Categories
1 సమూయేలు

1 సమూయేలు 5

1 ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనె జరునుండి అష్డోదునకు తీసికొనివచ్చి

2 దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచిరి.౹

3 అయితే మరునాడు అష్డోదువారు ప్రాతఃకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడియుండెను కనుక వారు దాగోనును లేవనెత్తి వానిస్థానమందు మరల ఉంచిరి.౹

4 ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడి యుండెను. దాగోనుయొక్క తలయు రెండు అరచేతులును తెగవేయబడి గడపదగ్గర పడియుండెను, వాని మొండెము మాత్రము వానికి మిగిలియుండెను.౹

5 కాబట్టి దాగోను యాజకులేమి దాగోను గుడికి వచ్చు వారేమి నేటివరకు ఎవరును అష్డోదులో దాగోనుయొక్క గుడి గడపను త్రొక్కుటలేదు.

6 యెహోవా హస్తము అష్డోదువారిమీద భారముగా ఉండెను. అష్డోదువారిని దాని సరిహద్దులలో నున్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతముచేయగా

7 అష్డోదువారు సంభవించినదాని చూచి–ఇశ్రాయేలీయుల దేవుని హస్తము మనమీదను మన దేవతయగు దాగోనుమీదను బహుభారముగా నున్నదే; ఆయన మందసము మనమధ్యనుండుటయే దీనికి కారణముగదా; అది యిక మన మధ్యనుండకూడదని చెప్పుకొని

8 ఫిలిష్తీయుల సర్దారులందరిని పిలువనంపించి–ఇశ్రాయేలీయుల దేవుని మందసమును మనము ఏమి చేయుదుమని అడిగిరి. అందుకు వారు–ఇశ్రాయేలీయుల దేవుని మందసమును ఇక్కడనుండి గాతు పట్టణమునకు పంపుడని చెప్పగా, జనులు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును అక్కడనుండి గాతునకు మోసికొనిపోయిరి.౹

9 అయితే వారు అష్డోదునుండి గాతునకు దానిని మోసికొనిపోయిన తరువాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకును రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి, గొప్ప నాశనము జేసెను.౹

10 వారు దేవుని మందసమును ఎక్రోనునకు పంపివేయగా దేవుని మందసము ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి–మనలను మన జనులను చంపివేయవలెనని వీరు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును మన యొద్దకు తీసికొని వచ్చిరనిరి.౹

11 కాగా జనులు ఫిలిష్తీయుల సర్దారులనందరి పిలువనంపించి –ఇశ్రాయేలీయుల దేవుని మందసము మనలను మన జనులను చంపకుండునట్లు స్వస్థానమునకు దానిని పంపించుడనిరి. దేవుని హస్తము అక్కడ బహు భారముగా ఉండెను గనుక మరణభయము ఆ పట్టణస్థులందరిని పెట్టి యుండెను.౹

12 చావక మిగిలియున్నవారు గడ్డల రోగముచేత మొత్తబడిరి. ఆ పట్టణస్థుల కేకలు ఆకాశమువరకు వినబడెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1SA/5-5264dbe5ecf68db63e8473f7c64d9aa7.mp3?version_id=1787—

Categories
1 సమూయేలు

1 సమూయేలు 6

1 యెహోవా మందసము ఏడు నెలలు ఫిలిష్తీయుల దేశమందుండిన తరువాత

2 ఫిలిష్తీయుల యాజకులను శకునము చూచువారిని పిలువనంపించి–యెహోవా మందసమును ఏమి చేయుదుము? ఏమి చేసి స్వస్థలమునకు దానిని పంపుదుమో తెలియజెప్పుడనగా

3 వారు–ఇశ్రాయేలీయుల దేవుని మందసమును పంపివేయ నుద్దేశించినయెడల ఊరకయే పంపక, యే విధముచేతనైనను ఆయనకు అపరాధార్థమైన అర్పణము చెల్లించి పంపవలెను. అప్పుడు మీరు స్వస్థతనొంది ఆయన హస్తము మీ మీదనుండి యెందుకు తియ్యబడక యుండెనో మీరు తెలిసికొందు రనిరి.౹

4 ఫిలిష్తీయులు–మనము ఆయనకు చెల్లింపవలసిన అపరాధార్థమైన అర్పణమేదని వారినడుగగా వారు– మీ అందరిమీదను మీ సర్దారులందరి మీదను ఉన్న తెగులు ఒక్కటే గనుక, ఫిలిష్తీయుల సర్దారుల లెక్క చొప్పున అయిదు బంగారపు గడ్డల రూపములను, అయిదు బంగారపు పందికొక్కులను చెల్లింపవలెను.౹

5 కాబట్టి మీకు కలిగిన గడ్డలుగాను భూమిని పాడుచేయు పంది కొక్కులుగాను నిరూపించబడిన గడ్డలను చుంచులను చేసి పంపించి ఇశ్రాయేలీయుల దేవునికి మహిమను చెల్లింపవలెను. అప్పుడు మీ మీదను మీ దేవతలమీదను మీ భూమిమీదను భారముగా నున్న తన హస్తమును ఆయన తీసివేయును కాబోలు.౹

6 ఐగుప్తీయులును ఫరోయును తమ హృదయములను కఠినపరచుకొనినట్లు మీ హృదయములను మీరెందుకు కఠినపరచుకొందురు? ఆయన వారిలో అద్భుతకార్యములనుచేయగా వారు ఈ జనులను పోనిచ్చిరి; ఇశ్రాయేలీయులు వెళ్లిపోయిరి గదా.౹

7 కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి, కాడి మోయని పాడి ఆవులను రెంటిని తోలితెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గరనుండి యింటికి తోలి

8 యెహోవా మందసమును ఆ బండిమీద ఎత్తి, అపరా ధార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని ప్రక్కనే చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోవునట్లుగా విడిచిపెట్టుడి.౹

9 అది బేత్షెమెషుకు పోవు మార్గమున బడి యీ దేశపు సరిహద్దు దాటినయెడల ఆయనే యీ గొప్పకీడు మనకు చేసెనని తెలిసి కొనవచ్చును; ఆ మార్గమున పోనియెడల ఆయన మనలను మొత్తలేదనియు, మన అదృష్టవశముచేతనే అది మనకు సంభవించెననియు తెలిసికొందు మనిరి.౹

10 వారు ఆలాగున రెండు పాడి ఆవులను తోలితెచ్చి బండికి కట్టి వాటి దూడలను ఇంటిలోపల పెట్టి

11 యెహోవా మందసమును బంగారు గడ్డలును పందికొక్కు రూపములునుగల ఆ చిన్న పెట్టెను బండిమీద ఎత్తగా

12 ఆ ఆవులు రాజ మార్గమునబడి చక్కగా పోవుచు అరచుచు, బేత్షెమెషు మార్గమున నడిచెను. ఫిలిష్తీయుల సర్దారులు వాటి వెంబడియే బేత్షెమెషు సరిహద్దువరకు పోయిరి.౹

13 బేత్షెమెషు వారు లోయలో తమ గోధుమచేలను కోయుచుండిరి; వారు కన్నులెత్తి చూడగా మందసము వారికి కనబడెను, దానిని చూచి వారు సంతోషించిరి.౹

14 ఆ బండి బేత్షెమెషు వాడైన యెహోషువయొక్క పొలములోనికి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతిదగ్గర నిలువగా, వారు బండియొక్క కఱ్ఱలను చీల్చి ఆవులను యెహోవాకు దహనబలిగా అర్పించిరి.౹

15 లేవీయులు యెహోవా మందసమును బంగారపు వస్తువులుగల ఆ చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతిమీద ఉంచగా, ఆ దినమున బేత్షెమెషువారు యెహోవాకు దహనబలులను అర్పించి బలులను వధించిరి.౹

16 ఫిలిష్తీయుల సర్దారులు అయిదుగురు అంతవరకు చూచి నాడే ఎక్రోనునకు తిరిగి వెళ్లిరి.

