Categories
2 రాజులు

2 రాజులు 8

1 ఒకనాడు ఎలీషా తాను బ్రదికించిన బిడ్డకు తల్లియైన ఆమెను పిలిచి–యెహోవా క్షామకాలము రప్పింపబోవుచున్నాడు; ఏడు సంవత్సరములు దేశములో క్షామము కలుగునని చెప్పి–నీవు లేచి, నీవును నీ యింటివారును ఎచ్చటనుండుట అనుకూలమో అచ్చటికి పోవుడనగా

2 ఆ స్త్రీ లేచి దైవజనుని మాటచొప్పున చేసి, తన యింటి వారిని తోడుకొని ఫిలిష్తీయుల దేశమునకు పోయి యేడు సంవత్సరములు అక్కడ వాసముచేసెను.౹

3 అయితే ఆ యేడు సంవత్సరములు గతించిన తరువాత ఆ స్త్రీ ఫిలిష్తీయుల దేశములోనుండి వచ్చి తన యింటిని గూర్చియు భూమిని గూర్చియు మనవి చేయుటకై రాజునొద్దకు పోయెను.౹

4 రాజు దైవజనుని పనివాడగు గేహజీతో మాటలాడి–ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటిని నాకు తెలియజెప్పుమని ఆజ్ఞనిచ్చి యుండెను.౹

5 అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా, ఎలీషా బ్రదికించిన బిడ్డ తల్లి తన యింటిని గూర్చియు భూమిని గూర్చియు రాజుతో మనవిచేయ వచ్చెను. అంతట గేహజీ–నా యేలినవాడ వైన రాజా ఆ స్త్రీ యిదే; మరియు ఎలీషా తిరిగి బ్రదికించిన యీమెబిడ్డ వీడే అని చెప్పగా

6 రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పెను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి, ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటినుండి నేటివరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరల ఇమ్మని సెలవిచ్చెను.

7 ఎలీషా దమస్కునకు వచ్చెను. ఆ కాలమున సిరియారాజైన బెన్హదదు రోగియైయుండి, దైవజనుడైన అతడు ఇక్కడికి వచ్చియున్నాడని తెలిసికొని

8 హజాయేలును పిలిచి–నీవు ఒక కానుకను చేతపట్టుకొని దైవజనుడైన అతనిని ఎదుర్కొన బోయి–ఈ రోగముపోయి నేను బాగుపడుదునా లేదా అని అతనిద్వారా యెహోవాయొద్ద విచారణ చేయుమని ఆజ్ఞ ఇచ్చిపంపెను.౹

9 కాబట్టి హజాయేలు దమస్కులోనున్న మంచి వస్తువులన్నిటిలో నలువది ఒంటెల మోతంత కానుకగా తీసికొని అతనిని ఎదుర్కొన బోయి అతని ముందర నిలిచి–నీ కుమారుడును సిరియా రాజునైన బెన్హదదు–నాకు కలిగిన రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని నిన్నడుగుటకు నన్ను పంపె నని చెప్పెను.౹

10 అప్పుడు ఎలీషా–నీవు అతని యొద్దకు పోయి–నిశ్చయముగా నీకు స్వస్థతకలుగవచ్చుననిచెప్పుము. అయినప్పటికిని అతనికి అవశ్యముగ మరణము సంభవించునని యెహోవా నాకు తెలియజేసెనని పలికి

11 హజాయేలు ముఖము చిన్నబోవునంతవరకు ఆ దైవజనుడు అతని తేరి చూచుచు కన్నీళ్లు రాల్చెను.౹

12 హజాయేలు–నా యేలిన వాడవైన నీవు కన్నీళ్లు రాల్చెదవేమని అతని నడుగగా ఎలీషా యీలాగు ప్రత్యుత్తరమిచ్చెను–ఇశ్రాయేలువారి గట్టి స్థలములను నీవు కాల్చివేయుదువు; వారి యౌవనస్థులను కత్తిచేత హతము చేయుదువు; వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు; వారి గర్భిణుల కడుపులను చింపి వేయుదువు గనుక నీవు వారికి చేయబోవు కీడును నేనెరిగియుండుటచేత కన్నీళ్లు రాల్చుచున్నాను.౹

13 అందుకు హజాయేలు–కుక్కవంటివాడనగు నీ దాసుడనైన నేను ఇంత కార్యము చేయుటకు ఎంతటి వాడను అని అతనితో అనగా, ఎలీషా–నీవు సిరియామీద రాజవగుదువని యెహోవా నాకు బయలుపరచియున్నాడనెను.౹

14 అతడు ఎలీషాను విడిచి వెళ్లి తన యజమానుని యొద్దకు రాగా అతడు–ఎలీషా నీతో చెప్పినదేమని అడుగగా అతడు– నిజముగా నీవు బాగుపడుదువని అతడు చెప్పెననెను.౹

15 అయితే మరునాడు హజాయేలు ముదుగు బట్ట తీసికొని నీటిలో ముంచి రాజు ముఖముమీద పరచగా అతడు చచ్చెను; అప్పుడు హజాయేలు అతనికి మారుగా రాజాయెను.

16 అహాబు కుమారుడును ఇశ్రాయేలువారికి రాజునైన యెహోరాము ఏలుబడిలో అయిదవ సంవత్సరమందు యెహోషాపాతు యూదారాజై యుండగా యూదా రాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏల నారంభించెను.౹

17 అతడు ఏల నారంభించినప్పుడు ముప్పది రెండేండ్లవాడైయుండి యెరూషలేమందు ఎనిమిది సంవ త్సరములు ఏలెను.౹

18 ఇతడు అహాబు కుమార్తెను పెండ్లి చేసికొని యుండెను గనుక అహాబు కుటుంబికులవలెనే ఇతడును ఇశ్రాయేలురాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.౹

19 అయినను యెహోవా సదాకాలము తన సేవకుడగు దావీదునకును అతని కుమారులకును దీపము నిలిపెదనని మాట యిచ్చి యుండెను గనుక అతని జ్ఞాపకముచేత యూదాను నశింప జేయుటకు ఆయనకు మనస్సు లేకపోయెను.౹

20 ఇతని దినములలో ఎదోమీయులు యూదారాజునకు ఇక లోబడుట మాని అతనిమీద తిరుగుబాటు చేసి, తమమీద నొకని రాజుగా నియమించుకొనినందున

21 యెహోరాము తన రథములన్నిటిని తీసికొనిపోయి జాయీరు అను స్థలమునకు వచ్చి రాత్రివేళ లేచి తన చుట్టునున్న ఎదో మీయులను రథములమీది అధిపతులను హతముచేయగా జనులు తమతమ గుడారములకు పారిపోయిరి.౹

22 అయితే నేటివరకును ఎదోమీయులు తిరుగుబాటు చేసి యూదావారికి లోబడకయే యున్నారు. మరియు ఆ సమయమందు లిబ్నా పట్టణమును తిరుగబడెను.౹

23 యెహోరాము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దానినంతటినిగూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.౹

24 యెహోరాము తన పితరులతోకూడ నిద్రించి తన పితరుల సమాధిలో దావీదుపురమునందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజాయెను.౹

25 అహాబు కుమారుడును ఇశ్రాయేలురాజునైన యెహోరాము ఏలు బడిలో పండ్రెండవ సంవత్సరమందు యూదా రాజైన యెహోరాము కుమారుడైన అహజ్యా యేలనారంభించెను.౹

26 అహజ్యా యేలనారంభించినప్పుడు ఇరువది రెండేండ్ల వాడైయుండి యెరూషలేములో ఒక సంవత్సరము ఏలెను. అతని తల్లిపేరు అతల్యా; ఈమె ఇశ్రాయేలురాజైన ఒమ్రీ కుమార్తె.౹

27 అతడు అహాబు కుటుంబికుల ప్రవర్తనను అనుసరించుచు, వారివలెనే యెహోవా దృష్టికి చెడు తనము జరిగించెను; అతడు అహాబు ఇంటివారికి అల్లుడు.౹

28 అతడు అహాబు కుమారుడైన యెహోరాముతోకూడ రామోత్గిలాదునందు సిరియారాజైన హజాయేలుతో యుద్ధముచేయ బయలుదేరగా సిరియనులు యెహోరామును గాయపరచిరి.౹

29 రాజైన యెహోరాము సిరియారాజైన హజాయేలుతో రామాలో యుద్ధము చేసినప్పుడు సిరియనులవలన తాను పొందిన గాయములను బాగుచేసికొనుటకై యెజ్రెయేలు ఊరికి తిరిగి రాగా యూదా రాజైన యెహోరాము కుమారుడైన అహజ్యా అహాబు కుమారుడైన యెహోరాము రోగియాయెనని తెలిసికొని అతని దర్శించుటకై యెజ్రెయేలు ఊరికి వచ్చెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2KI/8-f0eae93c6e76f4dbf35914f9b140f168.mp3?version_id=1787—

Categories
2 రాజులు

2 రాజులు 9

1 అంతట ప్రవక్తయగు ఎలీషా ప్రవక్తల శిష్యులలో ఒకనిని పిలువనంపించి అతనితో ఇట్లనెను–నీవు నడుము బిగించుకొని యీ తైలపుగిన్నె చేతపట్టుకొని రామో త్గిలాదునకు పోయి

2 అచ్చట ప్రవేశించినప్పుడు నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ యెక్కడ నున్నాడని తెలిసికొని అతనిని దర్శించి, అతని సహోదరులమధ్యనుండి అతనిని చాటుగా రప్పించి, లోపలి గదిలోకి అతనిని పిలుచుకొనిపోయి

3 తైలపుగిన్నె తీసికొని అతని తలమీద తైలము పోసి–నేను నిన్ను ఇశ్రాయేలుమీద పట్టాభిషిక్తునిగా చేసితినని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి, ఆలస్యము చేయక తలుపుతీసి పారి పొమ్ము.౹

4 యౌవనుడైన ఆ ప్రవక్త పోవలెనని బయలుదేరి రామోత్గిలాదునకు వచ్చునప్పటికి సైన్యాధిపతులు కూర్చుని యుండిరి.౹

5 అప్పుడతడు–అధిపతీ, నీకొక సమాచారము తెచ్చితినని చెప్పగా యెహూ–యిందరిలో అది ఎవరిని గూర్చినదని అడుగగా అతడు–అధిపతీ నిన్నుగూర్చినదే యనెను; అందుకు యెహూ లేచి యింటిలో ప్రవేశించెను.౹

6 అప్పుడు ఆ యౌవనుడు అతని తలమీద తైలము పోసి అతనితో ఇట్లనెను–ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా–యెహోవా జనులైన ఇశ్రాయేలు వారిమీద నేను నిన్ను పట్టాభిషిక్తునిగా చేయుచున్నాను.౹

