Categories
నిర్గమకాండము

నిర్గమకాండము 21

1 నీవు వారికి నియమింపవలసిన న్యాయవిధులేవనగా

2 –నీవు హెబ్రీయుడైన దాసుని కొనినయెడలవాడు ఆరుసంవత్సరములు దాసుడై యుండి యేడవ సంవత్సరమున ఏమియు ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును.౹

3 వాడు ఒంటిగా వచ్చినయెడల ఒంటిగానే వెళ్లవచ్చును. వానికి భార్య యుండినయెడల వాని భార్య వానితోకూడ వెళ్లవచ్చును.౹

4 వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తరువాత ఆమె వానివలన కుమారులనైనను కుమార్తెలనైనను కనినయెడల ఆ భార్యయు ఆమె పిల్లలును ఆమె యజమానుని సొత్తగుదురుకానివాడు ఒంటిగానే పోవలెను.౹

5 అయితే ఆ దాసుడు–నేను నా యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించుచున్నాను; నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనొల్లనని నిజముగా చెప్పినయెడల

6 వాని యజమానుడు దేవునియొద్దకు వానిని తీసికొని రావలెను, మరియువాని యజమానుడు తలుపునొద్ద కైనను ద్వారబంధమునొద్దకైనను వాని తోడుకొనిపోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను. తరువాతవాడు నిరంతరము వానికి దాసుడైయుండును.

7 ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మినయెడల దాసు లైన పురుషులు వెళ్లిపోవునట్లు అది వెళ్లిపోకూడదు.౹

8 దానిని ప్రధానము చేసికొనినయజమానుని దృష్టికి అది యిష్టురాలు కానియెడల అది విడిపింపబడునట్లు అవకాశము నియ్యవలెను; దాని వంచించినందున అన్యజనులకు దానిని అమ్ముటకు వానికి అధికారములేదు.౹

9 తన కుమారునికి దాని ప్రధానము చేసినయెడల కుమార్తెల విషయమైన న్యాయవిధినిబట్టి దానియెడల జరిగింపవలెను.౹

10 ఆ కుమారుడు వేరొక దాని చేర్చుకొనినను, మొదటిదానికి ఆహారమును వస్త్రమును సంసారధర్మమును తక్కువ చేయకూడదు.౹

11 ఈ మూడును దానికి కలుగజేయని యెడల అది ఏమియు ఇయ్యక స్వతంత్రురాలై పోవచ్చును.

12 నరుని చావగొట్టినవానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను.౹

13 అయితేవాడు చంపవలెనని పొంచి యుండకయే దైవికముగా వానిచేత ఆ హత్య జరిగినయెడలవాడు పారిపోగల యొక స్థలమును నీకు నిర్ణయించెదను.

14 అయితే ఒకడు తన పొరుగువానిమీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంప లేచినయెడలవాడు నా బలిపీఠము నాశ్రయించినను వాని లాగివేసి చంపవలెను.

15 తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్షనొందును.

16 ఒకడు నరుని దొంగిలించి అమ్మినను, తనయొద్ద నుంచుకొనినను,వాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును.

17 తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును.

18 మనుష్యులు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగువానిని రాతితోనైనను పిడికిటితోనైనను గుద్దుటవలనవాడు చావక మంచముమీద పడియుండి

19 తరువాత లేచి తన చేతికఱ్ఱతో బయటికి వెళ్లి తిరుగుచుండినయెడల, వాని కొట్టిన వానికి శిక్ష విధింపబడదుగాని అతడు పనిచేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చివాడు అతనిని పూర్తిగా బాగుచేయింపవలెను.

20 ఒకడు తన దాసుడైనను తన దాసియైనను చచ్చునట్లు కఱ్ఱతో కొట్టినయెడల అతడు నిశ్చయముగా ప్రతి దండన నొందును.౹

21 అయితేవాడు ఒకటి రెండు దినములు బ్రదికినయెడల ఆ ప్రతి దండన అతడు పొందడు,వాడు అతని సొమ్మేగదా.౹

22 నరులు పోట్లాడుచుండగా గర్భవతియైన స్త్రీకి దెబ్బతగిలి ఆమెకు గర్భపాతమేగాక మరి ఏ హానియు రానియెడల హానిచేసినవాడు ఆ స్త్రీ పెనిమిటి వానిమీద మోపిన నష్టమును అచ్చుకొనవలెను. న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాని చెల్లింపవలెను.౹

23-24 హాని కలిగినయెడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పల్లు, చేతికి చెయ్యి, కాలికి కాలు,౹

25 వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను.

26 ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పోగొట్టినయెడల ఆ కంటి హానినిబట్టి వారిని స్వతంత్రు నిగా పోనియ్యవలెను.౹

27 వాడు తన దాసుని పల్లయినను తన దాసి పల్లయినను ఊడగొట్టినయెడల ఆ పంటి నిమిత్తము వారిని స్వతంత్రులగా పోనియ్యవలెను.

28 ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావపొడిచినయెడల నిశ్చయముగా రాళ్లతో ఆ యెద్దును చావకొట్టవలెను. దాని మాంసమును తినకూడదు, అయితే ఆ యెద్దు యజమానుడు నిర్దోషియగును.౹

29 ఆ యెద్దు అంతకు ముందు పొడుచునది అని దాని యజమానునికి తెలుపబడినను,వాడు దాని భద్రము చేయకుండుటవలన అది పురుషునైనను స్త్రీనైనను చంపినయెడల ఆ యెద్దును రాళ్లతో చావగొట్టవలెను; దాని యజమానుడు మరణశిక్ష నొందవలెను.౹

30 వానికి పరిక్రయధనము నియమింపబడినయెడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలెను.౹

31 అది కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచినను ఈ విధి చొప్పున అతడు చేయవలెను.౹

32 ఆ యెద్దు దాసునినైనను దాసినైనను పొడిచినయెడల వారి యజమానునికి ముప్పది తులముల వెండి చెల్లింపవలెను. మరియు ఆ యెద్దును రాళ్లతో చావకొట్టవలెను.

33 ఒకడు గోతిమీది కప్పు తీయుటవలన, లేక ఒకడు గొయ్యి త్రవ్వి దాని కప్పకపోవుటవలన, దానిలో ఎద్దయినను గాడిదయైనను పడినయెడల

34 ఆ గోతి ఖామందులు ఆ నష్టమును అచ్చుకొనవలెను; వాటి యజమానునికి సొమ్ము ఇయ్యవలెను; చచ్చినది వానిదగును.

35 ఒకని యెద్దు వేరొకని యెద్దు చచ్చునట్లు దాని పొడి చినయెడల బ్రదికియున్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకొనవలెను, చచ్చిన యెద్దును పంచుకొనవలెను.౹

36 అయితే అంతకు ముందు ఆ యెద్దు పొడుచునది అని తెలియబడియు దాని యజమానుడు దాని భద్రము చేయని వాడైతేవాడు నిశ్చయముగా ఎద్దుకు ఎద్దునియ్యవలెను; చచ్చినది వానిదగును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EXO/21-e4ddd06919c6f1301c4bcb0ab7d653af.mp3?version_id=1787—

Categories
నిర్గమకాండము

నిర్గమకాండము 22

1 ఒకడు ఎద్దునైనను గొఱ్ఱెనైనను దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ యెద్దుకు ప్రతిగా అయిదు ఎద్దులను ఆ గొఱ్ఱెకు ప్రతిగా నాలుగు గొఱ్ఱెలను ఇయ్యవలెను.౹

2 దొంగ కన్నము వేయుచుండగావాడు దొరికి చచ్చునట్లు కొట్టబడినయెడల అందువలన రక్తాపరాధ ముండదు.౹

3 సూర్యుడు ఉదయించిన తరువాత వాని కొట్టినయెడల వానికి రక్తాపరాధముండును;వాడు సరిగా సొమ్ము మరల చెల్లింపవలెను. వానికేమియు లేకపోయినయెడలవాడు దొంగతనము చేసినందున అమ్మబడవలెను.౹

4 వాడు దొంగిలినది ఎద్దయినను గాడిదయైనను గొఱ్ఱెయైనను సరే అది ప్రాణముతో వానియొద్ద దొరికినయెడల రెండం తలు చెల్లింపవలెను.

5 ఒకడు చేనునైనను ద్రాక్షతోటనైనను మేపుటకు తన పశువును విడిపించగా ఆ పశువు వేరొకని చేను మేసినయెడల అతడు తన చేలలోని మంచిదియు ద్రాక్ష తోటలోని మంచిదియు దానికి ప్రతిగా నియ్యవలెను.

