Categories
అపొస్తలుల కార్యములు

అపొస్తలుల కార్యములు 23

1 పౌలు మహా సభవారిని తేరిచూచి–సహోదరులారా, నేను నేటివరకు కేవలము మంచి మనస్సాక్షిగల వాడనై దేవునియెదుట నడుచుకొనుచుంటినని చెప్పెను.౹

2 అందుకు ప్రధానయాజకుడైన అననీయ–అతని నోటిమీద కొట్టుడని దగ్గర నిలిచియున్నవారికి ఆజ్ఞాపింపగా౹

3-4 పౌలు అతనిని చూచి–సున్నము కొట్టిన గోడా, దేవుడు నిన్ను కొట్టును; నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి, ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్ట నాజ్ఞాపించుచున్నావా అనెను. దగ్గర నిలిచియున్నవారు –నీవు దేవుని ప్రధానయాజకుని దూషించెదవా? అని అడిగిరి.౹

5 అందుకు పౌలు సహోదరులారా, యితడు ప్రధానయాజకుడని నాకు తెలియలేదు–

నీ ప్రజల అధికారిని నిందింపవద్దు

అని వ్రాయబడి యున్నదనెను.౹

6 వారిలో ఒక భాగము సద్దూకయ్యులును మరియొక భాగము పరిసయ్యులునై యున్నట్టు పౌలు గ్రహించి–సహోదరులారా, నేను పరిసయ్యుడను పరిసయ్యుల సంతతివాడను; మనకున్న నిరీక్షణనుగూర్చియు, మృతుల పునరుత్థానమునుగూర్చియు నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పెను.౹

7 అతడాలాగు చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దూకయ్యులకును కలహము పుట్టినందున ఆ సమూహము రెండు పక్షములు ఆయెను.౹

8 సద్దూకయ్యులు పునరుత్థానము లేదనియు, దేవదూతయైనను ఆత్మయైనను లేదనియు చెప్పుదురు గాని పరిసయ్యులు రెండును కలవని యొప్పుకొందురు.౹

9 అప్పుడు పెద్దగొల్లు పుట్టెను; పరిసయ్యుల పక్షముగా ఉన్న శాస్త్రులలో కొందరు లేచి–ఈ మనుష్యునియందు ఏ దోషమును మాకు కనబడలేదు; ఒక ఆత్మయైనను దేవదూతయైనను అతనితో మాటలాడియుంటే మాటలాడి యుండవచ్చునని చెప్పుచు తగువులాడిరి.౹

10 కలహమెక్కు వైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి–మీరు వెళ్లి వారి మధ్యనుండి అతనిని బలవంతముగా పట్టుకొని కోటలోనికి తీసికొని రండని సైనికులకు ఆజ్ఞాపించెను.

11 ఆ రాత్రి ప్రభువు అతనియొద్ద నిలుచుండి–ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్నుగూర్చి నీవేలాగు సాక్ష్యమిచ్చితివో ఆలాగున రోమాలో కూడ సాక్ష్య మియ్యవలసియున్నదని చెప్పెను.

12 ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి, తాము పౌలును చంపువరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనిరి.౹

13 ఈ కుట్రలో చేరినవారు నలుబదిమంది కంటె ఎక్కువ.౹

14 వారు ప్రధానయాజకుల యొద్దకును పెద్దలయొద్దకును వచ్చి–మేము పౌలును చంపువరకు ఏమియు రుచి చూడమని గట్టిగ ఒట్టుపెట్టుకొని యున్నాము.౹

15 కాబట్టి మీరు మహా సభతో కలిసి, అతనినిగూర్చి మరి పూర్తిగా విచారించి తెలిసికొనబోవునట్టు అతనిని మీ యొద్దకు తీసికొని రమ్మని సహస్రాధిపతితో మనవిచేయుడి; అతడు దగ్గరకు రాకమునుపే మేమతని చంపుటకు సిద్ధపడియున్నామని చెప్పిరి.౹

16 అయితే పౌలు మేనల్లుడు వారు పొంచియున్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపెను.౹

17 అప్పుడు పౌలు శతాధిపతులలో నొకనిని తనయొద్దకు పిలిచి–ఈ చిన్నవానిని సహస్రాధిపతియొద్దకు తోడుకొనిపొమ్ము, ఇతడు అతనితో ఒక మాట చెప్పుకొనవలెనని యున్నాడనెను.౹

18 శతాధిపతి సహస్రాధిపతియొద్ద కతని తోడుకొనిపోయి–ఖైదీయైన పౌలు నన్ను పిలిచి–నీతో ఒక మాట చెప్పుకొనవలెననియున్న యీ పడుచువానిని నీయొద్దకు తీసికొనిపొమ్మని నన్ను అడిగెనని చెప్పెను.౹

19 సహస్రాధిపతి అతని చెయ్యి పట్టుకొని అవతలకు తీసి కొనిపోయి–నీవు నాతో చెప్పుకొనవలెనని యున్నదేమని యొంటరిగా అడిగెను.౹

20 అందుకతడు–నీవు పౌలునుగూర్చి సంపూర్తిగా విచారింపబోవునట్టు అతనిని రేపు మహాసభ యొద్దకు తీసికొని రావలెనని నిన్ను వేడుకొనుటకు యూదులు కట్టుకట్టి యున్నారు.౹

21 వారి మాటకు నీవు సమ్మతింపవద్దు; వారిలో నలువదిమందికంటె ఎక్కువ మనుష్యులు అతనికొరకు పొంచియున్నారు. వారు అతని చంపువరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనియున్నారు; ఇప్పుడు నీయొద్ద మాట తీసికొనవలెనని కనిపెట్టుకొని సిద్ధముగా ఉన్నారని చెప్పెను.

22 అందుకు సహస్రాధిపతి–నీవు ఈ సంగతి నాకు తెలిపితివని యెవనితోను చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ పడుచువానిని పంపివేసెను.౹

23 తరువాత అతడు శతాధిపతులలో ఇద్దరిని తనయొద్దకు పిలిచి–కైసరయవరకు వెళ్లుటకు ఇన్నూరు మంది సైనికులను డెబ్బదిమంది గుఱ్ఱపురౌతులను ఇన్నూరు మంది యీటెలవారిని రాత్రి తొమ్మిది గంటలకు సిద్ధపరచి౹

24 పౌలును ఎక్కించి–అధిపతియైన ఫేలిక్సునొద్దకు భద్రముగా తీసికొనిపోవుటకు గుఱ్ఱములను సిద్ధపరచుడని చెప్పెను.౹

25 మరియు ఈ ప్రకారముగా ఒక పత్రిక వ్రాసెను–

26 మహాఘనతవహించిన అధిపతియైన ఫేలిక్సుకు క్లౌదియ లూసియ వందనములు.౹

27 యూదులు ఈ మనుష్యుని పట్టుకొని చంపబోయినప్పుడు, అతడు రోమీయుడని నేను విని, సైనికులతో వచ్చి అతనిని తప్పించితిని.౹

28 వారు అతనిమీద మోపిన నేరమేమో తెలిసికొనగోరి నేను వారి మహాసభయొద్దకు అతనిని తీసికొనివచ్చితిని.౹

29 వారు తమ ధర్మశాస్త్రవాదములనుగూర్చి అతనిమీద నేరము మోపిరే గాని మరణమునకైనను, బంధకములకైనను తగిన నేరము అతనియందేమియు కనుపరచలేదు.౹

30 అయితే వారు ఈ మనుష్యునిమీద కుట్రచేయనై యున్నారని నాకు తెలియవచ్చినందున, వెంటనే అతని నీయొద్దకు పంపించితిని. నేరము మోపినవారు కూడ అతనిమీద చెప్పవలెనని యున్న సంగతి నీయెదుట చెప్పుకొన నాజ్ఞాపించితిని.

