Categories
2 దినవృత్తాంతములు

2 దినవృత్తాంతములు 14

1 అబీయా తన పితరులతోకూడ నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి; అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయెను. ఇతని దినములలో దేశము పది సంవత్సరములు నెమ్మది పొందెను.౹

2 ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడచినవాడై

3 అన్యదేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నతస్థలములను పాడుచేసి ప్రతిమలను పగుల గొట్టి దేవతాస్తంభములను కొట్టివేయించి

4 వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును, ధర్మశాస్త్రమునుబట్టియు విధినిబట్టియు క్రియలు జరిగించుటకును, యూదావారికి ఆజ్ఞాపించి

5 ఉన్నతస్థలములను సూర్య దేవతాస్తంభములను యూదావారి పట్టణములన్నిటిలోనుండి తీసివేసెను. అతని యేలుబడియందు రాజ్యము నెమ్మదిగా ఉండెను.౹

6 ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవుటచేత దేశములో నెమ్మదికలిగియుండెను; యెహోవా అతనికి విశ్రాంతి దయచేసియుండగా అతడు యూదా దేశమున ప్రాకారములుగల పట్టణములను కట్టించెను.

7 అతడు యూదావారికి ఈలాగు ప్రకటనచేసెను–మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి, ఆశ్ర యించినందున ఆయన మన చుట్టును నెమ్మది కలుగజేసి యున్నాడు; దేశమందు మనము నిరభ్యంతరముగా తిరుగ వచ్చును, మనము ఈ పట్టణములను కట్టించి, వాటికి ప్రాకారములను గోపురములను గుమ్మములను ద్వారబంధములను అమర్చుదము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధినొందిరి.౹

8 ఆ కాలమున డాళ్లను ఈటెలను పట్టుకొను మూడు లక్షలమంది యూదావారును, కేడెములు ధరించి విల్లువేయు రెండులక్షల ఎనుబదివేల మంది బెన్యామీనీయులును కూడిన సైన్యము ఆసాకు ఉండెను; వీరందరును పరాక్రమశాలులై యుండిరి.౹

9 కూషీయుడైన జెరహు వారిమీద దండెత్తి వేయి వేల సైన్యమును మూడువందల రథములను కూర్చుకొని బయలుదేరి మారేషావరకు రాగా ఆసా అతనికి ఎదురుబోయెను.౹

10 వారు మారేషానొద్ద జెపాతా అను పల్లపుస్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలుపగా

11 ఆసా తన దేవుడైన యెహోవాకు మొఱ్ఱపెట్టి – యెహోవా, విస్తారమైన సైన్యముచేతిలో ఓడిపోకుండ బలములేనివారికి సహాయము చేయుటకు నీకన్న ఎవరును లేరు; మా దేవా యెహోవా, మాకు సహాయముచేయుము, నిన్నే నమ్ముకొనియున్నాము, నీ నామమునుబట్టియే యీ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరియున్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైని జయమొందనియ్యకుము అని ప్రార్థింపగా

12 యెహోవా ఆ కూషీయులను ఆసాయెదుటను యూదావారి యెదుటను నిలువనియ్యక వారిని మొత్తినందునవారు పారిపోయిరి.౹

13 ఆసాయును అతనితోకూడనున్నవారును గెరారువరకు వారిని తరుమగా కూషీయులు మరల పంక్తులు తీర్చలేక యెహోవా భయముచేతను ఆయన సైన్యపు భయముచేతను పారిపోయిరి. యూదావారు విశేషమైన కొల్లసొమ్ము పట్టుకొనిరి.౹

14 గెరారు చుట్టునున్న పట్టణములలోని వారందరిమీదికి యెహోవా భయము వచ్చెను గనుక ఆ పట్టణములన్నిటిని కొల్లపెట్టి, వాటిలోనున్న మిక్కుటమైన కొల్లసొమ్మంతయు దోచుకొనిరి.౹

15 మరియు వారు పసులసాలలను పడగొట్టి విస్తారమైన గొఱ్ఱెలను ఒంటెలను సమకూర్చుకొని యెరూషలేమునకు తిరిగి వచ్చిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2CH/14-af48a2f5eacb6fcc7350af9f611df04f.mp3?version_id=1787—

Categories
2 దినవృత్తాంతములు

2 దినవృత్తాంతములు 15

1 ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యామీదికి రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయి యీలాగు ప్రకటించెను

2 –ఆసా, యూదావారలారా, బెన్యామీనీయులారా, మీరందరు నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపువారైనయెడల ఆయన మీ పక్షమున నుండును; మీరు ఆయనయొద్ద విచారణచేసినయెడల ఆయన మీకు ప్రత్యక్షమగును; మీరు ఆయనను విసర్జించినయెడల ఆయన మిమ్మును విసర్జించును,౹

3 నిజమైన దేవుడైనను ఉపదేశముచేయు యాజకులైనను, ధర్మశాస్త్రమైనను చాలాదినములు ఇశ్రాయేలీయులకులేకుండ పోవును.౹

4 తమ శ్రమయందువారు ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా యొద్దకు మళ్లుకొని ఆయనను వెదకి నపుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను.౹

5 ఆ కాలములలో దేశముల కాపురస్థులందరిలోను గొప్ప కల్లోలములు కలిగెను గనుక తమ పనిపాటలను చక్క పెట్టుకొనుటకై తిరుగువారికి సమాధానములేకుండెను.౹

6 దేవుడు జనములను సకలవిధములైన బాధలతో శ్రమపరచెను గనుక జనము జనమును, పట్టణము పట్టణమును, పాడు చేసెను.౹

7 కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును.

8 ప్రవక్తయైన ఓదేదు ప్రవచించిన యీ మాటలు ఆసా వినినప్పుడు అతడు ధైర్యము తెచ్చుకొని యూదా బెన్యామీనీయుల దేశమంతటినుండియు, ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకొనిన పట్టణములలోనుండియు హేయములైన విగ్రహములన్నిటిని తీసివేసి, యెహోవా మంటపము ఎదుటనుండు యెహోవా బలిపీఠమును మరల కట్టించి

9 యూదా వారినందరిని బెన్యామీనీయుల నందరిని, ఎఫ్రాయిము మనష్షే షిమ్యోను గోత్రస్థానములలోనుండి వచ్చి వారిమధ్య నివసించు పరదేశులను సమకూర్చెను. అతని దేవుడైన యెహోవా అతనికి సహాయుడై యుండుట చూచి ఇశ్రాయేలువారిలోనుండి విస్తారమైనజనులు అతని పక్షము చేరిరి.౹

10 ఆసా యేలుబడియందు పదునైదవ సంవత్సరమున మూడవ నెలను వారు యెరూషలేములో కూడి

11 తాము తీసికొనివచ్చిన కొల్లసొమ్ములోనుండి ఆ దినమున ఏడువందల యెద్దులను ఏడువేల గొఱ్ఱెలను యెహోవాకు బలులుగా అర్పించి

12 పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను తమపితరుల దేవుడైన యెహోవాయొద్ద తాము విచారణచేయుదుమనియు

