Categories
సంఖ్యాకాండము

సంఖ్యాకాండము 4

1 యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను

2 –నీవు లేవీయులలో కహాతీయులను వారివారి వంశములచొప్పునను వారివారి పితరుల కుటుంబముల చొప్పునను

3 ముప్పది యేండ్లు మొదలుకొని, యేబది యేండ్లవరకు ప్రాయము కలిగి, ప్రత్యక్షపుగుడారములో పనిచేయుటకు సేనగా చేరగలవారందరి సంఖ్యను వ్రాయించుము.౹

4 అతి పరిశుద్ధమైనదాని విషయములో ప్రత్యక్షపు గుడారమునందు కహాతీయులు చేయవలసిన సేవ యేదనగా

5 దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులును లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి

6 దానిమీద సముద్రవత్సల చర్మమయమైన కప్పునువేసి దానిమీద అంతయు నీలవర్ణముగల బట్టను పరచి దాని మోతకఱ్ఱలను దూర్చవలెను.౹

7 సన్నిధిబల్లమీద నీలిబట్టను పరచి దానిమీద గిన్నెలను ధూపార్తులను పాత్రలను తర్పణ పాత్రలను ఉంచవలెను. నిత్యముగా ఉంచవలసిన రొట్టెలును దానిమీద ఉండవలెను. అప్పుడు వారు వాటిమీద ఎఱ్ఱ బట్ట పరచి

8 దానిమీద సముద్రవత్సల చర్మపు కప్పువేసి దాని మోతకఱ్ఱలను దూర్చవలెను.౹

9 మరియు వారు నీలి బట్టను తీసికొని దీపవృక్షమును దాని ప్రదీపములను దాని కత్తెరను దాని కత్తెర చిప్పలను దాని సేవలో వారు ఉప యోగపరచు సమస్త తైలపాత్రలను కప్పి

10 దానిని దాని ఉపకరణములన్నిటిని సముద్రవత్సల చర్మమయమైన కప్పులో పెట్టి దండెమీద ఉంచవలెను.౹

11 మరియు బంగారుమయమైన బలిపీఠముమీద నీలిబట్టనుపరచి సముద్రవత్సల చర్మముతో దానిని కప్పి దాని మోతకఱ్ఱలను దూర్చవలెను.౹

12 మరియు తాము పరిశుద్ధస్థలములో సేవచేయు ఆ ఉపకరణములన్నిటిని వారు తీసికొని నీలిబట్టలో ఉంచి సముద్రవత్సల చర్మముతో కప్పి వాటిని దండెమీద పెట్టవలెను.౹

13 వారు బలిపీఠపు బూడిద యెత్తి దానిమీద ధూమ్రవర్ణముగల బట్టను పరచి

14 దానిమీద తమ సేవోప కరణములన్నిటిని, అనగా ధూపార్తి ముండ్లు గరిటెలు గిన్నెలునైన బలిపీఠపు ఉపకరణములన్నిటిని దానిమీద పెట్టి, సముద్రవత్సల చర్మమయమైన కప్పును దానిమీద పరచి, దాని మోతకఱ్ఱలను తగిలింపవలెను.౹

15 దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులును పరిశుద్ధస్థలమును పరిశుద్ధస్థలముయొక్క ఉపకరణములన్నిటిని కప్పుట ముగించిన తరువాత కహాతీయులు దాని మోయ రావలెను. అయితే వారు చావకయుండునట్లు పరిశుద్ధమైనదానిని ముట్టకూడదు. ఇవి ప్రత్యక్షపు గుడారములో కహాతీయుల భారము.౹

16 యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరు పైవిచారణలోనికి వచ్చునవి ఏవనగా–దీపతైలము పరిమళధూపద్రవ్యములు నిత్య నైవేద్యము అభిషేకతైలము. మందిరమంతటి పైవిచారణ పరిశుద్ధస్థలములోనేమి, దాని ఉపకరణములలోనేమి, దానిలోనున్న అంతటి పైవిచారణలోనికి అతని భారము.

17 మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను

18 –మీరు కహాతీయుల గోత్ర కుటుంబములను లేవీయులలోనుండి ప్రత్యేకింపకుడి.౹

19 వారు అతి పరిశుద్ధమైనదానికి సమీపించినప్పుడు వారు చావక బ్రదికి యుండునట్లు మీరు వారినిగూర్చి చేయవలసినదేదనగా –అహరోనును అతని కుమారులును లోపలికి వచ్చి ప్రతి వానికి వాని వాని పనియువాని వాని బరువును నియమింపవలెను.౹

20 వారు చావకయుండునట్లు పరిశుద్ధస్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు.

21 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

22 –గెర్షోనీయులను వారివారి పితరుల కుటుంబముల చొప్పు నను వారివారి వంశముల చొప్పునను లెక్కించి సంఖ్యను వ్రాయించుము.౹

23 ముప్పదియేండ్లు మొదలుకొని యేబది యేండ్లవరకు వయస్సు కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవచేయుటకు సేనలో పని చేయ చేరువారందరిని లెక్కింపవలెను.౹

24 పనిచేయుటయు మోతలు మోయుటయు గెర్షో నీయుల సేవ;౹

25 వారు మందిరముయొక్క తెరలను ప్రత్యక్షపు గుడారమును దాని కప్పును దాని పైనున్న సముద్రవత్సల చర్మమయమైన పైకప్పును ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారపు తెరను ప్రాకార తెరలను౹

26 మందిరము చుట్టును బలిపీఠము చుట్టునుఉండు ప్రాకారపు గవినిద్వారపు తెరలను వాటి త్రాళ్లను వాటి సేవా సంబంధమైన ఉపకరణములన్నిటిని వాటికొరకు చేయబడినది యావత్తును మోయుచు పనిచేయుచు రావలెను.౹

27 గెర్షోనీయుల పని అంతయు, అనగా తాము మోయు వాటినన్నిటిని చేయుపనియంతటిని అహరోనుయొక్కయు అతని కుమారులయొక్కయు నోటిమాటచొప్పున జరుగవలెను. వారు జరుపువాటినన్నిటిని జాగ్రత్తగా చూచు కొనవలెనని వారికి ఆజ్ఞాపింపవలెను.౹

28 ప్రత్యక్షపు గుడారములో గెర్షోనీయులయొక్క పని యిది; వారు పని చేయుచు యాజకుడగు అహరోను కుమారుడైన ఈతా మారు చేతిక్రింద నుండవలెను.

29 మెరారీయులను వారివారి వంశములచొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపవలెను.౹

30 ముప్పదియేండ్లు మొదలుకొని యేబది యేండ్లవరకు వయస్సు కలిగి ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు సేనగా చేరువారందరిని లెక్కింపవలెను.౹

31 ప్రత్యక్షపు గుడారములో వారు చేయుపని అంతటి విషయములో వారు, మందిరపు పలకలను దాని అడ్డ కఱ్ఱలను దాని స్తంభములను

32 దాని దిమ్మలను దాని చుట్టునున్న ప్రాకార స్తంభములను వాటి దిమ్మలను వాటి మేకులను వాటి త్రాళ్లను వాటి ఉపకరణములన్నిటిని వాటి సంబంధమైన పనియంతటికి కావలసినవన్నిటిని వారు మోసి కాపాడవలసిన బరువులను పేర్ల వరుసను లెక్కింపవలెను.౹

33 మెరారీయుల వంశములు ప్రత్యక్షపు గుడారములో యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతిక్రింద చేయవలసిన సేవ యిది; అంతే వారు చేయవలసిన సేవ అని చెప్పెను.

34 అప్పుడు మోషే అహరోనులు సమాజప్రధానులను కహాతీయులను, అనగా వారివారి వంశముల చొప్పునను వారివారి పితరుల కుటుంబముల చొప్పునను ముప్పది యేండ్లు మొదలుకొని

35 యేబది యేండ్లవరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవచేయుటకు సేనగా చేరువారందరిని లెక్కించిరి.౹

36 వారివారి వంశములచొప్పున వారిలో లెక్కింపబడినవారు రెండువేల ఏడువందల ఏబదిమంది.౹

37 ప్రత్యక్షపు గుడారములో సేవచేయతగిన వారని కహాతీయుల వంశములలో లెక్కింపబడినవారు వీరే; యెహోవా మోషేచేత పలికించిన మాటచొప్పున మోషే అహరోనులు వారిని లెక్కించిరి.

