Categories
యెహోషువ

యెహోషువ 24

1 యెహోషువ ఇశ్రాయేలీయుల గోత్రముల వారినందరిని షెకెములో పోగుచేసి, వారి పెద్దలను వారి ప్రధానులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి.౹

2 యెహోషువ జనులందరితో ఇట్లనెను–ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా చెప్పునదేమనగా–ఆదికాలమునుండి మీపితరులు, అనగా అబ్రాహాముకును నాహోరుకును తండ్రియైన తెరహు కుటుంబికులు నది (యూఫ్రటీసు) అద్దరిని నివసించి యితర దేవతలను పూజించిరి.౹

3 అయితే నేను నది అద్దరినుండి మీపితరుడైన అబ్రాహామును తోడుకొని వచ్చి కనాను దేశమందంతట సంచరింపజేసి, అతనికి సంతానమును విస్తరింపజేసి, అతనికి ఇస్సాకును ఇచ్చితిని.౹

4 ఇస్సాకునకు నేను యాకోబు ఏశావుల నిచ్చితిని. శేయీరు మన్యములను స్వాధీనపరచుకొనునట్లు వాటిని ఏశావు కిచ్చితిని. యాకోబును అతని కుమారులును ఐగుప్తులోనికి దిగిపోయిరి.౹

5 తరువాత నేను మోషే అహరోనులను పంపి, దానిమధ్యను నేను చేసిన క్రియలవలన ఐగుప్తీయులను హతముచేసి మిమ్మును వెలుపలికి రప్పించితిని.౹

6 నేను ఐగుప్తులోనుండి మీ తండ్రులను రప్పించినప్పుడు మీరు సముద్రమునొద్దకు రాగా ఐగుప్తీయులు రథములతోను రౌతులతోను మీ తండ్రులను ఎఱ్ఱసముద్రమువరకు తరిమిరి.౹

7 వారు యెహోవాకు మొఱ్ఱపెట్టినప్పుడు ఆయన మీకును ఐగుప్తీయులకును మధ్య చీకటి కల్పించి సముద్రమును వారిమీదికి రప్పించి వారిని ముంచివేసెను. ఐగుప్తు దేశములో నేను చేసినదానిని మీరు కన్నులార చూచితిరి. అటుతరువాత మీరు బహు దినములు అరణ్యములో నివసించితిరి.౹

8 యొర్దాను అద్దరిని నివసించిన అమోరీయుల దేశమునకు నేను మిమ్మును రప్పించినప్పుడు వారు మీతో యుద్ధముచేయగా నేను మీ చేతికి వారిని అప్పగించితిని, మీరు వారి దేశమును స్వాధీనపరచుకొంటిరి, వారు మీ యెదుట నిలువకుండ వారిని నశింపజేసితిని.౹

9 తరువాత మోయాబు రాజును సిప్పోరు కుమారుడునైన బాలాకు లేచి ఇశ్రాయేలీయులతో యుద్ధముచేసి మిమ్ము శపించుటకు బెయోరు కుమారుడైన బిలామును పిలువనంపగా

10 నేను బిలాము మనవి విననొల్లనైతిని గనుక అతడు మిమ్మును దీవించుచునే వచ్చెను. అతనిచేతినుండి నేనే మిమ్మును విడిపించితిని.౹

11 మీరు యొర్దాను దాటి యెరికో దగ్గరకు వచ్చినప్పుడు యెరికోకు యజమానులగు అమోరీయులు పెరిజ్జీయులు కనానీయులు హిత్తీయులు గిర్గాషీయులు హివ్వీయులు యెబూసీయులనువారు మీతో యుద్ధముచేయగా నేను వారిని మీ చేతికప్పగించితిని.౹

12 మరియు నేను మీకు ముందుగా కందిరీగలను పంపితిని; నీ ఖడ్గము కాదు నీ విల్లుకాదుగాని అవే అమోరీయుల రాజుల నిద్దరిని తోలివేసెను. మీరు సేద్యముచేయని దేశమును

13 మీరు కట్టని పట్టణములను మీకిచ్చియున్నాను. మీరు వాటిలో నివసించుచున్నారు. మీరు నాటని ద్రాక్షతోటల పండ్లను ఒలీవతోటల పండ్లను తినుచున్నారు.౹

14 కాబట్టి మీరు యెహోవాయందు భయభక్తులుగలవారై, ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు, మీపితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి.౹

15 యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినయెడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీపితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి; మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా యింటివారును యెహోవాను సేవించెదము అనెను.౹

16 అందుకు ప్రజలు–యెహోవాను విసర్జించి యితరదేవతలను సేవించినయెడల మేము శాపగ్రస్తుల మగుదుము గాక.౹

17 ఐగుప్తుదేశమను దాసుల గృహములోనుండి మనలను మన తండ్రులను రప్పించి, మన కన్నులయెదుట ఆ గొప్ప సూచకక్రియలను చేసి, మనము నడిచిన మార్గములన్నిటిలోను, మనము వెళ్లిన ప్రజలందరిమధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు.౹

18 యెహోవా ఆ దేశములో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరు మనయెదుట నిలువకుండ వారిని తోలివేసినవాడు; యెహోవానే సేవించెదము; ఆయనయే మా దేవుడని ప్రత్యుత్తరమిచ్చిరి.

19 అందుకు యెహోషువ–యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషముగల దేవుడు, ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపనివాడు, మీరాయనను సేవింప లేరు.౹

20 మీరు యెహోవాను విసర్జించి అన్యదేవతలను సేవించినయెడల ఆయన మీకు మేలుచేయువాడైనను మనస్సు త్రిప్పుకొని మీకు కీడుచేసి మిమ్మును క్షీణింప జేయుననగా

21 జనులు–అట్లు కాదు, మేము యెహోవానే సేవించెదమని యెహోషువతో చెప్పిరి.౹

22 అప్పుడు యెహోషువ–మీరు యెహోవానే సేవించెదమని ఆయనను కోరు కొన్నందుకు మిమ్మునుగూర్చి మీరే సాక్షులై యున్నా రనగా వారు–మేము సాక్షులమే అనిరి.౹

23 అందుకతడు– ఆలాగైతే మీ మధ్య నున్న అన్యదేవతలను తొలగద్రోసి, ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాతట్టు మీ హృదయమును త్రిప్పుకొనుడని చెప్పెను.౹

24 అందుకు జనులు–మన దేవుడైన యెహోవానే సేవించెదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి.

25 అట్లు యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడను విధిని నియమించి

26 దేవుని ధర్మశాస్త్రగ్రంథములో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధస్థలములోనున్న సింధూర వృక్షముక్రింద దాని నిలువబెట్టి

27 జనులందరితో ఇట్లనెను–ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నియు ఈ రాతికి వినబడెను గనుక అది మనమీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించినయెడల అది మీమీద సాక్షిగా ఉండును.౹

28 అప్పుడు యెహోషువ ప్రజలను తమ స్వాస్థ్యములకు వెళ్లనంపెను.

29 ఈ సంగతులు జరిగినతరువాత నూను కుమారుడును యెహోవా దాసుడునైన యెహోషువ నూటపది సంవత్సరముల వయస్సుగలవాడై మృతినొందెను.౹

30 అతని స్వాస్థ్యపు సరిహద్దులోనున్న తిమ్నత్సెరహులో అతడు పాతిపెట్టబడెను. అది ఎఫ్రాయిమీయుల మన్యములోని గాయషు కొండకు ఉత్తర దిక్కున నున్నది.

31 యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంక బ్రతికి యెహోవా ఇశ్రాయేలీయులకొరకు చేసిన క్రియలన్నిటిని ఎరిగిన పెద్దల దినములన్నిటను ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించుచు వచ్చిరి.౹

32 ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో, అనగా యాకోబు నూరు వరహాలకు షెకెము తండ్రియైన హమోరు కుమారులయొద్ద కొనిన చేని భాగములో వారు పాతిపెట్టిరి. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను.౹

33 మరియు అహరోను కుమారుడైన ఎలియాజరు మృతినొందినప్పుడు ఎఫ్రాయీమీయుల మన్యప్రదేశములో అతని కుమారుడైన ఫీనెహాసునకు ఇయ్య బడిన ఫీనెహాసుగిరిలో జనులు అతని పాతిపెట్టిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOS/24-1701dba7f9683664e5df76a825414e9a.mp3?version_id=1787—

Categories
న్యాయాధిపతులు

న్యాయాధిపతులు 1

1 యెహోషువ మృతినొందిన తరువాత ఇశ్రాయేలీయులు–కనానీయులతో యుద్ధము చేయుటకు తమలో నెవరు ముందుగా వారి మీదికి పోవలసినది యెహోవా తెలియజేయునట్లు ప్రార్థనచేయగా

2 యెహోవా–ఆ దేశమును యూదావంశస్థుల కిచ్చియున్నాను, వారు పోవలెనని సెలవిచ్చెను.౹

3 అప్పుడు యూదావంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో–మనము కనానీయులతో యుద్ధము చేయుటకు–మా వంతులోనికి మాతోకూడ రండి, మేమును మీతోకూడ మీ వంతులోనికి వచ్చెదమని చెప్పగా షిమ్యోనీయులు వారితోకూడ పోయిరి.౹

4 కనానీయులమీదికి యూదావంశస్థులు పోయినప్పుడు యెహోవా కనానీయులను పెరిజ్జీయులను వారి కప్పగించెను గనుక వారు బెజెకులో పదివేలమంది మనుష్యులను హతముచేసిరి.౹

5 వారు బెజెకులో అదోనీ బెజెకును చూచి వానితో యుద్ధముచేసి కనానీయులను పెరిజ్జీయులను హతముచేసిరి.౹

6 అదోనీ బెజెకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాలుచేతుల బొట్టన వ్రేళ్లను కోసివేసిరి.౹

7 అప్పుడు అదోనీ బెజెకు–తమ కాళ్లు చేతుల బొట్టనవ్రేళ్లు కోయబడిన డెబ్బదిమంది రాజులు నా భోజనపు బల్లక్రింద ముక్కలు ఏరుకొనుచుండిరి. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలమిచ్చెననెను. వారు యెరూషలేమునకు అతని తోడుకొనిరాగా అతడు అక్కడ చనిపోయెను.