7 కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసినదానినిబట్టియు, యెహోవా సేవకులందరిని హతము చేసిన దానినిబట్టియు, యెజెబెలునకు ప్రతికారము చేయునట్లు నీవు నీ యజమానుడైన అహాబు సంతతివారిని హతముచేయుము.౹

8 అహాబు సంతతివారందరును నశింతురు; అల్పులలోనేమి ఘనులలోనేమి అహాబు సంతతిలో ఏ పురుషుడును ఉండకుండ అందరిని నిర్మూలము చేయుము.౹

9 నెబాతు కుమారుడైన యరొబాము కుటుంబికులను అహీయా కుమారుడైన బయెషా కుటుంబికులను నేను అప్పగించినట్లు అహాబు కుటుంబికులను నేను అప్పగించుదును.౹

10 యెజెబెలు పాతిపెట్టబడక యెజ్రెయేలు భూభాగమందు కుక్కలచేత తినివేయబడును. ఆ యౌవనుడు ఈ మాటలు చెప్పి తలుపుతీసి పారిపోయెను.౹

11 యెహూ బయలుదేరి తన యజమానుని సేవకులయొద్దకు రాగా ఒకడు–ఏమి సంభవించినది? ఆ వెఱ్ఱివాడు నీయొద్దకు వచ్చిన హేతువేమని అతని నడుగగా, అతడు–వానిని వాని మాటలు మీరెరిగే యున్నారని చెప్పెను.౹

12 కాబట్టి వారు–అదంతయు వట్టిది; జరిగినదానిని మాకు తెలియజెప్పుమనగా అతడిట్లనెను– నను నిన్ను ఇశ్రాయేలుమీద పట్టాభిషిక్తునిగా చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతడు నాతో చెప్పెను.౹

13 అంతట వారు అతివేగిరముగా తమతమ వస్త్రములను పట్టుకొని మెట్లమీద అతని క్రింద పరచి బాకా ఊదించి–యెహూ రాజైయున్నాడని చాటించిరి.౹

14 ఈ ప్రకారము నింషీకి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ యెహోరాముమీద కుట్రచేసెను. అప్పుడు యెహోరామును ఇశ్రాయేలువారందరును సిరియారాజైన హజాయేలును ఎదిరించుటకై రామో త్గిలాదు దగ్గర కావలియుండిరి.౹

15 అయితే యెహోరాము సిరియారాజైన హజాయేలుతో యుద్ధము చేయుచుండగా సిరియనులవలన తాను పొందిన గాయములను బాగు చేసి కొనుటకై యెజ్రెయేలు ఊరికి తిరిగి వచ్చియుండెను. అంతట యెహూ–నీకనుకూలమైతే ఈ సంగతి తెలియ బడకుండునట్లు ఈ పట్టణములోనుండి యెవనినైనను యెజ్రెయేలు ఊరికి తప్పించుకొని పోనియ్యకుమని ఆజ్ఞ ఇచ్చి

16 రథముయెక్కి, యెజ్రెయేలు ఊరిలో యెహోరాము మంచము పెట్టియుండగా అచ్చటికి పోయెను మరియు యూదా రాజైన అహజ్యా యెహోరామును దర్శించుటకై అచ్చటికి వచ్చి యుండెను.౹

17 యెజ్రెయేలు గోపురముమీద కావలివాడు నిలిచి యుండి, యెహూతో కలిసి వచ్చుచున్న సైన్యమును చూచి–సైన్యమొకటి నాకు కనబడుచున్నదని తెలియజెప్పగా యెహోరాము ఒక రౌతును పిలిచి–వారిని ఎదుర్కొనబోయి–సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని చెప్పి, పంపుమని వానితో సెలవిచ్చెను.౹

18 కాబట్టి యొకడు గుఱ్ఱమెక్కిపోయి అతనిని ఎదుర్కొని – సమాధానముగా వచ్చుచున్నారా? అని అడుగుమని రాజు నన్ను పంపెననగా యెహూ–సమాధానముతో నీకేమి పని? నీవు నా వెనుకకు తిరిగిరమ్మని వానితో చెప్పగా ఆ కావలివాడు–పంపబడినవాడు వారిని కలిసికొనెనుగాని తిరిగి రాక నిలిచెనని సమాచారము తెలిపెను.౹

19 రాజు రెండవ రౌతును పంపగా వాడు వారియొద్దకు వచ్చి–సమాధానముగా వచ్చుచున్నారా? అని అడుగుమని రాజు నన్ను పంపెననగా యెహూ–సమాధానముతో నీకేమి పని? నా వెనుకకు తిరిగి రమ్మని వానితో చెప్పెను.౹

20 అప్పుడు కావలివాడు–వీడును వారిని కలిసికొని తిరిగిరాక నిలిచెను మరియు అతడు వెఱ్ఱి తోలడము తోలుచున్నాడు గనుక అది నింషీకుమారుడైన యెహూ తోలడమువలెనే యున్న దనెను.౹

21 –రథము సిద్ధముచేయుమని యెహోరాము సెలవియ్యగా వారు అతని రథము సిద్ధముచేసిరి. అప్పుడు ఇశ్రాయేలురాజైన యెహోరామును యూదారాజైన అహజ్యాయును తమతమ రథములనెక్కి యెహూను కలియబోయి యెజ్రెయేలీయుడైన నాబోతు భూభాగమందు అతనిని ఎదుర్కొనిరి.౹

22 అంతట యెహోరాము యెహూను చూచి–యెహూ సమాధానమా? అని అడుగగా యెహూ–నీ తల్లియైన యెజెబెలు జారత్వములును చిల్లంగి తనములును ఇంత యపరిమితమై యుండగా సమాధాన మెక్కడనుండి వచ్చుననెను.౹

23 యెహోరాము రథము త్రిప్పి–అహజ్యా, ద్రోహము జరుగుచున్నదని అహజ్యాతో చెప్పి పారిపోయెను.౹

24 అప్పుడు యెహూ తన బలముకొలది విల్లు ఎక్కుపెట్టి యెహోరామును భుజములమధ్య కొట్టగా బాణము అతని గుండెగుండ దూసి పోయెను గనుక అతడు తన రథమునందే యొరిగెను.౹

25 కాగా యెహూ తన అధిపతియైన బిద్కరును పిలిచి యిట్లనెను–అతని ఎత్తి యెజ్రెయేలీయుడైన నాబోతు భూభాగమందు పడవేయుము; మనమిద్దరమును అతని తండ్రియైన అహాబు వెనుక గుఱ్ఱములెక్కి వచ్చినప్పుడు యెహోవా అతనిమీద ఈ శిక్షమోపిన సంగతి జ్ఞాపకము చేసికొనుము.౹

26 అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా నిశ్చయముగా నాబోతు రక్తమును వాని కుమారుల రక్తమును నిన్నటి దినమున నేను చూచితిని గనుక ఈ భూభాగమందు నేను దానికి ప్రతికారము చేయుదును; ఇదే యెహోవా వాక్కు కాబట్టి నీవు యెహోవా మాటచొప్పున అతని ఎత్తి యీ భూభాగమందు పడవేయుము అనెను.౹

27 యూదారాజైన అహజ్యా జరిగిన దాని చూచి వనములోని నగరి మార్గముగా పారిపోయెను; అయినను యెహూ అతని తరిమి, రథమునందు అతని హతముచేయుడని ఆజ్ఞ ఇచ్చెను గనుక వారు ఇబ్లెయాము దగ్గరనున్న గూరునకు పోవు మార్గమందు అతని కొట్టగా అతడు మెగిద్దోకు పారిపోయి అచ్చట మరణమాయెను.౹

28 అప్పుడు అతని సేవకులు అతనిని రథముమీద వేసి యెరూషలేమునకు తీసికొనిపోయి దావీదు పురమందు అతని పితరుల సమాధిలో అతని పాతిపెట్టిరి.

29 అహజ్యా అహాబు కుమారుడైన యెహోరాము ఏలు బడిలో పదకొండవ సంవత్సరమందు యూదాను ఏల నారంభించెను.

30 యెహూ యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజె బెలునకు వినబడెను గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసికొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలోనుండి కనిపెట్టి చూచుచుండగా

31 యెహూ గుమ్మముద్వారా ప్రవేశించెను. ఆమె అతనిని చూచి–నీ యజమానుని చంపినవాడా, జిమ్రీ వంటివాడా, నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా

32 అతడు తలయెత్తి కిటికీతట్టు చూచి–నా పక్షమందున్న వారెవరని అడుగగా ఇద్దరు ముగ్గురు పరిచారకులు పైనుండి తొంగిచూచిరి.౹

33 –దీనిని క్రింద పడద్రోయుడని అతడు చెప్పగా వారు దానిని క్రిందికి పడద్రోసినందున దాని రక్తములో కొంత గోడమీదను గుఱ్ఱములమీదను చిందెను. మరియు గుఱ్ఱములచేత అతడు దానిని త్రొక్కించెను.౹

34 అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తరువాత–ఆ శాపగ్రస్తు రాలు రాజకుమార్తె గనుక మీరు వెళ్లి దానిని కనుగొని పాతిపెట్టుడని ఆజ్ఞ ఇయ్యగా

35 వారు దానిని పాతిపెట్ట బోయిరి; అయితే దాని కపాలమును పాదములును అర చేతులును తప్ప మరి ఏమియు కనబడలేదు.౹

36 వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియజెప్పగా అతడిట్లనెను –ఇది యెజెబెలని యెవరును గుర్తుపట్టలేకుండ యెజ్రెయేలు భూభాగమందు కుక్కలు యెజెబెలు మాంసమును తినును.౹

37 యెజెబెలుయొక్క కళేబరము యెజ్రెయేలు భూభాగ మందున్న పెంటవలెనుండును అని తన సేవకుడును తిష్బీ యుడునగు ఏలీయాద్వారా యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున యిది జరిగెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2KI/9-e89b5237909b3076a322e264364f5e79.mp3?version_id=1787—

Categories
2 రాజులు

2 రాజులు 10

1 షోమ్రోనులో అహాబునకు డెబ్బదిమంది కుమారు లుండిరి. యెహూ వెంటనే తాకీదులు వ్రాయించి షోమ్రోనులోనుండు యెజ్రెయేలు అధిపతులకును పెద్దలకును అహాబు పిల్లలను పెంచినవారికిని పంపి ఆజ్ఞ ఇచ్చిన దేమనగా–మీ యజమానుని కుమారులు మీయొద్ద నున్నారు;౹

2 మరియు మీకు రథములును గుఱ్ఱములును ప్రాకారముగల పట్టణమును ఆయుధ సామగ్రియును కలవు గదా

