Categories
నిర్గమకాండము

నిర్గమకాండము 11

1 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను–ఫరో మీదికిని ఐగుప్తుమీదికిని ఇంకొక తెగులును రప్పించెదను. అటుతరువాత అతడు ఇక్కడనుండి మిమ్మును పోనిచ్చును. అతడు మిమ్మును పోనిచ్చునప్పుడు ఇక్కడనుండి మిమ్మును బొత్తిగా వెళ్లగొట్టును.౹

2 కాబట్టి తన చెలికానియొద్ద ప్రతి పురుషుడును తన చెలికత్తెయొద్ద ప్రతి స్త్రీయును వెండి నగలను బంగారు నగలను అడిగి తీసికొనుడని ప్రజలతో చెప్పుము.౹

3 యెహోవా ప్రజలయెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను; అదిగాక ఐగుప్తుదేశములో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయెను.

4 మోషే ఫరోతో ఇట్లనెను–యెహోవా సెలవిచ్చిన దేమనగా–మధ్యరాత్రి నేను ఐగుప్తుదేశములోనికి బయలు వెళ్లెదను.౹

5 అప్పుడు సింహాసనముమీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలుకొని తిరగలి విసురు దాసి తొలిపిల్లవరకు ఐగుప్తుదేశమందలి తొలిపిల్లలందరును చచ్చెదరు; జంతు వులలోను తొలిపిల్లలన్నియు చచ్చును.౹

6 అప్పుడు ఐగుప్తు దేశమందంతట మహా ఘోష పుట్టును. అట్టి ఘోష అంతకుముందు పుట్టలేదు, అట్టిది ఇకమీదట పుట్టదు.౹

7 యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియబడునట్లు, మనుష్యులమీదగాని జంతు వులమీదగాని ఇశ్రాయేలీయులలో ఎవరిమీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు.౹

8 అప్పుడు నీ సేవకు లైన వీరందరు నా యొద్దకు వచ్చి నాకు నమస్కారము చేసి–నీవును, నిన్ను ఆశ్రయించియున్న యీ ప్రజలందరును బయలు వెళ్లుడని చెప్పుదురు. ఆ తరువాత నేను వెళ్లుదుననెను. మోషే ఆలాగు చెప్పి ఫరో యొద్దనుండి అత్యాగ్రహముతో వెళ్లిపోయెను.

9 అప్పుడు యెహోవా–ఐగుప్తుదేశములో నా మహ త్కార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పెను.౹

10 మోషే అహరోనులు ఫరో యెదుట ఈ మహత్కార్యములను చేసిరి. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు తన దేశములోనుండి ఇశ్రాయేలీయులను పోనియ్య డాయెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EXO/11-870da56cb47f1f0171ff9b607e2c35a6.mp3?version_id=1787—

Categories
నిర్గమకాండము

నిర్గమకాండము 12

1 మోషే అహరోనులు ఐగుప్తుదేశములో ఉండగా యెహోవావారితో ఈలాగు సెలవిచ్చెను

2 – నెలలలో ఈ నెల మీకు మొదటిది, యిది మీ సంవత్సరమునకు మొదటి నెల.౹

3 మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో–ఈ నెల దశమినాడు వారు తమతమ కుటుంబముల లెక్కచొప్పున ఒక్కొక్కడు గొఱ్ఱెపిల్లనైనను, మేకపిల్లనైనను, అనగా ప్రతి యింటికిని ఒక గొఱ్ఱెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసికొనవలెను.౹

4 ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలక పోయినయెడలవాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాని తీసికొనవలెను.౹

5 ఆ గొఱ్ఱెపిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితినిబట్టి వారిని లెక్కింపవలెను.౹

6 నిర్దోషమైన యేడాది మగపిల్లను తీసికొనవలెను. గొఱ్ఱెలలోనుండి యైనను మేకలలోనుండియైనను దాని తీసికొనవచ్చును.౹

7 ఈ నెల పదునాలుగవ దినమువరకు మీరు దాని నుంచు కొనవలెను; తరువాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరు తమతమ కూటములలో సాయంకాలమందు దాని చంపి దాని రక్తము కొంచెము తీసి, తాము దాని తిను యిండ్లద్వారబంధపు రెండు నిలువు కమ్ములమీదను పై కమ్మి మీదను చల్లి

8 ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదుకూరలతో దాని తినవలెను

9 దాని తలను దాని కాళ్లను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాని తినవలెను;౹

10 దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తిననే తినకూడదు; ఉదయకాలమువరకు దానిలోనిదేదియు మిగిలింపకూడదు. ఉదయకాలమువరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చి వేయవలెను.౹

11 మీరు దానిని తినవలసిన విధమేదనగా, మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కఱ్ఱలు చేతపట్టుకొని, త్వరపడుచు దాని తినవలెను; అది యెహోవాకు పస్కాబలి.౹

12 ఆ రాత్రి నేను ఐగుప్తుదేశమందు సంచరించి, ఐగుప్తుదేశమందలి మనుష్యులలోనేగాని జంతు వులలోనేగాని తొలి సంతతియంతయు హతముచేసి, ఐగుప్తు దేవతలకందరికిని తీర్పు తీర్చెదను; నేను యెహోవాను.౹

13 మీరున్న యిండ్లమీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయెదను. నేను ఐగుప్తుదేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు.౹

14 కాబట్టి యీ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును. మీరు యెహోవాకు పండుగగా దాని నాచరింపవలెను; తరతరములకు నిత్యమైనకట్టడగా దాని నాచరింపవలెను.౹

15 ఏడుదినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటిదినమున మీ యిండ్లలోనుండి పొంగినది పార వేయవలెను. మొదటి దినము మొదలుకొని యేడవ దినమువరకు పులిసినదానిని తిను ప్రతిమనుష్యుడు ఇశ్రాయేలీయులలోనుండి కొట్టివేయబడును.౹

16 ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను, ఏడవదినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినములయందు ప్రతివాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును; అదియుగాక మరి ఏ పనియు చేయకూడదు.౹

17 పులియనిరొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను. ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించితిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినము నాచరింపవలెను; ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును.౹

18 మొదటి నెల పదునాలుగవదినము సాయంకాలము మొదలుకొని ఆ నెల యిరువది యొకటవదినము సాయంకాలమువరకు మీరు పులియనిరొట్టెలను తినవలెను.౹

19 ఏడు దినములు మీ యిండ్లలో పొంగినదేదియును ఉండకూడదు, పులిసిన దానిని తినువాడు అన్యుడేగాని దేశములో పుట్టినవాడేగాని ఇశ్రాయేలీయుల సమాజములో నుండక కొట్టివేయబడును.౹

20 మీరు పులిసినదేదియు తినక మీ నివాసములన్నిటిలోను పులియని వాటినే తినవలెనని చెప్పుమనెను.

