Categories
న్యాయాధిపతులు

న్యాయాధిపతులు 10

1 అబీమెలెకునకు తరువాత ఇశ్శాఖారు గోత్రికుడైన దోదో మనుమడును పువ్వా కుమారుడునైన తోలా న్యాయాధిపతిగా నియమింపబడెను. అతడు ఎఫ్రాయి మీయుల మన్యమందలి షామీరులో నివసించినవాడు.౹

2 అతడు ఇరువదిమూడు సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతియై ఉండి చనిపోయి షామీరులో పాతిపెట్టబడెను.

3 అతని తరువాత గిలాదుదేశస్థుడైన యాయీరు నియమింపబడినవాడై యిరువదిరెండు సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను.౹

4 అతనికి ముప్పదిమంది కుమారులుండిరి, వారు ముప్పది గాడిదపిల్లల నెక్కి తిరుగువారు, ముప్పది ఊరులు వారికుండెను, నేటివరకు వాటికి యాయీరు గ్రామములని పేరు.౹

5 అవి గిలాదు దేశములోనున్నవి. యాయీరు చనిపోయి కామోనులో పాతిపెట్టబడెను.

6 ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరల దుష్ ప్రవర్తనులైరి. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి, బయలులు అష్తారోతులు అను సిరియనుల దేవతలను సీదోనీయుల దేవతలను మోయాబీయుల దేవతలను అమ్మోనీయుల దేవతలను ఫిలిష్తీయుల దేవతలను పూజిం చుచువచ్చిరి.౹

7 యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయులమీద మండగా ఆయన ఫిలిష్తీయుల చేతికిని అమ్మోనీయుల చేతికిని వారినప్పగించెను గనుక

8 వారు ఆ సంవత్సరము మొదలుకొని ఇశ్రాయేలీయులను, అనగా యొర్దాను అవతలనున్న గిలాదునందలి అమోరీయుల దేశములో కాపురమున్న ఇశ్రాయేలీయులను పదునెనిమిది సంవత్సరములు చితుకగొట్టి అణచివేసిరి.౹

9 మరియు అమ్మోనీయులు యూదాదేశస్థులతోను బెన్యామీనీయులతోను ఎఫ్రాయి మీయులతోను యుద్ధముచేయుటకు యొర్దానును దాటిరి గనుక ఇశ్రాయేలీయులకు మిక్కిలి శ్రమ కలిగెను

10 అప్పుడు ఇశ్రాయేలీయులు–మేము నీ సన్నిధిని పాపము చేసియున్నాము, మా దేవుని విడిచి బయలులను పూజించియున్నామని యెహోవాకు మొఱ్ఱపెట్టగా

11 యెహోవా –ఐగుప్తీయుల వశములోనుండియు అమోరీయుల వశములోనుండియు అమ్మోనీయుల వశములోనుండియు ఫిలిష్తీయుల వశములోనుండియు మాత్రము గాక

12 సీదోనీయులును అమాలేకీయులును మాయోనీయులును మిమ్మును బాధ పరచినప్పుడు వారి వశములోనుండియు నేను మిమ్మును రక్షించితిని గదా

13 అయితే మీరు నన్ను విసర్జించి అన్యదేవతలను పూజించితిరి గనుక నేను ఇకను మిమ్మును రక్షిం పను.౹

14 పోయి మీరు కోరుకొనిన దేవతలకు మొఱ్ఱపెట్టుకొనుడి; మీ శ్రమకాలమున అవి మిమ్మును రక్షించునేమో అని ఇశ్రాయేలీయులతో సెలవిచ్చెను.౹

15 అప్పుడు ఇశ్రాయేలీయులు–మేము పాపము చేసియున్నాము, నీ దృిష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయుము; దయచేసి నేడు మమ్మును రక్షింపుమని చెప్పి

16 యెహోవాను సేవింపవలెనని తమ మధ్యనుండి అన్యదేవతలను తొలగింపగా, ఆయన ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూచి సహింపలేక పోయెను.

17 అప్పుడు అమ్మోనీయులు కూడుకొని గిలాదులో దిగి యుండిరి. ఇశ్రాయేలీయులును కూడుకొని మిస్పాలో దిగియుండిరి.౹

18 కాబట్టి జనులు, అనగా గిలాదు పెద్దలు–అమ్మోనీయులతో యుద్ధముచేయ బూనుకొనువాడెవడో వాడు గిలాదు నివాసులకందరికిని ప్రధానుడగునని యొక నితో నొకడు చెప్పుకొనిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JDG/10-cb09c49a5cde116309f4903032336240.mp3?version_id=1787—

Categories
న్యాయాధిపతులు

న్యాయాధిపతులు 11

1 గిలాదువాడైన యెఫ్తా పరాక్రమముగల బలాఢ్యుడు. అతడు వేశ్య కుమారుడు; గిలాదు యెఫ్తాను కనెను.౹

2 గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్ద వారై యెఫ్తాతో–నీవు అన్యస్త్రీకి పుట్టిన వాడవు గనుక మన తండ్రియింట నీకు స్వాస్థ్యము లేదనిరి.౹

3 యెఫ్తా తన సహోదరులయొద్దనుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరిజనము యెఫ్తాయొద్దకు వచ్చి అతనితోకూడ సంచరించుచుండెను.

4 కొంతకాలమైన తరువాత అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధముచేయగా

5 అమ్మోనీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసినందున

6 గిలాదు పెద్దలు టోబుదేశమునుండి యెఫ్తాను రప్పించుటకు పోయి–నీవు వచ్చి మాకు అధిపతివై యుండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయుదమని యెఫ్తాతో చెప్పిరి.౹

7 అందుకు యెఫ్తా–మీరు నాయందు పగపెట్టి నా తండ్రి యింటనుండి నన్ను తోలివేసితిరే. ఇప్పుడు మీకు కలిగినశ్రమలో మీరు నాయొద్దకు రానేల? అని గిలాదు పెద్దలతో చెప్పెను.౹

8 అప్పుడు గిలాదు పెద్దలు–అందుచేతనే మేము నీయొద్దకు మళ్లి వచ్చితిమి; నీవు మాతోకూడ వచ్చి అమ్మోనీయులతో యుద్ధముచేసినయెడల, గిలాదు నివాసులమైన మా అందరిమీద నీవు అధికారివవుదువని యెఫ్తాతో అనిరి.౹

9 అందుకు యెఫ్తా–అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసికొనిపోయినమీదట యెహోవావారిని నా చేతి కప్పగించినయెడల నేనే మీకు ప్రధానుడనవుదునా? అని గిలాదు పెద్దల నడుగగా

10 గిలాదు పెద్దలు–నిశ్చయముగా మేము నీ మాటచొప్పున చేయుదుము; యెహోవా మన యుభయులమధ్యను సాక్షిగా ఉండునుగాకని యెఫ్తాతో అనిరి.౹

11 కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతోకూడ పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతని నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి యంతయు వినిపించెను.

12 యెఫ్తా అమ్మోనీయుల రాజునొద్దకు దూతలనుపంపి– నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశము మీదికి యుద్ధమునకు వచ్చియున్నావని యడుగగా

13 అమ్మోనీయుల రాజు–ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని యబ్బోకు వరకును యొర్దానువరకును నా దేశము ఆక్రమించుకొని నందుననే నేను వచ్చియున్నాను. కాబట్టి మనము సమాధానముగా నుండునట్లు ఆ దేశములను మరల మాకప్పగించుమని యెఫ్తా పంపిన దూతలతో సమాచారము చెప్పెను.౹

14 అంతట యెఫ్తా మరల అమ్మోనీయుల రాజునొద్దకు దూతలను పంపి యిట్లనెను

15 –యెఫ్తా సెలవిచ్చినదేమనగా–ఇశ్రాయేలీయులు మోయాబు దేశమునైనను అమ్మోనీయుల దేశమునైనను ఆక్రమించుకొనలేదు.౹

16 ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చుచుండగా వారు ఎఱ్ఱసముద్రమువరకు అరణ్యములో నడిచి కాదేషునకు వచ్చిరి.౹

17 అప్పుడు ఇశ్రాయేలీయులు ఎదోము రాజునొద్దకు దూతలను పంపి –నీ దేశము గుండ పోవుటకు దయచేసి నాకు సెలవిమ్మని యడుగగా, ఎదోమురాజు ఒప్పుకొనలేదు. వారు మోయాబు రాజునొద్దకు అట్టి వర్తమానమే పంపిరిగాని అతడును–నేను సెలవియ్యనని చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలీయులు కాదేషులో నివసించిరి.౹