6 అగ్ని రగిలి ముండ్ల కంపలు అంటుకొనుటవలన పంట కుప్పయైనను పంటపైరైనను చేనైనను కాలి పోయినయెడల అగ్ని నంటించినవాడు ఆ నష్టమును అచ్చుకొనవలెను.౹

7 ఒకడు సొమ్మయినను సామానైనను జాగ్రత్తపెట్టుటకు తన పొరుగువానికి అప్పగించినప్పుడు అది ఆ మనుష్యుని యింటనుండి దొంగిలింపబడి ఆ దొంగ దొరికినయెడలవాడు దానికి రెండంతలు అచ్చుకొనవలెను;౹

8 ఆ దొంగ దొరకని యెడల ఆ యింటి యజమానుడు తన పొరుగువాని పదార్థములను తీసికొనెనో లేదో పరిష్కారమగుటకై దేవునియొద్దకు రావలెను.౹

9 ప్రతి విధమైన ద్రోహమునుగూర్చి, అనగా ఎద్దునుగూర్చి గాడిదనుగూర్చి గొఱ్ఱెనుగూర్చి బట్టనుగూర్చి పోయినదాని నొకడు చూచి యిది నాదని చెప్పిన దానిగూర్చి ఆ యిద్దరి వ్యాజ్యెము దేవుని యొద్దకుతేబడవలెను. దేవుడుఎవనిమీద నేరము స్థాపించునోవాడు తన పొరుగువానికి రెండంతలు అచ్చుకొనవలెను.

10 ఒకడు గాడిదనైనను ఎద్దునైనను గొఱ్ఱెనైనను మరి ఏ జంతువునైనను కాపాడుటకు తన పొరుగువానికి అప్పగించినమీదట, అది చచ్చినను హాని పొందినను, ఎవడును చూడకుండగా తోలుకొని పోబడినను,౹

11 వాడు తన పొరుగువాని సొమ్మును తీసికొనలేదనుటకు యెహోవా ప్రమాణము వారిద్దరిమధ్యనుండవలెను. సొత్తుదారుడు ఆ ప్రమాణమును అంగీకరింపవలెను; ఆ నష్టమును అచ్చు కొననక్కరలేదు.౹

12 అది నిజముగా వానియొద్దనుండి దొంగిలబడినయెడల సొత్తుదారునికి ఆ నష్టమును అచ్చు కొనవలెను.౹

13 అది నిజముగా చీల్చబడినయెడలవాడు సాక్ష్యముకొరకు దాని తేవలెను; చీల్చబడినదాని నష్టమును అచ్చుకొన నక్కరలేదు.

14 ఒకడు తన పొరుగువానియొద్ద దేనినైనను బదులు దీసి కొనిపోగా దాని యజమానుడు దానియొద్ద లేనప్పుడు, అది హానిపొందినను చచ్చినను దాని నష్టమును అచ్చుకొనవలెను.౹

15 దాని యజమానుడు దానితో నుండినయెడల దాని నష్టమును అచ్చుకొననక్కరలేదు. అది అద్దెదైనయెడల అది దాని అద్దెకు వచ్చెను.౹

16 ఒకడు ప్రధానము చేయబడని ఒక కన్యకను మరులుకొల్పి ఆమెతో శయనించినయెడల ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెండ్లి చేసికొనవలెను.౹

17 ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనొల్లని యెడలవాడు కన్యకల ఓలిచొప్పున సొమ్ము చెల్లింపవలెను.

18 శకునము చెప్పుదానిని బ్రదుకనియ్యకూడదు.

19 మృగసంయోగముచేయు ప్రతివాడు నిశ్చయముగా మరణశిక్ష నొందవలెను.౹

20 యెహోవాకు మాత్రమే గాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు.౹

21 పరదేశిని విసికింపవద్దు, బాధింపవద్దు; మీరు ఐగుప్తు దేశములో పరదేశులై యుంటిరి గదా.౹

22 విధవరాలినైనను దిక్కులేని పిల్లనైనను బాధపెట్టకూడదు.౹

23 వారు నీచేత ఏ విధముగానైనను బాధనొంది నాకు మొఱపెట్టినయెడల నేను నిశ్చయముగా వారి మొఱను విందును.౹

24 నా కోపాగ్ని రవులుకొని మిమ్మును కత్తిచేత చంపించెదను, మీ భార్యలు విధవ రాండ్రగుదురు, మీ పిల్లలు దిక్కు లేనివారగుదురు.

25 నా ప్రజలలో నీయొద్దనుండు ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చినయెడల వడ్డికిచ్చువానివలె వాని యెడల జరిగింపకూడదు, వానికి వడ్డికట్టకూడదు.౹

26 నీవు ఎప్పుడైనను నీ పొరుగువాని వస్త్రమును కుదవగా తీసికొనినయెడల సూర్యుడు అస్తమించువేళకు అది వానికి మరల అప్పగించుము.౹

27 వాడు కప్పుకొనునది అదే. అది వాని దేహమునకు వస్త్రము;వాడు మరి ఏమి కప్పుకొని పండు కొనును? నేను దయగలవాడను,వాడు నాకు మొఱపెట్టినయెడల నేను విందును.

28 నీవు దేవునినిందింపగూడదు, నీ ప్రజలలోని అధికారిని శపింపకూడదు.

29 నీ మొదటి సస్యద్రవ్యములను అర్పింప తడవుచేయకూడదు. నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను.౹

30 అట్లే నీ యెద్దులను నీ గొఱ్ఱెలను అర్పింపవలెను. ఏడు దినములు అది దాని తల్లియొద్ద ఉండవలెను. ఎనిమిదవదినమున దానిని నాకియ్యవలెను.

31 మీరు నాకు ప్రతిష్ఠింపబడినవారు గనుక పొలములో చీల్చబడిన మాంసమును తినక కుక్కలకు దాని పారవేయవలెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EXO/22-ef991e7ad43c7551a56476b6df723cdd.mp3?version_id=1787—

Categories
నిర్గమకాండము

నిర్గమకాండము 23

1 లేనివార్తను పుట్టింపకూడదు; అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు;౹

2 దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించ వద్దు, న్యాయమును త్రిప్పి వేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యెములో సాక్ష్యము పలుకకూడదు;౹

3 వ్యాజ్యెమాడువాడు బీదవాడైనను వానియెడల పక్షపాతముగా నుండకూడదు.

4 నీ శత్రువుని యెద్దయినను గాడిదయైనను తప్పిపోవుచుండగా అది నీకు కనబడినయెడల అగత్యముగా దాని తోలుకొనివచ్చి వాని కప్పగింపవలెను.౹

5 నీవు నీ పగవాని గాడిద బరువుక్రింద పడియుండుట చూచి, దానినుండి తప్పింపకయుందునని నీవు అనుకొనినను అగత్యముగా వానితో కలిసి దాని విడిపింపవలెను.

6 దరిద్రుని వ్యాజ్యెములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు

7 అబద్ధమునకు దూరముగానుండుము; నిరప రాధినైనను నీతిమంతునినైనను చంపకూడదు; నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను.౹

8 లంచము తీసికొనకూడదు; లంచము దృష్టిగలవానికి గ్రుడ్డితనము కలుగజేసి, నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును.౹

9 పరదేశిని బాధింపకూడదు; పరదేశి మనస్సు ఎట్లుండునో మీరెరుగుదురు; మీరు ఐగుప్తుదేశములో పరదేశులై యుంటిరిగదా.

10 ఆరుసంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను.౹

11 ఏడవ సంవత్సరమున దానిని బీడు విడువవలెను. అప్పుడు నీ ప్రజలలోని బీదలు తినిన తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. నీ ద్రాక్షతోట విషయములోను నీ ఒలీవతోట విషయములోను ఆలాగుననే చేయవలెను.౹

12 ఆరు దినములు నీ పనులు చేసి, నీ యెద్దును నీ గాడిదయు నీ దాసి కుమారుడును పరదేశియు విశ్రమించునట్లు ఏడవదినమున ఊరక యుండవలెను.౹

13 నేను మీతో చెప్పినవాటినన్నిటిని జాగ్రత్తగా గైకొనవలెను; వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు; అది నీ నోటనుండి రానియ్య తగదు.

14 సంవత్సరమునకు మూడుమారులు నాకు పండుగ ఆచరింపవలెను.౹

15 పులియనిరొట్టెల పండుగ నాచరింపవలెను. నేను నీ కాజ్ఞాపించినట్లు ఆబీబు నెలలో నీవు ఐగుప్తులోనుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు ఏడు దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడును వట్టిచేతులతో కనబడకూడదు.౹

16 నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలిపంటయొక్క కోతపండుగను, పొలములోనుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంతమందు ఫలసంగ్రహపు పండుగను ఆచరింపవలెను.౹

17 సంవ త్సరమునకు మూడుమారులు పురుషులందరు ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెను.