21 కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దల నందరిని పిలిపించి వారితో ఇట్లనెను–మీరు మీ కుటుంబముల చొప్పున మందలోనుండి పిల్లను తీసికొని పస్కా పశువును వధించుడి.౹

22 మరియు హిస్సోపు కుంచె తీసికొని పళ్లెములోనున్న రక్తములో దాని ముంచి, ద్వారబంధపు పైకమ్మికిని రెండు నిలువు కమ్ములకును పళ్లెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలో నెవరును ఉదయమువరకు తన యింటి ద్వారమునుండి బయలు వెళ్లకూడదు.౹

23 యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారముచేయుచు, ద్వారబంధపు పైకమ్మిమీదను రెండు నిలువు కమ్ములమీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును; మిమ్ము హతము చేయుటకు మీ యిండ్లలోనికి సంహారకుని చొరనియ్యడు.౹

24 కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను.౹

25 యెహోవా తాను సెలవిచ్చినట్లు మీ కిచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీని నాచరింపవలెను.౹

26 మరియు మీ కుమారులు–మీరు ఆచరించు ఈ ఆచారమేమిటని మిమ్ము నడుగునప్పుడు

27 మీరు–ఇది యెహోవాకు పస్కాబలి; ఆయన ఐగుప్తీ యులను హతము చేయుచు మన యిండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయులయిండ్లను విడిచి పెట్టెను అనవలెనని చెప్పెను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారముచేసిరి.౹

28 అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్లి ఆలాగుచేసిరి; యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి.

29 అర్ధరాత్రివేళ జరిగినదేమనగా, సింహాసనముమీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీయొక్క తొలిపిల్లవరకు ఐగుప్తుదేశమందలి తొలిపిల్లల నందరిని పశువుల తొలిపిల్లలనన్నిటిని యెహోవా హతము చేసెను.౹

30 ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరును ఐగుప్తీయులందరును లేచినప్పుడు శవములేని ఇల్లు ఒకటైన లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను.౹

31 ఆ రాత్రివేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో –మీరును ఇశ్రాయేలీయులును లేచి నా ప్రజలమధ్యనుండి బయలు వెళ్లుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి.౹

32 మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసికొని పోవుడి; నన్ను దీవించుడని చెప్పెను.౹

33 ఐగుప్తీయులు–మనమందరము చచ్చిన వారమనుకొని, తమ దేశములోనుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతముచేసిరి.౹

34 కాబట్టి ప్రజలు తమ పిండిముద్దను తీసికొని, అది పులియకమునుపే పిండి పిసుకు తొట్లతో దానిని మూటకట్టుకొని, తమ భుజములమీద పెట్టుకొనిపోయిరి.౹

35 ఇశ్రాయేలీయులు మోషే మాటచొప్పున చేసి ఐగుప్తీయులయొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసికొనిరి.౹

36 యెహోవా ప్రజల యెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను గనుక వారు వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లువారు ఐగుప్తీయులను దోచుకొనిరి.

37 అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేసునుండి సుక్కో తుకు ప్రయాణమైపోయిరి వారు పిల్లలు గాక కాల్బలము ఆరులక్షల వీరులు.౹

38 అనేకులైన అన్యజనుల సమూహమును, గొఱ్ఱెలు ఎద్దులు మొదలైన పశువుల గొప్పమందయును వారితోకూడ బయలుదేరెను.౹

39 వారు ఐగుప్తులోనుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలుచేసి కాల్చిరి. వారు ఐగుప్తులోనుండి వెళ్లగొట్టబడి తడవుచేయ లేకపోయిరి గనుక అది పులిసి యుండలేదు, వారు తమ కొరకు వేరొక ఆహారమును సిద్ధపరచుకొని యుండలేదు.౹

40 ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము నాలుగు వందల ముప్పది సంవత్సరములు.౹

41 ఆ నాలుగు వందల ముప్పది సంవత్సరములు గడచిన తరువాత జరిగినదేమనగా, ఆ దినమందే యెహోవా సేనలన్నియు ఐగుప్తుదేశములోనుండి బయలుదేరిపోయెను.౹

42 ఆయన ఐగుప్తుదేశములోనుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలీయులందరు తమతమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి యిదే.

43 మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను–ఇది పస్కాపండుగనుగూర్చిన కట్టడ; అన్యుడెవడును దాని తినకూడదుగాని

44 వెండితో కొనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దాని తినవచ్చును.౹

45 పరదేశియు కూలికివచ్చిన దాసుడును దాని తినకూడదు.౹

46 మీరు ఒక్క యింటిలోనే దాని తినవలెను దాని మాంసములో కొంచెమైనను ఇంటిలోనుండి బయటికి తీసికొని పోకూడదు, దానిలో ఒక్క యెముకనైనను మీరు విరువకూడదు.౹

47 ఇశ్రాయేలీయుల సర్వసమాజము ఈ పండుగను ఆచరింపవలెను.౹

48 నీయొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింప గోరినయెడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలెను; తరువాత అతడు సమాజములోచేరి దానిని ఆచరింపవచ్చును. అట్టివాడు మీ దేశములో పుట్టినవానితో సముడగును. సున్నతి పొందనివాడు దానిని తినకూడదు.౹

49 దేశస్థునికిని మీలో నివసించు పరదేశికిని దీనిగూర్చి ఒకటే విధి యుండవలెననెను.౹

50 ఇశ్రాయేలీయులందరు ఆలాగు చేసిరి; యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేసిరి.౹

51 యెహోవా ఇశ్రాయేలీయులను వారివారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EXO/12-742b0033c7c6c12fef4f06bc8fbae676.mp3?version_id=1787—

Categories
నిర్గమకాండము

నిర్గమకాండము 13

1 మరియు యెహోవా మోషేతో ఈలాగు సెలవిచ్చెను

2 –ఇశ్రాయేలీయులలో మనుష్యులయొక్కయు పశువులయొక్కయు ప్రథమ సంతతి, అనగా ప్రతి తొలి చూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము; అది నాదని చెప్పెను.౹

