Categories
లేవీయకాండము

లేవీయకాండము 11

1 మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను

2 –మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లనుడి–భూమిమీదనున్న జీవులన్నిటిలోను మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చును;౹

3 జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరువేయునో దాని తినవచ్చునుగాని

4 నెమరు వేయు వాటిలోను రెండు డెక్కలుగల వాటిలోను వీటిని తినకూడదు, ఒంటె నెమరువేయునుగాని దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము.౹

5 పొట్టి కుందేలు నెమరువేయునుగాని దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము.౹

6 కుందేలు నెమరు వేయునుగాని దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము.౹

7 పంది విడిగానుండు రెండు డెక్కలు గలదిగాని అది నెమరువేయదు గనుక అది మీకు అపవిత్రము.౹

8 వాటి మాంసమును మీరు తినకూడదు; వాటి కళేబరములను ముట్టకూడదు; అవి మీకు అపవిత్రములు.

9 జలచరములన్నిటిలో వీటిని తినవచ్చును; సముద్రములోనేమి, నదులలోనేమి, యే నీళ్లలోనేమి, వేటికి రెక్కలు పొలుసులు ఉండునో వాటిని తినవచ్చును.౹

10 సముద్రములలోనేమి, నదులలోనేమి, సమస్త జలచరములలోను సమస్త జలజంతువులలోను వేటికి రెక్కలు పొలు సులు ఉండవో అవన్నియు మీకు హేయములు;౹

11 అవి మీకు హేయములుగానే ఉండవలెను. వాటి మాంసమును తినకూడదు, వాటి కళేబరములను హేయములుగా ఎంచుకొనవలెను.౹

12 నీళ్లలో దేనికి రెక్కలు పొలుసులు ఉండవో అది మీకు హేయము.

13 పక్షులలో వీటిని హేయములుగా ఎంచుకొనవలెను. వీటిని తినవద్దు ఇవి హేయములు; పక్షిరాజు, పెద్ద బోరువ,౹

14 క్రౌంచపక్షి, గద్ద, తెల్లగద్ద, ప్రతివిధమైన గద్ద,౹

15-17 ప్రతివిధమైన కాకి, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతివిధమైన డేగ,౹

18 పైగిడికంటె, చెరువుకాకి, గుడ్లగూబ, హంస, గూడబాతు, నల్లబోరువ,౹

19 సంకుబుడి కొంగ, ప్రతివిధమైన కొంగ, కుకుడుగువ్వ, గబ్బిలము.

20 రెక్కలుకలిగి నాలుగుకాళ్లతో చరించు చరములన్నియు మీకు హేయములు.౹

21 అయితే నాలుగుకాళ్లతో చరించుచు నేల గంతులువేయుటకు కాళ్లమీద తొడలు గల పురుగులన్ని తినవచ్చును.౹

22 నేత మిడతగాని చిన్నమిడతగాని ఆకుమిడతగాని మిడతలలో ప్రతివిధమైనది తినవచ్చును.౹

23 నాలుగు కాళ్లుగల పురుగులన్నియు మీకు హేయములు.౹

24 వాటివలన మీరు అపవిత్రులగుదురు వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును.౹

25 వాటి కళేబరములలో కొంచెమైనను మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును.౹

26 రెండుడెక్కలు గల జంతువులన్నిటిలో విడిగా చీలిన డెక్కలు లేకయు, నెమరువేయకయు నుండునవి మీకు అపవిత్రములు, వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు అపవిత్రుడగును.౹

27 నాలుగు కాళ్లతో నడుచు సమస్త జీవరాసులలో ఏవి అరకాలితో నడుచునో అవన్నియు అపవిత్రములు; వాటి కళేబరములను ముట్టిన ప్రతివాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును;౹

28 వాటి కళేబరమును మోసిన ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును; అవి మీకు అపవిత్రమైనవి.

29 నేలమీద ప్రాకు జీవరాసులలో మీకు అపవిత్రమైనవి ఏవేవనగా, చిన్నముంగిస, చిన్నపందికొక్కు, ప్రతి విధమైన బల్లి,౹

30 ఊసరవెల్లి, నేలమొసలి, తొండ, సరటము, అడవి యెలుక.౹

31 ప్రాకువాటిలో ఇవి మీకు అపవిత్రములు; ఇవి చచ్చిన తరువాత వీటిని ముట్టిన ప్రతివాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును.౹

32 వాటిలో చచ్చిన దాని కళేబరము దేనిమీద పడునో అది అపవిత్రమగును. అది చెక్కపాత్రయేగాని బట్టయేగాని చర్మమేగాని సంచియేగాని పనిచేయు ఉపకరణము ఏదియుగాని అయినయెడల దానిని నీళ్లలో వేయవలెను. అది సాయంకాలమువరకు అపవిత్రమైయుండును; తరువాత అది పవిత్రమగును.౹

33 వీటిలో ఏదైనను మంటిపాత్రలో పడినయెడల దానిలోనిదంతయు అపవిత్రమగును; మీరు దానిని పగుల గొట్టవలెను.౹

34 తినదగిన ఆహారమంతటిలో దేనిమీద ఆ నీళ్లు పడునో అది అపవిత్రమగును. అట్టి పాత్రలో త్రాగిన యే పానీయమును అపవిత్రము.౹

35 వాటి కళేబరములలో కొంచెము దేనిమీదపడునో అది అపవిత్రమగును. అది పొయ్యియైనను కుంపటియైనను దానిని పగులగొట్టవలెను. అవి అపవిత్రములు, అవి మీకు అపవిత్రములుగా ఉండవలెను.౹

36 అయితే విస్తారమైన నీళ్లుగల ఊటలోగాని గుంటలోగాని కళేబరము పడినను ఆ నీళ్లు అపవిత్రములు కావుగాని కళేబరమునకు తగిలినది అపవిత్రమగును.౹

37 వాటి కళేబరములలో కొంచెము విత్తుకట్టు విత్తనములమీద పడినను అవి అపవిత్రములు కావుగాని

38 ఆ విత్తనములమీద నీళ్లు పోసిన తరువాత కళేబరములో కొంచెము వాటిమీద పడినయెడల అవి మీకు అపవిత్రములగును.

39 మీరు తినదగిన జంతువులలో ఏదైనను చచ్చినయెడల దాని కళేబరమును ముట్టువాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును.౹

40 దాని కళేబరములో ఏదైనను తినువాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును. దాని కళేబరమును మోయువాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును.

41 నేలమీద ప్రాకు జీవరాసులన్నియు హేయములు, వాటిని తినకూడదు.౹

42 నేలమీద ప్రాకు జీవరాసులన్నిటిలో కడుపుతో చరించుదానినైనను నాలుగుకాళ్లతో చరించుదానినైనను చాలా కాళ్లుగల దానినైనను మీరు తినకూడదు; అవి హేయములు.౹

43 ప్రాకు జీవరాసులలో దేనినైననుతిని మిమ్మును మీరు హేయపరచుకొనకూడదు; వాటివలన అపవిత్రులగునట్లు వాటివలన అపవిత్రత కలుగ జేసికొనకూడదు.౹

44 నేను మీ దేవుడనైన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై యుండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేలమీద ప్రాకు జీవరాసులలో దేనివలనను మిమ్మును మీరు అపవిత్ర పరచుకొనకూడదు.౹

45 నేను మీకు దేవుడనైయుండుటకు ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించిన యెహోవాను; నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను.

46 అపవిత్రమైనదానికిని పవిత్రమైనదానికిని తినదగిన జంతువులకును తినదగని జంతువులకును భేదము చేయునట్లు

47 జంతువులనుగూర్చియు, పక్షులనుగూర్చియు, జలచరములైన సమస్త జీవులనుగూర్చియు, నేలమీద ప్రాకు సమస్త జీవులనుగూర్చియు చేసిన విధి యిదే అని చెప్పుమనెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/LEV/11-18c6379deb2aa909d4df783239c7f3b8.mp3?version_id=1787—

Categories
లేవీయకాండము

లేవీయకాండము 12

1 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

2 –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–ఒక స్త్రీ గర్భవతియై మగపిల్లను కనినయెడల ఆమె యేడు దినములు పురిటాలై యుండవలెను. ఆమె తాను ముట్టుదై కడగానుండు దినముల లెక్కనుబట్టి పురిటాలై యుండవలెను.౹

3 ఎనిమిదవదినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను.౹

4 ఆమె తన రక్తశుద్ధికొరకు ముప్పది మూడుదినములుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణమగువరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు, పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు.౹

5 ఆమె ఆడుపిల్లను కనినయెడల ఆమె తాను కడగా ఉండునప్పటివలె రెండు వారములు పురిటాలై ఉండవలెను. ఆమె తన రక్తశుద్ధి కొరకు అరువదియారు దినములు కడగా ఉండవలెను.౹

6 కుమారునికొరకేగాని కుమార్తెకొరకేగాని ఆమె శుద్ధిదినములు సంపూర్తియైన తరువాత ఆమె దహనబలిగా ఒక యేడాది గొఱ్ఱెపిల్లను, పాపపరిహారార్థబలిగా ఒక పావురపు పిల్లనైనను తెల్ల గువ్వనైనను ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు యాజకునియొద్దకు తీసికొనిరావలెను.౹

7 అతడు యెహోవా సన్నిధిని దాని నర్పించి ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయగా ఆమె రక్తస్రావ విషయమై ఆమె పవిత్రపరచబడును. ఇది మగపిల్లనుగాని ఆడు పిల్లనుగాని కనిన స్త్రీనిగూర్చిన విధి.౹

