసొమ్మగును.౹

6 బయటి పొలములోనున్న దాని కుమార్తెలు కత్తిపాలగుదురు, అప్పుడు నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.౹

7 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–రారాజగు బబులోను రాజైన నెబుకద్రెజరును నేను తూరుపట్టణము మీదికి రప్పించుచున్నాను, అతడు గుఱ్ఱములతోను రథములతోను రౌతులతోను గుంపులు గుంపులుగానున్న సైన్యముతోను ఉత్తరదిక్కునుండివచ్చి

8 బయటిపొలము లోని నీ కుమార్తెలను ఖడ్గముతో చంపి, నీ కెదురుగా బురుజులు కట్టించి దిబ్బవేయించి నీ కెదురుగా డాలు నెత్తును.౹

9 మరియు అతడు నీ ప్రాకారములను పడ గొట్టుటకై యంత్రములు సంధించి గొడ్డండ్రతో నీ కోటలను పడగొట్టును.౹

10 అతనికి గుఱ్ఱములు బహు విస్తారముగా ఉన్నవి, అవి ధూళి యెగరగొట్టగా అది నిన్ను కమ్మును, బీటసందులుగల పట్టణములోనికి సైనికులు చొరబడినట్లు అతడు నీ కోటలలో ప్రవేశించునప్పుడు రౌతులయొక్కయు చక్రములయొక్కయు రథములయొక్కయు ధ్వనిచేత నీ ప్రాకారములు కంపించును.౹

11 అతడు తన గుఱ్ఱముల డెక్కలచేత నీ వీధులన్నియు అణగద్రొక్కించును, నీ జనులను ఖడ్గముతో హతము చేయును, నీ ప్రభావమునకు చిహ్నములైన స్తంభములు నేలను కూలును.౹

12 వారు నీ ఐశ్వర్యమును దోచుకొందురు, నీ వర్తకమును అపహ రింతురు, నీ ప్రాకారములను పడగొట్టుదురు, నీ విలాస మందిరములను పాడుచేయుదురు, నీ రాళ్లను నీ కలపను నీ మంటిని నీళ్లలో ముంచివేయుదురు.౹

13 ఇట్లు నేను నీ సంగీతనాదమును మాన్పించెదను, నీ సితారానాద మికను వినబడదు,౹

14 నిన్ను వట్టిబండగా చేయుదును, వలలు పరచుకొనుటకు చోటగుదువు నీవికను కట్టబడక యుందువు. నేనే మాట యిచ్చియున్నాను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

15 తూరునుగూర్చి ప్రభువగు యెహోవా సెలవిచ్చు నదేమనగా–నీవు కూలునప్పుడు కలుగు ధ్వనియు, హతు లగుచున్నవారి కేకలును, నీలో జరుగు గొప్పవధయు ద్వీపములు విని కంపించును.౹

16 సముద్రపు అధిపతులందరును తమ సింహాసనములమీదనుండి దిగి, తమ చొక్కాయిలను విచిత్రమైన వస్త్రములను తీసివేసి, దిగులుపడిన వారై నేలను కూర్చుండి గడగడ వణకుచు నిన్ను చూచి విస్మయపడుదురు.౹

17 వారు నిన్నుగూర్చి అంగలార్పు వచన మెత్తి ఈలాగున అందురు–సముద్ర నివాసమైనదానా, ఖ్యాతినొందిన పట్ణణమా, నీవెట్లు నాశనమైతివి? సముద్ర ప్రయాణము చేయుటవలన దానికిని దాని నివాసులకును బలము కలిగెను, సముద్రవాసులందరిని భీతిల్లచేసినది ఇదే.౹

18 ఇప్పుడు నీవు కూలినందున ద్వీపములు కంపించుచున్నవి, నీవు వెళ్లిపోవుట చూచి సముద్రద్వీపములు కదలుచున్నవి.౹

