Categories
1 సమూయేలు

1 సమూయేలు 25

1 సమూయేలు మృతినొందగా ఇశ్రాయేలీయులందరు. కూడుకొని అతడు చనిపోయెనని ప్రలాపించుచు, రామాలోనున్న అతని ఇంటి నివేశనములో అతని సమాధిచేసిన తరువాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్లెను.

2 కర్మెలులోని మాయోనునందు ఆస్తిగలవాడొకడు కాపురముండెను. అతడు బహు భాగ్యవంతుడు, అతనికి మూడువేల గొఱ్ఱెలును వెయ్యి మేకలును ఉండెను. అతడు–కర్మెలులో తన గొఱ్ఱెల బొచ్చు కత్తిరించుటకై పోయి యుండెను.౹

3 అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధిగలదై రూపసియైయుండెను. అయితే చర్యలనుబట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై యుండెను. అతడు కాలేబు సంతతివాడు.౹

4 నాబాలు గొఱ్ఱెలబొచ్చు కత్తెర వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని

5 తన పనివారిలో పదిమందిని పిలిచి వారితో ఇట్లనెను– మీరు కర్మెలునకు నాబాలు నొద్దకు పోయి, నా పేరు చెప్పి కుశల ప్రశ్నలడిగి

6 ఆ భాగ్యవంతునితో–నీకును నీ యింటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక అని పలికి యీ వర్తమానము తెలియజెప్పవలెను.౹

7 –నీ యొద్ద గొఱ్ఱెలబొచ్చు కత్తిరించు వారున్నారను సంగతి నాకు వినబడెను; నీ గొఱ్ఱెకాపరులు మా దగ్గరనుండగా మేము వారికి ఏ కీడునుచేసి యుండలేదు; వారు కర్మెలులో నున్నంతకాలము వారేదియు పోగొట్టుకొనలేదు;౹

8 నీ పనివారిని నీవు అడిగినయెడల వారాలాగు చెప్పుదురు. కాబట్టి నా పనివారికి దయ చూపుము. శుభదినమున మేము వచ్చితిమి గదా; నీ కిష్టము వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము.౹

9 దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటిని నాబాలునకు తెలియజేసి కూర్చుండగా

10 నాబాలు– దావీదు ఎవడు? యెష్షయి కుమారుడెవడు? తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకు లున్నారు.౹

11 నేను సంపాదించుకొనిన అన్నపానములను, నా గొఱ్ఱెలబొచ్చు కత్తిరించువారికొరకు నేను వధించిన పశుమాంసమును తీసి, నేను బొత్తిగా ఎరుగని వారి కిత్తునా? అని దావీదు దాసులతో చెప్పగా

12 దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవపట్టుకొనిపోయి అతనికి ఈ మాటలన్నియు తెలియజేసిరి.౹

13 అంతట దావీదు వారితో–మీరందరు మీ కత్తులను ధరించుకొనుడనగా వారు కత్తులు ధరించుకొనిరి, దావీదు కూడను కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనుక దాదాపు నాలుగు వందలమంది బయలుదేరగా రెండువందలమంది సామాను దగ్గర నిలిచిరి.౹

14 పనివాడు ఒకడు నాబాలు భార్యయైన అబీగయీలుతో ఇట్లనెను–అమ్మా, దావీదు అరణ్యములోనుండి, మన యజమానుని కుశల ప్రశ్నలడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాటలాడెను.౹

15 అయితే ఆ మనుష్యులు మాకెంతో ఉపకారము చేసియున్నారు మేము పొలములో వారిమధ్యను సంచరించుచున్నంత సేపు అపాయముగాని నష్టముగాని మాకు సంభవింపనేలేదు.౹

16 మేము గొఱ్ఱెలను కాయుచున్నంతసేపు వారు రాత్రింబగళ్లు మాచుట్టు ప్రాకారముగా ఉండిరి.౹

17 అయితే మా యజమానునికిని అతని ఇంటి వారికందరికిని వారు కీడుచేయ నిశ్చయించియున్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసినదానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికిమాలినవాడు, ఎవనిని తనతో మాటలాడ నీయడు అనెను.౹

18 అందుకు అబీగయీలు నాబాలుతో ఏమియు చెప్పక త్వరపడి రెండువందల రొట్టెలను, రెండు ద్రాక్షారసపు తిత్తులను, వండిన అయిదు గొఱ్ఱెల మాంసమును, అయిదు మానికల వేచిన ధాన్యమును, నూరు ద్రాక్షగెలలను, రెండువందల అంజూరపు అడలను గార్ద భములమీద వేయించి

19 –మీరు నాకంటె ముందుగా పోవుడి, నేను మీ వెనుకనుండి వచ్చెదనని తన పనివారికి ఆజ్ఞనిచ్చి

20 గార్దభముమీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా, దావీదును అతని జనులును ఆమెకు ఎదురుపడిరి, ఆమె వారిని కలిసికొనెను.౹

21 అంతకుమునుపు దావీదు–నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏదియు పోకుండ ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయుచు వచ్చితిని; ఉపకారమునకు నాకు అపకారము చేసియున్నాడే

22 అని అనుకొని అతనికున్న వారిలో ఒక మగపిల్లవానినైనను తెల్లవారునప్పటికి నేనుండనియ్యను; లేదా దేవుడు మరి గొప్పఅపాయము దావీదు శత్రువులకు కలుగ జేయునుగాక అని ప్రమాణము చేసియుండెను.౹

23 అబీగయీలు దావీదును కనుగొని, గార్దభముమీదనుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారముచేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను

24 –నా యేలినవాడా, యీ దోషము నాదని యెంచుము; నీ దాసురాలనైన నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాల నైన నేను చెప్పుమాటలను ఆలకించుము;౹

25 నా యేలినవాడా, దుష్టుడైన యీ నాబాలును లక్ష్యపెట్టవద్దు, అతని పేరు అతని గుణములను సూచించుచున్నది, అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము; నా యేలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు.౹

26 నా యేలినవాడా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండ యెహోవా నిన్ను ఆపియున్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించెనన్నమాట నిజమని యెహోవా జీవముతోడు నీ జీవముతోడు అని ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువులును నా యేలినవాడవైన నీకు కీడుచేయనుద్దేశించు వారును నాబాలువలె ఉందురు గాక.౹

27 అయితే నేను నా యేలినవాడవగు నీయొద్దకు తెచ్చిన యీ కానుకను నా యేలినవాడవగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి

28 నీ దాసురాలనైన నా తప్పు క్షమించుము. నా యేలినవాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా యేలినవాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతి నిచ్చును. నీవు బ్రదుకు దినములన్నిటను నీకు అపాయము కలుగకుండును.౹

29 నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైన ఉద్దేశించినయెడల, నా యేలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవాయొద్దనున్న జీవపుమూటలో కట్టబడును; ఒకడు వడిసెలతో రాయి విసరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసరివేయును.౹

30 యెహోవా నా యేలినవాడవగు నిన్నుగూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలీయులమీద అధిపతినిగా నిర్ణయించిన తరువాత

31 నా యేలినవాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకేగాని, నా యేలినవాడవగు నీవు పగతీర్చుకొనినందుకేగాని, మనోవిచారమైనను దుఃఖమైనను నా యేలినవాడవగు నీకు ఎంత మాత్రమును కలుగక పోవునుగాక, యెహోవా నా యేలినవాడవగు నీకు మేలు చేసిన తరువాత నీవు నీ దాసురాలనగునన్ను జ్ఞాపకము చేసికొనుము అనెను.౹

32 అందుకు దావీదు–నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక.౹

33 నేను పగ తీర్చుకొనకుండను ఈ దినమున ప్రాణము తీయకుండను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువు గాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక.౹

34 నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనక పోయినయెడల, నీకు హానిచేయకుండ నన్ను ఆటంకపరచిన ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా జీవముతోడు తెల్లవారు లోగా నాబాలునకు మగవాడొకడును విడువబడడన్న మాట నిశ్చయము అని చెప్పి

35 తనయొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమెచేత తీసికొని–నీ మాటలు నేను ఆలకించి నీ మనవి నంగీకరించితిని, సమాధానముగా నీ యింటికి పొమ్మని ఆమెతో చెప్పెను.౹

36 అబీగయీలు తిరిగి నాబాలునొద్దకు రాగా, రాజులు విందుచేసినట్లు అతడు ఇంటిలో విందుచేసి, త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగానుండెను గనుక తెల్లవారువరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమియు చెప్పక ఊరకుండెను.౹

37 ఉదయమున నాబాలునకు మత్తు తగ్గియున్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా భయముచేత అతని గుండెపగిలెను, అతడు రాతివలె బిగిసికొనిపోయెను.౹