38 గెర్షోనీయులలో వారివారి వంశములచొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింప బడినవారు, అనగా ముప్పది యేండ్లు మొదలుకొని

39 యేబది యేండ్లవరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవచేయుటకై సేనగా చేరువారందరు తమతమ వంశముల చొప్పునను

40 తమతమపితరుల కుటుంబముల చొప్పునను వారిలో లెక్కింపబడినవారు రెండువేల ఆరు వందల ముప్పదిమంది.౹

41 ప్రత్యక్షపు గుడారములో సేవ చేయతగినవారని గెర్షోనీయులలో లెక్కింపబడినవారు వీరే; యెహోవా నోటిమాటనుబట్టి మోషే అహరోనులు వారిని లెక్కించిరి.౹

42 మెరారీయుల వంశములలో తమతమ వంశముల చొప్పునను తమతమపితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడినవారు

43 అనగా ముప్పదియేండ్లు మొదలుకొని యేబదియేండ్లవరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవచేయుటకు సేనగా చేరువారు

44 అనగా తమతమ వంశములచొప్పున వారిలో లెక్కింప బడినవారు మూడువేల రెండువందలమంది.౹

45 మెరారీయుల వంశములలో లెక్కింపడినవారు వీరే; యెహోవా మోషే చేత పలికించిన మాటనుబట్టి మోషే అహరోనులు వారిని లెక్కించిరి.౹

46 మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల ప్రధానులును లెక్కించిన లేవీయులలో

47 ముప్పది యేండ్లు మొదలుకొని యేబదియేండ్లవరకు ప్రాయము కలిగి తమతమ వంశములచొప్పునను తమతమపితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడినవారు

48 అనగా ప్రత్యక్షపు గుడారములో సేవయు మోతయు జరిగించు నిమిత్తమై చేరువారందరు, అనగా వారిలో లెక్కింపబడినవారు ఎనిమిదివేల ఐదువందల ఎనుబదిమంది.౹

49 యెహోవా నోటిమాటచొప్పున మోషేచేత వారు లెక్కింపబడిరి; ప్రతివాడును తన తన సేవనుబట్టియు తన తన మోతనుబట్టియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లువారు అతనివలన లెక్కింపబడిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/NUM/4-2b219a244fabb76dac747869f1791af1.mp3?version_id=1787—

Categories
సంఖ్యాకాండము

సంఖ్యాకాండము 5

1 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.౹

2 –ప్రతి కుష్ఠరోగిని, స్రావముగల ప్రతి వానిని, శవము ముట్టుటవలన అపవిత్రుడైన ప్రతి వానిని, పాళెములోనుండి వెలివేయవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము.౹

3 నేను నివసించుచుండు వారి పాళెమును వారు అపవిత్ర పరచకుండునట్లు మగవానినేమి ఆడుదానినేమి అందరిని పంపివేయవలెను; వారిని ఆ పాళెము వెలుపలికి వెళ్లగొట్టవలెను.౹

4 ఇశ్రాయేలీయులు ఆలాగు చేసిరి; పాళెము వెలుపలికి అట్టివారిని వెళ్లగొట్టిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసిరి.

5 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –నీవు ఇశ్రాయేలీయులతో

6 –పురుషుడుగాని స్త్రీగాని యెహోవామీద తిరుగబడి మనుష్యులుచేయు పాపములలో దేనినైనను చేసి అపరాధులగునప్పుడు

7 వారు తాము చేసిన పాపమును ఒప్పుకొనవలెను. మరియు వారు తమ అపరాధమువలని నష్టమును సరిగా నిచ్చుకొని దానిలో అయిదవవంతు దానితో కలిపి యెవనికి విరోధముగా ఆ అపరాధము చేసిరో వానికిచ్చుకొనవలెను.౹

8 ఆ అపరాధ నష్టమును తీసికొనుటకు ఆ మనుష్యునికి రక్తసంబంధి లేనియెడల యెహోవాకు చెల్లింపవలసిన అపరాధ నష్టమును యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై అర్పించిన ప్రాయశ్చిత్తార్థమైన పొట్టేలును యాజకుని వగును.౹

9 ఇశ్రాయేలీయులు యాజకునికి తెచ్చు ప్రతిష్ఠితమైన వాటన్నిటిలో ప్రతిష్ఠింపబడిన ప్రతి వస్తువు యాజకుని వగును. ఎవడైనను ప్రతిష్ఠించినవి అతనివగును.౹

10 ఎవడైనను యాజకునికి ఏమైనను ఇచ్చినయెడల అది అతని దగునని చెప్పుము.

11 యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను–నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము

12 ఒకని భార్య త్రోవతప్పి వానికి ద్రోహముచేసినయెడల, అనగా వేరొకడు ఆమెతో వీర్యస్ఖలనముగా శయనించినయెడల

13 ఆమె భర్తకు ఆ సంగతి తెలియబడక వాని కన్నులకు మరుగైయుండి ఆమె అపవిత్రపరచబడినదనుటకు సాక్ష్యము లేక పోయినను, ఆమె పట్టుబడకపోయినను,౹

14 వాని మనస్సులో రోషము పుట్టి అపవిత్రపరచబడిన తన భార్యమీద కోపపడినయెడల, లేక వాని మనస్సులో రోషముపుట్టి అపవిత్ర పరచబడని తన భార్యమీద కోపపడినయెడల,౹

15 ఆ పురుషుడు యాజకునియొద్దకు తన భార్యను తీసికొనివచ్చి, ఆమె విషయము తూమెడు యవలపిండిలో పదియవ వంతును తేవలెను.వాడు దానిమీద తైలము పోయకూడదు దానిమీద సాంబ్రాణి వేయకూడదు; ఏలయవగా అది రోషవిషయమైన నైవేద్యము, అనగా దోషమును జ్ఞాపకముచేయుటకై జ్ఞాపకార్థమైన నైవేద్యము.౹

16 అప్పుడు యాజకుడు ఆమెను దగ్గరకు తీసికొనివచ్చి యెహోవా సన్నిధిని ఆమెను నిలువబెట్టవలెను.౹

17 తరువాత యాజకుడు మంటికుండతో పరిశుద్ధమైన నీళ్లు తీసికొనవలెను, మరియు యాజకుడు మందిరములో నేలనున్న ధూళి కొంచెము తీసికొని ఆ నీళ్లలో వేయవలెను.౹

18 తరువాత యాజకుడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలువబెట్టి, ఆ స్త్రీ తల ముసుకును తీసి, రోష విషయమైన నైవేద్యమును, అనగా ఆ జ్ఞాపకార్థమైన నైవేద్యమును ఆమె చేతులలో ఉంచవలెను. శాపము పొందించు చేదునీళ్లు యాజకునిచేతిలో ఉండవలెను.౹

19 అప్పుడు యాజకుడు ఆ స్త్రీచేత ప్రమాణము చేయించి ఆమెతో చెప్పవలసిన దేమనగా–ఏ పురుషుడును నీతో శయనింపనియెడలను, నీవు నీ భర్తకు అధీనురాలవైనప్పుడు నీవు తప్పిపోయి అపవిత్రమైన కార్యముచేయక పోయినయెడలను, శాపము కలుగజేయు ఈ చేదునీళ్లనుండి నిర్దోషివి కమ్ము.౹

20 నీవు నీ భర్తకు అధీనురాలవైనప్పుడు నీవు త్రోవతప్పి అపవిత్ర పరచబడినయెడల, అనగా నీ భర్తకు మారుగా వేరొక పురుషుడు నీతో కూటమిచేసినయెడల

21 యెహోవా నీ నడుము పడునట్లును నీ కడుపు ఉబ్బునట్లును చేయుటవలన యెహోవా నీ జనులమధ్యను నిన్ను శపథమునకును ప్రమాణమునకును ఆస్పదముగా చేయుగాక.౹

22 శాపము కలుగజేయు ఈ నీళ్లు నీ కడుపు ఉబ్బునట్లును నీ నడుము పడునట్లును చేయుటకు నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీచేత శపథ ప్రమాణము చేయించిన తరువాత ఆ స్త్రీ– ఆమేన్అని చెప్పవలెను.౹

23 తరువాత యాజకుడు పత్రముమీద ఆ శపథములను వ్రాసి ఆ చేదు నీళ్లతో వాటిని తుడిచి

24 శాపము కలుగజేయు ఆ చేదు నీళ్లను ఆ స్త్రీకి త్రాగింపవలెను. శాపము కలుగజేయు ఆ నీళ్లు ఆమెలోనికి చేదు పుట్టించును.౹

25 మరియు యాజకుడు ఆ స్త్రీ చేతినుండి దోష విషయమైన ఆ నైవేద్యమును తీసికొని యెహోవా సన్నిధిని ఆ నైవేద్యమును అల్లాడించి బలిపీఠము నొద్దకు దాని తేవలెను.౹

26 తరువాత యాజకుడు దానికి జ్ఞాపకార్థమైనదిగా ఆ నైవేద్యములోనుండి పిడికెడు తీసి బలిపీఠముమీద దాని దహించి

