Categories
ఎస్తేరు

ఎస్తేరు 5

1 మూడవ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని, రాజునగరుయొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్లి నిలిచెను. రాజనగరు ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణములో తన రాజాసనముమీద రాజు కూర్చుని యుండెను.౹

2 రాణియైన ఎస్తేరు ఆవరణములో నిలువబడి యుండుట రాజు చూడగా ఆమెయందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలోనుండు బంగారపు దండమును ఎస్తేరుతట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండముయొక్క కొన ముట్టెను.౹

3 రాజు – రాణియైన ఎస్తేరూ, నీకేమి కావలెను? నీ మనవి యేమిటి? రాజ్యములో సగము మట్టుకు నీకను గ్రహించెదనని ఆమెతో చెప్పగా

4 ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచినయెడల నేను రాజుకొరకు సిద్ధము చేయించిన విందునకు రాజవైన తామును హామానును నేడు రావలెనని కోరుచున్నానని ప్రత్యుత్తరమిచ్చెను.౹

5 ఎస్తేరు మాటప్రకారముగా జరుగునట్లు హామాను చేయవలయునని త్వరపెట్టుమని రాజు సెలవియ్యగా రాజును హామానును ఎస్తేరు చేయించిన విందునకు వచ్చిరి.౹

6 రాజు ద్రాక్షారసపు విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి నీ కోరిక యేమిటి? అది నీకనుగ్రహింపబడును, నీ మనవి యేమిటి? అది రాజ్యములో సగముమట్టుకైనను చేయబడునని చెప్పగా

7 ఎస్తేరు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను– రాజవైన తమ దృష్టికి నా యెడల దయకలిగి నా మనవి చొప్పునను నా కోరికచొప్పునను జరిగించుట రాజవైన తమకు అనుకూలమైతే

8 రాజవైన తామును హామానును మీ నిమిత్తము నేను చేయింపబోవు విందునకు రావలెను. రాజవైన తాము చెప్పినట్లు రేపటి దినమున నేను చేయుదును; ఇదే నా మనవియు నా కోరికయుననెను.౹

9 ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసముగలవాడై బయలువెళ్లి, రాజుగుమ్మముననుండు మొర్దకై తన్ను చూచియు అతడు లేచి నిలువకయు కదలకయు ఉన్నందున మొర్దకైమీద బహుగా కోపగించెను.౹

10 అయితే హామాను కోపము అణచుకొని తన యింటికిపోయి తన స్నేహితులను తన భార్యయైన జెరెషును పిలిపించి

11 తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమునుగూర్చియు, చాలామంది పిల్లలు తనకుండుటనుగూర్చియు, రాజు తన్ను ఘనపరచి రాజు క్రిందనుండు అధిపతులమీదను సేవకులమీదను తన్ను ఏలాగున పెద్దగాచేసెనో దానిని గూర్చియు వారితో మాటలాడెను.౹

12 మరియు అతడు–రాణియైన ఎస్తేరు తాను చేయించిన విందునకు రాజును నన్ను తప్ప మరి యెవనిని పిలిపించలేదు, రేపటి దినమున కూడ రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనదని తెలియజేసెను.౹

13 అయితే యూదుడైన మొర్దకై రాజుగుమ్మమున కూర్చునియుండుట నేను చూచునంత కాలము ఆ పదవి అంతటివలన నాకు ప్రయోజన మేమియు లేదని అతడు చెప్పగా

14 అతని భార్యయైన జెరెషును అతని స్నేహితులందరును–ఏబది మూరల ఎత్తుగల యొక ఉరికొయ్య చేయించుము; దాని మీద మొర్దకై ఉరితీయింపబడునట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము; తరువాత నీవు సంతోషముగా రాజుతోకూడ విందునకు పోదువు అని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానునకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్య యొకటి సిద్ధము చేయించెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EST/5-b8e1509df3680c7889b4381136970d6e.mp3?version_id=1787—

Categories
ఎస్తేరు

ఎస్తేరు 6

1 ఆ రాత్రి నిద్రపట్టక పోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను.౹

2 ద్వారపాలకులైన బిగ్తాను తెరెషు అను రాజుయొక్క యిద్దరు నపుంసకులురాజైన అహష్వేరోషును చంప యత్నించిన సంగతి మొర్దకై తెలిపినట్టు అందులో వ్రాయబడి యుండెను.౹

3 రాజు ఆ సంగతి విని–ఇందు నిమిత్తము మొర్దకైకి బహుమతి యేదై నను ఘనత యేదైనను చేయబడెనా అని యడుగగా రాజు సేవకులు–అతనికేమియు చేయబడలేదని ప్రత్యుత్తర మిచ్చిరి.౹

4 అప్పుడు–ఆవరణములో ఎవరో యున్నారని రాజు చెప్పెను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్యమీద మొర్దకైని ఉరితీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకై రాజనగరుయొక్క ఆవరణములోనికి వచ్చియుండెను.౹

5 రాజ సేవకులు–ఏలినవాడా చిత్తగించుము, హామాను ఆవరణములో నిలువబడియున్నాడని రాజుతో చెప్పగా రాజు–అతని రానియ్యుడని సెలవిచ్చి నందున హామాను లోపలికి వచ్చెను.౹