17 అపరాధార్థమైన అర్పణగా ఫిలిష్తీయులు చెల్లించిన బంగారపు గడ్డలు ఏవనగా, అష్డోదువారి నిమిత్తము ఒకటి, గాజావారి నిమిత్తము ఒకటి, అష్కెలోను వారి నిమిత్తము ఒకటి, గాతువారి నిమిత్తము ఒకటి, ఎక్రోనువారి నిమిత్తము ఒకటి.౹

18 ప్రాకారముగల పట్టణములవారేమి పొలములోని గ్రామములవారేమి ఫిలిష్తీయుల అయిదు గురు సర్దారుల పట్టణములన్నిటి లెక్క చొప్పున బంగారపు పందికొక్కులను అర్పించిరి. వారు యెహోవా మందసమును దింపిన పెద్దరాయి దీనికి సాక్ష్యము. నేటివరకు ఆ రాయి బేత్షెమెషు వాడైన యెహోషువయొక్క పొలములోనున్నది.౹

19 బేత్షెమెషువారు యెహోవా మందసమును తెరచి చూడగా దేవుడు వారిని హతముచేసి ఆ జనులలో ఏబదివేల డెబ్బదిమందిని మొత్తెను. యెహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తగా జనులు దుఃఖా క్రాంతులైరి.౹

20 అప్పుడు బేత్షెమెషువారు పరిశుద్ధదేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలువగలరు? మనయొద్దనుండి ఆయన ఎవరియొద్దకు పోవలెనని చెప్పి

21 కిర్యత్యారీము కాపురస్థులకు దూతలను పంపి–ఫిలిష్తీయులు యెహోవా మందసమును మరల తీసికొని వచ్చిరి; మీరు వచ్చి మీ దాపునకు దానిని తీసికొని పోవలెనని వర్తమానము పంపిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1SA/6-24e3bf4313090f624cf900e6737a278f.mp3?version_id=1787—

Categories
1 సమూయేలు

1 సమూయేలు 7

1 అంతట కిర్యత్యారీమువారు వచ్చి యెహోవా మందసమును తీసికొనిపోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి.

2 మందసము కిర్యత్యారీములోనుండిన కాలము ఇరువై సంవత్సరములాయెను. ఇశ్రాయేలీయులందరు యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా

3 సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను–మీ పూర్ణహృదయముతో యెహోవాయొద్దకు మీరు మళ్లుకొనినయెడల, అన్యదేవతలను అష్తారోతు దేవతలను మీ మధ్యనుండి తీసి వేసి, పట్టుదలగలిగి యెహోవాతట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలోనుండి మిమ్మును విడిపించును.౹

4 అంతట ఇశ్రాయేలీయులు బయలుదేవతలను అష్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి.

5 అంతట సమూయేలు – ఇశ్రాయేలీయులందరిని మిస్పాకు పిలువనంపుడి; నేను మీపక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా

6 వారు మిస్పాలో కూడుకొని నీళ్లుచేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి–యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచువచ్చెను.౹

7 ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడియున్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలుమీదికి వచ్చిరి. ఈ సంగతి ఇశ్రాయేలీయులు విని ఫిలిష్తీయులకు భయపడి

8 –మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలోనుండి మనలను రక్షించునట్లుగా మాకొరకు ఆయనను ప్రార్థనచేయుట మానవద్దని సమూయేలునొద్ద మనవి చేసిరి

9 సమూయేలు పాలు విడువని ఒక గొఱ్ఱెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి, ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థనచేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను.౹

10 సమూయేలు దహనబలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయులమీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయులమీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారుచేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి.౹

11 ఇశ్రాయేలీయులు మిస్పాలోనుండి బయలుదేరి బేత్కారువరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి.౹

12 అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి–యింతవరకు యెహోవా మనకు సహాయము చేసెనని చెప్పి దానికి ఎబెనెజరుఅను పేరు పెట్టెను.౹

13 ఈలాగున ఫిలిష్తీయులు అణపబడినవారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను.౹

14 మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల యొద్దనుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలీయులకు తిరిగి వచ్చెను. ఎక్రోనునుండి గాతు వరకున్న గ్రామములను వాటి పొలములను ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలోనుండి విడిపించిరి. మరియు ఇశ్రాయేలీయులకును అమోరీయులకును సమాధానము కలిగెను.౹

15 సమూయేలు తాను బ్రదికిన దినములన్నియు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను.౹

16 ఏటేట అతడు బేతేలునకును గిల్గాలునకును మిస్పాకును తిరుగుచు ఆ స్థలములయందు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచు వచ్చెను.౹

17 మరియు అతని యిల్లు రామాలోనుండినందున అచ్చటికి తిరిగివచ్చి అచ్చటకూడను న్యాయము తీర్చుచుండెను, మరియు అతడు అక్కడ యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1SA/7-4e8924809ff8a8bcf22f64268292df20.mp3?version_id=1787—

Categories
1 సమూయేలు

1 సమూయేలు 8

1 సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయులమీద న్యాయాధిపతులుగా నియమించెను.౹

2 అతని జ్యేష్ఠకుమారుని పేరు యోవేలు; రెండవవాని పేరు అబీయా,౹

3 వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక, ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా

4 ఇశ్రాయేలీయుల పెద్దలందరు కూడి రామాలో సమూయేలునొద్దకు వచ్చి

5 –చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తనవంటి ప్రవర్తన గలవారు కారు గనుక, సకలజనుల మర్యాదచొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి.౹

6 –మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థనచేసెను.౹

7 అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా–జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము; వారు నిన్ను విసర్జింపలేదుగాని తమ్మును ఏలకుండ నన్నే విసర్జించియున్నారు.౹

8 వారు నన్ను విసర్జించి, యితర దేవతలను పూజించి, నేను ఐగుప్తులోనుండి వారిని రప్పించిన నాటి నుండి నేటివరకు తాము చేయుచువచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీయెడలను జరిగించుచున్నారు; వారు చెప్పిన మాటలను అంగీకరించుము.౹

9 అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయుము.

10 సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్ని వినిపించి

11 ఈలాగున చెప్పెను–మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడగుననగా, అతడు మీ కుమారులను పట్టుకొని, తన రథములను తోలుటకును తన గుఱ్ఱములను కాపాడుటకును వారిని ఉంచుకొనును, కొందరు అతని రథముల ముందర పరుగెత్తుదురు.౹

12 మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును; తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధా యుధములను తన రథముల సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకొనును.౹

13 మీ కుమార్తెలను భక్ష్యకా రిణులుగాను బోనకత్తెలుగాను రొట్టెలు కాల్చువారినిగాను పెట్టుకొనును.౹

14 మీ పొలములలోను మీ ద్రాక్ష తోటలలోను ఒలీవతోటలలోను శ్రేష్ఠమైనవాటిని తీసికొని తన సేవకులకిచ్చును.౹

15 మీ ధాన్యములోను ద్రాక్ష పండ్లలోను పదియవభాగము తీసి తన పరివారజనమునకును సేవకులకును ఇచ్చును.౹

16 మీ దాసులను మీ పని కత్తెలను మీ పశువులలోను గార్దభములలోను శ్రేష్ఠమైన వాటినిపట్టుకొని తన పనికొరకు ఉంచుకొనును.౹

17 మీ మందలో పదియవభాగము పట్టుకొనును, మీమట్టుకు మీరు అతనికి దాసులవుదురు.౹

18 ఆ దినమున మీరు కోరు కొనిన రాజునుబట్టి మీరు మొఱ్ఱపెట్టినను యెహోవా మీ మొఱ్ఱవినక పోవును అనెను.౹

19 అయినను జనులు సమూయేలుయొక్క మాట చెవిని బెట్టనొల్లక–ఆలాగున కాదు,౹

20 జనములు చేయురీతిని మేమును చేయునట్లు మాకు రాజుకావలెను, మా రాజు మాకు న్యాయము తీర్చును, మా ముందర పోవుచు అతడే మా యుద్ధములను జరిగించుననిరి.౹

