Categories
హోషేయ

హోషేయ 9

1 ఇశ్రాయేలూ, అన్యజనులు సంతోషించునట్లు నీవు సంభ్రమపడి సంతోషింపవద్దు; నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి, నీ కళ్లములన్నిటిమీదనున్న ధాన్యమునుబట్టి నీవు పడుపుకూలిని ఆశించితివి.౹

2 కళ్లములుగాని గానుగలుగాని వారికి ఆహారము నియ్యవు; క్రొత్త ద్రాక్షారసము లేకపోవును.౹

3 ఎఫ్రాయిమీయులు ఐగుప్తునకు మరలుదురు, అష్షూరు దేశములో వారు అపవిత్రమైన వాటిని తిందురు, యెహోవా దేశములో వారు నివసింపకూడదు.౹

4 యెహోవాకు ద్రాక్షారస పానా ర్పణమును వారర్పింపరు; వారర్పించు బలులయందు ఆయన కిష్టములేదు, వారు ఆహారముగా పుచ్చుకొనునది ప్రలాపము చేయువారి ఆహారమువలెనగును, దాని భుజించు వారందరు అపవిత్రులగుదురు; తమ ఆహారము తమకే సరిపడును గాని అది యెహోవా మందిరములోనికిరాదు.౹

5 నియామక దినములలోను యెహోవా పండుగ దినములలోను మీరేమి చేతురు?

6 లయము సంభవించినందున జనులు వెళ్లిపోయి యున్నారు; ఐగుప్తుదేశము వారికి కూడు స్థలముగా ఉండును; నొపుపట్టణము వారికి శ్మశాన భూమిగా నుండును; వెండిమయమైన వారి ప్రియవస్తువులను దురదగొండ్లు ఆవరించును; ముండ్లకంప వారి నివాస స్థలములో పెరుగును.౹

7 శిక్షా దినములు వచ్చేయున్నవి; ప్రతికార దినములు వచ్చేయున్నవి; తాము చేసిన విస్తారమైన దోషమును తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారై తమ ప్రవక్తలు అవివేకులనియు, దురాత్మ ననుసరించినవారు వెఱ్ఱివారనియు ఇశ్రాయేలువారు తెలిసికొందురు.౹

8 ఎఫ్రాయిము నా దేవునియొద్దనుండి వచ్చు దర్శనములను కనిపెట్టును; ప్రవక్తలు తమ చర్యయంతటిలోను వేటకాని వలవంటివారై యున్నారు; వారు దేవుని మందిరములో శత్రువులుగా ఉన్నారు.౹

9 గిబియాలో చెడుకార్యములు జరిగిన నాడు జనులు దుర్మార్గులైనట్లువారు బహు దుర్మార్గులైరి; యెహోవావారి దోషమును జ్ఞాపకము చేసికొనుచున్నాడు, వారి పాపములకై ఆయన వారికి శిక్ష విధించును.౹

10 అరణ్యములో ద్రాక్షపండ్లు దొరికినట్లు ఇశ్రాయేలువారు నాకు దొరికిరి; చిగురుపెట్టు కాలమందు అంజూరపు చెట్టుమీద తొలి ఫలము దొరికినట్లు మీపితరులు నాకు దొరికిరి. అయితే వారు బయల్పెయోరు నొద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమ్మును తాము అప్పగించుకొనిరి; తాము మోహించినదానివలెనే వారు హేయులైరి.౹

11 ఎఫ్రాయిముయొక్క కీర్తి పక్షివలె ఎగిరి పోవును; జననమైనను, గర్భముతో ఉండుటయైనను, గర్భము ధరించుటయైనను వారికుండదు.౹

12 వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరునులేకుండ అందమైన స్థలములో వారిని పుత్రహీనులుగా చేసెదను; నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును.౹

13 లోయలో స్థాపింపబడిన తూరువంటి స్థానముగా నుండుటకై నేను ఎఫ్రాయిమును ఏర్పరచుకొంటిని; అయితే నరహంతకుల కప్పగించుటకై అది దాని పిల్లలను బయటికి తెచ్చును.౹

14 యెహోవా, వారికి ప్రతికారము చేయుము; వారికి నీవేమి ప్రతికారము చేయుదువు? వారి స్త్రీలను గొడ్రాండ్రుగాను ఎండు రొమ్ములుగల వారినిగాను చేయుము.౹

15 వారి చెడుతనమంతయు గిల్గాలులో కనబడుచున్నది; అచ్చటనే నేను వారికి విరోధినైతిని, వారి దుష్టక్రియలనుబట్టి వారి నికను ప్రేమింపక నా మందిరములోనుండి వారిని వెలివేతును; వారి యధిపతులందరును తిరుగుబాటు చేయువారు.౹

16 ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయెను, వారు ఫలమియ్యరు. వారు పిల్లలు కనినను వారి గర్భనిధిలోనుండివచ్చు సొత్తును నేను నాశనము చేసెదను.౹

17 వారు నా దేవుని మాటల నాలకించలేదు గనుక ఆయన వారిని విసర్జించెను. వారు దేశము విడిచి అన్యజనులలో తిరుగుదురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/HOS/9-b4654b744c36968de6b390798ddddee9.mp3?version_id=1787—

Categories
హోషేయ

హోషేయ 10

1 ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష . చెట్టుతో సమానము. వారు ఫలము ఫలించిరి. ఫలము ఫలించినకొలది వారు బలిపీఠములను మరి విశేషముగా చేయుచువచ్చిరి; తమ భూమి ఫలవంతమైనకొలది వారు తమ దేవతాస్తంభములను మరి విశేషముగా చేసిరి.౹

