Categories
1 సమూయేలు

1 సమూయేలు 15

1 ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి యెహోవా ఇశ్రాయేలీయులగు తన జనులమీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను; యెహోవా మాట వినుము.౹

2 సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా–అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే, వారు ఐగుప్తులోనుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారిమీదికి వచ్చిరి గదా.౹

3 కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలే కీయులను హతముచేయుచు, పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పసిపిల్లలనేమి యెద్దులనేమి గొఱ్ఱెలనేమి ఒంటెలనేమి గార్దభములనేమి అన్నిటిని హతముచేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడుచేసి అమాలేకీయులను నిర్మూలము చేయుమని చెప్పెను.

4 అంతట సౌలు జనులను పోగుచేసి తెలాయీములో వారిని లెక్కపెట్టగా, కాలుబలము రెండు లక్షలమందియు యూదావారు పదివేలమందియు నుండిరి.౹

5 అప్పుడు సౌలు అమాలేకీయుల పట్టణములలో నొకదానికి వచ్చి లోయలో పొంచియుండి

6 –ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారము చేసితిరి గనుక అమాలేకీయులతోకూడ నేను మిమ్మును నాశనము చేయకుండునట్లు మీరు వారిలోనుండి బయలుదేరి పోవుడని కేనీయులకు వర్తమానము పంపగా కేనీయులు అమాలేకీయులలోనుండి వెళ్లిపోయిరి.౹

7 తరువాత సౌలు అమాలేకీయులను హవీలానుండి ఐగుప్తుదేశపు మార్గముననున్న షూరువరకు తరిమి హతముచేసి

8 అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులనందరిని కత్తిచేత నిర్మూలము చేసెను

9 సౌలును జనులును కూడి అగగును, గొఱ్ఱెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొఱ్ఱెపిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి, పనికిరాని నీచపశువులన్నిటిని నిర్మూలముచేసిరి.

10 అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

11 –సౌలు నన్ను అనుస రింపక వెనుకతీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంత యెహోవాకు మొఱ్ఱపెట్టుచుండెను.౹

12 ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మెలునకువచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయెనన్న సమాచారము వినెను.౹

13 తరువాత అతడు సౌలు నొద్దకురాగా సౌలు–యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా

14 సమూయేలు–ఆలాగైతే నాకు వినబడుచున్న గొఱ్ఱెల అరుపులును ఎడ్ల రంకెలును ఎక్కడివి? అని అడిగెను.౹

15 అందుకు సౌలు–అమాలేకీయుల యొద్దనుండి జనులు వీటిని తీసికొనివచ్చిరి; నీ దేవుడైన యెహోవాకు బలులనర్పించుటకు జనులు గొఱ్ఱెలలోను ఎడ్లలోను మంచివాటిని ఉండనిచ్చిరి; మిగిలినవాటినన్నిటిని మేము నిర్మూలముచేసితిమనగా

16 సమూయేలు–నీవు మాటలాడ పనిలేదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో అనగా, సౌలు–చెప్పుమనెను.౹

17 అందుకు సమూయేలు– నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సువైతివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలీయులమీద రాజుగా అభిషేకించెను.౹

18 మరియు యెహోవా నిన్ను సాగనంపి–నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయుము, వారు లయమగువరకు వారితో యుద్ధము చేయుమని సెలవియ్యగా

19 నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడుమీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను.౹

20 అందుకు సౌలు–ఆ మాట అనవద్దు; నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసికొనివచ్చితిని కాని అమాలేకీయులను నిర్మూలము చేసితిని.౹

21 అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములగు గొఱ్ఱెలలోను ఎడ్లలోను ముఖ్యమైనవాటిని తీసికొనివచ్చిరని సమూయేలుతో చెప్పెను.౹

22 అందుకు సమూయేలు–తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుటవలన యెహోవా సంతోషించునట్లు, ఒకడు దహనబలులను బలులను అర్పించుటవలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుటకంటె ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుటకంటె మాట వినుటయు శ్రేష్ఠము.౹

23 తిరుగుబాటు చేయుట సోదెచెప్పుటయను పాపముతో సమానము; మూర్ఖతను అగపరచుట మాయావిగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జింతివి గనుక నీవు రాజుగా ఉండకుండ ఆయన నిన్ను విసర్జించెననగా

24 సౌలు–జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని.౹

25 కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మ్రొక్కునట్లు నాతోకూడ తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను.౹

26 అందుకు సమూయేలు–నీతోకూడ నేను తిరిగి రాను; నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలీయులమీద రాజుగా ఉండకుండ యెహోవా నిన్ను విసర్జించెనని చెప్పి

27 వెళ్లిపోవలెనని తిరుగగా, సౌలు అతని దుప్పటిచెంగు పట్టుకొనినందున అది చినిగెను.౹

28 అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను–నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలోనుండి లాగివేసి నీకంటె ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించియున్నాడు.౹

29 మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైనవాడు నరుడుకాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాప పడడు.౹

30 అందుకు సౌలు–నేను పాపము చేసితిని, అయినను నా జనుల పెద్దలయెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నన్ను ఘనపరచిన యెహోవాకు మ్రొక్కుటకై నేను పోగా నాతోకూడ తిరిగి రమ్మని అతనిని వేడుకొనినందున

31 సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్లెను. సౌలు యెహోవాకు మ్రొక్కిన తరువాత

32 సమూయేలు–అమాలేకీయులరాజైన అగగును నా దగ్గరకు తీసికొనిరండనిచెప్పెను. అగగు సంతోషముగా అతని దగ్గరకు వచ్చి–మరణశ్రమ నాకు గడచిపోయెనే అని చెప్పగా

33 సమూయేలు–నీ కత్తి స్త్రీలకు సంతులేకుండ చేసినట్లు నీ తల్లికిని స్త్రీలలో సంతులేకపోవునని అతనితో చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిని అగగును తుత్తునియలుగా నరికెను.

34 అప్పుడు సమూయేలు రామాకు వెళ్లిపోయెను, సౌలును సౌలు గిబియాలోని తన యింటికి వెళ్లెను.౹

35 సౌలు బ్రదికిన దినములన్నిటను సమూయేలు అతని దర్శింప వెళ్లలేదుగాని సౌలునుగూర్చి దుఃఖాక్రాంతు డాయెను. మరియు తాను సౌలును ఇశ్రాయేలీయులమీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపము పడెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1SA/15-41131dd0b1bca60615a27ef826eece7b.mp3?version_id=1787—

Categories
1 సమూయేలు

1 సమూయేలు 16

1 అంతట యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను – ఇశ్రాయేలీయులమీద రాజుగా ఉండకుండ నేను విసర్జించిన సౌలునుగూర్చి నీ వెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము, బేత్లెహేమీయుడైన యెష్షయియొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును.౹

2 సమూయేలు–నేనెట్లు వెళ్లుదును? నేను వెళ్లిన సంగతి సౌలు వినినయెడల అతడు నన్ను చంపుననగా యెహోవా –నీవు ఒక పెయ్యను తీసికొనిపోయి యెహోవాకు బలిపశువును వధించుటకై వచ్చితినని చెప్పి

3 యెష్షయిని బల్యర్పణమునకు పిలువుము; అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును; ఎవనిపేరు నేను నీకు చెప్పుదునో అతనిని నీవు అభిషేకింపవలెనని సెలవియ్యగా

4 సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవుచొప్పున బేత్లెహేమునకు వెళ్లెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి–సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా

5 అతడు–సమాధానముగానే వచ్చితిని; మీరు శుద్ధులై నాతోకూడ బలికి రండని చెప్పి, యెష్షయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను.౹

6 వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి–నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన యెదుట నిలిచియున్నాడని అనుకొనెను

7 అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను–అతని రూపమును అతని యెత్తును లక్ష్యపెట్టకుము, మనుష్యులు లక్ష్యపెట్టువాటిని యెహోవా లక్ష్యపెట్టడు; నేను అతని త్రోసివేసి యున్నాను. మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురుగాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.౹

8 యెష్షయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతని రప్పింపగా అతడు–యెహోవా ఇతని కోరుకొన లేదనెను.౹

9 అప్పుడు యెష్షయి షమ్మాను పిలువగా అతడు –యెహోవా ఇతనిని కోరుకొనలేదనెను.౹

10 యెష్షయి తన యేడుగురు కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు–యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి

11 నీ కుమారులందరు ఇక్కడనున్నారా అని యెష్షయిని అడుగగా అతడు–ఇంకను కడసారివాడున్నాడు. అయితే వాడు గొఱ్ఱెలను కాయుచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు–నీవు వాని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చువరకు మనము కూర్చుందమని యెష్షయితో చెప్పగా

12 అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొనివచ్చెను. అతడు ఎఱ్ఱనివాడును చక్కని నేత్రములుగలవాడును చూచుటకు సుందరమైనవాడునై యుండెను. అతడు రాగానే–నేను కోరుకొన్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవియ్యగా

13 సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల యెదుట వానికి అభిషేకము చేసెను. నాటనుండి యెహోవా ఆత్మ దావీదుమీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్లిపోయెను.

