Categories
యిర్మీయా

యిర్మీయా 6

1 బెన్యామీనీయులారా, యెరూషలేములోనుండి పారిపోవుడి, తెకోవలో బూరధ్వని చేయుడి, బేత్ హక్కెరెము మీద ఆనవాలుకై ధ్వజము నిలువబెట్టుడి, కీడు ఉత్తర దిక్కునుండి వచ్చుచున్నది, గొప్ప దండు వచ్చుచున్నది.౹

2 సుందరియు సుకుమారియునైన సీయోను కుమార్తెను పెల్ల గించుచున్నాను.౹

3 గొఱ్ఱెల కాపరులు తమ మందలతో ఆమెయొద్దకు వచ్చెదరు, ఆమె చుట్టు తమ గుడారములను వేయుదురు, ప్రతివాడును తన కిష్టమైనచోట మందను మేపును.౹

4 ఆమెతో యుద్ధమునకు సిద్ధపరచుకొనుడి; లెండి, మధ్యాహ్నమందు బయలుదేరుదము. అయ్యో, మనకు శ్రమ, ప్రొద్దు గ్రుంకుచున్నది, సాయంకాలపు ఛాయలు పొడుగవుచున్నవి.౹

5 లెండి ఆమె నగరులను నశింపజేయుటకు రాత్రి బయలుదేరుదము.౹

6 సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –చెట్లను నరికి యెరూషలేమునకు ఎదురుగా ముట్టడిదిబ్బ కట్టుడి, ఈ పట్టణము కేవలము అన్యాయమును అనుసరించి నడచునది గనుక శిక్ష నొందవలసి వచ్చెను.౹

7 ఊట తన జలమును పైకి ఉబుక చేయునట్లు అది తన చెడుతనమును పైకి ఉబుకచేయుచున్నది, బలాత్కారమును దోపుడును దానిలో జరుగుట వినబడుచున్నది, గాయములును దెబ్బలును నిత్యము నాకు కనబడుచున్నవి.౹

8 యెరూషలేమా, నేను నీయొద్దనుండి తొలగింపబడకుండునట్లును నేను నిన్ను పాడైన నిర్మానుష్య ప్రదేశముగా చేయకుండునట్లును శిక్షకు లోబడుము.

9 సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ద్రాక్షచెట్టు ఫలమును ఏరుకొనునట్లు మనుష్యులు ఏమియు మిగులకుండ ఇశ్రాయేలు శేషమును ఏరుదురు; ద్రాక్షపండ్లను ఏరువాడు చిన్న తీగెలను ఏరుటకై తన చెయ్యి మరల వేయునట్లు నీ చెయ్యివేయుము.౹

10 విందురని నేనెవరితో మాటలాడెదను? ఎవరికి సాక్ష్య మిచ్చెదను? వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేనివారై దాని తృణీకరింతురు.౹

11 కావున నేను యెహోవా క్రోధముతో నిండియున్నాను, దానిని అణచుకొని అణచుకొని నేను విసికియున్నాను, ఒకడు తప్పకుండ వీధిలోనున్న పసిపిల్లలమీదను యౌవనుల గుంపుమీదను దాని కుమ్మరింపవలసి వచ్చెను, భార్యా భర్తలును వయస్సుమీరినవారును వృద్ధులును పట్టుకొనబడెదరు.౹

12 ఏమియు మిగులకుండ వారి యిండ్లును వారి పొలములును వారి భార్యలును ఇతరులకు అప్పగింపబడుదురు, ఈ దేశనివాసులమీద నేను నా చెయ్యి చాపుచున్నాను; ఇదే యెహోవా వాక్కు

13 –అల్పులేమి ఘనులేమి వారందరు మోసము చేసి దోచుకొనువారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరు వంచకులు.౹

14 సమాధానములేని సమయమున–సమాధానము సమాధానమని చెప్పుచు, నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగుచేయుదురు.౹

15 వారు తాము హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను గాని వారు ఏమాత్రమును సిగ్గుపడరు; అవమానము నొందితిమని వారికి తోచనేలేదు గనుక పడి పోవువారితో వారు పడిపోవుదురు, నేను వారిని విమ ర్శించు కాలమునవారు తొట్రిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.

16 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–మార్గములలో నిలిచి చూడుడి, పురాతనమార్గములనుగూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని యడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు–మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు.౹

17 మిమ్మును కాపుకాయుటకు నేను కావలివారిని ఉంచియున్నాను; ఆలకించుడి, వారుచేయు బూరధ్వని వినబడుచున్నది.౹

18 అయితే మేము వినమని వారనుచున్నారు; అన్యజనులారా, వినుడి; సంఘమా, వారికి జరిగిన దానిని తెలిసికొనుము.౹

19 భూలోకమా, వినుము; ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారిమీదికి రప్పించుచున్నాను.౹

20 షేబనుండి వచ్చు సాంబ్రాణి నాకేల? దూరదేశమునుండి వచ్చు మధురమైన చెరుకు నాకేల? మీ దహనబలులు నాకిష్టమైనవి కావు, మీ బలులయందు నాకు సంతోషము లేదు.౹

21 కావున యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –ఈ జనుల మార్గమున నేడు అడ్డురాళ్లు వేయుదును; తండ్రులేమి కుమారులేమి అందరును అవి తగిలి కూలుదురు; ఇరుగుపొరుగువారును నశించెదరు.

22 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఉత్తర దేశమునుండి యొక జనము వచ్చుచున్నది, భూదిగంతములలోనుండి మహా జనము లేచి వచ్చుచున్నది.౹

23 వారు వింటిని ఈటెను వాడనేర్చినవారు, అది యొక క్రూర జనము; వారు జాలిలేనివారు, వారి స్వరము సముద్ర ఘోషవలె నున్నది, వారు గుఱ్ఱములెక్కి సవారిచేయు వారు; సీయోను కుమారీ, నీతో యుద్ధము చేయవలెనని వారు యోధులవలె వ్యూహము తీరియున్నారు.౹

24 దాని గూర్చిన వర్తమానము విని మా చేతులు బలహీనమగుచున్నవి, ప్రసవించు స్త్రీ వేదన పడునట్లు మేము వేదన పడుచున్నాము.౹

25 పొలములోనికి పోకుము, మార్గములో నడువకుము, శత్రువులు కత్తిని ఝుళిపించుచున్నారు, నలు దిక్కుల భయము తగులుచున్నది.౹

26 నా జనమా, పాడు చేయువాడు హఠాత్తుగా మామీదికి వచ్చుచున్నాడు. గోనెపట్ట కట్టుకొని బూడిదె చల్లుకొనుము; ఏక కుమారుని గూర్చి దుఃఖించునట్లు దుఃఖము సలుపుము ఘోరమైన దుఃఖము సలుపుము.౹

27 నీవు నా జనుల మార్గమును తెలిసి కొని పరీక్షించునట్లు నిన్ను వారికి వన్నెచూచువానిగాను వారిని నీకు లోహపు తుంటగాను నేను నియమించియున్నాను.౹

28 వారందరు బహు ద్రోహులు, కొండె గాండ్రు, వారు మట్టిలోహము వంటివారు, వారందరు చెరుపువారు.౹

29 కొలిమితిత్తి బహుగా బుసలు కొట్టుచున్నది గాని అగ్నిలోనికి సీసమే వచ్చుచున్నది; వ్యర్థము గానే చొక్కముచేయుచు వచ్చెను. దుష్టులు చొక్కమునకు రారు.౹

30 యెహోవావారిని త్రోసివేసెను గనుక త్రోసివేయవలసిన వెండియని వారికి పేరు పెట్టబడును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/6-34d942496141ba19629351b818df700a.mp3?version_id=1787—

Categories
యిర్మీయా

యిర్మీయా 7

1 యెహోవాయొద్దనుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు

2 –నీవు యెహోవామందిర ద్వారమున నిలువ బడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము–యెహోవాకు నమస్కారముచేయుటకై యీ ద్వారములలోబడి ప్రవేశించు యూదావారలారా, యెహోవా మాట వినుడి.౹