8 ఆమె గొఱ్ఱెపిల్లను తేజాలని యెడల ఆమె రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను దహనబలిగా ఒకదానిని, పాపపరిహారార్థబలిగా ఒక దానిని తీసికొని రావలెను. యాజకుడు ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయగా ఆమెకు పవిత్రత కలుగును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/LEV/12-faf7ceca62ea65fe2fcd069419daea4d.mp3?version_id=1787—

Categories
లేవీయకాండము

లేవీయకాండము 13

1 మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను.౹

2 –ఒకని దేహచర్మమందు వాపుగాని పక్కుగాని నిగనిగలాడు మచ్చగాని యుండి వాని దేహచర్మమందు కుష్ఠుపొడవంటిది కనబడినయెడల యాజకుడైన అహరోను నొద్దకైనను యాజకులైన అతని కుమారులలో ఒకనియొద్దకైనను వాని తీసికొని రావలెను.౹

3 ఆయాజకుడు వాని దేహచర్మమందున్న ఆ పొడను చూడగా ఆ పొడయందలి వెండ్రుకలు తెల్లబారినయెడలను, ఆ పొడ అతని దేహచర్మము కంటె పల్లముగా కనబడినయెడలను అది కుష్ఠు పొడ. యాజకుడు వాని చూచి అపవిత్రుడని నిర్ణయింపవలెను.౹

4 నిగనిగలాడు మచ్చ చర్మముల కంటె పల్లముకాక వాని దేహచర్మమందు తెల్లగా కనబడినయెడలను, దాని వెండ్రుకలు తెల్లబారకున్నయెడలను ఆయాజకుడు ఏడు దినములు ఆ పొడగలవానిని కడగా ఉంచవలెను.౹

5 ఏడవ నాడు యాజకుడు వానిని చూడవలెను. ఆ పొడ చర్మమందు వ్యాపింపక అట్లే ఉండినయెడల, యాజకుడు మరి యేడు దినములు వాని కడగా ఉంచవలెను.౹

6 ఏడవనాడు యాజకుడు రెండవసారి వాని చూడవలెను. అప్పుడు ఆ పొడ చర్మమందు వ్యాపింపక అదే తీరున ఉండినయెడల యాజకుడు వానిని పవిత్రుడని నిర్ణయింపవలెను; అది పక్కే,వాడు తన బట్టలు ఉదుకుకొని పవిత్రుడగును.౹

7 అయితేవాడు తన శుద్ధివిషయము యాజకునికి కనబడిన తరువాత ఆ పక్కు చర్మమందు విస్తారముగా వ్యాపించినయెడలవాడు రెండవసారి యాజకునికి కనబడవలెను.౹

8 అప్పుడు ఆ పక్కు చర్మమందు వ్యాపించినయెడల యాజకుడువాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను.

9 కుష్ఠుపొడ యొకనికి కలిగినయెడల యాజకుని యొద్దకు వానిని తీసికొనిరావలెను.౹

10 యాజకుడు వాని చూడగా తెల్లని వాపు చర్మమందు కనబడినయెడలను, అది వెండ్రుకలను తెల్లబరచినయెడలను, వాపులో పచ్చి మాంసము కనబడినయెడలను,౹

11 అది వాని దేహచర్మమందు పాతదైన కుష్ఠము గనుక యాజకుడువాడు అపవిత్రుడని నిర్ణ యింపవలెను, వానిని కడగా ఉంచకూడదు;వాడు అప విత్రుడు.౹

12 కుష్ఠము చర్మమందు విస్తారముగా పుట్టినప్పుడు యాజకుడు చూచినంతవరకు ఆ పొడగలవాని తలమొదలుకొని పాదములవరకు కుష్ఠము వాని చర్మమంతయు వ్యాపించి యుండినయెడల

13 యాజకుడు వానిని చూడవలెను; ఆ కుష్ఠము వాని దేహమంతట వ్యాపించినయెడల ఆ పొడగలవాడు పవిత్రుడని నిర్ణయింపవలెను. వాని ఒళ్లంతయు తెల్లబారెను;వాడు పవిత్రుడు.౹

14 అయితే వాని యొంట పచ్చిమాంసము కనబడు దినమునవాడు అపవిత్రుడు.౹

15 యాజకుడు ఆ పచ్చిమాంసమును చూచివాడు అపవిత్రు డని నిర్ణయింపవలెను. ఆ పచ్చిమాంసము అపవిత్రమే; అది కుష్ఠము.౹

16 అయితే ఆ పచ్చిమాంసము ఆరి తెల్లబారినయెడలవాడు యాజకునియొద్దకు రావలెను;౹

17 యాజకుడు వాని చూడగా ఆ పొడ తెల్లబారినయెడల యాజకుడు ఆ పొడ పవిత్రమని నిర్ణయింపవలెను;వాడు పవిత్రుడు.

18 ఒకని దేహచర్మమందు పుండు పుట్టి మానిన తరువాత

19 ఆ పుండుండినచోటను తెల్లని వాపైనను తెలుపుతోకూడిన యెరుపురంగుగల పొడగాని నిగనిగలాడు తెల్లని పొడగాని పుట్టినయెడల, యాజకునికి దాని కనుపరచవలెను.౹

20 యాజకుడు దాని చూచినప్పుడు అతని చూపునకు అది చర్మముకంటె పల్లముగా కనబడినయెడలను, దాని వెండ్రు కలు తెల్లబారి యుండినయెడలను, యాజకుడువాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది ఆ పుంటివలన పుట్టిన కుష్ఠుపొడ.౹

21 యాజకుడు దాని చూచినప్పుడు దానిలో తెల్లని వెండ్రుకలు లేకపోయినయెడలను, అది చర్మము కంటె పల్లముకాక కొంచెము నయముగా కనబడినయెడలను, యాజకుడు ఏడు దినములు వానిని ప్రత్యేకముగా ఉంచవలెను.౹

22 అది చర్మమందు విస్తారముగా వ్యాపించినయెడల యాజకుడువాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది కుష్ఠుపొడ.౹

23 నిగనిగలాడు పొడ వ్యాపింపక అట్లే ఉండినయెడల అది దద్దురు; యాజకుడువాడు పవిత్రు డని నిర్ణయింపవలెను.

24 దద్దురు కలిగిన దేహచర్మమందు ఆ వాత యెఱ్ఱగానేగాని తెల్లగానేగాని నిగనిగలాడు తెల్లని మచ్చగానేగాని యుండినయెడల యాజకుడు దాని చూడవలెను.౹

25 నిగ నిగలాడు ఆ మచ్చలోని వెండ్రుకలు తెల్లబారినయెడలను, అది చర్మముకంటె పల్లముగా కనబడినయెడలను, అది ఆ వాతవలన పుట్టిన కుష్ఠుపొడ; యాజకుడువాడు అపవిత్రు డని నిర్ణయింపవలెను; అది కుష్ఠము.౹

26 యాజకుడు దాని చూచునప్పుడు అది నిగనిగలాడు మచ్చలో తెల్లని వెండ్రు కలు లేకయేగాని చర్మముకంటె పల్లముగా నుండకయేగాని కొంత నయముగా కనబడినయెడల, యాజకుడు ఏడు దినములు వానిని కడగా ఉంచవలెను.౹

27 ఏడవనాడు యాజకుడు వాని చూచినప్పుడు అది చర్మమందు విస్తారముగా వ్యాపించినయెడలవాడు అపవిత్రుడని నిర్ణయింపవలెను; అది కుష్ఠమే.౹

28 అయితే నిగనిగలాడు మచ్చ చర్మమందు వ్యాపింపక ఆ చోటనేయుండి కొంచెము నయముగా కనబడినయెడల అది వాతపు వాపే;వాడు పవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను; అది వాతపు మంటయే.

29 పురుషునికైనను స్త్రీకైనను తలయందేమి గడ్డమందేమి పొడ పుట్టినయెడల, యాజకుడు ఆ పొడను చూడగా

30 అది చర్మముకంటె పల్లముగాను సన్నమైన పసుపు పచ్చ వెండ్రుకలు కలదిగాను కనబడినయెడల,వాడు అపవిత్రు డని యాజకుడు నిర్ణయింపవలెను; అది బొబ్బ, తలమీద నేమి గడ్డముమీద నేమి పుట్టిన కుష్ఠము.౹

31 యాజకుడు ఆ బొబ్బయిన పొడను చూచినప్పుడు అది చర్మముకంటె పల్లము కానియెడలను, దానిలో నల్లవెండ్రుకలు లేనియెడలను, యాజకుడు ఆ బొబ్బయిన పొడగలవానిని ఏడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను.౹

32 ఏడవనాడు యాజకుడు ఆ పొడను చూడవలెను. ఆ బొబ్బ వ్యాపిం పక యుండినయెడలను, దానిలో పసుపు పచ్చవెండ్రు కలు లేనియెడలను, చర్మముకంటె పల్లముకాని యెడలను,౹

33 వాడు క్షౌరము చేసికొనవలెనుగాని ఆ బొబ్బ క్షౌరము చేయకూడదు. యాజకుడు బొబ్బగల వానిని మరి యేడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను.౹

34 ఏడవనాడు యాజకుడు ఆ బొబ్బను చూడగా అది చర్మమందు బొబ్బ వ్యాపింపక చర్మముకంటె పల్లముకాక యుండినయెడల, యాజకుడువాడు పవిత్రుడని నిర్ణయింపవలెను.వాడు తన బట్టలు ఉదుకుకొని పవిత్రుడగును.౹

35 వాడు పవిత్రు డని నిర్ణయించిన తరువాత బొబ్బ విస్తారముగా వ్యాపించినయెడల యాజకుడు వాని చూడవలెను,౹

36 అప్పుడు ఆ మాద వ్యాపించియుండినయెడల యాజకుడు పసుపు పచ్చ వెండ్రుకలను వెదకనక్కరలేదు;వాడు అపవిత్రుడు.౹

37 అయితే నిలిచిన ఆ మాదలో నల్లవెండ్రుకలు పుట్టినయెడల ఆ మాద బాగుపడెను;వాడు పవిత్రుడు; యాజకుడువాడు పవిత్రుడని నిర్ణయింపవలెను.

