Categories
సామెతలు

సామెతలు 23

1 నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండినయెడల

నీవెవరి సమక్షముననున్నావో బాగుగా యోచించుము.

2 నీవు తిండిపోతువైనయెడల

నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము.

3 అతని రుచిగల పదార్థములను ఆశింపకుము

అవి మోసపుచ్చు ఆహారములు.

4 ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము

నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాని విడిచిపెట్టుము.

5 నీవు దానిమీద దృష్టి నిలిపినతోడనే అది లేకపోవును

నిశ్చయముగా అది రెక్కలు ధరించి యెగిరిపోవును.

పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును.

6 ఎదుటివాని మేలు ఓర్చలేనివానితో కలిసి భోజనము

చేయకుము

వాని రుచిగల పదార్థముల నాశింపకుము.

7 అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొనువాడు

తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని

అది హృదయములోనుండి వచ్చు మాట కాదు.

8 నీవు తినినను తినినదానిని కక్కి వేయుదువు

నీవు పలికిన యింపైన మాటలు వ్యర్థములగును.

9 బుద్ధిహీనుడు వినగా మాటలాడకుము

అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును.

10 పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము

తలిదండ్రులు లేనివారి పొలములోనికి నీవు చొరబడకూడదు

11 వారి విమోచకుడు బలవంతుడు

ఆయన వారిపక్షమున నీతో వ్యాజ్యెమాడును.

12 ఉపదేశముమీద మనస్సు నుంచుము

తెలివిగల మాటలకు చెవి యొగ్గుము.

13 నీ బాలురను శిక్షించుట మానుకొనకుము

బెత్తముతో వాని కొట్టినయెడల వాడు చావకుండును

14 బెత్తముతో వాని కొట్టినయెడల

పాతాళమునకు పోకుండ వాని ఆత్మను నీవు తప్పించెదవు.

15 నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించినయెడల

నా హృదయము కూడ సంతోషించును.

16 నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా

అంతరింద్రియములు ఆనందించును.

17 పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము

నిత్యము యెహోవాయందు భయభక్తులు కలిగియుండుము.

18 నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును

నీ ఆశ భంగము కానేరదు.

19 నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము

నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు

చక్కగా నడిపించుకొనుము.

20 ద్రాక్షారసము త్రాగువారితోనైనను

మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము.

21 త్రాగుబోతులును తిండిపోతులును దరిద్రులగుదురు.

నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును.

22 నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము

నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము.

23 సత్యమును అమ్మివేయక దాని కొని యుంచుకొనుము

జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని యుంచుకొనుము.

24 నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును

జ్ఞానముగలవానిని కనినవాడు వానివలన ఆనందము

నొందును.

25 నీ తలిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను

నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను.

26 నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము

నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము,

27 వేశ్య లోతైన గొయ్యి పరస్త్రీ యిరుకైన గుంట.

28 దోచుకొనువాడు పొంచియుండునట్లు అది పొంచి

యుండును

అది బహుమందిని విశ్వాసఘాతకులనుగా చేయును.

29 ఎవరికి శ్రమ? ఎవరికి దుఃఖము?

ఎవరికి జగడములు? ఎవరికి చింత?

ఎవరికి హేతువులేని గాయములు? ఎవరికి మంద దృష్టి?

30 ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చువారికే గదా

కలిపిన ద్రాక్షారసము రుచిచూడ చేరువారికే గదా.

31 ద్రాక్షారసము మిక్కిలి ఎఱ్ఱబడగను

గిన్నెలో తళతళలాడుచుండగను

త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకుము.

32 పిమ్మట అది సర్పమువలె కరచును

కట్లపామువలె కాటువేయును.

33 విపరీతమైనవి నీ కన్నులకు కనబడును

నీవు వెఱ్ఱిమాటలు పలుకుదువు

34 నీవు నడిసముద్రమున పండుకొనువానివలె నుందువు

ఓడకొయ్య చివరను పండుకొనువానివలె నుందువు.

35 –నన్ను కొట్టినను నాకు నొప్పి కలుగలేదు

నామీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు

నేనెప్పుడు నిద్ర మేల్కొందును?

మరల దాని వెదకుదును అని నీవనుకొందువు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PRO/23-4f8f05802161364d12c05c1d75f0202a.mp3?version_id=1787—

Categories
సామెతలు

సామెతలు 24

1 దుర్జనులను చూచి మత్సరపడకుమువారి సహవాసము కోరకుము

2 వారి హృదయము బలాత్కారము చేయ యోచించునువారి పెదవులు కీడునుగూర్చి మాటలాడును.

3 జ్ఞానమువలన ఇల్లు కట్టబడును

వివేచనవలన అది స్థిరపరచబడును.

4 తెలివిచేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ

సంపదలతో నింపబడును.

5 జ్ఞానముగలవాడు బలవంతుడుగానుండును

తెలివిగలవాడు శక్తిమంతుడుగా నుండును.

6 వివేకముగల నాయకుడవై యుద్ధముచేయుము.

ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము

7 మూర్ఖునికి జ్ఞానము అందదు

గుమ్మమునొద్ద అట్టివారు మౌనులైయుందురు.

8 కీడుచేయ పన్నాగములు పన్నువానికి

తంటాలమారి అని పేరు పెట్టబడును.

