Categories
2 దినవృత్తాంతములు

2 దినవృత్తాంతములు 24

1 యోవాషు ఏలనారంభించినప్పుడు ఏడు సంవత్స. రముల యీడుగలవాడై యెరూషలేములో నలువది ఏండ్లు ఏలెను; అతని తల్లి బెయేర్షెబా కాపురస్థురాలైన జిబ్యా.౹

2 యాజకుడైన యెహోయాదా బ్రదికిన దినములన్నియు యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను.

3 యెహోయాదా అతనికి యిద్దరు భార్యలను పెండ్లి చేసెను; అతడు కుమారులను కుమార్తెలను కనెను.౹

4 అంతట యెహోవా మందిరమును బాగుచేయవలెనని యోవాషునకు తాత్పర్యము పుట్టెను గనుక

5 అతడు యాజకులను లేవీయులను సమకూర్చి–మీరు యూదా పట్టణములకు పోయి మీ దేవుని మందిరము బాగుచేయుటకై ఇశ్రాయేలీయులందరియొద్దనుండి ధనమును ఏటేట సమకూర్చుచు, ఈ కార్యమును మీరు త్వరపెట్టవలెనని వారికాజ్ఞ ఇచ్చెను. వారు దానిని త్వరగా చేయకపోయి నందున

6 రాజు ప్రధానయాజకుడగు యెహోయాదాను పిలిచి–ఆ దుర్మార్గురాలైన అతల్యా కుమారులు దేవుని మందిరమును పాడుచేసి, యెహోవామందిర సంబంధమైన ప్రతిష్ఠోపకరణముల నన్నిటిని బయలుదేవతపూజకు ఉప యోగించిరి.౹

7 సాక్ష్యపు గుడారమును బాగుచేయుటకై యూదాలోనుండియు యెరూషలేములోనుండియు ఇశ్రాయేలీయుల సమాజముచేత యెహోవా సేవకుడైన మోషే నిర్ణయించిన కానుకను లేవీయులతో నీ వెందుకు చెప్పి తెప్పించలేదని యడిగెను.౹

8 కాబట్టి రాజు ఆజ్ఞ చొప్పునవారు ఒక పెట్టెను చేయించి యెహోవామందిరద్వారము బయట ఉంచిరి.౹

9 మరియు దేవుని సేవకుడైన మోషే అరణ్యమందు ఇశ్రాయేలీయులకు నిర్ణ యించిన కానుకను యెహోవాయొద్దకు జనులు తేవలెనని యూదాలోను యెరూషలేములోను వారు చాటించిరి.౹

10 కాగా అధిపతులందరును జనులందరును సంతోషముగా కానుకలను తీసికొని వచ్చి చాలినంతమట్టుకు పెట్టెలో వేసిరి.౹

11 లేవీయులు ఆ పెట్టెను రాజు విమర్శించు స్థలమునకు తెచ్చుచు వచ్చిరి; అందులో ద్రవ్యము విస్తారముగా నున్నట్టు కనబడినప్పుడెల్ల, రాజుయొక్క ప్రధానమంత్రియు ప్రధానయాజకుడు నియమించిన పై విచారణకర్తయు వచ్చి, పెట్టెలోనున్న ద్రవ్యమును తీసి యథాస్థానమందు దానిని ఉంచుచు వచ్చిరి; వారీచొప్పున పలుమారు చేయుటచేత విస్తారమైన ద్రవ్యము సమకూర్చబడెను.౹

12 అప్పుడు రాజును యెహోయాదాయును యెహోవా మందిరపు పనిచేయువారికి దానినిచ్చి, యెహోవా మందిరమును బాగుచేయుటకై కాసెవారిని వడ్లవారిని, యెహోవా మందిరమును బలపరచుటకు ఇనుపపని యిత్తడిపని చేయువారిని కూలికి కుదిర్చిరి.౹

13 ఈలాగున పనివారు పని జరిగించి సంపూర్తి చేసిరి. వారు దేవుని మందిరమును దాని యథాస్థితికి తెచ్చి దాని బలపరచిరి.౹

14 అది సిద్ధమైన తరువాత మిగిలిన ద్రవ్యమును రాజునొద్దకును యెహోయాదా యొద్దకును తీసికొనిరాగా వారు దాని చేత యెహోవా మందిరపు సేవయందు ఉపయోగపడునట్లును, దహనబలులనర్పించుటయందు ఉపయోగపడునట్లును, ఉపకరణములను గరిటెలను వెండి బంగారముల ఉపకరణములను చేయించిరి. యెహోయాదాయున్న యన్నిదినములు యెహోవా మందిరములో దహనబలులు నిత్యమును అర్పింపబడెను.

15 యెహోయాదా దినములు గడచిన వృద్ధుడై చని పోయెను; అతడు చనిపోయినప్పుడు నూట ముప్పది ఏండ్ల వాడు.౹

16 అతడు ఇశ్రాయేలీయులలో దేవునిదృష్టికిని తన యింటివారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించెను గనుక జనులు దావీదు పట్టణమందు రాజులదగ్గర అతని పాతిపెట్టిరి.౹

17 యెహోయాదా చనిపోయిన తరువాత యూదా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను.౹

18 జనులు తమపితరుల దేవుడైన యెహోవా మందిరమును విడచి, దేవతాస్తంభములకును విగ్రహములకును పూజచేసిరి; వారు చేసిన యీ యప రాధము నిమిత్తము యూదావారిమీదికిని యెరూషలేము కాపురస్థులమీదికిని కోపము వచ్చెను.౹

19 తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవావారియొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారిమీద సాక్ష్యము పలికిరిగాని వారు చెవియొగ్గక యుండిరి.౹

20 అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జెకర్యామీదికి రాగా అతడు జనులయెదుట నిలువబడి–మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు; మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మును విసర్జించియున్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనెను.౹

21 అందుకు వారతనిమీద కుట్రచేసి, రాజు మాటనుబట్టి యెహోవా మందిరపు ఆవరణములోపల రాళ్లు రువ్వి అతని చావగొట్టిరి.౹

22 ఈ ప్రకారము రాజైన యోవాషు జెకర్యా తండ్రియైన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరచినవాడై అతని కుమారుని చంపించెను; అతడు చనిపోవునప్పుడు–యెహోవా దీని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగాక యనెను.

23 ఆ సంవత్సరాంతమందు సిరియా సైన్యము యోవాషు మీదికి వచ్చెను; వారు యూదాదేశముమీదికిని యెరూషలేముమీదికిని వచ్చి, శేషములేకుండ జనుల అధిపతుల నందరిని హతముచేసి, తాము పట్టుకొనిన కొల్లసొమ్మంతయు దమస్కు రాజునొద్దకు పంపిరి.౹

24 సిరియనులు చిన్న దండుతో వచ్చినను యూదావారు తమపితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందుకై యెహోవావారి చేతికి అతివిస్తారమైన ఆ సైన్యమును అప్పగింపగా యోవాషుకు శిక్ష కలిగెను.౹

25 వారు యోవాషును విడచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగియైయుండెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారుల ప్రాణహత్యదోషము నిమిత్తము అతని సేవకులు అతనిమీద కుట్రచేసి, అతడు పడకమీద ఉండగా అతని చంపిరి. అతడు చనిపోయిన తరువాత జనులు దావీదు పట్టణమందు అతని పాతిపెట్టిరిగాని రాజుల సమాధులలో అతని పాతిపెట్టలేదు.౹

26 అతనిమీద కుట్రచేసినవారు అమ్మోనీయురాలైన షిమాతు కుమారుడగు జాబాదు, మోయాబురాలైన షిమ్రీతు కుమారుడగు యెహోజాబాదు అనువారు.౹

27 అతని కుమారులనుగూర్చియు, అతనిమీద చెప్పబడిన అనేకమైన దేవోక్తులనుగూర్చియు, అతడు దేవుని మందిరమును బాగుచేయుటనుగూర్చియు రాజుల సటీక గ్రంథములో వ్రాయబడి యున్నది. అతనికి బదులుగా అతని కుమారుడైన అమజ్యా రాజాయెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2CH/24-0a22b73a59ca491f882d52edc9c9e227.mp3?version_id=1787—

Categories
2 దినవృత్తాంతములు

2 దినవృత్తాంతములు 25

1 అమజ్యా యేలనారంభించినప్పుడు ఇరువదియయిదేండ్లవాడై యిరువది తొమ్మిది సంవత్సరములు యెరూషలేములో ఏలెను; అతని తల్లి యెరూషలేము కాపురస్థు రాలు, ఆమె పేరు యెహోయద్దాను.౹

2 అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెనుగాని పూర్ణహృదయముతో ఆయనను అనుసరింపలేదు.౹

3 రాజ్యము తనకు స్థిరమైనప్పుడు అతడు రాజైన తన తండ్రిని చంపిన రాజసేవకులను చంపించెను.౹

4 అయితే–తండ్రులు పిల్లలకొరకును పిల్లలు తండ్రులకొరకును చావకూడదు, ప్రతి మనిషి తన పాపముకొరకు తానే చావవలెనని మోషే గ్రంథ మందలి ధర్మశాస్త్రమునందు వ్రాయబడియున్న యెహోవా ఆజ్ఞనుబట్టి అతడు వారి పిల్లలను చంపక మానెను.