కాబట్టి అతడు వారికాజ్ఞాపించిన ప్రకారము సైనికులు పౌలును రాత్రివేళ అంతిపత్రికి తీసికొనిపోయిరి.౹

31 మరునాడు వారతనితోకూడ రౌతులను పంపి తాము కోటకు తిరిగి వచ్చిరి.౹

32 వారు కైసరయకు వచ్చి అధిపతికి ఆ పత్రిక అప్పగించి పౌలును కూడ అతనియెదుట నిలువ బెట్టిరి.౹

33 అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు–ఇతడు ఏ ప్రదేశపువాడని అడిగి, అతడు కిలికియవాడని తెలిసికొని౹

34 –నీమీద నేరము మోపువారు కూడ వచ్చినప్పుడు నీ సంగతి పూర్ణముగా విచారింతునని చెప్పి,౹

35 హేరోదు అధికారమందిరములో అతనిని కావలియందుంచవలెనని ఆజ్ఞాపించెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ACT/23-b4e300ecb00780fd6d60a99498086f30.mp3?version_id=1787—

Categories
అపొస్తలుల కార్యములు

అపొస్తలుల కార్యములు 24

1 అయిదు దినములైన తరువాత ప్రధానయాజకుడైన అననీయయు, కొందరు పెద్దలును, తెర్తుల్లు అను ఒక న్యాయ వాదియు కైసరయకు వచ్చి, పౌలుమీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసిరి.౹

2 పౌలు రప్పింపబడినప్పుడు తెర్తుల్లు అతనిమీద నేరముమోప నారంభించి యిట్లనెను–

3 మహాఘనతవహించిన ఫేలిక్సా, మేము తమవలన ఎంతో నెమ్మది అనుభవించుచున్నామనియు, ఈ దేశ జనమునకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరామర్శ చేత దిద్దుబాటవుచున్నవనియు ఒప్పుకొని, మేము సకల విధములను సకల స్థలములలోను పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాము.౹

4 నేను తమకు ఎక్కువ ఆయాసము కలుగజేయకుండ మేము క్లుప్తముగా చెప్పుకొనుదానిని తమరు ఎప్పటివలె శాంతముగా వినవలెనని వేడుకొనుచున్నాను.౹

5 ఈ మనుష్యుడు పీడవంటివాడును, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపు వాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడునై యున్నట్టు మేము కనుగొంటిమి,౹

6-8 మరియు ఇతడు దేవాలయమును అపవిత్రము చేయుటకు యత్నపడెను గనుక మేము అతని పట్టుకొంటిమి.తమరు విమర్శించినయెడల మేము ఇతనిమీద మోపుచున్న నేరములన్నియు తమకే తెలియవచ్చునని చెప్పెను.౹

9 యూదులందుకు సమ్మతించి యీ మాటలు నిజమే అని చెప్పిరి.

10 అప్పుడు అధిపతి–మాటలాడుమని పౌలునకు సైగ చేయగా అతడిట్లనెను–

తమరు బహు సంవత్సరములనుండి యీ జనమునకు న్యాయాధిపతులై యున్నారని యెరిగి నేను ధైర్యముతో సమాధానము చెప్పుకొనుచున్నాను.౹

11 యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్లిననాటనుండి పండ్రెండు దినములు మాత్రమే అయినదని తమరు విచారించి తెలిసికొన వచ్చును.౹

12 దేవాలయములోనేమి, సమాజమందిరములలోనేమి, పట్టణములోనేమి, నేను ఎవనితోను తర్కించుట యైనను, జనులను గుమికూర్చుటయైనను వారు చూడలేదు.౹

13 మరియు వారు ఇప్పుడు నామీద మోపు నేరములను తమరికి ఋజువుపరచలేరు.౹

14-15 ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములయందును వ్రాయబడియున్నవన్నియు నమ్మి, నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగ బోవుచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడ దేవునియందు నిరీక్షణయుంచి, వారు మతభేదమని పేరుపెట్టు ఈ మార్గముచొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరియెదుట ఒప్పుకొనుచున్నాను.౹

16 ఈ విధమున నేనును దేవునియెడలను మనుష్యులయెడలను ఎల్లప్పుడు నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసికొనుచున్నాను.౹

17 కొన్ని సంవత్సరములైన తరువాత నేను నా స్వజనులకు దానద్రవ్యమును కానుకలును అప్పగించుటకు వచ్చితిని.౹

18 నేను శుద్ధి చేసికొనిన వాడనై యీలాగు అప్పగించుచుండగా వారు దేవాలయములో నన్ను చూచిరి. నేను గుంపుకూర్చి యుండ లేదు, నావలన అల్లరి కాలేదు. ఆసియనుండి వచ్చిన కొందరు యూదులు ఉండిరి;౹

19 నామీద వారికేమైన ఉన్నయెడల వారే తమరి సన్నిధికివచ్చి నామీద నేరము మోపవలసియుండెను.౹

20-21 లేదా, నేను మహాసభయెదుట నిలిచియున్నప్పుడు, మృతుల పునరుత్థానమునుగూర్చి నేడు వారియెదుట విమర్శింపబడు చున్నానని వారి మధ్య నిలువబడి నేను బిగ్గరగా చెప్పిన యీయొక్క మాట విషయమై తప్ప నాయందు మరి ఏ నేరమైనను వీరు కనుగొనియుంటే వీరైన చెప్పవచ్చుననెను.

22 ఫేలిక్సు ఈ మార్గమునుగూర్చి బాగుగా ఎరిగినవాడై–సహస్రాధిపతియైన లూసియ వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారించి తెలిసికొందునని చెప్పి విమర్శ నిలుపు చేసెను.౹

23 మరియు అతని విడిగా కావలిలో ఉంచి, అతనికి పరిచారము చేయుటకు అతని స్వజనులలో ఎవరిని ఆటంకపరచకూడదని శతాధిపతికి ఆజ్ఞాపించెను.

24 కొన్ని దినములైన తరువాత ఫేలిక్సు యూదురాలైన ద్రుసిల్ల అను తన భార్యతోకూడ వచ్చి పౌలును పిలిపించి, క్రీస్తుయేసునందలి విశ్వాసమునుగూర్చి అతడు బోధింపగా వినెను.౹

25 అప్పుడతడు నీతిని గూర్చియు ఆశానిగ్రహమునుగూర్చియు రాబోవు విమర్శనుగూర్చియు ప్రసంగించుచుండగా ఫేలిక్సు మిగుల భయపడి–ఇప్పటికి వెళ్లుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపింతునని చెప్పెను.౹

26 తరువాత పౌలువలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి, మాటిమాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను.౹

27 రెండు సంవత్సరములైన తరువాత ఫేలిక్సుకు ప్రతిగా పోర్కియు ఫేస్తు వచ్చెను. అప్పుడు ఫేలిక్సు యూదులచేత మంచి వాడనిపించుకొనవలెనని కోరి, పౌలును బంధకములలోనే విడిచిపెట్టి పోయెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ACT/24-196e319ea3bb71649a4362f55a281b50.mp3?version_id=1787—

Categories
అపొస్తలుల కార్యములు

అపొస్తలుల కార్యములు 25

1 ఫేస్తు ఆ దేశాధికారమునకు వచ్చిన మూడుదినములకు కైసరయనుండి యెరూషలేమునకు వెళ్లెను.౹

2 అప్పుడు ప్రధానయాజకులును యూదులలో ముఖ్యులును పౌలుమీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేసిరి.౹

3 మరియు త్రోవలో అతనిని చంపుటకు పొంచియుండి–మీరు దయచేసి అతనిని యెరూషలేమునకు పిలువనంపించుడని అతనినిగూర్చి ఫేస్తు నొద్ద మనవి చేసిరి.౹

4 అందుకు ఫేస్తు–పౌలు కైసరయలో కావలిలో ఉన్నాడు; నేను శీఘ్రముగా అక్కడికి వెళ్ల బోవుచున్నాను౹

5 గనుక మీలో సమర్థులైనవారు నాతోకూడ వచ్చి ఆ మనుష్యునియందు తప్పిదమేదైన ఉంటే అతనిమీద మోపవచ్చునని ఉత్తరమిచ్చెను.

