Categories
నహూము

నహూము 1

1 నీనెవెనుగూర్చిన దేవోక్తి, ఎల్కోషువాడగు నహూమునకు కలిగిన దర్శనమును వివరించు గ్రంథము.

2 యెహోవా రోషముగలవాడై ప్రతికారము చేయువాడు, యెహోవా ప్రతికారముచేయును; ఆయన మహోగ్రతగలవాడు, యెహోవా తన శత్రువులకు ప్రతికారము చేయును, తనకు విరోధులైన వారిమీద కోపముంచుకొనును.౹

3 యెహోవా దీర్ఘశాంతుడు, మహా బలముగలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు, యెహోవా తుపానులోను సుడిగాలిలోను వచ్చువాడు; మేఘములు ఆయనకు పాదధూళిగా నున్నవి.౹

4 ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును, నదులన్నిటిని ఆయన యెండిపోజేయును, బాషానును కర్మెలును వాడిపోవును లెబానోను పుష్పము వాడిపోవును.౹

5 ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును, ఆయన యెదుట భూమి కంపించును, లోకమును అందలి నివాసులందరును వణకుదురు.౹

6 ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్నియెదుట నిలువగలవాడెవడు? ఆయన కోపము అగ్నివలె పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును.౹

7 యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తనయందు నమ్మికయుంచువారిని ఆయన ఎరుగును.౹

8 ప్రళయ జలమువలె ఆయన ఆ పురస్థానమును నిర్మూలముచేయును, తన శత్రువులు అంధకారములో దిగువరకు ఆయన వారిని తరుమును,౹

9 యెహోవానుగూర్చి మీ దురాలోచన యేమి? బాధ రెండవమారు రాకుండ ఆయన బొత్తిగా దానిని నివారణచేయును.౹

10 ముండ్లకంపవలె శత్రువులు కూడినను వారు ద్రాక్షారసము త్రాగి మత్తులైనను ఎండిపోయిన చెత్తవలె కాలిపోవుదురు.౹

11 నీనెవే, యెహోవా మీద దురాలోచనచేసి వ్యర్థమైనవాటిని బోధించినవాడొకడు నీలోనుండి బయలుదేరియున్నాడు.౹

12 యెహోవా సెలవిచ్చునదేమనగా–వారు విస్తారజనమై పూర్ణ బలము కలిగియున్నను కోతయందైనట్లువారు కోయబడి నిర్మూల మగుదురు; నేను నిన్ను బాధ పరచితినే, నేను నిన్నిక బాధపెట్టను.౹

13 వారి కాడిమ్రాను నీమీద ఇక మోపకుండ నేను దాని విరుగగొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును.౹

14 నీనెవే, యెహోవా నిన్నుబట్టి ఆజ్ఞ ఇచ్చునదేమనగా–నీ పేరు పెట్టుకొనువారు ఇకను పుట్టక యుందురు, నీ దేవతాలయములో చెక్కబడిన విగ్రహమేగాని పోతపోసిన ప్రతిమయేగాని యొకటియులేకుండ అన్నిటిని నాశనముచేతును. నీవు పనికిమాలినవాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను.౹

15 సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయువాని పాదములు పర్వతములమీద కనబడుచున్నవి. యూదా, నీ పండుగల నాచరింపుము, నీ మ్రొక్కు బళ్లను చెల్లింపుము. వ్యర్థుడు నీ మధ్యనిక సంచరించడు, వాడు బొత్తిగా నాశనమాయెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/NAM/1-14822ff230aa3932b494d03b8129aa81.mp3?version_id=1787—

Categories
నహూము

నహూము 2

1 లయకర్త నీమీదికి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలికాయుము, మార్గములో కావలియుండుము, నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుము,౹

2 దోచుకొనువారు వారిని దోపుడుసొమ్ముగా పట్టుకొనినను, వారి ద్రాక్షావల్లులను నరికివేసినను, అతిశయాస్పదముగా ఇశ్రాయేలీయులకువలె యెహోవా యాకోబు సంతతికి మరల అతిశయాస్పదముగా అనుగ్రహించును.౹

3 ఆయన బలాఢ్యుల డాళ్లు ఎరుపాయెను, పరాక్రమశాలురు రక్తవర్ణపు వస్త్రములు ధరించుకొనియున్నారు, ఆయన సైన్యము వ్యూహపరచిన దినమున రథభూషణములు అగ్నివలె మెరయుచున్నవి, సరళదారుమయమైన యీటెలు ఆడుచున్నవి;౹

4 వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవుచున్నవి, రాజమార్గములలో రథములు ఒక దానిమీద నొకటి పడుచు పరుగెత్తుచున్నవి, అవి దివిటీలవలె కనబడుచున్నవి, మెరుపులవలె అవి పరుగెత్తుచున్నవి,౹

5 రాజు తన పరాక్రమశాలురను జ్ఞాపకము చేసికొనగా వారు నడుచుచు పడిపోవుదురు, ప్రాకారమునకు పరుగెత్తి వచ్చి మ్రాను సిద్ధపరచుదురు.౹

6 నదులదగ్గరనున్న గుమ్మములు తెరువబడుచున్నవి, నగరుపడిపోవుచున్నది.౹

7 నిర్ణయమాయెను, అది దిగంబరమై కొనిపోబడుచున్నది, గువ్వలు మూల్గునట్లు దాని దాసీలు రొమ్ము కొట్టుకొనుచు మూల్గుచున్నారు.౹

