Categories
ఆదికాండము

ఆదికాండము 41

1 రెండేండ్లు గడిచిన తరువాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటిదగ్గర నిలిచియుండగా

2 చూపునకు అందమైనవియు బలిసినవియునైన యేడు ఆవులు యేటిలోనుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను.౹

3 వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి యేడు ఆవులు ఏటిలోనుండి పైకి వచ్చుచు ఏటి యొడ్డున ఆ ఆవులదగ్గర నిలుచుండెను.౹

4 అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేలుకొనెను.౹

5 అతడు నిద్రించి రెండవసారి కల కనెను. అందులో మంచి పుష్టిగల యేడు వెన్నులు ఒక్క దంటున పుట్టుచుండెను.౹

6 మరియు తూర్పు గాలిచేత చెడి పోయిన యేడు పీల వెన్నులు వాటి తరువాత మొలిచెను.౹

7 అప్పుడు నిండైన పుష్టిగల ఆ యేడు వెన్నులను ఆ పీలవెన్నులు మ్రింగివేసెను. అంతలో ఫరో మేలుకొని అది కల అని గ్రహించెను.౹

8 తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను గనుక అతడు ఐగుప్తు శకునగాండ్ర నందరిని అక్కడి విద్వాంసులనందరిని పిలువనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పెనుగాని ఫరోకు వాటి భావము తెలుపగలవాడెవడును లేక పోయెను.౹

9 అప్పుడు పానదాయకుల అధిపతి–నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసికొనుచున్నాను.౹

10 ఫరో తన దాసులమీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయులను రాజసంరక్షక సేనాధిపతియింట కావలిలో ఉంచెను.౹

11 ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కలలు కంటిమి. ఒక్కొకడు వేరువేరు భావములుగల కలలు చెరి యొకటి కంటిమి.౹

12 అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడైయుండిన యొక హెబ్రీ పడుచువాడు మాతోకూడ ఉండెను. అతనితో మా కలలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపెను. ఒక్కొకని కలచొప్పున దాని దాని భావమును తెలిపెను.౹

13 అతడు మాకు ఏ యే భావము తెలిపెనో ఆయా భావముల చొప్పున జరిగెను. నా ఉద్యోగము నాకు మరల ఇప్పించి భక్ష్యకారుని వ్రేలాడదీయించెనని ఫరోతో చెప్పగా

14 ఫరో యోసేపును పిలువనంపెను. కాబట్టి చెరసాలలోనుండి అతని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరోయొద్దకు వచ్చెను.౹

15 ఫరో యోసేపుతో–నేనొక కల కంటిని, దాని భావమును తెలుపగలవారెవరును లేరు. నీవు కలను విన్నయెడల దాని భావమును తెలుపగలవని నిన్నుగూర్చి వింటినని అతనితో చెప్పినందుకు

16 యోసేపు–నావలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని ఫరోతో చెప్పెను.౹

17 అందుకు ఫరో–నా కలలో నేను ఏటి యొడ్డున నిలుచుంటిని.౹

18 బలిసినవియు, చూపునకందమైనవియునైన, యేడు ఆవులు ఏటిలోనుండి పైకివచ్చి జమ్ములో మేయుచుండెను.౹

19 మరియు నీరసమై బహు వికారరూపము కలిగి చిక్కిపోయిన మరి యేడు ఆవులు వాటి తరువాత పైకి వచ్చెను. వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశమందు ఎక్కడను నాకు కనబడలేదు.౹

20 చిక్కిపోయి వికారముగానున్న ఆవులు బలిసిన మొదటి యేడు ఆవులను తినివేసెను.౹

21 అవి వాటి కడుపులో పడెనుగాని అవి కడుపులో పడినట్టు కనబడలేదు, మొదట ఉండినట్లే అవి చూపునకు వికారముగా నుండెను. అంతలో నేను మేలుకొంటిని.౹

22 మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల యేడు మంచి వెన్నులు ఒక్క దంటున పుట్టెను.౹

23 మరియు తూర్పు గాలిచేత చెడి పోయి యెండిన యేడు పీలవెన్నులు వాటి తరువాత మొలిచెను.౹

24 ఈ పీలవెన్నులు ఆ మంచి వెన్నులను మ్రింగివేసెను. ఈ కలను జ్ఞానులకు తెలియ చెప్పితినిగాని దాని భావమును తెలుపగలవారెవరును లేరని అతనితో చెప్పెను.౹

25 అందుకు యోసేపు–ఫరో కనిన కల ఒక్కటే. దేవుడు తాను చేయబోవుచున్నది ఫరోకు తెలియచేసెను. ఆ యేడు మంచి ఆవులు ఏడు సంవత్సరములు

26 ఆ యేడు మంచి వెన్నులును ఏడు సంవత్సరములు.౹

27 కల ఒక్కటే. వాటి తరువాత, చిక్కిపోయి వికారమై పైకివచ్చిన యేడు ఆవులును ఏడు సంవత్సరములు; తూర్పు గాలిచేత చెడిపోయిన యేడు పీలవెన్నులు కరవుగల యేడు సంవత్సరములు.౹

28 నేను ఫరోతో చెప్పు మాట యిదే. దేవుడు తాను చేయబోవుచున్నది ఫరోకు చూపించెను.౹

29 ఇదిగో ఐగుప్తు దేశమందంతటను బహు సమృద్ధిగా పంటపండు ఏడు సంవత్సరములు వచ్చుచున్నవి.౹

30 మరియు కరవు గల యేడు సంవత్సరములు వాటి తరువాత వచ్చును; అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును, ఆ కరవు దేశమును పాడుచేయును.౹

31 దాని తరువాత కలుగు కరవుచేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును; ఆ కరవు మిక్కిలి భారముగా నుండును.౹

32 ఈ కార్యము దేవునివలన నిర్ణయింపబడి యున్నది. ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. అందుచేతనే ఆ కల ఫరోకు రెట్టింపబడెను.౹

33 కాబట్టి ఫరో వివేక జ్ఞానములుగల ఒక మనుష్యుని చూచుకొని ఐగుప్తు దేశముమీద అతని నియమింపవలెను.౹

34 ఫరో అట్లు చేసి యీ దేశముపైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంటపండు ఏడు సంవత్సరములలో ఐగుప్తు దేశ మందంతటను అయిదవభాగము తీసికొనవలెను.౹

35 రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహార మంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలెను.౹

36 కరవుచేత ఈ దేశము నశించి పోకుండ ఆ ఆహారము ఐగుప్తుదేశములో రాబోవు కరవు సంవత్సరములు ఏడింటికి ఈ దేశమందు సంగ్రహముగానుండునని ఫరోతో చెప్పెను.౹

37 ఆ మాట ఫరోదృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమైయుండెను గనుక

38 అతడు తన సేవకులను చూచి–ఇతనివలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని యనెను.౹

39 మరియు ఫరో–దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను గనుక నీవలె వివేకజ్ఞానములుగలవారెవరును లేరు.౹

40 నీవు నా యింటికి అధికారివై యుండవలెను, నా ప్రజలందరు నీకు విధేయులైయుందురు; సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటె పైవాడనై యుందునని యోసేపుతో చెప్పెను.౹

41 మరియు ఫరో–చూడుము, ఐగుప్తు దేశ మంతటిమీద నిన్ను నియమించియున్నానని యోసేపుతో చెప్పెను.౹

42 మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి, సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి, అతని మెడకు బంగారు గొలుసు వేసి

43 తన రెండవ రథముమీద అతని నెక్కించెను. అప్పుడు–వందనము చేయుడని అతని ముందర జనులు కేకలువేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటిమీద అతని నియమించెను.౹

44 మరియు ఫరో యోసేపుతో–ఫరోను నేనే; అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను.౹

45 మరియు ఫరో యోసేపునకు జప్నత్ప నేహు అను పేరు పెట్టి, అతనికి ఓనుయొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసెనతు నిచ్చి పెండ్లి చేసెను.౹

46 యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతట సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో యెదుట నిలిచినప్పుడు ముప్పది సంవత్సరములవాడై యుండెను. అప్పుడు యోసేపు ఫరో యెదుటనుండి వెళ్లి ఐగుప్తు దేశమందంతట సంచారము చేసెను.

47 సమృద్ధిగా పంటపండిన యేడు సంవత్సరములలో భూమి బహు విరివిగా పండెను.౹

48 ఐగుప్తు దేశమందున్న యేడు సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి, ఆయా పట్టణములలో దాని నిలువచేసెను. ఏ పట్టణము చుట్టునుండు పొలముయొక్క ధాన్యము ఆ పట్టణమందే నిలువచేసెను.౹

49 యోసేపు సముద్రపు ఇసుకవలె అతి విస్తారముగా ధాన్యము పోగుచేసెను. కొలుచుట అసాధ్య మాయెను గనుక కొలుచుట మానివేసెను.