6 అతడు వారియొద్ద ఎనిమిది, పది దినములు గడిపి కైసరయకు వెళ్లి మరునాడు న్యాయపీఠముమీద కూర్చుండి పౌలును తీసికొని రమ్మని ఆజ్ఞాపించెను.౹

7 పౌలు వచ్చి నప్పుడు యెరూషలేమునుండి వచ్చిన యూదులు అతని చుట్టు నిలిచి, భారమైన నేరములనేకముల మోపిరి గాని వాటిని బుజువు చేయలేక పోయిరి.౹

8 అందుకు పౌలు –యూదుల ధర్మశాస్త్రమునుగూర్చి గాని దేవాలయమునుగూర్చి గాని, కైసరునుగూర్చి గాని నేనెంతమాత్రమును తప్పిదము చేయలేదని సమాధానము చెప్పెను.౹

9 అయితే ఫేస్తు యూదులచేత మంచివాడనిపించు కొనవలెనని–యెరూషలేమునకు వచ్చి అక్కడ నా యెదుట ఈ సంగతులనుగూర్చి విమర్శింపబడుట నీకిష్టమా అని పౌలును అడిగెను.౹

10 అందుకు పౌలు–కైసరు న్యాయపీఠము ఎదుట నిలువబడి యున్నాను; నేను విమర్శింపబడవలసిన స్థలమిదే, యూదులకు నేను అన్యాయమేమియు చేయ లేదని తమరికి బాగుగా తెలియును.౹

11 నేను న్యాయము తప్పి మరణమునకు తగినదేదైనను చేసినయెడల మరణమునకు వెనుకతీయను; వీరు నామీద మోపుచున్న నేరములలో ఏదియు నిజముకాని యెడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరితరముకాదు; కైసరు ఎదుటనే చెప్పుకొందుననెను.౹

12 అప్పుడు ఫేస్తు తన సభవారితో ఆలోచనచేసిన తరువాత కైసరు ఎదుట చెప్పుకొందునంటివే కైసరునొద్దకే పోవుదు వని ఉత్తరమిచ్చెను.

13 కొన్ని దినములైన తరువాత రాజైన అగ్రిప్పయు బెర్నీకేయు ఫేస్తు దర్శనము చేసికొనుటకు కైసరయకు వచ్చిరి.౹

14 వారక్కడ అనేకదినములుండగా, ఫేస్తు పౌలు సంగతి రాజుకు తెలియజెప్పెను; ఏమనగా–ఫేలిక్సు విడిచిపెట్టిపోయిన యొక ఖైదీ యున్నాడు.౹

15 నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధానయాజకులును యూదుల పెద్దలును అతనిమీద తెచ్చిన ఫిర్యాదు తెలిపి అతనికి శిక్ష విధింపవలెనని వేడుకొనిరి.౹

16 అందుకు నేను –నేరము మోపబడివవాడు నేరము మోపినవారికి ముఖాముఖిగా వచ్చి, తనమీద మోపబడిన నేరమునుగూర్చి సమాధానము చెప్పుకొనుటకు అవకాశమియ్యకమునుపు ఏ మనుష్యునినైనను అప్పగించుట రోమీయుల ఆచారము కాదని ఉత్తరమిచ్చితిని.౹

17 కాబట్టి వారిక్కడికి కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యమేమియు చేయక, మరునాడు న్యాయపీఠముమీద కూర్చుండి ఆ మనుష్యుని తీసికొని రమ్మని ఆజ్ఞాపించితిని.౹

18 నేరము మోపినవారు నిలిచి నప్పుడు, నేననుకొనిన నేరములలో ఒకటియైనను అతని మీద మోపినవారు కారు.౹

19 అయితే తమ మతమునుగూర్చియు, చనిపోయిన యేసు అను ఒకనిగూర్చియు ఇతనితో వారికి కొన్ని వివాదములున్నట్టు కనబడెను;౹

20 ఆ యేసు బ్రదికియున్నాడని పౌలు చెప్పెను. నేనట్టి వాదముల విషయమై యేలాగున విచారింపవలెనో యేమియు తోచక, యెరూషలేమునకు వెళ్లి అక్కడ వీటినిగూర్చి విమర్శింపబడుటకు అతని కిష్టమవునేమో అని అడిగితిని.౹

21 అయితే పౌలు, చక్రవర్తి విమర్శకు తన్ను నిలిపి యుంచ వలెనని చెప్పుకొనినందున నేనతనిని కైసరునొద్దకు పంపించువరకు నిలిపియుంచవ లెనని ఆజ్ఞాపించితిననెను.౹

22 అందుకు అగ్రిప్ప–ఆ మనుష్యుడు చెప్పుకొనునది నేనును వినగోరు చున్నానని ఫేస్తుతో అనగా అతడు–రేపు వినవచ్చునని చెప్పెను.

23 కాబట్టి మరునాడు అగ్రిప్పయు బెర్నీకేయు మిక్కిలి ఆడంబరముతో వచ్చి, సహస్రాధిపతులతోను పట్టణ మందలి ప్రముఖులతోను అధికారమందిరములో ప్రవేశించిన తరువాత ఫేస్తు ఆజ్ఞనియ్యగా పౌలు తేబడెను.౹

24 అప్పుడు ఫేస్తు–అగ్రిప్పరాజా, యిక్కడ మాతో ఉన్న సమస్తజనులారా, మీరు ఈ మనుష్యుని చూచుచున్నారు. యెరూషలేములోను ఇక్కడను యూదులందరు–వీడు ఇక బ్రదుక తగడని కేకలు వేయుచు అతనిమీద నాతో మనవి చేసికొనిరి.౹

25 ఇతడు మరణమునకు తగినది ఏమియు చేయలేదని నేను గ్రహించి, యితడు చక్రవర్తియెదుట చెప్పుకొందునని అనినందున ఇతని పంప నిశ్చయించియున్నాను.౹

26 ఇతనిగూర్చి మన యేలినవారిపేర వ్రాయుటకు నాకు నిశ్చయమైనది ఏమియు కనబడలేదు గనుక విచారణయైన తరువాత వ్రాయుటకు ఏమైనను నాకు దొరకవచ్చునని మీ అందరియెదుటికిని, అగ్రిప్ప రాజా, ముఖ్యముగా మీ యెదుటికిని, ఇతని రప్పించియున్నాను.౹

27 ఖయిదీమీద మోపబడిన నేరములను వివరింపకుండ అతని పంపుట యుక్తముకాదని నాకు తోచు చున్నదని చెప్పెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ACT/25-6366e781b81ce7bed1bb2c3b7d5d9e5c.mp3?version_id=1787—

Categories
అపొస్తలుల కార్యములు

అపొస్తలుల కార్యములు 26

1 అగ్రిప్ప పౌలును చూచి–నీ పక్షమున చెప్పు కొనుటకు నీకు సెలవైనదనెను. అప్పుడు పౌలు చేయి చాచి యీలాగు సమాధానము చెప్పసాగెను–

