Categories
2 దినవృత్తాంతములు

2 దినవృత్తాంతములు 34

1 యోషీయా యేలనారంభించినప్పుడు ఎనిమిదేండ్లవాడై యెరూషలేములో ముప్పది యొక సంవత్సరము ఏలెను.౹

2 అతడు యెహోవా దృష్టికి నీతి ననుసరించుచు, కుడికైనను ఎడమకైనను తొలగకుండ తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను.౹

3 తన యేలుబడియందు ఎనిమిదవ సంవత్సరమున తానింకను బాలుడై యుండగానే అతడు తన పితరుడైన దావీదుయొక్క దేవునియొద్ద విచారించుటకు పూనుకొనినవాడై, పండ్రెండవయేట ఉన్నతస్థలములను దేవతాస్తంభములను పడగొట్టి, చెక్కినవిగ్రహములను పోతవిగ్రహములను తీసివేసి, యూదాదేశమును యెరూషలేమును పవిత్రముచేయ నారంభించెను.౹

4 అతడు చూచుచుండగా జనులు బయలుదేవతల బలిపీఠములను పడగొట్టి, వాటిపైన ఉన్న సూర్య దేవతల విగ్రహములను అతని ఆజ్ఞచొప్పున నరికివేసి, దేవతాస్తంభములను చెక్కినవిగ్రహములను పోతవిగ్రహములను తుత్తునియలుగా కొట్టి చూర్ణముచేసి, వాటికి బలులు అర్పించినవారి సమాధులమీద చల్లి వేసిరి.౹

5 బయలుదేవత యాజకుల శల్యములను బలిపీఠములమీద అతడు కాల్పించి, యూదాదేశమును యెరూషలేమును పవిత్రపరచెను.౹

6 ఆప్రకారము అతడు మనష్షే ఎఫ్రాయిము షిమ్యోను దేశములవారి పట్టణములలోను, నఫ్తాలి మన్యమునందును, చుట్టుపెట్లనున్న పాడుస్థలములన్నిటను బలిపీఠములను పడ గొట్టెను.౹

7 బలిపీఠములను దేవతాస్తంభములను పడగొట్టి చెక్కినవిగ్రహములను చూర్ణముచేసి, ఇశ్రాయేలీయుల దేశమంతటనున్న సూర్యదేవతా విగ్రహములన్నిటిని నరికి వేసి అతడు యెరూషలేమునకు తిరిగి వచ్చెను.

8 అతని యేలుబడియందు పదునెనిమిదవ సంవత్సరమున, దేశమును మందిరమును పవిత్రపరచుటయైన తరువాత, అతడు అజల్యా కుమారుడైన షాఫానును, పట్టణాధిపతియైన మయశేయాను, రాజ్యపు దస్తావేజులమీదనున్న యోహాహాజు కుమారుడగు యోవాహాజును, తన దేవుడైన యెహోవా మందిరమును బాగుచేయుటకై పంపెను.౹

9 వారు ప్రధానయాజకుడైన హిల్కీయాయొద్దకు వచ్చి, ద్వారపాలకులైన లేవీయులు మనష్షే ఎఫ్రాయిమీయుల దేశములయందు ఇశ్రాయేలువారిలో శేషించియున్న వారందరియొద్దనుండియు, యూదా బెన్యామీనీయులందరి యొద్దనుండియుకూర్చి, దేవుని మందిరములోనికి తీసికొని వచ్చిన ద్రవ్యమును అతనికి అప్పగించిరి.౹

10 వారు దానిని యెహోవా మందిరపు పనిమీదనున్న పైవిచారణకర్తల కియ్యగా, దాని బాగుచేయుటకును, యూదారాజులు పాడుచేసిన యిండ్లకు దూలములను అమర్చుటకును

11 చెక్కిన రాళ్లను జోడింపుపనికి మ్రానులను కొనుటకై యెహోవా మందిరమునందు పనిచేయువారికిని శిల్పకారులకును దాని నిచ్చిరి.౹

12 ఆ మనుష్యులు ఆ పనిని నమ్మకముగా చేసిరి. వారిమీది పైవిచారణకర్తలు ఎవరనగా, మెరా రీయులైన లేవీయులగు యహతు ఓబద్యా అనువారును, పని నడిపించుటకు ఏర్పడిన కహాతీయులగు జెకర్యా మెషుల్లాము అనువారును, లేవీయులలో వాద్యప్రవీణులైనవారు వారితోకూడ ఉండిరి.౹

13 మరియు బరువులు మోయు వారిమీదను, ప్రతివిధమైన పని జరిగించువారిమీదను ఆ లేవీయులు పైవిచారణకర్తలుగా నియమింపబడిరి. మరియు లేవీయులలో లేఖకులును పరిచారకులును ద్వారపాలకులు నైనవారు ఆయా పనులమీద నియమింపబడిరి.౹

14 యెహోవా మందిరములోనికి తేబడిన ద్రవ్యమును బయటికి తీసికొని వచ్చినప్పుడు, మోషేద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రముగలగ్రంథము యాజకుడైన హిల్కీయాకు కనబడెను.౹

15 అప్పుడు హిల్కీయా–యెహోవామందిరమందు ధర్మశాస్త్రముగలగ్రంథము నాకు దొరికెనని శాస్త్రియగు షాఫానుతో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించెను.౹

16 షాఫాను ఆ గ్రంథమును రాజునొద్దకు తీసికొనిపోయి రాజుతో ఇట్లనెను–నీ సేవకులకు నీవు ఆజ్ఞాపించినదంతయు వారు చేయుచున్నారు.౹

17 యెహోవా మందిరమునందు దొరికిన ద్రవ్యమును వారు పోగుచేసి పైవిచారణ కర్తల చేతికిని పనివారి చేతికిని దాని అప్పగించియున్నారు.౹

18 మరియు యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథము ఇచ్చెనని రాజు ఎదుట మనవిచేసికొని, శాస్త్రియగు షాఫాను రాజు సముఖమున దానినుండి చదివి వినిపించెను.౹

19 అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములను చింపుకొని

20 హిల్కీయాకును, షాఫాను కుమారుడైన అహీకాముకును, మీకా కుమారుడైన అబ్దోనుకును, శాస్త్రియగు షాఫానుకును, రాజు సేవకుడైన ఆశాయాకును ఈలాగున ఆజ్ఞ ఇచ్చెను

21 – మీరు వెళ్లి దొరకిన యీ గ్రంథములోని మాటలవిషయమై నాకొరకును, ఇశ్రాయేలు యూదావారిలో శేషించియున్నవారికొరకును యెహోవాయొద్ద విచారించుడి. మన పితరులు ఈ గ్రంథమునందు వ్రాయబడియున్న సమస్తమును అనుసరింపకయు, యెహోవా ఆజ్ఞలను గైకొనకయు నుండిరి గనుక యెహోవా కోపము మనమీదికి అత్యధికముగా వచ్చియున్నది.

22 అప్పుడు హిల్కీయాయును రాజు నియమించినవారును సంగతినిగూర్చి విచారణచేయుటకై హర్హషుకు పుట్టిన తిక్వా కుమారుడును వస్త్రశాలకు పైవిచారణకర్తయునగు షల్లూముయొక్క భార్యయైన హుల్దా అను ప్రవక్తియొద్దకు పోయిరి. ఆమె అప్పుడు యెరూషలేమునకు చేరిన యుప భాగములో కాపురముండెను. వారు ఆమెతో సంగతి చెప్పగా

23 ఆమె వారితో ఇట్లనెను–ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా

24 –ఆలకించుడి, నేను ఈ స్థలముమీదికిని దాని కాపురస్థులమీదికిని యూదారాజు సముఖమున చదివి వినిపింపబడిన గ్రంథమునందు వ్రాయబడియున్న శాపములన్నిటిని రప్పించెదను.౹

25 వారు నన్ను విసర్జించి యితర దేవతలకు ధూపము వేసి, తమ చేతిపనులవలన నాకు కోపము పుట్టించియున్నారు గనుక నాకోపము ఈ స్థలముమీద మితిలేకుండ కుమ్మరింపబడును. నాయొద్దకు మిమ్మును పంపిన వానికి ఈ వార్త తెలుపుడి.౹

26 మరియు యెహోవాయొద్ద విచారించుడని మిమ్మును పంపిన యూదారాజుకు మీరు ఈ మాట తెలియజెప్పుడి–నీవు ఎవనిమాటలు విని యున్నావో ఇశ్రాయేలీయులదేవుడైన ఆ యెహోవా సెలవిచ్చునదేమనగా

27 –నీ మనస్సు మెత్తనిదై యీ స్థలముమీదను దాని కాపురస్థులమీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించితిని.౹

28 నేను నీ పితరులయొద్ద నిన్ను చేర్చుదును; నెమ్మదిగలవాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడుదువు; ఈ స్థలముమీదికిని దాని కాపురస్థులమీదికిని నేను రప్పించు అపాయము నీవు కన్నులార చూడవు.

