Categories
నిర్గమకాండము

నిర్గమకాండము 1

1 ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీయుల పేరులు ఏవనగా, రూబేను షిమ్యోను లేవి యూదా ఇశ్శాఖారు జెబూలూను బెన్యామీను.౹

2-5 దాను నఫ్తాలి గాదు ఆషేరు. వీరిలో ప్రతివాడును తన తన కుటుంబముతో వచ్చెను. యాకోబు గర్భమున పుట్టినవారందరు డెబ్బదిమంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను.౹

6 యోసేపును అతని అన్నదమ్ములందరును ఆ తరము వారందరును చనిపోయిరి.౹

7 ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబ లిరి; వారున్న ప్రదేశము వారితో నిండి యుండెను.

8 అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్తరాజు ఐగుప్తును ఏల నారంభించెను.౹

9 అతడు తన జనులతో ఇట్లనెను– ఇదిగో ఇశ్రాయేలు సంతతియైన యీ జనము మనకంటె విస్తారముగాను బలిష్ఠముగాను ఉన్నది.౹

10 వారు విస్తరింపకుండునట్లు మనము వారియెడల యుక్తిగా జరిగించుదము రండి; లేనియెడల యుద్ధము కలుగునప్పుడు కూడ మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధముచేసి యీ దేశములోనుండి, వెళ్లిపోదురేమో అనెను.౹

11 కాబట్టి వారిమీద పెట్టిన భారములలో వారిని శ్రమపెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారిమీద నియ మింపగా వారు ఫరోకొరకు ధాన్యాదులను నిలువచేయు పీతోము రామెసేసను పట్టణములను కట్టిరి.౹

12 అయినను ఐగుప్తీయులు వారిని శ్రమపెట్టినకొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల యెడల అసహ్య పడిరి.౹

13 ఇశ్రాయేలీయులచేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి;౹

14 వారు ఇశ్రాయేలీయులచేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములోచేయు ప్రతిపనిలోను కఠినసేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి.

15 మరియు ఐగుప్తురాజు షిఫ్రా పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాటలాడి

16 –మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసానిపని చేయుచు వారిని కాన్పుపీటలమీద చూచినప్పుడు మగవాడైనయెడల వాని చంపుడి, ఆడుదైనయెడల దాని బ్రదుకనియ్యుడని వారితో చెప్పెను.౹

17 అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి, ఐగుప్తురాజు తమ కాజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రదుకనియ్యగా

18 ఐగుప్తురాజు ఆ మంత్రసానులను పిలిపించి–మీరెందుకు మగపిల్లలను బ్రదుకనిచ్చితిరి? ఈ పని యేల చేసితిరి అని అడిగెను.౹

19 అందుకు ఆ మంత్ర సానులు–హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలవంటివారు కారు; వారు చురుకైనవారు. మంత్రసాని వారియొద్దకు వెళ్లకమునుపే వారు ప్రసవించి యుందురని ఫరోతో చెప్పిరి.౹

20 దేవుడు ఆ మంత్రసానులకు మేలుచేసెను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను.౹

21 ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను.౹

22 అయితే ఫరో–హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రదుకనియ్యుడి అని తన జనులందరికి ఆజ్ఞాపించెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EXO/1-6f88ab58ebbe077fb71795956e480489.mp3?version_id=1787—

Categories
నిర్గమకాండము

నిర్గమకాండము 2

1 లేవి వంశస్థుడొకడు వెళ్లి లేవి కుమార్తెను వివాహము చేసికొనెను.౹

2 ఆ స్త్రీ గర్భవతియై కుమారుని కని,వాడు సుందరుడైయుండుట చూచి మూడునెలలు వానిని దాచెను.౹

3 తరువాత ఆమె వాని దాచలేక వానికొరకు ఒక జమ్ముపెట్టె తీసికొని, దానికి జిగటమన్నును కీలును పూసి, అందులో ఆ పిల్లవానినిపెట్టి యేటియొడ్డున జమ్ములో దానిని ఉంచగా,౹

4 వానికేమి సంభవించునో తెలిసికొనుటకు వాని అక్క దూరముగా నిలిచియుండెను.౹

5 ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటియొడ్డున నడుచుచుండగా ఆమె నాచు లోని ఆ పెట్టెను చూచి, తన పనికత్తె నొకతెను పంపి దాని తెప్పించి

6 తెరచి ఆ పిల్లవాని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వానియందు కనికరించి– వీడు హెబ్రీయుల పిల్లలలో నొకడనెను.౹

7 అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీకొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్లి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వత్తునా అనెను.౹

8 అందుకు ఫరో కుమార్తె–వెళ్లుమని చెప్పగా ఆ చిన్నది వెళ్లి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను.౹

9 ఫరో కుమార్తె ఆమెతో–ఈ బిడ్డను తీసికొనిపోయి నాకొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చెదనని చెప్పగా, ఆ స్త్రీ ఆ బిడ్డను తీసికొనిపోయి పాలిచ్చి పెంచెను.౹

10 ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతని తీసికొని వచ్చెను, అతడు ఆమెకు కుమారుడాయెను. ఆమె–నీటిలోనుండి ఇతని తీసితినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను.

11 ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనులయొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను.౹

12 అతడు ఇటు అటు తిరిగి చూచి యెవడును లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి యిసుకలో వాని కప్పి పెట్టెను.౹

13 మరునాడు అతడు బయట నడిచి వెళ్లుచుండగా హెబ్రీయులైన మనుష్యులిద్దరు పోట్లాడుచుండిరి.౹

14 అప్పుడతడు అన్యాయము చేసినవాని చూచి–నీ వేల నీ పొరుగువాని కొట్టుచున్నావని అడుగగా అతడు–మామీద నిన్ను అధికారినిగాను తీర్పరినిగాను నియమించినవాడెవడు? నీవు ఆ ఐగుప్తీయుని చంపినట్లు నన్నును చంపవలెనని అనుకొనుచున్నావా అనెను. అందుకు మోషే–నిశ్చయముగా ఈ సంగతి బయలు పడెననుకొని భయపడెను.౹

15 ఫరో ఆ సంగతి విని మోషేను చంప చూచెనుగాని, మోషే ఫరో యెదుటనుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచి పోయి యొక బావియొద్ద కూర్చుండెను.౹

16 మిద్యాను యాజకునికి ఏడుగురు కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా

17 మందకాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టెను.౹

18 వారు తమ తండ్రియైన రగూయేలు నొద్దకు వచ్చినప్పుడు అతడు–నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చితిరనెను.౹

19 అందుకు వారు–ఐగుప్తీయుడొకడు మందకాపరుల చేతిలోనుండి మమ్మును తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టెననగా

20 అతడు తన కుమార్తెలతో–అతడెక్కడ? ఆ మనుష్యుని ఏల విడిచి వచ్చితిరి? భోజనమునకు అతని పిలుచుకొని రండనెను.౹

21 మోషే ఆ మనుష్యునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తెయైన సిప్పోరాను మోషే కిచ్చెను.౹

22 ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే–నేను అన్య దేశములో పర దేశినై యుంటిననుకొని వానికి గెర్షోముఅనుపేరు పెట్టెను.