50 కరవు సంవత్సరములు రాకమునుపు యోసేపుకిద్దరు కుమారులు పుట్టిరి. ఓనుయొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసెనతు అతనికి వారిని కనెను.౹

51 అప్పుడు యోసేపు–దేవుడు నా సమస్త బాధను నా తండ్రియింటి వారినందరిని నేను మరచిపోవునట్లు చేసెనని చెప్పి తన జ్యేష్ఠకుమారునికి మనష్షేఅను పేరు పెట్టెను.౹

52 తరువాత అతడు–నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెనని చెప్పి, రెండవవానికి ఎఫ్రాయిముఅను పేరు పెట్టెను.

53 ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంటపండిన సంవత్సరములు గడచిన తరువాత

54 యోసేపు చెప్పిన ప్రకారము ఏడు కరవు సంవత్సరములు ఆరంభ మాయెనుగాని ఐగుప్తు దేశమందంతటను ఆహారముండెను.౹

55 ఐగుప్తు దేశమందంతటను కరవు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోతో మొరపెట్టుకొనిరి, అప్పుడు ఫరో–మీరు యోసేపునొద్దకు వెళ్లి అతడు మీతో చెప్పునట్లు చేయుడని ఐగుప్తీయులందరితో చెప్పెను.౹

56 కరవు ఆ దేశమందంతటను ఉండెను గనుక యోసేపు కొట్లన్నియు విప్పించి ఐగుప్తీయులకు ధాన్యమమ్మకము చేసెను. ఐగుప్తు దేశమందు ఆ కరవు భారముగా ఉండెను;౹

57 మరియు ఆ కరవు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపునొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/GEN/41-a519e3d26ab43958cd7c05b37fa1f2d7.mp3?version_id=1787—

Categories
ఆదికాండము

ఆదికాండము 42

1 ధాన్యము ఐగుప్తులో నున్నదని యాకోబు తెలిసి కొనినప్పుడు–మీరేల ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను.౹

2 మరియు అతడు–చూడుడి, ఐగుప్తులో ధాన్యమున్నదని వింటిని, మనము చావక బ్రదుకునట్లు మీరు అక్కడికి వెళ్లి మనకొరకు అక్కడనుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా

3 యోసేపు పదిమంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొన బోయిరి.౹

4 అయినను–ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాడు.

5 కరవు కనాను దేశములో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చినవారితోకూడ ఇశ్రాయేలు కుమారులును వచ్చిరి.౹

6 అప్పుడు యోసేపు ఆ దేశమంతటిమీద అధికారియైయుండెను. అతడే ఆ దేశ ప్రజలందరికిని ధాన్యమమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనముచేసిరి.౹

7 యోసేపు తన సహోదరులను చూచి వారిని గురుతుపెట్టి వారికి అన్యునివలె కనబడి వారితో కఠినముగా మాటలాడి–మీరెక్కడనుండి వచ్చితిరని అడిగెను. అందుకు వారు–ఆహారము కొనుటకు కనాను దేశమునుండి వచ్చితి మనిరి.౹

8 యోసేపు తన సహోదరులను గురుతు పట్టెనుగాని వారతని గురుతు పట్టలేదు.౹

9 యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకము చేసికొని–మీరు వేగులవారు ఈ దేశముగుట్టు తెలిసికొన వచ్చితిరని వారితో ననగా

10 వారు–లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చితిమి;౹

11 మేమందరము ఒక్క మనుష్యుని కుమారులము; మేము యథార్థవంతులమేగాని నీ దాసులమైన మేము వేగులవారము కామని అతనితో చెప్పిరి.౹

12 అయితే అతడు–లేదు, ఈ దేశము గుట్టు తెలిసి కొనుటకై వచ్చితిరని వారితో అనెను.౹

13 అందుకు వారు– నీ దాసులమైన మేము పండ్రెండుమంది సహోదరులము, కనానుదేశములోనున్న ఒక్క మనుష్యుని కుమారులము; ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రియొద్ద ఉన్నాడు; ఒకడు లేడు అని ఉత్తరమిచ్చిరి.౹

14 అయితే యోసేపు– మీరు వేగులవారని నేను మీతో చెప్పినమాట నిజమే.౹

15 దీనివలన మీ నిజము తెలియబడును; ఫరో జీవముతోడు, మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనేగాని మీరిక్కడనుండి వెళ్లకూడదు.౹

16 మీ తమ్ముని తీసికొని వచ్చుటకు మీలో ఒకని పంపుడి; అయితే మీరు బంధింపబడి యుందురు. అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడును; లేనియెడల ఫరో జీవముతోడు, మీరు వేగుల వారని చెప్పి

17 వారిని మూడుదినములు చెరసాలలో వేయించెను.

18 మూడవదినమున యోసేపు వారిని చూచి–నేను దేవునికి భయపడువాడను; మీరు బ్రదుకునట్లు దీని చేయుడి.౹

19 మీరు యథార్థవంతులైతిరా మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలెను; మీరు వెళ్లి మీ కుటుంబముల కరవు తీరుటకు ధాన్యము తీసికొని పోవుడి.౹

20 మీ తమ్ముని నా యొద్దకు తీసికొని రండి; అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడును గనుక మీరు చావరని చెప్పెను. వారట్లు చేసిరి.౹

21 అప్పుడు వారు–నిశ్చయముగా మన సహోదరుని యెడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలుకొనినప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి; అందువలన ఈ వేదన మనకు వచ్చెనని ఒక నితో ఒకడు మాటలాడుకొనిరి.౹

22 మరియు రూబేను – ఈ చిన్నవానియెడల పాపము చేయకుడని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినరైతిరి గనుక అతని రక్తాప రాధము మనమీద మోపబడుచున్నదని వారికి ఉత్తర మిచ్చెను.౹

23 అయితే ద్విభాషి వారి మధ్యనుండెను గనుక తన మాట యోసేపు గ్రహించెనని వారు తెలిసికొనలేదు.౹

24 అతడు వారియొద్దనుండి అవతలకు పోయి యేడ్చి, మరల వారియొద్దకు వచ్చి వారితో మాటలాడి, వారిలో షిమ్యో నును పట్టుకొని వారి కన్నుల ఎదుట అతని బంధించెను.౹

25 మరియు యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును, ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును, ప్రయాణముకొరకు భోజనపదార్థములు వారికిచ్చుటకును ఆజ్ఞ ఇచ్చెను. అతడు వారియెడల నిట్లు జరిగించెను.

26 వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిదలమీద ఎక్కించుకొని అక్కడనుండి వెళ్లిపోయిరి.౹

27 అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేతపెట్టుటకై తన గోనె విప్పినప్పుడు అతని రూకలు కనబడెను, అవి అతని గోనెమూతిలో ఉండెను.౹

28 అప్పుడతడు–నా రూకలు తిరిగి యిచ్చివేసినారు. ఇదిగో ఇవి నా గోనె లోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పెను. అంతట వారు గుండె చెదిరిపోయినవారై జడిసి–ఇదేమిటి? దేవుడు మనకిట్లు చేసెనని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి.౹

29 వారు కనాను దేశమందున్న తమ తండ్రియైన యాకోబునొద్దకు వచ్చి తమకు సంభవించినది యావత్తును అతనికి తెలియ చేసిరి.౹

30 ఎట్లనగా–ఆ దేశమునకు ప్రభువైనవాడు మాతో కఠినముగా మాటలాడి, మేము ఆ దేశమును వేగుచూడ వచ్చినవారమని అనుకొనెను.౹

31 అప్పుడు–మేము యథార్థవంతులము, వేగులవారము కాము.౹

32 పండ్రెండుమంది సహోదరులము, ఒక్కతండ్రి కుమారులము, ఒకడు లేడు, మా తమ్ముడు నేడు కనాను దేశమందు మా తండ్రియొద్ద ఉన్నాడని అతనితో చెప్పితిమి.౹

33 అందుకు ఆ దేశపు ప్రభువు మమ్మును చూచి–మీరు యథార్థవంతులని దీని వలన నేను తెలిసికొందును. మీ సహోదరులలో ఒకనిని నాయొద్ద విడిచిపెట్టి మీ కుటుంబములకు కరవు తీరునట్లు ధాన్యము తీసికొనిపోయి,౹

34 నాయొద్దకు ఆ చిన్నవాని తోడుకొనిరండి. అప్పుడు మీరు యథార్థవంతులేగాని వేగులవారు కారని నేను తెలిసికొని మీ సహోదరుని మీకప్పగించెదను; అప్పుడు మీరు ఈ దేశమందు వ్యాపారము చేసికొనవచ్చునని చెప్పెననిరి.