29 వారు రాజునొద్దకు ఈ వర్తమానము తీసికొనిరాగా రాజు యూదా యెరూషలేములోని పెద్దలనందరిని పిలువనంపించి

30 వారిని సమకూర్చెను. రాజును, యూదా వారందరును, యెరూషలేము కాపురస్థులును, యాజకులును, లేవీయులును, జనులలో పిన్నపెద్దలందరును యెహోవా మందిరమునకు రాగా యెహోవామందిరమందు దొరకిన నిబంధన గ్రంథపు మాటలన్నియు వారికి వినిపింపబడెను.౹

31 పిమ్మట రాజు తన స్థలమందు నిలువబడి –నేను యెహోవాను అనుసరించుచు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శాసనములను కట్టడలను పూర్ణమనస్సుతోను పూర్ణహృదయముతోను గైకొనుచు, ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుదు నని యెహోవా సన్నిధిని నిబంధన చేసికొనెను.౹

32 మరియు అతడు యెరూషలేమునందున్న వారినందరిని బెన్యామీనీయులనందిరిని అట్టి నిబంధనకు ఒప్పుకొనజేసెను గనుక యెరూషలేము కాపురస్థులు తమపితరుల దేవుడైన దేవుని నిబంధన ప్రకారము ప్రవర్తించిరి.౹

33 మరియు యోషీయా ఇశ్రాయేలీయులకు చెందిన దేశములన్నిటిలోనుండి హేయమైన విగ్రహములన్నిటిని తీసివేసి, ఇశ్రాయేలీయులందరును తమ దేవుడైన యెహోవాను సేవించునట్లు చేసెను. అతని దినములన్నియు వారు తమపితరుల దేవుడైన యెహోవాను అనుసరించుట మానలేదు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2CH/34-85e6c54edbecd371912d050e4338c505.mp3?version_id=1787—

Categories
2 దినవృత్తాంతములు

2 దినవృత్తాంతములు 35

1 మరియు యోషీయా యెరూషలేమునందు యెహోవాకు పస్కాపండుగ ఆచరించెను. మొదటి నెల పదునాల్గవదినమున జనులు పస్కాపశువును వధించిరి.౹

2 అతడు యాజకులను వారి వారి పనులకు నిర్ణయించి, యెహోవామందిరసేవను జరిగించుటకై వారిని ధైర్య పరచి

3 ఇశ్రాయేలీయులకందరికి బోధ చేయువారును యెహోవాకు ప్రతిష్ఠితులునైన లేవీయులకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను–పరిశుద్ధమైన మందసమును మీరిక మీ భుజములమీద మోయక, ఇశ్రాయేలీయుల రాజైన దావీదు కుమారుడగు సొలొమోను కట్టించిన మందిరములో దాని నుంచుడి, మీ దేవుడైన యెహోవాకును ఆయన జనులైన ఇశ్రాయేలీయులకును సేవ జరిగించుడి.౹

4 ఇశ్రాయేలీయుల రాజైన దావీదు వ్రాసియిచ్చిన క్రమముచొప్పు నను అతని కుమారుడైన సొలొమోను వ్రాసి ఇచ్చిన క్రమము చొప్పునను మీ మీపితరులయిండ్లకు ఏర్పాటైన వరుసలనుబట్టి మిమ్మును సిద్ధపరచుకొనుడి.౹

5 జనుల ఆయా భాగములకు లేవీయులకు కుటుంబములలో ఆయా భాగములు ఏర్పాటగునట్లుగా మీరు పరిశుద్ధ స్థలమందు నిలిచి, వారి వారి పితరుల కుటుంబముల వరుసలనుబట్టి జనులైన మీ సహోదరులకొరకు సేవచేయుడి.౹

6 ఆప్రకారము పస్కా పశువును వధించి మిమ్మును ప్రతి ష్ఠించుకొని, మోషేద్వారా యెహోవా యిచ్చిన ఆజ్ఞలను అనుసరించి, దానిని మీ సహోదరులకొరకు సిద్ధపరచుడి.౹

7 మరియు యోషీయా తన స్వంత మందలో ముప్పది వేల గొఱ్ఱెపిల్లలను మేకపిల్లలను మూడువేల కోడెలను అక్కడ నున్న జనులకందరికి పస్కాపశువులుగా ఇచ్చెను.౹

8 అతని అధిపతులును జనులకును యాజకులకును లేవీయులకును మనఃపూర్వకముగా పశువులు ఇచ్చిరి. యెహోవా మందిరపు అధికారులైన హిల్కీయాయు, జెకర్యాయు, యెహీయేలును పస్కాపశువులుగా యాజకులకు రెండువేల ఆరువందల గొఱ్ఱెలను మూడువందల కోడెలను ఇచ్చిరి.౹

9 కొనన్యాయు, అతని సహోదరులైన షెమయాయు, నెతనేలును, లేవీయులలో నధిపతులగు హషబ్యాయు, యెహీయేలును యోజాబాదును పస్కాపశువులుగా లేవీయులకు అయిదువేల గొఱ్ఱెలను ఐదువందల కోడెలను ఇచ్చిరి.౹

10 ఈ ప్రకారము సేవ జరుగుచుండగా రాజాజ్ఞనుబట్టి యాజకులు తమ స్థలములోను లేవీయులు తమ వరుసలలోను నిలువబడిరి.౹

11 లేవీయులు పస్కాపశువులను వధించి రక్తమును యాజకుల కియ్యగా వారు దాని ప్రోక్షించిరి. లేవీయులు పశువులను ఒలువగా

12 మోషే గ్రంథములో వ్రాయబడిన ప్రకారము జనుల కుటుంబముల విభాగము చొప్పున యెహోవాకు అర్పణగా ఇచ్చుటకు దహనబలి పశుమాంసమును యాజకులు తీసికొనిరి.౹

13 వారు ఎడ్లను కూడ ఆప్రకారముగానే చేసిరి. వారు విధిప్రకారము పస్కాపశు మాంసమును నిప్పుమీద కాల్చిరిగాని యితరమైన ప్రతిష్ఠార్పణలనుకుండలలోను బొరుసులలోను పెనములలోను ఉడికించి జనులకందరికి త్వరగా వడ్డించిరి.౹

14 తరువాత లేవీయులు తమకొరకును యాజకులకొరకును సిద్ధముచేసిరి. అహరోను సంతతి వారగు యాజకులు దహనబలి పశుమాంసమును క్రొవ్వును రాత్రివరకు అర్పింపవలసివచ్చెను గనుక లేవీయులు తమ కొరకును అహరోను సంతతివారగు యాజకులకొరకును సిద్ధపరచిరి.౹

15 మరియు ఆసాపు సంతతివారగు గాయకులును, ఆసాపు హేమానులును, రాజునకు దీర్ఘదర్శియగు యెదూతూనును దావీదు నియమించిన ప్రకారముగా తమ స్థలమందుండిరి; ద్వారములన్నిటియొద్దను ద్వారపాలకులు కనిపెట్టుచుండిరి. వారు తమ చేతిలో పని విడిచి అవతలికి వెళ్లిపోకుండునట్లు వారి సహోదరులగు లేవీయులు వారికొరకు సిద్ధపరచిరి.౹

16 ఈ ప్రకారము రాజైన యోషీయా యిచ్చిన ఆజ్ఞనుబట్టి వారు పస్కా పండుగ ఆచరించి, యెహోవా బలిపీఠముమీద దహనబలులను అర్పించుటచేత ఆ దినమున ఏమియు లోపములేకుండ యెహోవా సేవ జరిగెను.౹

17 అక్కడ నున్న ఇశ్రాయేలీయులు, ఆ కాలమందు పస్కాను పులియనిరొట్టెల పండుగను ఏడు దినములు ఆచరించిరి.౹

18 ప్రవక్తయగు సమూయేలు దినములు మొదలుకొని ఇశ్రాయేలీయులలో పస్కాపండుగ అంత ఘనముగా ఆచరింపబడి యుండలేదు. యోషీయాయు, యాజకులును, లేవీయులును, అక్కడనున్న యూదా ఇశ్రాయేలువారందరును, యెరూషలేము కాపురస్థులును ఆచరించిన ప్రకారము ఇశ్రాయేలురాజులందరిలో ఒక్కడైనను పస్కాపండుగను ఆచరించి యుండలేదు.౹

19 యోషీయా యేలుబడియందు పదునెనిమిదవ సంవత్సరమున ఈ పస్కాపండుగ జరిగెను.

