Categories
న్యాయాధిపతులు

న్యాయాధిపతులు 20

1 అంతట ఇశ్రాయేలీయులందరు బయలుదేరి దాను మొదలుకొని బెయేర్షెబావరకును గిలాదుదేశమువరకును వారి సమాజము ఏకమనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను.౹

2 దేవుని జన సమాజమునకు చేరినవారు ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటికి పెద్దలుగా నున్నవారై కత్తిదూయు నాలుగు లక్షల కాలుబలము కూడుకొనిరి.౹

3 ఇశ్రాయేలీయులు మిస్పాకు వచ్చియున్నారని బెన్యామీనీయులు వినిరి. ఇశ్రాయేలీయులు–ఈ చెడుతనము ఎట్లు చేయబడెనో అది చెప్పుడని యడుగగా

4 చంప బడిన స్త్రీ పెనిమిటియైన లేవీయుడు ఉత్తరమిచ్చినదేమనగా–బెన్యామీనీయుల గిబియాలో రాత్రి బసచేయుటకై నేనును నా ఉపపత్నియు వచ్చియుండగా

5 గిబియావారు నా మీదికి లేచి రాత్రి నేనున్న యిల్లు చుట్టుకొని నన్ను చంపతలచి

6 నా ఉపపత్నిని బలవంతముచేయగా ఆమె చనిపోయెను. వారు ఇశ్రాయేలీయులలో దుష్కార్యమును వెఱ్ఱిపనిని చేసిరని నేను తెలిసికొని, నా ఉపపత్నిని పట్టుకొని ఆమెను ముక్కలుగా కోసి ఇశ్రాయేలీయుల స్వాస్థ్యమైన దేశమంతటికి ఆ ముక్కలను పంపితిని.౹

7 ఇదిగో ఇశ్రాయేలీయులారా, యిక్కడనే మీరందరు కూడియున్నారు, ఈ సంగతిని గూర్చి ఆలోచనచేసి చెప్పుడనెను.౹

8 అప్పుడు జనులందరు ఏకీభవించి లేచి–మనలో ఎవడును తన గుడారమునకు వెళ్లడు, ఎవడును ఇంటికి వెళ్లడు,౹

9 మనము గిబియా యెడల జరిగింపవలసినదానిని నెరవేర్చుటకై చీట్లు వేసి దాని మీదికి పోదుము. జనులు బెన్యామీనీయుల గిబియాకు వచ్చి

10 ఇశ్రాయేలీయులలో జరిగిన వెఱ్ఱితనము విషయమై పగతీర్చుకొనుటకు వెళ్లువారికొరకు ఆహారము తెచ్చుటకై మనము ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో నూటికి పదిమంది మనుష్యులను, వెయ్యింటికి నూరుమందిని, పదివేలకు వెయ్యిమందిని ఏర్పరచుకొందము రండని చెప్పు కొనిరి.౹

11 కాబట్టి ఇశ్రాయేలీయులందరు ఒక్క మనుష్యుడైనట్టుగా ఏకీభవించి ఆ ఊరివారితో యుద్ధముచేయుటకు కూడిరి.

12 ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులందరియొద్దకు మనుష్యులను పంపి–మీలో జరిగిన యీ చెడుతనమేమిటి?

13 గిబియాలోనున్న ఆ దుష్టులను అప్పగించుడి; వారిని చంపి ఇశ్రాయేలీయులలోనుండి దోషమును పరిహరింప చేయుదమని పలికింపగా, బెన్యామీనీయులు తమ సహోదరులగు ఇశ్రాయేలీయుల మాట విననొల్లక

14 యుద్ధమునకు బయలు దేరవలెనని తమ పట్టణములలోనుండి వచ్చి గిబియాలో కూడుకొనిరి.౹

15 ఆ దినమున బెన్యామీనీయులు తమ జన సంఖ్యను మొత్తముచేయగా ఏడువందలమందియైన గిబియా నివాసులుగాక కత్తిదూయ సమర్థులై పట్టణమునుండి వచ్చినవారు ఇరువదియారు వేలమందియైరి.౹

16 ఆ సమస్త జనములో నేర్పరచబడిన ఏడువందలమంది యెడమచేతి వాటముగలవారు. వీరిలో ప్రతివాడును గురిగా నుంచ బడిన తలవెండ్రుక మీదికి వడిసెలరాయి తప్పక విసరగల వాడు.