27 ఆ నీళ్లు ఆ స్త్రీకి త్రాగింపవలెను. అతడు ఆమెకు ఆ నీళ్లు త్రాగించిన తరువాత జరుగునదేదనగా, ఆమె అపవిత్రపరపబడి తన భర్తకు ద్రోహము చేసినయెడల, శాపము కలుగజేయు ఆ నీళ్లు చేదై ఆమెలోనికి చేరిన తరువాత ఆమె కడుపు ఉబ్బును ఆమె నడుము పడిపోవును. ఆ స్త్రీ తన జనులమధ్య శాపమున కాస్పదముగా నుండును.౹

28 ఆ స్త్రీ అపవిత్ర పరపబడక పవిత్రురాలై యుండినయెడల, ఆమె నిర్దోషియై గర్భవతియగునని చెప్పుము.౹

29 రోషము విషయమైన విధి యిదే. ఏ స్త్రీయైనను తన భర్త అధీనములోనున్నప్పుడు త్రోవ తప్పి అపవిత్రపడినయెడలనేమి,౹

30 లేక వానికి రోషము పుట్టి తన భార్యమీద కోపపడినయెడలనేమి,వాడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలువబెట్టినప్పుడు యాజకుడు ఆమెయెడల సమస్తము విధిచొప్పున చేయవలెను.౹

31 అప్పుడు ఆ పురుషుడు నిర్దోషియగును, ఆ స్త్రీ తాను చేసిన దోషమును భరింపవలెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/NUM/5-8d5c9557cfd5073920782793acd00862.mp3?version_id=1787—

Categories
సంఖ్యాకాండము

సంఖ్యాకాండము 6

1 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము.౹

2 పురుషుడేగాని స్త్రీయేగాని యెహోవాకు నాజీరగుటకుఎవరైనను మ్రొక్కుకొని తన్నుతాను ప్రత్యేకించుకొనినయెడలవాడు ద్రాక్షారస మద్యములను మానవలెను.౹

3 ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు; ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు; పచ్చివిగాని యెండినవిగాని ద్రాక్షపండ్లను తినవలదు.౹

4 అతడు ప్రత్యేకముగా నుండు దినములన్నియు పచ్చికాయలేగాని పైతోలేగాని ద్రాక్షావల్లిని పుట్టినదేదియు తినవలదు.౹

5 అతడు నాజీ రగుటకు మ్రొక్కుకొనిన దినములన్నిటిలో మంగలకత్తి అతని తలమీద వేయవలదు, అతడు యెహోవాకు తన్నుతాను ప్రత్యేకించుకొనిన దినములు నెరవేరువరకు అతడు ప్రతిష్ఠితుడై తన తలవెండ్రుకలను ఎదుగనియ్యవలెను.౹

6 అతడు యెహోవాకు ప్రత్యేకముగానుండు దినములన్ని టిలో ఏ శవమును ముట్టవలదు.౹

7 తన దేవునికి మీదు కట్టబడిన తలవెండ్రుకలు అతని తలమీదనుండును గనుక అతని తండ్రిగాని తల్లిగాని సహోదరుడుగాని సహోదరిగాని చనిపోయినను వారినిబట్టి అతడు తన్నుతాను అపవిత్రపరచుకొనవలదు.౹

8 అతడు ప్రత్యేకముగాఉండు దినములన్నియు అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును.౹

9 ఒకడు అతనియొద్ద హఠాత్తుగా చనిపోవుటవలన ప్రత్యేకముగా ఉండువాని తల అపవిత్రపరపబడినయెడల అతడు పవిత్రపరపబడు దినమున, అనగా ఏడవదినమున తనతల గొరిగించుకొనవలెను.౹

10 ఎనిమిదవదినమున అతడు రెండు తెల్లగువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దనున్న యాజకునియొద్దకు తేవలెను.౹

11 అప్పుడు యాజకుడు ఒకదానితో పాపపరిహారార్థబలిని రెండవదానితో దహన బలిని అర్పించి,వాడు శవము ముట్టుటవలన పాపి యైనందున వాని నిమిత్తము ప్రాయశ్చిత్తముచేసి ఆ దినమున వాని తలను పరిశుద్ధపరపవలెను.౹

12 మరియు తాను ప్రత్యేకముగాఉండు దినములను మరల యెహోవాకు తన్ను ప్రత్యేకించుకొని అపరాధపరిహారార్థబలిగా ఏడాది గొఱ్ఱెపిల్లను తీసికొని రావలెను; తన వ్రతసంబంధమైన తలవెండ్రుకలు అపవిత్రపరపబడెను గనుకమునుపటి దినములు వ్యర్థమైనవి.

13 నాజీరు ప్రత్యేకముగాఉండు దినములు నిండిన తరువాత వానిగూర్చిన విధి యేదనగా, ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దకు వానిని తీసికొని రావలెను.౹

14 అప్పుడతడు దహనబలిగాను నిర్దోషమైన యేడాది మగ గొఱ్ఱెపిల్లను, పాపపరిహారార్థబలిగాను నిర్దోషమైన యేడాది ఆడు గొఱ్ఱెపిల్లను, సమాధాన బలిగాను నిర్దోషమైన యొక పొట్టేలును,౹

15 గంపెడు పొంగని పిండి, అనగా గోధుమపిండి వంటలను నూనె కలిపిన గోధుమ పిండితో చేసిన భక్ష్యములను నూనె పూసిన పొంగని పూరీలను వాటి నైవేద్యమును పానార్పణములను అర్పణముగా యెహోవాయొద్దకు తేవలెను.౹

16 అప్పుడు యాజకుడు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చి అతని నిమిత్తము పాపపరిహారార్థబలిని దహనబలిని అర్పింపవలెను.౹

17 యాజకుడు ఆ గంపెడు పొంగని భక్ష్యములతో ఆ పొట్టేలును యెహోవాకు సమాధానబలిగా అర్పింపవలెను; వాని నైవేద్యమును వాని పానార్పణమును అర్పింపవలెను.౹

18 అప్పుడా నాజీరు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము నొద్ద తన వ్రతసంబంధమైన తన తలవెండ్రుకలు గొరిగించుకొని, ఆ వ్రతసంబంధమైన తన తలవెండ్రుకలు తీసికొని, సమాధానబలి ద్రవ్యము క్రిందనున్న అగ్నిలో వేయవలెను.౹

19 మరియు యాజకుడు ఆ పొట్టేలుయొక్క వండిన జబ్బను ఆ గంపలోనుండి పొంగని యొక భక్ష్యమును పొంగని యొక పూరీని తీసికొని నాజీరు తన వ్రతసంబంధమైన వెండ్రుకలు గొరికించుకొనిన పిమ్మట అతనిచేతులమీద వాటి నుంచవలెను.౹

20 తరువాత యాజకుడు యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా వాటిని అల్లాడింపవలెను. అల్లాడింపబడు బోరతోను ప్రతిష్ఠితమైన జబ్బతోను అది యాజకునికి ప్రతిష్ఠితమగును; తరువాత ఆ నాజీరు ద్రాక్షారసము త్రాగవచ్చును.౹

21 మ్రొక్కుకొనిన నాజీరు తన కలిమి కొలది ఇచ్చు దాని గూర్చిన విధియు, అతడు నాజీరైయున్నందున యెహోవాకు అర్పింపవలసిన దాని గూర్చిన విధియు ఇదే. తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున నాజీరునుగూర్చిన విధిని బట్టి ఇదియంతయు చేయవలెనని చెప్పుము.