3 మోషే ప్రజలతో నిట్లనెను–మీరు దాస గృహమైన ఐగుప్తునుండి బయలుదేరివచ్చిన దినమును జ్ఞాపకము చేసికొనుడి. యెహోవా తన బాహు బలముచేత దానిలోనుండి మిమ్మును బయటికి రప్పించెను; పులిసిన దేదియు తినవద్దు.౹

4 ఆబీబను నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చితిరిగదా.౹

5 యెహోవా–నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసినట్లు, కనానీయులకు హిత్తీయులకు అమోరీయులకు హివ్వీయులకు యెబూసీయులకు నివాసస్థానమై యుండు, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తరువాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనవలెను.౹

6 ఏడు దినములు నీవు పులియని రొట్టెలను తినవలెను, ఏడవదినమున యెహోవా పండుగ ఆచరింపవలెను.౹

7 పులియని వాటినే యేడు దినములు తినవలెను. పులిసినదేదియు నీయొద్ద కనబడకూడదు. నీ ప్రాంతములన్నిటిలోను పొంగినదేదియు నీయొద్ద కనబడకూడదు.౹

8 మరియు ఆ దినమున నీవు–నేను ఐగుప్తులోనుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసినదాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికి తెలియచెప్పవలెను.౹

9 యెహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులోనుండి నిన్ను బయటికి రప్పించెననుటకు, ఈ ఆచారము నీ చేతిమీద నీకు సూచనగాను నీ కన్నులమధ్య జ్ఞాపకార్థముగా ఉండును.౹

10 కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింపవలెను.

11 యెహోవా నీతోను నీ పితరులతోను ప్రమాణము చేసినట్లు ఆయన కనానీయుల దేశములోనికి నిన్ను చేర్చి దానిని నీకిచ్చిన తరువాత

12 ప్రతి తొలి చూలుపిల్లను, నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. వానిలో మగసంతానము యెహోవా దగును.౹

13 ప్రతి గాడిద తొలి పిల్లను వెలయిచ్చి విడిపించి దానికి మారుగా గొఱ్ఱెపిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని యెడల దాని మెడను విరుగదీయవలెను. నీ కుమారులలో తొలిచూలియైన ప్రతి మగ వానిని వెలయిచ్చి విడిపింపవలెను.౹

14 ఇకమీదట నీ కుమారుడు–ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాని చూచి–బాహుబలముచేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులోనుండి మనలను బయటికి రప్పించెను.౹

15 ఫరో మనలను పోనియ్యకుండ తన మనస్సును కఠినపరచుకొనగా యెహోవా మనుష్యుల తొలి సంతానమేమి జంతువుల తొలి సంతానమేమి ఐగుప్తుదేశములో తొలి సంతాన మంతయు సంహరించెను. ఆ హేతువు చేతను నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును; అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము వెలయిచ్చి విడిపించుదునని చెప్పవలెను.౹

16 బాహు బలముచేత యెహోవా మనలను ఐగుప్తులోనుండి బయటికి రప్పించెను గనుక ఆ సంగతి నీ చేతిమీద సూచనగాను నీ కన్నులమధ్య లలాట పత్రికగాను ఉండవలెను అని చెప్పెను.

17 మరియు ఫరో ప్రజలను పోనియ్యగా దేవుడు–ఈ ప్రజలు యుద్ధము చూచునప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకొని, ఫిలిష్తీయులదేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు.౹

18 అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎఱ్ఱసముద్రపు అరణ్యమార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులోనుండి వచ్చిరి.౹

19 మరియు మోషే యోసేపు ఎముకలను తీసికొని వచ్చెను. అతడు–దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును; అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడనుండి తీసికొని పోవలెనని ఇశ్రాయేలీయులచేత రూఢిగా ప్రమాణము చేయించుకొని యుండెను.౹

20 వారు సుక్కోతునుండి ప్రయాణమై పోయి, అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి.౹

21 వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవాత్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను, వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడచుచు వచ్చెను.౹

22 ఆయన పగటివేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజలయెదుటనుండి తొలగింపలేదు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EXO/13-86b11822dd72b1d4f8f8df72a3c4f416.mp3?version_id=1787—

Categories
నిర్గమకాండము

నిర్గమకాండము 14

1 మరియు యెహోవా మోషేతో ఈలాగు సెలవిచ్చెను

2 –ఇశ్రాయేలీయులు తిరిగి పీహహీరోతు ఎదుటను, అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్య నున్న బయల్సెఫోను నెదుటను, దిగవలెనని వారితో చెప్పుము; దాని యెదుటి సముద్రమునొద్ద వారు దిగవలెను.౹

3 ఫరో ఇశ్రాయేలీయులనుగూర్చి–వారు ఈ దేశములో చిక్కు బడి యున్నారు; అరణ్యము వారిని మూసి వేసెనని అను కొనును.౹

4 అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను; అతడు వారిని తరుమగా; నేను ఫరోవలనను అతని సమస్త సేనవలనను మహిమ తెచ్చుకొందును; నేను యెహోవానని ఐగుప్తీయులందరు తెలిసికొందురనెను. వారు ఆలాగు దిగిరి.౹

5 ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి –మనమెందుకీలాగు చేసితిమి? మన సేవలో నుండకుండ ఇశ్రాయేలీయులను ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పు కొనిరి.౹

6 అంతట అతడు తన రథమును సిద్ధపరచుకొని, తన జనమును తనతోకూడ తీసికొని పోయెను.౹

7 మరియు అతడు శ్రేష్ఠమైన ఆరువందల రథములను ఐగుప్తు రథముల నన్నిటిని వాటిలో ప్రతిదానిమీద అధిపతులను తోడుకొనిపోయెను.౹

8 యెహోవా ఐగుప్తురాజైన ఫరో హృదయమును కఠినపరపగా అతడు ఇశ్రాయేలీయులను తరిమెను. అట్లు ఇశ్రాయేలీయులు బలిమిచేత బయలు వెళ్లుచుండిరి.౹

9 ఐగుప్తీయులు, అనగా ఫరో రథముల గుఱ్ఱములన్నియు అతని గుఱ్ఱపు రౌతులు అతని దండును వారిని తరిమి, బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగియుండగా వారిని కలిసికొనిరి.౹

10 ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమవెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొఱపెట్టిరి.౹

11 అంతట వారు మోషేతో–ఐగుప్తులో సమాధులు లేవని యీ యరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తులోనుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేల?