13 పిన్నలేగాని పెద్దలేగాని పురుషులేగాని స్త్రీలేగాని ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాయొద్ద విచారణ చేయనివారికందరికిని మరణము విధించుదుమనియు నిష్కర్షచేసికొనిరి.౹

14 వారు ఎలుగెత్తి బొబ్బలిడుచు, మేళములతోను బూరల నాదముతోను భేరీధ్వనులతోను యెహోవా సన్నిధిని ప్రమాణము చేసిరి.౹

15 ఈలాగు ప్రమాణము చేయబడగా యూదావారందరును సంతోషించిరి; వారు పూర్ణహృదయముతో ప్రమాణముచేసి పూర్ణమనస్సుతో ఆయనను వెదకియుండిరి గనుక యెహోవావారికి ప్రత్యక్షమై చుట్టునున్న దేశస్థులతో యుద్ధములులేకుండ వారికి నెమ్మది కలుగజేసెను.౹

16 మరియు తన తల్లియైన మయకా అసహ్యమైన యొక దేవతాస్తంభమును నిలిపినందున ఆమె యిక పట్టపుదేవియై యుండకుండ రాజైన ఆసా ఆమెను త్రోసివేసి, ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి ఛిన్నాభిన్నము చేసి కిద్రోను వాగుదగ్గర దాని కాల్చివేసెను.౹

17 ఆసా ఉన్నతస్థలములను ఇశ్రాయేలీయులలోనుండి తీసివేయలేదుగాని యితడు బ్రదికిన కాలమంతయు ఇతని హృదయము యథార్థముగా ఉండెను.౹

18 తన తండ్రి ప్రతిష్ఠించినట్టియు, తాను ప్రతిష్ఠించినట్టియు వెండిని బంగారమును ఉపకరణములను అతడు తీసికొని దేవుని మందిరమునందుంచెను.౹

19 ఆసా యేలుబడియందు ముప్పది యయిదవ సంవత్సరమువరకు యుద్ధములు జరుగలేదు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2CH/15-e3eda1836ac17c947fa3a58eb2cfda65.mp3?version_id=1787—

Categories
2 దినవృత్తాంతములు

2 దినవృత్తాంతములు 16

1 ఆసా యేలుబడియందు ముప్పది ఆరవ సంవత్సరమున ఇశ్రాయేలురాజైన బయెషా యూదావారిమీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆసాయొద్దకు రాక పోకలు జరుగకుండునట్లు రామాను కట్టింపగా

2 ఆసా యెహోవామందిరమందును రాజనగరునందును ఉన్న బొక్కసములలోని వెండి బంగారములను తీసి, దమస్కులో నివాసముచేయు సిరియా రాజగు బెన్హదదు నొద్దకు దూతలచేత పంపించి

3 –నా తండ్రికిని నీ తండ్రికిని కలిగియున్నట్లు నాకును నీకును సంధి కలిగియున్నది, వెండిని బంగారమును నీకు పంపియున్నాను; ఇశ్రాయేలురాజైన బయెషా నన్ను విడిచి ఆవలికి పోవునట్లుగా నీవు అతనితో చేసియున్న సంధిని భంగము చేయుమని వర్తమానము చేసెను.౹

4 బెన్హదదు రాజైన ఆసా మాట అంగీకరించి, తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలువారి పట్టణములమీదికి పంపగా వీరు ఈయోనును దానును ఆబేల్మాయీమును నఫ్తాలి ప్రదేశమునకు చేరిన పట్టణములలోని కొట్లను కొల్లపెట్టిరి.౹

5 బయెషా అది విని రామాను ప్రాకారములతో కట్టించుట మానివేసి తాను చేయుచున్న పని చాలించెను.౹

6 అప్పుడు రాజైన ఆసా యూదా వారినందరిని సమకూర్చెను; వీరు పోయి బయెషా కట్టించు చుండిన రామాపట్టణపు రాళ్లను దూలములను తీసికొని వచ్చిరి, వాటితో ఆసా గెబను మిస్పాను ప్రాకారపురములుగా కట్టించెను.

7 ఆ కాలమందు దీర్ఘదర్శియైన హనానీ యూదా రాజైన ఆసాయొద్దకు వచ్చి అతనితో ఈలాగు ప్రకటించెను–నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే? సిరియా రాజుయొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొనిపోయెను.౹

8 బహువిస్తారమైన రథములును గుఱ్ఱపు రౌతులునుగల కూషీయులును లూబీయులును గొప్ప దండై వచ్చిరిగదా? అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీచేతికప్పగించెను.౹

9 తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది; యీ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును.౹

10 ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆసా అతనిమీద కోపగించి రౌద్రముచూపి అతనిని బందీగృహములో వేసెను, ఇదియుగాక ఆ సమయమందే ఆసా జనులలో కొందరిని బాధపరచెను.౹

11 ఆసా చేసిన కార్యములన్నిటినిగూర్చి యూదా ఇశ్రాయేలురాజుల గ్రంథమందు వ్రాయబడియున్నది.౹

12 ఆసా తన యేలుబడియందు ముప్పది తొమ్మిదవ సంవత్సరమున పాదములలో జబ్బుపుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవాయొద్ద విచారణచేయక వైద్యులను పట్టుకొనెను.౹

13 ఆసా తన పితరులతోకూడ నిద్రించి తన యేలుబడియందు నలువది యొకటవ సంవత్సరమున మృతి నొందగా

14 అత్తరు పనివారిచేత సిద్ధము చేయబడిన సుగంధ వర్గములతోను పరిమళద్రవ్యములతోను నిండిన పడకమీద జనులు అతని ఉంచి, అతని నిమిత్తము బహువిస్తారమైన గంధవర్గములను దహించి, దావీదు పట్టణమందు అతడు తన కొరకై తొలిపించుకొనిన సమాధియందు అతని పాతిపెట్టిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2CH/16-d3742313145e8194bfd9cb7a61d2ab28.mp3?version_id=1787—

Categories
2 దినవృత్తాంతములు

2 దినవృత్తాంతములు 17

1 తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన . యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండ తన రాజ్యమును బలపరచుకొనెను.౹

2 అతడు యూదా దేశములోని ప్రాకారపురములన్నిటియందును సైన్యములను ఉంచి, యూదా దేశమందును తన తండ్రియైన ఆసా పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణములయందును కావలి బలములను ఉంచెను.౹

3 యెహోవా అతనికి సహాయుడై యుండగా యెహోషాపాతు తన తండ్రియైన దావీదు ప్రారంభదినములలో నడచిన మార్గమందు నడచుచు

4 బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు, ఇశ్రాయేలువారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలననుసరించి నడిచెను.౹

5 కాబట్టి యెహోవా అతనిచేత రాజ్యమును స్థిరపరచెను, యూదావారందరును యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి, అతనికి ఐశ్వ ర్యమును ఘనతయు మెండుగా కలిగెను.౹

6 యెహోవా మార్గములయందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరచుకొనినవాడై ఉన్నతస్థలములను దేవతాస్తంభములను యూదాలోనుండి తీసివేసెను.

