Categories
అపొస్తలుల కార్యములు

అపొస్తలుల కార్యములు 13

1 అంతియొకయలోనున్న సంఘములో బర్నబా, నీగెరనబడిన సుమెయోను, కురేనీయుడైన లూకియ చతుర్థాధిపతియైన హేరోదుతోకూడ పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలును బోధకులును ఉండిరి.౹

2 వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ–నేను బర్నబాను సౌలును పిలిచిన పనికొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను.౹

3 అంతట వారు ఉపవాసముండి ప్రార్థనచేసి వారిమీద చేతులుంచి వారిని పంపిరి.

4 కాబట్టి వీరు పరిశుద్ధాత్మచేత పంపబడినవారై సెలూ కయకు వచ్చి అక్కడనుండి ఓడయెక్కి కుప్రకు వెళ్లిరి.౹

5 వారు సలమీలో ఉండగా యూదుల సమాజమందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడై యుండెను.౹

6 వారు ఆ ద్వీపమందంతట సంచరించి పాఫు అను ఊరికి వచ్చి నప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తయునైన బర్ యేసు అను ఒక యూదుని చూచిరి.౹

7 ఇతడు వివేకముగలవాడైన సెర్గి పౌలు అను అధిపతియొద్దనుండెను; అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను.౹

8 అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసమునుండి తొలగింపవలెనని యత్నముచేసి వారిని ఎదిరించెను; ఎలుమ అను పేరునకు గారడీవాడని అర్థము.౹

9 అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై౹

10 అతని తేరిచూచి–సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాదికుమారుడా, సమస్త నీతికి విరోధీ, నీవు ప్రభువుయొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా?౹

11 ఇదిగో ప్రభువు తనచెయ్యి నీమీద ఎత్తియున్నాడు; నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైన చెయ్యిపట్టుకొని నడిపింతురా అని వెదకుచుండెను.౹

12 అంతట ఆ అధిపతి జరిగినదానిని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వ సించెను.

13 తరువాత పౌలును అతనితోకూడ ఉన్నవారును ఓడ యెక్కి పాఫునుండి బయలుదేరి పంఫూలియాలోనున్న పెర్గేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్లెను.౹

14 అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియలోనున్న అంతియొకయకు వచ్చి విశ్రాంతిదినమందు సమాజమందిరములోనికి వెళ్లి కూర్చుండిరి.౹

15 ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తరువాత సమాజమందిరపు అధికారులు–సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైన బోధవాక్యము చెప్పవలెనని యున్నయెడల చెప్పుడని వారికి వర్తమానము చేసిరి.౹

16 అప్పుడు పౌలు నిలువబడి చేసైగ చేసి ఇట్లనెను–

17 ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడువారలారా, వినుడి. ఇశ్రాయేలను ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని, వారు ఐగుప్తు దేశమందు పరదేశులై యున్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి, తన భుజబలముచేత వారినక్కడనుండి తీసికొనివచ్చి౹

18 యించుమించు నలువది ఏండ్లమట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించెను.౹

19 మరియు కనాను దేశములో ఏడు జాతుల వారిని నాశనముచేసి వారి దేశములను వీరికి స్వాస్థ్యముగా పంచి యిచ్చెను.౹

20 ఇంచుమించు నాలుగువందల ఏబది సంవత్సరములు ఇట్లు జరిగెను. అటుతరువాత ప్రవక్తయైన సమూయేలువరకు ఆయన వారికి న్యాయాధిపతులను దయ చేసెను.౹

21 ఆ తరువాత వారు రాజు కావలెనని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీయుడును కీషు కుమారుడునైన సౌలును వారికి నలువది ఏండ్లవరకు దయచేసెను.౹

22 తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన–నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని; అతడు నా యిష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నియు నెరవేర్చునని చెప్పి అతనినిగూర్చి సాక్ష్యమిచ్చెను.

23 అతని సంతానమునుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలుకొరకు రక్షకుడగు యేసును పుట్టించెను.౹

24 ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలకందరికి మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించెను.౹

25 యోహాను తన పనిని నెరవేర్చుచుండగా –నేనెవడనని మీరు తలంచుచున్నారు? నేను ఆయనను కాను; ఇదిగో నా వెనుక ఒకడు వచ్చుచున్నాడు, ఆయన కాళ్ల చెప్పులు విప్పుటకైనను నేను పాత్రుడను కానని చెప్పెను.

26 సహోదరులారా, అబ్రాహాము వంశస్థులారా, దేవునికి భయపడువారలారా, యీ రక్షణ వాక్యము మనయొద్దకు పంపబడియున్నది.౹

27 యెరూషలేములో కాపురముండు వారును, వారి అధికారులును, ఆయననైనను, ప్రతి విశ్రాంతిదినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక, ఆయనకు శిక్షవిధించుటచేత ఆ వచనములను నెరవేర్చిరి.౹

28 ఆయనయందు మరణమునకు తగిన హేతువేదియు కనబడక పోయినను ఆయనను చంపించవలెనని వారు పిలాతును వేడుకొనిరి.౹

29 వారు ఆయననుగూర్చి వ్రాయబడినవన్నియు నెరవేర్చిన తరువాత ఆయనను మ్రానుమీదనుండి దింపి సమాధిలో పెట్టిరి.౹

30 అయితే దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెను.౹

31 ఆయన గలిలయనుండి యెరూషలేమునకు తనతోకూడ వచ్చిన వారికి అనేకదినములు కనబడెను; వారిప్పుడు ప్రజల యెదుట ఆయనకు సాక్షులై యున్నారు.౹

32-33 దేవుడు యేసును లేపి, పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చియున్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆలాగే

–నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కంటిని అని రెండవ కీర్తనయందు వ్రాయబడియున్నది.౹

34 మరియు ఇక కుళ్లుపట్టకుండ ఆయనను మృతులలోనుండి లేపుటనుబట్టి–దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకనుగ్రహింతును, అవి నమ్మకములైనవని చెప్పెను.౹

35 కాబట్టి వేరొక కీర్తనయందు–నీ పరిశుద్ధుని కుళ్లుపట్ట నియ్యవని చెప్పుచున్నాడు.౹

36-37 దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరమువారికి సేవచేసి నిద్రించి, తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్లిపోయెను గాని దేవుడు లేపినవాడు కుళ్లుపట్టలేదు.౹

38 కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు,౹

39 మీరు మోషే ధర్మశాస్త్రమువలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేక పోతిరో ఆ విషయములన్నిటిలో, విశ్వసించు ప్రతివాడును ఈయనవలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియుగాక.౹

40 ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీమీదికి రాకుండ చూచుకొనుడి; అదేమనగా–

41 ఇదిగో తిరస్కరించువారలారా, ఆశ్చర్యపడుడి

నశించుడి

మీ దినములలో నేనొక కార్యము చేసెదను

ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత

మాత్రమును నమ్మరు అనెను.

42 వారు సమాజమందిరములోనుండి వెళ్లుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతిదినమున తమతో చెప్పవలెనని జనులు వేడుకొనిరి.౹

43 సమాజమందిరములోనివారు లేచిన తరువాత అనేకులు యూదులును, భక్తిపరులైన యూదమత ప్రవిష్టులును, పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాటలాడుచు, దేవుని కృపయందు నిలుకడగా నుండవలెనని వారిని హెచ్చరించిరి.

