Categories
2 సమూయేలు

2 సమూయేలు 14

1 రాజు అబ్షాలోముమీద ప్రాణము పెట్టుకొని యున్నాడనిసెరూయా కుమారుడైన యోవాబు గ్రహించి

2 తెకోవనుండి యుక్తిగల యొక స్త్రీని పిలువనంపించి–ఏడ్చుచున్న దానవైనట్టు నటించి దుఃఖవస్త్రములు ధరించుకొని తైలము పూసికొనక బహు కాలము దుఃఖపడిన దానివలెనుండి

3 నీవు రాజునొద్దకు వచ్చి యీ ప్రకారము మనవి చేయవలెనని దానికి బోధించెను.౹

4 కాగా తెకోవ ఊరి స్త్రీ రాజునొద్దకువచ్చి సాగిలపడి సమస్కారము చేసి–రాజా రక్షించుమనగా

5 రాజు–నీకేమి కష్టము వచ్చెనని అడిగెను. అందుకు ఆమె–నేను నిజముగా విధవరాలను, నా పెనిమిటి చనిపోయెను;౹

6 నీ దాసినైన నాకు ఇద్దరు కుమారులు ఉండిరి, వారు పొలములో పెనుగు లాడుచుండగా విడిపించు వాడెవడును లేకపోయినందున వారిలో నొకడు రెండవవాని కొట్టి చంపెను.౹

7 కాబట్టి నా యింటివారందరును నీ దాసినైన నామీదికి లేచి–తన సహోదరుని చంపినవాని అప్పగించుము; తన సహోదరుని ప్రాణము తీసినందుకై మేము వానిని చంపి హక్కు దారుని నాశనము చేతుమనుచున్నారు. ఈలాగునవారు నా పెనిమిటికి భూమిమీద పేరైనను శేషమైననులేకుండ మిగిలిన నిప్పురవ్వను ఆర్పివేయబోవుచున్నారని రాజుతో చెప్పగా

8 రాజు–నీవు నీ యింటికి పొమ్ము, నిన్నుగురించి ఆజ్ఞ ఇత్తునని ఆమెతో చెప్పెను.౹

9 అందుకు తెకోవ ఊరి స్త్రీ–నా యేలినవాడా రాజా, దోషము నామీదను నాతండ్రి ఇంటివారి మీదను నిలుచునుగాక, రాజునకును రాజు సింహాసనమునకును దోషము తగులకుండునుగాక అని రాజుతో అనగా

10 రాజు–ఎవడైనను దీనినిగూర్చి నిన్నేమైన అనినయెడల వానిని నాయొద్దకు తోడుకొని రమ్ము; వాడికను నిన్ను ముట్టక యుండునని ఆమెతో చెప్పెను.౹

11 అప్పుడు ఆమె–రాజవైన నీవు నీ దేవుడైన యెహోవాను స్మరించి హత్యకు ప్రతిహత్య చేయువారు నా కుమారుని నశింపజేయకుండ ఇకను నాశనము చేయుట మాన్పించుమని మనవిచేయగా రాజు–యెహోవా జీవముతోడు నీ కుమారుని తల వెండ్రుకలలో ఒకటైనను నేల రాలకుండుననెను.౹

12 అప్పుడు ఆ స్త్రీ–నా యేలినవాడవగు నీతో ఇంకొక మాటచెప్పుకొనుట నీ దాసినగు నాకు దయచేసి సెలవిమ్మని మనవిచేయగా రాజు–చెప్పుమనెను.౹

13 అందుకు ఆ స్త్రీ–దేవుని జనులైనవారికి విరోధముగా నీ వెందుకు దీనిని తలపెట్టియున్నావు? రాజు ఆ మాట సెలవిచ్చుటచేత తాను వెళ్లగొట్టిన తనవాని రానియ్యక తానే దోషియగుచున్నాడు.౹

14 మనమందరమును చనిపోదుము గదా, నేలను ఒలికినమీదట మరల ఎత్తలేని నీటివలె ఉన్నాము; దేవుడు ప్రాణముతీయక తోలివేయబడినవాడు తనకు దూరస్థుడు కాకయుండుటకు సాధనములు కల్పించుచున్నాడు.౹

15 జనులు నన్ను భయపెట్టిరి గనుక నేను దీనిని గూర్చి నా యేలినవాడవగు నీతో మాటలాడ వచ్చితిని. కాబట్టి నీ దాసురాలనగు నేను–రాజు తన దాసినగు నా మనవి చొప్పున చేయునేమో

16 రాజు నా మనవి అంగీకరించి దేవుని స్వాస్థ్యము అనుభవింపకుండ నన్నును నా కుమారునిని నాశనము చేయదలచిన వాని చేతిలోనుండి తన దాసినగునన్ను విడిపించునేమో అనుకొంటిని.౹

17 మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడై యున్నాడు గనుక నా యేలినవాడవును రాజవునగు నీవు దేవుని దూతవంటివాడవై మంచి చెడ్డలన్నియు విచారింప చాలియున్నావు; కాబట్టి నీ దాసినగు నేను నా యేలినవాడగు రాజు సెలవిచ్చిన మాట సమాధానకరమగునని అనుకొంటిననెను.౹

18 రాజు–నేను నిన్ను అడుగు సంగతి నీ వెంతమాత్రమును మరుగు చేయవద్దని ఆ స్త్రీతో అనగా ఆమె–నా యేలినవాడవగు నీవు సెలవిమ్మనెను.౹

19 అంతట రాజు–యోవాబు నీకు బోధించెనా అని ఆమె నడిగినందుకు ఆమె యిట్లనెను–నా యేలినవాడవైన రాజా, నీ ప్రాణముతోడు, చెప్పినదానిని తప్పక గ్రహించుటకు నా యేలినవాడవును రాజవునగు నీవంటివాడొకడును లేడు; నీ సేవకుడగు యోవాబు నాకు బోధించి యీ మాటలన్నిటిని నీ దాసినగు నాకు నేర్పెను

20 సంగతిని రాజుతో మరుగు మాటలతో మనవి చేయుటకు నీ సేవకుడగు యోవాబు ఏర్పాటు చేసెను. ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా యేలినవాడవగు నీవు దేవదూతల జ్ఞానమువంటి జ్ఞానము గలవాడవు.౹

21 అప్పుడు రాజు యోవాబుతో ఈలాగున సెలవిచ్చెను. ఆలకించుము, నీవు మనవి చేసినదానిని నేను ఒప్పుకొనుచున్నాను.౹

22 తరువాత–యౌవనుడగు అబ్షాలోమును రప్పింపుమని అతడు సెలవియ్యగా యోవాబు సాష్టాంగ నమస్కారము చేసి రాజును స్తుతించి–రాజవగు నీవు నీ దాసుడనైన నా మనవి అంగీకరించినందున నా యేలిన వాడవగు నీవలన నేను అనుగ్రహము నొందితినని నాకు తెలిసెనని చెప్పి లేచి గెషూరునకు పోయి

23 అబ్షాలోమును యెరూషలేమునకు తోడుకొని వచ్చెను.౹

24 అయితే రాజు –అతడు నా దర్శనము చేయక తన ఇంటికి పోవలెనని ఉత్తరువుచేయగా అబ్షాలోము రాజదర్శనము చేయక తన ఇంటికి పోయెను.

25 ఇశ్రాయేలీయులందరిలో అబ్షాలోమంత సౌందర్యముగలవాడు ఒకడును లేడు; అరికాలు మొదలుకొని తలవరకు ఏ లోపమును అతనియందు లేకపోయెను.౹

26 తన తల వెండ్రుకలు భారముగా నున్నందున ఏటేట అతడు వాటిని కత్తిరించుచు వచ్చెను; కత్తిరించునప్పుడెల్ల వాటి యెత్తు రాజు తూనికనుబట్టి రెండువందల తులములాయెను.౹

27 అబ్షాలోమునకు ముగ్గురు కుమారులును తామారు అనునొక కుమార్తెయు పుట్టిరి; ఆమె బహు సౌందర్యవతి.

28 అబ్షాలోము రెండు నిండు సంవత్సరములు యెరూషలేములోనుండియు రాజదర్శనము చేయక యుండగా

29 యోవాబును రాజునొద్దకు పంపించుటకై అబ్షాలోము అత నిని పిలువనంపినప్పుడు యోవాబు రానొల్లక యుండెను. రెండవమారు అతని పిలువనంపినప్పుడు అతడు రానొల్లక పోగా

30 అబ్షాలోము తన పనివారిని పిలిచి–యోవాబు పొలము నా పొలముదగ్గర నున్నది గదా, దానిలో యవల చేలు ఉన్నవి; మీరు పోయి వాటిని తగులబెట్టుడని వారితో చెప్పెను. అబ్షాలోము పనివారు ఆ చేలు తగుల బెట్టగా

31 యోవాబు చూచి లేచి అబ్షాలోము ఇంటికి వచ్చి–నీ పనివారు నా చేలు తగులబెట్టిరేమని అడుగగా

32 అబ్షాలోము యోవాబుతో ఇట్లనెను–గెషూరునుండి నేను వచ్చిన ఫలమేమి? నేనచ్చటనే యుండుట మేలని నీ ద్వారా రాజుతో చెప్పుకొనుటకై రాజునొద్దకు నిన్ను పంపవలెనని నేను నిన్ను పిలిచితిని; రాజదర్శనము నేను చేయవలెను; నాయందు దోషము కనబడినయెడల రాజు నాకు మరణశిక్ష విధింపవచ్చును.౹

33 అంతట యోవాబు రాజునొద్దకు వచ్చి ఆ సమాచారము తెలుపగా, రాజు అబ్షాలోమును పిలువనంపించెను. అతడు రాజునొద్దకు వచ్చి రాజసన్నిధిని సాష్టాంగ నమస్కారముచేయగా రాజు అబ్షాలోమును ముద్దుపెట్టుకొనెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2SA/14-ae913c0532e1e5bef2fb54bb27e6baac.mp3?version_id=1787—

Categories
2 సమూయేలు

2 సమూయేలు 15

1 ఇదియైన తరువాత అబ్షాలోము ఒక రథమును గుఱ్ఱములను సిద్ధపరచి, తనయెదుట పరుగెత్తుటకై యేబదిమంది బంటులను ఏర్పరచుకొనెను.౹

2 ఉదయముననే లేచి బయలుదేరి పట్టణముయొక్క గుమ్మపు మార్గమందు ఒకతట్టున నిలిచి, రాజుచేత తీర్పునొందుటకై వ్యాజ్యెమాడు వారెవరైనను వచ్చియుండగా కనిపెట్టి వారిని పిలిచి–నీవు ఏ ఊరివాడవని యడుగుచుండెను–నీ దాసుడనైన నేను ఇశ్రాయేలీయుల గోత్రములలో ఫలానిదానికి చేరిన వాడనని వాడు చెప్పగా

3 అబ్షాలోము–నీ వ్యాజ్యెము సరిగాను న్యాయముగాను ఉన్నదిగాని దానిని విచారించుటకై నియమింపబడినవాడు రాజునొద్ద ఒకడును లేడని చెప్పి

4 నేను ఈ దేశమునకు న్యాయాధిపతినైయుండుట యెంత మేలు; అప్పుడు వ్యాజ్యెమాడు వారు నాయొద్దకు వత్తురు, నేను వారికి న్యాయము తీర్చుదునని చెప్పుచు వచ్చెను.౹

5 మరియు తనకు నమస్కారము చేయుటకై యెవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతని పట్టుకొని ముద్దుపెట్టుకొనుచు వచ్చెను.౹

6 తీర్పునొందుటకై రాజునొద్దకు వచ్చిన ఇశ్రాయేలీయులకందరికి అబ్షాలోము ఈ ప్రకారము చేసి ఇశ్రాయేలీయుల నందరిని తనతట్టు త్రిప్పుకొనెను.