8 కట్టబడినప్పటినుండి నీనెవె పట్టణము నీటికొలనువలె ఉండెను; దాని జనులు పారిపోవు చున్నారు; –నిలువుడి నిలువుడి అనిపిలిచినను తిరిగి చూచువాడొకడును లేడు.౹

9 వెండి కొల్లపట్టుడి, బంగారము కొల్లపట్టుడి, అది సకలవిధములైన విచిత్రములగు ఉపకరణములతో నిండియున్నది, అవి లెక్కలేక యున్నవి.౹

10 అది వట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అగుచున్నది, జనుల హృదయము కరిగిపోవుచున్నది, మోకాళ్లు వణకుచున్నవి, అందరి నడుములు బహుగా నొచ్చుచున్నవి, అందరి ముఖములు తెల్లబోవుచున్నవి.౹

11 సింహముల గుహ యేమాయెను? సింహపుపిల్లల మేతస్థలమేమాయెను? ఎవరును బెదరింపకుండ సింహమును ఆడుసింహమును సింహపు పిల్లలును తిరుగులాడు స్థలమేమాయెను?

12 తన పిల్లలకు కావలసినంత చీల్చివేయుచు, ఆడుసింహములకును కావలసినంత గొంతుక నొక్కి పట్టుచు, తన గుహలను ఎరతోను తన నివాసములను వేటాడి పెట్టిన యెరతోను నింపిన సింహమేమాయెను?

13 నేను నీకు విరోధినై యున్నాను, వాటి పొగ పైకెక్కునట్లుగా నీ రథములను కాల్చివేసెదను, కత్తి నీ కొదమ సింహములను మ్రింగివేయును, నీకిక దొరకకుండ భూమిలోనుండి నీవు పట్టుకొనిన యెరను నేను తీసివేతును, నీ దూతల శబ్దము ఇక వినబడదు; ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/NAM/2-10e92ec9241ba8b58570d83e8354afae.mp3?version_id=1787—

Categories
నహూము

నహూము 3

1 నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ; అది ఎడతెగక యెర పట్టుకొనుచు మోసముతోను బలాత్కారముతోను నిండియున్నది.౹

2 సారధియొక్క చబుకు ధ్వనియు చక్రములధ్వనియు గుఱ్ఱముల త్రొక్కుడు ధ్వనియు వడిగా పరుగెత్తు రథములధ్వనియు వినబడుచున్నవి.౹

3 రౌతులు వడిగా పరుగెత్తుచున్నారు, ఖడ్గములు తళతళలాడుచున్నవి, ఈటెలు మెరయుచున్నవి, చాలమంది హతమవుచున్నారు; చచ్చినవారు కుప్పలు కుప్పలుగా పడియున్నారు; పీనుగులకు లెక్కయే లేదు, పీనుగులు కాలికి తగిలి జనులు తొట్రిల్లుచున్నారు.౹

4 చక్కనిదానవై వేశ్యవై చిల్లంగి తనమందు జ్ఞానముగల దానవై జారత్వముచేసి జనాంగములమీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసినదానా,౹

5 నీవు చేసిన అధిక జారత్వమునుబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే–నేను నీకు విరోధినైయున్నాను, నీ చెంగులు నీ ముఖముమీద కెత్తి జనములకు నీ మానమును రాజ్యములకు నీ యవమానమును నేను బయలుపరతును.౹

6 పదిమంది యెదుట నీమీద మాలిన్యమువేసి నిన్ను అవమానపరచెదను.౹

7 అప్పుడు నిన్ను చూచువారందరు నీయొద్ద నుండి పారిపోయి–నీనెవె పాడైపోయెనే, దానికొరకు అంగలార్చువారెవరు? నిన్ను ఓదార్చు వారిని ఎక్కడ నుండి పిలుచుకొని వచ్చెదము అందురు.౹

8 సముద్రమే తనకు ఆపుగాను సముద్రమే తనకు ప్రాకారముగాను చేసికొని, బహుజనములచేత చుట్టబడి నైలునది దగ్గర నుండిన నోఅమోను పట్టణముకంటె నీవు విశేషమైన దానవా?

9 కూషీయులును ఐగుప్తీయులును దాని శూరులైరి, వారు విస్తార జనముగా నుండిరి, పూతువారును లూబీయులును నీకు సహాయులై యుండిరి.౹

10 అయినను అది చెరపట్టబడి కొనిపోబడెను, రాజమార్గముల మొగలయందు శత్రువులు దానిలోని చిన్నపిల్లలను బండలకువేసి కొట్టి చంపిరి, దాని ఘనులమీద చీట్లువేసి దాని ప్రధానుల నందరిని సంకెళ్లతో బంధించిరి.౹

11 నీవును మత్తురాలవై దాగుకొందువు, శత్రువు వచ్చుట చూచి ఆశ్రయదుర్గము వెదకుదువు.౹

12 అయితే నీ కోటలన్నియు అకాలపు పండ్లు గల అంజూరపు చెట్లవలె ఉన్నవి; ఒకడు వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చినవానినోట పడును;౹

13 నీ జనులు స్త్రీలవంటివారైరి, నీ శత్రువులు చొచ్చునట్లు నీ దేశపు గవునుల అడ్డకఱ్ఱలు తీయబడియున్నవి, అగ్ని నీ అడ్డగడియలను కాల్చుచున్నది.౹