7 తన యేలుబడియందు మూడవ సంవత్సరమున యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్హయీలును ఓబద్యాను జెకర్యాను నెతనేలును మీకాయాను

8 షెమయా నెతన్యా జెబద్యా అశాహేలు షెమిరామోతు యెహోనాతాను అదోనీయా టోబీయా టోబదోనీయా అను లేవీయులను, యాజకులైన ఎలీషామాను యెహోరామును బంపెను.౹

9 వారు యెహోవా ధర్మశాస్త్రగ్రంథమును చేతపుచ్చుకొని యూదావారిమధ్య ప్రకటనచేయుచు, యూదా పట్టణములన్నిటను సంచరించుచు జనులకు బోధించిరి.౹

10 యూదాదేశము చుట్టుఉండు దేశముల రాజ్యములన్నిటి మీదికి యెహోవా భయము వచ్చినందునవారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి.౹

11 ఫిలిష్తీయులలో కొందరు యెహోషాపాతునకు పన్నును కానుకలను ఇచ్చుచు వచ్చిరి; అరబీయులును అతనికి ఏడువేల ఏడు వందల గొఱ్ఱె పొట్టేళ్లను ఏడువేల ఏడు వందల మేకపోతులను తెచ్చుచు వచ్చిరి.

12 యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమునందు కోటలను సామగ్రిని నిలువచేయు పట్టణములను కట్టించెను.౹

13 యూదాదేశపు పట్టణములలో అతనికి బహు ధనము సమకూర్చబడెను. అతని క్రింది పరాక్రమశాలులు యెరూషలేములో కూడియుండిరి.౹

14 వీరి పితరుల వంశములచొప్పున వీరి సంఖ్య యెంతనగా, యూదాలో సహస్రాధిపతులైన వారికి ప్రధానుడగు అద్నాయొద్ద మూడు లక్షలమంది పరాక్రమశాలులుండిరి.౹

15 రెండవవాడగు యెహోహానాను అను అధిపతియొద్ద రెండులక్షల ఎనుబదివేలమంది యుండిరి.౹

16 మూడవవాడు జిఖ్రీ కుమారుడై యెహోవాకు తన్నుతాను మనఃపూర్వకముగా సమర్పించుకొనిన అమస్యా; అతనియొద్ద రెండు లక్షలమంది పరాక్రమశాలులుండిరి.౹

17 బెన్యామీనీయులలో ఎల్యాదా అను పరాక్రమశాలి యొకడుండెను; వీనియొద్ద వింటిని కేడెమును పట్టుకొనువారు రెండు లక్షలమంది యుండిరి.౹

18 రెండవవాడు యెహోజాబాదు; వీనియొద్ద లక్షయెనుబదివేలమంది యుద్ధసన్నద్ధులుండిరి.౹

19 రాజు యూదాయందంతటనుండు ప్రాకారపురములలో ఉంచినవారు గాక వీరు రాజుయొక్క పరివారములో చేరినవారై యుండిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2CH/17-46eb1243d6eff759e23ba4be08b8d259.mp3?version_id=1787—

Categories
2 దినవృత్తాంతములు

2 దినవృత్తాంతములు 18

1 తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు అహాబుతో వియ్యమంది

2 కొన్ని సంవత్సరములు గతించినమీదట షోమ్రోనులో నుండు అహాబునొద్దకు పోయెను; అహాబు అతని కొరకును అతని వెంటవచ్చిన జనులకొరకును అనేకమైన గొఱ్ఱెలను పశువులను కోయించి, తనతోకూడ రామోత్గిలాదు మీదికిపోవుటకు అతని ప్రేరేపించెను.౹

3 ఇశ్రాయేలురాజైన అహాబు యూదారాజైన యెహోషాపాతును చూచి–నీవు నాతోకూడ రామోత్గిలాదునకు వచ్చెదవా అని అడుగగా యెహోషాపాతు–నేను నీవాడను, నా జనులు నీ జనులు, మేము నీతోకూడ యుద్ధమునకు వచ్చెదమని చెప్పెను.౹

4 మరియు యెహోషాపాతు ఇశ్రాయేలురాజుతో–నేడు యెహోవాయొద్ద సంగతి విచారణ చేయుదము రండనగా

5 ఇశ్రాయేలురాజు నాలుగువందలమంది ప్రవక్తలను సమకూర్చి–నేను రామోత్గిలాదుమీదికి యుద్ధమునకు పోవుదునా మానుదునా అని వారి నడిగెను. అందుకువారు–పొమ్ము, దేవుడు రాజు చేతికి దానినప్పగించునని చెప్పిరి.౹

6 అయితే యెహోషాపాతు–మనము అడిగి విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా? అని యడుగగా

7 ఇశ్రాయేలురాజు–యెహోవాయొద్ద విచారణచేయుటకు ఇవ్లూ కుమారుడైన మీకాయా అను ఒకడు ఇచ్చట ఉన్నాడు; అయితే అతడు నన్నుగూర్చి మేలు ప్రవచింపక నిత్యము కీడునే ప్రవచించుచున్నాడు గనుక నేను వానియందు పగ గలిగియున్నాననగా యెహోషాపాతు–రాజు ఆలాగనవద్దనెను.౹

8 అప్పుడు ఇశ్రాయేలురాజు తన పరివారములోనున్న యొకని పిలిపించి–ఇవ్లూ కుమారుడైన మీకాయాను శీఘ్రముగా రప్పించుమని ఆజ్ఞ ఇచ్చెను.౹

9 ఇశ్రాయేలురాజును యూదారాజగు యెహోషాపాతును షోమ్రోను ఊరు గవిని ముందరి బయలునందు తమతమ వస్త్రములను ధరించుకొని తమతమ సింహాసనములమీద కూర్చునియుండగా ప్రవక్తలందరును వారి ముందర ప్రవచించుచుండిరి.౹

10 అప్పుడు కెనయనా కుమారుడైన సిద్కియా యినుపకొమ్ములు చేయించుకొనివచ్చి–సిరియనులు నిర్మూల మగువరకు వీటితో వారిని నీవు పొడిచెదవని యెహోవా సెలవిచ్చుచున్నాడని ప్రకటించెను.౹

11 ప్రవక్తలందరును ఆప్రకారముగానే ప్రవచించుచు–యెహోవా రామో త్గిలాదును రాజు చేతికి అప్పగించును, దానిమీదికిపోయి జయమొందుము అనిరి.౹

12 మీకాయాను పిలుచుటకు పోయిన దూత అతని కనుగొని–ప్రవక్తలు రాజు విషయమై యేక ముఖముగా మేలునే పలుకుచున్నారు, దయచేసి నీ మాటను వారి మాటలకు అనుకూలపరచి మేలునే ప్రవ చింపుమనగా

13 మీకాయా–యెహోవా జీవముతోడు నా దేవుడు సెలవిచ్చునదేదో దానినే ప్రవచింతునని చెప్పెను.౹