5 అమజ్యా యూదావారినందరిని సమకూర్చి యూదా దేశమంతటను బెన్యామీనీయుల దేశమంతటను వారివారి పితరులయిండ్లనుబట్టి సహస్రాధిపతులను శతాధిపతులను నియమించెను. అతడు ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పై ప్రాయముగల వారిని లెక్కింపగా, ఈటెను డాళ్లను పట్టుకొని యుద్ధమునకు పోదగినట్టి యోధులు మూడులక్షలమంది కనబడిరి.౹

6 మరియు అతడు ఇశ్రాయేలువారిలోనుండి లక్షమంది పరాక్రమశాలులను రెండువందల మణుగుల వెండికి కుదిర్చెను.౹

7 దైవజనుడైన యొకడు అతనియొద్దకు వచ్చి–రాజా, ఇశ్రాయేలువారి సైన్యమును నీతోకూడ తీసికొనిపోవద్దు, యెహోవా ఇశ్రాయేలువారగు ఎఫ్రాయిమీయులలో ఎవరికిని తోడుగా ఉండడు.౹

8 ఆలాగు పోవలెనని నీకున్నయెడల పొమ్ము, యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువు ఎదుట నిన్ను కూల్చును; నిలువబెట్టుటయు పడవేయు టయు దేవునివశమేగదా అని ప్రకటింపగా

9 అమజ్యా దైవజనుని చూచి–ఇశ్రాయేలువారి సైన్యమునకు నేనిచ్చిన రెండువందల మణుగుల వెండికి ఏమి చేసెదమని అడిగినందుకు–దీనికంటె మరి యధికముగా యెహోవా నీకు ఇయ్యగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరమిచ్చెను.౹

10 అప్పుడు అమజ్యా ఎఫ్రాయిములోనుండి తనయొద్దకు వచ్చిన సైన్యమును వేరుపరచి–మీ యిండ్లకు తిరిగి వెళ్లు డని వారికి సెలవిచ్చెను; అందుకు వారి కోపము యూదావారిమీద బహుగా రగులుకొనెను, వారు ఉగ్రులై తమ యిండ్లకు తిరిగి పోయిరి.౹

11 అంతట అమజ్యా ధైర్యము తెచ్చుకొని తన జనులతోకూడ బయలుదేరి ఉప్పుపల్లపు స్థలమునకు పోయి శేయీరువారిలో పదివేలమందిని హతము చేసెను.౹

12 ప్రాణముతోనున్న మరి పదివేలమందిని యూదావారు చెరపట్టుకొని, వారిని ఒక పేటుమీదికి తీసికొనిపోయి ఆ పేటుమీదనుండి వారిని పడవేయగా వారు తుత్తునియలైపోయిరి.౹

13 అయితే తనతోకూడ యుద్ధమునకు రావద్దని అమజ్యా తిరిగి పంపివేసిన సైనికులు షోమ్రోను మొదలుకొని బేత్‌హోరోనువరకు ఉన్న యూదాపట్టణములమీదపడి వారిలో మూడు వేలమందిని హతముచేసి విస్తారమైన కొల్లసొమ్ము పట్టుకొనిపోయిరి.

14 అమజ్యా ఎదోమీయులను ఓడించితిరిగి వచ్చిన తరువాత అతడు శేయీరువారి దేవతలను తీసికొనివచ్చి తనకు దేవతలుగా నిలిపి వాటికి నమస్కరించి ధూపము వేసెను.౹

15 అందుకొరకు యెహోవా కోపము అమజ్యామీద రగులుకొనెను. ఆయన అతనియొద్దకు ప్రవక్తను ఒకని పంపగా అతడు–నీ చేతిలోనుండి తమ జనులను విడిపింప శక్తిలేని దేవతలయొద్ద నీవెందుకు విచారణ చేయుదువని అమజ్యాతోననెను.౹

16 అతడు అమజ్యాతో మాటలాడుచుండగా రాజు అతని చూచి–నీవు రాజుయొక్క ఆలోచనకర్తలలో ఒకడవైతివా? ఊరకొనుము; నేను నిన్ను చంపనేల అని చెప్పగా ఆ ప్రవక్త–నీవు ఈలాగున చేసి నా ఆలోచనను అంగీకరింపకపోవుట చూచి దేవుడు నిన్ను నశింపజేయనుద్దేశించియున్నాడని నాకు తెలియునని చెప్పి యూరకొనెను.

17 అప్పుడు యూదారాజైన అమజ్యా ఆలోచనచేసికొని –రమ్ము మనము ఒకరి ముఖమును ఒకరము చూచుకొందమని యెహూకు పుట్టిన యెహోయాహాజు కుమారుడును ఇశ్రాయేలురాజునైన యెహోయాషునొద్దకు వర్తమానము పంపెను.౹

18 కాగా ఇశ్రాయేలురాజైన యెహోయాషు యూదారాజైన అమజ్యాకు ఈలాగు తిరుగ వర్తమానము పంపెను–నీ కుమార్తెను నా కుమారునికిమ్మని లెబానోనులో నున్న ముండ్లచెట్టు లెబానోనులోనున్న దేవదారువృక్షమునకు వర్తమానము పంపగా లెబానోనులో సంచరించు ఒక దుష్టమృగము ఆ ముండ్లచెట్టును త్రొక్కివేసెను.౹

19 –నేను ఎదోమీయులను ఓడించితిని గదా యని నీవను కొనుచున్నావు; నీ హృదయము నీవు గర్వించి ప్రగ ల్భము లాడునట్లు చేయుచున్నది; యింటియొద్ద నిలిచి యుండుము; నీవు నా జోలికి వచ్చి కీడు తెచ్చుకొనుట యెందుకు? నీవును నీతోకూడ యూదావారును అపజయ మొందుట యెందుకు?

20 జనులు ఎదోమీయుల దేవతలయొద్ద విచారణ చేయుచు వచ్చిరి గనుక వారి శత్రువుల చేతికి వారు అప్పగింపబడునట్లు దేవుని ప్రేరణవలన అమజ్యా ఆ వర్తమానమును అంగీకరింపక పోయెను.౹

21 ఇశ్రాయేలురాజైన యెహోయాషు బయలుదేరగా యూదా దేశమునకు చేరిన బేత్షెమెషులో అతడును యూదా రాజైన అమజ్యాయును ఒకరి ముఖము ఒకరు చూచుకొనిరి.౹

22 యూదావారు ఇశ్రాయేలువారియెదుట నిలువలేక ఓడిపోగా ప్రతివాడును తన తన గుడారమునకు పారిపోయెను.౹

23 అప్పుడు ఇశ్రాయేలురాజైన యెహోయాషు యెహోయాహాజునకు పుట్టిన యోవాషు కుమారుడును యూదారాజునైన అమజ్యాను బేత్షెమెషులో పట్టుకొని యెరూషలేమునకు తీసికొని వచ్చి, యెరూషలేము ప్రాకారమును ఎఫ్రాయిము గుమ్మము మొదలుకొని మూలగుమ్మమువరకు నాలుగువందల మూరల పొడుగున పడ గొట్టెను.౹

24 అతడు దేవుని మందిరములో ఓబేదెదోము నొద్దనున్న వెండియంతయు బంగారమంతయు ఉపకరణములన్నియు రాజు నగరునందున్న సొమ్మును కుదవపెట్ట బడినవారిని తీసికొని షోమ్రోనునకు తిరిగి వెళ్లెను.

25 ఇశ్రాయేలురాజును యెహోయాహాజు కుమారుడునైన యెహోయాషు మరణమైన తరువాత యూదా రాజును యోవాషు కుమారుడునైన అమజ్యా పదునయిదు సంవత్సరములు బ్రదికెను.౹

26 అమజ్యా చేసిన యితర కార్యములు యూదా ఇశ్రాయేలురాజుల గ్రంథమందు వ్రాయబడియున్నవి.౹

27 అమజ్యా యెహోవాను అనుసరించుట మానివేసిన తరువాత జనులు యెరూషలేములో అతనిమీద కుట్రచేయగా అతడు లాకీషునకు పారి పోయెను.౹

28 అయితే వారు అతని వెనుక లాకీషునకు మనుష్యులను పంపి అతని అక్కడ చంపి, గుఱ్ఱములమీద అతని శవము ఎక్కించి తీసికొనివచ్చి యూదాపట్టణమందు అతని తండ్రులయొద్ద అతని పాతిపెట్టిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2CH/25-67b835d48899edf12c8d92c0e8d44130.mp3?version_id=1787—

Categories
2 దినవృత్తాంతములు

2 దినవృత్తాంతములు 26

1 అంతట యూదా జనులందరును పదునారేండ్ల వాడైన ఉజ్జియాను తీసికొని అతని తండ్రియైన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి.౹

2 అతడు ఏలతును కట్టించి, రాజగు తన తండ్రి అతని పితరులతోకూడ నిద్రించిన తరువాత అది యూదావారికి తిరిగి వచ్చునట్లు చేసెను.