23 ఆలాగున అనేక దినములు జరిగినమీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులనుబట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టు చుండగా, తమ వెట్టి పనులనుబట్టి వారు పెట్టిన మొర దేవునియొద్దకు చేరెను.౹

24 కాగా దేవుడు వారి మూలుగును విని, అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను.౹

25 దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను; దేవుడు వారియందు లక్ష్యముంచెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EXO/2-ef394d22ef693e28034c14cc4fcc54c4.mp3?version_id=1787—

Categories
నిర్గమకాండము

నిర్గమకాండము 3

1 మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు, ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను.౹

2 ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవాదూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను.గాని పొద కాలిపోలేదు.౹

3 అప్పుడు మోషే–ఆ పొద యేల కాలిపోలేదో నేను ఆతట్టు వెళ్లి యీ గొప్పవింత చూచెదననుకొనెను.౹

4 దానిని చూచుటకు అతడు ఆతట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమనుండి–మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు–చిత్తము ప్రభువా అనెను.౹

5 అందుకాయన–దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను.౹

6 మరియు ఆయన–నేను నీ తండ్రి దేవుడను, అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవునివైపు చూడ వెరచెను.౹

7 మరియు యెహోవా యిట్లనెను–నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపట్టువారినిబట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే యున్నవి.౹

8 కాబట్టి ఐగుప్తీయుల చేతిలోనుండి వారిని విడిపించుటకును, ఆ దేశములోనుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు హిత్తీయులకు అమోరీయులకు పెరిజ్జీయులకు హివ్వీయులకు యెబూసీయులకు నివాసస్థానమై, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చియున్నాను.౹

9 ఇశ్రాయేలీయుల మొర నిజముగా నాయొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారినిపెట్టు చున్న హింస చూచితిని.౹

10 కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను; ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులోనుండి తోడుకొని పోవలెననెను.౹

11 అందుకు మోషే–నేను ఫరో యొద్దకు వెళ్లుటకును, ఇశ్రాయేలీయులను ఐగుప్తులోనుండి తోడుకొని పోవుటకును ఎంతటివాడనని దేవునితో అనగా

12 ఆయన–నిశ్చయముగా నేను నీకు తోడైయుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన; నీవు ఆ ప్రజలను ఐగుప్తులోనుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతముమీద దేవుని సేవించెదరనెను.౹

13 మోషే–చిత్తగించుము; నేను ఇశ్రాయేలీయులయొద్దకు వెళ్లి వారిని చూచి–మీపితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు–ఆయన పేరేమి అని అడిగినయెడల వారితో నే నేమి చెప్పవలెనని దేవుని నడిగెను.౹

14 అందుకు దేవుడు–నేను ఉన్నవాడనుఅను వాడనైయున్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన–ఉండుననువాడు మీయొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెననెను.౹

15 మరియు దేవుడు మోషేతో నిట్లనెను–మీపితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము.౹

16 నీవు వెళ్లి ఇశ్రాయేలీయుల పెద్దలను పోగు చేసి–మీపితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు, నాకు ప్రత్యక్షమై యిట్లనెను – నేను మిమ్మును, ఐగుప్తులో మీకు సంభవించిన దానిని, నిశ్చయముగా చూచితిని,౹

17 ఐగుప్తు బాధలోనుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు, అనగా కనానీయులు హిత్తీయులు అమోరీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులున్న దేశమునకు మిమ్ము రప్పించెదనని సెలవిచ్చితినని వారితో చెప్పుము.౹

18 వారు నీ మాట విందురు గనుక నీవును ఇశ్రాయేలీయుల పెద్దలును ఐగుప్తు రాజునొద్దకు వెళ్లి అతని చూచి–హెబ్రీ యులదేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయెను గనుక మేము అరణ్యమునకు మూడుదినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించుదుము సెలవిమ్మని అతనితో చెప్పవలెను.౹

19 ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదికి వచ్చి మిమ్ము పోనియ్యడని నేనెరుగుదును;౹

20 కాని, నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యమున నేను చేయదలచియున్న నా అద్భు తములన్నిటిని చూపి దాని పాడుచేసెదను. అటుతరువాత అతడు మిమ్ము పంపివేయును.౹

21 మరియు నేను ఈ జనుల యెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెదను గనుక మీరు వెళ్లునప్పుడు వట్టిచేతులతో వెళ్లరు.౹

22 ప్రతి స్త్రీయు తన పొరుగుదానిని తన యింటనుండు దానిని వెండినగలను బంగారునగలను వస్త్రములను ఇమ్మని అడిగి తీసికొని, మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపచేసి ఐగుప్తీయులను దోచుకొందురనెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EXO/3-549b0b355b86f35a3987276efd658b06.mp3?version_id=1787—

Categories
నిర్గమకాండము

నిర్గమకాండము 4

1 అందుకు మోషే–చిత్తగించుము; వారు నన్ను నమ్మరు నా మాట వినరు–యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమియ్యగా

2 యెహోవా–నీ చేతిలోనిది ఏమిటి అని అతని నడిగెను. అందుకతడు–కఱ్ఱ అనెను.౹

3 అప్పుడాయన–నేలను దాని పడవేయుమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. మోషే దాని నుండి పారిపోయెను.౹

4 అప్పుడు యెహోవా–నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనుమనగా, అతడు తన చెయ్యి చాపి దాని పట్టుకొనగానే అది అతనిచేతిలో కఱ్ఱ ఆయెను.౹

5 ఆయన –దానిచేత వారు తమపితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రాహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయెనని నమ్ముదురనెను.౹

6 మరియు యెహోవా–నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొను మనగా, అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠముగలదై హిమమువలె తెల్లగా ఆయెను.౹

7 తరువాత ఆయన–నీ చెయ్యి మరల నీ రొమ్మున ఉంచుకొనుమనగా, అతడు తన చెయ్యి మరల తన రొమ్మున ఉంచుకొని తన రొమ్మునుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరమువలె ఆయెను.౹

8 మరియు ఆయన–వారు నిన్ను నమ్మక, మొదటి సూచననుబట్టి వినకపోయినయెడల రెండవ దానిబట్టి విందురు.౹

9 వారు ఈ రెండు సూచనలనుబట్టి నమ్మక నీమాట వినకపోయినయెడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి యెండిన నేలమీద పోయవలెను. అప్పుడు నీవు ఏటిలోనుండి తీసిన నీళ్లు పొడినేలమీద రక్తమగుననెను.౹

