Categories
యిర్మీయా

యిర్మీయా 36

1 యూదారాజైన యోషీయా కుమారుడగు యెహోయాకీము నాలుగవ సంవత్సరమున యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

2 – నీవు పుస్తకపుచుట్ట తీసికొని నేను నీతో మాటలాడిన దినము మొదలుకొని, అనగా యోషీయా కాలము మొదలుకొని నేటివరకు ఇశ్రాయేలువారినిగూర్చియు యూదావారిని గూర్చియు సమస్త జనములనుగూర్చియు నేను నీతో పలి కిన మాటలన్నిటిని దానిలో వ్రాయుము.౹

3 నేను యూదావారికి చేయనుద్దేశించు కీడంతటినిగూర్చి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించునట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపపడుదురేమో.౹

4 యిర్మీయా నేరీయా కుమారుడైన బారూకును పిలువనంపగా అతడు యెహోవా యిర్మీయాతో చెప్పిన మాటలన్నిటిని యిర్మీయా నోటిమాటలనుబట్టి ఆ పుస్తకములో వ్రాసెను.౹

5 యిర్మీయా బారూకునకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను–నేను యెహోవా మందిరములోనికి రాకుండ నిర్బంధింపబడితిని.౹

6 కాబట్టి నీవు వెళ్లి ఉపవాసదినమున యెహోవా మందిరములో ప్రజలకు వినబడునట్లు నేను చెప్పగా నీవు పుస్తకములో వ్రాసిన యెహోవా మాటలను చదివి వినిపించుము, తమ పట్టణములనుండి వచ్చు యూదా జనులందరికిని వినబడునట్లుగా వాటిని చదివి వినిపింపవలెను.౹

7 ఒకవేళ వారి విన్నపములు యెహోవా దృష్టికి అనుకూలమగునేమో, ఒక వేళ వారు తమ చెడుమార్గము విడుతురేమో, నిజముగా ఈ ప్రజలమీదికి ఉగ్రతయు మహా కోపమును వచ్చునని యెహోవా ప్రకటించియున్నాడు.౹

8 ప్రవక్తయైన యిర్మీయా తనకు ఆజ్ఞ ఇచ్చినట్టు నేరీయా కుమారుడైన బారూకు గ్రంథము చేతపట్టుకొని యెహోవా మాటలన్నిటిని యెహోవా మందిరములో చదివి వినిపించెను.

9 యూదారాజైన యోషీయా కుమారుడగు యెహోయాకీము ఏలుబడియందు అయిదవ సంవత్సరము తొమ్మిదవ నెలను యెరూషలేములోనున్న ప్రజలందరును యూదా పట్టణములలోనుండి యెరూషలేమునకు వచ్చిన ప్రజలందరును యెహోవాపేరట ఉపవాసము చాటింపగా

10 బారూకు యెహోవా మందిరములో లేఖికుడైన షాఫాను కుమారుడైన గెమర్యా గదికి పైగానున్న శాలలో యెహోవా మందిరపు క్రొత్త ద్వారపు ప్రవేశమున ప్రజలందరు వినునట్లు యిర్మీయా చెప్పిన మాటలను గ్రంథములోనుండి చదివి వినిపించెను.౹

11 షాఫాను కుమారుడైన గెమర్యా కుమారుడగు మీకాయా ఆ గ్రంథములోని యెహోవా మాటలన్నిటిని విని

12 రాజనగరులోనున్న లేఖికుని గదిలోనికి వెళ్లగా ప్రధానులందరును లేఖికుడైన ఎలీషామా షెమాయా కుమారుడైన దెలాయ్యా అక్బోరు కుమారుడైన ఎల్నాతాను షాఫాను కుమారుడైన గెమర్యా హనన్యా కుమారుడైన సిద్కియా అనువారును ప్రధానులందరును అక్కడ కూర్చుండి యుండిరి.౹

13 బారూకు ప్రజలందరికి వినబడునట్లు ఆ పుస్తకములోనుండి చదివి వినిపించిన మాటలన్నిటిని మీకాయా వారికి తెలియ జెప్పగా

14 ప్రధానులందరు కూషీకి ఇనుమనుమడును షెలెమ్యాకు మనుమడును నెతన్యాకు కుమారుడునైన యెహూదిని బారూకు నొద్దకు పంపి–నీవు ప్రజల వినికిడిలో చదివిన పుస్తకమును చేతపట్టుకొని రమ్మని ఆజ్ఞ నియ్యగా నేరీయా కుమారుడగు బారూకు ఆ గ్రంథమును చేతపట్టుకొని వచ్చెను.౹

15 అతడు రాగా వారు–నీవు కూర్చుండి మాకు వినిపింపుమనగా బారూకు దాని చదివి వినిపించెను.౹

16 వారు ఆ మాటలన్నిటిని విన్నప్పుడు భయపడి యొకరి నొకరు చూచుకొని–మేము నిశ్చయముగా ఈ మాట లన్నిటిని రాజునకు తెలియజెప్పెదమని బారూకుతో ననిరి.౹

17 మరియు–ఈ మాటలన్నిటిని అతడు చెప్పుచుండగా నీవు ఎట్లు వ్రాసితివి? అది మాకు తెలియజెప్పుమని వారడుగగా

18 బారూకు–అతడు నోటనుండియే యీ మాటలన్నిటిని పలుకగా నేను పుస్తకములో వాటిని సిరాతో వ్రాసితినని వారితో ఉత్తరమిచ్చెను.౹

19 నీవును యిర్మీయాయును పోయి దాగియుండుడి, మీరున్నచోటు ఎవరికిని తెలియజేయవద్దని ఆ ప్రధానులు చెప్పి

20 శాలలోనున్న రాజునొద్దకు తామే వెళ్లి ఆ మాటలన్నిటిని రాజు చెవులలో వినిపించిరి గాని ఆ పుస్తకపుచుట్టను లేఖికుడైన ఎలీషామా గదిలో దాచిపెట్టిరి.౹

21 ఆ గ్రంథమును తెచ్చుటకు రాజు యెహూదిని పంపగా అతడు లేఖకుడైన ఎలీ షామా గదిలోనుండి దాని తీసికొని వచ్చి రాజు వినికిడిలోను రాజనొద్దకు నిలిచియున్న అధిపతులందరి వినికిడిలోను దాని చదివెను.౹

22 తొమ్మిదవ మాసమున రాజు శీత కాలపు నగరులో కూర్చుండియుండగా అతని ముందర కుంపటిలో అగ్ని రగులుచుండెను.౹

23 యెహూది మూడు నాలుగు పుటలు చదివిన తరువాత రాజు చాకుతో దాని కోసి కుంపటిలో వేయగా ఆ కుంపటిలో నున్న అగ్నిచేత అది బొత్తిగా కాలిపోయెను గాని

24 రాజైనను ఈ మాట లన్నిటిని వినిన యతని సేవకులలో ఎవరైనను భయపడ లేదు, తమ బట్టలు చింపుకొనలేదు.౹

25 –గ్రంథమును కాల్చవద్దని ఎల్నాతానును దెలాయ్యాయును గెమర్యాయును రాజుతో మనవిచేయగా అతడు వారి విజ్ఞాపనము వినకపోయెను.౹

26 లేఖకుడైన బారూకును ప్రవక్తయైన యిర్మీయాను పట్టుకొనవలెనని రాజవంశస్థుడగు యెరహ్మెయేలునకును అజ్రీయేలు కుమారుడైన శెరాయాకును అబ్దెయేలు కుమారుడైన షెలెమ్యాకును రాజు ఆజ్ఞాపించెను గాని యెహోవావారిని దాచెను.