3 కాబట్టి యీ తాకీదు మీకు ముట్టినవెంటనే మీ యజమానుని కుమారులలో ఉత్తముడును తగినవాడునైన యొకని కోరుకొని, తన తండ్రి సింహాసనముమీద అతనిని ఆసీనునిగా చేసి, మీ యజమానుని కుటుంబికుల పక్షమున యుద్ధమాడుడి.౹

4 వారు ఇది విని బహు భయపడి–ఇద్దరు రాజులు అతనిముందర నిలువజాలక పోయిరే, మనమెట్లు నిలువగలమని అనుకొని

5 కుటుంబపు అధికారియు పట్టణపు అధికారియు పెద్దలును పిల్లలను పెంచినవారును కూడి యెహూకు వర్తమానము పంపి–మేము నీ దాసులము; నీ సెలవు ప్రకారము సమస్తము జరిగించెదము; మేము ఎవనిని రాజుగా చేసికొనము; నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చేయుమని తెలియజేసిరి.౹

6 అప్పుడతడు రెండవ తాకీదు వ్రాయించి–మీరు నా పక్షమున నుండి నా మాట వినుటకు ఒప్పుకొనినయెడల మీ యజమానుని కుమారుల తలలను తీసికొని, రేపు ఈ వేళకు యెజ్రెయేలునకు నాయొద్దకు రండని ఆజ్ఞ ఇచ్చెను. డెబ్బదిమంది రాజకుమారులును వారిని పెంచిన పట్టణపు పెద్దలయొద్ద ఉండిరి.౹

7 కావున ఆ తాకీదు తమకు ముట్టినప్పుడు వారు డెబ్బదిమంది రాజకుమారులను పట్టుకొని చంపి, వారి తలలను గంపలలో పెట్టి, యెజ్రెయేలులోనున్న అతని యొద్దకు పంపిరి.౹

8 దూత అతనియొద్దకు వచ్చి–రాజకుమారుల తలలు వచ్చినవని చెప్పగా అతడు–ఉదయమువరకు ద్వారము బయటిస్థలమందు వాటిని రెండు కుప్పలుగా వేయించుడనెను.౹

9 ఉదయమైనప్పుడు అతడు బయటికి వచ్చి నిలిచి, జనులందరిని చూచి–మీరు నిర్దోషులు, నేను నా యజమానునిమీద కుట్రచేసి అతని చంపితిని; అయితే వీరందరిని ఎవరు చంపిరి?

10 అహాబు కుటుంబికులనుగూర్చి యెహోవా సెలవిచ్చిన మాటలలో ఒకటియు నెరవేరక పోదు; తన సేవకుడైన ఏలీయాద్వారా తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చెనని చెప్పెను.౹

11 ఈ ప్రకారము యెహూ యెజ్రెయేలులో అహాబు కుటుంబికులందరిని, అతని సంబంధులగు గొప్పవారినందరిని అతని బంధువులనందరిని, అతడు నియమించిన యాజకులను హతముచేసెను; అతనికి ఒకనినైనను ఉండనియ్యలేదు.౹

12 అప్పుడతడు లేచి ప్రయాణమై షోమ్రోను పట్టణమునకు పోయెను. మార్గమందు అతడు గొఱ్ఱెవెండ్రుకలు కత్తిరించు ఇంటికి వచ్చి

13 యూదారాజైన అహజ్యా సహోదరులను ఎదుర్కొని– మీరు ఎవరని వారి నడుగగా వారు–మేము అహజ్యా సహోదరులము; రాజకుమారులను రాణికుమారులను దర్శించుటకు వెళ్లుచున్నామని చెప్పిరి.౹

14 వారిని సజీవులుగా పట్టుకొనుడని అతడు చెప్పగా వారు వారిని సజీవులుగా పట్టుకొని యొకనినైన విడువక గొఱ్ఱె వెండ్రుకలు కత్తి రించు ఇంటి గోతిదగ్గర నలువది ఇద్దరిని చంపిరి.

15 అచ్చటినుండి అతడు పోయిన తరువాత తన్ను ఎదుర్కొన వచ్చిన రేకాబు కుమారుడైన యెహోనాదాబును కనుగొని అతనిని కుశలప్రశ్నలడిగి–నీయెడల నాకున్న ట్టుగా నాయెడల నీకున్నదా అని అతని నడుగగా యెహో నాదాబు–ఉన్నదనెను. –ఆలాగైతే నా చేతిలో చెయ్యి వేయుమని చెప్పగా అతడు ఇతని చేతిలో చెయ్యివేసెను. గనుక యెహూ తన రథముమీద అతనిని ఎక్కించుకొని

16 –యెహోవానుగూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతోకూడ రమ్మనగా యెహూ రథముమీద వారతని కూర్చుండబెట్టిరి.౹

17 అతడు షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులో అహాబునకు శేషించియున్న వారినందరిని చంపి, ఏలీయాకు యెహోవా సెలవిచ్చిన మాట నెరవేర్చి, అహాబును నిర్మూలము చేయువరకు హతముచేయుట మానకుండెను.౹

18 తరువాత యెహూ జనులందరిని సమకూర్చి వారికీలాగు ఆజ్ఞ ఇచ్చెను–అహాబు బయలుదేవతకు కొద్ది గానే పూజచేసెను. యెహూ అను నేను అధికముగా పూజచేయబోవుచున్నాను,౹

19 కావున ఒకడైనను తప్పకుండ బయలు ప్రవక్తలనందరిని వాని భక్తులనందరిని వారి యాజకులనందరిని నాయొద్దకు పిలువనంపించుడి; నేను బయలునకు గొప్ప బలి అర్పింప బోవుచున్నాను గనుక రానివాడెవడో వాని బ్రదుకనియ్యనని చెప్పెను. అయితే బయలునకు మ్రొక్కువారిని నాశనము చేయుటకై అతడు ఈ ప్రకారము కపటోపాయము చేసెను.౹

20 మరియు యెహూ–బయలునకు పండుగ నియమింపబడినదని చాటించుడని ఆజ్ఞ ఇయ్యగా వారాలాగు చాటించిరి.౹

21 యెహూ ఇశ్రాయేలు దేశమంతటిలోనికి వర్తమానము పంపించగా బయలునకు మ్రొక్కు వారందరును వచ్చిరి, రానివాడు ఒకడును లేడు; వారు వచ్చి బయలు గుడిలో ప్రవేశింపగా ఎచ్చటను చోటులేకుండ బయలు గుడి ఈతట్టునుండి ఆతట్టువరకు నిండిపోయెను.౹

22 అప్పుడతడు వస్త్రశాలమీద ఉన్న అధికారిని పిలిచి–బయలునకు మ్రొక్కువారికందరికి వస్త్రములు బయటికి తెప్పించుమని చెప్పగా వాడు తెప్పించెను.౹

23 యెహూయును రేకాబు కుమారుడైన యెహోనాదాబును బయలు గుడిలో ప్రవేశింపగా యెహూ – యెహోవా భక్తులలో ఒకనినైనను ఇచ్చట మీ యొద్దనుండనియ్యక బయలునకు మ్రొక్కువారుమాత్రమే యుండునట్లు జాగ్రత్తచేయుడని బయలునకు మ్రొక్కువారితో ఆజ్ఞ ఇచ్చెను.౹

24 బలులను దహనబలులను అర్పించుటకై వారు లోపల ప్రవేశింపగా యెహూయెనుబదిమందిని బయట కావలియుంచి–నేను మీ వశముచేసినవారిలో ఒకడైన తప్పించుకొనిపోయినయెడల వాని ప్రాణమునకు బదులుగా వానిపోనిచ్చినవాని ప్రాణముతీతునని వారితో చెప్పి యుండెను.౹

25 దహనబలులనర్పించుట సమాప్తికాగా యెహూ–మీరు లోపల చొచ్చి యొకడైనను బయటికి రాకుండ వారిని చంపుడని తన కావలివారితోను అధిపతులతోను చెప్పగా వారు అందరిని హతము చేసిరి. పిమ్మట కావలివారును అధిపతులును వారిని బయటవేసి, బయలు గుడియున్న పట్టణమునకు పోయి

26 బయలు గుడిలోని నిలువు విగ్రహములను బయటికి తీసికొని వచ్చి వాటిని కాల్చివేసిరి.౹

27 మరియు బయలు ప్రతిమను గుడిని క్రింద పడగొట్టి దానిని పెంటయిల్లుగా చేసిరి. నేటివరకు అది ఆలాగే యున్నది

28 ఈ ప్రకారము యెహూ బయలుదేవతను ఇశ్రాయేలువారిమధ్యనుండకుండ నాశనము చేసెను.౹

29 అయితే ఇశ్రాయేలువారు పాపము చేయుటకు నెబాతు కుమారుడైన యరొబాము కారకుడైనట్లు యెహూ కూడ అందుకు కారకుడై, బేతేలు దాను అను స్థలములందున్న బంగారుదూడలను అనుసరించుట మానలేదు.౹

30 కావున యెహోవా యెహూతో నీలాగు సెలవిచ్చెను–నీవు నా హృదయాలోచనయంతటిచొప్పున అహాబు కుటుంబికులకు చేసి నా దృష్టికి న్యాయమైనదాని జరిగించి బాగుగా నెరవేర్చితివి గనుక నీ కుమారులు నాల్గవ తరమువరకు ఇశ్రాయేలురాజ్యసింహాసనముమీద ఆసీనులగుదురు.౹

31 అయితే ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడైన యరొబాముచేసిన పాపములను యెహూ యేమాత్రమును విసర్జించనివాడై ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణహృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేని వాడాయెను.

