Categories
ఎజ్రా

ఎజ్రా 8

1 రాజైన అర్తహషస్త ఏలుబడి కాలమందు బబులోను దేశమునుండి నాతోకూడ వచ్చిన యింటి పెద్దల వంశావళి.౹

2 –ఫీనెహాసు వంశములో గెర్షోమును, ఈతామారు వంశములో దానియేలును, దావీదు వంశములో హట్టూషును,౹

3 షెకన్యా పరోషుల వంశములలో జెకర్యాయు వంశా వళికి నూట ఏబదిమంది పురుషులును లెక్కింపబడిరి.౹

4 పహత్మోయాబు వంశములో జెరహ్య కుమారుడైన ఎల్యో యేనైయు రెండు వందలమంది పురుషులును

5 షెకన్యా వంశములో యహజీయేలు కుమారుడును మూడువందలమంది పురుషులును

6 ఆదీను వంశములో యోనాతాను కుమారుడైన ఎబెదును ఏబదిమంది పురుషులును

7 ఏలాము వంశములో అతల్యా కుమారుడైన యెషయాయు డెబ్బదిమంది పురుషులును

8 షెఫట్య వంశములో మిఖాయేలు కుమారుడైన జెబద్యాయు ఎనుబదిమంది పురుషులును

9 యోవాబు వంశములో యెహీయేలు కుమారుడైన ఓబ ద్యాయు రెండువందల పదునెనిమిదిమంది పురుషులును

10 షెలోమీతు వంశములో యోసిప్యా కుమారుడును నూట అరువదిమంది పురుషులును

11 బేబై వంశములో బేబై కుమారుడైన జెకర్యాయు ఇరువది ఎనిమిదిమంది పురుషులును

12 అజ్గాదు వంశములో హక్కాటాను కుమారుడైన యోహానానును నూటపదిమంది పురుషులును

13 అదోనీ కాముయొక్క చిన్న కుమారులలో ఎలీపేలెటును యెహీయేలును షెమయాయు అరువదిమంది పురుషులును

14 బిగ్వయి వంశములో ఊతైయును జబ్బూదును డెబ్బదిమంది పురుషులును.

15 వీరిని నేను అహవా వైపునకు పారు నదియొద్దకు సమకూర్చితిని. అచ్చట మేము మూడుదినములు గుడారములలో ఉంటిమి. అంతలో నేను జనులను యాజకులను తనికీ చూడగా లేవీయుడొకడును నాకు కనబడలేదు.౹

16 అప్పుడు నేను పెద్దలైన ఎలీయెజెరు అరీయేలు షెమయా ఎల్నాతాను యారీబు ఎల్నాతాను నాతాను జెకర్యా మెషుల్లాము అను వారిని, ఉపదేశకులగు యోయారీబు ఎల్నాతానులను పిలువనంపించి

17 –కాసిప్యా అను స్థల మందుండు అధికారియైన ఇద్దోయొద్దకు వారిని పంపి, మా దేవుని మందిరమునకు పరిచారకులను మాయొద్దకు తీసికొని వచ్చునట్లుగా కాసిప్యా అను స్థలమందుండు ఇద్దోతోను అతని బంధువులైన నెతీనీయులతోను చెప్పవలసిన మాటలను వారికి తెలియజెప్పితిని.౹

18 మా దేవుని కరుణా హస్తము మాకు తోడుగా ఉన్నందునవారు ప్రజ్ఞావంతుడైన ఒక నిని షేరేబ్యాను అతని కుమారులను సహోదరులను, పదు నెనిమిదిమందిని తోడుకొని వచ్చిరి. ఆ ప్రజ్ఞావంతుడు మహలి కుమారులలో ఒకడు; ఈ మహలి ఇశ్రాయేలునకు పుట్టిన లేవి వంశస్థుడు.౹

19 హషబ్యాను అతనితోకూడ మెరారీయుడగు యెషయాను అతని బంధువులును వారి కుమారులునైన యిరువదిమందిని వారు తోడుకొని వచ్చిరి.౹

20 మరియు లేవీయులు చేయవలసిన సేవలో తోడ్పడుటకై దావీదును అధిపతులును నిర్ణయించిన నెతీనీయులలో రెండువందల ఇరువదిమంది వచ్చిరి. వీరందరును పేర్లు ఉదాహరింపబడి నియమింపబడినవారు.౹

21 అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరచుకొని, మాకును మా చిన్న వారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నదిదగ్గర ఉపవాసముండుడని ప్రకటించితిని.౹

22 –మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికిని మా దేవుని హస్తముతోడుగా ఉండునుగాని, ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరిమీదికి వచ్చునని మేము రాజుతో చెప్పియుంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయునట్లు కాల్బలమును రౌతులును రాజునొద్ద కావలెనని మనవి చేయుటకు సిగ్గుగా నాకు తోచెను.౹

23 మేము ఉపవాసముండి ఆ సంగతినిబట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను

24 గనుక నేను యాజకులలోనుండి ప్రధానులైన పండ్రెండు మందిని, అనగా షేరేబ్యాను హషబ్యాను వీరి బంధువులలో పదిమందిని ఏర్పరచి

25 మా దేవుని మందిరమును ప్రతిష్ఠించుట విషయములో రాజును అతని మంత్రులును అధిపతులును అక్కడ నున్న ఇశ్రాయేలీయులందరును ప్రతిష్ఠించిన వెండిబంగారములను ఉపకరణములను తూచి వారికి అప్పగించితిని.౹

26 వెయ్యిన్ని మూడువందల మణుగుల వెండిని రెండువందల మణుగుల వెండి ఉపకరణములను, రెండువందల మణుగుల బంగారమును,౹

27 ఏడువేల తులములుగల యిరువది బంగారపు గిన్నెలను, బంగారమంత వెలగల పరిశుద్ధమైన రెండు రాగి పాత్రలను తూచి

28 వారిచేతికి అప్పగించి–మీరు యెహోవాకు ప్రతిష్ఠింపబడినవారు, పాత్రలును ప్రతిష్ఠితములైనవి. ఈ వెండి బంగారములును మీపితరుల దేవుడైన యెహోవాకు స్వేచ్ఛార్పణలై యున్నవి.౹

29 కాబట్టి మీరు యెరూషలేములో యెహోవా మందిరపు ఖజానా గదులలో, యాజకులయొక్కయు లేవీయులయొక్కయు ఇశ్రాయేలు పెద్దలయొక్కయు ప్రధానులైన వారియెదుట, వాటిని తూచి అప్పగించువరకు వాటిని భద్రముగా ఉంచుడని వారితో చెప్పితిని.౹

30 కాబట్టి యాజకులును లేవీయులును వాటి యెత్తు ఎంతో తెలిసికొని, యెరూషలేములోనున్న మన దేవుని మందిరమునకు కొనిపోవుటకై ఆ వెండి బంగారములను పాత్రలను తీసికొనిరి.

31 మేము మొదటి నెల పండ్రెండవదినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహవా నదినుండి బయలుదేరగా, మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి, శత్రువుల చేతిలోనుండియు మార్గమందు పొంచియున్నవారి చేతిలోనుండియు మమ్మును తప్పించినందున

32 మేము యెరూషలేమునకు వచ్చి మూడుదినములు అక్కడ బసచేసితిమి.౹

33 నాలుగవదినమున వెండి బంగారములును పాత్రలును మా దేవుని మందిరమందు యాజకుడైన ఊరియా కుమారుడైన మెరేమోతుచేత తూనిక వేయబడెను. అతనితోకూడ ఫీనెహాసు కుమారుడైన ఎలియాజరు ఉండెను; వీరితో లేవీయులైన యేషూవ కుమారుడైన యోజాబాదును బిన్నూయి కుమారుడైన నోవద్యాయును కూడనుండిరి.౹

34 సంఖ్యచొప్పునను ఎత్తుచొప్పునను అన్నిటిని సరిచూచిన తరువాత వాటి యెత్తు ఎంతైనది లెక్కలలో వ్రాసిరి.౹

35 మరియు చెరలోనికి కొనిపోబడినవారికి పుట్టి చెరనుండి విడుదలనొంది తిరిగి వచ్చినవారు ఇశ్రాయేలీయుల దేవునికి దహనబలులు అర్పించిరి. ఇశ్రాయేలీయులందరికొరకు పండ్రెండు ఎడ్లను తొంబది యారు పొట్టేళ్లను డెబ్బదియేడు గొఱ్ఱెపిల్లలను, పాపపరిహారార్థబలిగా పండ్రెండు మేకపోతులను తెచ్చి అన్నిటిని దహనబలిగా యెహోవాకు అర్పించిరి.౹