22 యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను–నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఈలాగనుము

23 –మీరు ఇశ్రాయేలీయులను ఈలాగు దీవింపవలెను.౹

24 యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక;౹

25 యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక;౹

26 యెహోవా నీమీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. అట్లువారు ఇశ్రాయేలీయులమీద నా నామమును ఉచ్చరించుటవలన నేను వారిని ఆశీర్వదించెదను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/NUM/6-6db7cc93ccf0626a3eff5e10ce4aede1.mp3?version_id=1787—

Categories
సంఖ్యాకాండము

సంఖ్యాకాండము 7

1 మోషే మందిరమును నిలువబెట్టుట ముగించి దాని అభిషేకించి ప్రతిష్ఠించి,౹

2 దాని ఉపకరణములన్నిటిని బలిపీఠమును దాని పాత్రలన్నిటిని చేయించి, అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున తమతమపితరుల కుటుంబములలో ప్రధానులును గోత్ర ముఖ్యులును లెక్కింప బడిన వారిమీద అధిపతులునైన ఇశ్రాయేలీయులలోని ప్రధానులు అర్పణములను తెచ్చిరి.౹

3 వారు ఇద్దరిద్దరికి ఒక్కొక బండి చొప్పునను, ప్రతివానికి ఒక్కొక యెద్దు చొప్పునను, ఆరు గూడు బండ్లను పండ్రెండు ఎద్దులను యెహోవా సన్నిధికి తీసికొనివచ్చిరి. వారు మందిరము ఎదుటికి వాటిని తీసికొనివచ్చిరి.౹

4-5 అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను–నీవు వారియొద్ద ఈ వస్తువులను తీసికొనుము; అవి ప్రత్యక్షపు గుడారముయొక్క సేవకై యుండును; నీవు వాటిని లేవీయులలో ప్రతివానికిని వాని వాని సేవ చొప్పున ఇయ్యవలెను.౹

6 మోషే ఆ బండ్లను ఆ యెద్దులను తీసికొని లేవీయుల కిచ్చెను.౹

7 అతడు రెండు బండ్లను నాలుగు ఎద్దులను వారి వారి సేవచొప్పున గెర్షోనీయులకిచ్చెను.౹

8 అతడు నాలుగు బండ్లను ఎనిమిది యెద్దులను యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతిక్రింద సేవచేయు మెరారీ యులకు వారి వారి సేవచొప్పున ఇచ్చెను.౹

9 కహాతీయుల కియ్యలేదు; ఏలయనగా పరిశుద్ధస్థలపు సేవ వారిది; తమ భుజములమీద మోయుటయే వారి పని గనుక వారికి వాహనములను నియమింపలేదు.౹

10 బలిపీఠము అభిషేకింప బడిననాడు ఆ ప్రధానులు దానికి ప్రతిష్ఠార్పణములను తెచ్చిరి; ప్రధానులు బలిపీఠము ఎదుటికి తమతమ అర్పణములను తెచ్చిరి.౹

11 బలిపీఠమును ప్రతిష్ఠించుటకు వారిలో ఒక్కొక్క ప్రధానుడు ఒక్కొక్క దినమున తన తన అర్పణమును అర్పింపవలెనని యెహోవా మోషేకు సెలవిచ్చెను.

12 మొదటి దినమున తన అర్పణమును తెచ్చినవాడు అమ్మీనాదాబు కుమారుడును యూదా గోత్రికుడునైన నయస్సోను.౹

13 అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూటముప్పది తులముల యెత్తుగల వెండిగిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని

14 ధూపద్రవ్యముతో నిండిన పది తులముల బంగారు ధూపార్తిని

15 దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను

16 అపరాధ పరిహారార్థబలిగా ఒక మేకపిల్లను

17 సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను అర్పణము.

18 రెండవదినమున అర్పణమును తెచ్చినవాడు సూయారు కుమారుడును ఇశ్శాఖారీయులకు ప్రధానుడునైన నెతనేలు.౹

19 అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండ నూనెతో కలిసిన గోధుమపిండిని

20 ధూపద్రవ్యముతో నిండిన పది తులముల బంగారు ధూపార్తిని

21 దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును

22 ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను

23 సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది సూయారు కుమారుడైన నెతనేలు అర్పణము.

24 మూడవదినమున అర్పణమును తెచ్చినవాడు హేలోను కుమారుడును జెబూలూను కుమారులకు ప్రధానుడునైన ఏలీయాబు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూటముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను

25 నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని

26 ధూప ద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును

27 ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను

28 సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను

29 అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది హేలోను కుమారుడైన ఏలీయాబు అర్పణము.

30 నాలుగవదినమున అర్పణమును తెచ్చినవాడు షెదేయూరు కుమారుడును రూబేనీయులకు ప్రధానుడునైన ఏలీసూరు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూటముప్పది తులముల యెత్తుగల వెండిగిన్నెను

31 డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని

32 ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును

33 ఏడాది గొఱ్ఱెపిల్లను, పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను

34-35 సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది షెదేయూరు కుమారుడైన ఏలీసూరు అర్పణము.

36 అయిదవదినమున అర్పణమును తెచ్చినవాడు సూరీష దాయి కుమారుడును షిమ్యోనీయులకు ప్రధానుడునైన షెలుమీయేలు.౹

37 అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని

38 ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని దహనబలిగా ఒక చిన్నకోడెను

39 ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను

40 పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను

41 సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది సూరీషదాయి కుమారుడైన షెలుమీయేలు అర్పణము.

42 ఆరవదినమున అర్పణమును తెచ్చినవాడు దెయూవేలు కుమారుడును గాదీయులకు ప్రధానుడునైన ఎలీయా సాపు.౹

43 అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూటముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమపిండిని

44 ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని

45 దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను

46-47 పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది దెయూవేలు కుమారుడైన ఎలీయాసాపు అర్పణము.

48 ఏడవదినమున అర్పణమును తెచ్చినవాడు అమీ హూదు కుమారుడును ఎఫ్రాయిమీయులకు ప్రధానుడునైన ఎలీషామా.౹

49 అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూటముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమపిండిని

50 ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని

51 దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును, ఏడాది గొఱ్ఱెపిల్లను పాప పరిహారార్థబలిగా ఒక మేకపిల్లను

52 సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను

53 అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది అమీహూదు కుమారుడైన ఎలీ షామా అర్పణము.

54 ఎనిమిదవదినమున అర్పణమును తెచ్చినవాడు పెదా సూరు కుమారుడును మనష్షీయులకు ప్రధానుడునైన గమలీ యేలు.౹

55 అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమపిండిని ధూపద్రవ్యముతో నిండిన పది తులముల బంగారు ధూపార్తిని

56 దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను

57-58 అపరాధపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను.౹

59 ఇది పెదాసూరు కుమారుడైన గమలీయేలు అర్పణము.

60 తొమ్మిదవదినమున అర్పణమును తెచ్చినవాడు గిద్యోనీ కుమారుడును బెన్యామీనులకు ప్రధానుడునైన అబీదాను.౹

61 అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమపిండిని ధూప ద్రవ్యముతో నిండియున్న పది షెకెలుల బంగారు ధూపార్తిని

62 దహనబలిగా ఒక చిన్న కోడెను

63 ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను

64 పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను

65 సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది గిద్యోనీ కుమారుడైన అబీదాను అర్పణము.

66 పదియవదినమున అర్పణమును తెచ్చినవాడు అమీష ద్దాయి కుమారుడును దానీయులకు ప్రధానుడునైన అహీ యెజెరు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి

67 నూటముప్పది తులముల యెత్తు గల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటిలో నూనెతో కలిసి నిండిన గోధుమ పిండిని

68 ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని

69 దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను

70 సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను

71 అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది అమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు అర్పణము.

72 పదకొండవదినమున అర్పణమును తెచ్చినవాడు ఒక్రాను కుమారుడును ఆషేరీయులకు ప్రధానుడునైన పగీయేలు.౹

73 అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూటముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని

74 ధూపద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని

75 దహనబలిగా ఒక చిన్న కోడెను ఒక పొట్టేలును

76 ఏడాది గొఱ్ఱెపిల్లను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను

77 సమాధానబలిగా రెండు కోడెలను అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది ఒక్రాను కుమారుడైన పగీయేలు అర్పణము.

78 పండ్రెండవదినమున అర్పణమును తెచ్చినవాడు ఏనాను కుమారుడు నఫ్తాలీయులకు ప్రధానుడునైన అహీర.౹

79 అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటినిండ నూనెతో కలిసిన గోధుమ పిండిని

80 ధూప ద్రవ్యముతో నిండియున్న పది తులముల బంగారు ధూపార్తిని

81 దహనబలిగా ఒక చిన్నకోడెను ఒక పొట్టేలును ఏడాది గొఱ్ఱెపిల్లను

82 పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సమాధానబలిగా రెండు కోడెలను

83 అయిదు పొట్టేళ్లను అయిదు మేకపోతులను ఏడాదివి అయిదు గొఱ్ఱెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది ఏనాను కుమారుడైన అహీర అర్పణము.