9 మూర్ఖుని యోచన పాపము

అపహాసకులు నరులకు హేయులు.

10 శ్రమదినమున నీవు క్రుంగినయెడల

నీవు చేతకాని వాడవగుదువు.

11 చావునకై పట్టబడినవారిని నీవు తప్పించుము

నాశమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు

రక్షింపవా?

12 ఈ సంగతి మాకు తెలియదని నీవనుకొనినయెడల

హృదయములను శోధించువాడు నీ మాటను గ్రహించును గదా.

నిన్ను కనిపెట్టువాడు దాని నెరుగును గదా

నరులకు వారి వారి పనులనుబట్టి ఆయన ప్రతికారము చేయును గదా.

13 నా కుమారుడా, తేనె త్రాగుము అది రుచిగలది గదా

తేనెపట్టు తినుము అది నీ నాలుకకు తీపియే గదా.

14 నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలిసికొనుము

అది నీకు దొరికినయెడల ముందుకు నీకు మంచిగతి

కలుగును

నీ ఆశ భంగము కానేరదు.

15 భక్తిహీనుడా, నీతిమంతుని నివాసమునొద్ద పొంచి

యుండకుము

వాని విశ్రమస్థలమును పాడుచేయకుము.

16 నీతిమంతుడు ఏడుమారులు పడినను తిరిగి లేచును

ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు.

17 నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము

వాడు తొట్రిల్లినప్పుడు నీవు మనస్సున నుల్లిసింపకుము.

18 యెహోవా అది చూచి అసహ్యించుకొని

వానిమీదనుండి తన కోపము త్రిప్పుకొనునేమో.

19 దుర్మార్గులను చూచి నీవు వ్యసనపడకుము

భక్తిహీనులయెడల మత్సరపడకుము.

20 దుర్జనునికి ముందుగతి లేదు భక్తిహీనుల దీపము ఆరిపోవును

21 నా కుమారుడా, యెహోవాను ఘనపరచుము రాజును ఘనపరచుము

ఆలాగు చేయనివారి జోలికి పోకుము.

22 అట్టివారికి ఆపద హఠాత్తుగా తటస్థించునువారి కాలము ఎప్పుడు ముగియునో యెవరికి తెలియును?

23 ఇవియు జ్ఞానులు చెప్పిన సామెతలే

–న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట

ధర్మము కాదు

24 –నీయందు దోషములేదని దుష్టునితో చెప్పువానిని

ప్రజలు శపించుదురు

జనులు అట్టివానియందు అసహ్యపడుదురు.

25 న్యాయముగా తీర్పు తీర్చువారికి మేలు కలుగును

క్షేమకరమైన దీవెన అట్టివారిమీదికి వచ్చును.

26 సరియైన మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట

పెదవులతో ముద్దుపెట్టుకొనినట్లుండును.

27 బయట నీ పని చక్క పెట్టుకొనుము ముందుగా పొలములో దాని సిద్ధపరచుము

తరువాత ఇల్లు కట్టుకొనవచ్చును.

28 నిర్నిమిత్తముగా నీ పొరుగువానిమీద సాక్ష్యము పలుకకుము

నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా?

29 –వాడు నాకు చేసినట్లు వానికి చేసెదను

వాని క్రియచొప్పున వానికి ప్రతిఫలమిచ్చెద నను

కొనకుము.

30 సోమరివాని చేను నేను దాటి రాగా

తెలివిలేనివాని ద్రాక్షతోట నేను దాటి రాగా

31 ఇదిగో దానియందంతట ముండ్ల తుప్పలు బలిసి

యుండెను.

దూలగొండ్లు దాని కప్పియుండెను

దాని రాతి గోడ పడియుండెను.

32 నేను దాని చూచి యోచన చేసికొంటిని

దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని.

33 ఇంక కొంచెము నిద్ర యింక కొంచెముకునుకుపాటు

పరుండుటకై యింక కొంచెము చేతులు ముడుచు

కొనుట

వీటివలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును

ఆయుధస్థుడు వచ్చినట్లు లేమి నీమీదికి వచ్చును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PRO/24-bc665ed1701f5340a7684a808297b107.mp3?version_id=1787—

Categories
సామెతలు

సామెతలు 25

1 ఇవియును సొలొమోను సామెతలే

యూదారాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి

వ్రాసిరి.

2 –సంగతి మరుగుచేయుట దేవునికి ఘనత

సంగతి శోధించుట రాజులకు ఘనత.

3 ఆకాశముల యెత్తును భూమి లోతును

రాజుల అభిప్రాయమును అగోచరములు.

4 వెండిలోని మష్టు తీసివేసినయెడల

పుటము వేయువాడు పాత్రయొకటి సిద్ధపరచును.

5 రాజు ఎదుటనుండి దుష్టులను తొలగించినయెడల

అతని సింహాసనము నీతివలన స్థిరపరచబడును.

6 రాజు ఎదుట డంబము చూపకుము

గొప్పవారున్న చోట నిలువకుము.

7 నీ కన్నులు చూచిన ప్రధానియెదుట

ఒకడు నిన్ను తగ్గించుటకంటె

–ఇక్కడికి ఎక్కి రమ్మని అతడు నీతో చెప్పుట నీకు

మేలు గదా.