17 బెన్యామీనీయులు గాక ఇశ్రాయేలీయులలో ఖడ్గము దూయు నాలుగులక్షలమంది లెక్కింపబడిరి; వీరందరు యోధులు.౹

18 వీరు లేచి బేతేలుకు పోయి–ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్లవలెనని దేవునియొద్ద మనవి చేసినప్పుడు యెహోవా– యూదా వంశస్థులు ముందుగా వెళ్లవలెనని సెలవిచ్చెను.౹

19 కాబట్టి ఇశ్రాయేలీయులు ఉదయముననే లేచి గిబియాకు ఎదురుగా దిగిరి.౹

20 ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో యుద్ధముచేయ బయలుదేరినప్పుడు ఇశ్రాయేలీయులు గిబియామీద పడుటకు యుద్ధపంక్తులు తీర్చగా

21 బెన్యామీనీయులు గిబియాలోనుండి బయటికివచ్చి ఆ దినమున ఇశ్రాయేలీయులలో ఇరువదిరెండు వేలమందిని నేల గూల్చిరి.౹

22 అయితే ఇశ్రాయేలీయులు ధైర్యము తెచ్చుకొని, తాము మొదట ఎక్కడ యుద్ధపంక్తి తీర్చిరో ఆ చోటనే మరల యుద్ధము జరుగవలెనని తమ్మును తాము యుద్ధపంక్తులుగా తీర్చుకొనిరి.౹

23 మరియు ఇశ్రాయేలీయులు పోయి సాయంకాలమువరకు యెహోవా ఎదుట ఏడ్చుచు–మా సహోదరులైన బెన్యామీనీయులతో యుద్ధము చేయుటకు తిరిగి పోదుమా? అని యెహోవాయొద్ద విచారణచేయగా యెహోవావారితో యుద్ధము చేయబోవుడని సెలవిచ్చెను.

24 కాబట్టి ఇశ్రాయేలీయులు రెండవదినమున బెన్యామీనీయులతో యుద్ధము చేయరాగా, ఆ రెండవదినమున బెన్యామీనీయులు వారిని ఎదుర్కొనుటకు

25 గిబి యాలోనుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలీయులలో పదు నెనిమిది వేలమందిని నేలగూల్చి సంహరించిరి.౹

26 వీరందరు కత్తి దూయువారు. అప్పుడు ఇశ్రాయేలీయులందరును జనులందరును పోయి, బేతేలును ప్రవేశించి యేడ్చుచు సాయంకాలమువరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహనబలులను సమాధానబలులను యెహోవా సన్నిధిని అర్పించిరి.౹

27 ఆ దినములలో యెహోవా నిబంధనమందసము అక్కడనే యుండెను.౹

28 అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు ఆ దినములలో దానియెదుట నిలుచువాడు. ఇశ్రాయేలీయులు మరల–మా సహోదరులైన బెన్యామీనీయులతో యుద్ధమునకు పోదుమా, మానుదుమా? అని యెహోవాయొద్ద విచారణచేయగా యెహోవా–వెళ్లుడి రేపు నీ చేతికి వారిని అప్పగించెదనని సెలవిచ్చెను.౹

29 అప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా చుట్టు మాటు గాండ్రను పెట్టిరి.

30 మూడవదినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో యుద్ధమునకు పోయిమునుపటివలె గిబియావారితో యుద్ధము చేయుటకు సిద్ధపడగా

31 బెన్యామీనీయులు వారిని ఎదుర్కొనుటకు బయలుదేరి పట్టణములోనుండి తొలగివచ్చిమునుపటివలె ఇశ్రాయేలీయులలో గాయ పరచబడినవారిని ఇంచుమించు ముప్పదిమంది మనుష్యులను రాజమార్గములలో చంపుచువచ్చిరి. ఆ మార్గములలో ఒకటి బేతేలునకును ఒకటి పొలములోనున్న గిబియాకును పోవుచున్నవి.౹

32 బెన్యామీనీయులుమునుపటివలె వారు మనయెదుట నిలువలేక కొట్టబడియున్నారని అనుకొనిరిగాని ఇశ్రాయేలీయులు–మనము పారిపోయి వారిని పట్టణములోనుండి రాజమార్గములలోనికి రాజేయుదము రండని చెప్పుకొనియుండిరి.౹