2 అగ్రిప్పరాజా, తమరు యూదులలోఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగినవారు గనుక౹

3 యూదులు నామీద మోపిన నేరములన్నిటినిగూర్చి నేడు తమరియెదుట సమాధానము చెప్పుకొనబోవుచున్నందుకు నేను ధన్యుడనని యనుకొనుచున్నాను; తాల్మితో నా మనవి వినవలెనని వేడుకొనుచున్నాను.౹

4 మొదటినుండి యెరూషలేములో నా జనముమధ్యను బాల్యమునుండి నేను బ్రదికిన బ్రదుకు ఏలాటిదో యూదులందరు ఎరుగుదురు.౹

5 వారు మొదటినుండి నన్ను ఎరిగినవారు గనుక సాక్ష్యమిచ్చుటకు వారికిష్టమైతే నేను మన మతములోని బహునిష్ఠగల తెగను అనుసరించి, పరిసయ్యుడనుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు.౹

6 ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము విషయమైన నిరీ క్షణనుగూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచియున్నాను.౹

7 మన పండ్రెండు గోత్రములవారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదుమని నిరీక్షించుచున్నారు. ఓ రాజా, యీ నిరీక్షణ విషయమే యూదులు నామీద నేరము మోపి యున్నారు.౹

8 దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మతగనిదని మీరేల యెంచుచున్నారు?౹

9 నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేననుకొంటిని;౹

10 యెరూషలేములో నేనాలాగు చేసితిని. నేను ప్రధానయాజకులవలన అధికారము పొంది, పరిశుద్ధులను అనేకులను చెరసాలలలో వేసి, వారిని చంపినప్పుడు సమ్మతించితిని;౹

11 అనేకపర్యాయములు సమాజమందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణచేయునట్లు బలవంతపెట్ట చూచితిని. మరియు వారిమీద మిక్కిలి క్రోధము గలవాడనై యితర పట్టణములకును వెళ్లి వారిని హింసించు చుంటిని.౹

12 అందునిమిత్తము నేను ప్రధానయాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవుచుండగా౹

13 రాజా, మధ్యాహ్నమందు నా చుట్టును నాతోకూడ వచ్చినవారి చుట్టును ఆకాశమునుండి సూర్య తేజస్సుకంటె మిక్కిలి ప్రకాశమానమైన యొక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని.౹

14 మేమందరమును నేలపడినప్పుడు–సౌలా సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు? మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీభాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని.౹

15 అప్పుడు నేను–ప్రభువా, నీవు ఎవడవని అడుగగా ప్రభువు నేను–నీవు హింసించుచున్న యేసును.౹

16-18 నీవు నన్ను చూచియున్న సంగతినిగూర్చియు నేను నీకు కనబడబోవు సంగతినిగూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడియున్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము; నేను ఈ ప్రజల వలనను అన్యజనులవలనను హాని కలుగకుండ నిన్ను కాపాడెదను; వారు చీకటిలోనుండి వెలుగులోనికిని సాతాను అధికారమునుండి దేవుని వైపుకును తిరిగి, నా యందలి విశ్వాసముచేత పాపక్షమాపణను, పరిశుద్ధపరచబడినవారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారియొద్దకు పంపెదనని చెప్పెను.౹

19 కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశమునుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక౹

20 మొదట దమస్కులోనివారికిని, యెరూషలేములోను యూదయ దేశమంతటను, తరువాత అన్యజనులకును, వారు మారుమనస్సు పొంది దేవునితట్టు తిరిగి మారుమనస్సునకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని.౹

21 ఈ హేతువుచేత యూదులు దేవాలయములో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నముచేసిరి;౹

22 అయినను నేను దేవుని వలననైన సహాయము పొంది నేటివరకు నిలిచియుంటిని; –క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందువారిలో మొదటివాడగుటచేత, ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని౹

23 ప్రవక్తలును మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమియు చెప్పక, అల్పు లకును ఘనులకును సాక్ష్యమిచ్చుచుంటిని.

24 అతడు ఈలాగు సమాధానము చెప్పుకొనుచుండగా ఫేస్తు–పౌలా, నీవు వెఱ్ఱివాడవు, అతి విద్యవలన నీకు వెఱ్ఱిపెట్టినదని గొప్ప శబ్దముతో చెప్పెను.౹

25 అందుకు పౌలు ఇట్లనెను–మహాఘనత వహించిన ఫేస్తూ, నేను వెఱ్ఱివాడను కానుగాని సత్యమును స్వస్థబుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను.౹

26 రాజు ఈ సంగతులెరుగును గనుక అతని యెదుట నేను ధైర్యముగా మాటలాడుచున్నాను; వాటిలో ఒకటియు అతనికి మరుగైయుండ లేదని రూఢిగా నమ్ముచున్నాను; ఇది యొక మూలను జరిగిన కార్యము కాదు.౹

27 అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా? నమ్ముచున్నారని నేనెరుగుదును.౹

28 అందుకు అగ్రిప్ప–ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయ జూచుచున్నావే అని పౌలుతో చెప్పెను.౹

29 అందుకు పౌలు–సులభముగానో దుర్లభము గానో, తమరు మాత్రము కాదు, నేడు నా మాట వినువారందరును ఈ బంధకములు తప్ప నావలె ఉండునట్లు దేవుడనుగ్రహించుగాక అనెను.

30 అంతట రాజును అధిపతియు బెర్నీకేయు వారితోకూడ కూర్చుండినవారును లేచి అవతలకు పోయి౹

31 –ఈ మనుష్యుడు మరణమునకైనను బంధకములకైనను తగిన దేమియు చేయలేదని తమలోతాము మాటలాడుకొనిరి.౹

32 అందుకు అగ్రిప్ప–ఈ మనుష్యుడు–కైసరు ఎదుట చెప్పు కొందునని అననియెడల ఇతనిని విడుదల చేయవచ్చునని ఫేస్తుతో చెప్పెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ACT/26-08ab70eb7a253808e7e6a2759ff94eb4.mp3?version_id=1787—

Categories
అపొస్తలుల కార్యములు

అపొస్తలుల కార్యములు 27

1 మేము ఓడయెక్కి ఇటలీ వెళ్లవలెనని నిర్ణయమై నప్పుడు, వారు పౌలును మరికొందరు ఖైదీలను ఔగుస్తు పటాలములో శతాధిపతియైన యూలి అను వానికి అప్పగించిరి.౹

2 ఆసియ దరివెంబడినున్న పట్టణములకు ప్రయాణము చేయబోవు అద్రముత్తియ పట్టణపు ఓడనెక్కి మేము బయలుదేరితిమి; మాసిదోనీయుడును థెస్సలొనీక పట్టణస్థుడునైన అరిస్తార్కు మాతోకూడ ఉండెను.౹

3 మరునాడు సీదోనుకు వచ్చితిమి. అప్పుడు యూలి పౌలు మీద దయగా ఉండి, అతడు తన స్నేహితులయొద్దకు వెళ్లి పరామరిక పొందుటకు అతనికి సెలవిచ్చెను.౹

4 అక్కడనుండి బయలుదేరిన తరువాత ఎదురుగాలి కొట్టుచున్నందున కుప్రచాటున ఓడ నడిపించితిమి.౹

5 మరియు కిలికియకును పంఫూలియకును ఎదురుగా ఉన్న సముద్రము దాటి లుకియలో ఉన్న మూరకు చేరితిమి.౹

6 అక్కడ శతాధిపతి ఇటలీవెళ్లనైయున్న అలెక్సంద్రియ పట్టణపు ఓడ కనుగొని అందులో మమ్మును ఎక్కించెను.౹

7 అనేక దినములు మెల్లగా నడచి, యెంతో కష్టపడి క్నీదుకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మును పోనియ్యకున్నందున క్రేతు చాటున సల్మోనే దరిని ఓడ నడిపించితిమి.౹

8 బహు కష్టపడి దాని దాటి, మంచిరేవులు అను ఒక స్థలమునకు చేరితిమి. దానిదగ్గర లసైయ పట్టణముండెను.