84 బలిపీఠము అభిషేకింపబడిన దినమున ఇశ్రాయేలీయుల ప్రధానులు అర్పించిన ప్రతిష్ఠార్పణములు ఇవి, వెండి గిన్నెలు పండ్రెండు, వెండి ప్రోక్షణపాత్రలు పండ్రెండు, బంగారు ధూపార్తులు పండ్రెండు, ప్రతి వెండిగిన్నె నూట ముప్పది తులములది.౹

85 ప్రతి ప్రోక్షణపాత్ర డెబ్బది తులములది; ఆ ఉపకరణముల వెండి అంతయు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి రెండువేల నాలుగువందల తులములది.౹

86 ధూపద్రవ్యముతో నిండిన బంగారు ధూపా ర్తులు పండ్రెండు; వాటిలో ఒకటి పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి పది తులములది.౹

87 ఆ ధూపార్తుల బంగారమంతయు నూటఇరువది తులములది; దహనబలి పశువులన్నియు పండ్రెండు కోడెలు, పొట్టేళ్లు పండ్రెండు, ఏడాదివైన గొఱ్ఱెపిల్లలు పండ్రెండు, వాటి నైవేద్యములును పాపపరిహారార్థమైన మగమేకపిల్లలు పండ్రెండు,౹

88 సమాధానబలి పశువులన్నియు ఇరువదినాలుగు కోడెలు,౹

89 పొట్టేళ్లు అరువది, మేకపోతులు అరువది, ఏడాదివైన గొఱ్ఱెపిల్లలు అరువది.౹

90 మోషే యెహోవాతో మాటలాడుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లినప్పుడు సాక్ష్యపు మందసముమీద నున్న కరుణాపీఠముమీద నుండి, అనగా రెండు కెరూబుల నడమనుండి తనతో మాటలాడిన యెహోవా స్వరము అతడు వినెను, అతడు ఆయనతో మాటలాడెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/NUM/7-d916d8ce1db33fab3500987ba812a94a.mp3?version_id=1787—

Categories
సంఖ్యాకాండము

సంఖ్యాకాండము 8

1 యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను–నీవు అహరోనుతో

2 నీవు దీపములను వెలిగించునప్పుడు ఆ యేడు దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడునట్లు వాటిని వెలిగింపవలెనని చెప్పుమనెను. అహరోను ఆలాగు చేసెను.౹

3 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను.౹

4 ఆ దీపవృక్షము బంగారు నకిషిపనిగలది; అది దాని స్తంభము మొదలుకొని పుష్పములవరకు నకిషిపనిగలది; యెహోవా కనుపరచిన మాదిరినిబట్టి మోషే ఆ దీపవృక్షమును చేయించెను.

5 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –నీవు ఇశ్రాయేలీయులలోనుండి

6 లేవీయులను ప్రత్యే కించి వారిని పవిత్రపరచుము.౹

7 వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసినదేమనగా, వారిమీద పాపపరిహా రార్థజలమును ప్రోక్షింపుము; అప్పుడు వారు మంగలి కత్తితో తమ శరీరమంతయు గొరిగించుకొని

8 తమ బట్టలు ఉదుకుకొని పవిత్రపరచుకొనిన తరువాత వారు ఒక కోడెను దాని నైవేద్యమును, అనగా తైలముతో కలిసిన గోధుమపిండిని తేవలెను. నీవు పాపపరిహారార్థబలిగా మరియొక కోడెను తీసికొని రావలెను.౹

9 అప్పుడు నీవు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి లేవీయులను తోడుకొని వచ్చి ఇశ్రాయేలీయుల సర్వసమాజమును పోగుచేయవలెను.౹

10 నీవు యెహోవా సన్నిధికి లేవీయులను తోడుకొనివచ్చిన తరువాత ఇశ్రాయేలీయులు తమ చేతులను ఆ లేవీయులమీద ఉంచవలెను.౹

11 లేవీయులు యెహోవా సేవచేయు వారవుటకు అహరోనును ఇశ్రాయేలీయులును ప్రతిష్ఠార్పణముగా వారిని యెహోవా సన్నిధిని ప్రతిష్ఠింపవలెను.౹

12 లేవీయులు ఆ కోడెల తలలమీద తమ చేతులుంచిన తరువాత నీవు లేవీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు యెహోవాకు వాటిలో ఒకదానిని పాపపరిహారార్థబలిగాను రెండవ దానిని దహనబలిగాను అర్పించి

13 అహరోను ఎదుటను అతని కుమారుల యెదుటను లేవీయులను నిలువబెట్టి యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా వారిని అర్పింపవలెను.౹

14-15 అట్లు నీవు ఇశ్రాయేలీయులలోనుండి లేవీయులను వేరుపరచవలెను; లేవీయులు నావారై యుందురు. తరువాత నీవు వారిని పవిత్రపరచి ప్రతిష్ఠార్పణముగా వారిని అర్పించినప్పుడు లేవీయులు ప్రత్యక్షపు గుడారములో సేవచేయుటకై లోపలికి వెళ్లవచ్చును.౹

16 ఇశ్రాయేలీయులలో వారు నా వశము చేయబడినవారు; తొలిచూలియైన ప్రతివానికిని, అనగా ఇశ్రాయేలీయులలో ప్రథమ సంతానమంతటికిని ప్రతిగా వారిని నేను తీసికొనియున్నాను.౹

17 ఏలయనగా మనుష్యులలోను పశువులలోను ఇశ్రాయేలీయులలో తొలిచూలియైనది యావత్తును నాది; ఐగుప్తుదేశములో తొలిచూలియైన ప్రతివానిని నేను సంహరించిననాడు వారిని నాకొరకు ప్రతిష్ఠించుకొంటిని.౹

18 ఇశ్రాయేలీయులలో తొలిచూలియైన ప్రతివానికి మారుగా లేవీయులను తీసికొని యున్నాను.౹

19 మరియు ప్రత్యక్షపు గుడారములో ఇశ్రాయేలీయుల నిమిత్తము సేవచేయుటకును ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, ఇశ్రాయేలీయులలో లేవీయులను అహరోనుకును అతని కుమారులకును ఇచ్చి అప్పగించియున్నాను. అందువలన ఇశ్రాయేలీయులు పరిశుద్ధమందిరమునకు సమీపించునప్పుడు ఏ తెగులైనను ఇశ్రాయేలీయులకు సంభవింపకపోవును అని చెప్పెను.౹

20 అప్పుడు మోషే అహరోనులును ఇశ్రాయేలీయుల సర్వసమాజము యెహోవా లేవీయులనుగూర్చి మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమునుబట్టి లేవీయులయెడల చేసిరి; ఇశ్రాయేలీయులు వారికి అట్లేచేసిరి.౹

21 లేవీయులు తమ్మును పవిత్రపరచుకొని తమ బట్టలు ఉదుకుకొనిన తరువాత అహరోను యెహోవా సన్నిధిని ప్రతిష్ఠార్పణముగా వారిని అర్పించెను. వారిని పవిత్రపరచుటకు అహరోను వారినిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను.౹

22 తరువాత లేవీయులు అహరోను ఎదుటను అతని కుమారుల యెదుటను ప్రత్యక్షపు గుడారములో సేవచేయుటకు లోపలికి వెళ్లిరి. యెహోవా లేవీయులనుగూర్చి మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు వారియెడల చేసెను.౹

23 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను–ఇది లేవీయులనుగూర్చిన విధి.౹

24 ఇరువదియైదేండ్లు మొదలుకొని పైప్రాయముగల ప్రతివాడును ప్రత్యక్షపు గుడారముయొక్క సేవలో పని చేయుటకు రావలెను.౹

25 అయితే ఏబది ఏండ్ల వయస్సు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరకుండవలెను.౹

26 వారు కాపాడవలసినవాటిని కాపాడుటకు ప్రత్యక్షపు గుడారములో తమ గోత్రపువారితోకూడ పరిచర్య చేయవలెనుగాని పనిచేయవలదు. లేవీయులు కాపాడవలసిన వాటివిషయము నీవు వారికి ఆలాగు నియమింపవలెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/NUM/8-293268aef5cfdc32f9ee423c0576c861.mp3?version_id=1787—

Categories
సంఖ్యాకాండము

సంఖ్యాకాండము 9

1 ఐగుప్తుదేశములోనుండి వారు వచ్చిన తరువాత రెండవ సంవత్సరము మొదటి నెలలో యెహోవా సీనాయి అరణ్యమందు మోషేకు ఈలాగు సెలవిచ్చెను

2 ఇశ్రాయేలీయులు పస్కాపండుగను దాని నియామకకాలమందు ఆచరింపవలెను.౹

3 దాని నియామక కాలమున, అనగా ఈ నెల పదునాలుగవదినమున సాయంకాలమందు దానిని ఆచరింపవలెను; దాని కట్టడలన్నిటినిబట్టి దాని విధులన్నిటినిబట్టి మీరు దానిని ఆచరింపవలెను.౹

4 కాబట్టి మోషే –పస్కాపండుగను ఆచరింపవలెనని ఇశ్రాయేలీయులతో చెప్పగా వారు సీనాయి అరణ్యమందు మొదటి నెల పదునాలుగవదినమున సాయంకాలమందు పస్కాపండుగ సామగ్రిని సిద్ధపరచుకొనిరి.౹

5 యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును ఇశ్రాయేలీయులు అతడు చెప్పినట్లే చేసిరి.౹

6 కొందరు నరశవమును ముట్టుటవలన అపవిత్రులై ఆ దినమున పస్కాపండుగను ఆచరింపలేకపోయిరి.౹

7 వారు ఆ దినమున మోషే అహరోనుల ఎదుటికి వచ్చి మోషేతో – నరశవమును ముట్టుటవలన అపవిత్రులమైతిమి; యెహోవా అర్పణమును దాని నియామకకాలమున ఇశ్రాయేలీయులమధ్యను అర్పింపకుండునట్లు ఏల అడ్డగింపబడితిమని అడుగగా

8 మోషే–నిలువుడి; మీ విషయములో యెహోవా యేమి సెలవిచ్చునో నేను తెలిసి కొందునని వారితో అనెను.