38 పది దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను.౹

39 నాబాలు చనిపోయెనని దావీదు విని–యెహోవా నాబాలు చేసిన కీడును అతని తలమీదికి రప్పించెను గనుక తన దాసుడనైన నేను కీడుచేయకుండ నన్ను కాపాడి, నాబాలువలన నేను పొందిన అవమానమును తీర్చిన యెహోవాకు స్తోత్రము కలుగును గాక అనెను. తరువాత దావీదు అబీగయీలును పెండ్లి చేసికొనవలెనని ఆమెతో మాటలాడ తగినవారిని పంపెను.౹

40 దావీదు సేవకులు కర్మెలులోనున్న అబీగయీలు నొద్దకు వచ్చి–దావీదు మమ్మును పిలిచి నిన్ను పెండ్లిచేసికొనుటకై తోడుకొనిరండని పంపెననగా

41 ఆమె లేచి సాగిలపడి– నా యేలినవాని చిత్తము; నా యేలినవాని సేవకుల కాళ్లు కడుగుటకు నా యేలినవాని దాసురాలనగు నేను సిద్ధముగా నున్నానని చెప్పి

42 త్వరగా లేచి గార్దభముమీద ఎక్కితన వెనుక నడచుచున్న అయిదుగురు పనికత్తెలతోకూడ దావీదు పంపిన దూతలవెంబడి రాగా దావీదు ఆమెను పెండ్లి చేసికొనెను.౹

43 మరియు దావీదు యెజ్రెయేలు స్త్రీయైన అహీనోయమును పెండ్లి చేసికొనియుండెను; వారిద్దరు అతనికి భార్యలుగా ఉండిరి.౹

44 సౌలు తన కుమార్తెయైన మీకాలు అను దావీదు భార్యను పల్తీయేలను గల్లీమువాడైన లాయీషు కుమారునికి ఇచ్చి యుండెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1SA/25-4051da3366737ccc5dacb1f742927d81.mp3?version_id=1787—

Categories
1 సమూయేలు

1 సమూయేలు 26

1 అంతట జీఫీయులు గిబియాలో సౌలునొద్దకు వచ్చి. –దావీదు యెషీమోను ఎదుట హకీలామన్యములో దాగి యున్నాడని తెలియజేయగా

2 సౌలు లేచి ఇశ్రాయేలీయులలో ఏర్పరచబడిన మూడువేలమందిని తీసికొని జీఫు అరణ్యములో దావీదును వెదకుటకు జీఫు అరణ్యమునకు పోయెను.౹

3 సౌలు యెషీమోను ఎదుటనున్న హకీలామన్యమందు త్రోవ ప్రక్కను దిగగా, దావీదు అరణ్యములో నివసించుచుండి తన్ను పట్టుకొనవలెనని సౌలు అరణ్యమునకు వచ్చెనని విని

4 వేగులవారిని పంపి –నిశ్చయముగా సౌలు వచ్చెనని తెలిసికొనెను.౹

5 తరువాత దావీదు లేచి సౌలు దండు దిగిన స్థలము దగ్గరకు వచ్చి, సౌలును సౌలునకు సైన్యాధిపతియగు నేరు కుమారుడైన అబ్నేరును పరుండియుండగా వారున్నస్థలము కను గొనెను. సౌలు దండు క్రొత్తళములో పండుకొనగా దండువారు అతనిచుట్టు నుండిరి.౹

6 అప్పుడు దావీదు–పాళెములోనికి సౌలు దగ్గరకు నాతోకూడ ఎవరు వత్తురని హిత్తీయుడైన అహీమెలెకును సెరూయా కుమారుడును యోవాబునకు సహోదరుడునగు అబీషైని నడుగగా– నీతోకూడ నేనే వత్తునని అబీషై యనెను.౹

7 దావీదును అబీషైయును రాత్రివేళ ఆ జనుల దగ్గరకు పోగా సౌలు దండు క్రొత్తళములో పండుకొని నిద్ర బోవుచుండెను, అతని యీటె అతని తలగడ దగ్గర నేలను నాటియుండెను, అబ్నేరును జనులును అతని చుట్టు పండుకొనియుండిరి.౹

8 అప్పుడు అబీషై దావీదుతో–దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకప్పగించెను; కాబట్టి నీ చిత్తమైతే ఆ యీటెతో ఒక్కపోటు పొడిచి, నేనతనిని భూమికి నాటివేతును, ఒక దెబ్బతోనే పరిష్కారము చేతుననగా

9 దావీదు–నీవతని చంపకూడదు, యెహోవాచేత అభిషేకము నొందినవానిని చంపి నిర్దోషియగుట యెవనికి సాధ్యము?

10 యెహోవా జీవముతోడు యెహోవాయే అతని మొత్తును, అతడు అపాయమువలన చచ్చును, లేదా యుద్ధమునకు పోయి నశించును;౹

11 యెహోవాచేత అభిషేకము నొందిన వానిని నేను చంపను; ఆలాగున నేను చేయకుండ యెహోవా నన్ను ఆపునుగాక. అయితే అతని తలగడ దగ్గరనున్న యీటెను నీళ్ల బుడ్డిని తీసికొని మనము వెళ్లిపోదము రమ్మని అబీషైతో చెప్పి

12 సౌలు తలగడదగ్గర నున్న యీటెను నీళ్లబుడ్డిని తీసికొని వారిద్దరు వెళ్లిపోయిరి. యెహోవాచేత వారికందరికి గాఢనిద్ర కలుగగా వారిలో ఎవడును నిద్ర మేలుకొనలేదు, ఎవడును వచ్చిన వారిని చూడలేదు, జరిగినదాని గుర్తు పెట్టినవాడొకడును లేడు.౹

13 తరువాత దావీదు అవతలకుపోయి దూరముగా నున్న కొండమీద నిలిచి, ఉభయులమధ్యను చాలా యెడముండగా

14 జనులును నేరు కుమారుడైన అబ్నేరును వినునట్లు–అబ్నేరూ, నీవు మాటలాడవా? అని కేక వేయగా అబ్నేరు కేకలువేసి–రాజును నిద్రలేపు నీవెవడ వని అడిగెను.౹

15 అందుకు దావీదు–నీవు మగవాడవు కావా? ఇశ్రాయేలీయులలో నీ వంటివాడెవడు? నీకు యజమానుడగు రాజునకు నీ వెందుకు కాపు కాయక పోతివి? నీకు యజమానుడగు రాజును సంహరించుటకు జనులలో ఒకడు చేరువకు వచ్చెనే;౹

16 నీ ప్రవర్తన అను కూలము కాదు, నీవు శిక్షకు పాత్రుడవే; యెహోవాచేత అభిషేకము నొందిన నీ యేలినవానికి నీవు రక్షకముగా నుండలేదు; యెహోవా జీవముతోడు నీవు మరణశిక్షకు పాత్రుడవు. రాజుయొక్క యీటె యెక్కడ నున్నదో చూడుము, అతని తలగడయొద్దనున్న నీళ్లబుడ్డి యెక్కడ నున్నదో చూడుము అని పలికెను.౹

17 సౌలు దావీదు స్వరము ఎరిగి–దావీదా నాయనా, యిది నీ స్వరమేగదా అని అనగా దావీదు ఇట్లనెను–నా యేలినవాడా నా రాజా, నా స్వరమే.౹

18 నా యేలినవాడు తన దాసుని ఈలాగు ఎందుకు తరుముచున్నాడు? నేనేమి చేసితిని? నావలన ఏ కీడు నీకు సంభవించును?