33 ఇశ్రాయేలీయులందరు తమ చోటనుండి లేచి బయల్తామారులో తమ్మును తాము యుద్ధమునకు సిద్ధపరచుకొనులోగా ఇశ్రాయేలీయుల మాటుగాండ్రును తమ చోటనుండి గిబియా బట్టబయటి మార్గమునకు త్వరగా వచ్చిరి.౹

34 అప్పుడు ఇశ్రాయేలీయులందరిలోనుండి ఏర్ప రచబడిన పదివేలమంది గిబియాకు ఎదురుగా వచ్చినందున కఠినయుద్ధము జరిగెను. అయితే తమకు అపాయము తటస్థెమైనదని బెన్యామీనీయులకు తెలియలేదు.౹

35 అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయులచేత బెన్యామీనీయులను హతముచేయించెను. ఆ దినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులలో ఇరువదియయిదు వేల నూరుమంది మనుష్యులను చంపిరి. వీరందరు కత్తి దూయువారు.

36 బెన్యామీనీయులు జరుగుదాని చూచి తమకు అప జయము కలిగినదని తెలిసికొనిరి. ఇశ్రాయేలీయులు తాము గిబియామీద పెట్టిన మాటుగాండ్రను నమ్మి బెన్యామీనీయులకు స్థలమిచ్చిరి.౹

37 మాటుననున్నవారు త్వరపడి గిబియాలో చొరబడి కత్తివాతను ఆ పట్టణములోనివారినందరిని హతముచేసిరి.౹

38 ఇశ్రాయేలీయులకును మాటు గాండ్రకును నిర్ణయమైన సంకేతమొకటి యుండెను; అదే దనగా వారు పట్టణములోనుండి పొగ గొప్ప మేఘమువలె లేచునట్లు చేయుటయే.౹

39 ఇశ్రాయేలీయులు యుద్ధము నుండి వెనుకతీసి తిరిగినప్పుడు బెన్యామీనీయులు–వీరు మొదటి యుద్ధములో అపజయమొందినట్లు మనచేత ఓడి పోవుదురుగదా అనుకొని, చంపనారంభించి, ఇశ్రాయేలీయులలో ఇంచుమించు ముప్పదిమంది మనుష్యులను హతము చేసిరి.౹

40 అయితే పట్టణమునుండి ఆకాశముతట్టు స్తంభ రూపముగా పొగ పైకిలేవ నారంభింపగా బెన్యామీనీయులు వెనుకతట్టు తిరిగి చూచిరి. అప్పుడు ఆ పట్టణ మంతయు ధూమమయమై ఆకాశమున కెక్కుచుండెను.౹

41 ఇశ్రాయేలీయులు తిరిగినప్పుడు బెన్యామీనీయులు తమకు అపజయము కలిగినదని తెలిసికొని విభ్రాంతినొంది

42 యెడారి మార్గముతట్టు వెళ్లుదమని ఇశ్రాయేలీయుల యెదుట వెనుకకు తిరిగిరిగాని, యుద్ధమున తరుమబడగా పట్టణములలోనుండి వచ్చినవారు మధ్య మార్గమందే వారిని చంపిరి.౹

43 ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులను చుట్టుకొని తరిమి తూర్పుదిక్కున గిబియాకు ఎదురుగా వారు దిగిన స్థలమున వారిని త్రొక్కుచుండిరి.౹

44 అప్పుడు బెన్యామీనీయులలో పదునెనిమిది వేలమంది మనుష్యులు పడిపోయిరి. వీరందరు పరాక్రమవంతులు.౹

45 అప్పుడు మిగిలినవారు తిరిగి యెడారిలో నున్న రిమ్మోనుబండకు పారిపోగా, వారు రాజమార్గములలో చెదిరియున్న అయిదువేలమంది మనుష్యులను చీలదీసి గిదోమువరకు వారిని వెంటాడి తరిమి వారిలో రెండు వేలమందిని చంపిరి.౹

46 ఆ దినమున బెన్యామీనీయులలో పడిపోయినవారందరు కత్తిదూయు ఇరువదియయిదు వేలమంది, వీరందరు పరాక్రమవంతులు.౹