3 సైన్యములకధిపతియు ఇశ్రాయేలుయొక్క దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి

4 –ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే; యీ మోసకరమైన మాటలు ఆధారము చేసికొనకుడి.౹

5 ఆలాగనక, మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరచుకొని, ప్రతివాడు తన పొరుగువానియెడల తప్పక న్యాయము జరిగించి.౹

6 పరదేశులను తండ్రిలేనివారిని విధవరాండ్రను బాధింపకయు ఈ చోట నిర్దోషిరక్తము చిందింపకయు, మీకు కీడు కలుగజేయు అన్యదేవతలను అనుసరింపకయు నుండినయెడల

7 ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీపితరులకిచ్చిన దేశమున మిమ్మును కాపురముంచుదును.౹

8 ఇదిగో అబద్ధపుమాటలను మీరు నమ్ముకొనుచున్నారు. అవి మీకు నిష్‌ప్రయోజనములు.౹

9 ఇదేమి? మీరు జారచోర క్రియలను నరహత్యను చేయుచు

10 అబద్ధసాక్ష్యము పలుకుచు బయలునకు ధూపమువేయుచు మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే; అయినను నా నామము పెట్టబడిన యీ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదలనొందియున్నామని మీరు చెప్పుదురు; ఈ హేయక్రియలన్నియు జరిగించుటకేనా మీరు విడుదలనొందితిరి?

11 నాదని చాటబడిన యీ మందిరము మీ దృష్టికి దొంగలగుహ యైనదా? ఆలోచించుడి, నేనే యీ సంగతి కనుగొనుచున్నాను. ఇదే యెహోవా వాక్కు.౹

12 పూర్వమున నేను నా నామము నిలిపిన షిలోహునందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయుడి, ఇశ్రాయేలీయులైన నా జనుల దుష్టత్వమునుబట్టి నేను దానికి చేసిన కార్యము చూడుడి; ఇదే యెహోవా వాక్కు.౹

13 నేను మీతో మాటలాడినను పెందలకడ లేచి మీతో మాటలాడినను మీరు వినకయు, మిమ్మును పిలిచినను మీరు ఉత్తరమియ్యకయు నుండినవారై యీ క్రియలన్నిటిని చేసితిరి గనుక

14 నేను షిలోహునకు చేసినట్లు మీకు ఆశ్రయమై నా నామముపెట్టబడిన యీ మందిరమునకును మీకును మీ తండ్రులకును నేనిచ్చిన స్థలమునకును నేను ఆలాగే చేయుదును.౹

15 ఎఫ్రాయిము సంతానమగు మీ సహోదరులనందరిని నేను వెళ్లగొట్టినట్లు మిమ్మును నా సన్నిధినుండి వెళ్లగొట్టుదును.౹

16 కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థనచేయకుము, వారికొరకు మొఱ్ఱనైనను ప్రార్థననైనను చేయకుము, నన్ను బతిమాలుకొనకుము, నేను నీ మాట వినను.

17 యూదాపట్టణములలోను యెరూషలేము వీధులలోను వారు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు గదా.౹

18 నాకు కోపము పుట్టించునట్లు ఆకాశరాణి దేవతకు పిండివంటలు చేయవలెననియు, అన్యదేవతలకు పానార్పణములు పోయవలెననియు పిల్లలు కట్టెలు ఏరుచున్నారు తండ్రులు అగ్ని రాజ బెట్టుచున్నారు స్త్రీలు పిండి పిసుకుచున్నారు.౹

19 –నాకే కోపము పుట్టించునంతగా వారు దాని చేయుచున్నారా? తమకే అవమానము కలుగు నంతగా చేయుచున్నారు గదా, యిదే యెహోవా వాక్కు.౹

20 అందువలన ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఈ స్థలముమీదను నరులమీదను జంతువులమీదను పొలముల చెట్లమీదను భూమిపంట మీదను నాకోపమును నా ఉగ్రతను కుమ్మరించెదను, ఆర్పశక్యము కాకుండ అది మండును.

21 సైన్యములకధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–మీ దహనబలులను మీ బలులను కలిపి మాంసము భక్షించుడి.౹

22 నేను ఐగుప్తు దేశములోనుండి మీపితరులను రప్పించిన దినమున దహనబలులనుగూర్చిగాని బలులనుగూర్చిగాని నేను వారితో చెప్పలేదు, అట్టి వాటినిగూర్చి నేను ఏ ఆజ్ఞయు ఇయ్యలేదు, ఈ ఆజ్ఞను మాత్రమే నేను వానికిచ్చితిని

23 ఏదనగా–నా మాటలు మీరు అంగీకరించినయెడల నేను మీకు దేవుడనై యుందును మీరు నాకు జనులైయుందురు; మీకు క్షేమము కలుగునట్లు నేను మీకాజ్ఞా పించుచున్న మార్గమంతటియందు మీరు నడుచుకొనుడి.౹

24 అయితే వారు వినకపోయిరి, చెవియొగ్గకుండిరి, ముందుకు సాగక వెనుకదీయుచు తమ ఆలోచనలనుబట్టి తమ దుష్ట హృదయకాఠిన్యము ననుసరించి నడుచుచు వచ్చిరి.౹

25 మీపితరులు ఐగుప్తు దేశములోనుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటివరకు మీరు వెనుకదీయుచు వచ్చిన వారే; నేను అనుదినము పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులనందరిని మీ యొద్దకు పంపుచు వచ్చితిని.౹

26 వారు నా మాట వినకయున్నారు చెవియొగ్గకయున్నారు తమ మెడను వంచక మనస్సును కఠినపరచుకొనుచున్నారు; వారు తమపితరులకంటె మరి దుష్టులైరి.

27 నీవు ఈ మాటలన్నియు వారితో చెప్పినను వారు నీ మాటలంగీకరింపరు, నీవు వారిని పిలిచినను వారు నీకుత్తర మియ్యరు

28 గనుక నీవు వారితో ఈలాగు చెప్పుము–వీరు తమ దేవుడైన యెహోవా మాట విననివారు, శిక్షకు లోబడనొల్లనివారు, కాబట్టి నమ్మకము వారిలోనుండి తొలగిపోయియున్నది, అది వారి నోట నుండకుండ కొట్టి వేయబడియున్నది.

29 తనకు కోపము తెప్పించు తరమువారిని యెహోవా విసర్జించి వెళ్లగొట్టుచున్నాడు; సీయోనూ నీ తలవెండ్రు కలను కత్తిరించుకొనుము, వాటిని పారవేయుము, చెట్లులేని మెట్టలమీద ప్రలాపవాక్య మెత్తుము.౹

30 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–యూదావారు నా దృష్టికి చెడ్డక్రియలు చేయుచున్నారు, నా నామముపెట్టబడిన మందిరము అపవిత్రపడునట్లువారు దానిలో హేయ వస్తువులను ఉంచియున్నారు.౹

31 నేనాజ్ఞాపించని క్రియను నాకు తోచని క్రియను వారు చేసియున్నారు, అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్‍హిన్నోము లోయలోనున్న తోఫెతునందు బలిపీఠములను కట్టుకొనియున్నారు.౹

32 కాలము సమీపించుచున్నది; అప్పుడు అది తోఫెతు అనియైనను బెన్‌హిన్నోము లోయ అనియైనను అనబడక వధలోయ అనబడును; పాతిపెట్టు టకు స్థలము లేకపోవువరకు తోఫెతులో శవములు పాతిపెట్టబడును; ఇదే యెహోవా వాక్కు.౹

33 ఈ జనుల శవములు ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహార మగును, వాటిని తోలివేయువాడు లేకపోవును.౹

34 ఉల్లాస ధ్వనియు ఆనందధ్వనియు పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోనులేకుండచేసెదను; ఈ దేశము తప్పక పాడైపోవును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/7-5d4317ae6c038f7735600ed832e58b3a.mp3?version_id=1787—

Categories
యిర్మీయా

యిర్మీయా 8

1 యెహోవా వాక్కు – ఆ కాలమున శత్రువులు యూదారాజుల యెముకలను అధిపతుల యెముకలను యాజకుల యెముకలను ప్రవక్తల యెముకలను యెరూషలేము నివాసుల యెముకలను సమాధులలోనుండి వెలుపలికి తీసి

2 వారు ప్రేమించుచు పూజించుచు అనుసరించుచు విచారణచేయుచు నమస్కరించుచు వచ్చిన ఆ సూర్య చంద్ర నక్షత్రముల యెదుట వాటిని పరచెదరు; అవి కూర్చబడకయు పాతిపెట్టబడకయు భూమిమీద పెంటవలె పడియుండును.౹

3 అప్పుడు నేను తోలివేసిన స్థలములన్నిటిలో మిగిలియున్న యీ చెడ్డ వంశములో శేషించిన వారందరు జీవమునకు ప్రతిగా మరణమును కోరుదురు; సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు ఇదే.