3 ఉజ్జియా యేలనారంభించినప్పుడు పదునారేండ్లవాడై యెరూషలేములో ఏబది రెండు సంవత్సరములు ఏలెను; అతని తల్లి యెరూషలేము కాపురస్థురాలు, ఆమె పేరు యెకొల్యా.౹

4 అతడు తన తండ్రియైన అమజ్యా చర్యయంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను.౹

5 దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జెకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను, అతడు యెహోవాను ఆశ్రయించినంతకాలము దేవుడు అతని వర్ధిల్ల జేసెను.౹

6 అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధముచేసి గాతు ప్రాకారమును యబ్నె ప్రాకారమును అష్డోదు ప్రాకారమును పడగొట్టి, అష్డోదు దేశములోను ఫిలిష్తీయుల ప్రదేశములలోను ప్రాకారపురములను కట్టించెను.౹

7 ఫిలిష్తీయులతోను గూర్బయలులో నివసించిన అరబీయులతోను మెహూనీయులతోను అతడు యుద్ధముచేయగా దేవుడు అతనికి సహాయము చేసెను.౹

8 అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి. అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటను వ్యాపించెను.౹

9 మరియు ఉజ్జియా యెరూషలేములో మూలగుమ్మము దగ్గరను, పల్లపుస్థలముల గుమ్మము దగ్గరను, ప్రాకారపు మూల దగ్గరను, దుర్గములను కట్టించి గుమ్మములు దిట్టపరచెను.౹

10 అదియుగాక షెఫేలా ప్రదేశములోను మైదాన ప్రదేశములోను అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించెను. వ్యవసాయమందు అతడు అపేక్షగలవాడు గనుక పర్వతములలోను కర్మెలులోను అతనికి వ్యవసాయకులును ద్రాక్ష తోట పనివారును కలిగియుండిరి.

11 యుద్ధమునకు ఉజ్జియాకు సైన్యము కలిగియుండెను; అందులోని యోధులు రాజు అధిపతులలో హనన్యా అనువాని చేతిక్రిందనుండిరి. ఖజానాదారుడగు మయ శేయాయు ప్రధానమంత్రియగు యెహీయేలును వారి లెక్క ఎంతైనది చూచి వారిని పటాలముగా ఏర్పరచువారై యుండిరి.౹

12 వారి పితరులయిండ్ల పెద్దల సంఖ్యనుబట్టి పరాక్రమశాలులు రెండువేల ఆరువందలమంది యైరి.౹

13 రాజునకు సహాయము చేయుటకై శత్రువులతో యుద్ధము చేయుటయందు పేరుపొందిన పరాక్రమశాలు లైన మూడులక్షల ఏడువేల ఐదువందలమందిగల సైన్యము వారి చేతిక్రింద ఉండెను.౹

14 ఉజ్జియా యీ సైన్యమంతటికి డాళ్లను ఈటెలను శిరస్త్రాణములను కవచములను విల్లులను వడిసెలలను చేయించెను.౹

15 మరియు అతడు అంబులనేమి పెద్దరాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయ శాలులు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడువరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను.

16 అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠముమీద ధూపమువేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవామీద ద్రోహముచేయగా

17 యాజకుడైన ఆజర్యాయు అతనితోకూడ ధైర్యవంతులైన యెహోవా యాజకులు ఎనుబదిమందియు అతని వెంబడి లోపలికి పోయిరి.౹

18 వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి –ఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుట ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతివారైన యాజకుల పనియేగాని నీ పని కాదు; పరిశుద్ధస్థలములోనుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసియున్నావు, దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగ జేయదని చెప్పగా

19 ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేతపట్టుకొని రౌద్రుడై, యాజకులమీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూప పీఠముప్రక్క నతడు ఉండగా యాజకులు చూచుచునే యున్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను.౹

20 ప్రధానయాజకుడైన అజర్యాయును యాజకులందరును అతనివైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడై యుండెను. గనుక వారు తడవుచేయక అక్కడనుండి అతనిని బయటికి వెళ్లగొట్టిరి; యెహోవా తన్ను మొత్తెనని యెరిగి బయటికి వెళ్లుటకు తానును త్వరపడెను.౹

21 రాజైన ఉజ్జియా తన మరణదినమువరకు కుష్ఠరోగియైయుండెను. కుష్ఠరోగియై యెహోవా మందిరములోనికి పోకుండ ప్రత్యేకింపబడెను గనుక అతడు ప్రత్యేకముగా ఒక యింటిలో నివసించుచుండెను; అతని కుమారుడైన యోతాము రాజు ఇంటివారికి అధిపతియై దేశపు జనులకు న్యాయము తీర్చుచుండెను.౹

22 ఉజ్జియా చేసిన యితర కార్యములనుగూర్చి ఆమోజు కుమారుడును ప్రవక్తయు నైన యెషయా వ్రాసెను.౹

23 ఉజ్జియా తన పితరులతోకూడ నిద్రించెను. అతడు కుష్ఠరోగియని రాజుల సంబంధమైన శ్మశానభూమిలో అతని పితరులదగ్గర అతని పాతిపెట్టిరి. అతని కుమారుడైన యోతాము అతనికి బదులుగా రాజాయెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2CH/26-b6b8033015c0e4676c8c962bc2a1aa2b.mp3?version_id=1787—

Categories
2 దినవృత్తాంతములు

2 దినవృత్తాంతములు 27

1 యోతాము ఏలనారంభించినప్పుడు ఇరువది. యయిదేండ్లవాడై యెరూషలేములో పదునారు సంవత్సరములు ఏలెను; అతని తల్లి సాదోకు కుమార్తె; ఆమె పేరు యెరూషా.౹

2 యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రియైన ఉజ్జియాయొక్క చర్యయంతటి ప్రకారముచేయుచు యెహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించెను; అతని కాలములో జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించుచుండిరి.౹

3 అతడు యెహోవా మందిరపు ఎత్తు ద్వారమును కట్టించి ఓపెలు దగ్గరనున్న గోడ చాలమట్టుకు కట్టించెను.౹

4 మరియు అతడు యూదా పర్వతములలో ప్రాకారపురములను కట్టించి అరణ్యములలో కోటలను దుర్గములను కట్టించెను.౹

5 అతడు అమ్మోనీయుల రాజుతో యుద్ధముచేసి జయించెను గనుక అమ్మోనీయులు ఆ సంవత్సరము అతనికి రెండు వందల మణుగుల వెండిని పదివేల కొలల గోధుమలను పదివేల కొలల యవలను ఇచ్చిరి; ఈ ప్రకారముగా అమ్మోనీయులు మరు సంవత్సరమును మూడవ సంవత్సరమును అతనికి చెల్లించిరి.౹

6 ఈలాగున యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచబడెను.౹

7 యోతాము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన యుద్ధములన్నిటిని గూర్చియు, అతని చర్యనుగూర్చియు ఇశ్రాయేలు యూదారాజుల గ్రంథమందు వ్రాయబడియున్నది.౹

8 అతడు ఏలనారం భించినప్పుడు ఇరువదియయిదేండ్లవాడై యెరూషలేములో పదునారు సంవత్సరములు ఏలెను.౹

9 యోతాము తన పితరులతోకూడ నిద్రించెను; అతడు దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను; అతని కుమారుడైన ఆహాజు అతనికి బదులుగా రాజాయెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2CH/27-7958e3042ece32b8a024fb5349b7fccf.mp3?version_id=1787—

Categories
2 దినవృత్తాంతములు

2 దినవృత్తాంతములు 28

1 ఆహాజు ఏలనారంభించినప్పుడు ఇరువది సంవత్సరములవాడై యెరూషలేములో పదునారు సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదువలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు.౹

2 అతడు ఇశ్రాయేలురాజుల మార్గములందు నడచి, బయలుదేవతా రూపములుగా పోతవిగ్రహములను చేయించెను.౹

3 మరియు అతడు బెన్‌హిన్నోము లోయయందు ధూపము వేసి ఇశ్రాయేలీయుల యెదుటనుండి యెహోవా తోలివేసిన జనముల హేయక్రియలచొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను.౹

4 అతడు ఉన్నతస్థలములలోను కొండలమీదను ప్రతి పచ్చనిచెట్టు క్రిందను బలులు అర్పించుచు ధూపము వేయుచు వచ్చెను.౹

5 అందుచేత అతని దేవుడైన యెహోవా అతనిని సిరియా రాజుచేతి కప్పగించెను. సిరియనులు అతని ఓడించి అతని జనులలో చాలమందిని చెరపట్టుకొని దమస్కునకు తీసికొనిపోయిరి. అతడును ఇశ్రాయేలురాజుచేతికి అప్పగింపబడెను; ఆ రాజు అతని లెస్సగా ఓడించెను.

6 రెమల్యా కుమారుడైన పెకహు యూదావారిలో పరాక్రమశాలులైన లక్ష ఇరువదివేలమందిని ఒక్కనాడు హతముచేసెను. వారు తమపితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున వారికిట్టి గతి పట్టెను.౹

7 పరాక్రమ శాలియైన ఎఫ్రాయిమీయుడగు జిఖ్రీ రాజసంతతివాడైన మయశేయాను సభాముఖ్యుడైన అజ్రీకామును ప్రధానమంత్రియైన ఎల్కొనానును హతము చేసెను.౹

8 ఇదియుగాక ఇశ్రాయేలువారు తమ సహోదరులైన వీరిలోనుండి స్త్రీలనేమి కుమారులనేమి కుమార్తెలనేమి రెండు లక్షలమందిని చెరతీసికొనిపోయిరి. మరియు వారియొద్దనుండి విస్తారమైన కొల్లసొమ్ము తీసికొని దానిని షోమ్రోనునకు తెచ్చిరి.౹

9 యెహోవా ప్రవక్తయగు ఓదేదు అను ఒకడు అచ్చట ఉండెను. అతడు షోమ్రోనునకు వచ్చిన సమూహము ఎదుటికిపోయి వారితో ఈలాగు చెప్పెను–ఆలకించుడి, మీపితరుల దేవుడైన యెహోవా యూదావారి మీద కోపించినందుచేత ఆయన వారిని మీ చేతికి అప్పగించెను; మీరు ఆకాశమునంటునంత రౌద్రముతో వారిని సంహరించితిరి.౹

10 ఇప్పుడు మీరు యూదావారిని యెరూషలేము కాపురస్థులను మీకొరకు దాసులుగాను దాసురాండ్రుగాను లోపరచుకొన దలచియున్నారు. మీ దేవుడైన యెహోవా దృష్టికి మీరు మాత్రము అపరాధులు కాకయున్నారా?