12 మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పినమాట యిదే గదా; మేము ఈ అరణ్యమందు చచ్చుటకంటె ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి.౹

13 అందుకు మోషే–భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగ జేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి; మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇకమీదట మరి ఎన్నడును చూడరు.౹

14 యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే యుండవలెనని ప్రజలతో చెప్పెను.

15 అంతలో యెహోవా మోషేతో–నీవేల నాకు మొఱ పెట్టుచున్నావు? –సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము.౹

16 నీవు నీ కఱ్ఱను ఎత్తి ఆ సముద్రమువైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము, అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రముమధ్యను ఆరిన నేలమీద నడిచిపోవుదురు.౹

17 ఇదిగో నేను నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరుచుదును. వారు వీరిని తరుముదురు; నేను ఫరోవలనను అతని సమస్త సేనవలనను అతని రథముల వలనను అతని గుఱ్ఱపు రౌతులవలనను నాకు మహిమ తెచ్చు కొందును.౹

18 నేను ఫరోవలనను అతని రథములవలనను అతని గుఱ్ఱపు రౌతులవలనను మహిమ తెచ్చుకొనునప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలిసికొందురనెను.౹

19 అప్పుడు ఇశ్రాయేలీయుల యెదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకుపోయి వారిని వెంబడించెను; ఆ మేఘస్తంభము వారి యెదుటనుండి పోయి వారి వెనుక నిలిచెను.౹

20 అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను; అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని, రాత్రి అది వీరికి వెలుగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపింపలేదు.౹

21 మోషే సముద్రమువైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలిచేత సముద్రమును తొల గించి దానిని ఆరిన నేలగా చేసెను.౹

22 నీళ్లు విభజింప బడగా ఇశ్రాయేలీయులు సముద్రముమధ్యను ఆరిన నేలమీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను వారికి గోడవలె నుండెను.౹

23 ఐగుప్తీయులును ఫరో గుఱ్ఱములును రథములును రౌతులును వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి.౹

24 అయితే వేకువ జామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభమునుండి ఐగుప్తీయుల దండువైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచి

25 వారి రథచక్రములు ఊడిపడునట్లుచేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు –ఇశ్రాయేలీయుల యెదుటనుండి పారిపోదము రండి; యెహోవావారిపక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి.

26 అంతలో యెహోవా మోషేతో–ఐగుప్తీయులమీదికిని వారి రథములమీదికిని వారి రౌతులమీదికిని నీళ్లు తిరిగి వచ్చునట్లు సముద్రముమీద నీ చెయ్యి చాపుమనెను.౹

27 మోషే సముద్రముమీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రముమధ్యను ఐగుప్తీయులను నాశము చేసెను.౹

28 నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరోయొక్క సర్వసేనను కప్పివేసెను; వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు.౹

29 అయితే ఇశ్రాయేలీయులు ఆరిననేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి యెడమ ప్రక్కలను గోడవలె నుండెను.౹

30 ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్రతీరమున చూచిరి.౹

31 యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవాయందును ఆయన సేవకుడైన మోషేయందును నమ్మకముంచిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EXO/14-7ac251b751b192b7c2d42790cfe17439.mp3?version_id=1787—

Categories
నిర్గమకాండము

నిర్గమకాండము 15

1 అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులును యెహోవానుగూర్చి యీ కీర్తన పాడిరి–

యెహోవానుగూర్చి గానముచేసెదను

ఆయన మిగుల అతిశయించి జయించెను

గుఱ్ఱమును దాని రౌతును

ఆయన సముద్రములో పడద్రోసెను.

2 యెహోవాయే నా బలము నా గానము

ఆయన నాకు రక్షణయు ఆయెను.

ఆయన నా దేవుడు ఆయనను వర్ణించెదను

ఆయన నా పితరుల దేవుడు

ఆయన మహిమ నుతించెదను.

3 యెహోవా యుద్ధశూరుడు

యెహోవా అని ఆయనకు పేరు.

4 ఆయన ఫరో రథములను అతని సేనను

సముద్రములో పడద్రోసెను

అతని అధిపతులలో శ్రేష్ఠులు

ఎఱ్ఱసముద్రములో మునిగిపోయిరి

5 అగాధజలములు వారిని కప్పెనువారు రాతివలె అడుగంటిపోయిరి.

6 యెహోవా, నీ దక్షిణహస్తము బలమొంది అతిశయించును

యెహోవా, నీ దక్షిణ హస్తము శత్రువుని చితక గొట్టును.

7 నీ మీదికి లేచువారిని

నీ మహిమాతిశయమువలన అణచివేయుదువు

నీ కోపాగ్నిని రగులజేయుదువు

అది వారిని చెత్తవలె దహించును.

8 నీ నాసికారంధ్రముల ఊపిరివలన

నీళ్లు రాశిగా కూర్చబడెను

ప్రవాహములు కుప్పగా నిలిచెను

అగాధజలములు సముద్రముమధ్య గడ్డకట్టెను

9 –తరిమెదను కలిసికొనియెదను

దోపుడుసొమ్ము పంచుకొనియెదను

వాటివలన నా ఆశ తీర్చుకొనియెదను

నా కత్తి దూసెదను

నా చెయ్యి వారిని నాశనము చేయునని

శత్రువనుకొనెను.

10 నీవు నీ గాలిని విసరజేసితివి

సముద్రము వారిని కప్పెనువారు మహా అగాధమైన నీళ్లలో సీసమువలె

మునిగిరి.

11 యెహోవా, వేల్పులలో నీవంటివాడెవడు

పరిశుద్ధతనుబట్టి నీవు మహానీయుడవు

స్తుతికీర్తనలనుబట్టి పూజ్యుడవు

అద్భుతములు చేయువాడవు

నీవంటివాడెవడు

12 నీ దక్షిణహస్తమును చాపితివి

భూమి వారిని మ్రింగివేసెను.

13 నీవు విమోచించిన యీ ప్రజలను

నీ కృపచేత తోడుకొనిపోతివి

నీ బలముచేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడి పించితివి.

14 జనములు విని దిగులుపడును

ఫిలిష్తియ నివాసులకు వేదన కలుగును.

15 ఎదోము నాయకులు కలవరపడుదురు

మోయాబు బలిష్ఠులకు వణకు పుట్టును

కనాను నివాసులందరు దిగులొంది కరిగిపోవుదురు.

భయము అధికభయము వారికి కలుగును.

