Categories
నెహెమ్యా

నెహెమ్యా 8

1 ఏడవ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులై యుండిరి. అప్పుడు జనులందరును ఏక మనస్కులై, నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి –యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్రగ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా

2 యాజకుడైన ఎజ్రా యేడవ మాసము మొదటి దినమున చదువబడుదాని గ్రహింపశక్తిగల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి యెదుటను ఆ ధర్మశాస్త్రగ్రంథము తీసికొనివచ్చి

3 నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నమువరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును, తెలివితో వినగలవారికందరికిని చదివి వినిపించుచు వచ్చెను, ఆ జనులందరును ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి

4 అంతట శాస్త్రియగు ఎజ్రా ఆ పనికొరకు కఱ్ఱతో చేయబడిన యొక పీఠము మీద నిలువబడెను; మరియు అతని దగ్గర కుడిపార్శ్వమందు మత్తిత్యా షెమ అనాయా ఊరియా హిల్కీయా మయశేయా అనువారును, అతని యెడమ పార్శ్వమందు పెదాయా మిషాయేలు మల్కీయా హాషుము హష్బద్దానా జెకర్యా మెషుల్లాము అనువారును నిలిచియుండిరి.౹

5 అప్పుడు ఎజ్రా అందరికంటె ఎత్తుగా నిలువబడి జనులందరును చూచుచుండగా గ్రంథమును విప్పెను, విప్ప గానే జనులందరు నిలువబడిరి.౹

6 ఎజ్రా మహా దేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరు తమ చేతులెత్తి– ఆమేన్ ఆమేన్ అని పలుకుచు, నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కరించిరి.౹

7 జనులు ఈలాగు నిలువబడుచుండగా యేషూవ బానీ షేరేబ్యా యామీను అక్కూబు షబ్బెతై హోదీయా మయశేయా కెలీటా అజర్యా యోజాబాదు హానాను పెలాయాలును లేవీయులును ధర్మశాస్త్రముయొక్క తాత్పర్యమును తెలియ జెప్పిరి.౹

8 ఇటువలెనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించునట్లు దానికి అర్థము చెప్పిరి.౹

9 జనులందరు ధర్మశాస్త్రగ్రంథపు మాటలు విని యేడ్వ మొదలుపెట్టగా, అధికారియైన నెహెమ్యాయు యాజకుడును శాస్త్రియునగు ఎజ్రాయును జనులకు బోధించు లేవీయులును–మీరు దుఃఖపడవద్దు, ఏడ్వవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి.౹

10 మరియు అతడు వారితో నిట్లనెను–పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైనదాని పానము చేయుడి, ఇదివరకు తమకొరకు ఏమియు సిద్ధము చేసికొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను, మీరు దుఃఖపడకుడి,యెహోవాయందు ఆనందించుటవలన మీరు బల మొందుదురు.౹

11 ఆలాగున లేవీయులు జనులందరిని ఓదార్చి –మీరు దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధదినము, మీరు దుఃఖపడకూడదని వారితో అనిరి.౹

12 ఆ తరువాత జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నిటిని గ్రహించి, తినుటకును త్రాగుటకును లేనివారికి ఫలాహారములు పంపించుటకును సంభ్రమముగా ఉండుటకును ఎవరి యిండ్లకు వారు వెళ్లిరి.

13 రెండవదినమందు జనులందరి పెద్దలలో ప్రధానులైనవారును యాజకులును లేవీయులును ధర్మశాస్త్రగ్రంథపు మాటలు వినవలెనని శాస్త్రియైన ఎజ్రా యొద్దకు కూడి వచ్చిరి.౹

14 యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా, ఏడవ మాసపు ఉత్సవకాలమందు ఇశ్రాయేలీయులు పర్ణశాలలో నివాసము చేయవలెనని వ్రాయబడి యుండుట కనుగొనెను

15 మరియు వారు తమ పట్టణములన్నిటిలోను యెరూషలేములోను ప్రకటనచేసి తెలియ జేయవలసినదేమనగా–మీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను అడవి ఒలీవచెట్ల కొమ్మలను గొంజిచెట్ల కొమ్మలను ఈతచెట్ల కొమ్మలను గుబురుగల వేరువేరు చెట్ల కొమ్మలను తెచ్చి, వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను.౹

16 ఆప్రకారమే జనులుపోయి కొమ్మలను తెచ్చి జనులందరు తమతమ యిండ్లమీదను తమ లోగిళ్లలోను దేవమందిరపు ఆవరణములోను నీటి గుమ్మపు వీధిలోను ఎఫ్రాయిము గుమ్మపు వీధిలోను పర్ణశాలలు కట్టుకొనిరి.౹

17 మరియు చెరలోనుండి తిరిగి వచ్చినవారి సమూహమును పర్ణశాలలు కట్టుకొని వాటిలో కూర్చుండిరి. నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని అదివరకు ఇశ్రాయేలీయులు ఆలాగున చేసియుండలేదు; అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను.౹

18 ఇదియుగాక మొదటి దినము మొదలుకొని కడదినమువరకు అను దినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి విని పించుచు వచ్చెను. వారు ఈ ఉత్సవమును ఏడు దినములవరకు ఆచరించిన తరువాత విధిచొప్పున ఎనిమిదవదినమునవారు పరిశుద్ధ సంఘముగా కూడుకొనిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/NEH/8-c3a805bcfaa655932adfad0ef87c6f9f.mp3?version_id=1787—

Categories
నెహెమ్యా

నెహెమ్యా 9

1 ఈ నెల యిరువది నాలుగవ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనెపట్టలు కట్టుకొని తలమీద ధూళి పోసికొని కూడి వచ్చిరి.౹

2 ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలోనుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి, తమ పాపములను తమపితరుల పాపములను ఒప్పుకొనిరి.౹

3 మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలువ బడి, తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రగ్రంథమును చదువుచు వచ్చిరి, ఒక జాముసేపు తమ పాపములను ఒప్పు కొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచు వచ్చిరి.౹

4 లేవీయులలో యేషూవ బానీ కద్మీయేలు షెబన్యా బున్నీ షేరేబ్యా బానీ కెనానీ అనువారు మెట్లమీద నిలువబడి, యెలుగెత్తి, తమ దేవుడైన యెహోవాకు మొఱ్ఱపెట్టిరి.౹

5 అప్పుడు లేవీయులైన యేషూవ కద్మీయేలు బానీ హషబ్నెయా షేరేబ్యా హోదీయా షెబన్యా పెతహయా అనువారు–నిలువబడి, నిరంతరము మీకు దేవుడైయున్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఈలాగు స్తోత్రము చేసిరి–సకలాశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక.౹

6 నీవే, అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండునది అంతటిని, సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటినన్నిటిని కాపాడువాడవు. ఆకాశసైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది.౹

7 దేవా యెహోవా, అబ్రామును ఏర్పరచుకొని, కల్దీయుల ఊరు అను స్థలము నుండి ఇవతలకు అతని రప్పించి అతనికి అబ్రాహామను పేరు పెట్టినవాడవు నీవే.౹

8 అతడు నమ్మకమైన మనస్సుగల వాడని యెరిగి, కనానీయులు హిత్తీయులు అమోరీయులు పెరిజ్జీయులు యెబూసీయులు గిర్గాషీయులు అనువారి దేశమును అతని సంతతివారికిచ్చునట్లు అతనితో నిబంధన చేసినవాడవు నీవే.౹

9 నీవు నీతిమంతుడవై యుండి నీ మాటచొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందినశ్రమను నీవు చూచితివి, ఎఱ్ఱసముద్రమునొద్ద వారి మొఱ్ఱను నీవు వింటివి.౹

10 ఫరోయు అతని దాసులందరును అతని దేశపు జనులందరును వారియెడల బహు గర్వముగా ప్రవర్తించిరని నీకు తెలియగా నీవు వారియెదుట సూచకక్రియలను మహత్కార్యములను చూపించితివి. ఆలాగున చేయుటవలన నీవు ఈ దినమందున్నట్టుగా ప్రసిద్ధినొందితివి.౹

11 మరియు నీ జనులయెదుట నీవు సముద్రమును విభాగించినందునవారు సముద్రము మధ్య పొడినేలను నడచిరి, ఒకడు లోతునీట రాయి వేసినట్లు వారిని తరిమినవారిని అగాధజలములలో నీవు పడవేసితివి.౹

12 ఇదియుగాక పగటికాలమందు మేఘస్తంభములో ఉండిన వాడవును రాత్రికాలమందువారు వెళ్లవలసిన మార్గమున వెలుగిచ్చుటకై అగ్నిస్తంభములో ఉండినవాడవును అయి యుండి వారిని తోడుకొనిపోతివి.౹

13 సీనాయి పర్వతము మీదికి దిగి వచ్చి ఆకాశమునుండి వారితో మాటలాడి, వారికి నీతియుక్తమైన విధులను సత్యమైన ఆజ్ఞలను మేలు కరములైన కట్టడలను ధర్మములను నీవు దయచేసితివి.౹