9 అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము

10 –మీలోగాని మీ వంశములలోగాని ఒకడు శవమును ముట్టుటవలన అప విత్రుడైనను, దూరప్రయాణము చేయుచుండినను, అతడు యెహోవా పస్కాపండుగను ఆచరింపవలెను.౹

11 వారు రెండవనెల పదునాలుగవదినమున సాయంకాలమున దానిని ఆచరించి పొంగనివాటితోను చేదు ఆకుకూరలతోను దానిని తినవలెను.౹

12 వారు మరునాటివరకు దానిలో కొంచెమైనను మిగలనీయవలదు; దానిలోనిది ఒక్క యెముకనైనను విరువవలదు; పస్కాపండుగ విషయమైన కట్టడ లన్నిటినిబట్టి వారు దానిని ఆచరింపవలెను.౹

13 ప్రయాణములో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించుట మానినయెడల ఆ మనుష్యుడు తన జనులలోనుండి కొట్టివేయబడును. అతడు యెహోవా అర్పణమును దాని నియామక కాలమున అర్పింపలేదు గనుక ఆ మనుష్యుడు తన పాపమును తానే భరింపవలెను.౹

14 మీలో నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింప గోరునప్పుడు అతడు పస్కా కట్టడచొప్పున దాని విధినిబట్టియే దానిని చేయవలెను. పరదేశికిని మీ దేశములో పుట్టినవానికిని మీకును ఒకటే కట్టడ ఉండవలెను.

15 వారు మందిరమును నిలువబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను; సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు అగ్నివంటి ఆకారము మందిరముమీద నుండెను.౹

16 నిత్యమును ఆలాగే జరిగెను. మేఘము మందిరమును కమ్మెను; రాత్రియందు అగ్నివంటి ఆకారము కనబడెను.౹

17 ఆ మేఘము గుడారము మీదనుండి పైకెత్తబడునప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమైసాగిరి; ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీయులు తమ గుడారములను వేసికొనిరి.౹

18 యెహోవానోటిమాటచొప్పున ఇశ్రాయేలీయులు ప్రయాణమైసాగిరి. యెహోవా నోటిమాటచొప్పునవారు తమ గుడారములను వేసికొనిరి. ఆ మేఘము మందిరముమీద నిలిచియుండిన దినములన్నియు వారు నిలిచిరి.౹

19 ఆ మేఘము బహుదినములు మందిరముమీద నిలిచినయెడల ఇశ్రాయేలీయులు యెహోవా విధిననుసరించి ప్రయాణము చేయకుండిరి.౹

20 మేఘము కొన్ని దినములు మందిరముమీద నిలిచినయెడల వారును నిలిచిరి; యెహోవా నోటిమాటచొప్పుననే నిలిచిరి, యెహోవా నోటిమాటచొప్పుననే ప్రయాణము చేసిరి.౹

21 ఆలాగే మేఘము సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు నిలిచినయెడల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడగానే వారు ప్రయాణము చేసిరి. పగలేమి రాత్రియేమి ఆ మేఘము పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణము చేసిరి.౹

22 ఆ మేఘము రెండుదినములుగాని, ఒక నెలగాని, యేడాదిగాని తడవు చేసి మందిరముమీద నిలిచినయెడల ఇశ్రాయేలీయులు ప్రయాణముచేయక తమ గుడారములలో నిలిచిరి. అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణము చేసిరి.౹

23 యెహోవా మాటచొప్పునవారు తమ గుడారములను వేసికొనిరి; యెహోవా మాటచొప్పునవారు ప్రయాణముచేసిరి; మోషేద్వారా యెహోవా చెప్పిన మాటనుబట్టి యెహోవా ఆజ్ఞ ననుసరించి నడిచిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/NUM/9-08558d182dfc1368ba57250fc92c5028.mp3?version_id=1787—

Categories
సంఖ్యాకాండము

సంఖ్యాకాండము 10

1 యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను–నీవు . రెండు వెండి బూరలు చేయించుకొనుము;౹

2 నకిషిపనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తర్లించుటకును నీకుండవలెను.౹

3 ఊదువారు వాటిని ఊదునప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునెదుట నీ యొద్దకు కూడి రావలెను.౹

4 వారు ఒకటే ఊదినయెడల ఇశ్రాయేలీయుల సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీయొద్దకు కూడి రావలెను.౹

5 మీరు ఆర్భాటముగా ఊదునప్పుడు తూర్పుదిక్కున దిగి యున్న సైన్యములు సాగవలెను.౹

6 మీరు రెండవమారు ఆర్భాటముగా ఊదునప్పుడు దక్షిణదిక్కున దిగిన సైన్యములు సాగవలెను. వారు ప్రయాణమైపోవునప్పుడు ఆర్భాటముగా ఊదవలెను.౹

7 సమాజమును కూర్చునప్పుడు ఊదవలెనుగాని ఆర్భాటము చేయవలదు.౹

8 అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఊదవలెను; నిత్యమైన కట్టడనుబట్టి అవి మీ వంశముల పరంపరగా మీకు ఉండును.౹

9 మిమ్మును బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశములో యుద్ధమునకు వెళ్లునప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలెను అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువులనుండి రక్షింపబడుదురు.౹

10 మరియు ఉత్సవ దినమందును నియామక కాలములయందును నెలల ఆరంభములయందును మీరు దహనబలులనుగాని సమాధానబలు లనుగాని అర్పించునప్పుడు ఆ బూరలు ఊదవలెను అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును మీ దేవుడైన యెహోవాను నేనే.

11 రెండవ సంవత్సరము రెండవనెల యిరువదియవ తేదిని మేఘము సాక్ష్యపు మందిరము మీదనుండి పైకెత్తబడెను గనుక ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యములోనుండి ప్రయాణములు చేయసాగిరి.౹

12 తరువాత ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచెను.౹

13 యెహోవా మోషే చేత పలికించిన మాటనుబట్టి వారు మొదట ప్రయాణము చేసిరి.౹

14 యూదీయుల పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున ముందర సాగెను; అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను ఆ సైన్యమునకు అధిపతి.౹

15 ఇశ్శాఖారీయుల గోత్రసైన్యమునకు సూయారు కుమారుడైన నెతనేలు అధిపతి.౹

16 జెబూలూనీయుల గోత్రసైన్యమునకు హేలోను కుమారుడైన ఏలీయాబు అధిపతి.౹

17 మందిరము విప్పబడినప్పుడు గెర్షోనీయులును మెరారీయులును మందిరమును మోయుచు సాగిరి.౹

18 రూబేనీయుల పాళెము ధ్వజము వారి సేనలచొప్పున సాగెను. ఆ సైన్యమునకు షెదేయూరు కుమారుడైన ఏలీసూరు అధిపతి.౹

19 షిమ్యోనీయుల గోత్రసైన్యమునకు సూరీషదాయి కుమారుడైన షెలుమీయేలు అధిపతి.౹

20 గాదీయుల గోత్రసైన్యమునకు దెయూవేలు కుమారుడైన ఎలీయాసాపు అధిపతి.౹

21 కహాతీయులు పరిశుద్ధమైనవాటిని మోయుచుసాగిరి; అందరు వచ్చులోగా వారు మందిరమును నిలువబెట్టిరి.౹

22 ఎఫ్రాయీమీయుల పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున సాగెను; ఆ సైన్యమునకు అమీహూదు కుమారుడైన ఎలీషామా అధిపతి.౹

23 పెదాసూరు కుమారుడైన గమలీయేలు మనష్షీయుల గోత్ర సైన్యమునకు అధిపతి.౹

24 గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీనుల గోత్రసైన్యమునకు అధిపతి.౹

25 దానీయుల పాళెపు ధ్వజము సాగెను; అది పాళెములన్నిటిలో వెనుక నుండెను; అమీషద్దాయి కుమారుడైన అహీయెజరు ఆ సైన్యమునకు అధిపతి

26 ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరీయుల గోత్రసైన్యమునకు అధిపతి.౹

27 ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలీయుల గోత్రసైన్యమునకు అధిపతి.౹

28 ఇశ్రాయేలీయులు ప్రయాణముచేయునప్పుడు తమతమ సైన్యముల చొప్పుననే ప్రయాణమై సాగిరి.