32 ఆ దినములలో యెహోవా ఇశ్రాయేలువారిని తగ్గించ నారంభించెను.౹

33 హజాయేలు ఇశ్రాయేలు సరిహద్దులలో నున్న యొర్దాను తూర్పుదిక్కున గాదీయులకును రూబే నీయులకును చేరికైన గిలాదు దేశమంతటిలోను, అర్నోను నది దగ్గరనున్న అరోయేరు మొదలుకొని మనష్షీయుల దేశములోను, అనగా గిలాదులోను బాషానులోను వారిని ఓడించెను.౹

34 యెహూచేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దానినంతటినిగూర్చియు, అతని పరాక్రమమునుగూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.౹

35 అంతట యెహూ తన పితరులతోకూడ నిద్రించి షోమ్రోనులో సమాధిచేయబడెను; అతని కుమారుడైన యెహోయాహాజు అతనికి మారుగా రాజాయెను.౹

36 షోమ్రోనులో యెహూ ఇశ్రాయేలును ఏలిన కాలము ఇరువది యెనిమిది యేండ్లు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2KI/10-182ebd010357da2aaa0ab98b7c7a4439.mp3?version_id=1787—

Categories
2 రాజులు

2 రాజులు 11

1 అహజ్యా తల్లియైన అతల్యా తన కుమారుడు మృతి బొందెనని తెలిసికొని లేచి రాజకుమారులనందరిని నాశనము చేసెను.౹

2 రాజైన యెహోరాము కుమార్తెయును అహజ్యాకు సహోదరియునైన యెహోషెబ అహజ్యా కుమారుడైన యోవాషును, హతమైన రాజకుమారులతోకూడ చంపబడకుండ అతని రహస్యముగా తప్పించెను గనుక వారు అతనిని అతని దాదిని పడకగదిలో అతల్యాకు మరుగుగా ఉంచియుండుటచేత అతడు చంపబడకుండెను.౹

3 అతల్యా దేశమును ఏలుచుండగా ఇతడు ఆరుసంవత్సరములు యెహోవామందిరమందు దాదితోకూడ దాచబడి యుండెను.

4 ఏడవ సంవత్సరమందు యెహోయాదా కావలికాయు వారిమీదను రాజదేహ సంరక్షకులమీదను ఏర్పడియున్న శతాధిపతులను పిలువనంపించి, యెహోవా మందిరములోనికి వారిని తీసికొనిపోయి, యెహోవామందిరమందు వారిచేత ప్రమాణము చేయించి వారితో నిబంధనచేసి, వారికి ఆ రాజు కుమారుని కనుపరచి యీలాగు ఆజ్ఞాపించెను

5 –మీరు చేయవలసినదేమనగా, విశ్రాంతిదినమున లోపల ప్రవేశించు మీరు మూడు భాగములై యొక భాగము రాజమందిరమునకు కావలి కాయువారై యుండవలెను;౹

6 ఒక భాగము సూరు గుమ్మముదగ్గర కాపు చేయవలెను, ఒక భాగము కాపు కాయువారి వెనుకటి గుమ్మమునొద్ద ఉండవలెను, ఈ ప్రకారము మందిరమును భద్రపరచుటకై మీరు దానిని కాచుకొని యుండవలెను.౹

7 మరియు విశ్రాంతిదినమున బయలుదేరు మీయందరిలో రెండు భాగములు రాజు దగ్గర యెహోవా మందిరమునకు కాపు కాయువారై యుండవలెను.౹

8 మీలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చేతపట్టుకొని రాజుచుట్టు కాచుకొని యుండవలెను, ఎవడైనను పంక్తులలో ప్రవేశించినయెడల వాని చంపవలెను, రాజు బయలుదేరి సంచరించునప్పుడెల్ల మీరు అతనియొద్ద ఉండవలెను.౹

9 శతాధిపతులు యాజకుడైన యెహోయాదా తమ కిచ్చిన ఆజ్ఞలన్నిటి ప్రకారము చేసిరి, ప్రతి మనిషి తన తన మనుష్యులను తీసికొని విశ్రాంతిదినమున లోపల ప్రవేశింపవలసిన వారితోను, విశ్రాంతిదినమున బయలుదేరవలసిన వారితోను కలిసి యాజకుడైన యెహోయాదా యొద్దకు వచ్చెను.౹

10 యాజకుడు మందిరములో ఉన్న దావీదు ఈటెలను డాళ్లను శతాధిపతులకు అప్పగింపగా

11 కాపు కాయువారిలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చేతపట్టుకొని బలిపీఠముచెంతను మందిరముచెంతను మందిరము కుడికొన మొదలుకొని యెడమకొనవరకు రాజుచుట్టు నిలిచిరి.౹

12 అప్పుడు యాజకుడు రాజకుమారుని బయటకు తోడుకొనిపోయి అతని తలమీద కిరీటము పెట్టి, ధర్మశాస్త్రగ్రంథమును అతనిచేతికిచ్చిన తరువాత వారు అతని పట్టాభిషిక్తునిగా చేసి చప్పట్లుకొట్టి–రాజు చిరంజీవి యగునుగాకని చాటించిరి.౹

13 అతల్యా, కాయువారును జనులును కేకలువేయగా విని, యెహోవామందిరమందున్న జనుల దగ్గరకు వచ్చి

14 రాజు ఎప్పటి మర్యాద చొప్పున ఒక స్తంభముదగ్గర నిలుచుటయు, అధిపతులును బాకా ఊదువారును రాజునొద్ద నిలువబడుటయు, దేశపు వారందరును సంతోషించుచు శృంగధ్వనిచేయుటయు చూచి తన వస్త్రములను చింపుకొని – ద్రోహము ద్రోహము అని కేక వేయగా

15 యాజకుడైన యెహోయాదా సైన్యములోని శతాధిపతులకు – యెహోవామందిరమందు ఆమెను చంపకూడదు, పంక్తుల బయటికి ఆమెను వెళ్లగొట్టుడి; ఆమె పక్షపువారిని ఖడ్గముచేత చంపుడని ఆజ్ఞ ఇచ్చెను గనుక

16 రాజమందిరములోనికి గుఱ్ఱములు వచ్చు మార్గమున ఆమెకు దారి ఇచ్చిరి. ఆమె వెళ్లిపోగా వారు ఆమెను అక్కడ పట్టుకొని చంపిరి.

17 అప్పుడు యెహోయాదా–జనులు యెహోవావారని ఆయన పేరట రాజుతోను జనులతోను నిబంధన చేయిం చెను, మరియు అతడు రాజుపేరట జనులతో నిబంధన చేయించెను.౹

18 అప్పుడు దేశపు జనులందరును బయలు గుడికి పోయి దానిని పడగొట్టి దాని బలిపీఠములను ప్రతి మలను ఛిన్నాభిన్నములుచేసి, బయలునకు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపివేసిరి. మరియు యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరమును కాచుకొనుటకు మనుష్యులను నియమించెను.౹

19 అతడు శతాధిపతులను అధికారులను కాపుకాయువారిని దేశపు జనులందరిని పిలిపింపగా వారు యెహోవా మందిరములోనున్న రాజునుతీసికొని, కాపుకాయువారి గుమ్మపు మార్గమున రాజనగరునకు రాగా రాజు సింహాసనముమీద ఆసీనుడాయెను.౹

20 మరియు వారు రాజనగరు దగ్గర అతల్యాను ఖడ్గముచేత చంపిన తరువాత దేశపు జనులందరును సంతోషించిరి, పట్టణమును నిమ్మళముగా ఉండెను.౹

21 యోవాషు ఏలనారంభించినప్పుడు అతడు ఏడేండ్లవాడు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2KI/11-0684c7c1d20c1480cd03fffd557a9085.mp3?version_id=1787—

Categories
2 రాజులు

2 రాజులు 12

1 యెహూ యేలుబడిలో ఏడవ సంవత్సరమందు యోవాషు ఏలనారంభించి యెరూషలేములో నలువది సంవత్సరములు ఏలెను. అతని తల్లి బెయేర్షెబా సంబంధురాలైన జిబ్యా.౹

2 యాజకుడైన యెహోయాదా తనకు బుద్ధినేర్పువాడైయుండు దినములన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించెను.౹

3 అయితే ఉన్నతస్థలములు కొట్టివేయబడక నిలిచెను; జనులు ఇంకను ఉన్నతస్థలములందు బలులు అర్పించుచు ధూపము వేయుచు నుండిరి.

4 యోవాషు యాజకులను పిలిపించి–యెహోవా మందిరములోనికి తేబడు ప్రతిష్ఠిత వస్తువుల విలువను అనగా జనసంఖ్య దాఖలాచేయబడిన జనులు తెచ్చిన ద్రవ్యమును వంతుచొప్పున ప్రతి మనిషికి నిర్ణయమైన ద్రవ్యమును, స్వేచ్ఛచేత నెవరైనను యెహోవా మందిరములోనికి తెచ్చిన ద్రవ్యమును,౹

5 యాజకులలో ఒక్కొక్కడు తనకు నెలవైన వారియొద్ద తీసికొని, మందిరము ఎచ్చటెచ్చట శిథిలమై యున్నదో అచ్చటనెల్ల దానిని బాగుచేయింపవలెనని ఆజ్ఞ ఇచ్చెను.౹

6 అయితే యోవాషు ఏలుబడిలో ఇరువది మూడవ సంవత్సరమువరకును యాజకులు మందిరముయొక్క శిథిలమైన స్థలములను బాగుచేయకయే యుండిరి గనుక

7 యోవాషు యాజకుడైన యెహోయాదాను మిగి లిన యాజకులను పిలిపించి–మందిరములో శిథిలమైన స్థలములను మీరెందుకు బాగుచేయక పోతిరి? ఇకను మీ మీ నెలవైన వారియొద్ద ద్రవ్యము తీసికొనక, మందిరములో శిథిలమైన స్థలములను బాగుచేయుటకై మీరు అంతకుముందు తీసికొనినదాని నప్పగించుడని ఆజ్ఞ ఇచ్చి యుండెను.౹

8 కాబట్టి యాజకులు–మందిరములో శిథిలమైన స్థలములను బాగుచేయుట మా వశములేదు గనుక జనులయొద్ద ద్రవ్యము ఇక తీసికొనమని చెప్పిరి.౹

9 అంతట యాజకుడైన యెహోయాదా ఒక పెట్టెను తెచ్చి దాని మూతకు బెజ్జము చేసి, బలిపీఠము దగ్గరగా యెహోవా మందిరములో ప్రవేశించు వారి కుడిపార్శ్వమందు దాని నుంచగా ద్వారముకాయు యాజకులు యెహోవా మందిరములోనికి వచ్చిన ద్రవ్యమంతయు అందులో వేసిరి.౹

10 పెట్టెలో ద్రవ్యము విస్తారముగా ఉన్నదని వారు తెలియ జేయగా రాజుయొక్క ప్రధానమంత్రియును ప్రధానయాజకుడును వచ్చి, యెహోవామందిరమందు దొరికిన ద్రవ్యము లెక్కచూచి సంచులలో ఉంచిరి.౹

11 తరువాత వారు ఆ ద్రవ్యమును తూచి యెహోవా మందిరపు కాపరులకు, అనగా పనిచేయించు వారి కప్పగించిరి; వీరు యెహోవామందిరమందు పనిచేసిన కంసాలులకును శిల్పకారులకును కాసెపనివారికిని రాతిపనివారికిని

12 యెహోవామందిరమందు శిథిలమైన స్థలములను బాగుచేయుటకు మ్రానులనేమి చెక్కబడిన రాళ్లనేమి కొనుటకును, మందిరము బాగుచేయుటలో అయిన ఖర్చు అంతటికిని, ఆ ద్రవ్యము ఇచ్చుచు వచ్చిరి.౹

13 యెహోవా మందిరమునకు వెండి పాత్రలైనను, కత్తెరలైనను, గిన్నెలైనను, బాకా లైనను, బంగారు పాత్రలైనను, వెండిపాత్రలైనను చేయబడలేదుగాని

14 మరమ్మతు పనిచేయువారికి మాత్రము ఆ ద్రవ్యము ఇచ్చి యెహోవా మందిరమును మరల బాగుచేయించిరి.౹

15 మరియు పనివారికిచ్చుటకై ఆ ద్రవ్యము అప్పగింత పెట్టుకొనినవారు నమ్మకస్థులని వారిచేత లెక్క అడుగలేదు.౹

16 అపరాధ పరిహారార్థ బలులవలనను పాప పరిహారార్థ బలులవలనను దొరికిన సొమ్ము యెహోవా మందిరములోనికి తేబడలేదు, అది యాజకులదాయెను.

