Categories
యిర్మీయా

యిర్మీయా 16

1 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

2 –ఈస్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహము చేసికొనకూడదు.౹

3 ఈ స్థలమందు పుట్టు కుమారులనుగూర్చియు, కుమార్తెలనుగూర్చియు, వారిని కనిన తల్లులనుగూర్చియు, ఈ దేశములో వారిని కనిన తండ్రులనుగూర్చియు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు

4 –వారు ఘోరమైన మరణము నొందెదరు; వారినిగూర్చి రోదనము చేయబడదు, వారు పాతిపెట్టబడక భూమిమీద పెంటవలె పడియుండెదరు, వారు ఖడ్గముచేతను క్షామముచేతను నశించెదరు; వారి శవములు ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహారముగా ఉండును.౹

5 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నేను ఈ ప్రజలకు నా సమాధానము కలుగనియ్యకయు వారియెడల నా కృపావాత్సల్యములను చూపకయు ఉన్నాను గనుక రోదనముచేయు ఇంటిలోనికి నీవు పోకుము, వారినిగూర్చి అంగలార్చుటకు పోకుము, ఎవరిని ఓదార్చుటకు వెళ్లకుము; ఇదే యెహోవా వాక్కు.౹

6 ఘనులేమి అల్పులేమి యీ దేశమందున్నవారు చనిపోయి పాతిపెట్టబడరు, వారి నిమిత్తము ఎవరును అంగలార్చకుందురు, ఎవరును తమ్మును తాము కోసికొనకుందురు, వారి నిమిత్తము ఎవరును తమ్మును తాము బోడి చేసికొనకుందురు.౹

7 చచ్చినవారినిగూర్చి జనులను ఓదార్చుటకు అంగలార్పు ఆహారము ఎవరును పంచిపెట్టరు; ఒకని తండ్రియైనను తల్లియైనను చనిపోయెనని యెవరును వారికి ఓదార్పు పాత్రను త్రాగనియ్యకుందురు.౹

8 వారియొద్ద కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనుటకు నీవు విందు శాలలో ప్రవేశింపకూడదు.౹

9 సైన్యములకధిపతియు ఇశ్రాయేలు దేవుడునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–మీ కన్నుల ఎదుటనే మీ దినములలోనే సంతోషధ్వనిని ఆనందధ్వనిని పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును ఈ చోట వినబడకుండ మాన్పించెదను.౹

10 నీవు ఈ మాటలన్నియు ఈ ప్రజలకు తెలియ జెప్పిన తరువాత వారు–దేనిబట్టి యెహోవా మాకు ఈ ఘోరబాధ అంతయు నియమించెను? మా దేవుడైన యెహోవాకు విరోధముగా మా దోషమేమి? మాపాప మేమి? అని నిన్నడుగగా

11 నీవు వారితో ఇట్లనుము– యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–మీపితరులు నన్ను విడిచి అన్యదేవతలను అనుసరించి పూజించి వాటికి నమస్కారము చేయుటనుబట్టియే గదా వారు నా ధర్మశాస్త్రమును గైకొనక నన్ను విసర్జించిరి.౹

12 ఆలకించుడి; మీరందరు నా మాట వినకుండ కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు; మీరు మీపితరులకంటె విస్తారముగా చెడుతనము చేసియున్నారు.౹

13 కాబట్టి నేను మీయందు ఏమాత్రమును దయయుంచక, యీ దేశమునుండి మీరైనను మీపితరులైనను ఎరుగని దేశమునకు మిమ్మును వెళ్లగొట్టుచున్నాను; అక్కడ మీరు దివారాత్రము అన్యదేవతలను కొలుచుదురు.

14-15 యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా–నేను వారి పితరులకిచ్చిన దేశమునకు వారిని మరల రప్పించెదను గనుక రాబోవు దినములలో–ఐగుప్తు దేశములోనుండి ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవముతోడని ఇకమీదట అనక–ఉత్తరదేశములోనుండియు ఆయన వారిని తరిమిన దేశములన్నిటిలోనుండియు ఇశ్రాయేలీయులను రప్పించిన యెహోవా జీవముతోడని జనులు ప్రమాణము చేయుదురు.౹

16 ఇదే యెహోవా వాక్కు– వారిని పట్టుకొనుటకు నేను చాలమంది జాలరులను పిలిపించెదను. తరువాత ప్రతి పర్వతముమీదనుండియు ప్రతి కొండమీద నుండియు మెట్టల సందులలోనుండియు వారిని వేటాడి తోలివేయుటకై అనేకులైన వేటగాండ్రను పిలిపించెదను.౹

17 ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి యుంచితిని, ఏదియు నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషమును నాకు మరుగైయుండదు.౹

18 వారు తమ హేయదేవతల కళేబరములచేత నా దేశమును అపవిత్రపరచియున్నారు, తమ హేయక్రియలతో నా స్వాస్థ్యమును నింపియున్నారు గనుక నేను మొదట వారి దోషమునుబట్టియు వారి పాపమునుబట్టియు రెండంతలుగా వారికి ప్రతికారము చేసెదను.౹

19 యెహోవా, నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, భూదిగంతములనుండి జనములు నీ యొద్దకు వచ్చి– మా పితరులు వ్యర్థమును మాయా రూపమును నిష్‌ప్రయోజనమునగు వాటిని మాత్రము స్వతంత్రించుకొనిరని చెప్పుదురు.౹

20 నరులు తమకు దేవతలను కల్పించుకొందురా? అయినను అవి దైవములు కావు.౹

21 కాబట్టి నా నామము యెహోవా అని వారు తెలిసికొనునట్లు నేను ఈ సారి వారికి అనుభవము కలుగజేతును, నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియజేతును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/16-b727787e0aa0ff3a0d5d93d474116b2d.mp3?version_id=1787—

Categories
యిర్మీయా

యిర్మీయా 17

1 వారి కుమారులు తాముకట్టిన బలిపీఠములను, ప్రతి పచ్చని చెట్టుక్రిందనున్న దేవతాస్తంభములను జ్ఞాపకము చేసికొనుచుండగా

2 యూదా పాపము ఇనుపగంట ముతో వ్రాయబడియున్నది; అది వజ్రపు మొనతో లిఖింపబడియున్నది; అది వారి హృదయములనెడి పలకలమీదను చెక్కబడియున్నది. మీ బలిపీఠముల కొమ్ములమీదను చెక్కబడియున్నది.౹

3 పొలములోనున్న నా పర్వతమా, నీ ప్రాంతములన్నిటిలో నీవుచేయు నీ పాపమునుబట్టి నీ ఆస్తిని నీ నిధులన్నిటిని నీ బలిపీఠములను దోపుడుసొమ్ముగా నేనప్పగించుచున్నాను.౹

4 మీరు నిత్యము రగులుచుండు కోపము నాకు పుట్టించితిరి గనుక, నేను నీకిచ్చిన స్వాస్థ్యమును నీ అంతట నీవే విడిచిపెట్టితివి గనుక నీవెరుగని దేశములో నీ శత్రువులకు నీవు దాసుడ వగుదువు.

5 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. –నరులను ఆశ్రయించి శరీరులను తనకాధారముగా చేసికొనుచు తన హృదయమును యెహోవామీదనుండి తొలగించుకొను వాడు శాపగ్రస్తుడు.౹

6 వాడు ఎడారిలోని అరుహావృక్షము వలె ఉండును; మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు, వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమియందును నివసించును.౹

7 యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును.౹

8 వాడు జలములయొద్ద నాటబడిన చెట్టువలె నుండును; అది కాలువల ఓరను దాని వేళ్లు తన్నును; వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగానుండును, వర్షములేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు.౹

9 హృదయము అన్నిటికంటె మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికలది, దాని గ్రహింపగలవాడెవడు?