20 ఇదంతయు అయిన తరువాత యోషీయా మందిరమును సిద్ధపరచినప్పుడు ఐగుప్తురాజైన నెకో యూఫ్రటీసు నదియొద్దనున్న కర్కెమీషుమీదికి దండెత్తి వెళ్లుచుండగా యోషీయా అతనిమీదికి బయలుదేరెను.౹

21 అయితే రాజైన నెకో అతనియొద్దకు రాయబారులను పంపి– యూదారాజా నీతో నాకేమి? పూర్వమునుండి నాకు శత్రువులగువారిమీదికేగాని నేడు నీమీదికి నేను రాలేదు. దేవుడు త్వరచేయుమని నాకు ఆజ్ఞాపించెను గనుక దేవుడు నాతోకూడ ఉండి నిన్ను నశింపజేయకుండునట్లు ఆయన జోలికి నీవు రావద్దనిచెప్ప నాజ్ఞా పించెను.౹

22 అయినను యోషీయా అతనితో యుద్ధము చేయగోరి, అతనియొద్దనుండి తిరిగి పోక మారువేషము ధరించుకొని, యెహోవా నోటిమాటలుగా పలుకబడిన నెకో మాటలను వినక మెగిద్దో లోయయందు యుద్ధము చేయ వచ్చెను.౹

23 విలుకాండ్రు రాజైన యోషీయామీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూచి–నాకు గొప్ప గాయము తగిలెను, ఇక్కడనుండి నన్ను కొని పోవుడని చెప్పెను.౹

24 కావున అతని సేవకులు రథము మీదనుండి అతని దింపి, అతనికున్న వేరు రథముమీద అతని ఉంచి యెరూషలేమునకు అతని తీసికొని వచ్చిరి. అతడు మృతిబొంది తన పితరుల సమాధులలో ఒకదానియందు పాతిపెట్టబడెను. యూదా యెరూషలేము వారందరును యోషీయా చనిపోయెనని ప్రలాపము చేసిరి.౹

25 యిర్మీయాయు యోషీయానుగూర్చి ప్రలాప వాక్యము చేసెను, గాయకులందరును గాయకురాండ్రంద రును తమ ప్రలాపవాక్యములలో అతని గూర్చి పలికిరి; నేటివరకు యోషీయానుగూర్చి ఇశ్రాయేలీయులలో ఆలాగు చేయుట వాడుక ఆయెను. ప్రలాపవాక్యములలో అట్టివి వ్రాయబడియున్నవి.౹

26 యోషీయా చేసిన యితర కార్యములన్నిటిని గూర్చియు, యెహోవా ధర్మశాస్త్రవిధులననుసరించి అతడు చూపిన భయభక్తులనుగూర్చియు,౹

27 అతడు చేసిన సమస్త క్రియలనుగూర్చియు ఇశ్రాయేలు యూదారాజుల గ్రంథమందు వ్రాయబడి యున్నది.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2CH/35-0f40d2505274d8faefdf7e44b5413edc.mp3?version_id=1787—

Categories
2 దినవృత్తాంతములు

2 దినవృత్తాంతములు 36

1 అప్పుడు దేశపు జనులు యోషీయా కుమారుడైన యెహోయాహాజును స్వీకరించి యెరూషలేములో అతని తండ్రి స్థానమున అతనిని రాజుగా నియమించిరి.౹

2 యెహోయాహాజు ఏలనారంభించినప్పుడు ఇరువది మూడేండ్లవాడై యెరూషలేములో మూడు నెలలు ఏలెను.౹

3 ఐగుప్తురాజు యెరూషలేమునకు వచ్చి అతని తొలగించి, ఆ దేశమునకు రెండువందల మణుగుల వెండిని రెండు మణుగుల బంగారమును జుల్మానాగా నిర్ణయించి

4 అతని సహోదరుడైన ఎల్యాకీమును యూదామీదను యెరూషలేముమీదను రాజుగా నియమించి, అతనికి యెహోయాకీము అను మారుపేరు పెట్టెను. నెకో అతని సహోదరుడైన యెహోయాహాజును పట్టుకొని ఐగుప్తునకు తీసికొని పోయెను.

5 యెహోయాకీము ఏలనారంభించినప్పుడు ఇరువదియయిదేండ్లవాడై యెరూషలేములో పదకొండు సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడునడత నడచుటచేత

6 అతని మీదికి బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి అతని బబులోనునకు తీసికొని పోవుటకై గొలుసులతో బంధించెను.౹

7 మరియు నెబుకద్నెజరు యెహోవా మందిరపు ఉపకరణములలో కొన్నిటిని బబులోనునకు తీసికొనిపోయి బబులోనులోనున్న తన గుడిలో ఉంచెను.౹

8 యెహోయాకీము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు హేయదేవతలను పెట్టుకొనుటనుగూర్చియు, అతని సకల ప్రవర్తననుగూర్చియు ఇశ్రాయేలు యూదారాజుల గ్రంథమందు వ్రాయబడి యున్నది. అతని కుమారుడైన యెహోయాకీను అతనికి బదులుగా రాజాయెను.

9 యెహోయాకీను ఏలనారంభించినప్పుడు ఎనిమిదేండ్ల వాడై యెరూషలేములో మూడు నెలల పది దినములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి చెడునడత నడిచెను

10 ఏడాదినాటికి, రాజైన నెబుకద్నెజరు దూతలను పంపి యెహోయాకీనును బబులోనునకు రప్పించి, అతని సహోదరుడైన సిద్కియాను యూదామీదను యెరూషలేము మీదను రాజుగా నియమించెను. మరియు అతడు రాజు వెంట యెహోవా మందిరములోని ప్రశస్తమైన ఉపకరణములను తెప్పించెను.

11 సిద్కియా యేలనారంభించినప్పుడు ఇరువది యొక టేండ్లవాడై యెరూషలేములో పదకొండు సంవత్సరములు ఏలెను.౹

12 అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడచుచు, ఆయన నియమించిన ప్రవక్తయైన యిర్మీయా మాట వినకయు, తన్నుతాను తగ్గించుకొనకయు ఉండెను.౹

13 మరియు దేవుని నామమునుబట్టి తనచేత ప్రమాణముచేయించిన నెబుకద్నెజరు రాజుమీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవావైపు తిరుగక తన మనస్సును కఠినపరచుకొనెను.౹

14 అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులగువారు, అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై, యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరచిన మందిరమును అపవిత్రపరచిరి.౹

15 వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులయందును తన నివాసస్థలమందును కటాక్షముగలవాడై వారియొద్దకు తన దూతలద్వారా వర్తమానము పంపుచు వచ్చెను. ఆయన పెందలకడ లేచి పంపుచువచ్చినను

16 వారు దేవుని దూతలను ఎగతాళిచేయుచు, ఆయన వాక్యములను తృణీకరిం చుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా, నివారింప శక్యముకాకుండ యెహోవా కోపము ఆయన జనులమీదికి వచ్చెను.౹

17 ఆయన వారిమీదికి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధస్థలముగానున్న మందిరములోనే వారి యౌవనులను ఖడ్గముచేత సంహరించెను. అతడు యౌవనులయందైనను, యువతులయందైనను, ముసలి వారియందైనను, నెరసిన వెండ్రుకలుగల వారియందైనను కనికరింపలేదు. దేవుడు వారినందరిని అతనిచేతికప్ప గించెను.౹

18 మరియు బబులోనురాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటిని, యెహోవా మందిరపు నిధులలోనిదేమి రాజు నిధులలోనిదేమి అధిపతుల నిధులలోనిదేమి, దొరకిన ద్రవ్యమంతయు బబులోనునకు తీసికొనిపోయెను.౹

19 అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి, యెరూషలేము ప్రాకారమును పడగొట్టి, దానియొక్క నగరులన్నిటిని కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటిని బొత్తిగా పాడు చేసిరి.౹

20 ఖడ్గముచేత హతులు కాకుండ తప్పించుకొనిన వారిని అతడు బబులోనునకు తీసికొనిపోయెను. రాజ్యము పారసీకులదగువరకు వారు అక్కడనేయుండి అతనికిని అతని కుమారులకును దాసులైరి.౹

21 యిర్మీయాద్వారా పలుక బడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతిదినములను దేశము అనుభవించువరకు ఇది సంభవించెను. దేశము పాడుగానున్న డెబ్బది సంవత్సరములకాలము అది విశ్రాంతిదినముల ననుభవించెను.