2 వారి మనస్సు కపటమైనది గనుక వారు త్వరలోనే తమ అపరాధమునకు శిక్ష నొందుదురు; యెహోవావారి బలిపీఠములను తుత్తునియలుగా చేయును, వారు ప్రతిష్ఠించిన దేవతాస్తంభములను పాడుచేయును.౹

3 –రాజు మనకు లేడు, మనము యెహోవాకు భయపడము, రాజు మనకేమి చేయును అని వారిప్పుడు చెప్పుదురు.౹

4 అబద్ధప్రమాణములు చేయుదురు, సంధులు చేయుదురు, వట్టిమాటలు పలుకుదురు, అందువలన భూమి చాళ్లలో విషపుకూర మొలచునట్టుగా దేశములో వారి తీర్పులు బయలుదేరుచున్నవి.౹

5 బేతావెనులోనున్న దూడవిషయమై షోమ్రోను నివాసులు భయపడుదురు, దాని ప్రభావము పోయెనని ప్రజలును, సంతోషించుచుండిన దాని అర్చకులును దుఃఖింతురు.౹

6 ఎఫ్రాయిము అవమానము నొందుటకు, ఇశ్రాయేలువారు తాము చేసిన ఆలోచనవలన సిగ్గు తెచ్చుకొనుటకు, అది అష్షూరు దేశములోనికి కొనిపోబడి రాజైన యారేబునకు కానుకగా ఇయ్యబడును.౹

7 షోమ్రోను నాశమగును, దాని రాజు నీళ్లలో కొట్టుకొనిపోవు నురుగుతో సమానమగును.౹

8 ఇశ్రాయేలువారి పాప స్వరూపమైన ఆవెనులోని ఉన్నతస్థలములు లయమగును, ముండ్ల చెట్లును కంపయు వారి బలిపీఠములమీద పెరుగును, పర్వతములను చూచి–మమ్మును మరుగుచేయుడనియు, కొండలను చూచి–మామీద పడుడనియు వారు చెప్పుదురు.౹

9 ఇశ్రాయేలూ, గిబియా దినములనుండి నీవు పాపము చేయుచు వచ్చితివి, అచ్చట వారు నిలిచియుండిరి. దుర్మార్గులమీద జరిగిన యుద్ధము గిబియాలో వారిమీదకి రాగా

10 నా యిష్టప్రకారము నేను వారిని శిక్షింతును; వారు చేసిన రెండు దోషక్రియలకు నేను వారిని బంధింపగా అన్యజనులు కూడి వారిమీదికి వత్తురు.౹

11 ఎఫ్రాయిము నూర్పునందు అభ్యాసముగలదై కంకులను త్రొక్కగోరు పెయ్యవలె ఉన్నది; అయితే దాని నున్నని మెడకు నేను కాడి కట్టుదును; ఎఫ్రాయిముచేత దున్నిం చుటకు నేనొకని నియమింతును, యూదా భూమిని దున్నును, యాకోబు దానిని చదును చేసికొనును.౹

12 నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమయను కోత మీరు కోయుడి, యెహోవాను వెదకుటకు ఇదే సమ యము గనుక ఆయన ప్రత్యక్షమై మీమీద నీతివర్షము కురిపించునట్లు ఇదివరకెన్నడును దున్నని బీడుభూమి దున్నుడి.౹

13 నీ ప్రవర్తన నాధారము చేసికొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతనపు పంటకై దున్నితివి గనుక మీరు పాపమను కోతకోసియున్నారు. అబద్ధమునకు ఫలము పొందియున్నారు.౹

14 నీ జనులమీదికి అల్లరి వచ్చును; షల్మాను యుద్ధముచేసి బేతర్బేలును పాడుచేసినట్లు ప్రాకారములుగల నీ పట్టణములన్నియు పాడగును; పిల్లలమీద తల్లులు నేలను పడవేయబడుదురు.౹

15 ఈలాగున మీరు చేసిన ఘోరమైన దుష్టక్రియలనుబట్టి బేతేలు మీకు నాశన కారణమగును; ఉదయకాలమున ఇశ్రాయేలురాజు కొట్టబడి నిర్మూలమగును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/HOS/10-5ce0dbcd6cb95b79389fbe8ba049910e.mp3?version_id=1787—

Categories
హోషేయ

హోషేయ 11

1 ఇశ్రాయేలు బాలుడైయుండగా నేను అతనియెడల ప్రేమగలిగి నా కుమారుని ఐగుప్తుదేశములోనుండి పిలిచితిని.౹

2 ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులనర్పించిరి, విగ్రహములకు ధూపము వేసిరి.౹

3 ఎఫ్రా యిమును చెయ్యిపట్టుకొని వానికి నడక నేర్పినవాడను నేనే; వారిని కౌగలించుకొనినవాడను నేనే; నేనే వారిని స్వస్థపరచినవాడనైనను ఆ సంగతి వారికి మనస్సున పట్ట లేదు

4 ఒకడు మనుష్యులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించితిని; ఒకడు పశువులమీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి యెదుట భోజనము పెట్టితిని

5 ఐగుప్తుదేశమునకు వారు మరల దిగిపోరు గాని నన్ను విసర్జించినందున అష్షూరురాజు వారిమీద ప్రభుత్వము చేయును.౹

6 వారు చేయుచున్న యోచనలనుబట్టి యుద్ధము వారి పట్టణములను ఆవరించును; అది వారి పట్టణపు గడియలు తీసి వారిని మ్రింగివేయును.౹