6 –రాజు ఘనపరచ నపేక్షించువానికి ఏమిచేయవలెనని రాజు అతని నడుగగా హామాను–నన్ను గాక మరి ఎవరిని రాజు ఘనపరచ నపే క్షించునని తనలో తాననుకొని రాజుతో ఇట్లనెను

7 –రాజు ఘనపరచ నపేక్షించువానికి చేయ తగినదేమనగా

8 రాజు ధరించుకొను రాజవస్త్రములను రాజు ఎక్కు గుఱ్ఱమును రాజు తన తలమీద ఉంచుకొను రాజకిరీటమును ఒకడు తీసికొని రాగా

9 ఘనులైన రాజుయొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుఱ్ఱమును పట్టుకొని, రాజు ఘనపరచ నపేక్షించువానికి ఆ వస్త్రములను ధరింప జేసి ఆ గుఱ్ఱముమీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతని నడిపించుచు–రాజు ఘనపరచ నపేక్షించువానికి ఈ ప్రకారముగా చేయతగునని అతనిముందర చాటింపవలెను.౹

10 అందుకు రాజు–నీవు చెప్పినప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుఱ్ఱమును తీసికొని, రాజు గుమ్మమునొద్ద కూర్చునియున్న యూదుడైన మొర్దకైకి ఆలాగుననే చేయుము; నీవు చెప్పినదానిలో ఒకటియు విడువక అంతయు చేయుమని హామానునకు ఆజ్ఞ ఇచ్చెను.౹

11 ఆప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుఱ్ఱమును తీసికొని, మొర్దకైకి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుఱ్ఱము మీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతని నడిపించుచు, రాజు ఘనపరచ నపేక్షించువానికి ఈ ప్రకారము చేయ తగునని అతనిముందర చాటించెను.౹

12 తరువాత మొర్దకై రాజు గుమ్మమునొద్దకు వచ్చెను; అయితే హామాను తల కప్పుకొని దుఃఖించుచు తన యింటికి త్వరగా వెళ్లి పోయెను.౹

13 హామాను తనకు సంభవించినదంతయు తన భార్యయైన జెరెషుకును తన స్నేహితులకందరికిని తెలు పగా, అతనియొద్దనున్న జ్ఞానులును అతని భార్యయైన జెరెషును–ఎవనిచేత నీకు అధికారనష్టము కలుగుచున్నదో ఆ మొర్దకై యూదుల వంశపువాడైనయెడల అతనిమీద నీకు జయము కలుగదు, అతనిచేత అవశ్యముగా చెడి పోదువని ఆతనితో అనిరి.౹

14 వారు ఇంక మాటలాడుచుండగా రాజుయొక్క నపుంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన విందునకు రమ్మని హామానును త్వరపెట్టిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EST/6-a48bcbe67d5291496edabc1f2b1f5f2b.mp3?version_id=1787—

Categories
ఎస్తేరు

ఎస్తేరు 7

1 రాజును హామానును రాణియైన ఎస్తేరునొద్దకు విందునకు రాగా

2 రాజు–ఎస్తేరు రాణీ, నీ విజ్ఞాపన మేమిటి? అది నీకనుగ్రహింపబడును, నీ మనవి యేమిటి? రాజ్యములో సగముమట్టుకైనను నీకనుగ్రహించెదనని రెండవ నాడు ద్రాక్షారసపు విందులో ఎస్తేరుతో అనెను.

3 అప్పుడు రాణియైన ఎస్తేరు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను –రాజా, నీ దృష్టికి నేను దయపొందినదాననైనయెడల రాజవైన తమకు సమ్మతియైతే, నా విజ్ఞాపననుబట్టి నా ప్రాణమును, నా మనవినిబట్టి నా జనులును, నా కనుగ్ర హింపబడుదురు గాక.౹

4 సంహరింపబడుటకును, హతము చేయబడి నశించుటకును, నేనును నా జనులును కూడ అమ్మబడినవారము. మేము దాసులముగాను దాసు రాండ్రముగాను అమ్మబడినయెడల నేను మౌనముగా నుందును; ఏలయనగా మా విరోధిని తప్పించుకొనుటకై మేము రాజవగు తమరిని శ్రమపరచుట యుక్తము కాదు.౹

5 అందుకు రాజైన అహష్వేరోషు–ఈ కార్యము చేయుటకు తన మనస్సు దృఢపరచుకొన్నవాడెవడు? వాడేడి? అని రాణియగు ఎస్తేరు నడుగగా

6 ఎస్తేరు–మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన యీ హామానే అనెను. అంతట హామాను రాజు ఎదుటను రాణి యెదుటను భయాక్రాంతుడాయెను.౹

7 రాజు ఆగ్రహమొంది ద్రాక్షారసపు విందును విడిచి నగరు వనమునకు పోయెను. అయితే రాజు తనకు ఏదో హానిచేయనుద్దేశించెనని హామాను తెలిసికొని, రాణియైన ఎస్తేరు ఎదుట తన ప్రాణముకొరకు విన్నపము చేయుటకై నిలిచెను.౹