8 ఆలోచన లేక వ్యాజ్యెమాడుటకు పోకుము

నీ పొరుగువాడు నిన్ను అవమానపరచి–దాని అంత

మున ఇక నీవేమి చేయుదువని నీతో అనునేమో.

9 నీ పొరుగువానితో నీవు వ్యాజ్యెమాడవచ్చును గాని

పరునిగుట్టు బయటపెట్టకుము.

10 బయటపెట్టినయెడల వినువాడు నిన్ను అవమానపరచునేమో

అందువలన నీకు కలిగిన అపకీర్తి యెన్నటికిని పోకుండును.

11 సమయోచితముగా పలుకబడిన మాట

చిత్రమైన వెండి పళ్లెములలో నుంచబడిన బంగారు

పండ్లవంటిది.

12 బంగారు కర్ణభూషణమెట్టిదో అపరంజి ఆభరణమెట్టిదో

వినువాని చెవికి జ్ఞానముగల ఉపదేశకుడు అట్టివాడు.

13 నమ్మకమైన దూత తనను పంపువారికి

కోతకాలపు మంచు చల్లదనమువంటివాడు

వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల

జేయును.

14 కపటమనస్సుతో దానమిచ్చి డంబము చేయువాడు

వర్షములేని మబ్బును గాలిని పోలియున్నాడు.

15 దీర్ఘశాంతముచేత న్యాయాధిపతిని ఒప్పించ వచ్చును

సాత్వికమైన నాలుక యెముకలను నలుగగొట్టును.

16 తేనె కనుగొంటివా? తగినంతమట్టుకే త్రాగుము

అధికముగా త్రాగినయెడల కక్కి వేయుదువేమో

17 మాటిమాటికి నీ పొరుగువాని యింటికి వెళ్లకుము

అతడు నీవలన విసికి నిన్ను ద్వేషించునేమో.

18 తన పొరుగువానిమీద కూటసాక్ష్యము పలుకువాడు

సమ్మెటను ఖడ్గమును వాడిగల అంబును పోలినవాడు.

19 శ్రమకాలములో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట

విరిగిన పళ్లతోను కీలు వసిలిన కాలుతోను సమానము.

20 దుఃఖచిత్తునికి పాటలు వినుపించువాడు

చలిదినమున పైబట్ట తీసివేయువానితోను

సురేకారముమీద చిరకపోయువానితోను సమానుడు.

21 నీ పగవాడు ఆకలిగొనినయెడల వానికి భోజనము

పెట్టుము

దప్పిగొనినయెడల వానికి దాహమిమ్ము

22 అట్లు చేయుటచేత వాని తలమీద నిప్పులు కుప్పగా

పోయుదువు

యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును.

23 ఉత్తరపు గాలి వాన పుట్టించును

కొండెగాని నాలుక కోపదృష్టి కలిగించును.

24 గయ్యాళితో పెద్ద యింట నుండుటకంటె

మిద్దెమీద నొక మూలను నివసించుట మేలు

25 దప్పిగొనినవానికి చల్లని నీరు ఎట్లుండునో

దూరదేశమునుండి వచ్చిన శుభసమాచారము అట్లుండును.

26 కలకలు చేయబడిన ఊటయు చెడిపోయిన బుగ్గయు

నీతిమంతుడు దుష్టునికి లోబడుటయు సమానములు.

27 తేనె నధికముగా త్రాగుట మంచిది కాదు.

దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము.

28 ప్రాకారము లేక పాడైన పురము ఎంతో

తన మనస్సును అణచుకొనలేనివాడును అంతే.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PRO/25-f6442624a2cb0430052122c606994431.mp3?version_id=1787—

Categories
సామెతలు

సామెతలు 26

1 ఎండకాలమునకు మంచు గిట్టదు కోతకాలమునకు

వర్షము గిట్టదు

అటువలె బుద్ధిహీనునికి ఘనత గిట్టదు.

2 రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు

దాటుచుండు వానకోయిలయు దిగకుండునట్లు

హేతువులేని శాపము తగులకపోవును.

3 గుఱ్ఱమునకు చబుకు గాడిదకు కళ్లెము

మూర్ఖుల వీపునకు బెత్తము.

4 వాని మూఢతచొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తర మియ్యకుము

ఇచ్చినయెడల నీవును వాని పోలియుందువు.

5 వాని మూఢతచొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తర మిమ్ము

ఆలాగు చేయనియెడల వాడు తన దృష్టికి తాను

జ్ఞానిననుకొనును.

6 మూర్ఖునిచేత వర్తమానము పంపువాడు

కాళ్లు తెగగొట్టుకొని విషము త్రాగినవానితో సమానుడు.

7 కుంటివాని కాళ్లు పట్టులేక యున్నట్లు

మూర్ఖుల నోట సామెత పాటిలేకుండును

8 బుద్ధిహీనుని ఘనపరచువాడు

వడిసెలలోని రాయి కదలకుండ కట్టువానితో సమానుడు.

9 –మూర్ఖుల నోట సామెత

మత్తునుగొనువాని చేతిలోముల్లు గుచ్చుకొన్నట్లుండును.

10 అధికముగా నొందినవాడు సమస్తము చేయవచ్చును

మూర్ఖునివలన కలుగు లాభము నిలువదు కూలికి వానిని

పిలిచినవాడును చెడిపోవును.