17 అంతట సిరియారాజైన హజాయేలు గాతు పట్టణము మీదికి పోయి యుద్ధముచేసి దాని పట్టుకొనిన తరువాత అతడు యెరూషలేముమీదికి రాదలచియుండగా

18 యూదారాజైన యోవాషు తన పితరులైన యెహోషాపాతు యెహోరాము అహజ్యా అను యూదారాజులు ప్రతిష్ఠించిన వస్తువులన్నిటిని, తాను ప్రతిష్ఠించిన వస్తువులను, యెహోవా మందిరములోను రాజనగరులోనున్న పదార్థములలోను కనబడిన బంగారమంతయు తీసికొని సిరియారాజైన హజాయేలునకు పంపగా అతడు యెరూషలేమునొద్దనుండి తిరిగిపోయెను.౹

19 యోవాషు చేసిన యితర కార్యములనుగూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.౹

20 అతని సేవకులు లేచి కుట్రచేసి సిల్లా అను చోటకి పోవుమార్గమందున్న మిల్లో అను నగరునందు యోవాషును చంపిరి.౹

21 ఎట్లనగా షిమాతు కుమారుడైన యోజాకారు షోమేరు కుమారుడైన యెహోజాబాదు అను అతని సేవకులును అతనిమీద పడగా అతడు మరణమాయెను. జనులు దావీదు పురమందు అతని పితరుల సమాధిలో అతనిని పాతిపెట్టిరి; అతని కుమారుడైన అమజ్యా అతనికి మారుగా రాజాయెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2KI/12-84216f75cb62d5e3e4d1232c5bb73551.mp3?version_id=1787—

Categories
2 రాజులు

2 రాజులు 13

1 యూదారాజైన అహజ్యా కుమారుడైన యోవాషు ఏలుబడిలో ఇరువది మూడవ సంవత్సరమందు యెహూ కుమారుడైన యెహోయాహాజు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి పదునైదు సంవత్సరములు ఏలెను.౹

2 ఇతడు ఇశ్రాయేలువారు పాపముచేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.౹

3 కాబట్టి యెహోవా కోపము ఇశ్రాయేలువారిమీద రగులుకొనగా ఆయన సిరియారాజైన హజాయేలు దినములన్నిటను హజాయేలు కుమారుడైన బెన్హదదు దినములన్నిటను ఇశ్రాయేలువారిని వారి కప్పగించెను.౹

4 అయితే యెహోయాహాజు యెహోవాను వేడుకొనగా యెహోవా సిరియా రాజుచేత బాధనొందిన ఇశ్రాయేలువారిని కనికరించి అతని మనవి నంగీకరించెను.౹

5 కావున యెహోవా ఇశ్రాయేలువారికి ఒక రక్షకుని అనుగ్రహింపగా అతనిచేత ఇశ్రాయేలువారు సిరియనుల వశములోనుండి తప్పించుకొనిమునుపటివలె స్వస్థానములలో కాపురముండిరి.౹

6 అయినను ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు యరొబాము కుటుంబికులు చేసిన పాపములను వారు విడువక వాటిననుసరించుచు వచ్చిరి. మరియు ఆ దేవతాస్తంభమును షోమ్రోనులో నిలిచియుండెను.౹

7 రౌతులలో ఏబదిమందియు రథములలో పదియు కాల్బలములో పదివేలమందియు మాత్రమే యెహోయాహాజు దగ్గర ఉండిరి; మిగిలినవారిని సిరియా రాజు దుళ్లకొట్టిన ధూళివలె నాశనముచేసి యుండెను.౹

8 యెహోయాహాజు చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసినదానినంతటినిగూర్చియు, అతని పరాక్రమమునుగూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.౹

9 యెహోయాహాజు తన పితరులతోకూడ నిద్రించి షోమ్రోనులో పాతిపెట్టబడెను; అతని కుమారుడైన యెహోయాషు అతనికి మారుగా రాజాయెను.

10 యూదారాజైన యోవాషు ఏలుబడిలో ముప్పది యేడవ సంవత్సరమందు యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారం భించి పదునారుసంవత్సరములు ఏలెను.౹

11 ఇతడును ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక వాటి ననుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.౹

12 యెహోయాషు చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసినదాని అంతటినిగూర్చియు, యూదారాజైన అమజ్యాతో యుద్ధము చేయునప్పుడు అతడు కనుపరచిన పరాక్రమమునుగూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.౹

13 యెహోయాషు తన పితరులతోకూడ నిద్రించిన తరువాత యరొబాము అతని సింహాసనముమీద ఆసీనుడాయెను; యెహోయాషు షోమ్రోనులో ఇశ్రాయేలురాజుల సమాధియందు పాతిపెట్టబడెను.

14 అంతట ఎలీషా మరణకరమైన రోగముచేత పీడితుడై యుండగా ఇశ్రాయేలురాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచు–నా తండ్రీ నా తండ్రీ, ఇశ్రాయేలువారికి రథమును రౌతులును నీవే అని యేడ్చెను.౹

15 అందుకు ఎలీషా–నీవు వింటిని బాణములను తీసికొమ్మని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసికొనెను.౹

16 –నీ చెయ్యి వింటిమీద ఉంచుమని అతడు ఇశ్రాయేలురాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటిమీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతులమీద వేసి

17 –తూర్పువైపున నున్న కిటికీని విప్పుమని చెప్పగా అతడు విప్పెను. అప్పుడు ఎలీషా –బాణము వేయుమని చెప్పగా అతడు బాణము వేసెను అతడు–ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనులచేతిలోనుండి మిమ్మును రక్షించు బాణము; సిరియనులు నాశనమగునట్లు నీవు అఫెకులో వారిని హతముచేయుదు వని చెప్పి,౹

18 బాణములను పట్టుకొమ్మనగా అతడు పట్టుకొనెను. అంతట అతడు ఇశ్రాయేలురాజుతో–నేలను కొట్టుమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను.౹

19 అందునిమిత్తము దైవజనుడు అతనిమీద కోపగించి–నీవు అయిదుమారులైన ఆరుమారులైన కొట్టినయెడల సిరియనులు నాశనమగువరకు నీవు వారిని హతము చేసియుందువు; అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులను ఓడించెదవని చెప్పెను.

20 తరువాత ఎలీషా మృతిపొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. ఒక సంవత్సరము గడచిన తరువాత మోయాబీయుల సైన్యము దేశముమీదికి వచ్చినప్పుడు

21 కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషాయొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్లు మోపి నిలిచెను.

22 యెహోయాహాజు దినములన్నియు సిరియారాజైన హజాయేలు ఇశ్రాయేలువారిని బాధపెట్టెను.౹

23 గాని యెహోవావారిమీద జాలిపడి వారియందు దయయుంచి, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసియున్న నిబంధననుబట్టి వారియందు లక్ష్యము నిలిపి, వారిని నాశము చేయనొల్లక యిప్పటికిని తన సముఖములోనుండి వారిని వెళ్లగొట్టక యుండెను.౹

24 సిరియారాజైన హజాయేలు మరణముకాగా అతని కుమారుడైన బెన్హదదు అతనికి మారుగా రాజాయెను.౹

25 అంతట యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు హజాయేలు కుమారుడైన బెన్హదదు తన తండ్రియైన యెహోయాహాజు చేతిలోనుండి యుద్ధమందు పట్టుకొనిన పట్టణములను మరల తీసి కొనెను. యెహోయాషు అతని ముమ్మారు జయించి ఇశ్రాయేలు పట్టణములను మరల వశపరచుకొనెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2KI/13-836f92f905849492e1e003e03e694d73.mp3?version_id=1787—

Categories
2 రాజులు

2 రాజులు 14

1 ఇశ్రాయేలురాజును యెహోయాహాజు కుమారుడునైన యెహోయాషు ఏలుబడిలో రెండవ సంవత్సరమందు యూదారాజును యోవాషు కుమారుడునైన అమజ్యా రాజాయెను.౹

2 అతడు ఏలనారంభించినప్పుడు ఇరువదియయిదేండ్లవాడై యెరూషలేమునందు ఇరువదితొమ్మిది సంవత్సరములు ఏలెను; అతని తల్లి యెరూషలేము కాపురస్థురాలైన యెహోయద్దాను.౹

3 ఇతడు తన పితరుడైన దావీదు చేసినట్టు చేయక పోయినను, యెహోవా దృష్టికి నీతిగలవాడై తన తండ్రియైన యోవాషు చేసిన ప్రకారము చేసెను.౹

4 అయితే అతడు ఉన్నతస్థలములను కొట్టివేయ లేదు; జనులు ఇంకను ఉన్నతస్థలములలో బలులనర్పించుచు ధూపము వేయుచునుండిరి.౹

5 రాజ్యమందు తాను స్థాపింపబడిన తరువాత రాజగు తన తండ్రిని చంపిన తన సేవకులను అతడు హతము చేయించెను.౹

6 అయితే– కుమారుల దోషమునుబట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు, తండ్రుల దోషమునుబట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపమునిమిత్తము వాడే మరణశిక్ష నొందును, అని మోషే వ్రాసియిచ్చిన ధర్మశాస్త్రమందు యెహోవా యిచ్చిన ఆజ్ఞనుబట్టి ఆ నరహంతకుల పిల్లలను అతడు హతము చేయలేదు.౹

7 మరియు ఉప్పు లోయలో అతడు యుద్ధము చేసి ఎదోమీయులలో పదివేలమందిని హతముచేసి, సెల అను పట్టణమును పట్టుకొని దానికి యొక్తయేలని పేరు పెట్టెను; నేటివరకు దానికి అదే పేరు.