8 యూదావంశస్థులు యెరూషలేముమీదికి యుద్ధము చేసి దానిని పట్టుకొని కొల్లబెట్టి ఆ పట్టణమును కాల్చి వేసిరి.౹

9 తరువాత యూదావంశస్థులు మన్యములయందును దక్షిణదేశమందును లోయయందును నివసించిన కనానీయులతో యుద్ధము చేయుటకు పోయిరి.౹

10 మరియు యూదా వంశస్థులు హెబ్రోనులో నివసించిన కనానీయులమీదికి పోయి, షేషయిని అహీమానును తల్మయిని హతముచేసిరి.౹

11 ఆ హెబ్రోను పేరు కిర్యతర్బా. అక్కడనుండి వారు దెబీరు నివాసులమీదికి పోయిరి. పూర్వము దెబీరు పేరు కిర్యత్సేఫెరు.౹

12 కాలేబు–కిర్యత్సేఫెరును పట్టుకొని కొల్లబెట్టువానికి నా కుమార్తెయైన అక్సాను ఇచ్చి పెండ్లిచేసెదనని చెప్పగా

13 కాలేబు తమ్ముడైన కనజు కుమారుడగు ఒత్నీయేలు దాని పట్టుకొనెను గనుక కాలేబు తన కుమార్తెయైన అక్సాను అతనికిచ్చి పెండ్లిచేసెను.౹

14 ఆమె తన పెనిమిటి యింట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు–నీకేమి కావలెనని యడిగెను

15 అందుకామె–దీవెన దయచేయుము; నాకు దక్షిణ భూమి ఇచ్చియున్నావు, నీటి మడుగులను కూడ నాకు దయచేయుమనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను.

16 మోషే మామయైన కేయిను కుమారులు యూదా వంశస్థులతోకూడ ఖర్జూరచెట్ల పట్టణములోనుండి అరాదు దక్షిణదిక్కులోని యూదా అరణ్యమునకు వెళ్లి అక్కడ చేరి ఆ జనముతో నివసించిరి.౹

17 యూదావంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతోకూడ పోయి జెఫతులో నివసించిన కనానీయులను హతము చేసి పట్టణమును నిర్మూలముచేసి ఆ పట్టణమునకు హోర్మాఅను పేరు పెట్టిరి.౹

18 యూదావంశస్థులు గాజాను దాని ప్రదేశమును అష్కె లోనును దాని ప్రదేశమును ఎక్రోనును దాని ప్రదేశమును పట్టుకొనిరి.౹

19 యెహోవా యూదావంశస్థులకు తోడై యున్నందునవారు మన్యదేశమును స్వాధీనపరచుకొనిరి. అయితే మైదానమందు నివసించువారికి ఇనుపరథములున్నందున వారిని వెళ్లగొట్టలేకపోయిరి.౹

20 మోషే చెప్పినట్లువారు కాలేబుకు హెబ్రోను నియ్యగా అతడు ముగ్గురు అనాకీయులను అక్కడనుండి పారదోలి దానిని స్వాధీన పరచుకొనెను.౹

21 యెరూషలేములో నివసించు యెబూసీ యులను బెన్యామీనీయులు వెళ్లగొట్టలేదు; యెబూసీయులు బెన్యామీనీయులతోకూడ నేటివరకు యెరూషలేములో నివసించుచున్నారు.

22 యోసేపు ఇంటివారు బేతేలుకు వెళ్లినప్పుడు యెహోవావారికి తోడైయుండెను.౹

23 పూర్వము లూజనబడిన బేతేలును వేగుచూచుటకు యోసేపు ఇంటివారు దూతలను పంపగా

24 ఆ వేగులవారు ఆ పట్టణమునుండి ఒకడు వచ్చుట చూచి–నీవు దయచేసి యీ పట్టణములోనికి వెళ్లు త్రోవను మాకు చూపినయెడల మేము మీకు ఉపకారము చేసెదమని చెప్పిరి.౹

25 అతడు పట్టణములోనికి పోవు త్రోవను వారికి చూపగా వారు ఆ పట్టణమును కత్తివాత హతము చేసిరిగాని ఆ మనుష్యుని వాని కుటుంబికుల నందరిని పోనిచ్చిరి.౹

26 ఆ మనుష్యుడు హిత్తీయుల దేశమునకు వెళ్లి ఒక పట్టణమును కట్టించి దానికి లూజు అను పేరుపెట్టెను. నేటివరకు దానికదే పేరు.

27 మనష్షీయులు బేత్షెయానును దాని పల్లెలను, తయి నాకును దాని పల్లెలను, దోరునివాసులను దోరు పల్లెలను, ఇబ్లెయామును దాని పల్లెలను, మెగిద్దో నివాసులను, మెగిద్దో పల్లెలను, స్వాధీనపరచుకొనలేదు; ఏలయనగా కనానీయులు ఆ దేశములో నివసింపవలెనని గట్టిపట్టు పెట్టియుండిరి.౹

28 ఇశ్రాయేలీయులు బలవంతులైన తరువాత వారు కనానీయుల చేత వెట్టిపనులు చేయించుకొనిరి కాని వారిని బొత్తిగా వెళ్లగొట్టలేదు.

29 ఎఫ్రాయిమీయులు గెజెరులో నివసించిన కనానీయులను వెళ్లగొట్టలేదు, గెజెరులో కనానీయులు వారిమధ్యను నివసించిరి.౹

30 జెబూలూనీయులు కిత్రోను నివాసులను నహలోలు నివాసులను వెళ్లగొట్టలేదు, కనానీయులు వారి మధ్య నివసించి వారికి వెట్టిపనులు చేయువారైరి.౹

31 ఆషేరీయులు అక్కో నివాసులను సీదోను నివాసులను అహ్లాబు వారిని అక్జీబువారిని హెల్బావారిని ఆఫెకువారిని రెహోబు వారిని

32 ఆషేరీయులు దేశనివాసులైన కనానీయులను వెళ్లగొట్టక వారి మధ్య నివసించిరి. నఫ్తాలీయులు బేత్షెమెషు వారిని బేతనాతువారిని వెళ్లగొట్టలేదుగాని

33 బేత్షెమెషు నివాసులచేతను బేతనాతు నివాసులచేతను వెట్టి పనులు చేయించుకొనిరి.౹

34 అమోరీయులు దానీయులను పల్లపు దేశమునకు దిగనియ్యక మన్యమునకు వారిని వెళ్లగొట్టిరి.౹

35 అమోరీయులు అయ్యాలోను నందలి హెరెసు కొండలోను షయల్బీములోను నివసింపవలెనని గట్టిపట్టు పెట్టియుండగా యోసేపు ఇంటివారు బలవంతులై వారిచేత వెట్టిపనులు చేయించుకొనిరి

36 అమోరీయుల సరిహద్దు అక్రబ్బీము మొదలుకొని హస్సెలావరకు వ్యాపించెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JDG/1-935e77333308f2a34bc3b8e59a769445.mp3?version_id=1787—

Categories
న్యాయాధిపతులు

న్యాయాధిపతులు 2

1 యెహోవాదూత గిల్గాలునుండి బయలుదేరి బోకీమునకువచ్చి యీలాగు సెలవిచ్చెను–నేను మిమ్మును ఐగుప్తులోనుండి రప్పించి, మీపితరులకు ప్రమాణముచేసిన దేశమునకు మిమ్మును చేర్చి–నీతో చేసిన నిబంధన నేనెన్నడును మీరను.౹

2 మీరు ఈ దేశనివాసులతో నిబంధన చేసి కొనకూడదు; వారి బలిపీఠములను విరుగగొట్టవలెనని ఆజ్ఞ ఇచ్చితినిగాని మీరు నా మాటను వినలేదు.౹

3 మీరు చేసినపని యెట్టిది? కావున నేను–మీ యెదుటనుండి ఈ దేశనివాసులను వెళ్లగొట్టను, వారు మీ ప్రక్కలకు శూలములుగా నుందురు, వారి దేవతలు మీకు ఉరిగా నుందురని చెప్పుచున్నాను.౹

4 యెహోవాదూత ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పగా

5 జనులు ఎలుగెత్తి యేడ్చిరి; కాగా ఆ చోటికి బోకీమనుపేరు పెట్టబడెను. అక్కడ వారు యెహోవాకు బలి అర్పించిరి.

6 యెహోషువ జనులను వెళ్లనంపినప్పుడు ఇశ్రాయేలీయులు దేశమును స్వాధీనపరచుకొనుటకు తమ స్వాస్థ్యములకు పోయిరి.౹

7 యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంక బ్రదికినవారై యెహోవా ఇశ్రాయేలీయులకొరకు చేసిన కార్యములన్నిటిని చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించుచు వచ్చిరి.౹

8 నూను కుమారుడును యెహోవాకు దాసుడునైన యెహోషువ నూట పది సంవత్సరముల వయస్సుగల వాడై మృతినొందినప్పుడు అతని స్వాస్థ్యపు సరిహద్దు లోనున్న తిమ్నత్సెరహులో జనులతని పాతిపెట్టిరి.౹

9 అది ఎఫ్రాయిమీయుల మన్యమందలి గాయషుకొండకు ఉత్తరదిక్కున నున్నది.

10 ఆ తరమువారందరు తమపితరులయొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా

11 ఇశ్రాయేలీయులు యెహోవా కన్నులయెదుట కీడుచేసి, ఐగుప్తుదేశములోనుండి వారిని రప్పించిన తమపితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి

12 తమ చుట్టునుండు జనుల దేవతలలో ఇతరదేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి.౹

13 వారు యెహోవాను విసర్జించి బయలును అష్తారోతును పూజించిరి.౹

14 కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయులమీద మండెను; ఆయన దోచుకొనువారిచేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలీయులను దోచుకొనిరి; ఆయన వారి చుట్టునున్నవారి శత్రువులచేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల యెదుట నిలువలేకపోయిరి.౹

15 యెహోవావారితో చెప్పినట్లు, యెహోవావారితో ప్రమాణము చేసినట్లు, వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యెహోవావారికి శత్రువాయెను గనుక వారికి మిక్కిలి యిబ్బంది కలిగెను.