44 మరుసటి విశ్రాంతిదినమున దాదాపుగా ఆ పట్టణ మంతయు దేవుని వాక్యము వినుటకు కూడివచ్చెను.౹

45 యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు, పౌలు చెప్పినవాటికి అడ్డము చెప్పిరి.౹

46 అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి–దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే; అయినను మీరు దానిని త్రోసివేసి, మిమ్మును మీరే నిత్యజీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు, గనుక ఇదిగో మేము అన్యజనులయొద్దకు వెళ్లుచున్నాము;౹

47 ఏలయనగా

–నీవు భూదిగంతములవరకు రక్షణార్థముగా ఉండునట్లు

నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను అని ప్రభువు మాకాజ్ఞాపించెననిరి.౹

48 అన్యజనులు ఆ మాటవిని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి; మరియు నిత్యజీవమునకు నిర్ణయింపబడిన వారందరు విశ్వసించిరి.౹

49-50 ప్రభువు వాక్యము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను గాని యూదులు భక్తి మర్యాదలుగల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకును హింస కలుగజేసి, వారిని తమ ప్రాంతములనుండి వెళ్లగొట్టిరి.౹

51 వీరు తమ పాదధూళిని వారితట్టు దులిపివేసి ఈకొనియకు వచ్చిరి.౹

52 అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండినవారైరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ACT/13-53fae8666c6cf064461b529e229659cd.mp3?version_id=1787—

Categories
అపొస్తలుల కార్యములు

అపొస్తలుల కార్యములు 14

1 ఈకొనియలో జరిగినదేమనగా, వారు కూడి . యూదుల సమాజమందిరములో ప్రవేశించి, తేటగా బోధించినందున అనేకులు, యూదులును గ్రీసు దేశస్థు లును విశ్వసించిరి.౹

2 అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొలిపి వారి మనస్సులలో సహోదరులమీద పగ పుట్టించిరి.౹

3 కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాటలాడుచు అక్కడ బహుకాలము గడపిరి. ప్రభువు వారిచేత సూచకక్రియలను అద్భుతములను చేయించి, తన కృపావాక్యమునకు సాక్ష్యమిప్పించు చుండెను.౹

4 పట్టణపు జనసమూహములో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపొ స్తలుల పక్షముగాను ఉండిరి.౹

5 మరియు అన్యజనులును యూదులును తమ అధికారులతో కలిసి వారిమీదపడి వారిని అవమానపరచి రాళ్లు రువ్వి చంపవలెనని యుండిరి.౹

6 వారాసంగతి తెలిసికొని లుకయొనియలోని పట్టణములగు లుస్త్రకును దెర్బేకును చుట్టుపెట్లనున్న ప్రదేశమునకును పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి.

7-8 లుస్త్రలో బలహీన పాదములుగల యొకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై యెన్నడును నడువలేక కూర్చుండియుండువాడు.౹

9 అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతనివైపు తేరి చూచి, స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి౹

10 – నీ పాదములు మోపి సరిగా నిలువుమని, బిగ్గరగా చెప్పి నప్పుడు అతడు గంతులువేసి నడువ సాగెను.౹

11-12 జనసమూహములు పౌలు చేసినదాని చూచి, లుకయోనియ భాషలో –దేవతలు మనుష్యరూపము తాల్చి మనయొద్దకు దిగి వచ్చియున్నారని కేకలువేసి, బర్నబాకు ద్యుపతిఅనియు, పౌలు ముఖ్యప్రసంగియైనందున అతనికి హెర్మే అనియు పేరుపెట్టిరి.౹

13 పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతియొక్క పూజారి యెడ్లను పూదండలను ద్వారములయొద్దకు తీసికొనివచ్చి సమూహముతో కలిసి, బలి అర్పింపవలెనని యుండెను.౹

14 అపొస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని, తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి౹

15 –అయ్యలారా, మీరెందుకీలాగు చేయుచున్నారు? మేము కూడ మీ స్వభావమువంటి స్వభావముగల నరులమే. మీరు ఈ వ్యర్థమైనవాటిని విడిచి పెట్టి, ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోఉండు సమస్తమును సృజించిన జీవముగల దేవునివైపు తిరుగ వలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము.౹

16 ఆయన గతకాలములలో సమస్త జనులను తమతమ మార్గములయందు నడువనిచ్చెను.౹

17 అయినను ఆయన ఆకాశమునుండి మీకు వర్షమును, ఫలవంతములైన రుతువులను దయచేయుచు, ఆహారము ననుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలుచేయుటచేత తన్నుగూర్చి సాక్ష్యములేకుండ చేయలేదని బిగ్గరగా చెప్పిరి.౹

18 వారీలాగు చెప్పి తమకు బలి అర్పింపకుండ సమూహములను ఆపుట బహు ప్రయాసమాయెను.

19 అంతియొకయ నుండియు ఈకొనియ నుండియు యూదులు వచ్చి, జనసమూహములను తమ పక్షముగా చేసికొని, పౌలుమీద రాళ్లు రువ్వి అతడు చనిపోయెనని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి.౹

20 అయితే శిష్యులు అతనిచుట్టు నిలిచియుండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి, మరునాడు బర్నబాతోకూడ దెర్బేకు బయలుదేరి పోయెను.౹

21 వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తరువాత లుస్త్రకును ఈకొనియకును అంతియొకయకును తిరిగివచ్చి౹

22 శిష్యుల మనస్సులను దృఢపరచి–విశ్వాసమందు నిలుకడగా ఉండ వలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి.౹

23 మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి, ఉపవాసముండి, ప్రార్థనచేసి, వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి.౹

24 తరువాత పిసిదియ దేశమంతట సంచరించి పంఫూలియకు వచ్చిరి.౹

25 మరియు పెర్గేలో వాక్యము బోధించి, అత్తాలియకు దిగి వెళ్లిరి.౹

26 అక్కడనుండి ఓడ యెక్కి, తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడినవారై, మొదట బయలుదేరిన అంతియొ కయకు తిరిగి వచ్చిరి.౹

27 వారు వచ్చి, సంఘమును సమకూర్చి, దేవుడు తమకు తోడైయుండి చేసిన కార్యములన్నియు, అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరచిన సంగతియు, వివరించిరి.౹

28 పిమ్మట వారు శిష్యులయొద్ద బహుకాలము గడపిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ACT/14-4027e837466c94d1754fd6bd5db9313e.mp3?version_id=1787—

Categories
అపొస్తలుల కార్యములు

అపొస్తలుల కార్యములు 15

1 కొందరు యూదయనుండి వచ్చి–మీరు మోషే . నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి.౹

2 పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు, ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరి కొందరును యెరూషలేమునకు అపొస్తలులయొద్దకును పెద్దలయొద్దకును వెళ్లవలెనని సహోదరులు నిశ్చయించిరి.౹

3 కాబట్టి వారు సంఘమువలన సాగనంపబడి, ఫేనీకే సమరయ దేశములద్వారా వెళ్లుచు, అన్యజనులు దేవునివైపు తిరిగిన సంగతి తెలియపరచి సహోదరులకందరికిని మహా సంతోషము కలుగజేసిరి.౹

4 వారు యెరూషలేమునకు రాగా, సంఘపువారును అపొస్తలులును పెద్దలును వారిని చేర్చుకొనిరి; దేవుడు తమకు తోడై యుండి చేసినవన్నియు వారు వివరించిరి.౹

5 పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరులేచి, అన్యజనులకు సున్నతి చేయింపవలెననియు, మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలెననియు చెప్పిరి.

6 అప్పుడు అపొస్తలులును పెద్దలును ఈ సంగతినిగూర్చి ఆలోచించుటకు కూడివచ్చిరి. బహు తర్కము జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇట్లనెను–

7 సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడేర్పరచుకొనెనని మీకు తెలియును.౹

8 మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి, వారినిగూర్చి సాక్ష్య మిచ్చెను.౹

9 వారి హృదయములను విశ్వాసమువలన పవిత్రపరచి మనకును వారికిని ఏ భేదమైనను కనుపరచలేదు౹

10 గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడమీద పెట్టి మీ రెందుకు దేవుని శోధించుచున్నారు?౹

11 ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము గదా? అలాగే వారును రక్షణ పొందుదురు అనెను.

12 అంతట ఆ సమూహమంతయు ఊరకుండి, బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసిన సూచకక్రియలను అద్భుతములను వివరించగా ఆలకించెను.౹

13 వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లనెను–సహోదరులారా, నా మాట ఆలకించుడి.౹

14 అన్యజనులలోనుండి దేవుడు తన నామముకొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఏలాగు మొదట కటాక్షించెనో సుమెయోను వివరించియున్నాడు.౹

15 ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడియున్నవి; ఎట్లనగా–

16 ఆ తరువాత నేను తిరిగి వచ్చెదను;

మనుష్యులలో కడమవారును

నా నామము ఎవరికి పెట్టబడెనో

ఆ సమస్తమైన అన్యజనులునుప్రభువును వెదకునట్లు

17 పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను

దాని పాడైనవాటిని తిరిగి కట్టి దానిని నిలువబెట్టెద

నని అనాదికాలమునుండి ఈ సంగతులను తెలియ

18 పరచినప్రభువుసెలవిచ్చుచున్నాడు

అని వ్రాయబడియున్నది.౹

19 కాబట్టి అన్యజనులలోనుండి దేవునివైపు తిరుగుచున్నవారిని మనము కష్టపట్టక౹

20 విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతుపిసికి చంపినదానిని, రక్తమును, విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము.౹

21 ఏలయనగా, సమాజమందిరములలో ప్రతి విశ్రాంతిదినమున మోషే లేఖనములు చదువుటవలనమునుపటి తరములనుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పెను.