22 పారసీకదేశపు రాజైన కోరెషు ఏలుబడియందు మొదటి సంవత్సరమున యిర్మీయాద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీకదేశపురాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమం దంతటను చాటించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను

23 –పారసీకదేశపు రాజైన కోరెషు ఆజ్ఞా పించునదేమనగా–ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకలజనములను నా వశముచేసి, యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు; కావున మీలో ఎవరు ఆయన జనులైయున్నారో వారు బయలుదేర వచ్చును; వారి దేవుడైన యెహోవావారికి తోడుగా నుండునుగాక.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2CH/36-0c5c876598388cf8200a0c8465fcdaac.mp3?version_id=1787—

Categories
ఎజ్రా

ఎజ్రా 1

1 పారసీకదేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు యిర్మీయాద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీకదేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతట చాటింపుచేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను

2 –పారసీకదేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించునదేమనగా – ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి, యూదాదేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు.౹

3 కావున మీలో ఎవరు ఆయన జనులైయున్నారో వారు యూదాదేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి, యెరూషలేములోని దేవుని మందిరమును, అనగా ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను; వారి దేవుడు వారికి తోడై యుండునుగాక.౹

4 మరియు యెరూషలేములోనుండు దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆయా స్థలములలోనివారు తమ యొద్ద నివసించువారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలెనని ఆజ్ఞాపించెను.౹

5 అప్పుడు యూదా పెద్దలును, బెన్యామీనీయుల పెద్దలును, యాజకులును లేవీయులును, ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించెనో వారందరు వారితోకూడుకొని వచ్చి, యెరూషలేములోఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి.౹

6 మరియు వారి చుట్టు నున్నవారందరును స్వేచ్ఛగా అర్పించినవిగాక, వెండి ఉపకరణములను బంగారును పశువులను ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయము చేసిరి.౹

7 మరియు నెబుకద్నెజరు యెరూషలేములోనుండి తీసికొని వచ్చి తన దేవతలయొక్క గుడియందుంచిన యెహోవా మందిరపు ఉపకరణములనురాజైన కోరెషు బయటికి తెప్పించెను.౹

8 పారసీకదేశపు రాజైన కోరెషు తన ఖజానాదారుడైన మిత్రిదాతుద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క చేయించి, యూదులకు అధిపతియగు షేష్బజ్జరు చేతికి అప్పగించెను.౹

9 వాటియొక్క లెక్క ముప్పది బంగారపు పళ్లెములును వెయ్యి వెండి పళ్లెములును ఇరువది తొమ్మిది కత్తులును

10 ముప్పది బంగారుగిన్నెలును నాలుగువందలపది వెండితో చేయబడిన రెండవ రకమైన గిన్నెలును, మరి యితరమైన ఉపకరణములును వెయ్యియైయుండెను.౹

11 బంగారు వస్తువులును వెండి వస్తువులును అన్నియు అయిదువేల నాలుగు వందలు. షేష్బజ్జరు బబులోను చెరలోనుండి విడిపింపబడినవారితోకూడ కలిసి వీటన్నిటిని యెరూషలేమునకు తీసికొని వచ్చెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZR/1-6870d7f4e81f5ea2fcdaf632e5ca1912.mp3?version_id=1787—

Categories
ఎజ్రా

ఎజ్రా 2

1 బబులోను రాజైన నెబుకద్నెజరుచేత బబులోను దేశమునకు చెరగా తీసికొని పోబడినవారికి ఆ దేశమందు పుట్టి చెరలోనుండి విడిపింపబడి

2 యెరూషలేమునకును యూదాదేశమునకును తమతమ పట్టణములకు పోవునట్లుగా సెలవుపొంది, జెరుబ్బాబెలు యేషూవ నెహెమ్యా శెరాయా రెయేలాయా మొర్దకై బిల్షాను మిస్పెరేతు బిగ్వయి రెహూము బయనా అనువారితోకూడ వచ్చిన ఇశ్రాయేలీయులయొక్క లెక్కయిది.౹

3 పరోషు వంశస్థులు రెండువేల నూట డెబ్బది యిద్దరు,౹

4 షెఫట్య వంశస్థులు మూడువందల డెబ్బది యిద్దరు,౹

5 ఆరహు వంశస్థులు ఏడువందల డెబ్బది యయిదుగురు,౹

6 పహత్మో యాబు వంశస్థులు యేషూవ యోవాబు వంశస్థులతోకూడ రెండువేల ఎనిమిదివందల పండ్రెండుగురు,౹

7 ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురు,౹

8 జత్తూ వంశస్థులు తొమ్మిదివందల నలువది యయిదుగురు, జక్కయి వంశస్థులు ఏడువందల అరువది మంది,౹

9-11 బానీ వంశస్థులు ఆరువందల నలువది యిద్దరు, బేబైవంశస్థులు ఆరువందల ఇరువది ముగ్గురు,౹

12 అజ్గాదు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఇరువది యిద్దరు,౹

13 అదొనీకాము వంశస్థులు ఆరువందల అరువది ఆరుగురు,౹

14 బిగ్వయి వంశస్థులు రెండువేల ఏబది ఆరుగురు;౹

15 ఆదీను వంశస్థులు నాలుగువందల ఏబది నలుగురు,౹

16 అటేరు వంశస్థులు హిజ్కియాతోకూడ తొంబది ఎనమండుగురు,౹

17 బెజయి వంశస్థులు మూడువందల ఇరువది ముగ్గురు,౹

18 యోరా వంశస్థులు నూట పండ్రెండుగురు,౹

19 హాషుము వంశస్థులు రెండువందల ఇరువది ముగ్గురు,౹

20 గిబ్బారు వంశస్థులు తొంబది యయిదుగురు,౹

21 బేత్లెహేము వంశస్థులు నూట ఇరువది ముగ్గురు,౹

22 నెటోపా వంశస్థులు ఏబది ఆరుగురు,౹

23 అనాతోతు వంశస్థులు నూట ఇరువది యెనమండుగురు,౹

24-25 అజ్మావెతు వంశస్థులు నలువది యిద్దరు, కిర్యాతారీము కెఫీరా బెయేరోతు అనువారి వంశస్థులు ఏడువందల నలువది ముగ్గురు,౹

26 రామా, గెబ అనువారి వంశస్థులు ఆరువందల ఇరువదియొక్కరు,౹

27 మిక్మషు వంశస్థులు నూట ఇరువది ముగ్గురు,౹

28 బేతేలు హాయి మనుష్యులు రెండువందల ఇరువది యిద్దరు,౹

29-31 నెబో వంశస్థులు ఏబది ఇద్దరు, మగ్బీషు వంశస్థులు నూట ఏబది ఆరుగురు, ఇంకొక ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురు,౹

32 హారీము వంశస్థులు మూడువందల ఇరువదిమంది,౹

33 లోదు హదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడువందల ఇరువదియయిదుగురు,౹

34 యెరికో వంశస్థులు మూడువందల నలువది యయిదుగురు,౹

35 సెనాయా వంశస్థులు మూడువేల ఆరు వందల ముప్పదిమంది,౹

36 యాజకులలో యేషూవ యింటివారైన యెదాయా వంశస్థులు తొమ్మిదివందల ఏబది ముగ్గురు

37 ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది ఇద్దరు,౹

38 పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువదియేడుగురు,౹

39 హారీము వంశస్థులు వెయ్యిన్ని పదునేడు గురు,౹

40 లేవీయులలో యేషూవ కద్మీయేలు హోదవ్యా అనువారి వంశస్థులు కలిసి డెబ్బది నలుగురు,౹

41 గాయకులలో ఆసాపు వంశస్థులు నూట ఇరువది యెనమండు గురు,౹

42 ద్వారపాలకులలో షల్లూము అటేరు టల్మోను అక్కూబు హటీటా షోబయి అనువారందరి వంశస్థులు నూట ముప్పది తొమ్మండుగురు,౹

43 నెతీనీయులలో జీహా వంశస్థులు హశూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు,౹

44 కేరోసు వంశస్థులు, సీయహా వంశస్థులు, పాదోను వంశస్థులు,౹

45 లెబానా వంశస్థులు, హగాబా వంశస్థులు, అక్కూబు వంశస్థులు,౹

46 హాగాబు వంశస్థులు, షల్మయి వంశస్థులు, హానాను వంశస్థులు,౹

47 గిద్దేలు వంశస్థులు, గహరు వంశస్థులు, రెవాయా వంశస్థులు,౹

48 రెజీను వంశస్థులు, నెకోదా వంశస్థులు, గజ్జాము వంశస్థులు,౹

49 ఉజ్జా వంశస్థులు, పాసెయ వంశస్థులు, బేసాయి వంశస్థులు,౹

50 అస్నా వంశస్థులు, మెహూనీము వంశస్థులు, నెపూసీము వంశస్థులు,౹

51 బక్బూకు వంశస్థులు, హకూపా వంశస్థులు, హర్హూరు వంశస్థులు,౹

52 బజ్లీతు వంశస్థులు, మెహీదా వంశస్థులు, హర్షా వంశస్థులు,౹

53 బర్కోసు వంశస్థులు, సీసెరా వంశస్థులు, తెమహు వంశస్థులు,౹

54 నెజీయహు వంశస్థులు, హటీపా వంశస్థులు,౹

55 సొలొమోను సేవకుల వంశస్థులు, సొటయి వంశస్థులు, సోపెరెతు వంశస్థులు, పెరూదా వంశస్థులు,౹