35 వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రూకల మూట వారి గోనెలో ఉండెను. వారును వారి తండ్రియు ఆ రూకల మూటలు చూచి భయపడిరి.౹

36 అప్పుడు వారి తండ్రియైన యాకోబు వారిని చూచి– మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు; యోసేపు లేడు; షిమ్యోను లేడు; మీరు బెన్యామీనును కూడ తీసికొనపోవుదురు; ఇవన్నియు నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పెను.౹

37 అందుకు రూబేను–నేనతని నీయొద్దకు తీసికొని రానియెడల నా యిద్దరు కుమారులను నీవు చంపవచ్చును; అతని నా చేతికప్పగించుము, అతని మరల నీయొద్దకు తీసికొని వచ్చి అప్పగించెదనని తన తండ్రితో చెప్పెను.౹

38 అయితే అతడు–నా కుమారుని మీతో వెళ్లనియ్యను; ఇతని అన్న చనిపోయెను, ఇతడు మాత్రమే మిగిలియున్నాడు. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించినయెడల నెరసిన వెండ్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/GEN/42-92187cc02d27f5c8cb44cecea2e7940b.mp3?version_id=1787—

Categories
ఆదికాండము

ఆదికాండము 43

1 ఆ దేశమందు కరవు భారముగా ఉండెను గనుక

2 వారు ఐగుప్తునుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తరువాత వారి తండ్రి–మీరు మరల వెళ్లి మనకొరకు కొంచెము ఆహారము కొనుడని వారితో అనగా

3 యూదా అతని చూచి–ఆ మనుష్యుడు మీ తమ్ముడు మీతో ఉంటేనేగాని మీరు నా ముఖము చూడకూడదని మాతో గట్టిగా చెప్పెను.౹

4 కాబట్టి నీవు మా తమ్ముని మాతోకూడ పంపినయెడల మేము వెళ్లి నీకొరకు ఆహారము కొందుము.౹

5 నీవు వానిని పంపనొల్లనియెడల మేము వెళ్లము; ఆ మనుష్యుడు–మీ తమ్ముడు మీతో లేనియెడల మీరు నా ముఖము చూడకూడదని మాతో చెప్పెననెను.౹

6 అందుకు ఇశ్రాయేలు–మీకు ఇంకొక సహోదరుడు కలడని మీరు ఆ మనుష్యునితో చెప్పి నాకు ఇంత శ్రమ కలుగజేయనేల అనగా

7 వారు–ఆ మనుష్యుడు–మీ తండ్రి యింక సజీవుడై యున్నాడా? మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మునుగూర్చియు మా బంధువులనుగూర్చియు ఖండితముగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టు అతనికి వాస్తవము తెలియచెప్పితిమి–మీ సహోదరుని తీసికొని రండని అతడు చెప్పునని మాకెట్లు తెలియుననిరి.౹

8 యూదా తన తండ్రియైన ఇశ్రాయేలును చూచి–ఆ చిన్న వానిని నాతోకూడ పంపుము, మేము లేచి వెళ్లుదుము, అప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలును చావక బ్రదుకుదుము;౹

9 నేను అతనిగూర్చి పూటపడుదును, నీవు అతనిగూర్చి నన్ను అడుగవలెను; నేను అతని తిరిగి నీయొద్దకు తీసికొనివచ్చి నీయెదుట నిలువబెట్టనియెడల ఆ నింద నామీద ఎల్లప్పుడును ఉండును.౹

10 మాకు తడవు కాక పోయినయెడల ఈపాటికి రెండవమారు తిరిగి వచ్చి యుందుమని చెప్పగా

11 వారి తండ్రియైన ఇశ్రాయేలు వారితో–అట్లయిన మీ రీలాగు చేయుడి; ఈ దేశమందు ప్రసిద్ధములైనవి, అనగా కొంచెము మస్తకి కొంచెము తేనె సుగంధ ద్రవ్యములు బోళము పిస్తాచకాయలు బాదము కాయలు మీ గోనెలలో వేసికొని ఆ మనుష్యునికి కానుకగా తీసికొని పోవుడి.౹

12 రెట్టింపు రూకలు మీరు తీసికొనుడి, మీ గోనెల మూతిలో ఉంచబడి తిరిగివచ్చిన రూకలు కూడ చేతపట్టుకొనిపోయి మరల ఇచ్చివేయుడి; ఒకవేళ అది పొరబాటై యుండును;౹

13 మీ తమ్ముని తీసికొని లేచి ఆ మనుష్యుని యొద్దకు తిరిగి వెళ్లుడి.౹

14 ఆ మనుష్యుడు మీ యితర సహోదరుని బెన్యామీనును మీ కప్పగించునట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుష్యుని యెదుట మిమ్మును కరుణించును గాక. నేను పుత్రహీనుడనై యుండవలసినయెడల పుత్రహీనుడనగుదునని వారితో చెప్పెను.

15 ఆ మనుష్యులు ఆ కానుకను తీసికొని, చేతులలో రెట్టింపు రూకలను తమవెంట బెన్యామీనును తీసికొని లేచి ఐగుప్తునకు వెళ్లి యోసేపు యెదుట నిలిచిరి.౹

16 యోసేపు వారితో నున్న బెన్యామీనును చూచి తన గృహనిర్వాహ కునితో–ఈ మనుష్యులను ఇంటికి తీసికొనిపోయి ఒక వేటను కోసి వంట సిద్ధము చేయించుము; మధ్యాహ్నమందు ఈ మనుష్యులు నాతో భోజనము చేయుదురని చెప్పెను.౹

17 యోసేపు చెప్పినట్లు అతడు చేసి ఆ మనుష్యులను యోసేపు ఇంటికి తీసికొనిపోయెను.౹

18 ఆ మనుష్యులు యోసేపు ఇంటికి రప్పింపబడినందునవారు భయపడి–మొదట మన గోనెలలో తిరిగి పెట్టబడిన రూకల నిమిత్తము అతడు మన మీదికి అకస్మాత్తుగా వచ్చి మీదపడి మనలను దాసులుగా చెరపెట్టి మన గాడిదలను తీసికొనుటకు లోపలికి తెప్పించెననుకొనిరి.

19 వారు యోసేపు గృహనిర్వాహకునియొద్దకు వచ్చి యింటి ద్వారమున అతనితో మాటలాడి

20 –అయ్యా ఒక మనవి; మొదట మేము ఆహారము కొనుటకే వచ్చితిమి.౹

21 అయితే మేము దిగినచోటికి వచ్చి మా గోనెలను విప్పి నప్పుడు, ఇదిగో మా మా రూకల తూనికెకు సరిగా ఎవరి రూకలు వారి గోనెమూతిలో నుండెను. అవి చేతపట్టుకొని వచ్చితిమి.౹

22 ఆహారము కొనుటకు మరి రూకలను తీసికొని వచ్చితిమి; మా రూకలను మా గోనెలలో నెవరు వేసిరో మాకు తెలియదని చెప్పిరి.౹

23 అందుకతడు–మీకు క్షేమమగునుగాక భయపడకుడి; మీపితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చెను. మీ రూకలు నాకు ముట్టినవని చెప్పి షిమ్యోనును వారియొద్దకు తీసికొని వచ్చెను.౹

24-25 ఆ మనుష్యుడు వారిని యోసేపు ఇంటికి తీసికొని వచ్చి వారికి నీళ్లియ్యగా వారు కాళ్లు కడుగుకొనిరి. మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించెను. అక్కడ తాము భోజనము చేయవలెనని వినిరి గనుక మధ్యాహ్నమందు యోసేపు వచ్చు వేళకు తమ కానుకను సిద్ధముచేసిరి.౹

26 యోసేపు ఇంటికి వచ్చి నప్పుడు వారు తమ చేతులలోనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి, అతనికి నేలను సాగిలపడిరి.౹

27 అప్పుడు –మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా? అతడు ఇంక బ్రతికియున్నాడా? అని వారి క్షేమసమాచారము అడిగినందుకు వారు

28 –నీ దాసుడైన మా తండ్రి ఇంక బ్రదికియున్నాడు క్షేమముగానున్నాడని చెప్పి వంగి సాగిలపడిరి.౹

29 అప్పుడతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూచి–మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా? అని అడిగి –నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించును గాక అనెను.౹

30 అప్పుడు తన తమ్మునిమీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి యేడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్లి అక్కడ ఏడ్చెను.౹

31 అప్పుడు అతడు ముఖము కడుగుకొని వెలుపలికి వచ్చి తన్నుతాను అణచుకొని, భోజనము వడ్డించుడని చెప్పెను.౹

32 అతనికిని వారికిని అతనితో భోజనముచేయుచున్న ఐగుప్తీయులకును వేరువేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనము చేయరు; అది ఐగుప్తీయులకు హేయము.౹

33 జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠునివరకు వారు అతని యెదుట తమతమ యీడు చొప్పున కూర్చుండిరి గనుక ఆ మనుష్యులు ఒకనివైపు ఒకడు చూచి ఆశ్చర్యపడిరి.౹

34 మరియు అతడు తనయెదుటనుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతులకంటె అయిదంతలు గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతుష్టిగా త్రాగిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/GEN/43-7f7da5b3b392d59c7c9e5c1667047189.mp3?version_id=1787—

Categories
ఆదికాండము

ఆదికాండము 44

1 యోసేపు ఆ మనుష్యుల గోనెలు పెట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనె మూతిలో పెట్టుమనియు,౹

2 కనిష్ఠుని గోనె మూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టుమనియు, తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పిన మాటచొప్పున అతడు చేసెను.