7 నన్ను విసర్జించవలెనని నా జనులు తీర్మానము చేసికొనియున్నారు; మహోన్నతునితట్టు చూడవలెనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడును యత్నము చేయడు

8 ఎఫ్రాయిమూ, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును? ఇశ్రాయేలూ, నేను నిన్ను ఎట్లు విస ర్జింతును? అద్మానువలె నిన్ను నేను ఎట్లు చేతును? సెబో యీమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును? నా మనస్సు మారినది, సహింపలేకుండ నా యంతరంగము మండు చున్నది.౹

9 నా ఉగ్రతాగ్నినిబట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను; నేను మరల ఎఫ్రాయిమును లయపర చను, నేను మీ మధ్య పరిశుద్ధదేవుడను గాని మనుష్యుడను కాను, మిమ్మును దహించునంతగా నేను కోపింపను.౹

10 వారు యెహోవా వెంబడి నడిచెదరు; సింహము గర్జించునట్లు ఆయన ఘోషించును, ఆయన ఘోషింపగా పశ్చిమ దిక్కున నున్న జనులు వణకుచు వత్తురు.౹

11 వారు వణకుచు పక్షులు ఎగురునట్లుగా ఐగుప్తుదేశములోనుండి వత్తురు; గువ్వలు ఎగురునట్లుగా అష్షూరుదేశములోనుండి ఎగిరి వత్తురు; నేను వారిని తమ నివాసములలో కాపురముంతును; ఇదే యెహోవా వాక్కు.

12 ఎఫ్రాయిమువారు అబద్ధములతో నన్ను ఆవరించియున్నారు; ఇశ్రాయేలువారు మోసక్రియలతో నన్ను ఆవరించియున్నారు; యూదావారు నిరాటంకముగా దేవునిమీద తిరుగుబాటు చేయుదురు, నమ్మకమైన పరిశుద్ధ దేవునిమీద తిరుగబడుదురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/HOS/11-569455ed6da4994b5ae82d58e5630c6b.mp3?version_id=1787—

Categories
హోషేయ

హోషేయ 12

1 ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు; తూర్పు గాలిని వెంటాడుచున్నాడు; మానక దినమెల్ల అబద్ధమాడుచు, బలాత్కారము చేయుచున్నాడు; జనులు అష్షూరీయులతో సంధిచేసెదరు, ఐగుప్తునకు తైలము పంపించెదరు.౹

2 యూదావారిమీద యెహోవాకు వ్యాజ్యెము పుట్టెను; యాకోబు సంతతివారి ప్రవర్తననుబట్టి ఆయన వారిని శిక్షించును, వారి క్రియలనుబట్టి వారికి ప్రతికారము చేయును.౹

3 తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను, మగసిరికలవాడై అతడు దేవునితో పోరాడెను.౹

4 అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను, అక్కడ ఆయన మనతో మాటలాడెను;౹

5 యెహోవా అని, సైన్యములకధిపతియగు యెహోవా అని, ఆయనకు జ్ఞాపకార్థనామము.౹

6 కాబట్టి నీవు నీ దేవునితట్టు తిరుగవలెను; కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవునియందు నమ్మిక నుంచుము.

7 ఎఫ్రాయిమువారు కనానీయుల వర్తకులవంటివారై అన్యాయపు త్రాసును వాడుకచేసెదరు, బాధపెట్టవలె నన్న కోరిక వారికి కలదు.౹

8 –నేను ఐశ్వర్యవంతుడనైతిని, నాకు బహు ఆస్తి దొరికెను, నా కష్టార్జితములో దేనినిబట్టియు శిక్షకు తగిన పాపము నాలోనున్నట్టు ఎవరును కనుపరచలేరని ఎఫ్రాయిము అనుకొనుచున్నాడు.౹

9 అయితే ఐగుప్తుదేశములోనుండి మీరు వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీకు దేవుడను; నియామక దినములలో మీరు డేరాలలో కాపురమున్నట్లు నేనికను మిమ్మును డేరాలలో నివసింపజేతును.౹

10 ప్రవక్తలతో నేను మాటలాడి యున్నాను, విస్తారమైన దర్శనములను నేనిచ్చియున్నాను, ఉపమానరీతిగా అనేకపర్యాయములు ప్రవ క్తలద్వారా మాటలాడియున్నాను.౹

11 నిజముగా గిలాదు చెడ్డది, అచ్చటివి వ్యర్థములు, గిల్గాలులో జనులు ఎడ్లను బలులగా అర్పింతురు, వారి బలిపీఠములు దున్నినచేని గనిమలమీదనున్న రాళ్లకుప్పలవలె ఉన్నవి

12 యాకోబు తప్పించుకొని సిరియా దేశములోనికి పోయెను, భార్య కావలెనని ఇశ్రాయేలు కొలువు చేసెను, భార్య కావలెనని అతడు గొఱ్ఱెలు కాచెను.౹

13 ఒక ప్రవక్తద్వారా యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తుదేశములోనుండి రప్పించెను, ప్రవక్తద్వారా వారిని కాపాడెను.౹

14 ఎఫ్రాయిము బహు ఘోరమైన కోపము పుట్టించెను గనుక అతనిని ఏలినవాడు అతడు చేసిన నరహత్యకై అతనిమీద నేరము మోపును; అతడు పరులకు అవమానము కలుగజేసినందుకై నేనతని నవమానపరతును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/HOS/12-d631838782ec2881b3e7b19f41190bbd.mp3?version_id=1787—