21 సమూయేలు జనులయొక్క మాట లన్నిటిని విని యెహోవా సన్నిధిని వాటిని వివరించెను

22 గనుక యెహోవా–నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించుమని సమూయేలునకు సెలవియ్యగా సమూయేలు–మీరందరు మీ మీ గ్రామములకు పొండని ఇశ్రాయేలీయులకు సెలవిచ్చెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1SA/8-372cbbfb17ae115273a545dadeeb2dd4.mp3?version_id=1787—

Categories
1 సమూయేలు

1 సమూయేలు 9

1 అఫియకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరుకు జననమైన అబీయేలు కుమారుడగు కీషు అను బెన్యామీనీయుడొకడుండెను. కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనీయుడు.౹

2 అతనికి సౌలు అను నొక కుమారు డుండెను. అతడు బహు సౌందర్యముగల యౌవనుడు, ఇశ్రాయేలీయులలో అతనిపాటి సుందరుడొకడునులేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరులకంటె ఎత్తు గలవాడు.౹

3 సౌలు తండ్రియైన కీషుయొక్క గార్దభములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి–మన దాసులలో ఒకని తీసికొనిపోయి గార్దభములను వెదకుమని చెప్పెను.౹

4 అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షాలిషాదేశమున సంచరింపగా అవి కనబడలేదు. తరువాత వారు షయలీము దేశమును దాటి సంచారము చేసిరిగాని అవి కనబడకయుండెను. బెన్యామీనీయుల దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు.౹

5 అయితే వారు సూపు దేశమునకు వచ్చి నప్పుడు–మనము తిరిగి వెళ్లుదము రమ్ము, గార్దభముల కొరకు చింతింపక, నా తండ్రి మనకొరకు విచారపడు నేమోయని సౌలు తనయొద్దనున్న పనివానితో అనగా

6 వాడు–ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒక డున్నాడు, అతడు బహుఘనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. మనము వెళ్లవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయునేమో అతని యొద్దకు వెళ్లుదము రండని చెప్పెను.౹

7 అందుకు సౌలు –మనము వెళ్లునెడల ఆ మనిషికి ఏమి తీసికొనిపోవు దుము? మన సామగ్రిలోనుండు భోజనపదార్థములు సరిపోయినవి; ఆ దైవజనునికి బహుమానము తీసికొనిపోవుటకు మన కేమియు లేదు అని తన పనివానితో చెప్పి– మనయొద్ద ఏమి యున్నదని అడుగగా

8 వాడు సౌలుతో –చిత్తగించుము, నా యొద్ద పావు తులము వెండి కలదు. మనకు మార్గము తెలియజెప్పినందుకై దానిని ఆ దైవజనుని కిత్తుననెను.౹

9 ఇప్పుడు ప్రవక్తయను పేరు నొందువాడు పూర్వము దీర్ఘదర్శి యనిపించుకొనెను. పూర్వము ఇశ్రాయేలీయులలో దేవునియొద్ద విచారణచేయుటకై ఒకడు బయలుదేరినయెడల–మనము దీర్ఘదర్శకుని యొద్దకు పోవుదము రండని జనులు చెప్పుకొనుట వాడుక.౹

10 సౌలు–నీ మాట మంచిది, వెళ్లుదము రమ్మనగా

11 వారు దైవజనుడుండు ఊరికి పోయిరి. ఊరికి ఎక్కిపోవుచుండగా నీళ్లుచేదుకొనుటకై వచ్చిన కన్యకలు తమకు కనబడినప్పుడు–ఇక్కడ దీర్ఘ దర్శియున్నాడా అని అడిగిరి.౹

12 అందుకు వారు–ఇదిగో అతడు మీ యెదుటనే యున్నాడు, త్వరగా పోయి కలిసికొనుడి; యీ దినముననే అతడు ఈ ఊరికి వచ్చెను. నేడు ఉన్నతస్థలమందు జనులకు బలి జరుగును గనుక

13 ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే, అతడు భోజనము చేయుటకు ఉన్నతమైన స్థలమునకు వెళ్లకమునుపే మీరు అతని కనుగొందురు; అతడు రాకమునుపు జనులు భోజనము చేయరు; అతడు బలిని ఆశీర్వదించిన తరువాత పిలువ బడినవారు భోజనము చేయుదురు, మీరు ఎక్కిపొండి; అతని చూచుటకు ఇదే సమయమని చెప్పిరి.౹

14 వారు ఊరిలోనికి రాగా ఉన్నతమైన స్థలమునకు పోవుచున్న సమూయేలు వారికి ఎదురుపడెను.

15 సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలునకు తెలియజేసెను.౹

16 ఎట్లనగా–నా జనుల మొఱ్ఱ నాయొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించియున్నాను; కాగా ఫిలిష్తీయుల చేతిలోనుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలీయులమీద వానిని అధికారినిగా అభిషేకించుటకుగాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశములోనుండి ఒక మనుష్యుని నీయొద్దకు రప్పించుదును.౹

17 సౌలు సమూయేలునకు కనబడగానే యెహోవా–ఇతడే నేను నీతో చెప్పిన మనిషి ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చెను.౹

18 సౌలు గవినియందు సమూయేలును కలిసికొని–దీర్ఘదర్శి యిల్లు ఏది? దయచేసి నాతో చెప్పుమని అడుగగా

19 సమూయేలు సౌలుతో–నేనే దీర్ఘదర్శిని, ఉన్నతమైన స్థలమునకు నాకుముందు వెళ్లుడి, నేడు మీరు నాతోకూడ భోజనము చేయవలెను, రేపు నీ మనస్సులో నున్నదంతయు నీకు తెలియజేసి నిన్ను వెళ్లనిచ్చెదను.౹

20 మూడుదినముల క్రిందట తప్పిపోయిన నీ గార్దభములనుగూర్చి విచారపడకుము, అవి దొరికినవి. ఇశ్రాయేలీయుల అభీష్టము ఎవరియందున్నది? నీయందును నీ తండ్రి యింటి వారియందును గదా అనెను.౹

21 అందుకు సౌలు–నేను బెన్యామీనీయుడను కానా? నా గోత్రము ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వల్పమైనదికాదా? నా యింటివారు బెన్యామీను గోత్రపు ఇంటివారందరిలో అల్పులు కారా? నాతో ఈలాగున ఎందుకు పలుకుచున్నావు? అనెను.౹

22 అయితే సమూయేలు సౌలును అతని పనివానిని భోజనపు సాలలోనికి తోడుకొనిపోయి, పిలువబడిన దాదాపు ముప్పదిమందిలో ప్రధానస్థలమందు వారిని కూర్చుండబెట్టి

23 పచనకర్తతో–నేను నీ దగ్గరనుంచుమని చెప్పి నీ చేతికి ఇచ్చిన భాగమును తీసికొని రమ్మనగా

24 పచనకర్త జబ్బను దాని మీద నున్నదానిని తీసికొనివచ్చి సౌలు ఎదుట ఉంచగా సమూయేలు సౌలుతో ఇట్లనెను–చూడుము, మనము కలిసికొను కాలమునకై దాచియుంచబడిన దానిని నీకు పెట్టియున్నాడు, జనులను పిలిచితినని నేను పచనకర్తతో చెప్పినప్పుడు ఇది నీకొరకుంచవలసినదని చెప్పితిని. ఆ దినమున సౌలు సమూయేలుతోకూడ భోజనముచేసెను,౹

25 పట్టణస్థులు ఉన్నతమైన స్థలముమీద నుండి దిగుచుండగా సమూయేలు సౌలుతో మిద్దెమీద మాటలాడు చుండెను.౹

26 మరునాడు తెల్లవారునప్పుడు సమూయేలు–మిద్దెమీదనున్న సౌలును పిలిచి నేను నిన్ను సాగనంపుటకై లెమ్ము అని చెప్పగా సౌలు లేచెను. తరువాత వారిద్దరు బయలుదేరి