11 యెహోవా మహోగ్రత మీమీద రేగియున్నది గనుక నా మాట ఆలకించి మీ సహోదరులలోనుండి మీరు చెరపెట్టిన వీరిని విడచి పెట్టుడి.

12 అప్పుడు ఎఫ్రాయిమీయుల పెద్దలలో యోహానాను కుమారుడైన అజర్యా మెషిల్లేమోతు కుమారుడైన బెరెక్యా షల్లూము కుమారుడైన యెహిజ్కియా హద్లాయి కుమారుడైన అమాశా అనువారు యుద్ధమునుండి వచ్చినవారికి ఎదురుగా నిలువబడి వారితో ఇట్లనిరి

13 –యెహోవా మన మీదికి అపరాధశిక్ష రప్పించునట్లు మీరు చేసియున్నారు. చెరపెట్టిన వీరిని మీరు ఇక్కడికి రప్పింపకూడదు. మన పాపములను అపరాధములను పెంపుజేయుటకు మీరు పూనుకొని యున్నారు; మన అపరాధము అధికమై యున్నది. ఇశ్రాయేలువారమైన మన మీద మహోగ్రత రేగియున్నది.౹

14 కాగా అధిపతులును సమాజముగా కూడినవారును కన్నులార చూచుచుండగా ఆయుధస్థులు చెరపెట్టినవారిని కొల్లసొమ్మును విడచిపెట్టిరి.౹

15 పేళ్లు ఉదాహరింపబడినవారు అప్పుడు లేచి చెరపట్టబడిన వారిని చేపెట్టి దోపుసొమ్ముచేత వారిలో వస్త్రహీనులైన వారికి బట్టలు కట్టించి వారికి వస్త్రములను పాదరక్షలను ధరింపజేసి అన్నపానములిచ్చి తలలకు నూనె బెట్టించి వారిలో బలహీనులైన వారిని గాడిదలమీద ఎక్కించి ఖర్జూరవృక్షములుగల పట్టణమగు యెరికోకు వారి సహోదరులయొద్దకు వారిని తోడుకొనివచ్చిరి; తరువాత వారు షోమ్రోనునకు మరలి వెళ్లిరి.

16 ఆ కాలమందు ఎదోమీయులు మరల వచ్చి యూదా దేశమును పాడుచేసి కొందరిని చెరపట్టుకొని పోగా

17 రాజైన ఆహాజు తనకు సహాయము చేయుడని అష్షూరు రాజులయొద్దకు వర్తమానము పంపెను.౹

18 ఫిలిష్తీయులు షెఫేలా ప్రదేశములోని పట్టణములమీదను యూదా దేశమునకు దక్షిణపు దిక్కుననున్న పట్టణములమీదను పడి బేత్షెమెషును అయ్యాలోనును గెదెరోతును శోకోను దాని గ్రామములను, తిమ్నాను దాని గ్రామములను, గిమ్జోనును దాని గ్రామములను ఆక్రమించుకొని అక్కడ కాపురముండిరి.౹

19 ఆహాజు యూదాదేశమును దిగంబరినిగా చేసి యెహోవాకు ద్రోహము చేసియుండెను గనుక యెహోవా ఇశ్రాయేలురాజైన ఆహాజు చేసిన దానినిబట్టి యూదావారిని హీనపరచెను.౹

20 అష్షూరురాజైన తిగ్లత్పిలేసెరు అతనియొద్దకు వచ్చి అతని బాధపరచెనేగాని అతని బలపరచలేదు.౹

21 ఆహాజు భాగము లేర్పరచి, యెహోవా మందిరములోనుండి యొక భాగమును, రాజనగరులోనుండి యొక భాగమును, అధిపతులయొద్ద నుండి యొక భాగమును తీసి అష్షూరు రాజున కిచ్చెనుగాని అతడు అతనికి సహాయము చేయలేదు.౹

22 ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరి యధికముగా అతిక్రమములు జరిగించెను; అట్లు చేసినవాడు ఈ ఆహాజు రాజే.౹

23 ఎట్లనగా–సిరియా రాజుల దేవతలు వారికి సహాయము చేయుచున్నవి గనుక వాటి సహాయము నాకును కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించెదననుకొని, తన్ను ఓడించిన దమస్కువారి దేవతలకు బలులు అర్పించెను; అయితే అవి అతనికిని ఇశ్రాయేలువారికిని నష్టమునకే హేతువులాయెను.౹

24 ఆహాజు దేవుని మందిరపు ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేమునందంతట బలిపీఠములను కట్టించెను.౹

25 యూదా దేశములోని పట్టణములన్నిటిలోను అతడు అన్యుల దేవతలకు ధూపము వేయుటకై బలిపీఠములను కట్టించి, తన పితరుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను.౹

26 అతడుచేసిన యితర కార్యములనుగూర్చియు, అతని చర్యయంతటిని గూర్చియు యూదా ఇశ్రాయేలురాజుల గ్రంథమందు వ్రాయబడియున్నది.౹

27 ఆహాజు తన పితరులతోకూడ నిద్రించి యెరూషలేము పట్టణమునందు పాతిపెట్టబడెనుగాని ఇశ్రాయేలీయుల రాజుల సమాధులకు అతడు తేబడలేదు. అతని కుమారుడైన హిజ్కియా అతనికి బదులుగా రాజాయెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2CH/28-3364c7a341960702a7afbff11e6d6b7a.mp3?version_id=1787—

Categories
2 దినవృత్తాంతములు

2 దినవృత్తాంతములు 29

1 హిజ్కియా యేలనారంభించినప్పుడు ఇరువదియయిదేండ్లవాడై యిరువదితొమ్మిది సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జెకర్యా కుమార్తె, ఆమె పేరు అబీయా.౹

2 అతడు తన పితరుడగు దావీదు చర్యయంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను.౹

3 అతడు తన యేలుబడియందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగుచేసి,౹

4 యాజకులను లేవీయులను పిలువనంపి, తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి

5 వారికీలాగు ఆజ్ఞ ఇచ్చెను–లేవీయులారా, నా మాట ఆలకించుడి; ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని, మీపితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధస్థలములోనుండి నిషిద్ధ వస్తువుల నన్నిటిని బయటికి కొనిపోవుడి.౹

6 మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడునడతలు నడచి ఆయనను విసర్జించి, ఆయన నివాసమునకు పెడ ముఖము పెట్టుకొని దానిని అలక్ష్యముచేసిరి.౹

7 మరియు వారు మంటపముయొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి, పరిశుద్ధస్థలమందు ఇశ్రాయేలీయులు దేవునికి ధూపము వేయకయు దహనబలులను అర్పింపకయు ఉండిరి.౹

8 అందుచేత యెహోవా యూదావారిమీదను యెరూషలేము కాపురస్థులమీదను కోపించి, మీరు కన్నులార చూచుచున్నట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయమునకును నిందకును ఆస్పదముగాచేసెను.౹

9 కాబట్టి మన తండ్రులు కత్తిచేత పడిరి; మన కుమారులును కుమార్తెలును భార్యలును చెరలోనికి కొనపోబడిరి.౹

10 ఇప్పుడు మనమీద నున్న ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలెనని నా మనస్సులో అభిలాష పుట్టెను.౹

11 నా కుమారులారా, తనకు పరిచారకులైయుండి ధూపము వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధచేయకుడి.

12 అప్పుడు కహాతీయులలో అమాశై కుమారుడైన మహతు అజర్యా కుమారుడైన యోవేలు, మెరారీయులలో అబ్దీ కుమారుడైన కీషు యెహాల్లెలేలు కుమారుడైన అజర్యా, గెర్షోనీయులలో జిమ్మా కుమారుడైన యోవాహు యోవాహు కుమారుడైన ఏదేను

13 ఎలీషాపాను సంతతి వారిలో షిమ్రీ యెహీయేలు, ఆసాపు కుమారులలో జెకర్యా మత్తన్యా

14 హేమాను సంతతివారిలో యెహీయేలు షిమీ, యెదూతూను సంతతివారిలో షెమయా ఉజ్జీయేలు అను లేవీయులు నియమించబడిరి.౹

15 వీరు తమ సహోదరులను సమకూర్చి తమ్మును ప్రతిష్ఠించుకొని యెహోవా మాటలనుబట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞచొప్పున యెహోవా మందిరమును పవిత్రపరచుటకు వచ్చిరి.౹

16 పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధవస్తువులన్నిటిని యెహోవా మందిరపు ఆవరణములోనికి తీసికొనిరాగా లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి.౹

17 మొదటి నెల మొదటి దినమునవారు ప్రతిష్ఠచేయ నారంభించి, ఆ నెల యెనిమిదవదినమున యెహోవా మంటపమునకు వచ్చిరి. ఈ ప్రకారము వారు ఎనిమిది దినములు యెహోవా మందిరమును ప్రతిష్ఠించుచు మొదటి నెల పదునారవదినమున సమాప్తి చేసిరి.