8 నగరు వనములోనుండి ద్రాక్షారసపు విందుస్థలమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుండియున్న శయ్యమీద హామాను బడియుండుట చూచి–వీడు ఇంటిలో నా సముఖము ఎదుటనే రాణిని బలవంతము చేయునా? అని చెప్పెను; ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖమునకు ముసుకు వేసిరి.౹

9 రాజు ముందరనుండు షండులలో హర్బోనా అనునొకడు–ఏలినవాడా చిత్తగించుము, రాజు మేలుకొరకు మాటలాడిన మొర్దకైని ఉరితీయుటకు హామాను చేయించిన యేబది మూరల యెత్తు గల ఉరికొయ్య హామాను ఇంటియొద్ద నాటబడి యున్న దనగా రాజు–దానిమీద వాని ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చెను.౹

10 కాగా హామాను మొర్దకైకి సిద్ధముచేసిన ఉరి కొయ్యమీద వారు అతనినే ఉరితీసిరి. అప్పుడు రాజుయొక్క ఆగ్రహము చల్లారెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EST/7-90e8bb455f2da915485826b384ce80e4.mp3?version_id=1787—

Categories
ఎస్తేరు

ఎస్తేరు 8

1 ఆ దినమున రాజైన అహష్వేరోషు యూదులకు శత్రువైన హామాను ఇంటిని రాణియైన ఎస్తేరున కిచ్చెను. ఎస్తేరు మొర్దకై తనకు ఏమి కావలెనో రాజునకు తెలియ జేసినమీదట అతడు రాజు సన్నిధికి రాగా

2 రాజు హామాను చేతిలోనుండి తీసికొనిన తన ఉంగరమును మొర్దకైకి ఇచ్చెను. ఎస్తేరు మొర్దకైని హామాను ఇంటి మీద అధికారిగా ఉంచెను.౹

3 మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసికొని, అతని పాదములమీద పడి, అగాగీయుడైన హామాను చేసిన కీడును అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతని వేడుకొనగా

4 రాజు బంగారు దండమును ఎస్తేరుతట్టు చాపెను. ఎస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి

5 – రాజవైన తమకు సమ్మతియైనయెడలను, తమ దృష్టికి నేను దయపొందినదాననై రాజవైన తమ యెదుట ఈ సంగతి యుక్తముగా తోచినయెడలను, తమ దృష్టికి నేను ఇంపైన దాననైనయెడలను, రాజవైన తమ సకల సంస్థానములలో నుండు యూదులను నాశనముచేయవలెనని హమ్మెదాతా కుమారుడైన అగాగీయుడగు హామాను వ్రాయించిన తాకీదులచొప్పున జరుగకుండునట్లు వాటిని రద్దుచేయుటకు ఆజ్ఞ ఇయ్యుడి.౹

6 నా జనులమీదికి రాబోవు కీడును, నా వంశముయొక్క నాశనమును చూచి నేను ఏలాగు సహింపగలనని మనవిచేయగా

7 రాజైన అహష్వేరోషు రాణియైన ఎస్తేరునకును యూదుడైన మొర్దకైకిని ఈలాగు సెలవిచ్చెను–హామాను ఇంటిని ఎస్తేరున కిచ్చియున్నాను; అతడు యూదులను హతముచేయుటకు ప్రయత్నించి నందున అతడు ఉరికొయ్యమీద ఉరితీయబడెను.౹

8 అయితే రాజుపేరట వ్రాయబడి రాజు ఉంగరముతో ముద్రింప బడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడు; కాగా మీకిష్టమైనట్లు మీరు రాజునైన నా పేరట యూదుల పక్షమున తాకీదు వ్రాయించి రాజు ఉంగరముతో దాని ముద్రించుడి.

9 సీవాను అను మూడవ నెలలో ఇరువది మూడవ దినమందు రాజుయొక్క వ్రాతగాండ్రు పిలువబడిరి; మొర్దకై ఆజ్ఞాపించిన ప్రకారమంతయు యూదులకును, హిందూ దేశము మొదలుకొని కూషుదేశమువరకు వ్యాపించియున్న నూట ఇరువదియేడు సంస్థానములలోనున్న అధిపతులకును అధికారులకును, ఆయా సంస్థానములకును దాని దాని వ్రాతనుబట్టియు దాని దాని భాషనుబట్టియు తాకీదులు వ్రాయబడెను.౹

10 రాజైన అహష్వేరోషు పేరట తాకీదులు మొర్దకై వ్రాయించి రాజు ఉంగరముతో ముద్రించి గుఱ్ఱములమీద, అనగా రాజనగరుపనికి పెంచబడిన బీజాశ్వములమీద అంచెగాండ్ర నెక్కించి ఆ తాకీ దులను వారిచేత పంపెను.౹

11 రాజైన అహష్వేరోషుయొక్క సంస్థానములన్నిటిలో ఒక్క దినమందే, అనగా అదారు అను పండ్రెండవనెల పదమూడవ దినమందే ప్రతి పట్టణమునందుండు యూదులు కూడుకొని, తమ ప్రాణములు కాపాడుకొనుటకు ఆయా ప్రదేశములలోనుండి తమకు విరోధులగు జనుల సైనికులనందరిని, శిశువులను స్త్రీలను కూడ, సంహరించి హతముచేసి నిర్మూల పరచి

