Categories
2 దినవృత్తాంతములు

2 దినవృత్తాంతములు 4

1 అతడు ఇరువది మూరలు పొడవును ఇరువది మూరలు వెడల్పును పది మూరలు ఎత్తునుగల యొక యిత్తడి బలిపీఠమును చేయించెను.౹

2 పోతపోసిన సముద్రపు తొట్టి యొకటి చేయించెను, అది యీ యంచుకు ఆ యంచుకు పది మూరల యెడము గలది; దానియెత్తు అయిదు మూరలు, దాని కైవారము ముప్పదిమూరలు,౹

3 దాని క్రిందితట్టున ఎద్దులు రూపింపబడియుండెను, అవి ఒక్కొక్క మూరకు పదేసియుండెను, అవి ఆ సముద్రపు తొట్టిని ఆవరించెను; ఎద్దులు రెండు వరుసలు తీరి యుండెను, అవి తొట్టితోకూడనే పోతపోయబడెను.౹

4 అది పండ్రెండు ఎద్దులమీద నిలువబడెను, మూడు ఎద్దులు ఉత్తరపుతట్టు మూడు పడమటితట్టు మూడు దక్షిణపుతట్టు మూడు తూర్పుతట్టు చూచుచుండెను. సముద్రపు తొట్టి వాటిపై నుంచ బడెను, వాటి వెనుకటి పార్శ్వములన్నియు లోపలికి తిరిగి యుండెను.౹

5 అది బెత్తెడు దళముగలది, దాని అంచు గిన్నెయంచువంటిదై తామరపుష్పములు తేల్చబడియుండెను; అది ముప్పది పుట్ల నీళ్లు పట్టును.

6 మరియు దహనబలులుగా అర్పించువాటిని కడుగుటకై కుడితట్టుకు అయిదును ఎడమతట్టుకు అయిదును పది స్నానపు గంగాళములను చేయించెను; సముద్రమువంటి తొట్టియందు యాజకులు మాత్రము స్నానము చేయుదురు.౹

7 మరియు వాటినిగూర్చిన విధిననుసరించి పది బంగారపు దీపస్తంభములను చేయించి, దేవాలయమందు కుడితట్టున అయిదును ఎడమతట్టున అయిదును ఉంచెను.౹

8 పది బల్లలను చేయించి దేవాలయమందు కుడితట్టున అయిదును ఎడమతట్టున అయిదును ఉంచెను; నూరు బంగారపు తొట్లను చేయించెను.౹

9 అతడు యాజకుల ఆవరణమును పెద్ద ఆవరణమును దీనికి వాకిండ్లను చేయించి దీని తలుపులను ఇత్తడితో పొదిగించెను.౹

10 సముద్రపు తొట్టిని తూర్పుతట్టున కుడిపార్శ్వమందు దక్షిణ ముఖముగా ఉంచెను.౹

11 హూరాము పాత్రలను బూడిదె నెత్తు చిప్పకోలలను తొట్లను చేసెను; రాజైన సొలొమోను ఆజ్ఞప్రకారము దేవుని మందిరమునకు చేయవలసిన పనియంతయు హూరాము సమాప్తిచేసెను.౹

12 దాని వివరమేమనగా, రెండు స్తంభములు, వాటి పళ్లెములు, వాటి పైభాగమునకు చేసిన పీటలు, వీటి పళ్లెములు, ఆ స్తంభముల శీర్షముల రెండు పళ్లెములను కప్పుటకైన రెండు అల్లికలు,౹

13 ఆ స్తంభముల శీర్షముల రెండు పళ్లెములను కప్పునట్టి అల్లిక, అల్లికకు రెండేసి వరుసలుగా చేయబడిన నాలుగు వందల దానిమ్మపండ్లు.౹

14 మట్లు, మట్లమీదనుండు తొట్లు,౹

15 సముద్రపుతొట్టి దాని క్రింద నుండు పండ్రెండు ఎద్దులు,౹

16 పాత్రలు, బూడిదె నెత్తు చిప్పకోలలు, ముండ్ల కొంకులు మొదలైన ఉపకరణములు. వీటిని హూరాము రాజైన సొలొమోను ఆజ్ఞప్రకారము యెహోవా మందిరముకొరకు మంచి వన్నెగల యిత్తడితో చేసెను.౹

17 యొర్దాను మైదానమందు సుక్కో తునకును జెరేదాతాకునుమధ్యను జిగటమంటి భూమియందు రాజు వాటిని పోతపోయించెను.౹

18 ఎత్తు చూడ లేనంత యిత్తడి తన యొద్ద నుండగా సొలొమోను ఈ ఉపకరణములన్నిటిని బహు విస్తారముగా చేయించెను.౹

19 దేవుని మందిరమునకు కావలసిన ఉపకరణములన్నిటిని బంగారపు పీఠమును సన్నిధి రొట్టెలు ఉంచు బల్లలను,౹

20 వాటినిగూర్చిన విధిప్రకారము గర్భాలయము ఎదుట వెలుగుచుండుటకై ప్రశస్తమైన బంగారపు దీపస్తంభములను,౹

21 పుష్పములను ప్రమిదెలను కత్తెరలను కారులను తొట్లను గిన్నెలను ధూపకలశములను సొలొమోను మేలిమి బంగారముతో చేయించెను.౹

22 మరియు మందిరద్వారము లోపలి తలుపులును అతి పరిశుద్ధ స్థలముయొక్క లోపలి తలుపులును దేవాలయపు తలుపులును అన్నియు బంగారముతో చేయబడెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2CH/4-c754a0500db8905f40b7b328e8772edd.mp3?version_id=1787—

Categories
2 దినవృత్తాంతములు

2 దినవృత్తాంతములు 5

1 సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పనియంతయు సమాప్తముచేసి, తన తండ్రియైన దావీదు ప్రతిష్ఠించిన వెండిని బంగారమును ఉపకరణములన్నిటిని దేవుని మందిరపు బొక్కసములలో చేర్చెను.౹

2 తరువాత యెహోవా నిబంధనమందసమును సీయోను అను దావీదు పురమునుండి తీసికొని వచ్చుటకై సొలొమోను ఇశ్రాయే లీయుల పెద్దలను ఇశ్రాయేలీయుల వంశములకు అధికారులగు గోత్రముల పెద్దలనందరిని యెరూషలేమునందు సమకూర్చెను.౹

3 ఏడవ నెలను పండుగ జరుగుకాలమున ఇశ్రాయేలీయులందరును రాజునొద్దకు వచ్చిరి.౹

4 ఇశ్రాయేలీయుల పెద్దలందరును వచ్చిన తరువాత లేవీయులు మందసమును ఎత్తుకొనిరి

5 రాజైన సొలొమోనును ఇశ్రాయేలీయుల సమాజకులందరును సమకూడి, లెక్కింప శక్యముకాని గొఱ్ఱెలను పశువులను బలిగా అర్పించిరి.౹

6 లేవీయులును యాజకులును మందసమును సమాజపు గుడారమును గుడారమందుండు ప్రతిష్ఠితములగు ఉపకరణములన్నిటిని తీసికొని వచ్చిరి.౹

7 మరియు యాజకులు యెహోవా నిబంధనమందసమును తీసికొని గర్భాలయమగు అతి పరిశుద్ధస్థలమందు కెరూబుల రెక్కలక్రింద దానిని ఉంచిరి.౹

8 మందసముండు స్థలమునకు మీదుగా కెరూబులు తమ రెండు రెక్కలను చాచుకొని మందసమును దాని దండెలను కమ్మెను.౹

9 వాటి కొనలు గర్భా లయము ఎదుట కనబడునంత పొడవుగా ఆ దండెలుంచ బడెనుగాని అవి బయటికి కనబడలేదు. నేటివరకు అవి అచ్చటనే యున్నవి.౹

10 ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి బయలువెళ్లిన తరువాత యెహోవా హోరేబునందు వారితో నిబంధన చేసినప్పుడు మోషే ఆ మందసమునందు ఉంచిన రెండు రాతిపలకలు తప్ప దానియందు మరేమియులేదు.౹