16 ఆ కాలమున యెహోవావారికొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకొనువారి చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షించిరి. అయితే వారు ఇంక న్యాయాధిపతుల మాట వినక

17 తమపితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గమునుండి త్వరగా తొలగి పోయి యితర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్క రించిరి; తమపితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లువారు నడవకపోయిరి.౹

18 తమ శత్రువులు తమ్మును బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారికొరకు న్యాయాధిపతులను పుట్టించి, ఆయా న్యాయాధిపతులకు తోడైయుండి వారి దినములన్నిటను వారిశత్రువుల చేతులలోనుండి ఇశ్రాయేలీయులను రక్షించెను.౹

19 ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి యితర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుటవలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వికులకంటె మరి మిగుల చెడ్డవారైరి.౹

20 కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయులమీద మండగా ఆయన ఈలాగు సెలవిచ్చెను–ఈ ప్రజలు నా మాట వినక, వీరి పితరులతో నేను చేసిన నిబంధనను మీరుదురు

21 గనుక నేను నియమించిన విధిననుసరించి వారి పితరులు నడిచినట్లు వీరును యెహోవా విధిననుసరించి నడుచుదురో లేదో ఆ జనములవలన ఇశ్రాయేలీయులను శోధించుటకై

22 యెహోషువ చనిపోయిన కాలమున శేషించిన జనములలో ఏ జనమును వారి యెదుటనుండి నేను వెళ్లగొట్టను.౹

23 అందుకు యెహోవా ఆ జనములను యెహోషువ చేతి కప్పగింపకయు శీఘ్రముగా వెళ్లగొట్ట కయు మాని వారిని ఉండనిచ్చెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JDG/2-b872dc6d5186c2a83c8d8d5b1101a187.mp3?version_id=1787—

Categories
న్యాయాధిపతులు

న్యాయాధిపతులు 3

1 ఇశ్రాయేలీయులకును కనానీయులకును జరిగినయుద్ధములన్నిటిని చూడనివారందరిని శోధించి

2-4 ఇశ్రాయేలీయుల తరతరములవారికి, అనగా పూర్వము ఆ యుద్ధములను ఏ మాత్రమును చూడనివారికి యుద్ధముచేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు ఇవి. ఫిలిష్తీయుల అయిదుగురు సర్దారుల జనులును, కనానీయులందరును, సీదోనీయులును, బయల్హెర్మోను మొదలుకొని హమాతునకు పోవు మార్గమువరకు లెబానోను కొండలో నివసించు హివ్వీయులును, యెహోవా మోషేద్వారా తమ తండ్రుల కిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలిసికొనునట్లు ఇశ్రాయేలీయులను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను.౹

5 కాబట్టి ఇశ్రాయేలీయులు, కనానీయులు హిత్తీయులు అమోరీయులు

6 పెరిజ్జీయులు హివ్వీయులు ఎబూసీయులను జనులమధ్య నివసించుచు వారి కుమార్తెలను పెండ్లిచేసికొనుచు, వారి కుమారులకు తమ కుమార్తెల నిచ్చుచు, వారి దేవతలను పూజించుచు వచ్చిరి

7 అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని దోషులై, తమ దేవుడైన యెహోవాను మరచి బయలుదేవతలను దేవతాస్తంభములను పూజించిరి.౹

8 అందునుగూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలీయులమీద మండగా ఆయన అరా మ్నహరాయిముయొక్క రాజైన కూషన్రిషాతాయిము చేతులకు దాసులగుటకై వారిని అమ్మివేసెను. ఇశ్రాయేలీయులు ఎనిమిది సంవత్సరములు కూషన్రిషాతాయిమునకు దాసులుగానుండిరి

9 ఇశ్రాయేలీయులు యెహోవాకు మొఱ్ఱపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజుయొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీయులకొరకు నియమించి వారిని రక్షించెను.౹

10 యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతియై యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరామ్నహరాయిము రాజైన కూషన్రిషాతాయిమును అతనిచేతికప్పగించెను, అతడు కూషన్రిషాతాయిమును జయించెను.౹

11 అప్పుడు నలువది సంవత్సరములు దేశము నెమ్మదిపొందెను. అటుతరువాత కనజు కుమారుడైన ఒత్నీయేలు మృతినొందెను.

12 ఇశ్రాయేలీయులు మరల యెహోవా దృష్టికి దోషులైరి గనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలీయులతో యుద్ధముచేయుటకు మోయాబు రాజైన ఎగ్లోనును బలపరచెను.౹

13 అతడు అమ్మోనీయులను అమాలేకీయులను సమకూర్చుకొనిపోయి ఇశ్రాయేలీయులను ఓడగొట్టి ఖర్జూరచెట్ల పట్టణమును స్వాధీనపరచుకొనెను.౹

14 ఇశ్రాయేలీయులు పదునెనిమిది సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైరి.౹

15 ఇశ్రాయేలీయులు యెహోవాకు మొఱ్ఱపెట్టగా బెన్యామీనీయుడైన గెరా కుమారుడగు ఏహూదను రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. అతడు ఎడమచేతి పని వాడు. అతనిచేతను ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోనుకు కప్పము పంపగా

16 ఏహూదు మూరెడు పొడవుగల రెండంచుల కత్తిని చేయించుకొని, తన వస్త్రములో తన కుడి తొడమీద

17 దానిని కట్టుకొని, ఆ కప్పము మోయాబురాజైన ఎగ్లోనుకు తెచ్చెను. ఆ ఎగ్లోను బహు స్థూలకాయుడు.౹

18 ఏహూదు ఆ కప్పము తెచ్చి యిచ్చిన తరువాత కప్పము మోసిన జనులను వెళ్లనంపి

19 గిల్గాలు దగ్గరనున్న పెసీలీమునొద్దనుండి తిరిగి వచ్చి– రాజా, రహస్యమైన మాట ఒకటి నేను నీతో చెప్పవలె ననగా అతడు–తనయొద్ద నిలిచినవారందరు వెలుపలికి పోవువరకు ఊరకొమ్మని చెప్పెను.౹

20 ఏహూదు అతని దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఒక్కడే చల్లని మేడ గదిలో కూర్చుండియుండెను. ఏహూదు–నీతో నేను చెప్ప వలసిన దేవునిమాట ఒకటి యున్నదని చెప్పగా అతడు తన పీఠముమీదనుండి లేచెను.౹

21 అప్పుడు ఏహూదు తన యెడమచేతిని చాపి తన కుడి తొడమీదనుండి ఆ కత్తి తీసి కడుపుమీద అతని పొడిచెను.౹

22 పిడియును కత్తివెంబడి దూరగా క్రొవ్వుకత్తిపైని కప్పుకొనినందున అతని కడుపు నుండి కత్తిని తీయలేకపోయెను, అది వెనుకనుండి బయటికి వచ్చి యుండెను.౹

23 అప్పుడు ఏహూదు పంచపాళిలోనికి బయలువెళ్లి తన వెనుకను ఆ మేడగది తలుపువేసి గడియ పెట్టెను.౹

24 అతడు బయలువెళ్లిన తరువాత ఆ రాజు దాసులు లోపలికివచ్చి చూడగా ఆ మేడగది తలుపులు గడియలు వేసియుండెను గనుక వారు–అతడు చల్లని గదిలో శంకానివర్తికి పోయియున్నాడనుకొని

25 తాము సిగ్గువింతలు పడువరకు కనిపెట్టినను అతడు ఆ గది తలుపులను తీయకపోగా వారు తాళపు చెవిని తెచ్చి తలుపులు తీసి చూచినప్పుడు వారి యజమానుడు చనిపోయి నేలను పడియుండెను.౹

26 వారు తడవు చేయుచుండగా ఏహూదు తప్పించుకొని పెసీలీమును దాటి శెయీరాకు పారి పోయెను.౹

27 అతడు వచ్చి ఎఫ్రాయిమీయుల కొండలో బూరను ఊదగా ఇశ్రాయేలీయులు మన్యప్రదేశమునుండి దిగి అతని యొద్దకు వచ్చిరి.౹

28 అతడు వారికి ముందుగా సాగి వారితో–నా వెంబడి త్వరగా రండి; మీ శత్రువు లైన మోయాబీయులను యెహోవా మీ చేతి కప్పగించుచున్నాడనెను. కాబట్టి వారు అతని వెంబడిని దిగివచ్చి మోయాబు నెదుటి యొర్దాను రేవులను పట్టుకొని యెవనిని దాటనియ్యలేదు.౹

29 ఆ కాలమునవారు మోయాబీయులలో బలముగల శూరులైన పరాక్రమశాలులను పదివేలమందిని చంపిరి; ఒకడును తప్పించుకొనలేదు. ఆ దినమున మోయాబీయులు ఇశ్రాయేలీయుల చేతిక్రింద అణపబడగా దేశము ఎనుబది సంవత్సరములు నిమ్మళముగా ఉండెను.

30 అతనితరువాత అనాతు కుమారుడైన షమ్గరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిష్తీయులలో ఆరువందలమందినిమునుకోల కఱ్ఱతో హతముచేసెను; అతడును ఇశ్రాయేలీయులను రక్షించెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JDG/3-3b3fdfef9502610a1faefdc9a00ca757.mp3?version_id=1787—

Categories
న్యాయాధిపతులు

న్యాయాధిపతులు 4

1 ఏహూదు మరణమైనతరువాత ఇశ్రాయేలీయులు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి గనుక

2 యెహోవా హాసోరులో ఏలు కనానురాజైన యాబీనుచేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషెతులో నివసించిన సీసెరా.౹

3 అతనికి తొమ్మిదివందల ఇనుపరథము లుండెను. అతడు ఇరువది సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధపెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి.