22 అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారుపేరుగల యూదాను సీలను తమలో ఏర్పరచుకొని, పౌలుతోను బర్నబాతోను అంతియొకయకు పంపుట యుక్తమని అపొస్తలులకును పెద్దలకును సంఘమంతటికిని తోచెను.౹

23 వీరు వ్రాసి, వారిచేత పంపిన దేమనగా–అపొస్తలులును పెద్దలైన సహోదరులును అంతియొకయలోను, సిరియలోను, కిలికియలోను నివసించుచు అన్యజనులుగానుండిన సహోదరులకు శుభము.౹

24 కొందరు మాయొద్దనుండి వెళ్లి, తమ బోధచేత మిమ్మును కలవరపరచి, మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మే మధికారమిచ్చి యుండలేదు౹

25-26 గనుక మనుష్యులను ఏర్పరచి, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరుకొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా పౌలు అను మన ప్రియులతోకూడ మీయొద్దకు పంపుట యుక్తమని మాకంద రికి ఏకాభిప్రాయము కలిగెను.౹

27 కాగా యూదాను సీలను పంపి యున్నాము; వారును నోటిమాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు.౹

28-29 విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటె ఎక్కువైన యే భారమును మీ మీద మోపకూడదని, పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్తపడితిరా అది మీకు మేలు. మీకు క్షేమము కలుగును గాక.

30 అంతట వారు సెలవుపుచ్చుకొని అంతియొకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి.౹

31 వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి.౹

32 మరియు యూదాయు సీలయు కూడ ప్రవక్తలై యుండి నందున పెక్కుమాటలతో సహోదరుల నాదరించి స్థిరపరచిరి.౹

33-34 వారు అక్కడ కొంతకాలము గడపి, సహోదరులయొద్దనుండి తమ్మును పంపిన వారియొద్దకు వెళ్లుటకు సమాధానముతో సెలవు పుచ్చుకొనిరి.౹

35 అయితే పౌలును బర్నబాయు అంతియొకయలో నిలిచి, యింక అనేకులతోకూడ ప్రభువు వాక్యము బోధించుచు ప్రకటించుచు నుండిరి.

36 కొన్ని దినములైన తరువాత–ఏ యే పట్టణములలో ప్రభువు వాక్యము ప్రచురపరచితిమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరులయొద్దకు తిరిగి వెళ్లి, వారేలాగున్నారో మనము చూతమని పౌలు బర్నబాతో అనెను.౹

37 అప్పుడు మార్కు అనుమారు పేరుగల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా యిష్టపడెను.౹

38 అయితే పౌలు, పంఫూలియలో పనికొరకు తమతోకూడ రాక తమ్మును విడిచిన వానిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను.౹

39 వారిలో తీవ్రమైన వాదము కలిగినందునవారు ఒకనిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్లెను;౹

40-41 పౌలు సీలను ఏర్పరచుకొని, సహోదరులచేత ప్రభువు కృపకు అప్పగింపబడినవాడై బయలుదేరి, సంఘములను స్థిరపరచుచు సిరియ కిలికియ దేశముల ద్వారా సంచారము చేయుచుండెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ACT/15-5d3a09f6cb42067091978c52324760c3.mp3?version_id=1787—

Categories
అపొస్తలుల కార్యములు

అపొస్తలుల కార్యములు 16

1 పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ . తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన యొక యూదురాలి కుమారుడు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు.౹

2 అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరులవలన మంచిపేరు పొందినవాడు.౹

3 అతడు తనతోకూడ బయలుదేరి రావలెనని పౌలుకోరి, అతని తండ్రి గ్రీసుదేశస్థుడని ఆ ప్రదేశములోని యూదులకందరికి తెలియును గనుక వారినిబట్టి అతని తీసికొని సున్నతి చేయించెను.౹

4 వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్లుచు, యెరూషలేములోనున్న అపొస్తలులును పెద్దలును నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి.౹

5 గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి, అనుదినము లెక్కకు విస్తరించుచుండెను.

6 ఆసియలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటంకపరచినందున, వారు ఫ్రుగియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్లిరి. ముసియ దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్లుటకు ప్రయత్నము చేసిరి గాని౹

7-8 యేసుయొక్క ఆత్మ వారిని వెళ్లనియ్యలేదు. అంతటవారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి.౹

9 అప్పుడు మాసిదోనియ దేశస్థుడొకడు నిలిచి–నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయము చేయుమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను.౹

10 అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచియున్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియకు బయలుదేరుటకు యత్నము చేసితిమి.

11 కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సమొత్రాకేకును, మరునాడు నెయపొలికిని, అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి.౹

12 మాసిదోనియ దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్యపట్టణమును రోమీయుల ప్రవాసస్థానమునై యున్నది. మేము కొన్నిదినములు ఆ పట్టణములో ఉంటిమి.౹

13 విశ్రాంతిదినమున గవిని దాటి నదీతీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి, కూడివచ్చిన స్త్రీలతో మాటలాడు చుంటిమి.౹

14 అప్పుడు లూదియయను దైవభక్తిగల యొక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగుపొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను.౹

15 ఆమెయు ఆమె యింటివారును బాప్తిస్మము పొందినప్పుడు, ఆమె–నేను ప్రభువునందు విశ్వాసము గలదాననని మీరు యెంచితే, నా యింటికి వచ్చియుండు డని వేడుకొని మమ్మును బలవంతము చేసెను.

16 మేము ప్రార్థనాస్థలమునకు వెళ్లుచుండగా (పుతోను అను) దయ్యముపెట్టినదై, సోదె చెప్పుటచేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న యొక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను.౹

17 ఆమె పౌలును మమ్మును వెంబడించి–ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు; వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై యున్నారని కేకలువేసి చెప్పెను.౹

18 ఆమె ఈలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి–నీవు ఈమెను వదలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను; వెంటనే అది ఆమెను వదలిపోయెను.

19 ఆమె యజమానులు తమ లాభసాధనము పోయెనని చూచి, పౌలును సీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారులయొద్దకు ఈడ్చుకొనిపోయిరి.౹

20 అంతట న్యాయాధిపతులయొద్దకు వారిని తీసికొనివచ్చి–ఈ మనుష్యులు యూదులై యుండి౹

21 రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు, మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి.౹

22 అప్పుడు జనసమూహము వారిమీదికి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులును వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి.౹

23 వారు చాల దెబ్బలు కొట్టి వారిని చెరసాలలోవేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకుని కాజ్ఞాపించిరి.౹

24 అతడు అట్టి ఆజ్ఞనుపొంది, వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి, వారి కాళ్లకు బొండవేసి బిగించెను.౹

25 అయితే మధ్యరాత్రివేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి; ఖయిదీలు వినుచుండిరి.౹

26 అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నియు తెరచుకొనెను, అందరి బంధకములు ఊడెను.౹

27 అంతలో చెరసాల నాయకుడు మేలుకొని, చెరసాల తలుపులన్నియు తెరచియుండుట చూచి, ఖయిదీలు పారిపోయిరనుకొని, కత్తిదూసి, తన్ను తాను చంపుకొనబోయెను.౹

28 అప్పుడు పౌలు–నీవు ఏ హానియు చేసికొనవద్దు, మేమందరము ఇక్కడనే యున్నామని బిగ్గరగా చెప్పెను.౹

29 అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి, వణకుచు పౌలుకును సీలకును సాగిలపడి౹

30 వారిని వెలుపలికి తీసికొనివచ్చి–అయ్యలారా, రక్షణపొందుటకు నేనేమి చేయవలెననెను.౹

31 అందుకు వారు– ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురని చెప్పి౹

32 అతనికిని అతని ఇంటనున్న వారికందరికిని దేవుని వాక్యము బోధించిరి.౹

33 రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసికొనివచ్చి, వారి గాయములు కడిగెను; వెంటనే అతడును అతని ఇంటివారందరును బాప్తిస్మము పొందిరి.౹

34 మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనముపెట్టి, దేవునియందు విశ్వాసముంచినవాడై తన ఇంటివారందరితోకూడ ఆనందించెను.