8 అంతట అమజ్యా ఇశ్రాయేలురాజైన యెహూకు పుట్టిన యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు నొద్దకు దూతలను పంపి–మనము ఒకరి నొకరము దర్శించునట్లు నన్ను కలియ రమ్మని వర్తమానముచేయగా

9 ఇశ్రాయేలురాజైన యెహోయాషు యూదారాజైన అమజ్యాకు ఈలాగు వర్తమానము పంపెను–లెబానోనులోనున్న ముండ్ల చెట్టొకటి–నీ కుమార్తెను నా కుమారునికిమ్మని లెబానో నులోనున్న దేవదారు వృక్షమునకు వర్తమానము పంపగా, లెబానోనులోనున్న దుష్టమృగము వచ్చి ఆ ముండ్లచెట్టును త్రొక్కివేసెను.౹

10 నీవు ఎదోమీయులను హతము చేసినందున నీ హృదయమందు నీవు అతిశయపడుచున్నావు సరే; యిప్పుడు నీ నగరునందు నీవుండి నీకున్న ఘనతనుబట్టి నీవు అతిశయపడుము. నీవు మాత్రము గాక నీతోకూడ యూదావారును కూలునట్లుగా నీవెందుకు అపాయములో దిగుదువని చెప్పినను

11 అమజ్యా విననొల్లనందున ఇశ్రాయేలురాజైన యెహోయాషు బయలుదేరి, యూదా సంబంధమైన బేత్షెమెషు పట్టణముదగ్గర తానును యూదా రాజైన అమజ్యాయు కలిసికొనగా

12 యూదావారు ఇశ్రాయేలువారియెదుట నిలువలేక అపజయమొంది అందరును తమతమ గుడారములకు పారిపోయిరి.౹

13 మరియు ఇశ్రాయేలురాజైన యెహోయాషు అహజ్యాకుపుట్టిన యోవాషు కుమారుడైన అమజ్యా అను యూదారాజును బేత్షెమెషు దగ్గర పట్టుకొని యెరూషలేమునకు వచ్చి, ఎఫ్రాయిము గుమ్మము మొదలుకొని మూల గుమ్మమువరకు యెరూషలేము ప్రాకారమును నాలుగువందల మూరల పొడుగున పడగొట్టెను.౹

14 మరియు యెహోవా మందిరమునందును రాజనగరునందును కనబడిన బంగారము వెండి మొదలైన సమస్తవస్తువులను పట్టణస్థులలో కుదవ పెట్టబడినవారిని తీసికొని షోమ్రోనునకు వచ్చెను.౹

15 యెహోయాషు చేసిన యితర కార్యములనుగూర్చియు, అతని పరాక్రమమునుగూర్చియు యూదారాజైన అమజ్యాతో అతడు చేసిన యుద్ధమునుగూర్చియు ఇశ్రాయేలురాజులవృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.౹

16 అంతట యెహోయాషు తన పితరులతోకూడ నిద్రించి షోమ్రోనులో ఇశ్రాయేలురాజుల సమాధియందు పాతిపెట్టబడెను; అతని కుమారుడైన యరొబాము అతనికి మారుగా రాజాయెను.

17 యూదారాజైన యోవాషు కుమారుడైన అమజ్యా ఇశ్రాయేలురాజైన యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు మరణమైన తరువాత పదునయిదు సంవత్సరములు బ్రదికెను.౹

18 అమజ్యా చేసిన యితర కార్యములనుగూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయ బడి యున్నది.౹

19 అతనిమీద యెరూషలేములో జనులు కుట్రచేయగా అతడు లాకీషు పట్టణమునకు పారిపోయెనుగాని వారు లాకీషునకు అతనివెంట కొందరిని పంపిరి.౹

20 వారు అక్కడ అతనిని చంపి గుఱ్ఱములమీద అతని శవమును యెరూషలేమునకు తెప్పించి దావీదు పురమందు అతని పితరుల సమాధిలో పాతిపెట్టిరి.౹

21 అప్పుడు యూదా జనులందరును పదునారు సంవత్సరములవాడైన అజర్యాను తీసికొని అతని తండ్రియైన అమజ్యాకు బదులుగా పట్టాభి షేకము చేసిరి.౹

22 ఇతడు రాజైన తన తండ్రి తన పితరులతో నిద్రించిన తరువాత ఏలతు అను పట్టణమును బాగుగా కట్టించి యూదావారికి దానిని మరల అప్పగించెను.

23 యూదారాజును యోవాషు కుమారుడునైన అమజ్యా యేలుబడిలో పదునయిదవ సంవత్సరమందు ఇశ్రాయేలురాజైన యెహోయాషు కుమారుడగు యరొబాము షోమ్రోనులో ఏలనారంభించి నలువదియొక సంవత్సరములు ఏలెను.౹

24 ఇతడును ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.౹

25 గత్హేపరు ఊరివాడైన అమిత్త యికి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్తద్వారా ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున ఇతడు హమాతునకుపోవు మార్గము మొదలుకొని మైదానపు సముద్రమువరకు ఇశ్రాయేలువారి సరిహద్దును మరల స్వాధీనము చేసికొనెను.౹

26 ఏలయనగా అల్పులేమి ఘనులేమి ఇశ్రాయేలువారికి సహాయులెవరును లేకపోయిరి.౹

27 యెహోవా ఇశ్రాయేలువారు పొందిన బాధ ఘోరమైనదనుకొనెను. ఇశ్రాయేలను పేరు ఆకా శము క్రిందనుండి తుడిచివేయనని యెహోవా సెలవిచ్చి యుండెను గనుక యెహోయాషు కుమారుడైన యరొబాము ద్వారా వారిని రక్షించెను.౹

28 యరొబాము చేసిన యితరకార్యములనుగూర్చియు, అతడు చేసిన దానినంతటిని గూర్చియు, అతని పరాక్రమమునుగూర్చియు, అతడు చేసిన యుద్ధమునుగూర్చియు, దమస్కు పట్టణమును యూదావారికి కలిగియున్న హమాతు పట్టణమును ఇశ్రాయేలువారి కొరకై అతడు మరల పట్టుకొనిన సంగతిని గూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.౹

29 యరొబాము తన పితరులైన ఇశ్రాయేలురాజులతోకూడ నిద్రించిన తరువాత అతని కుమారుడైన జెకర్యా అతనికి మారుగా రాజాయెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2KI/14-d6a070091bf654d6969bf0dea48067e4.mp3?version_id=1787—

Categories
2 రాజులు

2 రాజులు 15

1 ఇశ్రాయేలురాజైన యరొబాము ఏలుబడిలో ఇరువది మూడవ సంవత్సరమందు యూదారాజైన అమజ్యా కుమారుడైన అజర్యా యేలనారంభించెను.౹

2 అతడు పదునారేండ్లవాడై యేలనారంభించి యెరూషలేమునందు ఏబది రెండు సంవత్సరములు రాజుగా ఉండెను; అతని తల్లి యెరూషలేము కాపురస్థురాలైన యెకొల్యా.౹

3 ఇతడు తన తండ్రియైన అమజ్యా చర్యయంతటిప్రకారము యెహోవా దృష్టికి నీతిగలవాడై ప్రవర్తించెను.౹

4 ఉన్నతస్థలములను మాత్రము కొట్టి వేయలేదు; ఉన్నతస్థలములయందు జనులు ఇంకను బలులు అర్పించుచు ధూపము వేయుచు ఉండిరి.౹

5 యెహోవా ఈ రాజును మొత్తినందున అతడు మరణమగువరకు కుష్ఠరోగియై ప్రత్యేకముగా ఒక నగరులో నివసించెను గనుక రాజకుమారుడైన యోతాము నగరుమీద అధికారియై దేశపు జనులకు న్యాయము తీర్చువాడుగా ఉండెను.౹

6 అజర్యా చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దానినంతటినిగూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.౹

7 అజర్యా తన పితరులతోకూడ నిద్రించి దావీదు పురములో తన పితరుల సమాధియందు పాతిపెట్టబడగా అతని కుమారుడైన యోతాము అతనికి మారుగా రాజాయెను.

8 యూదారాజైన అజర్యా యేలుబడిలో ముప్పది యెనిమిదవ సంవత్సరమందు యరొబాము కుమారుడైన జెకర్యా షోమ్రోనులో ఇశ్రాయేలువారిని ఆరునెలలు ఏలెను.౹

9 ఇతడు ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు, తన పితరులు చేసినట్లుగా తానును యెహోవా దృష్టికి చెడుతనము జరి గించెను.౹

10 యాబేషు కుమారుడైన షల్లూము అతనిమీద కుట్రచేసి, జనులు చూచుచుండగా అతనిమీదపడి అతనిని చంపి అతనికి మారుగా రాజాయెను.౹

11 జెకర్యా చేసిన కార్యములనుగూర్చి ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.౹

12 –నీ కుమారులు నాలుగవ తరమువరకు ఇశ్రాయేలు సింహాసనముమీద ఆసీనులైయుందురని యెహోవా యెహూతో సెలవిచ్చిన మాటచొప్పున ఇది జరిగెను.

13 యూదారాజైన ఉజ్జియా యేలుబడిలో ముప్పది తొమ్మిదవ సంవత్సరమందు యాబేషు కుమారుడైన షల్లూము ఏలనారంభించి షోమ్రోనులో నెలదినములు ఏలెను.౹

14 గాదీ కుమారుడైన మెనహేము తిర్సాలోనుండి బయలుదేరి షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులోనుండు యాబేషు కుమారుడైన షల్లూముమీదపడి అతని చంపి అతనికి మారుగా రాజాయెను.౹

15 షల్లూము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన కుట్రనుగూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయ బడియున్నది.౹

16 మెనహేము రాగా తిప్సహు పట్టణపు వారు తమ గుమ్మములు తీయలేదు గనుక అతడు వారినందరిని హతము చేసి, తిర్సాను దాని చేరువ గ్రామములనన్నిటిని కొల్లపెట్టి అచ్చట గర్భిణులందరి గర్భములను చింపెను.

17 యూదారాజైన అజర్యా యేలుబడిలో ముప్పదితొమ్మిదవ సంవత్సరమందు గాదీ కుమారుడైన మెనహేము ఇశ్రాయేలువారిని ఏలనారంభించి షోమ్రోనులో పది సంవత్సరములు ఏలెను.౹

18 ఇతడును తన దినములన్నియు ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక యనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.౹

19 అష్షూరు రాజైన పూలు దేశముమీదికి రాగా, మెనహేము తనకు రాజ్యము స్థిరపరచునట్లుగా పూలుచేత సంధి చేయించుకొనవలెనని రెండువేల మణుగుల వెండి పూలునకు ఇచ్చెను.౹

20 మెనహేము ఇశ్రాయేలులో భాగ్యవంతులైన గొప్పవారిలో ప్రతి మనిషి యొద్దను ఏబదేసి తులముల వెండి వసూలుచేసి యీ ద్రవ్యమును అష్షూరు రాజునకిచ్చెను గనుక అష్షూరురాజు దేశమును విడిచి వెళ్లిపోయెను.౹

21 మెనహేము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దానినంతటిని గూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.౹

22 మెనహేము తన పితరులతోకూడ నిద్రించిన తరువాత అతని కుమారుడైన పెకహ్యా అతనికి మారుగా రాజాయెను.