29 మోషే మామయగు మిద్యానీయుడైన రెవూయేలు కుమారుడగు హోబాబుతో మోషే–యెహోవా మా కిచ్చెదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమై పోవుచున్నాము; మాతోకూడ రమ్ము; మేము మీకు మేలు చేసెదము; యెహోవా ఇశ్రాయేలీయులకు తాను చేయబోవు మేలునుగూర్చి వాగ్దానము చేసెననగా

30 అందుకతడు–నేను రాను, నా దేశమునకును నా వంశస్థుల యొద్దకును వెళ్లుదుననెను.౹

31 అందుకు మోషే–నీవు దయచేసి మమ్మును విడువకుము; ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసియున్నవి; నీవు మాకు కన్నులవలె ఉందువు.౹

32 మరియు నీవు మాతోకూడ వచ్చినయెడల యెహోవా మాకు ఏ మేలుచేయునో ఆ మేలునుబట్టి మేము నీకు మేలుచేయుదుమనెను.

33 వారు యెహోవా కొండనుండి మూడుదినముల ప్రయాణముచేసిరి; వారికి విశ్రాంతిస్థలము చూచుటకు ఆ మూడుదినముల ప్రయాణములో యెహోవా నిబంధనమందసము వారికి ముందుగా సాగెను.౹

34 వారు తాము దిగిన స్థలమునుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటివేళ వారిమీద ఉండెను.

35 ఆ మందసము సాగినప్పుడు మోషే–యెహోవా లెమ్ము; నీ శత్రువులు చెదరిపోవుదురుగాక, నిన్ను ద్వేషించువారు నీ యెదుటనుండి పారిపోవుదురుగాక యనెను.౹

36 అది నిలిచినప్పుడు అతడు–యెహోవా, ఇశ్రాయేలు వేవేలమధ్యకు మరల రమ్మనెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/NUM/10-920d9d7b8201300aa95b99eb9c997d93.mp3?version_id=1787—

Categories
సంఖ్యాకాండము

సంఖ్యాకాండము 11

1 జనులు ఆయాసమునుగూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను; యెహోవా దాని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను; యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములో నొక కొనను దహింపసాగెను.౹

2 జనులు మోషేకు మొఱపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను.౹

3 యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరాఅను పేరు పెట్టబడెను.

4 వారి మధ్యనున్న మిశ్రితజనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులును మరల ఏడ్చి– మాకెవరు మాంసము పెట్టెదరు?

5 ఐగుప్తులో మేము ఉచి తముగా తినిన చేపలును కీరకాయలును దోసకాయలును కూరాకులును ఉల్లిపాయలును తెల్ల గడ్డలును జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను.౹

6 ఈ మన్నా కాక మా కన్నులయెదుట మరేమియు లేదని చెప్పుకొనిరి.౹

7 ఆ మన్నా కొతిమెరగింజలవలె ఉండెను. చూపునకు అది బోళమువలె ఉండెను.౹

8 జనులు తిరుగుచు దానిని గూర్చుకొని తిరుగట విసిరి లేక రోట దంచి పెనముమీద కాల్చి రొట్టెలు చేసిరి; దాని రుచి క్రొత్త నూనె రుచివలె ఉండెను.౹

9 రాత్రియందు మంచు పాళెముమీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను.౹

10 జనులు తమతమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారమునొద్దవారు ఏడ్వగా మోషే వినెను. యెహోవా కోపము బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికిని చెడ్డదిగా నుండెను.౹

11 కాగా మోషే యెహోవాతో యిట్లనెను–నీవేల నీ సేవకుని బాధించితివి? నామీద నీ కటాక్షము రానీయక యీ జనులందరి భారమును నామీద పెట్టనేల?

12 నేనే యీ సర్వ జనమును గర్భమున ధరించితినా? నేనే వీరిని కంటినా? పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లను మోయునట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు.౹

13 ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నా కెక్కడిది? వారు నన్ను చూచి యేడ్చుచు –తినుటకు మాకు మాంసమిమ్మని అడుగుచున్నారు

14 ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నావలన కాదు; అది నేను భరింపలేని భారము; నీవు నాకిట్లు చేయదలచినయెడల నన్ను చంపుము.౹

15 నామీద నీ కటాక్షము వచ్చినయెడల నేను నా బాధను చూడకుండునట్లు నన్ను చంపుము.

16 అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను–జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలీయుల పెద్దలలోనుండి డెబ్బదిమంది మనుష్యులను నాయొద్దకు పోగుచేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నీతోకూడ నిలువబడవలెను.౹

17 నేను దిగి అక్కడ నీతో మాటలాడెదను. మరియు నీమీద వచ్చిన ఆత్మలో పాలు వారిమీద ఉంచెదను; ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లువారు దానిలో నొక పాలు నీతోకూడ భరింపవలెను.౹

18 నీవు జనులను చూచి యిట్లనుము–మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచు కొనుడి; మీరు మాంసము తిందురు. యెహోవా వినునట్లు ఏడ్చి–మాకు ఎవరు మాంసము పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకొంటిరి గనుక యెహోవా మీకు మాంసమిచ్చును, మీరు తిందురు.౹

19 ఒక్క దినము కాదు, రెండు దినములు కాదు, అయిదు దినములు కాదు, పది దినములు కాదు, ఇరువది దినములు కాదు.౹

20 ఒక నెలదినములవరకు, అనగా అది మీ నాసికా రంధ్రములలోనుండి వచ్చి మీకు అసహ్యము పుట్టువరకు దానిని తిందురు; ఏలయనగా మీరు మీ మధ్య నున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి–ఐగుప్తులోనుండి యెందుకు వచ్చితిమనుకొంటిరి.౹

21 అందుకు మోషే–నేను ఈ జనులమధ్య ఉన్నాను; వారు ఆరు లక్షల పాదచారులు–వారు నెలదినములు తినుటకు వారికి మాంసమిచ్చెదనని చెప్పితివి.౹

22 వారు తృప్తిగా తినునట్లు వారినిమిత్తము గొఱ్ఱెలను పశువులను చంపవలెనా? వారు తృప్తిగా తినునట్లు సముద్రపు చేపలన్నియు వారినిమిత్తము కూర్చవలెనా? అనెను.

23 అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను– యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ యెడల నెరవేరునో లేదో యిప్పుడు చూచెదవు.౹

24 మోషే బయటికి వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి, జనుల పెద్దలలోనుండి డెబ్బదిమంది మనుష్యులను పోగుచేసి గుడారముచుట్టు వారిని నిలువబెట్టగా

25 యెహోవా మేఘములో దిగి అతనితో మాటలాడి అతనిమీద వచ్చిన ఆత్మలో పాలు ఆ డెబ్బదిమంది పెద్దలమీద ఉంచెను; కావున ఆ ఆత్మ వారిమీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరిగాని మరల ప్రవచింపలేదు.౹

26 ఆ మనుష్యులలో నిద్దరు పాళెములో నిలిచియుండిరి; వారిలో ఒకనిపేరు ఎల్దాదు, రెండవ వానిపేరు మేదాదు; వారి మీదను ఆత్మ నిలిచియుండెను; వారు వ్రాయబడినవారిలోను ఉండియు వారు గుడారమునకు వెళ్లక తమ పాళెములోనే ప్రవచించిరి.౹

27 అప్పుడు ఒక యౌవనుడు మోషే యొద్దకు పరుగెత్తివచ్చి–ఎల్దాదు మేదాదులు పాళెములో ప్రవచించుచున్నారని చెప్పగా

28 మోషే ఏర్పరచుకొనినవారిలో నూను కుమారుడును మోషేకు పరిచారకుడునైన యెహోషువ–మోషే నా ప్రభువా, వారిని నిషేధింపుమని చెప్పెను.౹

29 అందుకు మోషే–నా నిమిత్తము నీకు రోషము వచ్చెనా? యెహోవా ప్రజలందరును ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారిమీద ఉంచును గాక అని అతనితో అనెను.౹

30 అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయుల పెద్దలును పాళెములోనికి వెళ్లిరి.౹

31 తరువాత యెహోవా సన్నిధినుండి ఒక గాలి బయలుదేరి సముద్రమునుండి పూరేళ్లను రప్పించి పాళెముచుట్టు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరమువరకు భూమిమీద రెండు మూరల యెత్తున వాటిని పడజేసెను.౹

