Categories
1 దినవృత్తాంతములు

1 దినవృత్తాంతములు 13

1 దావీదు సహస్రాధిపతులతోను శతాధిపతులతోను అధిపతులందరితోను ఆలోచనచేసి, సమాజముగా కూడిన ఇశ్రాయేలీయులందరితో ఈలాగు సెలవిచ్చెను

2 –ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వలన కలిగినయెడల ఇశ్రాయేలీయుల నివాసప్రదేశముల యందంతట శేషించియున్న మన సహోదరులును తమ పట్టణములలోను పల్లెలలోను కాపురమున్న యాజకులును లేవీయులును మనతోకూడుకొనునట్లు వారియొద్దకు పంపి

3 మన దేవుని మందసమును మరల మనయొద్దకు కొంచు వత్తము రండి; సౌలు దినములలో దానియొద్ద మనము విచారణ చేయకయే యుంటిమి.౹

4 ఈ కార్యము సమా జకులందరి దృష్టికి అనుకూలమాయెను గనుక జనులందరును ఆప్రకారము చేయుదుమనిరి.౹

5 కాగా దేవుని మందసమును కిర్యత్యారీమునుండి తీసికొని వచ్చుటకు దావీదు ఐగుప్తుయొక్క షీహోరునది మొదలుకొని హమాతునకు పోవుమార్గమువరకునుండు ఇశ్రాయేలీయులనందరిని సమకూర్చెను.౹

6 కెరూబులమధ్య నివాసముచేయు దేవుడైన యెహోవా నామము పెట్టబడిన ఆయన మందసమును యూదాలోనుండు కిర్యత్యారీము అనబడిన బాలానుండి తీసికొనివచ్చుటకై అతడును ఇశ్రాయేలీయులందరును అచ్చటికి పోయిరి.౹

7 వారు దేవుని మందసమును ఒక క్రొత్త బండిమీద ఎక్కించి, అబీనాదాబు ఇంటనుండి తీసికొనివచ్చిరి; ఉజ్జాయును అహ్యోయును బండిని తోలిరి.౹

8 దావీదును ఇశ్రాయేలీయులందరును తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు, సితారాలను స్వరమండలములను తంబురలను తాళములను వాయించుచు బూరలు ఊదుచుండిరి.౹

9 వారు కీదోను కళ్లమునొద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకొనవలెనని ఉజ్జా చేయిచాపగా

10 యెహోవా కోపము అతనిమీద రగులుకొనెను, అతడు తన చేయి మందసము నొద్దకు చాపగా ఆయన అతని మొత్తెను గనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయెను.౹

11 యెహోవా ఉజ్జాను వినాశము చేయుటచూచి దావీదు వ్యాకులపడెను; అందుచేత ఆ స్థలమునకు నేటివరకు పెరెజ్ఉజ్జా అని పేరు.౹

12 ఆ దినమున దావీదు దేవుని విషయమై భయమొంది–దేవుని మందసమును నాయొద్దకు నేను ఏలాగు తీసికొని పోవుదుననుకొని, మందసమును

13 తన యొద్దకు దావీదు పురమునకు తీసికొనిపోక, దానిని గిత్తీయుడైన ఓబేదెదోము ఇంటిలోనికి కొనిపోయెను.౹

14 దేవుని మందసము ఓబేదెదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద మూడు నెలలుండగా యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1CH/13-e6801e4bb020646b1977900de1faac63.mp3?version_id=1787—

Categories
1 దినవృత్తాంతములు

1 దినవృత్తాంతములు 14

1 తూరు రాజైన హీరాము దావీదునొద్దకు దూతలను, అతనికి ఒక యిల్లు కట్టుటకై దేవదారు మ్రానులను, కాసెపనివారిని వడ్లవారిని పంపెను.౹

2 తన జనులగు ఇశ్రాయేలీయుల నిమిత్తము యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున ఆయన తన్ను ఇశ్రాయేలీయులమీద రాజుగాస్థిరపరచెనని దావీదు గ్రహించెను.

3 పిమ్మట యెరూషలేమునందు దావీదు ఇంక కొందరు స్త్రీలను వివాహము చేసికొని యింక కుమారులను కుమార్తెలను కనెను.౹

4 యెరూషలేమునందు అతనికి పుట్టిన కుమారుల పేరులేవనగా, షమ్మూయ షోబాబు నాతాను సొలొమోను

5-7 ఇభారు ఏలీషూవ ఎల్పాలెటు నోగహు నెపెగు యాఫీయ ఎలీషామా బెయెల్యెదా ఎలీపేలెటు.

8 దావీదు ఇశ్రాయేలీయులందరిమీద రాజుగా అభిషేకము చేయబడెనని విని, ఫిలిష్తీయులందరు దావీదును వెదకి పట్టుకొనుటకై బయలుదేరగా దావీదు ఆ సంగతి విని వారిని ఎదుర్కొనబోయెను.౹

9 ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీముల లోయలోదిగిరి.౹

10 ఫిలిష్తీయులమీదికి నేను పోయినయెడల నీవు వారిని నా చేతికి అప్పగించుదువా? అని దావీదు దేవునియొద్ద విచారణచేయగా యెహోవా –పొమ్ము, నేను వారిని నీ చేతికి అప్పగించెదనని సెలవిచ్చెను.౹

11 వారు బయల్పెరాజీమునకు వచ్చినప్పుడు దావీదు అచ్చట వారిని హతముచేసి–జలప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా యెదుట నిలువకుండ నాశనము చేసెననుకొని ఆ స్థలమునకు బయల్పెరాజీముఅను పేరుపెట్టెను.౹

12 వారు అచ్చట తమ దేవతలను విడిచిపెట్టిపోగా వాటిని అగ్నిచేత కాల్చి వేయవలెనని దావీదు సెలవిచ్చెను.౹

13 ఫిలిష్తీయులు మరల ఆ లోయలోనికి దిగిరాగా

14 దావీదు తిరిగి దేవునియొద్ద విచారణచేసెను. అందుకు దేవుడు–నీవు వారిని తరుము కొనిపోక వారిని తప్పించుకొని చుట్టు తిరిగి కంబళిచెట్లకు ఎదురుగా నిలిచి

15 కంబళిచెట్ల కొనలయందు కాళ్లచప్పుడు నీకు వినబడునప్పుడు వారితో యుద్ధము కలుపుటకై బయలుదేరి వారిమీద పడుము; ఆ చప్పుడు వినబడునప్పుడు ఫిలిష్తీయుల దండును హతము చేయుటకై దేవుడు నీకు ముందుగా బయలువెళ్లియున్నాడని తెలిసికొనుమని సెలవిచ్చెను.౹

16 దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము దావీదుచేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల సైన్యమును గిబియోను మొదలుకొని గాజెరువరకు తరిమి హతముచేసిరి.౹

17 కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలీయుల ప్రదేశములందంతట ప్రసిద్ధియాయెను; యెహోవా అతని భయము అన్యజనులకందరికి కలుగజేసెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1CH/14-3ebec687d88f684d1ca3b499f0276d11.mp3?version_id=1787—