14 అతడు రాజునొద్దకు రాగా రాజు అతని చూచి–మీకాయా, యుద్ధమునకు రామోత్గిలాదునకు మేము పోవుదుమా, మానుదుమా అని యడుగగా అతడు–పోయి జయించుడి, వారు మీ చేతికి అప్పగింపబడుదురనెను.౹

15 అప్పుడు రాజు–యెహోవా నామమునుబట్టి అబద్ధముకాక సత్యమే పలుకుమని నేను ఎన్నిమారులు నీచేత ఒట్టు పెట్టించుకొందునని అతనితో అనగా

16 అతడు–కాపరిలేని గొఱ్ఱెలవలెనే ఇశ్రాయేలు వారందరును పర్వతములమీద చెదరిపోవుట చూచితిని; –వీరికి యజమానుడు లేడనియు, వీరిలో ప్రతివాడు తన తన యింటికి సమాధానముగా పోవలెననియు యెహోవా సెలవిచ్చియున్నాడనెను.౹

17 ఇశ్రాయేలురాజు ఇది విని యెహోషాపాతుతో ఇట్లనెను –ఇతడు కీడునేగాని నా విషయమై మేలును ప్రవచింపడని నేను నీతో చెప్పలేదా అని యనగా

18 మీకాయా– యెహోవా మాట వినుడి, యెహోవా తన సింహాసనము మీద ఆసీనుడైయుండుటయు, పరమండల సైన్యమంతయు ఆయన కుడిప్రక్కను ఎడమప్రక్కను నిలువబడుటయు నేను చూచితిని.౹

19 –ఇశ్రాయేలురాజైన అహాబు రామో త్గిలాదుమీదికి పోయి పడిపోవునట్లు ఎవడు అతని ప్రేరేపించునని యెహోవా అడుగగా, ఒకడు ఈ విధముగాను ఇంకొకడు ఆ విధముగాను ప్రత్యుత్తరమిచ్చిరి.౹

20 అప్పుడు ఒక ఆత్మవచ్చి యెహోవాయెదుట నిలువబడి–నేను అతని ప్రేరేపించెదనని చెప్పగా యెహోవా–దేనిచేతనని అతని నడిగెను.౹

21 అందుకు ఆయాత్మ–నేను బయలుదేరి అతని ప్రవక్తలందరి నోటను అబద్ధములాడు ఆత్మగా ఉందునని చెప్పగా యెహోవా–నీవు అతనిని ప్రేరేపించి జయిం తువు, పోయి ఆప్రకారముగా చేయుమని సెలవిచ్చెను.౹

22 యెహోవా నీ ప్రవక్తలగు వీరినోట అబద్ధములాడు ఆత్మను ఉంచియున్నాడు, యెహోవా నీమీద కీడు పలికించియున్నాడని చెప్పెను.

23 అప్పుడు కెనయనా కుమారుడైన సిద్కియా దగ్గరకు వచ్చి మీకాయాను చెంపమీద కొట్టి–నీతో మాటలాడుటకు యెహోవా ఆత్మ నాయొద్దనుండి ఏ మార్గమున పోయెననెను.౹

24 అందుకు మీకాయా–దాగుటకై నీవు లోపలి గదిలోనికి వెళ్లు దినమున దాని తెలిసికొందువని చెప్పెను.౹

25 అప్పుడు ఇశ్రాయేలురాజు–పట్టణపు అధిపతియైన ఆమోనునొద్దకును రాజు కుమారుడైన యోవాషునొద్దకును –మీరు మీకాయాను తీసికొనిపోయి వారితో రాజు మీకిచ్చిన సెలవు ఇదియే యనుడి,౹

26 –నేను సురక్షితముగా తిరిగి వచ్చువరకు వీనిని చెరలోపెట్టి క్లేశాన్న పానములు ఇయ్యుడి.౹

27 అప్పుడు మీకాయా యిట్ల నెను–నీవు సురక్షితముగా తిరిగి వచ్చినయెడల యెహోవా నా ద్వారా పలుకనే లేదనిచెప్పి, సమస్తజనులారా ఆలకించుడనెను.౹

28 అంతట ఇశ్రాయేలురాజును యూదా రాజైన యెహోషాపాతును రామోత్గిలాదుమీదికి పోయిరి.౹

29 ఇశ్రాయేలురాజు–నేను మారువేషమువేసికొని యుద్ధమునకు పోవుదును, నీవు నీ వస్త్రములనే ధరించుకొనుమని యెహోషాపాతుతో చెప్పి తాను మారువేషము వేసి కొనెను, తరువాత వారు యుద్ధమునకు పోయిరి.౹

30 సిరియా రాజు–మీరు ఇశ్రాయేలురాజుతోనే యుద్ధము చేయుడి, అధములతోనైనను అధికులతోనైనను చేయవద్దని తనతోకూడనున్న తన రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చియుండెను.౹

31 కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలురాజనుకొని యుద్ధము చేయుటకు అతని చుట్టుకొనిరి,గాని యెహోషాపాతు మొఱ్ఱపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను, దేవుడు అతని యొద్దనుండి వారు తొలగిపోవునట్లు చేసెను.౹

32 ఎట్లనగా రథాధిపతులు అతడు ఇశ్రాయేలురాజుకాడని తెలిసికొని అతని తరుముట మాని తిరిగిపోయిరి.౹

33 అప్పుడు ఒకడు గురిచూడకయే తన వింటిని ఎక్కుబెట్టి, ఇశ్రాయేలురాజును అతని కవచపు బందులసందున కొట్టగా అతడు– నాకు గాయము తగిలినది, నీ చెయ్యి త్రిప్పి దండులోనుండి నన్ను కొనిపొమ్మని తన సారధితో అనెను.౹

34 ఆ దినమున యుద్ధము ప్రబలమాయెను; అయినను ఇశ్రాయేలురాజు అస్తమయమువరకు సిరియనులకెదురుగా తన రథమునందు నిలిచెను, ప్రొద్దుగ్రుంకువేళ అతడు చని పోయెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2CH/18-b483c3d0a7658f684aa180d6355f20c9.mp3?version_id=1787—

Categories
2 దినవృత్తాంతములు

2 దినవృత్తాంతములు 19

1 యూదారాజైన యెహోషాపాతు ఏ యపాయమును చెందకుండ యెరూషలేమునందుండు తన నగరునకు తిరిగిరాగా

2 దీర్ఘదర్శి హనానీ కుమారుడునగు యెహూ అతనిని ఎదుర్కొనబోయి, రాజైన యెహోషాపాతుకు ఈలాగు ప్రకటనచేసెను–నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి గదా? అందువలన యెహోవా సన్నిధినుండి కోపము నీమీదికి వచ్చును.౹

3 అయితే దేశములోనుండి నీవు దేవతాస్తంభములను తీసివేసి దేవునియొద్ద విచారణచేయుటకు నీవు మనస్సు నిలుపుకొనియున్నావు, నీయందు మంచి క్రియలు కనబడుచున్నవి.