14 ముట్టడివేయు కాలమునకు నీళ్లు చేదుకొనుము, నీ కోటలను బలపరచుము, జిగట మంటిలోనికి దిగి యిటుకల బురదను త్రొక్కుము, ఆవములను సిద్ధపరచుము.౹

15 అచ్చటనే అగ్ని నిన్ను కాల్చివేయును, ఖడ్గము నిన్ను నాశనముచేయును, గొంగళిపురుగు తినివేయురీతిగా అది నిన్ను తినివేయును, నీవు సంఖ్యకు గొంగళిపురుగులంత విస్తారముగాను మిడుతలంత విస్తారముగాను ఉండుము.౹

16 నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రములకంటె ఎక్కువగానున్నను గొంగళి పురుగు వచ్చి అంతయు నాకివేసి యెగిరిపోయెను.౹

17 నీవు ఏర్పరచిన శూరులు మిడుతలంత విస్తారముగా నున్నారు, నీ సైనికులు చలికాలమందు కంచెలలో దిగిన గొంగళి పురుగులవలె నున్నారు. ఎండకాయగా అవి యెగిరి పోవును, అవి ఎక్కడ వాలినది ఎవరికిని తెలియదు.౹

18 అష్షూరు రాజా, నీ కాపరులు నిద్రపోయిరి, నీ ప్రధానులు పండుకొనిరి, నీ జనులు పర్వతములమీద చెదరి పోయిరి, వారిని సమకూర్చువాడొకడును లేడు.౹

19 నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది, నీ గాయమునకు చికిత్స ఎవడును చేయజాలడు, జనులందరు ఎడతెగక నీచేత హింసనొందిరి, నిన్నుగూర్చిన వార్త వినువారందరు నీ విషయమై చప్పట్లు కొట్టుదురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/NAM/3-81e111da58977e8244c0331d4ab0bb6d.mp3?version_id=1787—

Categories
హబక్కూకు

హబక్కూకు 1

1 ప్రవక్తయగు హబక్కూకునొద్దకు దర్శనరీతిగా వచ్చిన దేవోక్తి.

2 యెహోవా, నేను మొఱ్ఱపెట్టినను నీవెన్నాళ్లు ఆలకింప కుందువు? బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొఱ్ఱపెట్టినను నీవు రక్షింపక యున్నావు.౹

3 నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేల ఊరకయే చూచుచున్నావు? ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి.౹

4 అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమాయెను, న్యాయము ఎన్నడును జరుగకుండ మానిపోయెను, భక్తి హీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవుచున్నది.౹

5 అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయమునొందుడి. మీ దినములలో నేనొక కార్యము జరిగింతును, ఆలాగు జరుగునని యొకడు మీకు తెలిపినను మీరతని నమ్మకయుందురు.౹

6 ఆలకించుడి, తమవికాని ఉనికిపట్టులను ఆక్రమించవలెనని భూదిగంతములవరకు సంచరించు ఉద్రేకముగల క్రూరులగు కల్దీయులను నేను రేపుచున్నాను.౹

7 వారు ఘోరమైన భీకరజనముగా ఉన్నారు, వారు ప్రభుత్వమును విధులను తమ యిచ్ఛవచ్చినట్లు ఏర్పరచుకొందురు.౹

8 వారి గుఱ్ఱములు చిరుతపులులకంటె వేగముగా పరుగులెత్తును, రాత్రియందు తిరుగులాడు తోడేళ్లకంటెను అవి చురుకైనవి; వారి రౌతులు దూరమునుండి వచ్చి తటాలున జొరబడుదురు, ఎరను పట్టుకొనుటకై పక్షిరాజు వడిగా వచ్చునట్లువారు పరుగులెత్తి వత్తురు.౹

9 వెనుక చూడకుండ బలాత్కారము చేయుటకై వారు వత్తురు, ఇసుక రేణువులంత విస్తారముగా వారు జనులను చెరపట్టుకొందురు.౹

10 రాజులను అపహాస్యము చేతురు, అధిపతులను హేళన చేతురు, ప్రాకారముగల దుర్గములన్నిటిని తృణీకరింతురు, మంటి దిబ్బవేసి వాటిని పట్టుకొందురు.౹

11 తమ బలమునే తమకు దేవతగా భావింతురు, గాలికొట్టుకొని పోవునట్లువారు కొట్టుకొని పోవుచు అపరాధులగుదురు.౹

12 యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆదినుండి నీవున్నవాడవు కావా? మేము మరణమునొందము; యెహోవా, తీర్పు తీర్చుటకు నీవు వారిని నియమించియున్నావు; ఆశ్రయ దుర్గమా, మమ్మును దండించుటకు వారిని పుట్టించితివి.౹

13 నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది గదా; బాధించువారుచేయు బాధను నీవు దృష్టింపజాలవు గదా; కపటులను నీవు చూచియు, దుర్మార్గులు తమకంటె ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు?

14 ఏలికలేని చేపలతోను ప్రాకుపురుగులతోను నీవు నరులను సమానులనుగా చేసితివి.౹

15 వాడు గాలమువేసి మానవులనందరిని గుచ్చి లాగి యున్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు, వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులువేయుచున్నాడు.౹

16 కావున వలవలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్న వని వాడు తన వలకు బలులనర్పించుచున్నాడు, తన ఉరులకు ధూపము వేయుచున్నాడు.౹

17 వాడు ఎల్లప్పుడును తన వలలోనుండి దిమ్మరించుచుండవలెనా? ఎప్పటికిని మానకుండ వాడు జనములను హతము చేయుచుండవలెనా?