18 అప్పుడు వారు రాజైన హిజ్కియాయొద్దకు పోయి– మేము యెహోవామందిరమంతటిని దహనబలిపీఠమును ఉపకరణములన్నిటిని సన్నిధి రొట్టెలుంచు బల్లను పవిత్రపరచియున్నాము.౹

19 మరియు రాజైన ఆహాజు ఏలిన కాలమున అతడు ద్రోహముచేసి పారవేసిన ఉపకరణములన్నిటిని మేము సిద్ధపరచి ప్రతిష్ఠించియున్నాము, అవి యెహోవా బలిపీఠము ఎదుట ఉన్నవని చెప్పిరి.

20 అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడలేచి, పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను.౹

21 రాజ్యముకొరకును పరిశుద్ధస్థలముకొరకును యూదావారికొరకును పాపపరిహారార్థబలి చేయుటకై యేడు కోడెలను ఏడు పొట్టేళ్లను ఏడు గొఱ్ఱెపిల్లలను ఏడు మేకపోతులను వారు తెచ్చియుంచిరి గనుక అతడు –యెహోవా బలిపీఠముమీద వాటిని అర్పించుడని అహరోను సంతతివారగు యాజకులకు ఆజ్ఞాపించెను.౹

22 పరిచారకులు ఆ కోడెలను వధించినప్పుడు యాజకులు వాటి రక్తమును తీసికొని బలిపీఠముమీద ప్రోక్షించిరి. ఆప్రకారము వారు పొట్లేళ్లను వధించినప్పుడు యాజకులు ఆ రక్తమును బలిపీఠముమీద ప్రోక్షించిరి. వారు గొఱ్ఱెపిల్లలను వధించినప్పుడు ఆ రక్తమును బలిపీఠముమీద ప్రోక్షించిరి.౹

23 పాపపరిహారార్థబలికై రాజు ఎదుటికిని సమాజము ఎదుటికిని మేకపోతులను తీసికొనిరాగా, వారు తమ చేతులను వాటిమీద ఉంచిన తరువాత యాజకులు వాటిని వధించి

24 ఇశ్రాయేలీయులందరికొరకు దహనబలియు పాపపరిహారార్థబలియు అర్పింపవలెనని రాజు ఆజ్ఞాపించి యుండెను గనుక, ఇశ్రాయేలీయులందరి నిమిత్తము ప్రాయ శ్చి త్తము చేయుటకై బలిపీఠముమీద వాటి రక్తమును పోసి, పాపపరిహారార్థబలి అర్పించిరి.౹

25 మరియు దావీదును దావీదు రాజుకు దీర్ఘదర్శియైన గాదును ప్రవక్తయైన నాతా నును చేసిన నిర్ణయముచొప్పున యెహోవా మందిరములో తాళములను స్వరమండలములను సితారాలను వాయించుటకై అతడు లేవీయులను ఏర్పాటుచేసెను. ఆలాగు జరుగవలెనని యెహోవా తన ప్రవక్తలద్వారా ఆజ్ఞాపించి యుండెను.౹

26 దావీదు చేయించిన వాద్యములను వాయించుటకు లేవీయులును బూరలు ఊదుటకు యాజకులును నియమింపబడిరి.౹

27 బలిపీఠముమీద దహనబలులను అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించెను. దహనబలి యర్పణ ఆరంభమగుటతోనే బూరలు ఊదుటతోను ఇశ్రాయేలురాజైన దావీదు చేయించిన వాద్యములను వాయించుటతోను యెహోవాకు స్తుతి గానము ఆరంభమాయెను.౹

28 అంత సేపును సర్వసమాజము ఆరాధించుచుండెను. గాయకులు పాడుచుండిరి, బూరలు ఊదువారు నాదముచేయుచుండిరి, దహనబలియర్పణ సమాప్తమగువరకు ఇదియంతయు జరుగుచుండెను.౹

29 వారు అర్పించుట ముగించిన తరువాత రాజును అతనితోకూడనున్నవారందరును తమ తలలు వంచి ఆరాధించిరి.౹

30 –దావీదును దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయును అధిపతులును లేవీయులకు ఆజ్ఞా పింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తలవంచి ఆరాధించిరి.

31 అంతట హిజ్కియా – మీరిప్పుడు యెహోవాకు మిమ్మును ప్రతిష్ఠించుకొంటిరి; దగ్గరకు వచ్చి యెహోవా మందిరములోనికి బలిద్రవ్యములను కృతజ్ఞతార్పణలను తీసికొనిరండని ఆజ్ఞ ఇయ్యగా సమాజపువారు బలిద్రవ్యములను కృతజ్ఞతార్పణలను తీసికొని వచ్చిరి, దహనబలులనర్పించుటకు ఎవరికి ఇష్టముపుట్టెనో వారు దహనబలిద్రవ్యములను తీసికొని వచ్చిరి.౹

32 సమాజపువారు తీసికొని వచ్చిన దహనబలి పశువులెన్నియనగా, డెబ్బది కోడెలును నూరు పొట్టేళ్లును రెండువందల గొఱ్ఱెపిల్లలును; ఇవియన్నియు యెహోవాకు దహనబలులుగా తేబడెను.౹

33 ప్రతిష్ఠింపబడినవి ఆరువందల ఎద్దులును మూడువేల గొఱ్ఱెలును.౹

34 యాజకులు కొద్దిగా ఉన్నందునవారు ఆ దహనబలి పశువులన్నిటిని ఒలువలేకపోగా, పని సంపూర్ణమగువరకు కడమయాజకులు తమ్మును ప్రతిష్ఠించుకొనువరకు వారి సహోదరులగు లేవీయులు వారికి సహాయము చేసిరి; తమ్మును ప్రతిష్ఠించుకొనుటయందు యాజకులకంటె లేవీయులు యథార్థహృదయులై యుండిరి.౹

35 సమాధానబలి పశువుల క్రొవ్వును దహనబలి పశువులును దహనబలులకు ఏర్పడిన పానార్పణలును సమృద్ధిగా ఉండెను. ఈలాగున యెహోవామందిరసేవ క్రమముగా జరిగెను.౹

36 ఈ కార్యము అప్పటికప్పుడే జరిగినందున దేవుడు జనులకు సిద్ధపరచినదానిని చూచి హిజ్కియాయును జనులందరును సంతోషించిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2CH/29-bd6c113ec10550b92c23e8e2fc7607b7.mp3?version_id=1787—

Categories
2 దినవృత్తాంతములు

2 దినవృత్తాంతములు 30

1 మరియు హిజ్కియా ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాకు పస్కాపండుగ ఆచరించుటకై యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు రావలసినదని ఇశ్రాయేలువారికందరికిని యూదావారికందరికిని వర్తమానములను, ఎఫ్రాయిమీయులకును మనష్షేవారికిని పత్రికలను పంపెను.౹

2 సేవకు చాలినంతమంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకుండుటచేతను, జనులు యెరూషలేములో కూడుకొనకుండుటచేతను, మొదటినెలయందు పస్కాపండుగ జరుగకపోగా

3 రాజును అతని అధిపతులును యెరూషలేములోనున్న సమాజపువారందరును దానిని రెండవనెలలో ఆచరింపవలెనని యోచనచేసిరి.౹

4 ఈ సంగతి రాజుకును సమాజపువారికందరికిని అనుకూల మాయెను.౹

5 కావున బహుకాలమునుండి వారు వ్రాయ బడిన ప్రకారము ఇంత ఘనముగా నాచరింపకుండుట చూచి, ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాకు యెరూషలేములో పస్కాపండుగ ఆచరించుటకై రావలసినదని బెయేర్షెబా మొదలుకొని దానువరకు ఇశ్రాయేలీయులుండు దేశమంతటను చాటింపవలెనని వారు నిర్ణయముచేసిరి.౹

6 కావున అంచెవాండ్రు రాజునొద్దను అతని అధిపతులయొద్దను తాకీదులు తీసికొని, యూదా ఇశ్రాయేలుదేశములందంతట సంచరించి రాజాజ్ఞను ఈలాగు ప్రచురము చేసిరి–ఇశ్రాయేలువారలారా, అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవావైపు తిరుగుడి; మీరు తిరిగినయెడల మీలో అష్షూరురాజుల చేతిలోనుండి తప్పించుకొని శేషించినవారివైపు ఆయన తిరుగును.౹

7 తమపితరుల దేవుడైన యెహోవాయెడల ద్రోహముగా ప్రవర్తించిన మీపితరులవలెను మీ సహోదరులవలెను మీరు ప్రవర్తింపకుడి. వారి ప్రవర్తన ఎట్టిదో మీకు అగపరచవలెనని ఆయన వారిని వినాశమునకు అప్పగించెను.౹

8 మీపితరులవలె మీరు అవిధేయులుగాక యెహోవాకు లోబడి, ఆయన శాశ్వతముగా పరిశుద్ధపర చిన ఆయన పరిశుద్ధమందిరములో ప్రవేశించి, మీ దేవుడైన యెహోవా మహోగ్రత మీ మీదినుండి తొలగి పోవునట్లు ఆయనను సేవించుడి.౹

9 మీరు యెహోవావైపు తిరిగినయెడల మీ సహోదరులయెడలను మీ పిల్లల యెడలను చెరతీసికొనిపోయిన వారికి కనికరము పుట్టును, వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడైన యెహోవా కరుణాకటాక్షములుగలవాడు గనుక మీరు ఆయనవైపు తిరిగినయెడల ఆయన మీయందు ప్రసన్ను డగును.