Categories
హోషేయ

హోషేయ 13

1 ఎఫ్రాయిము మాటలాడినప్పుడు భయము కలిగెను; అతడు ఇశ్రాయేలువారిలో తన్ను గొప్ప చేసికొనెను; తరువాత బయలుదేవతనుబట్టి అపరాధియై అతడు నాశన మొందెను.౹

2 ఇప్పుడు వారు పాపము పెంపుచేయుదురు, తమకు తోచినట్టు వెండితో విగ్రహములను పోతపోయుదురు, అదంతయు పనివారు చేయుపనియే, వాటికి బలులను అర్పించువారు–దూడలను ముద్దు పెట్టుకొనుడని చెప్పుదురు.౹

3 కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘమువలెను పెందలకడ గతించు ప్రాతఃకాలపు మంచువలె నుందురు; కళ్లములోనుండి గాలి యెగురగొట్టు పొట్టువలెను, కిటికీలోగుండ పోవు పొగవలె నుందురు.౹

4 మీరు ఐగుప్తు దేశములోనుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను; నన్ను తప్ప నీవు ఏ దేవునిని ఎరుగవు, నేను తప్ప రక్షకుడును లేడు.౹

5 మహా యెండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించినవాడను నేనే.౹

6 తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తిపొందిరి; తృప్తిపొంది గర్వించి నన్ను మరచిరి.౹

7 కాబట్టి నేను వారికి సింహమువంటివాడనైతిని; చిరుతపులి మార్గమున పొంచియున్నట్లు నేను వారిని పట్టుకొన పొంచియుందును.౹

8 పిల్లలు పోయిన యెలుగుబంటి యొకనిమీద పడునట్టు నేను వారిమీదపడి వారి రొమ్మును చీల్చివేయుదును; ఆడుసింహము ఒకని మ్రింగివేయునట్లు వారిని మ్రింగివేతును; దుష్టమృగములు వారిని చీల్చివేయును.౹

9 ఇశ్రాయేలూ, నీ సహాయకర్తనగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసికొనుచున్నావు.౹

10 నీ పట్టణములలో దేనియందును నీకు సహాయము చేయకుండ నీ రాజు ఏమాయెను? –రాజును అధిపతులను నామీద నియమించుమని నీవు మనవి చేసికొంటివిగదా; నీ అధిపతులు ఏమైరి?

11 కాగా కోపము తెచ్చుకొని నీకు రాజును నియమించితిని; క్రోధముకలిగి అతని కొట్టివేయు చున్నాను.౹

12 ఎఫ్రాయిము దోషము నాయొద్ద ఉంచబడి యున్నది, అతని పాపము భద్రము చేయబడియున్నది.౹

13 ప్రసూతి వేదనలు కలిగినట్టుగా అతనికి వేదనపుట్టును, పిల్లపుట్టు సమయమున బయటికి రాని శిశువైనట్టుగా అతడు బుద్ధిలేనివాడై వృద్ధికి రాడు.౹

14 అయినను పాతాళ వశములోనుండి నేను వారిని విమోచింతును; మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా, నీ విజయ మెక్కడ? ఓ మరణమా, నీముల్లెక్కడ? పశ్చాత్తాపము నాకు పుట్టదు.౹

15 నిజముగా ఎఫ్రాయిము తన సహోదరులలో ఫలాభివృద్ధినొందును. అయితే తూర్పుగాలి వచ్చును, యెహోవా పుట్టించుగాలి అరణ్యములోనుండి లేచును; అది రాగా అతని నీటిబుగ్గలు ఎండి పోవును, అతని ఊటలు ఇంకిపోవును, అతని ధననిధులను అతనికి ప్రియమైన వస్తువు లన్నిటిని శత్రువు కొల్లపట్టును.౹

16 షోమ్రోను తన దేవుని మీద తిరుగుబాటుచేసెను గనుక అది శిక్షనొందును, జనులు కత్తిపాలగుదురు, వారి పిల్లలు రాళ్లకువేసి కొట్టబడుదురు, గర్భిణిస్త్రీల కడుపులు చీల్చబడును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/HOS/13-79a198f1e858eed5711ac31aaea66384.mp3?version_id=1787—

Categories
హోషేయ

హోషేయ 14

1 ఇశ్రాయేలూ, నీ పాపముచేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవాతట్టుకు తిరుగుము.౹

2 మాటలు సిద్ధపరచుకొని యెహోవాయొద్దకు తిరుగుడి; మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా–మా పాపములన్నిటిని పరిహ రింపుము; ఎడ్లకు బదులుగా నీకు మా పెదవుల నర్పించుచున్నాము; నీవంగీకరింపదగినవి అవే మాకున్నవి.౹

3 అష్షూరీయులచేత రక్షణ నొందగోరము, మేమికను గుఱ్ఱములను ఎక్కము–మీరే మాకు దేవుడని మేమికమీదట మా చేతి పనితో చెప్పము; తండ్రిలేనివారి యెడల వాత్సల్యము చూపువాడవు నీవే గదా.౹

4 వారు విశ్వాసఘాతుకులు కాకుండ నేను వారిని గుణపరచుదును. వారిమీదనున్న నాకోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహిం తును.౹

5 చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతనికుందును, తామరపుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును, లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లువారు తమ వేళ్లు తన్నుదురు.౹

6 అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవచెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికుండును.౹