27 యిర్మీయా నోటిమాటనుబట్టి బారూకు వ్రాసిన గ్రంథమును రాజు కాల్చిన తరువాత యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

28 –నీవు మరియొక గ్రంథము తీసికొని యూదారాజైన యెహోయాకీము కాల్చిన మొదటి గ్రంథములో వ్రాయబడిన మాటలన్నిటిని దానిలో వ్రాయుము.౹

29 మరియు యూదా రాజైన యెహోయాకీమునుగూర్చి నీవీమాట చెప్పవలెను–యెహోవా సెలవిచ్చునదేమనగా–బబులోనురాజు నిశ్చయముగా వచ్చి యీ దేశమును పాడుచేసి అందులో మనుష్యులైనను జంతువులైనను ఉండకుండ చేయునని ఇందులో నీవేల వ్రాసితివని చెప్పి నీవు ఈ గ్రంథమును కాల్చివేసితివే;౹

30 అందుచేతను యూదారాజైన యెహోయాకీమునుగూర్చి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–దావీదుయొక్క సింహాసనముమీద ఆసీనుడగుటకు అతనికి ఎవడును లేకపోవును, అతని శవము పగలు ఎండపాలు రాత్రి మంచుపాలునగును.౹

31 నేను వారి దోషమునుబట్టి అతనిని అతని సంతతిని అతని సేవకులను శిక్షించుచున్నాను. నేను వారినిగూర్చి చెప్పిన కీడంతయు వారిమీదికిని యెరూషలేము నివాసులమీదికిని యూదా జనులమీదికిని రప్పించుచున్నాను; అయినను వారు వినినవారుకారు.౹

32 యిర్మీయా యింకొక గ్రంథమును తీసికొని లేఖికుడగు నేరియా కుమారుడైన బారూకుచేతికి అప్పగింపగా అతడు యిర్మీయా నోటిమాటలనుబట్టి యూదారాజైన యెహోయాకీము అగ్నిలో కాల్చిన గ్రంథపు మాటలన్నిటిని వ్రాసెను; మరియు ఆ మాటలు గాక అట్టివి అనేకములు అతడు వాటితో కూర్చెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/36-cafe144e9ca6e307e872d55cabf66735.mp3?version_id=1787—

Categories
యిర్మీయా

యిర్మీయా 37

1 బబులోను రాజైన నెబుకద్రెజరు యూదా దేశములో రాజుగా నియమించిన యోషీయా కుమారుడగు సిద్కియా యెహోయాకీము కుమారుడైన కొన్యాకు ప్రతిగా రాజ్యముచేయుచుండెను.౹

2 అతడైనను అతని సేవకులైనను దేశప్రజలైనను యెహోవా ప్రవక్తయైన యిర్మీయాచేత సెలవిచ్చిన మాటలను లక్ష్యపెట్టలేదు.

3 రాజైన సిద్కియా షెలెమ్యా కుమారుడైన యెహు కలును యాజకుడైన మయశేయా కుమారుడగు జెఫన్యాను ప్రవక్తయైన యిర్మీయాయొద్దకు పంపి–దయచేసి మన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయుమని మనవిచేసెను.౹

4 అప్పటికి వారు యిర్మీయాను చెరసాలలో నుంచియుండ లేదు; అతడు ప్రజలమధ్య సంచరించుచుండెను.౹

5 ఫరో దండు ఐగుప్తులోనుండి బయలుదేరగా యెరూషలేమును ముట్టడివేయుచున్న కల్దీయులు సమాచారము విని యెరూషలేము దగ్గరనుండి బయలుదేరిరి.౹

6 అప్పుడు యెహోవా వాక్కు ప్రవక్తయైన యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

7 ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా–నాయొద్ద విచారించుడని నిన్ను నా యొద్దకు పంపిన యూదారాజుతో నీ వీలాగు చెప్పవలెను–మీకు సహాయము చేయుటకై బయలుదేరి వచ్చు చున్న ఫరోదండు తమ స్వదేశమైన ఐగుప్తులోనికి తిరిగి వెళ్లును.౹

8 కల్దీయులు తిరిగి వచ్చి యీ పట్టణముమీద యుద్ధముచేసి దాని పట్టుకొని అగ్నిచేత కాల్చివేయుదురు.౹

9 యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–కల్దీయులు నిశ్చయముగా మాయొద్దనుండి వెళ్లెదరనుకొని మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుడి, వారు వెళ్లనే వెళ్లరు.౹

10 మీతో యుద్ధముచేయు కల్దీయుల దండువారినందరిని మీరు హతముచేసి వారిలో గాయపడిన వారిని మాత్రమే మిగిలించినను వారే తమ గుడారములలోనుండి వచ్చి యీ పట్టణమును అగ్నితో కాల్చివేయుదురు.

11 ఫరో దండునకు భయపడి కల్దీయుల దండు యెరూషలేము ఎదుటనుండి వెళ్లిపోగా

12 యిర్మీయా బెన్యామీను దేశములో తనవారియొద్ద భాగము తీసికొనుటకై యెరూషలేమునుండి బయలుదేరి అక్కడికి పోయెను. అతడు బెన్యామీను గుమ్మమునొద్దకు రాగా

13 ఇరీయా అను కావలివారి అధిపతి అక్కడ నుండెను. అతడు హనన్యా కుమారుడైన షెలెమ్యా కుమారుడు. అతడు ప్రవక్తయైన యిర్మీయాను పట్టుకొని–నీవు కల్దీయులలో చేరబోవుచున్నావని చెప్పగా

14 యిర్మీయా–అది అబద్ధము, నేను కల్దీయులలో చేరబోవుటలేదనెను. అయితే అతడు యిర్మీయామాట నమ్మనందున ఇరీయా యిర్మీయాను పట్టుకొని అధిపతులయొద్దకు తీసికొని వచ్చెను.౹

15 అధిపతులు యిర్మీయామీద కోపపడి అతని కొట్టి, తాము బందీగృహముగా చేసియున్న లేఖికుడైన యోనాతాను ఇంటిలో అతని వేయించిరి.౹

16-17 యిర్మీయా చెరసాల గోతిలో వేయబడి అక్కడ అనేక దినములు ఉండెను; పిమ్మట రాజైన సిద్కియా అతని రప్పించుటకు వర్తమానము పంపి, అతని తన యింటికి పిలిపించి–యెహోవాయొద్దనుండి ఏ మాటై నను వచ్చెనా అని యడుగగా యిర్మీయా–నీవు బబులోను రాజుచేతికి అప్పగింపబడెదవను మాటవచ్చెననెను.౹

18 మరియు యిర్మీయా రాజైన సిద్కియాతో ఇట్లనెను–నేను నీకైనను నీ సేవకులకైనను ఈ ప్రజలకైనను ఏ పాపము చేసినందున నన్ను చెరసాలలో వేసితివి?

19 బబులోను రాజు మీమీది కైనను ఈ దేశముమీదికైనను రాడని మీకు ప్రకటించిన మీ ప్రవక్తలు ఎక్కడనున్నారు?

20 రాజా, నా యేలినవాడా, చిత్తగించి వినుము, చిత్తగించి నా మనవి నీ సన్ని ధికి రానిమ్ము, నేను అక్కడ చనిపోకుండునట్లు లేఖకుడైన యోనాతాను ఇంటికి నన్ను మరల పంపకుము.౹

21 కాబట్టి రాజైన సిద్కియా సెలవియ్యగా బంటులు బందీగృహ శాలలో యిర్మీయాను వేసి, పట్టణములో రొట్టెలున్నంతవరకు రొట్టెలు కాల్చువారి వీధిలోనుండి అనుదినము ఒక రొట్టె అతనికిచ్చుచు వచ్చిరి; ఇట్లు జరుగగా యిర్మీయా బందీగృహశాలలో నివసించెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/37-37a8755e99c8c3f0f90e10cd0d30846a.mp3?version_id=1787—

Categories
యిర్మీయా

యిర్మీయా 38

1 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఈ పట్టణములో నిలిచియున్నవారు ఖడ్గముచేతనైనను క్షామముచేతనైనను తెగులుచేతనైనను చత్తురు గాని కల్దీయులయొద్దకు బయలు వెళ్లువారు బ్రదుకుదురు, దోపుడుసొమ్ముదక్కించు కొనునట్లు తమ ప్రాణము దక్కించుకొని వారు బ్రదుకుదురు.౹