11 తన మూఢతను మరల కనుపరచు మూర్ఖుడు

కక్కినదానికి తిరుగు కుక్కతో సమానుడు.

12 తన దృష్టికి జ్ఞానిననుకొనువానిని చూచితివా?

వానిని గుణపరచుటకంటె మూర్ఖుని గుణపరచుట

సుళువు.

13 సోమరి–దారిలో సింహమున్నదనును వీధిలో సింహ

మున్నదనును.

14 ఉతకమీద తలుపు తిరుగును

తన పడకమీద సోమరి తిరుగును.

15 సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును

నోటియొద్దకు దాని తిరిగి యెత్తుట కష్టమనుకొనును.

16 హేతువులు చూపగల యేడుగురికంటె

సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకొనును

17 తనకు పట్టని జగడమునుబట్టి రేగువాడు

దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకొనువానితో

సమానుడు.

18 తెగులు అమ్ములు కొఱవులు విసరు వెఱ్ఱివాడు

19 తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు

చేసితినని పలుకువానితో సమానుడు.

20 కట్టెలు లేనియెడల అగ్ని ఆరిపోవును

కొండెగాడు లేనియెడల జగడము చల్లారును.

21 వేడిబూడిదెకు బొగ్గులు అగ్నికి కట్టెలు

కలహములు పుట్టించుటకు కలహప్రియుడు.

22 కొండెగాని మాటలు రుచిగల పదార్థములవంటివి

అవి లోకడుపులోనికి దిగిపోవును.

23 చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెద

వులును కలిగియుండుట మంటి పెంకుమీది వెండి

పూతతో సమానము.

24 పగవాడు పెదవులతో మాయలు చేసి

అంతరంగములో కపటము దాచుకొనును.

25 వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మకుము

వాని హృదయములో ఏడు హేయవిషయములు కలవు.

26 వాడు తనద్వేషమును కపటవేషముచేత దాచుకొనును

సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును.

27 గుంటను త్రవ్వువాడే దానిలో పడును

రాతిని పొర్లించువానిమీదికి అది తిరిగి వచ్చును.

28 అబద్ధములాడువాడు తాను నలగగొట్టినవారిని ద్వేషించును

ఇచ్చకపు మాటలాడు నోరు నష్టము కలుగజేయును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PRO/26-7805603915c40620b75b04502e95c891.mp3?version_id=1787—

Categories
సామెతలు

సామెతలు 27

1 రేపటి దినమునుగూర్చి అతిశయపడకుము

ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు.

2 నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే

నిన్ను పొగడదగును.

3 రాయి బరువు ఇసుక భారము

మూఢుని కోపము ఆ రెంటికంటె బరువు.

4 క్రోధము క్రూరమైనది కోపము వరదవలె పొర్లునది.

రోషము ఎదుట ఎవడు నిలువగలడు?

5 లోలోపల ప్రేమించుటకంటె

బహిరంగముగా గద్దించుట మేలు

6 మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును

పగవాడు లెక్కలేని ముద్దులుపెట్టును.

7 కడుపు నిండినవాడు తేనెపట్టునైనను త్రొక్కివేయును.

ఆకలిగొనినవానికి చేదువస్తువైనను తియ్యగా నుండును.

8 తన యిల్లు విడిచి తిరుగువాడు

గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు.

9 తైలమును అత్తరును హృదయమును సంతోషపరచు

నట్లు

చెలికాని హృదయములోనుండి వచ్చు మధురమైన

మాటలు హృదయమును సంతోషపరచును.

10 నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునినైనను విడిచి

పెట్టకుము

నీకు అపద కలిగిన దినమందు నీ సహోదరుని యింటికి

వెళ్లకుము

దూరములోనున్న సహోదరునికంటె

దగ్గరనున్న పొరుగువాడు వాసి,

11 నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృద

యమును సంతోషపరచుము.

అప్పుడు నన్ను నిందించువారితో నేను ధైర్యముగా

మాటలాడుదును.

12 బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును

జ్ఞానములేనివారు యోచింపక ఆపదలో పడుదురు.

13 ఎదుటివానికొరకు పూటబడినవాని వస్త్రము పుచ్చుకొనుము

పరులకొరకు పూటబడినవానివలన కుదువపెట్టించుము.

14 వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని

దీవించువాని దీవెన వానికి శాపముగా ఎంచబడును.

15 ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును

గయ్యాళియైన భార్యయు సమానము

16 దానిని ఆపజూచువాడు గాలిని ఆపజూచువానితోను

తన కుడిచేత నూనె పట్టుకొనువానితోను సమానుడు.

17 ఇనుముచేత ఇనుము పదునగును

అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును.

18 అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము

తినును

19 తన యజమానుని మన్నించువాడు ఘనతనొందును.

నీటిలో ముఖమునకు ముఖము కనబడునట్లు

20 ఒకని మనస్సునకు మరియొకని మనస్సు కనబడును.

పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానేరదు

21 ఆలాగున నరుల దృష్టి తృప్తికానేరదు.

మూసచేత వెండిని కొలిమి చేత బంగారును

22 తాను పొందిన కీర్తిచేత నరుని పరిశోధింపవచ్చును.

మూఢుని రోటిలోని గోధుమలలో వేసి రోకట

దంచినను

వాని మూఢత వాని వదలిపోదు.