18 తరువాత వారు అరణ్యప్రయాణముచేయుచు ఎదోమీయులయొక్కయు మోయాబీయులయొక్కయు దేశముల చుట్టు తిరిగి, మోయాబునకు తూర్పు దిక్కున కనాను దేశమందు ప్రవేశించి అర్నోను అద్దరిని దిగిరి. వారు మోయాబు సరిహద్దు లోపలికి పోలేదు. అర్నోను మోయాబునకు సరిహద్దుగదా.౹

19 మరియు ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోనను హెష్బోను రాజునొద్దకు దూతలను పంపి–నీ దేశముగుండ మా స్థలమునకు మేము పోవునట్లు దయచేసి సెలవిమ్మని అతనియొద్ద మనవిచేయగా

20 సీహోను ఇశ్రాయేలీయులను నమ్మక, తన దేశములోబడి వెళ్లనియ్యక, తన జనులనందరిని సమకూర్చుకొని యాహసులో దిగి ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసెను.౹

21 అప్పుడు ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా ఆ సీహోనును అతని సమస్త జనమును ఇశ్రాయేలీయుల చేతి కప్పగింపగా వారు ఆ జనమును హతముచేసిన తరువాత ఆ దేశనివాసులైన అమోరీయుల దేశమంతయు స్వాధీనపరచుకొని

22 అర్నోను నది మొదలుకొని యబ్బోకువరకును అరణ్యము మొదలుకొని యొర్దానువరకును అమోరీయుల ప్రాంతములన్నిటిని స్వాధీనపరచుకొనిరి.౹

23 కాబట్టి ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా అమోరీయులను తన జనులయెదుట నిలువకుండ తోలివేసిన తరువాత నీవు దానిని స్వతంత్రించు కొందువా?

24 స్వాధీన పరచుకొనుటకు కెమోషను నీ దేవత నీకిచ్చిన దానిని నీవనుభవించుచున్నావుగదా? మా దేవుడైన యెహోవా మా యెదుటనుండి యెవరిని తోలివేయునో వారి స్వాస్థ్యమును మేము స్వాధీనపరచుకొందుము.౹

25 మోయాబు రాజైన సిప్పోరు కుమారుడగు బాలాకుకంటె నీవు ఏమాత్రమును అధికుడవు కావుగదా? అతడు ఇశ్రాయేలీయులతో ఎప్పుడైనను కలహించెనా? ఎప్పుడైనను వారితో యుద్ధము చేసెనా?

26 ఇశ్రాయేలీయులు హెష్బోనులోను దాని ఊరులలోను అరోయేరులోను దాని ఊరులలోను అర్నోను తీరముల పట్టణములన్నిటిలోను మూడు వందల సంవత్సరములనుండి నివసించుచుండగా ఆ కాలమున నీవేల వాటిని పట్టుకొనలేదు?

27 ఇట్లుండగా నేను నీ యెడల తప్పు చేయలేదుగాని నీవు నామీదికి యుద్ధమునకు వచ్చుటవలన నాయెడల దోషము చేయుచున్నావు. న్యాయాధిపతియైన యెహోవా నేడు ఇశ్రాయేలీయులకును అమ్మోనీయులకును న్యాయము తీర్చును గాక.౹

28 అయితే అమ్మోనీయులరాజు యెఫ్తా తనతో చెప్పిన మాటలకు ఒప్పుకొనలేదు.

29 యెహోవా ఆత్మ యెఫ్తామీదికి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు, గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పేనుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను.౹

30 అప్పుడు యెఫ్తా యెహోవాకు మ్రొక్కు కొనెను, ఎట్లనగా–నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించినయెడల

31 నేను అమ్మోనీయులయొద్ద నుండి క్షేమముగా తిరిగివచ్చునప్పుడు, నన్ను ఎదుర్కొనుటకు నా యింటిద్వారమునుండి బయలుదేరి వచ్చునదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును; మరియుదహనబలిగా దాని నర్పించెదననెను.౹

32 అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారియొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతనిచేతికి వారినప్పగించెను గనుక అతడు వారిని

33 అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చువరకు ఆబేల్కెరామీమువరకును ఇరువది పట్టణముల వారిని నిశ్శేషముగా హతముచేసెను. అట్లు అమ్మోనీయులు ఇశ్రాయేలీయుల యెదుట నిలువకుండ అణచి వేయబడిరి.

34 యెఫ్తా మిస్పాలోనున్న తన యింటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోను నాట్యముతోను బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమేగాని ఆడుసంతానమేగానిలేదు.౹

35 కాబట్టి అతడు ఆమెను చూచి, తన బట్టలను చింపుకొని–అయ్యో నా కుమారీ, నీవు నన్ను బహుగా క్రుంగచేసితివి, నీవు నన్ను తల్లడింపచేయువారిలో ఒకతెవైయున్నావు; నేను యెహోవాకు మాట యిచ్చియున్నాను గనుక వెనుకతీయ లేననగా

36 ఆమె–నా తండ్రీ, యెహోవాకు మాట యిచ్చి యుంటివా? నీ నోటినుండి బయలుదేరిన మాటచొప్పున నాకు చేయుము; యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయులమీద పగతీర్చుకొని యున్నాడని అతనితోననెను.౹

37 మరియు ఆమె–నాకొరకు చేయవలసినదేదనగా రెండు నెలలవరకు నన్ను విడువుము, నేనును నా చెలికత్తెలును పోయి కొండలమీద ఉండి, నా కన్యాత్వమునుగూర్చి ప్రలాపించెదనని తండ్రితో చెప్పగా

38 అతడు పొమ్మనిచెప్పి రెండు నెలలవరకు ఆమెను పోనిచ్చెను గనుక ఆమె తన చెలికత్తెలతోకూడ పోయి కొండలమీద తన కన్యాత్వమునుగూర్చి ప్రలాపించెను.౹

39 ఆ రెండు నెలల అంతమున ఆమె తన తండ్రియొద్దకు తిరిగిరాగా అతడు తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడిచొప్పున ఆమెకు చేసెను.౹

40 ఆమె పురుషుని ఎరుగనేలేదు. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలీయుల కుమార్తెలు నాలుగు దినములు గిలాదుదేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధిచేయుటకద్దు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JDG/11-79ac42172b7a7069e73f9de98cb276bf.mp3?version_id=1787—

Categories
న్యాయాధిపతులు

న్యాయాధిపతులు 12

1 ఎఫ్రాయిమీయులు కూడుకొని ఉత్తరదిక్కునకు . పోయి–నీవు అమ్మోనీయులతో యుద్ధము చేయబోయినప్పుడు నీతో వచ్చుటకు మమ్మునేల పిలువ లేదు? నీవు కాపురమున్న నీ యింటిని అగ్నితో కాల్చివేయుదుమని యెఫ్తాతో చెప్పగా

2 యెఫ్తా–నాకును నా జనులకును అమ్మోనీయులతో గొప్ప కలహము కలిగినప్పుడు నేను మిమ్మును పిలిచితినిగాని మీరు వారి చేతులలోనుండి నన్ను రక్షింపలేదు. మీరు నన్ను రక్షింపకపోవుట నేను చూచి

3 నా ప్రాణమును అరచేతిలో ఉంచుకొని అమ్మోనీయులతో యుద్ధము చేయపోతిని. అప్పుడు యెహోవావారిని నా చేతి కప్పగించెను గనుక నాతో పోట్లాడుటకు మీరేల నేడు వచ్చితిరనెను.౹

4 అప్పుడు యెఫ్తా గిలాదువారినందరిని పోగుచేసికొని ఎఫ్రాయిమీయులతో యుద్ధముచేయగా గిలాదువారు ఎఫ్రాయిమీయులను జయించిరి. ఏలయనగా వారు–ఎఫ్రాయిమీయులకును మనష్షీ యులకునుమధ్యను గిలాదువారైన మీరు ఎఫ్రాయిమీ యులయెదుట నిలువక పారిపోయిన వారనిరి.౹

5 ఎఫ్రాయి మీయులతో యుద్ధముచేయుటకై గిలాదువారు యొర్దాను దాటు రేవులను పట్టుకొనగా పారిపోయిన ఎఫ్రాయిమీ యులలో ఎవడో–నన్ను దాటనియ్యుడని చెప్పినప్పుడు గిలాదువారు–నీవు ఎఫ్రాయిమీయుడవా అని అతని నడి గిరి.౹

6 అందుకతడు–నేను కాను అనినయెడల వారు అతని చూచి–షిబ్బోలెతను శబ్దము పలుకుమనిరి. అతడు అట్లు పలుకనేరక సిబ్బోలెతని పలుకగా వారు అతని పట్టుకొని యొర్దానురేవులయొద్ద చంపిరి. ఆ కాలమున ఎఫ్రాయి మీయులలో నలువది రెండువేలమంది పడిపోయిరి.౹

7 యెఫ్తా ఆరుసంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతియైయుండెను. గిలాదువాడైన యెఫ్తా చనిపోయి గిలాదు పట్టణములలో నొకదానియందు పాతిపెట్టబడెను.