10 అప్పుడు మోషే–ప్రభువా, ఇంతకుమునుపైనను, నీవు నీ దాసునితో మాటలాడినప్పటినుండి యైనను, నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా

11 యెహోవా–మానవునకు నోరిచ్చినవాడు ఎవడు? మూగ వానినేగాని చెవిటివానినేగాని దృష్టిగలవానినేగాని గ్రుడ్డి వానినేగాని పుట్టించినవాడెవడు? యెహోవానైన నేనే గదా.౹

12 కాబట్టి వెళ్లుము, నేను నీ నోటికి తోడైయుండి, నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించెదనని అతనితో చెప్పెను.౹

13 అందుకతడు–అయ్యో ప్రభువా, నీవు పంప తలంచినవానినే పంపుమనగా

14 ఆయన మోషేమీద కోపపడి–లేవీయుడగు నీ అన్నయైన అహరోను లేడా? అతడు బాగుగా మాటలాడగలడని నేనెరుగుదును, ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడు, అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును;౹

15 నీవు అతనితో మాటలాడి అతని నోటికి మాటలు అందించవలెను, నేను నీ నోటికి అతని నోటికి తోడై యుండి, మీరు చేయ వలసినదానిని మీకు బోధించెదను.౹

16 అతడే నీకు బదులు జనులతో మాటలాడును, అతడే నీకు నోరుగానుండును, నీవు అతనికి దేవుడవుగా ఉందువు.౹

17 ఈ కఱ్ఱను చేతపట్టుకొని దానితో ఆ సూచక క్రియలు చేయవలెనని చెప్పెను.

18 అటుతరువాత మోషే బయలుదేరి తన మామయైన యిత్రోయొద్దకు తిరిగి వెళ్లి–సెలవైనయెడల నేను ఐగుప్తులోనున్న నా బంధువులయొద్దకు మరల పోయి వారింక సజీవులై యున్నారేమో చూచెదనని అతనితో చెప్పగా యిత్రో–క్షేమముగా వెళ్లుమని మోషేతో అనెను.౹

19 అంతట యెహోవా–నీ ప్రాణమును వెదకిన మనుష్యులందరు చనిపోయిరి గనుక ఐగుప్తుకు తిరిగి వెళ్లు మని మిద్యానులో మోషేతో చెప్పగా,౹

20 మోషే తన భార్యను తన కుమారులను తీసికొని గాడిదమీద నెక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్లెను. మోషే దేవుని కఱ్ఱను తన చేతపట్టుకొని పోయెను.౹

21 అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను–నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత, చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నియు ఫరో యెదుట చేయవలెను సుమీ. అయితే నేను అతని హృదయమును కఠినపరచెదను, అతడు ఈ జనులను పోనియ్యడు.౹

22 అప్పుడు నీవు ఫరోతో–ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు;౹

23 నన్ను సేవించునట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను; వాని పంపనొల్లనియెడల ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను.౹

24 అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంపచూడగా

25 సిప్పోరా వాడిగల రాయి తీసికొని తన కుమారునికి సున్నతిచేసి అతని పాదములయొద్ద అది పడవేసి–నిజముగా నీవు నాకు రక్తసంబంధమైన పెనిమిటి వైతివనెను; అంతట ఆయన అతనిని విడిచెను.౹

26 అప్పుడు ఆమె–ఈ సున్నతినిబట్టి నీవు నాకు రక్తసంబంధమైన పెనిమిటివైతివనెను.

27 మరియు యెహోవా–మోషేను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్లుమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్లి దేవుని పర్వతమందు అతని కలిసికొని అతని ముద్దు పెట్టుకొనెను.౹

28 అప్పుడు మోషే తన్ను పంపిన యెహోవా పలుకుమన్న మాటలన్నిటిని, ఆయన చేయనాజ్ఞాపించిన సూచక క్రియలన్నిటిని అహరోనుకు తెలిపెను.

29 తరువాత మోషే అహరోనులు వెళ్లి ఇశ్రాయేలీయుల పెద్దలనందరిని పోగుచేసి,౹

30 యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నియు అహరోను వివరించి, జనులయెదుట ఆ సూచక క్రియలనుచేయగా జనులు నమ్మిరి.౹

31 మరియు–యెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టెనను మాట జనులు విని తలవంచుకొని నమస్కారము చేసిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EXO/4-4fd14ae506f37c5bdd5ae4a0d5ed0436.mp3?version_id=1787—

Categories
నిర్గమకాండము

నిర్గమకాండము 5

1 తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోనుచూచి–ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా–అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి.౹

2 ఫరో–నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయననెను.౹

3 అప్పుడు వారు–హెబ్రీయుల దేవుడు మమ్మును ఎదుర్కొనెను, సెలవైనయెడల మేము అరణ్యములోనికి మూడుదినముల ప్రయాణమంత దూరముపోయి మా దేవుడైన యెహోవాకుబలి అర్పించుదుము; లేనియెడల ఆయన మామీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో అనిరి.౹

4 అందుకు ఐగుప్తు రాజు–మోషే అహరోనూ, ఈ జనులు తమ పనులను చేయకుండ మీరేల ఆపుచున్నారు? మీ బరువులు మోయుటకు పొండనెను.౹

5 మరియు ఫరో–ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించియున్నది; వారు తమ బరువులను విడిచి తీరికగా నుండునట్లు మీరు చేయుచున్నారని వారితో అనెను.౹

6 ఆ దినమున ఫరో ప్రజలపైనున్న కార్యనియామకులకును వారి నాయకులకును ఇట్లు ఆజ్ఞాపించెను

7 –ఇటుకలు చేయుటకు మీరు ఇకమీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు, వారు వెళ్లి తామే గడ్డి కూర్చుకొనవలెను.౹

8 అయినను వారు ఇదివరకు చేసిన యిటుకల లెక్కనే వారిమీద మోపవలెను, దానిలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు; వారు సోమరులు గనుక–మేము వెళ్లి మా దేవునికిబలి నర్పించుటకు సెలవిమ్మని మొఱ పెట్టుచున్నారు.౹

9 ఆ మనుష్యులచేత ఎక్కువ పని చేయింపవలెను, దానిలో వారు కష్టపడవలెను, అబద్ధపుమాటలను వారు లక్ష్యపెట్టకూడదనెను.౹

10 కాబట్టి ప్రజల కార్య నియామకులును వారి నాయకులును పోయి ప్రజలను చూచి–నేను మీకు గడ్డి ఇయ్యను;౹

11 మీరు వెళ్లి మీకు గడ్డి యెక్కడ దొరకునో అక్కడ మీరే సంపాదించు కొనుడి, అయితే మీ పనిలో నేమాత్రమును తక్కువ చేయబడదని ఫరో సెలవిచ్చెననిరి.౹

12 అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్యకాలు కూర్చుటకు ఐగుప్తుదేశమందంతటను చెదిరి పోయిరి.౹

13 మరియు కార్యనియామకులు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పటివలెనే యేనాటిపని ఆనాడే ముగించుడనిరి.౹

14 ఫరో కార్య నియామకులు తాము ఇశ్రాయేలీయులలో వారిమీద ఉంచిన నాయకులను కొట్టి–ఎప్పటివలె మీ లెక్క చొప్పున ఇటుకలను నిన్న నేడు మీరు ఏల చేయించలేదని అడుగగా

15 ఇశ్రాయేలీయుల నాయకులు ఫరోయొద్దకు వచ్చి–తమ దాసుల యెడల తమరెందుకిట్లు జరిగించుచున్నారు?