10 ఒకని ప్రవర్తననుబట్టి వాని క్రియల ఫలముచొప్పున ప్రతి కారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను.౹

11 న్యాయవిరోధముగా ఆస్తి సంపాదించు కొనువాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజుపిట్టవలె నున్నాడు; సగము ప్రాయములో వాడు దానిని విడువ వలసి వచ్చును; అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనబడును.

12 ఉన్నతస్థలముననుండు మహిమగల సింహాసనము మొదటినుండి మా పరిశుద్ధాలయ స్థానము.

13 ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా, నిన్ను విసర్జించి వారందరు సిగ్గునొందుదురు. నాయెడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించియున్నారు గనుక వారు ఇసుకమీద పేరు వ్రాయబడినవారుగా ఉందురు.౹

14 యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థతనొందుదును, నన్ను రక్షించుము నేను రక్షింపబడు దును, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతు డవు.౹

15 వారు–యెహోవా వాక్కు ఎక్కడనున్నది? దాని రానిమ్మని యనుచున్నారు.౹

16 నేను నిన్ను అనుసరించు కాపరినైయుండుట మానలేదు, ఘోరమైన దినమును చూడవలెనని నేను కోరలేదు, నీకే తెలిసియున్నది. నా నోటినుండి వచ్చిన మాట నీ సన్నిధిలోనున్నది.౹

17 ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకుము.౹

18 నన్ను సిగ్గుపడనియ్యక నన్ను తరుము వారిని సిగ్గుపడనిమ్ము నన్ను దిగులుపడనియ్యక వారిని దిగులు పడనిమ్ము, వారిమీదికి ఆపద్దినము రప్పించుము, రెట్టింపు నాశనముతో వారిని నశింపజేయుము.

19 యెహోవా నాకీలాగు సెలవిచ్చియున్నాడు–నీవు వెళ్లి యూదారాజులు వచ్చుచు పోవుచునుండు జనుల గుమ్మము నను యెరూషలేము గుమ్మములన్నిటను నిలిచి జనులలో దీని ప్రకటన చేయుము

20 –యూదారాజులారా, యూదావారలారా, యెరూషలేము నివాసులారా, ఈ గుమ్మములో ప్రవేశించు సమస్తమైనవారలారా, యెహోవా మాట వినుడి.౹

21 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –మీ విషయములో జాగ్రత్తపడుడి, విశ్రాంతిదినమున ఏ బరువును మోయకుడి, యెరూషలేము గుమ్మములలో గుండ ఏ బరువును తీసికొని రాకుడి.౹

22 విశ్రాంతిదినమున మీ యిండ్లలోనుండి యే బరువును మోసికొని పోకుడి, యే పనియు చేయకుడి, నేను మీపితరుల కాజ్ఞాపించినట్లు విశ్రాంతిదినమును ప్రతిష్ఠితదినముగా ఎంచుకొనుడి.౹

23 అయితే వారు వినకపోయిరి, చెవినిబెట్టక పోయిరి, వినకుండను బోధనొందకుండను మొండికి తిరిగిరి.౹

24 మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చెను–మీరు నామాట జాగ్రత్తగా విని, విశ్రాంతిదినమున ఏ పనియు చేయక దాని ప్రతిష్ఠిత దినముగా నెంచి, విశ్రాంతిదినమున ఈ పట్టణపు గుమ్మములలోగుండ ఏ బరువును తీసికొని పోకుండినయెడల

25 దావీదు సింహాసనమందు ఆసీనులై, రథములమీదను గుఱ్ఱములమీదను ఎక్కి తిరుగుచుండు రాజులును అధిపతులును ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశింతురు. వారును వారి అధిపతులును యూదావారును యెరూషలేము నివాసులును ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశింతురు; మరియు ఈ పట్టణము నిత్యము నిలుచును.౹

26 మరియు జనులు దహనబలులను బలులను నైవేద్యములను ధూపద్రవ్యములను తీసికొని యూదా పట్టణములలోనుండియు, యెరూషలేము ప్రాంతములలోనుండియు, బెన్యామీను దేశములోనుండియు, మైదానపు దేశములోనుండియు, మన్యములోనుండియు, దక్షిణదేశములోనుండియు వచ్చె దరు; యెహోవా మందిరమునకు స్తుతియాగ ద్రవ్యములను తీసికొని వచ్చెదరు.౹

27 అయితే మీరు విశ్రాంతిదినమును ప్రతిష్ఠితదినముగా నెంచి, ఆ దినమున బరువులు మోసి కొనుచు యెరూషలేము గుమ్మములలో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు విననియెడల నేను దాని గుమ్మములలో అగ్ని రగులబెట్టెదను, అది యెరూషలేము నగరులను కాల్చివేయును, దానిని ఆర్పుటకు ఎవరికిని సాధ్యము కాకపోవును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/17-78341c100ace6ca46f0466a3593d31b0.mp3?version_id=1787—

Categories
యిర్మీయా

యిర్మీయా 18

1 యెహోవాయొద్దనుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన . వాక్కు

2 –నీవు లేచి కుమ్మరి యింటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును.౹

3 నేను కుమ్మరి యింటికి వెళ్లగా వాడు తన సారెమీద పని చేయుచుండెను.౹

4 కుమ్మరి జిగటమంటితో చేయుచున్నకుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరల తీసికొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరియొకకుండ చేసెను.

5 అంతట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

6 –ఇశ్రాయేలువారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? యిదే యెహోవా వాక్కు – జిగటమన్ను కుమ్మరిచేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలువారలారా, మీరు నా చేతిలో ఉన్నారు.౹

7 దాని పెల్లగింతుననియు, విరుగగొట్టుదుననియు, నశింపజేయుదుననియు ఏదోయొక జనమునుగూర్చి గాని రాజ్యమునుగూర్చి గాని నేను చెప్పి యుండగా

8 ఏ జనమునుగూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనముచేయుట మానినయెడల నేను వారికి చేయనుద్దేశించిన కీడునుగూర్చి సంతాపపడుదును.౹

9 మరియు కట్టెదననియు, నాటెదననియు ఒక జనమునుగూర్చి గాని రాజ్యమునుగూర్చి గాని నేను చెప్పి యుండగా

10 ఆ జనము నా మాట వినకుండ నా దృష్టికి కీడుచేసినయెడల దానికి చేయదలచిన మేలునుగూర్చి నేను సంతాపపడుదును.౹

11 కాబట్టి నీవు వెళ్లి యూదావారితోను యెరూషలేము నివాసులతోను ఇట్లనుము–యెహోవా సెలవిచ్చినమాట ఏదనగా–మీమీదికి తెచ్చుటకై నేను కీడును కల్పించుచున్నాను, మీకు విరోధముగా ఒక యోచనచేయుచున్నాను, మీరందరు మీ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరచుకొనుడి.౹

12 అందుకు వారు–నీ మాట నిష్ ప్రయోజనము; మేము మా ఆలోచనల చొప్పున నడుచు కొందుము, మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తించుదుము అనియందురు.

13 కావున యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–అన్యజనులను అడిగి తెలిసికొనుడి; ఇట్టి క్రియలు జరుగుట వారిలో ఎవడైన వినెనా? ఇశ్రాయేలు కన్యక బహు ఘోరమైన కార్యము చేసియున్నది.౹

14 లెబానోను పొలము లోని బండమీద హిమముండుట మానునా? దూరము నుండి పారుచున్న చల్లని జలములు పారకమానునా?

15 అయితే నా ప్రజలు నన్ను మరిచియున్నారు, మాయకు ధూపము వేయుచున్నారు, మెరకచేయబడని దారిలో తాము నడువవలెనని పురాతన మార్గములైన త్రోవలలో తమ్మును తాము తొట్రిల్ల చేసికొనుచున్నారు.౹

16 వారు ఎల్లప్పుడును అపహాస్యాస్పదముగానుండుటకై తమ దేశమును పాడుగా చేసికొనియున్నారు, దాని మార్గమున నడుచు ప్రతివాడును ఆశ్చర్యపడి తల ఊచును.౹

17 తూర్పు గాలి చెదరగొట్టునట్లు వారి శత్రువులయెదుట నిలువకుండ వారిని నేను చెదరగొట్టెదను; వారి ఆపద్దినమందు వారికి విముఖుడనై వారిని చూడకపోదును.