9 చాల కాలమైన తరువాత ఉపవాసదినము కూడ అప్పటికి గతించినందున ప్రయాణముచేయుట అపాయ కరమై యుండెను.౹

10 అప్పుడు పౌలు–అయ్యలారా, యీ ప్రయాణమువలన సరకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడ హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను.౹

11 అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను.౹

12 మరియు శీతకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున అక్కడనుండి బయలుదేరి యొకవేళ శక్యమైతే ఫీనిక్సునకుచేరి అక్కడ శీతకాలము గడపవలెనని యెక్కువ మంది ఆలోచన చెప్పిరి. అది నైరుతి వాయవ్యదిక్కులతట్టుననున్న క్రేతురేవై యున్నది.౹

13 మరియు దక్షిణపు గాలి మెల్లగా విసరుచుండగా వారు తమ ఆలోచన సమ కూడినదని తలంచి లంగరెత్తి, క్రేతు దరిని ఓడ నడిపించిరి.౹

14 కొంచెము సేపైన తరువాత ఊరకులోను అను పెనుగాలి క్రేతు మీదనుండి విసరెను.౹

15 దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడువలేక పోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొనిపోతిమి.౹

16 తరువాత కౌద అన బడిన యొక చిన్న ద్వీపము చాటున దాని నడిపింపగా పడవను భద్రపరచుకొనుట బహు కష్ట తరమాయెను.౹

17 దానిని పైకెత్తి కట్టిన తరువాత త్రాళ్లు మొదలైనవి తీసి కొని ఓడచుట్టు బిగించి కట్టిరి. మరియు సూర్తిసను ఇసుకతిప్పమీద పడుదుమేమో అని భయపడి, ఓడ చాపలు దింపివేసి, కొట్టుకొనిపోయిరి.౹

18 మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరకులు పారవేయ సాగిరి.౹

19 మూడవ దినమందు తమ చేతులార ఓడసామగ్రి పారవేసిరి.౹

20-21 కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్దగాలి మామీద కొట్టినందున ప్రాణములతో తప్పించు కొందుమను ఆశ బొత్తిగ పోయెను. వారు బహు కాలము భోజనము లేక యున్నందున పౌలు వారిమధ్యను నిలిచి–అయ్యలారా, మీరు నా మాట విని క్రేతునుండి బయలుదేరకయే యుండవలసినది. అప్పుడీ హానియు నష్టమును కలుగకపోవును.౹

22 ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను; ఓడకేగాని మీలో ఎవని ప్రాణమునకును హానికలుగదు.౹

23 నేను ఎవనివాడనో, యెవనిని సేవించుచున్నానో, ఆ దేవుని దూత గడచిన రాత్రి నాయొద్ద నిలిచి–పౌలా, భయపడకుము;౹

24 నీవు కైసరు ఎదుట నిలువవలసియున్నది; ఇదిగో నీతోకూడ ఓడలో ప్రయాణమై పోవుచున్న వారందరిని దేవుడు నీకు అనుగ్రహించియున్నాడని నాతో చెప్పెను.౹

25 కాబట్టి అయ్యలారా, ధైర్యము తెచ్చుకొనుడి; నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను.౹

26 అయినను మనము కొట్టుకొనిపోయి యేదైన ఒక ద్వీపముమీద పడవలసి యుండునని చెప్పెను.

27 పదునాలుగవ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియ సముద్రములో ఇటు అటు కొట్టుకొనిపోవుచుండగా అర్ధరాత్రివేళ ఓడవారు ఏదో యొక దేశము దగ్గర పడు చున్నదని యూహించి౹

28 బుడుదువేసి చూచి యిరువది బారల లోతని తెలిసికొనిరి. ఇంకను కొంతదూరము వెళ్లిన తరువాత, మరల బుడుదువేసి చూచి పదునైదు బారల లోతని తెలిసికొనిరి.౹

29 అప్పుడు రాతి తిప్పలుగల చోట్ల పడుదుమేమో అని భయపడి, వారు ఓడ అమరములోనుండి నాలుగు లంగరులువేసి యెప్పుడు తెల్ల వారునా అని కాచుకొని యుండిరి.౹

30 అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవలెనని చూచి, తాము అనివిలోనుండి లంగరులు వేయబోవునట్లుగా సముద్రములో పడవ దింపి వేసిరి.౹

31 అందుకు పౌలు–వీరు ఓడలో ఉంటేనేగాని మీరు తప్పించుకొనలేరని శతాధిపతితోను సైనికులతోను చెప్పెను.౹

32 వెంటనే సైనికులు పడవ త్రాళ్లు కోసి దాని కొట్టుకొని పోనిచ్చిరి.౹

33-34 తెల్లవారుచుండగా పౌలు– పదునాలుగు దినములనుండి మీరేమియు పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకొని యున్నారు గనుక ఆహా రము పుచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను; ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండియు ఒక వెండ్రుకయైనను నశింపదని చెప్పుచు, ఆహారము పుచ్చుకొనుడని అందరిని బతిమాలెను.౹

35 ఈ మాటలు చెప్పి, యొక రొట్టె పట్టుకొని అందరి యెదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి తిన సాగెను.౹

36 అప్పుడందరు ధైర్యము తెచ్చుకొని ఆహారము పుచ్చుకొనిరి.౹

37 ఓడలో ఉన్న మేమందరము రెండువందల డెబ్బది ఆరుగురము.౹

38 వారు తిని తృప్తిపొందిన తరువాత, గోధుమలను సముద్రములో పారబోసి ఓడ తేలికచేసిరి.౹

39 ఉదయమైనప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు గాని, దరిగల యొక సముద్రపు పాయను చూచి, సాధ్యమైనయెడల అందులోనికి ఓడను త్రోయవలెనని ఆలో చించిరి౹

40 గనుక లంగరుల త్రాళ్లుకోసి వాటిని సముద్రములో విడిచిపెట్టి చుక్కానుల కట్లు విప్పి ముందటి తెరచాప గాలికెత్తి సరిగా దరికి నడిపించిరి గాని౹

41 రెండు ప్రవాహములు కలిసినస్థలమందు చిక్కుకొని ఓడను మెట్ట పెట్టించిరి. అందువలన అనివి కూరుకొనిపోయి కదలక యుండెను, అమరము ఆ దెబ్బకు బద్దలై పోసాగెను.౹

42 ఖైదీలలో ఎవడును ఈదుకొని పారిపోకుండునట్లు వారిని చంపవలెనని సైనికులకు ఆలోచన పుట్టెను గాని౹

43 శతాధిపతి పౌలును రక్షింప నుద్దేశించి వారి ఆలోచన కొనసాగనియ్యక, మొదట ఈదగలవారు సముద్రములో దుమికి దరికి పోవలెననియు౹

44 కడమ వారిలో కొందరు పలకలమీదను, కొందరు ఓడ చెక్కలమీదను, పోవలెననియు ఆజ్ఞాపించెను. ఈలాగు అందరు తప్పించుకొని దరిచేరిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ACT/27-c5fc434170962306f225c6e32751d915.mp3?version_id=1787—

Categories
అపొస్తలుల కార్యములు

అపొస్తలుల కార్యములు 28

1 మేము తప్పించుకొనిన తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలిసికొంటిమి.౹

2 అనాగరికులగు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచార మింతంతకాదు. ఏలాగనగా, అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందునవారు నిప్పురాజబెట్టి మమ్మును అందరిని చేర్చుకొనిరి.౹

3 అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పులమీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను.౹

4 ఆ ద్వీపవాసులు ఆ జంతువతని చేతిని వ్రేలా డుట చూచినప్పుడు–నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు; ఇతడు సముద్రమునుండి తప్పించుకొనినను న్యాయమాతనినిబ్రదుకనియ్యదని తమలో తాము చెప్పు కొనిరి.౹

5 అతడైతే ఆ విషజంతువును అగ్నిలో జాడించి వేసి, యే హానియు పొందలేదు.౹

6 వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడిచచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియు కలుగకుండుట చూచి ఆ అభి ప్రాయము మాని–ఇతడొక దేవత అని చెప్పసాగిరి.