3 తెల్లవారినప్పుడు ఆ మనుష్యులు తమ గాడిదలతోకూడ పంపివేయబడిరి.౹

4 వారు ఆ పట్టణమునుండి బయలుదేరి యెంతో దూరము వెళ్లకమునుపు, యోసేపు తన గృహనిర్వాహకుని చూచి – నీవు లేచి ఆ మనుష్యుల వెంటబడి వెళ్లి వారిని కలిసికొని–మీరు మేలుకు కీడుచేయనేల?

5 దేనితో నా ప్రభువు పానము చేయునో దేనివలన అతడు శకునములు చూచునో అది యిదే కదా? మీరు దీని చేయుటవలన కాని పని చేసితిరని వారితో చెప్పుమనెను.౹

6 అతడు వారిని కలిసికొని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు

7 వారు–మా ప్రభువు ఇట్లు మాటలాడనేల? ఇట్టి పని చేయుట నీ దాసులకు దూరమవును గాక.౹

8 ఇదిగో మా గోనెలమూతులలో మాకు దొరికిన రూకలను కనాను దేశములోనుండి తిరిగి తీసికొనివచ్చితిమి; నీ ప్రభువు ఇంటిలోనుండి మేము వెండినైనను బంగారమునైనను ఎట్లు దొంగిలుదుము?

9 నీ దాసులలో ఎవరియొద్ద అది దొరుకునోవాడు చచ్చును గాక; మరియు మేము మా ప్రభువునకు దాసులముగా నుందుమని అతనితో అనిరి.౹

10 అందుకతడు–మంచిది, మీరు చెప్పినట్టే కానీయుడి; ఎవరియొద్ద అది దొరుకునో అతడే నాకు దాసుడగును, అయితే మీరు నిర్దోషులగుదురని చెప్పెను.౹

11 అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోనెను క్రిందికి దించి దానిని విప్పెను.౹

12 అతడు పెద్దవాడు మొదలుకొని చిన్న వానివరకు వారిని సోదా చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికెను.౹

13 కావునవారు తమ బట్టలు చింపుకొని ప్రతివాడు తన గాడిదమీద గోనెలు ఎక్కించుకొని తిరిగి పట్టణమునకు వచ్చిరి.౹

14 అప్పుడు యూదాయును అతని సహోదరులును యోసేపు ఇంటికి వచ్చిరి. అతడింక అక్కడనే ఉండెను గనుక వారు అతని యెదుట నేలను సాగిలపడిరి.౹

15 అప్పుడు యోసేపు–మీరు చేసిన యీ పని యేమిటి? నావంటి మనుష్యుడు శకునము చూచి తెలిసికొనునని మీకు తెలియదా అని వారితో అనగా

16 యూదా యిట్లనెను–ఏలిన వారితో ఏమి చెప్పగలము? ఏమందుము? మేము నిర్దోషులమని యెట్లు కనుపరచగలము? దేవుడే నీ దాసుల నేరము కనుగొనెను. ఇదిగో మేమును ఎవని యొద్ద ఆ గిన్నె దొరికెనోవాడును ఏలిన వారికి దాసుల మగుదుమనెను.౹

17 అందుకతడు–అట్లు చేయుట నాకు దూరమవునుగాక; ఎవనిచేతిలో ఆ గిన్నె దొరికెనో వాడే నాకు దాసుడుగా నుండును; మీరు మీ తండ్రి యొద్దకు సమాధానముగా వెళ్లుడని చెప్పగా

18 యూదా అతని సమీపించి–ఏలినవాడా ఒక మనవి; ఒక మాట యేలిన వారితో తమ దాసుని చెప్పుకొననిమ్ము; తమ కోపము తమ దాసునిమీద రవులుకొననీయకుము; తమరు ఫరో అంతవారుగదా

19 ఏలినవాడు–మీకు తండ్రియైనను సహోదరుడైనను ఉన్నాడా అని తమ దాసులనడిగెను.౹

20 అందుకు మేము–మాకు ముసలివాడైన తండ్రియు అతని ముసలితనమున పుట్టిన యొక చిన్నవాడును ఉన్నారు; వాని సహోదరుడు చనిపోయెను, వాని తల్లికి వాడొక్కడే మిగిలియున్నాడు, వాని తండ్రి వానిని ప్రేమించుచున్నాడని చెప్పితిమి.౹

21 అప్పుడు తమరు–నేనతని చూచుటకు అతని నా యొద్దకు తీసికొని రండని తమ దాసులతో చెప్పి తిరి.౹

22 అందుకు మేము–ఆ చిన్నవాడు తన తండ్రిని విడువలేడు.వాడు తన తండ్రిని విడిచినయెడల వాని తండ్రి చనిపోవునని యేలినవారితో చెప్పితిమి.౹

23 అందుకు తమరు–మీ తమ్ముడు మీతో రానియెడల మీరు మరల నా ముఖము చూడకూడదని తమ దాసులతో చెప్పితిరి.౹

24 కాబట్టి నా తండ్రియైన తమ దాసుని యొద్దకు మేము వెళ్లి యేలినవారి మాటలను అతనికి తెలియచేసితిమి.౹

25 మా తండ్రి–మీరు తిరిగి వెళ్లి మనకొరకు కొంచెము ఆహారము కొనుక్కొని రండని చెప్పినప్పుడు

26 మేము–అక్కడికి వెళ్లలేము; మా తమ్ముడు మాతోకూడ ఉండినయెడల వెళ్లుదుము; మా తమ్ముడు మాతో నుంటేనేగాని ఆ మనుష్యుని ముఖము చూడలేమని చెప్పితిమి.౹

27 అందుకు తమ దాసుడైన నా తండ్రి–నాభార్య నాకిద్దరిని కనెనని మీ రెరుగుదురు.౹

28 వారిలో ఒకడు నా యొద్దనుండి వెళ్లి పోయెను. అతడు నిశ్చయముగా దుష్టమృగములచేత చీల్చ బడెనను కొంటిని, అప్పటినుండి అతడు నాకు కనబడలేదు.౹

29 మీరు నా యెదుటనుండి ఇతని తీసికొనిపోయిన తరువాత ఇతనికి హాని సంభవించినయెడల నెరసిన వెండ్రుకలుగల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని మాతో చెప్పెను.౹

30 కావున తమ దాసుడైన నా తండ్రియొద్దకు నేను వెళ్లినప్పుడు ఈ చిన్నవాడు మాయొద్ద లేనియెడల

31 అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసికొని యున్నది గనుక ఈ చిన్నవాడు మాయొద్ద లేకపోవుట అతడు చూడగానే చనిపోవును. అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెండ్రుకలు గల తమ దాసుడైన మాతండ్రిని మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదుము.౹

32-33 తమ దాసుడనైన నేను ఈ చిన్న వానినిగూర్చి నా తండ్రికి పూటపడి–నీ యొద్దకు నేనతని తీసికొని రానియెడల నా తండ్రి దృష్టియందు ఆ నింద నామీద ఎల్లప్పుడు ఉండునని చెప్పితిని. కాబట్టి తమ దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలినవారికి దాసునిగా నుండనిచ్చి యీ చిన్నవాని తన సహోదరులతో వెళ్లనిమ్ము.౹

34 ఈ చిన్నవాడు నాతోకూడ లేనియెడల నా తండ్రియొద్దకు నేనెట్లు వెళ్లగలను? వెళ్లినయెడల నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చునని చెప్పెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/GEN/44-c9788336fd4a49e1c5e608d1204caada.mp3?version_id=1787—

Categories
ఆదికాండము

ఆదికాండము 45

1 అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచినవారందరి యెదుట తన్నుతాను అణచుకొనజాలక–నా యొద్దనుండి ప్రతిమనుష్యుని వెలుపలికి పంపి వేయుడని బిగ్గరగా చెప్పెను. యోసేపు తన సహోదరులకు తన్నుతాను తెలియచేసికొనినప్పుడు ఎవరును అతని యొద్ద నిలిచియుండలేదు.౹

2 అతడు ఎలుగెత్తి యేడ్వగా ఐగుప్తీయులును ఫరో యింటివారును వినిరి.౹

3 అప్పుడు యోసేపు–నేను యోసేపును; నా తండ్రి యింక బ్రదికియున్నాడా అని అడిగి నప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందర పడి అతనికి ఉత్తరము ఇయ్యలేక పోయిరి.౹

4 అంతట యోసేపు–నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పి నప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడతడు–ఐగుప్తునకు వెళ్లునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే.౹

5 అయినను నేనిక్కడికి వచ్చునట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి; అది మీకు సంతాపము పుట్టింప నియ్యకుడి; ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను.౹

6 రెండు సంవత్సరములనుండి కరవు దేశములోనున్నది. సేద్యమైనను కోతయైనను లేని సంవత్సరములు ఇంక అయిదు వచ్చును. మిమ్మును ఆశ్చర్యముగ రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును

7 ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను.౹

8 కాబట్టి దేవుడేగాని మీరు నన్నిక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని యింటి వారికందరికి ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటిమీద ఏలికగాను నియమించెను.౹

9 మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్లి అతనితో–నీ కుమారుడైన యోసేపు– దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు;౹

10 నీవు గోషెను దేశమందు నివసించెదవు, అప్పుడు నీవును నీ పిల్లలును నీ పిల్లల పిల్లలును నీ గొఱ్ఱెలమందలును నీ పశువులును నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా నుండును.౹

11 ఇకను అయిదు కరవు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ యింటి వారికిని నీకు కలిగినదంతటికిని పేదరికము రాకుండ అక్కడ నిన్ను పోషించెదనన్నాడని చెప్పుడి.౹

12 ఇదిగో మీతో మాటలాడుచున్నది నా నోరే అని మీ కన్నులును నా తమ్ముడైన బెన్యామీను కన్నులును చూచుచున్నవి.౹

13 ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను, మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియ చేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసికొనిరండని తన సహోదరులతో చెప్పి

14 తన తమ్ముడైన బెన్యామీను మెడమీదపడి యేడ్చెను; బెన్యామీను అతని మెడమీదపడి యేడ్చెను.౹

15 అతడు తన సహోదరులందరిని ముద్దు పెట్టుకొని వారిమీదపడి యేడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాటలాడిరి.

16 యోసేపుయొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో యింటిలో వినబడెను. అది ఫరోకును అతని సేవకు లకును ఇష్టముగా నుండెను.౹

17 అప్పుడు ఫరో యోసేపుతో ఇట్లనెను–నీవు నీ సహోదరులను చూచి–మీరీలాగు చేయుడి, మీ పశువులమీద బరువులు కట్టి కనాను దేశమునకు వెళ్లి

18 మీ తండ్రిని మీ యింటివారిని వెంట బెట్టుకొని నా యొద్దకు రండి; ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులను మీకిచ్చెదను, ఈ దేశముయొక్క సారమును మీరు అనుభవించెదరు.౹

19 నీకు ఆజ్ఞయైనది గదా? దీని చేయుడి, మీ పిల్లలకొరకును మీ భార్యలకొరకును ఐగుప్తులోనుండి బండ్లను తీసికొనిపోయి మీ తండ్రిని వెంటబెట్టుకొని రండి.౹

20 ఐగుప్తు దేశమంతటిలోనున్న మంచి వస్తువులు మీవే అగును గనుక మీ సామగ్రిని లక్ష్యపెట్టకుడని చెప్పుమనగా

21 ఇశ్రాయేలు కుమారులు ఆలాగుననే చేసిరి. యోసేపు ఫరోమాటచొప్పున వారికి బండ్లను ఇప్పించెను; మార్గమునకు ఆహారము ఇప్పించెను.౹

22 అతడు వారికి రెండేసి దుస్తుల బట్టలు ఇచ్చెను; బెన్యా మీనుకు మూడువందల తులముల వెండియును ఐదు దుస్తుల బట్టలు ఇచ్చెను,౹

23 అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులో నున్న మంచి వస్తువులను మోయుచున్న పది గాడిదలను, మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును, ఇతర ధాన్యమును తినుబండములను మోయుచున్న పది ఆడు గాడిదలను పంపెను.౹

24 అప్పుడతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా–మార్గమందు కలహ పడకుడని వారితో చెప్పెను.౹

25 వారు ఐగుప్తునుండి బయలుదేరి కనాను దేశమునకు తన తండ్రియైన యాకోబు నొద్దకు వచ్చి

26 యోసేపు ఇంక బ్రదికియుండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియచేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడాయెను.౹

27 అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటిని అతనితో చెప్పిరి. అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచి నప్పుడు వారి తండ్రియైన యాకోబు ప్రాణము తెప్ప రిల్లెను.౹

28 అప్పుడు ఇశ్రాయేలు–ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంక బ్రదికియున్నాడు, నేను చావకమునుపు వెళ్లి అతని చూచెదనని చెప్పెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/GEN/45-c425f069f4cf683f83a89f97e363ac92.mp3?version_id=1787—

Categories
ఆదికాండము

ఆదికాండము 46

1 అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసికొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రియైన ఇస్సాకు దేవునికి బలులనర్పించెను.౹

2 అప్పుడు రాత్రి దర్శనములయందు దేవుడు–యాకోబూ యాకోబూ అని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు–చిత్తము ప్రభువా అనెను.౹

3 ఆయన–నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్లుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసెదను.౹

4 నేను ఐగుప్తునకు నీతోగూడ వచ్చెదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసికొని వచ్చెదను, యోసేపు నీ కన్నులమీద తన చెయ్యి యుంచునని సెలవియ్యగా

5 యాకోబు లేచి బెయేర్షెబా నుండి వెళ్లెను. ఫరో అతని నెక్కించి తీసికొని వచ్చుటకు పంపిన బండ్లమీద ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రియైన యాకోబును తమ పిల్లలను తమ భార్యలను ఎక్కించిరి.౹

6 వారు, అనగా యాకోబును అతని యావత్తు సంతానమును, తమ పశువులను తాము కనానులో సంపా దించిన సంపద యావత్తును తీసికొని ఐగుప్తునకు వచ్చిరి.౹

7 అతడు తన కుమారులను తన కుమారుల కుమారులను తన కుమార్తెలను తన కుమారుల కుమార్తెలను తన యావత్తు సంతానమును ఐగుప్తునకు తనతోకూడ తీసికొనివచ్చెను.

8 యాకోబును అతని కుమారులును ఐగుప్తునకు వచ్చిరి. ఇశ్రాయేలు కుమారుల పేళ్లు ఇవే;౹

9 యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను. రూబేను కుమారులైన హనోకు పల్లు హెస్రోను కర్మీ.౹

10 షిమ్యోను కుమారులైన యెమూయేలు యామీను ఓహదు యాకీను సోహరు కనానీయురాలి కుమారుడైన షావూలు.౹

11 లేవి కుమారులైన గెర్షోను కహాతు మెరారి

12 యూదా కుమారులైన ఏరు ఓనాను షేలా పెరెసు జెరహు. ఆ ఏరును ఓనానును కనాను దేశములో చనిపోయిరి. పెరెసు కుమారులైన హెస్రోను హామూలు.౹

13 ఇశ్శాఖారు కుమారులైన తోలా పువ్వా యోబు షిమ్రోను.౹

14 జెబూలూను కుమారులైన సెరెదు ఏలోను యహలేలు.౹

15 వీరు లేయా కుమారులు. ఆమె పద్దనరాములో యాకోబు వారిని అతని కుమార్తెయైన దీనాను కనెను. అతని కుమారులును అతని కుమార్తెలును అందరును ముప్పది ముగ్గురు.౹

16 గాదు కుమారులైన సిప్యోను హగ్గీ షూనీ ఎస్బోను ఏరీ ఆరోదీ అరేలీ.౹

17 ఆషేరు కుమారులైన ఇమ్నా ఇష్వా ఇష్వీ బెరీయా; వారి సహోదరియైన శెరహు. ఆ బెరీయా కుమారులైన హెబెరు మల్కీయేలు.౹

18 లాబాను తన కుమార్తెయైన లేయా కిచ్చిన జిల్పా కుమారులు వీరే. ఆమె యీ పదునారు మందిని యాకోబునకు కనెను.౹

19 యాకోబు భార్యయైన రాహేలు కుమారులైన యోసేపు బెన్యామీను.౹

20 యోసేపునకు మనష్షే ఎఫ్రాయిములు పుట్టిరి. వారిని ఐగుప్తుదేశమందు ఓనుకు యాజకుడగు పోతీఫెర కుమార్తెయైన ఆసెనతు అతనికి కనెను.౹

21 బెన్యామీను కుమారులైన బెల బేకెరు అష్బేలు గెరా నయమాను ఏహీ రోషు ముప్పీము హుప్పీము ఆర్దు.౹

22 యాకోబునకు రాహేలు కనిన కుమారులగు వీరందరు పదునలుగురు.౹

23 దాను కుమారుడైన హుషీము.౹

24 నఫ్తాలి కుమారులైన యహసేలు గూనీ యేసెరు షిల్లేము.౹

25 లాబాను తన కుమార్తెయైన రాహేలునకు ఇచ్చిన బిల్హా కుమారులు వీరే. ఆమె వారిని యాకోబునకు కనెను. వారందరు ఏడుగురు.౹

26 యాకోబు కోడండ్రను వినాయించి అతని గర్భవాసమున పుట్టి యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరు అరువది ఆరుగురు.౹

27 ఐగుప్తులో అతనికి పుట్టిన యోసేపు కుమారులిద్దరు; ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబపు వారందరు డెబ్బదిమంది.