18 అప్పుడు జనులు–యిర్మీయా విషయమై యుక్తిగల యోచన చేతము రండి, యాజకుడు ధర్మశాస్త్రము విని పించక మానడు, జ్ఞాని యోచనలేకుండ నుండడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు, వాని మాటలలో దేనిని వినకుండ మాటలతో వాని కొట్టుదము రండి అని చెప్పు కొనుచుండిరి.

19 యెహోవా, నా మొఱ్ఱ నాలకించుము, నాతో వాదించువారి మాటను వినుము.౹

20 వారు నా ప్రాణము తీయవలెనని గుంట త్రవ్వియున్నారు; చేసిన మేలునకు ప్రతిగా కీడుచేయవలెనా? వారికి మేలు కలుగవలెనని వారిమీదనుండి నీ కోపము తప్పించుటకై నీ సన్నిధిని నిలిచి నేను వారిపక్షముగా మాటలాడిన సంగతి జ్ఞాపకము చేసికొనుము.౹

21 వారి కుమారులను క్షామమునకు అప్పగింపుము, ఖడ్గబలమునకు వారిని అప్పగింపుము, వారి భార్యలు పిల్లలు లేనివారై విధవరాండ్రగుదురుగాక, వారి పురుషులు మరణహతులగుదురుగాక, వారి యౌవనులు యుద్ధములో ఖడ్గముచేత హతులగుదురు గాక.౹

22 నన్ను పట్టుకొనుటకు వారు గొయ్యి త్రవ్విరి, నా కాళ్లకు ఉరులనొగ్గిరి; వారిమీదికి నీవు ఆకస్మికముగా దండును రప్పించుటవలన వారి యిండ్లలోనుండి కేకలు వినబడును గాక.౹

23 యెహోవా, నాకు మరణము రావలెనని వారు నా మీద చేసిన ఆలోచన అంతయు నీకు తెలిసేయున్నది, వారి దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగనియ్యకుము, నీ సన్నిధినుండి వారి పాపమును తుడిచివేయకుము; వారు నీ సన్నిధిని తొట్రిల్లుదురుగాక, నీకు కోపము పుట్టు కాలమున వారికి తగినపని చేయుము.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/18-991f58fd25f090644ec70409ba94b3a7.mp3?version_id=1787—

Categories
యిర్మీయా

యిర్మీయా 19

1 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–

2 నీవు వెళ్లి కుమ్మరిచేయు మంటి కూజానుకొని, జనుల పెద్దలలో కొందరిని యాజకుల పెద్దలలో కొందరిని పిలుచుకొనిపోయి, హర్సీతు గుమ్మపు ద్వారమునకు ఎదురుగా నున్న బెన్‌హిన్నోము లోయలోనికిపోయి నేను నీతో చెప్పబోవు మాటలు అక్కడ ప్రకటింపుము.౹

3 నీ విట్లనుము –యూదారాజులారా, యెరూషలేము నివాసులారా, యెహోవా మాట వినుడి; సైన్యములకధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఆలకించుడి, దాని సమాచారము వినువారందరికి చెవులు గింగురుమనునంత కీడును నేను ఈ స్థలము మీదికి రప్పింపబోవుచున్నాను.౹

4 ఏలయనగా వారు నన్ను విసర్జించి యీ స్థలములో అపచారము చేసియున్నారు, వారైనను వారి తండ్రులైనను యూదారాజులైనను ఎరుగని అన్యదేవతలకు దానిలో ధూపము వేసి నిరపరాధుల రక్తముచేత ఈ స్థలమును నింపిరి

5 నేను విధింపనిదియు సెలవియ్యనిదియు నా మనస్సునకు తోచ నిదియునైన ఆచారము నాచరించిరి; తమ కుమారులను దహనబలులుగా కాల్చుటకై బయలునకు బలిపీఠములను కట్టించిరి.౹

6 ఇందునుబట్టి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా–రాబోవు దినములలో ఈ స్థలము హత్య లోయ అనబడును గాని తోఫెతు అనియైనను బెన్‍హిన్నోము లోయ అనియైనను పేరు వాడబడదు.౹

7 తమ శత్రువుల యెదుట ఖడ్గముచేతను, తమ ప్రాణములను తీయ వెదకువారిచేతను వారిని కూలజేసి, ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహారముగా వారి కళేబరములను ఇచ్చి, ఈ స్థలములోనే యూదావారి ఆలోచనను యెరూషలేమువారి ఆలోచనను నేను వ్యర్థము చేసెదను.౹

8 ఆ మార్గమున పోవు ప్రతివాడును ఆశ్చర్య పడి దానికి కలిగిన యిడుమలన్నిటిని చూచి అప హాస్యము చేయునంతగా ఈ పట్టణమును పాడుగాను అపహాస్యాస్పదముగాను నేను చేసెదను.౹

9 వారు తమ కుమారుల మాంసమును తమ కుమార్తెల మాంసమును తినునట్లు చేసెదను; తమ ప్రాణము తీయ వెదకు శత్రువులు తమకు ఇబ్బందికలిగించుటకై వేయు ముట్టడినిబట్టియు దానివలన కలిగిన యిబ్బందినిబట్టియు వారిలో ప్రతివాడు తన చెలికాని మాంసము తినును.౹

10 ఈ మాటలు చెప్పినతరువాత నీతోకూడ వచ్చిన మనుష్యులు చూచుచుండగా నీవు ఆ కూజాను పగులగొట్టి వారితో ఈలాగనవలెను

11 –సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–మరల బాగుచేయ నశక్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగులగొట్టునట్లు నేను ఈ జనమును ఈ పట్టణమును పగులగొట్ట బోవుచున్నాను; తోఫెతులో పాతిపెట్టుటకు స్థలములేక పోవునంతగా వారు అక్కడనే పాతిపెట్టబడుదురు.౹

12 యెహోవా వాక్కు ఇదే–ఈ పట్టణమును తోఫెతువంటి స్థలముగా నేను చేయుదును, ఈ స్థలమునకును దాని నివాసులకును నేనాలాగున చేయుదును.౹

13 యెరూషలేము ఇండ్లును యూదారాజుల నగరులును ఆ తోఫెతు స్థలమువలెనే అపవిత్రములగును; ఏ యిండ్లమీద జనులు ఆకాశసమూహమను దేవతలకు ధూపము వేయుదురో, లేక అన్యదేవతలకు పానార్పణములనర్పించుదురో ఆ యిండ్లన్నిటికి ఆలాగే జరుగును.