2 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఈ పట్టణము నిశ్చయముగా బబులోనురాజు దండుచేతికి అప్పగింపబడును, అతడు దాని పట్టుకొనును అని యిర్మీయా ప్రజలకందరికి ప్రకటింపగా

3-4 మత్తాను కుమారుడైన షెఫట్యయును పషూరు కుమారుడైన గెదల్యాయును షెలెమ్యా కుమారుడైన యూకలును మల్కీయా కుమారుడైన పషూరును వినిరి గనుక ఆ ప్రధానులు రాజుతో మనవి చేసిన దేమనగా–ఈ మనుష్యుడు ఈ ప్రజలకు నష్టము కోరు వాడేగాని క్షేమము కోరువాడుకాడు. ఇతడు ఇట్టి సమాచారము వారికి ప్రకటన చేయుటవలన ఈ పట్టణములో నిలిచియున్న యోధుల చేతులను ప్రజలందరి చేతులను బలహీనముచేయుచున్నాడు; చిత్తగించి వానికి మరణశిక్ష విధింపుము.౹

5 అందుకు రాజైన సిద్కియా– అతడు మీవశమున ఉన్నాడు, రాజు మీకు అడ్డము రాజాలడనగా

6 వారు యిర్మీయాను పట్టుకొని కారా గృహములోనున్న రాజకుమారుడగు మల్కీయా గోతిలోనికి దింపిరి. అందులోనికి యిర్మీయాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురదమాత్రమే యుండెను, ఆ బురదలో యిర్మీయా దిగబడెను.౹

7-8 రాజు బెన్యామీను ద్వారమున కూర్చునియుండగా రాజు ఇంటి లోని కూషీయుడగు ఎబెద్మెలెకను షండుడు, వారు యిర్మీయాను గోతిలో వేసిరను సంగతి విని, రాజు నగరులోనుండి బయలువెళ్లి రాజుతో ఈలాగు మనవి చేసెను

9 రాజా, నా యేలినవాడా, ఆ గోతిలో వేయబడిన యిర్మీయా అను ప్రవక్తయెడల ఈ మనుష్యులు చేసినది యావత్తును అన్యాయము; అతడున్న చోటను అతడు ఆకలిచేత చచ్చును, పట్టణములోనైనను ఇంకను రొట్టె లేమియు లేవు.౹

10 అందుకు రాజు–నీవు ఇక్కడనుండి ముప్పదిమంది మనుష్యులను వెంటబెట్టుకొనిపోయి, ప్రవక్తయైన యిర్మీయా చావకమునుపు ఆ గోతిలోనుండి అతని తీయించుమని కూషీయుడగు ఎబెద్మెలెకునకు సెలవియ్యగా

11-12 ఎబెద్మెలెకు ఆ మనుష్యులను వెంటబెట్టుకొని రాజనగరులో ఖజానా క్రింది గదిలోనికి వచ్చి, అచ్చటనుండి పాతవైన చింకిబట్టలను చిరిగి చీరాకులైన గుడ్డపాతలను తీసికొనిపోయి, ఆ గోతిలోనున్న యిర్మీయా పట్టుకొనునట్లుగా త్రాళ్లచేత వాటినిదింపి–పాతవై చిరిగి చీరాకులైన యీ బట్టలను త్రాళ్లమీద నీ చంకలక్రింద పెట్టుకొనుమని అతనితో చెప్పెను.౹

13 యిర్మీయా ఆలాగు చేయగా వారు యిర్మీయాను త్రాళ్లతో చేదుకొని ఆ గోతిలోనుండి వెలుపలికి తీసిరి; అప్పుడు యిర్మీయా బందీగృహశాలలో నివసించెను.

14 తరువాత రాజైన సిద్కియా యెహోవా మందిరములోనున్న మూడవ ద్వారములోనికి ప్రవక్తయైన యిర్మీయాను పిలువనంపించి అతనితో ఇట్లనెను–నేను ఒకమాట నిన్నడుగుచున్నాను, నీవు ఏ సంగతిని నాకు మరుగు చేయక దాని చెప్పుమనగా

15 యిర్మీయా–నేను ఆ సంగతి నీకు తెలియజెప్పినయెడల నిశ్చయముగా నీవు నాకు మరణశిక్ష విధింతువు, నేను నీకు ఆలోచన చెప్పినను నీవు నా మాట వినవు.౹

16 కావున రాజైన సిద్కియా–జీవాత్మను మన కనుగ్రహించు యెహోవాతోడు నేను నీకు మరణము విధింపను, నీ ప్రాణము తీయజూచుచున్న యీ మనుష్యుల చేతికి నిన్ను అప్పగింపను అని యిర్మీయాతో రహ స్యముగా ప్రమాణము చేసెను.౹

17 అప్పుడు యిర్మీయా సిద్కియాతో ఇట్లనెను–దేవుడు, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నీవు బబులోనురాజు అధిపతులయొద్దకు వెళ్లినయెడల నీవు బ్రదికెదవు, ఈపట్టణము అగ్నిచేత కాల్చ బడదు, నీవును నీ యింటివారును బ్రదుకుదురు.౹

18 అయితే నీవు బబులోను అధిపతుల యొద్దకు వెళ్లనియెడల ఈ పట్టణము కల్దీయుల చేతికి అప్పగింపబడును, వారు అగ్నిచేత దాని కాల్చివేసెదరు, మరియు నీవు వారి చేతిలోనుండి తప్పించుకొనజాలవు.౹

19 అందుకు రాజైన సిద్కియా యిర్మీయాతో ఇట్లనెను–కల్దీయుల పక్షముగాఉండు యూదులకు భయపడుచున్నాను; ఒకవేళ కల్దీయులు నన్ను వారి చేతికి అప్పగించినయెడల వారు నన్ను అపహ సించెదరు.౹

20 అందుకు యిర్మీయా–వారు నిన్నప్పగింపరు, నీవు బ్రదికి బాగుగానుండునట్లు నేను నీతో చెప్పుచున్న సంగతినిగూర్చి యెహోవా సెలవిచ్చు మాటను చిత్తగించి ఆలకించుము.౹

21 నీవు ఒకవేళ బయలు వెళ్లక పోయినయెడల యెహోవా ఈ మాట నాకు తెలియజేసెను.౹

22 –యూదా రాజు నగరులో శేషించియున్న స్త్రీలందరు బబులోను అధిపతులయొద్దకు కొనిపోబడెదరు, ఆలాగు జరుగగా ఆ స్ర్రీలు నిన్ను చూచి–నీ ప్రియస్నేహితులు నిన్ను మోసపుచ్చి నీ పైని విజయము పొందియున్నారు, నీ పాదములు బురదలో దిగబడియుండగా వారు వెనుకతీసిరనియందురు.౹

23 నీ భార్యలందరును నీ పిల్లలును కల్దీయులయొద్దకు కొనిపోబడుదురు, నీవు వారి చేతిలోనుండి తప్పించుకొనజాలక బబులోను రాజుచేత పట్టబడెదవు గనుక ఈ పట్టణమును అగ్నిచేత కాల్చుటకు నీవే కారణమగుదువు.౹

24 అందుకు సిద్కియా యిర్మీయాతో ఇట్లనెను–నీవు మరణశిక్ష నొందకుండునట్లు ఈ సంగతులను ఎవనికిని తెలియనియ్యకుము.౹

25 నేను నీతో మాటలాడిన సంగతి అధిపతులు వినినయెడల వారు నీయొద్దకు వచ్చి–మేము నిన్ను చంపకుండునట్లు రాజుతో నీవు చెప్పిన సంగతిని రాజు నీతో చెప్పిన సంగతిని మరుగుచేయక మాకిప్పుడే తెలియజెప్పుమనగా

26 నీవు–యోనాతాను ఇంటిలో నేను చనిపోకుండ అక్కడికి నన్ను తిరిగి వెళ్లనంపవద్దని రాజు ఎదుట నేను మనవి చేసికొనబోతినని వారితో చెప్పుమని రాజు యిర్మీయాతో అనెను.౹