7-8 నాలుగుసంవత్సరములు జరిగినమీదట అబ్షాలోము రాజునొద్దకు వచ్చి–నీ దాసుడనైన నేను సిరియ దేశము నందలి గెషూరునందుండగా–యెహోవా నన్ను యెరూషలేమునకు తిరిగి రప్పించినయెడల నేను ఆయనను సేవించె దనని మ్రొక్కు కొంటిని గనుక, నేను హెబ్రోనునకు పోయి యెహోవాకు నేను మ్రొక్కుకొనిన మ్రొక్కు బడి తీర్చుకొనుటకు నాకు సెలవిమ్మని మనవిచేయగా

9 రాజు–సుఖముగా పొమ్మని సెలవిచ్చెను గనుక అతడు లేచి హెబ్రోనునకు పోయెను.౹

10 అబ్షాలోము–మీరు బాకానాదము వినునప్పుడు అబ్షాలోము హెబ్రోనులో ఏలుచున్నాడని కేకలు వేయుడని చెప్పుటకై ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటియొద్దకు వేగుల వారిని పంపెను.౹

11 విందునకు పిలువబడియుండి రెండువందలమంది యెరూషలేములోనుండి అబ్షాలోముతోకూడ బయలుదేరి యుండిరి, వీరు ఏమియు తెలియక యథార్థమైన మనస్సుతో వెళ్లియుండిరి.౹

12 మరియు బలి అర్పింపవలెనని యుండి అబ్షాలోము గీలోనీయుడైన అహీతోపెలు అను దావీదుయొక్క మంత్రిని గీలో అను అతని ఊరినుండి పిలిపించి యుండెను. అబ్షాలోముదగ్గరకు వచ్చిన జనము మరి మరి యెక్కువగుటచేత కుట్ర బహుబలమాయెను.

13 ఇశ్రాయేలీయులు అబ్షాలోముపక్షము వహించిరని దావీదునకు వర్తమానము రాగా

14 దావీదు యెరూషలేమునందున్న తన సేవకులకందరికి ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను–అబ్షాలోము చేతిలోనుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము; మనము పారిపోదము రండి, అతడు హఠా త్తుగా వచ్చి మనలను పట్టుకొనకను, మనకు కీడుచేయకను, పట్టణమును కత్తివాత హతము చేయకను ఉండునట్లు మనము త్వరగా వెళ్లిపోదము రండి.౹

15 అందుకు రాజు సేవకులు ఈలాగు మనవి చేసిరి–చిత్తగించుము; నీ దాసులమైన మేము మా యేలినవాడవును రాజవునగు నీవు సెలవిచ్చినట్లు చేయుటకు సిద్ధముగా నున్నాము.౹

16 అప్పుడు రాజు నగరిని కనిపెట్టుటకై ఉపపత్నులగు పదిమందిని ఉంచిన మీదట తన యింటివారినందరిని వెంటబెట్టుకొని కాలినడకను బయలుదేరెను.౹

17 రాజును అతని యింటివారును బయలుదేరి బెత్మెర్హాకుకు వచ్చి బసచేసిరి.౹

18 అతని సేవకులందరును అతని యిరుపార్శ్వముల నడిచిరి; కెరే తీయులందరును పెలేతీయులందరును గాతునుండి వచ్చిన ఆరువందలమంది గిత్తీయులును రాజునకు ముందుగా నడచుచుండిరి.౹

19 రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని– నీవు నివాసస్థలము కోరు పరదేశివై యున్నావు; నీవెందుకు మాతోకూడ వచ్చుచున్నావు? నీవు తిరిగి పోయి రాజున్న స్థలమున ఉండుము.౹

20 నిన్ననే వచ్చిన నీకు, ఎక్కడికి పోవుదుమో తెలియకయున్న మాతోకూడ ఈ తిరుగు లాట యెందుకు? నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము; కృపాసత్యములు నీకు తోడుగా ఉండును గాక యని చెప్పగా

21 ఇత్తయి–నేను చచ్చినను బ్రదికినను, యెహోవా జీవముతోడు నా యేలినవాడవును రాజవునగు నీ జీవముతోడు, ఏ స్థలమందు నా యేలినవాడవును రాజవునగు నీవుందువో ఆ స్థలమందే నీ దాసుడనైన నేనుందునని రాజుతో మనవిచేసెను.౹

22 అందుకు దావీదు –ఆలాగైతే నీవు రావచ్చునని ఇత్తయితో సెలవిచ్చెను గనుక గిత్తీయుడగు ఇత్తయియును అతని వారందరును అతని కుటుంబికులందరును సాగిపోయిరి.౹

23 వారు సాగిపోవుచుండగా జనులందరు బహుగా ఏడ్చుచుండిరి, ఈ ప్రకారము వారందరు రాజుతోకూడ కిద్రోనువాగు దాటి అరణ్యమార్గమున ప్రయాణమై పోయిరి.౹

24 సాదోకును లేవీయులందరును దేవుని నిబంధనమందసమును మోయుచు అతనియొద్ద ఉండిరి. వారు దేవుని మందసమును దింపగా అబ్యాతారు వచ్చి పట్టణములోనుండి జనులందరును దాటిపోవువరకు నిలిచెను.౹

25 అప్పుడు రాజు సాదోకును పిలిచి–దేవుని మందసమును పట్టణములోనికి తిరిగి తీసికొనిపొమ్ము; యెహోవా దృష్టికి నేను అనుగ్రహము పొందినయెడల ఆయన నన్ను తిరిగి రప్పించి

26 దానిని తన నివాసస్థానమును నాకు చూపించును; నీయందు నాకిష్టము లేదని ఆయన సెలవిచ్చినయెడల ఆయన చిత్తము, –నీ దృష్టికి అనుకూలమైనట్టు నాయెడల జరిగించుమని నేను చెప్పుదునని పలికి

27 యాజకుడైన సాదోకుతో ఇట్లనెను–సాదోకూ, నీవు దీర్ఘదర్శివి కావా? శుభమొంది నీవును నీ కుమారుడగు అహిమయస్సు అబ్యాతారునకు పుట్టిన యోనాతాను అను మీ యిద్దరు కుమారులును పట్టణమునకు పోవలెను.౹

28 ఆలకించుము; నీయొద్దనుండి నాకు రూఢియైన వర్తమానము వచ్చువరకు నేను అరణ్య మందలి రేవులదగ్గర నిలిచి యుందును.౹

29 కాబట్టి సాదోకును అబ్యాతారును దేవుని మందసమును యెరూషలేమునకు తిరిగి తీసికొనిపోయి అక్కడ నిలిచిరి.

30 అయితే దావీదు ఒలీవచెట్ల కొండ యెక్కుచు ఏడ్చుచు, తల కప్పుకొని పాదరక్షలులేకుండ కాలినడకను వెళ్లెను; అతనియొద్దనున్న జనులందరును తలలు కప్పుకొని యేడ్చుచు కొండ యెక్కిరి.౹

31 అంతలో ఒకడు వచ్చి, అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరియున్నాడని దావీదునకు తెలియజేయగా దావీదు–యెహోవా అహీతోపెలుయొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేసెను.౹

32 దేవుని ఆరాధించు స్థలమొకటి ఆ కొండమీద ఉండెను. వారు అచ్చటికి రాగా అర్కీయుడైన హూషై పై వస్త్రములు చింపుకొని తలమీద ధూళి పోసికొని వచ్చి రాజును దర్శనము చేసెను.౹

33 రాజు–నీవు నాతోకూడ వచ్చినయెడల నాకు భారముగా ఉందువు;౹

34 నీవు పట్టణమునకు తిరిగి పోయి–రాజా, యింతవరకు నీ తండ్రికి నేను సేవచేసినట్లు ఇకను నీకు సేవచేసెదనని అబ్షాలోముతో చెప్పినయెడల నీవు నా పక్షపువాడవై యుండి అహీతోపెలుయొక్క ఆలోచనను చెడగొట్ట గలవు.౹

35 అక్కడ యాజకులైన సాదోకును అబ్యాతారును నీకు సహాయకులుగా నుందురు; కాబట్టి రాజనగరియందు ఏదైనను జరుగుట నీకు వినబడినయెడల యాజకుడైన సాదోకుతోను అబ్యాతారుతోను దాని చెప్పవలెను.౹

36 సాదోకు కుమారుడైన అహిమయస్సు అబ్యాతారు కుమారుడైన యోనాతాను అనువారి ఇద్దరు కుమారులు అచ్చటనున్నారు. నీకు వినబడినదంతయు వారిచేత నాయొద్దకు వర్తమానము చేయుమని చెప్పి అతనిని పంపివేసెను.౹

37 దావీదు స్నేహితుడైన హూషై పట్టణమునకు వచ్చుచుండగా అబ్షాలోమును యెరూషలేము చేరెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2SA/15-f56b8c0e9642f03eaaf80d4d579c44b8.mp3?version_id=1787—

Categories
2 సమూయేలు

2 సమూయేలు 16

1 దావీదు కొండ శిఖరము అవతల కొంచెము దూరము వెళ్లిన తరువాత మెఫీబోషెతు సేవకుడైన సీబా గంతలు కట్టిన రెండు గాడిదలను తీసికొనివచ్చెను; రెండు వందల రొట్టెలును నూరు ద్రాక్ష గెలలును నూరు అంజూరపు అడలును ద్రాక్షారసపు తిత్తి ఒకటియు వాటిమీద వేసి యుండెను.౹

2 రాజు–ఇవి ఎందుకు తెచ్చితివని సీబాను అడుగగా సీబా–గాడిదలు రాజు ఇంటివారు ఎక్కుటకును, రొట్టెలును అంజూరపు అడలును పనివారు తినుటకును, ద్రాక్షారసము అరణ్యమందు అలసటనొందినవారు త్రాగుటకును తెచ్చితిననగా

3 రాజు–నీ యజమానుని కుమారుడు ఎక్కడనున్నాడని అడిగెను. అందుకు సీబా –చిత్తగించుము, ఈవేళ ఇశ్రాయేలీయులు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి యిప్పింతురనుకొని అతడు యెరూషలేములో నిలిచియున్నాడనెను.౹

4 అందుకు రాజు మెఫీబోషెతునకు కలిగినదంతయు నీదేయని సీబాతో చెప్పగా సీబా–నా యేలినవాడా రాజా, నీ దృష్టియందు నేను అనుగ్రహము పొందుదునుగాక, నేను నీకు నమస్కారము చేయుచున్నాననెను.