23 యూదారాజైన అజర్యా యేలుబడిలో ఏబదియవ సంవత్సరమందు మెనహేము కుమారుడైన పెకహ్యా షోమ్రోనులో ఇశ్రాయేలువారిని ఏలనారంభించి రెండు సంవత్సరములు ఏలెను.౹

24 ఇతడును ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.౹

25 ఇతని క్రింద అధిపతియు రెమల్యా కుమారుడునైన పెకహు కుట్ర చేసి, తనయొద్దనున్న గిలాదీయులైన యేబదిమందితోను, అర్గోబుతోను, అరీహేనుతోను కలిసికొని షోమ్రోనులో నున్న రాజనగరులోని అంతఃపురమందు అతనిని చంపి, పెకహ్యాకు మారుగా రాజాయెను.౹

26 పెకహ్యా చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసినదానినంతటినిగూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.

27 యూదారాజైన అజర్యా యేలుబడిలో ఏబదిరెండవ సంవత్సరమందు రెమల్యా కుమారుడైన పెకహు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి యిరువది సంవత్సరములు ఏలెను.౹

28 ఇతడును ఇశ్రాయేలువారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను.౹

29 ఇశ్రాయేలురాజైన పెకహు దినములలో అష్షూరురాజైన తిగ్లత్పిలేసెరు వచ్చి ఈయోను పట్టణమును, ఆబేల్బేత్మయకా పట్టణమును, యానోయహు పట్టణమును, కెదెషు పట్టణమును, హాసోరు పట్టణమును, గిలాదు దేశమును, గలిలయ దేశమును, నఫ్తాలీ దేశమంతయును పట్టుకొని అచ్చటనున్నవారిని అష్షూరు దేశమునకు చెరగా తీసికొని పోయెను.౹

30 అప్పుడు ఏలా కుమారుడైన హోషేయ ఇశ్రాయేలురాజును రెమల్యా కుమారుడునైన పెకహుమీద కుట్రచేసి, అతనిమీదపడి అతని చంపి, యూదా రాజైన ఉజ్జియా కుమారుడైన యోతాము ఏలుబడిలో ఇరువదియవ సంవత్సరమున అతనికి మారుగా రాజాయెను.౹

31 పెకహు చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసిన దానినంతటిని గూర్చియు ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయ బడియున్నది.

32 ఇశ్రాయేలురాజును రెమల్యా కుమారుడునైన పెకహు ఏలుబడిలో రెండవ సంవత్సరమున యూదారాజైన ఉజ్జియా కుమారుడగు యోతాము ఏలనారంభించెను.౹

33 అతడు ఇరువదియయిదేండ్లవాడై యెరూషలేమునందు రాజై పదునారు సంవత్సరములు ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తెయైన యెరూషా.౹

34 ఇతడు యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రియైన ఉజ్జియా చర్యను పూర్తిగా అనుసరించెను.౹

35 అయినను ఉన్నతస్థలములను కొట్టివేయకుండెను; జనులు ఉన్నతస్థలములందు ఇంకను బలులనర్పించుచు ధూపము వేయుచునుండిరి. ఇతడు యెహోవా మందిరమునకున్న యెత్తయిన ద్వారమును కట్టించెను.౹

36 యోతాము చేసిన యితర కార్యములనుగూర్చియు, అతడు చేసినదానినంతటినిగూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.౹

37 ఆ దినములో యెహోవా సిరియారాజైన రెజీనును రెమల్యా కుమారుడైన పెకహును యూదా దేశముమీదికి పంపనారంభించెను.౹

38 యోతాము తన పితరులతోకూడ నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను; అతని కుమారుడైన ఆహాజు అతనికి మారుగా రాజాయెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2KI/15-9a6a66c40fce75063f5f32bbded62309.mp3?version_id=1787—

Categories
2 రాజులు

2 రాజులు 16

1 రెమల్యా కుమారుడైన పెకహు ఏలుబడిలో పదునేడవ సంవత్సరమందు యూదారాజైన యోతాము కుమారుడగు ఆహాజు ఏలనారంభించెను.౹

2 ఆహాజు ఏలనారంభించి నప్పుడు ఇరువది యేండ్లవాడై యెరూషలేమునందు పదునారు సంవత్సరములు ఏలెను. తన పితరుడగు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇశ్రాయేలురాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించెను.౹

3 అతడు ఇశ్రాయేలీయుల ముందర నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలుచేయుచు, తన కుమారుని అగ్నిగుండమును దాటించెను.౹

4 మరియు అతడు ఉన్నతస్థలములలోను కొండమీదను సమస్తమైన పచ్చని వృక్షములక్రిందను బలులు అర్పించుచు ధూపము వేయుచు వచ్చెను.౹

5 సిరియారాజైన రెజీనును ఇశ్రాయేలురాజైన రెమల్యా కుమారుడగు పెకహును యెరూషలేముమీదికి యుద్ధమునకువచ్చి అక్కడ నున్న ఆహాజును పట్టణమును ముట్టడివేసిరిగాని అతనిని జయింపలేక పోయిరి.౹

6 ఆ కాలమందు సిరియారాజైన రెజీను ఏలతును మరల పట్టుకొని సిరియనుల వశముచేసి, ఏలతులోనుండి యూదావారిని వెళ్లగొట్టగా సిరియనులు ఏలతు పట్టణమునకు వచ్చి కాపురముండిరి. నేటివరకును వారచ్చటనే యున్నారు.౹

7 ఇట్లుండగా ఆహాజు యెహోవామందిర సంబంధమైనట్టియు రాజనగరు సంబంధమైనట్టియు సామగ్రులలో కనబడిన వెండి బంగారములను తీసికొని అష్షూరురాజునకు కానుకగా పంపి

8 –నేను నీ దాసుడను నీ కుమారుడనైయున్నాను గనుక నీవు వచ్చి, నామీదికి లేచిన సిరియారాజు చేతిలోనుండియు ఇశ్రాయేలురాజు చేతిలోనుండియు నన్ను రక్షింపవలెనని అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరునొద్దకు దూతలనంపగా

9 అష్షూరు రాజు అతనిమాట అంగీకరించి, దమస్కు పట్టణముమీదికి వచ్చి దాని పట్టుకొని, రెజీనును హతముచేసి ఆ జనులను కీరు పట్టణమునకు చెరదీసికొని పోయెను.౹

10 రాజైన ఆహాజు అష్షూరురాజైన తిగ్లత్పిలేసెరును కలిసికొనుటకై దమస్కు పట్టణమునకు వచ్చి, దమస్కు పట్టణమందు ఒక బలిపీఠమును చూచి, దాని పోలికెను, మచ్చును, దాని పని విధ మంతయును యాజకుడైన ఊరియాకు పంపెను.౹

11 కాబట్టి యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు దమస్కుపట్టణము నుండి పంపిన మచ్చునకు సమమైన యొక బలిపీఠమును కట్టించి, రాజైన ఆహాజు దమస్కునుండి తిరిగి రాకమునుపే సిద్ధపరచెను.౹

12 అంతట రాజు దమస్కునుండి వచ్చి బలిపీఠమును చూచి ఆ బలిపీఠమునొద్దకు వచ్చి దాని ఎక్కి

13 దహన బలిని నైవేద్యమును అర్పించి పానార్పణము చేసి, తాను అర్పించిన సమాధానబలిపశువుల రక్తమును దానిమీద ప్రోక్షించెను.౹

14 మరియు యెహోవా సన్నిధినున్న యిత్తడి బలిపీఠమును మందిరము ముంగిటిస్థలము నుండి, అనగా తాను కట్టించిన బలిపీఠమునకును యెహోవా మందిరమునకును మధ్యనుండి తీయించి, తాను కట్టించిన దాని ఉత్తర పార్శ్వమందు దానిని ఉంచెను.౹

15 అప్పుడు రాజైన ఆహాజు యాజకుడైన ఊరియాకు ఆజ్ఞాపించిన దేమనగా–ఈ పెద్ద బలిపీఠముమీద ఉదయము అర్పించు దహనబలులను, సాయంత్రమున అర్పించు నైవేద్యములను రాజుచేయు దహనబలి నైవేద్యములను దేశపు జనులందరు అర్పించు దహనబలి నైవేద్యములను పానార్పణలను దహించి, యే దహనబలి జరిగినను, ఏ బలిజరిగినను వాటి పశువుల రక్తమును దానిమీదనే ప్రోక్షింపవలెను. అయితే ఈ యిత్తడి బలిపీఠము దేవునియొద్ద నేను విచారణ చేయుట కుంచవలెను.౹

16 కాగా యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు ఆజ్ఞ చొప్పున అంతయుచేసెను.౹

17 మరియు రాజైన ఆహాజు స్తంభముల అంచులను తీసివేసి వాటిమీద నున్న తొట్టిని తొలగించెను, ఇత్తడి యెడ్లమీద నున్న సముద్రమును దింపి రాతి కట్టుమీద దానిని ఉంచెను.౹

18 మరియు అతడు అష్షూరు రాజునుబట్టి విశ్రాంతిదినపు ఆచరణకొరకై మందిరములో కట్టబడిన మంటపమును, రాజు ఆవరణముగుండ పోవు ద్వారమును యెహోవా మందిరమునుండి తీసివేసెను.౹

19 ఆహాజుచేసిన యితర కార్యములనుగూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి యున్నది.౹

20 ఆహాజు తన పితరులతోకూడ నిద్రించి దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను; అతని కుమారుడైన హిజ్కియా అతనికి మారుగా రాజాయెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2KI/16-485ffdeefbfd61a471f5c5911da42a99.mp3?version_id=1787—

Categories
2 రాజులు

2 రాజులు 17

1 యూదారాజైన ఆహాజు ఏలుబడిలో పండ్రెండవ సంవత్సరమందు ఏలా కుమారుడైన హోషేయ షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి తొమ్మిది సంవత్సరములు ఏలెను.౹

2 అతడు తన పూర్వికులైన ఇశ్రాయేలురాజులు చెడుతనము చేసినంతమట్టుకు చేయకపోయినను, యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించెను.౹