8 అతని తరువాత బేత్లెహేమువాడైన ఇబ్సాను ఇశ్రాయేలీయులకు అధిపతియాయెను.౹

9 అతనికి ముప్పదిమంది కుమారులును ముప్పదిమంది కుమార్తెలును ఉండిరి. అతడు ఆ కుమార్తెలను తన వంశమున చేరనివారికిచ్చి, తన వంశమునకు చేరని ముప్పదిమంది కన్యలను తన కుమారులకు పెండ్లి చేసెను. అతడు ఏడేండ్లు ఇశ్రాయేలీయులకు అధిపతిగా నుండెను.౹

10 ఇబ్సాను చనిపోయి బేత్లెహేములో పాతిపెట్టబడెను.

11 అతని తరువాత జెబూలూనీయుడైన ఏలోను ఇశ్రాయేలీయులకు అధిపతియాయెను; అతడు పదియేండ్లు ఇశ్రాయేలీయులకు అధిపతిగానుండెను.౹

12 జెబూలూనీయుడైన ఏలోను చనిపోయి జెబూలూను దేశమందలి అయ్యాలో నులో పాతిపెట్టబడెను.

13 అతని తరువాత పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను ఇశ్రాయేలీయులకు అధిపతియాయెను.౹

14 అతనికి నలువదిమంది కుమారులును ముప్పదిమంది మనుమలును ఉండిరి. వారు డెబ్బది గాడిదపిల్లల నెక్కి తిరుగువారు. అతడు ఎనిమిదేండ్లు ఇశ్రాయేలీయులకు అధిపతిగా నుండెను.౹

15 పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను చనిపోయి ఎఫ్రాయిము దేశమందలి అమాలేకీయుల మన్యములోనున్న పిరాతోనులో పాతిపెట్టబడెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JDG/12-b67146986ac1cbdb2665d66efe2a34fc.mp3?version_id=1787—

Categories
న్యాయాధిపతులు

న్యాయాధిపతులు 13

1 ఇశ్రాయేలీయులు మరల యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా నలువది సంవత్సరములు వారిని ఫిలిష్తీయులచేతికి అప్పగించెను.

2 ఆ కాలమున దానువంశస్థుడును జొర్యాపట్టణస్థుడునైన మానోహ అను నొకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపులేకయుండెను.౹

3 యెహోవాదూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై–ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపులేకపోయెను; అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు.౹

4 కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి, ద్రాక్షారసమునేగాని మద్యమునేగాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము.౹

5 నీవు గర్భవతివై కుమారుని కందువు. అతని తలమీద మంగలకత్తి వేయకూడదు; ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరుచేయబడినవాడై ఫిలిష్తీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా

6 ఆ స్త్రీ తన పెనిమిటియొద్దకు వచ్చి –దైవజనుడొకడు నా యొద్దకు వచ్చెను; అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడ నుండి వచ్చెనో నేనడుగలేదు, అతడు తనపేరు నాతో చెప్పలేదు

7 గాని–ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు ద్రాక్షారసమునేగాని మద్యమునేగాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చని పోవువరకు దేవునికి నాజీరు చేయబడినవాడైయుండునని నాతో చెప్పెననెను.౹

8 అందుకు మానోహ–నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరల మా యొద్దకువచ్చి, పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు దయచేయుమని యెహోవాను వేడు కొనగా

9 దేవుడు మానోహ ప్రార్థన నాలకించెను గనుక, ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవునిదూత ఆమెను దర్శించెను.౹

10 ఆ సమయమున ఆమె పెనిమిటియైన మానోహ ఆమె యొద్దయుండలేదు గనుక ఆ స్త్రీ త్వరగా పరుగెత్తి–ఆనాడు నాయొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడెనని అతనితో చెప్పెను.౹

11 అప్పుడు మానోహ లేచి తన భార్య వెంబడి వెళ్లి ఆ మనుష్యునియొద్దకు వచ్చి–ఈ స్త్రీతో మాటలాడినవాడవు నీవేనా అని అతని నడుగగా అతడు–నేనే అనెను.౹

12 అందుకు మానోహ–కావున నీ మాట నెరవేరునప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపుమని మనవిచేయగా

13 యెహోవాదూత–నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేకొనవలెను; ఆమె ద్రాక్షావల్లినుండి పుట్టినదేదియు తినకూడదు,౹

14 ఆమె ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగకూడదు, అపవిత్రమైన దేనినైనను తినకూడదు, నేను ఆమె కాజ్ఞాపించినదంతయు ఆమె చేకొనవలెనని మానోహతో చెప్పెను.౹

15 అప్పుడు మానోహ–మేము ఒక మేక పిల్లను సిద్ధపరచి నీ సన్నిధిని ఉంచువరకు నీవు ఆగుమని మనవి చేసికొనుచున్నామని యెహోవాదూతతో చెప్పగా

16 యెహోవాదూత–నీవు నన్ను నిలిపినను నీ భోజనము నేను తినను; నీవు దహనబలి అర్పించ నుద్దేశించినయెడల యెహోవాకు దాని నర్పింపవలెనని మానోహతో చెప్పెను. అతడు యెహోవాదూత అని మానోహకు తెలియలేదు.౹

17 మానోహ–నీ మాటలు నెరవేరిన తరువాత మేము నిన్ను సన్మానించునట్లు నీ పేరేమని యెహోవాదూతను అడుగగా

18 యెహోవాదూత–నీ వేల నాపేరు అడుగుచున్నావు? అది చెప్పశక్యముకాని దనెను.౹

19 అంతట మానోహ నైవేద్యముగా నొక మేకపిల్లను తీసికొని యొక రాతిమీద యెహోవాకు అర్పించెను. మానోహయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత యొక ఆశ్చర్య కార్యము చేసెను.౹

20 ఎట్లనగా, జ్వాలలు బలిపీఠము మీదనుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవాదూత బలిపీఠముమీదనున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరో హణమాయెను. మానోహయు అతని భార్యయు దానిని చూచి నేలకు సాగిలపడిరి.౹

21 ఆ తరువాత యెహోవాదూత మానోహకును అతని భార్యకును మరెన్నడు ప్రత్య క్షము కాలేదు.౹

22 ఆయన యెహోవాదూత అని మానోహ తెలిసికొని–మనము దేవుని చూచితిమి గనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా

23 అతని భార్య–యెహోవా మనలను చంపగోరినయెడల ఆయన దహనబలిని నైవేద్యమును మనచేత అంగీకరింపడు, ఈ సంగతులన్నిటిని మనకు చూపింపడు, ఈ కాలమున ఇట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పెను.౹

24 తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సమ్సోను అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతని నాశీర్వదించెను.౹

25 మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎష్తాయోలుకును మధ్యనున్న మహనెదానులో అతని రేపుటకు మొదలు పెట్టెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JDG/13-2e9332a809a39243245a7c567de1c471.mp3?version_id=1787—

Categories
న్యాయాధిపతులు

న్యాయాధిపతులు 14

1 సమ్సోను తిమ్నాతునకు వెళ్లి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచెను.౹

2 అతడు తిరిగి వచ్చి–తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతెను చూచితిని, మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవలెనని తన తలిదండ్రులతో అనగా

3 వారు–నీ స్వజనుల కుమార్తెలలోనేగాని నా జనులలోనేగాని స్త్రీ లేదనుకొని, సున్నతి పొందని ఫిలిష్తీయులలోనుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్లు చున్నావా? అని అతని నడిగిరి. అందుకు సమ్సోను–ఆమె నాకిష్టమైనది గనుక ఆమెను నాకొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పెను.౹

4 అయితే ఫిలిప్తీయులకేమైన చేయుటకై యెహోవాచేత అతడు రేపబడెనన్న మాట అతని తలిదండ్రులు తెలిసికొనలేదు. ఆ కాలమున ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను ఏలుచుండిరి.