18 నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు. నా పండుగలో నర్పించిన క్రొవ్వు ఉదయమువరకు నిలువ యుండకూడదు.౹

19 నీ భూమి ప్రథమఫలములో మొదటివాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు.

20 ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను.౹

21 ఆయన సన్నిధిని జాగ్రత్తగానుండి ఆయన మాట వినవలెను. ఆయన కోపము రేపవద్దు; మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది.౹

22 అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసినయెడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధియునై యుందును.౹

23 ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్లుచు, అమోరీయులు హిత్తీయులు పెరిజ్జీయులు కనానీయులు హివ్వీయులు యెబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును, నేను వారిని సంహరించెదను.౹

24 వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు; వారి క్రియలవంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి, వారి విగ్రహములను బొత్తిగా పగులగొట్టవలెను.౹

25 నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను నీ మధ్యనుండి రోగము తొలగించెదను.౹

26 కడుపు దిగబడునదియు గొడ్డుదియు నీ దేశములోను ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తిచేసెదను.౹

27 నన్నుబట్టి మనుష్యులు నీకు భయపడునట్లు చేసెదను. నీవు పోవు సర్వదేశములవారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ యెదుటనుండి పారిపోవునట్లు చేసెదను.౹

28 మరియు, పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించెదను, అవి నీ యెదుటనుండి హివ్వీయులను కనానీయులను హిత్తీయులను వెళ్లగొట్టును.౹

29 దేశము పాడై అడవిమృగములు నీకు విరోధముగా విస్తరింపకుండునట్లు వారిని ఒక్క సంవత్సరములోనే నీ యెదుటనుండి వెళ్లగొట్టను.౹

30 నీవు అభివృద్ధిపొంది ఆ దేశమును స్వాధీనపరచుకొనువరకు క్రమక్రమముగా వారిని నీయెదుటనుండి వెళ్లగొట్టెదను.౹

31 మరియు ఎఱ్ఱసముద్రమునుండి ఫిలిష్తీయుల సముద్రమువరకును అరణ్యమునుండి నదివరకును నీ పొలిమేరలను ఏర్పరచెదను, ఆ దేశ నివాసులను నీ చేతి కప్పగించెదను. నీవు నీ యెదుటనుండి వారిని వెళ్లగొట్టెదవు.౹

32 నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసికొన వద్దు. నీవు వారి దేవతలను సేవించినయెడల అది నీకు ఉరియగును గనుక

33 వారు నీచేత నాకు విరోధముగా పాపము చేయింపకుండునట్లువారు నీ దేశములో నివసింపకూడదు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EXO/23-54083bed562fd71dd46aab16aa00558f.mp3?version_id=1787—

Categories
నిర్గమకాండము

నిర్గమకాండము 24

1 మరియు ఆయన మోషేతో ఇట్లనెను–నీవును, అహరోనును, నాదాబును, అబీహును, ఇశ్రాయేలీయుల పెద్దలలో డెబ్బదిమందియు యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి.౹

2 మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు, ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు.౹

3 మోషే వచ్చి యెహోవా మాటలన్నిటిని విధులన్నిటిని ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరు–యెహోవా చెప్పిన మాట లన్నిటి ప్రకారము చేసెదమని యేకశబ్దముతో ఉత్తర మిచ్చిరి.౹

4 మరియు మోషే యెహోవా మాటలన్నిటిని వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు పండ్రెండు గోత్రముల చొప్పున పండ్రెండు స్తంభములను కట్టి

5 ఇశ్రాయేలీయులలో యౌవనస్థులను పంపగా వారు దహనబలులనర్పించి యెహోవాకు సమాధానబలులగా కోడెలను వధించిరి.౹

6 అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసికొని పళ్లెములలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠముమీద ప్రోక్షించెను.౹

7 అతడు నిబంధన గ్రంథమును తీసికొని ప్రజలకు వినిపింపగా వారు –యెహోవా చెప్పినవన్నియు చేయుచు విధేయులమై యుందుమనిరి.౹

8 అప్పుడు మోషే రక్తమును తీసికొని ప్రజలమీద ప్రోక్షించి–ఇదిగో యీ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను.౹

9 తరువాత మోషే అహరోను నాదాబు అబీహు ఇశ్రాయేలీయుల పెద్దలలో డెబ్బదిమందియు ఎక్కి పోయి

10 ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి. ఆయన పాదములక్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువువంటిదియు ఆకాశమండలపు తేజమువంటిదియు ఉండెను.౹

11 ఆయన ఇశ్రాయేలీయులలోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు; వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి.

12 అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను–నీవు కొండయెక్కి నాయొద్దకు వచ్చి అచ్చటనుండుము; నీవు వారికి బోధించునట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతిపలకలను నీకిచ్చెదననగా

13 మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండమీదికి ఎక్కెను.౹

14 అతడు పెద్దలను చూచి–మేము మీ యొద్దకు వచ్చువరకు ఇక్కడనే యుండుడి; ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు; ఎవనికైనను వ్యాజ్యెమున్నయెడల వారియొద్దకు వెళ్లవచ్చునని వారితో చెప్పెను.౹

15 మోషే కొండమీదికి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను.౹

16 యెహోవా మహిమ సీనాయి కొండమీద నిలిచెను; మేఘము ఆరు దినములు దాని కమ్ముకొనెను; ఏడవదినమున ఆయన ఆ మేఘములోనుండి మోషేను పిలిచినప్పుడు

17 యెహోవా మహిమ ఆ కొండ శిఖరముమీద దహించు అగ్నివలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను.౹

18 అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండమీదికి ఎక్కెను. మోషే ఆ కొండమీద రేయింబవళ్లు నలుబది దినములుండెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EXO/24-60783ba0738534c9e37ec2295ffa96b0.mp3?version_id=1787—

Categories
నిర్గమకాండము

నిర్గమకాండము 25

1 యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను .౹

2 –నాకు ప్రతిష్ఠార్పణ తీసికొనిరండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పించు ప్రతిమనుష్యుని యొద్ద దాని తీసికొనవలెను.౹

3 మీరు వారియొద్ద తీసికొన వలసిన అర్పణలేవనగా బంగారు, వెండి, ఇత్తడి,౹

4 నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్నపునార, మేకవెండ్రుకలు,౹

5 ఎరుపురంగు వేసిన పొట్టేళ్లతోళ్లు, సముద్రవత్సల తోళ్లు, తుమ్మకఱ్ఱలు,౹

6 ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభారములు,౹

7 లేతపచ్చలు, ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములు అనునవే.౹

8 నేను వారిలో నివసించునట్లువారు నాకు పరిశుద్ధస్థలమును నిర్మింపవలెను.౹

9 నేను నీకు కనుపరచువిధముగా మందిరముయొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను.

10 వారు తుమ్మకఱ్ఱతో నొక మందసమును చేయవలెను. దాని పొడుగు రెండుమూరలునర, దాని వెడల్పు మూరెడు నర, దానియెత్తు మూరెడునర

11 దానిమీద మేలిమి బంగారురేకు పొదిగింపవలెను; లోపలను వెలుపలను దానికి పొదిగింపవలెను; దానిమీద బంగారు జవను చుట్టు కట్టవలెను.౹

12 దానికి నాలుగు బంగారు ఉంగరములను పోత పోసి, ఒక ప్రక్కను రెండు ఉంగరములు ఎదుటి ప్రక్కను రెండు ఉంగరములు ఉండునట్లు దాని నాలుగు కాళ్లకు వాటిని వేయవలెను.౹

13 తుమ్మకఱ్ఱతో మోతకఱ్ఱలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి

14 వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కలమీది ఉంగరములలో ఆ మోతకఱ్ఱలను దూర్చవలెను.౹

15 ఆ మోతకఱ్ఱలు ఆ మందసపు ఉంగరములలోనే ఉండవలెను. వాటిని దానియొద్దనుండి తీయకూడదు;౹

16 ఆ మందసములో నేను నీకిచ్చు శాసనముల నుంచవలెను.౹

17 మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలెను. దాని పొడుగు రెండు మూరలునర దాని వెడల్పు మూరెడునర.౹

18 మరియు రెండు బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠముయొక్క రెండు కొనలను నకిషిపనిగా చేయవలెను.౹

19 ఈ కొనను ఒక కెరూబును ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమున దాని రెండు కొనలమీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను

20 ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలుగలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా నుండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణా పీఠముతట్టు నుండవలెను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసముమీద నుంచవలెను.౹

21 నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో నుంచవలెను.౹

22 అక్కడ నేను నిన్ను కలిసికొని కరుణా పీఠముమీద నుండియు, శాసనములుగల మందసముమీద నుండు రెండు కెరూబులమధ్యనుండియు, నేను ఇశ్రాయేలీయుల నిమిత్తము మీ కాజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్పెదను.