27 ఊరి చివరకు వచ్చుచుండగా సమూయేలు సౌలుతో–మనకంటె ముందుగా వెళ్లుమని యీ పనివానితో చెప్పుము; దేవుడు సెలవిచ్చి నది నేను నీకు తెలియజెప్పువరకు నీవు ఇక్కడ నిలిచి యుండుమనెను; అంతట వాడు వెళ్లెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1SA/9-ab9687ab0cd109be63900d9d51a81a71.mp3?version_id=1787—

Categories
1 సమూయేలు

1 సమూయేలు 10

1 అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తలమీద తైలముపోసి అతని ముద్దు పెట్టుకొని– యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యముమీద అధిపతిగా నియమించియున్నాడు అని చెప్పి యీలాగు సెలవిచ్చెను

2 –ఈ దినమున నీవు నా యొద్దనుండి పోయిన తరువాత బెన్యామీను సరిహద్దులో సెల్సహులోనుండు రాహేలు సమాధిదగ్గర ఇద్దరు మనుష్యులు నీకు కనబడుదురు. వారు–నీవు వెదకబోయిన గార్దభములు దొరికినవి, నీ తండ్రి తన గార్దభములకొరకు చింతింపక నా కుమారుని కనుగొనుటకై నేనేమి చేతునని నీకొరకు విచారపడుచున్నాడని చెప్పుదురు.౹

3 తరువాత నీవు అక్కడనుండి వెళ్లి తాబోరు మైదానమునకు రాగానే అక్కడ బేతేలునకు దేవునియొద్దకు పోవు ముగ్గురు మనుష్యులు నీకు ఎదురుపడుదురు; ఒకడు మూడు మేకపిల్లలను, ఒకడు మూడు రొట్టెలను, ఇంకొకడు ద్రాక్షారసపు తిత్తిని మోయుచు వత్తురు.౹

4 వారు నిన్ను కుశలప్రశ్నలడిగి నీకు రెండు రొట్టెలు ఇత్తురు. అవి వారిచేత నీవు తీసి కొనవలెను.౹

5 ఈలాగున పోవుచు ఫిలిష్తీయుల దండు కాపువారుండు దేవుని కొండకు చేరుదువు, అచ్చట ఊరిదగ్గరకు నీవు రాగానే, స్వరమండలము తంబుర సన్నాయి సితారా వాయించువారి వెనుక ఉన్నతమైన స్థలమునుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును, వారు ప్రకటనచేయుచు వత్తురు;౹

6 యెహోవా ఆత్మ నీమీదికి బలముగా దిగివచ్చును; నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సువచ్చును.౹

7 దేవుడు నీకు తోడుగానుండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నీకు మంచిదని తోచినదాని చేయుము.౹

8 నాకంటె ముందు నీవు గిల్గాలునకు వెళ్లగా, దహనబలులను బలులను సమాధానబలులను అర్పించుటకై నేను నీయొద్దకు దిగి వత్తును; నేను నీయొద్దకు వచ్చి నీవు చేయవలసినదానిని నీకు తెలియజేయువరకు ఏడు దినముల పాటు నీవు అచ్చట నిలువవలెను.౹

9 అతడు సమూయేలునొద్దనుండి వెళ్లిపోవుటకై తిరుగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించెను. ఆ దినముననే ఆ సూచనలు కనబడెను.

10 వారు ఆ కొండదగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను. అతడు వారిమధ్యను ఉండి ప్రకటన చేయుచుండెను.౹

11 పూర్వము అతని నెరిగినవారందరు అతడు ప్రవక్తలతోకూడనుండి ప్రకటించుట చూచి– కీషు కుమారునికి సంభవించిన దేమిటి? సౌలును ప్రవక్తలలో నున్నాడా? అని ఒకనితో ఒకడు చెప్పుకొనగా

12 ఆ స్థల మందుండు ఒకడు–వారి తండ్రి యెవడని యడిగెను. అందుకు సౌలును ప్రవక్తలలో నున్నాడా? అను సామెత పుట్టెను.౹

13 అంతట అతడు ప్రకటించుట చాలించి ఉన్నతస్థలమునకు వచ్చెను.

14 సౌలుయొక్క పినతండ్రి అతనిని అతని పనివానిని చూచి–మీరిద్దరు ఎక్కడికి పోతిరని అడుగగా అతడు –గార్దభములను వెదకబోతిమి; అవి కనబడక పోగా సమూయేలునొద్దకు పోతిమని చెప్పినప్పుడు

15 సౌలు పిన తండ్రి–సమూయేలు నీతో చెప్పిన సంగతి నాతో చెప్పుమని అతనితో అనగా

16 సౌలు–గార్దభములు దొరికినవని అతడు చెప్పెనని తన పినతండ్రితో అనెనుగాని రాజ్యమునుగూర్చి సమూయేలు చెప్పిన మాటను తెలు పలేదు.

17 తరువాత సమూయేలు మిస్పాకు యెహోవా యొద్దకు జనులను పిలువనంపించి ఇశ్రాయేలీయులతో ఇట్లనెను

18 –ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు–నేను ఇశ్రాయేలీయులైన మిమ్మును ఐగుప్తుదేశములోనుండి రప్పించి ఐగుప్తీయుల వశములోనుండియు, మిమ్మును బాధపెట్టిన జనములన్నిటి వశములోనుండియు విడిపించితిని.౹

19 అయినను మీ దుర్దశలన్నిటిని ఉపద్రవములన్నిటిని పోగొట్టి మిమ్మును రక్షించిన మీ దేవుని మీరు ఇప్పుడు విసర్జించి–మామీద ఒకని రాజుగా నియమింపుమని ఆయనను అడిగియున్నారు. కాబట్టి యిప్పుడు మీ గోత్రముల చొప్పునను మీ కుటుంబముల చొప్పునను మీరు యెహోవా సన్నిధిని హాజరు కావ లెను.౹

20 ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిని సమూయేలు సమకూర్చగా బెన్యామీను గోత్రము ఏర్పడెను.౹

21 బెన్యామీను గోత్రమును వారి యింటి కూటముల ప్రకారము అతడు సమకూర్చగా మథ్రీ యింటి కూటము ఏర్పడెను. తరువాత కీషు కుమారుడైన సౌలు ఏర్పడెను. అయితే జనులు అతని వెదకినప్పుడు అతడు కనబడలేదు.౹

22 కావునవారు–ఇక్కడికి ఇంకొక మనుష్యుడు రావలసియున్నదా అని యెహోవాయొద్ద విచారణచేయగా యెహోవా–ఇదిగో అతడు సామానులో దాగియున్నాడని సెలవిచ్చెను.౹

23 వారు పరుగెత్తిపోయి అక్కడనుండి అతని తోడుకొనివచ్చిరి; అతడు జనసమూహములో నిలిచి నప్పుడు భుజములు మొదలుకొని పైకి ఇతరులకంటె ఎత్తుగలవాడుగా కనబడెను.౹

24 అప్పుడు సమూయేలు–జనులందరిలో యెహోవా ఏర్పరచినవానిని మీరు చూచి తిరా? జనులందరిలో అతనివంటివాడొకడును లేడని చెప్పగా, జనులందరు బొబ్బలు పెట్టుచు–రాజు చిరంజీవి యగుగాక అని కేకలువేసిరి.