16 తమ దాసులకు గడ్డినియ్యరు అయితే ఇటుకలు చేయుడని మాతో చెప్పుచున్నారు; చిత్తగించుము, వారు తమరి దాసులను కొట్టుచున్నారు; అయితే తప్పిదము తమరి ప్రజలయందే యున్నదని మొఱపెట్టిరి.౹

17 అందుకతడు– మీరు సోమరులు మీరు సోమరులు అందుచేత–మేము వెళ్లి యెహోవాకు బలినర్పించుటకు సెలవిమ్మని మీరడుగుచున్నారు.౹

18 మీరు పొండి, పనిచేయుడి, గడ్డి మీకియ్య బడదు, అయితే ఇటుకల లెక్క మీరప్పగింపక తప్పదని చెప్పెను.౹

19 –మీ ఇటుకల లెక్కలో నేమాత్రమును తక్కువ చేయవద్దు, ఏనాటి పని ఆనాడే చేయవలెనని రాజు సెలవియ్యగా, ఇశ్రాయేలీయుల నాయకులు తాము దురవస్థలో పడియున్నట్లు తెలిసికొనిరి.౹

20 వారు ఫరో యొద్దనుండి బయలుదేరి వచ్చుచు, తమ్మును ఎదుర్కొనుటకు దారిలో నిలిచియున్న మోషే అహరోనులను కలిసి కొని

21 –యెహోవా మిమ్ము చూచి న్యాయము తీర్చును గాక; ఫరో యెదుటను అతని దాసుల యెదుటను మమ్మును అసహ్యులనుగా చేసి మమ్ము చంపుటకై వారిచేతికి ఖడ్గ మిచ్చితిరని వారితో అనగా

22 మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్లి–ప్రభువా, నీవేల ఈ ప్రజలకు కీడు చేసితివి? నన్నేల పంపితివి?

23 నేను నీ పేరట మాటలాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటినుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు, నీ జనులను నీవు విడిపింపను లేదనెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EXO/5-7e9e85fb3f55770f4e06a0f32a1817d7.mp3?version_id=1787—

Categories
నిర్గమకాండము

నిర్గమకాండము 6

1 అందుకు యెహోవా–ఫరోకు నేను చేయబోవు చున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు; బలమైన హస్తముచేత అతడు వారిని పోనిచ్చును, బలమైన హస్తము చేతనే అతడు తన దేశములోనుండి వారిని తోలివేయునని మోషేతో అనెను.

2 మరియు దేవుడు మోషేతో ఇట్లనెను–నేనే యెహోవాను;౹

3 నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని కాని, యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు.౹

4 మరియు వారు పరవాసము చేసిన దేశమగు కనానుదేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరచితిని.౹

5 ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరచియున్న ఇశ్రాయేలీయుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకముచేసికొని యున్నాను.౹

6 కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పుము–నేనే యెహోవాను; నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి, వారి దాసత్వములోనుండి మిమ్మును విడిపించి, నా బాహువు చాపి గొప్ప తీర్పులుతీర్చి మిమ్మును విడిపించి,౹

7 మిమ్మును నాకు ప్రజలగా చేర్చుకొని మీకు దేవుడనై యుందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రిందనుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలిసికొందురు.౹

8 నేను అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చెదనని చెయ్యి యెత్తి ప్రమాణముచేసిన దేశములోనికి మిమ్మును రప్పించి దాని మీకు స్వాస్థ్యముగా ఇచ్చెదను; నేను యెహోవానని చెప్పుమనగా

9 మోషే ఇశ్రాయేలీయులతో ఆలాగు చెప్పెను. అయితే వారు మనోవ్యాకులమునుబట్టియు కఠిన దాసత్వమునుబట్టియు మోషే మాట వినరైరి.

10-11 మరియు యెహోవా మోషేతో–నీవు లోపలికి వెళ్లి, ఐగుప్తురాజైన ఫరోతో–ఇశ్రాయేలీయులను తన దేశములోనుండి వెలుపలికి పోనియ్యవలెనని అతనితో చెప్పుమనెను.౹

12 అప్పుడు మోషే–చిత్తగించుము, ఇశ్రాయేలీయులే నా మాట వినలేదు; మాటమాంద్యము గలవాడనగు నా మాట ఫరో యెట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను.౹

13 మరియు యెహోవా మోషే అహరోనులతో నిట్లనెను–ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములోనుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇశ్రాయేలీయుల యొద్దకును ఫరో యొద్దకును వెళ్లవలెనని వారికాజ్ఞాపించెను.

14 వారి పితరుల కుటుంబముల మూలపురుషులు ఎవరనగా, ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు హనోకు పల్లు హెస్రోను కర్మీ; వీరు రూబేను కుటుంబములు.౹

15 షిమ్యోను కుమారులు యెమూయేలు యామీను ఓహదు యాకీను సోహరు కనాను స్త్రీకి కుమారుడైన షావూలు; వీరు షిమ్యోను కుటుంబములు.౹

16 లేవి కుమారుల పేరులు వారి వారి వంశావళుల చొప్పున ఏవేవనగా, గెర్షోను కహాతు మెరారి. లేవి నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను.౹

17 గెర్షోను కుమారులు వారి వారి వంశావళుల చొప్పున లిబ్నీ షిమీ.౹

18 కహాతు కుమారులు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు. కహాతు నూట ముప్పది మూడేండ్లు బ్రదికెను.౹

19 మెరారి కుమారులు మహలి మూషి; వీరు తమతమ వంశావళుల చొప్పున లేవి కుటుంబములు.౹

20 అమ్రాము తన మేనత్తయైన యోకె బెదును పెండ్లి చేసికొనెను; ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము నూట ముప్పది యేడేండ్లు బ్రదికెను.౹

21 ఇస్హారు కుమారులు కోరహు నెపెగు జిఖ్రీ

22 ఉజ్జీయేలు కుమారులు మిషాయేలు ఎల్సాఫాను సిత్రీ.౹

23 అహరోను అమ్మీనాదాబు కుమార్తెయు నయస్సోను సహో దరియునైన ఎలీషెబను పెండ్లిచేసి కొనెను. ఆమె అతనికి నాదాబును అబీహును ఎలియాజరును ఈతామారును కనెను.౹

24 కోరహు కుమారులు అస్సీరు ఎల్కానా అబీయా సాపు; వీరు కోరహీయుల కుటుంబములు.౹

25 అహరోను కుమారుడైన ఎలియాజరు పూతీయేలు కుమార్తెలలో ఒక తెను పెండ్లిచేసికొనెను. ఆమె అతనికి ఫీనెహాసును కనెను; వీరు తమతమ కుటుంబముల చొప్పున లేవీయుల పితరుల మూలపురుషులు.౹

26 ఇశ్రాయేలీయులను వారి సేనల చొప్పున ఐగుప్తుదేశములోనుండి వెలుపలికి రప్పించుడని యెహోవా ఆజ్ఞాపించిన అహరోను మోషేలు వీరు.౹

27 ఇశ్రాయేలీయలను ఐగుప్తులోనుండి వెలుపలికి రప్పించ వలెనని ఐగుప్తు రాజైన ఫరోతో మాటలాడినవారు వీరు; ఆ మోషే అహరోనులు వీరే.