7 పొప్లి అను ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతములలో భూములుండెను. అతడు మమ్మును చేర్చుకొని మూడుదినములు స్నేహ భావముతో ఆతిథ్య మిచ్చెను.౹

8 అప్పుడు పొప్లియొక్క తండ్రి జ్వరముచేతను రక్తభేదిచేతను బాధపడుచు పండుకొని యుండెను. పౌలు అతనియొద్దకు వెళ్లి ప్రార్థనచేసి, అతనిమీద చేతులుంచి స్వస్థపరచెను.౹

9 ఇది చూచి ఆ ద్వీపములో ఉన్న కడమ రోగులు కూడ వచ్చి స్వస్థత పొందిరి.౹

10 మరియు వారు అనేక సత్కారములతో మమ్మును మర్యాద చేసి, మేము ఓడ ఎక్కి వెళ్లినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి.

11 మూడు నెలలైన తరువాత, ఆ ద్వీపమందు శీతకాల మంతయు గడపిన అశ్వినీ చిహ్నముగల అలెక్సంద్రియ పట్టణపు ఓడ ఎక్కి బయలుదేరి౹

12 సురకూసైకి వచ్చి అక్కడ మూడుదినములుంటిమి.౹

13 అక్కడనుండి చుట్టు తిరిగి రేగియుకు వచ్చి యొక దినమైన తరువాత దక్షిణపు గాలి విసరుటవలన మరునాడు పొతియొలీకి వచ్చితిమి.౹

14 అక్కడ సహోదరులను మేము చూచినప్పుడు వారు తమ యొద్ద ఏడు దినములుండవలెనని మమ్మును వేడుకొనిరి. ఆ మీదట రోమాకు వచ్చితిమి.౹

15 అక్కడనుండి సహోదరులు మా సంగతి విని అప్పీయా సంతపేట వరకును త్రిసత్రములవరకును మమ్మును ఎదుర్కొనుటకు వచ్చిరి. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను.

16 మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి యున్న సైనికులతోకూడ ప్రత్యేకముగా ఉండుటకు సెలవు పొందెను.

17 మూడుదినములైన తరువాత అతడు యూదులలో ముఖ్యులైనవారిని తనయొద్దకు పిలిపించెను. వారు కూడి వచ్చినప్పుడతడు–సహోదరులారా, నేను మన ప్రజల కైనను పితరుల ఆచారములకైనను ప్రతికూలమైనది ఏదియు చేయకపోయినను, యెరూషలేములోనుండి రోమీయుల చేతికి నేను ఖైదీగా అప్పగించబడితిని.౹

18 వీరు నన్ను విమర్శ చేసి నాయందు మరణమునకు తగిన హేతువేదియు లేనందున నన్ను విడుదల చేయగోరిరి గాని౹

19 యూదులు అడ్డము చెప్పినందున నేను కైసరు ఎదుట చెప్పుకొందునన వలసి వచ్చెను. అయినను ఇందువలన నా స్వజనముమీద నేరమేమియు మోపవలెనని నా అభిప్రాయము కాదు;౹

20 ఈ హేతువుచేతనే మిమ్మును చూచి మాటలాడవలెనని పిలిపించితిని; ఇశ్రాయేలుయొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసుతో కట్టబడియున్నానని వారితో చెప్పెను.౹

21 అందుకు వారు–యూదయనుండి నిన్నుగూర్చి పత్రికలు మాకు రాలేదు; ఇక్కడికి వచ్చిన సహోదరులలో ఒక్క డైనను నిన్నుగూర్చి చెడుసంగతి ఏదియు మాకు తెలియ పరచను లేదు, మరియు ఎవరును చెప్పుకొనను లేదు.౹

22 అయినను ఈ విషయమై నీ అభిప్రాయము నీవలన విన గోరుచున్నాము; ఈ మతభేదమునుగూర్చి అంతట ఆక్షేపణ చేయుచున్నారు ఇంతమట్టుకు మాకు తెలియుననిరి.

23 అతనికి ఒక దినము నియమించి, అతని బసలోనికి అతనియొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయమునుండి సాయంకాలమువరకు అతడు దేవుని రాజ్యమునుగూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు, మోషే ధర్మశాస్త్రములోనుండియు ప్రవక్తలలోనుండియు సంగతులెత్తి యేసునుగూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను.

24 అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి.౹

25 వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తరువాత వారు వెళ్లిపోయిరి. అదేదనగా.

26 –మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే

గ్రహింపరు; చూచుట మట్టుకు చూతురు గాని

కాననే కానరని యీ ప్రజలయొద్దకు వెళ్లి

చెప్పుము.౹

27 ఈ ప్రజలు కన్నులార చూచి చెవు

లార విని మనసార గ్రహించి నావైపు తిరిగి

నావలన స్వస్థత పొందకుండునట్లు వారి హృద

యము క్రొవ్వియున్నది. వారు చెవులతో మంద

ముగా విని కన్నులు మూసికొనియున్నారు

అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్తద్వారా మీపితరులతో చెప్పిన మాట సరియే.౹

28-29 కాబట్టి దేవునివలననైన యీ రక్షణ అన్యజనులయొద్దకు పంపబడి యున్నదని మీరు తెలిసికొందురుగాక, వారు దాని విందురు.

30 పౌలు రెండు సంవత్సరములు పూర్తిగా తన అద్దె యింట కాపురముండి, తనయొద్దకు వచ్చువారినందరిని సన్మానించి౹

31 ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమునుగూర్చి ప్రకటించుచు, ప్రభువైన యేసు క్రీస్తునుగూర్చిన సంగతులు బోధించుచు ఉండెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ACT/28-ae391e42291dd2476b78fc7eabf221e3.mp3?version_id=1787—

Categories
రోమా

రోమా 1

1 యేసు క్రీస్తుదాసుడును, అపొస్తలుడుగా నుండు టకు పిలువబడినవాడును,౹

2-7 దేవుని సువార్తనిమిత్తము ప్రత్యేకింపబడినవాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికి అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికందరికి (శుభమని చెప్పి) వ్రాయునది. మన తండ్రియైన దేవునినుండియు, ప్రభువైన యేసు క్రీస్తునుండియు, కృపాసమాధానములు మీకు కలుగు గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తలద్వారా ముందు వాగ్దానముచేసెను. యేసుక్రీస్తు, శరీరమునుబట్టి దావీదు సంతానముగాను, మృతులలోనుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూ పింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయనద్వారా మేము కృపను అపొస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తువారుగా ఉండుటకు పిలువబడి యున్నారు.