14 వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతిదినమును ఆచరింప నాజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషేద్వారా ఆజ్ఞలను కట్టడలను ధర్మశాస్త్రమును వారికి నియమించితివి.౹

15 వారి ఆకలి తీర్చుటకు ఆకాశమునుండి ఆహారమును వారి దాహము తీర్చుటకు బండలోనుండి ఉదకమును తెప్పించితివి. వారికి ప్రమాణముచేసిన దేశమును స్వాధీనపరచుకొనవలెనని వారికాజ్ఞాపించితివి.౹

16 అయితే వారును మా పితరులును గర్వించి, లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవియొగ్గక పోయిరి.౹

17 వారు విధేయులగుటకు మనస్సు లేనివారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసికొనక తమ మనస్సును కఠినపరచుకొని, తాముండి వచ్చిన దాస్యపుదేశమునకు తిరిగి వెళ్లుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగు బాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయావాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడవునైయుండి వారిని విసర్జింపలేదు.౹

18 వారు ఒక పోతదూడను చేసికొని–ఐగుప్తులోనుండి మమ్మును రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి, నీకు బహు విసుకు పుట్టించినను

19 వారు ఎడారిలో ఉండగా నీవు బహువిస్తారమైన కృప కలిగినవాడవై వారిని విసర్జింపలేదు; మార్గముగుండ వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలు గిచ్చుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపైనుండి వెళ్లిపోక నిలిచెను.౹

20 వారికి బోధించుటకు నీ యుపకారాత్మను దయ చేసితివి, నీ విచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు; వారి దాహమునకు ఉదకమిచ్చితివి.౹

21 నిజముగా అరణ్యములో ఏమియు తక్కువ కాకుండ నలువది సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్లకువాపు రాలేదు.౹

22 ఇదియుగాక రాజ్యములను జనములను వారికప్పగించి, వారికి సరిహద్దులు ఏర్పరచితివి గనుక, వారు సీహోను అను హెష్బోను రాజుయొక్క దేశమును బాషానునకు రాజైన ఓగుయొక్క దేశమును స్వతంత్రించుకొనిరి.౹

23 వారి సంతతిని ఆకాశపు నక్షత్రములంత విస్తారముగా చేసి, ప్రవేశించి స్వతంత్రించుకొనునట్లు వారి పితరులకు నీవు వాగ్దానముచేసిన దేశములోనికి వారిని రప్పింపగా

24 ఆ సంతతివారు ప్రవేశించి ఆ దేశమును స్వతంత్రించుకొనిరి. నీవు కనానీయులను ఆ దేశవాసులను జయించి, తమకు మనస్సువచ్చినట్లు చేయుటకు వారి రాజులను ఆ దేశజనులను వారి చేతికి అప్పగించితివి.౹

25 అప్పుడు వారు ప్రాకారములుగల పట్టణములను ఫలవంతమైన భూమిని స్వాధీనపరచుకొని, సకలమైన పదార్థములతో నిండియున్న యిండ్లను త్రవ్విన బావులను ద్రాక్షతోటలను ఒలీవతోటలను బహు విస్తారముగా ఫలించు చెట్లను వశపరచుకొనిరి. ఆలాగునవారుతిని తృప్తిపొంది మదించి నీ మహోపకారమునుబట్టి బహుగా సంతోషించిరి.౹

26 అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటుచేసి, నీ ధర్మశాస్త్రమును లక్ష్యపెట్టక త్రోసివేసి, నీతట్టు తిరుగవలెనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుకు పుట్టించిరి.౹

27 అందుచేత నీవు వారిని వారి శత్రువులచేతికి అప్పగించితివి. ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమకాలమందువారు నీకు మొఱ్ఱపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి, వారి శత్రువుల చేతిలోనుండి వారిని తప్పించుటకై నీ కృపాసంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసితివి.౹

28 వారు నెమ్మదిపొందిన తరువాత నీ యెదుట మరల ద్రోహులుకాగా నీవు వారిని వారి శత్రువులచేతికి అప్పగించితివి; వీరు వారిమీద అధికారము చేసిరి. వారు తిరిగి వచ్చి నీకు మొఱ్ఱపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి నీ కృపచొప్పున అనేకమారులు వారిని విడిపించితివి.౹

29 నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించినయెడల వాటివలనవాడు బ్రదుకునుగదా. వారు మరల నీ ధర్మశాస్త్రము ననుసరించి నడుచునట్లు నీవు వారిమీద సాక్ష్యము పలికినను, వారు గర్వించి నీ ఆజ్ఞలకు లోబడక నీ విధుల విషయములో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనస్సును కఠినపరచుకొని నీ మాట వినకపోయిరి.౹

30 నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి, నీ ప్రవక్తలద్వారా నీ ఆత్మచేత వారిమీద సాక్ష్యము పలికితివిగాని వారు వినక పోయిరి; కాగా నీవు ఆయా దేశములలోనున్న జనులచేతికి వారిని అప్పగించితివి.౹

31 అయితే నీవు మహోప కారివై యుండి, వారిని బొత్తిగా నాశనముచేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. నిజముగా నీవు కృపాకనికరములుగల దేవుడవైయున్నావు.౹

32 చేసిన నిబంధనను నిలు పుచు కృప చూపునట్టి మహాపరాక్రమశాలివియు భయంకరుడవునగు మా దేవా, అష్షూరు రాజుల దినములు మొదలుకొని యీ దినములవరకు మా మీదికిని మా రాజులమీదికిని ప్రధానులమీదికిని మా పితరులమీదికిని నీ జనులందరిమీదికిని వచ్చినశ్రమయంతయు నీ దృష్టికి అల్పముగా ఉండకుండును గాక.౹

33 మా మీదికి వచ్చినశ్రమ లన్నిటిని చూడగా నీవు న్యాయస్థుడవే; నీవు సత్యము గానే ప్రవర్తించితివి కాని మేము దుర్మార్గులమైతిమి.౹

34 మా రాజులుగాని మా ప్రధానులుగాని మా యాజకులుగాని మా పితరులుగాని నీ ధర్మశాస్త్రము ననుసరించి నడువలేదు. నీవు వారిమీద పలికిన సాక్ష్యములనైనను నీ ఆజ్ఞలనైనను వారు వినకపోయిరి.౹

35 వారు తమ రాజ్య పరిపాలనకాలమందు నీవు తమ యెడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక, నీవు వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించియుండియు నిన్ను సేవింపకపోయిరి, తమ చెడు నడతలువిడిచి మారుమనస్సు పొందరైరి.౹

36 చిత్తగించుము, నేడు మేము దాస్యములో ఉన్నాము, దాని ఫలమును దాని సమృద్ధిని అనుభవించునట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమియందు మేము దాసులమై యున్నాము.౹

37 మా పాపములనుబట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అది అతివిస్తారముగా ఫలమిచ్చుచున్నది. వారు తమకిష్టము వచ్చినట్లు మా శరీరములమీదను మా పశువులమీదను అధికారము చూపుచున్నారు గనుక మాకు చాల శ్రమలు కలుగుచున్నవి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/NEH/9-9b1bf1bdb93fecad6eea4fbb20290985.mp3?version_id=1787—

Categories
నెహెమ్యా

నెహెమ్యా 10

1 మేము ఒప్పుకొని చెప్పినదానినిబట్టి ఒక స్థిరమైన నిబంధన చేసికొని వ్రాయించుకొనగా, మా ప్రధానులును లేవీయులును యాజకులును దానికి ముద్రలు వేసిరి. దానికి ముద్రలు వేసినవారెవరనగా, అధికారియగు హకల్యా కుమారుడైన నెహెమ్యా సిద్కీయా

2 శెరాయా అజర్యా యిర్మీయా

3-5 పషూరు అమర్యా మల్కీయా హట్టూషు షెబన్యా మల్లూకు. హారిము మెరేమోతు ఓబద్యా

6-8 దానియేలు గిన్నెతోను బారూకు మెషుల్లాము అబీయా మీయామిను మయజ్యా బిల్గయి షెమయా. వీరందరును యాజకులుగా ఉండువారు

9 లేవీయులు ఎవరనగా, అజన్యా కుమారుడైన యేషూవ హేనాదాదు కుమారులైన బిన్నూయి కద్మీయేలు

10 వారి సహోదరులైన షెబన్యా హోదీయా కెలీటా పెలాయా హానాను

11 మీకా రెహోబు హషబ్యా

12 జక్కూరు షేరేబ్యా షెబన్యా

13-14 హోదీయా బానీ బెనీను అనువారు. జనులలో ప్రధాను లెవరనగా పరోషు పహత్మోయాబు ఏలాము జత్తూ బానీ