23 మరియు నీవు తుమ్మకఱ్ఱతో నొక బల్ల చేయవలెను. దాని పొడుగు రెండు మూరలు దాని వెడల్పు ఒక మూర దాని యెత్తు మూరెడునర.౹

24 మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టు బంగారు జవను చేయింపవలెను.౹

25 దానికి చుట్టు బెత్తెడు బద్దెచేసి దాని బద్దెపైని చుట్టును బంగారు జవ చేయవలెను.౹

26 దానికి నాలుగు బంగారు ఉంగరములను చేసి దాని నాలుగు కాళ్లకుండు నాలుగు మూలలలో ఆ ఉంగరములను తగిలింపవలెను

27 బల్ల మోయుటకు మోతకఱ్ఱలు ఉంగరములును బద్దెకు సమీపముగా నుండవలెను.౹

28 ఆ మోతకఱ్ఱలు తుమ్మకఱ్ఱతో చేసి వాటిమీద బంగారు రేకు పొదిగింపవలెను; వాటితో బల్లమోయబడును.౹

29 మరియు నీవు దాని పళ్లెములను ధూపార్తులను గిన్నెలను పానీయార్పణముకు పాత్రలను దానికి చేయవలెను; మేలిమి బంగారుతో వాటిని చేయవలెను.౹

30 నిత్యమును నా సన్నిధిని సన్నిధిరొట్టెలను ఈ బల్లమీద ఉంచవలెను.

31 మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను; నకిషిపనిగా ఈ దీపవృక్షము చేయవలెను. దాని ప్రకాండమును దాని శాఖలను నకిషి పనిగా చేయవలెను; దాని కలశములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమైయుండవలెను.౹

32 దీపవృక్షముయొక్క ఒక ప్రక్కనుండి మూడుకొమ్మలు, దీపవృక్షముయొక్క రెండవ ప్రక్కనుండి మూడు కొమ్మలు, అనగా దాని ప్రక్కలనుండి ఆరుకొమ్మలు నిగుడవలెను.౹

33 ఒక కొమ్మలో మొగ్గ పువ్వుగల బాదము రూపమైన మూడు కలశములు, రెండవ కొమ్మలో మొగ్గ పువ్వుగల బాదము రూపమైన మూడు కలశములు; అట్లు దీపవృక్షమునుండి బయలుదేరు కొమ్మలలో నుండవలెను.౹

34 మరియు దీపవృక్ష ప్రకాండములో బాదము రూపమైన నాలుగు కలశములును వాటి మొగ్గలును వాటి పువ్వులును ఉండవలెను,౹

35 దీపవృక్ష ప్రకాండమునుండి నిగుడు ఆరుకొమ్మలకు దాని రెండేసి కొమ్మల క్రింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గచొప్పున ఉండవలెను.౹

36 వాటి మొగ్గలు వాటి కొమ్మలు దానితో ఏకాండమగును; అదంతయు మేలిమి బంగారుతో చేయబడిన ఏకాండమైన నకిషి పనిగా ఉండవలెను.౹

37 నీవు దానికి ఏడు దీపములను చేయవలెను. దాని యెదుట వెలుగిచ్చునట్లు దాని దీపములను వెలిగింపవలెను.౹

38 దాని కత్తెర దాని కత్తెరచిప్పయు మేలిమి బంగారుతో చేయవలెను.౹

39 ఆ ఉపకరణములన్ని నలుబది వీసెల మేలిమి బంగారుతో చేయవలెను.౹

40 కొండమీద నీకు కనుపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్తపడుము.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EXO/25-e77624e2412eab41e1608bdc51de8a06.mp3?version_id=1787—

Categories
నిర్గమకాండము

నిర్గమకాండము 26

1 మరియు నీవు పది తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పనియైన కెరూబులు గల వాటినిగా చేయవలెను.౹

2 ప్రతి తెర పొడుగు ఇరువది యెనిమిది మూరలు; ప్రతి తెర వెడల్పు నాలుగు మూరలు. ఆ తెరలన్నిటికి ఒకటే కొలత.౹

3 అయిదు తెరలను ఒక దానితో ఒకటి కూర్పవలెను. మిగిలిన అయిదు తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను.౹

4 తెరల కూర్పు చివరను మొదటి తెర అంచున నీలినూలుతో కొలుకులను చేయవలెను. రెండవ కూర్పునందలి వెలుపలి తెర చివరను అట్లు చేయవలెను.౹

5 ఒక తెరలో ఏబది కొలుకులను చేసి, ఆ కొలుకులు ఒకదాని నొకటి తగులుకొనునట్లు ఆ రెండవ కూర్పునందలి తెర అంచున ఏబది కొలుకులను చేయవలెను.౹

6 మరియు ఏబది బంగారు గుండీలను చేసి ఆ గుండీలచేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పవలెను; అది ఒకటే మందిరమగును.౹

7 మరియు మందిరముపైని గుడారముగా మేకవెండ్రుకలతో తెరలు చేయవలెను; పదకొండు తెరలను చేయవలెను.౹

8 ప్రతి తెర పొడుగు ముప్పది మూరలు, వెడల్పు నాలుగు మూరలు, పదకొండు తెరల కొలత ఒక్కటే.౹

9 అయిదు తెరలను ఒకటిగాను ఆరు తెరలను ఒకటిగాను ఒక దానికొకటి కూర్పవలెను. ఆరవ తెరను గుడారపు ఎదుటిభాగమున మడవవలెను.౹

10 తెరల కూర్పునకు వెలుపలనున్న తెర అంచున ఏబది కొలుకులను రెండవ కూర్పునందలి తెర అంచున ఏబది కొలుకులను చేయవలెను.౹

11 మరియు ఏబది యిత్తడి గుండీలను చేసి యొకటే గుడారమగునట్లు ఆ గుండీలను ఆ కొలుకులకు తగిలించి దాని కూర్పవలెను.౹

12 ఆ గుడారపు తెరలలో మిగిలి వ్రేలాడుభాగము, అనగా మిగిలిన సగము తెర, మందిరము వెనుక ప్రక్కమీద వ్రేలాడవలెను.౹

13 మరియు గుడారపు తెరల పొడుగులో మిగిలినది ఈ ప్రక్కను ఒక మూరయు, ఆ ప్రక్కను ఒక మూరయు, మందిరమును కప్పుటకు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దాని ప్రక్కలమీద వ్రేలాడవలెను.౹

14 మరియు ఎఱ్ఱరంగువేసిన పొట్టేళ్ల తోళ్లతో పై కప్పును దానికిమీదుగా సముద్ర వత్సల తోళ్లతో పై కప్పును చేయవలెను.

15 మరియు మందిరమునకు తుమ్మకఱ్ఱతో నిలువు పలకలు చేయవలెను.౹

16 పలక పొడుగు పది మూరలు పలక వెడల్పు మూరెడునర యుండవలెను.౹

17 ప్రతి పలకలో ఒకదాని కొకటి సరియైన రెండు కుసులుండవలెను. అట్లు మందిరపు పలకలన్నిటికి చేసిపెట్టవలెను.౹

18 ఇరువది పలకలు కుడివైపున, అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలెను.౹

19 మరియు నొక్కొక్క పలకక్రింద దాని దాని రెండు కుసులకు రెండు దిమ్మలను ఆ యిరువది పలకల క్రింద నలువది వెండి దిమ్మలను చేయవలెను.౹

20-21 మందిరపు రెండవ ప్రక్కను, అనగా ఉత్తరదిక్కున, ఒక్కొక్క పలకక్రింద రెండు దిమ్మలు ఇరువది పలకలును వాటి నలువది వెండి దిమ్మలు ఉండవలెను.౹

22 పడమటితట్టు మందిరముయొక్క వెనుక ప్రక్కకు ఆరు పలకలను చేయవలెను.౹

23 మరియు ఆ వెనుక ప్రక్కను మందిరముయొక్క మూలలకు రెండు పలకలను చేయవలెను.౹

24 అవి అడుగున కూర్చబడి శిఖరమున మొదటి ఉంగరముదనుక ఒకదానితో ఒకటి అతికింపబడవలెను. అట్లు ఆ రెంటికి ఉండవలెను, అవి రెండు మూలలకుండును.౹