Categories
1 దినవృత్తాంతములు

1 దినవృత్తాంతములు 15

1 దావీదు తనకొరకు దావీదుపురమందు ఇండ్లు కట్టించెను; దేవుని మందసమునకు ఒక స్థలమును సిద్ధపరచి, దానిమీద గుడారమొకటి వేయించెను.౹

2 –మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవచేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకొనెనని చెప్పి–వారు తప్ప మరి ఎవరును దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను.౹

3 అంతట దావీదు తాను యెహోవా మందసమునకు సిద్ధపరచిన స్థలమునకు దాని తీసికొనివచ్చుటకై ఇశ్రాయేలీయులనందరిని యెరూషలేమునకు సమాజముగా కూర్చెను.౹

4-5 అహరోను సంతతివారిని లేవీయులైన కహాతు సంతతివారి అధిపతియగు ఊరీయేలును వాని బంధువులలో నూట ఇరువదిమందిని,౹

6 మెరారీయులలో అధిపతియైన అశాయాను వాని బంధువులలో రెండువందల ఇరువది మందిని,౹

7 గెర్షోను సంతతివారికధిపతియగు యోవేలును వాని బంధువులలో నూట ముప్పదిమందిని,౹

8 ఎలీషా పాను సంతతివారికధిపతియగు షెమయాను వాని బంధు వులలో రెండువందలమందిని,౹

9 హెబ్రోను సంతతివారి కధిపతియగు ఎలీయేలును వాని బంధువులలో ఎనుబదిమందిని

10 ఉజ్జీయేలు సంతతివారికధిపతియగు అమ్మీనా దాబును వాని బంధువులలో నూట పండ్రెండుగురిని దావీదు సమకూర్చెను.౹

11 అంతట దావీదు యాజకులైన సాదోకును అబ్యాతారును లేవీయులైన ఊరియేలు అశాయా యోవేలు షెమయా ఎలీయేలు అమ్మీనాదాబు అనువారిని పిలిపించి వారితో ఇట్లనెను.౹

12 –లేవీయుల పితరుల సంతతులకు మీరు పెద్దలై యున్నారు.౹

13 ఇంతకుముందు మీరు ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా మందసమును మోయక యుండుటచేతను, మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధినిబట్టి విచారణచేయకుండుటచేతను, ఆయన మనలో నాశనము కలుగజేసెను; కావున ఇప్పుడు మీరును మీవారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని, నేను ఆ మందసమునకు సిద్ధపరచిన స్థలమునకు దాని తేవలెను.౹

14 అప్పుడు యాజకులును లేవీయులును ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా మందసమును తెచ్చుటకై తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి.౹

15 తరువాత లేవీయులు యెహోవా సెలవిచ్చిన మాటనుబట్టి మోషే ఆజ్ఞాపించినట్లు దేవుని మందసమును దాని దండెలతో తమ భుజములమీదికి ఎత్తికొనిరి.౹

16 అంతట దావీదు–మీరు మీ బంధువులగు పాటకులను పిలిచి, స్వరమండలములు సితారాలు తాళములు లోనగు వాద్యవిశేషములతో గంభీర ధ్వనిచేయుచు, సంతోషముతో స్వరములెత్తి పాడునట్లు ఏర్పాటుచేయుడని లేవీయుల అధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను.౹

17 కావున లేవీయులు యోవేలు కుమారుడైన హేమానును, వాని బంధువులలో బెరెక్యా కుమారుడైన ఆసాపును, తమ బంధువులగు మెరారీయులలో కూషాయాహు కుమారుడైన ఏతానును,౹

18 వీరితోకూడ రెండవ వరుసగానున్న తమ బంధువులైన జెకర్యా బేను యహజీయేలు షెమీరా మోతు యెహీయేలు ఉన్నీ ఏలీయాబు బెనాయా మయ శేయా మత్తిత్యా ఎలీప్లేహు మిక్నేయాహు లనువారిని ద్వారపాలకులగు ఓబేదెదోమును యెహీయేలును పాటకు లనుగా నియమించిరి.౹

19 పాటకులైన హేమానును ఆసాపును ఏతానును పంచలోహముల తాళములు వాయించుటకు నిర్ణయింపబడిరి.౹

20 జెకర్యా అజీయేలు షెమీరామోతు యెహీయేలు ఉన్నీ ఏలీయాబు మయశేయా బెనాయా అనువారు హెచ్చు స్వరముగల స్వరమండలములను వాయించుటకు నిర్ణయింపబడిరి.౹

21 మరియు మత్తిత్యా ఎలీప్లేహు మిక్నేయాహు ఓబేదెదోము యెహీయేలు అజజ్యాహు అనువారు రాగమెత్తుటకును సితారాలు వాయించుటకును నిర్ణయింపబడిరి.౹

22 లేవీయుల కధిపతియైన కెనన్యా మందసమును మోయుటయందు గట్టివాడైనందున అతడు మోతక్రమము నేర్పుటకై నియమింపబడెను.౹

23 బెరెక్యాయును ఎల్కానాయును మందసమునకు ముందునడుచు కావలివారుగాను

24 షెబన్యా యెహోషాపాతు నెతనేలు అమాశై జెకర్యా బెనాయా ఎలీయెజెరు అను యాజకులు దేవుని మందసమునకు ముందు బూరలు ఊదువారుగాను, ఓబేదెదోమును యెహీయాయును వెనుకతట్టు కనిపెట్టువారుగాను నియమింపబడిరి.౹

25 దావీదును ఇశ్రాయేలీయుల పెద్దలును సహస్రాధిపతులును యెహోవా నిబంధనమందసమును ఓబేదెదోము ఇంటిలోనుండి తెచ్చుటకై ఉత్సాహముతో పోయిరి.౹

26 యెహోవా నిబంధనమందసమును మోయు లేవీయులకు దేవుడు సహాయముచేయగా వారు ఏడు కోడెలను ఏడు గొఱ్ఱెపొట్టేళ్లను బలులుగా అర్పించిరి.౹

27 దావీదును మందసమును మోయు లేవీయులందరును పాట కులును పాటకుల పనికి విచారణకర్తయగు కెనన్యాయును సన్నపునారతో నేయబడిన వస్త్రములు ధరించుకొని యుండిరి, దావీదును సన్నపు నారతో నేయబడిన ఏఫోదును ధరించియుండెను.౹

28 ఇశ్రాయేలీయులందరును ఆర్భా టముచేయుచు, కొమ్ములు బూరలు ఊదుచు, తాళములు కొట్టుచు, స్వరమండలములు సితారాలు వాయించుచు యెహోవా నిబంధనమందసమును తీసికొనివచ్చిరి.౹

29 యెహోవా నిబంధనమందసము దావీదుపురములోనికి రాగా సౌలు కుమార్తెయైన మీకాలు కిటికీలోనుండి చూచి రాజైన దావీదు నాట్యమాడుటయు వాయించుటయు కనుగొని తన మనస్సులో అతని హీనపరచెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1CH/15-aa174c5b2845e0ee72d4087b4792b3c7.mp3?version_id=1787—

Categories
1 దినవృత్తాంతములు

1 దినవృత్తాంతములు 16

1 ఈ ప్రకారము వారు దేవుని మందసమును తీసికొని వచ్చి, దావీదు దానికొరకు వేయించియున్న గుడారము నడుమను దాని ఉంచి, దేవుని సన్నిధిని దహనబలులను సమాధానబలులను అర్పించిరి.౹

2 దహనబలులను సమాధానబలులను దావీదు అర్పించి చాలించిన తరువాత అతడు యెహోవా నామమున జనులను దీవించి

3 పురుషులకేమి స్త్రీలకేమి ఇశ్రాయేలీయులందరిలో ఒక్కొక్కరికి ఒక రొట్టెను ఒక భక్ష్యమును ఒక ద్రాక్షపండ్ల అడను పంచి పెట్టెను.