15 బున్నీ అజ్గాదు బేబై అదోనీయా బిగ్వయి ఆదీను

16-17 అటేరు హిజ్కియా అజ్జూరు

18 హోదీయా హాషుము బేజయి

19 హారీపు అనాతోతు నేబై

20 మగ్పీయాషు మెషుల్లాము హెజీరు

21 మెషేజ బెయేలు సాదోకు యద్దూవ

22 పెలట్యా హానాను అనాయా

23 హోషేయ హనన్యా హష్షూబు హల్లోహైషు పిల్హా షోబేకు

24 రెహూము హషబ్నా మయశేయా అహీయా హానాను ఆనాను

25-26 మల్లూకు హారిము బయనా అనువారు.౹

27-28 అయితే జనులలో మిగిలినవారు, అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు దేశపు జనులలో ఉండకుండ తమ్మును తాము వేరుపరచుకొనిన యాజకులు లేవీయులు ద్వారపాలకులు గాయకులు నెతీనీయులు అందరును, దేవుని దాసుడైన మోషేద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రము ననుసరించి నడుచుకొనుచు, మన ప్రభువైన యెహోవా నిబంధనలను కట్టడలను ఆచరించుదుమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి.౹

29 వారి భార్యలు వారి కుమారులు వారి కుమార్తెలు తెలివియు బుద్ధియుగలవా రెవరో వారును ఈ విషయములో ప్రధానులైన తమ బంధువులతో కలిసిరి.౹

30 మరియు–మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు నుందుమనియు

31 దేశపు జనులు విశ్రాంతిదినమందు అమ్మకపు వస్తువులనేగాని భోజన పదార్థములనేగాని అమ్ముటకు తెచ్చినయెడల విశ్రాంతిదినమునగాని పరిశుద్ధ దినములలోగాని వాటిని కొనకుందుమనియు, ఏడవ సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సరములో బాకీదారుల బాకీలు వదలివేయుదుమనియు నిర్ణయించుకొంటిమి.౹

32 మరియు మన దేవుని మందిరపు సేవనిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో మూడవ వంతు ఇచ్చెదమని నిబంధన చేసికొంటిమి.౹

33 సవరింపబడిన రొట్టెవిషయములోను, నిత్య నైవేద్యము విషయములోను, నిత్యము అర్పించు దహనబలి విషయములోను, విశ్రాంతిదినముల విషయములోను, అమావాస్యల విషయములోను, నిర్ణయింపబడిన పండుగల విషయములోను, ప్రతిష్ఠితములైన వస్తువుల విషయములోను, ఇశ్రాయేలీయులకు ప్రాయశ్చిత్తము కలుగుటకైన పాపపరిహారార్థబలుల విషయములోను, మన దేవుని మందిరపు పనియంతటి విషయములోను, ఆలాగుననే నిర్ణయించుకొంటిమి.౹

34 మరియు మా పితరుల యింటి మర్యాదప్రకారము ప్రతి సంవత్సరమును నిర్ణయించుకొనిన కాలములలో ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాసియున్నట్టు మా దేవుడైన యెహోవా బలిపీఠముమీద దహింప జేయుటకు యాజకులలోను లేవీయులలోను జనులలోను కట్టెల అర్పణమును మా దేవుని మందిరములోనికి ఎవరు తేవలెనో వారును చీట్లువేసికొని నిర్ణయించు కొంటిమి.౹

35 మరియు మా భూమియొక్క ప్రథమ ఫలములను సకల వృక్షముల ప్రథమ ఫలములను, ప్రతి సంవత్సరము ప్రభువు మందిరమునకు మేము తీసికొని వచ్చునట్లుగా నిర్ణయించుకొంటిమి

36 మా కుమారులలో జ్యేష్ఠపుత్రులు, మా పశువులలో తొలిచూలులను, ధర్మశాస్త్రగ్రంథమందు వ్రాయబడినట్టు మా మందలలో తొలిచూలులను, మన దేవుని మందిరములో సేవచేయు యాజకులయొద్దకు మేము తీసికొని వచ్చునట్లుగా నిర్ణయించుకొంటిమి.౹

37 ఇదియుగాక మా పిండిలో ప్రథమ ఫలము ప్రతిష్ఠార్పణలు సకల విధమైనవృక్షముల ఫలములు ద్రాక్షారసము నూనె మొద లైన వాటిని మా దేవుని మందిరపు గదులలోనికి యాజకుల యొద్దకు తెచ్చునట్లుగాను, మా భూమి పంటలో పదియవ వంతును లేవీయులయొద్దకు తీసికొని వచ్చునట్లుగా ప్రతి పట్టణములోనున్న మా పంటలో పదియవ వంతును ఆ లేవీయుల కిచ్చునట్లుగాను నిర్ణయించుకొంటిమి.౹

38 లేవీయులు ఆ పదియవ వంతును తీసికొనిరాగా అహరోను సంతతివాడైన యాజకుడు ఒకడును వారితోకూడ ఉండ వలెననియు, పదియవ వంతులలో ఒకవంతు లేవీయులు మా దేవుని మందిరములో ఉన్న ఖజానా గదులలోనికి తీసికొని రావలెననియు నిర్ణయించుకొంటిమి,౹

39 ఇశ్రాయేలీయులును లేవీయులును ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును నూనెను తేగా, సేవచేయు యాజకులును ద్వారపాలకులును గాయకులును వాటిని తీసికొని ప్రతిష్ఠితములగు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/NEH/10-51cc0ba8b74211d3b057bd4caa2c238e.mp3?version_id=1787—

Categories
నెహెమ్యా

నెహెమ్యా 11

1 జనుల అధికారులు యెరూషలేములో నివాసము చేసిరి. మిగిలిన జనులు పరిశుద్ధపట్టణమగు యెరూషలేమునందు పదిమందిలో ఒకడు నివసించునట్లును, మిగిలిన తొమ్మండుగురు వేరు పట్టణములలో నివసించునట్లును చీట్లు వేసిరి.౹

2 యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకొనినవారిని జనులు దీవించిరి.౹

3 యెరూషలేములో నివాసము చేసిన రాజ్యపు ప్రధానులు వీరే, యూదాపట్టణములలో ఎవరి స్వాస్థ్యములో వారు నివసించుచుండిరి. వారెవరనగా ఇశ్రాయేలీయులును యాజకులును లేవీయులును నెతీనీయులును సొలొమోనుయొక్క దాసుల వంశస్థులును నివాసము చేసిరి.౹

4 మరియు యెరూషలేములో యూదులలో కొందరును బెన్యామీనీయులలో కొందరును నివసించిరి. యూదులలో ఎవరనగా, జెకర్యాకు పుట్టిన ఉజ్జియా కుమారుడైన అతాయా, యితడు షెఫట్యకు పుట్టిన అమర్యా కుమారుడు, వీడు షెఫట్యకు పుట్టిన పెరెసు వంశస్థుడగు మహలలేలు కుమారుడు.౹

5 మరియు షిలోనికి పుట్టిన జెకర్యా కుమారునికి పుత్రుడైన యోయారీబు కనిన అదాయా కుమారుడైన హజాయాకు కలిగిన కొల్హోజెకు పుట్టిన బారూకు కుమారుడైన మయశేయా నివసించెను.౹

6 యెరూషలేములో నివాసము చేసిన పెరెసు వంశస్థులందరును బలవంతులైన నాలుగువందల అరువది ఎనమండుగురు.

7 బెన్యామీనీయులలో ఎవరనగా యోవేదు పెదాయా కోలాయా మయశేయా ఈతీయేలు యెషయా అను పితరుల వరుసలో మెషుల్లాము కుమారుడైన సల్లు.౹

8 అతని తరువాత గబ్బయి సల్లయి; వీరందరును తొమ్మిదివందల ఇరువది యెనమండుగురు;౹

9 జిఖ్రీ కుమారుడైన యోవేలు వారికి పెద్దగా ఉండెను. సెనూయా కుమారుడైన యూదా పట్టణముమీద రెండవ అధికారియైయుండెను.౹

10 యాజకులలో ఎవరనగా యోయారీబు కుమారుడైన యెదా యాయు యాకీనును

11 శెరాయా దేవుని మందిరమునకు అధిపతియైయుండెను. ఇతడు మెషుల్లాము సాదోకు మెరాయోతు అహీటూబులను పితరుల వరుసలో హిల్కీయాకు పుట్టెను.౹

12 ఇంటిపని చేసినవారి సహోదరులు ఎనిమిదివందల ఇరువది యిద్దరు. మరియు పితరులైన మల్కీయా పషూరు జెకర్యా అమ్జీ పెలల్యాల వరుసలో యెరోహామునకు పుట్టిన అదాయా.౹

13 పెద్దలలో ప్రధాను లైన ఆ అదాయా బంధువులు రెండువందల నలువది యిద్దరు. మరియు ఇమ్మేరు మెషిల్లేమోతె అహజైయను పితరుల వరుసలో అజరేలునకు పుట్టిన అమష్షయి.౹

14 బలవంతులైనవారి బంధువులు నూట ఇరువది యెనమండుగురు. వారికి జబ్దీయేలు పెద్దగా ఉండెను; ఇతడు ఘనులైన వారిలో ఒకని కుమారుడు.౹

15 లేవీయులలో ఎవరనగా, షెమయా. ఇతడు బున్నీకి పుట్టిన హషబ్యాకనిన అజ్రీ కాము కుమారుడైన హష్షూబునకు పుట్టినవాడు.౹

16 లేవీయులలో ప్రధానులైన వారిలో షబ్బెతైయును యోజా బాదును దేవుని మందిర బాహ్య విషయములో పై విచారణచేయు అధికారము పొందిరి.౹