32 కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొనుచుండిరి; తక్కువ కూర్చుకొనినవాడు నూరు తూములను కూర్చుకొనెను. తరువాత వారు తమకొరకు పాళెము చుట్టు వాటినిపరచిరి.౹

33 ఆ మాంసము ఇంక వారి పండ్ల సందున నుండగానే, అది నమలకమునుపే, యెహోవా కోపము జనులమీద రగులుకొనెను; యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను.౹

34 మాంసాపేక్షగల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావాఅను పేరు పెట్టబడెను.౹

35 జనులు కిబ్రోతు హత్తావానుండి హజేరోతుకు ప్రయాణమైపోయి హజేరోతులో దిగిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/NUM/11-4d6a373e7db9be926856d07427d89d06.mp3?version_id=1787—

Categories
సంఖ్యాకాండము

సంఖ్యాకాండము 12

1 మోషే కూషుదేశపు స్త్రీని పెండ్లి చేసికొని యుండెను గనుక అతడు పెండ్లిచేసికొనిన ఆ స్త్రీనిబట్టి మిర్యాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి.౹

2 వారు–మోషేచేత మాత్రమే యెహోవా పలి కించెనా? ఆయన మా చేతను పలికింపలేదా? అని చెప్పు కొనగా

3 యెహోవా ఆ మాటవినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు.౹

4 యెహోవా –మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞనిచ్చెను. ఆ ముగ్గురు రాగా

5 యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచెను.౹

6 వారిద్దరు రాగా ఆయన –నా మాటలు వినుడి; మీలో ప్రవక్త యుండినయెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలిసి కొనునట్లు కలలో అతనితో మాటలాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడుకాడు.౹

7 అతడు నా యిల్లంతటిలో నమ్మకమైనవాడు.౹

8 నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాటలాడుదును; అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాటలాడుటకు మీరేల భయపడలేదనెను.౹

9 యెహోవా కోపము వారిమీద రగులుకొనగా ఆయన వెళ్లిపోయెను.౹

10 మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారముమీదనుండి ఎత్తబడెను; అప్పుడు మిర్యాము హిమమువంటి తెల్లని కుష్ఠు గలదాయెను; అహరోను మిర్యామువైపు చూచినప్పుడు ఆమె కుష్ఠుగలదిగా కనబడెను.౹

11 అహరోను–అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము; పాపులమైన మేము చేసిన యీ పాపమును మామీద మోపవద్దు.౹

12 తన తల్లి గర్భములోనుండి పుట్టినప్పటికే సగముమాంసము క్షీణించిన శిశు శవమువలె ఆమెను ఉండనియ్యకుమని మోషేతో చెప్పగా

13 మోషే యెలుగెత్తి–దేవా, దయచేసి యీమెను బాగుచేయుమని యెహోవాకు మొఱపెట్టెను.౹

14 అప్పుడు యెహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖముమీద ఉమ్మివేసినయెడల ఆమె యేడు దినములు సిగ్గు పడునుగదా; ఆమె పాళెము వెలుపల ఏడు దినములు ప్రత్యేకముగా ఉండవలెను. తరువాత ఆమెను చేర్చు కొనవలెను.౹

15 కాబట్టి మిర్యాము ఏడు దినములు పాళెము వెలుపలనే గడిపెను. మిర్యాము మరల చేర్చబడువరకు జనులు ముందుకు సాగరైరి.౹

16 తరువాత జనులు హజేరోతు నుండి సాగి పారాను అరణ్యములో దిగిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/NUM/12-f47d98b5f96c5f18be7a079ea336587f.mp3?version_id=1787—

Categories
సంఖ్యాకాండము

సంఖ్యాకాండము 13

1 యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను

2 – నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనానుదేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దానినుండి ఒక్కొక్క మనుష్యుని మీరు పంపవలెను; వారిలో ప్రతివాడు ప్రధానుడై యుండవలెను.౹

3 మోషే యెహోవా మాట విని, పారాను అరణ్యమునుండి వారిని పంపెను. వారందరు ఇశ్రాయేలీయులలో ముఖ్యులు.౹

4 వారి పేళ్లు ఏవనగా–రూబేను గోత్రమునకు

5 జక్కూరు కుమారుడైన షమ్మూయ; షిమ్యోను గోత్రమునకు హోరీ కుమారుడైన షాపాతు;౹

6 యూదా గోత్రమునకు యెఫున్నె కుమారుడైన కాలేబు;౹

7 ఇశ్శాఖారు గోత్రమునకు యోసేపు కుమారుడైన ఇగాలు;౹

8 ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ;౹

9 బెన్యామీను గోత్రమునకు రాఫు కుమారుడైన పల్తీ;౹

10 జెబూలూను గోత్రమునకు సోరీ కుమారుడైన గదీయేలు;౹

11 యోసేపు గోత్రమునకు, అనగా మనష్షే గోత్రమునకు సూసీ కుమారుడైన గదీ;౹

12 దాను గోత్రమునకు గెమలి కుమారుడైన అమ్మీయేలు;౹

13 ఆషేరు గోత్రమునకు మిఖాయేలు కుమారుడైన సెతూరు;౹

14 నఫ్తాలి గోత్రమునకు వాపెసీ కుమారుడైన నహబీ;౹

15 గాదు గోత్రమునకు మాకీ కుమారుడైన గెయువేలు అనునవి.౹

16 దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుష్యుల పేళ్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అను పేరు పెట్టెను.౹

17 మోషే కనానుదేశమును సంచరించి చూచుటకు వారిని పంపి నప్పుడు వారితో ఇట్లనెను–మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణదిక్కున ప్రవేశించి ఆ కొండ యెక్కి ఆ దేశము ఎట్టిదో

18 దానిలో నివసించు జనము బలముగలదో బలములేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో

19 వారు నివసించు భూమి యెట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారములలో నివసించుదురో, కోటలలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో,౹

20 దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసికొనిరండని చెప్పెను. అది ద్రాక్షల ప్రథమ పక్వకాలము

21 కాబట్టి వారు వెళ్లి సీను అరణ్యము మొదలుకొని హమాతుకు పోవు మార్గముగా రెహోబువరకు దేశసంచారముచేసి చూచిరి.౹

22 వారు దక్షిణదిక్కున ప్రయాణముచేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీయులు అహీమాను షేషయి తల్మయి అను వారుండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయనుకంటె ఏడేండ్లు ముందుగా కట్టబడెను.౹

23 వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్షచెట్టుయొక్క కొమ్మనుకోసి దండెతో ఇద్దరు మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మపండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి.౹

24 ఇశ్రాయేలీయులు అక్కడకోసిన ద్రాక్ష గెలనుబట్టి ఆ స్థలమునకు ఎష్కోలులోయ అను పేరు పెట్టబడెను.౹

25 వారు నలుబది దినములు ఆ దేశమును సంచరించి చూచితిరిగి వచ్చిరి.౹

26 అట్లువారు వెళ్లి పారాను అరణ్యమందలి కాదేషులోనున్న మోషే అహరోనులయొద్దకును ఇశ్రాయేలీయుల సర్వసమాజమునొద్దకును వచ్చి, వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి.౹

27 వారు అతనికి తెలియపరచినదేమనగా–నీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్లితిమి; అది పాలు తేనెలు ప్రవహించు దేశమే; దాని పండ్లు ఇవి.౹

28 అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు; వారి పట్టణములు ప్రాకారముగలవి అవి మిక్కిలి గొప్పవి; మరియు అక్కడ అనాకీయులను చూచితిమి.౹

29 అమాలేకీయులు దక్షిణదేశములో నివసించుచున్నారు; హిత్తీయులు యెబూసీయులు అమోరీయులు కొండ దేశములో నివసించుచున్నారు; కనానీయులు సముద్రమునొద్దను యొర్దాను నదీప్రాంతములలోను నివసించుచున్నారని చెప్పిరి.౹

30 కాలేబు మోషే యెదుట జనులను నిమ్మళ పరచి–మనము నిశ్చయముగా వెళ్లుదుము; దాని స్వాధీనపరచుకొందుము; దాని జయించుటకు మన శక్తి చాలుననెను.౹

31 అయితే అతనితోకూడ పోయిన ఆ మనుష్యులు–ఆ జనులు మనకంటె బలవంతులు; మనము వారి మీదికి పోజాలమనిరి.౹

32 మరియు వారు తాము సంచరించి చూచిన దేశమునుగూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి–మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము; దానిలో మాకు కనబడిన జనులందరు ఉన్నత దేహులు.౹

33 అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి; మా దృష్టికి మేము మిడతలవలె ఉంటిమి, వారి దృష్టికిని అట్లే ఉంటిమనిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/NUM/13-ed3af019f787a2267ad2b1f77dcd1553.mp3?version_id=1787—