4 మరియు అతడు యెహోవా మందసము ఎదుట సేవచేయుచు, ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును, వందించుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీయులలో కొందరిని నియమించెను.౹

5 వారిలో ఆసాపు అధిపతి, జెకర్యా అతని తరువాతివాడు, యెహీయేలు షెమీరామోతు యెహీయేలు మత్తిత్యా ఏలీయాబు బెనాయా ఓబేదెదోము యెహీయేలు అనువారు స్వరమండలములను సితారాలను వాయించుటకై నియమింపబడిరి, ఆసాపు తాళములను వాయించువాడు.౹

6 బెనాయా యహజీయేలు అను యాజకులు ఎప్పుడును దేవుని నిబంధనమందసము ఎదుట బూరలు ఊదువారు.

7 ఆ దినమందు యెహోవాను స్తుతిచేయు విచారణను ఏర్పరచి, దావీదు ఆసాపుచేతికిని వాని బంధువులచేతికిని దానిని అప్పగించెను. ఆ స్తుతి విధమేమనగా

8 యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి.

ఆయన నామమును ప్రకటనచేయుడి

ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి.

9 ఆయననుగూర్చి పాడుడి

ఆయనను కీర్తించుడి

ఆయన అద్భుత క్రియలన్నిటినిగూర్చి సంభాషణ

చేయుడి.

10 ఆయన పరిశుద్ధ నామమునుబట్టి అతిశయించుడి

యెహోవాను వెదకువారు హృదయమునందు సంతో

షించుదురు గాక.

11 యెహోవాను ఆశ్రయించుడి ఆయన బలము నాశ్రయించుడి

ఆయన సన్నిధి నిత్యము వెదకుడి.

12 ఆయన దాసులగు ఇశ్రాయేలు వంశస్థులారా

ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారలారా

13 ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను జ్ఞాపకము చేసి

కొనుడి

ఆయన సూచక క్రియలను ఆయన నోటి తీర్పులను

జ్ఞాపకము చేసికొనుడి.

14 ఆయన మన దేవుడైన యెహోవా

ఆయన తీర్పులు భూమియందంతట జరుగుచున్నవి.

15 మీ సంఖ్య కొద్దిగాను మీరు స్వల్పసంఖ్యగల జనులు

గాను

కనాను దేశములో అన్యులుగాను ఉండగా

కొలవబడిన స్వాస్థ్యముగా దాని నీకిచ్చెదనని

16 ఆయన అబ్రాహాముతో చేసిన నిబంధనను

17 ఇస్సాకుతో చేసిన ప్రమాణమును ఏర్పాటును

నిత్యము జ్ఞాపకముంచుకొనుడి.

18 వేయితరములవరకు ఆ మాట నిలుచునని ఆయన

సెలవిచ్చెను.

19 యాకోబునకు కట్టడగాను

ఇశ్రాయేలునకు నిత్యనిబంధనగాను

ఆయన ఆ మాటను స్థిరపరచియున్నాడు.

20 వారు జనమునుండి జనమునకును రాజ్యమునుండి

రాజ్యమునకును తిరుగులాడుచుండగా

21 నేను అభిషేకించినవారిని ముట్టవలదనియు

నా ప్రవక్తలకు కీడుచేయవద్దనియు సెలవిచ్చి

22 ఆయన ఎవరినైనను వారికి హింసచేయనియ్యలేదువారి నిమిత్తము రాజులను గద్దించెను.

23 సర్వభూజనులారా, యెహోవాను సన్నుతించుడి

అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి.

24 అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి

సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములను

ప్రచురించుడి.

25 యెహోవా మహాఘనత వహించినవాడు

ఆయన బహుగా స్తుతినొంద తగినవాడు

సమస్త దేవతలకంటె ఆయన పూజ్యుడు.

26 జనముల దేవతలన్నియు వట్టి విగ్రహములే

యెహోవా ఆకాశవైశాల్యమును సృజించినవాడు.

27 ఘనతాప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి

బలమును సంతోషమును ఆయనయొద్ద ఉన్నవి.

28 జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి.

మహిమాబలమును యెహోవాకు చెల్లించుడి.

29 యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు

చెల్లించుడి

నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి

పరిశుద్ధాలంకారములగు ఆభరణములను ధరించుకొని

ఆయనయెదుట సాగిలపడుడి.

30 భూజనులారా, ఆయన సన్నిధిని వణకుడి

అప్పుడు భూలోకము కదలకుండును

అప్పుడది స్థిరపరచబడును.

31 యెహోవా ఏలుచున్నాడని జనములలో చాటించుడి.

ఆకాశములు ఆనందించునుగాక

భూమి సంతోషించునుగాక

32 సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక

పొలములును వాటియందుండు సర్వమును సంతో

షించునుగాక.

యెహోవా వేంచేయుచున్నాడు.

33 భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయు

చున్నాడు

వనవృక్షములు ఆయన సన్నిధిని ఉత్సహించును.

34 యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతర

ముండును.

ఆయనను స్తుతించుడి.

35 దేవా మా రక్షకా, మమ్మును రక్షించుము

మమ్మును చేర్చుకొనుము.

36 మేము నీ పరిశుద్ధనామమునకు కృతజ్ఞతాస్తుతులు

చెల్లించునట్లు

నిన్ను స్తుతించుచు అతిశయించునట్లు

అన్యజనుల వశములోనుండి మమ్మును విడిపింపుము

అని ఆయనను బతిమాలుకొనుడి.

ఇశ్రాయేలీయులకు దేవుడైన యెహోవా

యుగములన్నిటను స్తోత్రము నొందునుగాక.