5 అప్పుడు సమ్సోను తన తలిదండ్రులతోకూడ తిమ్నాతు నకుపోయి, తిమ్నాతు ద్రాక్షతోటలవరకు వచ్చినప్పుడు, కొదమసింహము అతని యెదుటికి బొబ్బరించుచువచ్చెను.౹

6 యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతనిచేతిలో ఏమియు లేకపోయినను, ఒకడు మేకపిల్లను చీల్చునట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు.౹

7 అతడు అక్క డికి వెళ్లి ఆ స్త్రీతో మాటలాడినప్పుడు ఆమెయందు సమ్సోనుకు ఇష్టము కలిగెను.౹

8 కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసికొని వచ్చుటకు తిరిగి వెళ్లుచుండగా, ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆవైపు తిరిగినప్పుడు, సింహపుకళేబరములో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా

9 అతడు ఆ తేనె చేతనుంచుకొని తినుచు వెళ్లుచు తన తలిదండ్రులయొద్దకు వచ్చి వారికి కొంత నియ్యగా వారును తినిరి. అయితే తాను సింహపుకళేబరములోనుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియజేయలేదు.౹

10 అంతట అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సమ్సోను విందుచేసెను. అచ్చటి పెండ్లికుమారులు అట్లు చేయుట మర్యాద.౹

11 వారు అతని చూచినప్పుడు అతని యొద్ద నుండుటకు ముప్పదిమంది స్నేహితులను తోడుకొని వచ్చిరి.౹

12 అప్పుడు సమ్సోను–మీకిష్టమైనయెడల నేను మీ యెదుట ఒక విప్పుడు కథను వేసెదను; మీరు ఈ విందు జరుగు ఏడు దినములలోగా దాని భావమును నాకు తెలిపినయెడల నేను ముప్పది సన్నపు నారబట్టలను ముప్పది దుస్తులను మీ కిచ్చెదను.౹

13 మీరు దాని నాకు తెలుపలేక పోయినయెడల మీరు ముప్పది సన్నపు నారబట్టలను ముప్పది దుస్తులను నాకియ్యవలెనని వారితో చెప్పగా వారు–మేము ఒప్పుకొందుము, నీ విప్పుడు కథను వేయుమని అతనితో చెప్పిరి.౹

14 కాగా అతడు–

బలమైనదానిలోనుండి తీపి వచ్చెను,

తిను దానిలోనుండి తిండి వచ్చెను అనెను.

మూడుదినములలోగా వారు ఆ విప్పుడు కథ భావమును చెప్పలేకపోయిరి.

15 ఏడవదినమునవారు సమ్సోను భార్యతో ఇట్లనిరి–నీ పెనిమిటి ఆ విప్పుడు కథభావమును మాకు తెలుపునట్లు అతని లాలనచేయుము, లేనియెడల మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి యింటివారిని కాల్చివేసెదము; మా ఆస్తిని స్వాధీన పరచుకొనుటకే మమ్మును పిలిచితిరా? అనిరి.౹

16 కాబట్టి సమ్సోను భార్య అతని పాదములయొద్దపడి యేడ్చుచు–నీవు నన్ను ద్వేషించితివిగాని ప్రేమింపలేదు. నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసితివి, దాని నాకు తెలుప వైతివి అనగా అతడు–నేను నా తలిదండ్రులకైనను దాని తెలుపలేదు, నీకు తెలుపుదునా? అనినప్పుడు ఆమె వారి విందు దినములు ఏడింటను అతనియొద్ద ఏడ్చుచువచ్చెను.౹

17 ఏడవదినమున ఆమె అతని తొందరపెట్టినందున అతడు ఆమెకు దాని తెలియజేయగా ఆమె తన జనులకు ఆ విప్పుడు కథను తెలిపెను.౹

18 ఏడవదినమున సూర్యుడు అస్తమింపకమునుపు ఆ ఊరివారు–

తేనెకంటె తీపియైనదేది?

సింహముకంటె బలమైనదేది?

అని అతనితో అనగా అతడు–

నా దూడతో దున్నకపోయినయెడల నా విప్పుడు

కథను విప్పలేకయుందురని వారితో చెప్పెను.

19 యెహోవా ఆత్మ అతనిమీదికి మరల రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో ముప్పదిమందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పినవారికి బట్టలనిచ్చెను.౹

20 అతడు కోపించి తన తండ్రి యింటికి వెళ్లగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకొనిన అతని చెలికాని కియ్యబడెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JDG/14-a1f4bf6bb926ac6ef0482d7ce1ed3c0d.mp3?version_id=1787—

Categories
న్యాయాధిపతులు

న్యాయాధిపతులు 15

1 కొన్నిదినములైన తరువాత గోధుమల కోతకాలమున సమ్సోను మేకపిల్ల ఒకటి తీసికొని తన భార్యను చూడ వచ్చి–అంతఃపురములోనున్న నా భార్యయొద్దకు నేను పోదుననుకొనగా

2 ఆమె తండ్రి లోపలికి అతని వెళ్ల నియ్యక–నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించితివనుకొని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చితిని; ఆమె చెల్లెలు ఆమెకంటె చక్కనిదికాదా? ఆమెకు ప్రతిగా ఈమె నీకుండవచ్చును చిత్తగించుమనెను.౹

3 అప్పుడు సమ్సోను–నేను ఫిలిష్తీయులకు హానిచేసినయెడల వారి విషయములో నేనిప్పుడు నిరపరాధినైయుందునని వారితో చెప్పి

4 పోయి మూడు వందల నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి తోకతట్టు తోకను త్రిప్పి రెండేసి తోకలమధ్యను ఒక్కొక్క దివిటీ కట్టి

5 ఆ దివిటీలో అగ్ని మండచేసి ఫిలిష్తీయుల గోధుమ చేలలోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను పైరును ద్రాక్షతోటలను ఒలీవతోటలను తగులబెట్టెను.౹

6 ఫిలిష్తీయులు–ఇది ఎవడు చేసినదని చెప్పుకొనుచు, తిమ్నా యుని అల్లుడైన సమ్సోను భార్యను ఆమె తండ్రి తీసికొని అతని స్నేహితుని కిచ్చెను గనుక అతడే చేసియుండెనని చెప్పిరి. కాబట్టి ఫిలిష్తీయులు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చిరి.౹

7 అప్పుడు సమ్సోను–మీరు ఈలాగున చేసినయెడల నేను మీమీద పగతీర్చుకొనిన తరువాతనే చాలించెదనని చెప్పి

8 తొడలతో తుంట్లను విరుగగొట్టి వారిని బహుగా హతము చేసెను. అటుపిమ్మట వెళ్లి ఏతాము బండసందులో నివసించెను.

9 అప్పుడు ఫిలిష్తీయులు బయలుదేరి యూదాదేశములో దిగి చెదరి, లేహీలో దోపిడికొరకై దండు కూర్చిరి.౹

10 యూదావారు–మీరేల మా మీదికి వచ్చితిరని అడుగగా ఫిలిష్తీయులు–సమ్సోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవలెనని అతని కట్టుటకే వచ్చితిమనిరి.౹

11 అందుకు యూదా జనులలో మూడువేలమంది ఏతాములోని బండ యొద్దకు పోయి సమ్సోనును చూచి–ఫిలిష్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా? నీవు మాకేమి చేసితివని చెప్పగా అతడు–వారు నాకెట్లు చేసిరో అట్లే నేను వారికి చేసితిననెను.౹

12 అందుకు వారు–మేము ఫిలిష్తీయుల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చితిమని అతనితో అనగా సమ్సోను–మీరు నామీద పడకుండునట్లు నాతో ప్రమాణము చేయుడనెను.౹

13 అందుకు వారు–ఆలాగు కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపముగాని నిన్ను గట్టిగా కట్టి వారిచేతికి మేము అప్పగించెదమని చెప్పి రెండు క్రొత్త తాళ్లచేత అతని కట్టి ఆ బండయొద్దనుండి అతని తీసికొనివచ్చిరి.౹

14 అతడు లేహీకి వచ్చువరకు ఫిలిష్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా, యెహోవా ఆత్మ అతనిమీదికి బలముగా వచ్చినందున అతనిచేతులకు కట్టబడిన తాళ్లు అగ్నిచేత కాల్చబడిన జనుపనారవలె నాయెను; సంకెళ్లును అతనిచేతులమీదనుండి విడిపోయెను.౹

15 అతడు గాడిదయొక్క పచ్చి దవడ యెముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దానిచేత వెయ్యిమంది మనుష్యులను చంపెను.౹

16 అప్పుడు సమ్సోను

గాడిద దవడ యెముకతో ఒక కుప్పను

రెండు కుప్పలను నేను చంపియున్నాను

గాడిద దవడ యెముకతో వెయ్యిమంది నరులను

చంపియున్నాను అనెను.