7 అతని నీడయందు నివసించువారు మరలివత్తురు. ధాన్యమువలె వారు తిరిగి మొలుతురు ద్రాక్షచెట్టువలె వారు వికసింతురు. లెబానోను ద్రాక్షరసము వాసనవలె వారు పరిమళింతురు.౹

8 ఎఫ్రాయిమూ–బొమ్మలతో నాకిక నిమిత్తమేమి? నేనే ఆలకించుచున్నాను, నేనే ఎఫ్రాయిమునుగూర్చి విచారణ చేయుచున్నాను, నేను చిగురుపెట్టు సరళవృక్షమువంటి వాడను, నావలననే నీకు ఫలము కలుగును.౹

9 జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు; ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాని ననుసరించి నడచుకొందురు గాని తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు తొట్రిల్లుదురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/HOS/14-e2622567c683c418925307a0dbb222af.mp3?version_id=1787—

Categories
యోవేలు

యోవేలు 1

1 పెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు

2 పెద్దలారా, ఆలకించుడి

దేశపు కాపురస్థులారా, మీరందరు చెవియొగ్గి వినుడి

ఈలాటి సంగతి మీ దినములలో గాని

మీపితరుల దినములలోగాని జరిగినదా?

3 ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి.వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరమువారిని తెలియజేయుదురు.

4 గొంగళిపురుగులు విడిచినదానిని మిడుతలు తినివేసి

యున్నవి

మిడుతలు విడిచినదానిని పసరుపురుగులు తినివేసి

యున్నవి.

పసరుపురుగులు విడిచినదానిని చీడపురుగులు తినివేసి

యున్నవి.

5 మత్తులారా, మేలుకొని కన్నీరు విడువుడి

ద్రాక్షారసపానము చేయువారలారా, రోదనము

చేయుడి.

క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండ నాశ

మాయెను,

6 లెక్కలేని బలమైన జనాంగమునా దేశము మీదికి

వచ్చియున్నది

వాటి పళ్లు సింహపు కోరలవంటివి

వాటి కాటు ఆడుసింహపు కాటువంటిది.

7 అవి నా ద్రాక్షచెట్లను పాడుచేసియున్నవి

నా అంజూరపు చెట్లను తుత్తునియలుగా కొరికి

యున్నవి

బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్లకొమ్మలు

తెలుపాయెను

8 పెనిమిటి పోయిన యౌవనురాలు గోనెపట్ట కట్టు

కొని అంగలార్చునట్లు నీవు అంగలార్చుము.

9 నైవేద్యమును పానార్పణమును

యెహోవా మందిరములోనికి రాకుండ నిలిచి

పోయెను.

యెహోవాకు పరిచర్యచేయు యాజకులు అంగలార్చుచున్నారు.

10 పొలము పాడైపోయెను

భూమి అంగలార్చుచున్నది ధాన్యము నశించెను

క్రొత్త ద్రాక్షారసము లేకపోయెను తైలవృక్షములు

వాడిపోయెను.

11 భూమిమీది పైరు చెడిపోయెను

గోధుమ కఱ్ఱలను యవల కఱ్ఱలను చూచి సేద్య

గాండ్లారా, సిగ్గునొందుడి.

12 ద్రాక్షతోట కాపరులారా, రోదనము చేయుడి.

ద్రాక్షచెట్లు చెడిపోయెను అంజూరపుచెట్లు వాడి

పోయెను

దానిమ్మచెట్లును ఈతచెట్లును జల్దరుచెట్లును తోట

చెట్లన్నియు వాడిపోయినవి

13 నరులకు సంతోషమేమియు లేకపోయెను.

యాజకులారా, గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి.

బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారలారా,

రోదనము చేయుడి.

నా దేవుని పరిచారకులారా,

గోనెపట్ట వేసికొని రాత్రి అంతయు గడపుడి.

నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిర

మునకు రాకుండ నిలిచిపోయెను.

14 ఉపవాసదినము ప్రతిష్ఠించుడి వ్రతదినము ఏర్పరచుడి

యెహోవాను బతిమాలుకొనుటకై

పెద్దలను దేశములోని జనులందరిని

మీదేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి.

15 ఆహా, యెహోవా దినము వచ్చెనే

అది ఎంత భయంకరమైన దినము!

అది ప్రళయమువలెనే సర్వశక్తునియొద్దనుండి వచ్చును.

16 మనము చూచుచుండగా మన దేవుని మందిరములో

ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయెను

మన ఆహారము నాశనమాయెను.

17 విత్తనము మంటిపెడ్డల క్రింద కుళ్లిపోవుచున్నది

పైరు మాడిపోయినందున ధాన్యపుకొట్లు వట్టి

వాయెను

కళ్లపుకొట్లు నేలపడియున్నవి.

18 మేతలేక పశువులు బహుగా మూల్గుచున్నవి

ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి

గొఱ్ఱెమందలు చెడిపోవుచున్నవి.

19 అగ్నిచేత అరణ్యములోని మేతస్థలములు కాలిపోయినవి

మంట తోటచెట్లన్నిటిని కాల్చివేసెను

యెహోవా, నీకే నేను మొఱ్ఱపెట్టుచున్నాను.

20 నదులు ఎండిపోవుటయు అగ్నిచేత మేతస్థలములు

కాలిపోవుటయు చూచి పశువులును నీకు మొఱ్ఱ

పెట్టుచున్నవి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOL/1-5f3af2d55020208b21d3864f887c5e19.mp3?version_id=1787—

Categories
యోవేలు

యోవేలు 2

1 సీయోను కొండమీద బాకా ఊదుడి

నా పరిశుద్ధపర్వతముమీద హెచ్చరిక నాదము

చేయుడి యెహోవా దినము వచ్చుచున్నదనియు

అది సమీపమాయెననియు దేశనివాసులందరు వణకు

దురుగాక.