14 ఆ ప్రవచనము చెప్పుటకు యెహోవా తన్ను పంపిన తోఫెతులోనుండి యిర్మీయా వచ్చి యెహోవా మందిరపు ఆవరణములో నిలిచి జనులందరితో ఈలాగు చెప్పెను.౹

15 –సైన్యములకధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–ఈ జనులు నా మాటలు వినకుండ మొండికి తిరిగియున్నారు గనుక ఈ పట్టణమునుగూర్చి నేను చెప్పిన కీడంతయు దాని మీదికిని దానితో సంబంధించిన పట్టణములన్నిటిమీదికిని రప్పించుచున్నాను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/19-01ebd38ec34e05549624ca7d4160bf44.mp3?version_id=1787—

Categories
యిర్మీయా

యిర్మీయా 20

1 యిర్మీయా ఆ ప్రవచనములను పలుకగా యెహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడునగు పషూరను యాజకుడు విని

2 ప్రవక్తయైన యిర్మీయాను కొట్టి, యెహోవామందిరమందున్న బెన్యామీనుమీది గుమ్మమునొద్దనుండు బొండలో అతనిని వేయించెను.౹

3 మరునాడు పషూరు యిర్మీయాను బొండలోనుండి విడిపింపగా యిర్మీయా అతనితో ఇట్లనెను–యెహోవా నీకు పషూరను పేరు పెట్టడు గాని మాగోర్‌మిస్సాబీబ్అని నీకు పేరు పెట్టును.౹

4 యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–నీకును నీ స్నేహితులకందరికిని నీవే భయ కారణముగా నుండునట్లు చేయుచున్నాను; నీవు చూచుచుండగా వారు తమ శత్రువుల ఖడ్గముచేత కూలెదరు, మరియు యూదావారినందరిని బబులోను రాజుచేతికి అప్పగింతును, అతడు వారిని చెరపెట్టి బబులోనునకు తీసికొనిపోవును, ఖడ్గముచేత వారిని హతముచేయును.౹

5 ఈ పట్టణములోని ఐశ్వర్యమంతయు దానికి వచ్చిన లాభ మంతయు దాని అమూల్యవస్తువులన్నియు యూదారాజుల నిధులన్నియు నేనప్పగింతును, వారి శత్రువుల చేతికే వాటి నప్పగింతును, శత్రువులు వాటిని దోచుకొని పట్టుకొని బబులోనునకు తీసికొనిపోవుదురు.౹

6 పషూరూ, నీవును నీ యింట నివసించువారందరును చెరలోనికి పోవుదురు, నీవును నీవు ప్రవచనములచేత మోసపుచ్చిన నీ స్నేహితులందరును బబులోనునకు వచ్చెదరు, అక్కడనే చనిపోయెదరు అక్కడనే పాతిపెట్టబడెదరు.

7 యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని; నీవు బలవంతముచేసి నన్ను గెలిచితివి, నేను దినమెల్ల నవ్వులపాలైతిని, అందరు నన్ను ఎగతాళి చేయుదురు.౹

8 ఏలయనగా నేను పలుకునప్పుడెల్ల బలాత్కారము జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని యెలుగెత్తి చాటింపవలసి వచ్చెను; దినమెల్ల యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయెను.౹

9 ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమునుబట్టి ప్రకటింపను, అని నేననుకొంటినా? అది నా హృదయములో అగ్నివలె మండుచు నా యెముకలలోనే మూయబడియున్నట్లున్నది; నేను ఓర్చి యోర్చి విసికి యున్నాను, చెప్పక మానలేదు.౹

10 నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. వారు–దుర్మార్గు డని మీరు చాటించినయెడల మేమును చాటింతుమందురు; అతడొకవేళ చిక్కుపడును, అప్పుడు మనమతని పట్టుకొని అతనిమీద పగతీర్చుకొందమని చెప్పుకొనుచు, నాకు స్నేహితులైన వారందరు నేను పడిపోగా చూడవలెనని కనిపెట్టుకొనియున్నారు.౹

11 అయితే పరాక్రమముగల శూరునివలె యెహోవా నాకు తోడైయున్నాడు; నన్ను హింసించువారు నన్ను గెలువక తొట్రిల్లుదురు; వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు, వారెన్నడును మరువబడని నిత్యావమానము పొందుదురు.౹

12 సైన్యములకధిపతివగు యెహోవా, నీతిమంతులను పరిశో ధించువాడవు నీవే; అంతరింద్రియములను హృదయమును చూచువాడవు నీవే; నా వ్యాజ్యెమును నీకే అప్పగించుచున్నాను. నీవు వారికిచేయు ప్రతి దండన నేను చూతును గాక

13 యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి, దుష్టుల చేతిలోనుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు.

14 నేను పుట్టినదినము శపింపబడును గాక; నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండును గాక;౹

15 –నీకు మగపిల్ల పుట్టెనని నా తండ్రికి వర్తమానము తెచ్చి అతనికి అధిక సంతోషము పుట్టించినవాడు శాపగ్రస్తు డగును గాక;౹

16 నా తల్లి నాకు సమాధిగానుండి ఆమె ఎల్లప్పుడు గర్భవతిగానుండునట్లు అతడు గర్భములోనే నన్ను చంపలేదు గనుక

17 యెహోవా యేమాత్రమును సంతాపములేక నశింపజేసిన పట్టణములవలె ఆ మనుష్యుడు ఉండును గాక; ఉదయమున ఆర్తధ్వనిని మధ్యాహ్న కాలమందు యుద్ధధ్వనిని అతడు వినును గాక

18 కష్టమును దుఃఖమును చూచుటకై నా దినములు అవమానముతో గతించిపోవునట్లు నేనేల గర్భములోనుండి వెడలితిని?

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/20-924830ddbe4dec5374a4d24eaa0df47e.mp3?version_id=1787—

Categories
యిర్మీయా

యిర్మీయా 21

1 రాజైన సిద్కియా మల్కీయా కుమారుడైన పషూరును యాజకుడగు మయశేయా కుమారుడైన జెఫన్యాను పిలిపించి

2 –బబులోను రాజైన నెబుకద్రెజరు మనమీద యుద్ధముచేయుచున్నాడు; అతడు మనయొద్దనుండి వెళ్లి పోవునట్లు యెహోవా తన అద్భుతకార్యములన్నిటిని చూపి మనకు తోడైయుండునో లేదో దయచేసి మా నిమిత్తము యెహోవా చేత నీవు విచారించుమని చెప్పుటకు యిర్మీయాయొద్దకు వారిని పంపగా యెహోవాయొద్దనుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు.

3 యిర్మీయా వారితో ఇట్లనెను–మీరు సిద్కియాతో ఈ మాట చెప్పుడి

4 –ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–బబులోను రాజుమీదను, మిమ్మును ముట్టడివేయు కల్దీయులమీదను, మీరుపయో గించుచున్న యుద్ధాయుధములను ప్రాకారముల బయటనుండి తీసికొని యీ పట్టణము లోపలికి వాటిని పోగు చేయించెదను.౹

5 కోపమును రౌద్రమును అత్యుగ్రతయు కలిగినవాడనై, బాహుబలముతోను, చాచిన చేతితోను నేనే మీతో యుద్ధము చేసెదను.౹

6 మనుష్యులనేమి పశువులనేమి యీ పట్టణపు నివాసులనందరిని హతము చేసెదను; గొప్ప తెగులుచేత వారు చచ్చెదరు.౹

7 అటు తరువాత నేను యూదాదేశపు రాజైన సిద్కియాను, అతని ఉద్యోగస్థులను, తెగులును ఖడ్గమును క్షామమును తప్పించుకొని శేషించిన ప్రజలను, బబులోను రాజైన నెబుకద్రెజరుచేతికి, వారి ప్రాణములను తీయజూచువారి శత్రువులచేతికి అప్పగించెదను. అతడు వారియందు అనుగ్రహముంచకయు, వారిని కరుణింపకయు, వారి యెడల జాలిపడకయు వారిని కత్తివాత హతముచేయును.౹

8 ఈ ప్రజలతో నీవిట్లనుము–యెహోవా సెలవిచ్చునదేమనగా–జీవమార్గమును మరణమార్గమును నేను మీ యెదుట పెట్టుచున్నాను.౹

9 ఈ పట్టణములో నిలుచువారు కత్తివలన గాని క్షామమువలనగాని తెగులువలనగాని చచ్చెదరు, మేలుచేయుటకుకాదు కీడుచేయుటకే నేను ఈ పట్టణమునకు అభిముఖుడనైతిని గనుక బయటకు వెళ్లి మిమ్మును ముట్టడి వేయుచున్న కల్దీయులకు లోబడువారు బ్రదుకుదురు; దోపుడుసొమ్ము దక్కినట్లుగా వారి ప్రాణము వారికి దక్కును.౹

10 ఈ పట్టణము బబులోను రాజుచేతికి అప్పగింపబడును, అతడు అగ్నిచేత దాని కాల్చివేయును; ఇదే యెహోవా వాక్కు.