47 ఆరువందలమంది తిరిగి యెడారిలోనున్న రిమ్మోను కొండకు పారిపోయి రిమ్మోను కొండమీద నాలుగు నెలలు నివసించిరి.౹

48 మరియు ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులమీదికి తిరిగి వచ్చి పట్టణనివాసులనేమి పశువులనేమి దొరికిన సమస్తమును కత్తివాత హతముచేసిరి. ఇదియుగాక వారు తాము పట్టుకొనిన పట్టణములన్నిటిని అగ్నిచేత కాల్చివేసిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JDG/20-b130bb549283c969e1927a908e869bd1.mp3?version_id=1787—

Categories
న్యాయాధిపతులు

న్యాయాధిపతులు 21

1 ఇశ్రాయేలీయులు తమలో ఎవడును తన కుమార్తెను . బెన్యామీనీయుని కియ్యకూడదని మిస్పాలో ప్రమాణము చేసికొనియుండిరి.౹

2 ప్రజలు బేతేలుకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలమువరకు కూర్చుండి

3 –యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, నేడు ఇశ్రాయేలీయులలో ఒక గోత్రము లేకపోయెను. ఇది ఇశ్రాయేలీయులకు సంభవింపనేల అని బహుగా ఏడ్చిరి.౹

4 మరునాడు జనులు వేకువనే లేచి అక్కడ బలిపీఠమును కట్టి దహనబలులను సమాధానబలులను అర్పించిరి.౹

5 అప్పుడు ఇశ్రాయేలీయులు – ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో మిస్పాలో యెహోవా పక్షమున రాకపోయినవారెవరని విచారించిరి. ఏలయనగా అట్టివారికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెనని ఖండితముగా ప్రమాణము చేసియుండిరి.౹

6 ఇశ్రాయేలీయులు తమ సహోదరులైన బెన్యామీనీయులనుగూర్చి పశ్చాత్తాపపడి–నేడు ఒక గోత్రము ఇశ్రాయేలీయులలో నుండకుండ కొట్టివేయబడియున్నది;౹

7 మిగిలియున్నవారికి భార్యలు దొరుకునట్లు మనము మన కుమార్తెలను వారికి పెండ్లి చేయమని యెహోవా తోడని ప్రమాణము చేసితిమిగదా; వారి విషయములో ఏమి చేయ గలము? అని చెప్పుకొనిరి.౹

8 మరియు వారు ఇశ్రాయేలీయుల గోత్రములలో యెహోవా పక్షమున మిస్పాకు రానిది ఏదని విచారింపగా

9 సమాజమునకుచేరిన యాబేష్గిలాదునుండి సేనలోనికి ఎవడును రాలేదని తేలెను. జన సంఖ్య చేసినప్పుడు యాబేష్గిలాదు నివాసులలో ఒకడును అక్కడ ఉండలేదు.౹

10 కాబట్టి సమాజపువారు పరాక్రమవంతులైన పండ్రెండు వేలమంది మనుష్యులను పంపించి –మీరు పోయి స్త్రీలనేమి పిల్లలనేమి యాబేష్గిలాదు నివాసులనందరిని కత్తివాతను హతము చేయుడి.౹

11 మీరు చేయవలసినదేమనగా, ప్రతి పురుషుని పురుషసంయోగము నెరిగిన ప్రతి స్త్రీని నశింపజేయవలెనని చెప్పిరి.౹

12 యాబేష్గిలాదు నివాసులలో పురుషసంయోగము నెరుగని నాలుగు వందలమంది కన్యలైన స్త్రీలు దొరుకగా కనాను దేశమందలి షిలోహులోనున్న సేనలోనికి వారిని తీసికొని వచ్చిరి.

13 ఆ సర్వసమాజము రిమ్మోను కొండలోనున్న బెన్యామీనీయులతో మాటలాడుటకును వారిని సమాధానపరచుటకును వర్తమానము పంపగా

14 ఆ వేళను బెన్యామీనీయులు తిరిగి వచ్చిరి. అప్పుడు వారు తాము యాబేష్గి లాదు స్త్రీలలో బ్రదుకనిచ్చినవారిని వారికిచ్చి పెండ్లి చేసిరి. ఆ స్ర్రీలు వారికి చాలకపోగా

15 యెహోవా ఇశ్రాయేలీయుల గోత్రములలో లోపము కలుగజేసి యుండుట జనులు చూచి బెన్యామీనీయులనుగూర్చి పశ్చాత్తాపపడిరి.