ఈలాగునవారు పాడగా జనులందరు ఆమేన్

37 అని చెప్పి యెహోవాను స్తుతించిరి. అప్పుడు మందసము ముందర నిత్యమును కావలసిన అనుదినసేవ జరుపుటకై దావీదు అచ్చట యెహోవా నిబంధనమందసముమీద ఆసాపును అతని సహోదరులను నియమించెను. ఓబేదె దోమును వారి సహోదరులైన అరువది ఎనిమిది మందిని

38 యెదూతూను కుమారుడైన ఓబేదెదోమును హోసాను ద్వారపాలకులుగా నియమించెను.౹

39 గిబియోనులోని ఉన్నతస్థలముననున్న యెహోవా గుడారముమీదను అచ్చటి బలిపీఠముమీదను యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమందు వ్రాయబడియున్న ప్రకారము

40 ఉదయాస్తమయములయందు అనుదినమున నిత్యమైన దహనబలిని ఆయనకు అర్పించుటకై అచ్చట అతడు యాజకుడైన సాదోకును అతని సహోదరులైన యాజకులను నియమించెను.౹

41 యెహోవా కృప నిత్యముండునని ఆయనను స్తుతిచేయుటకై వీరితోకూడ హేమానును యెదూతూనును పేళ్లవరుసను ఉదాహరింపబడిన మరి కొందరిని నియమించెను.౹

42 బూరలు ఊదుటకును తాళములను వాయించుటకును దేవునిగూర్చి పాడతగిన గీతములను వాద్యములతో వినిపించుటకును వీరిలోనుండు హేమానును యెదూతూనును అతడు నియమించెను. మరియు యెదూతూను కుమారులను అతడు ద్వారపాలకులుగా నియమించెను.౹

43 తరువాత జనులందరును తమతమ యిండ్లకు వెళ్లిపోయిరి; దావీదును తన యింటి వారిని దీవించుటకై వారియొద్దకు పోయెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1CH/16-e4a9c7154332f1d302318477dedc57af.mp3?version_id=1787—

Categories
1 దినవృత్తాంతములు

1 దినవృత్తాంతములు 17

1 దావీదు తన యింటనుండి ప్రవక్తయైన నాతానును పిలిపించి–నేను దేవదారు మ్రానులతో కట్టబడిన నగరులో నివాసము చేయుచున్నాను; యెహోవా నిబంధనమందసము తెరలచాటున నున్నదని చెప్పగా

2 నాతాను –దేవుడు నీకు తోడైయున్నాడు, నీ హృదయమందున్నదంతయు చేయుమని దావీదుతో అనెను.౹

3 ఆ రాత్రియందు దేవునివాక్కు నాతానునకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.౹

4 –నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనుము–యెహోవా సెలవిచ్చునదేమనగా నా నివాసమునకై యొక ఆలయముకట్టించుట నీచేతకాదు.౹

5 ఇశ్రాయేలీయులను రప్పించిన నాటనుండి నేటివరకు నేను ఒక యింటిలో నివాసము చేయక, ఒకానొక గుడారములోను ఒకానొక డేరాలోను నివాసము చేసితిని.౹

6 నేను ఇశ్రాయేలీయులందరిమధ్యను సంచరించిన కాలమంతయు–మీరు నాకొరకు దేవదారుమ్రానులతో ఆలయము కట్ట కుంటిరేమియని, నా జనమును మేపవలసినదని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులలో ఎవరితోనైనను నేనొక మాటయైన పలికియుంటినా?

7 కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగా–సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు–నీవు నా జనులైన ఇశ్రాయేలీయులమీద అధిపతివై యుండునట్లు, గొఱ్ఱెలవెంబడి తిరుగుచున్న నిన్ను గొఱ్ఱెల దొడ్డినుండి తీసికొని

8 నీవువెళ్లిన చోట్లనెల్ల నీకు తోడుగా ఉండి, నిన్ను ద్వేషించినవారిని నీ ముందర నిలువనియ్యక నిర్మూలము చేసితిని; లోకములోని ఘనులకు కలిగియున్న పేరువంటి పేరు నీకు కలుగ జేయుదును

9 మరియు నేను నా జనులైన ఇశ్రాయేలీయుల కొరకు ఒక స్థలము ఏర్పరచి వారిని నాటుదును, వారు మరి తిరుగులాడక తమ స్థానమందు కాపురముందురు, పూర్వమందు జరిగినట్లును, నా జనులైన ఇశ్రాయేలీయులమీద నేను న్యాయాధిపతులను నిర్ణయించిన కాలము మొదలుకొని జరుగుచు వచ్చినట్లును, దుష్టులు వారిని ఇక శ్రమ పెట్టకుందురు;౹

10 నీ పగవారినందరిని నేను అణచి వేసెదను. అదియుగాక–యెహోవా నీకు సంతతి కలుగజేయునని నేను నీకు తెలియజేసితిని.౹

11 నీ జీవిత దినములు తీరి నీ పితరులయొద్దకు నీవు చేరునప్పుడు నీ కుమారులవలన కలుగు నీ సంతతిని నేను స్థాపనచేసి అతని రాజ్యమును స్థిరపరచెదను.౹

12 అతడు నాకు ఒక మందిరమును కట్టించును, అతని సింహాసనమును నేను నిత్యస్థాపన చేసెదను.౹

13 నేను అతనికి తండ్రినైయుందును, అతడు నాకు కుమారుడైయుండును; నీకంటె ముందుగా ఉన్న వానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను.౹

14 నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతని స్థిరపరచెదను, అతని సింహాసనము ఎన్నటికిని స్థిరముగానుండునని అతనికి తెలియజేయుము.

15 నాతాను తనకు ప్రత్యక్షమైనదానిబట్టి యీ మాట లన్నిటిని దావీదునకు తెలియజేయగా

16 రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగు మనవి చేసెను–దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చు స్థితిలోనికి తెచ్చుటకు నేను ఎంతటివాడను? నా యిల్లు ఏమాత్రపుది?

17 దేవా, యిది నీ దృష్టికి స్వల్పవిషయమే; దేవా యెహోవా, నీవు రాబోవు బహుకాలమువరకు నీ సేవకుని సంతతినిగూర్చి సెలవిచ్చి, మనుష్యునితో మనుష్యుడు మాటలాడునట్లు దయ పాలించి నాతో మాటలాడి, నా సంతతి ఘనతజెందునని మాట యిచ్చియున్నావు.౹

18 నీ దాసుడనగు నాకు కలుగబోవు ఘనతనుగూర్చి దావీదను నీ దాసుడనైన నేను నీతో మరి ఏమని మనవిచేసెదను? నీవు నీ దాసుని ఎరుగుదువు.౹

19 యెహోవా నీ దాసుని నిమిత్తమే నీ చిత్తప్రకారము ఈ మహాఘనత కలుగునని నీవు తెలియజేసియున్నావు, అతని నిమిత్తమే నీవు ఈ గొప్ప కార్యమును చేసియున్నావు.౹

20 యెహోవా, మేము మా చెవులతో వినినదంతయు నిజము, నీవంటి వాడెవడును లేడు, నీవుతప్ప మరి ఏ దేవుడును లేడు.౹

21 నీ జనులైన ఇశ్రాయేలీయులవంటి జనము భూలోకమందు ఏది? ఐగుప్తులోనుండి నీవు విమోచించిన నీ జనులయెదుట నిలువనీయక నీవు అనేక జనములను తోలివేసినందువలన నీవు మహా భయంకరమైన పేరు తెచ్చుకొంటివి. వారు నీ స్వంత జనులగునట్లు వారిని విమోచించుటకై దేవుడవైన నీవు బయలుదేరితివి

22 నీ జనులైన ఇశ్రాయేలీయులు నిత్యము నీకు జనులగునట్లు నీ వాలాగున చేసితివి; యెహోవావైన నీవు వారికి దేవుడవై యున్నావు

23 యెహోవా, ఇప్పుడు నీ దాసునిగూర్చియు అతని సంతతిని గూర్చియు నీవు సెలవిచ్చిన మాట నిత్యము స్థిరమగును గాక.౹