11 యాజకులు పరిశుద్ధస్థలమునుండి బయలుదేరి వచ్చినప్పుడు అచ్చట కూడియున్న యాజకులందరును తమ వంతులు చూడకుండ తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి.౹

12 ఆసాపు హేమాను యెదూతూనుల సంబంధమైనవారును, వారి కుమారులకును సహోదరులకును సంబంధికులగు పాటకులైన లేవీయులందరును, సన్నపు నారవస్త్రములను ధరించుకొని తాళములను తంబురలను సితారాలను చేతపట్టుకొని బలిపీఠమునకు తూర్పుతట్టున నిలిచిరి;౹

13 వారితోకూడ బూరలు ఊదు యాజకులు నూట ఇరువదిమంది నిలిచిరి; బూరలు ఊదువారును పాట కులును ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానముచేయగా యాజకులు పరిశుద్ధస్థలములోనుండి బయలువెళ్లి, ఆ బూరలతోను తాళములతోను వాద్యములతోను కలిసి స్వరమెత్తి–యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రముచేసిరి.౹

14 అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండ నిండెను; యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవచేయుటకు యాజకులు ఆ మేఘమున్నచోట నిలువలేకపోయిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2CH/5-e9bae98f184ad63dde0456aaaa4692de.mp3?version_id=1787—

Categories
2 దినవృత్తాంతములు

2 దినవృత్తాంతములు 6

1 అప్పుడు సొలొమోను ఈలాగు ప్రకటన చేసెను– గాఢాంధకారమందు నేను నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చియున్నాడు.౹

2 నీవు నిత్యము కాపురముండుటకై నిత్యనివాసస్థలముగా నేనొక ఘనమైన మందిరమును నీకు కట్టించియున్నాను అని చెప్పి

3 రాజు తన ముఖము ప్రజలతట్టు త్రిప్పుకొని ఇశ్రాయేలీయుల సమాజకులందరును నిలుచుచుండగా వారిని దీవించెను.౹

4 మరియు రాజు ఇట్లు ప్రకటన చేసెను–నా తండ్రియైన దావీదునకు మాట యిచ్చి, తానే స్వయముగా నెరవేర్చిన ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక.౹

5 ఆయన సెలవిచ్చినదేమనగా–నేను నా జనులను ఐగుప్తుదేశములోనుండి రప్పించిన దినము మొదలుకొని నా నామముండుటకై యొక మందిరమును కట్టింపవలెనని నేను ఇశ్రాయేలీయుల గోత్రస్థానములలో ఏ పట్టణమునైనను కోరుకొనలేదు, నా జనులైన ఇశ్రాయేలీయులమీద అధిపతిగా నుండుటకై యే మనుష్యునియైనను నేను నియమింపలేదు.౹

6 ఇప్పుడు నా నామముండుటకై యెరూషలేమును కోరుకొంటిని, నా జనులైన ఇశ్రాయేలీయులమీద అధిపతిగా నుండుటకై దావీదును కోరుకొంటిని.౹

7 ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా నామఘనత కొరకు ఒక మందిరమును కట్టింపవలెనని నా తండ్రియైన దావీదు మనోభిలాష గలవాడాయెను.౹

8 అయితే యెహోవా నా తండ్రియైన దావీదుతో సెలవిచ్చిన దేమనగా–నా నామఘనతకొరకు మందిరమును కట్టింపవలెనని నీవు ఉద్దేశించిన యుద్దేశము మంచిదేగాని

9 నీవు ఆ మందిరమును కట్టరాదు, నీకు పుట్టబోవు నీ కుమారుడే నా నామమునకు ఆ మందిరమును కట్టును.౹

10 అప్పుడు తాను అట్లు చెప్పియున్న మాటను యెహోవా ఇప్పుడు నెరవేర్చియున్నాడు, యెహోవా సెలవుప్రకారము నేను నా తండ్రియైన దావీదునకు ప్రతిగా రాజునై ఇశ్రాయేలీయుల రాజాసనమందు కూర్చుండి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మందిరమును కట్టించి

11 యెహోవా ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధనకు గురుతైన మందసమును దానియందు ఉంచితినని చెప్పి

12 ఇశ్రాయేలీయులందరు సమాజముగా కూడి చూచుచుండగా యెహోవా బలిపీఠము ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేసెను.

13 తాను చేయించిన అయిదు మూరల పొడవును అయిదు మూరల వెడల్పును మూడు మూరల యెత్తునుగల యిత్తడి చప్పరమును ముంగిటి ఆవరణమునందుంచి, దానిమీద నిలిచియుండి, సమాజముగా కూడియున్న ఇశ్రాయేలీయులందరి యెదుటను మోకాళ్లూని, చేతులు ఆకాశమువైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థనచేసెను.౹

14 –యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచు నుండు నీవంటి దేవుడు ఆకాశమందైనను భూమియందైనను లేడు.౹

15 నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో నీవు సెలవిచ్చినమాట నెరవేర్చియున్నావు; నీవు వాగ్దానముచేసి యీ దినమున కనబడుచున్నట్టుగా దానిని నెరవేర్చియున్నావు.౹

16 –నీవు నాముందర నడచి నట్లుగా నీ కుమారులును తమ ప్రవర్తన కాపాడుకొని, నా ధర్మశాస్త్రముచొప్పున నడచినయెడల ఇశ్రాయేలీయుల సింహాసనముమీద కూర్చుండువాడు నా యెదుట నీకుండకపోడని నీవు నీ సేవకుడైన దావీదు అను నా తండ్రితో సెలవిచ్చినమాట, ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, దయచేసి నెరవేర్చుము.౹

17 ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నీవు నీ సేవకుడైన దావీదుతో సెలవిచ్చిన మాట ఇప్పుడు స్థిరమవును గాక.౹

18 మనుష్యులతో కలిసి దేవుడు భూమియందు నివాసము చేయునా? ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టచాలవే; నేను కట్టిన యీ మందిరము నిన్ను పట్టునా?

19 దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధినిచేయు ప్రార్థనయందును విన్న పమునందును లక్ష్యముంచి, నీ సేవకుడనైన నేనుచేయు ప్రార్థనను పెట్టు మొఱ్ఱను ఆలకించుము.౹

20 నీ సేవకులు ఈ స్థలముతట్టు తిరిగిచేయు విన్నపములను వినుటకై– నా నామమును అచ్చట ఉంచెదనని నీవు సెలవిచ్చిన స్థలముననున్న యీ మందిరముమీద నీ కనుదృష్టి రాత్రిం బగళ్లు నిలుచునుగాక.౹

21 నీ సేవకుడును నీ జనులైన ఇశ్రాయేలీయులును ఈ స్థలముతట్టు తిరిగి చేయబోవు ప్రార్థనలను నీవు ఆలకించుము, ఆకాశముననున్న నీ నివాసస్థలమందు ఆలకించుము, ఆలకించునప్పుడు క్షమించుము.౹

22 ఎవడైనను తన పొరుగువానియెడల తప్పుచేసినప్పుడు అతనిచేత ప్రమాణము చేయించుటకై అతనిమీద ఒట్టు పెట్టబడి ఆ ఒట్టు ఈ మందిరమందుండు నీ బలిపీఠము ఎదుటికి వచ్చినప్పుడు

23 నీవు ఆకాశమందు విని, నీ దాసులకు న్యాయముతీర్చి, హాని చేసినవాని తలమీదికి శిక్ష రప్పించి, నీతిపరుని నీతిచొప్పున వానికిచ్చి వాని నీతిని నిర్ధారణ చేయుము.౹

24 నీజనులైన ఇశ్రాయేలీయులు నీ దృిష్టి యెదుట పాపము చేసినవారై తమ శత్రువుల బలమునకు నిలువలేక పడిపోయినప్పుడు, వారు నీయొద్దకు తిరిగి వచ్చి నీ నామమును ఒప్పుకొని, యీ మందిరమునందు నీ సన్నిధిని ప్రార్థించి విన్నపము చేసినయెడల