16 యెహోవా, నీ ప్రజలు అద్దరికి చేరువరకు

నీవు సంపాదించిన యీ ప్రజలు అద్దరికి చేరువరకు

నీ బాహుబలముచేత పగవారు రాతివలె కదలకుందురు.

17 నీవు నీ ప్రజను తోడుకొని వచ్చెదవు

యెహోవా, నీ స్వాస్థ్యమైన కొండమీద

నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకొనిన చోటను

18 నీచేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందువారిని నిలువ పెట్టెదవు.

యెహోవా నిరంతరమును ఏలువాడు.

19 ఫరో గుఱ్ఱములు అతని రథములు అతని రౌతులును సముద్రములో దిగగా యెహోవావారి మీదికి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీయులు సముద్రముమధ్యను ఆరిన నేలమీద నడిచిరి.

20 మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియునగు మిర్యాము తంబురను చేతపట్టుకొనెను. స్త్రీలందరు తంబురలతోను నాట్యములతోను ఆమె వెంబడి వెళ్లగా

21 మిర్యాము వారితో కలిసి యిట్లు పల్లవి యెత్తి పాడెను–

యెహోవాను గానము చేయుడి

ఆయన మిగుల అతిశయించి జయించెను

గుఱ్ఱమును దాని రౌతును

సముద్రములో ఆయన పడద్రోసెను.

22 మోషే ఎఱ్ఱసముద్రమునుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్లి దానిలో మూడుదినములు నడిచిరి; అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి.౹

23 మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారాఅను పేరు కలిగెను.౹

24 ప్రజలు–మేమేమి త్రాగుదుమని మోషేమీద సణగు కొనగా

25 అతడు యెహోవాకు మొఱపెట్టెను. అంతట యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురము లాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి, అక్కడ వారిని పరీక్షించి,౹

26 –మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడచినయెడల, నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియ్యను; నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను.౹

27 తరువాత వారు ఏలీమునకు వచ్చిరి; అక్కడ పండ్రెండు నీటి బుగ్గలును డెబ్బది యీతచెట్లును ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్లయొద్ద దిగిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EXO/15-18bceacfea8ce98ac7041d593e50fbc3.mp3?version_id=1787—

Categories
నిర్గమకాండము

నిర్గమకాండము 16

1 తరువాత ఇశ్రాయేలీయుల సమాజమంతయును ఏలీమునుండి ప్రయాణమైపోయి, వారు ఐగుప్తు దేశములోనుండి బయలుదేరిన రెండవనెల పదునైదవదినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి.౹

2 ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజ మంతయు మోషే అహరోనులమీద సణిగెను.౹

3 ఇశ్రాయేలీయులు–మేము మాంసము వండుకొనుకుండలయొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినునప్పుడు యెహోవా చేతివలన ఏల చావక పోతిమి? ఈ సర్వసమాజమును ఆకలిచేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడ నుండి తోడుకొని వచ్చితిరని వారితో ననగా

4 యెహోవా మోషేను చూచి–ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను; వారు నా ధర్మశాస్త్రము ననుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించునట్లు ఈ ప్రజలు వెళ్లి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను.౹

5 మరియు ఆరవదినమునవారు తెచ్చుకొనినదానిని సిద్ధపరచుకొనవలెను. వారు దినదినమున కూర్చుకొనుదానికంటె అది రెండంతలై యుండవలెననెను.౹

6 అప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేలీయులందరితో–యెహోవా ఐగుప్తు దేశములోనుండి మిమ్మును బయటికి రప్పించెనని సాయంకాలమందు మీకు తెలియబడును.౹

7 యెహోవామీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు; ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు, మేము ఏపాటి వారము? మామీద సణుగనేల అనిరి.౹

8 మరియు మోషే –మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకియ్యగాను, మీరు ఆయనమీద సణుగు మీ సణుగులను యెహో వాయే వినుచుండగాను, మేము ఏపాటివారము? మీ సణుగుట యెహోవా మీదనేగాని మామీద కాదనెను

9 అంతట మోషే అహరోనుతో–యెహోవా సన్నిధికి సమీపించుడి; ఆయన మీ సణుగులను వినెనని నీవు ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో చెప్పుమనెను.౹

10 అట్లు అహరోను ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో మాటలాడుచుండగా వారు అరణ్యమువైపు చూచిరి, అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను.౹

11 అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను– నేను ఇశ్రాయేలీయుల సణుగులను వింటిని

12 నీవు–సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారముచేత తృప్తిపొందుదురు, అప్పుడు మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలిసికొందురని వారితో చెప్పుమనెను.౹

13 కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాళెమును కప్పెను, ఉదయమున మంచు వారి పాళెముచుట్టు పడియుండెను.౹

14 పడిన ఆ మంచు ఇగిరిపోయిన తరువాత నూగుమంచువలె సన్నని కణములు అరణ్యపు భూమిమీద కనబడెను.౹

15 ఇశ్రాయేలీయులు దాని చూచినప్పుడు అది ఏమైనది తెలియక–ఇదేమిఅని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి.౹

16 మోషే–ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించిన దేమనగా–ప్రతివాడును తనవారి భోజనమునకు, ప్రతివాడు తన కుటుంబములోని తలకు ఒక్కొక్క ఓమెరుచొప్పున దాని కూర్చుకొనవలెను, ఒక్కొక్కడు తన గుడారములోనున్నవారికొరకు కూర్చుకొనవలెననెను.౹

17 ఇశ్రాయేలీయులు అట్లుచేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి.౹

18 వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకొనినవానికి ఎక్కువగా మిగులలేదు తక్కువగా కూర్చుకొనినవానికి తక్కువకాలేదు. వారు తమతమ యింటివారి భోజనమునకు సరిగా కూర్చుకొనియుండిరి.౹

19 మరియు మోషే–దీనిలో ఏమియు ఉదయమువరకు ఎవరును మిగుల్చు కొనకూడదని వారితో చెప్పెను.౹

20 అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయమువరకు దానిలో కొంచెము మిగుల్చుకొనగా అది పురుగుపెట్టి కంపుకొట్టెను. మోషే వారిమీద కోపపడగా

21 వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన యింటివారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరి. ఎండ వేడిమికి అది కరిగెను.౹

22 ఆరవదినమునవారు ఒక్కొక్కనికి రెండేసి ఓమెరుల చొప్పున రెండంతలు ఆహారము కూర్చుకొనినప్పుడు సమాజముయొక్క అధికారులందరు వచ్చి అది మోషేకు తెలిపిరి.౹