4 యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయుచు బెయేర్షెబానుండి ఎఫ్రాయిము మన్యమువరకు జనులమధ్యను సంచరించుచు, వారి పితరుల దేవుడైన యెహోవావైపునకు వారిని మళ్లించెను.౹

5 మరియు అతడు ఆయా పట్టణములలో, అనగా దేశమందు యూదావారున్న బురుజులుగల పట్టణములన్నిటిలో న్యాయాధిపతులను నిర్ణయించి వారికీలాగున ఆజ్ఞాపించెను

6 –మీరు యెహోవా నియమమునుబట్టియేగాని మనుష్యుల నియమమునుబట్టి తీర్పు తీర్చవలసినవారు కారు; ఆయన మీతోకూడనుండును గనుక మీరు తీర్చు తీర్పు బహు జాగ్ర త్తగా చేయుడి.౹

7 యెహోవా భయము మీమీద ఉండునుగాక; హెచ్చరికగానుండి తీర్పు తీర్చుడి; మన దేవుడైన యెహోవాయందు దౌష్ట్యములేదు, ఆయన పక్షపాతికాడు, లంచము పుచ్చుకొనువాడు కాడు.౹

8 మరియు తాను యెరూషలేమునకు వచ్చినప్పుడు యెహోవా నిర్ణ యించిన న్యాయమును జరిగించుటకును, సందేహాంశములను పరిష్కరించుటకును, యెహోషాపాతు లేవీయులలోను యాజకులలోను ఇశ్రాయేలీయుల పితరులయిండ్ల పెద్దలలోను కొందరిని నియమించి

9 వారికీలాగున ఆజ్ఞాపించెను–యెహోవాయందు భయభక్తులు కలిగినవారై, నమ్మకముతోను యథార్థమనస్సుతోను మీరు ప్రవర్తింపవలెను.౹

10 నరహత్యనుగూర్చియు, ధర్మశాస్త్రమునుగూర్చియు, ధర్మమునుగూర్చియు, కట్టడలనుగూర్చియు, న్యాయవిధులనుగూర్చియు, ఆయాపట్టణములలో నివసించు మీ సహోదరులు తెచ్చు ఏ సంగతినేగాని మీరు విమ ర్శించునప్పుడు, మీమీదికిని మీ సహోదరులమీదికిని కోపము రాకుండునట్లువారు యెహోవాదృష్టికి ఏ అపరాధమును చేయకుండ వారిని హెచ్చరిక చేయవలెను; మీరాలాగు చేసినయెడల అపరాధులు కాకయుందురు.౹

11 మరియు ప్రధానయాజకుడైన అమర్యా యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీమీద ఉన్నాడు, యూదా సంతతివారికి అధిపతియు ఇష్మాయేలు కుమారుడునగు జెబద్యా రాజు సంగతుల విషయములో పైవాడుగా ఉన్నాడు, లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యము వహించుడి, మేలుచేయుటకై యెహోవా మీతోకూడ ఉండును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2CH/19-e65b9cd7fbe5b5e83cc12af57b7107b8.mp3?version_id=1787—

Categories
2 దినవృత్తాంతములు

2 దినవృత్తాంతములు 20

1 ఇది యయిన తరువాత మోయాబీయులును అమ్మోనీయులును మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతుమీదికి వచ్చిరి.౹

2 అంతలో కొందరు వచ్చి–సముద్రము ఆవలనుండు సిరియనులతట్టునుండి గొప్ప సైన్యమొకటి నీమీదికి వచ్చుచున్నది; చిత్తగించుము, వారు హససోన్‌తామారు అను ఏన్గెదీలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి.౹

3 అందుకు యెహోషాపాతు భయపడి యెహోవాయొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని, యూదాయంతట ఉపవాసదినము ఆచరింపవలెనని చాటింపగా

4 యూదావారు యెహోవావలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి, యెహోవాయొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలోనుండి జనులు వచ్చిరి.౹

5 యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాలయెదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనులమధ్యను నిలువబడి

6 –మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై యున్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే; నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుట కెవరికిని బలము చాలదు.౹

7 నీ జనులైన ఇశ్రాయేలీయుల యెదుటనుండి ఈ దేశపు కాపురస్థులను తోలివేసి, నీ స్నేహితుడైన అబ్రాహాముయొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే.౹

8 వారు అందులో నివాసముచేసి, కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరవైనను, మామీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ యెదుటను నిలువబడి మా శ్రమలో నీకు మొఱ్ఱపెట్టినయెడల

9 నీవు ఆలకించి మమ్మును రక్షిం చుదువని అనుకొని, యిచ్చట నీ నామఘనతకొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడెను గదా.౹

10 ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోను మోయాబీయులతోను శేయీరు మన్యవాసులతోను యుద్ధము చేయనియ్యలేదు గనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చేయక వారియొద్దనుండి తొలగి పోయిరి.౹

11 మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మా కిచ్చిన నీ స్వాస్థ్యములోనుండి మమ్మును తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము.౹

12 మా దేవా, నీవు వారికి తీర్పుతీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు; ఏమి చేయుటకును మాకు తోచదు; నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను.౹

13 యూదావారందరును తమ శిశువులతోను భార్యలతోను పిల్లలతోను యెహోవా సన్నిధిని నిలువబడిరి.౹

14 అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జెకర్యా కుమారుడును ఆసాపు సంతతివాడును లేవీయుడునగు యహజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతనిమీదికి రాగా అతడీలాగు ప్రకటిం చెను

15 –యూదావారలారా, యెరూషలేము కాపు రస్థులారా, యెహోషాపాతు రాజా, మీరందరును ఆలకించుడి; యెహోవా సెలవిచ్చునదేమనగా–ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, యీ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును.౹

16 రేపు వారిమీదికి పోవుడి; వారు జీజు అను ఎక్కుడుమార్గమున వచ్చెదరు, మీరు యెరూవేలు అరణ్యము ముందరనున్న వాగుకొనదగ్గర వారిని కనుగొందురు.౹

17 ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు; యూదావారలారా, యెరూషలేమువారలారా, మీరు యుద్ధపంక్తులు తీర్చి నిలువబడుడి; మీతోకూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు; భయపడకుడి జడియకుడి, రేపు వారిమీదికి పోవుడి, యెహోవా మీతోకూడ ఉండును.౹

18 అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసెను; యూదావారును యెరూషలేము కాపురస్థులును యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి.౹

19 కహాతీయుల సంతతివారును కోరహీయుల సంతతివారునగు లేవీయులు నిలువబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాను స్తుతించిరి.౹

20 అంతట వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి; వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడి–యూదావారలారా, యెరూషలేము కాపురస్థులారా, నా మాట వినుడి; మీ దేవుడైన యెహోవాను నమ్ము కొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు; ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పెను.౹

21 మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి, వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడచుచు–యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను.౹

22 వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదావారిమీదికి వచ్చిన అమ్మోనీయులమీదను మోయాబీయులమీదను శేయీరు మన్యవాసులమీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి.౹