25 ఆకాశమందు నీవు విని, నీ జనులైన ఇశ్రాయేలీయులు చేసిన పాపమును క్షమించి, వారికిని వారి పితరులకును నీవిచ్చిన దేశమునకు వారిని మరల రప్పించుదువుగాక.౹

26 వారు నీ దృష్టియెదుట పాపము చేసినందున ఆకాశము మూయబడి వాన కురియ కున్నప్పుడు, వారు ఈ స్థలముతట్టు తిరిగి ప్రార్థనచేసి నీ నామమును ఒప్పుకొని, నీవు వారిని శ్రమపెట్టినప్పుడు వారు తమ పాపములను విడిచిపెట్టి తిరిగినయెడల

27 ఆకాశ మందున్న నీవు ఆలకించి, నీ సేవకులును నీ జనులునగు ఇశ్రాయేలీయులు చేసిన పాపమును క్షమించి, వారు నడువవలసిన మంచిమార్గము వారికి బోధించి, నీవు నీ జనులకు స్వాస్థ్యముగా ఇచ్చిన నీ దేశమునకు వాన దయచేయుదువుగాక.౹

28 దేశమునందు కరవుగాని తెగులుగాని కనబడినప్పుడైనను, గాడ్పు దెబ్బగాని చిత్తపట్టుటగాని తగిలినప్పుడైనను, మిడతలుగాని చీడపురుగులుగాని దండు దిగినప్పుడైనను, వారి శత్రువులు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడివేసినప్పుడైనను, ఏ బాధగాని యే రోగముగాని వచ్చినప్పుడైనను

29 ఎవడైనను ఇశ్రాయేలీయులగు నీ జనులందరు కలిసియైనను, నొప్పిగాని కష్టముగాని అనుభవించుచు, ఈ మందిరముతట్టు చేతులు చాపిచేయు విన్నపములన్నియు ప్రార్థనలన్నియు నీ నివాసస్థలమైన ఆకాశమునుండి నీవు ఆలకించి క్షమించి

30 నీవు మా పితరులకిచ్చిన దేశమందువారు తమ జీవితకాల మంతయు నీయందు భయభక్తులుకలిగి

31 నీ మార్గములలో నడుచునట్లుగా వారి వారి హృదయములను ఎరిగియున్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేయుదువు గాక. నీవు ఒక్కడవే మానవుల హృదయము నెరిగిన వాడవు గదా.౹

32 మరియు నీ జనులైన ఇశ్రాయేలీయుల సంబంధులు కాని అన్యులు నీ ఘనమైన నామమునుగూర్చియు, నీ బాహుబలమునుగూర్చియు, చాచిన చేతులనుగూర్చియు వినినవారై, దూరదేశము నుండి వచ్చి ఈ మందిరముతట్టు తిరిగి విన్నపముచేసినపుడు

33 నీ నివాసస్థలమగు ఆకాశమునుండి నీవు వారి ప్రార్థన నంగీకరించి, నీ జనులగు ఇశ్రాయేలీయులు తెలిసికొనినట్లు భూజనులందరును నీ నామమును తెలిసికొని, నీయందు భయభక్తులు కలిగి, నేను కట్టిన యీ మందిరమునకు నీ పేరు పెట్టబడెనని గ్రహించునట్లుగా ఆ యన్యులు నీకు మొఱ్ఱపెట్టిన దానిని నీవు దయచేయుదువు గాక.౹

34 నీ జనులు నీవు పంపిన మార్గమందు తమ శత్రువులతో యుద్ధము చేయుటకై బయలుదేర నుద్దేశించి, నీవు కోరు కొనిన యీ పట్టణముతట్టును నీ నామమునకు నేను కట్టించిన యీ మందిరముతట్టు తిరిగి విన్నపము చేసినయెడల

35 ఆకాశమునుండి నీవు వారి విన్నపమును ప్రార్థ నను ఆలకించి వారికార్యమును నిర్వహించుదువుగాక.౹

36 పాపము చేయనివాడెవడును లేడు గనుక వారు నీ దృష్టి యెదుట పాపము చేసినప్పుడు నీవు వారిమీద ఆగ్ర హించి, శత్రువులచేతికి వారిని అప్పగింపగా, చెరపట్టు వారు వారిని దూరమైనట్టిగాని సమీపమైనట్టిగాని తమ దేశములకు పట్టుకొనిపోగా

37 వారు చెరకుపోయిన దేశమందు బుద్ధి తెచ్చుకొని మనస్సు త్రిప్పుకొని–మేము పాపముచేసితిమి, దోషులమైతిమి, భక్తిహీనముగా నడచితిమి అని ఒప్పుకొని

38 తాము చెరలోనున్న దేశమందు పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను నీయొద్దకు మళ్లుకొని, తమపితరులకు నీవిచ్చిన తమ దేశముమీదికిని, నీవు కోరుకొనిన యీ పట్టణముమీదికిని, నీ నామఘనతకొరకు నేను కట్టించిన యీ మందిరముమీదికిని మనస్సు త్రిప్పి విన్నపము చేసినయెడల

39 నీ నివాసస్థలమైన ఆకాశము నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారికార్యమును నిర్వహించి, నీ దృష్టియెదుట పాపముచేసిన నీ జనులను క్షమించుదువుగాక.౹

40 నా దేవా, యీ స్థలమందు చేయబడు విన్నపము మీద నీ కనుదృష్టి యుంచు దువుగాక, నీ చెవులు దానిని ఆలకించునుగాక.౹

41 నా దేవా, యెహోవా, బలమున కాధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము; నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము; దేవా యెహోవా, నీ యాజకులు రక్షణ ధరించు కొందురుగాక; నీ భక్తులు నీ మేలునుబట్టి సంతోషింతురు గాక.౹

42 దేవా యెహోవా, నీవు నీచేత అభిషేకము నొందిన వానికి పరాఙ్ముఖుడవై యుండకుము, నీవు నీ భక్తుడైన దావీదునకు వాగ్దానముచేసిన కృపలను జ్ఞాపకము చేసికొనుము.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2CH/6-7dec61ef84bc346d2cf85fc0f898ed20.mp3?version_id=1787—

Categories
2 దినవృత్తాంతములు

2 దినవృత్తాంతములు 7

1 సొలొమోను తానుచేయు ప్రార్థనను ముగించి నప్పుడు అగ్ని ఆకాశమునుండి దిగి దహనబలులను ఇతరమైన బలులను దహించెను; యెహోవా తేజస్సు మందిరమునిండ నిండెను,౹

2 యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకయుండిరి.౹

3 అగ్నియు యెహోవా తేజస్సును మందిరముమీదికి దిగగా చూచి ఇశ్రాయేలీయులందరును సాష్టాంగనమస్కారము చేసి–యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి.౹

4 రాజును జనులందరును యెహోవా ఎదుట బలులు అర్పించిరి.౹

5 రాజైన సొలొమోను ఇరువది రెండువేల పశువులను లక్ష యిరువది వేల గొఱ్ఱెలను బలులుగా అర్పించెను; యాజకులు తమతమ సేవాధర్మములలో నిలుచుచుండగను, లేవీయులు యెహోవా కృప నిరంతరము నిలుచుచున్నదని వారిచేత ఆయనను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాద్యములను వాయించుచు నిలుచుచుండగను, యాజకులు వారికి ఎదురుగా నిలిచి బూరలు ఊదుచుండగను, ఇశ్రాయేలీయులందరును నిలిచియుండగను

6 రాజును జనులందరును కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠచేసిరి.

7 మరియు తాను చేయించిన యిత్తడి బలిపీఠము దహనబలులకును నైవేద్యములకును క్రొవ్వుకును చాలనందున యెహోవా మందిరము ముంగిటనున్న నడిమి ఆవరణమును సొలొమోను ప్రతిష్ఠించి, అక్కడ దహనబలులను సమాధాన బలిపశువుల క్రొవ్వును అర్పించెను.౹

8 ఆ సమయమందు సొలొమోనును, అతనితోకూడ హమాతునకు పోవు మార్గము మొదలుకొని ఐగుప్తు నదివరకున్న దేశములోనుండి బహు గొప్ప సమూహముగా కూడివచ్చిన ఇశ్రాయేలీయులందరును ఏడు దినములు పండుగ ఆచరించి

9 యెనిమిదవనాడు పండుగ ముగించిరి; ఏడు దినములు బలిపీఠమును ప్రతిష్ఠచేయుచు ఏడు దినములు పండుగ ఆచరించిరి.