38 మరియు పురుషుని దేహపుచర్మమందేమి స్త్రీ దేహపు చర్మమందేమి నిగనిగలాడు మచ్చలు, అనగా నిగనిగలాడు తెల్లనిమచ్చలు పుట్టినయెడల

39 యాజకుడు వానిని చూడవలెను; వారి దేహచర్మమందు నిగనిగలాడు మచ్చలు వాడి యుండినయెడల అది చర్మమందు పుట్టిన యొక పొక్కు;వాడు పవిత్రుడు.

40 తలవెండ్రుకలు రాలినవాడు బట్ట తలవాడు; అయిననువాడు పవిత్రుడు.౹

41 ముఖమువైపున తలవెండ్రుకలు రాలినవాడు బట్ట నొసటివాడు;వాడు పవిత్రుడు.౹

42 అయినను బట్ట తలయందేగాని బట్ట నొసటియందేగాని యెఱ్ఱగానుండు తెల్లని పొడ పుట్టినయెడల, అది వాని బట్ట తలయందైనను బట్ట నొసటియందైనను పుట్టిన కుష్ఠము.౹

43 యాజకుడు వానిని చూడవలెను. కుష్ఠము దేహచర్మమందు కనబడునట్లు ఆ పొడ వాపు చూపునకు వాని బట్ట తలయందైనను వాని బట్ట నొసటియందైనను ఎఱ్ఱగా నుండు తెల్లని పొడయైనయెడల

44 వాడు కుష్ఠరోగి,వాడు అపవిత్రుడు; యాజకుడువాడు బొత్తిగా అపవిత్రుడని నిర్ణయింపవలెను; వాని కుష్ఠము వాని తలలోనున్నది.

45 ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను;వాడు తల విరియబోసికొనవలెను;వాడు తన పైపెదవిని కప్పుకొని–అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలుకవలెను.౹

46 ఆ పొడ వానికి కలిగిన దినములన్నియువాడు అపవిత్రుడైయుండును;వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను; వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవలెను.

47 మరియు కుష్ఠుపొడ వస్త్రమందు కనబడునప్పుడు అది గొఱ్ఱెవెండ్రుకల బట్టయందేమి నారబట్టయందేమి

48 నారతోనేగాని వెండ్రుకలతోనేగాని నేసిన పడుగునందేమి పేకయందేమి తోలునందేమి తోలుతో చేయబడు ఏయొక వస్తువునందేమి పుట్టి

49 ఆ పొడ ఆ బట్టయందేమి ఆ తోలునందేమి ఆ పేకయందేమి తోలుతో చేయబడిన వస్తువునందేమి పచ్చదాళుగానేగాని యెఱ్ఱదాళుగానేగాని కనబడినయెడల, అది కుష్ఠుపొడ; యాజకునికి దాని కనుపరచవలెను.౹

50 యాజకుడు ఆ పొడను చూచి పొడగల వాటిని ఏడు దినములు ప్రత్యేకముగా ఉంచవలెను.౹

51 ఏడవనాడు అతడు ఆ పొడను చూడవలెను. అప్పుడు ఆ వస్త్రమందు, అనగా పడుగునందేగాని పేకయందేగాని తోలునందేగాని తోలుతో చేసిన వస్తువునందేగాని ఆ పొడ వ్యాపించినయెడల అది కొరుకుడు కుష్ఠము; అది అపవిత్రము.౹

52 కావున అతడు ఆ పొడ దేనిలో ఉన్నదో ఆ వస్త్రమును నారతోనేమి వెండ్రుకలతోనేమి చేసిన పడుగును పేకను తోలుతోచేసిన ప్రతి వస్తువును అగ్నితో కాల్చివేయవలెను; అది కొరుకుడు కుష్ఠము; అగ్నితో దాని కాల్చివేయవలెను.౹

53 అయితే యాజకుడు చూచి నప్పుడు ఆ పొడ ఆ వస్త్రమందు, అనగా పడుగునందేమి పేకయందేమి తోలుతో చేసిన మరి దేనియందేమి వ్యాపింపక పోయినయెడల

54 యాజకుడు ఆ పొడగలదానిని ఉదుక నాజ్ఞాపించి మరి ఏడు దినములు దానిని విడిగా ఉంచవలెను.౹

55 ఆ పొడగల దానిని ఉదికిన తరువాత యాజకుడు దానిని చూడవలెను. ఆ పొడ మారకపోయినను వ్యాపిం పక పోయినను అది అపవిత్రము. అగ్నితో దానిని కాల్చి వేయవలెను. అది లోవైపునగాని పైవైపునగాని పుట్టినను కొరుకుడు కుష్ఠముగా ఉండును.౹

56 యాజకుడు దానిని చూచినప్పుడు వస్త్రము ఉదికిన తరువాత ఆ పొడ వాడి యుండినయెడల, అది ఆ వస్త్రములో ఉండినను తోలులో ఉండినను పడుగులో ఉండినను పేకలో ఉండినను యాజకుడు వాటిని చింపివేయవలెను.౹

57 అటుతరువాత అది ఆ వస్త్రమందేగాని పడుగునందేగాని పేకయందేగాని తోలుతో చేసిన దేనియందేగాని కనబడినయెడల అది కొరుకుడు కుష్ఠము. ఆ పొడ దేనిలో నున్నదో దానిని అగ్నితో కాల్చివేయవలెను.౹

58 ఏ వస్త్రమునేగాని పడుగునేగాని పేకనేగాని తోలుతో చేసిన దేనినేగాని ఉదికినతరువాత ఆ పొడ వదిలినయెడల, రెండవమారు దానిని ఉదుకవలెను;౹

59 అప్పుడు అది పవిత్రమగును. బొచ్చు బట్ట యందేగాని నారబట్టయందేగాని పడుగునందేగాని పేకయందేగాని తోలు వస్తువులయందేగాని యుండు కుష్ఠు పొడనుగూర్చి అది పవిత్రమని అపవిత్రమని నీవు నిర్ణ యింపవలసిన విధి యిదే.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/LEV/13-9e5a96ada5389f2054cdad03e37db363.mp3?version_id=1787—

Categories
లేవీయకాండము

లేవీయకాండము 14

1 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

2 –కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వానిగూర్చిన విధి యేదనగా, యాజకుని యొద్దకు వానిని తీసికొని రావలెను.౹

3 యాజకుడు పాళెము వెలుపలికి పోవలెను. యాజకుడు వానిని చూచినప్పుడు కుష్ఠుపొడ బాగుపడి కుష్ఠరోగిని విడిచినయెడల

4 యాజకుడు పవి త్రత పొందగోరువాని కొరకు సజీవమైన రెండు పవిత్ర పక్షులను దేవదారు కఱ్ఱను రక్తవర్ణముగల నూలును హిస్సో పును తెమ్మని ఆజ్ఞాపింపవలెను.౹

5 అప్పుడు యాజకుడు పారు నీటిపైని మంటిపాత్రలో ఆ పక్షులలో ఒకదానిని చంప నాజ్ఞాపించి

6 సజీవమైన పక్షిని ఆ దేవదారు కఱ్ఱను రక్తవర్ణముగల నూలును హిస్సోపును తీసికొని పారు నీటి పైని చంపిన పక్షిరక్తములో వాటిని సజీవమైన పక్షిని ముంచి

7 కుష్ఠు విషయములో పవిత్రత పొందగోరు వానిమీద ఏడుమారులు ప్రోక్షించివాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయవలెను.౹

8 అప్పుడు పవిత్రత పొందగోరువాడు తన బట్టలు ఉదుకుకొని తన రోమమంతటిని క్షౌరము చేసికొని నీళ్లతో స్నానముచేసి పవిత్రుడగును. తరువాతవాడు పాళెములోనికి వచ్చి తన గుడారము వెలుపల ఏడు దినములు నివసింపవలెను.౹

9 ఏడవనాడు తన రోమమంతటిని తన తలను తన గడ్డమును తన కనుబొమలను క్షౌరము చేసికొనవలెను. తన రోమ మంతటిని క్షౌరము చేసికొని బట్టలు ఉదుకుకొని యొడలు నీళ్లతో కడుగుకొని పవిత్రుడగును.౹

10 ఎనిమిదవనాడువాడు నిర్దోషమైన రెండు మగ గొఱ్ఱెపిల్లలను నిర్దోషమైన యేడాది ఆడు గొఱ్ఱెపిల్లను నైవేద్యమునకై నూనె కలిసిన మూడు పదియవ వంతుల గోధుమపిండిని ఒక అర్ధసేరు నూనెను తీసికొనిరావలెను.౹

11 పవిత్రపరచు యాజకుడు పవిత్రత పొందగోరు మనుష్యుని వాటితో ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమున యెహోవా సన్నిధికి తీసికొనిరావలెను.౹

12 అప్పుడు యాజకుడు ఒక మగ గొఱ్ఱెపిల్లను అర్ధసేరు నూనెను తీసికొని అపరాధ పరిహారార్థబలిగా వాటిని దగ్గరకు తెచ్చి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను.౹

13 అతడు పాపపరిహారార్థబలి పశువును దహన బలిపశువును వధించు పరిశుద్ధస్థలములో ఆ గొఱ్ఱెపిల్లను వధింపవలెను. పాపపరిహారార్థమైనదానివలె అపరాధపరి హారార్థమైనదియు యాజకునిదగును; అది అతిపరిశుద్ధము.౹