25 పలకలు ఎనిమిది; వాటి వెండి దిమ్మలు పదునారు; ఒక్కొక్క పలకక్రింద రెండు దిమ్మ లుండవలెను.౹

26 తుమ్మకఱ్ఱతో అడ్డ కఱ్ఱలను చేయవలెను. మందిరముయొక్క ఒక ప్రక్క పలకలకు అయిదు అడ్డ కఱ్ఱలును

27 మందిరముయొక్క రెండవ ప్రక్క పలకలకు అయిదు అడ్డ కఱ్ఱలును పడమటి వైపున మందిరముయొక్క ప్రక్క పలకలకు అయిదు అడ్డ కఱ్ఱలును ఉండవలెను;౹

28 ఆ పలకలమధ్యనుండు నడిమి అడ్డ కఱ్ఱ ఈ కొసనుండి ఆ కొసవరకు చేరియుండవలెను.౹

29 ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి వాటి అడ్డ కఱ్ఱలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డ కఱ్ఱలకును బంగారురేకును పొదిగింపవలెను.౹

30 అప్పుడు కొండమీద నీకు కనుపరచబడినదాని పోలికచొప్పున మందిరమును నిలువబెట్టవలెను.

31 మరియు నీవు నీల ధూమ్ర రక్తవర్ణములుగల ఒక అడ్డ తెరను పేనిన సన్న నారతో చేయవలెను. అది చిత్ర కారుని పనియైన కెరూబులు గలదిగా చేయవలెను.౹

32 తుమ్మకఱ్ఱతో చేయబడి బంగారురేకు పొదిగిన నాలుగు స్తంభములమీద దాని వేయవలెను; దాని వంకులు బంగా రువి వాటి దిమ్మలు వెండివి.౹

33 ఆ అడ్డతెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెరలోపలికి తేవలెను. ఆ అడ్డతెర పరిశుద్ధస్థలమును అతిపరిశుద్ధస్థలమును వేరుచేయును.౹

34 అతిపరిశుద్ధస్థలములో సాక్ష్యపు మందసముమీద కరుణాపీఠము నుంచవలెను.౹

35 అడ్డతెర వెలుపల బల్లను ఆ బల్లయెదుట దక్షిణపు వైపుననున్న మందిరముయొక్క యుత్తరదిక్కున దీపవృక్షమును ఉంచవలెను.౹

36 మరియు నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్న నారతో చిత్రకారునిపనియైన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను.౹

37 ఆ తెరకు అయిదు స్తంభములను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి బంగారురేకు పొదిగింపవలెను. వాటి వంపులు బంగారువి వాటికి అయిదు ఇత్తడి దిమ్మలు పోతపోయవలెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EXO/26-660e21714e6b98d0d4badcdec71d1f1d.mp3?version_id=1787—

Categories
నిర్గమకాండము

నిర్గమకాండము 27

1 మరియు అయిదు మూరల పొడుగు అయిదు మూరల వెడల్పుగల బలిపీఠమును తుమ్మకఱ్ఱతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచ్చౌకముగా నుండవలెను; దాని యెత్తు మూడు మూరలు.౹

2 దాని నాలుగు మూలలను దానికి కొమ్ములను చేయవలెను; దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను; దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను.౹

3 దాని బూడిదె ఎత్తుటకుకుండలను గరిటెలను గిన్నెలను ముండ్లను అగ్నిపాత్రలను చేయవలెను. ఈ ఉపకరణములన్నియు ఇత్తడితో చేయవలెను.౹

4-5 మరియు వల వంటి ఇత్తడి జల్లెడ దానికి చేయవలెను. ఆ వలమీద దాని నాలుగు మూలలను నాలుగు ఇత్తడి ఉంగరములను చేసి ఆ వల బలిపీఠము నడిమివరకు చేరునట్లు దిగువను బలిపీఠము గట్టు క్రింద దాని నుంచవలెను.౹

6 మరియు బలిపీఠముకొరకు మోతకఱ్ఱలను చేయవలెను. ఆ మోతకఱ్ఱలను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలెను.౹

7 ఆ మోతకఱ్ఱలను ఆ ఉంగరములలో చొనపవలెను. బలిపీఠమును మోయుటకు ఆ మోతకఱ్ఱలు దాని రెండుప్రక్కల నుండవలెను.౹

8 పలకలతో గుల్లగా దాని చేయవలెను; కొండమీద నీకు చూపబడిన పోలికగానే వారు దాని చేయవలెను.

9 మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను. కుడివైపున, అనగా దక్షిణదిక్కున ఆవరణముగా నూరు మూరల పొడుగుగలదై పేనిన సన్ననార యవనికలు ఒక ప్రక్కకు ఉండవలెను.౹

10 దాని యిరువది స్తంభములును వాటి యిరువది దిమ్మలును ఇత్తడివి; ఆ స్తంభముల వంకులును వాటి పెండెబద్దలును వెండివి.౹

11 అట్లే పొడుగులో ఉత్తర దిక్కున నూరు మూరల పొడుగుగల యవనికలుండవలెను. దాని యిరువది స్తంభములును వాటి యిరువది దిమ్మలును ఇత్తడివి. ఆ స్తంభముల వంకులును వాటి పెండె బద్దలును వెండివి.౹

12 పడమటి దిక్కున ఆవరణపు వెడల్పు కొరకు ఏబది మూరల యవనికలుండవలెను; వాటి స్తంభములు పది వాటి దిమ్మలు పది.౹

13 తూర్పువైపున, అనగా ఉదయదిక్కున ఆవరణపు వెడల్పు ఏబది మూరలు.౹

14 ఒక ప్రక్కను పదునైదు మూరల యవనికలుండవలెను; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలు మూడు.౹

15 రెండవ ప్రక్కనుపరునైదుమూరల యవనికలుండవలెను; వాటి స్తంభములు మూడు వాటి దిమ్మలును మూడు.౹

16 ఆవరణపు ద్వారమునకు నీల ధూమ్ర రక్తవర్ణములుగల యిరువది మూరల తెర యుండవలెను. అది పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలెను; దాని స్తంభములు నాలుగు దాని దిమ్మలు నాలుగు.౹

17 ఆవరణముచుట్టున్న స్తంభములన్నియు వెండి పెండెబద్దలు కలవి; వాటి వంకులు వెండివి వాటి దిమ్మలు ఇత్తడివి.౹

18 ఆవరణపు పొడుగు నూరు మూరలు; దాని వెడల్పు ఏబదిమూరలు దాని యెత్తు అయిదు మూరలు; అవి పేనిన సన్ననారవి వాటి దిమ్మలు ఇత్తడివి.౹

19 మందిరసంబంధమైన సేవోపకరణములన్నియు మేకులన్నియు ఆవరణపు మేకులన్నియు ఇత్తడివై యుండవలెను.

20 మరియు దీపము నిత్యము వెలిగించునట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలెనని ఇశ్రాయేలీయుల కాజ్ఞాపించుము.౹

21 సాక్ష్యపు మందసము ఎదుట నున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులును సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు యెహోవా సన్నిధిని దాని సవరింపవలెను. అది ఇశ్రాయేలీయులకు వారి తరతరములవరకు నిత్యమైన కట్టడ.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EXO/27-22d8f438423a59e04d4df11b619eef28.mp3?version_id=1787—

Categories
నిర్గమకాండము

నిర్గమకాండము 28

1 మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోనును, అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలీయులలోనుండి నీ యొద్దకు పిలిపింపుము.౹

2 అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను.౹

3 అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతని ప్రతిష్ఠించుదువు. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికి ఆజ్ఞ ఇమ్ము.౹

4 పతకము ఏఫోదు నిలువు టంగీ విచిత్రమైన చొక్కాయి పాగా దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడైయుండునట్లువారు నీ సహోదరుడైన అహరోనుకు అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను.౹

5 వారు బంగారును నీల ధూమ్ర రక్తవర్ణములుగల నూలును సన్ననారను తీసికొని

6 బంగారుతోను నీల ధూమ్ర రక్త వర్ణములుగల ఏఫోదును పేనిన సన్ననారతోను చిత్ర కారునిపనిగా చేయవలెను.౹

7 రెండు అంచులయందు కూర్చబడు రెండు భుజఖండములు దానికుండవలెను; అట్లు అది సమకూర్పబడియుండును.౹