10 ఏడవ నెల యిరువది మూడవ దినమందు దావీదునకును సొలొమోనునకును తన జనులైన ఇశ్రాయేలీయులకును యెహోవా చేసిన మేలుల విషయమై సంతోషించుచును మనోత్సాహము నొందుచును, ఎవరి గుడారములకు వారు వెళ్లునట్లు అతడు జనులకు సెలవిచ్చి వారిని పంపివేసెను.౹

11 ఆప్రకారము సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టించి, యెహోవామందిరమందును తన నగరునందును చేయుటకు తాను ఆలోచించినదంతయు ఏ లోపములేకుండ నెరవేర్చి పని ముగించెను.

12 అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనునకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను–నేను నీ విన్నపము నంగీకరించి యీ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని.౹

13 వాన కురియకుండ నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనులమీదికి తెగులు రప్పించినప్పుడే గాని,౹

14 నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడుమార్గములను విడిచినయెడల, ఆకాశమునుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును.౹

15 ఈ స్థలమందు చేయబడు ప్రార్థనమీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును,౹

16 నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాని కోరుకొని పరిశుద్ధపరచితిని, నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద నుండును.౹

17 నీ తండ్రియైన దావీదు నడచినట్లుగా నీవును నా కనుకూల వర్తనుడవై నడచి, నేను నీకాజ్ఞాపించిన దానియంతటి ప్రకారముచేసి, నా కట్టడలను నా న్యాయవిధులను అనుసరించినయెడల

18 ఇశ్రాయేలీయులను ఏలుటకు స్వసంతతివాడు ఒకడు నీకుండకపోడని నేను నీ తండ్రియైన దావీదుతో చేసియున్న నిబంధననుబట్టి నేను నీ రాజ్యసింహాసనమును స్థిరపరచుదును.౹

19 అయితే మీరు త్రోవ తప్పి, నేను మీకు నియమించిన కట్టడలను ఆజ్ఞలను విడచి, యితర దేవతలను అనుసరించి వాటికి పూజానమస్కారములు చేసినయెడల

20 నేను మీకిచ్చిన నా దేశములోనుండి మిమ్మును పెల్లగించి, నా నామమునకు నేను పరిశుద్ధపరచిన యీ మందిరమును నా సన్నిధినుండి తీసి వేసి, సమస్త జనములలో దానిని సామెత కాస్పదముగాను నిందకాస్పదముగాను చేయుదును.౹

21 అప్పుడు ప్రఖ్యాతి నొందిన యీ మందిరమార్గమున పోవు ప్రయాణస్థులందరును విస్మయమొంది–యెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఎందుకు ఈ ప్రకారముగా చేసెనని యడుగగా

22 జనులు–ఈ దేశస్థులు తమపితరులను ఐగుప్తు దేశమునుండి రప్పించిన తమ దేవుడైన యెహోవాను విస ర్జించి యితర దేవతలను అనుసరించి వాటికి పూజానమస్కారములు చేసినందున యెహోవా ఈ కీడంతయు వారి మీదికి రప్పించెనని ప్రత్యుత్తరమిచ్చెదరు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2CH/7-21ee1e7db3f8e5716a40609c54bf029c.mp3?version_id=1787—

Categories
2 దినవృత్తాంతములు

2 దినవృత్తాంతములు 8

1 సొలొమోను యెహోవా మందిరమును తన నగరును కట్టించిన యిరువది సంవత్సరముల కాలము తీరిన తరువాత

2 హీరాము తనకిచ్చిన పట్టణములను సొలొమోను కట్టించి వాటిలో ఇశ్రాయేలీయులను కాపురముంచెను.

3 తరువాత సొలొమోను హమాతుసొబా అను స్థలమునకు పోయి దానిని పట్టుకొనెను.౹

4 మరియు అరణ్యమందుండు తద్మోరుకును హమాతు దేశమందు ఖజానా ఉంచు పట్టణములన్నిటికిని ప్రాకారములను కట్టించెను.౹

5 ఇదియుగాక అతడు ఎగువ బేత్‌హోరోను దిగువ బేత్‍హోరోను గవునులు అడ్డగడలుగల ప్రాకారపట్టణములుగా కట్టించెను.౹

6 బయలతును, ఖజానా ఉంచు పట్టణములన్నిటిని, రథములుంచు పట్టణములన్నిటిని, గుఱ్ఱపు రౌతులుండు పట్టణములన్నిటిని కట్టించెను. మరియు యెరూషలేమునందును లెబానోనునందును తాను ఏలు దేశములన్నిటియందును ప్రాకారపురములుగా కట్టించవలెనని తానుద్దేశించిన పట్టణములన్నిటిని సొలొమోను కట్టించెను.౹

7 ఇశ్రాయేలీయుల సంబంధులు కాని హిత్తీయులలోనుండియు అమోరీయులలోనుండియు, పెరిజ్జీయులలోనుండియు, హివ్వీయులలోనుండియు, యెబూసీయులలోనుండియు, శేషించియున్న సకల జనులను

8 ఇశ్రాయేలీయులు నాశనముచేయక వదలివేసిన ఆయా జనుల సంతతి వారిని సొలొమోను నేటివరకును తనకు వెట్టిపనులు చేయువారినిగా చేసికొనియుండెను.౹

9 అయితే ఇశ్రాయేలీయులలో ఒకనినైనను సొలొమోను తన పనిచేయుటకు దాసునిగా నియమింపలేదు; వారిని యోధులుగాను తన అధిపతులలో ప్రధానులుగాను రథములకును గుఱ్ఱపు రౌతులకును అధిపతులుగాను నియమించెను.౹

10 వీరిలో శ్రేష్ఠులైన రెండువందల ఏబదిమంది రాజైన సొలొమోను క్రింద అధిపతులై ప్రజలమీద అధికారులై యుండిరి.౹

11 ఇశ్రాయేలీయుల రాజైన దావీదు నగరునందు నా భార్య నివాసముచేయవలదు, యెహోవా మందసమున్న స్థలములు ప్రతిష్ఠితములు అని చెప్పి, సొలొమోను ఫరో కుమార్తెను దావీదు పట్టణమునుండి తాను ఆమెకొరకు కట్టించిన నగరునకు రప్పించెను.

12 అది మొదలుకొని సొలొమోను తాను మంటపము ఎదుట కట్టించిన యెహోవా బలిపీఠముమీద దహనబలులు అర్పించుచు వచ్చెను. అతడు అనుదిన నిర్ణయముచొప్పున

13 మోషే యిచ్చిన ఆజ్ఞనుబట్టి విశ్రాంతిదినములయందును, అమావాస్యలయందును, నియామక కాలములయందును, సంవత్సరమునకు ముమ్మారుజరుగు పండుగలయందును, అనగా పులియనిరొట్టెల పండుగయందును వారముల పండుగయందును పర్ణశాలల పండుగయందును యెహోవాకు దహనబలులు అర్పించుచు వచ్చెను.౹

14 అతడు తన తండ్రియైన దావీదు చేసిన నిర్ణయమునుబట్టి వారి వారి సేవాధర్మములను జరుపుకొనుటకై వారి వారి వంతుల చొప్పున యాజకులను వారి సేవకును, కట్టడనుబట్టి అను దినమున యాజకుల సముఖమున స్తుతిచేయుటకును, ఉప చారకులుగా ఉండుటకును, వంతులచొప్పున లేవీయులను, ద్వారములన్నిటి దగ్గర కావలియుండుటకై వారి వారి వంతులచొప్పున ద్వారపాలకులను నియమించెను; దైవ జనుడైన దావీదు ఆలాగుననే యాజ్ఞ ఇచ్చియుండెను.౹

15 ఏ విషయమునుగూర్చియేగాని బొక్కసములనుగూర్చియేగాని రాజు యాజకులకును లేవీయులకును చేసియున్న నిర్ణ యమునుబట్టి వారు సమస్తమును జరుపుచువచ్చిరి

16 యెహోవా మందిరమునకు పునాదివేసిన దినము మొదలుకొని అది సంపూర్ణమగువరకు సొలొమోను పనియంతయు చేయించెను; అప్పుడు యెహోవా మందిరము సమాప్త మాయెను.