14 అప్పుడు యాజకుడు అపరాధపరిహారార్థమైనదాని రక్తములో కొంచెము తీసి పవిత్రత పొందగోరువాని కుడిచెవి కొనమీదను, వాని కుడిచేతి బొటనవ్రేలిమీదను, వాని కుడికాలి బొటనవ్రేలిమీదను, దానిని చమరవలెను.౹

15 మరియు యాజకుడు అర్ధసేరు నూనెలో కొంచెము తీసి తన యెడమ అరచేతిలో పోసికొనవలెను.౹

16 అప్పుడు యాజకుడు తన యెడమ అరచేతిలోనున్న నూనెలో తన కుడిచేతి వ్రేలు ముంచి యెహోవా సన్నిధిని ఏడుమారులు తన వ్రేలితో ఆ నూనెలో కొంచెము ప్రోక్షింపవలెను.౹

17 యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెలో కొంచెము తీసికొని పవిత్రత పొందగోరు వాని కుడిచెవి కొనమీదను, వాని కుడిచేతి బొటనవ్రేలిమీదను, వాని కుడికాలి బొటనవ్రేలిమీదను ఉన్న అపరాధపరిహారార్థబలిపశువుయొక్క రక్తముమీద చమరవలెను.౹

18 అప్పుడు యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెను పవిత్రత పొంద గోరువాని తలమీద చమరవలెను. అట్లు యాజకుడు యెహోవా సన్నిధి వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను.౹

19 అప్పుడు యాజకుడు పాపపరిహారార్థబలి అర్పించి అపవిత్రత పోగొట్టుకొని పవిత్రత పొందగోరు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసిన తరువాతవాడు దహనబలిపశువును వధింపవలెను.౹

20 యాజకుడు దహనబలి ద్రవ్యమును నైవేద్యమును బలిపీఠముమీద అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తముచేయగావాడు పవిత్రుడగును.

21 వాడు బీదవాడై పైచెప్పినదంతయు తేజాలని యెడల తన నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకైవాడు అల్లా డించుటకు అపరాధపరిహారార్థబలిగా ఒక గొఱ్ఱెపిల్లను నైవేద్యముగా తూములో పదియవవంతు నూనెతో కలిసిన గోధుమపిండిని ఒక అర్ధసేరు నూనెను

22 వారికి దొరకగల రెండు తెల్ల గువ్వలనేగాని రెండు పావురపు పిల్లలనేగాని, అనగా పాపపరిహారార్థబలిగా ఒకదానిని దహనబలిగా ఒక దానిని తీసికొని రావలెను.౹

23 వాడు పవిత్రతపొంది ఎనిమిదవ నాడు యెహోవా సన్నిధికి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు యాజకునియొద్దకు వాటిని తీసికొని రావలెను.౹

24 యాజకుడు అపరాధ పరిహారార్థబలియగు గొఱ్ఱెపిల్లను అర్ధసేరు నూనెను తీసికొని అల్లాడించు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను.౹

25 అప్పుడతడు అపరాధపరిహారార్థబలియగు గొఱ్ఱెపిల్లను వధింపవలెను. యాజకుడు ఆ అపరాధ పరిహారార్థబలిపశువుయొక్క రక్తములో కొంచెము తీసికొని, పవిత్రత పొంద గోరువాని కుడిచెవి కొనమీదను, వాని కుడిచేతి బొటన వ్రేలిమీదను, వాని కుడికాలి బొటన వ్రేలిమీదను దానిని చమరవలెను.౹

26 మరియు యాజకుడు ఆ నూనెలో కొంచెము తన యెడమ అరచేతిలో పోసికొని

27 తన యెడమచేతిలో నున్న ఆ నూనెలో కొంచెము తన కుడివ్రేలితో యెహోవా సన్నిధిని ఏడుమారులు ప్రోక్షింపవలెను.౹

28 మరియు యాజకుడు తన అరచేతిలోనున్న నూనెలో కొంచెము పవిత్రత పొందగోరువాని కుడిచెవి కొనమీదను, వాని కుడిచేతి బొటన వ్రేలిమీదను, వాని కుడికాలి బొటన వ్రేలిమీదను ఆ అపరాధ పరిహారార్థబలిపశువుయొక్క రక్తమున్న చోటను వేయవలెను.౹

29 యాజకుని అరచేతిలో నున్న కొదువ నూనెను అతడు పవిత్రత పొందగోరువానికి యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము కలుగజేయుటకు వాని తలమీద పోయవలెను.౹

30 అప్పుడు వానికి దొరకగల ఆ తెల్లగువ్వలలోనేగాని పావురపుపిల్లలలోనేగాని ఒక దాని నర్పింపవలెను.౹

31 తన నైవేద్యము గాక వాటిలో తనకు దొరకగల పాపపరిహారార్థబలిగా ఒక దానిని దహనబలిగా ఒకదానిని అర్పింపవలెను. అట్లు యాజకుడు పవిత్రత పొందగోరువాని నిమిత్తము యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయవలెను.౹

32 కుష్ఠుపొడ కలిగినవాడు పవిత్రత పొందతగినవాటిని సంపాదింపలేనియెడల వాని విషయమైన విధి యిదే.

33 మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను

34 –నేను స్వాస్థ్యముగా మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చినతరువాత, మీ స్వాస్థ్యమైన దేశములోని యే యింటనైనను నేను కుష్ఠుపొడ కలుగ జేసినయెడల

35 ఆ యింటి యజమానుడు యాజకునియొద్దకు వచ్చి–నా యింటిలో కుష్ఠుపొడవంటిది నాకు కనబడెనని అతనికి తెలియ చెప్పవలెను.౹

36 అప్పుడు ఆ యింటనున్నది యావత్తును అపవిత్రము కాకుండునట్లు, యాజకుడు ఆ కుష్ఠుపొడను చూచుటకు రాకమునుపు అతడు ఆ యిల్లు వట్టిదిగాచేయ నాజ్ఞాపింపవలెను. ఆ తరువాత యాజకుడు ఆ యిల్లు చూచుటకై లోపలికి వెళ్లవలెను.౹

37 అతడు పొడ చూచినప్పుడు ఆ పొడ యింటి గోడలయందు పచ్చ దాళుగానైనను ఎఱ్ఱదాళుగానైననుఉండు పల్లపుచారలు గలదై గోడకంటె పల్లముగా ఉండినయెడల

38 యాజకుడు ఆ యింటనుండి యింటివాకిటికి బయలువెళ్లి ఆ యిల్లు ఏడు దినములు మూసి యుంచవలెను.౹

39 ఏడవనాడు యాజకుడు తిరిగి వచ్చి దానిని చూడవలెను. అప్పుడు ఆ పొడ యింటి గోడలయందు వ్యాపించినదైనయెడల

40 యాజకుని సెలవు చొప్పున ఆ పొడగల రాళ్లను ఊడదీసి ఊరి వెలుపలనున్న అపవిత్రస్థలమున పారవేయవలెను.౹

41 అప్పుడతడు ఆ యింటిలోపలను చుట్టు గోడలను గీయింపవలెను. వారు గీసిన పెల్లలను ఊరివెలుపలనున్న అపవిత్ర స్థలమున పారబోసి

42 వేరురాళ్లను తీసికొని ఆ రాళ్లకు ప్రతిగా చేర్పవలెను. అతడు వేరు అడుసును తెప్పించి ఆ యింటిగోడకు పూయింపవలెను.౹

43 అతడు ఆ రాళ్లను ఊడదీయించి యిల్లుగీయించి దానికి అడుసును పూయించిన తరువాత ఆ పొడ తిరిగి ఆ యింట బయలుపడినయెడల యాజకుడు వచ్చి దాని చూడవలెను.౹

44 అప్పుడు ఆ పొడ ఆ యింట వ్యాపించినయెడల అది ఆ యింటిలో కొరుకుడు కుష్ఠము; అది అపవిత్రము.౹

45 కాబట్టి అతడు ఆ యింటిని దాని రాళ్లను కఱ్ఱలను సున్నమంతటిని పడగొట్టించి ఊరివెలుపలనున్న అపవిత్రస్థలమునకు వాటిని మోయించి పారబోయింపవలెను.౹

46 మరియు ఆ యిల్లు పాడువిడిచిన దినములన్నియు దానిలో ప్రవేశించువాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును.౹

47 ఆ యింట పండు కొనువాడు తన బట్టలు ఉదుకుకొనవలెను. ఆ యింట భోజనముచేయువాడు తన బట్టలు ఉదుకుకొనవలెను.౹

48 యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి చూచునప్పుడు ఆ యింటికి అడుసు వేసిన తరువాత ఆ పొడ యింటిలో వ్యాపింపక పోయినయెడల, పొడ బాగుపడెను గనుక ఆ యిల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయింపవలెను.౹

49 ఆ యింటి కొరకు పాపపరిహారార్థబలి అర్పించుటకు అతడు రెండు పక్షులను దేవదారు కఱ్ఱను రక్తవర్ణపు నూలును హిస్సోపును తీసికొని

50 పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని వధించి

51 ఆ దేవదారు కఱ్ఱను హిస్సోపును రక్తవర్ణపు నూలును సజీవమైన పక్షిని తీసికొని వధింపబడిన పక్షి రక్తములోను పారు నీటిలో వాటిని ముంచి ఆ యింటిమీద ఏడు మారులు ప్రోక్షింపవలెను.౹

52 అట్లు ఆ పక్షి రక్తముతోను ఆ పారు నీటితోను సజీవమైన పక్షితోను దేవదారు కఱ్ఱతోను హిస్సోపుతోను రక్తవర్ణపు నూలుతోను ఆ యింటి విషయములో పాపపరి హారార్థబలి అర్పింపవలెను.౹

53 అప్పుడు సజీవమైన పక్షిని ఊరివెలుపల నెగుర విడువవలెను. అట్లు అతడు ఆ యింటికి ప్రాయశ్చిత్తముచేయగా అది పవిత్రమగును.