12 వారి వస్తువులను కొల్లపట్టుటకు రాజు యూదులకు సెలవిచ్చెనని దానియందు వ్రాయబడెను.౹

13 మరియు ఈ తాకీదుకు ప్రతులు వ్రాయించి ఆయా సంస్థానములలోని జనులకందరికి పంపించవలెననియు, యూదులు తమ శత్రువులమీద పగతీర్చుకొనుటకు ఒకానొక దినమందు సిద్ధముగా ఉండవలెననియు ఆజ్ఞ ఇయ్యబడెను.౹

14 రాజ నగరు పనికి పెంచబడిన బీజాశ్వములమీద నెక్కిన అంచె గాండ్రు రాజు మాటవలన ప్రేరేపింపబడి అతివేగముగా బయలుదేరిరి. ఆ తాకీదు షూషను కోటలో ఇయ్యబడెను.౹

15 అప్పుడు మొర్దకై ఊదావర్ణమును తెలుపువర్ణమునుగల రాజవస్త్రమును బంగారపు పెద్దకిరీటమును అవిసె నారతో చేయబడిన ధూమ్రవర్ణముగల వస్త్రములను ధరించుకొనినవాడై రాజుసముఖమునుండి బయలుదేరెను; అందునిమిత్తము షూషను పట్టణము ఆనందించి సంతోష మొందెను.౹

16 మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతుష్టియు ఘనతయు కలిగెను.౹

17 రాజుచేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను, అది శుభదినమని విందుచేసికొనిరి. మరియు దేశజనులలో యూదులయెడల భయముకలిగెను కనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EST/8-2b25d2a9ba21fcfdc718c88c67ce5532.mp3?version_id=1787—

Categories
ఎస్తేరు

ఎస్తేరు 9

1 రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలము వచ్చినప్పుడు అదారు అను పండ్రెండవనెల పదమూడవదినమున యూదులను జయింపగలుగుదుమని వారి పగవారు నిశ్చయించుకొనిన దినముననే యూదులు తమ పగవారి మీద అధికారము నొందినట్లు అగుపడెను.౹

2 యూదులురాజైన అహష్వేరోషుయొక్క సంస్థానములన్నిటిలో నుండు పట్టణములయందు తమకు కీడుచేయవలెనని చూచినవారిని హతముచేయుటకు కూడుకొనిరి. వారిని గూర్చి సకల జనులకు భయము కలిగినందున ఎవరును వారి ముందర నిలువలేకపోయిరి.౹

3 మొర్దకైని గూర్చిన భయము తమకు కలిగినందున సంస్థానములయొక్క అధిపతులును అధికారులును ప్రభువులును రాజు పని నడిపించువారును యూదులకు సహాయముచేసిరి.౹

4 మొర్దకై రాజుయొక్క నగరులో గొప్పవాడాయెను. ఈ మొర్దకై అనువాడు అంతకంతకు గొప్పవాడగుటచేత అతని కీర్తి సంస్థానములన్నిటియందు వ్యాపించెను.౹

5 యూదులు తమ శత్రువులనందరిని కత్తివాత హతముచేసి వారిని నాశనముచేసి మనస్సు తీర తమ విరోధులకు చేసిరి.౹

6 షూషను కోటయందు యూదులు ఐదువందలమందిని చంపి నాశనముచేసిరి.౹

7 హమ్మెదాతా కుమారుడై యూదులకు శత్రువగు హామానుయొక్క పదిమంది కుమారులైన పర్షందాతా

8 దల్పోను అస్పాతా పోరాతా

9 అదల్యా అరీదాతా పర్మష్తా

10 అరీసై అరీదై వైజాతా అను వారిని చంపిరి; అయితే కొల్ల సొమ్ము వారు పట్టుకొనలేదు.౹

11 ఆ దినమున షూషను కోటయందు చంపబడినవారి లెక్క రాజునకు తెలియ జెప్పగా

12 రాజు రాణియైన ఎస్తేరుతో–యూదులు షూషను కోటయందు ఐదువందలమందిని హామానుయొక్క పదిమంది కుమారులను బొత్తిగా నాశనము చేసియున్నారు; రాజుయొక్క కొదువ సంస్థానములలో వారు ఏమిచేసి యుందురో; ఇప్పుడు నీ మనవి ఏమిటి? అది నీకనుగ్ర హింపబడును, నీవు ఇంకను అడుగునదేమి? అది దయచేయబడునని సెలవియ్యగా

13 ఎస్తేరు–రాజవైన తమకు సమ్మతమైనయెడల ఈ దినము జరిగిన చొప్పున షూషనునందున్న యూదులు రేపును చేయునట్లుగాను, హామానుయొక్క పదిమంది కుమారులు ఉరికొయ్యమీద ఉరితీయింపబడునట్లుగాను సెలవియ్యుడనెను.౹