17 సొలొమోను ఎదోము దేశముయొక్క సముద్రపు దరినున్న ఎసోన్గెబెరునకును ఏలతునకును పోగా

18 హీరాము తన పనివారిద్వారా ఓడలను ఓడ నడుపుటయందు యుక్తి గల పనివారిని పంపెను. వీరు సొలొమోను పనివారితోకూడ ఓఫీరునకు పోయి అక్కడనుండి తొమ్మిదివందల మణుగుల బంగారమును ఎక్కించుకొని రాజైన సొలొమోను నొద్దకు తీసికొని వచ్చిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2CH/8-cfa9d978897557ebfb29f3ae3e04d402.mp3?version_id=1787—

Categories
2 దినవృత్తాంతములు

2 దినవృత్తాంతములు 9

1 షేబదేశపు రాణి సొలొమోనునుగూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నలచేత సొలొమోనును శోధింపవలెనని కోరి, మిక్కిలి గొప్ప పరివారమును వెంట బెట్టుకొని, గంధవర్గములను విస్తారము బంగారమును రత్నములను ఒంటెలమీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. ఆమె సొలొమోనునొద్దకు వచ్చి తన మనస్సు లోని విషయములన్నిటిని గురించి అతనితో మాటలాడెను.౹

2 సొలొమోను ఆమె ప్రశ్నలన్నియు ఆమెకు విడదీసి చెప్పెను; సొలొమోను ఆమెకు ప్రత్యుత్తరము చెప్పలేని మరుగైన మాట యేదియు లేకపోయెను.౹

3 షేబదేశపు రాణి సొలొమోనునకు కలిగిన జ్ఞానమును, అతడు కట్టించిన నగరును,౹

4 అతని బల్లమీది భోజనపదార్థములను, అతని సేవకులు కూర్చుండుటను, అతని యుపచారులు కనిపెట్టుటను వారి వస్త్రములను, అతనికి గిన్నెల నందించువారిని వారి వస్త్రములను, యెహోవామందిరమందు అతడు అర్పించు దహనబలులను చూచినప్పుడు, ఆమె విస్మయ మొంది రాజుతో ఇట్లనెను

5 –నీ కార్యములనుగూర్చియు జ్ఞానమునుగూర్చియు నేను నా దేశమందు వినిన వర్తమానము నిజవర్తమానమే గాని, నేను వచ్చి దాని కన్నులార చూచువరకు వారి మాటలను నమ్మకయుంటిని.౹

6 నీ యధిక జ్ఞానమునుగూర్చి సగమైనను వారు నాకు తెలుపలేదు. నిన్నుగూర్చి నేను వినినదానికంటె నీ కీర్తి యెంతో హెచ్చుగానున్నది.౹

7 నీ సేవకుల భాగ్యము మంచిది, ఎల్లప్పుడును నీ సముఖమున నిలిచి నీ జ్ఞానసంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది.౹

8 నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనముమీద ఆసీనుడవై యుండునట్లు నీయందు అనుగ్రహము చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రములు కలుగునుగాక. ఇశ్రాయేలీయులను నిత్యము స్థిరపరచవలెనన్న దయాలోచన నీ దేవునికి కలిగియున్నందున నీతిన్యాయములను జరిగించుటకై ఆయన నిన్ను వారిమీద రాజుగా నియమించెను అని చెప్పెను.౹

9 ఆమె రాజునకు రెండువందల నలుబది మణుగుల బంగారమును విస్తారమైన గంధవర్గములను రత్నములను ఇచ్చెను; షేబదేశపు రాణి రాజైన సొలొమోనున కిచ్చిన గంధవర్గములతో సాటియైన దేదియులేదు.౹

10 ఇదియుగాక ఓఫీరునుండి బంగారము తెచ్చిన హీరాము పనివారును సొలొమోను పనివారును చందనపు మ్రానులను ప్రశస్తమైన రత్నములను కూడ కొనివచ్చిరి.౹

11 ఆ చందనపు మ్రానులచేత రాజు యెహోవా మందిరమునకును రాజనగరునకును సోపానములను, గాయకులకు తంబురలను సితారాలను చేయించెను, అటువంటి పని అంతకుముందు యూదాదేశమందు ఎవ్వరును చూచియుండలేదు.౹

12 షేబ దేశపు రాణి రాజునకు తీసికొనివచ్చిన వాటికి అతడిచ్చిన ప్రతి బహుమానములుగాక ఆమె మక్కువపడి అడిగినదంతయు రాజైన సొలొమోను ఆమె కిచ్చెను; తరువాత ఆమె తన సేవకులను వెంట బెట్టుకొని మరలి తన దేశమునకు వెళ్లిపోయెను.

13 గంధవర్గములు అమ్ము వర్తకులును ఇతర వర్తకులును కొని వచ్చు బంగారముగాక సొలొమోనునకు ఏటేట వచ్చు బంగారము వెయ్యిన్ని మూడువందల ముప్పది రెండు మణుగులయెత్తు.౹

14 అరబీదేశపు రాజులందరును దేశాధిపతులును సొలొమోనునొద్దకు బంగారమును వెండియు తీసికొని వచ్చిరి.౹

15 రాజైన సొలొమోను సాగగొట్టిన బంగారముతో అలుగులుగల రెండువందల డాళ్లను చేయించెను; ఒక్కొక డాలునకు ఆరువందల తులముల బంగారము పట్టెను.౹

16 మరియు సాగగొట్టిన బంగారముతో మూడు వందల కేడెములను చేయించెను; ఒక్కొక కేడెమునకు మూడువందల తులముల బంగారము పట్టెను; వాటిని రాజు లెబానోను అరణ్యపు నగరునందుంచెను.౹

17 మరియు రాజు దంతముతో ఒక గొప్ప సింహాసనము చేయించి ప్రశస్తమైన బంగారముతో దాని పొదిగించెను.౹

18 ఆ సింహాసనమునకు దానితో కలిసియున్న ఆరు బంగారపు సోపానములును సింహాసనమునకు కట్టి యున్న బంగారపు పాదపీఠమును ఉండెను, కూర్చుండుచోటికి ఇరుప్రక్కల ఊతలుండెను, ఊతలదగ్గర రెండు సింహములుండెను;౹

19 ఆయారు సోపానములమీద ఇరుప్రక్కల పండ్రెండు సింహములు నిలిచియుండెను, ఏ రాజ్యమందైనను అటువంటి పని చేయబడలేదు.౹

20 మరియు రాజైన సొలొమోనునకున్న పానపాత్రలన్నియును బంగారపువై యుండెను; లెబా నోను అరణ్యపు నగరుననున్న ఉపకరణములన్నియు బంగారముతో చేసినవి; హీరాముయొక్క పనివారితోకూడ రాజు ఓడలు తర్షీషుకు పోయి మూడు సంవత్సరములకు ఒకమారు బంగారము, వెండి, యేనుగుదంతము, కోతులు, నెమళ్లు అను సరకులతో వచ్చుచుండెను గనుక

21 సొలొమోను దినములలో వెండియెన్నికకు రానిదాయెను

22 రాజైన సొలొమోను భూరాజులందరికంటెను ఐశ్వర్యమందును జ్ఞానమందును అధికుడాయెను.౹

23 దేవుడు సొలొమోనుయొక్క హృదయమందుంచిన జ్ఞానోక్తులను వినుటకై భూరాజులందరును అతని ముఖదర్శనము చేయగోరిరి.౹

24 మరియు ప్రతివాడును ఏటేట వెండివస్తువులను బంగారు వస్తువులను వస్త్రములను ఆయుధములను గంధవర్గములను గుఱ్ఱములను కంచరగాడిదలను కానుకలుగా తీసికొనివచ్చెను.