25 తరువాత సమూయేలు రాజ్యపాలనపద్ధతిని జనులకు వినిపించి, ఒక గ్రంథమందు వ్రాసి యెహోవా సన్నిధిని దాని నుంచెను. అంతట సమూయేలు జనులందరిని వారి వారి ఇండ్లకు పంపివేసెను.౹

26 సౌలును గిబియాలోని తన ఇంటికి వెళ్లిపోయెను. దేవునిచేత హృదయ ప్రేరేపణ నొందిన శూరులు అతని వెంట వెళ్లిరి.౹

27 పనికిమాలినవారు కొందరు–ఈ మనుష్యుడు మనలను ఏలాగు రక్షింపగల డని చెప్పుకొనుచు అతని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసికొని రాకుండగా అతడు చెవిటివాడైనట్టు ఊరకుండెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1SA/10-5d26d686832774d25dd9b06b712b3597.mp3?version_id=1787—

Categories
1 సమూయేలు

1 సమూయేలు 11

1 అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్గిలాదు కెదురుగా దిగినప్పుడు యాబేషు వారందరు–మేము నీకు సేవచేయుదుము, మాతో నిబంధనచేయుమని నాహాషుతో అనిరి.౹

2 –ఇశ్రాయేలీయులందరి మీదికి నింద తెచ్చునట్లు మీయందరి కుడికన్నులను ఊడదీయుదునని మీతో నేను నిబంధన చేసెదనని అమ్మోనీయుడైన నాహాషు

3 యాబేషు వారి పెద్దలతో చెప్పగా వారు–మేము ఇశ్రాయేలీయుల సరిహద్దు లన్నిటికి దూతలను పంపుటకై యేడు దినముల గడువు మాకిమ్ము; మమ్మును రక్షించుటకు ఎవరును లేక పోయినయెడల మమ్మును మేము నీకప్పగించుకొనెదమనిరి.౹

4 దూతలు సౌలు గిబియాకు వచ్చి జనులకు ఆ వర్తమానము తెలియజెప్పగా జనులందరు బిగ్గరగా ఏడ్చిరి.౹

5 సౌలు పొలమునుండి పశువులను తోలుకొని వచ్చుచు– జనులు ఏడ్చుటకు హేతువేమని అడుగగా వారు యాబేషువారు తెచ్చిన వర్తమానము అతనికి తెలియజేసిరి.౹

6 సౌలు ఆ వర్తమానము వినగానే దేవుని ఆత్మ అతనిమీదికి బలముగా వచ్చెను. అతడు అత్యాగ్రహుడై

7 ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలీయుల దేశము లోని నలుదిక్కులకు దూతలచేత వాటిని పంపి–సౌలుతోను సమూయేలుతోను చేరకుండువాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేయుదునని వర్తమానము చేసెను. అందువలన యెహోవా భయము జనులమీదికి వచ్చెను గనుక యొకడైనను నిలువకుండ వారందరు వచ్చిరి.౹

8 అతడు బెజెకులో వారిని లెక్కపెట్టగా ఇశ్రాయేలువారు మూడు లక్షలమందియు యూదావారు ముప్పదివేలమందియు అయిరి.౹

9 అప్పుడు–రేపు మధ్యాహ్నములోగా మీకు రక్షణ కలుగునని యాబేష్గిలాదు వారితో చెప్పుడని వచ్చిన దూతలతో ఆజ్ఞనిచ్చి వారిని పంపివేసెను. దూతలు పోయి యాబేషువారికి ఆ వర్తమానము తెలుపగా వారు సంతోషపడిరి.౹

10 కాబట్టి యాబేషువారు నాహాషుయొక్క దూతలతో ఇట్లనిరి–రేపు మేము బయలుదేరి మమ్మును అప్పగించుకొందుము, అప్పుడు మీ దృష్టికి ఏది అనుకూలమో అది మాకు చేయవచ్చును.౹

11 మరునాడు సౌలు జనులను మూడు సమూహములుగా చేసిన తరువాత వారు తెల్లవారు సమయమున దండుమధ్యను జొచ్చి మధ్యాహ్నములోగా అమ్మోనీయులను హతముచేయగా వారిలో మిగిలినవారు ఇద్దరేసికూడి పోజాలకుండ చెదరి పోయిరి.౹

12 జనులు–సౌలు మనలను ఏలునా అని అడిగిన వారేరి? మేము వారిని చంపునట్లు ఆ మనుష్యులను తెప్పించుడని సమూయేలుతో అనగా

13 సౌలు–నేడు యెహోవా ఇశ్రాయేలీయులకు రక్షణ కలుగజేసెను గనుక ఈ దినమున ఏ మనుష్యుని మీరు చంపవద్దనెను.

14 –మనము గిల్గాలునకు వెళ్లి రాజ్యపరిపాలన పద్ధతిని మరల స్థాపించుకొందము రండని చెప్పి సమూయేలు జనులను పిలువగా

15 జనులందరు గిల్గాలునకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధానబలులను అర్పించి, యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకము చేసిరి. సౌలును ఇశ్రాయేలీయులందరును అక్కడ బహుగా సంతోషించిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1SA/11-003efc59f1b934f7729099db8ed927ff.mp3?version_id=1787—

Categories
1 సమూయేలు

1 సమూయేలు 12

1 అప్పుడు సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను–ఆలకించుడి; మీరు నాతో చెప్పినమాట నంగీకరించి మీమీద ఒకని రాజుగా నియమించియున్నాను.౹

2 రాజు మీ కార్యములను జరిగించును. నేను తల నెరిసిన ముసలివాడను, నా కుమారులు, మీ మధ్యనున్నారు; బాల్యమునాటినుండి నేటివరకు నేను మీ కార్యములను జరిగించుచు వచ్చితిని.౹

3 ఇదిగో నేనున్నాను, నేనెవని యెద్దునైన తీసికొంటినా? ఎవని గార్దభమునైన పట్టు కొంటినా? ఎవనికైన అన్యాయము చేసితినా? ఎవనినైన బాధపెట్టితినా? న్యాయము నాకు అగపడకుండ ఎవని యొద్దనైన లంచము పుచ్చుకొంటినా? ఆలాగు చేసినయెడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని యెదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకవలెను, అప్పుడు నేను మీ యెదుట దానిని మరల నిత్తుననెను.౹

4 –నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధనైనను చేయలేదు; ఏ మనుష్యునియొద్దగాని నీవు దేనినైనను తీసికొనలేదని వారు చెప్పగా

5 అతడు–అట్టిది నాయొద్ద ఏదియు మీకు దొరకదని యెహోవాయును ఆయన అభిషేకము చేయించినవాడును ఈ దినమున మీ మీద సాక్షులై యున్నారు అని చెప్పినప్పుడు–సాక్షులే అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి.౹

6 మరియు సమూయేలు జనులతో ఇట్లనెను–మోషేను అహరోనును నిర్ణయించి మీపితరులను ఐగుప్తుదేశములోనుండి రప్పించినవాడు యెహోవాయే గదా

7 కాబట్టి యెహోవా మీకును మీపితరులకును చేసిన నీతికార్యములనుబట్టి యెహోవా సన్నిధిని నేను మీతో వాదించునట్లు మీరు ఇక్కడ నిలిచి యుండుడి.౹

8 యాకోబు ఐగుప్తునకు వచ్చిన పిమ్మట మీపితరులు యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన మోషే అహరోనులను పంపినందునవారు మీపితరులను ఐగుప్తులోనుండి తోడుకొని వచ్చి యీ స్థలమందు నివసింప జేసిరి.౹

9 అయితే వారు తమ దేవుడైన యెహోవాను మరచినప్పుడు ఆయన వారిని హాసోరుయొక్క సేనాధిపతియైన సీసెరా చేతికిని ఫిలిష్తీయుల చేతికిని మోయాబు రాజుచేతికిని అమ్మివేయగా వారు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసిరి.౹

10 అంతట వారు–మేము యెహోవాను విసర్జించి బయలుదేవతలను అష్తారోతు దేవతలను పూజించి నందున పాపము చేసితిమి; మా శత్రువుల చేతిలోనుండి నీవు మమ్మును విడిపించినయెడల మేము నిన్ను సేవించెదమని యెహోవాకు మొఱ్ఱపెట్టగా

11 యెహోవా యెరు బ్బయలును బెదానును యెఫ్తాను సమూయేలును పంపి, నలుదిశల మీ శత్రువుల చేతిలోనుండి మిమ్మును విడిపించి నందున మీరు నిర్భయముగా కాపురము చేయుచున్నారు.౹