14 ఆలాగు చేయవచ్చునని రాజు సెలవిచ్చెను. షూషనులో ఆజ్ఞ ప్రకటింపబడెను; హామానుయొక్క పదిమంది కుమారులు ఉరి తీయింపబడిరి.౹

15 షూషనునందున్న యూదులు అదారు మాసమున పదు నాలుగవ దినమందు కూడుకొని, షూషనునందు మూడు వందలమందిని చంపివేసిరి; అయితే వారు కొల్లసొమ్ము పట్టుకొనలేదు.౹

16 రాజు సంస్థానములయందుండు తక్కిన యూదులు కూడుకొని, తమ ప్రాణములను రక్షించు కొనుటకై పూనుకొని అదారు మాసము పదమూడవ దినమందు తమ విరోధులలో డెబ్బది యయిదువేలమందిని చంపివేసి, తమ పగవారివలన బాధలేకుండ నెమ్మదిపొందిరి; అయితే వారును కొల్లసొమ్ముపట్టుకొనలేదు.౹

17 పదునాలుగవ దినమందును వారు నెమ్మదిపొంది విందుచేసికొనుచు సంతో షముగా నుండిరి.౹

18 షూషనునందున్న యూదులు ఆ మాసమందు పదమూడవ దినమందును పదునాలుగవ దినమందును కూడుకొని పదునైదవ దినమందు నెమ్మదిపొంది విందుచేసికొనుచు సంతోషముగా నుండిరి.౹

19 కాబట్టి ప్రాకారములులేని ఊళ్లలో కాపురమున్న గ్రామవాసు లైన యూదులు అదారు మాసము పదునాలుగవ దినమందు సంతోషముగానుండి–అది విందుచేయదగిన శుభదినమను కొని ఒకరికొకరు బహుమానములను పంపించుకొనుచు వచ్చిరి.

20 మొర్దకై యీ సంగతులనుగూర్చి రాజైన అహష్వే రోషుయొక్క సంస్థానములన్నిటికి సమీపముననేమి దూరముననేమి నివసించియున్న యూదులకందరికి పత్రికలను పంపి

21 –యూదులు తమ పగవారిచేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు, వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియు, వారు మూల్గుట మానిన శుభదిన మనియు, ప్రతి సంవత్సరము అదారు నెలయొక్క పదు నాలుగవదినమును పదునైదవ దినమును వారు ఆచరించుకొనుచు

22 విందుచేసికొనుచు సంతోషముగానుండి ఒకరి కొకరు బహుమానములను, దరిద్రులకు కానుకలను, పంప తగిన దినములనియు వారికి స్థిరపరచెను.౹

23 అప్పుడు యూదులు తాము ఆరంభించినదానిని మొర్దకై తమకు వ్రాసిన ప్రకారముగా నెరవేర్చుదుమని యొప్పుకొనిరి.౹

24 యూదులకు శత్రువగు హమ్మెదాతా కుమారుడైన అగా గీయుడగు హామాను యూదులను సంహరింప దలచి వారిని నాశనపరచి నిర్మూలము చేయవలెనని, పూరు, అనగా చీటి, వేయించియుండగా

25 ఎస్తేరు, రాజు ఎదుటికి వచ్చిన తరువాత రాజు అతడు యూదులకు విరోధముగా తల పెట్టిన చెడుయోచన తన తలమీదికే వచ్చునట్లుగా చేసి,వాడును వాని కుమారులును ఉరికొయ్యమీద ఉరితీయబడునట్లుగా ఆజ్ఞ వ్రాయించి ఇచ్చెను.౹

26 కావున ఆ దినములు పూరు అను పేరునుబట్టి పూరీము అనబడెను. ఈ ఆజ్ఞలో వ్రాయబడిన మాటలన్నిటినిబట్టియు, ఈ సంగతినిబట్టియు, తాము చూచినదానినంతటినిబట్టియు తమమీదికి వచ్చినదానినిబట్టియు

27 యూదులు ఈ రెండు దినములనుగూర్చి వ్రాయబడిన ప్రకారముగా ప్రతి సంవత్సరము వాటి నియామక కాలమునుబట్టి వాటిని ఆచరించెదమనియు, ఈ దినములు తరతరముగా ప్రతి కుటుంబములోను ప్రతి సంస్థానములోను ప్రతి పట్టణములోను జ్ఞాపకము చేయబడునట్లుగా ఆచరించెదమనియు,౹

28 పూరీము అను ఈ దినములను యూదులు ఆచరింపకయు, తమ సంతతివారు వాటిని జ్ఞాపకముంచుకొనకయు మానకుండునట్లు నిర్ణయించుకొని, ఆ సంగతిని మరచి పోకుండునట్లు, తమమీదను, తమ సంతతివారిమీదను, తమతో కలిసికొనిన వారిమీదను ఇది యొక బాధ్యతగా ఉండునని ఒప్పుకొనిరి.౹

29 అప్పుడు పూరీమునుగూర్చి వ్రాయబడిన యీ రెండవ ఆజ్ఞను దృఢపరచుటకు అబీహాయిలు కుమార్తెయును రాణియునైన ఎస్తేరును యూదుడైన మొర్దకైయును ఖండితముగా వ్రాయించిరి.౹