17 ఆసాపు కుమారుడైన జబ్దికి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్యా ప్రార్థన స్తోత్రముల విషయములో ప్రధానుడు; తన సహోదరులలో బక్బుక్యాయును యెదూతూను కుమారుడైన గాలాలునకు పుట్టిన షమ్మూయ కుమారుడైన అబ్దాయును ఈ విషయములో అతనిచేతిక్రింది వారు

18 పరిశుద్ధ పట్టణములో ఉన్న లేవీయులందరు రెండువందల ఎనుబది నలుగురు.౹

19 ద్వారపాలకులైన అక్కూబు టల్మోను గుమ్మములు కాయువారును నూట డెబ్బది యిద్దరు.౹

20 ఇశ్రాయేలీయులలో శేషించిన యాజకులు లేవీయులు మొదలైనవారు యూదా పట్టణములన్నిటిలో ఎవరి స్వాస్థ్యములో వారు ఉండిరి.౹

21 నెతీనీయులు ఓపెలులో నివసించిరి. జీహాయు గిష్పాయును నెతీనీయులకు ప్రధానులు.౹

22 యెరూషలేములో ఉన్న లేవీయులకు మీకాకు పుట్టిన మత్తన్యా కుమారుడైన హషబ్యా కనిన బానీ కుమారుడైన ఉజ్జీ ప్రధానుడు; ఆసాపు కుమారులలో గాయకులు దేవుని మందిరముయొక్క పనిమీద అధికారులు

23 వారిని గూర్చిన విధి యేదనగా, గాయకులు వంతులప్రకారము ఒప్పందముమీద తమ పనిచేయవలెను, లేవీయులు రాజుయొక్క ఆజ్ఞనుబట్టి దినక్రమేణ జరుగు పనులు చూడవలెను.౹

24 మరియు యూదాదేశస్థుడగు జెరహు వంశస్థుడైన మెషేజబెయేలు కుమారుడగు పెతహయా జనులనుగూర్చిన సంగతులను విచారించుటకు రాజునొద్ద ఉండెను.౹

25 వాటి పొలములలోనున్న పల్లెలు చూడగా యూదా వంశస్థులలో కొందరు కిర్యతర్బాలోను దానికి సంబంధించిన పల్లెలలోను దీబోనులోను దానికి సంబంధించిన పల్లెలలోను యెకబ్సెయేలులోను దానికి సంబంధించిన పల్లెలలోను

26 యేషూవలోను మెలాదాలోను బేత్పెలెతులోను

27 హజర్షువలులోను బెయేర్షెబాలోను దానికి సంబంధించిన పల్లెలలోను

28 సిక్లగులోను మెకోనాలోను దానికి సంబంధించిన పల్లెలలోను

29 ఏన్రిమ్మోనులోను జొర్యాలోను యర్మూతులోను

30 జానోహలోను అదుల్లాములోను వాటికి సంబంధించిన పల్లెలలోను లాకీషులోను దానికి సంబంధించిన పొలములలోను అజేకాలోను దానికి సంబంధించిన పల్లెలలోను నివసించినవారు. మరియు బెయేర్షెబా మొదలుకొని హిన్నోము లోయవరకు వారు నివసించిరి.౹

31 గెబ నివాసులగు బెన్యామీనీయులు మిక్మషులోను హాయిలోను బేతేలులోను వాటికి సంబంధించిన పల్లెలలోను

32 అనాతోతులోను నోబులోను అనన్యాలోను

33 హాసోరులోను రామాలోను గిత్తయీములోను

34 హాదీదులోను జెబోయిములోను నెబల్లాటులోను

35 లోదులోను పనివారి లోయ అను ఓనోలోను నివసించిరి.౹

36 మరియు లేవీయుల సంబంధమైనవారిలో యూదా వంశస్థులలోనివారు బెన్యామీనీయులమధ్య భాగములు పొందిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/NEH/11-6be75087df86958f886719e3fd78e632.mp3?version_id=1787—

Categories
నెహెమ్యా

నెహెమ్యా 12

1 షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతోకూడ వచ్చిన యాజకులును లేవీయులును వీరే. యేషూవ శెరాయా యిర్మీయా ఎజ్రా

2 అమర్యా మళ్లూకు హట్టూషు

3-5 షెకన్యా రెహూము మెరేమోతు ఇద్దో గిన్నెతోను అబీయా. మీయామిను మయద్యా బిల్గా

6-7 షెమయా యోయారీబు యెదాయా సల్లూ ఆమోకు హిల్కీయా యెదాయా అనువారు. వారందరును యేషూవ దినములలో యాజకులలోను వారి బంధువులలోను ప్రధానులుగా ఉండిరి.౹

8 మరియు లేవీయులలో యేషూవ బిన్నూయి కద్మీయేలు షేరేబ్యా యూదా స్తోత్రాది సేవవిషయములో ప్రధానియైన మత్తన్యాయు అతని బంధువులును.౹

9 మరియు బక్బుక్యాయు ఉన్నీయును వారి బంధువులును వారికి ఎదురు వరుసలోనుండి పాడువారు.౹

10 యేషూవ యోయాకీమును కనెను, యోయాకీము ఎల్యాషీబును కనెను, ఎల్యాషీబు యోయా దాను కనెను.౹

11 యోయాదా యోనాతానును కనెను. యోనాతాను యద్దూవను కనెను.౹

12 యోయాకీము దినములలో పితరులలో ప్రధానులైనవారు యాజకులై యుండిరి. వారెవరనగా, శెరాయా యింటివారికి మెరాయా, యిర్మీయా యింటివారికి హనన్యా

13 ఎజ్రా యింటివారికి మెషుల్లాము, అమర్యా యింటివారికి యెహో హానాను

14 మెలీకూ యింటివారికి యోనాతాను, షెబన్యా యింటివారికి యోసేపు

15 హారిము ఇంటివారికి అద్నా, మెరాయోతు ఇంటివారికి హెల్కయి

16 ఇద్దో యింటివారికి జెకర్యా, గిన్నెతోను ఇంటివారికి మెషుల్లాము

17 అబీయా యింటివారికి జిఖ్రీ, మిన్యామీను ఇంటివారికి మోవద్యా యింటివారికి పిల్టయి.౹

18 బిల్గా యింటివారికి షమ్మూయ, షెమయా యింటివారికి యెహో నాతాను

19 యోయారీబు ఇంటివారికి మత్తెనై యెదాయా యింటివారికి ఉజ్జీ

20 సల్లయి యింటివారికి కల్లయి ఆమోకు ఇంటివారికి ఏబెరు

21 హిల్కీయా యింటివారికి హషబ్యా, యెదాయా యింటివారికి నెతనేలు.౹

22 ఎల్యాషీబు దినములలో లేవీయుల విషయములో యోయాదా యోహానాను యద్దూవ కుటుంబ ప్రధానులుగా దాఖలైరి. మరియు పారసీకుడగు దర్యావేషు ఏలుబడికాలములో వారే యాజకకుటుంబ ప్రధానులుగా దాఖలైరి.౹

23 ఎల్యాషీబు కుమారుడైన యోహానాను దినములవరకు అనుదినము జరుగు విషయముల గ్రంథమందువారు లేవీయుల కుటుంబ ప్రధానులుగా దాఖలైరి.౹

24 లేవీయుల కుటుంబ ప్రధానులైన హషబ్యాయు షేరేబ్యాయును కద్మీయేలు కుమారుడైన యేషూవయును వారికి ఎదురు వరుసలో పాడు తమ బంధువులతోకూడ దైవజనుడైవ దావీదుయొక్క ఆజ్ఞనుబట్టి స్తుతిపాటలు పాడుటకు వంతుల చొప్పున నిర్ణయింపబడిరి.౹

25 మత్తన్యా బక్బుక్యా ఓబద్యా మెషుల్లాము టల్మోను అక్కూబు అనువారు గుమ్మముల దగ్గరనున్న పదార్థపు కొట్టులయొద్ద కాపుకాచు ద్వారపాలకులుగా ఉండిరి.౹

26 వీరు యోజాదాకునకు పుట్టిన యేషూవ కుమారుడైన యోయాకీము దినములలోను అధికారియైన నెహెమ్యాదినములలోను యాజకుడును శాస్త్రి యునగు ఎజ్రా దినములలోను ఆ పని జరువుచువచ్చిరి.