54 ప్రతివిధమైన కుష్ఠుపొడనుగూర్చియు, బొబ్బనుగూర్చియు

55 వస్త్రకుష్ఠమునుగూర్చియు, వస్త్రమునకై నను ఇంటికైనను కలుగు కుష్ఠమునుగూర్చియు,౹

56 వాపునుగూర్చియు, పక్కునుగూర్చియు, నిగనిగలాడు మచ్చనుగూర్చియు,౹

57 ఒకడు ఎప్పుడు అపవిత్రుడగునో, యెప్పుడు పవిత్రుడగునో తెలియజేయుటకు ఇది కుష్ఠమునుగూర్చిన విధి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/LEV/14-da9e7d7345c6d5fd0cd3c7e10321dd4e.mp3?version_id=1787—

Categories
లేవీయకాండము

లేవీయకాండము 15

1 మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను

2 –మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లనుడి– ఒకని దేహమందు స్రావమున్నయెడల ఆ స్రావమువలనవాడు అపవిత్రుడగును.౹

3 వాని స్రావము కారినను కారక పోయినను ఆ దేహస్థితినిబట్టివాడు అపవిత్రుడగును. ఆ స్రావముగలవాడు పండుకొను ప్రతి పరుపు అప విత్రము;౹

4-5 వాడు కూర్చుండు ప్రతి వస్తువు అపవిత్రము. వాని పరుపును ముట్టువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును.౹

6 అట్టివాడు దేనిమీద కూర్చుండునో దానిమీద కూర్చుండువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును.౹

7 స్రావముగల వాని దేహమును ముట్టువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును.౹

8 స్రావముగలవాడు పవిత్రునిమీద ఉమ్మివేసినయెడలవాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును.౹

9 స్రావముగలవాడు కూర్చుండు ప్రతి పల్లము అపవిత్రము.౹

10 వాని క్రిందనుండిన యే వస్తువునైనను ముట్టు ప్రతివాడు సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును. వాటిని మోయువాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును.౹

11 స్రావముగలవాడు నీళ్లతో చేతులు కడుగుకొనకయే ఎవని ముట్టునోవాడు తన బట్టలు ఉదుకుకొని స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును.౹

12 స్రావము గలవాడు ముట్టుకొనిన మంటిపాత్రను పగలగొట్టవలెను, ప్రతి చెక్క పాత్రను నీళ్లతో కడుగవలెను.౹

13 స్రావముగలవాడు తన స్రావమునుండి పవిత్రత పొందునప్పుడు, తన పవిత్రత విషయమై యేడు దినములు లెక్కించుకొని తన బట్టలు ఉదుకుకొని పారు నీటితో ఒడలును కడుగుకొని పవిత్రుడగును.౹

14 ఎనిమిదవనాడు రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను తీసికొని ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దకు వచ్చి యెహోవా సన్నిధిని వాటిని యాజకుని కప్పగింపవలెను.౹

15 యాజకుడు వాటిలో ఒకదానిని పాపపరిహారార్థబలిగాను ఒకదానిని దహనబలిగాను అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని స్రావము విషయములో యెహోవా సన్నిధిని వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను.

16 ఒకనికి వీర్యస్ఖలనమైనయెడలవాడు సర్వాంగ స్నానము చేసికొని సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును.౹

17 ఏ బట్టమీదను ఏ తోలుమీదను వీర్యస్ఖలనమగునో ఆ బట్టయు ఆ తోలును నీళ్లతో ఉదుకబడి సాయంకాలమువరకు అపవిత్రమై యుండును.౹

18 వీర్యస్ఖలనమగునట్లు స్త్రీ పురుషులు శయనించినయెడల వారిద్దరు నీళ్లతో స్నానము చేసి సాయంకాలమువరకు అపవిత్రులైయుందురు.

19 స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైనయెడల ఆమె యేడు దినములు కడగా ఉండవలెను. ఆమెను ముట్టు వారందరు సాయంకాలమువరకు అపవిత్రులగుదురు.౹

20 ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేనిమీద పండుకొనునో అది అపవిత్రమగును; ఆమె దేనిమీద కూర్చుండునో అది అపవిత్రమగును.౹

21 ఆమె పడకను ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును.౹

22 ఆమె దేనిమీద కూర్చుం డునో దాని ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును.౹

23 అది ఆమె పరుపుమీదనైనను ఆమె కూర్చుండిన దానిమీదనైనను ఉండినయెడల దానిని ముట్టువాడు సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును.౹

24 ఒకడు ఆమెతో శయనించుచుండగా ఆమె రజస్సు వానికి తగిలినయెడల,వాడు ఏడు దినములు అపవిత్రుడగును;వాడు పండుకొను ప్రతి మంచము అపవిత్రము.

25 ఒక స్త్రీ కడగా ఉండుకాలమునకు ముందుగా ఆమె రక్తస్రావము ఇంక అనేకదినములు స్రవించినను ఆమె కడగానుండు కాలమైన తరువాత స్రవించినను, ఆమె అపవిత్రత ఆమె కడగానుండు దినములలోవలెనే ఆ స్రావదినములన్నియు ఉండును, ఆమె అపవిత్రురాలు.౹

26 ఆమె స్రావదినములన్నియు ఆమె పండుకొను ప్రతి మంచము ఆమె కడగానున్నప్పటి మంచమువలె ఉండవలెను. ఆమె దేనిమీద కూర్చుండునో అది ఆమె కడగా ఉన్నప్పటి అపవిత్రతవలె అపవిత్రమగును.౹

27 వాటిని ముట్టు ప్రతివాడు అపవిత్రుడు.వాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును.౹

28 ఆమె ఆ స్రావము కుదిరి పవిత్రురాలైనయెడల ఆమె యేడుదినములు లెక్కించుకొని అవి తీరిన తరువాత పవిత్రురాలగును.౹

29 ఎనిమిదవ నాడు ఆమె రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు యాజకునియొద్దకు తేవలెను.౹

30 యాజకుడు ఒకదానిని పాపపరిహారార్థబలిగాను ఒకదానిని దహనబలిగాను అర్పింపవలెను. అట్లు యాజకుడు ఆమె స్రావవిషయమై యెహోవా సన్నిధిని ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను.

31 ఇశ్రాయేలీయులు తమ మధ్యనుండు నా నివాసస్థలమును అపవిత్రపరచునప్పుడు వారు తమ అపవిత్రతవలన చావకుండునట్లు వారికి అపవిత్రత కలుగకుండ మీరు వారిని కాపాడవలెను.

32 స్రావముగలవానిగూర్చియు, వీర్యస్ఖలనమువలని అప విత్రతగలవానిగూర్చియు, కడగానున్న బలహీనురాలిని గూర్చియు, స్రావముగల స్త్రీ పురుషులనుగూర్చియు, అపవిత్రురాలితో శయనించువాని గూర్చియు విధింపబడి నది ఇదే.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/LEV/15-4d76870d2cbff5dd4cf819ae790bbe31.mp3?version_id=1787—

Categories
లేవీయకాండము

లేవీయకాండము 16

1 అహరోను ఇద్దరు కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తరువాత యెహోవా మోషేతో మాటలాడి ఇట్లనెను

2 –నేను కరుణాపీఠముమీద మేఘములో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావకయుండునట్లు అతడు మందసము మీది కరుణాపీఠము ఎదుటనున్న అడ్డతెరలోపలికి ఎల్లప్పుడును రాకూడదని అతనితో చెప్పుము.౹

3 అతడు పాపపరిహారార్థబలిగా ఒక కోడెదూడను దహనబలిగా ఒక పొట్టేలును తీసికొని, వీటితో పరిశుద్ధస్థలములోనికి రావలెను.౹

4 అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుగుకొని తన మానమునకు సన్న నార లాగులు తొడుగుకొని, సన్ననార దట్టికట్టుకొని సన్ననార పాగా పెట్టుకొనవలెను. అవి ప్రతిష్ఠవస్త్రములు గనుక అతడు నీళ్లతో దేహము కడుగుకొని వాటిని వేసికొనవలెను.౹

5 మరియు అతడు ఇశ్రాయేలీయుల సమాజము నొద్దనుండి పాపపరిహారార్థబలిగా రెండు మేక పిల్లలను దహనబలిగా ఒక పొట్టేలును తీసికొని రావలెను.౹

6 అహరోను తన కొరకు పాపపరిహారార్థబలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తమును తన యింటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి

7 ఆ రెండు మేకపిల్లలను తీసికొని వచ్చి, ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచవలెను.౹

8 అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటిని, విడిచిపెట్టే మేకపేరట ఒక చీటిని ఆ రెండు మేకలమీద రెండు చీట్లను వేయవలెను.౹

9 ఏ మేకమీద యెహోవాపేరట చీటి పడునో, ఆ మేకను అహరోను తీసికొని వచ్చి పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను.౹

10 ఏ మేకమీద విడిచిపెట్టుటఅనే చీటి పడునో దానివలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు, దానినిఅరణ్యములో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచవలెను.౹

11 అప్పుడు అహరోను పాపపరిహారార్థబలియగు ఆ కోడెను తీసికొని వచ్చి తన నిమిత్తమును తన యింటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసికొనవలెను. తరువాత అతడు తనకొరకు తానర్పించు పాపపరిహారార్థబలియగు కోడెను వధించి

12 యెహోవా సన్నిధినున్న ధూపపీఠము మీదనుండి ధూపార్తెడు నిప్పులను, తన పిడికెళ్లతో పరి మళధూపచూర్ణమును తీసికొని అడ్డతెరలోపలికి వాటిని తెచ్చి తాను చావకుండునట్లు