28 ఐగుప్తుదేశములో యెహోవా మోషేతో మాటలాడిన దినమున

29 యెహోవా–నేను యెహోవాను; నేను నీతో చెప్పునది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా

30 మోషే–చిత్తగించుము; నేను మాట మాంద్యము గలవాడను, ఫరో నా మాట యెట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EXO/6-4af4e87b5423746c12089a338613d2bc.mp3?version_id=1787—

Categories
నిర్గమకాండము

నిర్గమకాండము 7

1 కాగా యెహోవా మోషేతో ఇట్లనెను–ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని; నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును.౹

2 నేను నీ కాజ్ఞాపించునది యావత్తు నీవు పలుకవలెను. ఫరో తన దేశములోనుండి ఇశ్రాయేలీయులను పోనియ్యవలెనని నీ అన్నయైన అహరోను అతనితో చెప్పును;౹

3 అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి, ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపచేసెదను.౹

4 ఫరో మీ మాట వినడుగాని నేను నా చెయ్యి ఐగుప్తుమీద వేసి గొప్ప తీర్పులచేత నా సేనలను ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశములోనుండి వెలుపలికి రప్పించెదను.౹

5 నేను ఐగుప్తుమీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలీయులను వారి మధ్యనుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలిసికొందురనెను.౹

6 మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి, ఆలాగుననే చేసిరి.౹

7 వారు ఫరోతో మాటలాడినప్పుడు మోషేకు ఎనుబదియేండ్లు, అహరోనుకు ఎనుబది మూడు ఏండ్లు.

8-9 మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను–ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనుపరచుడని మీతో చెప్పునప్పుడు నీవు అహరోనును చూచి–నీ కఱ్ఱను పట్టుకొని ఫరో యెదుట దాని పడ వేయుమనుము; అది సర్పమగును.౹

10 కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్లి యెహోవా తమకాజ్ఞా పించినట్లు చేసిరి. అహరోను ఫరో యెదుటను అతని సేవకుల యెదుటను తన కఱ్ఱను పడవేయగానే అది సర్ప మాయెను.౹

11 అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునగాండ్రు కూడ తమ మంత్రములచేత ఆలాగే చేసిరి.౹

12 వారిలో ప్రతివాడును తన కఱ్ఱను పడవేసినప్పుడు అది సర్పమాయెనుగాని అహరోను కఱ్ఱ వారి కఱ్ఱలను మ్రింగివేయగా

13 యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను గనుక అతడు వారి మాట వినకపోయెను.౹

14 తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను–ఫరో హృదయము కఠినమైనది, అతడు ఈ ప్రజలను పోనియ్యనొల్లడాయెను

15 ప్రొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్లుము, ఇదిగో అతడు ఏటిదరికి పోవును. నీవు అతనిని ఎదుర్కొనుటకు ఏటియొడ్డున నిలిచి పాముగా చేయబడిన కఱ్ఱను చేతపట్టుకొని

16 అతని చూచి–అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకుగాను హెబ్రీయులదేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను. నీవు–ఇదివరకు వినకపోతివి.౹

17 కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా నేను యెహోవానని దీనిబట్టి నీవు తెలిసి కొందువని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలోనున్న యీ కఱ్ఱతో నేను ఏటి నీటిని కొట్టుదును అది రక్తముగా మార్చబడును.౹

18 ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపుకొట్టును, ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురని చెప్పు మనెను.౹

19 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను–నీవు అహరోనుతో–నీకఱ్ఱను పట్టుకొని ఐగుప్తు జలములమీద, అనగా వారి నదులమీదను వారి కాలువలమీదను, వారి చెరువులమీదను, వారి నీటిగుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపుము; అవి రక్తమగును; ఐగుప్తు దేశమందంతటను మ్రానుపాత్రలలోను రాతిపాత్రలలోను రక్తము ఉండునని అతనితో చెప్పుమనెను.౹

20 యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో యెదుటను అతని సేవకుల యెదుటను తన కఱ్ఱను పైకెత్తి ఏటినీళ్లను కొట్టగా ఏటి నీళ్లన్నియు రక్తముగా మార్చబడెను.౹

21 ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపుకొట్టెను, ఐగుప్తీయులు ఏటినీళ్లు త్రాగలేక పోయిరి, ఐగుప్తుదేశమందంతట రక్తము ఉండెను.౹

22 ఐగుప్తు శకునగాండ్రు కూడ తమ మంత్రములవలన అట్లుచేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను, అతడు మోషే అహరోనుల మాట వినకపోయెను.౹

23 జరిగినదానిని మన స్సున పెట్టక ఫరో తిరిగి తన యింటికి వెళ్లెను.౹

24 అయితే ఐగుప్తీయులందరు ఏటినీళ్లు త్రాగలేక త్రాగు నీళ్లకొరకు ఏటిప్రక్కలను త్రవ్విరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EXO/7-ff49d9779e0594ee9b59e2c470239b0b.mp3?version_id=1787—

Categories
నిర్గమకాండము

నిర్గమకాండము 8

1 యెహోవా ఏటిని కొట్టి యేడు దినములైన తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను–నీవు ఫరో యొద్దకు వెళ్లి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము;౹

2 నీవు వారిని పోనియ్యనొల్లనియెడల ఇదిగో నేను నీ పొలి మేరలన్నిటిని కప్పలచేత బాధించెదను.౹

3 ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును; అవి నీ యింట నీ పడకగదిలోనికి నీ మంచముమీదికి నీ సేవకులయిండ్లలోనికి నీ జనులమీదికి నీ పొయిలలోనికి నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కి వచ్చును;౹

4 ఆ కప్పలు నీ మీదికి నీ జనులమీదికి నీ సేవకులందరిమీదికి వచ్చునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పుమనెను.౹

5 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను–నీవు అహరోనును చూచి–నీ కఱ్ఱ పట్టుకొని యేటిపాయలమీదను కాలువలమీదను చెరువులమీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశముమీదికి కప్పలను రాజేయుమని అతనితో చెప్పుమనగా