19 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–నివాసులులేని పట్టణములవలెనే నేను నిన్ను పాడుచేయునప్పుడు మహా సముద్రము నిన్ను ముంచునట్లుగా నీ మీదికి నేను అగాధజలములను రప్పించెదను, పురాతన కాలమందు పాతాళములోనికి దిగిపోయినవారియొద్ద నీ వుండునట్లు నేను నిన్ను పడవేసి, నీవు జనములేని దానవగుటకై పురాతనకాలములో పాడైన జనులయొద్ద భూమి క్రిందనున్న స్థలములలో నీకు నివాసము నిర్ణయింతును, పాతాళములోనికి దిగి పోవువారితోకూడ నిన్ను నివసింప జేసెదను.౹

20 మరియు సజీవులు నివసించు భూమిమీద నేను మహాఘనకార్యము కలుగజేతును;౹

21 నిన్ను భీతికి కారణముగా జేతును, నీవు లేకపోవుదువు, ఎంత వెదకినను నీవెన్నటికిని కనబడక యుందువు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZK/26-3603e9c02e2c750ac642c3e6c93f448a.mp3?version_id=1787—

Categories
యెహెజ్కేలు

యెహెజ్కేలు 27

1 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.౹

2 –నరపుత్రుడా, తూరు పట్టణముగూర్చి అంగలార్పు వచనమెత్తి దానికీలాగు ప్రకటన చేయుము

3 –సముద్రపురేవులమీద నివసించుదానా, అనేక ద్వీపములకు ప్రయాణముచేయు వర్తకజనమా, ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా – తూరు పట్టణమా–నేను సంపూర్ణ సౌందర్యము కలదాననని నీవను కొనుచున్నావే;౹

4 నీ సరిహద్దులు సముద్రములమధ్య ఏర్పడెను, నీ శిల్పకారులు నిన్ను సంపూర్ణ సౌందర్యముగలదానిగా చేసియున్నారు.౹

5 నీ ఓడలను శెనీరుదేశపు సరళవృక్షపు మ్రానుతో కట్టుదురు, లెబానోను దేవదారు మ్రాను తెప్పించి నీ ఓడకొయ్యలు చేయుదురు.౹

6 బాషానుయొక్క సింధూరమ్రానుచేత నీ కోలలుచేయుదురు, కిత్తీయుల ద్వీపములనుండి వచ్చిన గుంజుమ్రానునకు దంతపు చెక్కడపుపని పొదిగి నీకు పీటలు చేయుదురు.౹

7 నీకు జెండాగా ఉండుటకై నీ తెరచాపలు ఐగుప్తునుండి వచ్చిన విచిత్రపు పనిగల అవిసె నారబట్టతో చేయబడును; ఎలీషాద్వీపములనుండి వచ్చిన నీలధూమ్ర వర్ణములుగల బట్ట నీవు చాందినిగా కప్పుకొందువు

8 తూరుపట్ట ణమా, సీదోను నివాసులును అర్వదు నివాసులును నీకు ఓడకళాసులుగా ఉన్నారు, నీ స్వజనులకు చేరిన ప్రజ్ఞా వంతులు నీకు ఓడ నాయకులుగా ఉన్నారు.౹

9 గెబలు పనివారిలో పనితెలిసిన పెద్దలు నీ ఓడలను బాగుచేయు వారుగా నున్నారు, సముద్రమందు నీ సరకులు కొనుటకై సముద్రప్రయాణముచేయు నావికుల యోడలన్నియు నీ రేవులలో ఉన్నవి.౹

10 పారసీకదేశపువారును లూదు వారును పూతువారును నీ సైన్యములలోచేరి నీకు సిపా యిలుగా ఉన్నారు, వారు నీ డాళ్లను శిరస్త్రాణములను ధరించువారు, వారిచేత నీకు తేజస్సు కలిగెను.౹

11 అర్వదువారు నీ సైన్యములోచేరి చుట్టు నీ ప్రాకారములకు డాళ్లు తగిలించి చుట్టు నీ ప్రాకారములమీద కావలి కాచి నీ సౌందర్యమును సంపూర్ణ పరచెదరు.౹