35 ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు–ఆ మనుష్యులను విడుదలచేయుమని చెప్పుటకు బంటులను పంపిరి.౹

36 చెరసాల నాయకుడీమాటలు పౌలునకు తెలిపి–మిమ్మును విడుదలచేయుమని న్యాయాధిపతులు వర్తమానము పంపి యున్నారు గనుక మీరిప్పుడు బయలుదేరి సుఖముగా పొండని చెప్పెను.౹

37 అయితే పౌలు–వారు న్యాయము విచారింపకయే రోమీయులమైన మమ్మును బహిరంగముగా కొట్టించి చెరసాలలోవేయించి, యిప్పుడు మమ్మును రహస్యముగా వెళ్లగొట్టుదురా? మేము ఒప్పము; వారే వచ్చి మమ్మును వెలుపలికి తీసికొని పోవలెనని చెప్పెను.౹

38 ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలపగా, వీరు రోమీయులని వారు విని భయపడి వచ్చి,౹

39 వారిని బతిమాలుకొని వెలుపలికి తీసికొనిపోయి – పట్టణము విడిచిపొండని వారిని వేడుకొనిరి.౹

40 వారు చెరసాలలోనుండి వెలుపలికి వచ్చి లూదియ యింటికి వెళ్లిరి; అక్కడి సహోదరులను చూచి, ఆదరించి బయలుదేరి పోయిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ACT/16-078924a311c0cda3492e1d10327493f9.mp3?version_id=1787—

Categories
అపొస్తలుల కార్యములు

అపొస్తలుల కార్యములు 17

1 వారు అంఫిపొలి, అపొల్లోనియ పట్టణములమీదుగా . వెళ్లి థెస్సలొనీకకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజమందిరమొకటి యుండెను౹

2-3 గనుక పౌలు తనవాడుక చొప్పున సమాజపు వారియొద్దకు వెళ్లి–క్రీస్తు శ్రమపడి మృతులలోనుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురముచేయు యేసే క్రీస్తయియున్నాడనియు లేఖనములలోనుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు, వారితో మూడువిశ్రాంతిదినములుతర్కించుచుండెను.౹

4 వారిలో కొందరును, భక్తిపరులగు గ్రీసుదేశస్థులలో చాలమందియు, ఘనతగలస్త్రీలలో అనేకులును ఒప్పుకొని పౌలుతోను సీలతోను కలిసికొనిరి.౹

5 అయితే యూదులు మత్సరపడి, పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపుకూర్చి పట్టణమెల్ల అల్లరిచేయుచు, యాసోను ఇంటిమీదపడి వారిని జనుల సభయెదుటికి తీసికొని వచ్చుటకు యత్నముచేసిరి.౹

6 అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారులయొద్దకు ఈడ్చుకొనిపోయి – భూలోకమును తలక్రిందుచేసిన వీరు ఇక్కడికి కూడ వచ్చియున్నారు; యాసోను వీరిని చేర్చుకొనియున్నాడు.౹

7 వీరందరు యేసు అను వేరొక రాజున్నాడని చెప్పి, కైసరు చట్టములకు విరోధముగా నడుచుకొనువారు అని కేకలువేసిరి.౹

8 ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరచిరి.౹

9 వారు యాసోనునొద్దను మిగిలినవారియొద్దను జామీను తీసికొని వారిని విడుదల చేసిరి.

10 వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజమందిరములో ప్రవేశించిరి.౹

11 వీరు థెస్సలొనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి.౹

12 అందుచేత వారిలో అనేకులును, ఘనతగల గ్రీసుదేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలమందియు విశ్వసించిరి.౹

13 అయితే బెరయలో కూడ పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని థెస్సలొనీకలో ఉండు యూదులు తెలిసికొని అక్కడికిని వచ్చి జనసమూహములను రేపి కలవరపరచిరి.౹

14 వెంటనే సహోదరులు పౌలును సముద్రమువరకు వెళ్లుమని పంపిరి; అయితే సీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి.౹

15 పౌలును సాగనంప వెళ్లినవారు అతనిని ఏథెన్సు పట్టణమువరకు తోడుకొని వచ్చి, సీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతనియొద్దకు రావలెనని ఆజ్ఞపొంది బయలుదేరి పోయిరి.

16 పౌలు ఏథెన్సులో వారికొరకు కనిపెట్టుకొని యుండగా, ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచి నందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను.౹

17 కాబట్టి సమాజమందిరములలో యూదులతోను, భక్తిపరులైన వారితోను ప్రతిదినమున సంతవీధిలో తన్ను కలిసికొను వారితోను తర్కించుచు వచ్చెను.౹

18 ఎపికూరీయులలోనుస్తోయికులలోను ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు–ఈ వదరుబోతు చెప్పునది ఏమిటని చెప్పుకొనిరి. అతడు యేసునుగూర్చియు పునరుత్థానమునుగూర్చియు ప్రకటించెను గనుక మరికొందరు–వీడు అన్యదేవతలనుప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి.౹

19 అంతట వారు అతని వెంటబెట్టుకొని అరేయొపగు అను సభ యొద్దకు తీసికొనిపోయి–నీవు చేయుచున్న యీ నూతన బోధ యెట్టిదో మేము తెలిసికొనవచ్చునా?౹

20 కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మేము తెలిసికొన గోరు చున్నామని చెప్పిరి.౹

21 ఏథెన్సువారందరును అక్కడ నివసించు పరదేశులును ఏదోయొక క్రొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపు చుండువారు.౹

22 పౌలు అరేయొపగు మధ్య నిలిచిచెప్పిన దేమనగా

–ఏథెన్సువారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తిగలవారై యున్నట్టు నాకు కనబడు చున్నది.౹

23 నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద–తెలియబడని దేవునికి అని వ్రాయబడియున్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తికలిగియున్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను.౹

24 జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు.౹

25 ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువ యున్నట్టు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు.౹

26-27 మరియు యావద్భూమిమీద కాపురముండుటకు ఆయన యొకనినుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో యని, తన్ను వెదకునిమిత్తము నిర్ణయకాలమును వారి నివాసస్థలముయొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు.౹

28 మనమాయనయందు బ్రదుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగియున్నాము. అటువలె–మన మాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు.౹

29 కాబట్టి మనము దేవుని సంతానమై యుండి, మనుష్యుల చమత్కార కల్పనలవలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి యున్నదని తలంపకూడదు.౹

30 ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు.౹

31 ఎందుకనగా తాను నియమించిన మనుష్యునిచేత నీతి ననుసరించి భూలోకమునకు తీర్పుతీర్చ బోయెడి యొక దినమును నిర్ణయించియున్నాడు. మృతులలోనుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారము కలుగజేసియున్నాడు.

32 మృతుల పునరుత్థానమునుగూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యముచేసిరి; మరికొందరు–దీనిగూర్చి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి.౹

33 ఆలాగుండగా పౌలు వారి మధ్యనుండి వెళ్లిపోయెను.౹

34 అయితే కొందరు మనుష్యులు అతని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరేయొపగీతుడైన దియొనూసియు, దమరి అను ఒక స్త్రీయు, వీరితోకూడ మరికొందరునుండిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ACT/17-f84d61b4494719c2e1eef78c0099a70d.mp3?version_id=1787—

Categories
అపొస్తలుల కార్యములు

అపొస్తలుల కార్యములు 18

1 అటుతరువాత పౌలు ఏథెన్సునుండి బయలుదేరి కొరింథునకు వచ్చి, పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని, అతని భార్యయైన ప్రిస్కిల్లను కనుగొని వారియొద్దకు వెళ్లెను.౹

2 యూదులందరు రోమా విడిచి వెళ్లిపోవలెనని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున, వారు ఇటలీనుండి క్రొత్తగా వచ్చినవారు.౹

3 వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తిగలవాడు గనుక వారితో కాపురముండెను; వారు కలిసి పనిచేయుచుండిరి.౹

4 అతడు ప్రతి విశ్రాంతిదినమున సమాజమందిరములో తర్కించుచు, యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు నుండెను.

5 సీలయు తిమోతియు మాసిదోనియనుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురతగలవాడై, యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చు చుండెను.౹

6 వారు ఎదురాడి దూషించినప్పుడు, అతడు తన వస్త్రములు దులుపుకొని–మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు.నేను నిర్దోషిని; యికమీదట అన్యజనులయొద్దకు పోవుదునని వారితో చెప్పి౹

7 అక్కడనుండి వెళ్లి, దేవునియందు భక్తిగల తీతియు యూస్తు అను ఒకని యింటికి వచ్చెను. అతని యిల్లు సమాజమందిరమును ఆనుకొనియుండెను.౹

8 ఆ సమాజమందిరపు అధికారియైన క్రిస్పు తన యింటివారందరితోకూడ ప్రభువునందు విశ్వాసముంచెను. మరియు కొరింథీయులలో అనేకులువిని విశ్వ సించి బాప్తిస్మము పొందిరి.౹

9 రాత్రివేళ దర్శనమందు ప్రభువు–నీవు భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకుము.౹

10 నేను నీకు తోడైయున్నాను, నీకు హాని చేయుటకు నీమీదికి ఎవడును రాడు; ఈ పట్టణములో నాకు బహుజనమున్నదని పౌలుతో చెప్పగా౹

11 అతడు వారిమధ్య దేవుని వాక్యము బోధించుచు, ఒక సంవత్సరము మీద ఆరునెలలు అక్కడ నివసించెను.