14 యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్దనుండి దురాత్మయొకటి వచ్చి అతని వెరపింపగా

15 సౌలు సేవకులు–దేవునియొద్దనుండి వచ్చిన దురాత్మయొకటి నిన్ను వెరపించియున్నది;౹

16 మా యేలినవాడవైన నీవు ఆజ్ఞ ఇమ్ము, నీ దాసులమైన మేము సిద్ధముగా నున్నాము. సితారా చమత్కారముగా వాయింపగల యొకని విచారించుటకై మాకు సెలవిమ్ము దేవుని యొద్దనుండి దురాత్మ వచ్చి నిన్ను పెట్టినప్పుడెల్ల అతడు సితారా చేతపట్టుకొని వాయించుటచేత నీవు బాగుపడుదువని అతనితో ననిరి

17 సౌలు–బాగుగా వాయింపగల యొకని విచారించి నా యొద్దకు తీసికొని రండని తన సేవకులకు సెలవియ్యగా వారిలో ఒకడు

18 –చిత్తగించుము, బేత్లెహేమీయుడైన యెష్షయియొక్క కుమారులలో ఒకని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహు శూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసియునై యున్నాడు, మరియు యెహోవా వానికి తోడుగా నున్నాడనగా

19 సౌలు–యెష్షయియొద్దకు దూతలను పంపి, గొఱ్ఱెలయొద్దనున్న నీ కుమారుడైన దావీదును నాయొద్దకు పంపుమనెను.౹

20 అప్పుడు యెష్షయి ఒక గార్దభముమీద రొట్టెలను ద్రాక్షారసపు తిత్తిని ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడైన దావీదుచేత సౌలునొద్దకు పంపెను.౹

21 దావీదు సౌలు దగ్గరకువచ్చి అతనియెదుట నిలువబడగా అతనియందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను, అతడు సౌలు ఆయుధములను మోయువాడాయెను.౹

22 అంతట సౌలు–దావీదు నా అనుగ్రహము పొందెను గనుక అతడు నా సముఖమందు సేవచేయుటకు ఒప్పుకొనుమని యెష్ష యికి వర్తమానము పంపెను.౹

23 దేవునియొద్దనుండి దురాత్మ వచ్చి సౌలును పెట్టినప్పుడెల్ల దావీదు సితారా చేతపట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను, అతడు సేదదీరి బాగాయెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1SA/16-b60cf9246b2e4b2c8cfada994e952c99.mp3?version_id=1787—

Categories
1 సమూయేలు

1 సమూయేలు 17

1 ఫిలిష్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమ కూర్చి యూదా దేశములోని శోకోలో కూడి ఏఫెస్దమ్మీము దగ్గర శోకోకును అజేకాకునుమధ్యను దిగి యుండగా

2 సౌలును ఇశ్రాయేలీయులును కూడివచ్చి ఏలా లోయలో దిగి ఫిలిష్తీయుల కెదురుగ యుద్ధపంక్తులు తీర్చిరి.౹

3 ఫిలిష్తీయులు ఆతట్టు పర్వతము మీదను ఇశ్రాయేలీయులు ఈతట్టు పర్వతముమీదను నిలిచియుండగా ఉభయులమధ్యను ఒక లోయయుండెను.౹

4 గాతువాడైన గొల్యాతు అను శూరుడొకడు ఫిలిష్తీయుల దండులోనుండి బయలుదేరు చుండెను. అతడు ఆరుమూళ్లజేనెడు ఎత్తుమనిషి.౹

5 అతని తలమీద రాగి శిరస్త్రాణముండెను, అతడు యుద్ధకవచము ధరించియుండెను, ఆ కవచము అయిదు వేల తులముల రాగి యెత్తుగలది.౹

6 మరియు అతని కాళ్లకు రాగి కవచమును అతని భుజములమధ్యను రాగి బల్లెమొకటి యుండెను.౹

7 అతని యీటెకఱ్ఱ నేతగాని దోనె అంత పెద్దది; మరియు అతని యీటెకొన ఆరువందల తులముల యినుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయుచు అతని ముందర పోవుచుండెను.౹

8 అతడు నిలిచి ఇశ్రాయేలీయుల దండువారిని పిలిచి–యుద్ధపంక్తులు తీర్చుటకై మీ రెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిష్తీయుడను కానా? మీరు సౌలు దాసులుకారా? మీ పక్షముగా ఒకనిని ఏర్ప రచుకొని అతని నాయొద్దకు పంపుడి;౹

9 అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగినయెడల మేము మీకు దాసుల మగుదుము; నేనతని జయించి చంపినయెడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు.౹

10 ఈ దినమున నేను ఇశ్రాయేలీయుల సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒకని నియమించినయెడలవాడును నేనును పోట్లాడుదుమని ఆ ఫిలిష్తీయుడు చెప్పుచువచ్చెను.౹

11 సౌలును ఇశ్రాయేలీయులందరును ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహు భీతులైరి.

12 దావీదు యూదా బేత్లెహేమువాడగు ఎఫ్రాతీయుడైన యెష్షయి అనువాని కుమారుడు. యెష్షయికి ఎనమండు గురు కుమాళ్లుండిరి. అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడై యుండెను.౹

13 అయితే యెష్షయియొక్క ముగ్గురు పెద్దకుమారులు యుద్ధమునకు సౌలువెంటను పోయి యుండిరి. యుద్ధమునకు పోయిన అతని ముగ్గురు కుమారుల పేరులు ఏవనగా, జ్యేష్ఠుడు ఏలీయాబు, రెండవవాడు అబీనాదాబు, మూడవవాడు షమ్మా,౹

14 దావీదు కనిష్ఠుడు; పెద్దవారైన ముగ్గురు సౌలువెంటను పోయి యుండిరిగాని

15 దావీదు బేత్లెహేములో తన తండ్రి గొఱ్ఱెలను మేపుచు సౌలునొద్దకు తిరిగి పోవుచు వచ్చుచు నుండెను.౹

16 ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలు దేరుచు నలువది దినములు తన్నుతాను అగుపరచుకొనుచు వచ్చెను.

17 యెష్షయి తన కుమారుడైన దావీదును పిలిచి–నీ సహోదరులకొరకు వేయించిన యీ గోధుమలలో ఒక తూమెడును ఈ పది రొట్టెలను తీసికొని దండులో నున్న నీ సహోదరులదగ్గరకు త్వరగా పొమ్ము.౹

18 మరియు ఈ పది జున్నుగడ్డలు తీసికొనిపోయి వారి సహస్రాధిపతి కిమ్ము; నీ సహోదరులు క్షేమముగా నున్నారో లేదో సంగతి తెలిసికొని వారియొద్దనుండి ఆనవాలొకటి తీసికొని రమ్మనిచెప్పి పంపివేసెను.౹

19 సౌలును వారును ఇశ్రాయేలీయులందరును ఏలా లోయలో ఫిలిష్తీయులతో యుద్ధము చేయుచుండగా

20 దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొఱ్ఱెలను అప్పగించి ఆ వస్తువులను తీసికొని యెష్షయి తన కిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను; అయితే అతడు కందకమునకు వచ్చునప్పటికి వారును వీరును పంక్తులుగా తీరి, జయము జయమని అరుచుచు యుద్ధమునకు సాగుచుండిరి.౹

21 సైన్యము సైన్యమునకు ఎదురై ఇశ్రాయేలీయులును ఫిలిష్తీయులును యుద్ధసన్నద్ధులై బయలుదేరుచుండిరి.౹

22 దావీదు తాను తెచ్చిన వస్తువులను సామగ్రిని కనిపెట్టువాని వశము చేసి, పరుగెత్తిపోయి సైన్యములో చొచ్చి కుశలప్రశ్నలు తన సహోదరుల నడిగెను.౹

23 అతడు వారితో మాటలాడుచుండగా గాతు ఫిలిష్తీయుడైన గొల్యాతు అను శూరుడు ఫిలిష్తీయుల సైన్యములోనుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలుకగా దావీదు వినెను.౹

24 ఇశ్రాయేలీయులందరు ఆ మనుష్యుని చూచి మిక్కిలి భయపడి వాని యెదుటనుండి పారిపోగా

25 ఇశ్రాయేలీయులలో ఒకడు –వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే; నిజముగా ఇశ్రాయేలీయులను తిరస్కరించుటకై వాడు బయలుదేరు చున్నాడు, వానిని చంపినవానికి రాజు బహుగ ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లిచేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీయులలో స్వతంత్రులుగాచేయు ననగా

26 దావీదు–జీవముగల దేవుని సైన్యములను తిరస్క రించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? వాని చంపి ఇశ్రాయేలీయులనుండి యీ నింద తొలగించిన వానికి బహుమతి యేమని తనయొద్ద నిలిచినవారి నడుగగా

27 జనులు–వాని చంపినవానికి ఇట్లిట్లు చేయబడునని అతని కుత్తరమిచ్చిరి.