25 రథములు నిలువయుంచు పట్టణములలోను రాజునొద్ద యెరూషలేములోను సొలొమోనునకు నాలుగువేల గుఱ్ఱపు సాలలును రథములును పండ్రెండువేల గుఱ్ఱపు రౌతులును కలిగి యుండెను.౹

26 యూఫ్రటీసునది మొదలుకొని ఫిలిష్తీయుల దేశమువరకును ఐగుప్తు సరిహద్దువరకునుఉండు రాజులందరి పైని అతడు ఏలుబడి చేసెను.౹

27 రాజు యెరూషలేమునందు వెండి రాళ్లంత విస్తారముగా నుండునట్లును, దేవదారు మ్రానులు షెఫేలా ప్రదేశముననున్న మేడివృక్షములంత విస్తారముగా నుండునట్లును చేసెను.౹

28 ఐగుప్తునుండియు సకల దేశములనుండియు సొలొమోనునకు గుఱ్ఱములు తేబడెను.౹

29 సొలొమోను చేసిన కార్యములన్నిటినిగూర్చి ప్రవక్తయైన నాతాను రచించిన గ్రంథమందును, షిలోనీయుడైన అహీయా రచించిన ప్రవచన గ్రంథమందును, నెబాతు కుమారుడైన యరొబామునుగూర్చి దీర్ఘదర్శియైన ఇద్దోకు గ్రంథమందును వ్రాయబడి యున్నది.౹

30 సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలీయులందరిమీద నలుబది సంవత్సరములు ఏలుబడి చేసెను.౹

31 తరువాత సొలొమోను తన పితరులతోకూడ నిద్రించి తన తండ్రియైన దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను; అతనికి బదులుగా అతని కుమారుడైన రెహబాము రాజాయెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2CH/9-bc986f495a3d3e6edfc98777d9f8281f.mp3?version_id=1787—

Categories
2 దినవృత్తాంతములు

2 దినవృత్తాంతములు 10

1 రెహబామునకు పట్టాభిషేకము చేయుటకై ఇశ్రాయేలీయులందరును షెకెమునకు వెళ్లగా రెహబాము షెకెమునకు పోయెను.౹

2 రాజైన సొలొమోను సమక్షము నుండి పారిపోయి ఐగుప్తులో వాసము చేయుచున్న నెబాతు కుమారుడైన యరొబాము అది విని ఐగుప్తునుండి తిరిగిరాగా జనులు అతని పిలిపించిరి.౹

3 యరొబామును ఇశ్రాయేలువారందరును కూడి వచ్చి–నీ తండ్రి మా కాడిని బరువుచేసెను;౹

4 నీ తండ్రి నియమించిన కఠిన దాస్యమును అతడు మామీద ఉంచిన బరువైన కాడిని నీవు ఇప్పుడు చులుకన చేసినయెడల మేము నిన్ను సేవింతుమని రెహబాముతో మనవిచేయగా

5 అతడు–మీరు మూడుదినములు తాళి మరల నాయొద్దకు రండని చెప్పెను గనుక జనులు వెళ్లిపోయిరి.౹

6 అప్పుడు రాజైన రెహబాము తన తండ్రియైన సొలొమోను సజీవియై యుండగా అతని సమక్షమున నిలిచిన పెద్దలను పిలిపించి–యీ జనులకు నేనేమి ప్రత్యుత్తర మియ్యవలెను? మీరు చెప్పు ఆలోచన ఏది అని అడుగగా

7 వారు–నీవు ఈ జనులయెడల దయా దాక్షిణ్యములు చూపి వారితో మంచిమాటలాడినయెడల వారు ఎప్పటికిని నీకు దాసులగుదురని అతనితో చెప్పిరి.౹

8 అయితే అతడు పెద్దలు తనకు చెప్పిన ఆలోచన త్రోసి వేసి, తనతోకూడ పెరిగి తన యెదుటనున్న యౌవనస్థులతో ఆలోచనచేసి

9 –నీ తండ్రి మామీద ఉంచిన కాడిని చులుకన చేయుమని నన్నడిగిన యీ జనులకు ప్రత్యుత్తరమేమి ఇయ్యవలెనని మీరు యోచింతురో చెప్పుడని వారినడుగగా

10 అతనితోకూడ పెరిగిన యీ యౌవనస్థులు అతనితో ఇట్లనిరి–నీ తండ్రి మా కాడిని బరువుచేసెను, నీవు దానిని చులుకన చేయుమని నీతో పలికిన యీ జనులతో నీవు చెప్పవలసినదేమనగా–నా చిటికెన వ్రేలు నా తండ్రియొక్క నడుముకంటె బరువుగా ఉండును;౹

11 నా తండ్రి బరువైన కాడి మీమీద మోపెనుగాని నేను మీ కాడిని మరింత బరువు చేయుదును; నా తండ్రి మిమ్మును చబుకులతో దండించెనుగాని నేను కొరడాలతో మిమ్మును దండించెదనని చెప్పుము.౹

12 –మూడవ దినమందు నాయొద్దకు తిరిగి రండని రాజు చెప్పిన ప్రకారము యరొబామును జనులందరును మూడవ దినమందు రెహబామునొద్దకు రాగా

13 రాజైన రెహబాము పెద్దల ఆలోచనను త్రోసివేసి, యౌవనస్థులు చెప్పిన ప్రకారము వారితో మాటలాడి

14 వారికి కఠినమైన ప్రత్యుత్తర మిచ్చెను; ఎట్లనగా–నా తండ్రి మీ కాడిని బరువుచేసెను, నేను దానిని మరింత బరువు చేయుదును; నా తండ్రి మిమ్మును చబుకులతో దండించెను, నేను మిమ్మును కొరడాలతో దండించెదనని చెప్పెను.౹

15 యెహోవా షిలోనీయుడైన అహీయాద్వారా నెబాతు కుమారుడైన యరొబాముతో సెలవిచ్చిన తన మాటను స్థిరపరచునట్లు దేవుని నిర్ణయ ప్రకారము జనులు చేసిన మనవి రాజు ఆలకించక పోయెను.౹

16 రాజు తాము చేసిన మనవి అంగీకరింపక పోవుట చూచి జనులు–దావీదులో మాకు భాగము ఏది? యెష్షయి కుమారునియందు మాకు స్వాస్థ్యము లేదు; ఇశ్రాయేలువారలారా, మీ గుడారమునకు పోవుడి; దావీదూ, నీ సంతతివారిని నీవే చూచుకొనుమని రాజునకు ప్రత్యుత్తరమిచ్చి ఇశ్రాయేలువారందరును ఎవరి గుడారమునకు వారు వెళ్లిపోయిరి.౹

17 అయితే యూదాపట్టణములలో కాపురముండు ఇశ్రాయేలువారిమీద రెహబాము ఏలుబడి చేసెను.౹

18 రాజైన రెహబాము వెట్టిపనివారిమీద అధికారియైన హదోరమును పంపగా ఇశ్రాయేలువారు రాళ్లతో అతని చావ గొట్టిరి గనుక రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవలెనని త్వరపడి తన రథము ఎక్కెను.౹

19 ఇశ్రాయేలువారు ఇప్పటికిని దావీదు సంతతివారిమీద తిరుగుబాటు చేసి నేటివరకును వారికి లోబడకయున్నారు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2CH/10-22c24ac945fb70206687ace4948cee00.mp3?version_id=1787—

Categories
2 దినవృత్తాంతములు

2 దినవృత్తాంతములు 11

1 రెహబాము యెరూషలేమునకు వచ్చినప్పుడు ఇశ్రాయేలువారితో యుద్ధము చేయుటకును, రాజ్యమును తనకు మరల రప్పించుకొనుటకును అతడు యూదావారిలోనుండియు బెన్యామీనీయులలోనుండియు ఏర్పరచబడిన యుద్ధ శాలులను లక్షయెనుబదివేలమందిని సమకూర్చగా

2 దైవజనుడైన షెమయాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

3 –నీవు యూదారాజును సొలొమోను కుమారుడునగు రెహబాముతోను, యూదాయందును బెన్యామీనీయుల ప్రదేశమందునుఉండు ఇశ్రాయేలు వారందరితోను ఈ మాట ప్రకటించుము

4 –ఈ కార్యము నావలన జరుగుచున్నదని యెహోవా సెలవిచ్చుచున్నాడు గనుక, బయలుదేరకుండను మీ సహోదరులతో యుద్ధము చేయకుండను మీరందరును మీ మీ యిండ్లకు తిరిగి పోవుడి అని చెప్పెను. కావునవారు యెహోవా మాటలు విని యరొబాముతో యుద్ధము చేయుట మాని వెళ్లిపోయిరి.