6 అహరోను ఐగుప్తు జలములమీద తన చెయ్యి చాపెను; అప్పుడు కప్పలు ఎక్కివచ్చి ఐగుప్తు దేశమును కప్పెను.౹

7 శకునగాండ్రు కూడ తమ మంత్రములవలన అలాగు చేసి ఐగుప్తు దేశము మీదికి కప్పలను రాజేసిరి.౹

8 అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి–నా యొద్దనుండి నా జనులయొద్ద నుండి ఈ కప్పలను తొలగించుమని యెహోవాను వేడు కొనుడి, అప్పుడు యెహోవాకుబలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చెదననెను.౹

9 అందుకు మోషే–నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును, ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లును అవి నీ మీదను నీ యిండ్లలోను ఉండకుండ చంపబడునట్లును నీ కొరకును నీ సేవకులకొరకును నీ ప్రజలకొరకును నేనెప్పుడు వేడుకొనవలెనో చెప్పుమని ఫరోను అడుగగా అతడు రేపే అనెను.౹

10 అందుకతడు–మా దేవుడైన యెహోవా వంటి వారెవరును లేరు అని నీవు తెలిసికొనునట్లు నీ మాటచొప్పున జరుగును;౹

11 అనగా కప్పలు నీ యొద్ద నుండియు నీ యిండ్లలోనుండియు నీ సేవకులయొద్ద నుండియు నీ ప్రజలయొద్దనుండియు తొలగిపోవును; అవి యేటిలోనే ఉండుననెను.౹

12 మోషే అహరోనులు ఫరో యొద్దనుండి బయలు వెళ్లినప్పుడు యెహోవా ఫరో మీదికి రాజేసిన కప్పల విషయములో మోషే అతనికొరకు మొఱ పెట్టగా

13 యెహోవా మోషే మాటచొప్పున చేసెను గనుక ఇండ్లలోనేమి వెలుపలనేమి పొలములలోనేమి కప్పలు ఉండకుండ చచ్చిపోయెను.౹

14 జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపుకొట్టెను.౹

15 ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరచుకొని వారి మాట వినక పోయెను.

16 అందుకు యెహోవా మోషేతో నీవు నీ కఱ్ఱ చాపి యీ దేశపు ధూళిని కొట్టుము. అది ఐగుప్తు దేశమందంతటను పేలగునని అహరోనుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి.౹

17 అహరోను తన కఱ్ఱను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలుమనుష్యులమీదను జంతువులమీదను ఉండెను; ఐగుప్తు దేశమందంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయెను.౹

18 శకునగాండ్రు కూడ పేలను పుట్టించవలెనని తమ మంత్రములచేత అట్లు చేసిరిగాని అది వారివలన కాకపోయెను. పేలు మనుష్యులమీదను జంతువులమీదను ఉండగా

19 శకునగాండ్రు –ఇది దైవశక్తిఅని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను, అతడు వారిమాట వినకపోయెను.౹

20 కాబట్టి యెహోవా మోషేతో –నీవు ప్రొద్దున లేచి ఫరో యెదుట నిలువుము, ఇదిగో అతడు ఏటియొద్దకు పోవును. నీవు అతని చూచి–నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము.౹

21 నీవు నా ప్రజలను పోనియ్యని యెడల చూడుము నేను నీ మీదికిని నీ సేవకులమీదికిని నీ ప్రజలమీదికిని నీ యిండ్లలోనికి ఈగల గుంపులను పంపెదను; ఐగుప్తీయులయిండ్లును వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండియుండును.౹

22 మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలిసికొనునట్లు, ఆ దినమున నేను నా ప్రజలు నివసించు చున్న గోషెనుదేశమును వినాయించెదను, అక్కడ ఈగలగుంపులుండవు.౹

23 నా ప్రజలను నీ ప్రజలనుండి ప్రత్యేకపరచెదను, రేపు ఈ సూచక క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలెననెను.౹

24 యెహోవా ఆలాగు చేసెను. బాధకరమైన ఈగలగుంపులు ఫరో యింటిలోకిని అతని సేవకులయిండ్లలోకిని వచ్చి ఐగుప్తు దేశమంతట వ్యాపించెను. ఆ దేశము ఈగల గుంపులవలన చెడిపోయెను.౹

25 అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి–మీరు వెళ్లి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా

26 మోషే– అట్లు చేయతగదు; మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము. ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నుల యెదుట అర్పించినయెడల వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు గదా.౹

27 మేము అరణ్యములోనికి మూడుదినముల ప్రయాణమంత దూరముపోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి నర్పించుదు మనెను.౹

28 అందుకు ఫరో–మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి నర్పించుటకు మిమ్మును పోనిచ్చెదనుగాని దూరము పోవద్దు; మరియు నాకొరకు వేడు కొనుడనెను.౹

29 అందుకు మోషే–నేను నీ యొద్దనుండి వెళ్లి రేపు ఈ యీగల గుంపులు ఫరో యొద్దనుండియు అతని సేవకుల యొద్దనుండియు అతని జనులయొద్ద నుండియు తొలగి పోవునట్లు యెహోవాను వేడుకొందును గాని, యెహోవాకు బలి అర్పించుటకు ఫరో జనులను పోనియ్యక ఇకను వంచన చేయకూడదని చెప్పి

30 ఫరో యొద్దనుండి బయలువెళ్లి యెహోవాను వేడుకొనెను.౹

31 యెహోవా మోషే మాటచొప్పునచేయగా ఈగల గుంపులు ఫరో యొద్ద నుండియు అతని సేవకులయొద్ద నుండియు అతని ప్రజల యొద్దనుండియు తొలగిపోయెను; ఒక్కటియైనను నిలువలేదు.౹

32 అయితే ఫరో ఆ సమయమున కూడ తన హృదయమును కఠినపరచుకొని జనులను పోనియ్యడాయెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EXO/8-983bdea3f3f21117b4824af1d8f290bb.mp3?version_id=1787—

Categories
నిర్గమకాండము

నిర్గమకాండము 9

1 తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను–నీవు ఫరోయొద్దకు వెళ్లి–నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము.౹

2 నీవు వారిని పోనియ్యనొల్లక ఇంకను వారిని నిర్బంధించినయెడల

3 ఇదిగో యెహోవా బాహుబలము పొలములోనున్న నీ పశువులమీదికిని నీ గుఱ్ఱములమీదికిని గాడిదలమీదికిని ఒంటెలమీదికిని ఎద్దులమీదికిని గొఱ్ఱెలమీదికిని వచ్చును, మిక్కిలి బాధకరమైన తెగులు కలుగును.౹

4 అయితే యెహోవా ఇశ్రాయేలీయుల పశువులను ఐగుప్తు పశువులను వేరుపరచును; ఇశ్రాయేలీయులకున్న వాటన్నిటిలో ఒక్కటైనను చావదని హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పు మనెను.౹

5 మరియు యెహోవా కాలము నిర్ణయించి–రేపు యెహోవా ఈ దేశములో ఆ కార్యము జరిగించుననెను.౹

6 మరునాడు యెహోవా ఆ కార్యముచేయగా ఐగుప్తీయుల పశువులన్నియు చచ్చెనుగాని ఇశ్రాయేలీయుల పశువులలో ఒకటియు చావలేదు.౹

7 ఫరో ఆ సంగతి తెలిసికొన పంపినప్పుడు ఇశ్రాయేలు పశువులలో ఒకటియు చావ లేదు; అయినను అప్పటికిని ఫరో హృదయము కఠినమై నందున జనులను పంపక పోయెను.