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/HAB/1-345534abf70044768635bd9a5f8c7360.mp3?version_id=1787—

Categories
హబక్కూకు

హబక్కూకు 2

1 ఆయన నాకు ఏమి సెలవిచ్చునో, నా వాదము విషయమై నేనేమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలముమీదను గోపురముమీదను కనిపెట్టుకొని యుందుననుకొనగా

2 యెహోవా నాకీలాగు సెలవిచ్చెను –చదువువాడు పరుగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలకమీద స్పష్టముగా వ్రాయుము.౹

3 ఆ దర్శనవిషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్త మగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును.౹

4 వారు యథార్థపరులుకాక తమలో తాము అతిశయపడుదురు; అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగబ్రదుకును.౹

5 మరియు ద్రాక్షారసము మోసకరము, తననుబట్టి అతిశయించువాడు నిలువడు, అట్టివాడు పాతాళమంత విశాలముగా ఆశపెట్టును, మరణమంతగా ప్రబలినను తృప్తినొందక సకలజనములను వశపరచుకొనును, సకల జనులను సమకూర్చుకొనును.౹

6 తనదికాని దాని నాక్రమించి యభివృద్ధినొందినవానికి శ్రమ; తాకట్టు సొమ్మును విస్తారముగా పట్టుకొనువానికి శ్రమ; –వాడు ఎన్నాళ్లు నిలుచును అని చెప్పుకొనుచు వీరందరు ఇతనినిబట్టి ఉపమానరీతిగా అపహాస్యపు సామెత ఎత్తుదురు గదా.౹

7 వడ్డి కిచ్చువారు హఠాత్తుగా నీమీద పడుదురు, నిన్ను హింస పెట్టబోవువారు జాగ్రత్తగా వత్తురు, నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉందువు.౹

8 బహుజనముల ఆస్తిని నీవు కొల్లపెట్టి యున్నావు గనుక శేషించిన జనులు దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యనుబట్టియు బలాత్కారమునుబట్టియు నిన్ను కొల్లపెట్టుదురు.

9 తనకు అపాయము రాకుండునట్లు తన నివాసమును బలపరచుకొని, తన యింటివారికొరకై అన్యాయముగా లాభము సంపాదించుకొనువానికి శ్రమ.౹

10 నీవు చాలమంది జనములను నాశనముచేయుచు నీమీద నీవే నేర స్థాపనచేసియున్నావు, నీ దురాలోచనవలన నీ యింటి వారికి అవమానము తెచ్చియున్నావు.౹

11 గోడలలోని రాళ్లు మొఱ్ఱపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తర మిచ్చుచున్నవి.

12 నరహత్య చేయుటచేత పట్టణమును కట్టించువారికి శ్రమ; దుష్టత్వము జరిగించుటచేత కోటను స్థాపించు వారికి శ్రమ.౹

13 జనములు ప్రయాసపడుదురు గాని అగ్నిపాలవుదురు; వ్యర్థమైనదానికొరకు కష్టపడి జనులు క్షీణించుదురు; ఇది సైన్యములకధిపతియగు యెహోవా చేతనే యగునుగదా.౹

14 ఏలయనగా సముద్రము జలములతో నిండియున్నట్టు భూమి యెహోవా మాహాత్మ్యమునుగూర్చిన జ్ఞానముతో నిండియుండును.

15 తమ పొరుగువారి మానము చూడవలెనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయువారికి శ్రమ.౹

16 ఘనతకు మారుగా అవమానముతో నిండియున్నావు; నీవును త్రాగి నీ మానము కనుపరచు కొందువు. యెహోవా కుడిచేతిలోని పాత్ర నీకియ్యబడును, అవమానకరమైన వమనము నీ ఘనతమీదపడును.౹

17 లెబానోనునకు నీవు చేసిన బలాత్కారము నీమీదికే వచ్చును, పశువులను బెదరించిన బెదరు నీమీదనే పడును. దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యనుబట్టియు జరిగిన బలాత్కారమునుబట్టియు ఇది సంభవించును.

18 చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుటవలన ప్రయోజనమేమి? పనివాడు మూగబొమ్మను చేసి తాను రూపించినదానియందు నమ్మిక యుంచుటవలన ప్రయోజన మేమి? అబద్ధములు బోధించు పోతవిగ్రహములయందు నమ్మిక యుంచుటవలన ప్రయోజనమేమి?

19 కఱ్ఱనుచూచి –మేలుకొమ్మనియు, మూగరాతిని చూచి–లెమ్మనియు చెప్పువానికి శ్రమ; అది ఏమైన బోధింపగలదా? అది బంగారముతోను వెండితోను పూతపూయబడెను గాని దానిలో శ్వాసమెంత మాత్రమును లేదు.౹

20 అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/HAB/2-451abe0535798f10011979ebf772b2a5.mp3?version_id=1787—

Categories
హబక్కూకు

హబక్కూకు 3

1 ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన. (వాద్యములతో పాడదగినది)

2 యెహోవా, నిన్నుగూర్చిన వార్త విని నేను భయ

పడుచున్నాను

యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ

కార్యము నూతన పరచుము

సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము

కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము.