3 అతని మీదికి అష్షూరురాజైన షల్మనేసెరు యుద్ధమునకు రాగా హోషేయ అతనికి దాసుడై పన్ను ఇచ్చువాడాయెను.౹

4 అతడు ఐగుప్తురాజైన సోనొద్దకు దూతలను పంపి, పూర్వము తాను ఏటేట ఇచ్చుచు వచ్చినట్లు అష్షూరురాజునకు పన్ను ఇయ్యకపోగా, హోషేయ చేసిన కుట్ర అష్షూరు రాజు తెలిసికొని అతనికి సంకెళ్లు వేయించి బందీగృహములో ఉంచెను.౹

5 అష్షూరురాజు దేశమంతటిమీదికిని షోమ్రోనుమీదికిని వచ్చి మూడు సంవత్సరములు షోమ్రో నును ముట్టడించెను.౹

6 హోషేయ యేలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు అష్షూరురాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇశ్రాయేలువారిని అష్షూరు దేశములోనికి చెర గొనిపోయి. గోజానునది దగ్గరనున్న హాలహు హాబోరు అను స్థలములందును మాదీయుల పట్టణములలోను వారిని ఉంచెను.౹

7 ఎందుకనగా ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశములోనుండియు, ఐగుప్తురాజైన ఫరోయొక్క బలము క్రిందనుండియు, తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపముచేసి యితర దేవతలయందు భయభక్తులు నిలిపి

8 తమయెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనముల కట్టడలను, ఇశ్రాయేలురాజులు నిర్ణ యించిన కట్టడలను అనుసరించుచు ఉండిరి.౹

9 మరియు ఇశ్రాయేలువారు తమ దేవుడైన యెహోవా విషయములో కపటము గలిగి దుర్బోధలు బోధించుచు, అడవి గుడిసెల నివాసులును ప్రాకారములుగల పట్టణనివాసులును తమ స్థలములన్నిటిలో బలిపీఠములను కట్టుకొని

10 యెత్తయిన కొండలన్నిటిమీదనేమి, సకలమైన పచ్చని వృక్షముల క్రిందనేమి, అంతటను విగ్రహములను నిలువబెట్టి దేవతాస్తంభములను నిలిపి

11 తమ యెదుట నిలువకుండ యెహోవా వెళ్లగొట్టిన జనులవాడుక చొప్పున ఉన్నతస్థలములలో ధూపము వేయుచు, చెడుతనము జరిగించుచు, యెహోవాకు కోపము పుట్టించి

12 –చేయకూడదని వేటినిగూర్చి యెహోవా తమ కాజ్ఞాపించెనో వాటినిచేసి పూజించుచుండిరి.౹

13 అయినను–మీ దుర్మార్గములను విడిచిపెట్టి, నేను మీపితరులకు ఆజ్ఞాపించినట్టియు, నా సేవకులగు ప్రవక్తలద్వారా మీకప్పగించినట్టియు ధర్మశాస్త్రమునుబట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి, ప్రవక్తలందరిద్వారాను దీర్ఘదర్శులద్వారాను యెహోవా ఇశ్రాయేలువారికిని యూదావారికిని సాక్ష్యము పలికించినను,౹

14 వారు విననివారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతుకులైన తమపితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి.౹

15 వారు ఆయన కట్టడలను, తమపితరులతో ఆయన చేసిన నిబంధనను, ఆయన తమకు నిర్ణ యించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైనదాని అనుసరించుచు, వ్యర్థులై–వారి వాడుకలచొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టునున్న ఆ జనుల మర్యాదల ననుసరించి వారివంటివారైరి.౹

16 వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటిని యనుసరింపక పోతవిగ్రహములైన రెండు దూడలను చేసి దేవతాస్తంభములను నిలిపి ఆకాశసమూహమునకు నమస్కరించి బయలుదేవతను పూజించిరి.౹

17 మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుకచేసికొని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని, ఆయనకు కోపము పుట్టించిరి.౹

18 కాబట్టి యెహోవా ఇశ్రాయేలువారియందు బహుగా కోపగించి, తన సముఖములోనుండి వారిని వెళ్ల గొట్టెను గనుక యూదాగోత్రము గాక మరి యేగోత్రమును శేషించి యుండలేదు.౹

19 అయితే యూదావారును తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విడిచిపెట్టినవారై ఇశ్రాయేలువారు చేసికొనిన కట్టడలను అనుసరించిరి.౹

20 అంతట యెహోవా ఇశ్రాయేలువారి సంతతివారినందరిని విసర్జించి, వారిని శ్రమపెట్టి దోపుడుగాండ్ల చేతికప్పగించి, వారిని తన సముఖమునుండి వెళ్లగొట్టెను.౹

21 ఆయన ఇశ్రాయేలు గోత్రములను దావీదు ఇంటివారిలోనుండి విడగొట్టి వేయగా వారు నెబాతు కుమారుడైన యరొబామును రాజుగా చేసికొనిరి. ఈ యరొబాము ఇశ్రాయేలువారు యెహోవాను అనుసరింపకుండ ఆయనమీద వారిని తిరుగబడచేసి, వారు ఘోరపాపము చేయుటకు కారకుడాయెను.౹

22 ఇశ్రాయేలువారు యరొబాము చేసిన పాపములలో దేనిని విడువక వాటి ననుసరించుచు వచ్చిరి గనుక

23 తన సేవకులైన ప్రవక్తలద్వారా యెహోవా సెలవిచ్చిన మాటచొప్పున, ఆయన ఇశ్రాయేలువారిని తన సముఖములోనుండి వెళ్లగొట్టెను. ఆ హేతువుచేత వారు తమ స్వదేశములోనుండి అష్షూరు దేశములోనికి చెరగొని పోబడిరి; నేటివరకు వారచ్చట ఉన్నారు.

24 అష్షూరురాజు బబులోను, కూతా, అవ్వా, హమాతు, సెపర్వయీము అను తన దేశములలోనుండి జనులనురప్పించి, ఇశ్రాయేలువారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను గనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణములలో కాపురము చేసిరి.౹

25 అయితే వారు కాపురముండ నారంభించినప్పుడు యెహోవాయందు భయభక్తులు లేనివారు గనుక యెహోవావారి మధ్యకు సింహములను పంపెను, అవి వారిలో కొందరిని చంపెను.౹

26 –తమరు పట్టుకొనిన షోమ్రోను పట్టణములలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియ కున్నది గనుక ఆయన సింహములను పంపించెను. ఇశ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అష్షూరురాజుతో మనవిచేయగా

27 అష్షూరు రాజు–అచ్చటనుండి తేబడిన యాజకులలో ఒకనిని అచ్చటికి మీరు తోడుకొనిపోవుడి; అతడు అచ్చటికి పోయి కాపురముండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలెనని ఆజ్ఞాపించెను.౹

28 కాగా షోమ్రోనులోనుండి వారు పట్టుకొని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురముండి, యెహోవాయందు భయభక్తులుగా ఉండతగిన మర్యాదను వారికి బోధించెనుగాని

29 కొందరు జనులు తమ సొంత దేవతలను పెట్టుకొని షోమ్రోనీయులు కట్టుకొనిన ఉన్నతస్థలములమందిరములలో వాటిని ఉంచుచువచ్చిరి; మరియు వారు తమతమ పురములలో తమకు దేవతలను కలుగజేసికొనిరి.౹

30 బబులోనువారు సుక్కోత్బెనోతు దేవతను, కూతావారు నెర్గలు దేవతను, హమాతువారు అషీమా దేవతను,౹

31 ఆవీయులు నిబ్హజు దేవతను తర్తాకు దేవతను, ఎవరు వారి దేవతను పెట్టుకొనుచుండిరి. సెపర్వీయులు తమ పిల్లలను అద్రమ్మెలెకు అనెమ్మెలెకు అను సెపర్వయీముయొక్క దేవతలకు అగ్నిగుండమందు దహించుచుండిరి.౹

32 మరియు జనులు యెహోవాకు భయపడి, ఉన్నతస్థలములనిమిత్తము సామాన్యులలో కొందరిని యాజకులను చేసికొనగా వారు జనులపక్షమున ఉన్నతస్థలములలో కట్టబడిన మందిరములయందు బలులు అర్పించుచుండిరి.౹

33 ఈ ప్రకారముగా వారు యెహోవాయందు భయభక్తులుగలవారైయుండి, తాము ఏ జనులలోనుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి.౹

34 నేటివరకు తమ పూర్వమర్యాదల ప్రకారము వారు చేయుచున్నారు; యెహోవాయందు భయభక్తులు పూనక –వారితో నిబంధనచేసి మీరు ఇతర దేవతలకు భయపడకయు, వాటికి నమస్కరింపకయు, పూజ చేయకయు, బలులు అర్పింపకయు,౹

35 మహాధికారము చూపి బాహు బలముచేత ఐగుప్తు దేశములోనుండి మిమ్మును రప్పించిన యెహోవాయందు భయభక్తులుకలిగి ఆయనకు మాత్రమే నమస్కారముచేసి బలులు అర్పింపవలెనని ఇశ్రాయేలని పేరుపెట్టబడిన యాకోబు సంతతివారికి సెలవిచ్చిన దేవుని సేవింపకయు

36 ఆయన ఆజ్ఞాపించిన కట్టడలనుగాని విధులనుగాని ధర్మశాస్త్రమునుగాని ధర్మమందు దేనినిగాని అనుసరింపకయు ఉన్నారు.౹

37 మరియు–ఇతర దేవతలను పూజింపక మీరు బ్రదుకు దినములన్నియు మోషే మీకు వ్రాసియిచ్చిన కట్టడలను విధులను, అనగా ధర్మశాస్త్రము ధర్మమంతటిని గైకొనవలెను.౹

38 నేను మీతో చేసిన నిబంధనను మరువకయు ఇతర దేవతలను పూజింపకయు ఉండవలెను.౹

39 మీ దేవుడైన యెహోవాయందు భయభక్తులు గలవారై యుండినయెడల ఆయన మీ శత్రువుల చేతిలోనుండి మిమ్మును విడిపించునని ఆయన సెలవిచ్చినను

40 వారు ఆయన మాటవినక తమ పూర్వపు మర్యాదచొప్పుననే జరిగించుచు వచ్చిరి.౹

41 ఆ ప్రజలు ఆలాగున యెహోవాయందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకొనిన విగ్రహములను పూజించుచు వచ్చిరి. మరియు తమపితరులు చేసినట్లు వారి యింటివారును వారి సంతతివారును నేటివరకు చేయుచున్నారు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2KI/17-d6a81c746e4c2083e86934b971a256ee.mp3?version_id=1787—