36 వారు రాజుయొక్క నిర్ణయములను రాజుయొక్క సేనాధిపతులకును నది యివతలనున్న అధికారులకును అప్పగించిన తరువాత వీరు జనులకును దేవుని మందిరపు పనికిని సహాయము చేసిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZR/8-556e27686172a89117e98e5406c5f513.mp3?version_id=1787—

Categories
ఎజ్రా

ఎజ్రా 9

1 ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చి–ఇశ్రాయేలీయులును యాజకులును లేవీయులును, కనానీయులు హిత్తీయులు పెరిజ్జీయులు యెబూసీయులు అమ్మోనీయులు మోయాబీయులు ఐగుప్తీయులు అమోరీయులు అను దేశపు జనములలోనుండి తమ్మును తాము వేరు పరచుకొనక, వారుచేయు అసహ్యమైన కార్యములను తామేచేయుచు,౹

2 వారి కుమార్తెలను పెండ్లి చేసికొనుచు, తమ కుమారులకును తీసికొనుచు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలిసి కొనినవారైరి. ఈ అపరాధము చేసినవారిలో పెద్దలును అధికారులును నిజముగా ముఖ్యులై యుండిరని చెప్పిరి.౹

3 నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని, నా తల వెండ్రుకలను నా గడ్డపు వెండ్రుకలను పెరికి వేసికొని విభ్రాంతిపడి కూర్చుంటిని.౹

4 చెరపట్ట బడినవారి అపరాధమును చూచి, ఇశ్రాయేలీయుల దేవుని మాటకు భయపడిన వారందరును నాయొద్దకు కూడి వచ్చిరి. నేను విభ్రాంతిపడి సాయంత్రపు అర్పణ వేళవరకు కూర్చుంటిని.౹

5 సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి, నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్లమీద పడి, నా దేవుడైన యెహోవాతట్టు చేతులెత్తి

6 –నా దేవా నా దేవా, నా ముఖము నీవైపు ఎత్తి కొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై యున్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చియున్నవి, మా అపరాధము ఆకాశమంత యెత్తుగా పెరిగియున్నది.౹

7 మా పితరుల దినములు మొదలుకొని నేటివరకు మేము మిక్కిలి అపరాధులము; మా దోషములనుబట్టి మేమును మా రాజులును మా యాజకులును అన్యదేశముల రాజుల వశమునకును ఖడ్గమునకును చెరకును దోపునకును నేటిదినముననున్నట్లు అప్పగింపబడుటచేత మిగుల సిగ్గునొందినవార మైతిమి.౹

8 అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలుగిచ్చి, మా దాస్యములో మమ్మును కొంచెము తెప్పరిల్ల జేయునట్లుగాను, మాలో ఒక శేషము ఉండ నిచ్చినట్లుగాను, తన పరిశుద్ధస్థలమందు మమ్మును స్థిరపరచునట్లుగాను, మా దేవుడైన యెహోవా కొంతమట్టుకు మాయెడల దయ చూపియున్నాడు.౹

9 నిజముగా మేము దాసులమైతిమి; అయితే మా దేవుడవైన నీవు మా దాస్యములో మమ్మును విడువక, పారసీకదేశపు రాజులయెదుట మాకు దయ కనుపరచి, మేము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి, దాని పాడైన స్థలములను తిరిగి బాగుచేయుటకును, యూదాదేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయమునిచ్చుటకును కృప చూపించితివి.౹

10 మా దేవా, యింత కృపనొందిన తరువాత మేమేమి చెప్ప గలము? నిజముగా ప్రవక్తలైన నీ దాసులద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపకపోతిమి గదా.౹

11 వారు–మీరు స్వతంత్రించుకొనబోవు దేశము దాని నివాసుల అప విత్రతచేతను వారుచేయు అసహ్యమైన వాటిచేతను అపవిత్రమాయెను, వారు జరిగించిన అసహ్యమైన వాటిచేత ఆ దేశము నలుదిక్కుల నిండినదాయెను.౹

12 కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి కుమారులకియ్యకుడి. వారి కుమార్తెలను మీ కుమారులకొరకు పుచ్చుకొనకుడి. మరియు వారికి క్షేమభాగ్యములు కలుగవలెనని మీరు ఎన్నటికిని కోరకుండినయెడల, మీరు బలముగానుండి, ఆ దేశముయొక్క సుఖమును అనుభవించి, మీ పిల్లలకు నిత్య స్వాస్థ్యముగా దాని నప్పగించెదరని చెప్పిరి.౹

13 అయితే మా దుష్క్రియలనుబట్టియు మా గొప్ప అపరాధములనుబట్టియు ఈ శ్రమలన్నియు మామీదికి వచ్చిన తరువాత, మా దేవుడవైన నీవు మా దోషములకు రావలసిన శిక్షలో కొంచెమే మామీద ఉంచి, మాకు ఈ విధముగా విడుదల కలుగజేయగా మేము నీ ఆజ్ఞలను మీరి

14 ఈ అసహ్యకార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసికొనినయెడల, మేము నాశనమగువరకు శేషమైననులేకుండునట్లును, తప్పించుకొనుటకు సాధనమైననులేకుండునట్లును, నీవు కోపపడుదువు గదా.౹

15 యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నీవు నీతిమంతుడవై యున్నావు, అందువలననే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము. చిత్తగించుము; మేము నీ సన్నిధిని అపరాధులము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థనచేసితిని.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZR/9-6df6097354db51ce37046a7cd388db7b.mp3?version_id=1787—

Categories
ఎజ్రా

ఎజ్రా 10

1 ఎజ్రా యేడ్చుచు దేవుని మందిరము ఎదుట. సాష్టాంగపడుచు, పాపమును ఒప్పుకొని ప్రార్థనచేసెను. ఇశ్రాయేలీయులలో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడివచ్చి బహుగా ఏడ్వగా

2 ఏలాము కుమారులలో నొకడగు యెహీయేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతో ఇట్లనెను –మేము దేశమందుండు అన్యజనములలోని స్త్రీలను పెండ్లిచేసికొని మా దేవునిదృష్టికి పాపము చేసితిమి; అయితే ఈ విషయములో ఇశ్రాయేలీయులు తమ నడ వడి దిద్దుకొందురను నిరీక్షణ కద్దు.౹

3 కాబట్టి యీ పని ధర్మశాస్త్రానుసారముగా జరుగునట్లు ఏలినవాడవైన నీ యోచ ననుబట్టియు, దైవాజ్ఞకు భయపడువారి యోచననుబట్టియు, ఈ భార్యలను వారికి పుట్టినవారిని వెలివేయించెదమని మన దేవునితో నిబంధన చేసికొనెదము.౹

4 లెమ్ము ఈ పని నీ యధీనములోనున్నది, మేమును నీతోకూడ నుందుము, నీవు ధైర్యము తెచ్చుకొని దీని జరిగించుమనగా

5 ఎజ్రా లేచి, ప్రధానయాజకులును లేవీయులును ఇశ్రాయేలీయులందరును ఆ మాట ప్రకారము చేయునట్లుగా వారిచేత ప్రమాణము చేయించెను. వారు ప్రమాణము చేసికొనగా

6 ఎజ్రా దేవుని మందిరము ఎదుటనుండి లేచి, ఎల్యాషీబు కుమారుడైన యోహానానుయొక్క గదిలో ప్రవేశించెను. అతడు అచ్చటికి వచ్చి, చెరపట్టబడినవారి అపరాధమునుబట్టి దుఃఖించుచు, భోజనమైనను పానమైనను చేయకుండెను.౹

7 చెరనుండి విడుదల నొందినవారందరు యెరూషలేమునకు కూడి రావలెనని యూదా దేశమంతటియందును యెరూషలేము పట్టణమందును ప్రకటనచేయబడెను.౹

8 మరియు మూడుదినములలోగా ప్రధానులును పెద్దలును చేసిన యోచనచొప్పున ఎవడైనను రాకపోయినయెడల వాని ఆస్తి దేవునికి ప్రతిష్ఠితమగుననియు, వాడు విడుదల నొందినవారి సమాజములోనుండి వెలివేయబడుననియు నిర్ణయించిరి.౹

9 యూదా వంశస్థులందరును బెన్యామీనీయులందరును ఆ మూడుదినములలోగా యెరూషలేమునకు కూడి వచ్చిరి. అది తొమ్మిదవ నెల; ఆ నెల యిరువదియవ దినమున జనులందరును దేవుని మందిరపు వీధిలో కూర్చుని గొప్ప వర్షాలచేత తడియుచు, ఆ సంగతిని తలం చుటవలన వణకుచుండిరి.