8 మరియు ఏఫోదు మీదనుండు విచిత్రమైన దట్టి దాని పనిరీతిగా ఏకాండమైనదై బంగారుతోను నీల ధూమ్ర రక్తవర్ణములుగల నూలుతోను పేనిన సన్ననారతోను కుట్టవలెను.౹

9 మరియు నీవు రెండు లేత పచ్చలను తీసికొని వాటిమీద ఇశ్రాయేలీయుల పేరులను, అనగా వారి జనన క్రమముచొప్పున

10 ఒక రత్నముమీద వారి పేళ్లలో ఆరును, రెండవ రత్నముమీద తక్కిన ఆరుగురి పేళ్లను చెక్కింపవలెను.౹

11 ముద్రమీద చెక్కబడిన వాటివలె చెక్కెడివాని పనిగా ఆ రెండు రత్నములమీద ఇశ్రాయేలీయుల పేళ్లను చెక్కి బంగారు జవలలో వాటిని పొదగవలెను.౹

12 అప్పుడు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములనుగా ఆ రెండు రత్నములను ఏఫోదు భుజములమీద ఉంచవలెను అట్లు జ్ఞాపకముకొరకు అహరోను తన రెండు భుజములమీద యెహోవా సన్నిధిని వారి పేరులను భరించును.౹

13 మరియు బంగారు జవలను మేలిమి బంగారుతో రెండు గొలుసులను చేయవలెను;౹

14 సూత్రములవలె అల్లికపనిగా వాటినిచేసి అల్లిన గొలుసులను ఆ జవలకు తగిలింపవలెను.

15 మరియు చిత్రకారుని పనిగా న్యాయవిధాన పతకము చేయవలెను. ఏఫోదుపనివలె దాని చేయవలెను; బంగారుతోను నీల ధూమ్ర రక్తవర్ణములుగల నూలుతోను పేనిన సన్ననారతోను దాని చేయవలెను.౹

16 అది మడవబడి చచ్చౌకముగా నుండవలెను; అది జేనెడు పొడుగు జేనెడు వెడల్పుగలదై యుండవలెను.౹

17 దానిలో నాలుగు పంక్తుల రత్నములుండునట్లు రత్నముల జవలను చేయవలెను. మాణిక్య గోమేధిక మరకతములుగల పంక్తి మొదటిది;౹

18 పద్మరాగ నీల సూర్యకాంతములుగల పంక్తి రెండవది;౹

19 గారుత్మతము యష్మురాయి ఇంద్రనీలములుగల పంక్తి మూడవ వది;౹

20 రక్తవర్ణపురాయి సులిమానిరాయి సూర్యకాంతములుగల పంక్తి నాలుగవది. వాటిని బంగారు జవలలో పొదగవలెను.౹

21 ఆ రత్నములు ఇశ్రాయేలీయుల పేరులుగలవై వారి పేరులచొప్పున పన్నెండుండవలెను. ముద్రమీద చెక్కినవాటివలె వారిలో ప్రతివాని పేరు చొప్పున పండ్రెండు గోత్రముల పేరులు ఉండవలెను.౹

22 మరియు ఆ పతకము అల్లిక పనిగా పేనిన గొలుసులను మేలిమి బంగారుతో చేయవలెను.౹

23 పతకమునకు రెండు బంగారు ఉంగరములు చేసి

24 ఆ రెండు ఉంగరములను పతకపు రెండు కొసలయందు తగిలించి, పతకపు కొసలనున్న రెండు ఉంగరములలో అల్లబడిన ఆ రెండు బంగారు గొలుసులను తగిలింపవలెను.౹

25 అల్లిన ఆ రెండు గొలుసుల కొసలను రెండు రెండు జవలకు తగిలించి ఏఫోదు నెదుట దాని భుజములమీద కట్టవలెను.౹

26 మరియు నీవు బంగారుతో రెండు ఉంగరములను చేసి ఏఫోదు నెదుటనున్న పతకములోపలి అంచున దాని రెండు కొసలకు వాటిని తగిలింపవలెను.౹

27 మరియు నీవు రెండు బంగారు ఉంగరములుచేసి ఏఫోదు విచిత్రమైన దట్టిపైగా దాని కూర్పు నొద్ద, దాని యెదుటి ప్రక్కకు దిగువను, ఏఫోదు రెండు భుజభాగములకు వాటిని తగిలింపవలెను.౹

28 అప్పుడు పతకము ఏఫోదు విచిత్రమైన దట్టికిపైగా నుండునట్లును అది ఏఫోదునుండి వదలక యుండునట్లును వారు దాని ఉంగరములకు ఏఫోదు ఉంగరములకు నీలి సూత్రముతో పతకము కట్టవలెను.

29 అట్లు అహరోను పరిశుద్ధస్థలములోనికి వెళ్లునప్పుడు అతడు తన రొమ్ముమీద న్యాయవిధాన పతకములోని ఇశ్రాయేలీయుల పేళ్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలెను.౹

30 మరియు నీవు న్యాయ విధాన పతకములో ఊరీము తుమ్మీము అనువాటిని ఉంచవలెను; అహరోను యెహోవా సన్నిధికి వెళ్లునప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలీయుల న్యాయవిధానమును నిత్యము భరించును.

31 మరియు ఏఫోదు నిలువుటంగీని కేవలము నీలిదారముతో కుట్టవలెను.౹

32 దానినడుమ తల దూరుటకు రంధ్రము ఉండవలెను. అది చినగకుండునట్లు కంఠ కవచ రంధ్రము వలె దాని రంధ్రముచుట్టు నేతపనియైన గోటు ఉండవలెను.౹

33 దాని అంచున దాని అంచులచుట్టు నీల ధూమ్ర రక్తవర్ణములుగల దానిమ్మ పండ్లను వాటి నడుమను బంగారు గంటలను నిలువుటంగీ చుట్టు తగిలింపవలెను.౹

34 ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మపండును ఆ నిలువు టంగీ క్రింది అంచున చుట్టు ఉండవలెను.౹

35 సేవచేయునప్పుడు అహరోను దాని ధరించుకొనవలెను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధస్థలములోనికి ప్రవేశించు నప్పుడు అతడు చావకయుండునట్లు దాని ధ్వని వినబడవలెను.౹

36 మరియు నీవు మేలిమి బంగారు రేకుచేసి ముద్ర చెక్కునట్లు దానిమీద యెహోవా పరిశుద్ధుడుఅను మాట చెక్కవలెను.౹

37 అది పాగామీద ఉండునట్లు నీలి సూత్రముతో దాని కట్టవలెను. అది పాగా ముందటి వైపున ఉండవలెను.౹

38 తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించు పరిశుద్ధమైనవాటికి తగులు దోషములను అహరోను భరించునట్లు అది అహరోను నొసట ఉండవలెను; వారు యెహోవా సన్నిధిని అంగీకరింపబడునట్లు అది నిత్యమును అతని నొసట ఉండవలెను.౹

39 మరియు సన్ననారతో చొక్కాయిని బుట్టా పనిగా చేయవలెను. సన్ననారతో పాగాను నేయవలెను; దట్టిని బుట్టాపనిగా చేయవలెను.౹

40 అహరోను కుమారులకు నీవు చొక్కాయిలను కుట్టవలెను; వారికి దట్టీలను చేయవలెను; వారికి అలంకారమును ఘనతయు కలుగునట్లు కుళ్లాయిలను వారికి చేయవలెను.౹

41 నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలెను; వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకముచేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను.౹

42 మరియు వారి మానమును కప్పుకొనుటకు నీవు వారికి నారలాగులను కుట్టవలెను.౹

43 వారు ప్రత్యక్షపు గుడారములోనికి ప్రవేశించునప్పుడైనను, పరిశుద్ధస్థలములో సేవచేయుటకు బలిపీఠమును సమీపించునప్పుడైనను, వారు దోషులై చావక యుండునట్లు అది అహరోనుమీదను అతని కుమారులమీదను ఉండవలెను. ఇది అతనికిని అతని తరువాత అతని సంతతికిని నిత్యమైన కట్టడ.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EXO/28-4a34bd108eac9382fed4ceb9c8cb8e11.mp3?version_id=1787—

Categories
నిర్గమకాండము

నిర్గమకాండము 29

1 వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా

2 ఒక కోడెదూడను కళంకములేని రెండు పొట్టేళ్లను పొంగని రొట్టెను పొంగనివై నూనెతో కలిసిన భక్ష్యములను పొంగనివై నూనె పూసిన పలచని అప్పడములను తీసికొనుము.౹