16 సమాజప్రధానులు బెన్యామీను గోత్రములో స్త్రీలు నశించియుండుట చూచి మిగిలినవారికి భార్యలు దొరుకునట్లు మనమేమి చేయుదమని యోచించుకొని

17 ఇశ్రాయేలీయులలోనుండి ఒక గోత్రము తుడిచివేయబడకుండునట్లు బెన్యామీనీయులలో తప్పించుకొనిన వారికి స్వాస్థ్య ముండవలెననిరి.౹

18 ఇశ్రాయేలీయులలో ఎవడైనను తన కుమార్తెను బెన్యామీనీయునికి ఇచ్చినయెడల వాడు నిర్మూలము చేయబడునని ప్రమాణము చేసియున్నాము గనుక మనము మన కుమార్తెలను వారికి పెండ్లి చేయకూడ దని చెప్పుకొనుచుండిరి.౹

19 కాగా వారు బెన్యామీనీయులతో ఇట్లనిరి–ఇదిగో బేతేలుకు ఉత్తరదిక్కున బేతేలు నుండి షెకెమునకు పోవు రాజమార్గమునకు తూర్పుననున్న లెబోనాకు దక్షిణదిక్కున యెహోవాకు పండుగ ఏటేట షిలోహులో జరుగునని చెప్పి బెన్యామీనీయులను చూచి

20 –మీరు వెళ్లి ద్రాక్షతోటలలో మాటుననుండి షిలోహు స్త్రీలు నాట్యమాడువారితో కలిసి నాట్యమాడుటకు బయలుదేరగా

21 ద్రాక్షతోటలలోనుండి బయలుదేరివచ్చి పెండ్లి చేసికొనుటకు ప్రతివాడును షిలోహు స్త్రీలలో ఒకదాని పట్టుకొని బెన్యామీనీయుల దేశమునకు పారిపోవుడి.౹

22 తరువాత వారి తండ్రులైనను సహోదరులైనను వాదించుటకు మీయొద్దకు వచ్చినయెడల మేము –ఆ యుద్ధమునుబట్టి వారిలో ప్రతివానికిని పెండ్లికి స్త్రీ దొరకలేదు గనుక ఈ స్త్రీలను దయచేసి మాకియ్యుడి, ఈ సమయమున వారికిచ్చినయెడల మీరు అపరాధులగుదురు గనుక మాకిచ్చినట్లుగా ఇయ్యుడని వారితో చెప్పెదమనిరి.౹

23 కాగా బెన్యామీనీయులు అట్లు చేసి తమ లెక్క చొప్పున నాట్యమాడిన వారిలోనుండి స్త్రీలను పట్టుకొని వారిని తీసికొనిపోయి తమ స్వాస్థ్యమునకు వెళ్లి పట్టణములను కట్టి వాటిలో నివసించిరి.౹

24 అటుపిమ్మట ఇశ్రాయేలీయులలో ప్రతివాడును అక్కడనుండి తమ గోత్రస్థానములకును కుటుంబములకును పోయెను. అందరును అక్కడనుండి బయలుదేరి తమ స్వాస్థ్యములకు పోయిరి.౹

25 ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు; ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచువచ్చెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JDG/21-60c24c8a46fedc5c8a6535a7d2e4640e.mp3?version_id=1787—

Categories
రూతు

రూతు 1

1 న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరవు కలుగగా యూదా బేత్లెహేమునుండి ఒక మనుష్యుడు తన భార్యను తన యిద్దరు కుమారులను వెంట బెట్టుకొని మోయాబుదేశమున కాపురముండుటకు వెళ్లెను.౹

2 ఆ మనుష్యుని పేరు ఎలీమెలెకు, అతని భార్యపేరు నయోమి; అతని యిద్దరు కుమారుల పేళ్లు మహ్లోను కిల్యోను; వారు యూదా బేత్లెహేమువారైన ఎఫ్రాతీయులు; వారు మోయాబు దేశమునకు వెళ్లి అక్కడ కాపురముండిరి.౹

3 నయోమి పెనిమిటియైన ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె యిద్దరు కుమాళ్లును నిలిచియుండిరి.౹