12 నానా విధమైన సరకులు నీలో విస్తారముగా నున్నందున తర్షీషు వారు నీతో వర్తకముచేయుచు, వెండియు ఇనుమును తగరమును సీసమును ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు.౹

13 గ్రేకేయులును తుబాలువారును మెషెకువారును నీలో వర్తకవ్యాపారముచేయుచు, నరులను ఇత్తడి వస్తువులను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు,౹

14 తోగర్మావారు గుఱ్ఱములను యుద్ధాశ్వములను కంచరగాడిదలను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు;౹

15 దదానువారును నీతో వర్తక వ్యాపారము చేయుదురు, చాల ద్వీపముల వర్తకములు నీ వశమున నున్నవి; వర్తకులు దంతమును కోవిదారు మ్రానును ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు.౹

16 నీచేత చేయబడిన వివిధ వస్తువులను కొనుక్కొనుటకై సిరియనులు నీతో వర్తకవ్యాపారము చేయుదురు, వారు పచ్చరాళ్లను ఊదారంగు నూలుతో కుట్టబడిన చీరలను అవిసెనార బట్టలను పగడములను రత్నములను ఇచ్చి నీ సరకులు కొను క్కొందురు.౹

17 మరియు యూదావారును ఇశ్రాయేలు దేశస్థులును నీలో వర్తక వ్యాపారముచేయుచు, మిన్నీతు గోధుమలును మిఠాయిలును తేనెయు తైలమును గుగ్గిలమును ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు.౹

18 దమస్కు వారు హెల్బోను ద్రాక్షారసమును తెల్లబొచ్చును ఇచ్చి విస్తారమైన నీ సరకులును దినుసులును కొనుక్కొందురు.౹

19 దదానువారును గ్రేకేయులును నూలు ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు. ఇనుపపనిముట్టును కత్సీయా కెనయా అను సుగంధద్రవ్యములును నీ సరకులకు బదులియ్యబడును.౹

20 దదాను వారు విచిత్రమైన పనిగల చౌకపు తుండ్లు తీసికొని అమ్ముదురు.౹

21 అరబీయులును కేదారు అధిపతులందరును నీతో వర్తకము చేయుదురు, వారు గొఱ్ఱెపిల్లలను పొట్టే ళ్లను మేకలను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు, వీటి నిచ్చి వారు నీతో వర్తకము చేయుదురు.౹

22 షేబ వర్తకులును రామా వర్తకులును నీతో వర్తకము చేయుదురు. వారు అతి ప్రశస్తమైన గంధవర్గములను విలువగల నానా విధమైన రత్నములను బంగారమును ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు.౹

23 హారానువారును కన్నేవారును ఏదెను వారును షేబ వర్తకులును అష్షూరు వర్తకులును కిల్మదు వర్తకులును నీతో వర్తకము చేయుదురు.౹

24 వీరు నీలో వర్తకులై సొగసైన వస్త్రములను ధూమ్రవర్ణముగలవియు కుట్టుపెనితో చేయబడినవియునగు బట్టలను విలువగల నూలును బాగుగా చేయబడిన గట్టి త్రాళ్లను ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు.౹

25 తర్షీషు ఓడలు నీకు బండ్లుగా ఉన్నవి. నీవు పరిపూర్ణమైనదానవై మహాఘనముగా సముద్రముమీద కూర్చున్నావు.౹

26 నీ కోలలు వేయు వారు మహాసముద్రములోనికి నిన్ను త్రోయగా తూర్పు గాలి సముద్రమధ్యమందు నిన్ను బద్దలుచేయును.౹

27 అప్పుడు నీ ధనమును నీ సరకులును నీవు బదులిచ్చు వస్తువులును నీ నావికులును నీ ఓడనాయకులును నీ ఓడలు బాగుచేయువారును నీతో వర్తకము చేయువారును నీలోనున్న సిపాయిలందరును నీలోనున్న జనసమూహములన్నియు నీవు కూలు దినమందే సముద్రమధ్యమందు కూలుదురు.౹