30 మరియు యూదుడైన మొర్దకైయును రాణియైన ఎస్తేరును యూదులకు నిర్ణయించిన దానినిబట్టి వారు ఉపవాస విలాపకాలములు ఏర్పరచుకొని, అది తమమీదను తమ వంశపు వారిమీదను ఒక బాధ్యతయని యెంచుకొని వాటిని జరిగించెదమని యొప్పుకొనిన ప్రకారముగా

31 ఈ పూరీము అను పండుగదినములను స్థిరపరచుటకు అతడు అహష్వే రోషుయొక్క రాజ్యమందుండు నూట ఇరువదియేడు సంస్థానములలోనున్న యూదులకందరికి వారి క్షేమము కోరునట్టియు, విశ్వాసార్థములగునట్టియు మాటలుగల పత్రికలు పంపెను.౹

32 ఈలాగున ఎస్తేరుయొక్క ఆజ్ఞచేత ఈ పూరీముయొక్క సంగతులు స్థిరమై గ్రంథములో వ్రాయబడెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EST/9-2c1ab8d1829bf66e47d11fdda0ee931f.mp3?version_id=1787—

Categories
ఎస్తేరు

ఎస్తేరు 10

1 రాజైన అహష్వేరోషు రాజ్యమును సముద్ర ద్వీపములును పన్ను చెల్లింప నిర్ణయించెను.౹

2 మొర్దకైయొక్క బలమునుగూర్చియు, అతడు సామర్థ్యముచేత చేసిన కార్యములన్నిటిని గూర్చియు, రాజు అతనిని ఘనపరచిన సంగతిని గూర్చియు మాదీయులయొక్కయు పారసీకులయొక్కయు రాజ్యసమాచార గ్రంథమందు వ్రాయబడియున్నది.౹

3 యూదుడైన మొర్దకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగానుండి, తనవారందరితో సమాధానముగా మాటలాడుచు, తన జనులయొక్క క్షేమమును విచారించువాడును యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలామందికి ఇష్టుడుగా ఉండెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EST/10-b71df91072ba2584e6b4e85a4b4a02f5.mp3?version_id=1787—

Categories
యోబు

యోబు 1

1 ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యు డుండెను. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులుకలిగి చెడుతనము విసర్జించినవాడు.

2 అతనికి ఏడుగురు కుమారులును ముగ్గురు కుమార్తెలును కలిగిరి.

3 అతనికి ఏడువేల గొఱ్ఱెలును మూడువేల ఒంటెలును ఐదువందల జతల యెడ్లును ఐదువందల ఆడు గాడిదలును కలిగి, బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను.

4 అతని కుమారులందరు వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమతమ యిండ్లలో విందుచేయనై కూడునప్పుడు తమ ముగ్గురు అక్కచెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచు వచ్చిరి.

5 వారి వారి విందుదినములు పూర్తికాగా యోబు, తన కుమారులు పాపముచేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి, అరుణోదయమున లేచి వారిలో ఒక్కొకని నిమిత్తమై దహనబలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము ఆలాగున చేయుచుండెను.

6 దేవదూతలుయెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను.

7 యెహోవా–నీవు ఎక్కడనుండి వచ్చితివని వానినడుగగా అపవాది–భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తర మిచ్చెను.

8 అందుకు యెహోవా–నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలో చించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులుకలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమిమీద అతనివంటివాడెవడును లేడు

9 అని అడుగగా అపవాది–యోబు ఊరకయే దేవునియందు భయభక్తులు కలవాడాయెనా?

10 నీవు అతనికిని అతని యింటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టు కంచె వేసితివి గదా? నీవు అతనిచేతిపనిని దీవించుచుండుటచేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించియున్నది.

11 అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తినయెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా

12 యెహోవా–ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది; అతనికిమాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవియ్యగా వాడు యెహోవా సన్నిధినుండి బయలు వెళ్లెను.

13 ఒకదినమున యోబు కుమారులును కుమార్తెలును తమ అన్నయింట భోజనముచేయుచు ద్రాక్షారసము పానముచేయుచునుండగా ఒక దూత అతనియొద్దకు వచ్చి

14 –ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచునుండగా షెబాయీయులు వాటిమీదపడి వాటిని పట్టుకొనిపోయి

15 ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను.

16 అతడు ఇంక మాటలాడుచుండగా మరియొకడు వచ్చి–దేవుని అగ్ని ఆకా శమునుండి పడి గొఱ్ఱెలను పనివారిని రగులబెట్టి కాల్చి వేసెను; దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను.

17 అతడు ఇంక మాటలాడుచుండగా మరియొకడు వచ్చి–కల్దీయులు మూడు సమూహములుగా వచ్చి ఒంటెలమీదపడి వాటిని కొనిపోయి ఖడ్గముచేత పనివారిని చంపిరి; నీకు దానిని తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను.

18 అతడు మాటలాడుచుండగా వేరొకడు వచ్చి– నీ కుమారులును నీ కుమార్తెలును తమ అన్న యింట భోజనముచేయుచు ద్రాక్షారసము పానముచేయుచుండగా

19 గొప్ప సుడిగాలి అరణ్యమార్గముగా వచ్చి ఆ యింటి నాలుగు మూలలను కొట్టగా అది యౌవనులమీద పడినందునవారు చనిపోయిరి; దానిని నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చియున్నాననెను.