23 నీ పశువులస్థితి జాగ్రత్తగా తెలిసికొనుము

నీ మందలయందు మనస్సు ఉంచుము.

24 ధనము శాశ్వతము కాదు

కిరీటము తరతరములు ఉండునా?

25 ఎండిన గడ్డి వామివేయబడెను పచ్చిక కనబడుచున్నది

కొండగడ్డి యేరబడియున్నది

26 నీ వస్త్రములకొరకు గొఱ్ఱెపిల్లలున్నవి

ఒక చేని క్రయధనమునకు పొట్టేళ్లు సరిపోవును

27 నీ ఆహారమునకు నీ యింటివారి ఆహారమునకు

నీ పనికత్తెల జీవనమునకు మేకపాలు సమృద్ధియగును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PRO/27-4eac3ddd3f17987d7c2c40500defeb55.mp3?version_id=1787—

Categories
సామెతలు

సామెతలు 28

1 ఎవడును తరుమకుండనే దుష్టుడు పారిపోవును

నీతిమంతులు సింహమువలె ధైర్యముగా నుందురు.

2 దేశస్థుల దోషమువలన దాని అధికారులు అనేకులగుదురు

బుద్ధిజ్ఞానములుగలవారిచేత దాని అధికారము స్థిర

పరచబడును.

3 బీదలను బాధించు దరిద్రుడు

ఆహారవస్తువులను ఉండనియ్యక కొట్టుకొనిపోవు

వానతో సమానుడు.

4 ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగడు

చుందురు

ధర్మశాస్త్రము ననుసరించువారు వారితో పోరాడుదురు.

5 దుష్టులు న్యాయమెట్టిదైనది గ్రహింపరు

యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు.

6 వంచకుడై ధనము సంపాదించినవానికంటె

యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి.

7 ఉపదేశము నంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు

తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి

అపకీర్తి తెచ్చును.

8 వడ్డిచేతను దుర్లాభముచేతను ఆస్తి పెంచుకొనువాడు

దరిద్రులను కరుణించువానికొరకు దాని కూడబెట్టును.

9 ధర్మశాస్త్రము వినబడకుండ చెవిని తొలగించుకొనువాని

ప్రార్థన హేయము.

10 యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు

తాను త్రవ్విన గోతిలో తానే పడును

యథార్థవంతులు మేలైనదానిని స్వతంత్రించుకొందురు.

11 ఐశ్వర్యవంతుడు తన దృష్టికి తానే జ్ఞాని

వివేకముగల దరిద్రుడు వానిని పరిశోధించును.

12 నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము

దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగియుందురు.

13 అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు

వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము

పొందును.

14 నిత్యము భయముగలిగి ప్రవర్తించువాడు ధన్యుడు

హృదయమును కఠినపరచుకొనువాడు కీడులో పడును.

15 బొబ్బరించు సింహమును తిరుగులాడు ఎలుగుబంటియు

దరిద్రులైన జనుల నేలు దుష్టుడును సమానములు.

16 వివేకములేనివాడవై జనులను అధికముగా బాధపెట్టు

అధికారీ,

దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును.

17 ప్రాణము తీసి దోషము కట్టుకొనినవాడు గోతికి

పరుగెత్తుచున్నాడు

ఎవరును అట్టివానిని ఆపకూడదు.

18 యథార్థముగా ప్రవర్తించువాడు రక్షింపబడును

మూర్ఖప్రవర్తన గలవాడు హఠాత్తుగా పడిపోవును.

19 తన పొలము సేద్యము చేసికొనువానికి కడుపునిండ

అన్నము దొరకును

వ్యర్థమైనవాటిని అనుసరించువారికి కలుగు పేదరికము

ఇంతంతకాదు.

20 నమ్మకమైనవానికి దీవెనలు మెండుగా కలుగును.

ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనొందకపోడు.

21 పక్షపాతము చూపుట మంచిది కాదు

రొట్టెముక్కకొరకు ఒకడు దోషముచేయును.

22 చెడు దృష్టిగలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును

తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు.

23 నాలుకతో ఇచ్చకములాడు వానికంటె

నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయపొందును.

24 తన తలిదండ్రుల సొమ్ము దోచుకొని–అది ద్రోహము

కాదనుకొనువాడు

నశింపజేయువానికి జతకాడు.

25 పేరాసగలవాడు కలహమును రేపును

యెహోవాయందు నమ్మకముంచువాడు వర్ధిల్లును.

26 తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు

జ్ఞానముగా ప్రవర్తించువాడు తప్పించుకొనును.

27 బీదలకిచ్చువానికి లేమి కలుగదు

కన్నులు మూసికొనువానికి బహు శాపములు కలుగును.

28 దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందురువారు నశించునప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PRO/28-347750d6521a329401f81838d9f29671.mp3?version_id=1787—

Categories
సామెతలు

సామెతలు 29

1 ఎన్నిసారులు గద్దించినను లోబడనివాడు

మరి తిరుగులేకుండ హఠాత్తుగా నాశనమగును.

2 నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు

దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు.

3 జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోష

పరచును

వేశ్యలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని

పాడుచేయును.

4 న్యాయము జరిగించుటవలన రాజు దేశమునకు

క్షేమము కలుగజేయును

లంచములు పుచ్చుకొనువాడు దేశమును పాడు

చేయును.