19 రాజా నా యేలినవాడా, నీ దాసుని మాటలు వినుము. నామీద పడవలెనని యెహోవా నిన్ను ప్రేరేపించినయెడల నైవేద్యము చేసి ఆయనను శాంతిపరచవచ్చును. అయితే నరులెవ రైనను నిన్ను ప్రేరేపించినయెడల వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురు. వారు–నీవు దేశమును విడిచి అన్యదేవతలను పూజించుమని నాతో చెప్పి, యెహోవా స్వాస్థ్యమునకు హత్తుకొనకుండ నన్ను వెలివేయుచున్నారు.౹

20 నా దేశమునకు దూరముగాను, యెహోవా సన్నిధికి ఎడముగాను నేను మరణము నొందకపోవుదును గాక. ఒకడు పర్వతములమీద కౌజుపిట్టను తరిమినట్టు ఇశ్రాయేలు రాజవైన నీవు మిన్నల్లిని వెదకుటకై బయలుదేరి వచ్చితివి.౹

21 అందుకు సౌలు–నేను పాపము చేసితిని, ఈ దినమున నాప్రాణము నీ దృష్టికి ప్రియముగా నుండినదానిబట్టి నేను నీకిక కీడుచేయను. దావీదా నాయనా, నాయొద్దకు తిరిగిరమ్ము; వెఱ్ఱివాడనై నేను బహు తప్పు చేసితిననగా

22 దావీదు–రాజా, యిదిగో నీ యీటె నాయొద్దనున్నది, పనివారిలో నొకడు వచ్చి దాని తీసికొనవచ్చును.౹

23 యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను నేను యెహోవా చేత అభిషేకము నొందినవానిని చంపనొల్లక పోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును.౹

24 చిత్తగించుము, ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలోనుండి నన్ను రక్షించునుగాక అని చెప్పెను.౹

25 అందుకు సౌలు–దావీదా నాయనా, నీవు ఆశీర్వాదము పొందుదువు గాక; నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువుగాక అని దావీదుతో అనెను. అప్పుడు దావీదు తన మార్గమున వెళ్లిపోయెను, సౌలును తన స్థలమునకు తిరిగి వచ్చెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1SA/26-d6b6bbc3a7ba0c2ba463df07e23dfd4e.mp3?version_id=1787—

Categories
1 సమూయేలు

1 సమూయేలు 27

1 తరువాత దావీదు–నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలుచేత నాశన మగుదును; నేను ఫిలిష్తీయుల దేశములోనికి తప్పించుకొని పోవుదును, అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల సరిహద్దులలో నన్ను వెదకుట మానుకొనును గనుక నేను అతనిచేతిలోనుండి తప్పించుకొందునని అనుకొని

2 లేచి తనయొద్దనున్న ఆరువందలమందితోకూడ ప్రయాణమై మాయోకు కుమారుడును గాతు రాజునైన ఆకీషునొద్దకు వచ్చెను.౹

3 దావీదు గాతులో ఆకీషునొద్ద చేరగా అతడును అతని వారందరును తమతమ కుటుంబముల సమేతముగా కాపురముండిరి. యెజ్రెయేలీయురాలగు అహీనోయము, నాబాలు భార్యయైయుండిన కర్మెలీయు రాలగు అబీగయీలు అను అతని యిద్దరు భార్యలు దావీదుతోకూడ ఉండిరి.

4 దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అతడు దావీదును వెదకుట మాని వేసెను.౹

5 అంతట దావీదు–రాజపురమందు నీయొద్ద నీ దాసుడనైన నేను కాపురము చేయనేల? నీ దృష్టికి నేను అనుగ్రహము పొందినవాడనైతే బయటి పట్టణములలో ఒకదానియందు నేను కాపురముండుటకు ఒక స్థలము ఇప్పించుమని ఆకీషును అడుగగా

6 ఆకీషు సిక్లగు అను గ్రామమును ఆ దినమున అతని కిచ్చెను. కాబట్టి నేటివరకు సిక్లగు యూదారాజుల వశమున నున్నది.

7 దావీదు ఫిలిష్తీయుల దేశములో కాపురముండిన కాల మంత ఒక సంవత్సరము నాలుగు నెలలు.౹

8 అంతలో దావీదును అతని వారును బయలుదేరి గెషూరీయులమీదను గెజెరీయులమీదను అమాలేకీయులమీదను పడిరి. ప్రయాణస్థులు పోవుమార్గమున షూరునుండి ఐగుప్తువరకు నున్న దేశములో వారు పూర్వము కాపురముండగా

9 దావీదు ఆ దేశస్థులను హతముచేసి, మగవానినేమి ఆడు దానినేమి యెవరిని సజీవులుగా విడువక గొఱ్ఱెలను ఎడ్లను గార్దభములను ఒంటెలను వస్త్రములను దోచుకొని తిరిగి ఆకీషునొద్దకు వచ్చెను.౹

10 ఆకీషు–ఇప్పుడు మీరు దండెత్తి దేశములో జొరబడితిరా అని దావీదు నడుగగా దావీదు –యూదా దేశమునకును యెరహ్మెయేలీయుల దేశమునకును కేనీయుల దేశమునకును దక్షిణముగా మేము ఒక ప్రదేశములో జొరబడితిమనెను.౹

11 ఆలాగున దావీదు చేయుచు వచ్చెను. అతడు ఫిలిష్తీయుల దేశములో నివసించినంత కాలము ఈ ప్రకారముగా చేయునని తమ్మును గురించి వారు చెప్పుదురేమో అని గాతుకు వర్తమానము తేగల మగవానినైనను ఆడుదానినైనను దావీదు బ్రతుక నియ్యలేదు.౹

12 –దావీదు తన జనులైన ఇశ్రాయేలీయులు తనయందు బొత్తిగా అసహ్యపడునట్లు చేసెను గనుక అతడు సదాకాలము నాకు దాసుడుగాను ఉండునని అనుకొని ఆకీషు దావీదు మాట నమ్మెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1SA/27-c345601b9c78ace0d8a4914987ea6696.mp3?version_id=1787—

Categories
1 సమూయేలు

1 సమూయేలు 28

1 ఆ దినములలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయవలెనని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా, ఆకీషు దావీదును పిలిచి–నేను దండెత్తగా నీవును నీ జనులును నాతోకూడ యుద్ధమునకు బయలుదేరి రావలెనని పరిష్కారముగా తెలిసికొనుమనగా

2 దావీదు–నీ దాసుడనైన నేను చేయబోవు కార్యము ఏదో అది నీవు ఇప్పుడు తెలిసికొందువనెను. అందుకు ఆకీషు–ఆలాగైతే నిన్ను ఎప్పటికి నాకు సంరక్షకుడుగా నిర్ణయింతుననెను.

3 సమూయేలు మృతిబొందగా ఇశ్రాయేలీయులు అతని గురించి విలాపము చేసి రామా అను అతని పట్టణములో అతని పాతిపెట్టియుండిరి. మరియు సౌలు కర్ణపిశాచము గలవారిని చిల్లంగివారిని దేశములోనుండి వెళ్లగొట్టి యుండెను.౹

4 ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి షూనేములో దిగగా, సౌలు ఇశ్రాయేలీయులందరిని సమకూర్చెను; వారు గిల్బోవలో దిగిరి.౹

5 సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపము నొంది

6 యెహోవా యొద్ద విచారణచేయగా యెహోవా స్వప్నముద్వారానైనను ఊరీముద్వారానైనను ప్రవక్తలద్వారానైనను ఏమియు సెలవియ్యకుండెను.౹

7 అప్పుడు సౌలు–నా కొరకు మీరు కర్ణపిశాచముగల యొక స్త్రీని కనుగొనుడి; నేను పోయి దానిచేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞ ఇయ్యగా వారు–చిత్తము, ఏన్దోరులో కర్ణపిశాచము గల యొకతె యున్నదని అతనితో చెప్పిరి.౹

8 కాబట్టి సౌలు మారు వేషము ధరించి వేరు బట్టలు తొడుగుకొని యిద్దరు మనుష్యులను వెంటబెట్టుకొనిపోయి రాత్రివేళ ఆ స్త్రీయొద్దకు వచ్చి–కర్ణపిశాచముద్వారా నాకు శకునము చెప్పి నాతో మాటలాడుటకై నేను నీతో చెప్పువాని రప్పించుమని కోరగా

9 ఆ స్త్రీ– ఇదిగో, సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా? కర్ణపిశాచము గలవారిని చిల్లంగివారిని అతడు దేశములో ఉండకుండ నిర్మూలముచేసెను గదా. నీవు నా ప్రాణముకొరకు ఉరి యొగ్గి నాకు మరణమేల రప్పింతువు అని అతనితో అనెను.౹

10 అందుకు సౌలు–యెహోవా జీవముతోడు దీనినిబట్టి నీకు శిక్ష యెంతమాత్రమును రాదని యెహోవా నామమున ప్రమాణముచేయగా

11 ఆ స్త్రీ–నీతో మాటలాడుటకై నేనెవని రప్పింపవలెనని యడుగగా అతడు –సమూయేలును రప్పింపవలెననెను.౹

12 ఆ స్త్రీ సమూయేలును చూచి నప్పుడు బిగ్గరగా కేకవేసి–నీవు సౌలువే; నీవు నన్నెందుకు మోసపుచ్చితివని సౌలుతో చెప్పగా

13 రాజు–నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినదని ఆమె నడుగగా ఆమె–దేవతలలో ఒకడు భూమిలోనుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాననెను.౹

14 అందుకతడు–ఏ రూపముగా ఉన్నాడని దాని నడిగినందుకు అది–దుప్పటి కప్పుకొనిన ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడనగా సౌలు–అతడు సమూయేలు అని తెలిసికొని సాగిలపడి నమస్కారము చేసెను.౹

15 సమూయేలు–నన్ను పైకిరమ్మని నీ వెందుకు తొందరపెట్టితివని సౌలు నడుగగా సౌలు– నేను బహు శ్రమలోనున్నాను; ఫిలిష్తీయులు నా మీదికి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నములద్వారానైనను నా కేమియు సెలవియ్యకయున్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియజెప్పుటకై నిన్ను పిలిపించితిననెను.౹

16 అందుకు సమూయేలు–యెహోవా నిన్ను ఎడ బాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుటవలన ప్రయోజనమేమి?