12 అయితే అమ్మోనీయుల రాజైన నాహాషు మీ మీదికి వచ్చుట మీరు చూడగానే, మీ దేవుడైన యెహోవా మీకు రాజైయున్నను–ఆయన కాదు, ఒక రాజు మిమ్మును ఏలవలెనని మీరు నాతో చెప్పితిరి.౹

13 కాబట్టి మీరు కోరి యేర్పరచుకొనిన రాజు ఇతడే. యెహోవా ఇతనిని మీమీద రాజుగా నిర్ణయించియున్నాడు.౹

14 మీరు యెహోవాయందు భయభక్తులుకలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగముచేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించినయెడల మీకు క్షేమము కలుగును.౹

15 అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసినయెడల యెహోవా హస్తము మీపితరులకు విరోధముగా నుండినట్లు మీకును విరోధముగా నుండును.౹

16 మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి.౹

17 గోధుమ కోతకాలము ఇదే గదా? మీరు రాజును నిర్ణయింపుమని అడిగినందుచేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలిసికొనుటకై యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొనుచున్నాను.౹

18 సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరు యెహోవాకును సమూయేలునకును బహుగా భయపడి

19 సమూయేలుతో ఇట్లనిరి–రాజును నియమించుమని మేము అడుగుటచేత మా పాపములన్నిటిని మించిన కీడు మేము చేసితిమి. కాబట్టి మేము మరణము కాకుండ నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము.౹

20 అంతట సమూయేలు జనులతో ఇట్లనెను– భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, అయినను యెహోవాను విసర్జింపకుండ ఆయనను అనుసరించుచు పూర్ణహృదయముతో ఆయనను సేవించుడి.౹

21 ఆయనను విసర్జింపకుడి, ఆయనను విసర్జించువారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను అను సరించుదురు. నిజముగా అవి మాయయే.౹

22 యెహోవా మిమ్మును తనకు జనముగా చేసికొనుటకు ఇష్టము గలిగి యున్నాడు; తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు.౹

23 నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుటవలన యెహోవాకు విరోధముగ పాపము చేసినవాడనగుదును. అది నాకు దూరమగునుగాక. కాని శ్రేష్ఠమైన చక్కని మార్గమును మీకు బోధింతును.౹

24 ఆయన మీకొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని, మీరు యెహోవాయందు భయభక్తులు కలిగి, నిష్కపటులై పూర్ణహృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము.౹

25 మీరు కీడుచేయువారైతే తప్పకుండ మీరును మీ రాజును నాశనమగుదురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1SA/12-53e6a551e5a449ce1ec3f6e1b336f13f.mp3?version_id=1787—

Categories
1 సమూయేలు

1 సమూయేలు 13

1 సౌలు ముప్పది ఏండ్లవాడై యేలనారంభించెను. అతడు రెండు సంవత్సరములు ఇశ్రాయేలీయులను ఏలెను

2 ఇశ్రాయేలీయులలో మూడు వేలమందిని ఏర్పరచు కొనెను. వీరిలో రెండు వేలమంది మిక్మషులోను బేతేలు కొండలోను సౌలునొద్దనుండిరి; వెయ్యిమంది బెన్యామీనీయుల గిబియాలో యోనాతాను నొద్దనుండిరి; మిగిలినవారిని అతడు వారి వారి డేరాలకు పంపివేసెను.౹

3 యోనాతాను గెబాలోనున్న ఫిలిష్తీయుల దండును హతముచేయగా ఆ సంగతి ఫిలిష్తీయులకు వినబడెను; మరియు దేశమంతట హెబ్రీయులు వినవలెనని సౌలు బాకా ఊదించెను.౹

4 సౌలు ఫిలిష్తీయుల దండును హతముచేసినందున ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులకు హేయులైరని ఇశ్రాయేలీయులకు వినబడగా జనులు గిల్గాలులో సౌలు నొద్దకు కూడివచ్చిరి.

5 ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధముచేయుటకై ముప్పదివేల రథములను ఆరువేల గుఱ్ఱపు రౌతులను సముద్రపుదరినుండు ఇసుకరేణువులంత విస్తారమైన జన సమూహమును సమకూర్చుకొని వచ్చిరి. వీరు బయలుదేరి బేతావెను తూర్పుదిక్కున మిక్మషులో దిగిరి.౹

6 ఇశ్రాయేలీయులు దిగులుపడుచు వచ్చి తాము ఇరుకులో నున్నట్టు తెలిసికొని గుహలలోను పొదలలోను మెట్టలలోను ఉన్నతస్థలములలోను కూపములలోను దాగిరి.౹

7 కొందరు హెబ్రీయులు యొర్దాను నది దాటి గాదు దేశమునకును గిలాదునకును వెళ్లి పోయిరిగాని సౌలు ఇంకను గిల్గాలులోనే ఉండెను; జనులందరు భయపడుచు అతని వెంబడించిరి.

8 సమూయేలు చెప్పినట్టు అతడు ఏడు దినములు ఆగి, సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు, జనులు తన యొద్దనుండి చెదరిపోవుటయు చూచి

9 – దహనబలులను సమాధానబలులను నా యొద్దకు తీసికొని రమ్మని చెప్పి దహనబలి అర్పించెను.౹

10 అతడు దహనబలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలిసి కొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా

11 సమూయేలు అతనితో–నీవు చేసిన పని యేమని యడిగెను. అందుకు సౌలు–జనులు నాయొద్దనుండి చెదరిపోవుటయు, నిర్ణయకాలమున నీవు రాకపోవుటయు, ఫిలిష్తీయులు మిక్మషులో కూడియుండుటయు నేను చూచి

12 –ఇంకను యెహోవాను శాంతిపరచకమునుపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నామీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహనబలి అర్పించితిననెను.౹

13 అందుకు సమూయేలు ఇట్లనెను–నీ దేవుడైన యెహోవా నీ కిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి; నీ రాజ్యమును ఇశ్రాయేలీయులమీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి యుండెను; అయితే నీ రాజ్యము నిలు వదు.౹

14 యెహోవా తన చిత్తానుసారమైన మనస్సుగల యొకని కనుగొనియున్నాడు. నీకు ఆజ్ఞాపించినదాని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనులమీద అతనిని అధిపతినిగా నియమించును.

15 సమూయేలు లేచి గిల్గాలును విడిచి బెన్యామీనీయుల గిబియాకు వచ్చెను; సౌలు తనయొద్దనున్న జనులను లెక్కపెట్టగా వారు దాదాపు ఆరు వందలమంది యుండిరి.౹

16 సౌలును అతని కుమారుడైన యోనాతానును తమ దగ్గర నున్న వారితోకూడ బెన్యామీనీయుల గిబియాలో ఉండిరి; ఫిలిష్తీయులు మిక్మషులో దిగియుండిరి.౹

17 మరియు ఫిలిష్తీయుల పాళెములోనుండి దోపుడుగాండ్రు మూడుగుంపులుగా బయలుదేరి ఒక గుంపు షూయాలు దేశమున, ఒఫ్రాకు పోవుమార్గమున సంచరించెను.౹

18 రెండవ గుంపు బేత్‍హోరోనుకు పోవుమార్గమున సంచరించెను. మూడవ గుంపు అరణ్య సమీపమందుండు జెబోయిములోయ సరిహద్దు మార్గమున సంచరించెను.