5 తన పొరుగువానితో ఇచ్చకములాడువాడు

వాని పట్టుకొనుటకు వలవేయువాడు.

6 దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును

నీతిమంతుడు సంతోషగానములు చేయును.

7 నీతిమంతుడు బీదలకొరకు న్యాయము విచారించును

దుష్టుడు జ్ఞానము వివేచింపడు.

8 అపహాసకులు పట్టణము తల్లడిల్లజేయుదురు

జ్ఞానులు కోపము చల్లార్చెదరు.

9 జ్ఞాని మూఢునితో వాదించునప్పుడు

వాడు ఊరకుండక రేగుచుండును.

10 నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు

అట్టివారు యథార్థవంతుల ప్రాణము తీయ జూతురు.

11 బుద్ధిహీనుడు తన కోపమంత కనుపరచును

జ్ఞానముగలవాడు కోపము అణచుకొని దానిని చూపకుండును.

12 అబద్ధముల నాలకించు రాజునకు

ఉద్యోగస్థులందరు దుష్టులుగా నుందురు

13 బీదలును వడ్డికిచ్చువారును కలిసికొందురు

ఉభయులకు వెలుగునిచ్చువాడు యెహోవాయే.

14 ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో

ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును.

15 బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును

అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును.

16 దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలునువారు పడిపోవుటను నీతిమంతులు కన్నులార చూచెదరు.

17 నీ కుమారుని శిక్షించినయెడల అతడు నిన్ను సంతోష

పరచును

నీ మనస్సుకు ఆనందము కలుగజేయును

18 దేవోక్తి లేనియెడల జనులు కట్టులేక తిరుగుదురు

ధర్మశాస్త్రము ననుసరించువాడు ధన్యుడు.

19 దాసుడు వాగ్దండనచేత గుణపడడు

తాత్పర్యము తెలిసికొన్నను వాడు లోబడడు

20 ఆతురపడి మాటలాడువాని చూచితివా?

వానికంటె మూర్ఖుడు సుళువుగా గుణపడును.

21 ఒకడు తన దాసుని చిన్నప్పటినుండి

గారాబముగా పెంచినయెడల తుదిని వాడు కుమారుడుగా ఎంచబడును.

22 కోపిష్ఠుడు కలహము రేపును

ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును.

23 ఎవని గర్వము వానిని తగ్గించును

వినయమనస్కుడు ఘనతనొందును

24 దొంగతో పాలుకూడువాడు తనకుతానే పగవాడు

అట్టివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు.

25 భయపడుటవలన మనుష్యులకు ఉరి వచ్చును

యెహోవాయందు నమ్మిక యుంచువాడు సురక్షితముగా నుండును.

26 అనేకులు ఏలువాని దయ కోరుచుందురు

మనుష్యులను తీర్పు తీర్చుట యెహోవా వశము.

27 దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు

యథార్థవర్తనుడు భక్తిహీనునికి హేయుడు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PRO/29-9637d5fdf5fac80b5be2d99afc2c290b.mp3?version_id=1787—

Categories
సామెతలు

సామెతలు 30

1 దేవోక్తి, అనగా యాకె కుమారుడైన ఆగూరు

పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఈతీయేలునకును,

ఈతీయేలునకును ఉక్కాలునకును చెప్పినమాట.

2 నిశ్చయముగా మనుష్యులలో నావంటి పశుప్రాయుడు లేడు

నరులకున్న వివేచన నాకు లేదు.

3 నేను జ్ఞానాభ్యాసము చేసికొన్నవాడను కాను

పరిశుద్ధ దేవునిగూర్చిన జ్ఞానము పొందలేదు.

4 ఆకాశమునకెక్కి మరల దిగినవాడెవడు?

తన పిడికిళ్లతో గాలిని పట్టుకొన్నవాడెవడు?

బట్టలో నీళ్లు మూటకట్టినవాడెవడు?

భూమియొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు?

ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు

తెలిసియున్నదా?

5 దేవుని మాటలన్నియు పుటము పెట్టబడినవే

ఆయనను ఆశ్రయించువారికి ఆయన కేడెము.

6 ఆయన మాటలతో ఏమియు చేర్చకుము

ఆయన నిన్ను గద్దించునేమో

అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు.

7 దేవా, నేను నీతో రెండు మనవులు చేసికొను

చున్నాను

నేను చనిపోకముందు వాటిని నాకనుగ్రహింపుము;

8 వ్యర్థమైనవాటిని అబద్ధములను నాకు దూరముగా

నుంచుము

పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయ

చేయకుము

తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము.

9 ఎక్కువైనయెడల నేను కడుపు నిండినవాడనై నిన్ను

విసర్జించి

–యెహోవా యెవడని అందునేమో

లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో.

10 దాసునిగూర్చి వాని యజమానునితో కొండెములు

చెప్పకుము

వాడు నిన్ను శపించును ఒకవేళ నీవు శిక్షార్హుడ

వగుదువు.

11 తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు.

12 తమ దృష్టికి తాము శుద్ధులై

తమ మాలిన్యమునుండి కడుగబడని వారి తరము కలదు.

13 కన్నులు నెత్తికి వచ్చినవారి తరము కలదు.వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడియున్నవి!