4 ఆ కాలమున లప్పీదోతునకు భార్యయైన దెబోరా అను ప్రవక్త్రి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతినిగా ఉండెను.౹

5 ఆమె ఎఫ్రాయిమీయుల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళవృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుటకద్దు, తీర్పు చేయుటకై ఇశ్రాయేలీయులు ఆమెయొద్దకు వచ్చుచుండిరి.౹

6 ఆమె నఫ్తాలి కెదెషులోనుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను–నీవువెళ్లి నఫ్తాలీయులలోను జెబూలూనీయులలోను పదివేలమంది మనుష్యులను తాబోరు కొండయొద్దకు రప్పించుము;౹

7 నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతియైన సీసెరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటియొద్దకు కూర్చి నీ చేతికి అత నిని అప్పగించెదనని ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా సెలవిచ్చియుండలేదా? అని దెబోరా చెప్పగా

8 బారాకు –నీవు నాతోకూడ వచ్చినయెడల నేను వెళ్లెదనుగాని నీవు నాతోకూడ రాని యెడల నేను వెళ్లనని ఆమెతో చెప్పెను.౹

9 అప్పుడు ఆమె–నీతో నేను అగత్యముగా వచ్చెదను; అయితే నీవుచేయు ప్రయాణమువలన నీకు ఘనతకలుగదు, యెహోవా ఒక స్త్రీచేతికి సీసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతోకూడ కెదెషునకు వెళ్లెను.౹

10 బారాకు జెబూలూనీయులను నఫ్తాలీయులను కెదెషునకు పిలిపించినప్పుడు పదివేలమంది మనుష్యులు అతనివెంట వెళ్లిరి;౹

11 దెబోరాయు అతనితోకూడ పోయెను. అంతకులోగా కయీనీయుడైన హెబెరు మోషే మామయైన హోబాబు సంతతివారైన కయీనీయులనుండి వేరు పడి కెదెషునొద్దనున్న జయనన్నీములోని మస్తకివృక్షము నొద్ద తన గుడారమును వేసికొనియుండెను.౹

12 అబీనో యము కుమారుడైన బారాకు తాబోరుకొండమీదికిపోయెనని సీసెరాకు తెలుపబడినప్పుడు సీసెరా తన రథములన్నిటిని తన తొమ్మిదివందల ఇనుప రథములను

13 అన్యుల హరోషెతునుండి కీషోను వాగువరకు తన పక్షముగా నున్న సమస్త జనమును పిలిపింపగా

14 దెబోరా–లెమ్ము, యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరునుగదా అని బారాకుతో చెప్పినప్పుడు, బారాకు ఆ పదివేలమంది మనుష్యులను వెంటబెట్టుకొని తాబోరు కొండమీదినుండి దిగి వచ్చెను.౹

15 బారాకు వారిని హతము చేయునట్లు యెహోవా సీసెరాను అతని రథములన్నిటిని అతని సర్వసేనను కలవరపరచగా సీసెరా తన రథము దిగి కాలినడకను పారిపోయెను.౹

16 బారాకు ఆ రథములను సేనను అన్యుల హరోషెతువరకు తరుమగా సీసెరాయొక్క సర్వసేనయు కత్తివాత కూలెను, ఒక్కడైనను మిగిలియుండలేదు

17 హాసోరురాజైన యాబీనుకును కయీనీయుడైన హెబెరు వంశస్థులకును సమాధానము కలిగియుండెను గనుక సీసెరా కాలినడకను కయీనీయుడగు హెబెరు భార్యయైన యాయేలు గుడారమునకు పారిపోయెను.౹

18 అప్పుడు యాయేలు సీసెరాను ఎదుర్కొన బోయి అతనిని చూచి –నా యేలినవాడా నాతట్టు తిరుగుము, తిరుగుము భయపడకుమని చెప్పినందున అతడు ఆమె గుడారమును జొచ్చెను.౹

19 ఆమె గొంగళితో అతని కప్పగా అతడు–దప్పికొనియున్నాను, దయచేసి దాహమునకు కొంచెము నీళ్లిమ్మని ఆమెనడిగెను. ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతని కప్పుచుండగా

20 అతడు–గుడారపు ద్వారమున నిలిచి యుండుము; ఎవడేకాని లోపలికివచ్చి–యిక్కడ నెవడైననున్నాడా అని నిన్నడిగినయెడల నీవు –ఎవడును లేడని చెప్పవలెననెను.౹

21 పిమ్మట హెబెరు భార్యయైన యాయేలు గుడారపు మేకు తీసికొని సుత్తె చేతపట్టుకొని అతనియొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢనిద్ర కలిగియుండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా

22 అతడు చచ్చెను. బారాకు సీసెరాను తరుముచుండగా యాయేలు అతనిని ఎదుర్కొన వచ్చి–రమ్ము, నీవు వెదకుచున్న మనుష్యుని నీకు చూపిం చెదననగా అతడు వచ్చినప్పుడు సీసెరా చచ్చిపడియుండెను, ఆ మేకు అతని కణతలలో నుండెను.

23 ఆ దినమున దేవుడు ఇశ్రాయేలీయులయెదుట కనానురాజైన యాబీనును అణచెను.౹

24 తరువాత వారు కనానురాజైన యాబీనును సంహరించువరకు ఇశ్రాయేలీయుల చెయ్యి కనానురాజైన యాబీనుకు విరోధముగా అంత కంతకు హెచ్చుచువచ్చెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JDG/4-5d35d23ee796671be43b5d861bda0524.mp3?version_id=1787—

Categories
న్యాయాధిపతులు

న్యాయాధిపతులు 5

1 ఆ దినమున దెబోరాయు అబీనోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి.

2 ఇశ్రాయేలీయులలోయుద్ధశాలులు ధైర్యము కనుపరచిరి

ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి. యెహోవాను

స్తుతించుడి.

3 రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి

యెహోవాకు గానముచేసెదను.

4 ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించెదను

యెహోవా, నీవు శేయీరునుండి బయలుదేరినప్పుడు

ఎదోము పొలమునుండి బయలుదేరినప్పుడు

భూమి వణకెను, ఆకాశము నీళ్లను కురిపించెను

మేఘములును వర్షించెను.

5 యెహోవా సన్నిధిని కొండలలోనుండి ప్రవాహములు

వచ్చెను

ఇశ్రాయేలు దేవుడైన యెహోవాసన్నిధిని

సీనాయిలోనుండి ప్రవాహములు వచ్చెను.

6 అనాతు కుమారుడైన షమ్గరు దినములలో

యాయేలు దినములలో రాజమార్గములు ఎడారు

లాయెను

ప్రయాణస్థులు చుట్టుత్రోవలలోనే నడిచిరి.

7 ఇశ్రాయేలీయుల అధిపతులు లేకపోయిరి

దెబోరా అను నేను రాకమునుపు

ఇశ్రాయేలులో నేను తల్లిగా నుండకమునుపువారు లేకపోయిరి

8 ఇశ్రాయేలీయులు క్రొత్త దేవతలను కోరుకొనగా

యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను

ఇశ్రాయేలీయులలో నలువదివేలమందికి

ఒక కేడెమేగాని యీటెయేగాని కనబడలేదు.

9 జనులలో ఇశ్రాయేలీయుల అధిపతులు సంతోషముగా సిద్ధపడిరి.వారియందు నాకు ప్రేమకలదు

యెహోవాను స్తుతించుడి.

10 తెల్లగాడిదల నెక్కువారలారా,

తివాసులమీద కూర్చుండువారలారా,

త్రోవలో నడుచువారలారా, ఈ సంగతి ప్రక

టించుడి.

11 విలుకాండ్ర ధ్వనికి దూరముగా నుండువారు

నీళ్లు చేదుకొను స్థలములలో నుండువారు

యెహోవా నీతి క్రియలను ప్రకటించెదరు

ఇశ్రాయేలీయుల గ్రామములో ఆయన జరిగించు

నీతి క్రియలను వారు ప్రకటించెదరు

వినుటకై యెహోవా జనులు ద్వారములలో కూడుదురు.

12 దెబోరా, మేలుకొనుము, మేలుకొనుము

దెబోరా, మేలుకొనుము, మేలుకొనుము

బారాకూ, కీర్తన పాడుము

అబీనోయము కుమారుడా, లెమ్ము చెరపెట్టిన వారిని చెరపట్టుము.

13 ప్రజలవీరులలో శేషించినవారును కూడి వచ్చిరి

శూరులలో యెహోవా నాకు సహాయము చేయ వచ్చెను.

14 అమాలేకీయులలో కాపురమున్న ఎఫ్రాయిమీయులును

నీ తరువాత నీ జనులలో బెన్యామీనీయులును

మాకీరునుండి న్యాయాధిపతులును

జెబూలూనీయులనుండి నాయకదండము వహించువారును వచ్చిరి.

15 ఇశ్శాఖారీయులైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చిరి.

ఇశ్శాఖారీయులును బారాకును

అతివేగమున లోయలోనికి చొరబడిరి

రూబేనీయుల కాలువలయొద్ద

జనులకు గొప్ప హృదయాలోచనలు కలిగెను.

16 మందల యీలలను వినుటకు

నీ దొడ్లమధ్యను నీవేల నివసించితివి?

రూబేనీయుల కాలువలయొద్ద

జనులకు గొప్ప యోచనలు కలిగెను.

17 గిలాదు యొర్దాను అద్దరిని నిలిచెను

దానీయులు ఓడలదగ్గర ఏల నిలిచిరి?

ఆషేరీయులు సముద్రతీరమున తమ అఖాతములయొద్ద

ఏల నిలిచిరి?

18 జెబూలూనీయులు మరణభయము లేక

ప్రాణము తృణీకరించుకొనిన జనము

నఫ్తాలీయులు భూమి మెట్టలమీద ప్రాణము తృణీక

రించిరి.

19 రాజులు వచ్చి యుద్ధముచేసిరి.

మెగిద్దో కాలువలయొద్దనున్న తానాకులో

కనాను రాజులు యుద్ధముచేసిరి.

వెండి లాభము వారు తీసికొనలేదు

20 నక్షత్రములు ఆకాశమునుండి యుద్ధముచేసెను

నక్షత్రములు తమ మార్గములలోనుండి సీసెరాతో

యుద్ధముచేసెను.

21 కీషోను వాగువెంబడి పురాతనపు వాగైన కీషోను

వెంబడివారు కొట్టుకొనిపోయిరి.

నా ప్రాణమా నీవు బలముపూని సాగుము.

22 గుఱ్ఱముల డెక్కలు శూరులను త్రొక్కెను

గుఱ్ఱములు ఎగసి యెగసి శూరులను త్రొక్కెను.

23 యెహోవాదూత యిట్లనెను

–మేరోజును శపించుడి

దాని నివాసులమీద మహా శాపము నిలుపుడి

యెహోవా సహాయమునకు వారు రాలేదు

బలిష్ఠులతోకూడి యెహోవా సహాయమునకు వారు

రాలేదు.

24 కయీనీయుడైన హెబెరు భార్య యాయేలు

స్త్రీలలో దీవెననొందును

గుడారములలోనుండు స్త్రీలలో ఆమె దీవెన

నొందును.

25 అతడు దాహమడిగెను

ఆమె పాలు తెచ్చియిచ్చెను

సర్దారులకు తగిన పాత్రతో మీగడ దెచ్చియిచ్చెను

ఆమె మేకును చేతపట్టుకొనెను

26 పనివాని సుత్తెను కుడిచేతపట్టుకొని సీసెరాను

కొట్టెను

వాని తలను ఆమె పగులగొట్టెను

ఆమె అతని తలను సుత్తెతో కొట్టగా అది పగిలెను.

27 అతడు ఆమె కాళ్లయొద్ద క్రుంగిపడి పరుండెను

ఆమె కాళ్లయొద్ద క్రుంగిపడెను

అతడు ఎక్కడ క్రుంగెనో అక్కడనే పడిచచ్చెను.