27 యెరూషలేము ప్రాకారమును ప్రతిష్ఠించు కాలములో వారు ఆ ప్రతిష్ఠాచారమును స్తోత్రగీతములతోను పాటలతోను స్వరమండల సితారా చేయి తాళములతోను సంతోషముగా జరిగించునట్లు లేవీయులను తమ సకల స్థలములలోనుండి యెరూషలేమునకు రప్పించుటకు పూను కొనిరి

28 అప్పుడు గాయకుల వంశస్థులు యెరూషలేము చుట్టునున్న మైదాన భూమిలోనుండియు నెటోపాతియొక్క గ్రామములలోనుండియు కూడుకొని వచ్చిరి.౹

29 మరియు గిల్గాలుయొక్క యింటిలోనుండియు, గెబయొక్కయు అజ్మావెతుయొక్కయు పొలములలోనుండియు జనులు వచ్చిరి. ఏలయనగా యెరూషలేము చుట్టును గాయకులు తమకు ఊళ్లను కట్టుకొని యుండిరి.౹

30 యాజకులును లేవీయులును తమ్మును తాము పవిత్రపరచుకొనిన తరువాత జనులను గుమ్మములను ప్రాకారమును పవిత్రపరచిరి.౹

31 అటుతరువాత నేను యూదుల ప్రధానులను ప్రాకారముమీదికి తోడుకొని వచ్చి స్తోత్రగీతములు పాడువారిని రెండు గొప్ప సమూహములుగా ఏర్పరచితిని. అందులో ఒక సమూహము కుడిప్రక్కను పెంట గుమ్మము వైపున ప్రాకారముమీదను నడిచెను.౹

32 వారివెంబడి హోషయాయును యూదుల ప్రధానులలో సగముమందియును వెళ్లిరి.౹

33 మరియు అజర్యాయు ఎజ్రాయు మెషుల్లామును

34 యూదాయు బెన్యామీనును షెమ యాయును యిర్మీయాయు అనువారు పోయిరి.౹

35 యాజకుల కుమారులలో కొందరు బాకాలు ఊదుచు పోయిరి; వారెవరనగా, ఆసాపు కుమారుడైన జక్కూరునకు పుట్టిన మీకాయా కనిన మత్తన్యాకు పుట్టిన షెమయా కుమారుడైన యోనాతానునకు పుట్టిన జెకర్యాయు

36 అతని బంధువులగు షెమయా అజరేలు మిలలై గిలలై మాయి నెతనేలు యూదా హనానీ అనువారు. వీరు దైవజనుడగు దావీదుయొక్క వాద్యములను వాయించుచు పోయిరి; వారి ముందర శాస్త్రియగు ఎజ్రాయును నడిచెను.౹

37 వారికి ఎదురుగా ఉన్న ఊట గుమ్మముదగ్గర దావీదుపురముయొక్క మెట్లమీద దావీదు నగరును దాటి ప్రాకారము వెంబడి తూర్పువైపు నీటి గుమ్మమువరకు పోయిరి.౹

38 స్తోత్రగీతములు పాడువారి రెండవ సమూహము వారికి ఎదురుగా నడిచెను, వారివెంబడి నేనును వెళ్లితిని. ప్రాకారముమీదనున్న సగముమంది కొలుముల గోపురము అవతలనుండి వెడల్పు ప్రాకారమువరకు వెళ్లిరి.౹

39 మరియు వారు ఎఫ్రాయిము గుమ్మము అవతలనుండియు, పాత గుమ్మము అవతలనుండియు, మత్స్యపు గుమ్మము అవతల నుండియు, హనన్యేలు గోపురమునుండియు, మేయా గోపురమునుండియు, గొఱ్ఱెల గుమ్మమువరకు వెళ్లి బందీ గృహపు గుమ్మములో నిలిచిరి.౹

40 ఆప్రకారమే దేవుని మందిరములో స్తోత్రగీతములు పాడువారి రెండు సమూహములును నేనును, నాతోకూడ ఉన్న అధికారులలో సగముమందియు నిలిచియుంటిమి.౹

41 యాజకులగు ఎల్యాకీము మయశేయా మిన్యామీను మీకాయా ఎల్యోయేనై జెకర్యా హనన్యా బాకాలు పట్టుకొనిరి.౹

42 ఇజ్రహయా అనువాడు నడిపింపగా మయశేయా షెమయా ఎలియాజరు ఉజ్జీ యెహోహానాను మల్కీయా ఏలాము ఏజెరులను గాయకులు బిగ్గరగా పాడిరి.౹

43 మరియు దేవుడు తమకు మహానందము కలుగజేసెనని ఆ దినమునవారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు పిల్లలు కూడ సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనందధ్వని బహు దూరమునకు వినబడెను.

44 ఆ కాలమందు పదార్థములకును ప్రతిష్ఠార్పణలకును ప్రథమ ఫలములకును పదియవవంతుల సంబంధమైన వాటికిని ఏర్పడిన గదులమీద కొందరు నియమింపబడిరి, వారు యాజకుల కొరకును లేవీయులకొరకును ధర్మశాస్త్రాను సారముగా నిర్ణయింపబడిన భాగములను పట్టణముల పొలములనుండి సమకూర్చుటకు నియమింపబడిరి; సేవచేయుటకు నియమింపబడిన యాజకులనుబట్టియు, లేవీయులనుబట్టియు యూదులు సంతోషించిరి.౹

45 మరియు గాయకులును ద్వారపాలకులును దావీదును అతని కుమారుడైన సొలొమోనును ఆజ్ఞాపించినట్లు దేవునిగూర్చిన పనులను తమ శుద్ధినిగూర్చిన పనులను నెరవేర్చుచు వచ్చిరి.౹

46 పూర్వమందు దావీదు దినములలో గాయకుల విషయములోను స్తోత్రగీతముల విషయములోను పాటల విషయములోను ఆసాపుప్రధానుడు.౹

47 జెరుబ్బాబెలు దినములలోనేమి నెహెమ్యా దినములలోనేమి ఇశ్రాయేలీయులందరును వారి వంతులచొప్పున గాయకులకును ద్వారపాలకులకును భోజనపదార్థములను అనుదినము ఇచ్చుచు వచ్చిరి. మరియు వారు లేవీయుల నిమిత్తము అర్పణలను ప్రతి ష్ఠించుచు వచ్చిరి. లేవీయులు అహరోను వంశస్థులకు వాటిని ప్రతిష్ఠించిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/NEH/12-b82750c2665f9cdf34481f13fddcf61f.mp3?version_id=1787—

Categories
నెహెమ్యా

నెహెమ్యా 13

1 ఆ దినమందువారు మోషేగ్రంథము జనులకు చదివి వినిపించగా అందులో–అమ్మోనీయులుగాని మోయాబీయులుగాని దేవునియొక్క సమాజమును ఎన్నటికి చేరకూడదు.౹

2 వారు అన్నపానములు తీసికొని ఇశ్రాయేలీయులకు ఎదురుపడక వారిని శపించుమని బిలామును ప్రోత్సాహపరచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెనని వ్రాయబడినట్టు కనబడెను.౹

3 కాగా జనులు ధర్మశాస్త్రమును వినినప్పుడు మిశ్ర జనసమూహమును ఇశ్రాయేలీయులలోనుండి వెలివేసిరి.

4 ఇంతకుముందు మన దేవుని మందిరపు గదిమీద నిర్ణ యింపబడిన యాజకుడగు ఎల్యాషీబు టోబీయాతో బంధుత్వము కలుగజేసికొని

5 నైవేద్యమును సాంబ్రాణిని పాత్రలను గింజలలో పదియవభాగమును క్రొత్త ద్రాక్షారసమును లేవీయులకును గాయకులకును ద్వారపాలకులకును ఏర్పడిన నూనెను యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వము ఉంచు స్థలమునొద్ద, అతనికి ఒక గొప్ప గదిని సిద్ధముచేసి యుండెను.౹

6 ఆ సమయములో నేను యెరూషలేములో ఉండలేదు. ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్తహషస్త యేలుబడియందు ముప్పది రెండవ సంవత్సరమున నేను రాజును దర్శించి కొన్నిదినములైన తరువాత రాజునొద్ద సెలవుపుచ్చుకొని

7 యెరూషలేమునకు వచ్చి ఎల్యాషీబు దేవుని మందిరములో టోబీయాకు ఒక గది యేర్పరచి చేసిన కీడంతయు తెలిసికొని

8 బహుగా దుఃఖపడి ఆ గదిలోనుండి టోబీయాయొక్క సామగ్రియంతయు అవతల పారవేసి, గదులన్నియు శుభ్రముచేయుడని ఆజ్ఞాపింపగా వారాలాగు చేసిరి.౹

9 పిమ్మట మందిరపు పాత్రలను నైవేద్య పదార్థములను సాంబ్రాణిని నేనక్కడికి మరల తెప్పించితిని.౹

10 మరియు లేవీయులకు రావలసిన పాళ్లు వారికి అందక పోవుటచేత సేవచేయు లేవీయులును గాయకులును తమ పొలములకు పారిపోయిరని తెలిసికొని

11 నేను అధిపతులతో పోరాడి –దేవుని మందిరమును ఎందుకు లక్ష్యపెట్టలేదని అడిగి, వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచితిని.౹

12 అటు తరువాత యూదులందరును ధాన్య ద్రాక్షారసతైలములలో పదియవభాగమును ఖజానాలోనికి తెచ్చిరి.౹

13 నమ్మకముగల మనుష్యులని పేరు పొందిన షెలెమ్యా అను యాజకుని సాదోకు అను శాస్త్రిని లేవీయులలో పెదాయాను ఖజానామీద నేను కాపరులగా నియమించితిని; వారి చేతిక్రింద మత్తన్యా కుమారుడైన జక్కూరునకు పుట్టిన హానాను నియమింపబడెను; మరియు తమ సహోదరులకు ఆహారము పంచిపెట్టు పనివారికి నియమింపబడెను.౹

14 నా దేవా, ఈ విషయములో నన్ను జ్ఞాపక ముంచుకొని, నా దేవుని మందిరమునకు దాని ఆచారముల జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరువకుండుము.