4 మరియు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుము–మనుష్యులు పడి తిరిగి లేవకుందురా? తొలగిపోయిన తరువాత మనుష్యులు తిరిగిరారా?

5 యెరూషలేము ప్రజలు ఏల విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు? వారు మోసమును ఆశ్ర యము చేసికొని తిరిగి రామని యేల చెప్పుచున్నారు?

6 నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను, పనికిమాలిన మాటలు వారాడుకొనుచున్నారు–నేనేమి చేసితినని చెప్పి తన చెడుతనమునుగూర్చి పశ్చాత్తాపపడువాడొకడును లేక పోయెను? యుద్ధమునకు చొరబడు గుఱ్ఱమువలె ప్రతివాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు.౹

7 ఆకాశములకెగురు సంకుబుడి కొంగయైనను తన కాలము నెరుగును, తెల్ల గువ్వయు మంగలకత్తిపిట్టయు ఓదెకొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును, అయితే నా ప్రజలు యెహోవా న్యాయవిధిని ఎరుగరు.౹

8 –మేము జ్ఞానులమనియు, యెహోవా ధర్మశాస్త్రము మాయొద్దనున్నదనియు మీరేల అందురు? నిజమే గాని శాస్త్రుల కల్లకలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది.౹

9 జ్ఞానులు అవమానము నొందిన వారైరి, వారు విస్మయమొంది చిక్కున పడియున్నారు, వారు యెహోవా వాక్యమును నిరాక రించినవారు, వారికి ఏపాటి జ్ఞానము కలదు?

10 గనుక వారి భార్యలను అన్యుల కప్పగింతును, వారిని జయించువారికి వారి పొలములను అప్పగింతును. అల్పులేమి ఘనులేమి అందరును మోసముచేసి దోచుకొనువారు; ప్రవక్తలేమి యాజకులేమి అందరును వంచకులు.౹

11 సమాధానము లేని సమయమున–సమాధానము సమాధానము అని వారు చెప్పుచు, నా జనుల గాయమును పైపైన మాత్రమే బాగుచేయుదురు.౹

12 తాము హేయమైన క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెనుగాని వారేమాత్రమును సిగ్గుపడరు; అవమానము నొందితిమని వారికి తోచనేలేదు గనుక పడిపోవువారిలో వారు పడిపోవుదురు; నేను వారిని విమర్శించుకాలమునవారు తొట్రిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు

13 ద్రాక్షచెట్టున ఫలములులేకుండునట్లును, అంజూరపుచెట్టున అంజూరపు పండ్లులేకుండునట్లును, ఆకులు వాడిపోవునట్లును నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను; వారిమీదికి వచ్చు వారిని నేనాలాగున పంపుచున్నాను; ఇదే యెహోవా వాక్కు.౹

14 మనమేల కూర్చుండియున్నాము? మనము పోగు బడి ప్రాకారములుగల పట్టణములలోనికి పోదము, అక్కడనే చచ్చిపోదము రండి; యెహోవాయే మనలను నాశనముచేయుచున్నాడు, ఆయనకు విరోధముగా మనము పాపము చేసినందున మన దేవుడైన యెహోవా మనకు విషజలమును త్రాగించుచున్నాడు.౹

15 మనము సమాధానము కొరకు కనిపెట్టుకొనుచున్నాము గాని మేలేమియు రాదాయెను; క్షేమముకొరకు కనిపెట్టుచున్నాముగాని భీతియే కలుగుచున్నది అని చెప్పుదురు.౹

16 దానునుండి వచ్చువారి గుఱ్ఱముల బుసలు వినబడెను, వారి గుఱ్ఱముల సకిలింపు ధ్వనిచేత దేశమంతయు కంపించుచున్నది, వారు వచ్చి దేశమును అందులోనున్న యావత్తును నాశనముచేయుదురు, పట్టణమును అందులో నివసించువారిని నాశనము చేయుదురు.౹

17 నేను మిడునాగులను మీలోనికి పంపు చున్నాను, అవి మిమ్మును కరచును, వాటికి మంత్రము లేదు; ఇదే యెహోవా వాక్కు.

18 నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది, నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుదును?

19 యెహోవా సీయో నులో లేకపోయెనా? ఆమె రాజు ఆమెలో లేకపోయెనా? అని బహు దూరదేశమునుండి నా ప్రజల రోదనశబ్దము వినబడుచున్నది; వారి విగ్రహములచేతను అన్యమైన మాయా రూపములచేతను నాకేల కోపము తెప్పించిరి?

20 –కోత కాలము గతించియున్నది, గ్రీష్మకాలము జరిగిపోయెను, మనము రక్షణనొందకయే యున్నాము అని చెప్పుదురు.౹

21 నా జనుల వేదననుబట్టి నేను వేదనపడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను, ఘోరభయము నన్ను పెట్టియున్నది.౹

22 గిలాదులో గుగ్గిలము ఏమియు లేదా? అక్కడ ఏ వైద్యు డును లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలుగక పోవు చున్నది?

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/8-53d7a2ec36a0ea2af2a0cbc0615594fa.mp3?version_id=1787—

Categories
యిర్మీయా

యిర్మీయా 9

1 నా జనులలో హతమైనవారినిగూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచునట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండును గాక.౹

2 నా జనులందరు వ్యభిచారులును ద్రోహుల సమూహమునై యున్నారు. అహహా, అరణ్యములో బాటసారులబస నాకు దొరికిన ఎంత మేలు? నేను నా జనులను విడిచి వారియొద్దనుండి తొలగిపోవుదును.౹

3 విండ్లను త్రొక్కి వంచునట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచుదురు; దేశములో తమకున్న బలమును నమ్మకముగా ఉప యోగపరచరు. నన్ను ఎరుగక కీడువెంట కీడుచేయుచు ప్రవర్తించుచున్నారు; ఇదే యెహోవా వాక్కు.౹

4 మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా నుండవలెను; ఏ సహోదరునినైనను నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టయి తన సహోదరుని కొంపముంచును; ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు.౹

5 సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగువానిని వంచించును, అబద్ధము లాడుట తమ నాలుకలకు అభ్యాసముచేసియున్నారు, ఎదుటివాని తప్పులు పట్టవలెనని ప్రయాసపడుదురు.౹

6 నీ నివాసస్థలము కాపట్యము మధ్యనే యున్నది, వారు కపటులై నన్ను తెలిసికొననొల్లకున్నారు; ఇదే యెహోవా వాక్కు.

7 కావున సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఆలకింపుము, వారిని చొక్కము చేయునట్లుగా నేను వారిని కరగించుచున్నాను, నా జనులనుబట్టి నేను మరేమి చేయుదును?

8 వారి నాలుక ఘాతుక బాణము, అది కాపట్యము పలుకుచున్నది; ఒకడు మనస్సులో వంచనాభిప్రాయముంచుకొని, నోట తన పొరుగువానితో సమాధానముగా మాటలాడును.౹

9 నేను ఈ సంగతులను తెలిసికొని వారిని శిక్షింపకపోదునా? ఇట్టి జనులకు నేను ప్రతి దండన చేయకుందునా? ఇదే యెహోవా వాక్కు.