14 దేశములో ఉండకుండ వారు దరిద్రులను మ్రింగు

నట్లును

మనుష్యులలో ఉండకుండ బీదలను నశింపజేయు

నట్లును

ఖడ్గమువంటి పళ్లును కత్తులవంటి దవడపళ్లునుగల వారి

తరము కలదు.

15 జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరు కలరు

తృప్తిపడనివి మూడు కలవు–చాలును అని పలుకనివి

నాలుగు కలవు.

16 అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును

అనని భూమి, చాలును అనని అగ్ని.

17 తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని

కన్ను

లోయ కాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని

తినును.

18 నా బుద్ధికి మించినవి మూడు కలవు

నేను గ్రహింపలేనివి నాలుగు కలవు.

అవేవనగా, అంతరిక్షమున పక్షిరాజు జాడ,

19 బండమీద సర్పము జాడ, నడిసముద్రమున ఓడ

నడచుజాడ,

కన్యకతో పురుషుని జాడ.

20 జారిణియొక్క చర్యయును అట్టిదే; అది తిని నోరు

తుడుచుకొని

–నేను ఏ దోషము ఎరుగననును.

21 భూమిని వణకించునవి మూడు కలవు, అది మోయ

లేనివి నాలుగు కలవు.

22 అవేవనగా, రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు

నిండ అన్నము కలిగిన మూర్ఖుడు,

23 కంటకురాలై యుండి పెండ్లియైన స్త్రీ, యజమాను

రాలికి హక్కు దారురాలైన దాసి.

24 భూమిమీద చిన్నవి నాలుగు కలవు అయినను అవి

మిక్కిలి జ్ఞానముగలవి.

25 చీమలు బలములేని జీవులు అయినను అవి వేసవిలో

తమ ఆహారమును సిద్ధపరచుకొనును.

26 చిన్న కుందేళ్లు బలములేని జీవులు అయినను అవి

పేటు సందులలో నివాసములు కల్పించుకొనును.

27 మిడుతలకు రాజు లేడు అయినను అవన్నియు పంక్తులు

తీరి సాగిపోవును.

28 బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు అయినను రాజుల

గృహములలో అది యుండును.

29 డంబముగా నడుచునవి మూడు కలవు

30 ఠీవితో నడుచునవి నాలుగు కలవు–అవేవనగా

ఎల్లమృగములలో పరాక్రమముగలదై

ఎవనికైన భయపడి వెనుకకు తిరుగని సింహము

31 శోణంగి కుక్క, మేకపోతు,

తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు.

32 నీవు బుద్ధిహీనుడవై అతిశయపడియుండినయెడల

కీడు యోచించి యుండినయెడల

నీ చేతితో నోరు మూసికొనుము.

33 పాలు తరచగా వెన్న పుట్టును, ముక్కు పిండగా

రక్తము వచ్చును, కోపము రేపగా కలహము

పుట్టును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PRO/30-1be757a7d4acc1e54cbf2c4598693fd8.mp3?version_id=1787—

Categories
సామెతలు

సామెతలు 31

1 రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతని

కుపదేశించిన దేవోక్తి,

2 నా కుమారుడా, నేనేమందును? నేను కన్న కుమారుడా, నేనేమందును?

నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా, నేనే

మందును?

3 నీ బలమును స్త్రీలకియ్యకుము

రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకుము

4 ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు

లెమూయేలూ, అది రాజులకు తగదు

మద్యపానాసక్తి అధికారులకు తగదు.

5 త్రాగినయెడల వారు కట్టడలను మరతురు

దీనులకందరికి అన్యాయము చేయుదురు

6 ప్రాణము పోవుచున్నవానికి మద్యము నియ్యుడి

మనోవ్యాకులముగలవారికి ద్రాక్షారసము నియ్యుడి.

7 వారు త్రాగి తమ పేదరికము మరతురు

తమ శ్రమను ఇక తలంచకుందురు.

8 మూగవారికిని దిక్కులేనివారికందరికిని న్యాయము

జరుగునట్లు నీ నోరు తెరువుము.

9 నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము

దీనులకును శ్రమపడువారికిని దరిద్రులకును న్యాయము

జరిగింపుము.

10 గుణవతియైన భార్య దొరుకుట అరుదు

అట్టిది ముత్యముకంటె అమూల్యమైనది.

11 ఆమె పెనిమిటి ఆమెయందు నమ్మికయుంచును

అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు.

12 ఆమె తాను బ్రదుకు దినములన్నియు

అతనికి మేలుచేయును గాని కీడేమియు చేయదు.

13 ఆమె గొఱ్ఱెబొచ్చును అవిసెనారను వెదకును

తన చేతులార వాటితో పనిచేయును.

14 వర్తకపు ఓడలు దూరమునుండి ఆహారము తెచ్చునట్లు

ఆమె దూరమునుండి ఆహారము తెచ్చుకొనును.

15 ఆమె చీకటితోనే లేచి, తన యింటివారికి భోజనము

సిద్ధపరచును

తన పనికత్తెలకు బత్తెముఏర్పరచును.

16 ఆమె పొలమును చూచి దానిని తీసికొనును

తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్షతోట

యొకటి నాటించును.

17 ఆమె నడికట్టుచేత నడుము బలపరచుకొని

చేతులతో బలముగా పనిచేయును

18 తన వ్యాపారలాభము అనుభవముచే తెలిసికొనును

రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు.