28 అతడు వారితో మాటలాడునది అతని పెద్దన్నయగు ఏలీయాబునకు వినబడగా ఏలీయాబునకు దావీదు మీద కోపమువచ్చి అతనితో–నీవిక్కడి కెందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొఱ్ఱె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేనెరుగుదును; యుద్ధము చూచుటకే గదా నీవు వచ్చితి వనెను.౹

29 అందుకు దావీదు–నేనేమి చేసితిని? మాట మాత్రము పలికితినని చెప్పి

30 అతనియొద్దనుండి తొలగి, తిరిగి మరియొకని ఆప్రకారమే యడుగగా జనులు వానికి అదేప్రకారము ప్రత్యుత్తరమిచ్చిరి.౹

31 దావీదు చెప్పిన మాటలు నలుగురికిని తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియ జెప్పిరి గనుక అతడు దావీదును పిలువనంపెను.౹

32 –ఈ ఫిలిష్తీయునిబట్టి యెవరిమనస్సును క్రుంగ నిమిత్తములేదు. మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా

33 సౌలు–ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు; నీవు బాలుడవు, వాడు బాల్యమునుండి యుద్ధాభ్యాసము చేసినవాడని దావీదుతో అనెను.౹

34 అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను–మీ దాసుడనైన నేను నా తండ్రియొక్క గొఱ్ఱెలను కాయుచుండ సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలోనుండి ఒక గొఱ్ఱెపిల్లను ఎత్తికొని పోవుచుండగ

35 నేను దానిని తరిమి చంపి దాని నోటనుండి ఆ గొఱ్ఱెను విడిపించితిని; అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని.౹

36 మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగు బంటిని చంపితినే, జీవముగల దేవుని సైన్యములను తిరస్క రించిన యీ సున్నతిలేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు,౹

37 సింహముయొక్క బలమునుండియు, ఎలుగుబంటియొక్క బలమునుండియు నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలోనుండికూడను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలు–పొమ్ము; యెహోవా నీకు తోడుగానుండునుగాక అని దావీదుతో అనెను.

38 పిమ్మట సౌలు తన యుద్ధవస్త్రములను దావీదునకు ధరింపజేసి, రాగి శిరస్త్రాణమొకటి అతనికి కట్టి, యుద్ధకవ చము తొడిగించెను.౹

39 ఈ సామగ్రి దావీదునకు వాడుక లేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ల కలిగినది లేనిది చూచుకొనిన తరువాత దావీదు–ఇవి నాకు వాడుకలేదు, వీటితో నేను వెళ్లలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి

40 తన కఱ్ఱ చేతపట్టుకొని యేటి లోయలోనుండి అయిదు నున్నని రాళ్లను ఏరుకొని తనయొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేతపట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను.౹

41 డాలు మోయువాడు తనకు ముందు నడువగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గ రకువచ్చి

42 చుట్టు పారచూచి దావీదును కనుగొని, అతడు బాలుడై యెఱ్ఱటివాడును రూపసియునై యుండుట చూచి అతని తృణీకరించెను.౹

43 ఫిలిప్తీయుడు–కఱ్ఱ తీసికొని నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా? అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను.౹

44 –నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశపక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా

45 దావీదు–నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను.౹

46 ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును; నేను నిన్ను చంపి నీ తల తెగ వేతును; ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరును తెలిసికొనునట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయులయొక్క కళేబరములను ఆకాశపక్షులకును భూమృగములకును ఇత్తును.౹

47 అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటెచేతను రక్షించువాడుకాడని యీ దండువారందరు తెలిసికొందురు; యుద్ధము యెహోవాదే; ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను.౹

48 ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుపోగా దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యముతట్టు త్వరగా పరుగెత్తిపోయి

49 తన సంచిలో చెయ్యివేసి అందులోనుండి రాయి యొకటి తీసి వడిసెలతో విసరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురుచొచ్చినందునవాడు నేలను బోర్లపడెను.౹

50 దావీదు ఫిలిష్తీయునికంటె బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోను రాతితోను ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను.౹

51 వాడు బోర్లపడగా దావీదు పరుగెత్తిపోయి ఫిలిష్తీయునిమీద నిలుచుండి వాని కత్తి వర దూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిష్తీయులు తమ శూరుడు చచ్చుట చూచి పారిపోయిరి.౹

52 అప్పుడు ఇశ్రాయేలువారును యూదావారును లేచి–జయము జయమని అరచుచు లోయవరకును షరాయిము ఎక్రోనువరకును ఫిలిష్తీయులను తరుమగా ఫిలిష్తీయులు హతులై షరాయిము ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను అను పట్టణములవరకు కూలిరి.౹

53 అప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి వచ్చి వారి డేరాలను దోచుకొనిరి.౹

54 అయితే దావీదు ఆ ఫిలిష్తీయుని ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసికొని యెరూషలేమునకు వచ్చెను.

55 సౌలు దావీదు ఫిలిష్తీయునికి ఎదురుగా పోవుట చూచినప్పుడు తన సైన్యాధిపతియైన అబ్నేరును పిలిచి–అబ్నేరూ, ఈ యౌవనుడు ఎవని కుమారుడని అడుగగా అబ్నేరు–రాజా, నీ ప్రాణముతోడు నాకు తెలియ దనెను.౹

56 అందుకు రాజు–ఈ పడుచువాడు ఎవని కుమారుడో అడిగి తెలిసికొమ్మని అతనికి ఆజ్ఞ ఇచ్చెను.౹

57 దావీదు ఫిలిష్తీయుని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతని పిలుచుకొనిపోయి ఫిలిష్తీయుని తల చేతనుండగా అతని సౌలు దగ్గరకు తోడుకొనివచ్చెను.౹

58 సౌలు అతనిని చూచి–చిన్నవాడా, నీవెవని కుమారుడవని అడుగగా దావీదు–నేను బేత్లెహేమీయుడైన యెష్షయి అను నీ దాసుని కుమారుడనని ప్రత్యుత్తరమిచ్చెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1SA/17-40f261a8e0150272d2a5fb0a73c728e1.mp3?version_id=1787—

Categories
1 సమూయేలు

1 సమూయేలు 18

1 దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు. యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను; యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను.౹

2 ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్లనియ్యక సౌలు అతనిని చేర్చుకొనెను.౹

3 దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధనచేసికొనెను.౹

4 మరియు యోనాతాను తన దుప్పటిని తన కత్తిని తన విల్లును నడి కట్టును తీసి దావీదున కిచ్చెను.౹

5 దావీదు సౌలు తనను పంపిన చోట్లకెల్లను పోయి, సుబుద్ధిగలిగి పని చేసికొని వచ్చెను గనుక సౌలు యోధులమీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై యుండెను.

6 దావీదు ఫిలిష్తీయుని హతముచేసితిరిగి వచ్చినప్పుడు, స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్లన్నిటిలోనుండి తంబురలతోను సంభ్రమముతోను వాద్యములతోను పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి

7 ఆ స్ర్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు–

సౌలు వేలకొలదియు, దావీదు పదివేలకొలదియు

(శత్రువులను) హతము చేసిరనిరి.

8 ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని–వారు దావీదునకు పదివేలకొలది అనియు, నాకు వేలకొలది అనియు స్తుతులు పాడిరే; రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసికొనగలడు అను కొనెను.౹

9 కాబట్టి నాటనుండి సౌలు దావీదుమీద విషపు చూపు నిలిపెను.

10 మరునాడు దేవునియొద్దనుండి దురాత్మ సౌలుమీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించు చుండగాదావీదుమునుపటిలాగున వీణచేతపట్టుకొని వాయించెను.౹

11 ఒకప్పుడు సౌలు చేతిలో నొక యీటె యుండగా–దావీదును పొడిచి గోడకు బిగించుదుననుకొని సౌలు ఆ యీటెను విసిరెను. అయితే అది తగలకుండ దావీదు రెండు మారులు తప్పించుకొనెను.౹

12 యెహోవా తనను విడిచి దావీదునకు తోడైయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను.౹

13 కాబట్టి సౌలు అతని తనయొద్ద నుండనియ్యక సహస్రాధిపతిగా చేసెను; అతడు జనులకు ముందువచ్చుచు పోవుచు నుండెను.౹

14 మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధిగలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను.౹

15 దావీదు మిగుల సుబుద్ధిగలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి యధికముగా అతనికి భయపడెను.౹

16 ఇశ్రాయేలు వారితోను యూదావారితోను దావీదు జనులకు ముందువచ్చుచు, పోవుచునుండుటచేత వారు అతనిని ప్రేమింపగా

17 సౌలు –నా చెయ్యి వానిమీద పడకూడదు, ఫిలిష్తీయుల చెయ్యి వానిమీద పడును గాక అనుకొని–దావీదూ, నా పెద్దకుమార్తెయైన మేరబును నీకిత్తును; నీవు నా పట్ల యుద్ధ శాలివై యుండి యెహోవా యుద్ధములను జరిగింపవలెననెను.౹