10 పర్వతముల విషయమై రోదనమును అంగలార్పును చేయుదును; అరణ్యములోని మేతస్థలములనుబట్టి విలా పము చేయుదును; అవి పాడాయెను. సంచారము చేయువాడెవడును లేడు, పశువుల అరుపులు వినబడవు, ఆకాశపక్షులును జంతువులును పారిపోయి యున్నవి, అవి తొలగిపోయి యున్నవి.౹

11 యెరూషలేమును పాడు దిబ్బలుగాను నక్కలకు చోటుగాను నేను చేయుచున్నాను, యూదాపట్టణములను నివాసిలేని పాడు స్థలముగా చేయుచున్నాను.౹

12 ఈ సంగతిని గ్రహింపగల జ్ఞాని యెవడు? దానిని వాడు తెలియజేయునట్లు యెహోవా నోటి మాట ఎవనికి వచ్చెను?ఎవడును సంచరింపకుండ ఆ దేశము ఎడారివలె ఏల కాలిపోయి పాడాయెను?

13 అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు– వారు నా మాట వినకయు దాని ననుసరింపకయు, నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రమును విసర్జించి

14 తమ హృదయమూర్ఖతచొప్పున జరిగించుటకై తమపితరులు తమకు నేర్పినట్లు బయలుదేవతలను అనుసరించుచున్నారు గనుకనే వారి దేశము పాడైపోయెను.౹

15 సైన్యములకధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –నేను ఈ ప్రజలకు చేదుకూరలు తినిపింతును, విషజలము త్రాగింతును.౹

16 తామైనను తమపితరులైనను ఎరుగని జనములలోనికి వారిని చెదరగొట్టు దును, వారిని నిర్మూలముచేయువరకు వారి వెంబడి ఖడ్గమును పంపుదును.

17 సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఆలోచింపుడి, రోదనముచేయు స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి.౹

18 మన కన్నులు కన్నీళ్లు విడుచునట్లుగాను మన కనురెప్పలనుండి నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోదనధ్వని చేయవలెను.౹

19 మనము వలసబోతిమే సిగ్గునొందితిమే, వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడువవలసివచ్చెనే అని సీయోనులో రోదనధ్వని వినబడు చున్నది.౹

20 స్త్రీలారా, యెహోవా మాట వినుడి–మీరు చెవియొగ్గి ఆయన నోటిమాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయనేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి.౹

21 వీధులలో పసిపిల్లలులేకుండను, రాజ మార్గములలో యౌవనులులేకుండను, వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది.౹

22 యెహోవా వాక్కు ఇదే–నీవీమాట చెప్పుము–చేలమీద పెంటపడునట్లు పంట కోయు వాని వెనుక పిడికిళ్లు పడునట్లు ఎవడును సమకూర్చకుండ మనుష్యుల శవములు పడును, వాటిని కూర్చువాడెవడును లేకపోవును.

23 యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–జ్ఞాని తన జ్ఞానమునుబట్టియు శూరుడు తన శౌర్యమునుబట్టియు అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమునుబట్టి అతిశయింపకూడదు.౹

24 అతిశయించువాడు దేనినిబట్టి అతిశయింపవలెననగా, భూమిమీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనేయని గ్రహించి నన్ను పరిశీలనగా తెలిసికొనుటనుబట్టియే అతిశయింపవలెను; అట్టి వాటిలో నేనానందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹

25 అన్యజనులందరును సున్నతిపొందనివారు గనుక, ఇశ్రాయేలీయులందరు హృదయ సంబంధమైన సున్నతినొందినవారుకారు గనుక, రాబోవుదినములలో సున్నతిపొందియు సున్నతిలేని వారివలెనుండు

26 ఐగుప్తీయులను యూదావారిని ఎదోమీయులను అమ్మోనీయులను మోయాబీయులను గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొను అరణ్య నివాసులైన వారినందరిని నేను శిక్షించెదను, ఇదే యెహోవా వాక్కు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/9-dfd437ba465a374833b1c62590073585.mp3?version_id=1787—

Categories
యిర్మీయా

యిర్మీయా 10

1 ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మునుగూర్చి సెలవిచ్చిన మాట వినుడి.౹

2 యెహోవా సెలవిచ్చు చున్నదేమనగా–అన్యజనముల ఆచారముల నభ్యసింపకుడి, ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి.౹

3 జనముల ఆచారములు వ్యర్థములు, అడవిలో నొకడు చెట్టు నరకునట్లు అది నరకబడును, అది పనివాడు గొడ్డలితో చేసినపని.౹

4 వెండి బంగారములచేత పనివారు దానిని అలంకరింతురు, అది కదలక యుండునట్లు మేకులుపెట్టి సుత్తెలతో బిగగొట్టి దాని నిలుపుదురు.౹

5 అవి తాటిచెట్టు వలె తిన్నగా ఉన్నవి, అవి పలుకవు నడువనేరవు గనుక వాటిని మోయవలసివచ్చెను; వాటికి భయపడకుడి అవి హానిచేయనేరవు మేలుచేయుట వాటివలనకాదు.౹

6 యెహోవా, నిన్ను పోలినవాడెవడును లేడు, నీవు మహా త్మ్యము గలవాడవు, నీ శౌర్యమునుబట్టి నీ నామము ఘనమైనదాయెను.౹

7 జనములకు రాజా, నీకు భయపడని వాడెవడు? జనముల జ్ఞానులందరిలోను వారి రాజ్యములన్నిటిలోను నీవంటివాడెవడును లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము.౹

8 జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు; బొమ్మల పూజవలన వచ్చు జ్ఞానము వ్యర్థము.౹

9 తర్షీషునుండి రేకులుగా సాగగొట్టబడిన వెండియు ఉపాజునుండి బంగారమును తెత్తురు, అది పని వాని పనియేగదా; పోతపోయువాడు దాని చేసెను, నీల ధూమ్రవర్ణములుగల వస్త్రములు వాటికున్నవి, అవన్నియు నేర్పరులగు పనివారి పనియే.౹

10 యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు.

11 మీరు వారితో ఈలాగు చెప్పవలెను–ఆకాశమును భూమిని సృష్టింపని యీ దేవతలు భూమిమీద నుండకుండను ఆకాశముక్రింద ఉండకుండను నశించును.

12 ఆయన తన బలముచేత భూమిని సృష్టించెను, తన జ్ఞానముచేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞచేత ఆకాశమును విశాలపరచెను.౹

13 ఆయన ఆజ్ఞ నియ్యగా జలరాసులు ఆకాశమండలములో పుట్టును, భూమ్యంత భాగములలోనుండి ఆయన ఆవిరి ఎక్క జేయును, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనా గారములలోనుండి గాలిని రావించును.౹

14 తెలివిలేని ప్రతిమనుష్యుడు పశుప్రాయుడు, పోతపోయు ప్రతివాడును తాను చేసిన విగ్రహమునుబట్టి అవమానము నొందు చున్నాడు; అతడు పోతపోసినది మాయారూపము, అందులో ప్రాణమేమియు లేదు.౹

15 అవి ఆశను చెడగొట్టు మాయాకార్యములు, విమర్శకాలములో అవి నశించి పోవును.౹

16 యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటివంటివాడు కాడు; ఆయన సమస్తమును నిర్మించువాడు, ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము; సైన్యములకధిపతియగు యెహోవాయని ఆయనకు పేరు.