28 అతడు గోషెనుకు త్రోవ చూపుటకు యోసేపునొద్దకు తనకు ముందుగా యూదాను పంపెను. వారు గోషెను దేశమునకు రాగా

29 యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రియైన ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు గోషెనుకు వెళ్లి అతనికి కనబడెను. అప్పుడతడు అతని మెడమీదపడి అతని మెడ పట్టుకొని యెంతో ఏడ్చెను.౹

30 అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో–నీవింక బ్రదికియున్నావు; నీ ముఖము చూచితిని గనుక నేనికను చనిపోవుదునని చెప్పెను.౹

31 యోసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారినిచూచి–నేను వెళ్లి యిది ఫరోకు తెలియచేసి, కనానుదేశములో ఉండిన నా సహోదరులును నా తండ్రి కుటుంబపువారును నాయొద్దకు వచ్చిరి;౹

32 ఆ మనుష్యులు పశువులు గలవారు, వారు గొఱ్ఱెల కాపరులు. వారు తమ గొఱ్ఱెలను పశువులను తమకు కలిగినదంతయు తీసికొనివచ్చిరని అతనితో చెప్పెదను.౹

33 గొఱ్ఱెల కాపరియైన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు గనుక ఫరో మిమ్మును పిలిపించి మీ వృత్తి యేమిటని అడిగినయెడల

34 మీరు గోషెను దేశమందు కాపురముండునట్లు–మా చిన్నతనమునుండి ఇదివరకు నీ దాసులమైన మేమును మా పూర్వికులును పశువులు గలవారమై యున్నామని ఉత్తరమియ్యుడని చెప్పెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/GEN/46-5f2687ff3e345c6a5f68e5715276957b.mp3?version_id=1787—

Categories
ఆదికాండము

ఆదికాండము 47

1 యోసేపు వెళ్లి ఫరోను చూచి–నా తండ్రియు నా సహోదరులును వారి గొఱ్ఱెల మందలతోను వారి పశువులతోను వారికి కలిగినదంతటితోను కనాను దేశము నుండి వచ్చి గోషెనులో నున్నారని తెలియచేసి

2 తన సహోదరులందరిలో అయిదుగురిని వెంటబెట్టుకొనిపోయి వారిని ఫరో సమక్షమందు ఉంచెను.౹

3 ఫరో అతని సహోదరులను చూచి–మీ వృత్తి యేమిటని అడిగినప్పుడు వారు–నీ దాసులమైన మేమును మా పూర్వికులును గొఱ్ఱెల కాపరులమని ఫరోతో చెప్పిరి.౹

4 మరియు వారు–కనాను దేశమందు కరవు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగియున్న మందలకు మేత లేదు గనుక ఈ దేశములో కొంత కాలముండుటకు వచ్చితిమి. కాబట్టి గోషెను దేశములో నీ దాసులు నివసింప సెలవిమ్మని ఫరోతో అనగా

5 ఫరో యోసేపును చూచి–నీ తండ్రియు నీ సహోదరులును నీయొద్దకు వచ్చియున్నారు.౹

6 ఐగుప్తు దేశము నీ యెదుట ఉన్నది, ఈ దేశములోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింప చేయుము, గోషెను దేశములో వారు నివసింప వచ్చును, వారిలో ఎవరైన ప్రజ్ఞగలవారని నీకు తోచినయెడల నా మందలమీద వారిని అధిపతులగా నియమించుమని చెప్పెను

7 మరియు యోసేపు తన తండ్రియైన యాకోబును లోపలికి తీసికొని వచ్చి ఫరో సమక్షమందు అతని నుంచగా యాకోబు ఫరోను దీవించెను.౹

8 ఫరో– నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబు నడిగినందుకు

9 యాకోబు–నేను యాత్రచేసిన సంవత్సరములు నూట ముప్పది, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితమైనవిగా ఉన్నవి. అవి నా పితరులు యాత్రచేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్ని కాలేదని ఫరోతో చెప్పి

10 ఫరోను దీవించి ఫరోయెదుటనుండి వెళ్లిపోయెను.౹

11 ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశములో నివసింపచేసి, ఆ దేశములో రామెసేసను మంచి ప్రదేశములో వారికి స్వాస్థ్యము నిచ్చెను.౹

12 మరియు యోసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబపువారినందరిని వారివారి పిల్లల లెక్కచొప్పున వారికి ఆహారమిచ్చి సంరక్షించెను.

13 కరవు మిక్కిలి భారమైనందున ఆ దేశమందంతటను ఆహారము లేకపోయెను. కరవువలన ఐగుప్తు దేశమును కనాను దేశమును క్షీణించెను.౹

14 వచ్చినవారికి ధాన్య మమ్ముటవలన ఐగుప్తు దేశములోను కనాను దేశములోను దొరికిన ద్రవ్యమంత యోసేపు సమకూర్చెను. ఆ ద్రవ్య మంతటిని యోసేపు ఫరో నగరులోనికి తెప్పించెను.౹

15 ఐగుప్తు దేశమందును కనాను దేశమందును ద్రవ్యము వ్యయమైన తరువాత ఐగుప్తీయులందరు యోసేపునొద్దకు వచ్చి–మాకు ఆహారము ఇప్పించుము, నీ సముఖమందు మేమేల చావవలెను? ద్రవ్యము వ్యయమైనది గదా అనిరి.౹

16 అందుకు యోసేపు–మీ పశువులను ఇయ్యుడి; ద్రవ్యము వ్యయమైపోయినయెడల మీ పశువులకు ప్రతిగా నేను మీకు ధాన్యమిచ్చెదనని చెప్పెను, కాబట్టి వారు తమ పశువులను యోసేపునొద్దకు తీసికొనివచ్చిరి. యోసేపు గుఱ్ఱములను గొఱ్ఱెల మందలను పశువుల మందలను గాడిదలను తీసికొని వారికి ఆహారమిచ్చెను.౹

17 ఆ సంవత్సరమందు వారి మందలన్నిటికి ప్రతిగా అతడు వారికి ఆహారమిచ్చి సంరక్షించెను.౹

18 ఆ సంవత్సరము గతించిన తరువాత రెండవ సంవత్సరమునవారు అతని యొద్దకు వచ్చి ఇది మా యేలినవారికి మరుగుచేయము; ద్రవ్యము వ్యయమై పోయెను, పశువుల మందలును ఏలినవారి వశమాయెను, ఇప్పుడు మా దేహములును మా పొలములును తప్ప మరి ఏమియు ఏలినవారి సముఖమున మిగిలియుండలేదు.౹

19 నీ కన్నుల యెదుట మా పొలములును మేమును నశింపనేల? ఆహారమిచ్చి మమ్మును మా పొలములనుకొనుము; మా పొలములతో మేము ఫరోకు దాసులమగుదుము; మేము చావక బ్రదుకునట్లును పొలములు పాడైపోకుండునట్లును మాకు విత్తనము లిమ్మని అడిగిరి.౹

20 అట్లు యోసేపు ఐగుప్తు భూములన్నిటిని ఫరోకొరకు కొనెను. కరవు వారికి భారమైనందున ఐగుప్తీయులందరు తమతమ పొలములను అమ్మివేసిరి గనుక, భూమి ఫరోది ఆయెను.౹

21 అతడు ఐగుప్తు పొలిమేరలయొక్క యీ చివరనుండి ఆ చివర వరకును జనులను ఊళ్లలోనికి రప్పించెను.౹

22 యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు, యాజకులకు ఫరో బత్తెములు నియమించెను. ఫరో ఇచ్చిన బత్తెములవలన వారికి భోజనము జరిగెను గనుక వారు తమ భూములను అమ్మలేదు.

23 యోసేపు–ఇదిగో నేడు మిమ్మును మీ భూములను ఫరోకొరకు కొనియున్నాను. ఇదిగో మీకు విత్తనములు; పొలములలో విత్తుడి.౹

24 పంటలో అయిదవభాగము మీరు ఫరోకు ఇయ్యవలెను. నాలుగు భాగములు పొలములలో విత్తుటకును మీకును మీ కుటుంబపువారికిని ఆహారమునకును మీ పిల్లలకు ఆహారమునకును మీవై యుండునని ప్రజలతో చెప్పగా

25 వారు–నీవు మమ్ము బ్రదికించితివి, ఏలినవారి కటాక్షము మా మీదనుండనిమ్ము; ఫరోకు దాసులమగుదుమని చెప్పిరి.౹

26 అప్పుడు అయిదవభాగము ఫరోదని నేటివరకు యోసేపు ఐగుప్తు భూములనుగూర్చి కట్టడ నియమించెను, యాజకుల భూములు మాత్రమే వినాయింపబడెను. అవి ఫరోవి కావు.౹

27 ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశమందలి గోషెను ప్రదేశములో నివసించిరి. అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతా నాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి.