5 రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబికుడగు గెరా కుమారుడైన షిమీ అను నొకడు అచ్చటనుండి బయలుదేరి వచ్చెను; అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు

6 జనులందరును బలాఢ్యులందరును దావీదు ఇరు పార్శ్వముల నుండగా రాజైన దావీదుమీదను అతని సేవకులందరిమీదను రాళ్లు రువ్వుచు వచ్చెను.౹

7 ఈ షిమీ–నరహంతకుడా, దుర్మా ర్గుడా

8 ఛీపో, ఛీపో, –నీవేలవలెనని నీవు వెళ్లగొట్టిన సౌలు ఇంటివారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించియున్నాడు; నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి యున్నావని చెప్పి రాజును శపింపగా

9 సెరూయా కుమారుడైన అబీషై–ఈ చచ్చిన కుక్క నా యేలినవాడవును రాజవునగు నిన్ను శపింపనేల? నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చెదననెను.౹

10 అందుకు రాజు –సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వానిని శపింపనియ్యుడు, దావీదును శపింపుమని యెహోవా వానికి సెలవియ్యగా–నీవు ఈలాగున నెందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి

11 అబీషైతోను తన సేవకులందరితోను పలికినదేమనగా–నా కడుపున బుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయ చూచుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము? వానిజోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చియున్నాడు గనుక వానిని శపింపనియ్యుడి.౹

12 యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టు నేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలుచేయునేమో.౹

13 అంతట దావీదును అతని వారును మార్గమున వెళ్లిపోయిరి. వారు వెళ్లిపోవుచుండగా షిమీ అతని కెదురుగా కొండప్రక్కను పోవుచు అతని మీదికి రాళ్లు విసరుచు ధూళి యెగరగొట్టుచునుండెను.౹

14 రాజును అతనితోకూడనున్న జనులందరును బడలినవారై యొకానొక చోటికి వచ్చి అలసట తీర్చుకొనిరి.

15 అబ్షాలోమును ఇశ్రాయేలువారందరును అహీతో పెలును యెరూషలేమునకు వచ్చి యుండిరి.౹

16 దావీదుతో స్నేహముగానున్న అర్కీయుడైన హూషైయను నతడు అబ్షాలోమునొద్దకువచ్చి అతని దర్శించి–రాజు చిరంజీవి యగును గాక రాజు చిరంజీవియగును గాక అని పలుకగా

17 అబ్షాలోము–నీ స్నేహితునికి నీవుచేయు ఉపకార మింతేనా నీ స్నేహితునితోకూడ నీవు వెళ్లకపోతివేమని అతని నడుగగా

18 హూషై–యెహోవాయును ఈ జనులును ఇశ్రాయేలీయులందరును ఎవని కోరుకొందురో నేను అతని వాడనగుదును, అతనియొద్దనే యుందును.౹

19 మరియు నేనెవనికి సేవచేయవలెను? అతని కుమారుని సన్నిధిని నేను సేవచేయవలెను గదా? నీ తండ్రి సన్నిధిని నేను సేవచేసినట్లు నీ సన్నిధిని నేను సేవచేయుదునని అబ్షాలోమునొద్ద మనవి చేసెను.౹

20 అబ్షాలోము అహీతోపెలుతో మనము చేయవలసిన పని ఏదో తెలిసి కొనుటకై ఆలోచన చేతము రమ్ము అనగా

21 అహీతోపెలు–నీ తండ్రిచేత ఇంటికి కావలియుంచబడిన ఉపపత్నులయొద్దకు నీవు పోయినయెడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇశ్రాయేలీయులందరు తెలిసికొందురు, అప్పుడు నీ పక్షమున నున్నవారందరు ధైర్యము తెచ్చుకొందురని చెప్పెను.౹

22 కాబట్టి మేడమీద వారు అబ్షాలోమునకు గుడారము వేయగా ఇశ్రాయేలీయులకందరికి తెలియునట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను.౹

23 ఆ దినములలో అహీ తోపెలు చెప్పిన యే యాలోచనయైనను ఒకడు దేవుని యొద్ద విచారణచేసి పొందిన ఆలోచనయైనట్టుగా ఉండెను; దావీదును అబ్షాలోమును దానిని అట్లే యెంచుచుండిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2SA/16-86e41baaa50d8e5a78cc9fd5d40d1dae.mp3?version_id=1787—

Categories
2 సమూయేలు

2 సమూయేలు 17

1 దావీదు అలసట నొంది బలహీనముగా నున్నాడు గనుక

2-3 –నేను అతనిమీదపడి అతని బెదరించినయెడల అతని యొద్దనున్న జనులందరు పారిపోదురు; రాజును మాత్రము హతముచేసి జనులందరిని నీతట్టు త్రిప్పెదను; నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరు వచ్చి నీతో సమాధానపడుదురు గనుక నీ చిత్తమైతే నేను పండ్రెండు వేలమందిని ఏర్పరచుకొనిపోయి యీ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహీతోపెలు అబ్షాలోముతో చెప్పగా

4 ఈ బోధ అబ్షాలోమునకును ఇశ్రాయేలువారి పెద్దలకందరికిని యుక్తముగా కనబడెను.

5 అంతట–అర్కీయుడైన హూషై యేమి చెప్పునో మనము వినునట్లు అతని పిలువనంపుడని అబ్షాలోము ఆజ్ఞ ఇయ్యగా, హూషై అబ్షాలోమునొద్దకు వచ్చెను.౹

6 అబ్షాలోము అహీతోపెలు చెప్పిన ఆలోచన అతనికి తెలియజేసి–అతని మాటచొప్పున మనము చేయుదమా చేయకుందుమా? నీ యాలోచన యేమైనది చెప్పుమని అతని నడుగగా

7 హూషై అబ్షాలోముతో ఇట్లనెను. ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు.౹

8 నీ తండ్రియు అతని పక్షమున నున్నవారును మహా బలాఢ్యులనియు, అడవిలో పిల్లలను పోగొట్టుకొనిన యెలుగుబంట్ల వంటివారై రేగిన మనస్సుతో ఉన్నారనియు నీకు తెలియును. మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు, అతడు జనులతోకూడ బసచేయడు.౹

9 అతడేదో యొక గుహయందో మరి ఏ స్థలమందో దాగి యుండును. కాబట్టి నీవారిలో కొందరు యుద్ధారంభమందు కూలగా చూచి జనులు వెంటనే ఆ సంగతినిబట్టి అబ్షాలోము పక్షమున నున్నవారు ఓడిపోయిరని చెప్పు కొందురు.౹

10 నీ తండ్రి మహా బలాఢ్యుడనియు, అతని పక్షపువారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలీయులందరును ఎరుగుదురు గనుక సింహపుగుండెవంటి గుండెగలవారు సయితము దిగులొందుదురు.౹

11 కాబట్టి నా ఆలోచన యేమనగా, దానునుండి బెయేర్షెబావరకు లెక్కకు సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా ఇశ్రాయేలీయుల నందరిని నలుదిశలనుండి నీ యొద్దకు సమకూర్చి నీవు స్వయముగా యుద్ధమునకు పోవలెను.౹

12 అప్పుడు మనము అతడు కనబడిన స్థలములలో ఏదో యొకదానియందు అతనిమీద పడుదుము; నేలమీద మంచుపడురీతిగా మనము అతనిమీదికి వచ్చినయెడల అతని పక్షపువారిలో ఒకడును తప్పించుకొనజాలడు.౹

13 అతడు ఒక పట్టణములో చొచ్చినయెడల ఇశ్రాయేలీయులందరును ఆ పట్టణమునకు త్రాళ్లు తీసికొనివచ్చి యొక చిన్న రాయి అచ్చట కనబడకుండ దానిని నదిలోనికి లాగుదురు.౹

14 అబ్షాలోమును ఇశ్రాయేలువారందరును ఈ మాట విని అర్కీయుడగు హూషై చెప్పిన ఆలోచన అహీతోపెలు చెప్పినదానికంటె యుక్తమని యొప్పుకొనిరి; ఏలయనగా యెహోవా అబ్షాలోముమీదికి ఉపద్రవమును రప్పింపగలందులకై అహీతోపెలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థముచేయ నిశ్చయించి యుండెను.

15 కాబట్టి హూషై అబ్షాలోమునకును ఇశ్రాయేలువారి పెద్దలకందరికిని అహీతోపెలు చెప్పిన ఆలోచనను తాను చెప్పిన ఆలోచనను యాజకులగు సాదోకుతోను అబ్యా తారుతోను తెలియజెప్పి

16 –మీరు త్వరపడి ఈ రాత్రి అరణ్యమందు ఏరు దాటు స్థలములలో ఉండవద్దనియు, రాజును అతని సమక్షమందున్న జనులందరును నశింపకుండునట్లు శీఘ్రముగా వెళ్లిపోవుడనియు దావీదునకు వర్తమానము పంపుడని చెప్పెను.౹

17 తాము పట్టణముతట్టు వచ్చిన సంగతి తెలియబడక యుండునట్లు యోనాతానును అహిమయస్సును ఏన్‌రోగేలు దగ్గర నిలిచియుండగా పని కత్తె యొకతెవచ్చి, హూషై చెప్పిన సంగతిని వారికి తెలియజేయగా వారు వచ్చి రాజైన దావీదుతో దాని తెలియజెప్పిరి.౹

18 తాను వారిని కనుగొనిన సంగతి పనివాడు ఒకడు అబ్షాలోమునకు తెలిపెనుగాని వారిద్దరు వేగిరముగా పోయి బహూరీములో ఒకని యిల్లు చేరి అతని యింటి ముంగిట ఒక బావి యుండగా దానిలో దిగి దాగి యుండిరి.౹

19 ఆ యింటి యిల్లాలు ముతక గుడ్డ యొకటి తీసికొనివచ్చి బావిమీద పరచి దానిపైన గోధుమపిండి ఆర బోసెను గనుక వారు దాగిన సంగతి యెవరికిని తెలియక పోయెను.౹

20 అబ్షాలోము సేవకులు ఆ యింటి ఆమెయొద్దకు వచ్చి అహిమయస్సును యోనాతానును ఎక్కడ ఉన్నారని అడుగగా ఆమె–వారు ఏరుదాటి పోయిరని వారితో చెప్పెను గనుక వారు పోయి వెదకి వారిని కానక యెరూషలేమునకు తిరిగి వచ్చిరి.౹

21 వారు వెళ్లిన తరువాత యోనాతానును అహిమయస్సును బావిలోనుండి బయటికి వచ్చి దావీదునొద్దకు పోయి అహీతోపెలు అతనిమీద చేసిన ఆలోచన తెలియజేసి–నీవు లేచి త్వరగా నది దాటవలసినదని అతనితో చెప్పగా

22 దావీదును అతని యొద్దనున్న జనులందరును లేచి యొర్దానునది దాటిరి, తెల్లవారునప్పటికి నది దాటక యుండినవాడు ఒకడును లేకపోయెను.౹

23 అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరుగకపోవుట చూచి, గాడిదకు గంతకట్టి యెక్కి తన ఊరనున్న తన యింటికి పోయి తన యిల్లు చక్కబెట్టుకొని ఉరిపోసికొని చనిపోయెను; జనులు అతని తండ్రి సమాధియందు అతనిని పాతిపెట్టిరి.

24 దావీదు మహనయీమునకు రాగా అబ్షాలోమును ఇశ్రాయేలీయులందరును యొర్దాను నది దాటి వచ్చిరి.౹

25 అబ్షాలోము యోవాబునకు మారుగా అమాశాను సైన్యాధి పతిగా నియమించెను. ఈ అమాశా ఇత్రా అను ఇశ్రాయేలీయుడు యోవాబు తల్లియైన సెరూయా సహోదరియగు నాహాషు కుమార్తెయైన అబీగయీలు నొద్దకు పోయి నందున పుట్టినవాడు

26 అబ్షాలోమును ఇశ్రాయేలీయులును గిలాదుదేశములో దిగియుండిరి.