17 నివాసినీ, ముట్టడివేయబడుచున్న దేశము విడిచి వెళ్లుటకై నీ సామగ్రిని కూర్చుకొనుము.౹

18 యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–నేను ఈ వేళను ఈ దేశ నివాసులను విసరివేయుచున్నాను, వారు పట్టబడవలెనని వారిని ముట్టడి వేయించుచున్నాను.౹

19 కటకటా, నేను గాయపడితిని, నా దెబ్బ నొప్పి పెట్టుచున్నది, అయితే –ఈ దెబ్బ నాకు తగినదే యనుకొని నేను దాని సహించుదును.౹

20 నా గుడారము చినిగిపోయెను, నా త్రాళ్లన్నియు తెగిపోయెను, నా పిల్లలు నాయొద్దనుండి తొలగిపోయి యున్నారు, వారు లేకపోయిరి, ఇకమీదట నా గుడారమును వేయుటకైనను నా తెరల నెత్తుటకైనను ఎవడును లేడు.౹

21 కాపరులు పశుప్రాయులై యెహోవాయొద్ద విచారణచేయరు గనుక వారే వర్ధిల్లకయున్నారు, వారి మందలన్నియు చెదరిపోవుచున్నవి.౹

22 ఆలకించుడి, ధ్వని పుట్టుచున్నది, దాని రాక ధ్వని వినబడుచున్నది, యూదా పట్టణములను పాడైన స్థలముగా చేయుటకును, నక్కలకు చోటుగా చేయుటకును ఉత్తరదేశమునుండి వచ్చుచున్న గొప్ప అల్లరి ధ్వని వినబడుచున్నది.౹

23 యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును.౹

24 యెహోవా, నీవు నన్ను బొత్తిగా తగ్గింపకుండునట్లు నీ కోపమునుబట్టి నన్ను శిక్షింపక నీ న్యాయవిధిని బట్టి నన్ను శిక్షింపుము.౹

25 నిన్నెరుగని అన్యజనులమీదను నీ నామమునుబట్టి ప్రార్థిం పని వంశములమీదను నీ ఉగ్రతను కుమ్మరించుము; వారు యాకోబును మ్రింగివేయుచున్నారు, నిర్మూలము చేయవలెనని వారు అతని మ్రింగివేయుచున్నారు, వాని నివాసమును పాడుచేయుచున్నారు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/10-0978c8c41994b80d4ee1bce03ff4d670.mp3?version_id=1787—

Categories
యిర్మీయా

యిర్మీయా 11

1 యెహోవాయొద్దనుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు

2 –మీరు ఈ నిబంధనవాక్యములను వినుడి; యూదా మనుష్యులతోను యెరూషలేము నివాసులతోను నీవీలాగున మాటలాడి తెలియజేయవలెను

3 –ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా–ఈ నిబంధన వాక్యములను విననొల్లనివాడు శాపగ్రస్తుడగును.౹

4 ఐగుప్తుదేశములోనుండి, ఆ యినుప కొలిమిలోనుండి నేను మీపితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చితిని–నేడున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీపితరులకిచ్చెదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చునట్లు, మీరు నా వాక్యము విని నేను మీ కాజ్ఞాపించు విధులన్నిటినిబట్టి యీ నిబంధన వాక్యముల ననుసరించినయెడల మీరు నాకు జనులైయుందురు నేను మీకు దేవుడనైయుందును.౹

5 అందుకు–యెహోవా, ఆప్రకారము జరుగును గాకని నేనంటిని.

6 యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా – నీవు యూదాపట్టణములలోను యెరూషలేము వీధులలోను ఈ మాటలన్నిటిని ప్రకటింపుము – మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిననుసరించి నడుచుకొనుడి.౹

7 ఐగుప్తులోనుండి మీపితరులను రప్పించిన దినము మొదలుకొని నేటివరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచు వచ్చితిని; నా మాట వినుడి అని పెందలకడ లేచి చెప్పుచు వచ్చితిని

8 అయినను వారు తమ దుష్టహృదయములో పుట్టు మూర్ఖతచొప్పున నడుచుచు వినకపోయిరి; చెవి యొగ్గినవారు కాకపోయిరి, వారు అనుసరింపవలెనని నేను వారికాజ్ఞాపించిన యీ నిబంధన మాటలన్నిటి ననుసరించి నడువలేదు గనుక నేను ఆ నిబంధనలోని వాటినన్నిటిని వారిమీదికి రప్పించుచున్నాను.

9 మరియు యెహోవా నాతో ఈలాగు సెలవిచ్చెను– యూదావారిలోను యెరూషలేము నివాసులలోను కుట్ర జరుగునట్లుగా కనబడుచున్నది.౹

10 ఏదనగా వారు నా మాటలు విననొల్లకపోయిన తమపితరుల దోషచర్యలను జరుప తిరిగియున్నారు; మరియు వారు అన్యదేవతలను పూజించుటకై వాటిని అనుసరించుచు, వారి పితరులతో నేను చేసిన నిబంధనను ఇశ్రాయేలు వంశస్థులును యూదావంశస్థులును భంగము చేసియున్నారు.౹

11 కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు – తాము తప్పించుకొనజాలని కీడు వారిమీదికి రప్పింపబోవుచున్నాను, వారు నాకు మొఱ్ఱపెట్టినను నేను వారి మొఱ్ఱను వినకుందును.౹

12 యూదాపట్టణస్థులును యెరూషలేము నివాసులును పోయి తాము ధూపార్పణముచేయు దేవతలకు మొఱ్ఱపెట్టెదరు గాని వారి ఆపత్కాలములో అవి వారిని ఏమాత్రమును రక్షింపజాలవు.౹

13 యూదా, నీ పట్టణముల లెక్కచొప్పున నీకు దేవతలున్నవి గదా? యెరూషలేము నివాసులారా, బయలుదేవతకు ధూపము వేయవలెనని మీ వీధుల లెక్కచొప్పున లజ్జాకరమైన దానిపేరట బలిపీఠములను స్థాపించితిరి.౹

14 కావున నీవు ఈ ప్రజలనిమిత్తము ప్రార్థనచేయకుము; వారి నిమిత్తము మొఱ్ఱపెట్టకుము ప్రార్థనచేయకుము, వారు తమ కీడునుబట్టి నాకు మొఱ్ఱపెట్టునప్పుడు నేను వినను.

15 దుర్వ్యాపారము జరిగించిన నా ప్రియురాలికి నా మందిరముతో నిమిత్తమేమి? మ్రొక్కుబళ్లచేతను ప్రతిష్ఠిత మాంసము తినుటచేతను నీకు రావలసిన కీడు నీవు పోగొట్టు కొందువా? ఆలాగైతే నీవు ఉత్సహించుదువు.౹

16 అది చక్కని ఫలముగల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను; గొప్ప తుపాను ధ్వనితో దానిమీద మంటపెట్టగా దాని కొమ్మలు విరిగిపోవుచున్నవి.౹

17 ఇశ్రాయేలు వంశస్థులును యూదా వంశస్థులును బయలునకు ధూపార్పణముచేసి నాకు కోపము పుట్టించుటచేత తమం తట తామే చేసిన చెడుతనమునుబట్టి మిమ్మును నాటిన సైన్యములకధిపతియగు యెహోవా మీకు కీడుచేయ నిర్ణయించుకొని యున్నాడు.