13 ఆ ధూపము మేఘము వలె శాసనములమీదనున్న కరుణాపీఠమును కమ్ముటకు, యెహోవా సన్నిధిని ఆ అగ్నిమీద ఆ ధూపద్రవ్యమును వేయవలెను.౹

14 అప్పుడతడు ఆ కోడెరక్తములో కొంచెము తీసికొని తూర్పుప్రక్కను కరుణాపీఠముమీద తన వ్రేలితో ప్రోక్షించి, కరుణాపీఠము ఎదుట తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము ఏడుమారులు ప్రోక్షింపవలెను.౹

15 అప్పుడతడు ప్రజలర్పించు పాపపరిహారార్థబలియగు మేకను వధించి అడ్డతెరలోపలికి దాని రక్తము తెచ్చి ఆ కోడెరక్తముతో చేసినట్లు దీని రక్తముతోను చేసి, కరుణాపీఠము మీదను కరుణాపీఠము ఎదుటను దాని ప్రోక్షింపవలెను.౹

16 అట్లు అతడు ఇశ్రాయేలీయుల సమస్త పాపములనుబట్టియు, అనగా వారి అపవిత్రతనుబట్టియు, వారి అతి క్రమములనుబట్టియు పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. ప్రత్యక్షపు గుడారము వారిమధ్య ఉండుటవలన వారి అపవిత్రతనుబట్టి అది అపవిత్రమగుచుండును గనుక అతడు దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను.౹

17 పరిశుద్ధస్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు అతడు లోపలికి పోవునప్పుడు అతడు తన నిమిత్తమును తన యింటి వారి నిమిత్తమును ఇశ్రాయేలీయుల సమస్త సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తముచేసి బయటికి వచ్చువరకు ఏ మనుష్యుడును ప్రత్యక్షపు గుడారములో ఉండరాదు.౹

18 మరియు అతడు యెహోవా సన్నిధినున్న బలిపీఠము నొద్దకు పోయి దానికి ప్రాయశ్చిత్తము చేయవలెను. అతడు ఆ కోడెరక్తములో కొంచెమును ఆ మేకరక్తములో కొంచెమును తీసికొని బలిపీఠపు కొమ్ములమీద చమిరి

19 యేడుమారులు తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము దానిమీద ప్రోక్షించి దాని పవిత్రపరచి ఇశ్రాయేలీయుల అపవిత్రతను పోగొట్టి దానిని పరిశుద్ధపరచవలెను.౹

20 అతడు పరిశుద్ధస్థలమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తరువాత ఆ సజీవమైన మేకను దగ్గరకు తీసికొని రావలెను.౹

21 అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తలమీద తన రెండు చేతులు ఉంచి, ఇశ్రాయేలీయుల పాపములన్నియు, అనగా వారి దోషములన్నియు వారి అతిక్రమములన్నియు దానిమీద ఒప్పుకొని, ఆ మేకతలమీద వాటిని మోపి, తగిన మనుష్యునిచేత అరణ్యములోనికి దాని పంపవలెను.౹

22 ఆ మేక వారి దోషములన్నిటిని ఎడారి దేశమునకు భరించి పోవును. అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టవలెను.౹

23 అప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారములోనికి వచ్చి, తాను పరిశుద్ధస్థలములోనికి వెళ్లినప్పుడు తాను వేసికొనిన నారబట్టలను తీసి అక్కడ వాటిని ఉంచి

24 పరిశుద్ధ స్థలములో దేహమును నీళ్లతో కడుగుకొని బట్టలు తిరిగి ధరించుకొని బయటికి వచ్చి తనకొరకు దహన బలిని ప్రజలకొరకు దహనబలిని అర్పించి, తన నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను

25 పాప పరిహారార్థబలి పశువుయొక్క క్రొవ్వును బలిపీఠముమీద దహింపవలెను

26 విడిచిపెట్టే మేకను వదలినవాడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో దేహము కడుగుకొని తరువాత పాళెములోనికి రావలెను.౹

27 పరిశుద్ధస్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకు వేటి రక్తము దాని లోపలికి తేబడెనో పాపపరిహారార్థబలియగు ఆ కోడెను ఆ మేకను ఒకడు పాళెము వెలుపలికి తీసికొని పోవలెను. వాటి చర్మములను వాటి మాంసమును వాటి మలమును అగ్నితో కాల్చివేయవలెను.౹

28 వాటిని కాల్చివేసినవాడు తన బట్టలు ఉదుకు కొని నీళ్లతో దేహము కడుగుకొని తరువాత పాళెములోనికి రావలెను.

29 ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులుగాని మీ మధ్యనుండు పరదేశులుగాని మీరందరు ఏడవనెల పదియవ నాడు ఏ పనియైనను చేయక మిమ్మును మీరు దుఃఖపరచు కొనవలెను.౹

30 ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపములనుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను.౹

31 అది మీకు మహా విశ్రాంతిదినము. మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను; ఇది నిత్యమైన కట్టడ.౹

32 ఎవరు తన తండ్రికి మారుగా యాజకుడగుటకై అభిషేకముపొంది తన్ను ప్రతిష్ఠించుకొనునో ఆయాజకుడు ప్రాయశ్చిత్తము చేసికొని నారవస్త్రములైన ప్రతిష్ఠిత వస్త్రములను ధరించుకొనవలెను.౹

33 మరియు అతడు అతి పరిశుద్ధముగానున్న మందిరమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేయవలెను. మరియు అతడు యాజకుల నిమిత్తమును సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను.౹

34 సంవత్సరమునకు ఒకసారి ఇశ్రాయేలీయుల సమస్త పాపములనుబట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/LEV/16-c32c7686fe70058dee81756a2dbd51a7.mp3?version_id=1787—

Categories
లేవీయకాండము

లేవీయకాండము 17

1 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.౹

2 –నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇశ్రాయేలీయులందరితోను ఈలాగు చెప్పుము – ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట

3-4 ఇశ్రాయేలీయుల కుటుంబములలో యెహోవా మందిరము ఎదుట యెహోవాకు అర్పణము అర్పించుటకు పూనుకొనువాడు అది ఎద్దేగాని గొఱ్ఱెయేగాని మేకయేగాని ప్రత్యక్షపు గుడా రముయొక్క ద్వారమునొద్దకు దానిని ముందు తేక పాళెములో వధించినను పాళెమునకు వెలుపల వధించినను ఆ మనుష్యుడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును;౹

5 వాడు రక్తమును ఒలికించినవాడు; ఇశ్రాయేలీయులు బయట వధించుచున్న బలిపశువులను ఇక బయట వధింపక యెహోవాపేరట యాజకునియొద్దకు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకే తీసికొని వచ్చి సమాధాన బలిగా అర్పించునట్లు ఆ మనుష్యుడు జనులలోనుండి కొట్టివేయబడవలెను.౹

6 యెహోవాకు ఇంపైన సువాసన గలుగునట్లు యాజకుడు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దనున్న యెహోవా బలిపీఠముమీద వాటి రక్తమును ప్రోక్షించి వాటి క్రొవ్వును దహింపవలెను.౹

7 వారు వ్యభిచారులై అనుసరించుచు వచ్చిన దయ్యముల పేరట వధించినట్లు ఇకమీదట తమ బలిపశువులను వధింప రాదు. ఇది వారి తరతరములకు వారికి నిత్యమైన కట్టడ.౹

8-9 మరియు నీవు వారితో ఇట్లనుము–ఇశ్రాయేలీయుల కుటుంబములలోగాని మీలో నివసించు పరదేశులలోగాని ఒకడు దహనబలినైనను వేరొక యే బలినైనను యెహోవాకు అర్పింప నుద్దేశముగలవాడై ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దకు తీసికొని రానియెడల ఆ మనుష్యుడు జనులలోనుండి కొట్టివేయబడును.

10 మరియు ఇశ్రాయేలీయుల కుటుంబములలోనేమి, మీలో నివసించు పరదేశులలోనేమి, ఒకడు దేని రక్తమును తినినను రక్తము తినువానికి నేను విముఖుడనై జనులలోనుండి వాని కొట్టివేయుదును.౹

11 రక్తము దేహమునకు ప్రాణము. మీనిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠముమీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమునుబట్టి ప్రాయశ్చిత్తము చేయును.౹

12 కాబట్టి మీలో ఎవడును రక్తము తినకూడదనియు, మీలో నివసించు ఏ పరదేశియు రక్తము తినకూడదనియు నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని.

13 మరియు ఇశ్రాయేలీయులలోనేగాని మీలో నివసించు పరదేశులలోనేగాని ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి పెట్టినయెడలవాడు దాని రక్తమును ఒలికించి మంటితో కప్పవలెను; ఏలయనగా అది సమస్త దేహములకు ప్రాణాధారము;౹

14 దాని రక్తము దాని ప్రాణమున కాధారము. కాబట్టి మీరు ఏ దేహరక్తమును తినకూడదు. వాటి రక్తము సర్వదేహములకు ప్రాణాధారము; దానిని తిను ప్రతివాడు మరణశిక్ష నొందునని నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించితిని.౹

15 మరియు కళేబరమునైనను చీల్చబడిన దానినైనను తిను ప్రతివాడు దేశమందు పుట్టినవాడేమి పరదేశియేమివాడు తన బట్టలను ఉదుకుకొని నీళ్లతో దేహమును కడుగుకొని సాయంకాలమువరకు అపవిత్రుడగును. తరువాత పవిత్రుడగును.౹

16 అయితేవాడు వాటిని ఉదుకుకొనకయు తన దేహమును కడుగుకొనకయు ఉండినయెడలవాడు తన దోషశిక్షను భరించును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/LEV/17-1e1cb78d3a6e2e95636e7348846b322a.mp3?version_id=1787—

Categories
లేవీయకాండము

లేవీయకాండము 18

1 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల. విచ్చెను

2 –నేను మీ దేవుడనైన యెహోవానని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పుము.౹

3 మీరు నివసించిన ఐగుప్తు దేశాచారములచొప్పున మీరు చేయకూడదు; నేను మిమ్మును రప్పించుచున్న కనాను దేశాచారములచొప్పున మీరు చేయకూడదు; వారి కట్టడలనుబట్టి నడవకూడదు.౹

4 మీరు నా విధులను గైకొనవలెను; నా కట్టడలనుబట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను; మీ దేవుడనగు నేను యెహోవాను.౹

5 మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటివలన బ్రదుకును; నేను యెహోవాను.