5 రెహబాము యెరూషలేమునందు కాపురముండి యూదా ప్రదేశమందు ప్రాకారపురములను కట్టించెను.౹

6-9 అతడు బేత్లెహేము, ఏతాము, తెకోవ, బేత్సూరు, శోకో, అదుల్లాము, గాతు, మారేషా, జీఫు, అదోరయీము, లాకీషు, అజేకా,౹

10 జొర్యా, అయ్యాలోను, హెబ్రోను అను యూదా బెన్యామీను ప్రదేశములందుండు ప్రాకారపురములను కట్టించి

11 దుర్గములను బల పరచి, వాటిలో అధిపతులను ఉంచి, ఆహారమును నూనెను ద్రాక్షారసమును సమకూర్చెను.౹

12 మరియు వాటిలో డాళ్లను బల్లెములను ఉంచి ఆ పట్టణములను బహుబలవంతమైన వాటిగా చేసెను. యూదావారును బెన్యామీనీయులును అతని పక్షముననుండిరి.

13 ఇశ్రాయేలువారి మధ్యనుండు యాజకులును లేవీయులును తామున్న ప్రదేశముల సరిహద్దులను దాటి అతని యొద్దకు వచ్చి చేరిరి.౹

14 యరొబామును అతని కుమారులును యెహోవాకు యాజకసేవ జరుగకుండ లేవీయులను త్రోసి వేయగా, వారు తమ గ్రామములను స్వాస్థ్యములను విడచి, యూదా దేశమునకును యెరూషలేమునకును వచ్చిరి.౹

15 యరొబాము బలిపీఠములకును దయ్యములకును తాను చేయించిన దూడలకును యాజకులను ఏర్పరచుకొనెను.౹

16 వారి చర్యలట్లుండగా ఇశ్రాయేలీయుల గోత్రములయం దంతటను ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాను వెదకుటకు మనస్సు నిలుపుకొనినవారు తమపితరుల దేవుడైన యెహోవాకు బలులనర్పించుటకై యెరూషలేమునకు వచ్చిరి.౹

17 దావీదును సొలొమోనును నడచిన మార్గమందు మూడు సంవత్సరములువారు నడచి, యూదా రాజ్యమును బలపరచి మూడు సంవత్సరములు సొలొమోను కుమారుడైన రెహబామునకు సహాయకులైరి.

18 రెహబాము, దావీదు కుమారుడైన యెరీమోతు కుమార్తెయగు మహలతును యెష్షయి కుమారుడైన ఏలీయాబు కుమార్తెయగు అబీహాయిలును వివాహము చేసికొనెను.౹

19 అతనికి యూషు షెమర్యా జహము అను కుమారులు కలిగిరి.౹

20 పిమ్మట అతడు అబ్షాలోము కుమార్తెయైన మయ కాను వివాహము చేసికొనగా ఆమె అతనికి అబీయాను అత్తయిని జీజాను షెలోమీతును కనెను.౹

21 రెహబాము పదునెనిమిదిమంది భార్యలను పెండ్లిచేసికొని అరువదిమంది ఉపపత్నులను తెచ్చుకొని యిరువది యెనిమిదిమంది కుమారులను అరువదిమంది కుమార్తెలను కనెను; అయితే తన భార్యలందరికంటెను ఉపపత్నులందరికంటెను అబ్షాలోము కుమార్తెయైన మయకాను అతడు ఎక్కువగా ప్రేమించెను.౹

22 రెహబాము మయకాకు పుట్టిన కుమారుడైన అబీయాను రాజును చేయతలచి, అతని సహోదరులమీద ప్రధానునిగాను అధిపతినిగాను అతని నియమించెను.౹

23 అతడు మంచి మెలకువగలవాడై తన కుమారులలో శేషించిన వారిని యూదా బెన్యామీను సంబంధములైన ఆయా ప్రదేశములలోని ఆయా ప్రాకారపురములయందు అధిపతులుగా నియమించి వారికి విస్తారమైన సొత్తు ఇచ్చి వారికి పెండ్లిండ్లు చేసెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2CH/11-17df730841633cf2941e7877075177e9.mp3?version_id=1787—

Categories
2 దినవృత్తాంతములు

2 దినవృత్తాంతములు 12

1 రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన . తరువాత అతడును ఇశ్రాయేలీయులందరును యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి.౹

2 వారు యెహోవా యెడల ద్రోహము చేసినందున రాజైన రెహబాముయొక్క అయిదవ సంవత్సరమందు ఐగుప్తు రాజైన షీషకు వెయ్యిన్ని రెండువందల రథములతోను అరువదివేల గుఱ్ఱపు రౌతులతోను యెరూషలేముమీదికి వచ్చెను.౹

3 అతనితోకూడ ఐగుప్తునుండి వచ్చిన లూబీయులు సుక్కీయులు కూషీయులు అనువారు లెక్కకు మించియుండిరి.౹

4 అతడు యూదాకు సమీపమైన ప్రాకారపురములను పట్టుకొని యెరూషలేమువరకు రాగా

5 ప్రవక్తయైన షెమయా రెహబామునొద్దకును, షీషకునకును భయపడి యెరూషలేమునకు వచ్చి కూడియున్న యూదావారి అధిపతుల యొద్దకును వచ్చి–మీరు నన్ను విసర్జించితిరి గనుక నేను మిమ్మును షీషకు చేతిలో పడనిచ్చియున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను.౹

6 అప్పుడు ఇశ్రాయేలీయుల అధిపతులును రాజును తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి.౹

7 వారు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను గనుక యెహోవా వాక్కు షెమయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను–వారు తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక నేను వారిని నాశనముచేయక, షీషకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేముమీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసెదను.౹

8 అయితే నన్ను సేవించుటకును, భూరాజులకు దాసులై యుండుటకును ఎంత భేదమున్నదో వారు తెలిసికొనునట్లువారు అతనికి దాసులగుదురు.

9 ఐగుప్తురాజైన షీషకు యెరూషలేముమీదికి వచ్చి యెహోవా మందిరపు బొక్కసములన్నిటిని రాజనగరు లోని బొక్కసములన్నిటిని దోచుకొని, సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను తీసికొనిపోయెను.౹

10 వాటికి బదులుగా రాజైన రెహబాము ఇత్తడి డాళ్లను చేయించి వాటిని రాజనగరుయొక్క ద్వారమును కాయు సేవకులయొక్క అధిపతులకు అప్పగించెను.౹

11 రాజు యెహోవా మందిరములోనికి ప్రవేశించినప్పుడెల్ల నగరు సేవకులు వచ్చి వాటిని ఎత్తి తరువాత వాటిని మరల గదిలో ఉంచుచు వచ్చిరి.౹

12 అతడు తన్నుతాను తగ్గించుకొనినందున యెహోవా అతని బొత్తిగా నిర్మూలముచేయక, యూదావారు కొంత మట్టుకు మంచితనము ననుసరించుట చూచి తన కోపము అతనిమీదనుండి త్రిప్పుకొనెను.