28 యాకోబు ఐగుప్తుదేశములో పదునేడు సంవత్సరములు బ్రదికెను. యాకోబు దినములు, అనగా అతడు జీవించిన సంవత్సరములు నూటనలుబదియేడు.౹

29 ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించి నప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి–నా యెడల నీకు కటాక్షమున్నయెడల దయచేసి నీ చెయ్యి నాతొడక్రింద ఉంచి నా యెడల దయను నమ్మకమును కనుపరచుము; ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతిపెట్టకుము.౹

30 నా పితరులతోకూడ నేను పండుకొనునట్లు ఐగుప్తులోనుండి నన్ను తీసికొనిపోయి వారి సమాధిలో నన్ను పాతిపెట్టుమని అతనితో చెప్పెను.౹

31 అందుకతడు–నేను నీ మాటచొప్పున చేసెదననెను. మరియు అతడు–నాతో ప్రమాణము చేయుమన్నప్పుడు యోసేపు అతనితో ప్రమాణము చేసెను. అప్పుడు ఇశ్రాయేలు తన మంచపు తలాపిమీద వంగి దేవునికి నమస్కారము చేసెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/GEN/47-9e546903ef995c83beb51e387ca50abb.mp3?version_id=1787—

Categories
ఆదికాండము

ఆదికాండము 48

1 ఈ సంగతులైన తరువాత–ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పెను. అప్పుడతడు మనష్షే ఎఫ్రాయిములు అను తన యిద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోగా,౹

2 ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడెను. అంతట ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచముమీద కూర్చుండెను.౹

3 యోసేపును చూచి–కనాను దేశమందలి లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి

4 –ఇదిగో నీకు సంతానాభి వృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహ మగునట్లు చేసి, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్యస్వాస్థ్యముగా ఇచ్చెదనని సెలవిచ్చెను.౹

5 ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తుదేశములో నీకు పుట్టిన నీ యిద్దరు కుమారులు నా బిడ్డలే; రూబేను పిమ్యోనులవలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలైయుందురు.౹

6 వారి తరువాత నీవు కనిన సంతానము నీదే; వారు తమ సహోదరుల స్వాస్థ్యమునుబట్టి వారి పేళ్ల చొప్పున పిలువబడుదురు.౹

7 పద్దనరామునుండి నేను వచ్చుచున్నప్పుడు, ఎఫ్రాతాకు ఇంక కొంత దూరమున నుండగా మార్గమున రాహేలు కనాను దేశములో నా యెదుట మృతి పొందెను. అక్కడ బేత్లెహేమను ఎఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతిపెట్టితినని యోసేపుతో చెప్పెను.౹

8 ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి–వీరెవరని అడుగగా

9 యోసేపు–వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నా కనుగ్ర హించెనని తన తండ్రితో చెప్పెను. అందుకతడు–నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసికొనిరమ్మనెను.౹

10 ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యమువలన మందముగా ఉండెను గనుక అతడు చూడలేక పోయెను. యోసేపు వారిని అతనిదగ్గరకు తీసికొనివచ్చినప్పుడు అతడు వారిని ముద్దుపెట్టుకొని కౌగిలించుకొనెను.౹

11 ఇశ్రాయేలు యోసే పుతో–నీ ముఖము చూచెదనని నేను అనుకొనలేదుగాని నీ సంతానమును దేవుడు నాకు కనుపరచియున్నాడనగా

12 యోసేపు అతని మోకాళ్లమధ్యనుండి వారిని తీసికొని అతనికి సాష్టాంగ నమస్కారము చేసెను.౹

13 తరువాత యోసేపు ఇశ్రాయేలు ఎడమచేతితట్టున తన కుడిచేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడిచేతితట్టున తన యెడమ చేత మనష్షేను పట్టుకొని వారినిద్దరిని అతని దగ్గరకు తీసికొనివచ్చెను.౹

14 మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తలమీద తన కుడిచేతిని మనష్షే తలమీద తన యెడమచేతిని ఉంచెను.౹

15 అతడు యోసేపును దీవించి–నా పితరులైన అబ్రాహాము ఇస్సాకులు ఎవనియెదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటివరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు,౹

16 అనగా సమస్తమైన కీడులలోనుండి నన్ను తప్పించిన దూత యీ పిల్లలను ఆశీర్వదించునుగాక; నా పేరును అబ్రాహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక; భూమియందువారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పెను.౹

17 యోసేపు ఎఫ్రాయిము తలమీద తన తండ్రి కుడిచెయ్యి పెట్టుట చూచినప్పుడు అది అతని కిష్టము కాకపోయెను గనుక అతడు మనష్షే తలమీద పెట్టించవలెనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తలమీదనుండి యెత్తి

18 –నా తండ్రీ అట్లు కాదు; ఇతడే పెద్దవాడు, నీ కుడిచెయ్యి యితని తలమీద పెట్టుమని చెప్పెను.౹

19 అయినను అతని తండ్రి ఒప్పక–అది నాకు తెలియును, నా కుమారుడా అది నాకు తెలియును; ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడగునుగాని యితని తమ్ముడు ఇతని కంటె గొప్పవాడగును, అతని సంతానము జనముల సమూహమగునని చెప్పెను.౹

20 ఆ దినమందు అతడు వారిని దీవించి–ఎఫ్రాయిమువలెను మనష్షేవలెను దేవుడు నిన్ను చేయును గాకని ఇశ్రాయేలీయులు నీ పేరు చెప్పి దీవిం చెదరనెను. ఆలాగు అతడు మనష్షేకంటె ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను.౹

21 మరియు ఇశ్రాయేలు–ఇదిగో నేను చనిపోవుచున్నాను, అయినను దేవుడు మీకు తోడైయుండి మీపితరుల దేశమునకు మిమ్మును మరల తీసికొని పోవును.౹

22 నేను నీ సహోదరులకంటె నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చితిని. అది నా కత్తితోను నా వింటితోను అమోరీయుల చేతిలోనుండి తీసికొంటినని యోసేపుతో చెప్పెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/GEN/48-aa2a3b32e7382f0eb4dd3193d78df88c.mp3?version_id=1787—

Categories
ఆదికాండము

ఆదికాండము 49

1 యాకోబు తన కుమారులను పిలిపించి యిట్లనెను. –మీరుకూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేసెదను.

2 యాకోబు కుమారులారా, కూడివచ్చి ఆలకించుడి

మీ తండ్రియైన ఇశ్రాయేలు మాట వినుడి.

3 రూబేనూ, నీవు నా పెద్దకుమారుడవు

నా శక్తియు నా బలముయొక్క ప్రథమఫలమును

ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే.

4 నీళ్లవలె చంచలుడవై నీవు అతిశయము పొందవు

నీ తండ్రి మంచముమీది కెక్కితివి

దానిని అపవిత్రము చేసితివి

అతడు నా మంచముమీది కెక్కెను.

5 షిమ్యోను లేవి అనువారు సహోదరులువారి

ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు.

6 నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు

నా ఘనమా, వారి సంఘముతో కలిసికొనవద్దు

వారు, కోపమువచ్చి మనుష్యులను చంపిరి

తమ స్వేచ్ఛచేత ఎద్దుల గుదికాలి నరములను తెగ గొట్టిరి.

7 వారికోపము వేండ్రమైనదివారి

ఉగ్రతయు కఠినమైనది

అవి శపింపబడును

యాకోబులో వారిని విభజించెదను

ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను.

8 యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు

నీ చెయ్యి నీ శత్రువుల మెడమీద ఉండును

నీ తండ్రి కుమారులు నీ యెదుట సాగిలపడుదురు.

9 యూదా కొదమసింహము

నా కుమారుడా, నీవు పెట్టినదానితిని వచ్చితివి

సింహమువలెను గర్జించు ఆడుసింహమువలెను

అతడు కాళ్లు ముడుచుకొని పండుకొనెను

అతని లేపువాడెవడు?

10 షిలోహు వచ్చువరకు

యూదా యొద్దనుండి దండము తొలగదు

అతని కాళ్లమధ్యనుండి రాజదండము తొలగదు

ప్రజలు అతనికి విధేయులైయుందురు.

11 ద్రాక్షావల్లికి తన గాడిదను

ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిదపిల్లను కట్టి

ద్రాక్షారసములో తన బట్టలను

ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును.

12 అతని కన్నులు ద్రాక్షారసముచేత ఎఱ్ఱగాను

అతని పళ్లు పాలచేత తెల్లగాను ఉండును.

13 జెబూలూను సముద్రపు రేవున నివసించును

అతడు ఓడలకు రేవుగా ఉండును

అతని పొలిమేర సీదోనువరకు నుండును.

14 ఇశ్శాఖారు రెండు దొడ్లమధ్యను

పండుకొనియున్న బలమైన గార్దభము.

15 అతడు విశ్రాంతి మంచిదగుటయు

ఆ భూమి రమ్యమైనదగుటయు చూచెను గనుక

అతడు మోయుటకు భుజము వంచుకొని

వెట్టిచేయు దాసుడగును.

16 దాను ఇశ్రాయేలు గోత్రికులవలె

తన ప్రజలకు న్యాయము తీర్చును.

17 దాను త్రోవలో సర్పముగాను

దారిలో కట్లపాముగాను ఉండును.