24 ఇశ్రాయేలీయులదేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడైయున్నాడని నీ పేరు ఎన్నటి కిని ఘనపరచబడునట్లు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయముగా స్థిరపరచబడును గాక; మరియు నీ దాసుడైన దావీదు సంతతి నీ యెదుట స్థిరపరచబడునుగాక.౹

25 దేవా –నీకు సంతతి కలుగజేసెదనని నీ దాసునికి నీవు తెలియ జేసియున్నావు గనుక నీ సన్నిధిని విన్నపము చేయుటకు నీ దాసునికి మనోధైర్యము కలిగెను.౹

26 యెహోవా, నీవు దేవుడవైయుండి నీ దాసునికి ఈ మేలు దయచేసెదనని సెలవిచ్చియున్నావు.౹

27 ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింప ననుగ్రహించియున్నావు. యెహోవా, నీవు ఆశీర్వదించినయెడల అది ఎన్నటికిని ఆశీర్వదింపబడి యుండును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1CH/17-b47bef53bd900aad32d21dbb90e2210f.mp3?version_id=1787—

Categories
1 దినవృత్తాంతములు

1 దినవృత్తాంతములు 18

1 ఇదియైన తరువాత దావీదు ఫిలిష్తీయులను జయించి, వారిని లోపరచి, గాతు పట్టణమును దాని గ్రామములును ఫిలిష్తీయుల వశమున నుండకుండ వాటిని పట్టుకొనెను.౹

2 అతడు మోయాబీయులను జయించగా వారు దావీదునకు కప్పముకట్టు దాసులైరి.౹

3 సోబా రాజైన హదదెజెరు యూఫ్రటీసునదివరకు తన రాజ్యమును వ్యాపించుటకై బయలుదేరగా హమాతునొద్ద దావీదు అతనిని ఓడించి

4 అతని యొద్దనుండి వెయ్యి రథములను ఏడువేల గుఱ్ఱపు రౌతులను ఇరువదివేల కాల్బలమును పట్టుకొనెను. దావీదు ఆ రథములలో నూరింటికి కావలసిన గుఱ్ఱములను ఉంచుకొని కడమవాటికన్నిటికి చీలమండ నరములు తెగవేయించెను.౹

5 సోబారాజైన హదదెజెరునకు సహాయము చేయవలెనని దమస్కులోని సిరియనులురాగా దావీదు ఆ సిరియనులలో ఇరువదిరెండువేలమందిని హతముచేసెను.౹

6 తరువాత దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యమును ఉంచెను; సిరియనులు దావీదునకు కప్పముకట్టు సేవకులైరి. ఈ ప్రకారము దావీదు పోయిన చోట్లనెల్ల యెహోవా అతనికి సహాయముచేయుచు వచ్చెను.౹

7 మరియు హదదెజెరు సేవకులు పట్టుకొనియున్న బంగారు డాళ్లను దావీదు తీసికొని యెరూషలేమునకు చేర్చెను.౹

8 హదదెజెరుయొక్క పట్టణములైన టిబ్హతులోనుండియు, కూనులోనుండియు దావీదు బహువిస్తారమైన యిత్తడిని తీసికొని వచ్చెను. దానితో సొలొమోను ఇత్తడి సముద్రమును స్తంభములును ఇత్తడి వస్తువులను చేయించెను.౹

9 దావీదు సోబారాజైన హదదెజెరుయొక్క సైన్యమంతటిని ఓడించిన వర్తమానము హమాతురాజైన తోహూకు వినబడెను.౹

10 హదదెజెరునకును తోహూకును విరోధము కలిగియుండెను గనుక రాజైన దావీదు హదదెజెరుతో యుద్ధముచేసి అతని నోడించినందుకై దావీదుయొక్క క్షేమము తెలిసికొనుటకును, అతనితో శుభవచనములు పలుకుటకును, బంగారముతోను వెండితోను ఇత్తడితోను చేయబడిన సకల విధములైన పాత్రలనిచ్చి, తోహూ తన కుమారుడైన హదోరమును అతనియొద్దకు పంపెను.౹

11 ఈ వస్తువులను కూడ రాజైన దావీదు తాను ఎదో మీయులయొద్ద నుండియు, మోయాబీయులయొద్ద నుండియు, అమ్మోనీయులయొద్ద నుండియు, ఫిలిష్తీయుల యొద్దనుండియు, అమాలేకీయులయొద్ద నుండియు తీసికొనిన వెండి బంగారములతో పాటుగా యెహోవాకు ప్రతిష్ఠించెను.౹

12 మరియు సెరూయా కుమారుడైన అబీషై ఉప్పులోయలో ఎదోమీయులలో పదునెనిమిది వేలమందిని హతము చేసెను.౹

13 దావీదు ఎదోములో కావలి సైన్యమును ఉంచెను, ఎదోమీయులందరును అతనికి సేవకులైరి, దావీదు పోయిన చోట్లనెల్ల యెహోవా అతని రక్షించెను.

14 ఈ ప్రకారము దావీదు ఇశ్రాయేలీయులందరిమీదను రాజైయుండి తన జనులందరికిని నీతిన్యాయములను జరిగించెను.౹

15 సెరూయా కుమారుడైన యోవాబు సైన్యాధి పతియైయుండెను; అహీలూదు కుమారుడైన యెహోషాపాతు రాజ్యపుదస్తావేజులమీద నుండెను;౹

16 అహీటూబు కుమారుడైన సాదోకును అబ్యాతారు కుమారుడైన అబీమెలెకును యాజకులు, షవ్షా శాస్త్రి;౹

17 యెహోయాదా కుమారుడైన బెనాయా కెరేతీయులకును పెలేతీయులకును అధిపతియైయుండెను; మరియు దావీదుయొక్క కుమారులు రాజునకు సహాయులై యుండిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1CH/18-d5d48736e13956c295252c6384b9a3df.mp3?version_id=1787—

Categories
1 దినవృత్తాంతములు

1 దినవృత్తాంతములు 19

1 ఇదియైన తరువాత అమ్మోనీయుల రాజైన నాహాషు చనిపోగా అతని కుమారుడు అతనికి మారుగా రాజాయెను.౹

2 అప్పుడు దావీదు–హానూను తండ్రియైన నాహాషు నా యెడల దయ చూపించెను గనుక నేను అతనికుమారుని యెడల దయ చూపెదనని యనుకొని, అతని తండ్రి నిమిత్తము అతని పరామర్శించుటకు దూతలను పంపెను. దావీదు సేవకులు హానూనును పరామర్శించుటకై అమ్మోనీయుల దేశమునకు వచ్చినప్పుడు

3 అమ్మోనీయుల యధిపతులు హానూనుతో–నిన్ను పరామర్శించుటకై నీ యొద్దకు దావీదు దూతలను పంపుట నీ తండ్రిని ఘనపర చుటకే అని నీవనుకొనుచున్నావా? దేశమును తరచి చూచి దాని నాశనము చేయుటకేగదా అతని సేవకులు నీయొద్దకు వచ్చియున్నారు అని మనవిచేయగా

4 హానూను దావీదు సేవకులను పట్టుకొని, వారిని గొరిగించి, వారి వస్త్రములు పిరుదులు దిగకుండునట్లు నడిమికి కత్తిరించి వారిని పంపివేసెను.౹