27 దావీదు మహనయీమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుల రబ్బా పట్టణపువాడైన నాహాషు కుమారుడగు షోబీయును, లోదెబారు ఊరివాడగు అమ్మీయేలు కుమారుడైన మాకీరును, రోగెలీము ఊరివాడును గిలాదీయుడునైన బర్జిల్లయియు

28 అరణ్యమందు జనులు అలసినవారై ఆకలిగొని దప్పిగొనియుందురని తలంచి, పరుపులు పాత్రలుకుండలు గోధుమలు యవలు పిండి వేచిన గోధుమలు కాయధాన్యములు చిక్కుడు కాయలు పేలాలు

29 తేనె వెన్న గొఱ్ఱెలు జున్నుముద్దలు దావీదును అతనియొద్దనున్న జనులును భోజనము చేయుటకై తీసికొనివచ్చిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2SA/17-3538da9b542038db917e29f97617bb83.mp3?version_id=1787—

Categories
2 సమూయేలు

2 సమూయేలు 18

1 దావీదు తన యొద్దనున్న జనులను లెక్కించి వారి మీద సహస్రాధిపతులను శతాధిపతులను నిర్ణయించి

2 జనులను మూడు భాగములుగా చేసి యోవాబు చేతి క్రింద ఒక భాగమును సెరూయా కుమారుడగు అబీషై అను యోవాబు సహోదరుని చేతిక్రింద ఒక భాగమును, గిత్తీయుడైన ఇత్తయి చేతిక్రింద ఒక భాగమును ఉంచెను. దావీదు–నేను మీతోకూడ బయలుదేరుదునని జనులతో చెప్పగా

3 జనులు–నీవు రాకూడదు, మేము పారిపోయి నను జనులు దానిని లక్ష్యపెట్టరు, మాలో సగము మంది చనిపోయినను జనులు దానిని లక్ష్యపెట్టరు, మావంటి పది వేలమందితో నీవు సాటి; కాబట్టి నీవు పట్టణమందు నిలిచి మాకు సహాయము చేయవలెనని అతనితో చెప్పిరి.౹

4 అందుకు రాజు–మీ దృష్టికేది మంచిదో దాని చేసెదనని చెప్పి గుమ్మపు ప్రక్కను నిలిచి యుండగా జనులందరును గుంపులై వందల కొలదిగాను వేల కొలదిగాను బయలుదేరిరి.౹

5 అప్పుడు రాజు యోవాబును అబీషైని ఇత్తయిని పిలిచి–నా నిమిత్తమై యౌవనుడైన అబ్షాలోమునకు దయ జూపుడని ఆజ్ఞాపించెను. జనులందరు వినుచుండగా రాజు అబ్షాలోమునుగూర్చి అధిపతులకందరికి ఆజ్ఞ ఇచ్చెను.౹

6 జనులు ఇశ్రాయేలువారిని ఎదిరించుటకై పొలములోనికి బయలుదేరిన మీదట యుద్ధము ఎఫ్రాయిము వనములో జరుగగా

7 ఇశ్రాయేలువారు దావీదు సేవకుల యెదుట నిలువలేక ఓడిపోయిరి; ఆ దినమున ఇరువది వేలమంది అక్కడ హతులైరి.౹

8 యుద్ధము ఆ ప్రదేశమంతటను వ్యాపించెను; మరియు నాటి దినమున కత్తిచేత కూలినవారి కంటె ఎక్కువమంది అడవిలో చిక్కుబడి నాశనమైరి.౹

9 అబ్షాలోము కంచరగాడిదమీద ఎక్కి పోవుచు దావీదు సేవకులకు ఎదురాయెను; ఆ కంచరగాడిద యొక గొప్పమస్తకి వృక్షముయొక్క చిక్కుకొమ్మల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికినిమధ్యను వ్రేలాడుచుండగా అతని క్రిందనున్న కంచరగాడిద సాగిపోయెను.౹

10 ఒకడు దానిని చూచి వచ్చి–అబ్షాలోము మస్తకివృక్షమున వ్రేలాడుచుండుట నేను చూచితినని యోవాబుతో చెప్పినప్పుడు

11 యోవాబు–నీవు చూచి యుంటివే, నేల కూలునట్లు నీవతని కొట్టకపోతివేమి? నీవతని చంపినయెడల పది తులముల వెండియు ఒక నడికట్టును నీకిచ్చియుందు నని తనకు సమాచారము చెప్పినవానితో అనెను.౹

12 అందుకు వాడు–యౌవనుడైన అబ్షాలోమును ఎవడును ముట్టకుండ జాగ్రత్తపడుడని రాజు నీకును అబీషైకిని ఇత్తయికిని ఆజ్ఞ నిచ్చుచుండగా నేను వింటిని; వెయ్యితులముల వెండి నా చేతిలో పెట్టినను రాజు కుమారుని నేను చంపను.౹

13 మోసము చేసి నేను అతని ప్రాణమునకు ముప్పు తెచ్చినయెడల అది రాజునకు తెలియకపోదు, రాజు సన్నిధిని నీవే నాకు విరోధివగుదువు గదా అని యోవాబుతో అనగా

14 యోవాబు–నీవు చేయువరకు నేను కాచుకొని యుందునా? అని చెప్పి మూడు బాణములు చేతపట్టుకొనిపోయి మస్తకివృక్షమున వ్రేలాడుచు ఇంకను ప్రాణముతో నున్న అబ్షాలోముయొక్క గుండెకు గురిపెట్టి

15 తన ఆయుధములను మోయువారు పదిమంది చుట్టు చుట్టుకొని యుండగా అబ్షాలోమును కొట్టి చంపెను.౹

16 అప్పుడు జనులను ఇక హతము చేయక విడువవలసినదని యోవాబు బాకా ఊదింపగా ఇశ్రాయేలీయులను తరుముకొనిపోయిన జనులు తిరిగి వచ్చిరి.౹

17 జనులు అబ్షాలోముయొక్క కళేబరమును ఎత్తి అడవిలో ఉన్న పెద్దగోతిలో పడవేసి పెద్దరాళ్లకుప్ప దానిమీద పేర్చిన తరువాత ఇశ్రాయేలీయులందరును తమతమ యిండ్లకు పోయిరి.౹

18 తన పేరు నిలుపుటకు తనకు కుమారులు లేరనుకొని, అబ్షాలోము తాను బ్రదికియుండగా ఒక స్తంభము తెచ్చి దానిని రాజు లోయలో తన పేరట నిలువబెట్టి, అతడు ఆ స్తంభమునకు తన పేరు పెట్టియుండెను. నేటివరకు అబ్షాలోము స్తంభమని దానికి పేరు.

19 సాదోకు కుమారుడైన అహిమయస్సు–నేను పరుగెత్తి కొనిపోయి యెహోవా తన శత్రువులను ఓడించి తనకు న్యాయము తీర్చిన వర్తమానము రాజుతో చెప్పెదననగా

20 యోవాబు–ఈ దినమున ఈ వర్తమానము చెప్ప తగదు, మరియొక దినమున చెప్పవచ్చును; రాజు కుమారుడు మరణమాయెను గనుక ఈ దినమున వర్తమానము తీసికొని పోతగదని అతనితో చెప్పెను.౹

21 తరువాత కూషీని పిలిచి –నీవు పోయి నీవు చూచిన దానిని రాజునకు తెలియజేయుమనగా కూషీ యోవాబునకు నమస్కారము చేసి పరుగెత్తికొని పోయెను.౹

22 అయితే సాదోకు కుమారుడైన అహిమయస్సు–కూషీతోకూడ నేనును పరుగెత్తికొని పోవుటకు సెలవిమ్మని యోవాబుతో మనవిచేయగా యోవాబు–నాయనా నీవెందుకు పోవలెను? చెప్పుటకు నీకు బహుమానము తెచ్చు విశేషమైన సమాచారమేదియు లేదు గదా అని అతనితో అనగా

23 అతడు–ఏమైనను సరే నేను పరుగెత్తికొని పోవుదుననెను. అందుకు యోవాబు –పొమ్మని సెలవియ్యగా అహిమయస్సు మైదానపు మార్గమున పరుగెత్తికొని కూషీకంటె ముందుగా చేరెను.

24 దావీదు రెండు గుమ్మములమధ్యను నడవలో కూర్చొని యుండెను; కావలికాడు గుమ్మముపైనున్న గోడమీదికి ఎక్కి పారచూడగా ఒంటరిగా పరుగెత్తికొని వచ్చుచున్న యొకడు కనబడెను. వాడు అరచి రాజునకు ఈ సంగతి తెలియజేయగా

25 రాజు–వాడు ఒంటరిగా ఉండినయెడల ఏదో వర్తమానము తెచ్చుచున్నాడనెను. అంతలో వాడు పరుగుమీద వచ్చుచుండగా

26 కావలికాడు పరుగెత్తికొని వచ్చు మరియొకని కనుగొని–అదిగో మరియొకడు ఒంటరి గానే పరుగెత్తికొని వచ్చుచున్నాడని ద్వారపుతట్టు తిరిగి చెప్పగా రాజు–వాడును వర్తమానము తెచ్చుచున్నా డనెను.౹

27 కావలికాడు మొదటివాడు పరుగెత్తుట చూడగా –వాడు సాదోకు కుమారుడైన అహిమయస్సు అని నాకు తోచుచున్నది అనినప్పుడు రాజు–వాడు మంచివాడు, శుభవర్తమానము తెచ్చుచున్నాడని చెప్పెను. అంతలో

28 అహిమయస్సు జయమని బిగ్గరగా రాజుతో చెప్పి రాజు ముందర సాష్టాంగ నమస్కారము చేసి–నా యేలినవాడవును రాజవునగు నిన్ను చంప చూచినవారిని అప్పగించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము అని చెప్పెను.౹

29 రాజు–బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా? అని యడుగగా అహిమయస్సు–యోవాబు రాజసేవకుడనైన నీ దాసుడనగునన్ను పంపినప్పుడు గొప్ప అల్లరి జరు గుట నేను చూచితినిగాని అది ఏమైనది నాకు తెలిసినది కాదని చెప్పెను.౹

30 అప్పుడు రాజు–నీవు ప్రక్కకు తొలగి నిలిచియుండుమని వాని కాజ్ఞనియ్యగా వాడు తొలగి నిలిచెను.౹

31 అంతలో కూషీ వచ్చి–నా యేలిన వాడా రాజా, నేను నీకు శుభసమాచారము తెచ్చితిని; యీ దినమున యెహోవా నీ మీదికి వచ్చినవారినందరిని ఓడించి నీకు న్యాయము తీర్చెనని చెప్పినప్పుడు

32 రాజు–బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా? అని యడిగెను. అందుకు కూషీ చెప్పినదేమనగా–నా యేలినవాడవును రాజవునగు నీ శత్రువులును నీకు హాని చేయవలెనని నీ మీదికి వచ్చినవారందరును ఆ బాలుడున్నట్టుగానే యుందురు గాక.౹

33 అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగా నున్న గదికి ఎక్కి పోయి యేడ్చుచు, సంచరించుచు–నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా, అని కేకలు వేయుచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయినయెడల ఎంత బాగుండును; నా కుమారుడా అబ్షాలోమా నా కుమారుడా, అని యేడ్చుచు వచ్చెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2SA/18-b7fd2edf936335ce0168046fa25215ff.mp3?version_id=1787—