12 గల్లియోను అకయకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలుమీదికి లేచి న్యాయపీఠము ఎదుటకు అతని తీసికొనివచ్చి౹

13 –వీడు ధర్మశాస్త్రమునకు వ్యతిరిక్తముగా దేవుని ఆరాధించుటకు జనులను ప్రేరేపించుచున్నాడని చెప్పిరి.౹

14 పౌలు నోరు తెరచి మాటలాడబోగా గల్లియోను – యూదులారా, యిదియొక అన్యాయము గాని చెడ్డ నేరము గాని యైనయెడల నేను మీమాట సహనముగా వినుట న్యాయమే.౹

15 ఇది యేదో యొక ఉపదేశమును, పేళ్లను, మీ ధర్మశాస్త్రమునుగూర్చిన వాదమైతే మీరే దాని చూచుకొనుడి; ఈలాటి సంగతులనుగూర్చి విమర్శచేయుటకు నాకు మనస్సులేదని యూదులతో చెప్పి౹

16 వారిని న్యాయపీఠము ఎదుటనుండి తోలివేసెను.౹

17 అప్పుడందరు సమాజమందిరపు అధికారియైన సోస్తెనేసును పట్టుకొని న్యాయపీఠము ఎదుట కొట్ట సాగిరి. అయితే గల్లియోను వీటిలో ఏ సంగతినిగూర్చియు లక్ష్యపెట్టలేదు.

18 పౌలు ఇంకను బహుదినములక్కడ ఉండిన తరువాత సహోదరులయొద్ద సెలవు పుచ్చుకొని, తనకు మ్రొక్కుబడి యున్నందున కెంక్రేయలో తల వెండ్రుకలు కత్తిరించుకొని ఓడ యెక్కి సిరియకు బయలుదేరెను. ప్రిస్కిల్ల అకుల అనువారు అతనితోకూడ వెళ్లిరి.౹

19 వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారినక్కడ విడిచిపెట్టి, తాను మాత్రము సమాజమందిరములో ప్రవేశించి, యూదులతో తర్కించుచుండెను.౹

20 వారింకను కొంతకాలముండుమని అతని వేడుకొనగా౹

21 అతడు ఒప్పక–దేవుని చిత్తమైతే మీయొద్దకు తిరిగి వత్తునని చెప్పి, వారియొద్ద సెలవు పుచ్చుకొని, ఓడ యెక్కి ఎఫెసునుండి బయలుదేరెను.౹

22 తరువాత కైసరయ రేవున దిగి యెరూషలేమునకు వెళ్లి సంఘపువారిని కుశలమడిగి, అంతియొకయకు వచ్చెను.౹

23 అక్కడ కొంతకాలముండిన తరువాత బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతమందును ఫ్రుగియయందును సంచరించుచు శిష్యులనందరిని స్థిరపరచెను.

24 అలెక్సంద్రియవాడైన అపొల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములయందు ప్రవీణుడునై యుండెను.౹

25 అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి, యోహాను బాప్తిస్మముమాత్రమే తెలిసికొనిన వాడైనను, యేసునుగూర్చిన సంగతులు వివరముగా చెప్పి, బోధించుచు, సమాజమందిరములో ధైర్యముగా మాటలాడ నారంభించెను.౹

26 ప్రిస్కిల్ల అకులయు విని, అతని చేర్చుకొని దేవునిమార్గము మరి పూర్తిగా అతనికి విశదపరచిరి.౹

27 తరువాత అతడు అకయకు పోదలచినప్పుడు అతనిని చేర్చుకొనవలెనని సహోదరులు ప్రోత్సాహ పరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. అతడక్కడికి వచ్చి కృపచేత విశ్వసించినవారికి చాల సహాయము చేసెను.౹

28 యేసే క్రీస్తు అని లేఖనములద్వారా అతడు దృష్టాంతపరచి, యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు వచ్చెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ACT/18-7164070d871071975dbb7a5573e1953c.mp3?version_id=1787—

Categories
అపొస్తలుల కార్యములు

అపొస్తలుల కార్యములు 19

1 అపొల్లో కొరింథులో నున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పైప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి–మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా? అని వారి నడుగగా౹

2 వారు–పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి.౹

3 అప్పుడతడు–ఆలాగైతే మీరు దేనినిబట్టి బాప్తిస్మము పొందితిరని అడుగగా వారు–యోహాను బాప్తిస్మమునుబట్టియే అని చెప్పిరి.౹

4 అందుకు పౌలు–యోహాను తన వెనుక వచ్చువానియందు, అనగా యేసునందు విశ్వాసముంచవలెనని ప్రజలతో చెప్పుచు, మారుమనస్సు విషయమైన బాప్తిస్మమిచ్చెనని చెప్పెను.౹

5 వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి.౹

6 తరువాత పౌలు వారిమీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారిమీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాటలాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి.౹

7 వారందరు ఇంచుమించు పండ్రెండుగురు పురుషులు.

8 తరువాత అతడు సమాజమందిరములోనికి వెళ్లి ప్రసంగించుచు, దేవుని రాజ్యమునుగూర్చి తర్కించుచు, ఒప్పించుచు, ధైర్యముగా మాటలాడుచు మూడు నెలలు గడిపెను.౹

9 అయితే కొందరు కఠినపరచబడినవారై యొప్పుకొనక, జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి, శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చెను.౹

10 రెండేండ్లవరకు ఈలాగున జరిగెను గనుక యూదులేమి గ్రీసుదేశస్థులేమి ఆసియలో కాపురమున్నవారందరును ప్రభువు వాక్యము వినిరి.౹

11 మరియు దేవుడు పౌలుచేత విశేషమైన అద్భుతములను చేయించెను;౹

12 అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డైలెనను నడికట్లయినను రోగులయొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడ వదలి పోయెను.౹

13 అప్పుడు దేశసంచారులును మాంత్రికులునైన కొందరు యూదులు–పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్చాటనచేయుచున్నానను మాట చెప్పి, దయ్యములు పెట్టినవారిమీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి.౹

14 యూదుడైన స్కెవయను ఒక ప్రధానయాజకుని కుమారులు ఏడుగురు ఆలాగు చేయుచుండిరి.౹

15 అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడ ఎరుగుదును, గాని మీరెవరని అడుగగా౹

16 ఆ దయ్యముపెట్టినవాడు ఎగిరి, వారిమీద పడి, వారిలో ఇద్దరిని లొంగదీసి గెలిచెను; అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ యింటనుండి పారిపోయిరి.౹

17 ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారికందరికి భయము కలిగెను గనుక ప్రభువైన యేసు నామము ఘన పరచబడెను.౹

18 విశ్వసించినవారు అనేకులు వచ్చి, తాము చేసినవాటిని తెలియజేసి యొప్పుకొనిరి.౹

19 మరియు మాంత్రిక విద్య అభ్యసించినవారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి, అందరియెదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వెల యేబదివేల వెండి రూకలాయెను.౹

20 ఇంత ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించెను.

21 ఈలాగు జరిగిన తరువాత పౌలు మాసిదోనియ అకయ దేశముల మార్గమునవచ్చి యెరూషలేమునకు వెళ్లవలెనని మనస్సులో ఉద్దేశించి–నేనక్కడికి వెళ్లిన తరువాత రోమా కూడ చూడవలెనని అనుకొనెను.౹

22 అప్పుడు తనకు పరిచర్యచేయు వారిలో తిమోతి ఎరస్తు అను వారి నిద్దరిని మాసిదోనియకు పంపి, తాను ఆసియలో కొంతకాలము నిలిచియుండెను.