27 అంతట అధిపతులందరు యిర్మీయాయొద్దకు వచ్చి యడుగగా అతడు రాజు సెలవిచ్చిన మాటల ప్రకారముగా వారికి ఉత్తరమిచ్చి ఆ సంగతి వారికి తెలియజేయ నందునవారు అతనితో మాటలాడుట మానిరి.౹

28 యెరూషలేము పట్టబడువరకు యిర్మీయా బందీగృహశాలలో ఉండెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/38-0b5c263dbc3942693e99401188953d33.mp3?version_id=1787—

Categories
యిర్మీయా

యిర్మీయా 39

1 యూదారాజైన సిద్కియా యేలుబడియందు . తొమ్మిదవ సంవత్సరము పదియవ నెలలో బబులోను రాజైన నెబుకద్రెజరు తన సమస్త సైన్యముతో యెరూషలేము మీదికివచ్చి దాని ముట్టడివేయగా

2 సిద్కియా యేలుబడియందు పదకొండవ సంవత్సరము నాలుగవ నెల తొమ్మిదవదినమున పట్టణ ప్రాకారములు పడగొట్టబడెను.౹

3 యెరూషలేము పట్టబడగా అధిపతులందరు, నేర్గల్‌షరేజరు సమ్గర్నెబో షండుల కధిపతియగు శర్సెకీము, జ్ఞానులకధిపతియగు నేర్గల్‌షరేజరు మొదలైన బబులోనురాజు అధిపతులందరు లోపలికి వచ్చి మధ్యగుమ్మములో కూర్చుండిరి.౹

4 యూదులరాజైన సిద్కియాయు అతని యోధులందరును వారినిచూచి పారిపోయి, రాజు తోటమార్గమున రెండు గోడలమధ్యనున్న గుమ్మపుమార్గమున పోయిరి గాని రాజు మైదానపు మార్గమున వెళ్లిపోయెను.౹

5 అయితే కల్దీయుల సేన వారిని తరిమి యెరికో దగ్గరనున్న మైదానములలో సిద్కియాను కలిసికొని పట్టుకొని, రాజు అతనికి శిక్ష విధింపవలెనని హమాతు దేశములో రిబ్లా పట్టణము దగ్గర నున్న బబులోను రాజైన నెబుకద్రెజరునొద్దకు వారు సిద్కియాను తీసికొనిపోయిరి

6 బబులోనురాజు రిబ్లా పట్టణములో సిద్కియా కుమారులను అతని కన్నులయెదుట చంపించెను, మరియు బబులోనురాజు యూదా ప్రధానులందరిని చంపించెను.౹

7 అంతట అతడు సిద్కియా కన్నులు ఊడదీయించి అతని బబులోనునకు తీసికొనిపోవుటకై సంకెళ్లతో బంధించెను.౹

8 కల్దీయులు రాజనగరును ప్రజలయిండ్లను అగ్నిచేత కాల్చివేసి యెరూషలేము ప్రాకారములను పడగొట్టిరి.౹

9 అప్పుడు రాజదేహ సంరక్షకులకధిపతియగు నెబూజరదాను శేషించి పట్టణములో నిలిచియున్న ప్రజలను, ద్రోహులై తమ రాజును విడిచి తనతో చేరినవారిని, శేషించిన ప్రజలనందరిని బబులోనునకు కొనిపోయెను.౹

10 అయితే రాజదేహసంరక్షకులకధిపతియైన నెబూజరదాను లేమిగల దరిద్రులను యూదాదేశములో నుండనిచ్చి, వారికి ద్రాక్షతోటలను పొలములను నియమించెను.౹

11-12 మరియు యిర్మీయానుగూర్చి బబులోను రాజైన నెబుకద్రెజరు రాజదేహ సంరక్షకులకు అధిపతియగు నెబూజరదానునకు ఈ ఆజ్ఞ ఇచ్చెను–నీవు ఇతనికి హాని చేయక దగ్గరనుంచుకొని పరామర్శించి, ఇతడు నీతో చెప్పునట్లు చేయవలెను.౹

13 కావున రాజదేహసంరక్షకులకు అధిపతియైన నెబూజరదానును షండులకు అధిపతియగు నెబూషజ్బానును జ్ఞానులకు అధిపతియగు నేర్గల్‌షరే జరును బబులోనురాజు ప్రధానులందరును దూతలను పంపి

14 బందీగృహశాలలోనుండి యిర్మీయాను తెప్పించి, అతనిని యింటికి తోడుకొనిపోవుటకు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాకు అతని నప్పగించిరి, అప్పుడతడు ప్రజలమధ్య నివాసముచేసెను.

15 యిర్మీయా బందీగృహశాలలోనుండగా యెహోవా మాట అతనికి ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

16 –నీవు వెళ్లి కూషీయుడగు ఎబెద్మెలెకుతో ఇట్లనుము–ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–మేలుచేయుటకైకాక కీడుచేయుటకై నేను ఈ పట్టణమునుగూర్చి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను; నీవు చూచుచుండగా ఆ మాటలు ఆ దినమున నెరవేరును.౹

17 ఆ దినమున నేను నిన్ను విడిపించెదను, నీవు భయపడు మనుష్యులచేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹

18 నీవు నన్ను నమ్ము కొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను, నీవు ఖడ్గముచేత పడవు, దోపుడుసొమ్ము దక్కించుకొనునట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు; ఇదే యెహోవా వాక్కు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/39-97cafc94de7c258f6d68d17ae1f1067f.mp3?version_id=1787—

Categories
యిర్మీయా

యిర్మీయా 40

1 రాజదేహసంరక్షకులకధిపతియైన నెబూజరదాను యెరూషలేములోనుండియు యూదాలోనుండియు బబులోనునకు చెరగా కొనిపోబడిన బందీ జనులందరిలోనుండి, సంకెళ్లచేత కట్టబడియున్న యిర్మీయాను తీసికొని రామాలోనుండి పంపివేయగా, యెహోవా యొద్దనుండి అతనికి ప్రత్యక్షమైన వాక్కు.౹

2 రాజదేహసంరక్షకులకధిపతి యిర్మీయాను అవతలికి తీసికొనిపోయి అతనితో ఈలాగు మాటలాడెను–ఈ స్థలమునకు నేను ఈ కీడు చేసెదనని నీ దేవుడగు యెహోవా ప్రకటించెను గదా.౹

3 తాను చెప్పిన ప్రకారము యెహోవా దాని రప్పించి చేయించెను, మీరు యెహోవాకు విరోధముగా పాపముచేసి ఆయన మాటలు వినకపోతిరి గనుక మీకీగతి పెట్టినది.౹

4 ఆలకించుము, ఈ దినమున నేను నీచేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించుచున్నాను, నాతోకూడ బబులోనునకు వచ్చుట మంచిదని నీకు తోచినయెడల రమ్ము, నేను నిన్ను భద్రముగా కాపాడెదను; అయితే బబులోనునకు నాతోకూడ వచ్చుట మంచిదికాదని నీకు తోచినయెడల రావద్దు, దేశమంతట నీకేమియు అడ్డములేదు, ఎక్కడికి వెళ్లుట నీ దృష్టికి అనుకూలమో, యెక్కడికి వెళ్లుట మంచిదని నీకు తోచునో అక్కడికి వెళ్లుము.౹

5 ఇంకను అతడు తిరిగి వెళ్లక తడవు చేయగా రాజదేహసంరక్షకులకధిపతి అతనితో ఈలాగు చెప్పెను–బబులోను రాజు షాఫాను కుమారుడైన అహీ కాము కుమారుడగు గెదల్యాను యూదాపట్టణములమీద నియమించియున్నాడు, అతని యొద్దకు వెళ్లుము; అతని యొద్ద నివసించి ప్రజలమధ్యను కాపురముండుము, లేదా యెక్కడికి వెళ్లుట నీ దృష్టికి అనుకూలమో అక్కడికే వెళ్లుము. మరియు రాజదేహసంరక్షకులకధిపతి అతనికి బత్తెమును బహుమానము ఇచ్చి అతని సాగనంపగా

6 యిర్మీయా మిస్పాలోనుండు అహీకాము కుమారుడైన గెదల్యాయొద్దకు వెళ్లి అతనితోకూడ దేశములో మిగిలిన ప్రజలమధ్య కాపురముండెను.