Categories
2 సమూయేలు

2 సమూయేలు 19

1 రాజు తన కుమారునిగూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడను సంగతి ఆ దినమున జనులందరు విని,౹

2-5 యుద్ధమందు సిగ్గుతో పారిపోయిన జనులవలె వారు నాడు దొంగనడకలతో వచ్చి పట్టణములో ప్రవేశించిరి; నాటి విజయము జనులకందరికి దుఃఖమునకు కారణమాయెను. రాజు ముఖము కప్పుకొని–అబ్షాలోమా నా కుమారుడా అబ్షాలోమా నా కుమారుడా నా కుమారుడా, అని కేకలు వేయుచు ఏడ్చుచుండగా, రాజు అబ్షాలోమునుగూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడను సంగతి యోవాబు విని నగరియందున్న రాజునొద్దకు వచ్చి–నీ ప్రాణమును నీ కుమారుల ప్రాణములను నీ కుమార్తెల ప్రాణములను నీ భార్యల ప్రాణములను నీ ఉపపత్నుల ప్రాణములను ఈ దినమున రక్షించిన నీ సేవకులనందరిని నేడు సిగ్గుపరచి

6 నీ స్నేహితుల యెడల ప్రేమ చూపక నీ శత్రువులయెడల ప్రేమ చూపుచు, ఈ దినమున అధిపతులును సేవకులును నీకు ఇష్టజనులుకారని నీవు కనుపరచితివి. మేమందరము చనిపోయి అబ్షాలోము బ్రదికియుండినయెడల అది నీకు ఇష్టమగునన్న మాట యీ దినమున నేను తెలిసికొనుచున్నాను. ఇప్పుడు లేచి బయటికివచ్చి నీ సేవకులను ధైర్యపరచుము.౹

7 నీవు బయటికి రాకయుండినయెడల ఈ రాత్రి యొకడును నీయొద్ద నిలువడని యెహోవా నామమునుబట్టి ప్రమాణము చేసి చెప్పుచున్నాను; నీ బాల్యమునుండి నేటివరకు నీకు ప్రాప్తించిన అపాయములన్నిటికంటె అది నీకు కష్టతరముగా ఉండునని రాజుతో మనవిచేయగా రాజు లేచి వచ్చి గుమ్మములో కూర్చుండెను.

8 రాజు గుమ్మములో కూర్చున్నాడను మాట జనులందరు విని రాజును దర్శింప వచ్చిరిగాని ఇశ్రాయేలువారు తమతమ యిండ్లకు పారిపోయిరి.౹

9 అంతట ఇశ్రాయేలువారి గోత్రములకు చేరికైన జనులందరు ఇట్లనుకొనిరి–మన శత్రువుల చేతిలోనుండియు, ఫిలిష్తీయుల చేతిలోనుండియు మనలను విడిపించిన రాజు అబ్షాలోమునకు భయపడి దేశములోనుండి పారిపోయెను.౹

10 మనమీద మనము రాజుగా పట్టాభిషేకము చేసిన అబ్షాలోము యుద్ధమందు మరణమాయెను. కాబట్టి మనము రాజును మరల తోడుకొని వచ్చుటనుగూర్చి ఏల మాట్లాడక పోతిమి?

11 రాజైన దావీదు ఇది విని యాజకులగు సాదోకునకును అబ్యాతారునకును వర్తమానము పంపి–ఇశ్రాయేలువారందరు మాటలాడుకొను సంగతి నగరిలోనున్న రాజునకు వినబడెను గనుక రాజును నగరికి మరల తోడుకొని రాకుండ మీరెందుకు ఆలస్యము చేయుచున్నారు?

12 మీరు నాకు ఎముక నంటినట్టియు మాంసము నంటినట్టియు సహోదరులై యుండగా రాజును తోడుకొని రాకుండ మీరెందుకు ఆలస్యము చేయుచున్నారని యూదావారి పెద్దలతో చెప్పుమని ఆజ్ఞ ఇచ్చెను.౹

13 మరియు అమాశా యొద్దకు దూతలను పంపి–నీవు నాకు ఎముక నంటిన బంధువుడవు మాంసము నంటిన బంధువుడవు కావా? యోవాబునకు బదులు నిన్ను సైన్యాధిపతిగా నేను ఖాయ పరచనియెడల దేవుడు గొప్పఅపాయము నాకు కలుగ జేయును గాకని చెప్పుడనెను.౹

14 అతడు పోయి యెవరును తప్పకుండ యూదావారినందరిని రాజునకు ఇష్టపూర్వకముగా లోబడునట్లు చేయగా–నీవును నీ సేవకులందరును మరల రావలెనన్న వర్తమానము వారు రాజునొద్దకు పంపిరి. రాజు తిరిగి యొర్దాను నదియొద్దకు రాగా

15 యూదావారు రాజును ఎదుర్కొనుటకును రాజును నది యివతలకు తోడుకొని వచ్చుటకును గిల్గాలునకు వచ్చిరి.

16 అంతలో బహూరీమునందున్న బెన్యామీనీయుడగు గెరా కుమారుడైన షిమీ త్వరపడి రాజైన దావీదును ఎదుర్కొనుటకై యూదావారితోకూడ వచ్చెను.౹

17 అతని యొద్ద వెయ్యిమంది బెన్యామీనీయులు ఉండిరి. మరియు సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయును అతని పదు నయిదుగురు కుమారులును అతని యిరువదిమంది దాసులును వచ్చి

18 రాజు ఎదుట నది దాటిరి; రాజు ఇంటివారిని అవతలకు దాటించుటకును రాజు దృష్టికి అనుకూలమైన దానిని చేయుటకును రేవుపడవను ఇవతలకు తెచ్చి యుండిరి. అంతట గెరా కుమారుడగు షిమీ వచ్చి రాజు యొర్దానునది దాటి పోగానే అతనికి సాష్టాంగపడి

19 –నా యేలినవాడా, నేను చేసిన ద్రోహము నామీద మోప కుము; నా యేలినవాడవును రాజవునగు నీవు యెరూషలేమును విడిచిన వేళ నీ దాసుడనగు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకమందుంచకుము, మనస్సునందుంచు కొనకుము.౹

20 నేను పాపము చేసితినని నాకు తెలిసినది గనుక యోసేపు వారందరితోకూడ నా యేలినవాడవును రాజవునగు నిన్ను ఎదుర్కొనుటకై నేను ముందుగా వచ్చియున్నాననెను.౹

21 అంతట సెరూయా కుమారుడగు అబీషై–యెహోవా అభిషేకించినవానిని శపించిన యీ షిమీ మరణమునకు పాత్రుడు కాడా అని యనగా

22 దావీదు–సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? ఇట్టి సమయమున మీరు నాకు విరోధులగుదురా? ఇశ్రాయేలువారిలో ఎవరైనను ఈ దినమున మరణశిక్ష నొందుదురా? యిప్పుడు నేను ఇశ్రాయేలువారిమీద రాజు నైతినను సంగతి నాకు తెలిసేయున్నదని చెప్పి ప్రమాణముచేసి

23 –నీకు మరణశిక్ష విధింపనని షిమీతో సెలవిచ్చెను.

24 మరియు సౌలు కుమారుడగు మెఫీబోషెతు రాజును నెదుర్కొనుటకు వచ్చెను. రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటివరకు అతడు కాళ్లు కడుగుకొనకయు, గడ్డము కత్తిరించుకొనకయు బట్టలు ఉదుకుకొనకయు నుండెను.౹

25 రాజును ఎదుర్కొనుటకై అతడు యెరూషలేమునకు రాగా రాజు –మెఫీబోషెతూ, నీవు నాతోకూడ రాకపోతివేమని అతని నడిగెను

26 అందుకతడు–నా యేలినవాడా రాజా, నీ దాసుడనైన నేను కుంటివాడను గనుక గాడిదమీద గంత కట్టించి యెక్కి రాజుతోకూడ వెళ్లిపోదునని నేనను కొనగా నా పనివాడు నన్ను మోసము చేసెను.౹

27 సీబా నీ దాసుడనైన నన్నుగూర్చి నా యేలినవాడవును రాజవునగు నీతో అబద్ధమాడెను. అయితే నా యేలినవాడవును రాజవునగు నీవు దేవదూత వంటివాడవు, నీ దృష్టికి ఏది యనుకూలమో దాని చేయుము.౹

28 నా తండ్రి యింటి వారందరు నా యేలినవాడవును రాజవునగు నీ దృష్టికి మృతుల వంటివారై యుండగా, నీవు నీ బల్లయొద్ద భోజనము చేయువారిలో నీ దాసుడనైన నన్ను చేర్చితివి. కాబట్టి ఇకను రాజవైన నీకు మొఱ్ఱపెట్టుటకు నాకేమి న్యాయమని అనగా

29 రాజు–నీ సంగతులను నీవిక ఎందులకు ఎత్తెదవు? నీవును సీబాయును భూమిని పంచుకొనుడని నేనాజ్ఞ ఇచ్చితిని గదా అనెను.౹

30 అందుకు మెఫీబోషెతు–నా యేలినవాడవగు నీవు నీ నగరికి తిరిగి క్షేమముగా వచ్చియున్నావు గనుక అతడు అంతయు తీసికొన వచ్చుననెను.

31 మరియు గిలాదీయుడగు బర్జిల్లయి రోగెలీమునుండి యొర్దాను అద్దరికి వచ్చి రాజుతోకూడ నది దాటెను.౹

32 బర్జిల్లయియెనుబది సంవత్సరముల వయస్సుకలిగి బహు ముసలివాడై యుండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహనయీములో నుండగా అతనికి భోజన పదార్థములను పంపించుచు వచ్చెను.౹

33 యెరూషలేములో నాయొద్ద నిన్ను నిలిపి పోషించెదను, నీవు నాతోకూడ నది దాటవలెనని రాజు బర్జిల్లయితో సెలవియ్యగా

34 బర్జిల్లయి–రాజవగు నీతోకూడ యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేనెన్ని దినములు బ్రతుకబోవుదును?

35 నేటికి నాకు ఎనుబది యేండ్లాయెను. సుఖదుఃఖములకున్న భేదమును నేను గుర్తింపగలనా? అన్నపానముల రుచి నీ దాసుడనైన నేను తెలిసికొనగలనా? గాయకులయొక్కయు గాయకురాండ్రయొక్కయు స్వరము నాకు వినబడునా? కావున నీ దాసుడనగు నేను నా యేలిన వాడవును రాజవునగు నీకు ఎందుకు భారముగా నుండవలెను?

36 నీ దాసుడనైన నేను నీతోకూడ నది దాటి అవతలకు కొంచెము దూరము వచ్చెదనుగాని రాజవగు నీవు నాకంత ప్రత్యుపకారము చేయనేల?