23 ఆ కాలమందు క్రీస్తు మార్గమునుగూర్చి చాల అల్లరి కలిగెను.౹

24 ఏలాగనగా – దేమేత్రియను ఒక కంసాలి అర్తెమిదేవికి వెండి గుళ్లను చేయించుటవలన ఆ పనివారికి మిగుల లాభము కలుగజేయుచుండెను.౹

25 అతడు వారిని అట్టి పనిచేయు ఇతరులను గుంపుకూర్చి–అయ్యలారా, యీ పనివలన మనకు జీవనము బహు బాగుగా జరుగు చున్నదని మీకు తెలియును.౹

26 అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని యీ పౌలు చెప్పి, ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియయందంతట బహు జనమును ఒప్పించి, త్రిప్పియున్న సంగతి మీరు చూచియు వినియు నున్నారు.౹

27 మరియు ఈ మన వృత్తియందు లక్ష్యము తప్పిపోవుటయేగాక, మహాదేవియైన అర్తెమి దేవియొక్క గుడి కూడ తృణీకరింపబడి, ఆసియయందంతటను భూలోకమందును పూజింపబడుచున్న యీమెయొక్క గొప్పతనము తొలగిపోవునని భయముతోచు చున్నదని వారితో చెప్పెను.౹

28 వారు విని రౌద్రముతో నిండిన వారై–ఎఫెసీయుల అర్తెమిదేవి మహాదేవి అని కేకలువేసిరి;౹

29 పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసి దోనియవారైన గాయియును అరిస్తర్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి.౹

30 పౌలు జనుల సభ యొద్దకు వెళ్లదలచెను, గాని శిష్యులు వెళ్లనియ్యలేదు.౹

31 మరియు ఆసియ దేశాధికారులలో కొందరు అతనికి స్నేహి తులైయుండి అతనియొద్దకు వర్తమానము పంపి–నీవు నాటక శాలలోనికి వెళ్లవద్దని అతని వేడుకొనిరి.౹

32 ఆ సభ గలిబిలిగా ఉండెను గనుక కొందరీలాగున, కొందరాలాగున కేకలువేసిరి; తామెందు నిమిత్తము కూడుకొనిరో చాలమందికి తెలియలేదు.౹

33 అప్పుడు యూదులు అలెక్సంద్రును ముందుకు త్రోయగా కొందరు సమూహములోనుండి అతనిని ఎదుటికి తెచ్చిరి. అలెక్సంద్రు సైగచేసి జనులతో సమాధానము చెప్పుకొనవలెనని యుండెను.౹

34 అయితే అతడు యూదుడని వారు తెలిసికొనినప్పుడు అందరును ఏకశబ్దముతో రెండు గంటలసేపు–ఎఫెసీయుల అర్తెమి దేవి మహాదేవి అని కేకలువేసిరి.౹

35 అంతట కరణము సమూహమును సముదాయించి–ఎఫెసీయులారా, ఎఫె సీయుల పట్టణము అర్తెమి మహాదేవికిని ద్యుపతియొద్ద నుండి పడిన మూర్తికిని పాలకురాలై యున్నదని తెలియని వాడెవడు?౹

36 ఈ సంగతులు నిరాక్షేపమైనవి గనుక మీరు శాంతము కలిగి ఏదియు ఆతురపడి చేయకుండుట ఆవశ్యకము.౹

37 మీరు ఈ మనుష్యులను తీసికొనివచ్చితిరి. వీరు గుడి దోచినవారు కారు, మన దేవతను దూషింపను లేదు.౹

38 దేమేత్రికిని అతనితోకూడనున్న కమసాలులకును ఎవని మీదనైనను వ్యవహారమేదైన ఉన్నయెడల న్యాయసభలు జరుగుచున్నవి, అధిపతులు ఉన్నారు గనుక వారు ఒక రితో ఒకరు వ్యాజ్యె మాడవచ్చును.౹

39 అయితే మీరు ఇతర సంగతులనుగూర్చి యేమైనను విచారణ చేయవలెనని యుంటే అది క్రమమైన సభలో పరిష్కారమగును.౹

40 మనము ఈ గలిబిలినిగూర్చి చెప్పదగిన కారణమేమియు లేనందున, నేడు జరిగిన అల్లరినిగూర్చి మనలను విచారణలోనికి తెత్తురేమో అని భయమవుచున్నది. ఇట్లు గుంపు కూడినందుకు తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను.౹

41 అతడీలాగు చెప్పి సభను ముగించెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ACT/19-6de973740b032824419a34f13c3f3c5e.mp3?version_id=1787—

Categories
అపొస్తలుల కార్యములు

అపొస్తలుల కార్యములు 20

1 ఆ యల్లరి అణగిన తరువాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించినమీదట వారియొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియకు వెళ్లుటకు బయలు దేరెను.౹

2 ఆ ప్రదేశములయందు సంచరించి, పెక్కుమాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చెను.౹

3 అతడు అక్కడ మూడు నెలలు గడిపి ఓడయెక్కి సిరియకు వెళ్ల వలెనని యుండగా అతని విషయమై యూదులు కుట్ర చేయుచున్నందున మాసిదోనియమీదుగా తిరిగి రావలెనని నిశ్చయించుకొనెను.౹

4 మరియు పుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడునైన సోపత్రును, థెస్సలొనీకయులలో అరిస్తర్కును, సెకుందును, దెర్బే పట్టణస్థుడునైన గాయియును, తిమోతియును, ఆసియ దేశస్థులైనన తుకికు, త్రోఫిమును అతనితోకూడవచ్చిరి.౹

5 వీరు ముందుగా వెళ్లి త్రోయలో మాకొరకు కనిపెట్టుకొని యుండిరి.౹

6 పులియనిరొట్టెల దినములైన తరువాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పీ విడిచి, అయిదు దినములలో త్రోయకు వచ్చి, అచ్చట వారియొద్ద ఏడు దినములు గడిపితిమి.

7 ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, పౌలు మరునాడు వెళ్లనైయుండి, వారితో ప్రసంగించుచు అర్ధరాత్రివరకు విస్తరించి మాటలాడుచుండెను.౹

8 మేము కూడియున్న మేడగదిలో అనేక దీపములుండెను.౹

9 అప్పుడు ఐతుకు అను నొక యౌవనస్థుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి, పౌలు చాలసేవు ప్రసంగించుచుండగా నిద్రాభారమువలన జోగి, మూడవ అంతస్తునుండి క్రిందపడి చనిపోయిన వాడై యెత్తబడెను.౹

10 అంతట పౌలు క్రిందికి వెళ్లి అతనిమీదపడి కౌగిలించుకొని–మీరు తొందరపడకుడి, అతని ప్రాణమతనిలో నున్నదని వారితో చెప్పెను.౹

11 అతడు మరల పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని, తెల్లవారువరకు విస్తారముగా సంభాషించి బయలు దేరెను.౹

12 వారు బ్రదికిన ఆ చిన్నవానిని తీసికొని వచ్చి నప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను.

13 మేము ముందుగా ఓడ ఎక్కి అస్సులో పౌలును ఎక్కించుకొనవలెనని అక్కడికి వెళ్లితిమి. తాను కాలి నడకను వెళ్లవలెనని అతడా ప్రకారముగా మాకు నియమించియుండెను.౹

14 అస్సులో అతడు మాతో కలిసికొని నప్పుడు మేమతనిని ఎక్కించుకొని మితులేనేకు వచ్చితిమి.౹

15 అచ్చటనుండి వెళ్లి మరునాడు కీయొసునకు ఎదురుగా వచ్చితిమి. మరునాడు సమొసునకు చేరి ఆ మరునాడు మిలేతుకు వచ్చితిమి.౹

16 సాధ్యమైతే పెంతెకొస్తు దినమున యెరూషలేములో ఉండవలెనని పౌలు త్వరపడుచుండెను గనుక అతడు ఆసియలో కాలహరణము చేయకుండ ఎఫె సును దాటిపోవలెనని నిశ్చయించుకొని యుండెను.