17 యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చియున్నట్టు నీ చేతినుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దాని నిచ్చియున్నాడు.౹

18 యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక, అమాలేకీయుల విషయములో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చక పోయిన దానినిబట్టి యెహోవా నీకు ఈవేళ ఈ ప్రకారముగా చేయుచున్నాడు.౹

19 యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును; యెహోవా ఇశ్రాయేలీయుల దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును; రేపు నీవును నీ కుమారులును నాతోకూడ ఉందురు అని సౌలుతో చెప్పగా

20 సమూయేలు మాటలకు సౌలు బహు భయమొంది వెంటనే నేలను సాష్టాంగపడి దివారాత్రము భోజన మేమియు చేయక యుండినందున బలహీను డాయెను.౹

21 అప్పుడు ఆ స్త్రీ సౌలు దగ్గరకువచ్చి, అతడు బహుగా కలవరపడుట చూచి–నా యేలినవాడా, నీ దాసినైన నేను నీ ఆజ్ఞకు లోబడి నా ప్రాణము నా చేతిలో పెట్టుకొని నీవు నాతో సెలవిచ్చిన మాటలను విని అట్లు చేసితిని.౹

22 ఇప్పుడు నీ దాసినైన నేను చెప్పు మాటలను ఆలకించుము, నేను నీకు ఇంత ఆహారము వడ్డించుదును, నీవు భోజనముచేసి ప్రయాణమై పోవుటకు బలము తెచ్చుకొనుమని అతనితో చెప్పగా

23 అతడు ఒప్పక భోజనము చేయననెను; అయితే అతని సేవకులు ఆ స్త్రీతో ఏకమై యతని బలవంతముచేయగా అతడు వారు చెప్పిన మాట ఆలకించి నేలనుండి లేచి మంచముమీద కూర్చుండెను.౹

24 తన యింటిలో క్రొవ్విన పెయ్య ఒకటి యుండగా ఆ స్త్రీ దాని తీసికొని త్వరగా వధించి పిండి తెచ్చి పిసికి పులుసులేని రొట్టెలు కాల్చి

25 తీసికొని వచ్చి సౌలునకును అతని సేవకులకును వడ్డించగా వారు భోజనముచేసి లేచి ఆ రాత్రి వెళ్లిపోయిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1SA/28-15ad0efa68b6de533ba3777040bb2a57.mp3?version_id=1787—

Categories
1 సమూయేలు

1 సమూయేలు 29

1 అంతలో ఫిలిష్తీయులు దండెత్తి పోయి ఆఫెకులో. దిగియుండిరి; ఇశ్రాయేలీయులు యెజ్రెయేలులోని జెల దగ్గర దిగియుండిరి.౹

2 ఫిలిష్తీయుల సర్దారులు తమ సైన్యమును నూరేసిమందిగాను వెయ్యేసిమందిగాను వ్యూహ పరచి వచ్చుచుండగా దావీదును అతని జనులును ఆకీషుతో కలిసి దండు వెనుకతట్టున వచ్చుచుండిరి.౹

3 ఫిలిష్తీయుల సర్దారులు–ఈ హెబ్రీయులు ఏల రావలెను అని ఆకీషును అడుగగా అతడు–ఇన్ని దినములు ఇన్ని సంవత్సరములు నాయొద్దనుండిన ఇశ్రాయేలీయుల రాజైన సౌలునకు సేవకుడగు దావీదు ఇతడే కాడా? ఇతడు నా యొద్ద చేరిన నాటనుండి నేటివరకు ఇతనియందు తప్పే మియు నాకు కనబడలేదని ఫిలిష్తీయుల సర్దారులతో అనెను.౹

4 అందుకు ఫిలిష్తీయుల సర్దారులు అతనిమీద కోపపడి–ఈ మనుష్యుని నీవు నిర్ణయించిన స్థలమునకు తిరిగి పోనిమ్ము, అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు, యుద్ధమందు అతడు మనకు విరోధియవు నేమో, దేనిచేత అతడు తన యజమానునితో సమాధాన పడును? మనవారి తలలను ఛేదించి తీసికొని పోవుటచేతనే గదా తన యజమానునితో సమాధానపడును.

5 సౌలు వేలకొలదిగాను

దావీదు పదివేలకొలదిగాను

హతముచేసిరని

వారు నాట్యమాడుచు గాన ప్రతిగానముచేయుచు పాడిన దావీదు ఇతడే కాడా అని అతనితో చెప్పిరి.౹

6 కాబట్టి ఆకీషు దావీదును పిలిచి–యెహోవా జీవముతోడు నీవు నిజముగా యథార్థపరుడవై యున్నావు; దండులో నీవు నాతోకూడ సంచరించుట నా దృష్టికి అనుకూలమే; నీవు నాయొద్దకు వచ్చిన దినమునుండి నేటివరకు నీయందు ఏ దోషమును నాకు కనబడలేదుగాని సర్దారులు నీయందు ఇష్టములేక యున్నారు.౹

7 ఫిలిష్తీయుల సర్దారుల దృష్టికి నీవు ప్రతికూలమైన దాని చేయకుండునట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్లుమని చెప్పగా

8 దావీదు–నేనేమి చేసితిని? నా యేలినవాడవగు రాజా, నీ శత్రువులతో యుద్ధముచేయుటకై నేను రాకుండునట్లు నీయొద్దకు వచ్చిన దినమునుండి నేటివరకు నీ దాసుడనైన నాయందు తప్పేమి కనబడెనని ఆకీషు నడిగెను.౹

9 అందుకు ఆకీషు–దైవదూతవలె నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేనెరుగుదునుగాని ఫిలిష్తీయుల సర్దారులు–ఇతడు మనతోకూడ యుద్ధమునకు రాకూడదని చెప్పుచున్నారు.౹

10 కాబట్టి ఉదయమున నీవును నీతోకూడ వచ్చిన నీ యజమానుని సేవకులును త్వరగా లేవవలెను; ఉదయమున లేచి తెల్లవారగానే బయలుదేరి పోవలెనని దావీదునకు ఆజ్ఞ ఇచ్చెను.౹

11 కావున దావీదును అతని జనులును ఉదయమున త్వరగా లేచి ఫిలిష్తీయుల దేశమునకు పోవలెనని ప్రయాణమైరి; ఫిలిష్తీయులు దండెత్తి యెజ్రెయేలునకు పోయిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1SA/29-49d144270383aac85628e7d86c0fe8f0.mp3?version_id=1787—

Categories
1 సమూయేలు

1 సమూయేలు 30

1 దావీదును అతని జనులును మూడవ దినమందు సిక్లగునకు వచ్చిరి; అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశముమీదను సిక్లగుమీదను పడి, కొట్టి దానిని తగులబెట్టి,౹

2 ఘనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరిని చెరపట్టుకొని చంపక వారిని తీసికొని వెళ్లిపోయి యుండిరి.౹

3 దావీదును అతని జనులును పట్టణమునకు వచ్చి అది కాల్చబడియుండుటయు, తమ భార్యలును కుమారులును కుమార్తెలును చెరలోనికి కొని పోబడి యుండుటయు చూచి

4 ఇక ఏడ్చుటకు శక్తిలేక పోవునంత బిగ్గరగా ఏడ్చిరి.౹

5 యెజ్రెయేలీయురాలైన అహీనోయము, కర్మెలీయుడైన నాబాలు భార్యయయిన అబీగయీలు అను దావీదు ఇద్దరు భార్యలును చెరలోనికి కొనిపోబడగా చూచి

6 దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమతమ కుమారులనుబట్టియు కుమార్తెలనుబట్టియు జనులకందరికి ప్రాణము విసికినందున రాళ్లు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పు కొనగా దావీదు తన దేవుడైన యెహోవానుబట్టి ధైర్యము తెచ్చుకొనెను.౹

7 పిమ్మట దావీదు–ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు నొద్దకు తీసికొనివచ్చెను.౹

8 –నేను ఈ దండును తరిమినయెడల దాని కలిసికొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణచేయగా యెహోవా–తరుము, నిశ్చయముగా నీవు వారిని కలిసి కొని తప్పక నీవారినందరిని దక్కించుకొందువని సెలవిచ్చెను.౹