అది గుఱ్ఱపు మడిమెలు కరచును

అందువలన ఎక్కువాడు వెనుకకు పడును.

18 యెహోవా, నీ రక్షణకొరకు కనిపెట్టి యున్నాను.

19 బంటుల గుంపు గాదును కొట్టును

అతడు మడిమెను కొట్టును.

20 ఆషేరునొద్ద శ్రేష్ఠమైన ఆహారము కలదు

రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును.

21 నఫ్తాలి విడువబడిన లేడి

అతడు ఇంపైనమాటలు పలుకును.

22 యోసేపు ఫలించెడి కొమ్మ

ఊట యొద్ద ఫలించెడి కొమ్మ

దాని రెమ్మలు గోడమీదికి ఎక్కి వ్యాపించును.

23 విలుకాండ్రు అతని వేధించిరివారు బాణములను వేసి అతని హింసించిరి.

24 యాకోబు కొలుచు పరాక్రమశాలియైనవాని హస్త బలమువలన

అతని విల్లు బలమైనదగును.

ఇశ్రాయేలునకు బండయు

మేపెడివాడును ఆయనే.

నీకు సహాయముచేయు నీ తండ్రి దేవునివలనను

పైనుండి మింటి దీవెనలతోను

25 క్రింద దాగియున్న అగాధజలముల దీవెనలతోను

స్తనముల దీవెనలతోను గర్భముల దీవెనలతోను

నిన్ను దీవించు సర్వశక్తుని దీవెనవలనను

అతని బాహుబలము దిట్టపరచబడును

26 నీ తండ్రి దీవెనలు నా పూర్వికుల దీవెనలపైని

చిరకాల పర్వతములకంటె హెచ్చుగ ప్రబలమగును.

అవి యోసేపు తలమీదను

తన సహోదరులనుండి వేరుపరచబడిన

వాని నడినెత్తిమీదను ఉండును.

27 బెన్యామీను చీల్చునట్టి తోడేలు

అతడు ఉదయమందు ఎరనుతిని

అస్తమయమందు దోపుడుసొమ్ము పంచుకొనును.

28 ఇవి అన్నియు ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములు. వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది యిదే. ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను.౹

29 తరువాత అతడు వారికాజ్ఞాపించుచు ఇట్లనెను–నేను నా స్వజనులయొద్దకు చేర్చబడుచున్నాను.౹

30 హిత్తీయుడైన ఎఫ్రోను భూమియం దున్న గుహలో నా తండ్రులయొద్ద నన్ను పాతిపెట్టుడి. ఆ గుహ కనాను దేశమందలి మమ్రే యెదుటనున్న మక్పేలా పొలములో ఉన్నది. అబ్రాహాము దానిని ఆ పొలమును హిత్తీయుడగు ఎఫ్రోనుయొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యముగా కొనెను.౹

31 అక్కడనే వారు అబ్రాహామును అతని భార్యయైన శారాను పాతిపెట్టిరి; అక్కడనే ఇస్సాకును అతని భార్యయైన రిబ్కాను పాతిపెట్టిరి; అక్కడనే నేను లేయాను పాతిపెట్టితిని.౹

32 ఆ పొలమును అందులోనున్న గుహయు హేతుకుమారులయొద్ద కొనబడినదనెను.౹

33 యాకోబు తన కుమారుల కాజ్ఞాపించుట చాలించి మంచముమీద తన కాళ్లు ముడుచుకొని ప్రాణమువిడిచి తన స్వజనులయొద్దకు చేర్చబడెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/GEN/49-58972ac2ec0be42e4fb3e5280581a16c.mp3?version_id=1787—

Categories
ఆదికాండము

ఆదికాండము 50

1 యోసేపు తన తండ్రి ముఖముమీదపడి అతని గూర్చి యేడ్చి అతని ముద్దుపెట్టుకొనెను.౹

2 తరువాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలెనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించెను గనుక ఆ వైద్యులు ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచిరి.౹

3 సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడువారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతనికొరకు నలుబది దినములు సంపూర్ణమాయెను. అతనిగూర్చి ఐగుప్తీయులు డెబ్బది దినములు అంగలార్చిరి.౹

4 అతనిగూర్చిన అంగలార్పు దినములు గడచిన తరువాత యోసేపు ఫరో యింటి వారితో మాటలాడి–మీ కటాక్షము నామీద నున్నయెడల మీరు అనుగ్రహించి నా మనవి ఫరో చెవిని వేసి

5 –నా తండ్రి నాచేత ప్రమాణము చేయించి–ఇదిగో నేను చనిపోవుచున్నాను, కనానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించితిని గదా, అందులోనే నన్ను పాతిపెట్ట వలెనని చెప్పెను. కాబట్టి సెలవైతే నే నక్కడికి వెళ్లి నా తండ్రిని పాతిపెట్టి మరల వచ్చెదనని చెప్పుడనెను.౹

6 అందుకు ఫరో–అతడు నీచేత చేయించిన ప్రమాణము చొప్పున వెళ్లి నీ తండ్రిని పాతిపెట్టుమని సెలవిచ్చెను.౹

7 కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టుటకు పోయెను; అతనితో ఫరో యింటి పెద్దలైన అతని సేవకులందరును ఐగుప్తు దేశపు పెద్దలందరును

8 యోసేపు యింటివారందరును అతని సహోదరులును అతని తండ్రి ఇంటివారును వెళ్లిరి. వారు తమ పిల్లలను తమ గొఱ్ఱెల మందలను తమ పశువులను మాత్రము గోషెను దేశములో విడిచిపెట్టిరి.౹

9 మరియు రథములును రౌతులును అతనితో వెళ్లినందున ఆ సమూహము బహు విస్తార మాయెను.౹

10 యొర్దానునకు అవతలనున్న ఆఠదు కళ్లమునొద్దకు చేరి అక్కడ బహు ఘోరముగా అంగలార్చిరి. అతడు తన తండ్రినిగూర్చి యేడు దినములు దుఃఖము సలిపెను.౹

11 ఆ దేశమందు నివసించిన కనానీయులు ఆఠదు కళ్లము నొద్ద ఆ దుఃఖము సలుపుట చూచి–ఐగుప్తీయులకు ఇది మిక్కటమైన దుఃఖ మని చెప్పుకొనిరి గనుక దానికి ఆబేల్మిస్రాయిము అను పేరు పెట్టబడెను, అది యొర్దానునకు అవతల నున్నది.౹

12 అతని కుమారులు తన విషయమై అతడు వారికాజ్ఞాపించినట్లు చేసిరి.౹

13 అతని కుమారులు కనాను దేశమునకు అతని శవమును తీసికొనిపోయి మక్పేలా పొలమందున్న గుహలో పాతిపెట్టిరి. దానిని ఆ పొలమును అబ్రాహాము తనకు శ్మశానముకొరకు స్వాస్థ్యముగానుండు నిమిత్తము మమ్రే యెదుట హిత్తీయుడైన ఎఫ్రోనుయొద్ద కొనెను.

14 యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తరువాత అతడును అతని సహోదరులును అతని తండ్రిని పాతిపెట్ట వెళ్లిన వారందరును తిరిగి ఐగుప్తునకు వచ్చిరి.

15 యోసేపు సహోదరులు తమ తండ్రి మృతిపొందుట చూచి–ఒకవేళ యోసేపు మనయందు పగపెట్టి మన మత నికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని

16 యోసేపునకు ఈలాగు వర్తమాన మంపిరి

17 –నీ తండ్రి తాను చావకమునుపు ఆజ్ఞాపించిన దేమనగా–మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించుమనిరి. వారు యోసేపుతో ఈలాగు మాటలాడుచుండగా అతడు ఏడ్చెను.౹

18 మరియు అతని సహోదరులు పోయి అతని యెదుట సాగిలపడి–ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా

19 యోసేపు–భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా?

20 మీరు నాకు కీడుచేయనుద్దేశించితిరిగాని నేటిదినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రదికించునట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను.౹

21 కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాటలాడెను.

22 యోసేపు అతని తండ్రి కుటుంబపువారును ఐగుప్తులో నివసించిరి, యోసేపు నూటపది సంవత్సరములు బ్రది కెను.౹

23 యోసేపు ఎఫ్రాయిముయొక్క మూడవతరము పిల్లలను చూచెను; మరియు మనష్షే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి.౹

24 యోసేపు తన సహోదరులను చూచి–నేను చనిపోవు చున్నాను; దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి, యీ దేశములోనుండి తాను అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసియిచ్చిన దేశమునకు మిమ్మును తీసికొని పోవునని చెప్పెను

25 మరియు యోసేపు –దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును; అప్పుడు మీరు నా యెముకలను ఇక్కడనుండి తీసికొని పోవలెనని చెప్పి ఇశ్రాయేలు కుమారులచేత ప్రమాణము చేయించు కొనెను.౹

26 యోసేపు నూటపది సంవత్సరములవాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/GEN/50-2e0c9b9f1572c8c158392be8a4b5330f.mp3?version_id=1787—