23 అందుకు అతడు–యెహోవా చెప్పినమాట యిది; రేపు విశ్రాంతిదినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతిదినము, మీరు కాల్చుకొన వలసినది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండు కొనుడి, ఉదయమువరకు మిగిలినదంతయు మీకొరకు ఉంచుకొనుడని వారితో చెప్పెను.౹

24 మోషే ఆజ్ఞాపించి నట్లువారు ఉదయమువరకు దానిని ఉంచుకొనిరి, అది కంపుకొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు.౹

25 మోషే–నేడు దాని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతిదినము, నేడు అది బయట దొరకదు.౹

26 ఆరు దినములు దాని కూర్చుకొనవలెను, విశ్రాంతిదినమున అనగా ఏడవదినమున అది దొరకదనెను.౹

27 అట్లు జరిగెను; ప్రజలలో కొందరు ఏడవదినమున దాని కూర్చుకొన వెళ్లగా వారికేమియు దొరకక పోయెను.౹

28 అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను–మీరు ఎన్నాళ్లవరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడువనొల్లరు?

29 చూడుడి నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతిదినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనుక ఆరవదినమున రెండు దినముల ఆహారము మీ కనుగ్రహించుచున్నాడు. ప్రతివాడును తన తన చోట నిలిచి యుండవలెను. ఏడవదినమున ఎవడును తన చోటనుండి బయలు వెళ్లకూడదనెను.౹

30 కాబట్టి యేడవదినమున ప్రజలు విశ్రమించిరి.౹

31 ఇశ్రాయేలీయులు దానికి మన్నా అను పేరు పెట్టిరి. అది తెల్లని కొతి మెరగింజవలె నుండెను. దాని రుచి తేనెతో కలిపిన అపూపములవలె నుండెను.౹

32 మరియు మోషే ఇట్లనెను–యెహోవా ఆజ్ఞాపించినదేమనగా–నేను ఐగుప్తుదేశము నుండి మిమ్మును బయటికి రప్పించినప్పుడు అరణ్యములో తినుటకు నేను మీకిచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచునట్లు, వారు తమయొద్ద ఉంచుకొనుటకు దానితో ఒక ఓమెరు పట్టు పాత్రను నింపుడనెను.౹

33 కాబట్టి మోషే అహరోనుతో నీవు ఒక గిన్నెను తీసికొని, దానిలో ఒక ఓమెరు మన్నాను పోసి, మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాని ఉంచుమనెను.౹

34 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దాని పెట్టెను.౹

35 ఇశ్రాయేలీయులు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు నలుబది యేండ్లు మన్నానే తినుచుండిరి; వారు కనానుదేశపు పొలిమేరలు చేరువరకు మన్నాను తినిరి.౹

36 ఓమెరు అనగా ఏపాలోదశమ భాగము.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EXO/16-42c4394470cf030bd1c9dbb149909898.mp3?version_id=1787—

Categories
నిర్గమకాండము

నిర్గమకాండము 17

1 తరువాత ఇశ్రాయేలీయుల సర్వసమాజము యెహోవా మాటచొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యమునుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లులేనందున

2 మోషేతో వాదిం చుచు–త్రాగుటకు మాకు నీళ్లిమ్మని అడుగగా మోషే– మీరు నాతో వాదింపనేల, యెహోవాను శోధింపనేల అని వారితో చెప్పెను.౹

3 అక్కడ ప్రజలు నీళ్లులేక దప్పి గొని మోషేమీద సణుగుచు–ఇదెందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులోనుండి ఇక్కడికి తీసికొని వచ్చితిరనిరి.౹

4 అప్పుడు మోషే యెహోవాకు మొఱపెట్టుచు–ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదు రనెను.౹

5 అందుకు యెహోవా–నీవు ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరిని తీసికొని ప్రజలకు ముందుగా పొమ్ము; నీవు నదిని కొట్టిన నీ కఱ్ఱను చేతపట్టుకొని పొమ్ము

6 ఇదిగో అక్కడ హోరేబులోని బండమీద నేను నీకు ఎదురుగా నిలిచెదను; నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలోనుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవియ్యగా మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల యెదుట అట్లు చేసెను.౹

7 అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమునుబట్టియు యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటనుబట్టియు అతడు ఆ చోటికి మస్సాఅనియు మెరీబాఅనియు పేర్లు పెట్టెను.

8 తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధముచేయగా

9 మోషే యెహోషువతో–మనకొరకు మనుష్యులను ఏర్పరచి వారిని తీసికొని బయలువెళ్లి అమాలేకీయులతో యుద్ధముచేయుము; రేపు నేను దేవుని కఱ్ఱను చేతపట్టుకొని ఆ కొండ శిఖరముమీద నిలిచెదననెను.౹

10 యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను; మోషే అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖర మెక్కిరి

11 మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి; మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి,౹

12 మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసికొని వచ్చి అతడు దానిమీద కూర్చుండుటకై దానివేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతనిచేతులను ఆదుకొనగా అతనిచేతులు సూర్యుడు అస్తమించువరకు నిలుకడగా ఉండెను.౹

13 అట్లు యెహోషువ కత్తివాడిచేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను.౹

14 అప్పుడు యెహోవా మోషేతో నిట్లనెను–నేను అమాలేకీయుల పేరు ఆకాశముక్రింద నుండకుండ బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంధములో దీని వ్రాసి యెహోషువకు విని పించుము.౹

15 తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సీఅని పేరుపెట్టి

16 –అమాలేకీయులు తమచేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరములవరకు యుద్ధమనెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EXO/17-bea0c214f07ad81d05a73238aadcdd86.mp3?version_id=1787—

Categories
నిర్గమకాండము

నిర్గమకాండము 18

1 దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలీయులకును చేసినదంతయు, యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తునుండి వెలుపలికి రప్పించిన సంగతియు, మిద్యాను యాజకుడును మోషేమామయునైన యిత్రో వినినప్పుడు

2 మోషే మామయైన ఆ యిత్రో తనయొద్దకు పంపబడిన మోషే భార్యయైన సిప్పోరాను ఆమె యిద్దరి కుమారులను తోడుకొని వచ్చెను.౹

3 అతడు–అన్యదేశములో నేను పర దేశిననుకొని వారిలో ఒకనికి గేర్షోము అని పేరుపెట్టెను.౹

4 –నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాతనుండి నన్ను తప్పించెననుకొని రెండవవానికి ఎలీయెజెరనిపేరు పెట్టెను.౹