56 యహలా వంశస్థులు, దర్కోను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు,౹

57 షెఫట్య వంశస్థులు, హట్టీలు వంశస్థులు, జెబాయీము సంబంధమైన పొకెరెతు వంశస్థులు, ఆమీ వంశస్థులు,౹

58 నెతీనీయులును సొలొమోను సేవకుల వంశస్థులును అందరును కలిసి మూడువందల తొంబది యిద్దరు.౹

59 మరియు తేల్మెలహు తేల్హర్షా కెరూబు అద్దాను ఇమ్మేరు అను స్థలములలోనుండి కొందరు వచ్చిరి. అయితే వీరు తమపితరులయొక్క యింటినైనను వంశావళినైనను చూపింపలేకపోయినందునవారు ఇశ్రాయేలీయులో కారో తెలియకపోయెను.౹

60 వారు ఎవరనగా దెలాయ్యా వంశస్థులు, టోబీయా వంశస్థులు, నెకోదా వంశస్థులు, వీరు ఆరువందల ఏబది యిద్దరు.౹

61 మరియు యాజకులలో హబాయ్యా వంశస్థులు, హాక్కోజు వంశస్థులు, గిలాదీయుడైన బర్జిల్లయియొక్క కుమార్తెలలో ఒకతెను పెండ్లిచేసికొని వారి పేళ్లనుబట్టి బర్జిల్లయి అనిపిలువబడినవాని వంశస్థులు.౹

62 వీరు వంశావళి లెక్కలో తమతమ పేరులను వెదకినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మములోనుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచ బడిరి.౹

63 మరియు పారసీకుల అధికారి–ఊరీమును తుమ్మీమును ధరించుకొనగల యొక యాజకుడు ఏర్పడువరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని వారికాజ్ఞాపించెను.౹

64 సమాజముయొక్క లెక్క మొత్తము నలువది రెండువేల మూడువందల అరువదిమంది యాయెను.౹

65 వీరుగాక వీరి దాసులును దాసురాండ్రును ఏడువేల మూడువందల ముప్పదియేడుగురు. మరియు వారిలో గాయకులును గాయకురాండ్రును రెండువందలమంది యుండిరి.౹

66 వారి గుఱ్ఱములు ఏడువందల ముప్పది యారు, వారి కంచరగాడిదలు రెండువందల నలువది యయిదు,౹

67 వారి ఒంటెలు నాలుగువందల ముప్పది యయిదు, గాడి

దలు ఆరువేల ఏడువందల ఇరువదియు ఉండెను.౹

68 కుటుంబ ప్రధానులు కొందరు యెరూషలేములోనుండు యెహోవా మందిరమునకు వచ్చి, దేవుని మందిరమును దాని స్థలములో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణములుగా అర్పించిరి.౹

69 పని నెరవేర్చుటకు తమ శక్తికొలది ఖజానాకు పదునారువేల మూడువందల తులముల బంగారమును రెండులక్షల యేబది వేల తులముల వెండిని యాజకులకొరకు నూరు వస్త్రములను ఇచ్చిరి.౹

70 యాజకులును లేవీయులును జనులలో కొందరును గాయకులును ద్వారపాలకులును నెతీనీయులును తమ పట్టణములకు వచ్చి కాపురముచేసిరి. మరియు ఇశ్రాయేలీయులందరును తమతమ పట్టణములందు కాపురము చేసిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZR/2-bbf3423f9cc6260d4b875a00394cd85d.mp3?version_id=1787—

Categories
ఎజ్రా

ఎజ్రా 3

1 ఏడవ నెలలో ఇశ్రాయేలీయులు తమతమ పట్టణములకు వచ్చిన తరువాత జనులు ఏకమనస్సు కలిగినవారై యెరూషలేములో కూడి,౹

2 యోజాదాకు కుమారుడైన యేషూవయును యాజకులైన అతని సంబంధులును షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులును లేచి, దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారముగా దహనబలులు అర్పించుటకై ఇశ్రాయేలీయుల దేవుని బలిపీఠమును కట్టిరి.౹

3 వారు దేశమందు కాపురస్థులైనవారికి భయపడుచు, ఆ బలిపీఠమును దాని పురాతన స్థలమున నిలిపి, దానిమీద ఉదయమునను అస్తమయమునను యెహోవాకు దహనబలులు అర్పించుచు వచ్చిరి

4 మరియు గ్రంథమునుబట్టి వారు పర్ణశాలల పండుగను నడిపించి, ఏ దినమునకు నియమింపబడిన లెక్కచొప్పున ఆ దినపు దహనబలిని విధి చొప్పున అర్పింపసాగిరి.౹

5 తరువాత నిత్యమైన దహనబలిని, అమావాస్యలకును యెహోవాయొక్క నియామకమైన పండుగలకును ప్రతిష్ఠితమైన దహనబలులను, ఒక్కొక్కడు తెచ్చిన స్వేచ్ఛార్పణలను అర్పించుచు వచ్చిరి.౹

6 ఏడవ నెల మొదటి దినమునుండి యెహోవాకు దహనబలులు అర్పింప మొదలుపెట్టిరి. అయితే యెహోవా మందిరముయొక్క పునాది అప్పటికి ఇంకను వేయబడలేదు.౹

7 మరియు వారు కాసెవారికిని వడ్రవారికిని ద్రవ్యము నిచ్చిరి. అదియుగాక పారసీకదేశపు రాజైన కోరెషు తమకు సెలవిచ్చినట్లు దేవదారు మ్రానులను లెబానోను నుండి సముద్రముమీద యొప్పే పట్టణమునకు తెప్పించుటకు సీదోనీయులకును తూరువారికిని భోజనపదార్థములను పానమును నూనెను ఇచ్చిరి.

8 యెరూషలేములోనుండు దేవునియొక్క మందిరమునకు వారు వచ్చిన రెండవ సంవత్సరము రెండవనెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును, యోజాదాకు కుమారుడైన యేషూవయును, చెరలోనుండి విడిపింపబడి యెరూషలేమునకు వచ్చినవారందరును పని ఆరంభించి, యిరువది సంవత్సరములు మొదలుకొని పై యీడుగల లేవీయులను యెహోవా మందిరముయొక్క పనికి నిర్ణయించిరి.౹

9 యేషూవయు అతని కుమారులును అతని సహోదరులును, కద్మీయేలును అతని కుమారులును, హోదవ్యా కుమారులును, హేనాదాదు కుమారులును, వారి కుమారులును, లేవీయులైనవారి బంధువులును, దేవుని మందిరములో పనివారిచేత పనిచేయించుటకు నియమింపబడిరి.౹

10 శిల్పకారులు యెహోవా మందిరముయొక్క పునాదిని వేయుచుండగా ఇశ్రాయేలురాజైన దావీదు నిర్ణయించిన విధిచొప్పున తమ వస్త్రములు ధరించుకొనినవారై యాజకులు బాకాలతోను, ఆసాపు వంశస్థులగు లేవీయులు చేయితాళములతోను నిలువబడి యెహోవాను స్తోత్రము చేసిరి

11 వీరు వంతు చొప్పున కూడి–యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరముయొక్క పునాది వేయబడుట చూచి, జనులందరును గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి.౹

12 మునుపటి మందిరమును చూచిన యాజకులలోను లేవీయులలోను కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు, ఇప్పుడు వేయబడిన యీ మందిరముయొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషముచేత బహుగా అరచిరి.౹

13 ఏది సంతోష శబ్దమో యేది దుఃఖశబ్దమో జనులు తెలిసికొనలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినబడెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZR/3-eca9ca8f40714423c2265f7101312c60.mp3?version_id=1787—

Categories
ఎజ్రా

ఎజ్రా 4

1 అంతట యూదావంశస్థులకును బెన్యామీనీయులకును విరోధులైనవారు, చెరనివారణయయినవారు ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాకు ఆలయమును కట్టుచున్న సంగతి విని

2 జెరుబ్బాబెలు నొద్దకును పెద్దలలో ప్రధానులయొద్దకును వచ్చి–మీరు ఆశ్రయించునట్లు మేమును మీ దేవుని ఆశ్రయించువారము. ఇచ్చటికి మమ్మును రప్పించిన అష్షూరు రాజైన ఏసర్హద్దోనుయొక్క కాలము మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించు వారము, మేమును మీతో కలిసి కట్టెదమని చెప్పిరి.౹

3 అందుకు జెరుబ్బాబెలును యేషూవయు ఇశ్రాయేలీయుల పెద్దలలో తక్కిన ప్రధానులును–మీరు మాతో కలిసి మా దేవునికి మందిరమును కట్టుటకు నిమిత్తము లేదు; మేమే కూడుకొని పారసీకదేశపు రాజైన కోరెషు మాకిచ్చిన ఆజ్ఞప్రకారము ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాకు మందిరమును కట్టుదుమని వారితో చెప్పిరి.౹

4 దేశపు జనులు యూదావంశస్థులకు ఇబ్బంది కలుగజేసి కట్టుచున్న వారిని బాధపరచిరి.౹

5 మరియు పారసీకదేశపు రాజైన కోరెషుయొక్క దినములన్నిటిలోను పారసీకదేశపు రాజైన దర్యావేషుయొక్క పరిపాలనకాలమువరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచములిచ్చిరి.౹

6 మరియు అహష్వేరోషు ఏలనారంభించినప్పుడు వారు యూదాదేశస్థులనుగూర్చియు యెరూషలేము పట్టణపు వారిని గూర్చియు ఉత్తరము వ్రాసి వారిమీద తప్పు మోపిరి.