11 యూదారాజు ఇంటివారలకు ఆజ్ఞ యిదే–యెహోవా మాట వినుడి.౹

12 దావీదు వంశస్థులారా, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–అనుదినము న్యాయముగా తీర్పు తీర్చుడి, దోచుకొనబడినవానిని బాధపెట్టువాని చేతిలోనుండి విడిపించుడి, ఆలాగు చేయనియెడల మీ దుష్టక్రియలనుబట్టి నా క్రోధము అగ్నివలె బయలువెడలి, యెవడును ఆర్పలేకుండ మిమ్మును దహించును.౹

13 యెహోవా వాక్కు ఇదే–లోయలో నివసించుదానా, మైదానమందలి బండవంటిదానా, –మా మీదికి రాగలవాడెవడు, మా నివాసస్థలములలో ప్రవేశించువాడెవడు? అనుకొనువారలారా,౹

14 మీ క్రియల ఫలములనుబట్టి మిమ్మును దండించెదను, నేను దాని అరణ్యములో అగ్ని రగుల బెట్టెదను, అది దాని చుట్టునున్న ప్రాంతములన్నిటిని కాల్చివేయును; ఇదే యెహోవా వాక్కు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/21-8c0bf5845df2549bb3d1af0341c15e89.mp3?version_id=1787—

Categories
యిర్మీయా

యిర్మీయా 22

1 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నీవు . యూదారాజు నగరుదిగిపోయి అక్కడ ఈ మాట ప్రకటింపుము

2 దావీదు సింహాసనముమీద కూర్చుండు యూదా రాజా, నీవును ఈ గుమ్మములద్వారా ప్రవేశించు నీ ఉద్యోగస్థులును నీ జనులును యెహోవా మాట వినుడని ప్రకటింపుము.౹

3 యెహోవా ఈలాగు ఆజ్ఞనిచ్చుచున్నాడు –మీరు నీతి న్యాయముల ననుసరించి నడుచుకొనుడి, దోచుకొనబడినవానిని బాధపెట్టువాని చేతిలోనుండి విడి పించుడి, పరదేశులనైనను తండ్రిలేనివారినైనను విధవ రాండ్రనైనను బాధింపకుడి వారికి ఉపద్రవము కలుగజేయకుడి, ఈ స్థలములో నిరపరాధుల రక్తము చిందింపకుడి.౹

4 మీరు నిశ్చయముగా ఈలాగున చేసినయెడల దావీదు సింహాసనముమీద కూర్చుండు రాజులు రథములను గుఱ్ఱములను ఎక్కి తిరుగుచు, ఉద్యోగస్థుల సమేతముగాను జనుల సమేతముగాను ఈ నగరు ద్వారములగుండ ప్రవేశింతురు.౹

5 మీరు ఈ మాటలు విననియెడల ఈ నగరుపాడై పోవును, నా తోడని ప్రమాణము చేయుచున్నాను; ఇదే యెహోవా వాక్కు.౹

6 యూదారాజు వంశస్థులనుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నా యెన్నికలో నీవు గిలాదువలెనున్నావు, లెబానోను శిఖరమువలె ఉన్నావు; అయినను నిశ్చయముగా ఎడారిగాను నివాసులు లేని పట్టణములుగాను నేను నిన్ను చేయుదును.౹

7 నీమీదికి వచ్చుటకైయొక్కొక్కడు తన ఆయుధములను పట్టుకొను సంహారకులను నేను ప్రతిష్ఠించుచున్నాను, వారు నీ దేవదారు చెట్లలో శ్రేష్ఠమైనవాటిని నరికి అగ్నిలో పడ వేతురు.౹

8 అనేక జనులు ఈ పట్టణపు మార్గమున పోవుచు –యెహోవా యెందునిమిత్తము ఈ గొప్పపట్టణమును ఈలాగు చేసెనని యొకని నొకడు అడుగగా

9 అచ్చటి వారు–వీరు తమ దేవుడైన యెహోవా నిబంధనను నిరాకరించి అన్యదేవతలను పూజించి వాటికి నమస్కారము చేసినందున ఆయన ఈలాగున చేసియున్నాడని చెప్పుదురు.

10 చనిపోయినవానిగూర్చి యేడవవద్దు, వానిగూర్చి అంగలార్చవద్దు; వెళ్లిపోవుచున్నవానిగూర్చి బహు రోదనము చేయుడి. వాడు ఇకను తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు.౹

11 తన తండ్రియైన యోషీయాకు ప్రతిగా ఏలిన వాడై యీ స్థలములోనుండి వెళ్లిపోయిన యూదారాజైన యోషీయా కుమారుడగు షల్లూమునుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–అతడు ఇక్కడికి తిరిగి రాడు;౹

12 ఈ దేశమునిక చూడక వారు అతని తీసికొనిపోయిన స్థలమునందే అతడు చచ్చును.

13 నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ; న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు, జీతమియ్యక తన పొరుగువానిచేత ఊరకయే కొలువు చేయించుకొనువానికి శ్రమ.౹

14 వాడు విశాలమైన మేడ గదులుగల గొప్ప మందిరమును కట్టించుకొందుననుకొని, విస్తారమైన కిటికీలు చేసికొనుచు, దేవదారు పలకలను దానికి సరంబీవేయుచు, ఇంగిలీకముతోరంగువేయుచు నున్నాడే;౹

15 నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకొనుటచేత రాజవగుదువా? నీ తండ్రి అన్నపానములుకలిగి నీతిన్యాయముల ననుసరించుచు క్షేమముగా ఉండలేదా?

16 అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రదికెను, ఆలాగున చేయుటే నన్ను తెలిసికొనుట కాదా? యిదే యెహోవా వాక్కు.౹

17 అయితే నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకొనుటయందే, నిరపరాధుల రక్తము ఒలికించుటయందే నిలిచియున్నవి. అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు, అందుకొరకే బలాత్కారము చేయుచున్నావు.౹

18 కావున యోషీయా కుమారుడగు యెహోయాకీమను యూదారాజునుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు – జనులు– అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరీ, అని అతని గూర్చి అంగలార్చరు; అయ్యో నా యేలినవాడా, అయ్యో, శోభావంతుడా; అని అతనికొరకు అంగలార్చరు.౹

19 అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఈడువబడి పారవేయబడి గాడిద పాతిపెట్టబడురీతిగా పాతిపెట్టబడును.

20 నీ విటకాండ్రు నాశనమైరి. లెబానోనును ఎక్కి కేకలువేయుము; బాషానులో బిగ్గరగా అరువుము, అబారీమునుండి కేకలువేయుము.౹

21 నీ క్షేమకాలములలో నీతో మాటలాడితిని గాని–నేను విననని నీవంటివి; నామాట వినకపోవుటే నీ బాల్యమునుండి నీకు వాడుక.౹

22 నీ కాపరులందరు గాలి పీల్చుదురు, నీ విటకాండ్రు చెరలోనికి పోవుదురు, నీ చెడుతనమంతటినిబట్టి నీవు అవమానమునొంది సిగ్గుపడుదువు.౹

23 లెబానోను నివాసినీ, దేవదారు వృక్షములలో గూడు కట్టుకొనినదానా, ప్రసవించు స్త్రీకి కలుగు వేదనవంటి కష్టము నీకు వచ్చునప్పుడు నీవు బహుగా కేకలువేయుదువు గదా!