17 అతడు మిలేతునుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను.౹

18 వారు తనయొద్దకు వచ్చినప్పుడతడు వారితో ఇట్లనెను–

నేను ఆసియలో కాలుపెట్టిన దినమునుండి, ఎల్లకాలము మీ మధ్య ఏలాగు నడుచుకొంటినో మీరే యెరుగుదురు.౹

19 యూదుల కుట్రలవలన నాకు శోధనలు సంభవించినను, కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేనేలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియును.౹

20-21 మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచు కొనక బహిరంగముగాను, ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు, దేవుని యెదుట మారుమనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచ వలెనని, యూదులకును గ్రీసుదేశస్థులకును ఏలాగు సాక్ష్య మిచ్చుచుంటినో యిదంతయు మీకు తెలియును.౹

22 ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడినవాడనై యెరూషలేమునకు వెళ్లుచున్నాను, అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదుగాని,౹

23 బంధకములును శ్రమలును నాకొరకు కాచుకొనియున్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోను నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియును.౹

24 అయితే దేవుని కృపాసువార్తనుగూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును, నేను ప్రభువైన యేసువలన పొందిన పరిచర్యను, తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంతమాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు.౹

25 ఇదిగో దేవుని రాజ్యమునుగూర్చి ప్రకటించుచు నేను మీమధ్యను సంచరించుచుంటిని; మీలో ఎవరును ఇకమీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియును.౹

26 కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైననునేను దోషినికానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను.౹

27 దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండ నేనేమియు దాచుకొనలేదు.౹

28 దేవుడుతన స్వరక్తమిచ్చి సంపా దించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆయావత్తుమందనుగూర్చియు, మీ మట్టుకు మిమ్మునుగూర్చియు జాగ్రత్తగా ఉండుడి.౹

29 నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియును; వారు మందను కనికరింపరు.౹

30 మరియు శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు.౹

31 కావున నేను మూడు సంవత్సరములు రాత్రింబగళ్లు కన్నీళ్లు విడుచుచు ప్రతిమనుష్యునికి మానక బుద్ధిచెప్పితినని మీరు జ్ఞాపకము చేసికొని మెలకువగా ఉండుడి.౹

32 ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును, పరిశుద్ధపరచబడినవారందరిలో స్వాస్థ్య మనుగ్రహించుటకును శక్తి మంతుడు.౹

33 ఎవని వెండినైనను, బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు;౹

34 నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియును.౹

35 మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు–

పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము

అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసి కొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పెను.

36 అతడీలాగు చెప్పి మోకాళ్లూని వారందరితో ప్రార్థన చేసెను.౹

37 అప్పుడు వారందరు చాల ఏడ్చిరి. మీరు ఇకమీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు౹

38 పౌలు మెడమీదపడి అతనిని ముద్దుపెట్టుకొని, వారు ఓడవరకు అతనిని సాగ నంపిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ACT/20-3d8e8e447163a1862fc69517ae94ed78.mp3?version_id=1787—

Categories
అపొస్తలుల కార్యములు

అపొస్తలుల కార్యములు 21

1 మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా వెళ్లి కోసుకును, మరునాడు రొదుకును, అక్కడనుండి పతరకును వచ్చితిమి.౹

2 అప్పుడు ఫేనీకేకు వెళ్ల బోవుచున్న ఒక ఓడను చూచి దానిని ఎక్కి బయలుదేరితిమి.౹

3 కుప్రకు ఎదురుగా వచ్చి, దానిని ఎడమతట్టున విడిచి, సిరియవైపుగా వెళ్లి, తూరులో దిగితిమి; అక్కడ ఓడ సరుకు దిగుమతి చేయవలసియుండెను.౹

4 మేమక్కడ నున్న శిష్యులను కనుగొని యేడుదినములక్కడ ఉంటిమి. వారు–నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దనిఆత్మద్వారా పౌలుతో చెప్పిరి.౹

5 ఆ దినములు గడిపిన తరువాత ప్రయాణమై పోవుచుండగా, భార్యలతోను పిల్లలతోను వారందరు మమ్మును పట్టణము వెలుపలివరకు సాగనంపవచ్చిరి. వారును మేమును సముద్రతీరమున మోకాళ్లూని ప్రార్థనచేసి యొకరియొద్ద ఒకరము సెలవు పుచ్చుకొంటిమి.౹

6 అంతట మేము ఓడ ఎక్కితిమి, వారు తమతమ యిండ్లకు తిరిగి వెళ్లిరి.

7 మేము తూరునుండి చేసిన ప్రయాణము ముగించి, తొలెమాయికి వచ్చి, సహోదరులను కుశలమడిగి వారి యొద్ద ఒక దినముంటిమి.౹

8 మరునాడు మేము బయలుదేరి కైసరయకు వచ్చి, యేడుగురిలో నొకడును సువార్తి కుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతనియొద్ద ఉంటిమి.౹

9 కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతనికుండిరి, వారు ప్రవచించువారు.౹

10 మేమనేక దినములక్కడ ఉండగా, అగబు అను ఒక ప్రవక్త యూదయనుండి వచ్చెను.౹

11 అతడు మాయొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసికొని, తన చేతులను కాళ్లను కట్టుకొని–యెరూషలేములోని యూదులు ఈ నడికట్టుగల మనుష్యుని ఈలాగు బంధించి, అన్యజనులచేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను.౹

12 ఈ మాట వినినప్పుడు మేమును అక్కడివారును–యెరూషలేమునకు వెళ్లవద్దని అతని బతిమాలుకొంటిమి గాని౹

13 పౌలు– ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసెదరేల? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను.౹

14 అతడు ఒప్పుకొన నందున మేము–ప్రభువు చిత్తము జరుగునుగాక అని ఊరకుంటిమి.

15 ఆ దినములైన తరువాత మాకు కావలసిన సామగ్రి తీసికొని యెరూషలేమునకు ఎక్కిపోతిమి.౹

16 మరియు కైసరయనుండి కొందరు శిష్యులు, మొదటనుండి శిష్యుడుగా ఉండిన కుప్రీయుడైన మ్నాసోను ఇంట మేము దిగవలెనను ఉద్దేశముతో అతనిని వెంటబెట్టుకొని మాతోకూడ వచ్చిరి.

17 మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మును సంతోషముతో చేర్చుకొనిరి.౹

18 మరునాడు పెద్దలందరు అక్కడికి వచ్చియుండగా పౌలు మాతోకూడ యాకోబునొద్దకు వచ్చెను.౹

19 అతడు వారిని కుశల మడిగి, తన పరిచర్యవలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పెను.౹

20 వారు విని దేవుని మహిమపరచి అతని చూచి–సహోదరుడా, యూదులలో విశ్వాసులైనవారు ఎన్ని వేలమంది యున్నారో చూచుచున్నావుగదా? వారందరును ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు.౹

21 అన్యజనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు, మన ఆచారముల చొప్పున నడువకూడదనియు నీవు చెప్పుటవలన వారందరు మోషేను విడిచిపెట్టవలెనని నీవు బోధించుచున్నట్టు వీరు నిన్నుగూర్చి వర్తమానము వినియున్నారు.౹

22 కావున మన మేమి చేయుదుము? నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు.౹

23 కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయుము. మ్రొక్కుబడియున్న నలుగురు మనుష్యులు మాయొద్ద ఉన్నారు.౹

24 నీవు వారిని వెంటబెట్టుకొనిపోయి వారితోకూడ శుద్ధిచేసికొని, వారు తలక్షౌరము చేయించుకొనుటకు వారికయ్యెడి తగులుబడి పెట్టుకొనుము; అప్పుడు నిన్నుగూర్చి తాము వినిన వర్తమానము నిజము కాదనియు, నీవును ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొనుచున్నావనియు తెలిసికొందురు౹

25 అయితే విశ్వసించిన అన్యజనులనుగూర్చి–వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును గొంతు పిసికి చంపినదానిని జారత్వమును మానవలసినదని నిర్ణయించి వారికి వ్రాసియున్నామని చెప్పిరి.౹

26 అంతట పౌలు మరునాడు ఆ మనుష్యులను వెంట బెట్టుకొనిపోయి, వారితోకూడ శుద్ధిచేసికొని, దేవాలయములో ప్రవేశించి, వారిలో ప్రతివానికొరకు కానుక అర్పించువరకు శుద్ధిదినములు నెరవేర్చుదుమని తెలిపెను.