20 అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తలవెండ్రుకలు గొరిగించుకొని నేలమీద సాష్టాంగపడి నమస్కారముచేసి ఇట్లనెను

21 –నేను నా తల్లిగర్భములోనుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్లెదను; యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక.

22 ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOB/1-0e5c1e2c4d94ccaca76e127e47af5f79.mp3?version_id=1787—

Categories
యోబు

యోబు 2

1 దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరియొక దినము తటస్థింపగా, వారితోకూడ అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను.

2 యెహోవా –నీవు ఎక్కడనుండి వచ్చితివని వానినడుగగా అపవాది –భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను.

3 అందుకు యెహోవా–నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతు డునై దేవునియందు భయభక్తులుకలిగి చెడుతనము విసర్జించినవాడు, భూమిమీద అతనివంటివాడెవడును లేడు. నిష్కారణముగా అతనిని పాడుచేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడనగా

4 అపవాది–చర్మము కాపాడు కొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా.

5 ఇంకొక సారి నీవు చేయి చాపి అతని యెముకను అతని దేహమును మొత్తినయెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచి పోవును అనెను.

6 అందుకు యెహోవా–అతడు నీ వశముననున్నాడు; అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను.

7 కాబట్టి అపవాది యెహోవా సన్నిధినుండి బయలువెళ్లి, అరికాలు మొదలుకొని నడినెత్తివరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను.

8 అతడు ఒళ్లు గోకుకొనుటకై చిల్లపెంకు తీసికొని బూడిదెలో కూర్చుండగా

9 అతని భార్య వచ్చి–నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను.

10 అందుకతడు–మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు; మనము దేవునివలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటిమాటతోనైనను పాపము చేయలేదు.

11 తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు నయమాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినినవారై, అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలెనని ఆలోచించుకొని తమతమ స్థలములను విడిచి వచ్చిరి.

12 వారు వచ్చి దూరముగా నిలువబడి కన్నులెత్తి చూచినప్పుడు, అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశముతట్టు తలలమీద ధూళి చల్లుకొని యెలుగెత్తి యేడ్చిరి.

13 అతని బాధ అత్యధికముగానుండెనని గ్రహించి యెవరును అతనితో ఒక్క మాటయైనను పలుకక రేయింబగలు ఏడు దినములు అతనితోకూడ నేలను కూర్చుండిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOB/2-f19921f2450714e2e8a2ed75305d24ea.mp3?version_id=1787—

Categories
యోబు

యోబు 3

1 ఆ తరువాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను.

2 యోబు ఈలాగు అనెను–

3 నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును

నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును

నేను పుట్టిన దినము లేకపోవును గాక

మగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేక పోవును గాక.

4 ఆ దినము అంధకారమగును గాక

పైనుండి దేవుడు దాని నెంచకుండును గాక

వెలుగు దానిమీద ప్రకాశింపకుండును గాక

5 చీకటియు గాఢాంధకారమును మరల దానిని తమ

యొద్దకు తీసికొనును గాక.

మేఘము దాని కమ్మును గాక

పగలును కమ్మునట్టి అంధకారము దాని బెదరించును గాక

6 అంధకారము ఆ రాత్రిని పట్టుకొనును గాక

సంవత్సరపు దినములలో నేనొకదాననని

అది హర్షింపకుండును గాక

మాసముల సంఖ్యలో అది చేరకుండును గాక

7 ఆ రాత్రి యెవడును జననము కాకపోవును గాక

దానిలో ఏ ఉత్సాహధ్వని పుట్టకుండును గాక

8 దినములు అశుభదినములని చెప్పువారు దానిని

శపించుదురు గాక

భుజంగమును రేపుటకు నేర్పుగలవారు దానిని

శపించుదురు గాక.

9 అందులో సంధ్యవేళను ప్రకాశించు నక్షత్రములకు

అంధకారము కమ్మును గాక

వెలుగుకొరకు అది యెదురుచూడగా వెలుగు

లేకపోవును గాక

10 అది వేకువ కనురెప్పలను చూడకుండును గాక

11 పుట్టుకలోనే నేనేల చావకపోతిని?

గర్భమునుండి బయలుదేరగానే నేనేల ప్రాణము

విడువక పోతిని?

12 మోకాళ్లమీద నన్నేల ఉంచుకొనిరి?

నేనేల స్తనములను కుడిచితిని?

13 లేనియెడల నేనిప్పుడు పండుకొని నిమ్మళించి యుందును

నేను నిద్రించియుందును, నాకు విశ్రాంతి కలిగియుండును

14 తమకొరకు బీడుభూములయందు భవనములు కట్టించు

కొనిన భూరాజులతోను మంత్రులతోను నేను

నిద్రించి నిమ్మళించియుందును.

15 బంగారము సంపాదించి తమ యిండ్లను వెండితో

నింపుకొనిన అధిపతులతో నిద్రించి విశ్రమించియుందును.