28 నీ ఓడనాయకులు వేసిన కేకలవలన నీ ఉపగ్రామములు కంపించును;౹

29 కోలలు పట్టుకొను వారందరును నావికులును ఓడనాయకులును తమ ఓడలమీదనుండి దిగి తీరమున నిలిచి

30 నిన్నుగూర్చి మహా శోకమెత్తి ప్రలాపించుచు, తమ తలలమీద బుగ్గి పోసికొనుచు, బూడిదెలో పొర్లుచు

31 నీకొరకు తలలు బోడి చేసికొని మొలలకు గోనెలు కట్టుకొని మనశ్చింతగలవారై నిన్నుగూర్చి బహుగా అంగలార్చుదురు.౹

32 వారు నిన్నుగూర్చి ప్రలాపవచనమెత్తి–తూరు పట్టణమా, నీతో సాటియైన పట్టణమేది? సముద్రములో మునిగి లయమై పోయిన పట్టణమా, నీకు సమమైన పట్టణమేది?

33 సముద్రముమీద వచ్చిన నీ సరకులను పంపించి చాల జనములను తృప్తిపరచితివి, విస్తారమైన నీ పదార్థములచేతను నీ వర్తకముచేతను భూపతులను ఐశ్వర్యవంతులుగా చేసితివి.౹

34 ఇప్పుడు అగాధజలములలో మునిగి సముద్రబలముచేత బద్దలైతివే, నీ వర్తకమును నీ యావత్సమూహమును నీతోకూడ కూలెనే యని చెప్పుకొనుచు బహుగా ఏడ్చుదురు.౹

35 నిన్నుబట్టి ద్వీపనివాసులందరు విభ్రాంతి నొందుదురు, వారి రాజులు వణకుదురు, వారి ముఖములు చిన్నబోవును.౹

36 జనులలోని వర్తకులు నిన్ను అపహసించుదురు భీతికి హేతువగుదువు, నీవు బొత్తిగా నాశనమగుదువు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZK/27-79d2eb526312bba21491b84722fa4346.mp3?version_id=1787—

Categories
యెహెజ్కేలు

యెహెజ్కేలు 28

1 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.౹

2 –నరపుత్రుడా, తూరు అధిపతితో ఈలాగు ప్రకటింపుము–ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా–గర్విష్ఠుడవై–నే నొక దేవతను, దేవతనైనట్టు సముద్రముమధ్యను నేను ఆసీనుడనై యున్నాను అని నీవనుకొనుచున్నావు; నీవు దేవుడవు కాక మానవుడవై యుండియు దేవునికి తగినంత అభి ప్రాయము కలిగియున్నావు, నీవు దానియేలునకంటె జ్ఞానవంతుడవు,౹

3 నీకు మర్మమైనదేదియు లేదు.౹

4 నీ జ్ఞానముచేతను నీ వివేకముచేతను ఐశ్వర్యమునొందితివి, నీ ధనాగారములలోనికి వెండి బంగారములను తెచ్చుకొంటివి.౹

5 నీకు కలిగిన జ్ఞానాతిశయముచేతను వర్తకముచేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకొంటివి, నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించినవాడవైతివి.౹

6 కాగా ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–దేవునికి తగినంత అభిప్రాయము కలిగియున్నవాడా, ఆలకించుము;౹

7 నేను పరదేశులను అన్యజనులలో క్రూరులను నీ మీదికి రప్పించుచున్నాను, వారు నీ జ్ఞాన శోభను చెరుపుటకై తమ ఖడ్గములను ఒరదీసి నీ సౌందర్యమును నీచపరతురు,౹

8 నిన్ను పాతాళములో పడవేతురు, సముద్రములో మునిగి చచ్చినవారివలెనే నీవు చత్తువు.౹

9 –నేను దేవుడనని నిన్ను చంపువానియెదుట నీవు చెప్పుదువా? నిన్ను చంపువానిచేతిలో నీవు మానవుడవే కాని దేవుడవు కావు గదా.౹

10 సున్నతిలేని వారు చంపబడు రీతిగా నీవు పరదేశులచేత చత్తువు, నేనే మాట యిచ్చియున్నాను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.