8 మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడు చుండుటనుబట్టి, మొదట మీ యందరినిమిత్తము యేసు క్రీస్తుద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.౹

9-10 ఇప్పుడేలాగైనను ఆటంకములేకుండ మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తమువలన నాకు వీలుకలుగు నేమో అని, నా ప్రార్థనలయందు ఎల్లప్పుడు ఆయనను బతిమాలుకొనుచు, మిమ్మునుగూర్చి యెడతెగక జ్ఞాపకము చేసికొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి.౹

11 మీరు స్థిరపడవలెనని, అనగా మీకును నాకును కలిగియున్న విశ్వాసముచేత, అనగా మనము ఒకరి విశ్వాసముచేత ఒకరము ఆదరణపొందవలెనని౹

12 ఆత్మసంబంధమైన కృపావరమేదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగుల అపేక్షించుచున్నాను.౹

13 సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడ ఫలమేదైనను పొందవలెనని అనేక పర్యాయములు మీయొద్దకు రానుద్దేశించితిని; గాని యిదివరకు ఆటంకపరచబడితిని; ఇది మీకు తెలియకుండుట నా కిష్టములేదు౹

14 గ్రీసుదేశస్థులకును గ్రీసుదేశస్థులు కాని వారికిని, జ్ఞానులకును మూఢులకును నేను ఋణస్థుడను.౹

15 కాగా నావలననైనంతమట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను.౹

16 సువార్తనుగూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసుదేశస్థునికి కూడ రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది.౹

17 ఎందుకనిన–నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంత కంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడుచున్నది.

18 దుర్నీతిచేత సత్యమును అడ్డగించు మనుష్యులయొక్క సమస్త భక్తిహీనతమీదను, దుర్నీతిమీదను దేవుని కోపము పరలోకమునుండి బయలుపరచబడుచున్నది.౹

19 ఎందు కనగా దేవునిగూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విశదమైయున్నది; దేవుడు అది వారికి విశదపరచెను.౹

20 ఆయన అదృశ్యలక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు.౹

21 మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచ లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనులేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి.౹

22 వారి అవివేకహృదయము అంధ కారమయమాయెను; తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి.౹

23 వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షులయొక్కయు, చతుష్పాద జంతువులయొక్కయు, పురుగులయొక్కయు, ప్రతిమాస్వరూపముగా మార్చిరి.

24 ఈ హేతువుచేత వారు తమ హృదయముల దురాశ లను అనుసరించి, తమ శరీరములను పరస్పరము అవమానపరచుకొనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను.౹

25 అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగములవరకు ఆయన స్తోత్రార్హుడై యున్నాడు, ఆమేన్.

26 అందువలన దేవుడు తుచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సయితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి.౹

27 అటువలె పురుషులు కూడ స్త్రీయొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి, పురుషులతో పురుషులు అవాచ్యమైనదిచేయుచు, తమ తప్పిదమునకు తగిన ప్రతి ఫలమును పొందుచు ఒకరియెడల ఒకరు కామతప్తులైరి.

28 మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారినప్పగించెను.౹

29 అట్టివారు సమస్తమైన దుర్నీతిచేతను, దుష్టత్వముచేతను, లోభముచేతను, ఈర్ష్యచేతను నిండుకొని, మత్సరము నరహత్య కలహము కపటము వైరమనువాటితో నిండినవారై౹

30 కొండెగాండ్రును అపవాదకులును, దేవద్వేషులును, హింసకులును, అహంకారులును, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తలిదండ్రులకవిధేయులును, అవివేకులును౹

31 మాట తప్పువారును అనురాగ రహితులును, నిర్దయులునైరి.౹

32 ఇట్టి కార్యములను అభ్య సించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగ ఎరిగియుండియు, వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ROM/1-4022ed54e536669dafe78dae99d26035.mp3?version_id=1787—

Categories
రోమా

రోమా 2

1 కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీ వెవడవైనను సరే నిరుత్తరుడవై యున్నావు. దేనివిషయములో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్థుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు; ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా?౹

2 అట్టి కార్యములు చేయువారిమీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని యెరుగుదుము.౹

3 అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించు కొందువని అనుకొందువా?౹

4 లేదా, దేవుని అనుగ్రహము మారుమనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని యెరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా?౹

5 నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి, ఉగ్రతదినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలు పరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చు కొనుచున్నావు.౹

6 ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును.౹

7 సత్‌క్రియను ఓపికగాచేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్యజీవము నిచ్చును.౹

8-9 అయితే భేదములు పుట్టించి, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడువారిమీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్క్యార్యముచేయు ప్రతిమనుష్యుని ఆత్మకు, మొదట యూదునికి గ్రీసుదేశస్థునికికూడ, శ్రమయు వేదనయు కలుగును.౹

10 సత్‌క్రియచేయు ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసుదేశస్థునికికూడ, మహిమయు ఘనతయు సమాధానమును కలుగును.౹

11-12 దేవునికి పక్షపాతములేదు. ధర్మశాస్త్రములేక పాపము చేసినవారందరు ధర్మశాస్త్రము లేకయే నశించెదరు; ధర్మశాస్త్రము కలిగినవారై పాపము చేసినవారందరు ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు.౹

13 ధర్మశాస్త్రము వినువారు దేవునిదృష్టికి నీతిమంతులు కారుగాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు.౹

14 ధర్మశాస్త్రములేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్రసంబంధమైన క్రియలను చేసినయెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు.౹

15 అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒక దానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పులేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్రసారము తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుచున్నారు.౹

16 దేవుడు నా సువార్త ప్రకారము యేసు క్రీస్తుద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఈలాగు జరుగును.

17 నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవునియందు అతిశయించుచున్నావు కావా?౹

18 ఆయన చిత్తమెరిగి, ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడవై శ్రేప్ఠమైనవాటిని మెచ్చుకొనుచున్నావు కావా?౹

19 జ్ఞానసత్యస్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవైయుండి –నేను గ్రుడ్డివారికి త్రోవచూపువాడను,౹

20 చీకటిలో ఉండువారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలురకు ఉపాధ్యాయుడనై యున్నానని నీయంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా?౹

21 ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా? దొంగిలవద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా?౹

22 వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా? విగ్రహములను అసహ్యించుకొను నీవు గుళ్లను దోచెదవా?౹

23 ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుటవలన దేవుని అవమానపర చెదవా?౹

24 వ్రాయబడిన ప్రకారము మిమ్మునుబట్టియే గదా దేవుని నామము అన్యజనులమధ్యను దూషింపబడు చున్నది?౹

25 నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వాడవైతివా, సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మశాస్త్రమును అతిక్రమించువాడవైతివా, నీ సున్నతి సున్నతి కాకపోవును.౹

26 కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతివిధులను గైకొనినయెడల అతడు సున్నతి లేనివాడైయుండియు సున్నతిగలవాడుగా ఎంచబడును గదా?౹

27 మరియు స్వభావమునుబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చినయెడల అక్షరమును సున్న తియు గలవాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చడా?౹

28 బాహ్యమునకు యూదుడైనవాడు యూదుడు కాడు; శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతికాదు.౹

29 అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరమువలన కలుగు నది కాదు. అట్టివానికి మెప్పు మనుష్యులవలన కలుగదు దేవునివలననే కలుగును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ROM/2-0910962dd560e07822440e2b6184383d.mp3?version_id=1787—

Categories
రోమా

రోమా 3

1 అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి? సున్నతి వలన ప్రయోజనమేమి?౹

2 ప్రతివిషయమందును అధికమే. మొదటిది, దేవోక్తులు యూదుల పరము చేయబడెను.౹

3 కొందరు అవిశ్వాసులైన నేమి? వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగినవాడు కాక పోవునా?అట్లనరాదు.