17 అతడు చెప్పుట చాలించిన తరువాత ఆ దవడ యెము కను చేతినుండి పారవేసి ఆ చోటికి రామత్లెహీఅను పేరు పెట్టెను.౹

18 అప్పుడతడు మిక్కిలి దప్పిగొనినందున యెహోవాకు మొఱ్ఱపెట్టి–నీవు నీ సేవకునిచేతివలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి, సున్నతి పొందనివారి చేతిలోనికి పడవలెనా? అని వేడుకొనగా

19 దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను, దానినుండి నీళ్లు బయలుదేరెను. అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రదికెను. కాబట్టి దానిపేరు నేటివరకు ఏన్హక్కోరెఅనబడెను; అది లేహీలో నున్నది.౹

20 అతడు ఫిలిష్తీయుల దినములలో ఇరువదియేండ్లు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతియైయుండెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JDG/15-5b7a08aaec309da8612d4216175c2965.mp3?version_id=1787—

Categories
న్యాయాధిపతులు

న్యాయాధిపతులు 16

1 తరువాత సమ్సోను గాజాకు వెళ్లి వేశ్య నొకతెను చూచి ఆమెయొద్ద చేరెను.౹

2 సమ్సోను అక్కడికి వచ్చెనని గాజావారికి తెలిసినప్పుడు వారు మాటుపెట్టి–రేపు తెల్లవారిన తరువాత అతని చంపుదమనుకొని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రి అంతయు పొంచియుండిరి.౹

3 సమ్సోను మధ్యరాత్రివరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి రెండు ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకఱ్ఱతోటి వాటిని ఊడబెరికి తన భుజములమీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండకొనకు వాటిని తీసికొనిపోయెను.

4 పిమ్మట అతడు శోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా

5 ఫిలిష్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో–నీవు అతని లాలనచేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో, మేమేలాగు అతని గెలువ వచ్చునో తెలిసికొనుము; మేము అతని బంధించి అతని గర్వము అణుపుదుము, అప్పుడు మాలో ప్రతివాడును వెయ్యిన్నినూరు వెండి నాణెములను నీకిచ్చెదమని చెప్పిరి.౹

6 కాబట్టి దెలీలా–నీ మహాబలము దేనిలోనున్నదో నిన్ను దేనిచేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపు మని సమ్సోనుతో ననగా

7 సమ్సోను–ఏడు నిరవంజి చువ్వలతో నన్ను బంధించినయెడల నేను బలహీనుడనై సామాన్య మనుష్యులలో ఒకనివలె అవుదునని ఆమెతో చెప్పెను.౹

8 ఫిలిష్తీయుల సర్దారులు ఏడు నిరవంజి చువ్వలను ఆమెయొద్దకు తీసికొని రాగా ఆమె వాటితో అతని బంధించెను.౹

9 మాటుననుండువారు ఆమెతో అంతఃపురములో దిగియుండిరి గనుక ఆమె–సమ్సోనూ, ఫిలిష్తీయులు నీమీద పడుచున్నారని అతనితో అనగా, అతడు అగ్నితగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపెను గనుక అతని బలము తెలియబడలేదు.౹

10 అప్పుడు దెలీలా–ఇదిగో నీవు నన్ను ఎగతాళిచేసి నాతో అబద్ధమాడితివి, నిన్ను దేనిచేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపుమని సమ్సోనుతో చెప్పగా

11 అతడు–పేనిన తరువాత పనికి పెట్టని క్రొత్తతాళ్లతో నన్ను బాగుగా బంధించినయెడల నేను బలహీనుడనై సామాన్య మనుష్యులలో ఒకనివలె అవుదునని ఆమెతో చెప్పెను

12 అంతట దెలీలా పేనబడిన క్రొత్త తాళ్లను తీసికొని వాటితో అతని బంధించి– సమ్సోనూ, ఫిలిష్తీయులు నీమీద పడుచున్నారని అతనితో అనెను. అప్పుడు మాటున నుండువారు అంతఃపురములోనుండిరి. అతడు తన చేతులమీదనుండి నూలుపోగునువలె ఆ తాళ్లు తెంపెను.౹

13 అప్పుడు దెలీలా–ఇదివరకు నీవు నన్ను ఎగతాళిచేసి నాతో అబద్ధములాడితివి, నిన్ను దేని వలన బంధింపవచ్చునో నాకు తెలుపుమని సమ్సోనుతో చెప్పగా అతడు–నీవు నా తల జడలు ఏడును అల్లిక అల్లినయెడల సరి అని ఆమెతో చెప్పెను.౹

14 అంతట ఆమె మేకుతో దాని దిగగొట్టి–సమ్సోనూ, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతడు నిద్రమేలుకొని మగ్గపు మేకును నేతను ఊడదీసికొని పోయెను.౹

15 అప్పుడు ఆమె–నాయందు నీకిష్టము లేనప్పుడు –నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పు చున్నావు? ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళిచేసి నీ గొప్పబలము దేనిలోనున్నదో నాకు తెలుపక పోతివని అతనితో అనెను.౹

16 ఆమె అనుదినమును మాటలచేత అతని బాధించి తొందరపెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను.౹

17 అప్పుడతడు తన అభిప్రాయమంతయు ఆమెకు తెలియజేసి–నేను నా తల్లిగర్భమునుండి పుట్టి నది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడినవాడనై యున్నాను, నా తలమీదికి మంగలకత్తి రాలేదు, నాకు క్షౌరముచేసినయెడల నా బలము నాలోనుండి తొలగి పోయి యితర మనుష్యులవలె అవుదునని ఆమెతో అనెను.౹

18 అతడు తన అభిప్రాయమును తనకు తెలిపెనని దెలీలా యెరిగి, ఆమె వర్తమానము పంపి ఫిలిష్తీయుల సర్దారులను పిలిపించి–యీసారికి రండి; ఇతడు తన అభిప్రాయమంతయు నాకు తెలిపెననెను. ఫిలిష్తీయుల సర్దారులు రూపాయిలను చేతపట్టుకొని ఆమెయొద్దకు రాగా

19 ఆమె తన తొడమీద అతని నిద్రబుచ్చి, ఒక మనుష్యుని పిలిపించి వానిచేత అతని తలమీదియేడు జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలు పెట్టెను. అప్పుడు అతనిలోనుండి బలము తొలగిపోయెను.౹

20 ఆమె–సమ్సోనూ, ఫిలిష్తీయులు నీమీద పడుచున్నారనగా అతడు నిద్రమేలుకొని–యెప్పటియట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు.౹

21 అప్పుడు ఫిలిష్తీయులు అతని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతని తీసికొని వచ్చి యిత్తడి సంకెళ్లచేత అతని బంధించిరి.౹

22 అతడు బందీగృహములో తిరగలి విసరువాడాయెను. అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తలవెండ్రుకలుతిరిగి మొలుచుటకు మొదలు పెట్టెను.