18 అందుకు దావీదు–రాజునకు అల్లుడనగుటకు నేనెంతటివాడను? నా స్థితియైనను ఇశ్రాయేలులో నా తండ్రి కుటుంబమైనను ఏపాటివని సౌలుతో అనెను.౹

19 అయితే సౌలు కుమార్తెయైన మేరబును దావీదునకు ఇయ్య వలసి యుండగా సౌలు ఆమెను మెహోలతీయుడైన అద్రీయేలుకిచ్చి పెండ్లి చేసెను.౹

20 అయితే తన కుమార్తెయైన మీకాలు దావీదు మీద ప్రేమ గలిగియుండగా సౌలు విని సంతోషించి,౹

21 ఆమె అతనికి ఉరిగానుండు నట్లును ఫిలిష్తీయుల చెయ్యి అతనిమీద నుండునట్లును నేను ఆమెను అతనికి ఇత్తుననుకొని–ఇప్పుడు నీవు మరి యొకదానిచేత నాకు అల్లుడవగుదువని దావీదుతో చెప్పి

22 తన సేవకులను పిలిపించి–మీరు దావీదుతో రహస్యముగా మాటలాడి–రాజు నీయందు ఇష్టము గలిగియున్నాడు, అతని సేవకులందరును నీయెడల స్నేహముగా నున్నారు, కాబట్టి నీవు రాజునకు అల్లుడవు కావలెనని చెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చెను.౹

23 సౌలు సేవకులు ఆ మాటలనుబట్టి దావీ దుతో సంభాషింపగా దావీదు–నేను దరిద్రుడనై యెన్నిక లేని వాడనై యుండగా రాజునకు అల్లుడనగుట స్వల్ప విషయమని మీకు తోచునా? అని వారితో అనగా

24 సౌలు సేవకులు దావీదు పలికిన మాటలు అతనికి తెలియ జేసిరి.౹

25 అందుకు సౌలు ఫిలిష్తీయులచేత దావీదును పడ గొట్టవలెనన్న తాత్పర్యముగలవాడై–రాజు ఓలిని కోరక రాజు శత్రువులమీద పగతీర్చుకొనవలెనని ఫిలిష్తీయుల నూరు ముందోళ్లు కోరుచున్నాడని దావీదుతో చెప్పు డనెను.౹

26 సౌలు సేవకులు ఆ మాటలు దావీదునకు తెలియ జేయగా తాను రాజునకు అల్లుడు కావలెనన్న కోరిక గలవాడై

27 గడువుదాటకమునుపే లేచి తనవారితో పోయి ఫిలిష్తీయులలో రెండువందలమందిని హతముచేసి వారి ముందోళ్లు తీసికొనివచ్చి రాజునకు అల్లుడగుటకై కావలసిన లెక్క పూర్తిచేసి అప్పగింపగా సౌలు తన కుమార్తెయైన మీకాలును అతనికిచ్చి పెండ్లిచేసెను.౹

28 యెహోవా దావీదునకు తోడుగా నుండుటయు, తన కుమార్తెయైన మీకాలు అతని ప్రేమించుటయు సౌలు చూచి

29 దావీదునకు మరి యెక్కువగా భయపడి, యెల్ల ప్పుడును దావీదు మీద విరోధముగా ఉండెను.

30 ఫిలిష్తీయుల సర్దారులు యుద్ధమునకు బయలు దేరుచు వచ్చిరి. వారు బయలుదేరినప్పుడెల్లను దావీదు బహు వివేకము గలిగి ప్రవర్తించుచు రాగా సౌలు సేవకులందరికంటె అతని పేరు బహు ప్రసిద్ధికెక్కెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1SA/18-b0d57d196b2b254f885b3d33637db106.mp3?version_id=1787—

Categories
1 సమూయేలు

1 సమూయేలు 19

1 అంతట సౌలు–మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోను తన సేవకులందరితోను చెప్పగా

2 సౌలు కుమారుడైన యోనాతాను దావీదుయందు బహు ఇష్టముగలవాడైయుండి దావీదుతో ఇట్లనెను–నా తండ్రియైన సౌలు నిన్ను చంపవలెనన్న ప్రయత్నముమీదనున్నాడు. కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్తపడి రహస్యమైన స్థలమందు దాగియుండుము.౹

3 నేను వచ్చి నీవు ఉన్న చేనిలో నా తండ్రియొద్ద నిలిచి నిన్నుగూర్చి అతనితో మాటలాడిన తరువాత నిన్నుగూర్చి నాకేమైన తెలిసినయెడల దానిని నీతో తెలియజెప్పుదుననెను.౹

4 యోనాతాను తన తండ్రియైన సౌలుతో దావీదునుగూర్చిదయగా మాటలాడి–నీ సేవకుడైన దావీదు నీ విషయములో ఏ తప్పిదమును చేసినవాడు కాక బహు మేలుచేసెను గనుక, రాజా నీవు అతని విషయములో ఏ పాపము చేయకుందువుగాక.౹

5 అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలీయులకందరికి గొప్ప రక్షణ కలుగజేసెను; అది నీవే చూచి సంతోషించితివి గదా; నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధియొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయుదువని మనవిచేయగా

6 సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి–యెహోవా జీవముతోడు అతనికి మరణశిక్ష విధింపనని ప్రమాణముచేసెను.౹

7 అప్పుడు యోనాతాను దావీదును పిలుచుకొనిపోయి ఆ సంగతులన్నియు అతనికి తెలియజేసి దావీదును సౌలునొద్దకు తీసికొనిరాగా దావీదుమునుపటిలాగున అతని సన్నిధిని ఉండెను.౹

8 తరువాత యుద్ధము సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధముచేసి వారిని ఓడించి వెనుకకు పారదోలి గొప్ప వధచేయగా

9 యెహోవాయొద్దనుండి దురాత్మ సౌలుమీదికి వచ్చెను. సౌలు ఈటె చేతపట్టుకొని యింట కూర్చుండి యుండెను. దావీదు సితారా వాయించుచుండగా

10 సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యముగలిగి యీటె విసి రెను. దావీదు అతని యెదుటనుండి తప్పించుకొనినందున ఈటె గోడకు నాటగా దావీదు ఆ రాత్రియందు తప్పించుకొని పారిపోయెను.౹

11 ఉదయమున అతని చంపవలెనని పొంచియుండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని యింటికి దూతలను పంపగా దావీదు భార్యయైన మీకాలు –ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకొంటేనేగాని రేపు నీవు చంపబడుదువని చెప్పి

12 కిటికీగుండ దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయెను.౹

13 తరువాత మీకాలు ఒక గృహదేవత బొమ్మను తీసి మంచము మీద పెట్టి మేకబొచ్చు తలవైపున ఉంచి దుప్పటితో కప్పివేసి

14 సౌలు దావీదును పట్టుకొనుటకై దూతలను పంపగా–అతడు రోగియై యున్నాడని చెప్పెను.౹

15 దావీదును చూచుటకు సౌలు దూతలను పంపి–నేను అతని చంపునట్లుగా మంచముతో అతని తీసికొని రండని వారితో చెప్పగా

16 ఆ దూతలు వచ్చి లోపల చొచ్చి చూచినప్పుడు తలతట్టున మేకబొచ్చుగల యొకటి మంచము మీద కనబడెను.౹

17 అప్పుడు సౌలు–తప్పించుకొని పోవునట్లుగా నీవు నా శత్రువుని పంపివేసి నన్నీలాగున ఎందుకు మోసపుచ్చితివని మీకాలు నడుగగా మీకాలు–నే నెందుకు నిన్ను చంపవలెను? నన్ను పోనిమ్మని దావీదు తనతో చెప్పినందుకని సౌలుతో అనెను.