24 యెహోవా సెలవిచ్చునదేమనగా – యూదా రాజైన యెహోయాకీము కుమారుడగు కొన్యా నా కుడిచేతికి శిఖా ఉంగరముగా ఉండినను దానిమీదనుండియు నిన్ను ఊడదీసివేసెదనని నాతోడని ప్రమాణముచేయుచున్నాను.౹

25 నీ ప్రాణమును ఎవరు తీయజూచుచున్నారో నీవెవరికి భయపడుచున్నావో వారి చేతికి, అనగా బబులోను రాజైన నెబుకద్రెజరు చేతికిని కల్దీయుల చేతికిని నిన్ను అప్పగించుచున్నాను.౹

26 నిన్నును నిన్ను కనిన నీ తల్లిని మీ జన్మ భూమికాని పరదేశములోనికి విసరివేసెదను, మీరు అక్కడనే చచ్చెదరు.౹

27 వారు తిరిగి రావలెనని బహుగా ఆశ పడు దేశమునకు వారు తిరిగి రారు.౹

28 కొన్యా అను ఇతడు హేయమైన ఓటికుండ వంటివాడా? పనికిమాలిన ఘటమా? అతడును అతని సంతానమును విసరివేయబడి, తామెరుగని దేశములోనికి ఏల త్రోయబడిరి?

29 దేశమా, దేశమా, దేశమా, యెహోవా మాట వినుము.౹

30 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–సంతానహీనుడనియు, తన దినములలో వర్ధిల్లనివాడనియు ఈ మనుష్యునిగూర్చి వ్రాయుడి; అతని సంతానములో ఎవడును వర్ధిల్లడు, వారిలో ఎవడును దావీదు సింహాసనమందు కూర్చుండడు; ఇక మీదట ఎవడును యూదాలో రాజుగా నుండడు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/22-868c63bc164e4ab604785e0f10b149ba.mp3?version_id=1787—

Categories
యిర్మీయా

యిర్మీయా 23

1 యెహోవా వాక్కు ఇదే–నా మందలో చేరిన . గొఱ్ఱెలను నశింపజేయుచు చెదరగొట్టు కాపరులకు శ్రమ.౹

2 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపరులనుగూర్చి యీలాగున సెలవిచ్చుచున్నాడు –మీరు నా గొఱ్ఱెలనుగూర్చి విచారణచేయక, నేను మేపుచున్న గొఱ్ఱెలను చెదరగొట్టి పారదోలితిరి; ఇదిగో మీ దుష్‌క్రియలనుబట్టి మిమ్మును శిక్షింపబోవుచున్నాను; ఇదే యెహోవా వాక్కు.౹

3 మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలోనుండి నా గొఱ్ఱెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించెదను; అవి అభివృద్ధిపొంది విస్తరించును.౹

4 నేను వాటి మీద కాపరులను నియమించెదను; ఇకమీదట అవి భయపడకుండను బెదరి పోకుండను వాటిలో ఒకటైనను తప్పిపోకుండను వీరు నా గొఱ్ఱెలను మేపెదరు; ఇదే యెహోవా వాక్కు.

5 యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు–రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను; అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమిమీద నీతి న్యాయములను జరిగించును.౹

6 అతని దినములలో యూదా రక్షణనొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతియని అతనికి పేరు పెట్టుదురు.౹

7 కాబట్టి రాబోవు దినములలో జనులు ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములోనుండి రప్పించిన యెహోవా జీవము తోడని యిక ప్రమాణముచేయక

8 ఉత్తర దేశములోనుండియు, నేను వారిని చెదరగొట్టిన దేశములన్నిటిలోనుండియు వారిని రప్పించిన యెహోవానగు నాతోడని ప్రమాణము చేతురని యెహోవా సెలవిచ్చుచున్నాడు; మరియు వారు తమ దేశములో నివసింతురు.

9 ప్రవక్తలనుగూర్చినది. యెహోవానుగూర్చియు ఆయన పరిశుద్ధమైన మాటలనుగూర్చియు నా గుండె నాలో పగులుచున్నది, నా యెముకలన్నియు కదలుచున్నవి, నేను మత్తిల్లినవానివలెను ద్రాక్షారసవశుడైన బలాఢ్యునివలెను ఉన్నాను.౹

10 దేశము వ్యభిచారులతో నిండియున్నది, జనుల నడవడి చెడ్డదాయెను, వారి శౌర్యము అన్యాయమున కుపయోగించుచున్నది గనుక శాపగ్రస్తమై దేశము దుఃఖపడుచున్నది; అడవిబీళ్లు ఎండిపోయెను.౹

11 ప్రవక్తలేమి యాజకులేమి అందరును అపవిత్రులు; నా మందిరములో వారి చెడుతనము నాకు కనబడెను; ఇదే యెహోవా వాక్కు.౹

12 వారి దండన సంవత్సరమున వారి మీదికి నేను కీడు రప్పించుచున్నాను గనుక గాఢాంధకారములో నడుచువానికి జారుడు నేలవలె వారి మార్గముండును; దానిలో వారు తరుమబడి పడిపోయెదరు; ఇదే యెహోవా వాక్కు.౹

13 షోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచితిని; వారు బయలు పేరట ప్రవచనము చెప్పి నా జనమైన ఇశ్రాయేలును త్రోవ తప్పించిరి.౹

14 యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని, వారు వ్యభిచారులు అసత్య వర్తనులు, ఎవడును తన దుర్మార్గతనుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరచుదురు, వారందరు నా దృష్టికి సొదొమ వలెనైరి, దాని నివాసులు గొమొఱ్ఱావలెనైరి.

15 కావున సైన్యములకధిపతియగు యెహోవా ఈ ప్రవక్త లనుగూర్చి సెలవిచ్చునదేమనగా–యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతట వ్యాపించెను గనుక తినుటకు మాచిపత్రియు త్రాగుటకు చేదునీళ్లును నేను వారి కిచ్చుచున్నాను.౹

16 సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి, వారు మిమ్మును భ్రమ పెట్టుదురు.౹

17 వారు నన్ను తృణీకరించు వారితో–మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చెననియు; ఒకడు తన హృదయమూర్ఖత చొప్పున నడవగా వానితో–మీకు కీడు రాదనియు చెప్పుచు, యెహోవా ఆజ్ఞనుబట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమునుబట్టి పలుకుదురు.౹

18 యెహోవా మాట విని గ్రహించునట్లు ఆయన సభలో నిలుచువాడెవడు? నా మాటను గ్రహించునట్లు దాని లక్ష్యము చేసినవాడెవడు?

19 ఇదిగో యెహోవాయొక్క మహోగ్రతయను పెనుగాలి బయలువెళ్లుచున్నది; అది భీకరమైన పెనుగాలి, అది దుష్టుల తలమీదికి పెళ్లున దిగును.౹

20 తన కార్యమును సఫలపరచువరకును తన హృదయా లోచనలను నెరవేర్చువరకును యెహోవా కోపము చల్లారదు; అంత్యదినములలో ఈ సంగతిని మీరు బాగుగా గ్రహించుదురు.౹

21 నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరుగెత్తి వచ్చెదరు, నేను వారితో మాటలాడకుండినను వారు ప్రకటించెదరు.౹

22 వారు నా సభలో చేరిన వారైనయెడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియ జేతురు, దుష్‌క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచి పెట్టునట్లు వారిని త్రిప్పియుందురు; ఇదే యెహోవా వాక్కు.౹

23 –నేను సమీపముననుండు దేవుడనుమాత్ర మేనా? దూరముననుండు దేవుడనుకానా?

24 యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా–నాకు కనబడకుండ రహస్య స్థలములలో దాగగలవాడెవడైనకలడా? నేను భూమ్యాకాశముల యందంతట నున్నవాడను కానా? యిదే యెహోవా వాక్కు.౹

25 –కలకంటిని కలకంటిని అని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను వినియున్నాను.౹

26 ఇక నెప్పటివరకు ఈలాగున జరుగుచుండును? తమ హృదయకాపట్యమునుబట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు దీని నాలో చింపరా?

27 బయలును పూజింపవలెనని తమపితరులు నా నామమును మరచినట్లు వీరందరు తమ పొరుగువారితో చెప్పు కలలచేత నా జనులు నా నామమును మరచునట్లు చేయవలెనని యోచించుచున్నారా?