8 కాగా యెహోవా–మీరు మీ పిడికిళ్లనిండ ఆవపు బుగ్గి తీసికొనుడి, మోషే ఫరో కన్నులయెదుట ఆకాశమువైపు దాని చల్లవలెను.౹

9 అప్పుడు అది ఐగుప్తు దేశ మంతట సన్నపు ధూళియై ఐగుప్తు దేశమంతట మనుష్యులమీదను జంతువులమీదను పొక్కులు పొక్కు దద్దురు లగునని మోషే అహరోనులతో చెప్పెను.౹

10 కాబట్టి వారు ఆవపుబుగ్గి తీసికొనివచ్చి ఫరో యెదుట నిలిచిరి. మోషే ఆకాశమువైపు దాని చల్లగానే అది మనుష్యులకును జంతువులకును పొక్కులు పొక్కు దద్దురులాయెను.౹

11 ఆ దద్దురులవలన శకునగాండ్రు మోషేయెదుట నిలువలేకపోయిరి ఆ దద్దురులు శకునగాండ్రకును ఐగుప్తీయులందరికిని పుట్టెను.౹

12 అయినను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను, అతడు వారి మాట వినకపోయెను.

13 తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను–హెబ్రీ యులదేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు; నీవు తెల్లవారగానే లేచిపోయి ఫరోయెదుట నిలిచి–నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము.౹

14 సమస్త భూమిలో నావంటివారెవరును లేరని నీవు తెలిసికొనవలెనని ఈ సారి నేను నా తెగుళ్లన్నియు నీ హృదయము నొచ్చునంతగా నీ సేవకులమీదికిని నీ ప్రజలమీదికిని పంపెదను;౹

15 భూమిమీద నుండకుండ నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపియుంటినేని నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసియుందును.౹

16 నా బలమును నీకు చూపునట్లును, భూలోక మందంతట నా నామమును ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని.౹

17 నీవు ఇంక నా ప్రజలను పోనియ్యనొల్లక వారిమీద ఆతిశయపడుచున్నావు.౹

18 ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధకరమైన వడగండ్లను కురిపించెదను; ఐగుప్తు రాజ్యము స్థాపించిన దినము మొదలుకొని యిదివరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు.౹

19 కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములలో నీకు కలిగి నది యావత్తును త్వరగా భద్రముచేయుము. ఇంటికి రప్పింపబడక పొలములోఉండు ప్రతిమనుష్యునిమీదను జంతువు మీదను వడగండ్లు కురియును, అప్పుడు అవి చచ్చునని చెప్పుమనెను.౹

20 ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడినవాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను.౹

21 అయితే యెహోవా మాట లక్ష్యపెట్టనివాడు తన పనివారిని తన పశువులను పొలములో ఉండనిచ్చెను.

22 యెహోవా–నీ చెయ్యి ఆకాశమువైపు చూపుము; ఐగుప్తుదేశమందలి మనుష్యులమీదను జంతువులమీదను పొలముల కూరలన్నిటిమీదను వడగండ్లు ఐగుప్తుదేశ మంతట పడునని మోషేతో చెప్పెను.౹

23 మోషే తన కఱ్ఱను ఆకాశమువైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమిమీద పడుచుండెను. యెహోవా ఐగుప్తుదేశముమీద వడగండ్లు కురిపించెను.౹

24 ఆలాగు వడగండ్లును వడగండ్లతో కలిసిన పిడుగులును బహుబలమైన వాయెను. ఐగుప్తు దేశమందంతటను అది రాజ్యమైనది మొదలుకొని యెన్నడును అట్టివి కలుగలేదు.౹

25 ఆ వడగండ్లు ఐగుప్తుదేశమందంతట మనుష్యులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపచేసెను. వడగండ్లు పొలములోని ప్రతి కూరను చెడగొట్టెను, పొలములోని ప్రతి చెట్టును విరుగ గొట్టెను.౹

26 అయితే ఇశ్రాయేలీయులున్న గోషెను దేశములో మాత్రము వడగండ్లు పడలేదు.౹

27 ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపి–నేను ఈసారి పాపముచేసియున్నాను; యెహోవా న్యాయవంతుడు, నేనును నా జనులును దుర్మార్గులము;౹

28 ఇంతమట్టుకు చాలును; ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండునట్లు యెహోవాను వేడుకొనుడి, మిమ్మును పోనిచ్చెదను, మిమ్మును ఇకను నిలుపనని వారితో చెప్పగా

29 మోషే అతని చూచి–నేను ఈ పట్టణమునుండి బయలు వెళ్లగానే నా చేతులు యెహోవావైపు ఎత్తెదను. ఈ ఉరుములు మానును, ఈ వడగండ్లును ఇకమీదట పడవు. అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడును.౹

30 అయినను నీవును నీ సేవకులును ఇకను దేవుడైన యెహోవాకు భయపడరని నాకు తెలిసియున్నదనెను.౹

31 అప్పుడు జనుపచెట్లు పువ్వులు పూసెను, యవలచేలు వెన్నులు వేసినవి గనుక జనుప యవలచేలును చెడగొట్టబడెనుగాని

32 గోధుమలు మిరపమొలకలు ఎదగనందున అవి చెడగొట్టబడలేదు.౹

33 మోషే ఫరోను విడిచి ఆ పట్టణమునుండి బయలు వెళ్లి యెహోవావైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ యురుములును వడగండ్లును నిలిచిపోయెను, వర్షము భూమిమీద కురియుట మానెను.౹

34 అయితే ఫరో వర్షమును వడ గండ్లును ఉరుములును నిలిచిపోవుట చూచి, అతడును అతని సేవకులును ఇంక పాపము చేయుచు తమ హృదయములను కఠినపరచుకొనిరి.౹

35 యెహోవా మోషేద్వారా పలికినట్లు ఫరో హృదయము కఠినమాయెను; అతడు ఇశ్రాయేలీయులను పోనియ్యక పోయెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EXO/9-ede8112eb9542a0cd45c392a86a7f0e7.mp3?version_id=1787—