13 రాజైన రెహబాము యెరూషలేమునందు స్థిరపడి యేలుబడి చేసెను; రెహబాము ఏలనారంభించినప్పుడు నలుబదియొక సంవత్సరముల యీడుగల వాడై యుండెను; తన నామమును అచ్చట ఉంచుటకై ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలోనుండి యెహోవా కోరుకొనిన పట్టణమగు యెరూషలేమునందు అతడు పదునేడు సంవత్సరములు ఏలెను, అతని తల్లి పేరు నయమా, ఆమె అమ్మోనీయురాలు.౹

14 అతడు తన మనస్సు యెహోవాను వెదకుటయందు నిలుపుకొనక చెడుక్రియలు చేసెను.

15 రెహబాము చేసిన కార్యములన్నిటిని గూర్చియు షెమయా రచించిన గ్రంథమందును దీర్ఘదర్శియైన ఇద్దో రచించిన వంశావళియందును వ్రాయబడియున్నది.౹

16 రెహ బామునకును యరొబామునకును యుద్ధము యెడతెగక జరిగెను. రెహబాము తన పితరులతోకూడ నిద్రించి దావీదుపట్టణమందు పాతిపెట్టబడెను, అతని కుమారుడైన అబీయా అతనికి బదులుగా రాజాయెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2CH/12-04a7f9e6a7d2ca60efcb18f78c9eb6e9.mp3?version_id=1787—

Categories
2 దినవృత్తాంతములు

2 దినవృత్తాంతములు 13

1 రాజైన యరొబాము ఏలుబడిలో పదునెనిమిదవ సంవత్సరమందు అబీయా యూదావారిమీద ఏలనారం భించెను.౹

2 అతడు మూడు సంవత్సరములు యెరూషలేమునందు ఏలెను; అతని తల్లిపేరు మీకాయా, ఆమె గిబియా ఊరివాడైన ఊరియేలు కుమార్తె.

3 అబీయాకును యరొబామునకును యుద్ధము కలుగగా అబీయా నాలుగు లక్షలమంది పరాక్రమశాలుల సైన్యము ఏర్పరచుకొని యుద్ధమునకు సిద్ధముచేసెను; యరొబామును ఎనిమిది లక్షలమంది పరాక్రమశాలులను ఏర్పరచుకొని అతనికి ఎదురుగా వారిని యుద్ధమునకు వ్యూహపరచెను.౹

4 అప్పుడు అబీయా ఎఫ్రాయిము మన్యమందుండు సెమరాయిము కొండమీద నిలిచి ప్రకటించినదేమనగా – యరొబామా, ఇశ్రాయేలువారలారా, మీరందరును నాకు చెవియొగ్గుడి.౹

5 ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడును ఏలునట్లుగా ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా దావీదుతోను అతని సంతతివారితోను భంగము కాజాలనినిబంధన చేసి దానిని వారికిచ్చెనని మీరు తెలిసికొందురు గదా.౹

6 అయినను దావీదు కుమారుడైన సొలొమోనుకు దాసుడును నెబాతు కుమారుడునగు యరొబాము పనికి మాలిన దుష్టులతో కలిసి లేచి తన యజమానునిమీద తిరుగుబాటు చేసెను.౹

7 సొలొమోను కుమారుడైన రెహబాము ఇంకను బాల్యదశలోనుండి ధైర్యము లేనివాడై వారిని ఎదిరించుటకు తగిన శక్తిలేకున్నప్పుడు వారు అతనితో యుద్ధము చేయుటకు సిద్ధమైరి.౹

8 ఇప్పుడు దావీదు సంతతి వారి వశముననున్న యెహోవా రాజ్యముతో మీరు యుద్ధముచేయ తెగించెదమని తలంచుచున్నారు. మీరు గొప్ప సైన్యముగా ఉన్నారు; యరొబాము మీకు దేవతలుగా చేయించిన బంగారు దూడలును మీయొద్ద ఉన్నవి.౹

9 మీరు అహరోను సంతతివారైన యెహోవా యాజకులను, లేవీయులను త్రోసివేసి, అన్యదేశముల జనులు చేయునట్లు మీకొరకు యాజకులను నియమించు కొంటిరిగదా? ఒక కోడెతోను ఏడు గొఱ్ఱె పొట్టేళ్లతోను తన్ను ప్రతిష్ఠించుటకైవచ్చు ప్రతివాడు, దైవములు కాని వాటికి యాజకుడగుచున్నాడు.౹

10 అయితే యెహోవా మాకు దేవుడైయున్నాడు; మేము ఆయనను విసర్జించిన వారము కాము; అహరోను సంతతివారు యెహోవాకు సేవచేయు యాజకులై యున్నారు; లేవీయులు చేయవలసిన పనులను లేవీయులే చేయుచున్నారు.౹

11 వారు ఉదయాస్తమయములయందు యెహోవాకు దహనబలులు అర్పించుచు, సుగంధద్రవ్యములతో ధూపము వేయుచు, పవిత్రమైన బల్లమీద సన్నిధిరొట్టెలు ఉంచుచు, బంగారు దీపస్తంభమును ప్రమిదెలను ప్రతి సాయంత్రము ముట్టిం చుచు వచ్చుచున్నారు; మేము మా దేవుడైన యెహోవా యేర్పరచిన విధినిబట్టి సమస్తము జరిగించుచున్నాముగాని మీరు ఆయనను విసర్జించిన వారైతిరి.౹

12 ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగానున్నాడు, మీ మీద ఆర్భాటము చేయుటకై బూరలు పట్టుకొని ఊదు నట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు; ఇశ్రాయేలువారలారా, మీపితరుల దేవుడైన యెహోవాతో యుద్ధముచేయకుడి, చేసినను మీరు జయమొందరు.

13 యరొబాము వారి వెనుకటి భాగమందు మాటు గాండ్రను కొందరిని ఉంచి, సైన్యము యూదావారికి ముందును మాటుగాండ్ర వారికి వెనుకను ఉండునట్లు చేసెను.౹

14 యూదావారు తిరిగి చూచి యోధులు తమకు ముందును వెనుకను ఉన్నట్టు తెలిసికొని యెహోవాకు ప్రార్థన చేసిరి, యాజకులును బూరలు ఊదిరి.౹

15 అప్పుడు యూదావారు ఆర్భటించిరి; యూదావారు ఆర్భటించి నప్పుడు యరొబామును ఇశ్రాయేలువారందరును అబీయా యెదుటను యూదావారి యెదుటను నిలువలేకుండునట్లు దేవుడు వారిని మొత్తినందున

16 ఇశ్రాయేలువారు యూదా వారి యెదుటనుండి పారిపోయిరి. దేవుడు వారిని యూదా వారిచేతికి అప్పగించినందున

17 అబీయాయును అతని జనులును వారిని ఘోరముగా సంహరించిరి. ఇశ్రాయేలు వారిలో అయిదు లక్షలమంది పరాక్రమశాలులు హతులైరి.౹

18 ఈ ప్రకారము ఇశ్రాయేలువారు ఆ కాలమందు తగ్గింపబడిరిగాని యూదావారు తమపితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువుచేత జయమొందిరి.౹

19 అబీయా యరొబామును తరిమి, బేతేలును దాని గ్రామములను యెషానాను దాని గ్రామములను ఎఫ్రోనును దాని గ్రామములను పట్టుకొనెను.

20 అబీయా బ్రదికిన కాలమున యరొబాము మరల బలము పొందలేదు, యెహోవా అతని మొత్తినందుచేత అతడు మరణ మొందెను.౹

21 అబీయా వృద్ధినొందెను, అతడు పదునాలుగు మంది భార్యలను వివాహము చేసికొని యిరువది యిద్దరు కుమారులను పదునారుగురు కుమార్తెలను కనెను.౹

22 అబీయా చేసిన యితర కార్యములనుగూర్చియు, అతని చర్యనుగూర్చియు, అతని కాలమున జరిగిన సంగతులనుగూర్చియు ప్రవక్తయైన ఇద్దో రచించిన సటీక గ్రంథమునందు వ్రాయ బడియున్నది.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2CH/13-274b9f91604607a000361008c0ac34c7.mp3?version_id=1787—