19 ఆమె పంటెను చేతపట్టుకొనును

తన వ్రేళ్లతో కదురు పట్టుకొని వడుకును.

20 దీనులకు తన చెయ్యి చాపును

దరిద్రులకు తన చేతులు చాపును

21 తన యింటివారికి చలి తగులునని భయపడదు

ఆమె యింటివారందరు రక్తవర్ణ వస్త్రములు ధరించినవారు.

22 ఆమె పరుపులను సిద్ధపరచుకొనును

ఆమె బట్టలు సన్నని నారబట్టలు రక్తవర్ణపు వస్త్రములు.

23 ఆమె పెనిమిటి దేశపు పెద్దలతోకూడ కూర్చుండును

గవినియొద్ద పేరుగొనినవాడైయుండును.

24 ఆమె నారబట్టలు నేయించి అమ్మును

25 నడికట్లను వర్తకులకు అమ్మును.

బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు

ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా

ఉండును.

26 జ్ఞానము కలిగి తన నోరు తెరచును

కృపగల ఉపదేశము ఆమె బోధించును.

27 ఆమె తన యింటివారి నడతలను బాగుగా కని

పెట్టును

పనిచేయకుండ ఆమె భోజనము చేయదు.

28 ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరు

29 – చాలమంది కుమార్తెలు పతివ్రతాధర్మము ననుసరించియున్నారు గాని

వారందరిని నీవు మించినదానవు అని

ఆమె పెనిమిటి ఆమెను పొగడును.

30 అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము

యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని

యాడబడును

31 చేసిన పనినిబట్టి అట్టిదానికి ప్రతిఫలమియ్యదగును

గవునులయొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/PRO/31-d0ed44f6c599705edb1b042cb0668a94.mp3?version_id=1787—

Categories
ప్రసంగి

ప్రసంగి 1

1 దావీదు కుమారుడును యెరూషలేములో రాజునైయుండిన ప్రసంగి పలికిన మాటలు.

2 –వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే.౹

3 సూర్యునిక్రింద నరులు పడుచుండు పాటు అంతటివలన వారికి కలుగుచున్న లాభ మేమి?

4 తరము వెంబడి తరము గతించి పోవుచున్నది; భూమియొకటే యెల్లప్పుడును నిలుచునది.౹

5 సూర్యుడుదయించును, సూర్యుడు అస్తమించును, తానుదయించు స్థలము మరల చేరుటకు త్వరపడును.౹

6 గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును; ఇట్లు మరల మరల తిరుగుచు తన సంచారమార్గమున తిరిగి వచ్చును.౹

7 నదులన్నియు సముద్రములో పడును, అయితే సముద్రము నిండుట లేదు; నదులు ఎక్కడనుండి పారివచ్చునో అక్కడికే అవి ఎప్పుడును మరలిపోవును

8 ఎడతెరిపిలేకుండ సమస్తము జరుగుచున్నది; మనుష్యులు దాని వివరింప జాలరు; చూచుటచేత కన్ను తృప్తిపొందకున్నది, వినుటచేత చెవికి తృప్తికలుగుట లేదు.౹

9 మునుపు ఉండినదే ఇక ఉండబోవు నది;మునుపు జరిగినదే ఇక జరుగబోవునది; సూర్యుని క్రింద నూతనమైన దేదియు లేదు.౹

10 ఇది నూతనమైనదని యొకదానిగూర్చి యొకడు చెప్పును; అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే.౹

11 పూర్వులు జ్ఞాపకమునకు రారు; పుట్టబోవువారి జ్ఞాపకము ఆ తరువాత నుండ బోవువారికి కలుగదు.

12 ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలీయులమీద రాజునైయుంటిని.౹

13 ఆకాశముక్రింద జరుగునది అంతటిని జ్ఞానముచేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని; వారు దీనిచేత అభ్యాసమునొందవలెనని దేవుడు మానవులకు ఏర్పాటుచేసిన ప్రయాసము బహు కఠినమైనది.౹

14 సూర్యునిక్రింద జరుగుచున్న క్రియల నన్నిటిని నేను చూచితిని; అవి అన్నియు వ్యర్థములే, అవి యొకడు గాలికై ప్రయాస పడినట్టున్నవి.౹

15 వంకరగానున్న దానిని చక్కపరచ శక్యముకాదు, లోపముగలది లెక్కకు రాదు.౹

16 యెరూషలేమునందు నాకు ముందున్న వారందరి కంటెను నేను చాల ఎక్కువగా జ్ఞానము సంపాదించితిననియు, జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించితిననియు నా మనస్సులో నేననుకొంటిని.౹

17 నా మనస్సు నిలిపి, జ్ఞానాభ్యాసమును వెఱ్ఱితనమును మతిహీనతను తెలిసికొనుటకు ప్రయత్నించితిని; అయితే ఇదియు గాలికై ప్రయాసపడుటయే అని తెలిసికొంటిని.౹

18 విస్తారమైన జ్ఞానాభ్యాసముచేత విస్తారమైన దుఃఖము కలుగును; అధిక విద్య సంపాదించినవానికి అధిక శోకము కలుగును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ECC/1-242195a2749fc93ec770e3f7090637d1.mp3?version_id=1787—