23 అమ్మోనీయులును మోయాబీయులును శేయీరు మన్యనివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలెనని పొంచియుండి వారిమీద పడిరి; వారు శేయీరు కాపురస్థులను కడముట్టించిన తరువాత తమలో ఒకరి నొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి.౹

24 యూదావారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యముతట్టు చూడగా వారు శవములై నేలపడియుండిరి, ఒకడును తప్పించుకొనలేదు.౹

25 యెహోషాపాతును అతని జనులును వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవములయొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలును కనబడెను; వారు తమకిష్టమైనంతమట్టుకు తీసికొని తాము కొనిపోగలిగినంతకంటె ఎక్కువగా ఒలుచుకొనిరి; కొల్లసొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు మూడుదినములు పట్టెను.౹

26 నాల్గవదినమునవారు బెరాకా లోయలో కూడిరి; అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటివరకును ఆ చోటికి బెరాకాలోయ యని పేరు.౹

27 ఈలాగున యెహోవావారి శత్రువులమీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచెను గనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరలవలెనని యూదావారును యెరూషలేమువారును వారందరికి ముందు యెహోషాపాతును సాగి వెళ్లిరి;౹

28 వారు యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు స్వరమండలములను సితారాలను వాయించుచు బూరలు ఊదుచువచ్చిరి.౹

29 ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసెనని దేశముల రాజ్యముల వారందరు వినగా దేవుని భయము వారందరిమీదికి వచ్చెను.౹

30 ఈ ప్రకారము అతని దేవుడు చుట్టునున్నవారిని జయించి అతనికి నెమ్మది ననుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా నుండెను.

31 యెహోషాపాతు యూదారాజ్యమును ఏలెను. అతడు ఏలనారంభించినప్పుడు ముప్పదియయిదు సంవత్సరములవాడై యెరూషలేములో ఇరువదియయిదు సంవత్సరములు ఏలెను; అతని తల్లి షిల్హీ కుమార్తె, ఆమె పేరు అజూబా,౹

32 అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి తన తండ్రియైన ఆసా మార్గమందు నడచుచు దానిలోనుండి తొలగిపోకుండెను.౹

33 అయితే అప్పటి కింకను జనులు తమపితరుల దేవుని వెదకుటకు తమ హృదయములను స్థిరపరచుకొనలేదు, అతడు ఉన్నతస్థలములను తీసివేయలేదు.౹

34 యెహోషాపాతు చేసిన కార్యములన్నిటినిగూర్చి హనానీ కుమారుడైన యెహూ రచించిన గ్రంథమందు వ్రాయబడియున్నది. ఈ యెహూ పేరు, ఇశ్రాయేలురాజుల గ్రంథమందు కనబడుచున్నది.౹

35 ఇది యయిన తరువాత యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలురాజైన అహజ్యాతో స్నేహము చేసెను.౹

36 తర్షీషునకు పోదగిన ఓడలను చేయింపవలెనని యెహోషాపాతు అతనితో స్నేహముచేయగా వారు ఎసోన్గె బెరులో ఆ ఓడలను చేయించిరి.౹

37 అప్పుడు మారేషావాడును దోదావాహు కుమారుడునగు ఎలీయెజెరు–నీవు అహజ్యాతో స్నేహము చేసికొంటివి గనుక యెహోవా నీ పనులను భంగము చేయునని యెహోషాపాతుమీద ప్రవచనమొకటి చెప్పెను. ఆ ఓడలు తర్షీషునకు వెళ్లజాలకుండ బద్దలైపోయెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2CH/20-e922fc4dc3376c2a05b1c593a9a0a0c2.mp3?version_id=1787—

Categories
2 దినవృత్తాంతములు

2 దినవృత్తాంతములు 21

1 యెహోషాపాతు తన పితరులతోకూడ నిద్రించి తన పితరులచెంతను దావీదు పురమందు పాతిపెట్టబడెను, అతని కుమారుడైన యెహోరాము అతనికి బదులుగా రాజాయెను.౹

2 యెహోషాపాతు కుమారులైన అజర్యా యెహీయేలు జెకర్యా అజర్యా మిఖాయేలు షెఫట్య అను వారు ఇతనికి సహోదరులు; వీరందరును ఇశ్రాయేలురాజైన యెహోషాపాతు కుమారులు.౹

3 వారి తండ్రి వెండి బంగారములను బహుమానములుగా ప్రశస్తవస్తువులనేకములను యూదా దేశములో ప్రాకారముగల పట్టణములను వారికిచ్చెను; అయితే యెహోరాము జ్యేష్ఠుడు గనుక అతనికి రాజ్యమును ఇచ్చెను.౹

4 యెహోరాము తన తండ్రి రాజ్యమును ఏలనారంభించినప్పుడు తన్ను స్థిరపరచుకొని, తన సహోదరులనందరిని ఇశ్రాయేలీయుల అధిపతులలో కొందరిని హతముచేసెను.౹

5 యెహోరాము ఏలనారంభించి నప్పుడు ముప్పది రెండేండ్లవాడు. అతడు యెరూషలేములో ఎనిమిది సంవత్సరములు ఏలెను.౹

6 అతడు అహాబు కుమార్తెను పెండ్లిచేసికొని అహాబు సంతతివారు నడచిన ప్రకారముగా ఇశ్రాయేలురాజుల మార్గమందు నడచెను; అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను.౹

7 అయినను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తమును, అతనికిని అతని కుమారులకును నిత్యము దీప మిచ్చెదనని చేసిన వాగ్దానము నిమిత్తమును దావీదు సంతతిని నశింపజేయుటకు మనస్సులేక యుండెను.౹

8 అతని దినములలో ఎదోమీయులు తిరుగబడి యూదావారి అధికారము త్రోసివేసి తమకు ఒకరాజును చేసికొనగా

9 యెహోరాము తన చేతిక్రిందనున్న అధికారులను వెంట బెట్టుకొని, తన రథములన్నిటితో బయలుదేరి రాత్రివేళ లేచి తన్ను చుట్టుకొనిన ఎదోమీయులను రథాధిపతులను హతముచేసెను.౹

10 కాగా నేటివరకును జరుగుచున్నట్టు ఎదోమీయులు యూదావారి చేతిక్రింద నుండక తిరుగబడిరి. యెహోరాము తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున ఆ కాలమందు లిబ్నాయును అతనిచేతి క్రిందనుండి తిరుగబడెను.౹

11 మరియు అతడు యూదా పర్వతములయందు బలిపీఠములను కట్టించి యెరూషలేము కాపురస్థులు దేవుని విసర్జించునట్లు చేసెను. యూదావారిని విగ్రహపూజకు లోపరచెను.