2 ఆ దినము అంధకారమయముగా ఉండును మహాంధ

కారము కమ్మును

మేఘములును గాఢాంధకారమును ఆ దినమున కమ్మును

పర్వతములమీద ఉదయకాంతి కనబడునట్లు అవి కన

బడుచున్నవి.

అవి బలమైన యొక గొప్ప సమూహము

ఇంతకుముందు అట్టివి పుట్టలేదు

ఇకమీదట తరతరములకు అట్టివి పుట్టవు.

3 వాటిముందర అగ్ని మండుచున్నది

వాటివెనుక మంట కాల్చుచున్నది

అవి రాకమునుపు భూమి ఏదెనువనమువలె ఉండెను

అవి వచ్చిపోయిన తరువాత తప్పించుకొనినదేదియు

విడువబడక భూమి యెడారివలె పాడాయెను.

4 వాటి రూపములు గుఱ్ఱముల రూపములవంటివి

రౌతులవలె అవి పరుగెత్తి వచ్చును.

5 రథములు ధ్వని చేయునట్లు

కొయ్యకాలు అగ్నిలో కాలుచు ధ్వని చేయునట్లు

యుద్ధమునకు సిద్ధమైన శూరులు ధ్వని చేయునట్లు

అవి పర్వతశిఖరములమీద గంతులు వేయుచున్నవి.

6 వాటిని చూచి జనములు వేదననొందును అందరి ముఖ

ములు తెల్లబారును.

7 బలాఢ్యులు పరుగెత్తునట్లు అవి పరుగెత్తుచున్నవి

శూరులు ప్రాకారములను ఎక్కునట్లు అవి గోడలు

దాటుచున్నవి

ఇటు అటు తిరుగకుండ అవన్నియు చక్కగా పోవుచున్నవి

8 ఒకదానిమీద ఒకటి త్రొక్కులాడక

అవన్నియు చక్కగా పోవుచున్నవి

ఆయుధములమీద పడినను త్రోవ విడువవు.

9 పట్టణములో నఖముఖాల పరుగెత్తుచున్నవి

గోడలమీద ఎక్కి యిండ్లలోనికి చొరబడుచున్నవి.

దొంగలు వచ్చినట్లు కిటికీలలోగుండ జొరబడుచున్నవి.

10 వాటి భయముచేత భూమి కంపించుచున్నది

ఆకాశము తత్తరించుచున్నది సూర్యచంద్రులకు తేజో

హీనత కలుగుచున్నది

నక్షత్రములకు కాంతి తప్పుచున్నది.

11 యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుమువలె

గర్జించుచున్నాడు

ఆయన దండు బహు గొప్పదైయున్నది

ఆయన ఆజ్ఞను నెరవేర్చునది బలముగలది

యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళ

గలవాడెవడు?

12 ఇప్పుడైనను మీరు ఉపవాసముండి

కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా

తిరిగి నాయొద్దకు రండి.

ఇదే యెహోవా వాక్కు

13 మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములుగల వాడును, శాంతమూర్తియు అత్యంతకృపగలవాడునైయుండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములనుకాక మీ హృదయములను చింపుకొని ఆయనతట్టు తిరుగుడి.౹

14 ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును; అనుగ్రహింపడని యెవడు చెప్పగలడు?

15 సీయోనులో బాకా ఊదుడి, ఉపవాసదినము ప్రతి

ష్ఠించుడి,

వ్రతదినము నియమించి ప్రకటనచేయుడి.

16 జనులను సమకూర్చుడి, సమాజకూటము ప్రతిష్ఠించుడి,

పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము

చేయు బిడ్డలను తోడుకొని రండి;

పెండ్లికుమారుడు అంతఃపురములోనుండియు

పెండ్లికుమార్తె గదిలోనుండియు రావలయును.

17 యెహోవాకు పరిచర్యచేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు –యెహోవా, నీ జనులయెడల జాలిచేసికొని, అన్యజనులు వారిమీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానమున కప్పగింపకుము; లేనియెడల అన్యజనులు–వారి దేవుడు ఏమాయెనందురు గదా యని వేడుకొనవలెను.

18 అప్పుడు యెహోవా తన దేశమునుబట్టి రోషము పూని తన జనులయెడల జాలిచేసికొనెను.౹

19 మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా– ఇకను అన్యజనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక, మీరు తృప్తినొందునంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును తైలమును మీకు పంపించెదను

20 మరియు ఉత్తరదిక్కునుండి వచ్చువాటిని మీకు దూరముగా పార దోలి, యెండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును; అవి గొప్ప కార్యములు చేసెను గనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రములోకిని, వెనుకటి భాగమును పడమటి సముద్రములోకిని పడగొట్టుదును; అక్కడ వాటి దుర్గంధము లేచును అవి కుళ్లు వాసన కొట్టును.౹

21 దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్పకార్యములు చేసెను.౹

22 పశువులారా, భయపడకుడి, గడ్డిబీళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపుచెట్లును, ద్రాక్షచెట్లు సమృద్ధిగా ఫలించును,౹

23 సీయోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవాయందు సంతోషించుడి; తన నీతినిబట్టి ఆయన తొలకరి వర్షమును మీకనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందువలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకనుగ్రహించును

24 కొట్లు ధాన్యముతో నిండును, కొత్త ద్రాక్షారసమును క్రొత్త తైలమును గానుగలకుపైగా పొర్లి పారును.౹

25 మీరు కడుపార తిని తృప్తిపొంది మీకొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడుతలును గొంగళి పురుగులును పసరు పురుగులును చీడపురుగులును అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరల నిత్తును.౹

26 నా జనులు ఇక నెన్నటికిని సిగ్గునొందరు.౹

27 అప్పుడు ఇశ్రాయేలీయులమధ్య నున్నవాడను నేనే యనియు, నేనే మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడొకడును లేడనియు మీరు తెలిసికొందురు; నా జనులు ఇక నెన్నడును సిగ్గునొందకయుందురు.