3 దేవుడు తేమానులోనుండి బయలుదేరుచున్నాడు

పరిశుద్ధదేవుడు పారానులోనుండి వేంచేయు

చున్నాడు.(సెలా. )

ఆయన మహిమ ఆకాశమండలమంతటను కనబడుచున్నది

భూమి ఆయన ప్రభావముతో నిండియున్నది.

4 సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది

ఆయన హస్తములనుండి కిరణములు బయలువెళ్లుచున్నవి

అచ్చట ఆయన బలము దాగియున్నది.

5 ఆయనకు ముందుగా తెగుళ్లు నడుచుచున్నవి

ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి

6 ఆయన నిలువబడగా భూమి కంపించును

ఆయన చూడగా జనులందరు ఇటు అటు తొలుగు

దురు

ఆదికాల పర్వతములు బద్దలైపోవును పురాతన గిరులు

అణగును

పూర్వకాలము మొదలుకొని ఆయన ఈలాగు జరి

గించువాడు.

7 కూషీయుల డేరాలలో ఉపద్రవము కలుగగా నేను

చూచితిని

మిద్యాను దేశస్థుల డేరాల తెరలు గజగజ వణ కెను.

8 యెహోవా, నదులమీద నీకు కోపము కలిగినందుననా

నదులమీద నీకు ఉగ్రత కలిగినందుననా

సముద్రముమీద నీకు ఉగ్రత కలిగినందుననా

నీ గుఱ్ఱములను కట్టుకొని రక్షణార్థమైన రథములమీద

ఎక్కి వచ్చుచున్నావు?

9 విల్లు వరలోనుండి తీయబడియున్నది

నీ వాక్కుతోడని ప్రమాణము చేసి నీ బాణములను

సిద్ధపరచియున్నావు(సెలా.)

భూమిని బద్దలు చేసి నదులను కలుగజేయుచున్నావు.

10 నిన్ను చూచి పర్వతములు కంపించును

జలములు ప్రవాహములుగా పారును

సముద్రాగాధము ఘోషించుచు తన చేతులు పై

కెత్తును.

11 నీ ఈటెలు తళతళలాడగా

సంచరించు నీ బాణముల కాంతికి భయపడి

సూర్యచంద్రులు తమ నివాసములలో ఆగిపోవుదురు.

12 బహు రౌద్రముకలిగి నీవు భూమిమీద సంచరించు

చున్నావు

మహోగ్రుడవై జనములను అణగద్రొక్కుచున్నావు

13 నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు

నీవు నియమించిన అభిషిక్తుని రక్షించుటకు బయలు

దేరుచున్నావు

దుష్టుల కుటుంబికులలో ప్రధానుడొకడుండకుండవారి తలను మెడను ఖండించి వారిని నిర్మూలము

చేయుచున్నావు.(సెలా.)

14 బీదలను రహస్యముగా మ్రింగివేయవలెనని ఉప్పొం

గుచు నన్ను పొడిచేయుటకై

తుపానువలె వచ్చు యోధుల తలలలో రాజుయొక్క

ఈటెలను నాటుచున్నావు.

15 నీవు సముద్రమును త్రొక్కుచు సంచరించుచు

నున్నావు

నీ గుఱ్ఱములు మహాసముద్ర జలరాసులను త్రొక్కును.

16 నేను వినగా జనులమీదికి వచ్చువారు సమీపించు

వరకు

నేను ఊరకొని శ్రమదినముకొరకు కనిపెట్టవలసి

యున్నది

నా అంతరంగము కలవరపడుచున్నది

ఆ శబ్దమునకు నా పెదవులు కదలుచున్నవి

నా యెముకలు కుళ్లిపోవుచున్నవి నా కాళ్లు వణకుచున్నవి.

17 అంజూరపు చెట్లు పూయకుండినను

ద్రాక్షచెట్లు ఫలింపకపోయినను

ఒలీవచెట్లు కాపులేకయుండినను

చేనిలోని పైరు పంటకు రాకపోయినను

గొఱ్ఱెలు దొడ్డిలో లేకపోయినను

సాలలో పశువులు లేకపోయినను

18 నేను యెహోవాయందు ఆనందించెదను

నా రక్షణకర్తయైన నా దేవునియందు నేను సంతో

షించెదను.

19 ప్రభువగు యెహోవాయే నాకు బలము

ఆయన నా కాళ్లను లేడికాళ్లవలె చేయును

ఉన్నతస్థలములమీద ఆయన నన్ను నడవచేయును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/HAB/3-d296ea7f9d2750cc0fc17bde17f0b950.mp3?version_id=1787—

Categories
జెఫన్యా

జెఫన్యా 1

1 యూదారాజగు ఆమోను కుమారుడైన యోషీయా దినములలో హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడగు గెదల్యాకు జననమైన కూషీ కుమారుడగు జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు.