10 అంచెవాండ్రు జెబూలూను దేశమువరకును, ఎఫ్రాయిము మనష్షేల దేశములలోనున్న ప్రతి పట్టణమునకును పోయిరిగాని అచ్చటివారు ఎగతాళిచేసి వారిని అపహ సించిరి.౹

11 అయినను ఆషేరు మనష్షే జెబూలూను దేశములవారిలోనుండి కొందరు కృంగిన మనస్సుతో యెరూషలేమునకు వచ్చిరి.౹

12 యెహోవా ఆజ్ఞనుబట్టి రాజును అధిపతులును చేసిన నిర్ణయమును నెరవేర్చునట్లు యూదాలోనివారికి మనస్సు ఏకముచేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను.౹

13 కావున రెండవనెలయందు పులియని రొట్టెలపండుగ ఆచరించుటకై అతివిస్తారమైన సమాజముగా బహుజనులు యెరూషలేములో కూడిరి.౹

14 వారు దాని చేపెట్టి యెరూషలేములోనున్న బలిపీఠములను ధూపపీఠములను తీసివేసి, కిద్రోను వాగులో వాటిని పారవేసిరి.౹

15 రెండవనెల పదునాల్గవదినమునవారు పస్కాపశువును వధించిరి; యాజకులును లేవీయులును సిగ్గునొంది, తమ్మును ప్రతిష్ఠించుకొని దహనబలి పశువులను యెహోవా మందిరములోనికి తీసికొని వచ్చిరి.౹

16 దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రములోని విధినిబట్టి వారు తమ స్థలమందు నిలువబడగా, యాజకులు లేవీయుల చేతిలోనుండి రక్తమును తీసికొని దానిని ప్రోక్షించిరి.౹

17 సమాజకులలో తమ్మును ప్రతిష్ఠించుకొనని వారనేకు లుండుటచేత యెహోవాకు వాటిని ప్రతిష్ఠించుటకై ప్రతిష్ఠించుకొనని ప్రతివాని నిమిత్తము పస్కాపశువులను వధించుపని లేవీయుల కప్పగింపబడెను.౹

18 ఎఫ్రాయిము మనష్షే ఇశ్శాఖారు జెబూలూను దేశములనుండి వచ్చిన జనులలో చాలామంది తమ్మును తాము ప్రతిష్ఠించు కొనకయే విధివిరుద్ధముగా పస్కాను భుజింపగా హిజ్కియా

19 పరిశుద్ధస్థలముయొక్క శుద్ధీకరణముచొప్పున తన్ను పవిత్రపరచుకొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతి వాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగాక అని ప్రార్థింపగా

20 యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచెను.౹

21 యెరూషలేములోనున్న ఇశ్రాయేలువారు బహు సంతోష భరితులై పులియనిరొట్టెల పండుగను ఏడు దినములు ఆచరించిరి. లేవీయులును యాజకులును యెహోవాను ఘనపరచుచు గొప్ప నాదముగల వాద్యములతో ప్రతిదినము ఆయనను స్తుతించుచు ఉండిరి.౹

22 యెహోవా సేవయందు మంచి నేర్పరులైన లేవీయులందరితో హిజ్కియా ప్రీతిగా మాటలాడెను; వారు సమాధానబలులు అర్పించుచు, తమపితరుల దేవుడైన యెహోవా దేవుడని యొప్పుకొనుచు ఏడు దినములు పండుగ ఆచరించిరి.౹

23 యూదా రాజైన హిజ్కియా సమాజపువారికి బలియర్పణల నిమిత్తము వెయ్యి కోడెలను ఏడువేల గొఱ్ఱెల నిచ్చుటయు, అధిపతులు వెయ్యి కోడెలను పదివేల గొఱ్ఱెల నిచ్చుటయు, బహుమంది యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకొనుటయు

24 సమాజపు వారందరును చూచి నప్పుడు, మరి ఏడు దినములు పండుగ ఆచరింపవలెనని యోచనచేసికొని మరి ఏడు దినములు సంతోషముగా దాని ఆచరించిరి.౹

25 అప్పుడు యాజకులును లేవీయులును యూదావారిలోనుండియు ఇశ్రాయేలువారిలోనుండియు వచ్చిన సమాజపువారందరును, ఇశ్రాయేలుదేశములోనుండి వచ్చి యూదాలో కాపురమున్న అన్యులును సంతోషించిరి.౹

26 యెరూషలేము కాపురస్థులకు మిక్కిలి ఆనం దము కలిగెను. ఇశ్రాయేలురాజును దావీదు కుమారుడునైన సొలొమోను కాలమునకు తరువాత ఈలాగున జరిగి యుండలేదు.౹

27 అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారిమాటలు వినబడెను; వారి ప్రార్థన ఆకాశముననున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2CH/30-84dd4131ae4b4d759795f0be707f1e0a.mp3?version_id=1787—

Categories
2 దినవృత్తాంతములు

2 దినవృత్తాంతములు 31

1 ఇదంతయు సమాప్తమైన తరువాత అక్కడనున్న . ఇశ్రాయేలువారందరును యూదా పట్టణములకు పోయి, యూదాదేశమంతటను, బెన్యామీను ఎఫ్రాయిము మనష్షే దేశముల యందంతటను ఉన్న విగ్రహములను నిర్మూలముచేసి, దేవతాస్తంభములను ముక్కలుగా నరికి, ఉన్నతస్థలములను బలిపీఠములను పడగొట్టిరి; తరువాత ఇశ్రాయేలువారందరును తమతమ పట్టణములలోనున్న తమతమ స్వాస్థ్యములకు తిరిగి వెళ్లిరి

2 అంతట హిజ్కియా యెవరి సేవాధర్మము వారు జరుపుకొనునట్లుగా యాజకులను వరుసల ప్రకారముగాను, లేవీయులను వారి వారి వరుసల ప్రకారముగాను నియమించెను; దహనబలులను సమాధానబలులను అర్పించుటకును, సేవను జరిగించుటకును కృతజ్ఞతా స్తుతులు చెల్లించుటకును, యెహోవా పాళెపు ద్వారములయొద్ద స్తుతులు చేయుటకును యాజకులను లేవీయులను నియమించెను.౹

3 మరియు యెహోవా ధర్మశాస్త్రమునందు వ్రాయ బడియున్న విధినిబట్టి జరుగు ఉదయాస్తమయముల దహనబలులను విశ్రాంతిదినములకును అమావాస్యలకును నియా మకకాలములకును ఏర్పడియున్న దహనబలులను అర్పించుటకై తనకు కలిగిన ఆస్తిలోనుండి రాజు ఒక భాగమును ఏర్పాటుచేసెను.౹

4 మరియు యెహోవా ధర్మశాస్త్రమునుబట్టి యాజకులును లేవీయులును ధైర్యము వహించి తమ పని జరుపుకొనునట్లు ఎవరి భాగములను వారికి ఇయ్య వలసినదని యెరూషలేములో కాపురమున్న జనులకు అతడు ఆజ్ఞాపించెను.౹

5 ఆయాజ్ఞ వెల్లడియగుటతోడనే ఇశ్రాయేలీయులు ప్రథమఫలములైన ధాన్య ద్రాక్షారసములను నూనెను తేనెను సస్యఫలములను విస్తారముగా తీసికొని వచ్చిరి. సమస్తమైన వాటిలోనుండియు పదియవ వంతులను విస్తారముగా తీసికొని వచ్చిరి.౹

6 యూదా పట్టణములలో కాపురమున్న ఇశ్రాయేలువారును యూదావారును ఎద్దులలోను గొఱ్ఱెలలోను పదియవవంతును, తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితములైన వస్తువులలో పదియవ వంతును తీసికొని వచ్చి కుప్పలుగా కూర్చిరి.౹

7 వారు మూడవ మాసమందు కుప్పలువేయ నారంభించి ఏడవ మాసమందు ముగించిరి.౹

8 హిజ్కియాయును అధిపతులును వచ్చి ఆ కుప్పలను చూచి యెహోవాను స్తుతించి ఆయన జనులైన ఇశ్రాయేలీయులను దీవించిరి.౹

9 హిజ్కియా ఆ కుప్పలనుగూర్చి యాజకులను లేవీయులను ఆలోచన యడిగినందుకు సాదోకు సంతతివాడును ప్రధానయాజకుడునగు అజర్యా

10 –యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలుపెట్టినప్పటినుండి మేము సమృద్ధిగా భోజనముచేసినను చాలా మిగులు చున్నది; యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్పరాశి మిగిలినదని రాజుతోననగా

11 హిజ్కియా యెహోవా మందిరములో కొట్లను సిద్ధపరచవలసినదని ఆజ్ఞ ఇచ్చెను.౹

12 వారు వాటిని సిద్ధపరచి ఏమియు అపహరింపకుండ కానుకలను పదియవభాగములను ప్రతిష్ఠితములుగా తేబడిన వస్తువులను లోపల చేర్చిరి; లేవీయుడైన కొనన్యా వాటిమీద విచారణకర్తగా నియమింప బడెను; అతని సహోదరుడైన షిమీ అతనికి సహకారిగా ఉండెను.౹