5 మోషే మామయైన యిత్రో అతని కుమారులనిద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యములో దేవుని పర్వతము దగ్గర దిగిన మోషేయొద్దకు వచ్చెను.౹

6 –యిత్రో అను నీ మామనైన నేనును నీ భార్యయు ఆమెతోకూడ ఆమె యిద్దరు కుమారులును నీయొద్దకు వచ్చియున్నామని మోషేకు వర్తమానము పంపగా

7 మోషే తన మామను ఎదుర్కొనపోయి వందనము చేసి అతని ముద్దుపెట్టుకొనెను. వారు ఒకరి క్షేమము ఒకరు తెలిసికొని గుడారములోనికి వచ్చిరి.౹

8 తరువాత మోషే యెహోవా ఇశ్రాయేలీయులకొరకు ఫరోకును ఐగుప్తీయులకును చేసిన దంతయు, త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును, యెహోవా తమ్మును విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పెను.౹

9 యెహోవా ఐగుప్తీయుల చేతిలోనుండి విడిపించి ఇశ్రాయేలీయులకు చేసిన మేలంతటిని గూర్చి యిత్రో సంతోషించెను.౹

10 మరియు యిత్రో– ఐగుప్తీయుల చేతిలోనుండియు ఫరో చేతిలోనుండియు మిమ్మును విడిపించి, ఐగుప్తీయుల చేతిక్రిందనుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడునుగాక.౹

11 ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీయులమీద చేసిన దౌర్జన్యమునుబట్టి ఆయన చేసినదాని చూచి, యెహోవా సమస్త దేవతలకంటె గొప్పవాడని యిప్పుడు నాకు తెలిసిన దనెను.౹

12 మరియు మోషే మామయైన యిత్రో ఒక దహనబలిని బలులను దేవునికర్పింపగా అహరోనును ఇశ్రాయేలీయుల పెద్దలందరును మోషే మామతో దేవుని సన్నిధిని భోజనము చేయవచ్చిరి.౹

13 మరునాడు మోషే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా, ఉదయము మొదలుకొని సాయంకాలమువరకు ప్రజలు మోషేయొద్ద నిలిచియుండిరి.౹

14 మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి–నీవు ఈ ప్రజలకు చేయుచున్న యీ పని ఏమిటి? ఉదయము మొదలుకొని సాయంకాలమువరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరు నీయొద్ద నిలిచి యుండనేల అని అడుగగా

15 మోషే–దేవుని తీర్పు తెలిసి కొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చెదరు.౹

16 వారికి వ్యాజ్యెము ఏదైనను కలిగినయెడల నా యొద్దకు వచ్చెదరు. నేను వారి విషయము న్యాయము తీర్చి, దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్రవిధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పెను.౹

17 అందుకు మోషే మామ అతనితో నీవు చేయుచున్న పని మంచిది కాదు;౹

18 నీవును నీతో నున్న యీ ప్రజలును నిశ్చయముగా నలిగిపోవుదురు; ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడవే చేయచాలవు.౹

19 కాబట్టి నా మాట వినుము. నేను నీకొక ఆలోచన చెప్పెదను. దేవుడు నీకు తోడై యుండును, ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యెములను దేవుని యొద్దకు తేవలెను.౹

20 నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్రవిధులను బోధించి, వారు నడవవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపవలెను.౹

21 మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యాసక్తి కలిగి, లంచగొండులుకాని మనుష్యులను ఏర్పరచుకొని, వేయిమందికి ఒకనిగాను, నూరుమందికి ఒకనిగాను, ఏబదిమందికి ఒకనిగాను, పదిమందికి ఒకనిగాను, వారిమీద న్యాయాధిపతులను నియమింపవలెను.౹

22 వారు ఎల్లప్పుడును ప్రజలకు న్యాయము తీర్చవలెను. అయితే గొప్ప వ్యాజ్యెములన్నిటిని నీయొద్దకు తేవలెను. ప్రతి అల్పవిషయమును వారే తీర్చవచ్చును. అట్లువారు నీతోకూడ ఈ భారమును మోసినయెడల నీకు సుళువుగా ఉండును.౹

23 దేవుడు ఈలాగు చేయుటకు నీకు సెలవిచ్చినయెడల నీవు ఈ పని చేయుచు దాని భారమును సహింపగలవు. మరియు ఈ ప్రజలందరు తమతమ చోట్లకు సమాధానముగా వెళ్లుదురని చెప్పెను.౹

24 మోషే తన మామమాట విని అతడు చెప్పినదంతయు చేసెను.౹

25 ఇశ్రాయేలీయులందరిలో సామర్థ్యముగల మనుష్యులను ఏర్పరచుకొని, వెయ్యిమందికి ఒకనిగాను, నూరు మందికి ఒకనిగాను, ఏబదిమందికి ఒకనిగాను, పదిమందికి ఒకనిగాను, న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజలమీద ప్రధానులనుగా నియమించెను.౹

26 వారెల్ల ప్పుడును ప్రజలకు న్యాయము తీర్చువారు. వారు కఠిన వ్యాజ్యెములను మోషేయొద్దకు తెచ్చుచు, స్వల్పవ్యాజ్యెములను తామే తీర్చుచువచ్చిరి.౹

27 తరువాత మోషే తన మామను పంపివేయగా అతడు తన స్వదేశమునకు వెళ్లెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EXO/18-7fc7e723bf36f0e7566ed499837c9859.mp3?version_id=1787—

Categories
నిర్గమకాండము

నిర్గమకాండము 19

1 ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమునుండి బయలుదేరిన మూడవనెలలో, వారు బయలుదేరిననాడే మూడవ నెల ఆరంభదినమందే, వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి.౹

2 వారు రెఫీదీమునుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. అక్కడ ఆ పర్వతము ఎదుట ఇశ్రాయేలీయులు విడసిరి.౹

3 మోషే దేవునియొద్దకు ఎక్కి పోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతని పిలిచి–నీవు యాకోబు కుటుంబికులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసిన దేమనగా

4 –నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో, మిమ్మును గద్ద రెక్కలమీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చు కొంటినో మీరు చూచితిరి.౹

5 కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు.౹

6 సమస్తభూమియు నాదేగదా. మీరు నాకు యాజకరూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము; నీవు ఇశ్రాయేలీయులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా

7 మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తన కాజ్ఞాపించిన ఆ మాటలన్నియు వారియెదుట తెలియపరచెను.౹

8 అందుకు ప్రజలందరు–యెహోవా చెప్పినదంతయు చేసెదమని యేకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్లి ప్రజల మాటలను యెహోవాకు తెలియచేసెను.౹

9 యెహోవా మోషేతో–ఇదిగో నేను నీతో మాటలాడు నప్పుడు ప్రజలు విని నిరంతరము నీయందు నమ్మక ముంచునట్లు నేను కారు మబ్బులలో నీయొద్దకు వచ్చెదనని చెప్పెను. మోషే ప్రజల మాటలను యెహోవాతో చెప్పగా

10 యెహోవా మోషేతో–నీవు ప్రజలయొద్దకు వెళ్లి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము; వారు తమ బట్టలు ఉదుకుకొని

11 మూడవనాటికి సిద్ధముగా నుండవలెను; మూడవనాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతముమీదికి దిగివచ్చును.౹

12 నీవు చుట్టు ప్రజలకు మేరను ఏర్పరచి–మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచును ముట్టవద్దు, భద్రము సుమీ ఈ పర్వతము ముట్టు ప్రతివానికి మరణశిక్ష తప్పక విధింపబడవలెను.౹

13 ఎవడును చేతితో దాని ముట్టకూడదు, ముట్టినవాడు రాళ్లతో కొట్టబడవలెను లేక పొడవబడవలెను, మనుష్యుడుగాని మృగముగాని బ్రదుకకూడదు, బూరధ్వని చేయునప్పుడు వారు పర్వతముయొద్దకు రావలెననెను.౹

14 అప్పుడు మోషే పర్వతముమీదనుండి ప్రజల యొద్దకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను ఉదుకుకొనిరి.౹

15 అప్పుడతడు–మూడవనాటికి సిద్ధముగా నుండుడి; ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పెను.౹

16 మూడవనాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతముమీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘము బూరయొక్క మహాధ్వనియు కలుగగా పాళెములోని ప్రజలందరు వణకిరి.౹

17 దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాళెములోనుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువను నిలిచిరి.౹

18 యెహోవా అగ్నితో సీనాయి పర్వతముమీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై యుండెను. దాని ధూమము కొలిమి ధూమమువలె లేచెను, పర్వతమంతయు మిక్కిలి కంపించెను.౹

19 ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరముచేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను.౹

20 యెహోవా సీనాయి పర్వతముమీదికి, అనగా ఆ పర్వత శిఖరముమీదికి దిగి వచ్చెను. యెహోవా పర్వత శిఖరముమీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను

21 అప్పుడు యెహోవా–ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దుమీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము.౹

22 మరియు యెహోవావారిమీద పడకుండునట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమ్ముతామే పరిశుద్ధపరచుకొనవలెనని మోషేతో చెప్పగా

23 మోషే యెహోవాతో– ప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేరు. నీవు–పర్వతమునకు మేరలను ఏర్పరచి దాని పరిశుద్ధపరచవలెనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించితివనెను.౹

24 అందుకు యెహోవా–నీవు దిగి వెళ్లుము, నీవును నీతో అహరోనును ఎక్కి రావలెను. అయితే యెహోవావారిమీద పడకుండునట్లు యాజకులును ప్రజలును ఆయన యొద్దకు వచ్చుటకు మేరను మీరకూడదు; ఆయన వారిమీద పడునేమో అని అతనితో చెప్పగా

25 మోషే ప్రజలయొద్దకు వెళ్లి ఆ మాట వారితో చెప్పెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EXO/19-d53a98a29f7e08338fb16c6d9665a69b.mp3?version_id=1787—

Categories
నిర్గమకాండము

నిర్గమకాండము 20

1 దేవుడు ఈ ఆజ్ఞలన్నియు వివరించి చెప్పెను.౹

2 –నీ దేవుడనైన యెహోవాను నేనే; నేనే దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను వెలుపలికి రప్పించితిని;౹

3 నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.

4 పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమిక్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపమునయినను విగ్రహమునయిననునీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు.౹

5 ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను; నన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరముల వరకు, తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుచు

6 నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనువారిని వెయ్యితరములవరకు కరుణించు వాడనై యున్నాను.

7 నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు; యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపువానిని నిర్దోషిగా ఎంచడు.

8 విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపక ముంచుకొనుము.౹

9 ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను

10 ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతిదినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ పశువైనను నీ యిండ్లలో నున్న పరదేశి యైనను ఏపనియు చేయకూడదు.౹

11 ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవదినమున విశ్ర మించెను; అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను.

12 నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.

13 నరహత్య చేయకూడదు.

14 వ్యభిచరింపకూడదు.

15 దొంగిలకూడదు.

16 నీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు.

17 నీ పొరుగువాని యిల్లు ఆశింపకూడదు.

నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని యెద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను.

18 ప్రజలందరు ఆ ఉరుములు ఆ మెరుపులు ఆ బూర ధ్వనియు ఆ పర్వత ధూమమును చూచి, భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి

19 –నీవు మాతో మాటలాడుము మేము విందుము; దేవుడు మాతో మాటలాడినయెడల మేము చనిపోవుదుము

20 అందుకు మోషే–భయపడకుడి; మిమ్ము పరీక్షించుటకును, మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలు గుటకును, దేవుడు వేంచేసెనని ప్రజలతో చెప్పెను.

21 ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా

22 యెహోవా మోషేతో ఇట్లనెను – ఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పుము–నేను ఆకాశమునుండి మీతో మాటలాడితినని మీరు గ్రహించితిరి.౹

23 మీరు నన్ను కొలుచుచు, వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసికొనకూడదు.౹

24 మంటి బలిపీఠమును నాకొరకు చేసి, దానిమీద నీ దహనబలులను సమాధానబలులను నీ గొఱ్ఱెలను నీ యెద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీయొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను.౹

25 నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయునప్పుడు మలిచిన రాళ్లతో దాని కట్టకూడదు; దానికి నీ పనిముట్టు తగలనిచ్చినయెడల అది అపవిత్రమగును.౹

26 మరియు నా బలిపీఠముమీద నీ దిగంబరత్వము కనబడక యుండునట్లు మెట్లమీదుగా దానిని ఎక్కకూడదు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EXO/20-b27c0e93b8a9e22f43f82b630804b8df.mp3?version_id=1787—