28 సీసెరా తల్లి కిటికీలోనుండి చూచెను

అల్లిక కిటికీలోనుండి చూచి కేకలు వేసెను

రాక, అతని రథము తడవుచేయనేల?

అతని రథముల చక్రములు ఆలస్యముచేయనేల?

29 ఆమెయొద్దనున్న వివేకముగల రాజకుమార్తెలు

ఈలాగుననే ఉత్తరమిచ్చిరి.

ఆమె తనకు తాను మరల ఇట్లనుకొనుచుండెను–

30 వారికి దొరకెను గదా? దోపుడుసొమ్ము పంచుకొనుచున్నారు గదా?

యోధులందరు తలాయొక స్త్రీని తీసికొందురు

ఇద్దరేసి స్త్రీలు వారికి దొరుకుదురు

సీసెరాకు రంగువేయబడిన వస్త్రమొకటి

దోపుడు సొమ్ముగా దొరకును

రంగువేయబడిన విచిత్ర వస్త్రమొకటి దోపుడుగా

దొరకును

రెండువైపుల రంగువేయబడిన విచిత్రమైన వస్త్రము

దోచుకొనినవారి మెడలకు తగిన వస్త్రమొకటి

దొరకును.

31 యెహోవా నీ శత్రువులందరు ఆలాగుననే నశించెదరు

ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు

సూర్యునివలె నుందురు అనిపాడిరి.

తరువాత దేశము నలువది సంవత్సరములు నిమ్మళముగా నుండెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JDG/5-062d38c4889085086e17ba4ae9fe5592.mp3?version_id=1787—

Categories
న్యాయాధిపతులు

న్యాయాధిపతులు 6

1 ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా యేడేండ్లు వారిని మిద్యానీయుల కప్ప గించెను.౹

2 మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయులమీద హెచ్చాయెను గనుక వారు మిద్యానీయులయెదుట నిలువలేక కొండలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి.

3 ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యా నీయులును అమాలేకీయులును తూర్పుననుండు వారును తమ పశువులను గుడారములను తీసికొని మిడతల దండంత విస్తారముగా వారిమీదికి వచ్చి

4 వారి యెదుట దిగి, గాజాకు పోవునంతదూరము భూమి పంటను పాడుచేసి, ఒక గొఱ్ఱెనుగాని యెద్దునుగాని గాడిదనుగాని జీవనసాధనమైన మరిదేనినిగాని ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు.౹

5 వారును వారి ఒంటెలును లెక్కలేకయుండెను.౹

6 దేశమును పాడుచేయుటకు వారు దానిలోనికి వచ్చిరి ఇశ్రాయేలీయులు మిద్యానీయులవలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి.

7 మిద్యానీయులవలని బాధనుబట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొఱ్ఱపెట్టగా

8 యెహోవా ఇశ్రాయేలీయులయొద్దకు ప్రవక్తనొకని పంపెను. అతడు వారితో ఈలాగు ప్రకటించెను – ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా–నేను ఐగుప్తులోనుండి మిమ్మును రప్పించి, దాసుల గృహములోనుండి మిమ్మును తోడుకొని వచ్చితిని.౹

9 ఐగుప్తీయుల చేతిలోనుండియు మిమ్మును బాధించిన వారందరిచేతిలోనుండియు మిమ్మును విడిపించి, మీ యెదుటనుండి వారిని తోలివేసి వారి దేశమును మీకిచ్చితిని; మీ దేవుడనైన యెహోవాను నేనే.౹

10 మీరు అమోరీయుల దేశమున నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పితినిగాని మీరు నా మాట వినకపోతిరి.

11 యెహోవాదూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవా షునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకివృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైయుండునట్లుగానుగ చాటున గోధుమలను దుళ్లగొట్టుచుండగా

12 యెహోవాదూత అతనికి కనబడి–పరాక్రమముగల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై యున్నాడని అతనితో అనగా

13 గిద్యోను–చిత్తము నా యేలినవాడా, యెహోవా మాకు తోడైయుండినయెడల ఇదంతయు మాకేల సంభవించెను? యెహోవా ఐగుప్తులోనుండి మమ్మును రప్పించెనని చెప్పుచు, మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుతకార్యములన్నియు ఏ మాయెను? యెహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మును అప్పగించెనని అతనితో చెప్పెను.౹

14 అంతట యెహోవా అతనితట్టు తిరిగి–బలము తెచ్చుకొని వెళ్లి మిద్యానీయుల చేతిలోనుండి ఇశ్రాయేలీయులను రక్షిం పుము, నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా

15 అతడు –చిత్తము నా యేలినవాడా, దేని సహాయముచేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నికలేనిదే. నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై యున్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా–అయిన నేమి?

16 నేను నీకు తోడై యుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతముచేయుదువని సెలవిచ్చెను.౹

17 అందుకతడు–నాయెడల నీకు కటాక్షము కలిగినయెడల నాతో మాటలాడుచున్న వాడవు నీవే అని నేను తెలిసి కొనునట్లు ఒక సూచన కనుపరచుము.౹

18 నేను నీయొద్దకు వచ్చి నా అర్పణమును బయటికి తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టువరకు ఇక్కడనుండి వెళ్లకుమీ అని వేడుకొనగా ఆయన–నీవు తిరిగి వచ్చువరకు నేను ఉండెదననెను.౹

19 అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేక పిల్లను తూమెడు పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లనుకుండలో పోసి ఆయనకొరకు ఆ మస్తకివృక్షముక్రిందికి దానిని తీసికొనివచ్చి దగ్గర ఉంచగా

20 దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతిమీద పెట్టి– నీళ్లు పోయుమని అతనితో చెప్పెను.౹

21 అతడాలాగుచేయగా యెహోవాదూత తన చేతనున్న కఱ్ఱను చాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలోనుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చి వేసెను, అంతట యెహోవాదూత అతనికి అదృశ్య మాయెను.౹

22 గిద్యోను ఆయన యెహోవాదూత అని తెలిసికొని–అహహా నా యేలినవాడా, యెహోవా, ఇందుకే గదా నేను ముఖాముఖిగా యెహోవాదూతను చూచితిననెను.౹

23 అప్పుడు యెహోవా–నీకు సమాధానము, భయపడకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను.౹

24 అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠముకట్టి, దానికి యెహోవా సమాధానకర్తయను పేరుపెట్టెను. నేటివరకు అది అబీయెజ్రీయుల ఒఫ్రాలో ఉన్నది.

25 మరియు ఆ రాత్రియందే యెహోవా–నీ తండ్రి కోడెను, అనగా ఏడేండ్ల రెండవ యెద్దును తీసికొని వచ్చి, నీ తండ్రికట్టిన బయలుయొక్క బలిపీఠమును పడగొట్టి, దానికి పైగానున్న దేవతాస్తంభమును నరికివేసి

26 తగిన యేర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠముకట్టి, ఆ రెండవ కోడెను తీసికొనివచ్చి నీవు నరికిన ప్రతిమయొక్క కఱ్ఱతో దహనబలి నర్పించుమని అతనితో చెప్పెను.౹

27 కాబట్టి గిద్యోను తన పనివారిలో పదిమందిని తీసికొనివచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేసెను. అతడు తన పితరుల కుటుంబమునకును ఆ ఊరివారికిని భయపడినందున పగలు దానిని చేయలేక రాత్రివేళ చేసెను.౹

28 ఆ ఊరివారు వేకువనే లేచినప్పుడు బయలుయొక్క బలిపీఠము విరుగగొట్టబడియుండెను, దానికి పైగా నున్న దేవతాస్తంభమును పడద్రోయబడి యుండెను, కట్టబడిన ఆ బలిపీఠముమీద ఆ రెండవ యెద్దు అర్పింప బడి యుండెను.౹

29 అప్పుడు వారు–ఈ పని యెవరు చేసినదని ఒకరితోనొకరు చెప్పుకొనుచు విచారణచేసి వెదకి, యోవాషు కుమారుడైన గిద్యోను ఆ పనిచేసినట్టు తెలిసికొనిరి.౹

30 కాబట్టి ఆ ఊరివారు–నీ కుమారుడు బయలుయొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతాస్తంభమును పడద్రోసెను గనుక అతడు చావవలెను, వానిని బయటికి తెమ్మని యోవాషుతో చెప్పగా

31 యోవాషు తనకు ఎదురుగా నిలిచిన వారందరితో–మీరు బయలు పక్షముగా వాదింతురా? మీరు వాని రక్షించుదురా? వానిపక్షముగా వాదించువాడు ఈ ప్రొద్దుననే చావవలెను; ఎవడో వాని బలిపీఠమును విరుగగొట్టెను గనుక, వాడు దేవతయైనందున తన పక్షమున తానేవాదించ వచ్చును.౹

32 ఒకడు తన బలిపీఠమును విరుగ గొట్టినందున అతనితో బయలు వాదించుకొననిమ్మని చెప్పి ఆ దినమున అతనికి యెరుబ్బయలనుపేరు పెట్టెను.

33 మిద్యానీయులందరును అమాలేకీయులందరును తూర్పు వారందరును కూడి వచ్చి నది దాటి యెజ్రెయేలు మైదానములో దిగగా

34 యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బూర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబపువారు అతని యొద్దకు వచ్చిరి.౹

35 అతడు మనష్షీ యులందరియొద్దకు దూతలను పంపగా వారును కూడుకొని అతనియొద్దకు వచ్చిరి. అతడు ఆషేరు జెబూలూను నఫ్తాలి గోత్రములవారియొద్దకు దూతలను పంపగా వారును కూడినవారిని ఎదుర్కొనుటకు వచ్చిరి.౹

36 అప్పుడు గిద్యోను –నీవు సెలవిచ్చినట్లు నాచేత ఇశ్రాయేలీయులను రక్షింప నుద్దేశించినయెడల

37 నేను కళ్లమున గొఱ్ఱెబొచ్చు ఉంచినతరువాత నేల అంతయు ఆరియుండగా ఆ గొఱ్ఱెబొచ్చుమీద మాత్రమే మంచుపడు నెడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించెదవని నేను నిశ్చయించుకొందునని దేవునితో అనెను.౹

38 ఆలాగున జరిగెను; అతడు ప్రొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్లతో పాత్ర నిండువరకు ఆ బొచ్చునుండి మంచును పిండెను.౹

39 అప్పుడు గిద్యోను–నీ కోపము నా మీద మండనియ్యకుము; ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము. నేల అంతటిమీద మంచు పడియుండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా

40 ఆ రాత్రి దేవుడు ఆలాగున చేసెను; నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చుమాత్రమే పొడిగానుండెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JDG/6-8560ea17c26747ed8f67a58603ec0607.mp3?version_id=1787—

Categories
న్యాయాధిపతులు

న్యాయాధిపతులు 7

1 అప్పుడు యెరుబ్బయలు, అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరును, వేకువను లేచి హరోదు బావియొద్ద దిగగా లోయలోని మోరె కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండుపాళెము వారికి కనబడెను.౹

2 యెహోవా –నీతో నున్న జనులు ఎక్కువ మంది, నేను వారిచేతికి మిద్యానీయులను అప్పగింపతగదు; ఇశ్రాయేలీయులు– నా బాహుబలము నాకు రక్షణ కలుగచేసికొనెననుకొని నామీద అతిశయించుదురేమో.౹

3 కాబట్టి నీవు–ఎవడు భయపడి వణకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచితిరిగి వెళ్లవలెనని జనులు వినునట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలోనుండి ఇరువది రెండువేలమంది తిరిగి వెళ్లిపోయిరి.