13 మరియు యెహీయేలు అజజ్యాహు నహతు అశాహేలు యెరీమోతు యోజాబాదు ఎలీయేలు ఇస్మక్యాహు మహతు బెనాయాలనువారు రాజైన హిజ్కియా వలనను, దేవుని మందిరమునకు అధిపతియైన అజర్యా వలనను, తాము పొందిన ఆజ్ఞచొప్పున కొనన్యా చేతి క్రిందను, అతని సహోదరుడగు షిమీ చేతిక్రిందను కని పెట్టువారై యుండిరి.౹

14 తూర్పుతట్టు ద్వారమునొద్ద పాలకుడును ఇమ్నా కుమారుడునగు లేవీయుడైన కోరే యెహోవా కానుకలను అతిపరిశుద్ధమైనవాటిని పంచి పెట్టుటకు దేవునికి అర్పింపబడిన స్వేచ్ఛార్పణలమీద నియమింపబడెను.౹

15 అతనిచేతిక్రింద ఏదెను మిన్యామీను యేషూవ షెమయా అమర్యా షెకన్యా అనువారు నమ్మకమైనవారు గనుక యాజకుల పట్టణములందు పిన్న పెద్దలైన తమ సహోదరులకు వంతులచొప్పున భాగము లిచ్చుటకు నియమింపబడిరి.౹

16 ఇదియుగాక గోత్రములలో మూడు సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సు గలవారై జనసంఖ్య సరిచూడబడిన మగవారికందరికిని, వంతులచొప్పున సేవచేయుటకై ప్రతిదినము యెహోవా మందిరములోనికి వచ్చువారందరికిని,౹

17 ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సు గలవారై వంతుల చొప్పున సేవచేయుటకు తమతమపితరుల వంశముల చొప్పున యాజకులలో సరిచూడబడిన లేవీయులకు,౹

18 అనగా నమ్మకమైనవారై తమ్మును ప్రతిష్ఠించుకొనిన లేవీ యులకును, తమ పిల్లలతోను భార్యలతోను కుమారులతోను కుమార్తెలతోను

19 సమాజమంతటను సరిచూడబడిన వారికిని, ఆయా పట్టణములకు చేరిన గ్రామములలో నున్న అహరోను వంశస్థులైన యాజకులకును, వంతులు ఏర్పరచుటకు వారు నియమింపబడి యుండిరి. పేళ్లచేత చెప్పబడిన ఆ జనులు యాజకులలో పురుషులకందరికిని, లేవీయులలో వంశములచొప్పున సరిచూడబడిన వారికందరికిని వంతులు ఏర్పరచుటకు నియమింపబడిరి.౹

20 హిజ్కియా యూదా దేశమంతటను ఈలాగున జరిగించి, తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయుచు వచ్చెను.౹

21 తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవవిషయమందేమి ధర్మశాస్త్ర విషయమందేమి ధర్మమంతటివిషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2CH/31-488d9392981313d5d5eac4f86afd3dc9.mp3?version_id=1787—

Categories
2 దినవృత్తాంతములు

2 దినవృత్తాంతములు 32

1 రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తరువాత . అష్షూరురాజైన సన్హెరీబు వచ్చి, యూదాదేశములో చొర బడి ప్రాకారపురములయెదుట దిగి వాటిని లోపరచుకొన జూచెను.౹

2 సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేముమీద యుద్ధముచేయనుద్దేశించియున్నాడని హిజ్కియాచూచి

3 పట్టణముబయటనున్న ఊటల నీళ్లను అడ్డవలెనని తలచి, తన యధిపతులతోను పరాక్రమశాలులతోను యోచనచేయగా వారతనికి సహాయము చేసిరి.౹

4 –బహుజనులు పోగై అష్షూరు రాజులు రానేల? విస్తారమైనజలము వారికి దొరుక నేల? అనుకొని ఊటలన్నిటిని దేశమధ్యముగుండ పారు చున్న కాలువను అడ్డిరి.౹

5 మరియు రాజు ధైర్యము తెచ్చుకొని, పాడైన గోడ యావత్తు కట్టించి, గోపురములవరకు దానిని ఎత్తు చేయించి, బయట మరియొక గోడను కట్టించి, దావీదు పట్టణములో మిల్లో దుర్గమును బాగుచేయించెను. మరియు ఈటెలను డాళ్లను విస్తారముగా చేయించెను.౹

6 జనులమీద సైన్యాధిపతులను నియమించి పట్టణపు గుమ్మములకు పోవు రాజవీధిలోనికి వారిని తన యొద్దకు రప్పించి వారిని ఈలాగు హెచ్చరికచేసెను

7 –మీరు దిగులుపడకుడి, ధైర్యము విడువకుడి; అష్షూరు రాజుకైనను అతనితోకూడనున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయమొందవద్దు, అతనికి కలిగియున్న సహాయముకంటె ఎక్కువ సహాయము మనకు కలదు.౹

8 మాంససంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటలయందు నమ్మికయుంచిరి.

9 ఇదియైన తరువాత అష్షూరురాజైన సన్హెరీబు తన బలగ మంతటితో లాకీషును ముట్టడివేయుచుండి, యెరూషలేమునకు యూదారాజైన హిజ్కియా యొద్దకును, యెరూషలేమునందున్న యూదావారందరియొద్దకును తన సేవకులను పంపి ఈలాగు ప్రకటన చేయించెను

10 –అష్షూరురాజైన సన్హెరీబు సెలవిచ్చునదేమనగా– దేని నమ్మి మీరు ముట్టడివేయబడియున్న యెరూషలేములో నిలుచుచున్నారు?

11 కరవుచేతను దాహముచేతను మిమ్మును చంపుటకై–మన దేవుడైన యెహోవా అష్షూరురాజు చేతిలోనుండి మనలను విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మును ప్రేరేపించుచున్నాడు గదా?

12 ఆ హిజ్కియా, మీరు ఒక్క బలిపీఠము ఎదుట నమస్కరించి దానిమీద ధూపము వేయవలెనని యూదావారికిని యెరూషలేమువారికిని ఆజ్ఞ ఇచ్చి, యెహోవా ఉన్నతస్థలములను బలిపీఠములను తీసి వేసినవాడుకాడా?

13 నేనును నా పితరులును ఇతరదేశముల జనులకందరికిని ఏమేమి చేసితిమో మీరెరుగరా? ఆ దేశ జనుల దేవతలు వారి దేశములను నా చేతిలోనుండి యేమాత్రమైనను రక్షింప చాలియుండెనా?

14 మీ దేవుడు మిమ్మును నా చేతిలోనుండి విడిపింపగలడనుకొనుటకు, నా పితరులు బొత్తిగా నిర్మూలము చేసిన ఆయా దేశస్థుల సకల దేవతలలోను తన జనులను నా చేతిలోనుండి విడిపింపగలిగిన దేవుడొకడైన యుండెనా?

15 కాబట్టి యిప్పుడు హిజ్కియాచేత మీరు మోసపోకుడి, మీరు ఇట్టి ప్రేరేపణకు లోబడకుడి, అతని నమ్ముకొనకుడి, యే జనుల దేవుడైనను ఏ రాజ్యపు దేవుడైనను తన జనులను నా చేతిలోనుండి గాని నా పితరుల చేతిలోనుండి గాని విడిపింపలేక పోగా, మీ దేవుడు నా చేతిలోనుండి మిమ్మును మొదలే విడిపింపలేక పోవునుగదా అనెను.౹

16 అతని సేవకులు దేవుడైన యెహోవామీదను ఆయన సేవకుడైన హిజ్కియా మీదను ఇంకను పేలాపనలు పేలిరి.౹

17 అదియుగాక ఇతర దేశముల జనుల దేవతలు తమ జనులను నా చేతిలోనుండి యేలాగున విడిపింపలేకపోయిరో ఆలాగున హిజ్కియా సేవించు దేవుడును తన జనులను నా చేతిలోనుండి విడిపింప లేకపోవునని ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిందించుటకును, ఆయనమీద అపవాదములు పలుకుటకును అతడు పత్రికలు వ్రాసి పంపెను.౹

18 అప్పుడు వారు పట్టణమును పట్టుకొనవలెనన్న యోచనతో, ప్రాకారము మీదనున్న యెరూషలేము కాపురస్థులను బెదరించుటకును నొప్పించుటకును, యూదాభాషలో బిగ్గరగా వారితో ఆ మాటలు పలికిరి.౹

19 మరియు వారు మనుష్యుల చేతిపనియైన భూజనుల దేవతలమీద తాము పలికిన దూషణలను యెరూషలేముయొక్క దేవునిమీద కూడను పలికిరి.

20 రాజైన హిజ్కియాయును ఆమోజు కుమారుడైన యెషయా అను ప్రవక్తయును ఇందును గురించి ప్రార్థించి ఆకాశముతట్టు చూచి మొఱ్ఱపెట్టగా

21 యెహోవా ఒక దూతను పంపెను. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులనందరిని సేనా నాయకులను అధికారులను నాశనముచేయగా అష్షూరురాజు సిగ్గునొందినవాడై తన దేశమునకు తిరిగిపోయెను. అంతట అతడు తన దేవుని గుడిలో చొచ్చినప్పుడు అతని కడుపున పుట్టినవారే అతని అక్కడ కత్తిచేత చంపిరి.౹

22 ఈ ప్రకారము యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపురస్థులను అష్షూరు రాజైన సన్హెరీబు చేతిలోనుండియు అందరిచేతిలోనుండియు రక్షించి, అన్నివైపులను వారిని కాపాడినందున

23 అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను యూదా రాజైన హిజ్కియాకు కానుకలను తెచ్చి యిచ్చిరి. అందువలన అతడు అప్పటినుండి సకల జనముల దృష్టికి ఘనత నొందిన వాడాయెను.