7 అర్తహషస్తయొక్క దినములలో బిష్లామును మిత్రి దాతును టాబెయేలును వారి పక్షముగానున్న తక్కినవారును పారసీకదేశపు రాజైన అర్తహషస్తకు ఉత్తరము వ్రాసిపంపిరి. ఆ యుత్తరము సిరియాభాషలో వ్రాయబడి సిరియాభాషలోనే తాత్పర్యము చేయబడినది.౹

8 మరియు మంత్రియగు రెహూమును లేఖకుడగు షిమ్షయియు ఈ ప్రకారముగా యెరూషలేము సంగతినిగూర్చి ఉత్తరము వ్రాసి రాజైన అర్తహషస్తయొద్దకు పంపిరి.౹

9 అంతట మంత్రియగు రెహూమును లేఖకుడగు షిమ్షయియు వారి పక్షముగానున్న తక్కినవారైన దీనాయీయులును అపర్స త్కాయ్యులును టర్పెలాయేలును అపార్సాయులును అర్కెవాయులును బబులోనువారును షూషన్కాయులును దెహావేయులును ఏలామీయులును

10 ఘనుడును, శ్రేష్ఠుడునైన ఆస్నప్పరు నది యివతలకు రప్పించి షోమ్రోను పట్టణములందును నది యవతలనున్న ప్రదేశమందును ఉంచిన తక్కిన జనములును, నది యివతలనున్న తక్కినవారును ఉత్తరము ఒకటి వ్రాసిరి.౹

11 వీరు రాజైన అర్తహ షస్తకు వ్రాసి పంపించిన ఉత్తరము నకలు. నది యివతలనున్న తమ దాసులమైన మేము రాజైన తమకు తెలియజేయునదేమనగా

12 తమ సన్నిధినుండి మాయొద్దకు వచ్చిన యూదులు యెరూషలేమునకు వచ్చి, తిరుగుబాటుచేసిన ఆ చెడుపట్టణమును కట్టుచున్నారు. వారు దాని ప్రాకారములను నిలిపి దాని పునాదులను మరమ్మతు చేయుచున్నారు.౹

13 కావున రాజవైన తమకు తెలియవలసినదేమనగా, ఈ పట్టణమును కట్టి దాని ప్రాకారములను నిలువ బెట్టినయెడల వారు శిస్తుగాని సుంకముగాని పన్నుగాని యియ్యకయుందురు, అప్పుడు రాజునకు రావలసిన పైకము నష్టమగును.౹

14 మేము రాజుయొక్క ఉప్పుతిన్నవారముగనుక రాజునకు నష్టమురాకుండ మేము చూడవలెనని ఈ యుత్తరమును పంపి రాజవైన తమకు ఈ సంగతి తెలియ జేసితిమి.౹

15 మరియు తమ పూర్వికులు వ్రాయించిన రాజ్యపు దస్తావేజులను చూచినయెడల, ఈ పట్టణపువారు తిరుగుబాటు చేయువారుగాను, రాజులకును దేశములకును హాని చేయువారుగాను, కలహకారులుగాను కనబడుదు రనియు, అందువలననే యీ పట్టణము నాశనము పొందెననియు రాజ్యపు దస్తావేజులవలననే తమకు తెలియ వచ్చును.౹

16 కావున రాజవైన తమకు మేము రూఢిపరచునదేమనగా, ఈ పట్టణము కట్టబడి దాని ప్రాకారములు నిలువబెట్టబడినయెడల నది యివతల తమకు హక్కు ఎంత మాత్రము ఉండదు.౹

17 అప్పుడు రాజు–మంత్రియగు రెహూమునకును లేఖకుడగు షిమ్షయికిని షోమ్రోనులో నివసించువారి పక్షముగానున్న మిగిలిన వారికిని నది యవతలనుండు తక్కినవారికిని–మీకు క్షేమసంప్రాప్తియగును గాక అని యీ మొదలగు మాటలు వ్రాయించి సెలవిచ్చిన దేమనగా

18 –మీరు మాకు పంపిన ఉత్తరమును శాంతముగా చదివించుకొన్నాము.౹

19 అందువిషయమై మా యాజ్ఞనుబట్టి వెదకగా, ఆదినుండి ఆ పట్టణపువారు రాజులమీద కలహమును తిరుగుబాటును చేయువారని మాకు అగుపడినది.౹

20 మరియు యెరూషలేముపట్టణమందు బలమైనరాజులు ప్రభుత్వము చేసిరి. వారు నది యవతలి దేశములన్నిటిని ఏలినందున వారికి శిస్తును సుంకమును పన్నును చెల్లుచుండెను.౹

21 కాబట్టి యిప్పుడు ఆ మనుష్యులు ఆ పని చాలించి, మేము సెలవిచ్చువరకు ఆ పట్టణమును కట్టక మానవలెనని ఆజ్ఞాపించుడి.౹

22 ఇది తప్పకుండ చేయుటకు మీరు జాగ్రత్తపడుడి. రాజులకు నష్టము కలుగునట్లు ద్రోహము పెరుగకుండ చూడుడి అని సెలవిచ్చెను.౹

23 రాజైన అర్తహషస్త పంపించిన యుత్తరముయొక్క ప్రతి రెహూమునకును షిమ్షయికిని వీరిపక్షముగా నున్న వారికిని వినిపింపబడినప్పుడు వారు త్వరగా యెరూషలేములోనున్న యూదులయొద్దకు వచ్చి, బలవంతముచేతను అధికారముచేతను వారు పని ఆపునట్లుచేయగా

24 యెరూషలేములో నుండు దేవుని మందిరపు పని నిలిచిపోయెను. ఈలాగున పారసీకదేశపు రాజైన దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరమువరకు ఆ పని నిలిచిపోయెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZR/4-4a494284388d50ec123cb4f00eb9bdaa.mp3?version_id=1787—

Categories
ఎజ్రా

ఎజ్రా 5

1 ప్రవక్తలైన హగ్గయియు ఇద్దో కుమారుడైన జెకర్యాయు యూదాదేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా నామమున ప్రకటింపగా

2 షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బా బెలును యోజాదాకు కుమారుడైన యేషూవయునులేచి యెరూషలేములోనుండు దేవుని మందిరమును కట్టనారం భించిరి. మరియు దేవునియొక్క ప్రవక్తలు వారితోకూడ నుండి సహాయము చేయుచువచ్చిరి.౹

3 అంతట నది యివతల అధికారియైన తత్తెనైయును షెతర్బోజ్నయియును వారి పక్షముననున్నవారును యూదులయొద్దకు వచ్చి–ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారమును నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని అడుగగా

4 ఈ కట్టడమును చేయించినవారి పేరులు మొదైలైన సంగతులను మేము వారితో చెప్పితిమి.౹

5 యూదుల దేవుడు వారి పెద్దలమీద తన దృష్టియుంచినందున ఆ సంగతినిగూర్చి దర్యావేషు ఎదుటికి వచ్చువారు ఆజ్ఞనొందువరకు అధికారులు వారిని పని మాన్పింపలేదు.