5 ఆ మనుష్యులు ఇంటికి వచ్చుచుండగా కొందరువచ్చి వారిని గూర్చిన వార్త దావీదునకు తెలియజేసిరి; వారు బహు లజ్జాక్రాంతులై యుండిరి గనుక వారికి ఎదురుగా మనుష్యులను పంపి–మీ గడ్డములు పెరుగుదనుక మీరు యెరికోలో ఉండి తరువాత రండని రాజు వారికి వర్తమాన మంపెను.౹

6 అమ్మోనీయులు దావీదునకు తమయందు అసహ్యము పుట్టించితిమని తెలిసికొనినప్పుడు హానూనును అమ్మోనీయులును అరామ్నహరయీము నుండియు, సిరియా మయకానుండియు సోబానుండియు రథములను గుఱ్ఱపురౌతులను రెండువేల మణుగుల వెండి ఇచ్చి బాడిగెకు కుదుర్చుకొనిరి.౹

7 ముప్పది రెండువేల రథములతో వచ్చునట్లు జీతమిచ్చి మయకారాజును అతని జనులను కుదుర్చుకొనిరి; వీరు వచ్చి మేదెబా ముందరితట్టున దిగిరి, అమ్మోనీయులు తమతమ పట్టణములలోనుండి కూడుకొని యుద్ధముచేయుటకు వచ్చిరి.౹

8 దావీదు ఈ సంగతి విని యోవాబును సైన్యములోని పరాక్రమశాలుల నందరిని పంపెను.౹

9 అమ్మోనీయులు బయలుదేరి పట్టణపు గవిని యొద్ద యుద్ధపంక్తులు తీర్చిరి, వచ్చిన రాజులు ప్రత్యేకముగా బయట భూమిలో యుద్ధమునకు సిద్ధముగా నిలిచిరి.౹

10 తాను రెండు సైన్యములమధ్యను చిక్కుబడి యుండుట చూచి, యోవాబు ఇశ్రాయేలీయులలోని శ్రేష్ఠులలో పరాక్రమశాలులను ఏర్పరచుకొని, సిరియనులకు ఎదురుగా వారిని పంక్తులు తీర్చి,౹

11 కడమ జనులను అమ్మోనీయులకు ఎదురుగా వ్యూహపరచి, తన సహోదరుడైన అబీషైకి అప్పగించి యిట్లనెను

12 సిరియనుల బలమునకు నేను నిలువలేకపోయినయెడల నీవు నాకు సహాయము చేయవలెను, అమ్మోనీయుల బలమునకు నీవు నిలువలేకపోయినయెడల నేను నీకు సహాయము చేయుదును.౹

13 ధైర్యము కలిగి యుండుము, మనము మన జనుల నిమిత్తమును మన దేవుని పట్టణముల నిమిత్తమును ధీరత్వము చూపుదము; యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాని చేయునుగాక.౹

14 ఆప్రకారము యోవాబును అతనితోకూడ నున్న జనమును సిరియనులతో యుద్ధము కలుపుటకై చేరపోగా వారు నిలువలేక అతని యెదుటనుండి తిరిగి పారిపోయిరి.౹

15 సిరియనులు తిరిగి పారిపోవుట అమ్మోనీయులు చూచినప్పుడు వారును అతని సహోదరుడైన అబీషైముందర నిలువలేక తిరిగి పారిపోయి పట్టణములో చొచ్చిరి, యోవాబు మరలి యెరూషలేమునకు వచ్చెను.౹

16 తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోతిమని సిరియనులు తెలిసికొనినప్పుడు వారు దూతలను పంపి, యేటి ఆవలి సిరియనులను పిలిపించుకొనిరి, హదదెజెరుయొక్క సైన్యాధిపతియైన షోపకు వారికి నాయకుడాయెను.౹

17 దావీదు ఆ సంగతి తెలిసికొని ఇశ్రాయేలీయులనందరిని సమకూర్చి యొర్దాను దాటి వారికి ఎదురుపడి వారియెదుట సైన్యములను వ్యూహపరచెను, దావీదు సిరియనులకు ఎదురుగా సైన్యములను పంక్తులు తీర్చినప్పుడు వారు అతనితో యుద్ధము చేసిరి.౹

18 అయితే సిరియనులు ఇశ్రాయేలీయుల యెదుట నిలువక తిరిగి పారిపోయిరి; దావీదు సిరియనులలో ఏడువేల రథికులను నలుబది వేలకాల్బలమును హతముచేసి సైన్యాధిపతియైన షోపకును చంపి వేసెను.౹

19 తాము ఇశ్రాయేలీయుల చేతిలో ఓడిపోతిమని హదదెజెరుయొక్క సేవకులు తెలిసికొనినప్పుడు వారు దావీదుతో సమాధానపడి అతనికి సేవకులైరి. అంతటి నుండి సిరియనులు అమ్మోనీయులకు సహాయము చేయుటకు మనస్సులేక యుండిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1CH/19-8299d41716e82e7366fbe9572e300869.mp3?version_id=1787—

Categories
1 దినవృత్తాంతములు

1 దినవృత్తాంతములు 20

1 మరుసటియేట రాజులు యుద్ధమునకు బయలుదేరు కాలమున యోవాబు సైన్యములో శూరులైన వారిని సమకూర్చి, అమ్మోనీయుల దేశమును పాడుచేసివచ్చి రబ్బాకు ముట్టడివేసెను; దావీదు యెరూషలేములోనేయుండగా యోవాబు రబ్బాను ఓడించి జనులను హతముచేసెను.౹

2 దావీదు వచ్చి వారి రాజు తలమీదనున్న కిరీటమును తీసి కొనెను; దాని యెత్తు రెండు మణుగుల బంగారము, అందులో రత్నములు చెక్కియుండెను, దానిని దావీదు ధరించెను. మరియు అతడు బహువిస్తారమైన కొల్లసొమ్ము ఆ పట్టణములోనుండి తీసికొనిపోయెను.౹

3 దానియందున్న జనులను అతడు వెలుపలికి కొనిపోయి, వారిలో కొందరిని రంపములతో కోయించెను, కొందరిని ఇనుపదంతెలతో చీరించెను; కొందరిని గొడ్డళ్లతో నరికించెను. ఈ ప్రకారము అతడు అమ్మోనీయుల పట్టణములన్నిటికిని చేసెను, అంతట దావీదును జనులందరును యెరూషలేమునకు తిరిగివచ్చిరి.