9 కాబట్టి దావీదు అతనియొద్దనున్న ఆరువందలమందియును బయలుదేరి బెసోరు వాగు గట్టుకు రాగా వారిలో రెండువందలమంది వెనుక దిగవిడువబడిరి.౹

10 దావీదును నాలుగువందలమందియును ఇంక తరుముచు పోయిరిగాని ఆ రెండువందలమంది అలసట పడి బెసోరు వాగు దాటలేక ఆగిరి. ఆ నాలుగు వందలమంది పోవుచుండగా

11 పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదునొద్దకు వాని తోడుకొనివచ్చి, వాడు మూడు రాత్రింబగళ్లు అన్నపానము లేమియు పుచ్చు కొనలేదని తెలిసికొని, వానికి భోజనము పెట్టి దాహమిచ్చి అంజూరపు అడలోని ముక్కను రెండు ద్రాక్షగెలలను వానికిచ్చిరి.౹

12 వాడు భోజనముచేసిన తరువాత వాని ప్రాణము తెప్పరిల్లగా

13 దావీదు–నీవు ఏ దేశపువాడవు? ఎక్కడనుండి వచ్చితివని వాని నడిగెను. అందుకు వాడు –నేను ఐగుప్తీయుడనై పుట్టి అమాలేకీయుడైన యొకనికి దాసుడనైతిని; మూడుదినముల క్రిందట నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టి పోయెను.౹

14 మేము దండెత్తి కెరేతీయుల దక్షిణ దేశమునకును యూదా దేశమునకును కాలేబు దక్షిణ దేశమునకును వచ్చి వాటిని దోచుకొని సిక్లగును కాల్చివేసితిమని చెప్పెను.౹

15 –ఆ దండును కలిసికొనుటకై నీవు నాకు దోవచూపుదువా అని దావీదు వానినడుగగా వాడు–నేను నిన్ను చంపననియు నీ యజమానుని వశము చేయననియు దేవునిబట్టి నీవు నాకు ప్రమాణము చేసినయెడల ఆ దండును కలిసి కొనుటకు నీకు దోవచూపుదుననెను.౹

16 తరువాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా, ఫిలిష్తీయుల దేశములోనుండియు యూదా దేశములోనుండియు తాము దోచి తెచ్చికొనిన సొమ్ముతో తులదూగుచు, వారు ఆ ప్రదేశమంతట చెదిరి అన్నపానములు పుచ్చుకొనుచు ఆటపాటలు సలుపుచుండిరి.౹

17 దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రమువరకు వారిని హతము చేయుచుండగా, ఒంటెలమీద ఎక్కి పారిపోయిన నాలుగువందలమంది యౌవనులు తప్ప తప్పించుకొనినవాడు ఒకడును లేకపోయెను.౹

18 ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొనిపోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన యిద్దరు భార్యలను రక్షించెను.౹

19 కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తికొనిపోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి యేదియు తక్కువకాకుండ దావీదు సమస్తమును రక్షించెను.౹

20 మరియు దావీదు అమాలేకీయుల గొఱ్ఱెలన్నిటిని గొడ్లన్నిటిని పట్టుకొనెను. ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ స్వంత పశువులకు ముందుగా వీటిని తోలిరి.౹

21 అలసటచేత దావీదును వెంబడించలేక బెసోరు వాగు దగ్గర నిలిచిన ఆ రెండువందలమందియొద్దకు దావీదు పోగా వారు దావీదును అతనియొద్దనున్న జనులను ఎదుర్కొనుటకై బయలుదేరి వచ్చిరి. దావీదు ఈ జనులయొద్దకు వచ్చి వారి యోగక్షేమమడుగగా

22 దావీదుతోకూడ వెళ్లినవారిలో దుర్మార్గులును, పనికి మాలినవారునైన కొందరు–వీరు మనతోకూడ రాక నిలిచిరి గనుక తమ భార్యలను పిల్లలను తప్ప మనకు మరల వచ్చిన దోపుడు సొమ్ములో మన మేమియు వీరికియ్యము; తమ భార్య పిల్లలను వారు తీసికొని పోవచ్చుననిరి.౹

23 అందుకు దావీదు వారితో ఇట్లనెను–నా సహోదరులారా, యెహోవా మనలను కాపాడి మనమీదికి వచ్చిన యీ దండును మనకప్పగించి మనకు దయచేసిన దాని విషయములో మీరు ఈలాగున చేయకూడదు.౹

24 మీరు చెప్పినది యెవరు ఒప్పుకొందురు? యుద్ధమునకు పోయినవాని భాగమెంతో సామానునొద్ద నిలిచిన వాని భాగము అంతే అని వాడుక మాట; అందరు సమముగానే పాలు పంచుకొందురు గదా

25 కావున నాటనుండి నేటివరకు దావీదు ఇశ్రాయేలీయులలో అట్టి పంపకము కట్టడగాను న్యాయవిధిగాను ఏర్పరచి నియమించెను.

26 దావీదు సిక్లగునకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యూదా పెద్దలకు ఏర్పరచి– యెహోవా శత్రువులయొద్ద నేను దోచుకొనిన సొమ్ములో కొంత ఆశీర్వాదసూచనగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపించెను.౹

27 బేతేలులోను దక్షిణ రామోతులోను యత్తీరులోను

28 అరోయేరులోను షిప్మోతులోను ఎష్తెమోలోను

29 రాకాలులోను యెరహ్మెయేలీయుల గ్రామములలోను కేనీయుల గ్రామములలోను

30 హోర్మాలోను కోరాషానులోను అతాకులోను

31 హెబ్రోనులోను దావీదును అతని జనులును సంచరించిన స్థలములన్నిటిలోను ఉన్న పెద్దలకు దావీదు పంపించెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1SA/30-5fdc1d8484f27febfe34bd0629f82b43.mp3?version_id=1787—

Categories
1 సమూయేలు

1 సమూయేలు 31

1 అంతలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధముచేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల యెదుటనుండి పారిపోయిరి. గిల్బోవ పర్వతమువరకు ఫిలిష్తీయులు వారిని హతము చేయుచు

2 సౌలును అతని కుమారులను తరుముచు, యోనాతాను, అబీనాదాబు, మెల్కీషూవ అను సౌలుయొక్క కుమారులను హతము చేసిరి.౹

3 యుద్ధములో సౌలు ఓడిపోవుచుండగా అతడు అంబులువేయువారి కంటబడి వారిచేత బహు గాయముల నొందెను. అప్పుడు సౌలు

4 –సున్నతిలేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండునట్లు నీకత్తి దూసి దానిచేత నన్ను పొడువుమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయముచేత ఆలాగు చేయనొల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దానిమీద పడెను.౹

5 సౌలు మరణమాయెనని అతని ఆయుధములను మోయువాడు తానును తన కత్తిమీదపడి అతనితోకూడ మరణమాయెను.౹

6 ఈలాగున సౌలును అతని ముగ్గురు కుమారులును అతని ఆయుధములను మోయువాడును అతని వారందరును ఒక దినముననే మరణమైరి.౹

7 లోయ అవతలనున్న ఇశ్రాయేలీయులును, యొర్దాను అవతల నున్నవారును, ఇశ్రాయేలీయులు పారిపోవుటయు, సౌలును అతని కుమారులును చచ్చియుండుటయు చూచి తమ నివాసగ్రామములు విడిచిపెట్టి పారిపోయిరి. ఫిలిష్తీయులు వచ్చివాటిలో కాపురముండిరి.