2 ఏమియు విడవకుండ భూమిమీదనున్న సమస్తమును నేను ఊడ్చివేసెదను; ఇదే యెహోవా వాక్కు.౹

3 మనుష్యులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసెదను; ఆకాశపక్షులనేమి సముద్రమత్స్యములనేమి దుర్జనులనేమి వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసెదను; భూమిమీద ఎవరునులేకుండ మనుష్యజాతిని నిర్మూలము చేసెదను; ఇదే యెహోవా వాక్కు.౹

4 నా హస్తమును యూదావారిమీదను యెరూషలేము నివాసులందరిమీదను చాపి, బయలుదేవతయొక్క భక్తులలో శేషించినవారిని, దానికి ప్రతిష్ఠితులగువారిని, దాని అర్చకులను నిర్మూలము చేసెదను.౹

5 మిద్దెలమీద ఎక్కి ఆకాశసమూహములకు మ్రొక్కువారిని యెహోవా పేరునుబట్టియు, బయలుదేవత తమకు రాజను దాని నామమునుబట్టియు మ్రొక్కి ప్రమాణము చేయువారిని నేను నిర్మూలము చేసెదను.౹

6 యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయనివారిని నేను నిర్మూలము చేసెదను.

7 ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను, ఆయన బలియొకటి సిద్ధపరచియున్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించియున్నాడు, యెహోవా సన్నిధిని మౌనముగా నుండుడి.౹

8 యెహోవా యేర్పరచిన బలిదినమందు అధిపతులను రాజకుమారులను అన్యదేశస్థులవలె వస్త్రములు వేసికొనువారినందరిని నేను శిక్షింతును.౹

9 మరియు ఇండ్ల గడపలు దాటివచ్చి యజమానుని యింటిని మోసముతోను బలాత్కారముతోను నింపువారిని ఆ దినమందు నేను శిక్షింతును.౹

10 ఆ దినమందు మత్స్యపు గుమ్మములో రోదనశబ్దమును, పట్టణపు దిగువభాగమున అంగలార్పును వినబడును, కొండల దిక్కునుండి గొప్ప నాశనము వచ్చును. ఇదే యెహోవా వాక్కు.౹

11 కనానీయులందరు నాశమైరి, ద్రవ్యము సమకూర్చుకొనినవారందరును నిర్మూలము చేయబడిరి గనుక మక్తేషు లోయ నివాసులారా, అంగలార్చుడి.౹

12 ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధింతును, మడ్డిమీద నిలిచిన ద్రాక్షారసమువంటివారై–యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనస్సులో అనుకొనువారిని శిక్షింతును.౹

13 వారి ఆస్తి దోపుడు సొమ్మగును, వారి ఇండ్లు పాడగును, వారు ఇండ్లు కట్టుదురు గాని వాటిలో కాపురముండరు, ద్రాక్షతోటలు నాటుదురు గాని వాటి రసమును పానముచేయరు.౹

14 యెహోవా మహా దినము సమీపమాయెను, యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది, పరాక్రమశాలురు మహారోదనము చేయుదురు.౹

15 ఆ దినము ఉగ్రతదినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములును గాఢాంధ కారమును కమ్ము దినము.౹

16 ఆ దినమున ప్రాకారములుగల పట్టణముల దగ్గరను, ఎత్తయిన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణయు బాకానాదమును వినబడును.౹

17 జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదికి ఉపద్రవము రప్పింపబోవుచున్నాను; వారు గ్రుడ్డి వారివలె నడిచెదరు, వారి రక్తము దుమ్మువలె కారును, వారి మాంసము పెంటవలె పారవేయబడును.౹

18 యెహోవా ఉగ్రతదినమున తమ వెండి బంగారములు వారిని తప్పింప లేకపోవును, రోషాగ్నిచేత భూమియంతయు దహింపబడును, హఠాత్తుగా ఆయన భూనివాసులనందరిని సర్వనాశనము చేయబోవుచున్నాడు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ZEP/1-ed8fd09c21a40378a0976c9ab308dd1d.mp3?version_id=1787—

Categories
జెఫన్యా

జెఫన్యా 2

1 సిగ్గుమాలిన జనులారా, కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది.౹

2 విధి నిర్ణయము కాకమునుపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రతదినము రాకమునుపే కూడిరండి.౹

3 దేశములో సాత్వికులై ఆయన న్యాయవిధులననుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి; మీరు వెదకి వినయముగలవారై నీతిని అనుసరించినయెడల ఒకవేళ ఆయన ఉగ్రతదినమున మీరు దాచబడుదురు.౹

4 గాజాపట్టణము నిర్జనమగును, అష్కెలోను పాడైపోవును, మధ్యాహ్నకాలమందు అష్డోదువారు బయటికి పారదోలబడుదురు, ఎక్రోను పట్టణము దున్నబడును.౹

5 సముద్రప్రాంతమందు నివసించు కెరేతీయులారా, మీకు శ్రమ; ఫిలిష్తీయుల దేశమైన కనానూ, నిన్నుగూర్చి యెహోవా సెలవిచ్చునదేమనగా–నీయందు ఒక కాపురస్థుడైననులేకుండ నేను నిన్ను లయముచేతును.౹

6 సముద్రప్రాంతము గొఱ్ఱెల కాపరులు దిగు మేతస్థలమగును, మందలకు దొడ్లు అచ్చట నుండును.౹

7 తమ దేవుడైన యెహోవా యూదావారిని కటాక్షించి వారిని చెరలోనుండి రప్పించగా అచ్చటవారిలో శేషించిన వారికి ఒక స్థలముండును; వారు అచ్చట తమ మందలను మేపుదురు, అస్తమయమునవారు అష్కెలోను ఇండ్లలో పండుకొందురు.౹