28 కలకనిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను; నా వాక్కు ఎవనికుండునో వాడు సత్యమునుబట్టి నా మాట చెప్పవలెను; ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఇదే యెహోవా వాక్కు.౹

29 నా మాట అగ్నివంటిదికాదా? బండను బద్దలుచేయు సుత్తెవంటిది కాదా?

30 కాబట్టి తమ జతవానియొద్దనుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని; ఇదే యెహోవా వాక్కు.౹

31 స్వేచ్ఛగా నాలుకల నాడించుకొనుచు దేవో క్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని; ఇదే యెహోవా వాక్కు.౹

32 మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు, అబద్ధములచేతను, మాయాప్రగల్భత చేతను నా ప్రజలను దారి తొలగించువారికి నేను విరో ధినై యున్నాను; ఇదే యెహోవా వాక్కు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారు ఈ జనులకు ఏమాత్రమును ప్రయోజనకారులు కారు; ఇదే యెహోవా వాక్కు.౹

33 మరియు ఈ జనులలో ఒకడు ప్రవక్తయే గాని యాజకుడే గాని యెహోవా భారమేమి అని నిన్నడుగునప్పుడు నీవు వారితో ఇట్లనుము–మీరే ఆయనకు భారము; మిమ్మును ఎత్తి పారవేతును; ఇదే యెహోవా వాక్కు. మరియు

34 –ప్రవక్తయే గాని యాజకుడే గాని సామాన్యుడే గాని యెహోవా భారమను మాట ఎత్తువాడెవడైనను, వానిని వాని యింటివారిని నేను దండించెదను.౹

35 అయితే యెహోవా ప్రత్యుత్తరమేది? యెహోవా యేమని చెప్పుచున్నాడు? అని మీరు మీ పొరుగువారితోను సహోదరులతోను ప్రశంసించవలెను.౹

36 యెహోవా భారమను మాట మీరికమీదట జ్ఞాపకము చేసికొనవద్దు; జీవముగల మన దేవుని మాటలను, సైన్యములకధిపతియు దేవుడునగు యెహోవా మాటలను, మీరు అపార్థముచేసితిరి; కాగా ఎవనిమాట వానికే భారమగును.౹

37 యెహోవా నీకేమని ప్రత్యుత్తర మిచ్చుచున్నాడనియు, యెహోవా యేమి చెప్పుచున్నాడనియు మీరు ప్రవక్తను అడుగవలెను గాని యెహోవా భారమను మాట మీరెత్తినయెడల

38 అందునుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–మీరు యెహోవా భారమను మాట యెత్తవద్దని నేను మీకు ఆజ్ఞ ఇచ్చినను మీరు యెహోవా భారమను మాట యెత్తుచునే యున్నారు.౹

39 కాగా నేను మిమ్మును ఎత్తివేయుచున్నాను, మీకును మీపితరులకును నేనిచ్చిన పట్టణమును నా సన్నిధినుండి పారవేయుచున్నాను.౹

40 ఎన్నడును మరువబడని నిత్యాపవాదమును నిత్యావమానమును మీమీదికి రప్పించెదను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/23-1e92bdc4b7b8fecf87ddf25547193d0c.mp3?version_id=1787—

Categories
యిర్మీయా

యిర్మీయా 24

1 బబులోను రాజైన నెబుకద్రెజరు యూదారాజైన యెహోయాకీము కుమారుడగు యెకోన్యాను యూదా ప్రధానులను శిల్పకారులను కంసాలులను యెరూషలేము నుండి చెరపట్టుకొని బబులోనునకు తీసికొనిపోయిన తరువాత యెహోవా నాకు చూపగా యెహోవా మందిరము ఎదుట ఉంచబడిన రెండు గంపల అంజూరపు పండ్లు నాకు కనబడెను.౹

2 ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరపు పండ్లవంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లుండెను. రెండవ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరపు పండ్లుండెను; అవి తిన శక్యముకానంతగా జబ్బువి.౹

3 యెహోవా–యిర్మీయా, నీకేమి కనబడుచున్నదని నన్నడుగగా నేను–అంజూరపు పండ్లు కనబడుచున్నవి, మంచివి మిక్కిలి మంచివిగాను జబ్బువి మిక్కిలి జబ్బువిగాను, తిన శక్యముకానంత జబ్బువిగాను కనబడుచున్నవంటిని.౹

4 అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

5 –ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా–వారికి మేలుకలుగవలెనని ఈ స్థలము నుండి నేను కల్దీయుల దేశమునకు చెరగా పంపు యూదులను, ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్యపెట్టునట్లు లక్ష్యపెట్టుచున్నాను.౹

6 వారికి మేలు కలుగునట్లు నేను వారిమీద దృష్టియుంచుచు, ఈ దేశమునకు వారిని మరల తీసికొనివచ్చి, పడగొట్టక వారిని కట్టెదను, పెల్ల గింపక వారిని నాటెదను.౹

7 వారు పూర్ణహృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడనగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారి కిచ్చెదను.౹

8 మరియు యూదారాజైన సిద్కియాను అతని ప్రధానులను దేశములో శేషించిన వారిని ఐగుప్తు దేశమున నివసించువారిని, మిక్కిలి జబ్బువై నందున తినశక్యముకాని ఆ జబ్బు అంజూరపుపండ్లవలె ఉండజేసెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹

9 మరియు వారు యిటు అటు చెదరగొట్టబడుటకై భూరాజ్యములన్నిటిలోను, నేను వారిని తోలివేయు స్థలములన్నిటిలోను, వారిని భీతికరముగాను నిందాస్పదముగాను సామెతగాను అపహాస్యముగాను శాపాస్పదముగాను ఉండజేసెదను.౹

10 నేను వారికిని వారి పితరులకును ఇచ్చిన దేశములో ఉండకుండ వారు పాడైపోవువరకు నేను ఖడ్గమును క్షామమును తెగులును వారిలోకి పంపెదను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/24-772af6563c79aaa5d067336137dd9fce.mp3?version_id=1787—

Categories
యిర్మీయా

యిర్మీయా 25

1 యోషీయా కుమారుడును యూదారాజునైన యెహోయాకీము నాలుగవ సంవత్సరమున, అనగా బబులోనురాజైన నెబుకద్రెజరు మొదటి సంవత్సరమున యూదా ప్రజలందరినిగూర్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు.౹

2 ప్రవక్తయైన యిర్మీయా యూదా ప్రజలందరితోను యెరూషలేము నివాసులందరితోను ఆ వాక్కును ప్రకటించెను.౹

3 ఆమోను కుమారుడును యూదారాజు నైన యోషీయా పదుమూడవ సంవత్సరము మొదలుకొని నేటివరకు ఈ యిరువది మూడు సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమగుచువచ్చెను; నేను పెందలకడ లేచి మీకు ఆ మాటలు ప్రకటించుచు వచ్చినను మీరు వినకపోతిరి.౹

4-6 –మీ చేతిపనులవలన నాకు కోపము పుట్టించకుండునట్లును, నేను మీకు ఏ బాధయు కలుగ జేయకుండునట్లును, అన్యదేవతలను అనుసరించుటయు, వాటిని పూజించుటయు, వాటికి నమస్కారముచేయుటయు మాని, మీరందరు మీ చెడ్డమార్గమును మీ దుష్ట క్రియలను విడిచిపెట్టి తిరిగినయెడల, యెహోవా మీకును మీపితరులకును నిత్యనివాసముగా దయచేసిన దేశములో మీరు నివసింతురని చెప్పుటకై, యెహోవా పెందలకడ లేచి ప్రవక్తలైన తన సేవకులనందరిని మీయొద్దకు పంపుచు వచ్చినను మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవియొగ్గకుంటిరి.౹

7 అయితే–మీకు బాధ కలుగుటకై మీ చేతుల పనులవలన నాకు కోపము పుట్టించి మీరు నా మాట ఆలకింపక పోతిరని యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹

8-9 సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–మీరు నా మాటలను ఆలకింపక పోతిరి గనుక నేను ఉత్తరదేశములోనున్న సర్వజనములను, నా సేవకుడైన నెబుకద్రెజరను బబులోనురాజును పిలువనంపించుచున్నాను; ఈ దేశముమీదికిని దీని నివాసులమీదికిని చుట్టునున్న యీ జనులందరి మీదికిని వారిని రప్పించుచున్నాను; ఈ జనులను శాపగ్రస్తులగాను విస్మ యాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికిని పాడుగాను ఉండజేసెదను.౹

10 సంతోషనాదమును ఉల్లాస శబ్దమును, పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును తిరుగటిరాళ్ల ధ్వనిని దీపకాంతిని వారిలో ఉండకుండ చేసెదను.౹

11 ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును; ఈ జనులు డెబ్బది సంవత్సరములు బబులోనురాజునకు దాసులుగా ఉందురు.౹

12 యెహోవా వాక్కు ఇదే–డెబ్బది సంవత్సరములు గడచిన తరువాత వారి దోషములనుబట్టి నేను బబులోనురాజును ఆ జనులను కల్దీయుల దేశమును శిక్షింతును; ఆ దేశము ఎప్పుడు పాడుగనుండునట్లు నియమింతును.౹

13 నేను ఆ దేశమునుగూర్చి సెలవిచ్చిన మాటలన్నియు యిర్మీయా ఈ జనములన్నిటినిగూర్చి ప్రకటింపగా, ఈ గ్రంథములో వ్రాయ బడినదంతయు ఆ దేశముమీదికి రప్పించెదను.౹

14 ఏలయనగా నేను వారి క్రియలనుబట్టియు వారి చేతి కార్యములనుబట్టియు వారికి ప్రతికారముచేయునట్లు అనేక జనములును మహారాజులును వారిచేత సేవ చేయించు కొందురు.

15 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాకీలాగు సెలవిచ్చుచున్నాడు–నీవు ఈ క్రోధపు మద్యపాత్రను నా చేతిలోనుండి తీసికొని, నేను నిన్ను పంపుచున్న జనములన్నిటికి దాని త్రాగింపుము.౹

16 వారు దాని త్రాగి సొక్కి సోలుచు నేను వారిమీదికి పంపుచున్న ఖడ్గమునుబట్టి వెఱ్ఱివాండ్రగుదురు.౹

17 అంతట యెహోవా చేతిలోనుండి నేను ఆ పాత్రను తీసికొని, యెహోవా నన్ను పంపిన జనములన్నిటికి దాని త్రాగించితిని.౹

18 నేటివలెనే పాడుగాను నిర్జనముగాను అపహాస్యాస్పదముగాను శాపాస్పదముగాను చేయుటకు యెరూషలేమునకును యూదా పట్టణములకును దాని మహారాజులకును దాని అధిపతులకును త్రాగించితిని.౹

19 మరియు ఐగుప్తురాజైన ఫరోయును అతని దాసులును అతని ప్రధానులును అతని జనులందరును

20 సమస్తమైన మిశ్రిత జనులును ఊజుదేశపు రాజులందరును ఫిలి ష్తీయుల దేశపు రాజులందరును అష్కెలోనును, గాజయును, ఎక్రోనును అష్డోదు శేషపువారును

21 ఎదోమీయులును మోయాబీయులును అమ్మోనీయులును

22 తూరు రాజులందరును సీదోను రాజులందరును సముద్రమునకు ఆవలి ద్వీపపు రాజులును

23 దదానీయులును తేమానీయులును బూజీయులును గడ్డపుప్రక్కలను కత్తిరించుకొనువారందరును

24 అరబిదేశపు రాజులందరును అరణ్యములో నివసించు మిశ్రితజనముల రాజులందరును

25 జిమ్రీ రాజులందరును ఏలాము రాజులందరును మాదీయుల రాజులందరును

26 సమీపమున ఉన్నవారేమి దూరమున ఉన్నవా రేమి ఉత్తరదేశముల రాజులందరును భూమిమీదనున్న రాజ్యములన్నియు దానిలోనిది త్రాగుదురు; షేషకురాజు వారి తరువాత త్రాగును.౹

27 నీవు వారితో ఈలాగు చెప్పుము–ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియు నైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నేను మీమీదికి పంపబోవు యుద్ధముచేత త్రాగి మత్తిల్లి కక్కు కొనినవారివలెనేయుండి మీరు మరల లేవకుండ పడుదురు.౹

28 మేము త్రాగమని వారు నీ చేతిలోనుండి ఆ పాత్రను తీసికొననొల్లని యెడల నీవు వారితో ఇట్లనుము –మీరు అవశ్యముగా దాని త్రాగవలెనని సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹

29 నా పేరు పెట్టబడిన పట్టణమునకు నేను కీడుచేయ మొదలుపెట్టగా మీకు శిక్షలేకుండ పోవునా? మీరు శిక్షింపబడకపోరు. భూలోక నివాసులందరిమీదికి నేను ఖడ్గమును రప్పించుచున్నాను; ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు.౹

30 కాబట్టి నీవు ఈ మాటలన్నిటిని వారికి ప్రకటించి, ఈలాగు చెప్పవలెను–ఉన్నతస్థలములోనుండి యెహోవా గర్జించుచున్నాడు, తన పరిశుద్ధాలయములోనుండి తన స్వరమును వినిపించుచున్నాడు, తన మంద మేయు స్థలమునకు విరోధముగా గర్జించుచున్నాడు, ద్రాక్షగానుగను త్రొక్కువారివలె అరచుచు ఆయన భూలోక నివాసులకందరికి విరోధముగా ఆర్భటించుచున్నాడు.౹

31 భూమ్యంతమువరకు సందడి వినబడును, యెహోవా జనములతో వ్యాజ్యెమాడుచున్నాడు, శరీరులందరితో ఆయన వ్యాజ్యెమాడుచున్నాడు, ఆయన దుష్టులను ఖడ్గమునకు అప్పగించుచున్నాడు; ఇదే యెహోవా వాక్కు.

32 సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–జనమునుండి జనమునకు కీడు వ్యాపించు చున్నది, భూదిగంతములనుండి గొప్ప తుపాను బయలు వెళ్లుచున్నది.౹

33 ఆ దినమున యెహోవాచేత హతులైనవారు ఈ దేశముయొక్క యీ దిశనుండి ఆ దిశవరకు కనబడుదురు. ఎవరును వారినిగూర్చి అంగలార్చరు, వారిని సమకూర్చరు, పాతిపెట్టరు, పెంటవలె వారి శవములు నేలమీద పడియుండును.౹

34 మందకాపరులారా, గోలలెత్తుడి, మొఱ్ఱపెట్టుడి; మందలోని ప్రధానులారా, బూడిద చల్లుకొనుడి. మీరు మరణమునొందుటకై దినములు పూర్తియాయెను, నేను మిమ్మును చెదరగొట్టెదను, రమ్యమైన పాత్రవలె మీరు పడుదురు.౹

35 మందకాపరులకు ఆశ్రయస్థలము లేకపోవును, మందలోని శ్రేష్ఠమైన వాటికి రక్షణ దొరకకపోవును,౹

36 ఆలకించుడి, మంద కాపరుల మొఱ్ఱ వినబడుచున్నది, మందలోని ప్రధానుల గోలవినబడుచున్నది, యెహోవావారి మేతభూమినిపాడు చేసియున్నాడు.౹

37 నెమ్మదిగల మేతస్థలములు యెహోవా కోపాగ్నిచేత పాడాయెను;౹

38 క్రూరమైన ఖడ్గముచేతను ఆయన కోపాగ్నిచేతను వారి దేశము పాడుకాగా సింహము తన మరుగును విడిచినట్లు ఆయన తన మరుగును విడిచెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/25-fc7f159d1fa95ec5f02d04e676fd3680.mp3?version_id=1787—