27 ఏడు దినములు కావచ్చినప్పుడు ఆసియనుండి వచ్చిన యూదులు దేవాలయములో అతని చూచి, సమూహ మంతటిని కలవరపరచి అతనిని బలవంతముగా పట్టుకొని౹

28 –ఇశ్రాయేలీయులారా, సహాయము చేయరండి; ప్రజ లకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికిని అంతటను బోధించుచున్నవాడు వీడే. మరియు వీడు గ్రీసుదేశస్థులను దేవాలయములోనికి తీసికొనివచ్చి యీ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచియున్నాడని కేకలు వేసిరి.౹

29 ఏలయనగా ఎఫెసీయుడైన త్రోఫిమును అతనితోకూడ పట్టణములో అంతకుముందువారు చూచియున్నందున పౌలు దేవాలయములోనికి అతని తీసికొని వచ్చెనని ఊహించిరి.౹

30 పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. జనులు గుంపులు గుంపులుగా పరుగెత్తికొని వచ్చి, పౌలును పట్టుకొని దేవాలయములోనుండి అతనిని వెలుపలికి ఈడ్చిరి; వెంటనే తలుపులు మూయబడెను.౹

31 వారతని చంపవలెనని యత్నించుచుండగా యెరూషలేమంతయు గలిబిలిగా ఉన్నదని పటాలపు పై యధికారికి వర్తమానము వచ్చెను;౹

32 వెంటనే అతడు సైనికులను శతాధిపతులను వెంట బెట్టుకొని వారియొద్దకు పరుగెత్తివచ్చెను; వారు పై యధికారిని సైనికులను రాణువవారిని చూచి పౌలును కొట్టుట మానిరి.౹

33 పై యధికారి దగ్గరకు వచ్చి అతని పట్టుకొని, రెండు సంకెళ్లతో బంధించుమని ఆజ్ఞా పించి–ఇతడెవడు? ఏమిచేసెనని అడుగగా,౹

34 సమూహములో కొందరీలాగు కొందరాలాగు కేకలువేయు చున్నప్పుడు అల్లరిచేత అతడు నిజము తెలిసికొనలేక కోటలోనికి అతని తీసికొనిపొమ్మని ఆజ్ఞాపించెను.౹

35 పౌలు మెట్లమీదికి వచ్చినప్పుడు జనులు గుంపుకూడి బలవంతము చేయుచున్నందున సైనికులు అతనిని మోసికొని పోవలసి వచ్చెను.౹

36 ఏలయనగా–వానిని చంపుమని జనసమూహము కేకలువేయుచు వెంబడించెను.

37 వారు పౌలును కోటలోనికి తీసికొనిపోవనై యుండగా అతడు పైయధికారిని చూచి–నేను నీతో ఒకమాట చెప్పవచ్చునా? అని అడిగెను. అందుకతడు–గ్రీకుభాష నీకు తెలియునా?౹

38 ఈ దినములకుమునుపు రాజద్రోహమునకు రేపి, నరహంతకులైన నాలుగువేలమంది మనుష్యులను అరణ్యమునకు వెంటబెట్టుకొనిపోయిన ఐగుప్తీయుడవు నీవు కావా? అని అడిగెను.౹

39 అందుకు పౌలు–నేను కిలికియలోని తార్సువాడనైన యూదుడను; ఆ గొప్ప పట్టణపు పౌరుడను. జనులతో మాటలాడుటకు నాకు సెలవిమ్మని వేడుకొనుచున్నానని చెప్పెను.౹

40 అతడు సెలవిచ్చిన తరువాత పౌలు మెట్లమీద నిలువబడి జనులకు చేసైగ చేసెను. వారు నిశ్శబ్దముగా ఉన్నప్పుడు అతడు హెబ్రీభాషలో ఇట్లనెను–

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ACT/21-564aa4a03b8c26d3fc25e5088c779f84.mp3?version_id=1787—

Categories
అపొస్తలుల కార్యములు

అపొస్తలుల కార్యములు 22

1 సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ యెదుట చెప్పు సమాధానము నాలకించుడి.

2 అతడు హెబ్రీభాషలో మాటలాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిరి. అప్పుడతడు ఈలాగు చెప్పసాగెను.

3 –నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదములయొద్ద పెరిగి, మన పితరుల ధర్మశాస్త్రసంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై, మీరందరు నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనైయుండి౹

4 ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణమువరకు హింసించితిని.౹

5 ఇందునుగూర్చి ప్రధానయాజకుడును పెద్దలందరును నాకు సాక్షులైయున్నారు. నేను వారివలన సహోదరులయొద్దకు పత్రికలు తీసికొని, దమస్కులోని వారిని కూడ బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవలెనని అక్కడికి వెళ్లితిని.౹

6 నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్నకాలమందు ఆకాశమునుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టు ప్రకాశించెను.౹

7 నేను నేలమీద పడి–సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నా వని నాతో ఒక స్వరము పలుకుట వింటిని.౹

8 అందుకు నేను–ప్రభువా, నీవెవడవని అడిగినప్పుడు ఆయన–నేను నీవు హింసించుచున్న నజరేయుడనగు యేసును అని నాతో చెప్పెను.౹

9 నాతోకూడ నున్నవారు ఆ వెలుగును చూచిరిగాని నాతో మాటలాడినవాని స్వరము వారు వినలేదు.౹

10 అప్పుడు నేను–ప్రభువా, నే నేమి చేయవలెనని అడుగగా, ప్రభువు–నీవు లేచి దమస్కులోనికి వెళ్లుము; అక్కడ నీవు చేయుటకు నియమింపబడిన వన్నియు నీకు చెప్పబడునని నాతో అనెను.౹

11 ఆ వెలుగుయొక్క ప్రభావమువలన నేను చూడలేక పోయినందున నాతోకూడ ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చితిని.౹

12 అంతట ధర్మశాస్త్రము చొప్పున భక్తి పరుడును, అక్కడ కాపురమున్న యూదులందరిచేత మంచిపేరు పొందినవాడునైన అననీయ అను ఒకడు నాయొద్దకు వచ్చి నిలిచి౹

13 –సౌలా! సహోదరా, దృష్టి పొందుమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృిష్టిపొంది అతని చూచితిని.౹

14 అప్పుడతడు–మన పితరుల దేవుడు తన చిత్తమును తెలిసికొనుటకును, ఆ నీతిమంతుని చూచుటకును, ఆయన నోటిమాట వినుటకును నిన్ను నియమించియున్నాడు;౹

15 నీవు కన్నవాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సకల మనుష్యులయెదుట ఆయనకు సాక్షివైయుందువు.౹

16 గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమునుబట్టి ప్రార్థనచేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగివేసికొనుమని చెప్పెను.౹

17 అంతట నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచితిని.౹

18 అప్పుడాయన–నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్లుము. నన్నుగూర్చి నీవిచ్చు సాక్ష్యము వారంగీకరింపరని నాతో చెప్పెను.౹

19 అందుకు నేను–ప్రభువా, ప్రతి సమాజమందిరములోను నీయందు విశ్వాసముంచువారిని నేను చెరసాలలో వేయుచు కొట్టుచు నుంటినని వారికి బాగుగా తెలియును.౹

20 మరియు నీ సాక్షి యైన స్తెఫను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడ దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతని చంపినవారి వస్త్రములకు కావలియుంటినని చెప్పితిని.౹

21 అందుకు ఆయన–వెళ్లుము, నేను దూరముగా అన్యజనులయొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పెను.

22 ఈ మాటవరకు అతడు చెప్పినది వారు ఆలకించుచుండిరి. అప్పుడు ఇటువంటివాడు బ్రదుకతగడు, భూమి మీద ఉండకుండ వానిని చంపివేయుడని కేకలు వేసిరి.౹

23 వారు కేకలువేయుచు తమ పైబట్టలు విదుల్చుకొని ఆకా శముతట్టు దుమ్మెత్తి పోయుచుండగా౹

24 వారతనికి విరోధముగా ఈలాగు కేకలు వేసిన హేతువేమో తెలిసికొనుటకై, సహస్రాధిపతి కొరడాలతో అతనిని కొట్టి, విమర్శింపవలెనని చెప్పి, కోటలోనికి తీసికొనిపొండని ఆజ్ఞా పించెను.౹

25 వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచియున్న శతాధిపతిని చూచి–శిక్ష విధింపకయే రోమీయుడైన మనుష్యుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారమున్నదా? అని యడిగెను.౹

26 శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతియొద్దకు వచ్చి– నీవేమి చేయబోవుచున్నావు? ఈ మనుష్యుడు రోమీ యుడు సుమీ అనెను.౹

27 అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతనిని చూచి–నీవు రోమీయుడవా? అది నాతో చెప్పుమనగా౹

28 అతడు–అవునని చెప్పెను. సహస్రాధిపతి– నేను బహు ద్రవ్యమిచ్చి యీ పౌరత్వము సంపాదించు కొంటిననెను; అందుకు పౌలు–నేనైతే పుట్టుకతోనే రోమీయుడననెను.౹

29 కాబట్టి అతని విమర్శింపబోయినవారు వెంటనే అతనిని విడిచిపెట్టిరి. మరియు అతడు రోమీయుడని తెలిసికొన్నప్పుడు అతని బంధించినందుకు సహస్రాధిపతి కూడ భయపడెను.

30 మరునాడు, యూదులు అతనిమీద మోపిన నేరమేమో తాను నిశ్చయముగా తెలిసికొనగోరి, సహస్రాధిపతి అతని వదిలించి, ప్రధానయాజకులును మహాసభ వారందరును కూడి రావలెనని ఆజ్ఞాపించి, పౌలును తీసి కొనివచ్చి వారియెదుట నిలువబెట్టెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ACT/22-0093598ad5addaf7928674b42bcc2a9d.mp3?version_id=1787—