19 హెబ్రీయులు కత్తులను ఈటెలను చేయించుకొందు రేమో అని ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల దేశమందంతట కమ్మరవాండ్రులేకుండచేసియుండిరి.౹

20 కాబట్టి ఇశ్రాయేలీయులందరు తమ నక్కులను పారలను గొడ్డండ్రను పోటకత్తులను పదును చేయించుటకై ఫిలిష్తీయులదగ్గరకు పోవలసి వచ్చెను.౹

21 అయితే నక్కులకును పారలకును మూడు ముండ్లుగల కొంకులకును గొడ్డండ్రకునుమునుకోల కఱ్ఱలు సరిచేయుటకును ఆకురాళ్లు మాత్రము వారియొద్ద నుండెను.౹

22 కాబట్టి యుద్ధదినమందు సౌలునొద్దను యోనాతాను నొద్దను ఉన్నజనులలో ఒకని చేతిలోనైనను కత్తియేగాని యీటెయేగాని లేకపోయెను, సౌలునకును అతని కుమారుడైన యోనాతానునకును మాత్రము అవి యుండెను.౹

23 ఫిలిష్తీయుల దండు కావలివారు కొందరు మిక్మషు కనుమకు వచ్చిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1SA/13-2e6fe6cd2f2da7df75a04ae3d8d5c764.mp3?version_id=1787—

Categories
1 సమూయేలు

1 సమూయేలు 14

1 ఆ దినము సౌలు కుమారుడైన యోనాతాను తన తండ్రితో ఏమియు చెప్పక తన ఆయుధములను మోయు పడుచువానిని పిలిచి–అవతలనున్న ఫిలిష్తీయుల దండు కావలివారిని హతముచేయ పోదము రమ్మనెను.౹

2 సౌలు గిబియా అవతల మిగ్రోనులో దానిమ్మచెట్టు క్రింద దిగియుండెను, అతని యొద్దనున్న జనులు దాదాపు ఆరు వందలమంది.౹

3 షిలోహులో యెహోవాకు యాజకుడగు ఏలీయొక్క కుమారుడైన ఫీనెహాసుకు పుట్టిన ఈకాబోదుయొక్క సహోదరుడైన అహీటూబునకు జననమైన అహీయా ఏఫోదు ధరించుకొని అక్కడ ఉండెను. యోనాతాను వెళ్లిన సంగతి జనులకు తెలియకయుండెను.౹

4 యోనాతాను ఫిలిష్తీయుల దండు కావలివారున్న స్థలమునకు పో జూచిన దారియగు కనుమల నడుమ ఇవతల ఒక సూది గట్టును అవతల ఒక సూదిగట్టును ఉండెను, వాటిలో ఒకదాని పేరు బొస్సేసు రెండవదానిపేరు సెనే.౹

5 ఒక దాని కొమ్ము మిక్మషు ఎదుట ఉత్తరపువైపునను, రెండవదాని కొమ్ము గిబియా యెదుట దక్షిణపువైపునను ఉండెను.౹

6 యోనాతాను – ఈ సున్నతిలేనివారి దండు కాపరులమీదికి పోదము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకులచేతనైనను కొద్దిమందిచేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయువానితో చెప్పగా

7 అతడు–నీ మనస్సులో ఉన్నదంతయు చేయుము, పోదము రమ్ము. నీ యిష్టాను సారముగా నేను నీకు తోడుగా నున్నానని అతనితో చెప్పెను.౹

8 అప్పుడు యోనాతాను–మనము వారి దగ్గరకు పోయి మనలను వారికి అగుపరుచుకొందము.౹

9 వారు మనలను చూచి–మేము మీ యొద్దకు వచ్చువరకు అక్కడ నిలువుడని చెప్పినయెడల వారియొద్దకు పోక మనమున్నచోట నిలుచుదము.౹

10 –మాయొద్దకు రండని వారు చెప్పినయెడల యెహోవావారిని మనచేతికి అప్పగించెనని దానిచేత గుర్తించి మనము పోదమని చెప్పగా

11 వీరిద్దరు తమ్మును తాము ఫిలిష్తీయుల దండుకాపరులకు అగుపరుచుకొనిరి. అప్పుడే ఫిలిష్తీయులు–చూడుడి, తాము దాగియుండిన గుహలలోనుండి హెబ్రీయులు బయలుదేరి వచ్చుచున్నారని చెప్పుకొనుచు

12 యోనాతానును అతని ఆయుధములను మోయువానిని పిలిచి– మేము మీకు ఒకటి చూపింతుము రండని చెప్పినప్పుడు యోనాతాను–నా వెనుక రమ్ము, యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారినప్పగించెనని తన ఆయుధములు మోయువానితో చెప్పి

13 అతడును అతని వెనుక అతని ఆయుధములు మోయువాడును తమ చేతులతోను కాళ్లతోను ప్రాకి యెక్కిరి. ఫిలిష్తీయులు యోనాతాను దెబ్బకు పడగా అతనివెనుక వచ్చు అతని ఆయుధములు మోయువాడు వారిని చంపెను.౹

14 యోనాతానును అతని ఆయు ధములు మోయువాడును చేసిన ఆ మొదటి వధయందు దాదాపుగా ఇరువదిమంది పడిరి; ఒక దినమున ఒక కాడి యెడ్లు దున్ను అరయెకరము నేల పొడుగున అది జరిగెను.౹

15 దండులోను పొలములోను జనులందరిలోను మహా భయకంపము కలిగెను. దండు కావలివారును దోపుడు గాండ్రును భీతినొందిరి; నేలయదిరెను. వారు ఈ భయము దైవికమని భావించిరి.౹

16 దండువారు చెదిరిపోయి బొత్తిగా ఓడిపోవుట బెన్యామీనీయుల గిబియాలో నున్న సౌలుయొక్క వేగులవారికి కనబడగా

17 సౌలు–మీరు లెక్కపెట్టి మనయొద్ద లేనివారెవరో చూడుడని తనయొద్దనున్న జనులతో చెప్పెను. వారు లెక్క చూచి యోనాతానును అతని ఆయుధములు మోయువాడును లేరని తెలిసికొనిరి.

18 దేవుని మందసము అప్పుడు ఇశ్రాయేలీయులయొద్ద ఉండగా–దేవుని మందసమును ఇక్కడికి తీసికొనిరమ్మని సౌలు అహీయాకు సెలవిచ్చెను.౹

19 సౌలు యాజకునితో మాటలాడుచుండగా ఫిలిష్తీయుల దండులో ధ్వని మరి యెక్కువగా వినబడెను; కాబట్టి సౌలు యాజకునితో– నీ చెయ్యి వెనుకకు తీయుమని చెప్పి

20 తానును తనయొద్దనున్న జనులందరును కూడుకొని యుద్ధమునకు చొరబడిరి. వారు రాగా ఫిలిష్తీయులు కలవరపడి ఒకరినొకరు హతము చేసికొనుచుండిరి.౹

21 మరియు అంతకుమునుపు ఫిలిష్తీయుల వశముననున్నవారై చుట్టునున్న ప్రాంతములలోనుండి వారితోకూడ దండునకు వచ్చిన హెబ్రీయులు సౌలు నొద్దను యోనాతానునొద్దను ఉన్న ఇశ్రాయేలీయులతో కలిసికొనవలెనని ఫిలిష్తీయులను విడిచిరి.౹

22 అదియుగాక ఎఫ్రాయిము మన్యములో దాగియున్న ఇశ్రాయేలీయులును ఫిలిష్తీయులు పారిపోయిరని విని యుద్ధమందు వారిని తరుముటలో కూడిరి.౹

23 ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులను ఈలాగున రక్షించెను. యుద్ధము బేతావెను అవతలకు సాగగా ఆ దినమున ఇశ్రాయేలీయులు చాలా బడలిక నొందిరి.౹

24 –నేను నా శత్రువులమీద పగ తీర్చుకొనకమునుపు, సాయంత్రము కాకమునుపు భోజనము చేయువాడు శపింపబడును అని సౌలు జనులచేత ప్రమాణము చేయించెను, అందువలన జనులు ఏమియు తినకుండిరి.౹

25 జనులందరు ఒక అడవిలోనికి రాగా అక్కడ నేలమీద తేనె కనబడెను.౹

26 జనులు ఆ అడవిని జొరగా తేనె కాలువ కట్టియుండెనుగాని జనులు తాము చేసిన ప్రమాణమునకు భయపడి ఒకడును చెయ్యి నోటపెట్టలేదు.౹