16 అకాలసంభవమై కంటబడకయున్న పిండమువంటి

వాడనై లేకపోయి యుందును.

వెలుగు చూడని బిడ్డలవలె లేకపోయి యుందును.

17 అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపరచరు

బలహీనులై అలసినవారు విశ్రాంతినొందుదురు

18 బంధింపబడినవారు కార్యనియామకుల శబ్దము వినక

యేకముగా కూడి విశ్రమించుదురు

19 అల్పులేమి ఘనులేమి అందరు నచ్చటనున్నారు

దాసులు తమ యజమానుల వశమునుండి తప్పించుకొని

స్వతంత్రులై యున్నారు.

20 దుర్దశలోనున్న వారికి వెలుగియ్యబడుట ఏల?

దుఃఖా క్రాంతులైనవారికి జీవమియ్యబడుట ఏల?

21 వారు మరణము నపేక్షింతురు

దాచబడిన ధనముకొరకైనట్టు దానిని కనుగొనుటకైవారు లోతుగా త్రవ్వుచున్నారుగాని అదివారికి దొరకక యున్నది.

22 సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు.

23 మరుగుపడిన మార్గముగలవానికిని, దేవుడు చుట్టుకంచె

వేసినవానికిని వెలుగు ఇయ్యబడనేల?

24 భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది

నా మొఱ్ఱలు నీళ్లవలె ప్రవహించుచున్నవి.

25 ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియే

నాకు సంభవించుచున్నది

నాకు భీతి పుట్టించినదే నామీదికి వచ్చుచున్నది.

26 నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు

శ్రమయే సంభవించుచున్నది.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOB/3-64387c857010498a42002da9a377c6b1.mp3?version_id=1787—

Categories
యోబు

యోబు 4

1 దానికి తేమానీయుడైన ఎలీఫజు ఈలాగు ప్రత్యుత్తర

మిచ్చెను–

2 ఎవడైన ఈ సంగతి యెత్తి నీతో మాటలాడినయెడల

నీకు వ్యసనము కలుగునా?

అయితే వాదింపక ఎవడు ఊరకొనగలడు?

3 అనేకులకు నీవు బుద్ధి నేర్పినవాడవు

బలహీనమైన చేతులను బలపరచినవాడవు.

4 నీ మాటలు తొట్రిల్లువానిని ఆదుకొని యుండెను.

క్రుంగిపోయిన మోకాళ్లుగలవానిని నీవు బలపరచితివి.

5 అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి

అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు.

6 నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా?

నీ యథార్థప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా?

7 జ్ఞాపకము చేసికొనుము, నిరపరాధియైన యొకడు

ఎప్పుడైన నశించెనా?

యథార్థవర్తనులు ఎక్కడనైన నిర్మూలమైరా?

8 నేను చూచినంతవరకు అక్రమమును దున్ని

కీడును విత్తువారు దానినే కోయుదురు.

9 దేవుడు ఊదగా వారు నశించుదురు

ఆయన కోపాగ్ని శ్వాసమువలనవారు లేక పోవుదురు.

10 సింహగర్జనయు క్రూరసింహపు శబ్దమును నిలిచిపోవును.

కొదమ సింహముల కోరలును విరిగిపోవును.

11 ఎర లేనందున ఆడుసింహము నశించును

సింహపుపిల్లలు చెల్లా చెదరగొట్టబడును.

12 నా కొకమాట రహస్యముగా తెలుపబడెను

నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టుగా అది నాకు

వినబడెను.

13 గాఢనిద్ర మనుష్యులకు వచ్చుసమయమున

రాత్రి కలలవలన పుట్టు తలంపులలో అది కలిగెను.

14 భయమును వణకును నాకు కలిగెను

అందువలన నా యెముకలన్నియు కదిలెను.

15 ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగా

నా శరీర రోమములు పులకించెను.

16 అది నిలువబడగా దాని రూపమును నేను

గురుతుపట్టలేక పోతిని

ఒక రూపము నా కన్నులయెదుట నుండెను

మెల్లనైన యొక కంఠస్వరమును నేను వింటిని

ఏమనగా–దేవుని సన్నిధిని మర్త్యులు

నీతిమంతులగుదురా?

17 తమ్ము సృజించినవాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా?

18 ఆయన తన సేవకులను నమ్ముటలేదు

తన దూతలయందు లోపములు కనుగొనుచున్నాడు.

19 జిగటమంటి యిండ్లలో నివసించువారియందు

మంటిలో పుట్టినవారియందు

చిమ్మట చితికిపోవునట్లు చితికిపోవువారియందు మరి

ఎన్ని కనుగొనును?

20 ఉదయము మొదలుకొని సాయంత్రమువరకు ఉండివారు బద్దలైపోవుదురు

ఎన్నికలేనివారై సదాకాలము నాశనమైయుందురు.

21 వారి డేరాత్రాడు తెగవేయబడునువారు బుద్ధికలుగకయే మృతినొందుదురు.

ఆలాగుననే జరుగుచున్నది గదా.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOB/4-3d513f7116f68475456790e8ee66ae7d.mp3?version_id=1787—