7 అయితే అచ్చటచ్చటనుండు సేనల యధిపతులందరును వారి పటాలపువారును, బబులోనురాజు అహీకాము కుమారుడైన గెదల్యాను దేశముమీద అధికారిగా నియమించి, బబులోనునకు చెరగొని పోబడక నిలిచినవారిలో స్త్రీలను పురుషులను పిల్లలను, దేశములోని అతినీరసులైన దరిద్రులను అతనికి అప్పగించెనని వినిరి.౹

8 కాగా నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును కారేహ కుమారులైన యోహానాను యోనాతానులును తన్హుమెతు కుమారుడైన శెరాయాయును నెటోపాతీయుడైన ఏపయి కుమారులును మాయ కాతీయుడైనవాని కుమారుడగు యెజన్యాయును వారి పటాలపువారును మిస్పాలోనుండిన గెదల్యాయొద్దకు వచ్చిరి.౹

9 అప్పుడు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యా ప్రమాణముచేసి వారితోను వారి పటాలపువారితోను ఈలాగు చెప్పెను–మీరు కల్దీయులను సేవించుటకు భయపడకుడి, దేశములో కాపురముండి బబులోనురాజును సేవించినయెడల మీకు మేలు కలుగును.౹

10 నేనైతేనో నాయొద్దకు వచ్చు కల్దీయుల యెదుట నిలుచుటకై మిస్పాలో కాపురముందును గాని మీరు ద్రాక్షారసమును వేసవికాల ఫలములను తైలమును సమకూర్చుకొని, మీ పాత్రలలో వాటిని పోసికొని మీరు స్వాధీనపరచుకొనిన పట్టణములలో కాపురముండుడి.౹

11 మోయాబులోనేమి అమ్మోనీయులమధ్యనేమి ఎదోములోనేమి యే యే ప్రదేశములలోనేమి యున్న యూదులందరు బబులోనురాజు యూదాలో జనశేషమును విడిచెననియు, షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాను వారిమీద నియమించెననియు వినినప్పుడు

12 అందరును తాము తోలివేయబడిన స్థలములన్నిటిని విడిచి మిస్పాకు గెదల్యాయొద్దకు వచ్చి బహు విస్తారము ద్రాక్షారసమును వేసవికాలపు పండ్లను సమకూర్చుకొనిరి.

13 మరియు కారేహ కుమారుడైన యోహానానును, అచ్చ టచ్చటనున్న సేనల యధిపతులందరును మిస్పా లోనున్న గెదల్యాయొద్దకు వచ్చి

14 –నిన్ను చంపుటకు అమ్మోనీయుల రాజైన బయలీసు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును పంపెనని నీకు తెలియదా అని చెప్పిరి. అయితే అహీ కాము కుమారుడైన గెదల్యా వారి మాట నమ్మలేదు.౹

15 కారేహ కుమారుడగు యోహానాను మిస్పాలో గెదల్యాతో రహస్యముగా ఇట్లనెను–నీయొద్దకు కూడివచ్చిన యూదులందరు చెదరిపోవునట్లును, యూదా జనశేషము నశించు నట్లును నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు నిన్ను చంప నేల? దయచేసి నన్ను వెళ్లనిమ్ము, ఎవనికి తెలియకుండ నేను వానిని చంపెదను.౹

16 అందుకు అహీకాము కుమారుడైన గెదల్యా కారేహ కుమారుడైన యోహానానుతో–ఇష్మాయేలునుగూర్చి నీవు అబద్ధమాడుచున్నావు, నీవాకార్యము చేయకూడదనెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/40-fa87bcba7e9f4f43787c6310d99a23eb.mp3?version_id=1787—

Categories
యిర్మీయా

యిర్మీయా 41

1 ఏడవ మాసమున ఎలీషామా మనుమడును నెతన్యా కుమారుడును రాజవంశస్థుడును రాజుయొక్క ప్రధానులలో నొకడునగు ఇష్మాయేలనువాడును, అతనితో పదిమంది మనుష్యులును, మిస్పాలోనున్న అహీకాము కుమారుడైన గెదల్యాయొద్దకు వచ్చి అక్కడ అతనితోకూడ మిస్పాలో భోజనముచేసిరి.౹

2 అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అతనితోకూడనున్న ఆ పదిమంది మనుష్యులును లేచి షాఫాను మనుమడును అహీకాము కుమారుడైన గెదల్యాను ఖడ్గముచేత హతముచేసిరి; బబులోనురాజు ఆ దేశముమీద అతని అధికారినిగా నియమించినందున అతని చంపిరి.౹

3 మరియు మిస్పాలో గెదల్యా యొద్ద ఉండిన యూదులనందరిని, అక్కడ దొరికిన యోధులగు కల్దీయులను ఇష్మాయేలు చంపెను.౹

4 అతడు గెదల్యాను చంపిన రెండవనాడు అది ఎవరికిని తెలియబడకమునుపు

5 గడ్డములు క్షౌరము చేయించుకొని వస్త్రములు చింపుకొని దేహములు గాయపరచుకొనినయెనుబదిమంది పురుషులు యెహోవా మందిరమునకు తీసికొని పోవుటకై నైవేద్యములను ధూపద్రవ్యములను చేతపట్టుకొని షెకెము నుండియు షిలోహునుండియు షోమ్రోనునుండియు రాగా

6 నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు దారి పొడుగున ఏడ్చుచు, వారిని ఎదుర్కొనుటకు మిస్పాలోనుండి బయలు వెళ్లి వారిని కలిసికొని వారితో–అహీకాము కుమారుడైన గెదల్యా యొద్దకు రండనెను.౹

7 అయితే వారు ఆ పట్టణముమధ్యను ప్రవేశించినప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును అతనితోకూడ ఉన్నవారును వారిని చంపి గోతిలో పడవేసిరి.౹

8 అయితే వారిలో పదిమంది మనుష్యులు ఇష్మాయేలుతో–పొలములలో దాచబడిన గోధుమలు యవలు తైలము తేనె మొదలైన ద్రవ్యములు మాకు కలవు, మమ్మును చంపకుమని చెప్పుకొనగా అతడు వారి సహోదరులతోకూడ వారిని చంపక మానెను.౹

9 ఇష్మాయేలు గెదల్యాతోకూడ చంపిన మనుష్యుల శవములన్నిటిని పడవేసిన గోయి రాజైన ఆసా ఇశ్రాయేలురాజైన బయషాకు భయపడి త్రవ్వించిన గొయ్యియే; నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపబడినవారి శవములతో దాని నింపెను.౹

10 అప్పుడు ఇష్మాయేలు మిస్పాలోనున్న జనశేష మంతటిని రాజ కుమార్తెలనందరిని అనగా రాజదేహసంరక్ష కుల కధిపతియైన నెబూజరదాను అహీకాము కుమారుడైన గెదల్యాకు అప్పగించిన జనులందరిని, చెరతీసికొనిపోయెను. నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు వారిని చెరతీసికొనిపోయి అమ్మోనీయులయొద్దకు చేరవలెనని ప్రయత్నపడుచుండగా

11 కారేహ కుమారుడైన యోహానానును అతనితోకూడనున్న సేనాధిపతులందరును నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చేసిన సమస్త దుష్కార్యములనుగూర్చిన వార్త విని

12 పురుషులనందరిని పిలుచుకొని, నెతన్యా కుమారుడైన ఇష్మాయేలుతో యుద్ధము చేయబోయి, గిబియోనులోనున్న మహా జలముల దగ్గర అతని కలిసికొనిరి.౹

13 ఇష్మాయేలుతోకూడనున్న ప్రజలందరు కారేహ కుమారుడైన యోహానానును, అతనితోకూడనున్న సేనాధిపతులనందరిని చూచినప్పుడు వారు సంతోషించి