10 అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లనెను –మీరు ఆజ్ఞను మీరి అన్యస్త్రీలను పెండ్లిచేసికొని, ఇశ్రాయేలీయుల అపరాధమును ఎక్కువ చేసితిరి.౹

11 కాబట్టి యిప్పుడు మీపితరులయొక్క దేవుడైన యెహోవా యెదుట మీ పాపమును ఒప్పుకొని, ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి, దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొని యుండుడి.౹

12 అందుకు సమాజకులందరు ఎలుగెత్తి అతనితో ఇట్లనిరి–నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసియున్నది.౹

13 అయితే జనులు అనేకులై యున్నారు, మరియు ఇప్పుడు వర్షము బలముగా వచ్చుచున్నందున మేము బయట నిలువలేము, ఈ పని యొకటి రెండు దినములలో జరుగునది కాదు; ఈ విషయములో అనేకులము అపరాధులము; కాబట్టి సమాజపు పెద్దలనందరిని యీ పనిమీద ఉంచవలెను,౹

14 మన పట్టణములయందు ఎవరెవరు అన్యస్త్రీలను పెండ్లిచేసికొనిరో వారందరును నిర్ణయకాలమందు రావలెను; మరియు ప్రతి పట్టణముయొక్క పెద్దలును న్యాయాధిపతులును ఈ సంగతినిబట్టి మామీదికి వచ్చిన దేవుని కఠినమైన కోపము మామీదికి రాకుండ తొలగి పోవునట్లుగా వారితోకూడ రావలెను అనిచెప్పెను.౹

15 అప్పుడు అశాహేలు కుమారుడైన యోనాతానును తిక్వా కుమారుడైన యహజ్యాయును మాత్రమే ఆ పనికినిర్ణ యింప బడిరి. మెషుల్లామును లేవీయుడైన షబ్బెతైయును వారికి సహాయులై యుండిరి.౹

16 చెరనుండి విడుదలనొందినవారు అట్లుచేయగా యాజకుడైన ఎజ్రాయును పెద్దలలో కొందరు ప్రధానులును వారి పితరుల యింటి పేరులనుబట్టి తమతమ పేరుల ప్రకారము అందరిని వేరుగా ఉంచి, పదియవ నెల మొదటి దినమున ఈ సంగతిని విమర్శించుటకు కూర్చుండిరి.౹

17 మొదటి నెల మొదటి దినమున అన్యస్త్రీలను పెండ్లి చేసికొనిన వారందరి సంగతి వారు సమాప్తము చేసిరి.

18 యాజకుల వంశములో అన్యస్త్రీలను పెండ్లిచేసికొని యున్నట్లు కనబడినవారు ఎవరనగా – యోజాదాకు కుమారుడైన యేషూవ వంశములోను, అతని సహోదరులలోను మయశేయాయు, ఎలీయెజెరును, యారీబును గెదల్యాయును.౹

19 వీరు తమ భార్యలను పరిత్యజించెదమని మాట యిచ్చిరి. మరియు వారు అపరాధులై యున్నందున అపరాధ విషయములో మందలో ఒక పొట్టేలును చెల్లించిరి.౹

20 ఇమ్మేరు వంశములో హనానీ జెబద్యా

21 హారీము వంశములో మయశేయా ఏలీయా షెమయా యెహీయేలు ఉజ్జియా,౹

22 పషూరు వంశములో ఎల్యో యేనై మయశేయా ఇష్మాయేలు నెతనేలు యోజాబాదు ఎల్యాశా,౹

23 లేవీయులలో యోజాబాదు షిమీ కెలిథా అను కెలాయా పెతహయా యూదా ఎలీయెజెరు,౹

24 గాయకులలో ఎల్యాషీబు, ద్వారపాలకులలో షల్లూము తెలెము ఊరి అనువారు.౹

25 ఇశ్రాయేలీయులలో ఎవరెవరనగా పరోషు వంశములో రమ్యా యిజ్జీయా మల్కీయా మీయామిను ఎలియేజరు మల్కీయా, బెనాయా,౹

26 ఏలాము వంశములో మత్తన్యా జెకర్యా యెహీయేలు అబ్దీ యెరేమోతు ఏలీయ్యా.౹

27 జత్తూ వంశములో ఎల్యోయేనై ఎల్యాషీబు మత్తన్యా యెరేమోతు జాబాదు అజీజా.౹

28 బేబై వంశములో యెహోహానాను హనన్యా జబ్బయి అత్లాయి,౹

29 బానీ వంశములో మెషుల్లాము మల్లూకు అదాయా యాషూబు షెయాలు

30 రామోతు, పహత్మో యాబు వంశములో అద్నా కెలాలు బెనాయా మయ శేయా మత్తన్యా బెసలేలు బిన్నూయి మనష్షే,౹

31 హారిము వంశములో ఎలీయెజెరు ఇష్షీయా మల్కీయా షెమయా

32 షిమ్యోను బెన్యామీను మల్లూకు షెమర్యా,౹

33 హాషుము వంశములో మత్తెనై మత్తత్తా జాబాదు ఎలీపేలెటు యెరేమై మనష్షే షిమీ,౹

34 బానీ వంశములో మయదై అమ్రాము ఊయేలు బెనాయా బేద్యా కెలూహు

35 వన్యా మెరేమోతు ఎల్యాషీబు

36 మత్తన్యా మత్తెనై యహశావు బానీ బిన్నూయి షిమీ

37-42 షిలెమ్యా నాతాను అదాయా మక్నద్బయి షామై షారాయి అజరేలు షెలెమ్యా షెమర్యా షల్లూము అమర్యా యోసేపు

43 నెబో వంశములో యెహీయేలు మత్తిత్యా జాబాదు జెబీనా యద్దయి యోవేలు బెనాయా అనువారు.౹

44 వీరందరును అన్యస్త్రీలను పెండ్లిచేసికొని యుండిరి. ఈ స్త్రీలలో కొందరు పిల్లలు గలవారు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZR/10-83cf6b20afe43ef6a51305830ff121c6.mp3?version_id=1787—

Categories
నెహెమ్యా

నెహెమ్యా 1

1 హకల్యా కుమారుడైన నెహెమ్యాయొక్క చర్యలు. ఇరువదియవ సంవత్సరములో కిస్లేవు మాసమున నేను షూషను కోటలో ఉండగా

2 నా సహోదరులలో హనానీయను ఒకడును యూదులలో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకొనిన యూదులనుగూర్చియు, యెరూషలేమునుగూర్చియు నేను వారి నడుగగా

3 వారు–చెరపట్టబడినవారిలో శేషించినవారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందు చున్నారు; మరియు యెరూషలేముయొక్క ప్రాకారము పడద్రోయబడినది; దాని గుమ్మములును అగ్నిచేత కాల్చ బడినవని నాతో చెప్పిరి.౹

4 ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి యేడ్చి, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి, ఆకాశమందలి దేవుని యెదుట విజ్ఞాపన చేసితిని.౹

5 ఎట్లనగా–ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడవైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా,౹

6 నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేనుచేయు ప్రార్థన అంగీ కరించుము. నీకు విరోధముగ పాపముచేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి యింటివారును పాపము చేసియున్నాము.౹

7 నీ యెదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి, నీ సేవకుడైన మోషేచేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనక పోతిమి.౹

8 నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చినమాటను జ్ఞాపకము తెచ్చుకొనుము; అదేదనగా–మీరు అపరాధము చేసినయెడల జనులలోనికి మిమ్మును చెదర గొట్టుదును.౹

9 అయితే మీరు నావైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచినయెడల, భూదిగంతములవరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మునుకూర్చి, నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకొనిన స్థలమునకు మిమ్మును రప్పించెదనని నీవు సెలవిచ్చితివి గదా.౹