4 నీ మాటలలో నీవు నీతిమంతుడవుగా తీర్చబడునట్లును

నీవు వ్యాజ్యెమాడునప్పుడు గెలుచునట్లును

అని వ్రాయబడిన ప్రకారము ప్రతిమనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు.౹

5 మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసినయెడల ఏమందుము? ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్థు డగునా? నేను మనుష్యరీతిగా మాటలాడుచున్నాను;౹

6 అట్లనరాదు. అట్లయినయెడల దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును?౹

7 దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యమువలన దేవుని సత్యము ప్రబలినయెడల నేనికను పాపినైనట్టు తీర్పు పొందనేల?౹

8 మేలు కలుగుటకు కీడుచేయుదమని మేము చెప్పుచున్నామని, కొందరు మమ్మును దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు? అట్టివారికి కలుగు శిక్షావిధి న్యాయమే.

9 ఆలాగైన ఏమందుము? మేము వారికంటె శ్రేష్ఠులమా? తక్కువవారమా? ఎంతమాత్రమును కాము. యూదులేమి గ్రీసుదేశస్థులేమి అందరును పాపమునకు లోనైయున్నారని యింతకుముందు దోషారోపణ చేసియున్నాము.

10 ఇందునుగూర్చి వ్రాయబడినదేమనగా–

11 నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు

గ్రహించువాడెవడును లేడు

దేవుని వెదకువాడెవడును లేడు

12 అందరును త్రోవ తప్పి యేకముగా పనికిమాలినవారైరి.

మేలుచేయువాడు లేడు, ఒక్కడైనను లేడు.

13 వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో

మోసము చేయుదురు;

వారి పెదవుల క్రింద సర్పవిషమున్నది

14 వారి నోటినిండ శపించుటయు పగయు ఉన్నవి.

15 రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తుచున్నవి.

16 నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి.

17 శాంతిమార్గము వారెరుగరు.

18 వారి కన్నుల యెదుట దేవుని భయము లేదు.

19 ప్రతి నోరు మూయబడునట్లును, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును, ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైనవారితో చెప్పు చున్నదని యెరుగుదుము.౹

20 ఏలయనగా ధర్మశాస్త్రసంబంధమైన క్రియలమూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు; ధర్మశాస్త్రమువలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది.౹

21 ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతిబయలుపడుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు.౹

22 అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై, నమ్ము వారందరికి కలుగు దేవుని నీతియైయున్నది.౹

23 ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అను గ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు.౹

24 కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు.౹

25 పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని౹

26 క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచునిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముగలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను.౹

27 కాబట్టి అతిశయకారణ మెక్కడ? అది కొట్టి వేయబడెను. ఎట్టి న్యాయమునుబట్టి అది కొట్టివేయ బడెను? క్రియాన్యాయమునుబట్టియా? కాదు, విశ్వాస న్యాయమునుబట్టియే.౹

28 కాగా ధర్మశాస్త్రసంబంధమైన క్రియలులేకుండ విశ్వాసమువలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని యెంచుచున్నాము.౹

29 దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే.౹

30 దేవుడు ఒకడే గనుక, ఆయన సున్నతి గలవారిని విశ్వాసమూలముగాను, సున్నతి లేనివారిని విశ్వాసముద్వారాను, నీతిమంతులనుగా తీర్చును.౹

31 విశ్వాసముద్వారా ధర్మశాస్త్రమును నిరర్థకము చేయుచున్నామా? అట్లనరాదు; ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ROM/3-647e15b686edb6ed5484b4abe9e84a57.mp3?version_id=1787—

Categories
రోమా

రోమా 4

1 కాబట్టి శరీరము విషయమై మన మూలపురుషుడగు అబ్రాహామునకేమి దొరికెనని అందుము.౹

2 అబ్రాహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడినయెడల అతనికి అతిశయకారణము కలుగును గాని అది దేవుని యెదుట కలుగదు.౹

3 లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రా హాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను౹

4 పని చేయువానికి జీతము ఋణమేగాని దానమని యెంచ బడదు.౹

5 పనిచేయక, భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వానియందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది.౹

6 ఆప్రకారమే క్రియలులేకుండ దేవుడెవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మను ష్యుడు ధన్యుడని దావీదు కూడ చెప్పుచున్నాడు.౹

7 ఏలాగనగా–

తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు

తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు

ధన్యుడు.

8 ప్రభువుచేత నిర్దోషియని ఎంచబడినవాడు ధన్యుడు.౹

9 ఈ ధన్యవచనము సున్నతిగలవారినిగూర్చి చెప్పబడినదా సున్నతిలేనివారినిగూర్చి కూడ చెప్పబడినదా? అబ్రాహాముయొక్క విశ్వాస మతనికి నీతి అని యెంచబడెననుచున్నాము గదా?౹

10 మంచిది; అది ఏ స్థితియందు ఎంచబడెను? సున్నతి కలిగి యుండినప్పుడా సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి యుండినప్పుడు కాదు సున్నతి లేనప్పుడే.౹

11 మరియు సున్నతి లేనివారైనను, నమ్మినవారికందరికి అతడు తండ్రి యగుటవలన వారికి నీతి ఆరోపించుటకై, అతడు సున్నతి పొందకమునుపు, తనకు కలిగిన విశ్వాసమువలననైన నీతికి ముద్రగా, సున్నతి అను గురుతు పొందెను.౹

12 మరియు సున్నతి గలవారికిని తండ్రియగుటకు, అనగా సున్నతిమాత్రము పొందినవారుగాక, మన తండ్రియైన అబ్రాహాము సున్నతి పొందకమునుపు అతనికి కలిగిన విశ్వాసముయొక్క అడుగుజాడలనుబట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు, అతడు ఆ గురుతు పొందెను.౹

13 అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రా హామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రమూలముగా కలుగలేదుగాని విశ్వాసమువలననైన నీతి మూలము గానే కలిగెను.౹

14 ధర్మశాస్త్రసంబంధులు వారసులైనయెడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్థకమగును.౹

15 ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టిం చును; ధర్మశాస్త్రము లేనియెడల అతిక్రమమును లేక పోవును.౹

16 ఈ హేతువుచేతను ఆ వాగ్దానమును యావత్సం తతికి, అనగా ధర్మశాస్త్రముగలవారికి మాత్రముకాక అబ్రాహామునకున్నట్టి విశ్వాసముగలవారికి కూడ దృఢము కావలెనని, కృపననుసరించినదై యుండునట్లు, అది విశ్వాసమూలమైనదాయెను.౹

17 తాను విశ్వసించిన దేవుని యెదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని యెదుట, అతడు మనకందరికి తండ్రియైయున్నాడు– ఇందునుగూర్చి

18 –నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడియున్నది.౹ –నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పినదానినిబట్టి తాననేక జనములకు తండ్రి యగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను.౹

19 మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సుగలవాడైయుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని,౹

20 అవిశ్వాసమువలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక౹

21 దేవుని మహిమపరచి, ఆయన వాగ్దానము చేసినదానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమువలన బలమునొందెను.౹

22 అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను.౹

23 అది అతనికి ఎంచబడెనని అతని నిమిత్తము మాత్రమే కాదుగాని౹

24 మన ప్రభువైన యేసును మృతులలోనుండి లేపినవానియందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడ వ్రాయ బడెను.౹

25 ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింప బడి, మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ROM/4-04e8b58a59b334eb579d422c980b6fa7.mp3?version_id=1787—