6 మీలో ఎవరును తమ రక్తసంబంధుల మానాచ్ఛాదనమును తీయుటకు వారిని సమీపింపకూడదు; నేను యెహోవాను.౹

7 నీ తండ్రికి మానాచ్ఛాదనముగా నున్న నీ తల్లి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ తల్లి; ఆమె మానాచ్ఛాదనమునుతీయకూడదు.౹

8 నీ తండ్రి భార్య మానాచ్ఛాదనమును తీయకూడదు; అది నీ తండ్రిదే.౹

9 నీ సహోదరి మానాచ్ఛాదనమును, అనగా ఇంటిలో పుట్టిన దేమి వెలుపట పుట్టినదేమి నీ తండ్రి కుమార్తెయొక్క యైనను నీ తల్లి కుమార్తెయొక్కయైనను మానాచ్ఛాదనమును తీయకూడదు.౹

10 నీ కుమారుని కుమార్తె మానాచ్ఛాదనమునైనను కుమార్తె కుమార్తె మానాచ్ఛాదనమునైనను తీయకూడదు; అది నీది.౹

11 నీ తండ్రివలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి; ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు.౹

12 నీ తండ్రి సహోదరి మానాచ్ఛాదనమును తీయకూడదు. ఆమె నీ తండ్రి రక్తసంబంధి.౹

13 నీ తల్లి సహోదరి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ తల్లి రక్తసంబంధి.౹

14 నీ తండ్రి సహోదరుని మానాచ్ఛాదనమును తీయకూడదు, అనగా అతని భార్యను సమీపింపకూడదు; ఆమె నీ పినతల్లి.౹

15 నీ కోడలి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ కుమారుని భార్య, ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు.౹

16 నీ సహోదరుని భార్య మానాచ్ఛాదనమును తీయకూడదు; అది నీ సహోదరుని మానము.౹

17 ఒక స్త్రీ మానాచ్ఛాదనమును ఆమె కుమార్తె మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె కుమారుని కుమార్తె మానాచ్ఛాదనమునైనను ఆమె కుమార్తె కుమార్తె మానాచ్ఛాదనమునైనను తీయుటకు వారిని చేర్చుకొనకూడదు; వారు ఆమె రక్త సంబంధులు; అది దుష్కామప్రవర్తన.౹

18 నీ భార్య బ్రదికి యుండగా ఆమెను పీడించుటకు ఆమె సహోదరి మానా చ్ఛాదనమును తీయుటకు ఈమెను ఆమెతో పెండ్లిచేసి కొనకూడదు.౹

19 అపవిత్రతవలన స్త్రీ కడగాఉండు నప్పుడు ఆమె మానాచ్ఛాదనమును తీయుటకు ఆమెను సమీపింపకూడదు.౹

20 నీ పొరుగువాని భార్యయందు నీ వీర్యస్ఖలనముచేసి ఆమెవలన అపవిత్రత కలుగజేసికొనకూడదు.౹

21 నీవు ఏ మాత్రమును నీ సంతానమును మోలెకునిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు; నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను.౹

22 స్త్రీ శయనమువలె పురుషశయనముకూడదు; అది హేయము.౹

23 ఏ జంతువునందును నీ స్ఖలనముచేసి దాని వలన అపవిత్రత కలుగజేసికొనకూడదు. జంతువు స్త్రీని పొందునట్లు ఆమె దాని యెదుట నిలువరాదు, అది విపరీతము.

24 వీటిలో దేనివలనను అపవిత్రత కలుగజేసికొనకూడదు. నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనములు వా టన్నిటివలన అపవిత్రులైరి.౹

25 ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దానిమీద దాని దోషశిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్లగ్రక్కివేయుచున్నది.౹

26-28 కాబట్టి ఆ దేశము మీకంటె ముందుగానున్న ప్రజలను వెళ్లగ్రక్కివేసిన ప్రకారము మీ అపవిత్రతనుబట్టి మిమ్మును వెళ్లగ్రక్కి వేయకుండునట్లు మీరు, అనగా స్వదేశియేగాని మీలో నివసించు పరదేశియేగాని యీ హేయ క్రియలన్నిటిలో దేనిని చేయక, యీ నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను.౹

29 ఎవరు అట్టి హేయ క్రియలలో దేనినైనను చేయుదురో వారు ప్రజలలోనుండి కొట్టివేయబడుదురు.౹

30 కాబట్టి మీకంటె ముందుగా నున్నవారు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనను అనుసరించుటవలన అపవిత్రత కలుగజేసికొనకుండునట్లు నేను మీకు విధించిన విధిననుసరించి నడుచు కొనవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/LEV/18-8af27d538f9373408c6349aef11dcdbe.mp3?version_id=1787—

Categories
లేవీయకాండము

లేవీయకాండము 19

1 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల . విచ్చెను–ఇశ్రాయేలీయుల సర్వసమాజముతో ఇట్లు చెప్పుము.౹

2 మీరు పరిశుద్ధులై యుండవలెను. మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై యున్నాను.౹

3 మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరింపవలెను; నేను మీ దేవుడనైన యెహోవాను.౹

4 మీరు వ్యర్థమైన దేవతలతట్టు తిరుగకూడదు. మీరు పోతవిగ్రహములను చేసికొనకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను

5 మీరు యెహోవాకు సమాధానబలి అర్పించునప్పుడు అది అంగీకరింపబడునట్లుగా అర్పింపవలెను.౹

6 మీరు బలినర్పిం చునాడైనను మరునాడైనను దాని తినవలెను. మూడవ నాటివరకు మిగిలియున్న దానిని అగ్నితో కాల్చివేయవలెను.౹

7 మూడవనాడు దానిలో కొంచెమైనను తినినయెడల అది హేయమగును; అది అంగీకరింపబడదు.౹

8 దానిని తినువాడు తన దోషశిక్షను భరించును.వాడు యెహోవాకు పరిశుద్ధమైన దానిని అపవిత్రపరచెను.వాడు ప్రజలలోనుండి కొట్టివేయబడును.

9 మీరు మీ భూమి పంటను కోయునప్పుడు నీ పొలముయొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు; నీ కోతలో పరిగెను ఏరుకొనకూడదు; నీ ఫలవృక్షముల తోట పరిగెను కూర్చుకొనకూడదు;౹

10 నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను;౹

11 నేను మీ దేవుడనైన యెహోవాను. మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకనితో ఒకడు అబద్ధమాడకూడదు;౹

12 నా నామమునుబట్టి అబద్ధప్రమాణము చేయకూడదు; నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు; నేను యెహోవాను.౹

13 నీ పొరుగువాని హింసింపకూడదు, వాని దోచుకొనకూడదు, కూలి వాని కూలి మరునాటివరకు నీయొద్ద ఉంచుకొనకూడదు;౹

14 చెవిటివాని తిట్టకూడదు, గ్రుడ్డివానియెదుట అడ్డమువేయకూడదు; నీ దేవునికి భయపడవలెను, నేను యెహోవాను.౹

15 అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు; న్యాయమునుబట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను.౹

16 నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరుగకూడదు, నీ సహోదరునికి ప్రాణహానిచేయ చూడకూడదు, నేను యెహోవాను.౹

17 నీ హృదయములో నీ సహోదరునిమీద పగపట్టకూడదు, నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండునట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను.౹

18 కీడుకు ప్రతికీడుచేయకూడదు, నీ ప్రజలమీద కోపముంచు కొనక నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను; నేను యెహోవాను.౹

19 మీరు నా కట్టడలను ఆచరింపవలెను; నీ జంతువులను ఇతరజాతి జంతువులను కలియనీయకూడదు; నీ పొలములో వేరు వేరు జాతుల విత్తనములు చల్లకూడదు; బొచ్చును నారయు కలిసినబట్ట వేసి కొనకూడదు.౹

20 ఒకనికి ప్రధానము చేయబడిన దాసి, వెలయిచ్చి విమోచింప బడకుండగానేమి ఊరక విడిపింప బడకుండగానేమి ఒకడు దానితో శయనించి వీర్యస్ఖలనము చేసినయెడల వారిని శిక్షింపవలెను. అది విడిపింపబడలేదు గనుక వారికి మరణశిక్ష విధింపకూడదు.౹

21 అతడు అపరాధ పరిహారార్ధబలిని, అనగా అపరాధపరిహారార్థబలియగు పొట్టేలును ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు యెహోవా సన్నిధికి తీసికొనిరావలెను.౹

22 అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపమునుబట్టి పాపపరిహారార్థబలియగు పొట్టేలువలన యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. దీనివలన అతడు చేసిన పాపము విషయమై అతనికి క్షమాపణ కలుగును.౹

23 మీరు ఆ దేశమునకు వచ్చి ఆహారమునకై నానా విధములైన చెట్లను నాటినప్పుడు వాటి పండ్లను అపవిత్రముగా ఎంచవలెను. వాటి కాపు మీకు ఎక్కువగా ఉండునట్లు అవి మూడు సంవత్సరములవరకు మీకు అపవిత్రముగా ఉండవలెను, వాటిని తినకూడదు.౹