10 చిత్తగించుము, నీవు నీ మహా ప్రభావమును చూపి, నీ బాహుబలముచేత విడిపించిన నీ దాసులగు నీ జనులు వీరే.౹

11 యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొఱ్ఱను, నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొఱ్ఱను ఆలకించి, ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరచి, ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాను, అని ప్రార్థించితిని. నేను రాజునకు గిన్నె అందించువాడనై యుంటిని.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/NEH/1-574165cc2f6c37c31d2505208a12215c.mp3?version_id=1787—

Categories
నెహెమ్యా

నెహెమ్యా 2

1 అటుతరువాత అర్తహషస్త రాజు ఏలుబడికాలమున ఇరువదియవ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలెనని చూచుచుండగా నేను ద్రాక్షారసము తీసికొని రాజునకు అందించితిని. అంతకు పూర్వము నేనెన్నడును అతనియెదుట విచారముగా ఉండలేదు.౹

2 కాగా రాజు–నీకు వ్యాధిలేదు గదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి? నీ హృదయదుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా

3 నేను మిగుల భయపడి–రాజు చిరంజీవి యగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి, దాని గుమ్మములును అగ్నిచేత కాల్చబడి యుండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని.౹

4 అప్పుడు రాజు –ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్నడుగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి

5 రాజుతో–నీ సముఖమందు నేను దయపొందినయెడల, నా పితరుల సమాధులుండు పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదాదేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసితిని.౹

6 అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చునియుండగా–నీ ప్రయాణము ఎన్నిదినములు పట్టును? నీవు ఎప్పుడు తిరిగి వచ్చెదవని అడిగెను. నేను ఇంత కాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తముగలవాడాయెను.౹

7 ఇదియుగాక రాజుతో నేనిట్లంటిని – రాజున కనుకూలమైతే యూదాదేశమున నేను చేరువరకు నన్ను దాటించునట్లుగా నది యవతలనున్న అధికారులకు తాకీదులను,౹

8 పట్టణప్రాకారమునకును, మందిరముతో సంబంధించిన కోటగుమ్మములకును, నేను ప్రవేశింపబోవు ఇంటికిని, దూలములు మ్రానులు ఇచ్చునట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఇయ్యుడని అడిగితిని; ఆలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణా హస్తముకొలది రాజు నా మనవి ఆలకించెను.౹

9 తరువాత నేను నది యవతలనున్న అధికారులయొద్దకు వచ్చి వారికి రాజుయొక్క తాకీదులను అప్పగించితిని. రాజు నాతోకూడ సేనాధిపతులను గుఱ్ఱపురౌతులను పంపించెను.

10 హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన టోబీయా అను దాసుడును ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగజేయు ఒకడు వచ్చెనని విని బహుగా దుఃఖపడిరి.౹

11 అంతట నేను యెరూషలేమునకు వచ్చి మూడుదినములు అక్కడనేయుండి

12 రాత్రియందు నేనును నాతోకూడ నున్న కొందరును లేచితిమి. యెరూషలేమునుగూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేనెవరితోనైనను చెప్పలేదు. మరియు నేను ఎక్కియున్న పశువుతప్ప మరి యే పశువును నాయొద్ద ఉండలేదు.౹

13 నేను రాత్రికాలమందు లోయద్వారముగుండ భుజంగపు బావియెదుటికిని పెంటద్వారము దగ్గరకును పోయి, పడద్రోయబడిన యెరూషలేముయొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి యుండెను.౹

14 తరువాత నేను బుగ్గగుమ్మమునకు వచ్చి రాజు కోనేటికిని వెళ్లితిని గాని, నేను ఎక్కియున్న పశువు పోవుటకు ఎడము లేకపోయెను.౹

15 నేను రాత్రియందు మడుగు దగ్గరనుండి పోయి ప్రాకారమును చూచినమీదట వెనుకకు మరలి లోయ గుమ్మములో బడి తిరిగి వచ్చితిని.౹

16 అయితే నేను ఎచ్చటికి వెళ్లినది యేమి చేసినది అధికారులకు తెలియలేదు. యూదులకేగాని యాజకులకేగాని యజమానులకేగాని అధికారులకేగాని పనిచేయు ఇతరమైనవారికేగాని నేను ఆ సంగతి చెప్పి యుండలేదు.౹

17 అయితే వారితో నేనిట్లంటిని–మనకు కలిగినశ్రమ మీకు తెలిసియున్నది, యెరూషలేము ఎట్లు పాడైపోయెనో దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చ బడెనో మీరు చూచియున్నారు, మనకు ఇకమీదట నింద రాకుండ యెరూషలేముయొక్క ప్రాకారమును మరల కట్టుదము రండి.౹

18 ఇదియుగాక నాకు సహాయముచేయు దేవుని కరుణాహస్తమునుగూర్చియు, రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నియు నేను వారితో చెప్పితిని. అందుకు వారు–మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి యీ మంచికార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి.౹

19 అయితే హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన దాసుడగు టోబీయా అనువాడును, అరబీయుడైన గెషెమును ఆ మాట వినినప్పుడు మమ్మును హేళన చేసి మా పని తృణీకరించి–మీరు చేయుపనియేమిటి? రాజుమీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి.౹

20 అందుకు నేను–ఆకాశమందు నివాసియైన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము, యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచనయైనను లేదని ప్రత్యుత్తరమిచ్చితిని.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/NEH/2-13ca312cfcba4b6b1d3be29c3a7d6293.mp3?version_id=1787—

Categories
నెహెమ్యా

నెహెమ్యా 3

1 ప్రధానయాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరు లైన యాజకులును లేచి గొఱ్ఱెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. హమ్మేయా గోపురమువరకును హనన్యేలు గోపురమువరకును ప్రాకారమునుకట్టి ప్రతిష్ఠించిరి.౹

2 అతని ఆనుకొని యెరికో పట్టణపువారు కట్టిరి; వారిని ఆనుకొని ఇమ్రీ కుమారుడైన జక్కూరు కట్టెను;౹

3 మత్స్యపు గుమ్మమును హస్సెనాయా వంశస్థులుకట్టిరి; మరియు వారు దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి.౹

4 వారిని ఆనుకొని హక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతును, వారిని ఆనుకొని మెషేజబెయేలునకు పుట్టిన బెరెక్యా కుమారుడైన మెషుల్లామును, వారిని ఆనుకొని బయనా కుమారుడైన సాదోకును,౹

5 వారిని ఆనుకొని తెకోవీయులును బాగుచేసిరి. అయితే జనుల అధికారులు తమ ప్రభువు పనిచేయ నొప్పుకొనక పోయిరి.౹

6 పాత గుమ్మమును బాగుచేయువారు ఎవరనగా పాసెయ కుమారుడైన యెహోయాదాయును బెసోద్యా కుమారుడైన మెషుల్లామును దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి.౹

7 వారిని ఆనుకొని గిబియో నీయులును మిస్పావారును గిబియోనీయుడైన మెలట్యాయును మేరోనోతీయుడైన యాదోనును ఏటి యివతలనున్న అధికారి న్యాయపీఠముంచబడు స్థలమువరకు బాగు చేసిరి.౹

8 వారిని ఆనుకొని బంగారపు పనివారి సంబంధి యైన హర్హయా కుమారుడైన ఉజ్జీయేలు బాగుచేయువాడై యుండెను. అతని ఆనుకొని ఔషధజ్ఞానియగు హనన్యా పని జరుపుచుండెను. యెరూషలేముయొక్క వెడల్పు గోడవరకు దాని నుండనిచ్చిరి.౹

9 వారిని ఆనుకొని యెరూషలేములో సగముభాగమునకు అధిపతియైన హూరు కుమారుడైన రెఫాయా బాగుచేసెను.౹

10 వారిని ఆనుకొని తన యింటికి ఎదురుగా హరూమపు కుమారుడైన యెదాయా బాగుచేసెను, అతని ఆనుకొని హషబ్నెయా కుమారుడైన హట్టూషు పని జరుపువాడై యుండెను.౹

11 రెండవభాగమును అగ్నిగుండముల గోపురమును హారిము కుమారుడైన మల్కీయాయును పహత్మోయాబు కుమారుడైన హష్షూ బును బాగుచేసిరి.౹