Categories
నిర్గమకాండము

నిర్గమకాండము 10

1 కాగా యెహోవా మోషేతో – ఫరోయొద్దకు వెళ్లుము. నేనే యెహోవానని మీరు తెలిసికొనునట్లును, నేనుచేయు సూచకక్రియలను ఐగుప్తీయుల యెదుట కనుపరచుటకు, నేను వారియెడల జరిగించిన వాటిని వారి యెదుట కలుగజేసిన సూచకక్రియలను

2 నీవు నీ కుమారునికి నీ కుమారుని కుమారునికి ప్రచురము చేయునట్లును, నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠిన పరచితిననెను.౹

3 కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్లి, అతనిని చూచి యీలాగు చెప్పిరి– హెబ్రీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా– నీవు ఎన్నాళ్లవరకు నాకు లొంగనొల్లక యుందువు? నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము.౹

4 నీవు నా జనులను పోనియ్య నొల్లనియెడల ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతములలోనికి రప్పించెదను.౹

5 ఎవడును నేలను చూడలేనంతగా అవి దాని కప్పును, తప్పించుకొనిన శేషమును, అనగా వడగండ్లదెబ్బను తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయును, పొలములో మొలిచిన ప్రతి చెట్టును తినును.౹

6 మరియు అవి నీ యిండ్లలోను నీ సేవకులందరి యిండ్లలోను ఐగుప్తీయులందరి యిండ్లలోను నిండిపోవును. నీ పితరులుగాని నీ పితామహులుగాని యీ దేశములోనుండిన నాటనుండి నేటివరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో యెదుటనుండి బయలు వెళ్లెను.౹

7 అప్పుడు ఫరో సేవకులు అతని చూచి– ఎన్నాళ్లవరకు వీడు మనకు ఉరిగా నుండును? తమ దేవుడైన యెహోవాను సేవించుటకు ఈ మనుష్యులను పోనిమ్ము; ఐగుప్తుదేశము నశించినదని నీకింకను తెలియదా అనిరి.౹

8 మోషే అహరోనులు ఫరోయొద్దకు మరల రప్పింపబడగా అతడు–మీరు వెళ్లి మీ దేవుడైన యెహోవాను సేవించుడి; అందుకు ఎవరెవరు వెళ్లుదురని వారి నడిగెను.౹

9 అందుకు మోషే–మేము యెహోవాకు పండుగ ఆచరింపవలెను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్న పెద్దలతోకూడ వెళ్లెదమనెను.౹

10 అందుకతడు–యెహోవా మీకు తోడైయుండునా? నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చెదనా? ఇదిగో మీరు దురాలోచన గలవారు.౹

11 పురుషులైన మీరు మాత్రము వెళ్లి యెహోవాను సేవించుడి; మీరు కోరినది అదే గదా అని వారితో అనగా ఫరో సముఖమునుండి వారు వెళ్లగొట్టబడిరి.

12 అప్పుడు యెహోవా మోషేతో–మిడతలు వచ్చునట్లు ఐగుప్తుదేశముమీద నీ చెయ్యి చాపుము; అవి ఐగుప్తుదేశముమీదకి వచ్చి యీ దేశపు పైరులన్నిటిని, అనగా వడగండ్లు పాడుచేయని వాటినన్నిటిని తినివేయునని చెప్పెను.౹

13 మోషే ఐగుప్తుదేశముమీద తన కఱ్ఱను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రి అంతయు ఆ దేశముమీద తూర్పుగాలిని విసర జేసెను; ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను.౹

14 ఆ మిడతలు ఐగుప్తు దేశమంతటి మీదికి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను. అవి మిక్కిలి బాధకరమైనవి, అంతకుమునుపు అట్టి మిడతలు ఎప్పుడును ఉండలేదు. తరువాత అట్టివి ఉండబోవు. అవి నేలంతయు కప్పెను.౹

15 ఆ దేశమున చీకటికమ్మెను, ఆ దేశపు కూరగాయలన్నిటిని ఆ వడగండ్లు పాడుచేయని వృక్షఫలములన్నిటిని అవి తినివేసెను. ఐగుప్తు దేశమంతట చెట్లేగాని పొలముల కూరయేగాని పచ్చని దేదియు మిగిలియుండలేదు.౹

16 కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి –నేను మీ దేవుడైన యెహోవాయెడలను మీ యెడలను పాపముచేసితిని.౹

17 మీరు దయచేసి, యీసారి మాత్రమే నా పాపము క్షమించి, నా మీదనుండి యీ చావు మాత్రము తొల గించుమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనుడనగా

18 అతడు ఫరో యొద్దనుండి బయలువెళ్లి యెహోవాను వేడుకొనెను.౹

19 అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహా బలమైన పడమటిగాలిని విసరజేయగా అది ఆ మిడతలను కొంచుపోయి ఎఱ్ఱసముద్రములో పడవేసెను. ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడతయైనను నిలువలేదు.౹

20 అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను; అతడు ఇశ్రాయేలీయులను పోనియ్యడాయెను.

21 అందుకు యెహోవా మోషేతో–ఆకాశమువైపు నీ చెయ్యి చాపుము. ఐగుప్తుదేశముమీద చీకటిచేతికి తెలియునంత చిక్కని చీకటి కమ్ముననెను.౹

22 మోషే ఆకాశమువైపు తన చెయ్యి యెత్తినప్పుడు ఐగుప్తుదేశ మంతయు మూడుదినములు గాఢాంధకారమాయెను.౹

23 మూడుదినములు ఒకని నొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోటనుండి లేవలేక పోయెను; అయినను ఇశ్రాయేలీయులకందరికి వారి నివాసములలో వెలుగుండెను.౹

24 ఫరో మోషేను పిలిపించి–మీరు వెళ్లి యెహోవాను సేవించుడి. మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను, మీ బిడ్డలు మీతో వెళ్లవచ్చుననగా

25 మోషే–మేము మా దేవుడైన యెహోవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తమును హోమార్పణలనిమిత్తమును నీవు మాకు పశువులనియ్యవలెను.౹

26 మా పశువులును మాతోకూడ రావలెను. ఒక డెక్కయైనను విడువబడదు, మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటిలోనుండి తీసికొనవలెను. మేము దేనితో యెహోవాను సేవింపవలెనో అక్కడ చేరకమునుపు మాకు తెలియదనెను.౹

27 అయితే యెహోవా ఫరో హృదయమును కఠినపరపగా అతడు వారిని పోనియ్య నొల్లక యుండెను.౹

28 గనుక ఫరో–నా యెదుటనుండి పొమ్ము భద్రము సుమీ; నా ముఖము ఇకను చూడవద్దు, నీవు నా ముఖమును చూచు దినమున మరణమవుదువని అతనితో చెప్పెను.౹

29 అందుకు మోషే–నీవన్నది సరి, నేనికను నీ ముఖము చూడననెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EXO/10-21d87d0b8eac3231ca7c172d1afaf014.mp3?version_id=1787—