37 నేను నా ఊరియందుండి మరణమై నా తలిదండ్రుల సమాధియందు పాతిపెట్టబడుటకై అచ్చటికి తిరిగి పోవునట్లు నాకు సెలవిమ్ము, చిత్తగించుము, నీ దాసుడగు కింహాము నా యేలిన వాడవును రాజవునగు నీతోకూడ వచ్చుటకు సెలవిమ్ము; నీ దృష్టికి ఏది యనుకూలమో దానిని అతనికి చేయుమని మనవిచేయగా

38 రాజు–కింహాము నాతోకూడ రావచ్చును, నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసెదను, మరియు నావలన నీవు కోరునదంతయు నేను చేసెదనని సెలవిచ్చెను.౹

39 జనులందరును రాజును నది యవతలకు రాగా రాజు బర్జిల్లయిని ముద్దుపెట్టుకొని దీవించెను; తరువాత బర్జిల్లయి తన స్థలమునకు వెళ్లిపోయెను.

40 యూదా వారందరును ఇశ్రాయేలువారిలో సగము మందియు రాజును తోడుకొని రాగా రాజు కింహామును వెంటబెట్టుకొని గిల్గాలునకు వచ్చెను.౹

41 ఇట్లుండగా ఇశ్రాయేలు వారందరును రాజునొద్దకు వచ్చి–మా సహోదరులగు యూదావారు ఎందుకు నిన్ను దొంగిలించుకొని, నీ యింటివారిని నీవారిని యొర్దాను ఇవతలకు తోడుకొని వచ్చిరని యడుగగా

42 యూదా వారందరు–రాజు మీకు సమీపబంధువుడై యున్నాడు గదా, మీకు కోప మెందుకు? ఆలాగుండినను మాలో ఎవరమైనను రాజు సొమ్ము ఏమైనను తింటిమా? మాకు యినాము ఏమైన ఇచ్చెనా? అని ఇశ్రాయేలువారితో అనిరి.౹

43 అందుకు ఇశ్రాయేలు వారు–రాజులో మాకు పది భాగములున్నవి; మీకంటె మేము దావీదునందు అధిక స్వాతంత్యము గలవారము; రాజును తోడుకొని వచ్చుటనుగురించి మీతో ముందుగా మాటలాడినవారము మేమే గదా మీరు మమ్మును నిర్లక్ష్యము చేసితిరేమి? అని యూదా వారితో పలికిరి. యూదావారి మాటలు ఇశ్రాయేలు వారి మాటలకంటె కఠినముగా ఉండెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2SA/19-c8b5ae148efb842b3e47c0f3708b1e6b.mp3?version_id=1787—

Categories
2 సమూయేలు

2 సమూయేలు 20

1 బెన్యామీనీయుడగు బిక్రి కుమారుడైన షెబయను పనికిమాలినవాడొకడు అచ్చటనుండెను. వాడు–దావీదునందు మనకు భాగము లేదు, యెష్షయి కుమారునియందు మనకు స్వాస్థ్యము ఎంతమాత్రమును లేదు; ఇశ్రాయేలువారలారా, మీరందరు మీ మీ గుడారములకు పొండని బాకా ఊది ప్రకటనచేయగా

2 ఇశ్రాయేలువారందరు దావీదును విడిచి బిక్రి కుమారుడైన షెబనువెంబడించిరి. అయితే యొర్దాను నదినుండి యెరూషలేమువరకు యూదావారు రాజును హత్తుకొనిరి.౹

3 దావీదు యెరూషలేము లోని తన నగరికి వచ్చి, తన యింటికి తాను కాపుగా నుంచిన తన ఉపపత్నులైన పదిమంది స్త్రీలను తీసికొని వారిని కావలిలో ఉంచి వారిని పోషించుచుండెనుగాని వారియొద్దకు పోకుండెను; వారు కావలియందుంచబడిన వారై బ్రతికినంతకాలము విధవరాండ్రవలె ఉండిరి.

4 తరువాత రాజు అమాశాను పిలువనంపి–మూడుదినములలోగా నీవు నా దగ్గరకు యూదావారినందరిని సమ కూర్చి యిక్కడ హాజరుకమ్మని ఆజ్ఞాపించగా

5 అమాశా యూదా వారిని సమకూర్చుటకై వెళ్లిపోయెను. అతడు ఆలస్యము చేసినందున అతనికి నిర్ణయించిన కాలము మీరి పోయినప్పుడు

6 దావీదు అబీషైని పిలువనంపి–బిక్రి కుమారుడైన షెబ అబ్షాలోముకంటె మనకు ఎక్కువ కీడుచేయును; వాడు ప్రాకారములుగల పట్టణములలో చొచ్చి మనకు దొరకక పోవునేమో గనుక నీవు నీ యేలినవాని సేవకులను వెంట బెట్టుకొనిపోయి వాని తరిమి పట్టుకొనుమని ఆజ్ఞాపించెను.౹

7 కాబట్టి యోవాబు వారును కెరేతీయులును పెలేతీయులును బలాఢ్యులందరును అతనితోకూడ యెరూషలేములోనుండి బయలుదేరి బిక్రి కుమారుడగు షెబను తరుమబోయిరి.౹

8 వారు గిబియోనులో ఉన్న పెద్ద బండదగ్గరకు రాగా అమాశా వారిని కలియ వచ్చెను; యోవాబు తాను తొడుగుకొనిన చొక్కాయకు పైన బిగించియున్న నడికట్టుకు వరగల కత్తికట్టుకొనియుండగా ఆ వర వదులై కత్తి నేలపడెను.౹

9 అప్పుడు యోవాబు అమాశాతో–నా సహోదరా, నీవు క్షేమముగా ఉన్నావా అనుచు, అమాశాను ముద్దుపెట్టుకొనునట్లుగా కుడిచేత అతని గడ్డము పట్టుకొని

10 అమాశా యోవాబు చేతిలోనున్న కత్తిని చూడకను తన్ను కాపాడు కొనకను ఉండగా యోవాబు అతని కడుపులో దాని గుచ్చెను; గుచ్చినతోడనే అతని పేగులు నేలకు జారి ఆ దెబ్బతోనే అతడు చనిపోయెను. యోవాబును అతని సహోదరుడగు అబీషైయును బిక్రి కుమారుడగు షెబను తరుముటకు సాగిపోగా

11 యోవాబు బంటులలో ఒకడు అతనిదగ్గర నిలిచి–యోవాబుకు ఇష్టులైన దావీదు పక్షముననున్నవారందరు యోవాబును వెంబడించుడని ప్రకటన చేసెను.౹

12 అమాశా రక్తములో పొర్లుచు మార్గమున పడియుండగా అచ్చోటికి వచ్చిన జనులందరు నిలిచి యుండుట ఆ మనుష్యుడు చూచి–అమాశాను మార్గము నుండి చేనిలోనికి లాగి, మార్గస్థులందరు నిలిచి తేరిచూడకుండ శవముమీద బట్ట కప్పెను.౹

13 శవము మార్గమునుండి తీయబడిన తరువాత జనులందరు బిక్రి కుమారుడగు షెబను తరుముటకై యోవాబు వెంబడి వెళ్లిరి.౹

14 అతడు ఇశ్రాయేలు గోత్రపు వారందరియొద్దకును ఆబేలువారియొద్దకును బేత్మయకావారియొద్దకును బెరీయులందరియొద్దకును రాగా వారు కూడుకొని అతని వెంబడించిరి.౹

15 ఈ ప్రకారము వారు వచ్చి ఆబేలు బేత్మయకాయందు బిక్రిని ముట్టడివేసి పట్టణపు ప్రాకారము ఎదుట బురుజు కట్టగా యోవాబు వారందరు ప్రాకారమును పడవేయుటకు దానిని కొట్టిరి.౹

16 అప్పుడు యుక్తిగల యొక స్త్రీ ప్రాకారము ఎక్కి–ఓహో ఆలకించుడి, ఆలకించుడి, నేను అతనితో మాటలాడునట్లు యోవాబును ఇక్కడికి రమ్మని చెప్పుడని కేకవేయగా యోవాబు ఆమెదగ్గరకు వచ్చెను.౹

17 అంతట ఆమె–యోవాబువు నీవేనా అని అతని నడుగగా అతడు–నేనే అనెను. అందుకామె– నీ దాసురాలనగు నేను నీతో మాటలాడుదునా అని అడుగగా అతడు–మాటలాడ వచ్చుననెను.౹

18 అంతట ఆమె–పూర్వకాలమున జనులు–ఆబేలునందు సంగతి విచారింపవలెనని చెప్పుట కద్దు; ఆలాగున చేసి కార్యములు ముగించుచు వచ్చిరి.౹

19 నేను ఇశ్రాయేలునందు నిమ్మళస్థులలోను యథార్థవంతులలోను చేరికయైనదానను; ఇశ్రాయేలీయుల పట్టణములలో ప్రధానమగు ఒక పట్టణమును లయము చేయవలెనని నీవు ఉద్దేశించుచున్నావు; యెహోవా స్వాస్థ్యమును నీవెందుకు నిర్మూలము చేయుదు వని చెప్పగా

20 యోవాబు–నిర్మూలము చేయను, లయపరచను, ఆలాగున చేయనే చేయను, సంగతి అది కానే కాదు.౹

21 బిక్రి కుమారుడగు షెబ అను ఎఫ్రాయిము మన్యపువాడు ఒకడు రాజైన దావీదుమీద ద్రోహము చేసియున్నాడు; మీరు వానిని మాత్రము అప్పగించుడి; తోడనే నేను ఈ పట్టణము విడిచిపోవుదునని చెప్పగా ఆమె యోవాబుతో–చిత్తము, వాని తల ప్రాకారము పైనుండి పడవేయబడునని చెప్పిపోయి

22 తాను యోవాబుతో పలికిన యుక్తిగల మాటలను జనులందరికి తెలియ జేయగా, వారు బిక్రి కుమారుడగు షెబయొక్క తలను ఛేదించి యోవాబు దగ్గర దాని పడవేసిరి. కాగా అతడు బాకా ఊదించిన తరువాత జనులందరును ఆ పట్టణమును విడిచి యెవరి గుడారములకు వారు పోయిరి; యోవాబు యెరూషలేమునకు రాజునొద్దకు తిరిగి వచ్చెను.