23 ఫిలిష్తీయుల సర్దారులు–మన దేవత మన శత్రువైన సమ్సోనును మనచేతికి అప్పగించియున్నదని చెప్పుకొని, తమ దేవతయైన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడుకొనిరి.౹

24 జనులు సమ్సో నును చూచినప్పుడు–మన దేశమును పాడుచేసినవాడును మనలో అనేకులను చంపినవాడునైన మన శత్రువుని మన దేవత మన చేతి కప్పగించియున్నదని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి.౹

25 వారి హృదయములు సంతోషముతో నిండియుండగా వారు–మనము పరిహాసము చేయుటకు సమ్సోనును పిలిపించుదము రండని సమ్సోనును బందీ గృహమునుండి పిలువనంపిరి. వారు అతని చూచి గుడి స్తంభములమధ్యను అతని నిలువబెట్టి పరిహాసముచేయగా

26 సమ్సోను తనచేతిని పట్టుకొనిన బంటుతో ఇట్లనెను–ఈ గుడికి ఆధారముగానున్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువుము, నేను వాటిమీద ఆనుకొందును.౹

27 ఆ గుడి స్త్రీ పురుషులతో నిండియుండెను, ఫిలిష్తీయుల సర్దారులందరు అక్కడ నుండిరి, వారు సమ్సోనును ఎగతాళిచేయగా గుడి కప్పుమీద స్త్రీ పురుషులు రమారమి మూడు వేలమంది చూచుచుండిరి.౹

28 అప్పుడు సమ్సోను –యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసికొనుము, దేవా దయచేసి యీసారి మాత్రమే నన్ను బల పరచుము, నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగతీర్చుకొననిమ్మని యెహోవాకు మొఱ్ఱపెట్టి

29 ఆ గుడికి ఆధారముగానున్న రెండు మధ్య స్తంభములలో ఒకదానిని కుడిచేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని

30 నేనును ఫిలిష్తీయులును చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారులమీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపినవారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపినవారి లెక్కకంటె ఎక్కువాయెను.౹

31 అప్పుడు అతని స్వదేశజనులును అతని తండ్రి యింటివారందరును కూడి అతనిని మోసికొనివచ్చి జొర్యాకును ఎష్తాయోలుకును మధ్యనున్న అతని తండ్రియైన మానోహ సమాధిలో అతని పాతిపెట్టిరి. అతడు ఇరువది సంవత్సరములు ఇశ్రాయేలీయులకు అధిపతిగానుండెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JDG/16-9b86c77ffd16b373194216943d8289ed.mp3?version_id=1787—

Categories
న్యాయాధిపతులు

న్యాయాధిపతులు 17

1 మీకా అను నొకడు ఎఫ్రాయిమీయుల మన్యదేశ .ములో నుండెను.౹

2 అతడు తన తల్లిని చూచి–నీ యొద్ద నుండి తీసికొనినరూకలు, అనగా నీవు ప్రమాణముచేసి నా వినికిడిలో మాటలాడిన ఆ వెయ్యిన్నినూరు వెండి రూకలు నా యొద్దనున్నవి. ఇదిగో నేను వాటిని తీసి కొంటినని ఆమెతో చెప్పగా అతని తల్లి–నా కుమారుడు యెహోవాచేత ఆశీర్వదింపబడును గాక అనెను.౹

3 అతడు ఆ వెయ్యిన్నినూరు రూకలను తన తల్లికి మరల నియ్యగా ఆమె–పోతవిగ్రహము చేయించుటకై నా కుమారునిచేత తీసికొనిన యీ రూకలను నేను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, నీకు మరల అది యిచ్చెదననెను.౹

4 అతడు ఆ రూకలను తన తల్లికియ్యగా ఆమె వాటిలో రెండువందలు పట్టుకొని కంసాలికప్పగించెను. అతడు వాటితో చెక్క బడిన ప్రతిమాస్వరూపమైన పోతవిగ్రహమునుచేయగా అది మీకా యింట ఉంచబడెను.౹

5 మీకా అను ఆ మనుష్యునికి దేవమందిర మొకటి యుండెను. మరియు అతడు ఏఫోదును గృహదేవతలను చేయించి తన కుమారులలో ఒకని ప్రతిష్ఠింపగా ఇతడు అతనికి యాజకుడాయెను.౹

6 ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజులేడు; ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను.

7 యూదా బేత్లెహేములోనుండి వచ్చిన యూదా వంశస్థుడైన ఒక యౌవనుడుండెను. అతడు లేవీయుడు, అతడు అక్కడ నివసించెను.౹

8 ఆ మనుష్యుడు తనకు స్థలము దొరికిన చోట నివసింపవలెనని యూదా బేత్లెహేము నుండి బయలుదేరి ప్రయాణము చేయుచు ఎఫ్రాయిమీయుల మన్యదేశముననున్న మీకా యింటికి వచ్చెను.౹

9 మీకా–నీవు ఎక్కడనుండి వచ్చితివని అతని నడుగగా అతడు–నేను యూదా బేత్లెహేమునుండి వచ్చిన లేవీయుడను, నాకు దొరుకగల చోట నివసించుటకు పోవు చున్నానని అతనితో అనెను.౹

10 మీకా–నా యొద్ద నివసించి నాకు తండ్రివిగాను యాజకుడవుగాను ఉండుము; నేను సంవత్సరమునకు నీకు పది వెండి రూకలును ఒక దుస్తు బట్టలును ఆహారమును ఇచ్చెదనని చెప్పగా ఆ లేవీ యుడు ఒప్పుకొని

11 ఆ మనుష్యునియొద్ద నివసించుటకు సమ్మతించెను. ఆ యౌవనుడు అతని కుమారులలో ఒకని వలె నుండెను.౹

12 మీకా ఆ లేవీయుని ప్రతిష్ఠింపగా అతడు మీకాకు యాజకుడై అతని యింట నుండెను.౹

13 అంతట మీకా–లేవీయుడు నాకు యాజకుడైనందున యెహోవా నాకు మేలుచేయునని యిప్పుడు నాకు తెలియును అనెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JDG/17-b0faee6083b0dffa2ebd466b12ef0ebc.mp3?version_id=1787—

Categories
న్యాయాధిపతులు

న్యాయాధిపతులు 18

1 ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. మరియు ఇశ్రాయేలీయుల గోత్రములలో ఆ దినమువరకు దానీయులు స్వాస్థ్యము పొంది యుండలేదు గనుక ఆ కాలమున తాము నివసించుటకు తమకు స్వాస్థ్యము వెదకు కొనుటకై వారు బయలుదేరియుండిరి.౹

2 ఆ దేశసంచారము చేసి దానిని పరిశోధించుటకై దానీయులు తమ వంశస్థులందరిలోనుండి పరాక్రమవంతులైన అయిదుగురు మనుష్యులను జొర్యానుండియు ఎష్తాయోలునుండియు పంపి –మీరు వెళ్లి దేశమును పరిశోధించుడని వారితో చెప్పగా

3 వారు ఎఫ్రాయిమీయుల మన్యముననున్న మీకా యింటికి వచ్చి అక్కడ దిగిరి. వారు మీకా యింటియొద్ద నున్నప్పుడు, లేవీయుడైన ఆ యౌవనుని స్వరమును పోల్చి ఆ వైపునకు తిరిగి అతనితో ఎవడు నిన్ను ఇక్కడికి రప్పించెను? ఈ చోటున నీవేమి చేయుచున్నావు? ఇక్కడ నీకేమి కలిగియున్నదని యడుగగా

4 అతడు మీకా తనకు చేసిన విధముచెప్పి–మీకా నాకు జీతమిచ్చుచున్నాడు, నేను అతనికి యాజకుడనై యున్నానని వారితో చెప్పెను.౹

5 అప్పుడు వారు–మేము చేయబోవుపని శుభమగునో కాదో మేము తెలిసికొనునట్లు దయచేసి దేవునియొద్ద విచారించుమని అతనితో అనగా

6 ఆయాజకుడు క్షేమముగా వెళ్లుడి, మీరు చేయబోవుపని యెహోవా దృష్టికి అనుకూలమని వారితో చెప్పెను.