4 పదివేలమంది నిలిచియుండగా యెహోవా–ఈ జను లింక ఎక్కువమంది, నీళ్లయొద్దకు వారిని దిగజేయుము, అక్కడ నీకొరకు వారిని శోధించెదను. ఇతడు నీతోకూడ పోవలెనని నేను ఎవనిగూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలెను; ఇతడు నీతో పోకూడదని యెవనిగూర్చి నీతో చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చెను.౹

5 అతడు నీళ్లయొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా–కుక్కగతుకునట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతివానిని, త్రాగుటకుమోకాళ్లూని క్రుంగిన ప్రతి వానిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చెను.౹

6 చేతితో నోటికందించుకొని గతికినవారిలెక్క మూడు వందలమంది; మిగిలిన జనులందరు నీళ్లు త్రాగుటకు మోకాళ్లూని క్రుంగిరి.౹

7 అప్పుడు యెహోవా–గతికిన మూడు వందల మనుష్యులద్వారా మిమ్మును రక్షించెదను; మిద్యానీయులను నీ చేతికి అప్పగించెదను; జనులందరు తమతమ చోట్లకు వెళ్లవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చెను.౹

8 ప్రజలు ఆహారమును బూరలను పట్టుకొనగా అతడు ప్రజలందరిని తమ గుడారములకు వెళ్లనంపెనుగాని ఆ మూడువందలమందిని నిలుపుకొనెను. మిద్యానీయుల దండు లోయలో అతనికి దిగువగా నుండెను.

9 ఆ రాత్రి యెహోవా అతనితో ఇట్లనెను–నీవు లేచి దండుమీదికి పొమ్ము, నీ చేతికి దాని నప్పగించెదను.౹

10 పోవుటకు నీకు భయమైనయెడల నీ పనివాడైన పూరాతోకూడ దండుకు దిగిపొమ్ము.౹

11 వారు చెప్పుకొనుచున్న దానిని వినిన తరువాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీచేతులు బలపరచబడునని చెప్పగా, అతడును అతని పని వాడైన పూరాయును ఆ దండులోనున్న సన్నద్ధుల యొద్దకు పోయిరి.౹

12 మిద్యానీయులును అమాలేకీయులును తూర్పువారును లెక్కకు మిడతలవలె ఆ మైదానములో పరుండి యుండిరి. వారి ఒంటెలు సముద్రతీరమందున్న యిసుక రేణువులవలె లెక్కలేనివై యుండెను.౹

13 గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా–నేనొక కలగంటిని, అదేమనగా యవలరొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి యొక గుడారమునకు వచ్చి దాని పడగొట్టి తల క్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయెనని చెప్పెను.౹

14 అందుకు వాని చెలికాడు–అది ఇశ్రాయేలీయుడైన యోవాషు కుమారుడగు గిద్యోను ఖడ్గమేగాని మరేమికాదు; దేవుడు మిద్యానీయులను ఈ దండంతను అతనిచేతికి అప్పగింప బోవుచున్నాడని ఉత్తరమిచ్చెను.

15 గిద్యోను ఆ కల వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యెహోవాకు నమస్కారము చేసి ఇశ్రాయేలీయుల దండులోనికి తిరిగి వెళ్లి–లెండి, యెహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి

16 ఆ మూడువందలమందిని మూడు గుంపులుగా చేసి బూరను వట్టికుండను ఆకుండలలో దివిటీలను ప్రతివాని చేతికిచ్చి వారితో ఇట్లనెను–నన్ను చూచి నేను చేయునట్లు చేయుడి;౹

17 ఇదిగో నేను వారి దండు కొట్టకొనకు పోవుచున్నాను, నేను చేయునట్లు మీరు చేయవలెను.౹

18 నేనును నాతో నున్నవారందరును బూరలను ఊదునప్పుడు మీరును దండు పాళెమంతటిచుట్టు బూరలను ఊదుచు–యెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయ వలెనని చెప్పెను.

19 అట్లు నడిజాము మొదటి కావలివారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న నూరుమందియు దండుపాళెము కొట్టకొనకు పోయి బూరలను ఊది తమ చేతులలోనున్నకుండలను పగులగొట్టిరి.౹

20 అట్లు ఆ మూడు గుంపులవారు బూరలను ఊదుచు ఆకుండలను పగులగొట్టి, యెడమచేతులలో దివిటీలను కుడిచేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని–యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గముఅని కేకలువేసిరి.౹

21 వారిలో ప్రతివాడును తన చోటున దండు చుట్టు నిలిచియుండగా ఆ దండువారందరును పరుగెత్తుచు కేకలు వేయుచు పారిపోయిరి.౹

22 ఆ మూడువందలమంది బూరలను ఊదినప్పుడు యెహోవా దండంతటిలోను ప్రతి వాని ఖడ్గమును వాని పొరుగువాని మీదికి త్రిప్పెను. దండు సెరేరాతువైపున నున్న బేత్షిత్తావరకు తబ్బాతునొద్దనున్న ఆబేల్మెహోలా తీరమువరకు పారిపోగా

23 నఫ్తాలి గోత్రములోనుండియు, ఆషేరు గోత్రములోనుండియు, మనష్షే గోత్రమంతటిలోనుండియు పిలిపింపబడిన ఇశ్రాయేలీయులు కూడుకొని మిద్యానీయులను తరిమిరి.౹

24 గిద్యోను ఎఫ్రాయిమీయుల మన్యదేశమంతటికిని దూతలను పంపి–మిద్యానీయులను ఎదుర్కొనుటకు వచ్చి, బేత్బారావరకు వాగులను యొర్దానును వారికంటెముందుగా పట్టుకొనుడని చెప్పియుండెను గనుక, ఎఫ్రాయిమీయులందరు కూడుకొని బేత్బారావరకు వాగులను యొర్దానును పట్టుకొనిరి.౹

25 మరియు వారు మిద్యాను అధిపతులైన ఓరేబు జెయేబు అను ఇద్దరిని పట్టుకొని, ఓరేబు బండమీద ఓరే బును చంపిరి, జెయేబు ద్రాక్షల తొట్టియొద్ద జెయేబును చంపి మిద్యానీయులను తరుముకొనిపోయిరి. ఓరేబు జెయేబుల తలలను యొర్దాను అవతలికి గిద్యోనునొద్దకు తెచ్చిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JDG/7-19c7b4d2ddf623f28e08209b5a751818.mp3?version_id=1787—

Categories
న్యాయాధిపతులు

న్యాయాధిపతులు 8

1 అప్పుడు ఎఫ్రాయిమీయులు గిద్యోనుతో–నీవు మా యెడల చూపిన మర్యాద యెట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలువలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి.౹

2 అందుకతడు–మీరు చేసినదెక్కడ నేను చేసినదెక్కడ? అబీ యెజెరు ద్రాక్షపండ్ల కోతకంటె ఎఫ్రాయిమీయుల పరిగె మంచిదికాదా? దేవుడు మిద్యానీయుల అధిపతులైన ఓర బును జెయేబును మీచేతికి అప్పగించెను; మీరు చేసినట్లు నేను చేయగలనా? అనెను.౹

3 అతడు ఆ మాట అన్నప్పుడు అతని మీది వారి కోపము తగ్గెను.౹

4 గిద్యోనును అతనితోనున్న మూడువందలమందియును అలసటగానున్నను, శత్రువులను తరుముచు యొర్దానునొద్దకు వచ్చి దాటిరి.౹

5 అతడు–నా వెంటనున్న జనులు అలసియున్నారు, ఆహారమునకు రొట్టెలు వారికి దయచేయుడి; మేము మిద్యాను రాజులైన జెబహును సల్మున్నాను తరుముచున్నామని సుక్కోతువారితో చెప్పగా

6 సుక్కోతు అధిపతులు– జెబహు సల్మున్నా అను వారి చేతులు ఇప్పుడు నీ చేతికి చిక్కినవి గనుకనా మేము నీ సేనకు ఆహారము ఇయ్యవలెనని యడిగిరి.౹

7 అందుకు గిద్యోను –ఈ హేతువు చేతను జెబహును సల్మున్నాను యెహోవా నా చేతికప్పగించిన తరువాత నూర్చు కొయ్యలతోను కంపలతోను మీ దేహములను నూర్చి వేయుదునని చెప్పెను.౹

8 అక్కడనుండి అతడు పెనూయేలునకు పోయి ఆలాగుననే వారితోను చెప్పగా సుక్కోతువారు ఉత్తరమిచ్చినట్లు పెనూయేలువారును అతని కుత్తరమిచ్చిరి గనుక అతడు

9 –నేను క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురమును పడగొట్టెదనని పెనూ యేలువారితో చెప్పెను.౹

10 అప్పుడు జెబహును సల్ము న్నాయు వారితోకూడ వారి సేనలును, అనగా తూర్పు జనుల సేనలన్నిటిలో మిగిలినయించుమించు పదునైదు వేలమంది మనుష్యులందరును కర్కోరులోనుండిరి. కత్తి దూయు నూట ఇరువదివేలమంది మనుష్యులు పడిపోయిరి.౹

11 అప్పుడు గిద్యోను నోబహుకును యొగేబ్బెహకును తూర్పున గుడారములలో నివసించిన వారి మార్గమున పోయి సేన నిర్భయముగా నున్నందున ఆ సేనను హతముచేసెను.౹