15 ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతిదినమున ద్రాక్షతొట్లను త్రొక్కుటయు, గింజలు తొట్లలో పోయుటయు, గాడిదలమీద బరువులు మోపుటయు, ద్రాక్షారసమును ద్రాక్షపండ్లను అంజూరపు పండ్లను నానా విధములైన బరువులను విశ్రాంతిదినమున యెరూషలేములోనికి తీసికొని వచ్చుటయు చూచి, యీ ఆహారవస్తువులను ఆ దినమున అమ్మినవారిని గద్దించితిని.౹

16 తూరుదేశస్థులును కాపురముండి, యెరూషలేములోను విశ్రాంతిదినములో యూదులకును చేపలు మొదలైన నానా విధ వస్తువులను తెచ్చి అమ్ముచుండిరి.౹

17 అంతట యూదుల ప్రధానులను నేనెదురాడి–విశ్రాంతిదినమును నిర్లక్ష్యపెట్టి మీ రెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు?

18 మీపితరులును ఇట్లు చేసి దేవునియొద్దనుండి మనమీదికిని యీ పట్టణస్థులమీదికిని కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతిదినమును నిర్లక్ష్యపెట్టి ఇశ్రాయేలీయులమీదికి కోపము మరి అధికముగా రప్పించుచున్నారని చెప్పితిని.౹

19 మరియు విశ్రాంతిదినమునకు ముందు చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసివేయవలెననియు, విశ్రాంతిదినము గడచువరకు వాటిని తియ్యకూడదనియు నేనాజ్ఞాపించితిని మరియు విశ్రాంతిదినమున ఏ బరువైనను లోపలికి రాకుండ గుమ్మములయొద్ద నా పనివారిలో కొందరిని కావలియుంచితిని.౹

20 వర్తకులును నానావిధములైన వస్తువులను అమ్మువారును ఒకటి రెండు మారులు యెరూషలేము అవతల బసచేసికొనగా

21 నేను వారిని గద్దించి వారితో ఇట్లంటిని–మీరు గోడచాటున ఎందుకు బసచేసి కొంటిరి? మీరు ఇంకొకసారి ఈలాగు చేసినయెడల మిమ్మును పట్టుకొందునని చెప్పితిని; అప్పటినుండి విశ్రాంతిదినమునవారు మరి రాలేదు.౹

22 అప్పుడు తమ్మును తాము పవిత్రపరచుకొనవలెననియు, విశ్రాంతిదినమును ఆచరిం చుటకు వచ్చి గుమ్మములను కాచుకొనవలెననియు లేవీయులకు నేను ఆజ్ఞాపించితిని. నా దేవా, యిందునుగూర్చియు నన్ను జ్ఞాపకముంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము.

23 ఆ దినములలో అష్డోదు అమ్మోను మోయాబు సంబంధు లైన స్త్రీలను వివాహము చేసికొనిన కొందరు యూదులు నాకు కనబడిరి.౹

24 వారి కుమారులలో సగము మంది అష్డోదు భాష మాటలాడువారు. వారు ఆయా భాషలు మాటలాడువారుగాని యూదుల భాష వారిలో ఎవరికిని రాదు.౹

25 అంతట నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తలవెండ్రుకలను పెరికివేసి–మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఇయ్యకయు, మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలెనని వారిచేత దేవుని పేరట ప్రమాణము చేయించి

26 –ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలీయుల రాజైన సొలొమోను పాపము చేయలేదా? అనేక జనములలో అతనివంటి రాజు లేకపోయినను, అతడు తన దేవునిచేత ప్రేమింపబడినవాడై ఇశ్రాయేలీయులందరిమీద రాజుగా నియమింపబడినను, అన్యస్త్రీలు అతనిచేత సహా పాపము చేయించలేదా?

27 కాగా ఇంత గొప్పకీడుచేయునట్లును, మన దేవునికి విరోధముగా పాపము చేయునట్లును అన్యస్త్రీలను వివాహము చేసికొనిన మీవంటివారి మాటలను మేము ఆలకింపవచ్చునా? అని అడిగితిని.౹

28 ప్రధానయాజకుడును ఎల్యాషీబు కుమారుడునైన యోయాదా కుమారులలో ఒకడు హోరోనీయుడైన సన్బల్లటునకు అల్లుడాయెను. దానినిబట్టి నేను అతని నాయొద్దనుండి తరిమితిని.౹

29 నా దేవా, వారు యాజక ధర్మమును, యాజకధర్మపు నిబంధనను, లేవీయుల నిబంధనను అపవిత్రపరచిరి గనుక వారిని జ్ఞాపకముంచుకొనుము.౹

30 ఈలాగునవారు ఏ పరదేశులలోను కలియకుండ వారిని పవిత్రపరచి, ప్రతి యాజకుడును ప్రతి లేవీయుడును విధి ప్రకారముగా సేవచేయునట్లు నియమించితిని.౹

31 మరియు కావలసి వచ్చినప్పుడెల్ల కట్టెల అర్పణను ప్రథమ ఫలములను తీసికొని వచ్చునట్లుగా నేను నియమించితిని. నా దేవా, మేలుకై నన్ను జ్ఞాపకముంచుకొనుము.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/NEH/13-7b8d1781c8256366e716c03503a6f6cf.mp3?version_id=1787—

Categories
ఎస్తేరు

ఎస్తేరు 1

1 అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరము : హిందూదేశము మొదలుకొని కూషుదేశమువరకు నూట ఇరువదియేడు సంస్థానములను అహష్వేరోషు ఏలెను.౹

2 ఆ కాలమందు రాజైన అహష్వేరోషు షూషను కోటలోనుండి రాజ్యపరిపాలన చేయుచుండగా

3 తన యేలుబడియందు మూడవ సంవత్సరమున తన అధిపతులకందరికిని సేవకులకును విందుచేయించెను. పారసీక దేశముయొక్కయు మాద్య దేశముయొక్కయు పరాక్రమశాలులును ఘనులును సంస్థానాధిపతులును అతని సన్నిధి నుండగా

4 అతడు తన మహిమగల రాజ్యముయొక్క ఐశ్వర్య ప్రభావములను, తన మహత్యాతిశయ ఘనతలను అనేక దినములు, అనగా నూట ఎనుబది దినములు కనుపరచెను.౹

5 ఆ దినములు గడచిన తరువాత రాజు షూషను కోటలోనున్న అల్పులకేమి ఘనులకేమి జనులకందరికిని రాజు కోటలోని తోట ఆవరణములో ఏడు దినములు విందుచేయించెను.౹

6 అక్కడ ధవళ ధూమ్రవర్ణములుగల అవిసెనారతో చేయబడిన త్రాళ్లతో చలువరాతి స్తంభములమీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఊదారంగును కలిసిన తెరలు వ్రేలాడుచుండెను. మరియు ఎరుపు తెలుపు పసుపు నలుపు అయిన చలువరాళ్లు పరచిన నేలమీద వెండి బంగారుమయమైన జలతారుగల పరుపులుండెను.౹

7 అచ్చట కూడినవారికి వివిధమైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు, రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షారసమును దాసులు అధికముగా పోసిరి.౹

8 ఆ విందు పానము ఆజ్ఞానుసారముగా జరుగుటనుబట్టి యెవరును బలవంతము చేయలేదు; ఎవడు కోరినట్టుగా వానికి పెట్టవలెనని తన కోటపనివారికి రాజు ఆజ్ఞ నిచ్చి యుండెను.౹

9 రాణియైన వష్తి కూడ రాజైన అహష్వే రోషు కోటలో స్త్రీలకు ఒక విందుచేయించెను.