8 మోయాబువారు చేసిన నిందయు, అమ్మోనువారు పలికిన దూషణమాటలును నాకు వినబడెను; వారు నా జనుల సరిహద్దులలో ప్రవేశించి అతిశయపడి వారిని దూషించిరి.౹

9 నా జీవముతోడు మోయాబుదేశము సొదొమ పట్టణమువలెను, అమ్మోనుదేశము గొమొఱ్ఱా పట్టణమువలెను అగును. అవి ముండ్లచెట్లకును ఉప్పు గోతులకును స్థానమై నిత్యము పాడుగా ఉండును; నా జనులలో శేషించువారు ఆ దేశములను దోచుకొందురు; నా జనులలో శేషించువారు వాటిని స్వతంత్రించు కొందురు. కాబట్టి ఇశ్రాయేలీయులదేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవావాక్కు ఇదే.౹

10 వారు అతిశయపడి సైన్యములకు అధిపతియగు యెహోవా జనులను దూషించిరి గనుక వారి గర్వమునుబట్టి యిది వారికి సంభవించును.౹

11 జనముల ద్వీపములలో నివసించు వారందరును తమతమ స్థానములనుండి తనకే నమస్కారము చేయునట్లు భూమిలోనున్న దేవతలను ఆయన నిర్మూలము చేయును, యెహోవావారికి భయంకరుడుగా ఉండును.౹

12 కూషీయులారా, మీరును నా ఖడ్గముచేత హతులవుదురు.౹

13 ఆయన ఉత్తరదేశముమీద తన హస్తమును చాపి అష్షూరు దేశమును నాశనముచేయును; నీనెవె పట్టణమును పాడు చేసి దానిని ఆరిపోయిన యెడారివలె చేయును.౹

14 దానిలో పసుల మందలు పండుకొనును; సకలజాతి జంతువులును గుంపులుగా కూడును; గూడబాతులును తుంబోళ్లును వారి ద్వారముల పైకమ్ములమీద నిలుచును; పక్షుల శబ్దములును కిటికీలలో వినబడును; గడపలమీద నాశనము కనుపించును. వారు చేసికొనిన దేవదారు కఱ్ఱపనియంతటిని యెహోవా నాశనము చేయును.౹

15 –నావంటి పట్టణము మరి యొకటి లేదని మురియుచు ఉత్సాహపడుచు నిర్విచారముగా ఉండిన పట్టణము ఇదే. –అది పాడైపోయెనే, మృగములు పండుకొను స్థలమాయెనే అని దాని మార్గమున పోవువారందరు చెప్పుకొనుచు, ఈసడించుచు పోపొమ్మని చేసైగ చేయుదురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ZEP/2-96acf0fb7d94d4fdcbf3aff8a02a7059.mp3?version_id=1787—

Categories
జెఫన్యా

జెఫన్యా 3

1 ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయునదియునగు పట్టణమునకు శ్రమ.౹

2 అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవాయందు విశ్వాసముంచదు, దాని దేవునియొద్దకు రాదు.౹

3 దాని మధ్య దాని అధిపతులు గర్జనచేయు సింహములు, దాని న్యాయాధిపతులు రాత్రియందు తిరుగులాడుచు తెల్లవారువరకు ఎరలో ఏమియు మిగులకుండ భక్షించు తోడేళ్లు.౹

4 దాని ప్రవక్తలు గప్పాలు కొట్టువారు, విశ్వాసఘాతుకులు; దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరతురు.౹

5 అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు; ఆయన అక్రమము చేయువాడు కాడు, అనుదినము తప్పకుండ ఆయన న్యాయవిధులను బయలుపరచును, ఆయనకు రహస్యమైనదేదియు లేదు; అయినను నీతిహీనులు సిగ్గెరుగరు.౹

6 నేను అన్యజనులను నిర్మూలము చేయగా వారి కోటలును పాడగును, ఒకడైన సంచరించకుండ వారి వీధులను పాడుచేసియున్నాను, జనములేకుండను వాటియందెవరును కాపురముండకుండను వారి పట్టణములను లయపరచినవాడను నేనే.౹

7 దాని విషయమై నా నిర్ణయమంతటి చొప్పున మీ నివాసస్థలము సర్వనాశము కాకుండునట్లు, నాయందు భయభక్తులుకలిగి శిక్షకు లోబడుదురని నేననుకొంటిని గాని వారు దుష్‌క్రియలు చేయుటయందు అత్యాశగలవా రైరి.౹

8 కాబట్టి యెహోవా సెలవిచ్చు వాక్కు ఏదనగా – నాకొరకు కనిపెట్టుడి, నేను లేచి యెరపట్టుకొను దినము కొరకు కనిపెట్టియుండుడి, నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటిని వారిమీద కుమ్మరించుటకై అన్యజనులను పోగు చేయుటకును గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకును నేను నిశ్చయించుకొంటిని; నా రోషాగ్ని చేత భూమియంతయు కాలిపోవును.౹

9 అప్పుడు జనులందరు యెహోవా నామమునుబట్టి యేకమనస్కులై ఆయనను సేవించునట్లు నేను వారికి పవిత్రమైన పెదవుల నిచ్చెదను.౹

10 చెదరిపోయినవారై నాకు ప్రార్థనచేయు నా జనులు కూషుదేశపు నదుల అవతలనుండి నాకు నైవేద్యముగా తీసికొని రాబడుదురు.౹