27 అయితే యోనాతాను తన తండ్రి జనులచేత చేయించిన ప్రమాణము వినలేదు. గనుక తన చేతికఱ్ఱ చాపి దాని కొనను తేనె పట్టులో ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించెను.౹

28 జనులలో ఒకడు–నీ తండ్రి జనులచేత ప్రమాణము చేయించి–ఈ దినమున ఆహారము పుచ్చుకొనువాడు శపింపబడునని ఖండితముగా ఆజ్ఞాపించియున్నాడు; అందుచేతనే జనులు బహు బడలియున్నారని చెప్పెను.౹

29 అందుకు యోనాతాను అందుచేత నా తండ్రి జనులను కష్టపెట్టినవాడాయెను; నేను ఈ తేనె కొంచెము పుచ్చుకొన్న మాత్రమున నా కన్నులు ఎంత ప్రకాశించుచున్నవో చూడుడి

30 జనులు తాము చిక్కించుకొనిన తమ శత్రువుల దోపుళ్ల వలన బాగుగా భోజనముచేసినయెడల వారు ఫిలిష్తీయులను మరి అధికముగా హతము చేసియుందురనెను.౹

31 ఆ దినమున జనులు ఫిలిష్తీయులను మిక్మషునుండి అయ్యాలోనువరకు హతముచేయగా జనులు బహు బడలిక నొందిరి.౹

32 జనులు దోపుడుమీద ఎగబడి, గొఱ్ఱెలను ఎడ్లను పెయ్యలను తీసికొని నేలమీద వాటిని వధించి రక్తముతోనే భక్షించినందున

33 –జనులు రక్తముతోనేతిని యెహోవా దృష్టికి పాపము చేయుచున్నారని కొందరు సౌలునకు తెలియజేయగా అతడు–మీరు విశ్వాసఘాతకులైతిరి; పెద్ద రాయి యొకటి నేడు నా దగ్గరకు దొర్లించి తెండని చెప్పి

34 –మీరు అక్కడక్కడికి జనులమధ్యకు పోయి, అందరు తమ యెద్దులను తమ గొఱ్ఱెలను నాయొద్దకు తీసికొనివచ్చి యిక్కడ వధించి భక్షింపవలెను; రక్తముతో మాంసముతిని యెహోవా దృష్టికి పాపము చేయకుడని వారితో చెప్పుడని కొందరిని పంపెను. కాబట్టి జనులందరు ఆ రాత్రి తమతమ యెద్దులను తీసికొని వచ్చి అక్కడ వధించిరి.౹

35 మరియు సౌలు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించెను. యెహోవాకు అతడు కట్టించిన మొదటి బలిపీఠము అదే.

36 అంతట–మనము రాత్రియందు ఫిలిష్తీయులను తరిమి తెల్లవారువరకు వారిని కలతపెట్టి, శేషించు వాడొకడునులేకుండ చేతము రండి అని సౌలు ఆజ్ఞ ఇయ్యగా జనులు –నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుమనిరి. అంతట సౌలు–యాజకుడు ఇక్కడనే యున్నాడు, దేవునియొద్ద విచారణ చేయుదము రండని చెప్పి

37 సౌలు–ఫిలిష్తీయుల వెనుక నేను దిగిపోయినయెడల నీవు ఇశ్రాయేలీయుల చేతికి వారి నప్పగింతువా అని దేవునియొద్ద విచారణ చేయగా, ఆ దినమున ఆయన అతనికి ప్రత్యుత్తరమియ్యక యుండెను.౹

38 అందువలన సౌలు–జనులలో పెద్దలు నా యొద్దకు వచ్చి నేడు ఎవరివలన ఈ పాపము కలిగెనో అది విచారింపవలెను.౹

39 నా కుమారుడైన యోనాతాను వలన కలిగినను వాడు తప్పక మరణమవునని ఇశ్రాయేలీయులను రక్షించు యెహోవా జీవముతోడని నేను ప్రమాణము చేయుచున్నాననెను. అయితే జనులందరిలో అతనికి ప్రత్యుత్తరమిచ్చినవాడు ఒకడును లేకపోయెను.౹

40 –మీరు ఒకతట్టునను నేనును నా కుమారుడగు యోనాతానును ఒకతట్టునను ఉండవలెనని అతడు జనులందరితో చెప్పగా జనులు–నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుమని సౌలుతో చెప్పిరి.౹

41 అప్పుడు సౌలు–ఇశ్రాయేలీయులకు దేవుడవైన యెహోవా, దోషిని కనుపరచుమని ప్రార్థింపగా సౌలు పేరటను యోనాతాను పేరటను చీటిపడెనుగాని జనులు తప్పించుకొనిరి.౹

42 –నాకును నా కుమారుడైన యోనాతానునకును చీట్లు వేయుడని సౌలు ఆజ్ఞ ఇయ్యగా యోనాతాను పేరట చీటి పడెను.౹

43 –నీవు చేసినదేదో నాతో చెప్పుమని యోనాతానుతో అనగా యోనాతాను–నా చేతికఱ్ఱకొనతో కొంచెము తేనె పుచ్చుకొన్న మాట వాస్తవమే; కొంచెము తేనెకై నేను మరణమొందవలసి వచ్చినదని అతనితో అనెను.౹

44 అందుకు సౌలు–యోనాతానా, నీవు అవశ్యముగా మరణమవుదువు, నేను ఒప్పుకొనని యెడల దేవుడు నాకు గొప్పఅపాయము కలుగజేయునుగాక అనెను.౹

45 అయితే జనులు సౌలుతో–ఇశ్రాయేలీయులకు ఇంత గొప్ప రక్షణ కలుగ జేసిన యోనాతాను మరణమవునా? అదెన్నటికినికూడదు. దేవుని సహాయముచేత ఈ దినమున యోనాతాను మనలను జయము నొందించెను; యెహోవా జీవముతోడు అతని తలవెండ్రుకలలో ఒకటియు నేల రాలదని చెప్పి యోనాతాను మరణము కాకుండ జనులు అతని రక్షించిరి.౹

46 అప్పుడు సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని వెళ్లిపోగా ఫిలిష్తీయులు తమ స్థలమునకు వెళ్లిరి.

47 ఈలాగున సౌలు ఇశ్రాయేలీయులను ఏలుటకు అధికారము నొందినవాడై నఖముఖాల వారి శత్రువులైన మోయాబీయులతోను అమ్మోనీయులతోను ఎదోమీ యులతోను సోబాదేశపు రాజులతోను ఫిలిష్తీయులతోను యుద్ధము చేసెను. ఎవరిమీదికి అతడు పోయెనో వారినందరిని ఓడించెను.౹

48 మరియు అతడు దండునుకూర్చి అమాలేకీయులను హతముచేసి ఇశ్రాయేలీయులను కొల్ల సొమ్ముగా పెట్టినవారి చేతిలోనుండి వారిని విడిపించెను.

49 సౌలునకు పుట్టిన కుమారుల పేర్లు ఏవనగా, యోనాతాను ఇష్వీ మెల్కీషూవ; అతని యిద్దరు కుమార్తెల పేర్లు ఏవనగా పెద్దదానిపేరు మేరబు చిన్న దానిపేరు మీకాలు.౹

50 సౌలుయొక్క భార్యకు అహీనోయమని పేరు, ఈమె అహిమయస్సు కుమార్తె. అతని సైన్యాధిపతి పేరు అబ్నేరు, ఇతడు సౌలునకు పిన తండ్రియైన నేరు కుమారుడు.౹

51 సౌలు తండ్రియగు కీషును అబ్నేరు తండ్రియగు నేరును అబీయేలు కుమారులు.

52 సౌలు బ్రదికిన దినములన్నియు ఫిలిష్తీయులతో ఘోర యుద్ధము జరుగగా తాను చూచిన బలాఢ్యుల నందరిని పరాక్రమశాలులనందరిని తనయొద్దకు చేర్చుకొనెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1SA/14-d02213278331e29372d2966d9b387878.mp3?version_id=1787—