23 యోవాబు ఇశ్రాయేలు దండువారందరికి అధిపతియైయుండెను. అయితే కెరేతీయులకును పెలేతీయులకును యెహోయాదా కుమారుడగు బెనాయా అధిపతియైయుండెను.౹

24 అదోరాము వెట్టిపనులు చేయువారిమీద అధికారియైయుండెను; అహీలూదు కుమారుడగు యెహోషాపాతు రాజ్యపు దస్తావేజులమీద ఉండెను; షెవా లేఖకుడు; సాదోకును అబ్యాతారును యాజకులు; యాయీరీయుడగు ఈరా దావీదునకు సభాముఖ్యుడు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2SA/20-c42b5c1e6d9a68bdbed6cee02f0c0e40.mp3?version_id=1787—

Categories
2 సమూయేలు

2 సమూయేలు 21

1 దావీదు కాలమున మూడు సంవత్సరములు విడువకుండ కరవుకలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఈలాగున సెలవిచ్చెను–సౌలు గిబియోనీయులను హతముచేసెను గనుక అతనినిబట్టియు, నరహంతకులగు అతని యింటివారినిబట్టియు శిక్షగా ఈ కరవు కలిగెను.౹

2 గిబియోనీయులు ఇశ్రాయేలీయుల సంబంధికులు కారు, వారు అమోరీయులలో శేషించినవారు. ఇశ్రాయేలీయులు మిమ్మును చంపమని ప్రమాణపూర్వకముగా వారితో చెప్పియుండిరిగాని సౌలు ఇశ్రాయేలు యూదాల వారియందు ఆసక్తిగలవాడై వారిని హతము చేయ చూచుచుండెను.౹

3 రాజగు దావీదు గిబియోనీయులను పిలువనంపి–నేను మీకేమి చేయగోరుదురు? యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించునట్లు దోష నివృత్తికై దేనిచేత నేను ప్రాయశ్చిత్తము చేయుదునని వారిని అడుగగా

4 గిబియోనీయులు–సౌలు అతని యింటివారును చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వెండి బంగారులేగాని ఇశ్రాయేలీయులలో ఎవరినైనను చంపుటయేగాని మేము కోరుట లేదనిరి. అంతట దావీదు మీరేమి కోరుదురో దానిని నేను మీకు చేయుదు ననగా

5 వారు–మాకు శత్రువులై మమ్మును నాశనముచేయుచు ఇశ్రాయేలీయుల సరిహద్దులలో ఉండకుండ మేము లయమగునట్లు మాకు హానిచేయనుద్దేశించినవాని కుమారులలో ఏడుగురిని మాకప్పగించుము.౹

6 యెహోవా ఏర్పరచుకొనిన సౌలు గిబియా పట్టణములో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరితీసెదమని రాజుతో మనవిచేయగా రాజు–నేను వారిని అప్పగించెదననెను.౹

7 తానును సౌలు కుమారుడగు యోనాతానును యెహోవా నామమునుబట్టి ప్రమాణము చేసియున్న హేతువుచేత రాజు సౌలు కుమారుడగు యోనాతానునకు పుట్టిన మెఫీబోషె తును అప్పగింపక

8 అయ్యా కుమార్తెయగు రిస్పా సౌలునకు కనిన యిద్దరు కుమారులగు అర్మోనిని మెఫీబోషెతును, సౌలు కుమార్తెయగు మెరాబుమెహూలతీయుడగు బర్జిల్లయి కుమారుడైన అద్రీయేలునకు కనిన అయిదుగురు కుమారులను పట్టుకొని గిబియోనీయుల కప్పగించెను.౹

9 వారు ఈ యేడుగురిని తీసికొనిపోయి కొండమీద యెహోవా సన్నిధిని ఉరితీసిరి. ఆ యేడుగురు ఏకరీతినే చంపబడిరి; కోతకాలమున యవలకోత యారంభమందువారు మరణమైరి.౹

10 అయ్యా కుమార్తెయగు రిస్పా గోనె పట్ట తీసికొని కొండపైన పరచుకొని కోత కాలారంభము మొదలుకొని ఆకాశమునుండి వర్షము ఆ కళేబరములమీద కురియువరకు అచ్చటనేయుండి, పగలు ఆకాశపక్షులు వాటిమీద వాలకుండను రాత్రి అడవిమృగములు దగ్గరకు రాకుండను వాటిని కాచుచుండగా

11 అయ్యా కుమార్తెయగు రిస్పా అను సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినబడెను.౹

12 కాబట్టి దావీదు పోయి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను యాబేష్గిలాదు వారియొద్దనుండి తెప్పించెను. ఫిలిష్తీయులు గిల్బోవలో సౌలును హతము చేసినప్పుడు వారు సౌలును యోనాతానును బేత్షాను పట్టణపు వీధిలో వ్రేలాడగట్టగా యాబే ష్గిలాదువారు వారి యెముకలను అచ్చటనుండి దొంగిలి తెచ్చి యుండిరి.౹

13 కావున దావీదు వారియొద్దనుండి సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను తెప్పించెను, రాజాజ్ఞనుబట్టి ఉరితీయబడినవారి యెముకలను జనులు సమకూర్చిరి.౹

14 సౌలు ఎముకలను అతని కుమారుడైన యోనాతాను ఎముకలను బెన్యామీనీయుల దేశమునకు చేరిన సేలాలోనున్న సౌలు తండ్రియగు కీషు సమాధియందు పాతిపెట్టిరి. రాజు ఈలాగు చేసిన తరువాత దేశముకొరకు చేయబడిన విజ్ఞాపనమును దేవుడంగీకరించెను.

15 ఫిలిష్తీయులకును ఇశ్రాయేలీయులకును యుద్ధము మరల జరుగగా దావీదు తన సేవకులతోకూడ దిగిపోయి ఫిలిష్తీయులతో యుద్ధము చేయునప్పుడు అతడు సొమ్మ సిల్లెను.౹

16 అప్పుడు రెఫాయీయుల సంతతివాడగు ఇష్బి బేనోబ అను ఒకడు ఉండెను. అతడు ధరించియున్న ఖడ్గము క్రొత్తది, వాని యీటె మూడువందల తులముల యెత్తు యిత్తడిగలది–నేను దావీదును చంపెదనని అతడు చెప్పియుండెను.౹

17 సెరూయా కుమారుడైన అబీషై రాజును ఆదుకొని ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. దావీదు జనులు దీనిచూచి, ఇశ్రాయేలీయులకు దీపమగు నీవు ఆరిపోకుండునట్లు నీవు ఇకమీదట మాతోకూడ యుద్ధమునకు రావద్దని అతనిచేత ప్రమాణము చేయించిరి.

18 అటుతరువాత ఫిలిష్తీయులతో గోబుదగ్గర మరల యుద్ధము జరుగగా హూషాతీయుడైన సిబ్బెకై రెఫాయీయుల సంతతివాడగు సఫును చంపెను.౹

19 తరువాత గోబుదగ్గర ఫిలిష్తీయులతో ఇంకొకసారి యుద్ధము జరుగగా అక్కడ బేత్లెహేమీయుడైన యహరేయోరెగీము కుమారుడగు ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుని చంపెను; వాని యీటెకఱ్ఱ నేతగాని దోనె అంత గొప్పది.౹

20 ఇంకొక యుద్ధము గాతుదగ్గర జరిగెను. అక్కడ మంచి యెత్తరి యొకడుండెను, ఒక్కొక చేతికి ఆరేసి వ్రేళ్లును, ఇరువది నాలుగు వ్రేళ్లు అతనికుండెను. అతడు రెఫాయీయుల సంతతివాడు.౹

21 అతడు ఇశ్రాయేలీయులను తిరస్కరించుచుండగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను అతనిని చంపెను.౹

22 ఈ నలుగురును గాతులోనున్న రెఫాయీయుల సంతతి వారై దావీదువలనను అతని సేవకులవలనను హతులైరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2SA/21-afbfc88a09f128c269e759f4a9a8999f.mp3?version_id=1787—

Categories
2 సమూయేలు

2 సమూయేలు 22

1 యెహోవా తన్ను సౌలుచేతిలోనుండియు, తన శత్రువులందరి చేతిలోనుండియు తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను.

అతడిట్లనెను.

2 యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు.

3 నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడెము నా రక్షణశృంగము నా ఉన్నతదుర్గము నా ఆశ్రయస్థానము. ఆయనే నాకు రక్షకుడు బలాత్కారులనుండి నన్ను రక్షించువాడవు నీవే.

4 కీర్తనీయుడైన యెహోవాకు నేను మొఱ్ఱపెట్టితిని నా శత్రువుల చేతిలోనుండి ఆయన నన్ను రక్షించెను.

5 మృత్యువుయొక్క అలలు నన్ను చుట్టుకొనగను వరదపొర్లువలె భక్తిహీనులు నా మీదికి వచ్చి నన్ను బెదరించగను

6 పాతాళపాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరించగను

7 నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని నా దేవుని ప్రార్థన చేసితిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను నా మొఱ్ఱ ఆయన చెవులలో చొచ్చెను.

8 అప్పుడు భూమి కంపించి అదిరెను పరమండలపు పునాదులు వణకెను ఆయన కోపింపగా అవి కంపించెను.

9 ఆయన నాసికారంధ్రములలోనుండి పొగ పుట్టెను ఆయన నోటనుండి అగ్నివచ్చి దహించెను నిప్పు కణములను రాజబెట్టెను.

10 మేఘములను వంచి ఆయన వచ్చెను ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మి యుండెను.

11 కెరూబుమీద ఎక్కి ఆయన యెగిరి వచ్చెను. గాలి రెక్కలమీద ప్రత్యక్షమాయెను.

12 గుడారమువలె అంధకారము తనచుట్టు వ్యాపింప జేసెను. నీటిమబ్బుల సముదాయములను, ఆకాశపు దట్టపు మేఘములను వ్యాపింపజేసెను.

13 ఆయన సన్నిధికాంతిలోనుండి నిప్పుకణములు పుట్టెను.

14 యెహోవా ఆకాశమందు గర్జించెను సర్వోన్నతుడు ఉరుముధ్వని పుట్టించెను.

15 తనబాణములను ప్రయోగించి శత్రువులను చెదర గొట్టెను మెరుపులను ప్రయోగించి వారిని తరిమివేసెను యెహోవా గద్దింపునకు తన నాసికారంధ్రముల శ్వాసము వడిగా విడువగా ఆయన గద్దింపునకు ప్రవాహముల అడుగుభాగములు కనబడెను

16 భూమి పునాదులు బయలుపడెను.

17 ఉన్నతస్థలములనుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహాజలరాసులలోనుండి తీసెను.

18 బలవంతులగు పగవారు, నన్ను ద్వేషించువారు, నాకంటె బలిష్ఠులై యుండగా వారి వశమునుండి ఆయన నన్ను రక్షించెను.

19 ఆపత్కాలమందువారు నామీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను.

20 నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను.

21 నా నీతినిబట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చెను నా నిర్దోషత్వమునుబట్టియే నాకు ప్రతిఫల మిచ్చెను.

22 యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నా దేవుని విడచినవాడను కాను.

23 ఆయన న్యాయవిధుల నన్నిటిని నేను లక్ష్యపెట్టు చున్నాను ఆయన కట్టడలను త్రోసివేసిన వాడనుకాను.

24 దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని ఆయన దృష్టికి యథార్థుడనైతిని.

25 కావున నేను నిర్దోషినై యుండుట యెహోవా చూచెను తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమునుబట్టి నాకు ప్రతిఫలమిచ్చెను.

26 దయగలవారియెడల నీవు దయ చూపించుదువు యథార్థవంతులయెడల నీవు యథార్థవంతుడవుగా నుందువు.

27 సద్భావముగల వారియెడల నీవు సద్భావము చూపు దువు మూర్ఖులయెడల నీవు వికటముగా నుందువు.

28 శ్రమపడువారిని నీవు రక్షించెదవు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచి వేసెదవు

29 యెహోవా, నీవు నాకు దీపమై యున్నావు యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును.

30 నీ సహాయముచేత నేను సైన్యములను జయింతును నా దేవుని సహాయమువలన నేను ప్రాకారములను దాటుదును.

31 దేవుడు యథార్థవంతుడు యెహోవా వాక్కు నిర్మలము ఆయన శరణుజొచ్చువారికందరికి ఆయన కేడెము.

32 యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది?

33 దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును.

34 ఆయన నా కాళ్లు జింకకాళ్లవలె చేయును ఎత్తయిన స్థలములమీద నన్ను నిలుపును.

35 నా చేతులకు యుద్ధముచేయ నేర్పువాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కు బెట్టును.

36 నీవు నీ రక్షణ కేడెమును నాకు అందించుదువు నీ సాత్వికము నన్ను గొప్పచేయును.

37 నా పాదములకు చోటు విశాలపరచుదువు నా చీలమండలు బెణకలేదు.