3 గోధుమపిండితో వాటినిచేసి ఒక గంపలో వాటిని పెట్టి, ఆ గంపను ఆ కోడెను ఆ రెండు పొట్టేళ్లను తీసికొనిరావలెను.౹

4 మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము దగ్గరకు తీసికొనివచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి

5 ఆ వస్త్రములను తీసికొని చొక్కాయిని ఏఫోదు నిలువు టంగిని ఏఫోదును పతకమును అహరోనుకు ధరింపచేసి, ఏఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి

6 అతని తలమీద పాగాను పెట్టి ఆ పాగామీద పరిశుద్ధ కిరీటముంచి

7 అభిషేక తైలమును తీసికొని అతని తలమీద పోసి అతని నభిషేకింపవలెను.౹

8 మరియు నీవు అతని కుమారులను సమీపింపచేసి వారికి చొక్కాయిలను తొడిగింపవలెను.౹

9 అహరోనుకును అతని కుమారులకును దట్టినికట్టి వారికి కుళ్లాయిలను వేయింపవలెను; నిత్యమైన కట్టడనుబట్టి యాజకత్వము వారికగును. అహరోనును అతని కుమారులను ఆలాగున ప్రతిష్ఠింపవలెను.౹

10 మరియు నీవు ప్రత్యక్షపు గుడారము నెదుటికి ఆ కోడెను తెప్పింపవలెను అహరోనును అతని కుమారులును కోడె తలమీద తమ చేతుల నుంచగా

11 ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము నొద్ద యెహోవా సన్నిధిని ఆ కోడెను వధింపవలెను.౹

12 ఆ కోడె రక్తములో కొంచెము తీసికొని నీ వ్రేలితో బలి పీఠపు కొమ్ములమీద చమిరి ఆ రక్తశేషమంతయు బలిపీఠపు టడుగున పోయవలెను.౹

13 మరియు ఆంత్రములను కప్పు కొను క్రొవ్వంతటిని కాలేజముమీది వపను రెండు మూత్ర గ్రంథులను వాటిమీది క్రొవ్వును నీవు తీసి బలిపీఠముమీద దహింపవలెను.౹

14 ఆ కోడె మాంసమును దాని చర్మమును దాని పేడను పాళెమునకు వెలుపల అగ్నితో కాల్చవలెను, అది పాపపరిహారార్థమైన బలి.౹

15 నీవు ఆ పొట్టేళ్లలో ఒకదాని తీసికొనవలెను. అహరోనును అతని కుమారులును ఆ పొట్టేలు తలమీద తమ చేతులుంచగా

16 నీవు ఆ పొట్టేలును వధించి దాని రక్తము తీసి బలిపీఠముచుట్టు దాని ప్రోక్షింపవలెను.౹

17 అంతట నీవు ఆ పొట్టేలును దాని అవయవములను దేనికి అది విడదీసి దాని ఆంత్రములను దాని కాళ్లను కడిగి దాని అవయవములతోను తలతోను చేర్చి

18 బలిపీఠముమీద ఆ పొట్టేలంతయు దహింపవలెను; అది యెహోవాకు దహనబలి, యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము.౹

19 మరియు నీవు రెండవ పొట్టేలును తీసికొనవలెను. అహరోనును అతని కుమారులును ఆ పొట్టేలు తలమీద తమ చేతులుంచగా

20 ఆ పొట్టేలును వధించి దాని రక్తములో కొంచెము తీసి, అహరోను కుడిచెవి కొనమీదను అతని కుమారుల కుడి చెవుల కొనమీదను, వారి కుడిచేతి బొట్టన వ్రేళ్లమీదను, వారి కుడికాలి బొట్టనవ్రేళ్లమీదను చమిరి బలిపీఠముమీద చుట్టు ఆ రక్తమును ప్రోక్షింపవలెను.౹

21 మరియు నీవు బలిపీఠము మీదనున్న రక్తములోను అభిషేక తైలములోను కొంచెము తీసి అహరోనుమీదను, అతని వస్త్రములమీదను, అతనితోనున్న అతని కుమారులమీదను, అతని కుమారుల వస్త్రములమీదను ప్రోక్షింపవలెను. అప్పుడు అతడును అతని వస్త్రములును అతనితోనున్న అతని కుమారులును అతని కుమారుల వస్త్రములును ప్రతిష్ఠితము లగును.౹

22 మరియు అది ప్రతిష్ఠితమైన పొట్టేలు గనుక దాని క్రొవ్వును క్రొవ్విన తోకను ఆంత్రములను కప్పు క్రొవ్వును కాలేజముమీది వపను రెండు మూత్రగ్రంథులను వాటిమీది క్రొవ్వును కుడి జబ్బను

23 ఒక గుండ్రని రొట్టెను నూనెతో వండిన యొక భక్ష్యమును యెహోవా యెదుటనున్న పొంగనివాటిలో పలచని ఒక అప్పడమును నీవు తీసికొని

24 అహరోను చేతులలోను అతని కుమారుల చేతులలోను వాటినన్నిటిని ఉంచి, అల్లాడింపబడు నైవేద్యముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను.౹

25 తరువాత నీవు వారి చేతులలోనుండి వాటిని తీసికొని యెహోవా సన్నిధిని ఇంపైన సువాసన కలుగునట్లు దహనబలిగా వాటిని బలిపీఠముమీద దహింపవలెను. అది యెహోవాకు హోమము.౹

26 మరియు అహరోనుకు ప్రతిష్ఠితమైన పొట్టేలునుండి బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని దానిని అల్లాడింపవలెను; అది నీ వంతగును.౹

27 ప్రతిష్ఠితమైన ఆ పొట్టేలులో అనగా అహరోనుదియు అతని కుమారులదియునైన దానిలో అల్లాడింపబడిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను ప్రతిష్ఠింపవలెను.౹

28 అది ప్రతిష్ఠార్పణ గనుక నిత్యమైన కట్టడ చొప్పున అది ఇశ్రాయేలీయులనుండి అహరోనుకును అతని కుమారులకునగును. అది ఇశ్రాయేలీయులు అర్పించు సమాధానబలులలోనుండి తాము చేసిన ప్రతిష్ఠా ర్పణ, అనగా వారు యెహోవాకు చేసిన ప్రతిష్ఠార్పణగా నుండును.౹

29 మరియు అహరోను ప్రతిష్ఠిత వస్త్రములును అతని తరువాత అతని కుమారులవగును; వారు అభిషేకము పొందుటకును ప్రతిష్ఠింపబడుటకును వాటిని ధరించుకొనవలెను.౹

30 అతని కుమారులలో నెవడు అతనికి ప్రతిగా యాజకుడగునో అతడు పరిశుద్ధస్థలములో సేవచేయుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లునప్పుడు ఏడు దినములు వాటిని వేసికొనవలెను.

31 మరియు నీవు ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసికొని పరిశుద్ధస్థలములో దాని మాంసమును వండవలెను.౹

32 అహరోనును అతని కుమారులును ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారముదగ్గర ఆ పొట్టేలు మాంసమును గంప లోని రొట్టెలను తినవలెను.౹

33 వారిని ప్రతిష్ఠ చేయుటకును వారిని పరిశుద్ధపరచుటకును వేటివలన ప్రాయశ్చిత్తము చేయబడెనో వాటిని వారు తినవలెను; అవి పరిశుద్ధమైనవి గనుక అన్యుడు వాటిని తినకూడదు.౹

34 ప్రతిష్ఠితమైన మాంసములోనేమి ఆ రొట్టెలలోనేమి కొంచెమైనను ఉదయమువరకు మిగిలియుండినయెడల మిగిలినది అగ్నిచేత దహింపవలెను; అది ప్రతిష్ఠితమైనది గనుక దాని తినవలదు.౹

35 నేను నీ కాజ్ఞాపించిన వాటన్నిటినిబట్టి నీవు అట్లు అహరోనుకును అతని కుమారులకును చేయవలెను. ఏడు దినములు వారిని ప్రతిష్ఠపరచవలెను.౹

36 ప్రాయశ్చిత్తము నిమిత్తము నీవు ప్రతిదినమున ఒక కోడెను పాప పరిహారార్థబలిగా అర్పింపవలెను. బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటవలన దానికి పాపపరిహారార్థబలి నర్పించి దాని ప్రతిష్ఠించుటకు దానికి అభిషేకము చేయవలెను.౹

37 ఏడుదినములు నీవు బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తముచేసి దాని పరిశుద్ధపరచవలెను. ఆ బలిపీఠము అతిపరిశుద్ధముగా ఉండును. ఆ బలిపీఠమునకు తగులునది అంతయు ప్రతిష్ఠితమగును.