4 అటుతరువాత గెజెరులోనున్న ఫిలిష్తీయులతో యుద్ధము కలుగగా హుషాతీయుడైన సిబ్బెకై రెఫాయీయుల సంతతివాడగు సిప్పయి అను నొకని హతము చేసెను, అందువలన ఫిలిష్తీయులు లొంగుబాటునకు తేబడిరి.౹

5 మరల ఫిలిష్తీయులతో యుద్ధము జరుగగా యాయీరు కుమారుడైన ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుడగు లహ్మీని చంపెను. వాని యీటె నేతగాని దోనెయంత పెద్దది.౹

6 మరల గాతులో యుద్ధము జరిగెను; మంచి యెత్తరియగు ఒకడు అచ్చట ఉండెను, వానికి చేతిచేతికి కాలికాలికి ఆరేసి చొప్పున ఇరువది నాలుగు వ్రేళ్లుండెను, వాడు రెఫాయీయుల సంతతివాడు.౹

7 వాడు ఇశ్రాయేలీయులను దూషింపగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను వాని చంపెను.౹

8 గాతులోనున్న రెఫాయీయుల సంతతివారగు వీరు దావీదుచేతను అతని సేవకులచేతను హతులైరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1CH/20-e320eca38c9e4d8ca1763e24660da8c5.mp3?version_id=1787—

Categories
1 దినవృత్తాంతములు

1 దినవృత్తాంతములు 21

1 తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి, ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా

2 దావీదు యోవాబునకును జనులయొక్క అధిపతులకును–మీరు వెళ్లి బెయేర్షెబా మొదలుకొని దానువరకుఉండు ఇశ్రాయేలీయులను ఎంచి, వారి సంఖ్య నాకు తెలియుటకై నాయొద్దకు దాని తీసికొని రండని ఆజ్ఞ ఇచ్చెను.౹

3 అందుకు యోవాబు–రాజా నా యేలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్నవారికంటె నూరంతలు ఎక్కువమందిని చేయునుగాక; వారందరు నా యేలినవాని దాసులుకారా? నా యేలినవానికి ఈ విచారణ యేల? ఇది జరుగవలసిన హేతువేమి? జరిగినయెడల ఇశ్రాయేలీయులకు శిక్షకలుగును అని మనవిచేసెను.౹

4 అయినను యోవాబు మాట చెల్లక రాజు మాటయే చెల్లెను గనుక యోవాబు ఇశ్రాయేలు దేశమందంతట సంచరించితిరిగి యెరూషలేమునకు వచ్చి జనుల సంఖ్య వెరసి దావీదునకు అప్పగించెను.౹

5 ఇశ్రాయేలీయులందరిలో కత్తిదూయువారు పదకొండు లక్షలమందియు యూదా వారిలో కత్తిదూయువారు నాలుగు లక్షల డెబ్బదివేలమందియు సంఖ్యకు వచ్చిరి.౹

6 రాజు మాట యోవాబునకు అసహ్యముగా ఉండెను గనుక అతడు లేవి బెన్యామీను గోత్రసంబంధులను ఆ సంఖ్యలో చేర్చలేదు.౹

7 ఈ కార్యము దేవునిదృష్టికి ప్రతికూలమగుటచేత ఆయన ఇశ్రాయేలీయులను బాధపెట్టెను.౹

8 దావీదు–నేను ఈ కార్యముచేసి అధిక పాపము తెచ్చుకొంటిని, నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించితిని, ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించుమని దేవునితో మొఱ్ఱపెట్టగా

9 యెహోవా దావీదునకు దర్శకుడగు గాదుతో ఈలాగు సెలవిచ్చెను–నీవు వెళ్లి దావీదుతో ఇట్లనుము.౹

10 – యెహోవా సెలవిచ్చునదేమనగా–మూడు విషయములు నేను నీయెదుట నుంచుచున్నాను, వాటిలో ఒకదానిని నీవు కోరుకొనినయెడల దాని నీకు చేయుదును.౹

11 కావున గాదు దావీదు నొద్దకు వచ్చి యిట్లనెను

12 –మూడేండ్ల పాటు కరవు కలుగుట, మూడు నెలలపాటు నీ శత్రువులు కత్తిదూసి నిన్ను తరుమగా నీవు వారియెదుట నిలువలేక నశించిపోవుట, మూడుదినములపాటు దేశమందు యెహోవా కత్తి, అనగా తెగులు నిలుచుటచేత యెహోవాదూత ఇశ్రాయేలీయుల దేశమందంతట నాశనము కలుగ జేయుట, అను వీటిలో ఒకదానిని నీవు కోరుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు; కావున నన్ను పంపిన వానికి నేను ఏమి ప్రత్యుత్తరమియ్యవలెనో దాని యోచించుము.౹

13 అందుకు దావీదు–నేను మిక్కిలి యిరుకులో చిక్కియున్నాను; యెహోవా మహా కృపగలవాడు, నేను మనుష్యులచేతిలో పడక ఆయన చేతిలోనే పడుదును గాక అని గాదుతో అనెను.౹

14 కావున యెహోవా ఇశ్రాయేలీయులమీదికి తెగులు పంపగా ఇశ్రాయేలీయులలో డెబ్బదివేలమంది చచ్చిరి.౹

15 యెరూషలేమును నాశనము చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను; అతడు నాశనము చేయబోవుచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపమొంది నాశనముచేయు దూతతో–చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపుమని సెలవియ్యగా ఆ దూత యెబూసీయుడైన ఒర్నాను కళ్లము నొద్ద నిలిచెను.౹

16 దావీదు కన్నులెత్తి చూడగా, భూమ్యాకాశములమధ్యను నిలుచుచు, వరదీసిన కత్తి చేతపట్టుకొని దానిని యెరూషలేముమీద చాపిన యెహోవాదూత కనబడెను. అప్పుడు దావీదును పెద్దలును గోనె పట్టలు కప్పుకొనినవారై సాష్టాంగపడగా

17 దావీదు– జనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చినవాడను నేనేగదా? పాపముచేసి చెడుతనము జరిగించినవాడను నేనేగదా? గొఱ్ఱెలవంటివారగు వీరేమి చేసిరి? నా దేవుడవైన యెహోవా, బాధపెట్టు నీ చెయ్యి నీ జనులమీద నుండకుండ నామీదను నా తండ్రి యింటివారిమీదను ఉండ నిమ్మని దేవునితో మనవిచేసెను.౹

18 యెబూసీయుడైన ఒర్నాను కళ్లమునందు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దావీదు అచ్చటికి వెళ్లవలెనని దావీదునకు ఆజ్ఞ నిమ్మని యెహోవాదూత గాదునకు సెలవియ్యగా

19 యెహోవా నామమున గాదు పలికిన మాట ప్రకారము దావీదు వెళ్లెను.౹

20 ఒర్నాను అప్పుడు గోధుమలను నూర్చు చుండెను; అతడు వెనుకకు తిరిగి దూతను చూచినప్పుడు, అతడును అతనితోకూడనున్న అతని నలుగురు కుమారులును దాగుకొనిరి.౹

21 దావీదు ఒర్నానునొద్దకు వచ్చినప్పుడు ఒర్నాను దావీదును చూచి, కళ్లములోనుండి వెలుపలికి వచ్చి, తల నేలమట్టునకు వంచి దావీదుకు నమస్కారము చేసెను.౹

22 –ఈ తెగులు జనులను విడిచిపోవునట్లుగా ఈ కళ్లపు ప్రదేశమందు నేను యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దాని నాకు తగిన క్రయమునకిమ్మని దావీదు ఒర్నానుతో అనగా

23 ఒర్నాను–రాజైన నా యేలినవాడు దాని తీసికొని తన దృష్టికి అనుకూలమైనట్టు చేయును గాక; ఇదిగో దహనబలులకు ఎద్దులు కట్టెలకై నురిపిడి సామగ్రి నైవేద్యమునకు గోధుమ పిండి; ఇదియంతయు నేనిచ్చెదనని దావీదుతో అనెను.౹

24 రాజైన దావీదు–అట్లు కాదు, నేను నీ సొత్తును ఊరక తీసికొని యెహోవాకు దహనబలులను అర్పించను, న్యాయమైన క్రయధనమిచ్చి దాని తీసికొందునని ఒర్నానుతో చెప్పి

25 ఆ భూమికి ఆరువందల తులముల బంగారమును అతని కిచ్చెను.౹

26 పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠమును కట్టించి దహనబలులను సమాధానబలులను అర్పించి యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆకాశములోనుండి దహనబలిపీఠము మీదికి అగ్నివలన అతనికి ప్రత్యుత్తరమిచ్చెను.౹

27 యెహోవాదూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని మరల వరలో వేసెను.