18 ఆలాగున దావీదు తప్పించుకొని పారిపోయి రామాలో నున్న సమూయేలునొద్దకు వచ్చి సౌలు తనకు చేసినది అంతటిని అతనికి తెలియజేయగా అతడును సమూయేలును బయలుదేరి నాయోతుకు వచ్చి అచట కాపురముండిరి.౹

19 దావీదు రామాదగ్గర నాయోతులో ఉన్నాడని సౌలునకు వర్తమానము రాగా

20 దావీదును పట్టుకొనుటకై సౌలు దూతలను పంపెను; వీరు వచ్చి ప్రవక్తలు సమాజముగా కూడుకొని ప్రకటించుటయు, సమూయేలు వారిమీద నాయకుడుగా నిలుచుటయు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతలమీదికి వచ్చెను గనుక వారును ప్రకటింప నారంభించిరి.౹

21 ఈ సంగతి సౌలునకు వినబడినప్పుడు అతడు వేరు దూతలను పంపెనుగాని వారును అటువలెనే ప్రకటించుచుండిరి. సౌలు మూడవసారి దూతలను పంపెనుగాని వారును ప్రకటించుచుండిరి.౹

22 కడవరిసారి తానే రామాకు పోయి సేఖూ దగ్గరనున్న గొప్ప బావియొద్దకు వచ్చి–సమూయేలును దావీదును ఎక్కడ ఉన్నారని అడుగగా ఒకడు–రామా దగ్గర నాయోతులో వారున్నారని చెప్పెను.౹

23 అతడు రామా దగ్గరనున్న నాయోతునకు రాగా దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ప్రయాణము చేయుచు రామాదగ్గరనున్న నాయోతునకు వచ్చువరకు ప్రకటించుచుండెను,౹

24 మరియు అతడు తన వస్త్రములను తీసివేసి ఆ నాటి రాత్రింబగళ్లు సమూయేలు ఎదుటనే ప్రకటించుచు, పైబట్టలేనివాడై పడియుండెను. అందువలన సౌలును ప్రవక్తలలోనున్నాడా అను సామెత పుట్టెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1SA/19-99326672aff08dfb6f18b6b10cb5dda1.mp3?version_id=1787—

Categories
1 సమూయేలు

1 సమూయేలు 20

1 పిమ్మట దావీదు రామాలోని నాయోతునుండి పారిపోయి యోనాతాను నొద్దకు వచ్చి–నేను ఏమి చేసితిని? నేను చేసిన దోషమేమి? నా ప్రాణము తీయ వెదకునట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమనియడుగగా

2 యోనాతాను–ఆ మాట నీవెన్నటికిని అనుకొనవద్దు, నీవు చావవు; నాకు తెలియజేయకుండ నా తండ్రి చిన్న కార్యమేగాని పెద్దకార్యమేగాని చేయడు; నా తండ్రి ఇదెందుకు నాకు మరుగుచేయుననగా

3 దావీదు–నేను నీ దృష్టికి అనుకూలుడనను సంగతి నీ తండ్రి రూఢిగా తెలిసికొని, యోనాతానునకు చింత కలుగకుండుటకై యిది అతనికి తెలుపననుకొనుచున్నాడు; అయితే యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రమున్నదని ప్రమాణముచేయగా

4 యోనాతాను–నీకేమి తోచునో దానినే నేను నీ యెడల జరుపుదుననెను.౹

5 అందుకు దావీదు–రేపటిదినము అమావాస్య; అప్పుడు నేను తప్పక రాజుతోకూడ కూర్చుండి భోజనము చేయవలెను; అయితే ఎల్లుండి సాయంత్రమువరకు చేనిలో దాగుటకు నాకు సెలవిమ్ము.౹

6 ఇంతలో నీ తండ్రి నేను లేకపోవుట కనుగొనగా నీవు ఈ మాట చెప్పవలెను. –దావీదు ఇంటివారికి ఏటేట బలి చెల్లించు మర్యాద కద్దు. కాబట్టి అతడు బేత్లెహేమను తన పట్టణమునకు పోవలెనని నన్ను బ్రతిమాలి నాయొద్ద సెలవుపుచ్చు కొనెను.౹

7 అతడు–మంచిదని సెలవిచ్చినయెడల నీ దాసుడనైన నాకు క్షేమమే కలుగును; అతడు బహుగా కోపించినయెడల అతడు నాకు కీడుచేయ తాత్పర్యముగలవాడై యున్నాడని నీవు తెలిసికొని

8 నీ దాసుడనైన నాకు ఒక ఉపకారము చేయవలెను; ఏమనగా యెహోవా పేరట నీతో నిబంధన చేయుటకై నీవు నీ దాసుడనైన నన్ను రప్పించితివి; నాయందు దోషమేమైన ఉండినయెడల నీ తండ్రియొద్దకు నన్నెందుకు తోడుకొని పోదువు? నీవే నన్ను చంపుమని యోనాతానునొద్ద మనవిచేయగా

9 యోనాతాను–ఆ మాట ఎన్నటికిని అనరాదు; నా తండ్రి నీకు కీడుచేయనుద్దేశము గలిగియున్నాడని నాకు నిశ్చయమైతే నీతో తెలియజెప్పుదును గదా అని అనగా

10 దావీదు–నీ తండ్రి నన్నుగూర్చి నీతో కఠినముగా మాటలాడినయెడల దాని నాకు తెలియజేయువారెవరని యోనాతాను నడిగెను.౹

11 అందుకు యోనాతాను–పొలములోనికి వెళ్లుదము రమ్మనగా, ఇద్దరును పొలములోనికి పోయిరి.

12 అప్పుడు యోనాతాను–ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా సాక్షి; రేపైనను ఎల్లుండియైనను ఈ వేళప్పుడు నా తండ్రిని శోధింతును; అప్పుడు దావీదునకు క్షేమ మవునని నేను తెలిసికొనినయెడల నేను ఆ వర్తమానము నీకు పంపక పోవుదునా?

13 అయితే నా తండ్రి నీకు కీడుచేయనుద్దేశించుచున్నాడని నేను తెలిసికొనినయెడల దాని నీకు తెలియజేసి నీవు క్షేమముగా వెళ్లునట్లు నిన్ను పంపివేయనియెడల యెహోవా నాకు గొప్పఅపాయము కలుగజేయుగాక. యెహోవా నా తండ్రికి తోడుగా ఉండినట్లు నీకును తోడుగా ఉండునుగాక.౹

14-15 అయితే నేను బ్రదికియుండినయెడల నేను చావకుండ యెహోవా దయచూపునట్లుగా నీవు నాకు దయచూపక పోయినయెడలనేమి, నేను చనిపోయినయెడల యెహోవా దావీదు శత్రువులను ఒకడైన భూమిమీద నిలువకుండ నిర్మూలము చేసిన తరువాత నీవు నా సంతతివారికి దయ చూపక పోయినయెడలనేమి యెహోవా నిన్ను విసర్జించును గాక.౹

16 ఈలాగున యెహోవా దావీదుయొక్క శత్రువుల చేత దాని విచారించునట్లుగా యోనాతాను దావీదు సంతతివారిని బట్టి నిబంధన చేసెను.౹

17 యోనాతాను దావీదును తన ప్రాణస్నేహితునిగా ప్రేమించెను గనుక ఆ ప్రేమనుబట్టి దావీదుచేత మరల ప్రమాణము చేయించెను.౹

18 మరియు యోనాతాను దావీదుతో ఇట్లనెను– రేపటిదినము అమావాస్య; నీ స్థలము ఖాళిగా కనబడును గదా;౹

19 నీవు మూడుదినములు ఆగి, యీ పని జరుగుచుండగా నీవు దాగియున్న స్థలమునకు త్వరగా వెళ్లి ఏసెలు అనుబండ దగ్గర నుండుము

20 గురి చూచి ప్రయో గించినట్టు నేను మూడు బాణములను దాని ప్రక్కకు కొట్టి

21 –నీవు వెళ్లి బాణములను వెదకుమని ఒక పని వానితో చెప్పుదును–బాణములు నీకు ఈతట్టున నున్నవి, పట్టుకొని రమ్మని నేను వానితో చెప్పినయెడల నీవు బయటికి రావచ్చును; యెహోవా జీవముతోడు నీకు ఏ అపాయమును రాక క్షేమమే కలుగును.౹

22 అయితే–బాణములు నీకు అవతల నున్నవని నేను వానితో చెప్పినయెడల పారిపొమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడని తెలిసికొని నీవు ప్రయాణమై పోవలెను.౹

23 అయితే మనమిద్దరము మాటలాడిన సంగతిని జ్ఞాపకము చేసికొనుము; నీకును నాకును సర్వకాలము యెహోవాయే సాక్షి.

24 కాబట్టి దావీదు పొలములో దాగుకొనెను; అమావాస్య వచ్చినప్పుడు రాజు భోజనము చేయకూర్చుండగా

25 మునుపటివలెనే రాజు గోడదగ్గర నున్న స్థలమందు తన ఆసనముమీద కూర్చునియుండెను. యోనాతాను లేవగా అబ్నేరు సౌలునొద్ద కూర్చుండెను; అయితే దావీదు స్థలము ఖాళిగా నుండెను.౹

26 అయినను అతనికి ఏదో ఒకటి సంభవించినందున అతడు అపవిత్రుడైయుండు నేమో, అతడు అపవిత్రుడైయుండుట యవశ్యమని సౌలు అనుకొని ఆ దినమున ఏమియు అనలేదు.౹

27 అయితే అమావాస్య పోయిన మరునాడు, అనగా రెండవదినమున దావీదు స్థలములో ఎవడును లేకపోవుట చూచి సౌలు– నిన్నయు నేడును యెష్షయి కుమారుడు భోజనమునకు రాకపోవుట ఏమని యోనాతాను నడుగగా

28 యోనాతాను–దావీదు బేత్లెహేమునకు పోవలెనని కోరి

29 దయచేసి నన్ను పోనిమ్ము, పట్టణమందు మా యింటివారు బలి అర్పింపబోవుచున్నారు–నీవును రావలెనని నా సహోదరుడు నాకు ఆజ్ఞాపించెను గనుక నీ దృష్టికి నేను దయ పొందిన వాడనైతే నేను వెళ్లి నా సహోదరులను దర్శించునట్లుగా నాకు సెలవిమ్మని బ్రతిమాలుకొని నాయొద్ద సెలవు తీసికొనెను; అందునిమిత్తమే అతడు రాజు భోజనపు బల్లయొద్దకు రాలేదని సౌలుతో చెప్పగా

30 సౌలు యోనాతానుమీద బహుగా కోపపడి – ఆ గడగొట్టుదాని కొడుకా, నీకును నీ తల్లి మానమునకును సిగ్గుకలుగునట్లుగా నీవు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా?