8 మరునాడు ఫిలిష్తీయులు హతమైనవారిని దోచుకొన వచ్చి గిల్బోవ పర్వతముమీద పడిపోయిన సౌలును అతని ముగ్గురు కుమారులను కనుగొని

9 అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుళ్లలోను జనులలోను జయవర్తమానము తెలియజేయుటకై ఫిలిష్తీయుల దేశములో నలుదిశలు వాటిని పంపిరి.౹

10 మరియు వారు అతని ఆయుధములను అష్తారోతు దేవిగుడిలో ఉంచి అతని మొండెమును బేత్షాను పట్టణపు గోడకు తగిలించిరి.౹

11 అయితే ఫిలిష్తీయులు సౌలుకు చేసిన దానిగురించిన వార్త యాబేష్గిలాదువారు విని

12 బలశాలులందరు లేచి రాత్రియంత నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కళేబరములను బేత్షాను పట్టణపు గోడమీదనుండి దించి యాబేషునకు తిరిగి వచ్చి వాటిని దహనముచేసి

13 వారి శల్యములను తీసి యాబేషులోని పిచులవృక్షము క్రింద పాతిపెట్టి యేడుదినములు ఉపవాసముండిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1SA/31-97697e960893c6f8001518b8ce54f3d5.mp3?version_id=1787—

Categories
2 సమూయేలు

2 సమూయేలు 1

1 దావీదు అమాలేకీయులను హతముచేసితిరిగి వచ్చెను. సౌలు మృతినొందిన తరువాత అతడు సిక్లగులో రెండు దినములుండెను.౹

2 మూడవదినమున బట్టలు చింపుకొని తలమీద బుగ్గిపోసికొనిన యొకడు సౌలునొద్దనున్నదండులోనుండి వచ్చెను.౹

3 అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారముచేయగా దావీదు–నీ వెక్కడనుండి వచ్చితివని యడిగెను. అందుకు వాడు–ఇశ్రాయేలీయుల సైన్యములోనుండి నేను తప్పించుకొని వచ్చితిననెను.౹

4 –జరిగిన సంగతులేవో నాతో చెప్పుమని దావీదు సెలవియ్యగా వాడు–జనులు యుద్ధమందు నిలువలేక పారిపోయిరి. అనేకులు పడి చచ్చిరి, సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరి అనెను.౹

5 –సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరని నీ కేలాగు తెలిసినది అని దావీదు వానినడుగగా వాడిట్లనెను

6-7 –గిల్బోవ పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన యీటెమీద ఆనుకొనియుండెను. అతడు రథములును రౌతులును తనను వెనువెంట తగులు చుండుట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకు–చిత్తము నా యేలినవాడా అని నేనంటిని.౹

8-10 – నీవెవడవని అతడు నన్నడుగగా–నేను అమాలేకీయుడనని చెప్పితిని. అతడు–నా ప్రాణము ఇంక నాలో ఉన్నదిగాని తల త్రిప్పుచేత నేను బహు బాధ పడుచున్నాను; నీవు నా దగ్గర నిలువబడి నన్ను చంపుమని సెలవియ్యగా, ఈలాగు పడినతరువాత అతడు బ్రదుకడని నేను నిశ్చయించుకొని అతనిదగ్గర నిలిచి అతని చంపితిని; తరువాత అతని తలమీదనున్న కిరీటమును హస్తకంకణములను తీసికొని నా యేలినవాడవైన నీయొద్దకు వాటిని తెచ్చియున్నాను అనెను.౹

11 దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొనెను. అతనియొద్దనున్నవారందరును ఆలాగున చేసి

12 సౌలును యోనాతానును యెహోవా జనులును ఇశ్రాయేలు ఇంటివారును యుద్ధములో కూలి రని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రమువరకు ఉపవాసముండిరి.౹

13 తరువాత దావీదు–నీవెక్కడ నుండి వచ్చితివని ఆ వార్త తెచ్చినవానినడుగగా వాడు–నేను ఇశ్రాయేలుదేశమున నివసించు అమాలేకీయుడగు ఒకని కుమారుడననెను.౹

14-16 అందుకు దావీదు–భయపడక యెహోవా అభిషేకించినవానిని చంపుటకు నీవేల అతని మీద చెయ్యి ఎత్తితివి? యెహోవా అభిషేకించిన వానిని నేను చంపితినని నీవు చెప్పితివే; నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాది వని వానితో చెప్పి తనవారిలో ఒకని పిలిచి–నీవు పోయి వాని చంపుమనగా అతడు వానిని కొట్టి చంపెను.

17-18 యూదావారికి అభ్యాసము చేయవలెనని దావీదు సౌలునుగూర్చియు అతని కుమారుడైన యోనాతానునుగూర్చియు ధనుర్గీతమొకటి చేసి దానినిబట్టి విలాపము సలిపెను. అది యాషారు గ్రంథమందు లిఖింపబడి యున్నది. ఎట్లనగా–

19 ఇశ్రాయేలూ, నీకు భూషణమగువారు నీ ఉన్నతస్థలములమీద హతులైరి అహహా బలాఢ్యులు పడిపోయిరి.

20 ఫిలిష్తీయుల కుమార్తెలు సంతోషింపకుండునట్లు సున్నతిలేనివారి కుమార్తెలు జయమని చెప్పకుండునట్లు ఈ సమాచారము గాతులో తెలియజేయకుడి అష్కెలోను వీధులలో ప్రకటన చేయకుడి.

21 గిల్బోవ పర్వతములారా మీమీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరుగల చేలైనను లేకపోవును గాక.

బలాఢ్యులడాళ్లు అవమానముగ పారవేయబడెను. తైలముచేత అభిషేకింపబడని వారిదైనట్టుసౌలు డాలును పారవేయబడెను.

22 హతుల రక్తము ఒలికింపకుండ బలాఢ్యుల క్రొవ్వును పట్టకుండ యోనాతాను విల్లు వెనుకతియ్యలేదు ఎవరిని హతముచేయకుండ సౌలు కత్తి వెనుక తీసినది కాదు.

23 సౌలును యోనాతానును తమ బ్రతుకునందు సరసులుగాను నెనరుగల వారుగాను ఉండిరి తమ మరణమందైనను వారు ఒకరినొకరు ఎడబాసినవారు కారు వారు పక్షిరాజులకంటె వడిగలవారు సింహములకంటె బలముగలవారు.

24 ఇశ్రాయేలీయుల కుమార్తెలారా, సౌలునుగూర్చి యేడ్వుడి అతడు మీకు ఇంపైన రక్తవర్ణపు వస్త్రములు ధరింప జేసినవాడు బంగారు నగలు మీకు పెట్టినవాడు.

25 యుద్ధరంగమునందు బలాఢ్యులు పడియున్నారు నీ ఉన్నతస్థలములలో యోనాతాను హతమాయెను.

26 నా సహోదరుడా, యోనాతానా నీవు నాకు అతిమనోహరుడవై యుంటివి నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను నాయందు నీకున్న ప్రేమ బహు వింతైనది స్త్రీలు చూపు ప్రేమకంటెను అది అధికమైనది.

27 అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయిరి యుద్ధసన్నద్ధులు నశించిపోయిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2SA/1-f18d85dde37dce6c02a85bc507f7b720.mp3?version_id=1787—

Categories
2 సమూయేలు

2 సమూయేలు 2

1 ఇది జరిగిన తరువాత–యూదా పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు యెహోవాయొద్ద విచారణ చేయగా–పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. –నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా–హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను.౹

2 కాబట్టి యెజ్రెయేలీయురాలగు అహీనోయము, కర్మెలీయుడగు నాబాలునకు భార్యయైన అబీగయీలు అను తన యిద్దరు భార్యలను వెంటబెట్టుకొని దావీదు అక్కడికి పోయెను.౹

3 మరియు దావీదు తనయొద్ద నున్నవారినందరిని వారి వారి యింటివారిని తోడుకొని వచ్చెను; వీరు హెబ్రోను గ్రామములలో కాపురముండిరి.౹

4 అంతట యూదావారు అక్కడికి వచ్చి యూదావారిమీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి.

5 సౌలును పాతిపెట్టినవారు యాబేష్గిలాదువారని దావీదు తెలిసికొని యాబేష్గిలాదువారియొద్దకు దూతలను పంపి–మీరు ఉపకారము చూపి మీ యేలినవాడైన సౌలును పాతిపెట్టితిరి గనుక యెహోవాచేత మీరు ఆశీర్వచనము నొందుదురు గాక.౹

6 యెహోవా మీకు కృపను సత్యస్వభావమును అగపరచును, నేనును మీరు చేసిన యీ క్రియనుబట్టి మీకు ప్రత్యుపకారము చేసెదను.౹

7 మీ యజమానుడగు సౌలు మృతినొందెనుగాని యూదావారు నాకు తమమీద రాజుగా పట్టాభిషేకము చేసియున్నారు గనుక మీరు ధైర్యము తెచ్చుకొని బలాఢ్యులై యుండుడని ఆజ్ఞనిచ్చెను.

8-10 నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలుయొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషెతును మహ నయీమునకు తోడుకొనిపోయి, గిలాదువారిమీదను ఆషేరీయులమీదను యెజ్రెయేలుమీదను ఎఫ్రాయి మీయులమీదను బెన్యామీనీయులమీదను ఇశ్రాయేలు వారిమీదను రాజుగా అతనికి పట్టాభిషేకము చేసెను. సౌలు కుమారుడగు ఇష్బోషెతు నలువదేండ్లవాడై యేలనారంభించి రెండు సంవత్సరములు పరిపాలించెను; అయితే యూదావారు దావీదు పక్షమున నుండిరి.౹

11 దావీదు హెబ్రోనులో యూదావారిమీద ఏలినకాల మంతయు ఏడు సంవత్సరముల ఆరు మాసములు.