7 కాబట్టి ఆ అయిదుగురు మనుష్యులు వెళ్లి లాయిషునకు వచ్చి, దానిలోని జనము సీదోనీయులవలె సుఖముగాను నిర్భయముగాను నివసించుటయు, అధికారబలముపొందిన వాడెవడును లేకపోవుటయు, ఏమాత్రమైనను అవమానపరచగలవాడెవడును ఆ దేశములో లేకపోవుటయు, వారు సీదోనీయులకు దూరస్థులై యే మనుష్యులతోను సాంగత్యములేకుండుటయు చూచిరి.౹

8 వారు జొర్యాలోను ఎష్తాయోలులోనుఉండు తమ స్వజనులయొద్దకు రాగా వారు–మీ తాత్పర్యమేమిటని యడిగిరి.౹

9 అందుకు వారు–లెండి, వారిమీద పడుదము, ఆ దేశమును మేము చూచితిమి, అది బహు మంచిది, మీరు ఊరకనున్నా రేమి? ఆలస్యము చేయక బయలుదేరి ప్రవేశించి ఆ దేశమును స్వాధీనపరచుకొనుడి.౹

10 జనులు నిర్భయముగా నున్నారు గనుక మీరు పోయి వారిమీద పడవచ్చును. ఆ దేశము నలుదిక్కుల విశాలమైనది, దేవుడు మీ చేతికి దాని నప్పగించును, భూమిలోనున్న పదార్థములలో ఏదియు అచ్చట కొదువలేదనిరి.

11 అప్పుడు జొర్యాలోను ఎష్తాయోలులోను ఉన్న దానీయులైన ఆరువందలమంది యుద్ధాయుధములు కట్టుకొని అక్కడనుండి బయలుదేరి యూదా దేశమందలి కిర్యత్యారీములో దిగిరి.౹

12 అందుచేతను నేటివరకు ఆ స్థలమునకు దానీయులదండని పేరు. అది కిర్యత్యారీమునకు పడమట నున్నది.౹

13 అక్కడనుండి వారు ఎఫ్రాయిమీయుల మన్యప్రదేశమునకు పోయి మీకా యింటికి వచ్చిరి.౹

14 కాబట్టి లాయిషుదేశమును సంచరించుటకు పోయిన ఆ అయిదుగురు మనుష్యులు తమ సహోదరులను చూచి–ఈ యిండ్లలో ఏఫోదును గృహదేవతలును చెక్క బడిన ప్రతిమయు పోతవిగ్రహమును ఉన్నవని మీరెరుగుదురా? మీరేమి చేయవలెనో దాని యోచన చేయుడనగా

15 వారు ఆతట్టు తిరిగి లేవీయుడైన ఆ యౌవనుడున్న మీకా యింటికి వచ్చి అతని కుశలప్రశ్నలడిగిరి.౹

16 దానీయులైన ఆ ఆరువందలమంది తమ యుద్ధాయుధములను కట్టుకొని

17 గవినివాకిట నిలుచుండగా, దేశమును సంచరించుటకు పోయిన ఆ అయిదుగురు మనుష్యులు లోపలచొచ్చి ఆ ప్రతిమను ఏఫోదును గృహదేవతలను పోతవిగ్రహమును పట్టుకొనిరి. అప్పుడు ఆయాజకుడు యుద్ధాయుధములు కట్టుకొనిన ఆ ఆరువందలమంది మనుష్యులతోకూడ గవిని యెదుట వాకిట నిలిచియుండెను.౹

18 వీరు మీకా యింటికిపోయి చెక్కబడిన ప్రతిమను ఏఫోదును గృహదేవతలను పోతవిగ్రహమును పట్టుకొనినప్పుడు ఆయాజకుడు–మీరేమి చేయుచున్నారని వారినడుగగా

19 వారు–నీవు ఊరకుండుము, నీ చెయ్యి నీ నోటి మీద ఉంచుకొని మాతోకూడ వచ్చి మాకు తండ్రివిగాను యాజకుడవుగాను ఉండుము, ఒకని యింటివారికే యాజకుడవై యుండుట నీకు మంచిదా, ఇశ్రాయేలీయులలో ఒక గోత్రమునకును కుటుంబమునకును యాజకుడవైయుం డుట మంచిదా? అని యడిగిరి.౹

20 అప్పుడు ఆయాజకుడు హృదయమున సంతోషించి ఆ ఏఫోదును గృహదేవతలను చెక్కబడిన ప్రతిమను పట్టుకొని ఆ జనులమధ్య చేరెను.౹

21 అట్లువారు తిరిగి చిన్నపిల్లలను పశువులను సామగ్రిని తమకు ముందుగా నడిపించుకొనిపోయిరి.౹

22 వారు మీకా యింటికి దూరమైనప్పుడు, మీకా పొరుగిండ్లవారు పోగై దానీయులను వెంటాడి కలిసికొని వారిని పిలువగా

23 వారు తమ ముఖములను త్రిప్పుకొని–నీకేమి కావలెను? ఇట్లు గుంపుకూడనేల? అని మీకాను అడిగిరి.౹

24 అందుకతడు–నేను చేయించిన నా దేవతలను నేను ప్రతిష్ఠించిన యాజకుని మీరు పట్టుకొని పోవుచున్నారే, యిక నా యొద్ద ఏమియున్నది? నీకేమి కావలెననుచున్నారే, అదే మన్నమాట అనగా

25 దానీయులు–నీ స్వరము మాలో నెవనికిని వినబడనీయకుము, వారు ఆగ్రహపడి నీమీద పడుదురేమో, అప్పుడు నీవు నీ ప్రాణమును నీ యింటివారి ప్రాణమును పోగొట్టుకొందువని అతనితో చెప్పి

26 తమ త్రోవను వెళ్లిరి. వారు తనకంటె బలవంతులని మీకా గ్రహించినవాడై తిరిగి తన యింటికి వెళ్లిపోయెను.౹

27 మీకా చేసికొనినదానిని, అతని యొద్దనున్న యాజకునిని వారు పట్టుకొని, సుఖముగాను నిర్భయముగాను ఉన్న లాయిషు వారి మీదికి వచ్చి కత్తివాత వారిని హతముచేసి అగ్నిచేత ఆ పట్టణమును కాల్చివేసిరి.౹

28 అది సీదోనుకు దూరమై నందునను, వారికి అన్యులతో సాంగత్యమేమియు లేనందునను వారిలో ఎవడును తప్పించుకొనలేదు. అది బేత్రెహోబునకు సమీపమైన లోయలోనున్నది.౹

29 వారొక పట్టణమును కట్టుకొని అక్కడ నివసించిరి. ఇశ్రాయేలుకు పుట్టిన తమ తండ్రియైన దానునుబట్టి ఆ పట్టణమునకు దాను అను పేరు పెట్టిరి. పూర్వము ఆ పట్టణమునకు లాయిషు అను పేరు.౹

30 దానీయులు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకొనిరి. మోషే మనుమడును గెర్షోను కుమారుడునైన యోనాతాననువాడును వాని కుమారులును ఆ దేశము చెరపట్టబడువరకు దానీయుల గోత్రమునకు యాజకులై యుండిరి.౹

31 దేవుని మందిరము షిలోహులోనున్న దినములన్నిటను వారు మీకా చేయించిన ప్రతిమను నిలుపుకొనియుండిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JDG/18-2b981f0a8436187f6ea573282ba2f5cb.mp3?version_id=1787—

Categories
న్యాయాధిపతులు

న్యాయాధిపతులు 19

1 ఇశ్రాయేలీయులకు రాజులేని దినములలో లేవీయుడైన యొకడు ఎఫ్రాయిమీయుల మన్యపు ఉత్తరభాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యూదా బేత్లెహేములోనుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా

2 అతని ఉపపత్ని అతనిని విడిచి ఒకనితో వ్యభిచరించి యూదా బేత్లెహేములోని తన తండ్రి యింటికి పోయి అక్కడ నాలుగు నెలలుండెను.౹

3 ఆమెతో ప్రియముగా మాటలాడి ఆమెను తిరిగి తెచ్చుకొనుటకై ఆమె పెనిమిటి లేచి తన దాసునిని రెండు గాడిదలను తీసికొని ఆమెయొద్దకు వెళ్లగా ఆమె తన తండ్రి యింట అతని చేర్చెను. ఆ చిన్నదాని తండ్రి అతని చూచినప్పుడు అతని కలిసికొని సంతోషించెను.౹

4 ఆ చిన్నదాని తండ్రియగు అతని మామ వెళ్లనియ్యనందున అతడు మూడుదినములు అతనియొద్ద నుండెను గనుక వారు అన్నపానములు పుచ్చుకొనుచు అక్కడ నిలిచిరి.౹