12 అంతట ప్రవక్తయైన ఏలీయా యొక పత్రిక వ్రాసి అతనియొద్దకు పంపెను–నీ పితరుడగు దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా–నీవు నీ తండ్రియైన యెహోషాపాతు మార్గములందైనను యూదారాజైన ఆసా మార్గములందైనను నడువక

13 ఇశ్రాయేలురాజుల మార్గమందు నడచి అహాబు సంతతివారు చేసిన వ్యభిచారముల చొప్పున యూదాను యెరూషలేము కాపురస్థులను వ్యభిచరింపజేసి, నీకంటె యోగ్యులైన నీ తండ్రి సంతతి వారగు నీ సహోదరులను నీవు చంపియున్నావు.౹

14 కాబట్టి గొప్ప తెగులుచేత యెహోవా నీ జనులను నీ పిల్లలను నీ భార్యలను నీ వస్తువాహనములన్నిటిని మొత్తును.౹

15 నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివై యుందువు; దిన క్రమేణ ఆ వ్యాధిచేత నీ పేగులు పడిపోవును.౹

16 మరియు యెహోవా యెహోరాముమీదికి ఫిలిష్తీయులను కూషీయుల చేరువనున్న అరబీయులను రేపగా

17 వారు యూదా దేశముమీదికి వచ్చి దానిలో చొరబడి రాజ నగరునందు దొరకిన సమస్త పదార్థములను అతని కుమారులను భార్యలను పట్టుకొనిపోయిరి; అతని కుమారులలో కనిష్ఠుడైన యెహోయాహాజు తప్ప అతనికి ఒక్క కుమారుడైనను విడువబడలేదు.౹

18 ఇదియంతయు అయినతరువాత యెహోవా కుదరచాలని వ్యాధిచేత అతనిని ఉదరమున మొత్తినందున

19 రెండు సంవత్సరములు వ్యాధి బలమగుచు వచ్చి ఆ వ్యాధిచేత అతని పేగులు పడిపోయి బహు వేదన నొందుచు అతడు మరణమాయెను. అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తరక్రియలు అతనికి చేయలేదు.౹

20 అతడు ఏలనారంభించినప్పుడు ముప్పది రెండేండ్లవాడు; యెరూషలేములో ఎనిమిది సంవత్సరములు ఏలి యెవరికిని ఇష్టము లేనివాడై అతడు చనిపోయెను; రాజుల సమాధులలో గాక దావీదు పురమందు వేరుచోట జనులు అతని పాతిపెట్టిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2CH/21-37e0e25774592a92cba010f366b6df1b.mp3?version_id=1787—

Categories
2 దినవృత్తాంతములు

2 దినవృత్తాంతములు 22

1 అరబీయులతోకూడ దండు విడియుచోటికి వచ్చినవారు పెద్దవారినందరిని చంపిరి గనుక యెరూషలేము కాపురస్థులు అతని కడగొట్టు కుమారుడైన అహజ్యాను అతనికి బదులుగా రాజునుచేసిరి. ఈ ప్రకారము యూదారాజగు యెహోరాము కుమారుడైన అహజ్యా రాజ్యము బొందెను.౹

2 అహజ్యా యేలనారంభించినప్పుడు నలువది రెండేండ్లవాడై యెరూషలేములో ఒక సంవత్సరము ఏలెను; అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్యా

3 దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచు వచ్చెను గనుక అతడును అహాబు సంతతివారి మార్గములందు నడచెను.౹

4 అహాబు సంతతివారివలెనే అతడు యెహోవా దృష్టికి చెడునడత నడచెను; అతని తండ్రి మరణమైన తరువాత వారు అతనికి ఆలోచనకర్తలై అతని నాశమునకు కారకులైరి.౹

5 వారి ఆలోచన చొప్పున అతడు ప్రవర్తించి, రామోత్గిలాదులో సిరియారాజైన హజాయేలుతో యుద్ధము చేయుటకై అహాబు కుమారుడైన ఇశ్రాయేలు రాజగు యెహోరాముతోకూడ పోయెను; సిరియనులచేత యెహోరామునకు గాయములు తగిలెను.౹

6 సిరియారాజైన హజాయేలుతో తాను రామాలో చేసిన యుద్ధమునందు తనకు తగిలిన గాయములను బాగుచేసికొనుటకై అతడు యెజ్రెయేలునకు మరలి వచ్చెను. అహాబు కుమారుడైన యెహోరాము రోగియైయున్నాడని విని యూదా రాజైన యెహోరాము కుమారుడగు అహజ్యా అతని దర్శించుటకై యెజ్రెయేలునకు పోయెను.౹

7 యెహోరాము నొద్దకు అతడు వచ్చుటచేత దేవునివలన అతనికి నాశము కలిగెను; ఎట్లనగా అతడు వచ్చినప్పుడు అహాబు సంతతివారిని నిర్మూలము చేయుటకై యెహోవా అభిషేకించిన నింషీకుమారుడైన యెహూమీదికి అతడు యెహోరాముతోకూడ పోగా

8 యెహూ అహాబు సంతతివారిమీద తీర్పు తీర్చుటకై వచ్చినప్పుడు అతడు యూదావారి అధిపతులను, అహజ్యాకు పరిచారకులుగా నున్న అహజ్యా సహోదరుల కుమారులను చూచి వారిని హతముచేసెను.౹

9 అతడు అహజ్యాను వెదకెను. అతడు షోమ్రోనులో దాగియుండగా వారు అతని పట్టుకొని యెహూనొద్దకు తీసికొనివచ్చిరి; వారు అతని చంపిన తరువాత ఇతడు యెహోవాను హృదయపూర్వకముగా వెదకిన యెహోషాపాతు కుమారుడు గదా అనుకొని అతని పాతిపెట్టిరి; కాగా రాజ్యమేలుటకు అహజ్యా యింటివారు ఇక నెవరును లేకపోయిరి.

10 అహజ్యా తల్లియైన అతల్యా తన కుమారుడు చనిపోయె నని వినినప్పుడు ఆమె లేచి యూదావారి సంబంధులగు రాజవంశజులనందరిని హతము చేసెను.౹

11 అయితే రాజునకు కుమార్తెయైన యెహోషబతు అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారులలోనుండి దొంగిలించి, అతనిని అతని దాదిని ఒక పడకటింటిలో ఉంచెను. యెహోరాము రాజు కుమార్తెయును యెహోయాదా అను యాజకుని భార్యయునైన యెహోషబతు అతల్యాకు కనబడకుండ అతని దాచిపెట్టెను గనుక ఆమె అతని చంప లేకపోయెను; ఈ యెహోషబతు అహజ్యాకు సహోదరి.౹

12 ఆరుసంవత్సరములు అతడు వారితోకూడ దేవుని మందిరములో దాచబడియుండెను; ఆ కాలమున అతల్యా దేశమును పాలించెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2CH/22-6576da26bf44688eea0cac4702202b22.mp3?version_id=1787—

Categories
2 దినవృత్తాంతములు

2 దినవృత్తాంతములు 23

1 అంతట ఏడవ సంవత్సరమందు యెహోయాదా. ధైర్యము తెచ్చుకొని, శతాధిపతులతోను యెరోహాము కుమారుడైన అజర్యాతోను యెహోహానాను కుమారుడైన ఇష్మాయేలుతోను ఓబేదు కుమారుడైన అజర్యాతోను అదాయా కుమారుడైన మయశేయాతోను జిఖ్రీ కుమారుడైన ఎలీషాపాతుతోను నిబంధనచేయగా