18 దానిని యెహోవా నాకు తెలియజేయగా నేను గ్రహించితిని; ఆయనవారి క్రియలను నాకు కనుపరచెను.౹

19 అయితే నేను వధకు తేబడుచుండు సాధువైన గొఱ్ఱెపిల్లవలె ఉంటిని ; మనము చెట్టును దాని ఫలమును నశింపజేయుదము రండి, వాని పేరు ఇకను జ్ఞాపకము చేయబడకపోవునట్లు బ్రదుకువారిలో నుండకుండ వాని నిర్మూలము చేయుదము రండని వారు నామీద చేసిన దురాలోచనలను నేనెరుగకయుంటిని.౹

20 నీతినిబట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను, హృదయమును శోధించు వాడు సైన్యములకధిపతియగు యెహోవాయే. యెహోవా, నా వ్యాజ్యెభారమును నీమీదనే వేయుచున్నాను; వారికి నీవుచేయు ప్రతిదండనను నన్ను చూడనిమ్ము.౹

21 కావున –నీవు మాచేత చావకుండునట్లు యెహోవా నామమున ప్రవచింపకూడదని చెప్పు అనాతోతు వారినిగూర్చి యెహోవా ఇట్లని సెలవిచ్చుచున్నాడు

22 –సైన్యములకధిపతియగు యెహోవావారినిగూర్చి సెలవిచ్చునదేమనగా – నేను వారిని శిక్షింపబోవుచున్నాను, వారి యౌవనులు ఖడ్గముచేత చంపబడెదరు, వారి కుమారులును కుమార్తెలును క్షామమువలన చచ్చెదరు;౹

23 వారికి శేషమేమియు లేకపోవును, నేను వారిని దర్శించు సంవత్సరమున అనాతోతు కీడును వారిమీదికి రప్పింతును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/11-35b21bc15abe6fca021257d4c829dd24.mp3?version_id=1787—

Categories
యిర్మీయా

యిర్మీయా 12

1 యెహోవా, నేను నీతో వాదించునప్పుడు నీవు నీతిమంతుడవుగా కనబడుదువు; అయినను న్యాయము విధించుటనుగూర్చి నేను నీతో మాటలాడుదును; దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేల? మహా విశ్వాసఘాతకులు సుఖింపనేల?

2 నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలముల నిచ్చుచున్నారు; వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు గాని వారి అంతరింద్రియములకు దూరముగా ఉన్నావు.౹

3 యెహోవా, నీవు నన్నెరిగియున్నావు; నన్ను చూచుచున్నావు; నా హృదయము నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు; వధకు ఏర్పడిన గొఱ్ఱెలనువలె వారిని హతముచేయుము, వధదినమునకు వారిని ప్రతిష్ఠించుము.౹

4 భూమి యెన్నాళ్లు దుఃఖింపవలెను? దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్లు ఎండిపోవలెను? అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా దేశములో నివసించువారి చెడుతనమువలన జంతువులును పక్షులును సమసిపోవుచున్నవి.౹

5 –నీవు పాదచారులతో పరుగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి గదా? నీవు రౌతులతో ఏలాగు పోరాడుదువు? నెమ్మదిగల స్థలమున నీవు క్షేమముగా ఉన్నావుగదా? యొర్దాను ప్రవాహముగా వచ్చునప్పుడు నీవేమి చేయుదువు?

6 నీ సహోదరులు సహితము నీ తండ్రి ఇంటివారు సహితము నీకు ద్రోహము చేయుచున్నారు; నీ వెంబడి గేలిచేయుదురు, వారు నీతో దయగా మాటలాడుచున్నను నీవు వారిని నమ్మకూడదు.

7 నా మందిరమును నేను విడిచియున్నాను, నా స్వాస్థ్యమును విసర్జించియున్నాను; నా ప్రాణప్రియురాలిని ఆమె శత్రువులచేతికి అప్పగించియున్నాను.౹

8 నా స్వాస్థ్యము నాకు అడవిలోని సింహమువంటిదాయెను; ఆమె నామీద గర్జించుచున్నది గనుక నేను ఆమెకు విరోధినైతిని.౹

9 నా స్వాస్థ్యము నాకు పొడల పొడల క్రూరపక్షి ఆయెనా? క్రూరపక్షులు దానిచుట్టు కూడుచున్నవా? రండి అడవిజంతువులన్నిటిని పోగు చేయుడి; మ్రింగివేయుటకై అవి రావలెను.౹

10 కాపరులనేకులు నా ద్రాక్షతోటలను చెరిపివేసియున్నారు, నా సొత్తును త్రొక్కివేసియున్నారు; నాకిష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసియున్నారు.౹

11 వారు దాని పాడు చేయగా అది పాడై నన్ను చూచి దుఃఖించుచున్నది; దానిగూర్చి చింతించువాడొకడును లేడు గనుక దేశమంతయు పాడాయెను.౹

12 పాడుచేయువారు అరణ్య మందలి చెట్లులేని మెట్టలన్నిటిమీదికి వచ్చుచున్నారు; దేశముయొక్క యీ కొననుండి ఆ కొనవరకు యెహోవా ఖడ్గము తిరుగుచు హతము చేయుచున్నది; శరీరులకు క్షేమ మేమియు లేదు.౹

13 జనులు గోధుమలు చల్లి ముండ్లపంట కోయుదురు; వారు అలసట పడుచున్నారు గాని ప్రయోజనము లేకపోయెను; యెహోవా కోపాగ్నివలన కోతకు పంటలేక మీరు సిగ్గుపడుదురు.

14 నేను నాజనులైన ఇశ్రాయేలునకు స్వాధీనపరచిన స్వాస్థ్యము నాక్రమించుకొను దుష్టులగు నా పొరుగు వారినిగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు –నేను వారి దేశములోనుండి వారిని పెల్లగింతును; మరియు వారి మధ్యనుండి యూదావారిని పెల్లగింతును.౹

15 వారిని పెల్లగించిన తరువాత నేను మరల వారియెడల జాలిపడుదును; ఒక్కొకని తన స్వాస్థ్యమునకును ఒక్కొకని తన దేశమునకును వారిని రప్పింతును.౹

16 బయలుతోడని ప్రమాణము చేయుట వారు నా ప్రజలకు నేర్పినట్లుగా యెహోవా జీవముతోడని నా నామమునుబట్టి ప్రమాణము చేయుటకై తాము నా ప్రజలమార్గములను జాగ్రత్తగా నేర్చుకొనినయెడల వారు నా ప్రజలమధ్య వర్ధిల్లుదురు.౹

17 అయితే వారు నా మాట విననొల్లని యెడల నేను ఆ జనమును వేరుతో పెల్లగించి బొత్తిగా నాశనము చేతును; ఇదే యెహోవా వాక్కు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/12-53d4fe1adb1b85f5072b9beb26dd65ef.mp3?version_id=1787—

Categories
యిర్మీయా

యిర్మీయా 13

1 యెహోవా నాతో ఈలాగు సెలవిచ్చెను–నీవు వెళ్లి అవిసెనార నడికట్టుకొని నీ నడుమున దానిని కట్టుకొనుము, నీళ్లలో దాని వేయకుము.౹

2 కావున యెహోవా మాటచొప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమున కట్టుకొంటిని.౹

3 రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై

4 –నీవు కొని నడుమున కట్టుకొనిన నడి కట్టును తీసికొని, లేచి యూఫ్రటీసునొద్దకు పోయి అక్కడ నున్న బండబీటలో దానిని దాచిపెట్టుమనగా

5 యెహోవా నాకాజ్ఞాపించినట్లు నేను పోయి యూఫ్రటీసునొద్ద దాని దాచిపెట్టితిని.౹

6 అనేక దినములైన తరువాత యెహోవా– నీవు లేచి యూఫ్రటీసునొద్దకు పోయి, నేను అక్కడ దాచి పెట్టుమని నీకాజ్ఞాపించిన నడికట్టును అక్కడనుండి తీసికొనుమని నాతో చెప్పగా

7 నేను యూఫ్రటీసునొద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాచి పెట్టినచోటనుండి దాని తీసికొంటిని; నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయి యుండెను; అది దేనికిని పనికిరానిదాయెను.౹

8 కాగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

9 –యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు –ఈ విధముగానే యూదావారి గర్వమును యెరూషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరచుదును.౹

10 అన్యదేవతలను పూజించుచు వాటికి నమస్కారము చేయుదుమని వాటిననుసరించుచు, నా మాటలు విన నొల్లక తమ హృదయకాఠిన్యము చొప్పున నడుచుకొను ఈ ప్రజలు దేనికిని పనికిరాని యీ నడికట్టువలె అగుదురు.౹

11 నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థుల నందరిని యూదా వంశస్థులనందరిని, నడికట్టు నరుని నడుముకు అంటియున్నరీతిగా నన్ను అంటియుండజేసితిని గాని వారు నా మాటలు వినకపోయి యున్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹

12 కాబట్టి నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ప్రతి సిద్దెయు ద్రాక్షారసముతో నింపబడును. –ప్రతి సిద్దెయు ద్రాక్షారసముతో నింపబడునని మాకు తెలియదా అని వారు నీతో అనినయెడల

13 నీవు వారితో ఈ మాట చెప్పుము –యెహోవా సెలవిచ్చునదేమనగా–ఈ దేశనివాసుల నందరిని, దావీదు సింహాసనముమీద కూర్చుండు రాజులనేమి యాజకులనేమి ప్రవక్తలనేమి యెరూషలేము నివాసులనందరిని నేను మత్తులుగా చేయబోవుచున్నాను.౹

14 అప్పుడు నేను తండ్రులను కుమారులను అందరిని ఏకముగా ఒకనిమీద ఒకని పడద్రోయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు; వారిని కరుణింపను శిక్షింపక పోను; వారియెడల జాలిపడక నేను వారిని నశింప జేసెదను.