38 నా శత్రువులను తరిమి నాశనము చేయుదును వారిని నశింపజేయువరకు నేను తిరుగను.

39 నేను వారిని మ్రింగివేయుదును వారిని తుత్తినియలుగా కొట్టుదును వారు నా పాదముల క్రిందపడి లేవలేకయుందురు.

40 యుద్ధమునకు బలము నీవు నన్ను ధరింపజేయుదువు నామీదికి లేచినవారిని నీవు అణచివేయుదువు.

41 నా శత్రువులను వెనుకకు మళ్లచేయుదువు నన్ను ద్వేషించువారిని నేను నిర్మూలము చేయుదును.

42 వారు ఎదురు చూతురుగాని రక్షించువాడు ఒకడును లేకపోవును వారు యెహోవాకొరకు కనిపెట్టుకొనినను ఆయన వారికి ప్రత్యుత్తరమియ్యకుండును.

43 నేల ధూళివలె వారిని నలుగగొట్టెదను పొడిగా వారిని కొట్టెదను వీధిలోని పెంటవలె నేను వారిని పారపోసి అణగ ద్రొక్కెదను.

44 నా ప్రజల కలహములలో పడకుండ నీవు నన్ను విడిపించితివి జనులకు అధికారిగా నన్ను నిలిపితివి నేను ఎరుగని జనులు నన్ను సేవించెదరు.

45 అన్యులు నాకు లోబడినట్టు వేషము వేయుదురు వారు నన్నుగూర్చి వినిన మాత్రముచేత నాకు విధే యులగుదురు

46 అన్యులు దుర్బలులై వణకుచు తమ దుర్గములను విడచి వచ్చెదరు. యెహోవా జీవముగలవాడు

47 నా ఆశ్రయదుర్గమైనవాడు స్తోత్రార్హుడు నాకు రక్షణాశ్రయ దుర్గమైన దేవుడు మహోన్నతు డగును గాక

48 ఆయన నా నిమిత్తము ప్రతిదండనచేయు దేవుడు ఆయన నా నిమిత్తము పగ తీర్చు దేవుడు జనములను నాకు లోపరచువాడు ఆయనే.

49 ఆయనే నా శత్రువుల చేతిలోనుండి నన్ను విడి పించును నామీదికి లేచినవారికంటె ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలాత్కారము చేయువారి చేతిలోనుండి నీవు నన్ను విడిపించుదువు.

50 అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను. నీ నామకీర్తన గానముచేసెదను.

51 నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగ జేయువాడవు అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2SA/22-0d7b60e74175bffee99cf717aee591b0.mp3?version_id=1787—

Categories
2 సమూయేలు

2 సమూయేలు 23

1 దావీదు రచించిన చివరి మాటలు ఇవే; యెష్షయి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి యిదే; యాకోబు దేవునిచేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడును ఇశ్రాయేలీయుల స్తోత్రగీతములను మధురగానము చేసిన గాయకుడునగు దావీదు పలికిన దేవోక్తి యిదే.

2 యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు ఆయన వాక్కు నా నోట ఉన్నది.

3 ఇశ్రాయేలీయుల దేవుడు సెలవిచ్చుచున్నాడు ఇశ్రాయేలీయులకు ఆశ్రయదుర్గమగువాడు నాద్వారా మాటలాడుచున్నాడు. –మనుష్యులను ఏలు నొకడు పుట్టును అతడు నీతిమంతుడై దేవునియందు భయభక్తులు గలిగియేలును.

4 ఉదయకాలపు సూర్యోదయ కాంతివలెను మబ్బులేకుండ ఉదయించిన సూర్యునివలెను వర్షము కురిసినపిమ్మట నిర్మలమైన కాంతిచేత భూమిలోనుండి పుట్టిన లేత గడ్డివలెను అతడు ఉండును.

5 నా సంతతివారు దేవునిదృష్టికి అనుకూలురే గదా ఆయన నాతో నిత్యనిబంధన చేసియున్నాడు ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే అది స్థిరమాయెను, దేవునికి పూర్ణానుకూలము అది నాకనుగ్రహింపబడిన రక్షణార్థమైనది నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును.

6 ఒకడు ముండ్లను చేతపట్టుకొనుటకు భయపడినట్లు దుర్మార్గులు విసర్జింపబడుదురు.

7 ముండ్లను పట్టుకొనువాడు ఇనుపపనిముట్టునైనను బల్లెపు కోలనైనను వినియోగించును గదా మనుష్యులు వాటిలో దేనిని విడువక అంతయు ఉన్నచోటనే కాల్చివేయుదురు.

8 దావీదు అనుచరులలో బలాఢ్యులెవరనగా యోషే బెష్షెబెతను ముఖ్యుడగు తక్మోనీయుడు; అతడు ఒక యుద్ధములో ఎనిమిది వందలమందిని హతము చేసెను.౹

9 ఇతని తరువాతివాడు అహోహీయుడైన దోదో కుమారుడైన ఎలియాజరు, ఇతడు దావీదు ముగ్గురు బలాఢ్యులలో ఒకడు. యుద్ధమునకు కూడివచ్చిన ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను తిరస్కరించి డీకొని వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్లిపోగా ఇతడు లేచి

10 చేయి తిమ్మిరిగొని కత్తి దానికి అంటుకొని పోవువరకు ఫిలిష్తీయులను హతము చేయుచు వచ్చెను. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగజేసెను. దోపుడుసొమ్ము పట్టుకొనుటకు మాత్రము జనులు అతనివెనుక వచ్చిరి.౹

11 ఇతని తరువాతి వారెవరనగా హరారీయుడగు ఆగే కుమారుడైన షమ్మా; ఫిలిష్తీయులు అలసందెల చేనిలో గుంపుకూడగా జనులు ఫిలిష్తీయులయెదుట నిలువలేక పారిపోయిరి.౹

12 అప్పుడితడు ఆ చేనిమధ్యను నిలిచి ఫిలిష్తీయులు దాని మీదికి రాకుండ వారిని వెళ్లగొట్టి వారిని హతము చేయుటవలన యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగ జేసెను.౹

13 మరియు ముప్పదిమంది అధిపతులలో శ్రేష్ఠులైన ముగ్గురు కోతకాలమున అదుల్లాము గుహలోనున్న దావీదు నొద్దకు వచ్చినప్పుడు ఫిలిష్తీయులు రెఫాయీము లోయలో దండు దిగియుండిరి,౹

14 దావీదు దుర్గములో నుండెను, ఫిలిష్తీయుల దండు కావలివారు బేత్లెహేములో ఉండిరి.౹

15 దావీదు–బేత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడై నను నాకు తెచ్చి యిచ్చినయెడల ఎంతో సంతోషించెదనని అధికారితో పలుకగా

16 ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిష్తీయుల దండు కావలివారిని ఓడించి, దారి చేసికొనిపోయి బేత్లెహేము గవిని దగ్గరనున్న బావినీళ్లు చేది దావీదునొద్దకు తీసికొనివచ్చిరి; అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సులేక యెహోవా సన్నిధిని పారబోసి –యెహోవా, నేను ఇవి త్రాగను;౹

17 ప్రాణమునకు తెగించి పోయి తెచ్చినవారి చేతి నీళ్లు త్రాగుదునా? అని చెప్పి త్రాగనొల్లకుండెను. ఆ ముగ్గురు బలాఢ్యులు ఈ కార్యములు చేసిరి.౹

18 సెరూయా కుమారుడును యోవాబు సహోదరుడునైన అబీషై తన అనుచరులలో ముఖ్యుడు. ఇతడొక యుద్ధములో మూడువందలమందిని హతముచేసి వారిమీద తన యీటెను ఆడించెను. ఇతడు ఆ ముగ్గు రిలో పేరుపొందినవాడు.౹

19 ఇతడు ఆ ముప్పదిమందిలో ఘనుడై వారికి అధిపతి యాయెనుగాని మొదటి ముగ్గు రితో సమానుడు కాకపోయెను.౹

20 మరియు కబ్సెయేలు ఊరివాడై క్రియలచేత ఘనతనొందిన యొక పరాక్రమ శాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అను నొకడు ఉండెను. ఇతడు మోయాబీయుల సంబంధులగు ఆ యిద్దరు శూరులను హతముచేసెను; మరియు మంచుకాలమున బయలువెడలి బావిలో దాగి యున్న యొక సింహమును చంపి వేసెను.౹

21 ఇంకను అతడు సౌందర్యవంతుడైన యొక ఐగుప్తీయుని చంపెను. ఈ ఐగుప్తీయుని చేతిలో ఈటెయుండగా బెనాయా దుడ్డుకఱ్ఱ తీసికొని వానిమీదికి పోయి వాని చేతిలోని యీటె ఊడలాగి దానితోనే వాని చంపెను.౹

22 ఈ కార్యములు యెహోయాదా కుమారుడైన బెనాయా చేసినందున ఆ ముగ్గురు బలాఢ్యులలోను అతడు పేరుపొంది

23 ఆ ముప్పదిమందిలో ఘనుడాయెను. అయినను మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయెను. దావీదు ఇతనిని తన సభికులలో ఒకనిగా నియమించెను.

24 ఆ ముప్పదిమంది యెవరనగా, యోవాబు సహోదరుడైన అశాహేలు, బేత్లెహేమీయుడగు దోదో కుమారుడగు ఎల్హానాను,౹

25 హరోదీయుడైన షమ్మా, హరోదీయుడైన ఎలీకా,౹

26 పత్తీయుడైన హేలెస్సు, తెకోవీయుడగు ఇక్కేషు కుమారుడైన ఈరా,౹

27 అనాతోతీయుడైన అబీ యెజరు, హుషాతీయుడైన మెబున్నయి,౹

28 అహోహీయుడైన సల్మోను, నెటోపాతీయుడైన మహరై

29 నెటోపా తీయుడైన బయానాకు పుట్టిన హేలెబు, బెన్యామీనీయుల గిబియాలో పుట్టిన రీబై కుమారుడైన ఇత్తయి,౹

30 పిరాతోనీయుడైన బెనాయా, గాయషు ఏళ్లనడుమ నివసించు హిద్దయి,౹

31 అర్బాతీయుడైన అబీయల్బోను, బర్హుమీయుడైన అజ్మావెతు,౹

32 షయల్బోనీయుడైన ఎల్యహ్బా, యాషేనుయొక్క కుమారులలో యోనాతాను,౹

33 హరారీయుడైన షమ్మా, హరారీయుడైన షారారునకు పుట్టిన అహీయాము,౹

34 మాయాకాతీయునికి పుట్టిన అహస్బయి కుమారుడైన ఎలీపేలెటు, గిలోనీయుడైన అహీతోపెలు కుమారుడగు ఏలీయాము,౹

35 కర్మెతీయుడైన హెసై, అర్బీయుడైన పయరై,౹

36 సోబావాడగు నాతానుయొక్క కుమారుడైన ఇగాలు, గాదీయుడైన బానీ,౹

37 అమ్మోనీయుడైన జెలెకు, బెయేరోతీయుడైన నహరై, యితడు సెరూయా కుమారుడగు యోవాబుయొక్క ఆయుధములను మోయువాడై యుండెను.౹

38-39 ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు, హిత్తీయుడైన ఊరియా. వారందరు ముప్పదియేడుగురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2SA/23-11d897cf13d69b12659c21e66ddcb292.mp3?version_id=1787—