11 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

12 –నరపుత్రుడా, తూరు రాజునుగూర్చి అంగలార్పువచనమెత్తి ఈలాగు ప్రకటింపుము– ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–పూర్ణజ్ఞానమును సంపూర్ణసౌందర్యమునుగల కట్టడమునకు మాదిరివి

13 దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి, మాణిక్యము గోమేధికము సూర్యకాంతమణి రక్తవర్ణపురాయి సులిమాని రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్యరత్నములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి యున్నావు; నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి.౹

14 అభిషేకము నొందిన కెరూబువై యొక ఆశ్రయముగా నీవుంటివి; అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతముమీద నీవుంటివి, కాలుచున్న రాళ్లమధ్యను నీవు సంచరించుచుంటివి.౹

15 నీవు నియమింప బడిన దినము మొదలుకొని పాపము నీయందు కనబడువరకు ప్రవర్తనవిషయములో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి.౹

16 అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకముచేత లోలోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతముమీద నీవుండకుండ నేను నిన్ను అపవిత్రపరచితిని ఆశ్రయముగా ఉన్న కెరూబూ, కాలుచున్న రాళ్లమధ్యను నీవికను సంచరింపవు, నిన్ను నాశనము చేసితిని.౹

17 నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించినవాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి, కావున నేను నిన్ను నేలను పడవేసెదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకప్పగించెదను.౹

18 నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగజేసికొనిన విస్తార దోషములచేత నీవు నీ పరిశుద్ధస్థలములను చెరుపుకొంటివి గనుక నీలోనుండి నేను అగ్ని పుట్టించెదను, అది నిన్ను కాల్చివేయును, జనులందరు చూచుచుండగా దేశముమీద నిన్ను బూడిదెగా చేసెదను.౹

19 జనులలో నిన్ను ఎరిగిన వారందరును నిన్నుగూర్చి ఆశ్చర్యపడుదురు. నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉందువు.

20 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

21 –నరపుత్రుడా, నీ ముఖమును సీదోను పట్టణమువైపు త్రిప్పుకొని దానిగూర్చి యీ సమాచారము ప్రవచింపుము – ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా

22 –సీదోను పట్టణమా, నేను నీకు విరోధిని, నీమధ్యను ఘనత నొందుదును, నేను దాని మధ్య తీర్పుతీర్చుచు దానినిబట్టి నన్ను పరిశుద్ధపరచు కొనగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసి కొందురు.౹

23 నేను యెహోవానని వారు తెలిసికొనునట్లు తెగులును రక్తమును దాని వీధులలోనికి పంపించుదును, నలుదిక్కుల దానిమీదికి వచ్చు ఖడ్గముచేత వారు హతు లగుదురు, నేను ప్రభువగు యెహోవానని

24 ఇశ్రాయేలీయులు తెలిసికొనునట్లు వారి చుట్టునుండి వారిని తిరస్క రించుచు వచ్చిన వారిలో ఎవరును ఇక వారికి గుచ్చుకొను ముండ్లుగానైనను నొప్పించు కంపగానైనను ఉండరు.

25 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–జనులలో చెదిరిపోయిన ఇశ్రాయేలీయులను నేను సమకూర్చి, జనుల సమక్షమున వారిమధ్యను నన్ను నేను పరిశుద్ధపరచు కొందును, అప్పుడు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన తమ దేశములో వారు నివసించెదరు.౹

26 వారు అందులో నిర్భయముగా నివసించి యిండ్లు కట్టుకొని ద్రాక్షతోటలు నాటుకొందురు, వారి చుట్టు ఉండి వారిని తిరస్కరించుచు వచ్చినవారికందరికి నేను శిక్షవిధించిన తరువాత వారు నిర్భయముగా నివసించుకాలమున నేను తమ దేవుడైన యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZK/28-3c3f9727e3ac863e19cfac6f627da25a.mp3?version_id=1787—