15 చెవి యొగ్గి వినుడి; యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి.౹

16 ఆయన చీకటి కమ్మజేయకమునుపే, మీ కాళ్లు చీకటి కొండలకు తగులకమునుపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా చేయకమునుపే, మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి.౹

17 అయినను మీరు ఆ మాట విననొల్లని యెడల మీ గర్వమునుబట్టి నేను చాటున ఏడ్చుదును; యెహోవామంద చెరపట్టబడి నందున నా నేత్రము బహుగా వలపోయుచు కన్నీరు విడుచుచు నుండును.౹

18 రాజును తల్లియైన రాణిని చూచి ఇట్లనుము–మీ శిరోభూషణములును తలమీదనున్న మీ సుందరకిరీటమును పడిపోయెను; క్రుంగి కూర్చుండుడి.౹

19 దక్షిణదేశ పట్టణములు మూయబడియున్నవి; వాటిని తెరువగలవాడెవడును లేడు; యూదావారందరు చెరపట్ట బడిరి; ఏమియులేకుండ సమస్తము కొనిపోబడెను.

20 కన్నులెత్తి ఉత్తరమునుండి వచ్చుచున్నవారిని చూడుడి; నీకియ్యబడిన మంద నీ సౌందర్యమైన మంద ఎక్కడ నున్నది?

21 నీవు నీకు స్నేహితులుగా చేసికొనినవారిని ఆయన నీమీద అధిపతులుగా నియమించునప్పుడు నీవేమి చెప్పెదవు? ప్రసవించు స్త్రీ వేదనవంటి వేదన నిన్ను పట్టును గదా?

22 నీవు–ఇవి నా కేల సంభవించెనని నీ మనస్సులో అనుకొనినయెడల నీవు చేసిన విస్తారమైన దోషములనుబట్టి నీ బట్టచెంగులు తొలగిపోయెను, నీ మడిమెలు సిగ్గు నొందెను.౹

23 కూషుదేశస్ధుడు తన చర్మమును మార్చు కొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగినయెడల కీడుచేయుటకు అలవాటుపడిన మీరును మేలుచేయ వల్లపడును.౹

24 కాబట్టి అడవిగాలికి పొట్టు ఎగురునట్లు నేను వారిని చెదరగొట్టెదను.౹

25 నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరచితివి గనుక ఇది నీకు వంతు, నాచేత నీకు కొలవబడిన భాగమని యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹

26 కాబట్టి నీ అవమానము కనబడునట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖముమీదికి ఎత్తు చున్నాను.౹

27 నీ వ్యభిచారమును నీ సకిలింపును నీ జార కార్యములను కామాతురతను నేనెరుగుదును; పొలములలో నున్న మెట్టలమీద నీ హేయక్రియలు నాకు కనబడుచున్నవి; యెరూషలేమా, నీకు శ్రమ, నిన్ను నీవు పవిత్ర పరచుకొననొల్లవు; ఇక నెంత కాలము ఈలాగు జరుగును?

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/13-400fc1b0590bd654484d1c5250cd41fb.mp3?version_id=1787—

Categories
యిర్మీయా

యిర్మీయా 14

1 కరవుకాలమున జరిగినదానిగూర్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు.౹

2 –యూదా దుఃఖించు చున్నది, దాని గుమ్మములు అంగలార్చుచున్నవి, జనులు విచారగ్రస్తులై నేలకు వంగుదురు, యెరూషలేముచేయు అంగలార్పు పైకెక్కుచున్నది.౹

3 వారిలో ప్రధానులు బీద వారిని నీళ్లకు పంపుచున్నారు, వారు చెరువులయొద్దకు రాగా నీళ్లు దొరుకుటలేదు, వట్టికుండలు తీసికొని వారు మరల వచ్చుచున్నారు, సిగ్గును అవమానము నొందినవారై తమ తలలు కప్పుకొనుచున్నారు.౹

4 దేశములో వర్షము కురువక పోయినందున నేల చీలియున్నది గనుక సేద్యము చేయువారు సిగ్గుపడి తలలు కప్పుకొనుచున్నారు.౹

5 లేళ్లు పొలములో ఈని గడ్డిలేనందున పిల్లలను విడిచిపెట్టుచున్నవి.౹

6 అడవి గాడిదలును చెట్లులేని మెట్టలమీద నిలువబడి నక్కలవలె గాలి పీల్చుచున్నవి, మేత ఏమియు లేనందున వాటి కన్నులు క్షీణించుచున్నవి.

7 యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధముగా మేము పాపముచేసితిమి; మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి; నీ నామమునుబట్టి నీవే కార్యము జరిగించుము.౹

8 ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశములో నీ వేల పరదేశివలెనున్నావు? ఏల రాత్రివేళను బసచేయుటకు గుడారమువేయు ప్రయాణస్థునివలె ఉన్నావు;౹

9 భ్రమసియున్నవానివలెను రక్షింపలేని శూరునివలెను నీవేల ఉన్నావు? యెహోవా, నీవు మామధ్య నున్నావే; మేము నీ పేరుపెట్టబడినవారము; మమ్మును చెయ్యి విడువకుము.

10 యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు–ఈ జనులు తమ కాళ్లకు అడ్డములేకుండ తిరుగులాడుటకు ఇచ్ఛగలవారు గనుక యెహోవావారిని అంగీకరింపడు; ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసికొనును; వారి పాపములనుబట్టి వారిని శిక్షిం చును.౹

11 మరియు యెహోవా నాతో ఇట్లనెను–వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయ కుము.౹

12 వారు ఉపవాసమున్నప్పుడు నేను వారి మొఱ్ఱను వినను; వారు దహనబలియైనను నైవేద్యమైనను అర్పించు నప్పుడు నేను వాటిని అంగీకరింపను; ఖడ్గమువలనను క్షామమువలనను తెగులువలనను వారిని నాశము చేసెదను

13 అందుకు నేను–అయ్యో, ప్రభువైన యెహోవా–మీరు ఖడ్గము చూడరు మీకు క్షామము కలుగదు, ఈ చోటను నేను స్థిరమైన సమాధానము మీకిచ్చెదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారవి నేననగా

14 యెహోవా నాతో ఇట్లనెను–ప్రవక్తలు నా నామమునుబట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు; నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాటలాడలేదు, వారు అసత్య దర్శనమును శకునమును మాయతంత్రమును తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు.౹

15 కావున నేను వారిని పంపకపోయినను, నా నామమునుబట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశములోనికి రాదని చెప్పుచు అబద్ధప్రవచనములు ప్రకటించు ప్రవక్తలనుగూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఆ ప్రవక్తలు ఖడ్గమువలనను క్షామమువలనను లయమగుదురు.౹

16 వారెవరితో అట్టి ప్రవచనములు చెప్పుదురో ఆ జనులు క్షామమునకును ఖడ్గమునకును పాలై యెరూషలేము వీధులలో పడవేయ బడెదరు; నేను వారి చెడుతనమును వారిమీదికి రప్పించెదను. వారినైనను వారి భార్యలనైనను వారి కుమారులనైనను వారి కుమార్తెలనైనను పాతిపెట్టువాడెవడును లేక పోవును.౹

17 నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా–నా జనుల కన్యక గొప్ప ఉపద్రవమువలన పీడింపబడుచున్నది, ఘోరమైన గాయము నొందియున్నది; దివారాత్రము మానక నా కన్నులనుండి కన్నీరు కారుచున్నది.౹

18 పొలములోనికి నేను పోగా ఖడ్గముచేత హతులైనవారు కనబడుదురు, పట్టణములో ప్రవేశింపగా క్షామపీడితులు అచ్చట నుందురు; ప్రవక్తలేమి యాజకులేమి తామెరుగని దేశమునకు పోవలెనని ప్రయాణమైయున్నారు.