14 ఇష్మాయేలు మిస్పాలోనుండి చెరగొనిపోయిన ప్రజలందరు అతని విడిచి కారేహ కుమారుడైన యోహానానుతో కలిసిరి.౹

15 అయినను, నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును ఎనమండుగురు మనుష్యులును యోహానాను చేతిలోనుండి తప్పించుకొని అమ్మోనీయుల యొద్దకు పారిపోయిరి.౹

16-18 అప్పుడు నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు అహీకాము కుమారుడైన గెదల్యాను చంపిన తరువాత, కారేహ కుమారుడైన యోహానానును అతనితోకూడనున్న సేనల యధిపతులందరును మిస్పాదగ్గరనుండి ఇష్మాయేలు నొద్దనుండి జనశేషమంతటిని, అనగా గిబియోను దగ్గరనుండి ఇష్మాయేలుకొనిపోయిన యోధులను స్త్రీలను పిల్లలను, రాజపరివారమును మరల రప్పించిరి; అయితే వారు బబులోనురాజు దేశముమీద అధికారినిగా నియమించిన అహీకాము కుమారుడైన గెదల్యాను నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు చంపినందునవారు కల్దీయులకు భయపడి ఐగుప్తునకు వెళ్లుదమనుకొని బేత్లెహేముదగ్గరనున్న గెరూతు కింహాములో దిగిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/41-41496e5ebba03ff42e986682f05253be.mp3?version_id=1787—

Categories
యిర్మీయా

యిర్మీయా 42

1 అంతలో సేనాధిపతులందరును కారేహ కుమారుడైన యోహానానును హోషేయా కుమారుడైన యెజన్యాయును, అల్పులేమి ఘనులేమి ప్రజలందరును ప్రవక్తయైన యిర్మీయా యొద్దకు వచ్చి అతనితో ఈలాగు మనవి చేసిరి

2 –మేము ఎంత కొంచెము మంది మిగిలియున్నామో నీవు చూచుచున్నావు గదా? చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి, శేషించియున్న మా యందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థనచేయుము.౹

3 మేము నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడగు యెహోవా మాకు తెలియజేయునుగాక.౹

4 కాగా ప్రవక్తయైన యిర్మీయా వారికి ఉత్తరమిచ్చినదేమనగా–మీరు చేసిన మనవి నేనంగీకరించుచున్నాను, మీ మాటలనుబట్టి మన దేవుడైన యెహోవాను నేను ప్రార్థించుదును, ఏమియు మీకు మరుగుచేయక యెహోవా మిమ్మునుగూర్చి సెలవిచ్చునదంతయు మీకు తెలియజేతును.౹

5 అప్పుడు వారు యిర్మీయాతో ఇట్లనిరి–నిన్ను మా యొద్దకు పంపి, నీ దేవుడగు యెహోవా సెలవిచ్చిన ఆ మాటలనుబట్టి మరుమాటలేకుండ మేము జరిగించని యెడల యెహోవా మామీద నమ్మకమైన సత్యసాక్షిగా ఉండును గాక.౹

6 మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట విను వారమై, అది మేలేగాని కీడేగాని మేము ఆయనయొద్దకు నిన్ను పంపువిషయములో మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు విధేయుల మగుదుము.

7 పది దినములైన తరువాత యెహోవా వాక్కు యిర్మీ యాకు ప్రత్యక్షమాయెను గనుక

8 అతడు కారేహ కుమారుడైన యోహానానును అతనితోకూడనున్న సేనలయధపతులనందరిని, అల్పులనేమి ఘనులనేమి ప్రజలనందరిని పిలిపించి వారితో ఇట్లనెను

9 –ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని మనవి చేయుటకై మీరు నన్ను పంపితిరి గదా? ఆయన సెలవిచ్చునదేమనగా

10 –నేను మీకు చేసిన కీడునుగూర్చి సంతాపమొందియున్నాను, మీరు తొందరపడక యీ దేశములో కాపురమున్నయెడల, పడగొట్టక నేను మిమ్మును స్థాపింతును, పెల్లగింపక నాటెదను.౹

11 మీరు బబులోనురాజునకు భయపడుచున్నారే; అతనికి భయపడకుడి, అతనిచేతిలోనుండి మిమ్మును తప్పించి మిమ్మును రక్షించుటకు నేను మీకు తోడై యున్నాను, అతనికి భయపడకుడి,౹

12 మరియు అతడు మీయెడల జాలిపడి మీ స్వదేశమునకు మిమ్మును పంపునట్లు మీయెడల నేనతనికి జాలి పుట్టించెదను.౹

13-14 అయితే మీరు మీ దేవుడైన యెహోవా మాట విననివారై యీ దేశమందు కాపురముండక–మనము ఐగుప్తు దేశమునకు వెళ్లుదము, అక్కడ యుద్ధము చూడకయు బూరధ్వని వినకయు ఆహారపు లేమిచేత ఆకలిగొనకయు నుందుము గనుక అక్కడనే కాపురముందమని మీరనుకొనినయెడల

15 యూదావారిలో శేషించినవారలారా, యెహోవా మాట ఆలకించుడి; ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఐగుప్తునకు వెళ్లవలెనని నిశ్చయించుకొని అక్కడనే కాపురముండు టకు మీరు వెళ్లినయెడల

16 మీరు భయపడుచున్న ఖడ్గము అక్కడను ఐగుప్తు దేశముననే మిమ్మును తరిమి పట్టుకొనును; మీకు భయము కలుగజేయు క్షామము ఐగుప్తులోనే మిమ్మును తరిమి కలిసికొనును, అక్కడనే మీరు చత్తురు,౹

17 నేను వారిమీదికి రప్పించు కీడునుండి వారిలో శేషించువాడైనను తప్పించుకొనువాడైనను ఉండడు, ఐగుప్తులో నివసింపవలెనని అక్కడికి వెళ్ల నిశ్చయించుకొను మనుష్యులందరు ఖడ్గముచేతను క్షామముచేతను తెగులు చేతను నిశ్శేషముగా చత్తురు.౹

18 ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నాకోపమును నా ఉగ్రతయు యెరూషలేము నివాసులమీదికి వచ్చినట్లు, మీరు ఐగుప్తునకు వెళ్లినయెడల నా ఉగ్రత మీమీదికిని వచ్చును, మీరు శాపాస్పదముగాను భీతి పుట్టించువారుగాను దూషణాస్పదముగాను తిరస్కరింపబడువారుగాను ఉందురు, ఈ స్థలమును మరి యెప్పుడును చూడరు.౹

19 యూదా శేషులారా, ఐగుప్తునకు వెళ్లకూడదని యెహోవా మీకాజ్ఞనిచ్చినట్టు నేడు నేను మీకు సాక్ష్య మిచ్చితినని మీరే నిశ్చయముగా తెలిసికొనుచున్నారు.౹

20 మన దేవుడైన యెహోవాకు మా నిమిత్తము ప్రార్థనచేసి మన దేవుడైన యెహోవా చెప్పునదంతయు మాకు తెలియ జెప్పినయెడల మేమాలాగు చేయుదుమని చెప్పుచు మిమ్మును మీరే మోసపుచ్చుకొనుచున్నారు.౹

21 నేడు నేను మీకు దాని తెలియజెప్పుచున్నాను గాని మీ దేవుడైన యెహోవా మీయొద్దకు నాచేత పంపిన వర్తమానమును మీరు ఆలకింపకపోతిరి.౹

22 కాబట్టి కాపురముండవలెనని మీరు కోరు స్థలములోనే మీరు ఖడ్గముచేతను క్షామముచేతను తెగులుచేతను చత్తురని నిశ్చయముగా తెలిసికొనుడి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/42-a6d378376b17899c88f4aed854832149.mp3?version_id=1787—

Categories
యిర్మీయా

యిర్మీయా 43

1 అతడు ప్రజలకందరికి ప్రకటింపవలెనని దేవుడైన యెహోవా పంపిన ప్రకారము యిర్మీయా వారి దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాటలన్నిటిని వారికి ప్రకటించి చాలింపగా