28 యెబూసీయుడైన ఒర్నాను కళ్లమందు యెహోవా తనకు ప్రత్యుత్తరమిచ్చెనని దావీదు తెలిసికొని అచ్చటనే బలి అర్పించెను

29 మోషే అరణ్యమందు చేయించిన యెహోవా నివాసపు గుడారమును దహనబలిపీఠమును ఆ కాలమందు గిబియోనులోని ఉన్నత స్థలమందుండెను.౹

30 దావీదు యెహోవాదూత పట్టుకొనిన కత్తికి భయపడిన వాడై దేవునియొద్ద విచారించుటకు ఆ స్థలమునకు వెళ్లలేకుండెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1CH/21-44db944602dcf2e29a258a271537b8f9.mp3?version_id=1787—

Categories
1 దినవృత్తాంతములు

1 దినవృత్తాంతములు 22

1 మరియు–దేవుడైన యెహోవా నివాసస్థలము ఇదేయని ఇశ్రాయేలీయులర్పించు దహనబలులకు పీఠము ఇదే యని దావీదు సెలవిచ్చెను.౹

2 తరువాత దావీదు ఇశ్రాయేలీయుల దేశమందుండు అన్యజాతి వారిని సమకూర్చుడని ఆజ్ఞ ఇచ్చి, దేవుని మందిరమును కట్టించుటకై రాళ్లు చెక్కువారిని నియమించెను.౹

3 వాకిళ్ల తలుపులకు కావలసిన మేకులకేమి చీలలకేమి విస్తారమైన యినుమును తూచ శక్యము కానంత విస్తారమైన ఇత్తడిని

4 ఎంచనలవికానన్ని దేవదారు మ్రానులను దావీదు సంపాదించెను; సీదోనీయులును తూరీయులును దావీదునకు విస్తారమైన దేవదారు మ్రానులను తీసికొని వచ్చుచుండిరి.౹

5 –నా కుమారుడైన సొలొమోను పిన్నవయస్సుగల లేతవాడు; యెహోవాకు కట్టబోవు మందిరము దాని కీర్తినిబట్టియు అందమునుబట్టియు సకల దేశములలో ప్రసిద్ధిచెందునట్లుగా అది చాలా ఘనమైనదై యుండవలెను; కాగా దానికి కావలసిన సాధన రాశిని సిద్ధపరచెదనని చెప్పి, దావీదు తన మరణమునకు ముందు విస్తారముగా వస్తువులను సమకూర్చి యుంచెను.

6 తరువాత అతడు తన కుమారుడైన సొలొమోనును పిలిపించి–ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాకు ఒక మందిరమును కట్టవలసినదని అతనికి ఆజ్ఞ ఇచ్చెను.౹

7 మరియు దావీదు సొలొమోనుతో ఇట్లనెను–నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవానామ ఘనతకొరకు ఒక మందిరమును కట్టించవలెనని నా హృదయమందు నిశ్చయము చేసికొనియుండగా

8 యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను– నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు, నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు, నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తము నేలమీదికి ఓడ్చితివి.౹

9 నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా నుండును; చుట్టుఉండు అతని శత్రువులనందరిని నేను తోలివేసి అతనికి సమాధానము కలుగ జేతును; అందువలన అతనికి సొలొమోను అను పేరు పెట్టబడును; అతని దినములలో ఇశ్రాయేలీయులకు సమాధానమును విశ్రాంతియు దయచేయుదును.౹

10 అతడు నా నామమునకు ఒక మందిరమును కట్టించును, అతడు నాకు కుమారుడైయుండును, నేనతనికి తండ్రినై యుందును, ఇశ్రాయేలీయులమీద అతని రాజ్యసింహాసనమును నిత్యము స్థిరపరచుదును.౹

11 నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక; నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్నుగూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరమును కట్టించుదువుగాక.౹

12 నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించునట్లుగా యెహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇశ్రాయేలీయులమీద నీకు అధికారము దయచేయును గాక.౹

13 యెహోవా ఇశ్రాయేలీయులనుగూర్చి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్తపడినయెడల నీవు వృద్ధిపొందుదువు; ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము; భయపడకుము దిగులుపడకుము.౹

14 ఇదిగో నేను నా కష్టిస్థతిలోనే ప్రయాసపడి యెహోవా మందిరముకొరకు రెండులక్షల మణుగుల బంగారమును పదికోట్ల మణుగుల వెండిని తూచ శక్యముకానంత విస్తారమైన యిత్తడిని యినుమును సమకూర్చియున్నాను; మ్రానులను రాళ్లను కూర్చియుంచితిని; నీవు ఇంకను సంపా దించుదువుగాక.౹

15 మరియు పనిచేయతగిన విస్తారమైన శిల్పకారులును కాసెపనివారును వడ్రవారును ఏవిధమైన పనినైనను నెరవేర్చగల మంచి పనివారును నీయొద్ద ఉన్నారు.౹

16 లెక్కింపలేనంత బంగారమును వెండియు ఇత్తడియు ఇనుమును నీకు ఉన్నవి; కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక.

17 మరియు తన కుమారుడైన సొలొమోనునకు సహాయము చేయవలెనని దావీదు ఇశ్రాయేలీయుల యధిపతులకందరికిని ఆజ్ఞాపించెను.౹

18 ఎట్లనగా–మీ దేవుడైన యెహోవా మీతోకూడ ఉన్నాడు గదా? చుట్టునున్న వారివలన తొందరలేకుండ ఆయన మీకు నెమ్మది యిచ్చియున్నాడుగదా? దేశనివాసులను ఆయన నాకు వశపరచియున్నాడు, యెహోవా భయమువలనను ఆయన జనుల భయమువలనను దేశము లోపరచబడియున్నది.౹

19 కావున హృదయపూర్వకముగా మీ దేవుడైన యెహోవాను వెదకుటకు మీ మనస్సులు దృఢపరచుకొని, ఆయన నిబంధన మందసమును దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకరణములను ఆయన నామముకొరకు కట్టబడు ఆ మందిరములోనికి చేర్చుటకై మీరు పూనుకొని దేవుడైన యెహోవా పరిశుద్ధ స్థలమును కట్టుడి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1CH/22-54c9c781ee01a1ae24b3fa3f882fb65c.mp3?version_id=1787—