11 ఆ దినమున నీ గర్వమునుబట్టి సంతోషించువారిని నీలోనుండి నేను వెళ్లగొట్టుదును గనుక నా పరిశుద్ధమైన కొండయందు నీవిక గర్వము చూపవు, నామీద తిరుగబడి నీవుచేసిన క్రియలవిషయమై నీకు సిగ్గు కలుగదు

12 దుఃఖితులగు దీనులను యెహోవా నామము నాశ్రయించు జనశేషముగా నీమధ్య నుండనిత్తును.౹

13 ఇశ్రాయేలీయులలో మిగిలినవారు పాపము చేయరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోటనుండదు; వారు ఎవరి భయములేకుండ విశ్రాంతిగలవారై అన్నపానములు పుచ్చుకొందురు;౹

14 సీయోను నివాసులారా, ఉత్సాహధ్వని చేయుడి; ఇశ్రాయేలీయులారా, జయధ్వని చేయుడి; యెరూషలేము నివాసులారా, పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి.౹

15 తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసియున్నాడు; మీ శత్రువులను ఆయన వెళ్లగొట్టియున్నాడు; ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు.౹

16 ఆ దినమున జనులు మీతో ఇట్లందురు–యెరూషలేమూ, భయపడకుము, సీయోనూ, ధైర్యము తెచ్చుకొనుము;౹

17 నీ దేవుడైన యెహోవా నీమధ్య ఉన్నాడు; ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమనుబట్టి శాంతము వహించి నీయందలి సంతోషముచేత ఆయన హర్షించును.౹

18 నీ నియామక కాలపు పండుగలకు రాలేక చింతపడు నీ సంబంధులను నేను సమకూర్చెదను, వారు గొప్ప అవమానము పొందినవారు.౹

19 ఆ కాలమున నిన్ను హింసపెట్టువారినందరిని నేను శిక్షింతును, కుంటుచు నడుచువారిని నేను రక్షింతును, చెదరగొట్టబడినవారిని సమకూర్చుదును, ఏ యే దేశములలో వారు అవమానము నొందిరో అక్కడనెల్ల నేను వారికి ఖ్యాతిని మంచిపేరును కలుగజేసెదను,౹

20 ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలోనుండి రప్పించి, మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును; నిజముగా భూమిమీద నున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచిపేరును తెప్పింతును; ఇదే యెహోవా వాక్కు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ZEP/3-57599da440e4cfaa7976744a6fbacc1c.mp3?version_id=1787—

Categories
హగ్గయి

హగ్గయి 1

1 రాజైన దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము ఆరవ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గయిద్వారా యూదా దేశముమీద అధికారియు షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్బాబెలుకును ప్రధానయాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను –సైన్యములకధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా

2 –సమయమింక రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయమింక రాలేదని యీ జనులు చెప్పుచున్నారే.౹

3 అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయిద్వారా సెలవిచ్చినదేమనగా

4 –ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబీవేసిన యిండ్లలో నివసించుటకు ఇది సమయమా?

5 కాబట్టి సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా –మీ ప్రవర్తననుగూర్చి ఆలోచించుకొనుడి.౹

6 మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనముచేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానముచేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పు కొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టముచేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది.౹

7 కాగా సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా–మీ ప్రవర్తననుగూర్చి ఆలోచించుకొనుడి.౹

8 పర్వతములెక్కి మ్రాను తీసికొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించినయెడల దానియందు నేను సంతోషించి నన్ను ఘనపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹

9 విస్తారముగా కావలెనని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెముగా పండెను; మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టితిని; ఎందు చేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడైయుండగా మీరందరు మీ మీ యిండ్లు కట్టుకొనుటకు త్వరపడుటచేతనే గదా.౹

10 కాబట్టి మిమ్మునుబట్టి ఆకాశపుమంచు కురువకయున్నది, భూమి పండక యున్నది.౹

11 నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగజేసి, ధాన్యము విషయములోను ద్రాక్షారసము విషయములోను తైలము విషయములోను భూమి ఫలించు సమస్తము విషయములోను మనుష్యుల విషయములోను పశువుల విషయములోను చేతిపనులన్నిటి విషయములోను క్షామము పుట్టించియున్నాను.

12 షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యెహో జాదాకు కుమారుడును ప్రధానయాజకుడునగు యెహోషు వయు శేషించిన జనులందరును తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి, తమ దేవుడైన యెహోవా ప్రవక్తయైన హగ్గయిని పంపించి, తెలియజేసిన వార్త విని యెహోవాయందు భయభక్తులు పూనిరి.౹

13 అప్పుడు యెహోవాదూతయైన హగ్గయి యెహోవా తెలియ జేసిన వార్తనుబట్టి జనులకు ప్రకటించినదేమనగా–నేను మీకు తోడుగా ఉన్నాను; ఇదే యెహోవా వాక్కు.౹

14 యెహోవా యూదాదేశపు అధికారియగు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుయొక్క మనస్సును, ప్రధానయాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనస్సును,శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా

15 వారు కూడివచ్చి, రాజైన దర్యావేషుయొక్క యేలుబడియందు రెండవ సంవత్సరము ఆరవ నెల యిరువది నాలుగవదినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పనిచేయ మొదలుపెట్టిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/HAG/1-df0190187c4bfe3bfd7940e47d6ef365.mp3?version_id=1787—