24 నాలుగవ సంవత్సరమున వాటి ఫలములన్నియు యెహోవాకు ప్రతిష్ఠితమైన స్తుతియాగ ద్రవ్యములగును; అయిదవ సంవత్సరమున వాటి ఫలములను తినవచ్చును;౹

25 నేను మీ దేవుడనైన యెహోవాను.౹

26 రక్తము కూడినదేదియు తినకూడదు, శకునములు చూడకూడదు, మంత్ర యోగములు చేయకూడదు,౹

27 మీ నుదుటి వెండ్రుకలను గుండ్రముగా కత్తిరింపకూడదు, నీ గడ్డపు ప్రక్కలను గొరగకూడదు,౹

28 చచ్చినవారికొరకు మీ దేహమును చీరుకొనకూడదు, పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు; నేను మీ దేవుడనైన యెహోవాను.౹

29 మీ దేశము వ్యభిచరింపకయు దుష్కామ ప్రవర్తనతో నిండకయు ఉండునట్లు నీ కుమార్తె వ్యభిచారిణియగుటకై ఆమెను వేశ్యగా చేయకూడదు.౹

30 నేను నియమించిన విశ్రాంతిదినములను మీరు ఆచరింపవలెను నా పరిశుద్ధస్థలమును మన్నింపవలెను; నేను యెహోవాను.౹

31 కర్ణపిశాచిగలవారి దగ్గరకుపోకూడదు, సోదె గాండ్రను వెదకి వారివలన అపవిత్రత కలుగజేసికొనకూడదు; నేను మీ దేవుడనైన యెహోవాను.౹

32 తల నెరసినవాని యెదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరచి నీ దేవునికి భయపడవలెను; నేను యెహోవాను.౹

33 మీ దేశమందు పరదేశి నీ మధ్య నివసించునప్పుడు వానిని బాధింపకూడదు,౹

34 మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టినవానివలె ఎంచవలెను, నిన్నువలె వానిని ప్రేమింపవలెను, ఐగుప్తుదేశములో మీరు పరదేశులై యుంటిరి; నేను మీ దేవుడనైన యెహోవాను.౹

35 తీర్పు తీర్చునప్పుడు కొలతలోగాని తూనికెలోగాని పరిమాణములోగాని మీరు అన్యాయము చేయకూడదు.౹

36 న్యాయమైన త్రాసులు న్యాయమైన గుండ్లు న్యాయమైన తూము న్యాయమైన పడి మీకుండవలెను; నేను ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను.౹

37 కాగా మీరు నా కట్టడలన్నిటిని నా విధులన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను; నేను యెహోవాను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/LEV/19-5c0b43f156e4a566f91cfc2417295e4e.mp3?version_id=1787—

Categories
లేవీయకాండము

లేవీయకాండము 20

1 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల. విచ్చెను–నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము

2 –ఇశ్రాయేలీయులలోనేగాని ఇశ్రాయేలు ప్రజలలో నివసించు పరదేశులలోనేగాని యొకడు ఏమాత్రమును తన సంతానమును మోలెకుకు ఇచ్చినయెడల వానికి మరణశిక్ష విధింపవలెను; మీ దేశప్రజలు రాళ్లతో వాని కొట్టవలెను.౹

3 ఆ మనుష్యుడు నా పరిశుద్ధస్థలమును అపవిత్రపరచి నా పరిశుద్ధనామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మోలెకుకు ఇచ్చెను గనుక నేను వానికి విరోధినై ప్రజలలోనుండి వాని కొట్టివేతును.౹

4-5 మరియు ఆ మనుష్యుడు తన సంతానమును మోలెకుకు ఇచ్చుచుండగా మీ దేశ ప్రజలు వాని చంపక, చూచి చూడనట్లు తమ కన్నులు మూసికొనినయెడల నేను వానికిని వాని కుటుంబమునకును విరోధినై వానిని మోలెకుతో వ్యభిచరించుటకు వాని తరిమి వ్యభిచారముచేయు వారినందరిని ప్రజలలోనుండి కొట్టివేతును.౹

6 మరియు కర్ణపిశాచిగలవారితోను సోదెగాండ్రతోను వ్యభిచరించుటకు వారితట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధినై ప్రజలలోనుండి వాని కొట్టి వేతును.౹

7 కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై యుండుడి; నేను మీ దేవుడనైన యెహోవాను.౹

8 మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను, నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను

9 ఎవడు తన తండ్రినైనను తన తల్లినైనను దూషించునో వానికి మరణశిక్ష విధింపవలెను.వాడు తన తండ్రినో తల్లినో దూషించెను గనుక తన శిక్షకు తానే కారకుడు.౹

10 పరుని భార్యతో వ్యభిచరించినవానికి, అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించినవానికిని ఆ వ్యభిచారిణికిని మరణశిక్ష విధింపవలెను.౹

11 తన తండ్రి భార్యతో శయనించినవాడు తన తండ్రి మానాచ్ఛాదనమును తీసెను; వారిద్దరికిని మరణశిక్ష విధింపవలెను; తమ శిక్షకు తామే కారకులు.౹

12 ఒకడు తన కోడలితో శయనించినయెడల వారిద్దరికిని మరణశిక్ష విధింపవలెను. వారు వారి వరసలు తప్పిరి; వారి ప్రాణాపరాధము వారిమీదనుండును.౹

13 ఒకడు స్త్రీతో శయనించినట్టు పురుషునితో శయనించినయెడల వారిద్దరు హేయక్రియనుచేసిరి గనుక వారికి మరణశిక్ష విధింపవలెను; తమ శిక్షకు తామే కారకులు.౹

14 ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెండ్లిచేసికొనినయెడల అది దుష్కామ ప్రవర్తన. దుష్కామప్రవర్తన మీ మధ్యనుండకుండ వానిని వారిని అగ్నితో కాల్చవలెను.౹

15 జంతుశయనము చేయువానికి మరణశిక్ష విధింపవలెను; ఆ జంతువును చంపవలెను.౹

16 స్త్రీ తన్ను జంతువు పొందునట్లు దాని సమీపించినయెడల ఆ స్త్రీకిని ఆ జంతువునకును మరణమే విధి; ఆమెను దానిని చంపవలెను; తమ శిక్షకు తామే కారకులు.౹

17 ఒకడు తన సహోదరిని, అనగా తన తండ్రి కుమార్తెనేగాని తన తల్లి కుమార్తెనేగాని చేర్చుకొని ఆమె దిసమొలనువాడును వాని దిసమొలను ఆమెయు చూచినయెడల అది దురనురాగము. వారికిని తమ జనులయెదుట మరణశిక్ష విధింపవలెను.వాడు తన సహోదరి మానా చ్ఛాదనమును తీసెను; తన దోషశిక్షను తాను భరించును.౹

18 కడగానున్న స్త్రీతో శయనించి ఆమె మానాచ్ఛాదనమును తీసినవాడు ఆమె రక్తధారాచ్ఛాదనమును తీసెను; ఆమె తన రక్తధారాచ్ఛాదనమును తీసివేసెను; వారి ప్రజలలోనుండి వారిద్దరిని కొట్టివేయవలెను.౹

19 నీ తల్లి సహోదరి మానాచ్ఛాదనమునేగాని నీ తండ్రి సహోదరి మానాచ్ఛాదనమునేగాని తీయకూడదు; తీసినవాడు తన రక్తసంబంధియొక్క మానాచ్ఛాదనమును తీసెను; వారు తమ దోషశిక్షను భరించెదరు.౹

20 పినతల్లితోనేగాని పెత్తల్లితోనేగాని శయనించినవాడు తన తలిదండ్రుల సహోదరుల మానాచ్ఛాదనమును తీసెను, వారు తమ పాపశిక్షను భరిం చెదరు; సంతానహీనులై మరణమగుదురు.౹

21 ఒకడు తన సహోదరుని భార్యను చేర్చుకొనినయెడల అది హేయము.వాడు తన సహోదరుని మానాచ్ఛాదనమును తీసెను; వారు సంతానహీనులైయుందురు.

22 కాబట్టి మీరు నివసించునట్లు నేను ఏ దేశమునకు మిమ్మును తీసికొని పోవుచున్నానో ఆ దేశము మిమ్మును కక్కివేయకుండునట్లు మీరు నా కట్టడలన్నిటిని నా విధు లన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను.౹

23 నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనముల ఆచారములనుబట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్నియు చేసిరి గనుక నేను వారియందు అసహ్య పడితిని.౹

24 నేను మీతో చెప్పిన మాట యిదే–మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు; అది, అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము, మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాని మీకిచ్చెదను. జనములలోనుండి మిమ్మును వేరుపరచిన మీ దేవుడనైన యెహోవాను నేనే.౹

25 కావున మీరు పవిత్ర జంతువులకును అపవిత్ర జంతువులకును పవిత్ర పక్షులకును అపవిత్ర పక్షులకును విభజన చేయవలెను. అపవిత్రమైనదని నేను మీకు వేరుచేసిన యే జంతువువలననేగాని, యే పక్షివలననేగాని, నేలమీద ప్రాకు దేనివలననేగాని మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు.౹

26 మీరు నాకు పరిశుద్ధులై యుండవలెను. యెహోవా అను నేను పరిశుద్ధుడను. మీరు నావారై యుండునట్లు అన్యజనులలోనుండి మిమ్మును వేరుపరచితిని.

27 పురుషునియందేమి స్త్రీయందేమి కర్ణపిశాచియైనను సోదెయైనను ఉండినయెడల వారికి మరణశిక్ష విధింపవలెను, వారిని రాళ్లతో కొట్టవలెను. తమ శిక్షకు తామే కారకులు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/LEV/20-a2c8d76278ec346f7c136cb30ada96c2.mp3?version_id=1787—