38 నీవు బలిపీఠముమీద నిత్యమును అర్పింపవలసినదేమనగా, ఏడాదివి రెండు గొఱ్ఱెపిల్లలను ప్రతిదినము ఉదయమందు ఒక గొఱ్ఱెపిల్లను

39 సాయంకాలమందు ఒక గొఱ్ఱెపిల్లను అర్పింపవలెను.౹

40 దంచితీసిన ముప్పావు నూనెతో కలిపిన పదియవవంతు పిండిని పానీయార్పణముగా ముప్పావు ద్రాక్షారసమును మొదటి గొఱ్ఱెపిల్లతో అర్పింపవలెను. సాయంకాలమందు రెండవ గొఱ్ఱెపిల్లను అర్పింపవలెను.౹

41 అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమమగునట్లు ఉదయకాలమందలి అర్పణమును దాని పానీయార్పణమును అర్పించినట్టు దీని నర్పింపవలెను.౹

42 ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారముయొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహనబలి. నీతో మాటలాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలిసికొందును.౹

43 అక్కడికి వచ్చి ఇశ్రాయేలీయులను కలిసికొందును; అది నా మహిమవలన పరిశుద్ధపరచబడును.౹

44 నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచెదను. నాకు యాజకులగునట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధపరచెదను.౹

45 నేను ఇశ్రాయేలీయులమధ్య నివసించి వారికి దేవుడనై యుందును.౹

46 కావున నేను వారి మధ్య నివసించునట్లు ఐగుప్తు దేశములోనుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలిసికొందురు. నేను వారి దేవుడనైన యెహోవాను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EXO/29-fbd3b58bcbc5e927926f51b1e8cac1e1.mp3?version_id=1787—

Categories
నిర్గమకాండము

నిర్గమకాండము 30

1 మరియు ధూపమువేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను తుమ్మకఱ్ఱతో దాని చేయవలెను.౹

2 దాని పొడుగు ఒక మూర దాని వెడల్పు ఒక మూర. అది చచ్చౌకముగా నుండవలెను. దాని యెత్తు రెండు మూరలు దాని కొమ్ములు దానితో ఏకాండమై యుండవలెను.౹

3 దాని పైభాగమునకును దాని నాలుగు ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టు బంగారు జవను చేయవలెను.౹

4 దాని జవకు దిగువను దానికి రెండు బంగారు ఉంగరములు చేయవలెను; దాని రెండు ప్రక్కలయందలి దాని రెండు మూలలమీద వాటిని ఉంచవలెను.౹

5 అవి దాని మోయు మోతకఱ్ఱలకు స్థలములు. ఆ మోతకఱ్ఱలను తుమ్మకఱ్ఱతో చేసి వాటికి బంగారురేకు పొదిగింపవలెను.౹

6 సాక్ష్యపు మందసము నొద్దనుండు అడ్డతెర యెదుట, అనగా శాసనములమీది కరుణాపీఠము నెదుట నీవు దానిని ఉంచవలెను; అక్కడ నేను నిన్ను కలిసికొందును.౹

7 అహరోను ప్రతిదినము ప్రొద్దున దానిమీద పరిమళద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరచునప్పుడు దానిమీద ఆ ధూపము వేయవలెను.౹

8 మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించునప్పుడు దానిమీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము.౹

9 మీరు దానిమీద అన్యధూపమునైనను దహనబలి సంబంధమైన ద్రవ్యమునైనను నైవేద్యమునైనను అర్పింపకూడదు; పానీయమునైనను దానిమీద పోయకూడదు.౹

10 మరియు అహరోను సంవత్సరమున కొకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహారార్థబలి రక్తమువలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. మీ తరతరములకు సంవత్సరమునకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అది యెహోవాకు అతి పరిశుద్ధమైనది.

11-12 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను–నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలెను. వారు లెక్కింపబడు వేళకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణపరిక్రయ ధనము నిచ్చుకొనవలెను. ఆలాగు చేసినయెడల నీవు వారిని లెక్కించునప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు.౹

13 వారు ఇయ్యవలసినది ఏమనగా, లెక్కింపబడినవారిలో చేరు ప్రతివాడును పరిశుద్ధస్థలముయొక్క తులమునుబట్టి అరతులము ఇయ్యవలెను. ఆ తులము యిరువది చిన్నములు. ఆ అరతులము యెహోవాకు ప్రతిష్ఠార్పణ.౹

14 ఇరువది సంవత్సరములుగాని అంతకంటె యెక్కువ వయస్సుగాని గలవారై లెక్కింపబడినవారిలో చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణ నియ్యవలెను.౹

15 అది మీ ప్రాణములకు పరిక్రయధనముగా నుండునట్లు యెహోవాకు అర్పణ ఇచ్చునప్పుడు ధనవంతుడు అర తులముకంటె ఎక్కువ ఇయ్యకూడదు. బీదవాడు తక్కువ ఇయ్యకూడదు.౹

16 నీవు ఇశ్రాయేలీయుల యొద్దనుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసికొని ప్రత్యక్షపు గుడారముయొక్క సేవనిమిత్తము దాని నియమింపవలెను. మీకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా నుండును.

17 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను–కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళమును ఇత్తడి పీటనుచేసి

18 ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను.౹

19 ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులును తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను.౹

20 వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లునప్పుడును సేవచేసి యెహోవాకు హోమధూపము నర్పించుటకు బలిపీఠము నొద్దకు వచ్చునప్పుడును తాము చావక యుండునట్లు నీళ్లతో కడుగుకొనవలెను.౹

21 తాము చావక యుండునట్లు తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. అది వారికి, అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నుండును.

22 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను–నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో

23 పరిశుద్ధస్థల సంబంధమైన తులముచొప్పున, అచ్చమైన గోపరసము ఐదువందల తులములును సుగంధముగల లవంగిపట్ట సగము, అనగా రెండువందల ఏబది తులముల యెత్తును

24 నిమ్మగడ్డి నూనె రెండువందల ఏబది తులముల యెత్తును, లవంగిపట్ట ఐదువందల తులములును ఒలీవ నూనె సంభారమును మూడు పళ్లును తీసికొని

25 వాటిని ప్రతిష్ఠాభిషేక తైలము, అనగా సుగంధద్రవ్యమేళకుని పనియైన పరిమళసంభారముగా చేయవలెను. అది ప్రతిష్ఠాభిషేక తైలమగును.౹

26 ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును సాక్ష్యపు మందసమును

27 బల్లను దాని ఉపకరణములన్నిటిని దీప వృక్షమును దాని ఉపకరణములను ధూపవేదికను

28 దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటిని గంగాళమును దాని పీటను అభిషేకించి

29 అవి అతిపరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. వాటిని తగులు ప్రతివస్తువు ప్రతిష్ఠితమగును.౹

30 మరియు అహరోనును అతని కుమారులును నాకు యాజకులై యుండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలెను.౹

31 మరియు నీవు ఇశ్రాయేలీయులతో–ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్ఠాభిషేకతైలమై యుండవలెను;౹

32 దానిని నర శరీరముమీద పోయకూడదు; దాని మేళనము చొప్పున దాని వంటి దేనినైనను చేయకూడదు. అది ప్రతిష్ఠితమైనది, అది మీకు ప్రతిష్ఠితమైనదిగా నుండవలెను.౹

33 దానివంటిది కలుపువాడును అన్యునిమీద దానిని పోయువాడును తన ప్రజలలోనుండి కొట్టివేయబడవలెనని చెప్పుము.

34 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను–నీవు పరిమళ ద్రవ్యములను, అనగా జటామాంసి గోపి చందనము గంధపుచెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసికొని

35 వాటితో ధూపద్రవ్యమును చేయవలెను; అది సుగంధద్రవ్యమేళకుని పనిచొప్పున కలపబడి, ఉప్పుగలదియు స్వచ్ఛమైనదియు పరిశుద్ధమైనదియునైన సుగంధ ధూపసంభారము.౹

36 దానిలో కొంచెము పొడిచేసి నేను నిన్ను కలిసికొను ప్రత్యక్షపు గుడారములోని సాక్ష్యపు మందసమునెదుట దాని నుంచవలెను. అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలెను.౹

37 నీవు చేయవలసిన ఆ ధూపద్రవ్యమును దాని మేళనము చొప్పున మీ నిమిత్తము మీరు చేసికొనకూడదు. అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలెను.౹

38 దాని వాసన చూచుటకు దానివంటిది చేయువాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EXO/30-98303de040e44d9ab8cf69d34c5c8078.mp3?version_id=1787—