10 ఏడవ దినమందు రాజు ద్రాక్షారసము త్రాగి సంతో షముగా నున్నప్పుడు, కూడివచ్చిన జనమునకును, అధిపతులకును రాణియైన వష్తియొక్క సౌందర్యమును కనుపరచవలెనని రాజ కిరీటము ధరించుకొనిన ఆమెను తన సన్నిధికి పిలుచుకొని వచ్చునట్లు

11 రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారముచేయు మెహూమాను బిజ్తా హర్బోనా బిగ్తా అబగ్తా జేతరు కర్కసు అను ఏడుగురు నపుంసకులకు ఆజ్ఞాపించెను. ఆమె సౌందర్యవతి.౹

12 రాణియైన వష్తి నపుంసకులచేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపగించెను, అతని కోపము రగులుకొనెను.౹

13 విధిని రాజ్యధర్మమును ఎరిగినవారందరిచేత రాజు ప్రతి సంగతి పరిష్కరించుకొనువాడు గనుక

14 అతడు కాలజ్ఞానులను చూచి–రాణియైన వష్తి రాజైన అహష్వేరోషు అను నేను నపుంసకులచేత ఇచ్చిన ఆజ్ఞప్రకారము చేయక పోయినందున ఆమెకు విధినిబట్టి చేయవలసినదేమని వారి నడిగెను.౹

15 అతని సన్నిధిని ఉండి రాజు ముఖమును చూచుచు, రాజ్యమందు ప్రథమపీఠములమీద కూర్చుండు పారసీకులయొక్కయు మాదీయులయొక్కయు ఏడుగురు ప్రధానులు ఎవరనగా–కర్షెనా షెతారు అద్మాతా తర్షీషు మెరెసు మర్సెనా మెమూకాను అనువారు.౹

16 మెమూకాను రాజు ఎదుటను ప్రధానుల యెదుటను ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెను–రాణియైన వష్తి రాజు ఎడల మాత్రము కాదు, రాజైన అహష్వేరోషుయొక్క సకల సంస్థానములలోనుండు అధిపతులందరి యెడలను జనులందరియెడలను నేరస్థురాలాయెను.౹

17 ఏలయనగా రాజైన అహష్వేరోషు తన రాణియైన వష్తిని తన సన్నిధికి పిలుచుకొని రావలెనని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదను సంగతి బయలుపడగానే స్త్రీలందరు దాని విని, ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారము చేయుదురు.౹

18 మరియు పారసీకులయొక్కయు మాదీయులయొక్కయు నాయకపత్నులు రాణి చేసినదాని సమాచారము విని, రాణి పలికినట్లు ఈ దినమందు రాజుయొక్క అధిపతులందరితో పలుకుదురు. దీనివలన బహు తిరస్కారమును కోపమును పుట్టును.౹

19 రాజునకు సమ్మతి ఆయెనా వష్తి రాజైన అహష్వేరోషు సన్నిధికి ఇకను రాకూడదని తమయొద్దనుండి యొక రాజాజ్ఞ పుట్టవలెను. అది తప్పకుండునట్లు పారసీకులయొక్కయు మాదీయులయొక్కయు న్యాయముచొప్పున నియమింపవలెను. మరియు వష్తికంటె యోగ్యురాలిని రాణినిగా తాము చేయవలెను.౹

20 మరియు రాజుచేయు నిర్ణయము విస్తారమైన తమ రాజ్యమందంతట ప్రకటించినయెడల, ఘను రాలుగాని అల్పురాలుగాని స్త్రీలందరు తమ పురుషులను సన్మానించుదురని చెప్పెను.౹

21 ఈ సంగతి రాజునకును అధిపతులకును అనుకూలముగా ఉండెను గనుక అతడు మెమూకాను మాట ప్రకారము చేసెను.౹

22 ప్రతి పురుషుడు తన యింటిలో అధికారిగా నుండవలెననియు, ప్రతి పురుషుడు తన స్వభాషననుసరించి తన యింటివారితో మాటలాడవలెననియు ఆజ్ఞ ఇచ్చి, ప్రతి సంస్థానమునకు దాని వ్రాతప్రకారముగాను, ప్రతి జనమునకు దాని భాష ప్రకారముగాను రాజు తన సకలమైన సంస్థానములకు దానిని గూర్చిన తాకీదులు పంపించెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EST/1-b4901ca5f1d5dc4993ab7e0284ffde15.mp3?version_id=1787—

Categories
ఎస్తేరు

ఎస్తేరు 2

1 ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషుయొక్క ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వష్తిని ఆమె చేసినదానిని ఆమెకు నిర్ణయింపబడినదానిని తలంచగా

2 యౌవనులగు రాజు పరిచారకులు ఇట్లనిరి–అందమైన కన్యకలను రాజుకొరకు వెదకనగును,౹

3 అందునిమిత్తము సౌందర్యవతులైన కన్యకలందరిని సమకూర్చి షూషను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియగు రాజుయొక్క నపుంసకుడగు హేగే వశమునకు అప్పగించునట్లు రాజు తన రాజ్యముయొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించునుగాక. శుద్ధికొరకు సుగంధద్రవ్యములను వారికిచ్చిన తరువాత

4 రాజు ఆ కన్యకలలో దేనియందు ఇష్టపడునో ఆమె వష్తికి బదులుగా రాణియగును. ఈ మాట రాజునకు అనుకూలమాయెను గనుక అతడు ఆలాగు జరిగించెను.

5 షూషను కోటలో బెన్యామీనీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దకై అను ఒక యూదుడుండెను.౹

6 బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకోన్యాను పట్టుకొనిపోయినప్పుడు ఇతడు యెకోన్యాతోకూడ యెరూషలేము నుండి చెరపట్టబడినవారిలో ఒకడు.౹

7 తన పినతండ్రి కుమార్తెయైన హదస్సా అను ఎస్తేరు తలిదండ్రులు లేనిదై యుండగా అతడామెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమునుగలదై యుండెను. ఆమె తలిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను.౹

8 రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురముచేయబడి కన్యకలు అనేకులు షూషను కోటకు పోగుచేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా, ఎస్తేరును రాజుయొక్క నగరునకు తేబడి, స్త్రీలను కాయు హేగేవశమునకు అప్పగింపబడెను.౹

9 ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతనివలన దయపొందెను; కాబట్టి ఆమె పరిమళక్రియలకొరకైన వస్తువులను ఆమెకు కావలసిన భోజనపదార్థములను, రాజు ఇంటిలోనుండి ఆమెకు ఇయ్యదగిన యేడుగురు ఆడుపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరచి ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్ఠమైన స్థలమందుంచెను.౹

10 మొర్దకై–నీ జాతిని నీ వంశమును కనుపరచ కూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించియుండెను గనుక ఆమె తెలుపలేదు.౹

11 ఎస్తేరు ఏలాగుండెనో అదియు, ఆమెకేమి సంభవించునో అదియు తెలిసికొనుటకై అంతఃపురముయొక్క ఆవరణము ఎదుట ప్రతిదినము మొర్దకై తిరుగులాడు చుండెను.౹

12 ఆరుమాసములు గోపరస తైలముతోను, ఆరు మాసములు సుగంధవర్గములతోను, స్త్రీల పరిమళక్రియలకొరకైన మరి వేరు పదార్థములతోను స్త్రీలు పరిమళక్రియలు ముగించి రాజునొద్దకు పోవువారు. పండ్రెండు మాసములైన తరువాత రాజైన అహష్వేరోషు నొద్దకు వెళ్లుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చి నప్పుడు ఒక్కొక చిన్నది రాజునొద్దకు ఆ విధముగా పోవుచుండెను, ఏమనగా ఆ తీరునవారు పరిమళక్రియలు చేయుకాలము సంపూర్ణమగుచుండెను.౹

13 మరియు అంతఃపురములోనుండి రాజు ఇంటిలోనికి వెళ్లవలసిన సమయమందు ఆమె యేమేమి కోరునో అది అట్టి స్త్రీకి ఇయ్యబడుటకద్దు.౹

14 సాయంత్రమందు ఆమె లోపలికి వెళ్లి మరుదినము ఉపపత్నులను కాయు రాజుయొక్క షండుడైన షయష్గజు అను అతని వశములోనున్న రెండవ అంతఃపురమునకు తిరిగివచ్చును. ఆమెయందు రాజు సంతోషించి ఆమెను పేరుపెట్టి పిలిచితేనేగాని ఆమె రాజు నొద్దకు మరల వెళ్లకుండెను.౹

15 మొర్దకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రియైన అబీహాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్లుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజుయొక్క షండుడైన హేగే నిర్ణ యించిన అలంకారముగాక ఆమె మరి ఏమియు కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికి ఆమెయందు దయపుట్టెను.౹

16 ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడియందు ఏడవ సంవత్సరమున టెబేతు అను పదియవ నెలలో రాజ నగరులోనికి అతనియొద్దకు పోగా

17 స్త్రీలందరికంటె రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యలందరికంటె ఆమె అతనివలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్యకిరీటమును ఆమె తలమీద ఉంచి ఆమెను వష్తికి బదులుగా రాణిగా నియమించెను.౹

18 అప్పుడు రాజు తన అధిపతులకందరికిని సేవకులకందరికిని ఎస్తేరు విషయమై యొక గొప్పవిందుచేయించి, సంస్థానములలో సెలవుదినము ప్రకటించి రాజు స్థితికి తగినట్టుగా బహుమతులు ఇప్పించెను.౹

19 రెండవమారు కన్యకలు కూర్చబడినప్పుడు మొర్దకై రాజు గుమ్మములో కూర్చుని యుండెను.౹

20 ఎస్తేరు మొర్దకైయొక్క పోషణ మందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను గనుక మొర్దకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియజేయక యుండెను.౹

21 ఆ దినములలో మొర్దకై రాజు గుమ్మములో కూర్చుని యుండగా రాజుయొక్క యిద్దరు షండులైన బిగ్తాను తెరెషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలో చించుకొని యుండిరి.౹

22 ఈ సంగతి మొర్దకైకి తెలియబడి నందున అతడు దానిని రాణియైన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దకై పేరట రాజునకు దాని తెలియ జేసెను.౹