12 జెబహు సల్మున్నాయు పారిపోయినప్పుడు అతడు వారిని తరిమి మిద్యాను ఇద్దరు రాజులైన జెబహును సల్మున్నాను పట్టుకొని ఆ సేననంతను చెదరగొట్టెను.౹

13 యుద్ధము తీరిన తరువాత యోవాషు కుమారుడైన గిద్యోను

14 హెరెసు ఎగువనుండి తిరిగి వచ్చి, సుక్కోతువారిలో ఒక యౌవనుని పట్టుకొని విచారింపగా అతడు సుక్కోతు అధిపతులను పెద్దలలో డెబ్బదియేడుగురు మనుష్యులను పేరు పేరుగా వివరించి చెప్పెను.౹

15 అప్పుడతడు సుక్కోతువారి యొద్దకు వచ్చి–జెబహు సల్మున్నా అను వారిచేతులు నీ చేతికి చిక్కినవి గనుకనా అలసియున్న నీ సేనకు మేము ఆహారము ఇయ్యవలెను అని మీరు ఎవరివిషయము నన్ను దూషించితిరో ఆ జెబహును సల్మున్నాను చూడుడి అని చెప్పి

16 ఆ ఊరిపెద్దలను పట్టుకొని నూర్చుకొయ్యలను బొమ్మజెముడును తీసికొని వాటివలన సుక్కోతువారికి బుద్ధిచెప్పెను.౹

17 మరియు నతడు పెనూయేలు గోపురమును పడగొట్టి ఆ ఊరివారిని చంపెను.౹

18 అతడు–మీరు తాబోరులో చంపిన మనుష్యులు ఎట్టివారని జెబహును సల్మున్నాను అడుగగా వారు–నీవంటివారే, వారందరును రాజకుమారులను పోలియుండిరనగా

19 అతడు–వారు నా తల్లి కుమారులు నా సహోదరులు; మీరు వారిని బ్రదుకనిచ్చినయెడల

20 యెహోవా జీవముతోడు, మిమ్మును చంపకుందునని చెప్పి తన పెద్దకుమారుడైన యెతెరును చూచి–నీవు లేచి వారిని చంపుమని చెప్పెను. అతడు చిన్నవాడు గనుక భయపడి కత్తిని దూయలేదు.౹

21 అప్పుడు జెబహు సల్మున్నాలు–ప్రాయముకొలది నరునికి శక్తియున్నది గనుక నీవు లేచి మామీద పడుమని చెప్పగా గిద్యోను లేచి జెబ హును సల్మున్నాను చంపి వారి ఒంటెల మెడలమీదనున్న చంద్రహారములను తీసికొనెను.

22 అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో–నీవు మిద్యానీయుల చేతిలోనుండి మమ్మును రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మును ఏల వలెనని చెప్పిరి.౹

23 అందుకు గిద్యోను–నేను మిమ్మును ఏలను, నా కుమారుడును మిమ్మును ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పెను.౹

24 మరియు గిద్యోను–మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నాకియ్య వలెనని మనవిచేయుచున్నాననెను. వారు ఇష్మాయేలీయులు గనుక వారికి పోగులుండెను.౹

25 అందుకు వారు–సంతోషముగా మేము వాటి నిచ్చెదమని చెప్పి యొక బట్టను పరచి ప్రతివాడును తన దోపుడుసొమ్ములోనుండిన పోగులను దానిమీద వేసెను.౹

26 మిద్యాను రాజుల ఒంటి మీదనున్న చంద్రహారములు కర్ణభూషణములు ధూమ్ర వర్ణపు బట్టలు గాకను, ఒంటెల మెడలనున్న గొలుసులు గాకను, అతడు అడిగిన బంగారు పోగుల యెత్తు వెయ్యిన్ని ఏడువందల తులముల బంగారము. గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఒఫ్రాలో దాని ఉంచెను.౹

27 కావున ఇశ్రాయేలీయులందరు అక్కడికి పోయి దాని ననుసరించి వ్యభిచారులైరి. అది గిద్యోనుకును అతని యింటివారికిని ఉరిగానుండెను.౹

28 మిద్యానీయులు ఇశ్రాయేలీయుల యెదుట అణపబడి అటుతరువాత తమ తలలను ఎత్తికొనలేకపోయిరి. గిద్యోను దినములలో దేశము నలువది సంవత్సరములు నిమ్మళముగా నుండెను.

29 తరువాత యోవాషు కుమారుడైన యెరుబ్బయలు తన యింట నివసించుటకు పోయెను.౹

30 గిద్యోనుకు అనేక భార్యలున్నందున కడుపున కనిన డెబ్బదిమంది కుమారులు అతనికుండిరి.౹

31 షెకెములోనున్న అతని ఉపపత్నియు అతని కొక కుమారుని కనగా గిద్యోను వానికి అబీమెలెకను పేరు పెట్టెను.౹

32 యోవాషు కుమారుడైన గిద్యోను మహా వృద్ధుడై చనిపోయి అబీయెజ్రీయుల ఒఫ్రాలోనున్న తన తండ్రియైన యోవాషు సమాధిలో పాతిపెట్టబడెను.

33 గిద్యోను చనిపోయిన తరువాత ఇశ్రాయేలీయులు చుట్టునుండు తమ శత్రువులచేతిలోనుండి తమ్మును విడి పించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసికొనక

34 మరల బయలుల ననుసరించి వ్యభిచారులై బయల్బెరీతును తమకు దేవతగా చేసికొనిరి.౹

35 మరియు వారు గిద్యోనను యెరుబ్బయలు ఇశ్రాయేలీయులకు చేసిన ఉపకార మంతయు మరచి అతని యింటివారికి ఉపకారము చేయక పోయిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JDG/8-11723bd47ef49b49bfc379028a254501.mp3?version_id=1787—

Categories
న్యాయాధిపతులు

న్యాయాధిపతులు 9

1 యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షెకెములోనున్న తన తల్లి సహోదరులయొద్దకుపోయి వారితోను తన తల్లి పితరుల కుటుంబికులందరితోను

2 –మీరు దయచేసి షెకెము యజమానులందరు వినునట్లు వారితో మాటలాడి –మీకేది మంచిది? యెరుబ్బయలుయొక్క కుమారులైన డెబ్బదిమంది మనుష్యులందరు మిమ్మును ఏలుటమంచిదా? ఒక్క మనుష్యుడు మిమ్మును ఏలుటమంచిదా? నేను మీ రక్తసంబంధినని జ్ఞాపకముచేసికొనుడి అని పలుకుడనెను.౹

3 అతని తల్లి సహోదరులు అతనిగూర్చి షెకెము యజమా నులు వినునట్లు ఆ మాటలన్నియు చెప్పగా వారు–ఇతడు మన సహోదరుడనుకొని తమ హృదయము అబీమెలెకుతట్టు త్రిప్పుకొనిరి;౹

4 అప్పుడు వారు బయల్బెరీతు గుడిలోనుండి డెబ్బది తులముల వెండి తెచ్చి అతనికియ్యగా వాటితో అబీమెలెకు అల్లరిజనమును కూలికి పెట్టుకొనెను, వారు అతని వశముననుండిరి.౹

5 తరువాత అతడు ఒఫ్రాలో నున్న తన తండ్రి యింటికి పోయి యెరుబ్బయలు కుమారులును తన సహోదరులునైన ఆ డెబ్బదిమంది మనుష్యులను ఒక్క రాతిమీద చంపెను. యెరుబ్బయలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగియుండి తప్పించు కొనెను.౹

6 తరువాత షెకెము యజమానులందరును మిల్లో ఇంటివారందరును కూడివచ్చి షెకెములోనున్న మస్తకి వృక్షముక్రింద దండు పాళెమునొద్ద అబీమెలెకును రాజుగా నియమించిరి.౹

7 అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరిజీము కొండకొప్పున నిలిచి యెలుగెత్తి పిలిచి వారితో ఇట్లనెను–షెకెము యజమానులారా, మీరు నా మాట వినినయెడల దేవుడు మీ మాట వినును.౹

8 చెట్లు తమమీద రాజును ఒకనిని అభిషేకించు కొనవలెనను మనస్సుకలిగి బయలుదేరి

9 మమ్మును ఏలుమని ఒలీవచెట్టు నడుగగా ఒలీవచెట్టు దేవునిని మానవులను దేనివలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నియ్యకమాని చెట్లమీద రాజునైయుండి యిటు అటు ఊగుటకు నేను వచ్చెదనా? అని వాటితో అనెను.౹

10 అప్పుడు చెట్లు–నీవు వచ్చి మమ్మును ఏలుమని అంజూరపు చెట్టు నడుగగా

11 అంజూరపు చెట్టు–చెట్లమీద రాజునైయుండి యిటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేనియ్యక మానుదునా? అని వాటితో అనెను.౹

12 అటుతరువాత చెట్లు–నీవు వచ్చి మమ్మును ఏలుమని ద్రాక్షావల్లి నడుగగా ద్రాక్షావల్లి

13 దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేనియ్యక మాని చెట్లమీద రాజునైయుండి యిటు అటు ఊగుటకు నేను వచ్చెదనా? అని వాటితో అనెను.౹

14 అప్పుడు చెట్లన్నియు నీవు వచ్చి మమ్మును ఏలుమని ముండ్లపొదయొద్ద మనవిచేయగా

15 ముండ్ల పొద–మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొన గోరినయెడల రండి నా నీడను ఆశ్రయించుడి; లేదా అగ్ని నాలోనుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయునని చెట్లతో చెప్పెను.౹

16 నా తండ్రి మీ నిమిత్తము తన ప్రాణమును నిర్లక్ష్యపెట్టి యుద్ధము చేసి మిద్యానీయుల చేతిలోనుండి మిమ్మును విడిపించెను.౹

17 అయితే మీరు నా తండ్రి కుటుంబముమీదికి లేచి, యొక రాతిమీద అతని కుమారులైన డెబ్బదిమంది మనుష్యులను చంపి, అతని పనికత్తె కుమారుడైన అబీమెలెకు మీ సహోదరుడైనందున షెకెము వారిమీద అతనిని రాజుగా నియమించియున్నారు. యెరుబ్బయలు ఎడలను అతని యింటి వారియెడలను మీరు ఉపకారము చేయకయు

18 అతడు చేసిన క్రియలకు మీరు ప్రతిక్రియ చేయకయు అబీమెలెకును రాజుగా నియమించుకొనిన విషయములో మీరు న్యాయముగాను యథార్థముగాను ప్రవర్తించినయెడల

19 నేడు మీరు యెరుబ్బయలు ఎడలను అతని యింటివారి యెడలను సత్యముగాను యథార్థముగాను ప్రవర్తించినయెడల, అబీమెలెకునందు సంతోషించుడి అతడు మీయందు సంతోషించునుగాక.౹

20 లేనియెడల అబీమెలెకు నుండి అగ్ని బయలుదేరి షెకెమువారిని మిల్లో యింటి వారిని కాల్చివేయునుగాక, షెకెమువారిలోనుండియు మిల్లో యింటినుండియు అగ్ని బయలుదేరి అబీమెలెకును దహించునుగాక అని చెప్పి

21 తన సహోదరుడైన అబీమెలెకునకు భయపడి యోతాము పారిపోయి బెయేరునకు వెళ్లి అక్కడ నివసించెను.