6 నది యివతల అధికారియైన తత్తెనైయును షెతర్బో జ్నయియును, నది యివతల నుండువారి పక్షముగానున్న అపర్సెకాయులును, రాజైన దర్యావేషునకు పంపిన ఉత్తరము నకలు

7 –రాజైన దర్యావేషునకు సకల క్షేమ ప్రాప్తియగునుగాక.౹

8 రాజవైన తమకు తెలియవలసినదేమనగా, మేము యూదా ప్రదేశములోనికి వెళ్లితిమి, అక్కడ మహాదేవునియొక్క మందిరము ఉన్నది; అది గొప్ప రాళ్లచేత కట్టబడినది, గోడలలో మ్రానులు వేయబడినవి. మరియు ఈ పని త్వరగా జరుగుచు వారిచేతిలో వృద్ధియగుచున్నది.౹

9 ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారములను నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని మేము అక్కడనున్న పెద్దలను అడిగితిమి.౹

10 వారిలో అధికారులైన వారిపేళ్లు వ్రాసి తమకు తెలియజేయుటకై వారి పేళ్లను అడుగగా

11 వారు ఈలాగున ప్రత్యుత్తర మిచ్చిరి–మేము భూమ్యాకాశముల దేవునియొక్క సేవకులమై అనేక సంవత్సరముల క్రిందట ఇశ్రాయేలీయులలో నొక గొప్పరాజు కట్టించి నిలిపిన మందిరమును మరల కట్టుచున్నాము.౹

12 మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపము పుట్టించినందున ఆయన వారిని కల్దీయుడైన నెబుకద్నెజరను బబులోను రాజుచేతికి అప్పగించెను. అతడు ఈ మందిరమును నాశనముచేసి జనులను బబులోను దేశములోనికి చెరపట్టుకొని పోయెను.౹

13 అయితే బబులోను రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు రాజైన కోరెషు దేవుని మందిరమును తిరిగి కట్టుటకు ఆజ్ఞ ఇచ్చెను.౹

14 మరియు నెబుకద్నెజరు యెరూషలేమందున్న దేవాలయములోనుండి తీసి బబులోను పట్టణమందున్న గుడిలోనికి కొనిపోయిన దేవుని మందిరపు వెండి బంగారు ఉపకరణములనురాజైన కోరెషు బబులోను పట్టణపు మందిరములోనుండి తెప్పించి

15 తాను అధికారిగా చేసిన షేష్బజ్జరు అను నతనికి అప్పగించి– నీవు ఈ ఉపకరణములను తీసికొని యెరూషలేము పట్టణ మందుండు దేవాలయమునకు పోయి దేవుని మందిరమును దాని స్థలమందు కట్టించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను.

16 కాబట్టి ఆ షేష్బజ్జరు వచ్చి యెరూషలేములోనుండు దేవుని మందిరపు పునాదిని వేయించెను. అప్పటినుండి నేటివరకు అది కట్టబడుచున్నను ఇంకను సమాప్తికాకుండ ఉన్నది.౹

17 కాబట్టి రాజవైన తమకు అనుకూలమైతే బబులోను పట్టణమందున్న రాజుయొక్క ఖజానాలో వెదకించి, యెరూషలేములోనుండు దేవుని మందిరమును కట్టుటకు రాజైన కోరెషు నిర్ణయముచేసెనో లేదో అది తెలిసికొని, రాజవైన తమరు ఆజ్ఞ ఇచ్చి యీ సంగతిని గూర్చి తమ చిత్తము తెలియజేయ గోరుచున్నాము.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZR/5-61b0e676442de2857afaa50c321bb6a2.mp3?version_id=1787—

Categories
ఎజ్రా

ఎజ్రా 6

1 అప్పుడు రాజైన దర్యావేషు ఆజ్ఞ ఇచ్చినందున బబులోనులో ఖజానాలోని దస్తావేజుకొట్టులో వెదకగా

2 మాదీయుల ప్రదేశమందు ఎగ్బతానాయను పురములో ఒక గ్రంథము దొరికెను. దానిలో వ్రాయబడియున్న యీ సంగతి కనబడెను.

3 –రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు అతడు యెరూషలేములోఉండు దేవుని మందిరమునుగూర్చి నిర్ణయించినది–బలులు అర్పింపతగిన స్థలముగా మందిరముకట్టింపబడవలెను; దాని పునాదులు గట్టిగా వేయబడవలెను; దాని నిడివి అరువది మూరలును దాని వెడల్పు అరువది మూరలును ఉండవలెను;౹

4 మూడు వరుసలు గొప్ప రాళ్లచేతను ఒక వరుస క్రొత్త మ్రానులచేతను కట్టింపబడవలెను; దాని వ్యయమును రాజుయొక్క ఖజానాలోనుండి యియ్యవలెను.౹

5 మరియు యెరూషలేములోనున్న ఆలయములోనుండి నెబుకద్నెజరు బబులోనునకు తీసికొని వచ్చిన దేవుని మందిరముయొక్క వెండి బంగారు ఉపకరణములు తిరిగి అప్పగింపబడి, యెరూషలేములోనున్న మందిరమునకు తేబడి, దేవుని మందిరములో వాటి స్థలమందు పెట్టబడవలెను.

6 కావున రాజైన దర్యావేషు ఈలాగు సెలవిచ్చెను– నది యవతల అధికారియైన తత్తెనై అను నీవును, షెతర్బోజ్నయి అను నీవును నది యవతల మీతోకూడ నున్న అపర్సెకాయులును యూదులజోలికి పోక

7 దేవుని మందిరపు పని జరుగనిచ్చి, వారి అధికారిని పెద్దలను దేవుని మందిరమును దాని స్థలమందు కట్టింప నియ్యుడి.౹

8 మరియు దేవుని మందిరమును కట్టించునట్లుగా యూదులయొక్క పెద్దలకు మీరు చేయవలసిన సహాయమునుగూర్చి మేము నిర్ణయించినదేమనగా–రాజుయొక్క సొమ్ములోనుండి, అనగా నది యవతలనుండి వచ్చిన పన్నులోనుండి వారు చేయుపని నిమిత్తము తడవు ఏమాత్రమును చేయక వారి వ్యయమునకు కావలసినదాని ఇయ్యవలెను.౹

9 మరియు ఆకాశమందలి దేవునికి దహనబలులు అర్పించుటకై కోడెలేగాని గొఱ్ఱెపొట్టేళ్లేగాని గొఱ్ఱెపిల్లలేగాని గోధుమలేగాని ఉప్పేగాని ద్రాక్షారసమేగాని నూనెయేగాని, యెరూషలేములోనున్న యాజకులు ఆకాశమందలి దేవునికి సువాసనయైన అర్పణలను అర్పించి, రాజును అతని కుమారులును జీవించునట్లు ప్రార్థనచేయు నిమిత్తమై వారు చెప్పినదానినిబట్టి ప్రతిదినమును తప్పకుండ

10 వారికి కావలసినదంతయు ఇయ్యవలెను.౹

11 ఇంకను మేము నిర్ణయించినదేమనగా, ఎవడైనను ఈ ఆజ్ఞను భంగపరచినయెడల వాని యింటివెన్నుగాడి ఊడ దీయబడి నిలువనెత్తబడి దానిమీద వాడు ఉరితీయింపబడును, ఆ తప్పునుబట్టి వాని యిల్లు పెంటరాశి చేయబడును.౹

12 ఏ రాజులేగాని యేజనులేగాని యీ ఆజ్ఞను భంగపరచి యెరూషలేములోనున్న దేవుని మందిరమును నశింపజేయుటకై చెయ్యిచాపినయెడల, తన నామమును అక్కడ ఉంచిన దేవుడు వారిని నశింపజేయును. దర్యావేషు అను నేనే యీ ఆజ్ఞ ఇచ్చితిని. మరియు అది అతివేగముగా జరుగవలెనని వ్రాయించి అతడు తాకీదుగా పంపించెను.

13 అప్పుడు నది యివతల అధికారియైన తత్తెనైయును షెతర్బోజ్నయియును వారి పక్షమున నున్నవారునురాజైన దర్యావేషు ఇచ్చిన ఆజ్ఞచొప్పున వేగముగా పని జరిపించిరి.౹

14 యూదుల పెద్దలు కట్టించుచు, ప్రవక్తయైన హగ్గయియు ఇద్దో కుమారుడైన జెకర్యాయు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపిరి. ఈ ప్రకారము ఇశ్రాయేలీయుల దేవుని ఆజ్ఞ ననుసరించి వారు కట్టించుచు, కోరెషు దర్యావేషు అర్తహషస్త అను పారసీకదేశపురాజుల ఆజ్ఞచొప్పున ఆ పని సమాప్తి చేసిరి.౹

15 రాజైన దర్యావేషు ఏలుబడియందు ఆరవ సంవత్సరము అదారు నెల మూడవనాటికి మందిరము సమాప్తి చేయబడెను.౹

16 అప్పుడు ఇశ్రాయేలీయులును యాజకులును లేవీయులును చెరలోనుండి విడుదలనొందిన తక్కినవారును దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ఠించిరి.౹

17 దేవుని మందిరమును ప్రతిష్ఠించినప్పుడు నూరు ఎడ్లను రెండు వందల పొట్టేళ్లను నాలుగువందల గొఱ్ఱెపిల్లలను ఇశ్రాయేలీయులకందరికిని పాపపరిహారార్థబలిగా ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్కచొప్పున పండ్రెండు మేకపోతులను అర్పించిరి.౹

18 మరియు వారు యెరూషలేములోనున్న దేవుని సేవ జరిపించుటకై మోషేయొక్క గ్రంథమందు వ్రాసిన దానినిబట్టి తరగతులచొప్పున యాజకులను వరుసలచొప్పున లేవీయులను నిర్ణయించిరి.