12 వారిని ఆనుకొని యెరూషలేములో సగమునకు అధిపతియైన హల్లోహషు కుమారుడైన షల్లూమును ఆతని కుమార్తెలును బాగుచేసిరి.౹

13 లోయద్వారమును హానూనును జానోహ కాపురస్థులును బాగుచేసి కట్టినతరువాత దానికి తలుపులను తాళములను గడియలను అమర్చిరి. ఇదియుగాక పెంటద్వారమువరకుండు గోడ వెయ్యిమూరలదనుక వారుకట్టిరి.౹

14 బేత్‌హక్కెరెము ప్రదేశమునకు అధిపతియైన రేకాబు కుమారుడైన మల్కీయా పెంటగుమ్మమును బాగు చేసెను, ఆతడు దాని కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను

15 అటు వెనుక మిస్పా ప్రదేశమునకు అధిపతియైన కొల్హోజె కుమారుడైన షల్లూము ధారయొక్క గుమ్మమును బాగుచేసి కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను. ఇదియుగాక దావీదు పట్టణమునుండి క్రిందకు పోవు మెట్లవరకు రాజు తోటయొద్దనున్న సిలోయము మడుగుయొక్క గోడను అతడు కట్టెను.౹

16 అతని ఆనుకొని బేత్సూరులో సగము భాగమునకు అధిపతియు అజ్బూకు కుమారుడునైన నెహెమ్యా బాగుచేసెను. అతడు దావీదు సమాధులకు ఎదురుగానున్న స్థలములవరకును కట్టబడిన కోనేటివరకును పరాక్రమశాలులయిండ్ల స్థలమువరకును కట్టెను.౹

17 అతని ఆనుకొని లేవీయులలో బానీ కుమారుడైన రెహూము బాగుచేసెను; అతని ఆనుకొని తన భాగములో కెయిలాయొక్క సగముభాగమునకు అధిపతియైన హషబ్యా బాగుచేయువాడాయెను.౹

18 అతని ఆనుకొని వారి సహోదరులైన హేనాదాదు కుమారుడైన బవ్వై బాగుచేసెను. అతడు కెయీలాలో సగము భాగమునకు అధిపతిగా ఉండెను.౹

19 అతని ఆనుకొని మిస్పాకు అధిపతియు యేషూవకు కుమారుడునైన ఏజెరు ఆయుధముల కొట్టు మార్గమునకు ఎదురుగానున్న గోడ మలుపు ప్రక్కను మరియొక భాగమును బాగు చేసెను.౹

20 అతని ఆనుకొని ఆ గోడ మలుపునుండి ప్రధానయాజకుడైన ఎల్యాషీబు ఇంటిద్వారమువరకు ఉన్న మరియొక భాగమును జబ్బయి కుమారుడైన బారూకు ఆసక్తితో బాగు చేసెను.౹

21 అతని ఆనుకొని ఎల్యాషీబు ఇంటి ద్వారము నుండి ఆ యింటి కొనవరకు హక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతు బాగుచేసెను.౹

22 అతనిని ఆనుకొని యొర్దాను మైదానములో నివాసులైన యాజకులు బాగుచేయువారైరి.౹

23 వారిని ఆనుకొని తమ యింటి కెదురుగా బెన్యామీను హష్షూబు అను వారు బాగుచేసిరి; వారిని ఆనుకొని తన యింటియొద్ద అనన్యాకు పుట్టిన మయశేయా కుమారుడైన అజర్యా బాగుచేసెను.౹

24 అతని ఆనుకొని అజర్యా యిల్లు మొదలుకొని గోడ మలుపు మూలవరకును హేనాదాదు కుమారుడైన బిన్నూయి మరియొక భాగమును బాగుచేసెను.౹

25 అతని ఆనుకొని గోడ మళ్లిన దిక్కున చెరసాల దగ్గర రాజు నగరులో నిలుచు మహా గోపురమువరకు ఊజై కుమారుడైన పాలాలు బాగుచేయువాడాయెను; అతని ఆనుకొని పరోషు కుమారుడైన పెదాయా బాగుచేసెను.౹

26 ఓపెలులోనున్న నెతీనీయులు తూర్పువైపు నీటి గుమ్మము ప్రక్కను దానికి సంబంధించిన గోపురము దగ్గరను బాగుచేసిరి.౹

27 వారిని ఆనుకొని ఓపెలు గోడవరకు గొప్ప గోపురమునకు ఎదురుగానున్న మరియొక భాగమును తెకోవీయులు బాగుచేసిరి.౹

28 గుఱ్ఱపు గుమ్మమునకు పైగా యాజకులందరు తమయిండ్ల కెదురుగా బాగుచేసిరి.౹

29 వారిని ఆనుకొని తన యింటికి ఎదురుగా ఇమ్మేరు కుమారుడైన సాదోకు బాగుచేసెను; అతని ఆనుకొని తూర్పు ద్వారమును కాయు షెకన్యా కుమారుడైన షెమయా బాగుచేసెను.౹

30 అతని ఆనుకొని షెలెమ్యా కుమారుడైన హనన్యాయును జాలాపు ఆరవ కుమారుడైన హానూనును మరియొక భాగమును బాగుచేయు వారైరి; వారిని ఆనుకొని తన గదికి ఎదురుగా బెరెక్యా కుమారుడైన మెషుల్లాము బాగుచేసెను.౹

31 అతని ఆనుకొని నెతీ నీయుల స్థలమునకును మిప్కాదు ద్వారమునకు ఎదురుగా నున్న వర్తకుల స్థలముయొక్క మూలవరకును బంగారపు పనివాని కుమారుడైన మల్కీయా బాగుచేసెను.౹

32 మరియు మూలకును గొఱ్ఱెల గుమ్మమునకునుమధ్యను బంగారపు పనివారును వర్తకులును బాగుచేసిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/NEH/3-3a8bca45b51110dea2df651083905af2.mp3?version_id=1787—

Categories
నెహెమ్యా

నెహెమ్యా 4

1 మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బల్లటు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళిచేసి

2 షోమ్రోను దండువారి యెదుటను తన స్నేహితుల యెదుటను ఇట్లనెను–దుర్బలులైన యీ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే యీ పని ముగింతురా? బలులు అర్పించి బలపరచుకొందురా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను కుప్పలుగాపడిన రాళ్లను మరల బలమైనవిగా చేయుదురా?

3 మరియు అమ్మోనీయుడైన టోబీయా అతనియొద్దను ఉండి–వారు కట్టినదానిపైకి ఒక నక్క యెగిరినట్టయిన వారి రాతిగోడ పడిపోవుననెను.౹

4 –మా దేవా ఆలకించుము, మేము తిరస్కారము నొందిన వారము; వారి నింద వారి తలలమీదికి వచ్చునట్లుచేసి, వారు చెరపట్టబడినవారై వారు నివసించు దేశములోనే వారిని దోపునకు అప్పగించుము.౹

5 వారు కట్టువారినిబట్టి నీకు కోపము పుట్టించి యుండిరి గనుక వారి దోషమును పరిహరింపకుము, నీయెదుట వారి పాపమును తుడిచి వేయకుము.౹

6 అయినను పని చేయుటకు జనులకు మనస్సు కలిగియుండెను గనుక మేము గోడను కట్టుచుంటిమి, అది సగము ఎత్తు కట్టబడి యుండెను.

7 సన్బల్లటును టోబీయాయును అరబీయులును అమ్మోనీయులును అష్డోదీయులును, యెరూషలేముయొక్క గోడలు కట్టబడెననియు, బీటలన్నియు కప్పబడెననియు వినినప్పుడు

8 మిగుల కోపపడి యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి, పని ఆటంకపరచవలెనని వారందరు కట్టుకట్టి మమ్మును కలతపరచగా,౹

9 మేము మా దేవునికి ప్రార్థనచేసి, వారి భయముచేత రాత్రింబగళ్లు కావలియుంచితిమి.౹

10 అప్పుడు యూదావారు – బరువులు మోయువారి బలము తగ్గిపోయెను, ఉన్న చెత్త విస్తారము, గోడ కట్టలేమని చెప్పగా,౹

11 మా విరోధులును – వారు తెలిసికొనకుండను చూడకుండను మనము వారిమధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకపరచుదమనిరి.౹

12 మా శత్రువులయొద్ద నివాసులైయున్న యూదులు వచ్చి–నలు దిక్కులనుండి మీరు మా సహాయమునకు రావలెనని మాటి మాటికి మాతో చెప్పగా

13 అందునిమిత్తము గోడవెనుక నున్న దిగువ స్థలములలోను పైనున్న స్థలములలోను జనులను వారి వారి కుటుంబముల ప్రకారముగా వారి కత్తులతోను వారి యీటెలతోను వారి విండ్లతోను నిలిపితిని.౹

14 అంతట నేను లేచి చూచి ప్రధానులతోను అధికారులతోను జనులతోను–వారికి మీరు భయపడకుడి, మహా ఘనుడును భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకము చేసికొని, మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షముగాను మీ కుమార్తెల పక్షముగాను మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని.