2 హోషేయా కుమారుడైన అజర్యాయును కారేహ కుమారుడైన యోహానానును గర్విష్ఠులందరును యిర్మీయాతో ఇట్లనిరి–నీవు అబద్ధము పలుకుచున్నావు–ఐగుప్తులో కాపురముండుటకు మీరు అక్కడికి వెళ్ల కూడ దని ప్రకటించుటకై మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు.౹

3 మమ్మును చంపుటకును, బబులోనునకు చెరపట్టుకొని పోవుటకును, కల్దీయులచేతికి మమ్మును అప్పగింపవలెనని నేరీయా కుమారుడైన బారూకు మాకు విరోధముగా రేపుచున్నాడు. (అని చెప్పిరి)

4 కాగా కారేహ కుమారుడైన యోహానానును సేనలయధిపతులందరును ప్రజలందరును యూదాదేశములో కాపురముండవలెనన్న యెహోవా మాట వినకపోయిరి.౹

5-6 మరియు కారేహ కుమారుడైన యోహానానును సేనల యధిపతులందరును యెహోవా మాట విననివారై, యూదాదేశములో నివసించుటకు తాము తరిమి వేయబడిన ఆయా ప్రదేశముల నుండి తిరిగి వచ్చిన యూదుల శేషమును, అనగా రాజదేహసంరక్షకులకధిపతియగు నెబూజరదాను షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాకు అప్పగించిన పురుషులను స్త్రీలను పిల్లలను రాజకుమార్తెలను ప్రవక్తయగు యిర్మీయాను నేరీయా కుమారుడగు బారూకును తోడుకొనిపోయి

7 ఐగుప్తుదేశములో ప్రవేశించిరి. వారు తహపనేసుకు రాగా

8 –యెహోవా వాక్కు తహపనేసులో యిర్మీయాకు ప్రత్యక్షమై యిలాగు సెలవిచ్చెను

9 –నీవు పెద్ద రాళ్లను చేతపట్టుకొని, యూదా మనుష్యులు చూచుచుండగా తహపనేసులో నున్న ఫరో నగరు ద్వారముననున్న శిలావరణములోని సున్నములో వాటిని పాతిపెట్టి జనులకీమాట ప్రకటింపుము

10 –ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చునదేమనగా–ఇదిగో నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్రెజరును నేను పిలువనంపించి తీసికొనివచ్చి, నేను పాతిపెట్టిన యీ రాళ్లమీద అతని సింహాసనము ఉంచెదను, అతడు రత్నకంబళిని వాటిమీదనే వేయిం చును.౹

11 అతడువచ్చి తెగులునకు నిర్ణయమైన వారిని తెగు లునకును, చెరకు నిర్ణయమైనవారిని చెరకును, ఖడ్గమునకు నిర్ణయమైనవారిని ఖడ్గమునకును అప్పగించుచు ఐగుప్తీ యులను హతముచేయును.౹

12 ఐగుప్తు దేవతల గుళ్లలో నేను అగ్ని రాజ బెట్టుచున్నాను, వాటిని నెబుకద్రెజరు కాల్చివేయును, ఆ దేవతలను చెరగొనిపోవును, గొఱ్ఱెలకాపరి తన వస్త్రమును చుట్టుకొనునట్లు అతడు ఐగుప్తుదేశమును తనకు చుట్టుకొని నిరాటంకముగా అక్కడనుండి సాగి పోవును.౹

13 అతడు ఐగుప్తులోనున్న సూర్యదేవతాపట్టణములోని సూర్యప్రతిమలను విరుగగొట్టి ఐగుప్తు దేవతల గుళ్లను అగ్నిచేత కాల్చివేయును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/43-31b2dee6799501ffbe39fda8b03475c7.mp3?version_id=1787—

Categories
యిర్మీయా

యిర్మీయా 44

1 మిగ్దోలులోగాని తహపనేసులోగాని నొపులోగాని పత్రోసులోగాని ఐగుప్తుదేశవాసముచేయుచున్న యూదులనందరినిగూర్చి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

2 నేను యెరూషలేము మీదికిని యూదా పట్టణములన్నిటి మీదికిని రప్పించిన కీడంతయు మీరు చూచుచునే యున్నారు.౹

3 మీరైనను మీపితరులైనను ఎరుగని అన్యదేవతలను అనుసరించుచు పూజించుచు వాటికి ధూపము వేయుచు వచ్చుటవలన వాటి నివాసులు తాము చేసికొనిన దోషముచేత నాకు కోపము పుట్టించిరి గనుక నేడు నివాసులులేకుండ అవి పాడుపడి యున్నవి గదా.౹

4 మరియు నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరిని మీయొద్దకు పంపుచు, నాకసహ్యమైన యీ హేయకార్యమును మీరు చేయకుండుడి అని నేను చెప్పుచువచ్చితిని గాని

5 వారు ఆలకింపక పోయిరి, అన్యదేవతలకు ధూపార్పణముచేయుట మానకపోయిరి, తమ దుర్మార్గతను విడువకపోయిరి చెవి యొగ్గకపోయిరి.౹

6 కావున నా ఉగ్రతయు నాకోపమును కుమ్మరింపబడి, యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను రగులుకొనెను, గనుక నేడున్నట్లుగా అవి పాడై యెడారి ఆయెను.౹

7 కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు అజ్ఞ ఇచ్చుచున్నాడు–ఏమియు శేషములేకుండ స్త్రీ పురుషులును శిశువులును చంటిబిడ్డలును యూదా మధ్యనుండకుండ నిర్మూలముచేయబడునట్లుగా మీరేల ఈ గొప్ప తప్పిదమును మీకు విరోధముగా చేసికొనుచున్నారు?

8 మీకు మీరే సమూలనాశనము తెచ్చుకొనునట్లును, భూమి మీదనున్న జనములన్నిటిలో మీరు దూషణపాలై తిరస్క రింపబడునట్లును, మీరు కాపురముండుటకు పోయిన ఐగుప్తులో అన్యదేవతలకు ధూపార్పణము చేయుదురు. మీరేల యీలాగున చేయుచు మీ చేతిక్రియలచేత నాకు కోపము పుట్టించుచున్నారు?

9 వారు యూదాదేశములోను యెరూషలేము వీధులలోను జరిగించిన క్రియలను అనగా మీపితరులు చేసిన చెడుతనమును యూదారాజులు చేసిన చెడుతనమును వారి భార్యలు చేసిన చెడుతనమును, మీమట్టుకు మీరు చేసిన చెడుతనమును మీ భార్యలు చేసిన చెడుతనమును మరచి పోతిరా?

10 నేటివరకు వారు దీనమనస్సు ధరింపకున్నారు, భయము నొందకున్నారు, నేను మీకును మీపితరులకును నియమించిన ధర్మశాస్త్రమునైనను కట్టడలనైనను అనుసరింపకయే యున్నారు.౹

11-12 కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–మీకు కీడుచేయునట్లు, అనగా యూదావారినందరిని నిర్మూలము చేయునట్లు, నేను మీకు అభిముఖుడనగుదును; ఐగుప్తు దేశములో కాపురముందుమని అచ్చటికి వెళ్ల నిశ్చయించు కొను యూదాశేషులను నేను తోడుకొని పోవుదును, వారందరు ఐగుప్తు దేశములోనే నశించెదరు; అల్పులేమి ఘనులేమి వారందరు కూలుదురు, ఖడ్గముచేతనైనను క్షామముచేతనైనను నశింతురు, ఖడ్గముచేతనైనను క్షామముచేతనైనను వారు చత్తురు, శాపాస్పదమును భీతి పుట్టించు వారుగాను దూషణపాలుగాను తిరస్కారము నొందినవారుగాను ఉందురు.౹

13 యెరూషలేము నివాసులను నేనేలాగు శిక్షించితినో ఆలాగే ఐగుప్తుదేశములో నివసించు వీరిని ఖడ్గముచేతగాని క్షామముచేతగాని తెగులుచేతగాని శిక్షించెదను.౹

14 కావున తాము మరలి వచ్చి యూదాదేశములో కాపురముండవలెనన్న మక్కువచేత ఐగుప్తులో ఆగుటకై అక్కడికి వెళ్లు యూదా వారిలోని శేషము ఎవరును తప్పించుకొనరు, శేషమేమియు ఉండదు, పారిపోవువారు గాక మరి ఎవరును తిరిగిరారు.