28 తరువాత నేను సర్వజనులమీద నా ఆత్మను కుమ్మ రింతును; మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచనములు చెప్పుదురు; మీ ముసలివారు కలలుకందురు, మీ యౌవనులు దర్శనములు చూతురు.౹

29 ఆ దినములలో నేను పనివారిమీదను పనికత్తెలమీదను నా ఆత్మను కుమ్మ రింతును.౹

30 మరియు ఆకాశమందును భూమియందును మహత్కార్యములను, అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనుపరచెదను

31 యెహోవాయొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజో హీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును.౹

32 యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండమీదను యెరూషలేములోను తప్పించుకొనినవారుందురు, శేషించినవారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమునుబట్టి ఆయనకు ప్రార్థనచేయు వారందరును రక్షింపబడుదురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOL/2-62883af4b2231be392551bdbcab38711.mp3?version_id=1787—

Categories
యోవేలు

యోవేలు 3

1 ఆ దినములలో, –అనగా యూదావారిని యెరూషలేము కాపురస్థులను నేను చెరలోనుండి రప్పించు కాలమున

2 అన్యజనులనందరిని సమకూర్చి, యెహోషాపాతు లోయలోనికి తోడుకొనిపోయి, వారు ఆయా దేశములలోనికి నా స్వాస్థ్యమగు ఇశ్రాయేలీయులను చెదరగొట్టి, నా దేశమును తాము పంచుకొనుటనుబట్టి నా జనులపక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యెమాడుదును.౹

3 వారు నా జనులమీద చీట్లువేసి, వేశ్యకు బదులుగా ఒక బాలుని ఇచ్చి ద్రాక్షారసము కొనుటకై యొక చిన్నదానిని ఇచ్చి త్రాగుచు వచ్చిరి గదా?

4 తూరు పట్టణమా, సీదోనుపట్టణమా, ఫిలిష్తీయ ప్రాంత వాసులారా, మీతో నాకు పనియేమి? నేను చేసినదానికి మీరు నాకు ప్రతికారము చేయుదురా? మీరు నా కేమైన చేయుదురా?

5 నా వెండిని నా బంగారమును మీరు పట్టుకొనిపోతిరి; నాకు ప్రియమైన మంచి వస్తువులను పట్టుకొనిపోయి మీ గుళ్లలో ఉంచుకొంటిరి.౹

6 యూదావారిని యెరూషలేము పట్టణపువారిని తమ సరిహద్దులకు దూరముగా నివసింపజేయుటకై మీరు వారిని గ్రేకీయులకు అమ్మివేసితిరి; మీరు చేసినదానిని బహు త్వరగా మీ నెత్తిమీదికి రప్పించెదను.౹

7 ఇదిగో మీరు చేసిన దానిని మీ నెత్తిమీదికి రాజేయుదును; మీరు వారిని అమ్మి పంపివేసిన ఆయా స్థలములలోనుండి నేను వారిని రప్పింతును

8 మీ కుమారులను కుమార్తెలను యూదావారికి అమ్మివేయింతును; వారు దూరముగా నివసించు జనులైన షెబాయీయులకు వారిని అమ్మివేతురు; యెహోవా సెలవిచ్చిన మాట యిదే.

9 అన్యజనులకు ఈ సమాచారము ప్రకటనచేయుడి–యుద్ధము ప్రతిష్ఠించుడి, బలాఢ్యులను రేపుడి, యోధులందరు సిద్ధపడి రావలెను.౹

10 మీ కఱ్ఱులు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి; బలహీనుడు–నేను బలాఢ్యుడను అనుకొనవలెను.౹

11 చుట్టుపెట్లనున్న అన్యజనులారా, త్వరపడి రండి; సమకూడి రండి. యెహోవా, నీ పరాక్రమశాలురను ఇక్కడికి తోడుకొని రమ్ము.౹

12 నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడనగుదును; అన్యజనులు లేచి అచ్చటికిరావలెను

13 పైరు ముదిరినది, కొడవలిపెట్టి కోయుడి; గానుగ నిండియున్నది; తొట్లు పొర్లి పారుచున్నవి, జనుల దోషము అత్యధిక మాయెను, మీరు దిగి రండి.౹

14 తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవాదినము వచ్చే యున్నది; తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి యున్నారు.౹

15 సూర్య చంద్రులు తేజోహీనులైరి; నక్షత్రముల కాంతి తప్పిపోయెను.౹

16 యెహోవా సీయోనులోనుండి గర్జించుచున్నాడు; యెరూషలేములోనుండి తన స్వరము వినబడజేయుచున్నాడు; భూమ్యాకాశములు వణకుచున్నవి. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయ మగును, ఇశ్రాయేలీయులకు దుర్గముగా ఉండును.౹