15 వారి యోచన మాకు తెలియబడెననియు, దేవుడు దానిని వ్యర్థము చేసెననియు మా శత్రువులు సమాచారము వినగా, మాలో ప్రతివాడును తన పనికి గోడదగ్గరకు వచ్చెను.౹

16 అయితే అప్పటినుండి నా పనివారిలో సగము మంది పనిచేయుచు వచ్చిరి, సగముమంది యీటెలును బల్లెములును విండ్లును కవచములును ధరించినవారై వచ్చిరి; అధికారులు యూదులలో ఆయా యింటివారి వెనుక నిలిచిరి.౹

17 గోడ కట్టువారును బరువులు మోయువారును బరువులు ఎత్తువారును, ఒక్కొక్కరు ఒక చేతితో పని చేసి ఒక చేతితో ఆయుధము పట్టుకొని యుండిరి.౹

18 మరియు కట్టువారిలో ఒక్కొకడు తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుచు వచ్చెను, బాకా ఊదువాడు నాయొద్ద నిలిచెను.౹

19 అప్పుడు నేను ప్రధానులతోను అధికారులతోను మిగిలినవారితోను ఇట్లంటిని–పని మిక్కిలి గొప్పది, మనము గోడమీద ఒకరొకరికి చాల యెడముగా ఉన్నాము

20 గనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధముచేయును.౹

21 ఆప్రకారము మేము పనియందు ప్రయాసపడితిమి; సగముమంది ఉదయము మొదలుకొని నక్షత్రములు అగుపడువరకు ఈటెలు పట్టుకొనిరి.౹

22 మరియు ఆ కాలమందు నేను జనులతో– ప్రతివాడు తన పనివానితోకూడ యెరూషలేములో బస చేయవలెను, అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా నుందురు, పగలు పనిచేయుదురని చెప్పితిని.౹

23 ఈలాగున నేనుగాని నా బంధువులుగాని నా పనివారుగాని నా వెంబడియున్న పారావారుగాని ఉదుకుకొనుటకు తప్ప మరి దేనికిని మా వస్త్రములను తీసివేయలేదు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/NEH/4-6774fc834015b6f9b8d6a97cd9ea5275.mp3?version_id=1787—

Categories
నెహెమ్యా

నెహెమ్యా 5

1 తమ సహోదరులైన యూదులమీద జనులును వారి భార్యలును కఠినమైన ఫిర్యాదుచేసిరి.౹

2 ఏదనగా కొందరు –మేమును మా కుమారులును మా కుమార్తెలును అనేకు లము. అందుచేత మేముతిని బ్రదుకుటకు ధాన్యము మీయొద్ద తీసికొందుమనిరి.౹

3 మరికొందరు–క్షామ మున్నందున మా భూములను ద్రాక్షతోటలను మాయిండ్లను కుదువ పెట్టితిమి గనుక మీయొద్ద ధాన్యము తీసికొందు మనిరి.౹

4 మరికొందరు–రాజుగారికి పన్ను చెల్లించుటకై మా భూములమీదను మా ద్రాక్షతోటలమీదను మేము అప్పు చేసితిమి.౹

5 మా ప్రాణము మా సహోదరుల ప్రాణమువంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లలను పోలినవారు కారా? మా కుమారులను మా కుమార్తెలను దాసులగుటకై అప్పగింపవలసి వచ్చెను; ఇప్పటికిని మా కుమార్తెలలో కొందరు దాసత్వములోనున్నారు, మా భూములును మా ద్రాక్షతోటలును అన్యులవశమున నుండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నదని చెప్పగా

6 వారి ఫిర్యాదును ఈ మాటలను నేను వినినప్పుడు మిగుల కోపపడితిని.౹

7 అంతట నాలో నేనే యోచనచేసి ప్రధానులను అధికారులను గద్దించి–మీరు మీ సహోదరులయొద్ద వడ్డి పుచ్చుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహా సమాజమును సమకూర్చి

8 –అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తికొలది మేము విడిపించితిమి, మీరు మీ సహోదరులను అమ్ముదురా? వారు మనకు అమ్మబడవచ్చునా? అని వారితో చెప్పగా, వారు ఏమియు చెప్పలేక ఊరకుండిరి.౹

9 మరియు నేను–మీరు చేయునది మంచిది కాదు, మన శత్రువులైన అన్యుల నిందనుబట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింప కూడదా?

10 నేనును నా బంధువులును నా దాసులును కూడ ఆలాగుననే వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చితిమి; ఆ అప్పు పుచ్చుకొనకుందము.౹

11 ఈ దినములోనే వారియొద్ద మీరు అపహరించిన భూములను ద్రాక్షతోటలను ఒలీవతోటలను వారి యిండ్లను వారికి అప్పుగా ఇచ్చిన సొమ్ములోను ధాన్యములోను ద్రాక్షారసములోను నూనెలోను నూరవభాగమును వారికి మరల అప్పగించుడని నేను మిమ్మును బతిమాలుచున్నాను అంటిని.౹

12 అందుకు వారు–నీవు చెప్పినప్రకారమే యివన్నియు ఇచ్చివేసి వారియొద్ద ఏమియు కోరమనిరి. అంతట నేను యాజకులను పిలిచి ఈ వాగ్దాన ప్రకారము జరిగించుటకు వారిచేత ప్రమాణము చేయించితిని.౹

13 మరియు నేను నా ఒడిని దులిపి–ఈ ప్రకారమే దేవుడు ఈ వాగ్దానము నెరవేర్చని ప్రతివానిని తన యింటిలో ఉండకయు తన పని ముగింపకయు నుండునట్లు దులిపివేయును; ఇటువలె వాడు దులిపి వేయబడి యేమియు లేనివాడుగా చేయబడునుగాకని చెప్పగా, సమాజకులందరు ఆలాగు కలుగునుగాక అని చెప్పి యెహోవాను స్తుతించిరి. జనులందరును ఈ మాటచొప్పుననే జరిగించిరి.౹

14 మరియు నేను యూదాదేశములో వారికి అధికారిగా నిర్ణయింపబడినకాలము మొదలుకొని, అనగా అర్తహషస్త రాజు ఏలుబడియందు ఇరువదియవ సంవత్సరము మొదలుకొని ముప్పదిరెండవ సంవత్సరమువరకు పండ్రెండు సంవత్సరములు అధికారికి రావలసిన సొమ్మును నేనుగాని నా బంధువులుగాని తీసికొనలేదు.౹

15 అయితే నాకు ముందుగానుండిన అధికారులు జనులయొద్ద నుండి ఆహారమును ద్రాక్షారసమును నలువది తులముల వెండిని తీసికొనుచు వచ్చిరి; వారి పనివారు సహా జనులమీద భారము మోపుచు వచ్చిరి, అయితే దేవుని భయముచేత నేనాలాగున చేయలేదు.౹

16 ఇదియుగాక నేను ఈ గోడపనిచేయగా నా పనివారును ఆ పనిచేయుచు వచ్చిరి.౹

17 భూమి సంపాదించుకొనినవారము కాము; నా భోజనపు బల్లయొద్ద మా చుట్టునున్న అన్యజనులలోనుండి వచ్చినవారు గాక యూదులును అధికారులును నూట ఏబదిమంది కూర్చునియుండిరి.౹

18 నా నిమిత్తము ప్రతిదినము ఒక యెద్దును శ్రేష్ఠమైన ఆరు గొఱ్ఱెలును సిద్ధము చేయబడెను. ఇవియుగాక కోళ్లను, పదిరోజులకు ఒకమారు నానావిధమైన ద్రాక్షారసములను సిద్ధము చేసితిని. ఈ ప్రకారముగా చేసినను ఈ జనుల దాసత్వము బహు కఠినముగా ఉండినందున అధికారికి రావలసిన సొమ్మును నేను అపేక్షింపలేదు.౹