22 అబీమెలెకు మూడు సంవత్సరములు ఇశ్రాయేలీయులమీద ఏలికయైయుండెను.౹

23-24 అప్పుడు యెరుబ్బయలు డెబ్బదిమంది కుమారులకు చేయబడిన ద్రోహఫలము వారిని చంపిన అబీమెలెకను వారి సహోదరుని మీదికిని, అతడు తన సహోదరులను చంపునట్లు అతనిచేతులను బలపరచిన షెకెము యజమానులమీదికిని వచ్చునట్లును, వారు చేసిన ప్రాణహత్య వారిమీద వచ్చునట్లును, దేవుడు అబీమెలెకునకును షెకెము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదికి దురాత్మను పంపెను. అప్పుడు షెకెము యజమా నులు అబీమెలెకును వంచించిరి.౹

25 ఎట్లనగా షెకెము యజమానులు కొండ శిఖరములమీద అతని కొరకు మాటు గాండ్లను ఉంచి, ఆ మార్గమున తమకు సమీపించినవారినందరిని దోచుకొనిరి; అది అబీమెలెకునకు తెలుపబడెను.

26 ఎబెదు కుమారుడైన గాలును అతని బంధువులును వచ్చి షెకెమునకు చేరగా షెకెము యజమానులు అతని ఆశ్రయించిరి.౹

27 వారు పొలములలోనికి పోయి వారి ద్రాక్ష పండ్లను ఏరుకొని వాటిని త్రొక్కి కృతజ్ఞతార్పణమును చెల్లించి తమ దేవతలమందిరములోనికి పోయి అన్నపానములు పుచ్చుకొనుచు అబీమెలెకును దూషింపగా

28 ఎబెదు కుమారుడైన గాలు ఇట్లనెను–అబీమెలెకు ఏపాటివాడు? షెకెము ఏపాటివాడు? మనము అతనికెందుకు దాసులము కావలెను? అతడు యెరుబ్బయలు కుమారుడు కాడా? జెబులు అతని ఉద్యోగి కాడా? షెకెము తండ్రియైన హమోరు వారికి దాసులమగుదముగాని మనము అతని కెందుకు దాసులము కావలెను?

29 ఈ జనము నా చేతిలో ఉండినయెడల ఆహా నేను అబీమెలెకును తొలగింతును గదా అనెను. తరువాత అతడు అబీమెలెకుతో నీ సేనను ఎక్కువ చేసి బయలుదేరి రమ్మనెను.౹

30 ఆ పట్టణ ప్రధానియైన జెబులు ఎబెదు కుమారుడైన గాలు మాటలను వినినప్పుడు అతని కోపాగ్ని మండెను.౹

31 అప్పుడతడు అబీమెలెకు నొద్దకు రహస్యముగా దూతలను పంపి–ఇదిగో ఎబెదు కుమారుడైన గాలును అతని బంధువులును షెకెముకు వచ్చియున్నారు, వారు నీమీదికి ఈ పట్టణమును రేపుచున్నారు.౹

32 కావున రాత్రి నీవును నీతోనున్న జనులును లేచి పొలములో మాటుగా నుండుడి,౹

33 ప్రొద్దున సూర్యుడు ఉదయింపగానే నీవు త్వరగా లేచి పట్టణముమీద పడవలెను. అప్పుడు అతడును అతనితోనున్న జనులును నీ యొద్దకు బయలుదేరి వచ్చుచుండగా నీవు సమయము చూచి వారియెడల ప్రవర్తింపవచ్చునని వర్తమానము చేసెను.

34 అబీమెలెకును అతనితోనున్న జనులందరును రాత్రివేళ లేచి నాలుగు గుంపులై షెకెముమీద పడుటకు పొంచియుండిరి.౹

35 ఎబెదు కుమారుడైన గాలు బయలుదేరి పట్టణపు గవిని దగ్గర నిలిచినప్పుడు అబీమెలెకును అతనితోనున్న జనులును పొంచియుండుట చాలించి లేచిరి.౹

36 గాలు ఆ జనులను చూచి జెబులుతో–ఇదిగో జనులు కొండశిఖరములమీదనుండి దిగివచ్చుచున్నారనగా, జెబులు–కొండల చాయలు మనుష్యులను పోలి నీకు కనబడుచున్నవని అతనితో చెప్పెను.౹

37 గాలు–చూడుము, దేశపు ఎత్తయిన స్థలమునుండి జనులు దిగి వచ్చుచున్నారు; ఒక దండు శకునగాండ్ల మస్తకివృక్షపు త్రోవను వచ్చు చున్నదనెను.౹

38 జెబులు అతనితో ఆహాహా మనము అతని సేవింపవలసినందుకు అబీమెలెకు ఎవడనిన నీమాట యేమాయెను? ఇది నీవు తృణీకరించిన జనము కాదా? పోయి వారితో యుద్ధము చేయుడనగా

39 గాలు షెకెము యజమానుల ముందర బయలుదేరి అబీమెలెకుతో యుద్ధము చేసెను.౹

40 అబీమెలెకు అతని తరుమగా అతడు అతని యెదుట నిలువలేక పారిపోయెను. అనేకులు గాయపడి పట్టణపు గవిని ప్రవేశించు చోట పడిరి.౹

41 అప్పుడు అబీమెలెకు అరూమాలో దిగెను, గాలును అతని బంధువులును షెకెములో నివసింపకుండ జెబులు వారిని తోలివేసెను.౹

42 మరునాడు జనులు పొలములలోనికి బయలువెళ్లిరి.౹

43 అది అబీమెలెకునకు తెలియబడగా అతడు తన జనులను తీసికొని మూడు తెగలుగాచేయగా వారు ఆ పొలములో మాటుగా ఉండిరి; అప్పుడతడు చూడగా జనులు పట్టణము నుండి బయలుదేరి వచ్చుచుండిరి గనుక అతడు వారిమీదపడి వారిని హతముచేసెను.౹

44 అబీమెలెకును అతనితోనున్న తెగలును ఇంకసాగి పట్టణపు గవిని ప్రదేశమునొద్ద నిలువగా రెండు తెగలు పరుగెత్తి పొలములలోనున్న వారందరి మీదపడి వారిని హతముచేసిరి.౹

45 ఆ దినమంతయు అబీమెలెకు ఆ పట్టణస్థులతో యుద్ధముచేసి పట్టణమును చుట్టుకొని అందులోనున్న జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలమున ఉప్పు జల్లెను.

46 షెకెము గోపుర యజమానులందరు ఆ వార్త విని ఏల్ బెరీతు గుడియొక్క కోటలోనికి చొరబడిరి.౹

47 షెకెము గోపుర యజమానులందరు కూడియున్న సంగతి అబీమెలెకునకు తెలుపబడినప్పుడు

48 అబీమెలెకును అతనితోనున్న జనులందరును సల్మోను కొండనెక్కి అబీమెలెకు గొడ్డలిని చేతపట్టుకొని చెట్లనుండి పెద్దకొమ్మను నరికి యెత్తి భుజముమీద పెట్టుకొని–నేను దేనిచేయుట మీరు చూచితిరో మీరును నేను చేసినట్టుగా దానిని త్వరగా చేయుడని తనతోనున్న జనులతో చెప్పెను.౹

49 అప్పుడు ఆ జనులందరిలో ప్రతివాడును ఒక్కొక కొమ్మను నరికి అబీమెలెకును వెంబడించి ఆ కోట దగ్గర వాటిని పెట్టి వాటివలన ఆ కోటను అగ్నిచేత కాల్చిరి. అప్పుడు షెకెము గోపుర యజమానులు, అనగా స్త్రీ పురుషులు ఇంచుమించు వెయ్యిమంది చచ్చిరి.

50 తరువాత అబీమెలెకు తేబేసుకు పోయి తేబేసునొద్ద దిగి దాని పట్టుకొనెను.౹

51 ఆ పట్టణము నడుమ ఒక బలమైన గోపురముండగా స్త్రీ పురుషులును పట్టణపు యజమానులును అక్కడికి పారిపోయి తలుపులు వేసికొని గోపుర శిఖరము మీదికెక్కిరి.౹

52 అబీమెలెకు ఆ గోపురము నొద్దకు వచ్చి దానిమీదపడి యుద్ధము చేసి అగ్నిచేత దాని కాల్చుటకు గోపురద్వారమునొద్దకు రాగా

53 ఒక స్త్రీ అబీమెలెకు తలమీద తిరుగటి మీదిరాతిని పడవేసినందున అతని కపాలము పగిలెను.౹

54 అప్పుడతడు తన ఆయుధములను మోయుబంటును త్వరగా పిలిచి–ఒక స్త్రీ అతని చంపెనని నన్నుగూర్చి యెవరును అనుకొనకుండునట్లు నీ కత్తి దూసి నన్ను చంపుమని చెప్పగా ఆ బంటు అతని పొడువగా అతడు చచ్చెను.౹

55 అబీమెలెకు చనిపోయెనని ఇశ్రాయేలీయులు తెలిసికొనినప్పుడు ఎవరిచోటికి వారు పోయిరి.౹

56 అట్లు అబీమెలెకు తన డెబ్బదిమంది సహోదరులను చంపుటవలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరల అతనిమీదికి రప్పించెను.౹

57 షెకెమువారు చేసిన ద్రోహమంతటిని దేవుడు వారి తలలమీదికి మరల రాజేసెను; యెరుబ్బయలు కుమారుడైన యోతాము శాపము వారిమీదికి వచ్చెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JDG/9-40320a3eefc9d24c479b5cbae4e0f1be.mp3?version_id=1787—