17 అన్యు లికమీదట దానిలో సంచరింపకుండ యెరూషలేము పరిశుద్ధపట్టణముగా ఉండును; మీ దేవుడనైన యెహోవాను నేనే, నాకు ప్రతిష్ఠితమగు సీయోను పర్వతమందు నివసించుచున్నానని మీరు తెలిసికొందురు.౹

18 ఆ దినమందు పర్వతములలోనుండి క్రొత్త ద్రాక్షారసము పారును, కొండలలోనుండి పాలు ప్రవహించును. యూదా నదులన్నిటిలో నీళ్లు పారును, నీటి ఊట యెహోవా మందిరములోనుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును.౹

19 ఐగుప్తీయులును ఎదోమీయులును యూదావారిమీద బలాత్కారముచేసి తమతమ దేశములలో నిర్దోషులగు వారికి ప్రాణహాని కలుగజేసిరి గనుక ఐగుప్తుదేశము పాడగును, ఎదోముదేశము నిర్జనమైన ఎడారిగా ఉండును.౹

20 ఈలాగున నేను ఇంతకుముందు ప్రతికారము చేయని ప్రాణదోషమునకై ప్రతికారము చేయుదును.౹

21 అయితే యూదాదేశములో నివాసులు నిత్యముందురు, తరతరములకు యెరూషలేము నివాసముగా నుండును, యెహోవా సీయోనులో నివాసిగా వసించును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOL/3-c722863783a453d27494bda36bfd8d71.mp3?version_id=1787—

Categories
ఆమోసు

ఆమోసు 1

1 యూదారాజైన ఉజ్జియా దినములలోను, ఇశ్రాయేలు రాజగు యెహోయాషు కుమారుడైన యరొబాము దినములలోను, భూకంపము కలుగుటకు రెండు సంవత్సరములు ముందు, ఇశ్రాయేలీయులనుగూర్చి తెకోవలోని పసుల కాపరులలో ఆమోసునకు కనబడిన దర్శన వివరము.

2 అతడు ప్రకటించినదేమనగా–యెహోవా సీయోనులోనుండి గర్జించుచున్నాడు, యెరూషలేములోనుండి తన స్వరము వినబడజేయుచున్నాడు; కాపరులు సంచరించు మేతభూములు దుఃఖించుచున్నవి, కర్మెలు శిఖరము ఎండి పోవుచున్నది.

3 యెహోవా సెలవిచ్చునదేమనగా–దమస్కు మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ దాని శిక్షింతును; ఏలయనగా దాని జనులు పంట దుళ్లగొట్టు ఇనుపపనిముట్లతో గిలాదును నూర్చిరి.౹

4 నేను హజాయేలు మందిరములో అగ్ని వేసెదను; అది బెన్హదదుయొక్క నగరులను దహించివేయును;౹

5 దమస్కుయొక్క అడ్డగడియలను విరిచెదను, ఆవెను లోయలోనున్న నివాసులను నిర్మూలము చేతును, బెతేదేనులో ఉండకుండ రాజదండము వహించినవానిని నిర్మూలము చేతును, సిరియనులు చెరపట్టబడి కీరు దేశమునకు కొనిపోబడుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

6 యెహోవా సెలవిచ్చునదేమనగా–గాజా మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ దాని శిక్షింతును; ఏలయనగా ఎదోము వారి కప్పగింపవలెనని తాము చెరపెట్టినవారినందరిని కొనిపోయిరి.౹

7 గాజాయొక్క ప్రాకారముమీద నేను అగ్ని వేసెదను, అది వారి నగరులను దహించివేయును;౹

8 అష్డోదులో నివాసులను నిర్మూలము చేతును, అష్కెలోనులో రాజదండము వహించినవాడుండకుండ నిర్మూలముచేతును, ఇంకను శేషించియున్న ఫిలిష్తీయులును క్షయమగునట్లు నేను ఎక్రోనును మొత్తెదనని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

9 యెహోవా సెలవిచ్చునదేమనగా–తూరు మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ దానిని శిక్షింతును; ఏలయనగా దాని జనులు సహో దర నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొనక పట్టబడినవారినందరిని ఎదోమీయులకు అప్పగించిరి.౹

10 నేను తూరు ప్రాకారములమీద అగ్ని వేసెదను, అది దాని నగరులను దహించివేయును.

11 యెహోవా సెలవిచ్చునదేమనగా–ఎదోము మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ వానిని శిక్షింతును. ఏలయనగా వాడు కనికరము చాలించుకొని ఖడ్గము పట్టుకొని యెడతెగని కోపముతో తనకు సహోదరులగువారిని మానక చీల్చుచు వచ్చెను.౹

12 తేమానుమీద అగ్ని వేసెదను, అది బొస్రాయొక్క నగరులను దహించివేయును.

13 యెహోవా సెలవిచ్చునదేమనగా–అమ్మోనీయులు మూడుసార్లు నాలుగుసార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ వారిని శిక్షింతును; ఏలయనగా తమ సరిహద్దులను మరి విశాలము చేయదలచి, గిలాదులోని గర్భిణి స్త్రీల కడుపులను చీల్చిరి.౹

14 రబ్బాయొక్క ప్రాకారము మీద నేను అగ్ని రాజబెట్టుదును; రణకేకలతోను, సుడి గాలి వీచునప్పుడు కలుగు ప్రళయమువలెను అది దాని నగరులమీదికి వచ్చి వాటిని దహించివేయును.౹

15 వారి రాజును అతని అధిపతులును అందరును చెరలోనికి కొని పోబడుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/AMO/1-a16e229e7ac90c59b89f775fe0208ade.mp3?version_id=1787—