19 నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములనుబట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/NEH/5-1cc91d79d58fb8f7c4979f758db14825.mp3?version_id=1787—

Categories
నెహెమ్యా

నెహెమ్యా 6

1 నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలుపకముందుగా దానిలో బీటలులేకుండ సంపూర్ణముగా గోడను కట్టియుండగా, సన్బల్లటును టోబీయాయును అరబీయుడైన గెషెమును మా శత్రువులలో మిగిలినవారును విని

2 సన్బల్లటును గెషెమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి–ఓనో మైదానమందున్న గ్రామములలో ఒక దాని దగ్గర మనము కలిసికొందము రండని నాయొద్దకు వర్తమానము పంపిరి.౹

3 అందుకు నేను–నేను చేయుపని గొప్పది, దానివిడిచి మీయొద్దకు వచ్చుటకై నేను దాని నెందుకు ఆపవలెను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని.౹

4 వారు ఆలాగున నాలుగు మారులు నాయొద్దకు వర్తమానము పంపగా ఆప్రకారమే నేను మరల ప్రత్యుత్తరమిచ్చితిని.౹

5 అంతట అయిదవమారు సన్బల్లటు తన పనివాని ద్వారా విప్పియున్న యొక పత్రికను నాయొద్దకు పంపెను.౹

6 అందులో–వారిపైన రాజుగా ఉండవలెనని నీవు ప్రాకారమును కట్టుచున్నావనియు, ఈ హేతువు చేతనే నీవును యూదులును రాజుమీద తిరుగుబాటు చేయునట్లుగా నీవు ఆలోచించుచున్నావనియు,౹

7 యూదులకు రాజుగా ఉన్నాడని నిన్నుగూర్చి ప్రకటనచేయుటకు యెరూషలేములో ప్రవక్తలను నీవు నియమించితివనియు మొదలగు మాటలును–రాజునకు ఈ సంగతులు తెలియనగుననియు మొదలగు మాటలును, –అందునిమిత్తము ఇప్పుడు మనము యోచన చేసెదము రండనియు, ఈ సంగతి అన్యజనుల వదంతియనియు, దానిని గెషెము చెప్పుచున్నాడనియు వ్రాయబడెను.౹

8 ఈ పని చేయలేకుండ మేమశక్తులమగుదుమనుకొని వారందరు మమ్మును బెదరింప జూచిరిగాని

9 నేను–ఇటువంటి కార్యములను మేమెంత మాత్రమును చేయువారముకాము, వీటిని నీ మనస్సులోనుండి నీవు కల్పించుకొంటివని అతనియొద్దకు నేను వర్తమానము పంపితిని. దేవా, ఇప్పుడు నా చేతులను బలపరచుము.

10 అటుతరువాత మెహేతబేలునకు పుట్టిన దెలాయ్యా కుమారుడైన షెమయాయొక్క యింటికి వచ్చితిని. అతడు బయటికి రాకుండ నిర్బంధింపబడెను. అతడు–రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక, దేవుని మందిర గర్భాలయములోపలికి మనము పోయి తలుపులు వేసికొనెదము రండని చెప్పగా

11 నేను–నావంటివాడు పారిపోవచ్చునా? ఇంతవాడనైన నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశింప వచ్చునా? నేను అందులో ప్రవేశింపనంటిని.౹

12 అప్పుడు దేవుడు అతని పంపలేదనియు, టోబీయాయును సన్బల్లటును అతనికి లంచమిచ్చినందున నా విషయమై యీ ప్రకటన చేసెననియు తేటగ కనుగొంటిని

13 ఇందువలన నాకు భయము పుట్టగా, నేను అతడు చెప్పినట్లు చేసి పాపములో పడుదునని అనుకొని, నామీద నింద మోపునట్లుగా నన్నుగూర్చి చెడువార్త పుట్టించుటకు వారతనికి లంచమిచ్చి యుండిరి.౹

14 నా దేవా, వారి క్రియలనుబట్టి టోబీయాను సన్బల్లటును నన్ను భయపెట్టవలెనని కనిపెట్టి యున్న ప్రవక్తలను, నోవద్యా అను ప్రవక్తిని జ్ఞాపకము చేసికొనుము.

15 ఈ ప్రకారముగా ఏలూలు మాసము ఇరువదియయిదవ దినమందు, అనగా ఏబదిరెండు దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయెను.౹

16 అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడును, మా చుట్టునుండు అన్యజనులందరు జరిగినపని చూచినప్పుడును, వారు బహుగా అధైర్య పడిరి; ఏలయనగా ఈ పని మా దేవునివలన జరిగినదని వారు తెలిసికొనిరి.౹

17 ఆ దినములలో యూదుల ప్రధానులు టోబీయా యొద్దకు మాటి మాటికి పత్రికలు పంపుచు వచ్చిరి; అతడును వారికి పత్రికలు పంపుచుండెను.౹

18 అతడు ఆరహు కుమారుడైన షెకన్యాకు అల్లుడు. ఇదియుగాక యోహానాను అను తన కుమారుడు బెరెక్యా కుమారుడైన మెషుల్లాము కుమార్తెను వివాహము చేసికొనియుండెను గనుక యూదులలో అనేకులు అతని పక్షమున నుండెదమని ప్రమాణము చేసిరి.౹

19 వారు నా యెదుట అతని గుణాతిశయములనుగూర్చి మాటలాడుచువచ్చిరి, నేను చెప్పిన మాటలు అతనికి తెలియజేసిరి. నన్ను భయపెట్టు టకే టోబీయా పత్రికలు పంపెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/NEH/6-8a025c3339f825dd668137ac76a23403.mp3?version_id=1787—

Categories
నెహెమ్యా

నెహెమ్యా 7

1 నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి, ద్వారపాలకులను గాయకులను లేవీయులను నియమించిన పిమ్మట

2 నా సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతియైన హనన్యాకును యెరూషలేముపైన అధికారము ఇచ్చితిని. హనన్యా నమ్మకమైన మనుష్యుడు, అందరికంటె ఎక్కువగా దేవునియెదుట భయభక్తులుగలవాడు.౹

3 అప్పుడు నేను–బాగుగా ప్రొద్దెక్కువరకు యెరూషలేముయొక్క గుమ్మముల తలుపులు తియ్యకూడదు; మరియు జనులు దగ్గర నిలువబడియుండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి వేయవలెననియు, ఇదియుగాక యెరూషలేము కాపురస్థులందరు తమతమ కావలి వంతులనుబట్టి తమ యిండ్లకు ఎదురుగా కాచుకొనుటకు కావలి నియమింపవలెననియు చెప్పితిని.౹

4 అప్పటిలో ఆ పట్టణము మిగుల విశాలముగాను పెద్దదిగాను ఉండెనుగాని దానిలో జనులు కొద్దిగా ఉండిరి, యిండ్లు ఇంక కట్టబడలేదు.౹

5 జనసంఖ్యచేయునట్లు నా దేవుడు నా హృదయములో తలంపు పుట్టింపగా, ప్రధానులను అధికారులను జనులను నేను సమకూర్చితిని. అంతలో ముందు వచ్చినవారినిగూర్చిన వంశావళి గ్రంథము నాకు కనబడెను, అందులో వ్రాయబడిన వంశావళులు ఇవి.౹

6 జెరుబ్బాబెలు యేషూవ నెహెమ్యా అజర్యా రయమ్యా నహమానీ మొర్దకై బిల్షాను మిస్పెరేతు బిగ్వయి నెహూము బయనా అనువారితోకూడ బాబెలురాజైన నెబుకద్నెజరుచేత చెరలోనికి కొనిపోబడి

7 తిరిగి యెరూషలేమునకును యూదాదేశమునకును తమతమ పట్టణములకు వచ్చినవారు వీరే. ఇశ్రాయేలీయులయొక్క జనసంఖ్య యిదే.౹

8 అది ఏలాగనగా పరోషువంశస్థులు రెండువేల నూట డెబ్బదియిద్దరును

9 షెఫట్య వంశస్థులు మూడువందల డెబ్బది యిద్దరును ౹ ఆరహు వంశస్థులు ఆరువందల ఏబది యిద్దరును