12 అంతలో నేరు కుమారుడగు అబ్నేరును సౌలు కుమారుడగు ఇష్బోషెతు సేవకులును మహనయీములోనుండి బయలుదేరి గిబియోనునకు రాగా

13 సెరూయా కుమారుడగు యోవాబును దావీదు సేవకులును బయలుదేరి వారి నెదిరించుటకై గిబియోను కొలనునకు వచ్చిరి. వీరు కొలనునకు ఈతట్టునను వారు కొలనునకు ఆతట్టునను దిగి యుండగా

14 అబ్నేరు లేచి–మన యెదుట యౌవనులు మల్లచేష్టలు చేయుదురా అని యోవాబుతో అనగా యోవాబు–వారు చేయవచ్చుననెను.౹

15 లెక్కకు సరిగా సౌలు కుమారుడగు ఇష్బోషెతు సంబంధులైన పన్నిద్దరు మంది బెన్యామీనీయులును దావీదు సేవకులలో పన్నిద్దరు మందియును లేచి మధ్య నిలిచిరి.౹

16 ఒక్కొక్కడు తన దగ్గరనున్న వాని తల పట్టుకొని వాని ప్రక్కను కత్తి పొడవగా అందరు తటాలున పడిరి. అందువలన హెల్కత్హన్సూరీమనిఆ స్థలమునకు పేరు పెట్టబడెను. అది గిబియోనునకు సమీపము.౹

17 తరువాత ఆ దినమున ఘోరయుద్ధము జరుగగా అబ్నేరును ఇశ్రాయేలువారును దావీదు సేవకుల యెదుట నిలువలేక పారిపోయిరి.౹

18 సెరూయా ముగ్గురు కుమారులగు యోవాబును అబీషైయును అశాహేలును అచ్చటనుండిరి. అశాహేలు అడవిలేడియంత తేలికగా పరుగెత్తగలవాడు గనుక

19 అతడు కుడితట్టయినను ఎడమతట్టయినను తిరుగక అబ్నేరును తరుముచుండగా

20 అబ్నేరు వెనుకకు తిరిగి–నీవు అశాహేలువా అని అతనిని నడుగగా అతడు నేను అశాహేలునే యనెను.౹

21 –నీవు కుడికైనను ఎడమకైనను తిరిగి యౌవనస్థులలో ఒకని కలిసికొని వాని ఆయుధములను పట్టుకొమ్ము అని అబ్నేరు అతనితో చెప్పినను, అశాహేలు ఈ తట్టయినను ఆ తట్టయినను తిరుగక అతని తరుమగా

22 అబ్నేరు–నన్ను తరుముట మాని తొలగిపొమ్ము, నేను నిన్ను నేలకు కొట్టి చంపినయెడల నీ సహోదరుడగు యోవాబు ముందు నేనెట్లు తలనెత్తుకొనగలననెను.౹

23 అతడు–నేను తొలగననగా, అబ్నేరు ఈటె మడమతో అతని కడుపులో పొడిచినందున యీటె అతని వెనుకకు వచ్చెను కనుక అతడు అచ్చటనే పడి చచ్చెను. అశాహేలు పడి చచ్చిన స్థలమునకు వచ్చినవారందరు నిలువబడిరిగాని

24 యోవాబును అబీషైయును అబ్నేరును తరుముచు గిబియోనను అరణ్యమార్గములోని గీహ యెదుటి అమ్మాయను కొండకు వచ్చిరి; అంతలో సూర్యుడు అస్త మించెను.౹

25 బెన్యామీనీయులు అబ్నేరుతో గుంపుగా కూడుకొని, ఒక కొండమీద నిలువగా

26 అబ్నేరు కేకవేసి –కత్తి చిరకాలము భక్షించునా? అది తుదకు ద్వేషమునకే హేతువగునని నీ వెరుగుదువుగదా; తమ సహోదరులను తరుమవద్దని నీ వెంతవరకు జనులకు ఆజ్ఞ ఇయ్యక యుందు వని యోవాబుతో అనెను.౹

27 అందుకు యోవాబు– దేవుని జీవముతోడు జగడమునకు నీవు వారిని పిలువక యుండినయెడల జనులందరు తమ సహోదరులను తరుమక ఉదయముననే తిరిగి పోయియుందురని చెప్పి

28 బాకా ఊదగా జనులందరు నిలిచి, ఇశ్రాయేలువారిని తరుముటయు వారితో యుద్ధము చేయుటయు మానిరి.౹

29 అబ్నేరును అతనివారును ఆ రాత్రి అంత మైదానము గుండ ప్రయాణము చేసి యొర్దానునది దాటి బిత్రోను మార్గమున మహనయీమునకు వచ్చిరి.౹

30 యోవాబు అబ్నేరును తరుముట మాని తిరిగి వచ్చి జనులను సమ కూర్చి లెక్కచూడగా దావీదు సేవకులలో అశాహేలు గాక పందొమ్మండుగురు లేకపోయిరి.౹

31 అయితే దావీదు సేవకులు బెన్యామీనీయులలోను అబ్నేరు జనులలోను మూడువందల అరువది మందిని హతము చేసిరి.౹

32 జనులు అశాహేలును ఎత్తికొనిపోయి బేత్లెహేములోనున్న అతని తండ్రి సమాధియందు పాతిపెట్టిరి. తరువాత యోవాబును అతనివారును రాత్రి అంతయు నడిచి తెల్లవారు సమయమున హెబ్రోనునకు వచ్చిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2SA/2-198b17af03734972c153274b88d53c2c.mp3?version_id=1787—

Categories
2 సమూయేలు

2 సమూయేలు 3

1 సౌలు కుటుంబికులకును దావీదు కుటుంబికులకును బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంత కంతకు ప్రబలెను; సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను.

2 హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులెవరనగా, అమ్నోను అను అతని జ్యేష్ఠపుత్రుడు యెజ్రెయేలీయు రాలగు అహీనోయమువలన పుట్టెను.౹

3 కిల్యాబు అను రెండవవాడు కర్మెలీయుడగు నాబాలు భార్యయైన అబీగ యీలు వలన పుట్టెను. మూడవవాడైన అబ్షాలోము గెషూరు రాజగు తల్మయి కుమార్తెయగు మయకావలన పుట్టెను.౹

4 నాలుగవవాడగు అదోనీయా హగ్గీతువలన పుట్టెను. అయిదవవాడగు షెఫట్య అబీటలువలన పుట్టెను.౹

5 ఆరవవాడగు ఇత్రెయాము దావీదునకు భార్యయగు ఎగ్లావలన పుట్టెను. వీరు హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు.

6 సౌలు కుటుంబికులకును దావీదు కుటుంబికులకును యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబికులకు బహు సహాయముచేసెను.౹

7 అయ్యా కుమార్తెయైన రిస్పా యను ఒక ఉపపత్ని సౌలుకుండెను–నా తండ్రికి ఉప పత్నియగు దానిని నీ వెందుకు కూడితివని ఇష్బోషెతు అబ్నేరును అడుగగా

8 అబ్నేరును ఇష్బోషెతు అడిగిన మాటకు బహుగా కోపగించుకొని–నిన్ను దావీదు చేతి కప్పగింపక నీ తండ్రియైన సౌలు ఇంటి వారికిని అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారము చేసిన నన్ను యూదావారికి చేరిన కుక్కతో సమానునిగాచేసి యీ దినమున ఒక స్త్రీనిబట్టి నామీద నేరము మోపుదువా?

9 యెహోవా దావీదునకు ప్రమాణము చేసిన దానిని అతనిపక్షమున నేను నెరవేర్చని యెడల

10 దేవుడు నాకు గొప్పఅపాయము కలుగజేయును గాక; సౌలు ఇంటివారి వశము కాకుండ రాజ్యమును తప్పించి దాను మొదలుకొని బెయేర్షెబావరకు దావీదు సింహాసనమును ఇశ్రాయేలువారిమీదను యూదావారిమీదను నేను స్థిరపరచెదననెను.౹

11 కావున ఇష్బోషెతు అబ్నేరునకు భయపడి యిక ఏ మాటయు పలుకలేక పోయెను.