23 ఈ సంగతినిగూర్చి విచారణకాగా అది నిజ మాయెను. అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరి తీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్యసమాచార గ్రంథమందు వ్రాయబడెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EST/2-7ee9145eeee59949866ca71143c16cea.mp3?version_id=1787—

Categories
ఎస్తేరు

ఎస్తేరు 3

1 ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు హమ్మెదాతా కుమారుడును అగాగీయుడునగు హామానును ఘనపరచి వాని హెచ్చించి, వాని పీఠమును తన దగ్గర నున్న అధిపతులందరికంటె ఎత్తుగా నుంచెను.౹

2 కాబట్టి రాజు గుమ్మముననున్న రాజసేవకులందరును రాజాజ్ఞాను సారముగా మోకాళ్లూని హామానునకు నమస్కరించిరి. మొర్దకై వంగకయు నమస్కారము చేయకయు నుండగా

3 రాజు గుమ్మముననున్న రాజసేవకులు–నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దకైని అడిగిరి.౹

4 ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచు వచ్చినను అతడు వారి మాట చెవిని బెట్టకపోయెను గనుక వారు–మొర్దకైయొక్క మాటలు స్థిరపడునో లేదో చూతమని దాని హామానునకు తెలిపిరి. ఏలయనగా అతడు–నేను యూదుడను గనుక ఆ పని చేయజాలనని వారితో చెప్పి యుండెను.౹

5 మొర్దకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి

6 మొర్దకై ప్రాణము మాత్రము తీయుట స్వల్పకార్యమని యెంచి, మొర్దకైయొక్క జనులు ఎవరైనది తెలిసికొని, అహష్వేరోషుయొక్క రాజ్యమందంతటనుండు మొర్దకై స్వజనులగు యూదులనందరిని సంహరించుటకు ఆలో చించెను.౹

7 రాజైన అహష్వేరోషుయొక్క యేలుబడియందు పండ్రెండవ సంవత్సరమున నీసాను మాసమున, అనగా ప్రథమమాసమునవారు హామాను ఎదుట పూరు, అనగా చీటిని దినదినమునకును నెల నెలకును అదారు అను పండ్రెండవనెలవరకు వేయుచు వచ్చిరి.౹

8 అంతట హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా –మీ రాజ్య సంస్థా నములన్నిటియందుండు జనులలో ఒక జాతివారు చెదరి యున్నారు; వారి విధులు సకలజనుల విధులకు వేరుగా ఉన్నవి; వారు రాజుయొక్క ఆజ్ఞలను గైకొనువారు కారు; కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు.౹

9 రాజునకు సమ్మతియైతే వారు హతము చేయబడునట్లును, నేను ఆ పనిచేయువారికి ఇరువదివేల మణుగుల వెండిని రాజుయొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించునట్లును, చట్టము పుట్టించుమనగా

10 రాజు తన చేతి ఉంగరము తీసి దానిని హమ్మెదాతా కుమారుడైన అగాగీయుడగు హామానున కిచ్చి

11 –ఆ వెండి నీకియ్య బడియున్నది; నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయునట్లుగా వారును నీకు అప్పగింపబడి యున్నారని రాజు సెలవిచ్చెను. ఈ హామాను యూదులకు శత్రువు.౹

12 మొదటి నెల పదమూడవ దినమందు రాజుయొక్క లేఖికులు పిలువబడిరి; హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆయా సంస్థానములమీద నుంచ బడిన రాజుయొక్క అధిపతులకును అధికారులకును, ఆయా సంస్థానములలోని జనములమీద నుంచబడిన అధిపతులకును అధికారులకును, వారి వారి లిపినిబట్టియు, ఆయా జనములభాషనుబట్టియు, రాజైన అహష్వేరోషు పేరట ఆ లేఖికులచేత తాకీదులు వ్రాయింపబడి రాజు ఉంగరముచేత ముద్రింపబడెను.౹

13 అదారు అను పండ్రెండవనెల పదమూడవ దినమందు యౌవనులనేమి వృద్ధులనేమి శిశువులనేమి స్త్రీలనేమి యూదులనందరిని ఒక్కదినమందే బొత్తిగా నిర్మూలము చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకొమ్మని తాకీదులు అంచెవారిచేత రాజ్య సంస్థానములన్నిటికిని పంపబడెను.౹

14 మరియు ఒకానొక దినమునకు వారు సిద్ధపడవలెనను ఆ ఆజ్ఞకు ఒక ప్రతి ప్రబలింపబడినదై ప్రతి సంస్థానములోనున్న సమస్త జనులకు ఇయ్యబడుటకు పంపబడెను.౹

15 అంచెవారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి బయలువెళ్లిరి. ఆయాజ్ఞ షూషను కోటలో ఇయ్యబడెను, దాని విని షూషను పట్టణము కలతపడెను. అంతట రాజును హామానును విందుకు కూర్చుండిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EST/3-82aab85ee5ab544f4373982928f7fcda.mp3?version_id=1787—

Categories
ఎస్తేరు

ఎస్తేరు 4

1 జరిగినదంతయు తెలియగానే మొర్దకై తన బట్టలు చింపుకొని గోనెపట్టలు వేసికొని బూడిదె పోసికొని పట్టణము మధ్యకు బయలువెళ్లి మహా శోకముతో రోద నముచేసి

2 రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను; గోనె కట్టుకొనినవాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు.౹

3 రాజుయొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడనున్న యూదులు ఉపవాస ముండి మహాదుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగినవారైరి, అనేకులు గోనెను బూడిదెను వేసికొని పడియుండిరి.౹

4 ఎస్తేరుయొక్క పనికత్తెలును ఆమెదగ్గరనున్న షండులును వచ్చి జరిగినదాని ఆమెకు తెలియజేయగా రాణి గొప్ప మనోవిచారము కలదై–మొర్దకై కట్టుకొని యున్న గోనెపట్టను తీసివేయుమని ఆజ్ఞ ఇచ్చి, కట్టించు కొనుటకై అతనియొద్దకు వస్త్రములు పంపెనుగాని అతడు వాటిని తీసికొనలేదు.౹

5 అప్పుడు ఎస్తేరు తన్ను కనిపెట్టి యుండుటకు రాజు నియమించిన షండులలో హతాకు అను ఒకని పిలిచి–అది ఏమియైనది, ఎందుకైనది తెలిసి కొనుటకు మొర్దకైయొద్దకు వెళ్లుమని ఆజ్ఞ నిచ్చెను.౹

6 హతాకు రాజు గుమ్మము ఎదుటనున్న పట్టణపు వీధిలో నుండు మొర్దకైయొద్దకు పోగా

7 మొర్దకై తనకు సంభవించిన దంతయు, యూదులను నాశనము చేయుటకుగాను హామాను వారినిబట్టి రాజు ఖజానాకు తూచి యిచ్చెదనని చెప్పిన సొమ్ము మొత్తము ఇంత యనియును అతనికి తెలిపి

8 –వారిని సంహరించుటకై షూషనులో ఇయ్యబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరునకు చూపి తెలుపుమనియు, ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపము చేయుటకై అతనియొద్దకు పోవలెనని చెప్పుమనియు దాని నతని కిచ్చెను. హతాకు వచ్చి మొర్దకైయొక్క మాటలను ఎస్తేరుతో చెప్పెను.౹

9 అంతట ఎస్తేరు మొర్దకైతో చెప్పుమని హతాకునకు సెలవిచ్చిన దేమనగా

10-11 –పిలువబడక పురుషుడేగాని స్త్రీయేగాని రాజుయొక్క అంతర్గృహమున ప్రవేశించినయెడల బ్రదుకునట్లుగా రాజు తన బంగారపుదండమును ఎవరితట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులకందరికిని అతని సంస్థానములలోనున్న జనులకందరికిని తెలిసే యున్నది. నేటికి ముప్పది దినములనుండి రాజునొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పుమనెను.౹

12 వారు ఎస్తేరుయొక్క మాటలు మొర్దకైకి తెలుపగా

13 మొర్దకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తర మిచ్చి– రాజ నగరులో ఉన్నంతమాత్రముచేత యూదులందరికంటె నీవు తప్పించుకొందువని నీ మనస్సులో తలంచుకొనవద్దు;౹

14 నీవు ఈ సమయమందు ఏమియు మాటలాడక మౌనముగానున్నయెడల యూదులకు సహాయమును విడుదలయు మరియొక దిక్కునుండి వచ్చును గాని, నీవును నీ తండ్రి యింటివారును నశించుదురు. నీవు ఈ సమయమునుబట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను.౹

15 అప్పుడు ఎస్తేరు మొర్దకైతో మరల ఇట్లనెను.౹

16 –నీవు పోయి షూషనునందు కనబడిన యూదులనందరిని సమాజమందిరమునకు సమకూర్చి, నా నిమిత్తము ఉపవాసముండి మూడుదినములు అన్నపానములు చేయకుండుడి; నేనును నా పని కత్తెలును కూడ ఉపవాసముందుము; ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించుదును; నేను నశించిన నశించెదను.౹

17 అటువలెనే మొర్దకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన యంతటి ప్రకారముగా జరిగించెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EST/4-97908f92d75ff21ecb31b269808f6218.mp3?version_id=1787—