10 యేషూవ యోవాబు సంబంధు లైన పహత్మోయాబు వంశస్థులు రెండువేల ఎనిమిదివందల పదునెనిమిదిమందియు

11 ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురును.౹

12 జత్తూవంశస్థులు ఎనిమిది వందల నలువది యయిదుగురును

13 జక్కయి వంశస్థులు ఏడువందల అరువది మందియు

14 బిన్నూయి వంశస్థులు ఆరువందల నలువది యెనమండుగురును

15 బేబై వంశస్థులు ఆరువందల ఇరువది యెనమండుగురును

16 అజ్గాదు వంశస్థులు రెండువేల మూడువందల ఇరువది యిద్దరును

17 అదోనీకాము వంశస్థులు ఆరువందల అరువదియేడుగురును

18 బిగ్వయి వంశస్థులు రెండువేల అరువదియేడుగురును

19 ఆదీను వంశస్థులు ఆరువందల ఏబది యయిదుగురును

20 హిజ్కియా బంధువుడైన అటేరు వంశస్థులు తొంబది యెనమండుగురును

21 హాషుము వంశస్థులు మూడువందల ఇరువది యెనమండుగురును

22 జేజయి వంశస్థులు మూడువందల ఇరువదినలుగురును

23 హారీపు వంశస్థులు నూటపండ్రెండుగురును

24 గిబియోను వంశస్థులు తొంబది యయిదు గురును

25 బేత్లెహేము నెటోపావారు నూట ఎనుబది యెనమండుగురును

26 అనాతోతువారు నూట ఇరువది యెనమండుగురును

27 బేతజ్మావెతువారు నలువది యిద్దరును

28 కిర్యత్యారీము కెఫీరా బెయేరోతులవారు ఏడువందల నలువది ముగ్గురును

29 రామా గెబలవారు ఆరువందల ఇరువది యొకరును

30 మిక్మషువారు నూట ఇరువది యిద్దరును

31 బేతేలు హాయిలవారు నూట ఇరువది ముగ్గురును రెండవ నెబోవారు ఏబది యిద్దరును

32-34 రెండవ ఏలాము వారు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురును

35 హారిము వంశస్థులు మూడువందల ఇరువది మందియు

36 యెరికో వంశస్థులు మూడువందల నలువది యయిదుగురును

37 లోదు హదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడువందల ఇరువది యొకరును

38 సెనాయా వంశస్థులు మూడువేల తొమ్మిది వందల ముప్పదిమందియు

39 యాజకులలో యేషూవ యింటివారైన యెదాయా వంశస్థులు తొమ్మిదివందల డెబ్బది ముగ్గురును

40 ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది యిద్దరును

41 పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువదియేడుగురును

42 హారిము వంశస్థులు వెయ్యిన్ని పదు నేడుగురును

43 లేవీయులైన యేషూవ హోదవ్యా కద్మీయేలు అనువారి వంశస్థులు డెబ్బది నలుగురును

44 గాయకు లైన ఆసాపు వంశస్థులు నూట నలువది యెనమండుగురును

45 ద్వారపాలకులైన షల్లూము వంశస్థులు అటేరు వంశస్థులు టల్మోను వంశస్థులు అక్కూబు వంశస్థులు హటీటా వంశస్థులు షోబయి వంశస్థులు నూటముప్పది యెనమండుగురును

46 నెతీనీయులైన జీహా వంశస్థులు హశూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు

47 కేరోసు వంశస్థులు సీయహా వంశస్థులు పాదోను వంశస్థులు

48 లెబానా వంశస్థులు హగాబా వంశస్థులు షల్మయి వంశస్థులు

49 హానాను వంశస్థులు గిద్దేలు వంశస్థులు గహరు వంశస్థులు

50 రెవాయ వంశస్థులు రెజీను వంశస్థులు నెకోదా వంశస్థులు

51 గజ్జాము వంశస్థులు ఉజ్జా వంశస్థులు పాసెయ వంశస్థులు

52 బేసాయి వంశస్థులు మెహూనీము వంశస్థులు నెపూ షేసీము వంశస్థులు.౹

53 బక్బూకు వంశస్థులు హకూపా వంశస్థులు హర్హూరు వంశస్థులు

54 బజ్లీతు వంశస్థులు మెహీదా వంశస్థులు హర్షా వంశస్థులు

55 బర్కోసు వంశస్థులు సీసెరా వంశస్థులు తెమహు వంశస్థులు నెజీయహు వంశస్థులు హటీపా వంశస్థులు

56-57 సొలొమోను దాసుల వంశస్థులు సొటయి వంశస్థులు సోపెరెతు వంశస్థులు పెరూదా వంశస్థులు

58 యహలా వంశస్థులు దర్కోను వంశస్థులు గిద్దేలు వంశస్థులు

59 షెఫట్య వంశస్థులు హట్టీలు వంశస్థులు జెబాయీయుల సంబంధమైన పొకెరెతు వంశస్థులు ఆమోను వంశస్థులు.౹

60 ఈ నెతీనీయులందరును సొలొమోను దాసుల వంశస్థులును మూడువందల తొంబది యిద్దరు.

61 తేల్మెలహు తేల్హర్షా కెరూబు అదోను ఇమ్మేరు మొద లైన స్థలములనుండి వచ్చినవారు తాము ఇశ్రాయేలీయుల సంబంధులో కారో తెలుపుటకు తమ యింటి పేరులైనను తమ వంశావళి పత్రికయైనను కనుపరచలేకపోయిరి.౹

62 వారెవరనగా దెలాయ్యా వంశస్థులు టోబీయా వంశస్థులు నెకోదా వంశస్థులు వీరు ఆరువందల నలువది యిద్దరు

63 హబాయ్యా వంశస్థులు హక్కోజు వంశస్థులు బర్జిల్లయి వంశస్థులు, అనగా గిలాదీయులైన బర్జిల్లయి కుమార్తెలలో ఒకతెను పెండ్లి చేసికొని వారి పేరుచేత పిలువబడిన బర్జిల్లయి వంశస్థులును యాజక సంతానులు.౹

64 వీరి వంశా వళులనుబట్టి యెంచబడినవారిలో వారి పద్దు పుస్తకమును వెదకగా అది కనబడకపోయెను; కాగా వారు అపవిత్రులుగా ఎంచబడి యాజకులలో ఉండకుండ వేరుపరచబడిరి.౹

65 కాగా అధికారి–ఊరీము తుమ్మీము అనువాటిని ధరించుకొని ఒక యాజకుడు ఏర్పడువరకు అతిపరిశుద్ధవస్తువులను మీరు తినకూడదని వారితో చెప్పెను.౹

66 సమాజకులందరును నలువది రెండువేల మూడువందల అరువదిమంది.౹

67 వీరు గాక వీరి పనివారును పనికత్తెలును ఏడువేల మూడు వందల ముప్పదియేడుగురును, గాయకులలో స్త్రీ పురు షులు రెండువందల నలువది యయిదుగురునై ఉండిరి.౹

68 వారి గుఱ్ఱములు ఏడువందల ముప్పది ఆరును, వారి కంచరగాడిదలు రెండువందల నలువది యయిదును

69 వారి ఒంటెలు నాలుగువందల ముప్పది యయిదును వారి గాడిదలు ఆరువేల ఏడువందల ఇరువదియునై యుండెను.

70 పెద్దలలో ప్రధానులైన కొందరు పనికి కొంత సహాయము చేసిరి. అధికారి ఖజానాలో నూట ఇరువది తులముల బంగారమును ఏబది పళ్లెములను ఏడువందల ముప్పది యాజక వస్త్రములను వేసి యిచ్చెను.౹

71 మరియు పెద్దలలో ప్రధానులైనవారు కొందరు ఖజానాలో నూట నలువది తులముల బంగారమును పదునాలుగు లక్షల తులముల వెండిని వేసిరి.౹

72 మిగిలినవారును రెండువందల నలువది తులముల బంగారమును రెండువందల నలువది లక్షల తులముల వెండిని అరువదియేడు యాజక వస్త్రములను ఇచ్చిరి.౹

73 అప్పుడు యాజకులు లేవీయులు ద్వారపాలకులు గాయకులు జనులలో కొందరును, నెతీనీయులు ఇశ్రాయేలీయులందరును, తమ పట్టణములయందు నివాసము చేసిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/NEH/7-bb32e8b6fa394caff42b23b758b5d1f4.mp3?version_id=1787—