2 వారు యూదా దేశమందంతటను సంచరించి, యూదావారి పట్టణములన్నిటిలోనుండి లేవీయులను ఇశ్రాయేలీయుల పితరులయిండ్ల పెద్దలను సమకూర్చి యెరూషలేమునకు తోడుకొని వచ్చిరి.౹

3 జనులందరు సమాజముగా కూడి దేవుని మందిరములో రాజుతో నిబంధన చేసికొనినప్పుడు అతడు వారితో ఇట్లనెను–యెహోవా దావీదు కుమారులనుగూర్చి యిచ్చిన సెలవుచొప్పున రాజకుమారుడు రాజ్య మేలవలెను.౹

4 కాబట్టి మీరు చేయవలసినదేమనగా, మీలో యాజకులైనవారేమి లేవీయులైనవారేమి విశ్రాంతిదినమున లోపల ప్రవేశించువారు మూడు భాగములై, యొక భాగము ద్వారపాలకులుగా ఉండవలెను.౹

5 ఒక భాగము రాజనగరునొద్ద ఉండవలెను. ఒక భాగము పునాది గుమ్మము నొద్ద ఉండవలెను, జనులందరు యెహోవా మందిరపు ఆవరణములలో ఉండవలెను.౹

6 యాజకులును లేవీయులలో పరిచారము చేయువారును తప్ప యెహోవా మందిరము లోపలికి మరి ఎవరును రాకూడదు, వారు ప్రతిష్ఠింపబడినవారు గనుక వారు లోపలికి రావచ్చునుగాని జనులందరు యెహోవా ఇచ్చిన ఆజ్ఞచొప్పున బయట ఉండవలెను.౹

7 లేవీయులందరు తమతమ ఆయుధములను చేతపట్టుకొని రాజుచుట్టును ఉండవలెను, మందిరము లోపలికి మరి ఎవరైనను వచ్చినయెడల ఆ వచ్చినవారికి మరణశిక్ష విధించుడి; రాజు లోపలికి వచ్చినప్పుడేమి బయటికి వెళ్లునప్పుడేమి మీరు అతనితోకూడ ఉండవలెను.౹

8 కాబట్టి లేవీయులును యూదావారందరును యాజకుడైన యెహోయాదా ఆజ్ఞ యంతటి ప్రకారము చేసిరి; యాజకుడైన యెహోయాదా వంతులవారికి సెలవియ్యలేదు గనుక ప్రతివాడు విశ్రాంతిదినమున బయటికి వెళ్ల వలసిన తనవారిని ఆ దినమున లోపలికి రావలసిన తనవారిని తీసికొనివచ్చెను.

9 మరియు యాజకుడైన యెహోయాదా దేవుని మందిరమందు రాజైన దావీదు ఉంచిన బల్లెములను కేడెములను డాళ్లను శతాధిపతులకు అప్పగించెను.౹

10 అతడు ఆయుధము చేతపట్టుకొనిన జనులందరిని మందిరపు కుడివైపునుండి యెడమవైపువరకు బలిపీఠము ప్రక్కను మందిరముప్రక్కను రాజుచుట్టును ఉంచెను.౹

11 అప్పుడు వారు రాజకుమారుని బయటికి తోడుకొని వచ్చి, అతనిమీద కిరీటముంచి, ధర్మశాస్త్ర గ్రంథమును అతనిచేతికిచ్చి అతనికి పట్టాభి షేకము చేసిరి; యెహోయాదాయును అతని కుమారులును అతనిని అభిషేకించి–రాజు చిరంజీవియగునుగాక యనిరి.

12 పరుగులెత్తుచు రాజును కొనియాడుచు ఉన్న జనులుచేయు ధ్వని అతల్యా విని యెహోవామందిరమందున్న జనులయొద్దకు వచ్చి

13 ప్రవేశస్థలముదగ్గర నున్న అతనికి ఏర్పాటైన స్తంభమునొద్ద రాజు నిలువబడియుండుటయు, అధిపతులును బూరలు ఊదువారును రాజునొద్దనుండుటయు, దేశపు జనులందరును సంతోషించుచు బూరలతో నాదములు చేయుచుండుటయు, గాయకులును వాద్యములతో స్తుతిపాటలు పాడుచుండుటయు చూచి వస్త్రములు చింపుకొని–ద్రోహము ద్రోహమని అరచెను.౹

14 అప్పుడు యాజకుడైన యెహోయాదా–యెహోవా మందిరములో ఆమెను చంపవలదు, ఆమెను పంక్తుల అవతలకు తీసుకొనివెళ్ళి ఆమె పక్షము పూనువారిని కత్తిచేత చంపుడని సైన్యముమీదనున్న శతాధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను.౹

15 కాబట్టి వారు ఆమెకు దారియిచ్చి, రాజనగరునొద్దనున్న గుఱ్ఱపు గుమ్మముయొక్క ప్రవేశస్థలమునకు ఆమె వచ్చి నప్పుడు వారు ఆమెను అక్కడ చంపివేసిరి.౹

16 అప్పుడు యెహోయాదా జనులందరు యెహోవావారై యుండవలెనని జనులందరితోను రాజుతోను నిబంధనచేసెను.౹

17 అంతట జనులందరును బయలుదేవతయొక్క గుడికి పోయి దాని పడగొట్టి, బలిపీఠములను విగ్రహములను తుత్తునియలుగా విరుగగొట్టి, బయలు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపిరి.౹

18 మరియు మోషే యిచ్చిన ధర్మశాస్త్రమందు వ్రాయబడినదానినిబట్టి ఉత్సాహముతోను గానముతోను యెహోవాకు అర్పింపవలసిన దహనబలులను దావీదు నియమించిన ప్రకారముగా అర్పించునట్లు, లేవీయులైన యాజకుల చేతిక్రింద నుండునట్టియు, యెహోవామందిరమందు దావీదు పనులు పంచివేసినట్టియునైన యెహోవా మందిరపు కావలివారికి యెహోయాదా నిర్ణయించెను.౹

19 యెహోవా మందిరములోనికి దేనిచేతనైనను అంటుతగిలినవారు ప్రవేశింపకుండునట్లు అతడు ద్వారములయొద్ద ద్వారపాలకులను ఉంచెను.౹

20 మరియు అతడు శతాధిపతులను ప్రధానులను జనుల అధికారులను దేశపు జనులనందరిని వెంటబెట్టుకొని యెహోవా మందిరములోనుండి రాజును తోడుకొని వచ్చెను; వారు ఎత్తయిన ద్వారముగుండ రాజ నగరుచొచ్చి రాజ్యసింహాసనముమీద రాజును ఆసీనునిచేయగా

21 దేశజనులందరు సంతోషించిరి. వారు అతల్యాను చంపిన తరువాత పట్టణము నెమ్మదిగా ఉండెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2CH/23-8bcafa6f4b48e08ada5014ee2dca11bc.mp3?version_id=1787—