12 అబ్నేరు తన తరపున దావీదునొద్దకు దూతలను పంపి –ఈ దేశము ఎవరిది? నీవు నాతో నిబంధనచేసినయెడల నేను నీకు సహాయము చేసి, ఇశ్రాయేలు వారినందరిని నీతట్టు త్రిప్పెదనని వర్తమానము పంపగా దావీదు– మంచిది; నేను నీతో నిబంధన చేసెదను.౹

13 అయితే నీవు ఒకపని చేయవలెను; నా దర్శనమునకు వచ్చునప్పుడు సౌలు కుమార్తెయగు మీకాలును నా యొద్దకు తోడుకొని రావలెను; లేదా నీకు దర్శనము దొరకదనెను.౹

14 మరియు దావీదు సౌలు కుమారుడగు ఇష్బోషెతునొద్దకు దూతలను పంపి–ఫిలిష్తీయులలో నూరుమంది ముందోళ్లను తెచ్చి నేను పెండ్లి చేసికొనిన మీకాలును నాకప్పగింపుమని చెప్పుడనగా

15 ఇష్బోషెతు దూతను పంపి, లాయీషు కుమారుడగు పల్తీయేలు అను దాని పెనిమిటియొద్దనుండి మీకాలును పిలువనంపెను.౹

16 దాని పెనిమిటి బహూరీమువరకు దాని వెనుక ఏడ్చుచు రాగా అబ్నేరు–నీవు తిరిగి పొమ్మనెను గనుక అతడు వెళ్లిపోయెను.

17 అంతలో అబ్నేరు ఇశ్రాయేలు వారి పెద్దలను పిలిపించి –దావీదు మిమ్మును ఏలవలెనని మీరు ఇంతకుమునుపు కోరితిరి గదా

18 –నా సేవకుడైన దావీదుచేత నా జనులగు ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలోనుండియు, వారి శత్రువులందరి చేతిలోనుండియు విమోచించెదనని యెహోవా దావీదునుగూర్చి సెలవిచ్చియున్నాడు గనుక మీ కోరిక నెరవేర్చుకొనుడని వారితో చెప్పెను.౹

19 మరియు అబ్నేరు బెన్యామీనీయులతో ఆలాగున మాటలాడిన తరువాత హెబ్రోనునకు వచ్చి ఇశ్రాయేలువారి దృష్టికిని బెన్యామీనీయులందరి దృష్టికిని ప్రయోజనమైన దానిని దావీదునకు పూర్తిగా తెలియచేసెను.౹

20 అందునిమిత్తమై అబ్నేరు ఇరువదిమందిని వెంటబెట్టుకొని హెబ్రోనులోనున్న దావీదునొద్దకు రాగా దావీదు అబ్నేరుకును అతనివారికిని విందుచేయించెను.౹

21 అంతట అబ్నేరు–నేను పోయి ఇశ్రాయేలువారినందరిని నా యేలినవాడవగు నీ పక్షమున సమకూర్చి, వారు నీతో నిబంధనచేయునట్లును, నీ చిత్తానుసారముగా నీవు రాజరికము వహించి కోరినదాని అంతటిమీద ఏలునట్లును చేయుదునని దావీదుతో చెప్పి దావీదునొద్ద సెలవుపుచ్చుకొని సమాధానముగా వెళ్లిపోయెను.౹

22 పిమ్మట దావీదు సేవకులును యోవాబును బందిపోటునుండి బహువిస్తారమైన దోపుడు సొమ్ము తీసికొనిరాగా అబ్నేరు హెబ్రో నులో దావీదునొద్ద లేకపోయెను, దావీదు అతనికి సెలవిచ్చియున్నందున అతడు సమాధానముగా వెళ్లిపోయి యుండెను.౹

23 అయితే యోవాబును అతనియొద్దనున్న సైన్యమును వచ్చినప్పుడు నేరు కుమారుడగు అబ్నేరు రాజునొద్దకు వచ్చెననియు, రాజు అతనికి సెలవిచ్చి పంపెననియు, అతడు సమాధానముగా వెళ్లిపోయెననియు తెలిసికొని

24 యోవాబు రాజునొద్దకు వచ్చి–చిత్తగించుము, నీవు ఏమిచేసితివి? అబ్నేరు నీయొద్దకు వచ్చి నప్పుడు నీవెందుకు అతనికి సెలవిచ్చి పంపి వేసితివి?

25 నేరు కుమారుడగు అబ్నేరును నీవెరుగవా? నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నిటిని నీవుచేయు సమస్తమును తెలిసికొనుటకై అతడు వచ్చెనని చెప్పి

26 దావీదునొద్ద నుండి బయలువెడలి అబ్నేరును పిలుచుటకై దూతలను పంపెను. వారు పోయి సిరా యను బావిదగ్గరనుండి అతనిని తోడుకొని వచ్చిరి; అతడు వచ్చిన సంగతి దావీదునకు తెలియకయుండెను.౹

27 అబ్నేరు తిరిగి హెబ్రోనునకు వచ్చినప్పుడు–సంగతి యెవరికి వినబడకుండ గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాటలాడవలెనని యోవాబు అతని పిలిచి, తన సహోదరుడగు అశాహేలు ప్రాణము తీసినందుకై అతనిని కడుపులో పొడువగా అతడు చచ్చెను.౹

28 ఆ తరువాత ఈ సమాచారము దావీదునకు వినబడినప్పుడు అతడు అనుకొనిన దేమనగా–నేనును నా రాజ్యమును నేరు కుమారుడగు అబ్నేరు ప్రాణము తీయుట విషయములో యెహోవా సన్నిధిని ఎప్పటికిని నిరపరాధులమే.౹

29 ఈ దోషము యోవాబుమీదను అతని తండ్రికి పుట్టిన వారందరిమీదను మోపబడునుగాక. యోవాబు ఇంటివారిలో స్రావముగలవాడైనను కుష్ఠరోగియైనను కఱ్ఱపెట్టుకొని నడుచువాడైనను ఖడ్గముచేత కూలు వాడైనను ఆహారము లేనివాడైనను ఉండకపోడుగాక అనెను.౹

30 ఆలాగున యోవాబును అతని సహోదరుడైన అబీషైయును, అబ్నేరు గిబియోను యుద్ధమందు తమ సహోదరుడైన అశాహేలును చంపిన దానినిబట్టి అతని చంపిరి.

31 దావీదు–మీ బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని అబ్నేరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపము చేయుడని యోవాబునకును అతనితోనున్న వారికందరికిని ఆజ్ఞ ఇచ్చెను.౹

32 రాజును స్వయముగా పాడెవెంట నడిచెను. వారు అబ్నేరును హెబ్రోనులో పాతిపెట్టగా రాజు అబ్నేరు సమాధిదగ్గర ఎలుగెత్తి యేడ్చెను, జనులందరును ఏడ్చిరి.౹

33 మరియు రాజు అబ్నేరునుగూర్చి శోకకీర్తన యొకటి కట్టెను.

34 ఎట్లనగా

అబ్నేరూ

నీచుడొకడు చచ్చునట్లుగా నీవు చావతగునా?

నీచేతులకు కట్లులేకుండగను

నీ కాళ్లకు సంకెళ్లు వేయబడకుండగను

దోషకారి యెదుట ఒకడు పడునట్లు నీవు పడితివే రాజు ఈలాగున కీర్తన యెత్తి పాడగా జనులందరు విని మరియెక్కువగా ఏడ్చిరి.౹

35 ఇంక వెలుగున్నప్పుడు జనులు దావీదునొద్దకు వచ్చి భోజనము చేయుమని అతనిని బతి మాలగా దావీదు ప్రమాణముచేసి–సూర్యుడు అస్తమించకమునుపు ఆహారమేమైనను నేను రుచిచూచినయెడల దేవుడు నాకు గొప్పఅపాయము కలుగజేయునుగాక నెను.౹

36 జనులందరు ఆ సంగతి గ్రహించినప్పుడు సంతోషించిరి; రాజు చేయునదంతయు జనులందరి దృష్టికి అను కూలమైనట్లు అదియు వారి దృష్టికి అనుకూలమాయెను.

37 నేరు కుమారుడైన అబ్నేరును చంపుట రాజు ప్రేరేపణ వలననైనది కాదని ఆ దినమున జనులందరికిని ఇశ్రాయేలు వారికందరికిని తెలియబడెను.౹

38 పిమ్మట రాజు తన సేవకులను పిలిచి వారితో ఈలాగు సెలవిచ్చెను–నేటిదినమున పడిపోయినవాడు ఇశ్రాయేలువారిలో ప్రధానుడనియు పెద్దలలో ఒకడనియు మీకు తెలిసేయున్నది.౹

39 పట్టాభి షేకము నొందినవాడనైనను, నేడు నేను బలహీనుడ నైతిని. సెరూయా కుమారులైన యీ మనుష్యులు నా కంటె బలముగలవారు, అతడు జరిగించిన దుష్క్రియనుబట్టి యెహోవా కీడుచేసినవానికి ప్రతికీడుచేయునుగాక.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2SA/3-1c9eea3e9cba9b7dd351c57ec808437e.mp3?version_id=1787—