19 చెరలోనుండి విడుదలనొందినవారు మొదటి నెల పదునాలుగవదినమున పస్కాపండుగ ఆచరించిరి.౹

20 యాజకులును లేవీయులును తమ్మును తాము పవిత్రపరచుకొని పవిత్రులైన తరువాత, చెరలోనుండి విడుదలనొందిన వారందరికొరకును తమ బంధువులైన యాజకులకొరకును తమకొరకును పస్కాపశువును వధించిరి.౹

21 కావున చెరలోనుండి విడుదలనొంది తిరిగివచ్చిన ఇశ్రాయేలీయులును, ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాను ఆశ్రయించుటకై దేశమందుండు అన్యజనులలో అపవిత్రతనుండి తమ్మును తాము ప్రత్యేకించుకొనిన వారందరును వచ్చి,తిని పులియనిరొట్టెల పండుగను ఏడు దినములు ఆనందముతో ఆచరించిరి.౹

22 ఏలయనగా ఇశ్రాయేలీయుల దేవుని మందిరపు పనివిషయమై వారి చేతులను బలపరచుటకు యెహోవా అష్షూరురాజు హృదయమునువారివైపు త్రిప్పి వారిని సంతోషింపజేసెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZR/6-0cf77f60f1d10d2f6d64dbe1756e595f.mp3?version_id=1787—

Categories
ఎజ్రా

ఎజ్రా 7

1 ఈ సంగతులు జరిగినపిమ్మట పారసీకదేశపు రాజైన అర్తహషస్తయొక్క యేలుబడిలో ఎజ్రా బబులోను దేశమునుండి యెరూషలేముపట్టణమునకు వచ్చెను. ఇతడు శెరాయా కుమారుడైయుండెను, శెరాయా అజర్యా కుమారుడు అజర్యా హిల్కీయా కుమారుడు

2 హిల్కీయా షల్లూము కుమారుడు షల్లూము సాదోకు కుమారుడు సాదోకు అహీటూబు కుమారుడు

3 అహీటూబు అమర్యా కుమారుడు అమర్యా అజర్యా కుమారుడు అజర్యా మెరాయోతు కుమారుడు

4 మెరాయోతు జెరహ్యా కుమారుడు జెరహ్యా ఉజ్జీ కుమారుడు ఉజ్జీ బుక్కీ కుమారుడు

5 బుక్కీ అబీషూవ కుమారుడు అబీషూవ ఫీనెహాసు కుమారుడు ఫీనెహాసు ఎలియాజరు కుమారుడు ఎలియాజరు ప్రధానయాజకుడైన అహరోను కుమారుడు.౹

6 ఈ ఎజ్రా ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషేయొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణతగల శాస్త్రి. మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును.౹

7 మరియు రాజైన అర్తహషస్త ఏలుబడియందు ఏడవ సంవత్సరమున ఇశ్రాయేలీయులు కొందరును యాజకులు కొందరును లేవీయులును గాయకులును ద్వారపాలకులును నెతీనీయులును బయలుదేరి యెరూషలేము పట్టణమునకు వచ్చిరి.౹

8 రాజు ఏలుబడియందు ఏడవ సంవత్సరము అయిదవ మాసమున ఎజ్రా యెరూషలేమునకు వచ్చెను.౹

9 మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశమునుండి బయలుదేరి, తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగానున్నందున అయిదవ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను.౹

10 ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడచుకొనుటకును, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢనిశ్చయము చేసికొనెను.

11 యెహోవా ఆజ్ఞల వాక్యములయందును, ఆయన ఇశ్రాయేలీయులకు విధించిన కట్టడలయందును శాస్త్రియు యాజకుడునైన ఎజ్రాకు రాజైన అర్తహషస్త యిచ్చిన తాకీదు నకలు

12 –రాజైన అర్తహషస్త, ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రియు యాజకుడునైన ఎజ్రాకు క్షేమము, మొదలగు మాటలు వ్రాసి యీలాగు సెలవిచ్చెను

13 –చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమునుబట్టి యూదానుగూర్చియు యెరూషలేమునుగూర్చియు విమర్శచేయుటకు నీవు రాజుచేతను అతని యేడుగురు మంత్రులచేతను పంపబడితివి గనుక మేము చేసిన నిర్ణయ మేమనగా,౹

14 మా రాజ్యమందుండు ఇశ్రాయేలీయులలోను వారి యాజకులలోను లేవీయులలోను యెరూషలేము పట్టణమునకు వెళ్లుటకు మనఃపూర్వకముగా ఇష్టపడు వారెవరో వారందరు నీతోకూడ వెళ్లవచ్చును.౹

15 మరియు యెరూషలేములో నివాసముగల ఇశ్రాయేలీయుల దేవునికి రాజును అతనియొక్క మంత్రులును స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారములను నీవు తీసికొని పోవలెను.౹

16 మరియు బబులోను ప్రదేశమందంతట నీకు దొరకు వెండి బంగారములంతయును, జనులును యాజకులును యెరూషలేములోనున్న తమ దేవుని మందిరమునకు స్వేచ్ఛగా అర్పించు వస్తువులను నీవు తీసికొని పోవలెను.౹

17 తడవు చేయక నీవు ఆ ద్రవ్యముచేత ఎడ్లను పొట్లేళ్లను గొఱ్ఱెపిల్లలను, వాటితోకూడ ఉండవలసిన భోజనార్పణలను పానార్పణలనుకొని, యెరూషలేమందుండు మీ దేవుని మందిరపు బలిపీఠము మీద వాటిని అర్పించుము.౹

18 మిగిలిన వెండి బంగారములతో మీ దేవుని చిత్తానుసారముగా నీకును నీ వారికిని యుక్తమని తోచినదానిని చేయ వచ్చును.౹

19 మరియు నీ దేవుని మందిరపు సేవకొరకు నీకియ్యబడిన ఉపకరణములను నీవు యెరూషలేములోని దేవుని యెదుట అప్పగింపవలెను.౹

20 నీ దేవుని మందిర విషయములో దానమిచ్చుటకై మరి ఏదైనను నీకు కావలసినయెడల అది రాజుయొక్క ఖజానాలోనుండి నీకియ్యబడును.౹

21 మరియు–రాజునైన అర్తహషస్త అను నేనే నది యవతలనున్న ఖజానాదారులైన మీకు ఇచ్చు ఆజ్ఞ యేదనగా, ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రములో శాస్త్రియు యాజకుడునైన ఎజ్రా మిమ్మును ఏదైన అడిగినయెడల ఆలస్యముకాకుండ మీరు దాని చేయవలెను.౹

22 వెయ్యి తూముల గోధుమలు రెండువందల మణుగుల వెండి మూడువందల తూముల ద్రాక్షారసము మూడువందల తూముల నూనె లెక్కలేకుండ ఉప్పును ఇయ్యవలెను.౹

23 ఆకాశమందలి దేవునిచేత ఏది నిర్ణయమాయెనో దాని ఆకాశమందలి దేవుని మందిరమునకు జాగ్రత్తగా చేయింప వలసినది. రాజుయొక్క రాజ్యముమీదికిని అతని కుమారులమీదికిని కోపమెందుకు రావలెను?

24 మరియు యాజకులును లేవీయులును గాయకులును ద్వారపాలకులును నెతీనీయులును, దేవుని మందిరపు సేవకులునైన వారందరిని గూర్చి మేము మీకు నిర్ణయించినదేమనగా, వారికి శిస్తుగాని సుంకముగాని పన్నుగాని వేయుట కట్టడపు న్యాయము కాదని తెలిసికొనుడి.౹

25 మరియు ఎజ్రా, నది యవతలనున్న జనులకు తీర్పు తీర్చుటకై నీ దేవుడు నీకు దయచేసిన జ్ఞానముచొప్పున నీవు నీ దేవునియొక్క ధర్మశాస్త్రవిధులను తెలిసికొనినవారిలో కొందరిని అధికారులగాను న్యాయాధిపతులగాను ఉంచవలెను, ఆ ధర్మశాస్త్రవిషయములో తెలియని వారెవరో వారికి నేర్పవలెను.౹

26 నీ దేవుని ధర్మశాస్త్రముగాని, రాజుయొక్క చట్టము గాని, గైకొననివాడెవడో త్వరగా విచారణచేసి, మరణశిక్షయైనను స్వదేశత్యాగమైనను ఆస్తి జప్తియైనను ఖైదునైనను వానికి విధింపవలెను.

27 యెరూషలేములోనుండు యెహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందునను, రాజును అతని మంత్రులును రాజుయొక్క మహాధిపతులును నాకు దయ అనుగ్రహింపజేసినందునను, మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక.౹

28 నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి, నాతోకూడ వచ్చుటకు ఇశ్రాయేలీయుల ప్రధానులను సమకూర్చితిని.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZR/7-1f055e340a132e2f7bc118c7857c7445.mp3?version_id=1787—