19 నీవు యూదాను బొత్తిగా విసర్జించితివా? సీయోను నీకు అసహ్యమాయెనా? మాకు చికిత్స దొరకకుండునంతగా నీవేల మమ్మును కొట్టితివి? మేము సమాధానముకొరకు కని పెట్టుచున్నాము గాని మేలేదియు కనబడుటలేదు; చికిత్స కలుగు కాలముకొరకు కనిపెట్టుచున్నాము గాని భీతి తగిలియున్నది.౹

20 యెహోవా, మా దుర్మార్గతను మా పితరుల దోషమును మేము ఒప్పుకొనుచున్నాము; నీకు విరో ధముగా పాపము చేసియున్నాము.౹

21 నీ నామమునుబట్టి మమ్మును త్రోసివేయకుము, ప్రశస్తమైన నీ సింహాసనమును అవమానపరచకుము, మాతో నీవు చేసిన నిబంధనను జ్ఞాపకము చేసికొనుము, దాని భ్రష్టపరచకుమీ.౹

22 జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగలవారున్నారా? ఆకాశము వాననియ్యగలదా? మా దేవుడవైన యెహోవా, నీవేగదా దాని చేయుచున్నావు? నీవే యీ క్రియలన్నియు చేయుచున్నావు; నీకొరకే మేముకనిపెట్టుచున్నాము.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/14-6508972a9df63984d4e80947257936d9.mp3?version_id=1787—

Categories
యిర్మీయా

యిర్మీయా 15

1 అప్పుడు యెహోవా నాకీలాగు సెలవిచ్చెను– మోషేయు సమూయేలును నాయెదుట నిలువబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు, నా సన్నిధి నుండకుండ వారిని వెళ్లగొట్టుము.౹

2 మేమెక్కడికి పోదుమని వారు నిన్నడిగినయెడల నీవు వారితో నిట్లనుము. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–చావునకు నియమింపబడినవారు చావునకును, ఖడ్గమునకు నియమింప బడినవారు ఖడ్గమునకును, క్షామమునకు నియమింపబడినవారు క్షామమునకును, చెరకు నియమింపబడినవారు చెరకును పోవలెను.౹

3 యెహోవా వాక్కు ఇదే–చంపుటకు ఖడ్గము, చీల్చుటకు కుక్కలు, తినివేయుటకును నాశనము చేయుటకును ఆకాశపక్షులు భూమృగములు అను ఈ నాలుగు విధముల బాధలు వారికి నియమించియున్నాను.౹

4 యూదారాజైన హిజ్కియా కుమారుడగు మనష్షే యెరూషలేములో చేసిన క్రియలనుబట్టి భూమిమీదనున్న సకలరాజ్యములలోనికి యిటు అటు చెదరగొట్టబడునట్లు వారిని అప్పగించుచున్నాను.౹

5 యెరూషలేమా, నిన్ను కరుణించువాడెవడు? నీయందు జాలిపడువాడెవడు? కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవడు త్రోవవిడిచి నీయొద్దకు వచ్చును?

6 యెహోవా వాక్కు ఇదే–నీవు నన్ను విసర్జించియున్నావు వెనుకతీసియున్నావు గనుక నిన్ను నశింప జేయునట్లు నేను నీ మీదికి నాచేతిని చాచియున్నాను; సంతాపపడి పడి నేను విసికియున్నాను.౹

7 దేశద్వారములో నేను వారిని చేటతో తూర్పారపట్టుచున్నాను, నా జనులు తమ మార్గములను విడిచి నాయొద్దకు రారు గనుక వారిని సంతానహీనులుగా చేయుచున్నాను, నశింపజేయు చున్నాను.౹

8 వారి విధవరాండ్రు సముద్రపు ఇసుకకంటె విస్తారముగా ఉందురు; మధ్యాహ్నకాలమున యౌవనుల తల్లిమీదికి దోచుకొనువారిని నేను రప్పింతును; పరితాపమును భయములను ఆకస్మాత్తుగా వారిమీదికి రాజేతును.౹

9 ఏడుగురిని కనిన స్త్రీ క్షీణించుచున్నది; ఆమె ప్రాణము విడిచియున్నది; పగటివేళనే ఆమెకు ప్రొద్దు గ్రుంకి యున్నది. ఆమె సిగ్గుపడి అవమానము నొందియున్నది; వారిలో శేషించిన వారిని తమ శత్రువులయెదుట కత్తి పాలు చేసెదను; ఇదే యెహోవా వాక్కు.

10 అయ్యో నాకు శ్రమ; నా తల్లీ, జగడమాడువానిగాను దేశస్థులందరితో కలహించువానిగాను నీవేల నన్ను కంటివి? వడ్డికి నేను బదులియ్యలేదు, వారు నాకు బదు లిచ్చినవారు కారు అయినను వారందరు నన్ను శపించుచున్నారు.౹

11 అందుకు యెహోవా–నిశ్చయముగా నీకు మేలుచేయవలెనని నేను నిన్ను బలపరచుచున్నాను, కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలిడునట్లు చేయుదునని సెలవిచ్చెను.

12 ఇనుమునైనను ఉత్తరమునుండి వచ్చు యినుమునైననుకంచునైనను ఎవడైన విరువగలడా?

13 నా జనులారా మీ ప్రాంతములన్నిటిలో మీరుచేయు సమస్త పాపములనుబట్టి మీ స్వాస్థ్యమును నిధులను క్రయములేకుండ నేను దోపుడు సొమ్ముగా అప్పగించుచున్నాను.౹

14 నీవెరుగని దేశములో నీ శత్రువులకు నిన్ను దాసునిగా చేతును, నా కోపాగ్ని రగులుకొనుచు నిన్ను దహించును.

15 యెహోవా, నా శ్రమ నీకే తెలిసియున్నది; నన్ను జ్ఞాపకము చేసికొనుము, నన్ను దర్శించుము, నన్ను హింసించువారికి నాకొరకై ప్రతి దండన చేయుము, నీవు దీర్ఘశాంతి కలిగినవాడవై నన్ను కొనిపోకుము, నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలిసికొనుము.౹

16 నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని; సైన్యములకధిపతివగు యెహోవా, దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి.౹

17 సంతోషించు వారి సమూహములో నేను కూర్చుండలేదు నేను ఉల్లసింపలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపి యున్నావు గనుక, నీ హస్తమునుబట్టి నేను ఏకాకినై కూర్చుంటిని.౹

18 నా బాధ యేల యెడతెగనిదాయెను? నా గాయము ఏల ఘోరమైనదాయెను? అది స్వస్థత నొందకపోనేల? నిశ్చయముగా నీవు నాకు ఎండమావుల వవుదువా? నిలువని జలములవవుదువా?

19 కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చెను–నీవు నాతట్టు తిరిగినయెడల నీవు నా సన్నిధిని నిలుచునట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో యేవి ఘనములో నీవు గురుతుపెట్టినయెడల నీవు నా నోటివలె ఉందువు; వారు నీతట్టునకు తిరుగవలెనుగాని నీవు వారితట్టునకు తిరుగకూడదు

20 అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని యిత్తడి ప్రాకారముగా నేను నియమించెదను; నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైయుందును గనుక వారు నీమీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹

21 దుష్టుల చేతిలోనుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలోనుండి నిన్ను విమో చించెదను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JER/15-3290c9662e132449d71bdb70687d3eb4.mp3?version_id=1787—