24 ఆ దినములలో హిజ్కియా రోగియై మరణదశలో నుండెను. అతడు యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరచి అతనికి సూచన యొకటి దయచేసెను.౹

25 అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదికిని యూదా యెరూషలేముల వారిమీదికిని కోపము రాగా

26 హిజ్కియా హృదయగర్వము విడచి, తానును యెరూషలేము కాపురస్థులును తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనులమీదికి రాలేదు.౹

27 హిజ్కియాకు అతివిస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగెను. అతడు వెండి బంగారములను రత్నములను సుగంధద్రవ్యములను డాళ్లను నానా విధములగు శ్రేష్ఠమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించెను.౹

28 ధాన్యమును ద్రాక్షారసమును తైలమును ఉంచుటకు కొట్లను, పలువిధముల పశువులకు శాలలను మందలకు దొడ్లను కట్టించెను.౹

29 మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్టణములను విస్తారమైన గొఱ్ఱెలమందలను పసులమందలను అతడు సంపాదించెను.౹

30 ఈ హిజ్కియా గిహోను కాలువకు ఎగువను కట్టవేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాని తెప్పించెను, హిజ్కియా తాను పూనుకొనిన సర్వప్రయత్నములయందును వృద్ధిపొందెను.౹

31 అతని దేశము ఆశ్చర్యముగా వృద్ధినొందుటనుగూర్చి విచారించి తెలిసికొనుటకై బబులోను అధిపతులు అతనియొద్దకు పంపిన రాయబారుల విషయములో అతని శోధించి, అతని హృదయములోని ఉద్దేశమంతయు తెలిసికొనవలెనని దేవుడతని విడచిపెట్టెను.

32 హిజ్కియా చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చూపిన భక్తినిగూర్చియు, ప్రవక్తయును ఆమోజు కుమారుడునగు యెషయాకు కలిగిన దర్శనముల గ్రంథమునందును యూదా ఇశ్రాయేలుల రాజుల గ్రంథమునందును వ్రాయబడియున్నది.౹

33 హిజ్కియా తన పితరులతోకూడ నిద్రించగా జనులు దావీదు సంతతివారి శ్మశానభూమియందు కట్టబడిన పైస్థానమునందు అతని పాతిపెట్టిరి. అతడు మరణ మొందినప్పుడు యూదావారందరును యెరూషలేము కాపురస్థులందరును అతనికి ఉత్తర క్రియలను ఘనముగా జరిగించిరి. అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజాయెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2CH/32-ab08e33bdf45625b59dda469ddb31f60.mp3?version_id=1787—

Categories
2 దినవృత్తాంతములు

2 దినవృత్తాంతములు 33

1 మనష్షే యేలనారంభించినప్పుడు పండ్రెండేండ్లవాడై యెరూషలేములో ఏబది యయిదు సంవత్సరములు ఏలెను.౹

2 ఇతడు ఇశ్రాయేలీయుల యెదుటనుండి యెహోవా వెళ్లగొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి, యెహోవా దృష్టికి చెడునడత నడచెను.౹

3 ఇతడు తన తండ్రియైన హిజ్కియా పడగొట్టిన ఉన్నతస్థలములను తిరిగి కట్టించి, బయలుదేవతకు బలిపీఠములను నిలిపి, దేవతాస్తంభములను చేయించి, ఆకాశనక్షత్రములన్నిటిని పూజించి కొలిచెను.౹

4 మరియు–నా నామము ఎన్నటెన్నటికి ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమునుగూర్చి యెహోవా సెలవిచ్చెనో అక్కడనున్న యెహోవామందిరమందు అతడు బలిపీఠములను కట్టించెను.౹

5 మరియు యెహోవా మందిరపు రెండు ఆవరణములలో అతడు ఆకాశనక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టించెను.౹

6 బెన్‌హిన్నోము లోయయందు అతడు తన కుమారులను అగ్నిలోగుండ దాటించి, ముహూర్తములను విచారించుచు, మంత్రములను చిల్లంగితనమును వాడుకచేయు కర్ణపిశాచములతోను సోదెగాండ్రతోను సాంగత్యముచేయుచు, యెహోవా దృష్టికి బహుగా చెడునడత నడచుచు ఆయనకు కోపము పుట్టించెను.౹

7-8 –ఇశ్రాయేలీయుల గోత్రస్థానములన్నిటిలో నేను కోరుకొనిన యెరూషలేమునందు నా నామము నిత్యము ఉంచెదను, నేను మోషేద్వారా నియమించిన కట్టడలను విధులను ధర్మశాస్త్రమంతటిని అనుసరించి నడచుకొనుటకై వారు జాగ్రత్తపడినయెడల, మీపితరులకు నేను ఖాయపరచిన దేశమునుండి ఇశ్రాయేలీయులను నేను ఇక తొలగింపనని దావీదుతోను అతని కుమారుడైన సొలొమోనుతోను దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్యపెట్టక, ఆ మందిరమునందు మనష్షే తాను చేయించిన చెక్కుడు విగ్రహమును నిలిపెను.౹

9 ఈ ప్రకారము మనష్షే యూదావారిని యెరూషలేము కాపురస్థులను మోసపుచ్చిన వాడై, ఇశ్రాయేలీయులయెదుట ఉండకుండ యెహోవా నశింపజేసిన అన్యజనులకంటెను వారు మరింత అక్రమముగా ప్రవర్తించునట్లు చేయుటకు కారకుడాయెను.

10 యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి.౹

11 కాబట్టి యెహోవా అష్షూరురాజుయొక్క సైన్యాధిపతులను వారి మీదికి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండ వారు అతని పట్టుకొని, గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసికొనిపోయిరి.౹

12 అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, తన పితరుల దేవుని సన్నిధిని తన్నుతాను బహుగా తగ్గించుకొని

13 ఆయనకు మొరలిడగా, ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసికొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై యున్నాడని మనష్షే తెలిసికొనెను.

14 ఇదియైన తరువాత అతడు దావీదు పట్టణము బయట గిహోనుకు పడమరగా లోయయందు మత్స్యపు గుమ్మమువరకు ఓపెలు చుట్టును బహు ఎత్తుగల గోడను కట్టించెను. మరియు యూదా దేశములోని బలమైన పట్టణములన్నిటిలోను సేనాధిపతులను ఉంచెను.౹

15 మరియు యెహోవా మందిరమునుండి అన్యుల దేవతలను విగ్రహమును తీసివేసి, యెరూషలేమునందును యెహోవామందిర పర్వతమునందును తాను కట్టించిన బలిపీఠములన్నిటిని తీసి పట్టణము బయటికి వాటిని లాగివేయించెను.౹

16 ఇదియుగాక అతడు యెహోవా బలిపీఠమును బాగుచేసి, దానిమీద సమాధానబలులను కృతజ్ఞతార్పణలను అర్పించుచు–ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాను సేవించుడని యూదావారికి ఆజ్ఞ ఇచ్చెను.౹

17 అయినను జనులు ఉన్నతస్థలములయందు ఇంకను బలులు అర్పించుచు వచ్చిరిగాని ఆ యర్పణలను తమ దేవుడైన యెహోవా నామమునకే చేసిరి.౹

18 మనష్షే చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు దేవునికి పెట్టిన మొరలనుగూర్చియు, ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా పేరట అతనితో పలికిన దీర్ఘదర్శులు చెప్పిన మాటలనుగూర్చియు, ఇశ్రాయేలురాజుల గ్రంథమందు వ్రాయబడియున్నది.౹

19 అతడు చేసిన ప్రార్థననుగూర్చియు, అతని మనవి వినబడుటనుగూర్చియు, అతడు చేసిన పాపద్రోహములన్నిటిని గూర్చియు, తాను గుణపడకముందు ఉన్నతస్థలములను కట్టించి దేవతాస్తంభములను చెక్కినవిగ్రహములను అచ్చట నిలుపుటనుగూర్చియు, దీర్ఘదర్శులు రచించిన గ్రంథములలో వ్రాయ బడియున్నది.౹

20 మనష్షే తన పితరులతోకూడ నిద్రించి తన నగరునందు పాతిపెట్టబడెను; అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజాయెను.

21 ఆమోను ఏలనారంభించినప్పుడు ఇరువది రెండేండ్ల వాడై యెరూషలేములో రెండు సంవత్సరములు ఏలెను.౹

22 అతడు తన తండ్రియైన మనష్షే నడచినట్లు యెహోవా దృష్టికి చెడునడత నడచెను; తన తండ్రియైన మనష్షే చేయించిన చెక్కుడు విగ్రహములన్నిటికి బలులు అర్పించుచు పూజించుచు

23 తన తండ్రియైన మనష్షే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తప్తుడు కాకను గుణపడకను, ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహకార్యములను చేయుచు వచ్చెను.౹

24 అతని సేవకులు అతనిమీద కుట్రచేసి అతని నగరునందే అతని చంపగా

25 దేశ జనులు ఆమోను రాజుమీద కుట్రచేసిన వారినందరిని హతముచేసి అతని కుమారుడైన యోషీయాను అతని స్థానమందు రాజుగా నియమించిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2CH/33-9e637dbb3b923f2e262fff59536582d5.mp3?version_id=1787—