31 యెష్షయి కుమారుడు భూమిమీద బ్రదుకునంత కాలము నీకైనను నీ రాజ్యమునకైనను స్థిరత కలుగదు గదా; కాబట్టి నీవు వర్తమానము పంపి అతనిని నా దగ్గరకు రప్పించుము, నిజముగా అతడు మరణమున కర్హుడని చెప్పెను.౹

32 అంతట యోనాతాను–అతడెందుకు మరణశిక్ష నొందవలెను? అతడు ఏమి చేసెనని సౌలు నడుగగా

33 సౌలు అతనిని పొడువవలెనని యీటె విసిరెను; అందువలన తన తండ్రి దావీదును చంపనుద్దేశము గలిగియున్నాడని యోనాతాను తెలిసికొని

34 అత్యాగ్రహుడై బల్లయొద్దనుండి లేచి, తన తండ్రి దావీదును అవమానపరచినందున అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడై అమావాస్య పోయిన మరునాడు భోజనము చేయకుండెను.

35 ఉదయమున యోనాతాను దావీదుతో నిర్ణయముచేసికొనిన వేళకు ఒక పనివాని పిలుచుకొని పొలములోనికి పోయెను.౹

36 –నీవు పరుగెత్తికొనిపోయి నేను వేయు బాణములను వెదకుమని ఆ పనివానితో అతడు చెప్పగా వాడు పరుగెత్తుచున్నప్పుడు అతడు ఒక బాణము వాని అవతలకు వేసెను.౹

37 అయితే వాడు యోనాతాను వేసిన బాణము ఉన్నచోటునకు వచ్చినప్పుడు యోనాతాను వాని వెనుక నుండి కేక వేసి–బాణము నీ అవతలనున్నదని చెప్పి

38 వాని వెనుక నుండి కేకవేసి–నీవు ఆలస్యము చేయక దబ్బున రమ్మనెను; యోనాతాను పనివాడు బాణములను కూర్చుకొని తన యజమానునియొద్దకు వాటిని తీసికొని వచ్చెనుగాని

39 సంగతి ఏమియు వానికి తెలియక యుండెను. యోనాతానునకును దావీదునకును మాత్రము ఆ సంగతి తెలిసి యుండెను.౹

40 యోనాతాను తన ఆయుధములను వాని చేతికిచ్చి–వీటిని పట్టణమునకు తీసికొని పొమ్మనిచెప్పి వాని పంపివేసెను.౹

41 వాడు వెళ్లిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కునుండి బయటికి వచ్చి మూడు మారులు సాష్టాంగ నమస్కారము చేసిన తరవాత వారు ఒకరినొకరు ముద్దుపెట్టుకొనుచు ఏడ్చుచుండిరి. ఈలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను.౹

42 అంతట యోనాతాను–యెహోవా నీకును నాకునుమధ్యను నీ సంతతికిని నా సంతతికినిమధ్యను ఎన్నటెన్నటికి సాక్షిగా నుండునుగాక. మనమిద్దరము యెహోవా నామమునుబట్టి ప్రమాణము చేసికొని యున్నాము గనుక మనస్సులో నెమ్మది గలిగి పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్లిపోయెను; యోనాతానును పట్టణమునకు తిరిగి వచ్చెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1SA/20-b6ebf4d6362ffd89be83b7e771553626.mp3?version_id=1787—

Categories
1 సమూయేలు

1 సమూయేలు 21

1 దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు నొద్దకు వచ్చెను; అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి–నీవు ఒంటరిగా వచ్చితివేమని అతని నడుగగా

2 దావీదు–రాజు నాకు ఒక పని నిర్ణయించి–నేను నీ కాజ్ఞాపించి పంపిన పని యేదో అదెవనితోనైనను చెప్ప వద్దనెను; నేను నా పనివారిని ఒకానొక చోటికి వెళ్ల నిర్ణయించితిని;౹

3 నీయొద్ద ఏమి యున్నది? అయిదు రొట్టెలుగాని మరేమియుగాని యుండినయెడల అది నా కిమ్మని యాజకుడైన అహీమెలెకుతో అనగా

4 యాజకుడు –సాధారణమైన రొట్టె నాయొద్ద లేదు; పనివారు స్త్రీలకు ఎడముగా నున్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను.౹

5 అందుకు దావీదు–నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటినుండి ఈ మూడుదినములు స్త్రీలు మాకు దూరముగానే యున్నారు; పనివారి బట్టలు పవిత్రములే; ఒకవేళ మేముచేయుకార్యము అపవిత్రమైనయెడల నేమి? రాజాజ్ఞనుబట్టి అది పవిత్రముగా ఎంచతగును అని యాజకునితో అనెను.౹

6 అంతట యెహోవా సన్నిధినుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా, వెచ్చనిరొట్టెలు వేయు దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతని కిచ్చెను.

7 ఆ దినమున సౌలుయొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను; అతని పేరు దోయేగు, అతడు ఎదోమీయుడు. అతడు సౌలు పసుల కాపరులకు పెద్ద.౹

8 –రాజు పని వేగిరముగా జరుగవలెనని యెరిగి నా ఖడ్గమునైనను ఆయుధములనైనను నేను తేలేదు. ఇక్కడ నీయొద్ద ఖడ్గమైనను ఈటెయైనను ఉన్నదా అని దావీదు అహీమెలెకు నడుగగా

9 యాజకుడు–ఏలా లోయలో నీవు చంపిన గొల్యాతు అను ఫిలిష్తీయుని ఖడ్గమున్నది, అదిగో బట్టతో చుట్టబడి ఏఫోదువెనుక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమునులేదు, దాని తీసికొనుటకు నీకిష్టమైనయెడల తీసికొనుమనగా దావీదు–దానికి సమమైనదొకటియు లేదు, నా కిమ్మనెను.

10 అంతట దావీదు సౌలునకు భయపడినందున ఆ దినము ననే లేచి పారిపోయి గాతురాజైన ఆకీషునొద్దకు వచ్చెను.౹

11 ఆకీషు సేవకులు–ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు గానప్రతిగానములు చేయుచు–

సౌలు వేలకొలది హతముచేసెననియు,

దావీదు పదివేలకొలది హతముచేసెననియు

పాడిన పాటలు ఇతనిగూర్చినవే గదా అని అతనినిబట్టి రాజుతో మాటలాడగా

12 దావీదు ఈ మాటలు తన మనస్సులోనుంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను.౹

13 కాబట్టి దావీదు వారి యెదుట తన చర్య మార్చుకొని వెఱ్ఱివానివలె నటించుచు, ద్వారపు తలుపులమీద గీతలు గీయుచు, ఉమ్మి తన గడ్డముమీదికి కార నిచ్చుచు నుండెను. వారతని పట్టుకొనిపోగా అతడు పిచ్చిచేష్టలు చేయుచు వచ్చెను.౹

14 కావున ఆకీషురాజు– మీరు చూచితిరికదా? వానికి పిచ్చిపెట్టినది, నాయొద్దకు వీని నెందుకు తీసికొని వచ్చితిరి?

15 పిచ్చిచేష్టలుచేయు వారితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చిచేష్టలు చేయుటకు వీని తీసికొని వచ్చితిరేమి? వీడు నా నగరిలోనికి రా తగునా? అని తన సేవకులతో అనెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1SA/21-e2d2ecc9cdd63e17bab15336f2e0ce1d.mp3?version_id=1787—

Categories
1 సమూయేలు

1 సమూయేలు 22

1 దావీదు అక్కడనుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొనిపోగా అతని సహోదరులును అతని తండ్రి ఇంటివారందరును ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి.౹

2 మరియు ఇబ్బందిగలవారందరును, అప్పులు చేసికొనిన వారందరును, అసమాధానముగా నుండు వారందరును, అతనియొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతియాయెను. అతనియొద్దకు ఎక్కువ తక్కువ నాలుగువందలమంది వచ్చియుండిరి.౹

3 తరువాత దావీదు అక్కడనుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి –దేవుడు నాకు ఏమి చేయునది నేను తెలిసికొనువరకు నా తలిదండ్రులు వచ్చి నీయొద్ద నుండనిమ్మని మోయాబు రాజుతో మనవిచేసి

4 అతనియొద్దకు వారిని తోడుకొని పోగా దావీదు కొండలలో దాగియున్న దినములువారు అతనియొద్ద కాపురముండిరి.౹

5 మరియు ప్రవక్తయగు గాదు వచ్చి–కొండలలో ఉండక యూదాదేశమునకు పారి పొమ్మని దావీదుతో చెప్పినందున దావీదు పోయి హారెతు అడవిలో చొచ్చెను.