5 నాలుగవ నాడు వారు వేకువను వెళ్లుటకు నిద్రమేలుకొనగా అతడు లేవసాగెను. అయితే ఆ చిన్నదాని తండ్రి–నీవు కొంచెము ఆహారము పుచ్చుకొని తెప్పరిల్లిన తరువాత నీ త్రోవను వెళ్లవచ్చునని

6 తన అల్లునితో అనగా, వారిద్దరు కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనిరి. తరువాత ఆ చిన్నదాని తండ్రి–దయచేసి యీ రాత్రి అంతయు ఉండి సంతోషపడుము, నీ హృదయమును సంతోషపరచుకొనుము అని ఆ మనుష్యునితో చెప్పి

7 అతడు వెళ్లుటకు లేచినప్పుడు అతని మామ బలవంతముచేయగా అతడు ఆ రాత్రి అక్కడ నుండెను.౹

8 అయిదవదినమున అతడు వెళ్లవలెనని ఉదయమున లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి–నీవు నీ ప్రాణము బలపరచుకొనుమని చెప్పినందునవారు ప్రొద్దు వ్రాలువరకు తడవుచేసి యిద్దరు కూడి భోజనముచేసిరి.౹

9 ఆ మనుష్యుడు తానును అతని ఉపపత్నియు అతని దాసుడును వెళ్ల లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రియగు అతని మామ–ఇదిగో ప్రొద్దు గ్రుంకుటకు సమీపమాయెను, నీవు దయచేసి యీ రాత్రి యిక్కడ ఉండుము, ఇదిగో ప్రొద్దు గ్రుంకుచున్నది, సంతోషించి యిక్కడ రాత్రి గడు పుము, రేపు నీ గుడారమునకు వెళ్లుటకు నీవు వేకువనే లేచి నీ త్రోవను పోవచ్చునని అతనితో చెప్పినను

10 అతడు అక్కడ ఆ రాత్రి గడప నొల్లక లేచి వెళ్లి, యెబూసను యెరూషలేము ఎదుటికి వచ్చెను. అప్పుడు జీను కట్టబడిన రెండు గాడిదలును

11 అతని ఉపపత్నియు అతనితోకూడ ఉండెను. వారు యెబూసునకు సమీపించినప్పుడు ప్రొద్దు చాలా వ్రాలెను గనుక అతని దాసుడు–మనము యెబూసీయులదైన యీ పట్టణము ప్రవేశించి దానిలో ఈ రాత్రి బసచేయుదము రండని తన యజమానునితో చెప్పగా

12 అతని యజమానుడు–ఇశ్రాయేలీయులు కాని అన్యుని పట్టణము ప్రవేశింపము. గిబియావరకు ప్రయాణము చేయుదమనెను.౹

13 మరియు అతడు–నీవు రమ్ము, ఈ స్థలములలో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనేగాని రామాలోనేగాని యీ రాత్రి బస చేసెదమనెను.౹

14 అప్పుడు వారు సాగి వెళ్లుచుండగా బెన్యామీనీయుల గిబియా దగ్గర నున్నప్పుడు ప్రొద్దు గ్రుంకెను.౹

15 కావునవారు గిబియాలో ఆ రాత్రి గడపుటకు అక్కడికి చేర సాగిరి; అతడు చేరి ఆ ఊరి సంత వీధిలో నుండెను, బస చేయుట కెవడును వారిని తన యింటికి పిలువలేదు.౹

16 ఆ చోటి మనుష్యులు బెన్యామీనీయులు. సాయంకాలమున ఒక ముసలివాడు పొలములోని తన పనినుండి వచ్చెను. అతడు ఎఫ్రాయిమీయుల మన్య ప్రదేశము నుండి వచ్చి గిబియాలో నివసించువాడు.౹

17 అతడు కన్నులెత్తి ఊరి సంత వీధిలో ప్రయాణస్థుడైన ఆ మనుష్యుని చూచి–నీ వెక్కడికి వెళ్లుచున్నావు? నీ వెక్కడనుండి వచ్చితివి? అని అడిగెను.౹

18 అందుకతడు–మేము యూదా బేత్లెహేమునుండి ఎఫ్రాయిమీయుల మన్యము అవతలకు వెళ్లుచున్నాము. నేను అక్కడివాడను; నేను యూదా బేత్లెహేమునకు పోయియుంటిని, ఇప్పుడు యెహోవా మందిరమునకు వెళ్లుచున్నాను, ఎవడును తన యింట నన్ను చేర్చుకొనలేదు.౹

19 అయితే మా గాడిదలకు గడ్డి మొదలైన మేతయు నాకును నా పనికత్తెకును నీ దాసులతోకూడ నున్న నా నౌకరులకును ఆహారమును ద్రాక్షారసమును ఉన్నవి, ఏదియు తక్కువ లేదని అతనితో చెప్పగా

20 ఆ ముసలివాడు–నీకు క్షేమమగునుగాక, నీకేవైన తక్కువైనయెడల వాటిభారము నామీద ఉంచుము.౹

21 మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి, తన యింట అతని చేర్చుకొని వారి గాడిదలకొరకు మేత సిద్ధపరచెను. అప్పుడు వారు కాళ్లు కడుగుకొని అన్నపానములు పుచ్చుకొనిరి.౹

22 వారు సంతోషించుచుండగా ఆ ఊరివారిలో కొందరు పోకిరులు ఆ యిల్లు చుట్టుకొని తలుపుకొట్టి–నీ యింటికి వచ్చిన మనుష్యుని మేము ఎరుగునట్లు అతని బయటికి తెమ్మని యింటి యజమానుడైన ఆ ముసలివానితో అనగా

23 యింటి యజమానుడైన ఆ మనుష్యుడు వారి యొద్దకు బయలు వెళ్లి–నా సహోదరులారా, అదికూడదు, అట్టి దుష్కార్యము చేయకూడదు, ఈ మనుష్యుడు నా యింటికి వచ్చెను గనుక మీరు ఈ వెఱ్ఱిపని చేయకుడి.౹

24 ఇదిగో కన్యకయైన నా కుమార్తెయును ఆ మనుష్యుని ఉపపత్నియు నున్నారు. నేను వారిని బయటికి తీసికొని వచ్చెదను, మీరు వారిని నీచపరచి మీ యిష్టప్రకారముగా వారియెడల జరిగింపవచ్చునుగాని యీ మనుష్యునియెడల ఈ వెఱ్ఱిపని చేయకుడని వారితో చెప్పెనుగాని

25 అతని మాట వినుటకు వారికి మనస్సు లేకపోయెను గనుక ఆ మనుష్యుడు బయట నున్నవారియొద్దకు తన ఉపపత్నిని తీసికొనిపోగా వారు ఆమెను కూడి ఉదయమువరకు ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపుచుండిరి. తెల్లవారగా వారు ఆమెను విడిచి వెళ్లిరి.౹

26 ప్రాతఃకాలమున ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చువరకు తన యజమానుడున్న ఆ మనుష్యుని యింటిద్వారమున పడియుండెను.౹

27 ఉదయమున ఆమె యజమానుడు లేచి యింటి తలుపులను తీసి తన త్రోవను వెళ్లుటకు బయలుదేరగా అతని ఉపపత్నియైన ఆ స్త్రీ యింటిద్వారమునొద్దపడి చేతులు గడపమీద చాపి యుండెను.౹

28 అతడు–లెమ్ము వెళ్లుదమనగా ఆమె ప్రత్యుత్తరమియ్యకుండెను గనుక అతడు గాడిదమీద ఆమెను ఉంచి లేచి తనచోటికి ప్రయాణము చేయ సాగెను.౹

29 అతడు తన యింటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకొని తన ఉపపత్నిని తీసికొని, ఆమెను ఆమె కీళ్ల ప్రకారము పండ్రెండు ముక్కలుగా కోసి, ఇశ్రాయేలీయుల దిక్కులన్నిటికి ఆ ముక్కలను పంపెను.౹

30 అప్పుడు దాని చూచినవారందరు, ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశములోనుండి వచ్చిన దినము మొదలుకొని నేటివరకు ఈలాటిపని జరుగుటయైనను వినబడుటయైనను లేదు; మీరు ఇది మన స్సుకు తెచ్చుకొని దీనినిబట్టి ఆలోచనచేసి దీనినిగూర్చి మాటలాడుడని ఒకరితో నొకరు చెప్పుకొనిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JDG/19-07094a1a975cad2bfa13b49a3c87d577.mp3?version_id=1787—