15-16 అప్పుడు తమ భార్యలు అన్యదేవతలకు ధూపము వేయుదురని యెరిగియున్న పురుషులందరును, అక్కడ నిలిచియున్న స్త్రీలును, మహా సమాజముగా కూడినవారును ఐగుప్తు దేశమందలి పత్రోసులో కాపురముండు జనులందరును యిర్మీయాకు ఈలాగు ప్రత్యుత్తర మిచ్చిరి–యెహోవా నామమునుబట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాటను మేమంగీకరింపము,౹

17 మేము నీతో చెప్పిన సంగతులన్నిటిని నిశ్చయముగా నెరవేర్చ బోవుచున్నాము; మేమును మా పితరులును మా రాజులును మా యధిపతులును యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను చేసినట్లే ఆకాశరాణికి ధూపము వేయుదుము, ఆమెకు పానార్పణములు అర్పింతుము; ఏలయనగా మేము ఆలాగు చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను, మేము క్షేమముగానే యుంటిమి, యే కీడును మాకు కలుగలేదు.౹

18 మేము ఆకాశరాణికి ధూపము వేయకయు ఆమెకు పానార్పణములు అర్పింపకయు మానినప్పటినుండి సమస్తము మాకు తక్కువైనది, మేము ఖడ్గముచేతను క్షామముచేతను క్షీణించుచున్నాము.౹

19 మేము ఆకాశ రాణికి ధూపము వేయగాను, ఆమెకు పానార్పణములు అర్పింపగాను, మా పురుషుల సెలవులేకుండ ఆమెకు పిండి వంటలు చేయుచున్నామా? ఆమెకు పానార్పణములు పోయుచున్నామా? అని వారు చెప్పగా

20 యిర్మీయా ఆ స్త్రీ పురుషులందరితో, అనగా తనకు అట్లు ప్రత్యుత్తర మిచ్చిన ప్రజలందరితో ఇట్లనెను

21 యూదాపట్టణములలోను యెరూషలేము వీధులలోను మీరును మీపితరులును మీ రాజులును మీ యధిపతులును దేశప్రజలును ధూపము వేసిన సంగతి యెహోవా జ్ఞాపకముచేసికొనలేదా? అదే గదా ఆయన మనస్సునకు వచ్చెను.౹

22 యెహోవా మీ దుష్టక్రియలను చూచి మీరుచేయు హేయకృత్యములను ఎంచి యికను సహింపలేకపోయెను గనుక నేడున్నట్లుగా మీ దేశము పాడుగాను ఎడారిగాను శాపాస్పదముగాను నిర్జనముగాను ఆయన చేసెను.౹

23 యెహోవా మాట వినక, ఆయన ధర్మశాస్త్రమునుబట్టియు కట్టడలనుబట్టియు ఆయన తనకు సాక్ష్యార్థముగా ఇచ్చిన ఆజ్ఞనుబట్టియు నడువక, మీరు ధూపమువేయుచు యెహోవాకు విరోధముగా పాపము చేసితిరి గనుకనే నేడున్నట్లుగా ఈ కీడు మీకు సంభవించెను.

24 మరియు యిర్మీయా ప్రజలనందరిని స్త్రీలనందరిని చూచి వారితో ఇట్లనెను–ఐగుప్తులోనున్న సమస్తమైన యూదులారా, యెహోవా మాట వినుడి.౹

25 ఇశ్రాయేలు దేవుడును, సైన్యములకధిపతియునగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు – ఆకాశరాణికి ధూపము వేయుదుమనియు, ఆమెకు పానార్పణములు అర్పింతుమనియు, మేము మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను నిశ్చయముగా నెరవేర్చుదుమనియు మీరును మీ భార్యలును మీ నోటితో పలికి మీ చేతులతో నెరవేర్చుచున్నారే; నిజముగానే మీ మ్రొక్కుబళ్లను మీరు మ్రొక్కుదురు, నిజముగానే మీ మ్రొక్కులను మీరు నెరవేర్తురు.౹

26 కాబట్టి ఐగుప్తులో నివసించు సమస్తమైన యూదులారా, యెహోవా మాటవినుడి–యెహోవా సెలవిచ్చునదేమనగా –ప్రభువగు యెహోవా అను నేను నా జీవముతోడు ప్రమాణముచేయుచు, ఐగుప్తులో నివసించు యూదులలో ఎవరును ఇకమీదట నా నామము నోట పలకరని నా ఘనమైన నామముతోడు నేను ప్రమాణము చేయుచున్నాను.౹

27 మేలుచేయుటకు కాక కీడుచేయుటకే నేను వారిని కనిపెట్టుచున్నాను; వారు ఖడ్గముచేతనైనను క్షామముచేతనైనను క్షీణించిపోవుచు, ఐగుప్తుదేశములోనున్న యూదావారందరు శేషములేకుండ చత్తురు.౹

28 ఖడ్గము తప్పించుకొనువారు కొద్దిమందియై ఐగుప్తుదేశములోనుండి యూదాదేశమునకు తిరిగి వచ్చెదరు, అప్పుడు ఐగుప్తుదేశములో కాపురముండుటకు వెళ్లిన యూదా వారిలో శేషము ఎవరి మాట నిలకడగా నుండునో, నాదో తమదో అది తెలిసికొందురు.౹

29 మీకు కీడు సంభవించునట్లుగా నా మాటలు నిశ్చయముగా నిలుచునని మీకు తెలియబడుటకును, నేను ఈ స్థలమందు మిమ్మును శిక్షించుచున్నందుకును ఇది మీకు సూచనగా నుండును; ఇదే యెహోవా వాక్కు.౹

30 అతనికి శత్రువై అతని ప్రాణమును తీయజూచుచుండిన నెబుకద్రెజరను బబులోను రాజుచేతికి నేను యూదారాజైన సిద్కియాను అప్పగించినట్లు ఐగుప్తురాజైన ఫరోహొఫ్రను అతని శత్రువులై అతని ప్రాణమును తీయజూచువారి చేతికి అప్పగించెదను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/44-ae551f8c234ae6dcdf740270c987f625.mp3?version_id=1787—

Categories
యిర్మీయా

యిర్మీయా 45

1 యూదారాజును యోషీయా కుమారుడునైన . యెహోయాకీము ఏలుబడియందు నాలుగవ సంవత్సరమున యిర్మీయా నోటిమాటనుబట్టి నేరీయా కుమారుడగు బారూకు గ్రంథములో ఈ మాటలు వ్రాయుచున్నప్పుడు ప్రవక్తయైన యిర్మీయా అతనితో చెప్పినది

2 –బారూకూ, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిన్నుగూర్చి ఈలాగు సెలవిచ్చుచున్నాడు

3 –కటకటా, నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలుగజేయుచున్నాడు, మూలుగుచేత అలసియున్నాను, నాకు నెమ్మది దొరకదాయెను అని నీవనుకొనుచున్నావు.౹

4 నీవు అతనికి ఈ మాట తెలియజేయుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు – నేను కట్టినదానినే నేను పడగొట్టుచున్నాను, నేను నాటినదానినే పెల్లగించుచున్నాను; సర్వభూమినిగూర్చియు ఈ మాట చెప్పు చున్నాను.౹

5 నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెదకు చున్నావా? వెదకవద్దు; నేను సర్వశరీరులమీదికి కీడు రప్పించుచున్నాను, అయితే నీవు వెళ్లు స్థలములన్నిటిలో దోపుడుసొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను; ఇదే యెహోవా వాక్కు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/45-effcf3e0c19d6fd51bf039cd9cadcbb6.mp3?version_id=1787—