6 దావీదును అతని జనులును ఫలానిచోట ఉన్నారని సౌలునకు వర్తమానమాయెను. అప్పుడు సౌలు గిబియా దగ్గర రామాలో ఒక పిచులవృక్షముక్రింద దిగి యీటె చేతపట్టుకొని యుండెను. అతని సేవకులు అతనిచుట్టు నిలిచియుండగా

7 సౌలు తనచుట్టు నిలిచియున్న సేవకులతో ఇట్లనెను – బెన్యామీనీయులారా ఆలకించుడి. యెష్షయి కుమారుడు మీకు పొలమును ద్రాక్షతోటలను ఇచ్చునా? మిమ్మును సహస్రాధిపతులుగాను శతాధిపతులుగాను చేయునా?

8 మీరెందుకు నామీద కుట్రచేయుచున్నారు? నా కుమారుడు యెష్షయి కుమారునితో నిబంధనచేసిన సంగతి మీలో ఎవడును నాకు తెలియ జేయలేదే. నేడు జరుగునట్లు నా కొరకు పొంచి యుండునట్లుగా నా కుమారుడు నా సేవకుని పురికొలిపి నను నా నిమిత్తము మీలో ఎవనికిని చింతలేదే.౹

9 అప్పుడు ఎదోమీయుడగు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచి యుండి–యెష్షయి కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలెకు దగ్గరకురాగా నేను చూచితిని.౹

10 అహీమెలెకు అతని పక్షముగా యెహోవాయొద్ద విచారణచేసి, ఆహారమును ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గమును అతని కిచ్చెనని చెప్పగా

11 రాజు యాజకుడును అహీటూబు కుమారుడునగు అహీమెలెకును నోబులోనున్న అతని తండ్రి యింటివారైన యాజకులనందరిని పిలువనంపించెను. వారు రాజునొద్దకు రాగా

12 సౌలు–అహీటూబు కుమారుడా, ఆలకించుమనగా అతడు–చిత్తము నా యేలినవాడా అనెను.౹

13 సౌలు–నీవు యెష్షయి కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవునియొద్ద విచారణచేసి, అతడు నామీదికి లేచి నేడు జరుగుచున్నట్టు పొంచి యుండుటకై అతడును నీవును జతకూడితిరేమని యడుగగా

14 అహీమెలెకు–రాజా, రాజునకు అల్లుడై నమ్మకస్థుడై, ఆలోచనకర్తయై నీ నగరిలో ఘనతవహించిన దావీదువంటివాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు?

15 అతని పక్షముగా నేను దేవునియొద్ద విచారణచేయుట నేడే ఆరంభించితినా? అది నాకు దూరమగునుగాక; రాజు తమ దాసుడనైన నామీదను నా తండ్రి ఇంటి వారందరిమీదను ఈ నేరము మోపకుండును గాక. ఈ సంగతినిగూర్చి కొద్ది గొప్ప యేమియు నీ దాసుడనైన నాకు తెలిసినది కాదు అని రాజుతో మనవిచేయగా

16 రాజు–అహీమెలెకూ, నీకును నీ తండ్రి ఇంటివారికందరికిని మరణము నిశ్చయము అని చెప్పి

17 యెహోవా యాజకులగు వీరు దావీదుతో కలిసినందునను, అతడు పారిపోయిన సంగతి తెలిసియు నాకు తెలియజేయక పోయినందునను మీరు వారిమీదపడి చంపుడని తనచుట్టు నిలిచియున్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చెను. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయనొల్లక యుండగా

18 రాజు దోయేగుతో–నీవు ఈ యాజకులమీద పడుమని చెప్పెను. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు యాజకులమీదపడి ఏఫోదు ధరించుకొనినయెనుబది యయిదుగురిని ఆ దినమున హతముచేసెను.౹

19 మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్థులను కత్తివాత హతము చేసెను; మగ వారినేమి ఆడువారినేమి బాలురనేమి పసిపిల్లలనేమి యెడ్లనేమి గార్దభములనేమి గొఱ్ఱెలనేమి అన్నిటిని కత్తివాత హతముచేసెను.౹

20 అయితే అహీటూబు కుమారుడైన అహీమెలెకు కుమారులలో అబ్యాతారు అను నొకడు తప్పించుకొని పారిపోయి దావీదునొద్దకు వచ్చి

21 సౌలు యెహోవా యాజకులను చంపించిన సంగతి దావీదునకు తెలియజేయగా

22 దావీదు–ఆ దినమున ఎదోమీయుడైన దోయేగు అక్కడనున్నందునవాడు సౌలునకు నిశ్చయముగా సంగతి తెలుపునని నేననుకొంటిని; నీ తండ్రి యింటివారికందరికిని మరణము రప్పించుటకు నేను కారకుడ నైతిని గదా.౹

23 నీవు భయపడక నాయొద్ద ఉండుము, నా యొద్ద నీవు భద్రముగా ఉందువు; నా ప్రాణము తీయ చూచువాడును నీ ప్రాణము తీయచూచువాడును ఒకడే అని అబ్యాతారుతో చెప్పెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1SA/22-4112c9246c9bd5b54e4803c55ffda1bf.mp3?version_id=1787—

Categories
1 సమూయేలు

1 సమూయేలు 23

1 తరువాత ఫిలిష్తీయులు కెయీలామీద యుద్ధము చేసి కళ్లములమీది ధాన్యమును దోచుకొనుచున్నారని దావీదునకు వినబడెను.౹

2 అంతట దావీదు–నేను వెళ్లి యీ ఫిలిష్తీయులను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణచేయగా యెహోవా–నీవు వెళ్లి ఫిలిష్తీయులను హతముచేసి కెయీలాను రక్షించుమని దావీదునకు సెలవిచ్చెను.౹

3 దావీదుతోకూడియున్న జనులు– మేము ఇచ్చట యూదా దేశములో ఉండినను మాకు భయముగా నున్నది; ఫిలిష్తీయుల సైన్యములకెదురుగా కెయీలాకు మేము వచ్చినయెడల మరింత భయము కలుగును గదా అని దావీదుతో అనగా

4 దావీదు మరల యెహోవాయొద్ద విచారణ చేసెను–నీవు లేచి కెయీలాకు వెళ్లుము, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవియ్యగా

5 దావీదును అతని జనులును కెయీలాకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధముచేసి వారిని లెస్సగా హతముచేసి వారి పశువులను దోచుకొనివచ్చిరి. ఈలాగున దావీదు కెయీలా కాపురస్థులను రక్షించెను.

6 అహీమెలెకు కుమారుడైన అబ్యాతారు ఏఫోదు చేతపట్టుకొని పారిపోయి కెయీలాలోనున్న దావీదునొద్దకు వచ్చెను.౹

7 దావీదు కెయీలాకు వచ్చిన సంగతి సౌలు విని –దావీదు ద్వారములును అడ్డుగడలునుగల పట్టణములో ప్రవేశించి అందులో మూయబడి యున్నాడు, దేవుడతనిని నా చేతికి అప్పగించె ననుకొనెను.౹

8 కాబట్టి సౌలు కెయీలాకు పోయి దావీదును అతని జనులను ముట్టడింపవలెనని జనులందరిని యుద్ధమునకు పిలువనంపించెను.౹

9 సౌలు తనకు కీడే యుద్దేశించుచున్నాడని దావీదు ఎరిగి యాజకుడైన అబ్యాతారును ఏఫోదును తెమ్మనెను.౹

10 అప్పుడు దావీదు–ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, సౌలు కెయీలాకు వచ్చి నన్నుబట్టి పట్టణమును పాడు చేయనుద్దేశించుచున్నాడని నీ దాసుడనైన నాకు రూఢిగా తెలియబడి యున్నది.౹

11 కెయీలా జనులు నన్ను అతనిచేతికి అప్పగించుదురా? నీ దాసుడనైన నాకు వినబడినట్లు సౌలు దిగివచ్చునా? ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, దయచేసి నీ దాసుడనైన నాకు దానిని తెలియజేయుమని ప్రార్థింపగా–అతడు దిగివచ్చునని యెహోవా సెలవిచ్చెను.౹

12 –కెయీలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరల మనవిచేయగా యెహోవా–వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చెను.౹

13 అంతట దావీదును దాదాపు ఆరువందలమందియైన అతని జనులును లేచి కెయీలాలోనుండి తరలి, ఎక్కడికి పోగలరో అక్కడకు వెళ్లిరి. దావీదు కెయీలాలోనుండి తప్పించుకొనిన సంగతి సౌలు విని వెళ్లక మానెను.

14 అయితే దావీదు అరణ్యములోని కొండస్థలములయందును, జీఫు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను; సౌలు అనుదినము అతని వెదకినను దేవుడు సౌలుచేతికి అతని నప్పగించలేదు.౹

15 తన ప్రాణము తీయుటకై సౌలు బయలుదేరెనని తెలిసికొని దావీదు జీఫు అరణ్యములో ఒక వనమున దిగెను.౹

16 అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి, వనము లోనున్న దావీదునొద్దకు వచ్చి–నా తండ్రియైన సౌలు నిన్ను పట్టుకొనజాలడు, నీవు భయపడవద్దు,౹

17 నీవు ఇశ్రాయేలీయులకు రాజవగుదువు, నేను నీకు సహకారినౌదును, ఇది నా తండ్రియైన సౌలునకు తెలిసియున్నదని అతనితో చెప్పి దేవునిబట్టి అతని బలపరచెను.౹

18 వీరిద్దరు యెహోవా సన్నిధిని నిబంధన చేసికొనిన తరువాత దావీదు వనములో నిలిచెను, యోనాతాను తన యింటికి తిరిగి వెళ్లెను.౹

19 జీఫీయులు బయలుదేరి గిబియాలోనున్న సౌలునొద్దకు వచ్చి–యెషీమోనుకు దక్షిణమున నున్న హకీలామన్యము లోని అరణ్యమున కొండ స్థలములయందు మా మధ్య దావీదు దాగియున్నాడే.౹

20 రాజా, నీ మనోభీష్టమంతటి చొప్పున దిగిరమ్ము; రాజవైన నీ చేతికి అతనిని అప్పగించుట మా పని అని చెప్పగా

21 సౌలు వారితో ఇట్లనెను–మీరు నాయందు కనికరపడినందుకై మీకు యెహోవా ఆశీర్వా దము కలుగును గాక.౹

22 మీరు పోయి అతడుఉండు స్థలము ఏదయినది, అతనిని చూచినవాడు ఎవడయినది నిశ్చయముగా తెలిసికొనుడి; అతడు బహు యుక్తిగా ప్రవర్తించుచున్నాడని నాకు వినబడెను గనుక

23 మీరు బహు జాగ్రత్తగా నుండి, అతడుండు మరుగు తావులను కని పెట్టియున్న సంగతి యంత నాకు తెలియజేయుటకై మరల నాయొద్దకు తప్పక రండి, అప్పుడు నేను మీతోకూడా వత్తును, అతడు దేశములో ఎక్కడనుండినను యూదావారందరిలో నేను అతని వెదకి పట్టుకొందును.౹

24 అంతట వారు లేచి సౌలుకంటె ముందు జీఫునకు తిరిగి వెళ్లిరి. దావీదును అతని జనులును యెషీమోనుకు దక్షి ణపు వైపుననున్న మైదానములోని మాయోను అరణ్యములో ఉండగా

25 సౌలును అతని జనులును తన్ను వెద కుటకై బయలుదేరిన మాట దావీదు విని, కొండ శిఖరము దిగి మాయోను అరణ్యమందు నివాసము చేసెను. సౌలు అది విని మాయోను అరణ్యములో దావీదును తరుమ బోయెను.౹

26 అయితే సౌలు పర్వతము ఈతట్టునను దావీదును అతని జనులును పర్వతము ఆతట్టునను పోవుచుండగా దావీదు సౌలుదగ్గరనుండి తప్పించుకొని పోవలెనని త్వరపడుచుండెను. సౌలును అతని జనులును దావీదును అతని జనులను పట్టుకొనవలెనని వారిని చుట్టుకొనుచుండిరి.౹

27 ఇట్లుండగా దూత యొకడు సౌలునొద్దకు వచ్చి–నీవు త్వరగా రమ్ము, ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి దేశములో చొరబడియున్నారని చెప్పగా

28 సౌలు దావీదును తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిష్తీయులను ఎదుర్కొనబోయెను. కాబట్టి సెలహమ్మలెకోతుఅని ఆ స్థలమునకు పేరు పెట్టబడెను.౹

29 తరువాత దావీదు అక్కడనుండి పోయి ఏన్గెదీకి వచ్చి కొండ స్థలములలో నివాసము చేయుచుండెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1SA/23-d44313943b1b3236e7c5803a32ee539e.mp3?version_id=1787—

Categories
1 సమూయేలు

1 సమూయేలు 24

1 సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగిరాగా దావీదు ఏన్గెదీ అరణ్యమందున్నాడని అతనికి వర్తమానము వచ్చెను.౹

2 అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులందరిలోనుండి మూడు వేలమందిని ఏర్పరచుకొని వచ్చి, కొండమేకలకు వాసములగు శిలాపర్వతములమీద దావీదును అతని జనులను వెదకుటకై బయలుదేరెను.౹

3 మార్గముననున్న గొఱ్ఱె దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ యొకటి కనబడెను. అందులో సౌలు శంకానివర్తికి పోగా దావీదును అతని జనులును ఆ గుహ లోపలిభాగములలో ఉండిరి గనుక

4 దావీదు జనులు–అదిగో–నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చెనని అతనితో అనగా; దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండ అతని పైవస్త్రపు చెంగును కోసెను.౹

5 సౌలు పైవస్త్రమును తాను కోసెనని దావీదు మనస్సు నొచ్చి

6 –ఇతడు యెహోవాచేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవాచేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవానుబట్టి అతని నేను చంపను అని తన జనులతో చెప్పెను.౹

7 ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదికి పోనియ్యక వారిని ఆపెను. తరువాత సౌలు లేచి గుహలోనుండి బయలువెళ్లి మార్గమున పోయెను.౹

8 అప్పుడు దావీదు లేచి గుహలోనుండి బయలువెళ్లి–నా యేలినవాడా రాజా, అని సౌలు వెనుకనుండి కేక వేయగా సౌలు వెనుక చూచెను. దావీదు నేల సాష్టాంగపడి నమస్కారము చేసి

9 సౌలుతో ఇట్లనెను–దావీదు నీకు కీడుచేయనుద్దే శించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు?

10 ఆలోచించుము; ఈ దినమున యెహోవా నిన్ను ఏలాగు గుహలో నాచేతికి అప్పగించెనో అది నీ కండ్లార చూచితివే; కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను నేను నీయందు కనికరించి–ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక నా యేలినవాని చంపనని నేను చెప్పితిని.౹

11 నా తండ్రీ చూడుము, ఇదిగో, చూడుము. నిన్ను చంపక నీ వస్త్రపుచెంగు మాత్రమే కోసితిని గనుక నావలన నీకు కీడు ఎంతమాత్రమును రాదనియు, నాలో తప్పిదము ఎంతమాత్రమును లేదనియు, నీవు తెలిసికొనవచ్చును. నీ విషయమై నేను ఏపాపమును చేయనివాడనై యుండగా నీవు నా ప్రాణము తీయవలెనని నన్ను తరుముచున్నావు.౹

12 నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. యెహోవా నా విషయమై పగతీర్చునుగాని నేను నిన్ను చంపను.౹

13 పూర్వికులు సామ్యము చెప్పినట్టు దుష్టుల చేతనే దౌష్ట్యము పుట్టునుగాని నేను నిన్ను చంపను.౹

14 ఇశ్రాయేలీయుల రాజు ఎవని పట్టుకొన బయలుదేరి వచ్చియున్నాడు? ఏపాటివానిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కను గదా? మిన్నల్లిని గదా?

15 యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతియై తీర్పు తీర్చునుగాక; ఆయనే సంగతి విచారించి నా పక్షమున వ్యాజ్యెమాడి నీ వశము కాకుండ నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక.౹

16 దావీదు ఈ మాటలు సౌలుతో మాటలాడి చాలింపగా సౌలు–దావీదా నాయనా, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి

17-18 దావీదుతో ఇట్లనెను – యెహోవా నన్ను నీచేతి కప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారముచేసిన వాడవై, నా యెడల నీకున్న ఉపకారబుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటె నీతిపరుడవు.౹

19 ఒకనికి తన శత్రువు దొరికినయెడల మేలుచేసి పంపివేయునా? ఈ దినమున నీవు నాకు చేసినదానినిబట్టి యెహోవా ప్రతిగా నీకు మేలుచేయునుగాక.౹

20 నిశ్చయముగా నీవు రాజ వగుదువనియు, ఇశ్రాయేలీయుల రాజ్యము నీకు స్థిరపరచబడుననియు నాకు తెలియును.౹

21 కాబట్టి నా తరువాత నా సంతతివారిని నీవు నిర్మూలము చేయకుండునట్లును, నా తండ్రి ఇంటిలోనుండి నా పేరు నీవు కొట్టివేయకుండునట్లును యెహోవా నామమున నాకు ప్రమాణము చేయుము. అంతట దావీదు సౌలునకు ప్రమాణము చేసెను

22 అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చెను; అయితే దావీదును అతని జనులును తమ కొండస్థలములకు వెళ్లి పోయిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1SA/24-e6d53820f7387951b7e40e34fe9d3f2f.mp3?version_id=1787—