4 వారు మోయాబుస్త్రీలను పెండ్లి చేసికొనిరి. వారిలో ఒకదాని పేరు ఓర్పా రెండవదాని పేరు రూతు.౹

5 వారు ఇంచుమించు పది సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోను కిల్యోనను ఇద్దరును చనిపోయిరి; కాగా ఆ స్త్రీ తాను కనిన యిద్దరు కుమారులును తన పెనిమిటియు లేనిదాయెను.౹

6 వారికి ఆహారమిచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబుదేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్లుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి.౹

7 అప్పుడు ఆమెయున్న స్థలమునుండి ఆమెతోకూడ ఆమె యిద్దరు కోడండ్రును బయలుదేరి యూదాదేశమునకు తిరిగి పోవలెనని మార్గమున వెళ్లుచుండగా

8 నయోమి తన యిద్దరు కోడండ్రను చూచి –మీరు మీ తల్లులయిండ్లకు తిరిగి వెళ్లుడి; చనిపోయిన వారి యెడలను నా యెడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ యెడల దయచూపునుగాక;౹

9 మీలో ఒక్కొక్కతె పెండ్లి చేసికొని తన యింట నెమ్మదినొందునట్లు యెహోవా దయచేయును గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను.౹

10 అంతట వారు ఎలుగెత్తి యేడ్చి–నీ ప్రజలయొద్దకు నీతోకూడ వచ్చెదమని ఆమెతో చెప్పగా

11 నయోమి–నా కుమార్తెలారా, మీరు మరలుడి; నాతోకూడ మీరు రానేల? మిమ్మును పెండ్లి చేసికొనుటకై యింక కుమారులు నా గర్భమున నుందురా?

12 నా కుమార్తెలారా, తిరిగి వెళ్లుడి, నేను పురుషునితో నుండలేని ముసలిదానను; నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితోనుండి కుమారులను కనినను

13 వారు పెద్ద వారగువరకు వారికొరకు మీరు కనిపెట్టుకొందురా? మీరు వారికొరకు కనిపెట్టుకొని పురుషులు లేక యొంటరి కత్తెలైయుందురా? నా కుమార్తెలారా, అదికూడదు; యెహోవా నాకు విరోధియాయెను; అది మిమ్మును నొప్పించినంతకంటె నన్ను మరి యెక్కువగా నొప్పించినదని వారితో చెప్పెను.౹

14 వారు ఎలుగెత్తి యేడ్వగా ఓర్పా తన అత్తను ముద్దుపెట్టుకొనెను, రూతు ఆమెను హత్తు కొనెను. ఇట్లుండగా

15 ఆమె–ఇదిగో నీ తోడికోడలు తన జనులయొద్దకును తన దేవునియొద్దకును తిరిగి పోయినదే; నీవును నీ తోడికోడలి వెంబడివెళ్లుమనెను.౹

16 అందుకు రూతు–నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్లు చోటికే నేను వచ్చెదను, నీవు నివసించుచోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు;౹

17 నీవు మృతి బొందుచోటను నేను మృతిబొందెదను, అక్కడనే పాతిపెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించినయెడల యెహోవా నాకు ఎంత కీడైన చేయునుగాక అనెను.౹

18 తనతోకూడ వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలిసి కొనినప్పుడు అందునుగురించి ఆమెతో మాటలాడుట మానెను గనుక వారిద్దరు బేత్లెహేమునకు వచ్చువరకు ప్రయాణము చేసిరి.౹

19 వారు బేత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరివారందరు వారియొద్దకు గుంపుకూడి వచ్చి–ఈమె నయోమి గదా అని అనుకొనుచుండగా

20 ఆమె–సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమిఅనక మారాఅనుడి.౹

21 నేను సమృద్ధిగలదాననై వెళ్లితిని, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అనిపిలువనేల? యెహోవా నామీద విరుద్ధముగ సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పెను.౹

22 అట్లు నయోమియు ఆమెతోకూడ మోయాబీయురాలైన రూతు అను ఆమె కోడలును మోయాబుదేశమునుండి తిరిగి వచ్చిరి. వారిద్దరు యవలకోత ఆరంభములో బేత్లెహేము చేరిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/RUT/1-fbd84be138b5c43bbcbc77db4b84bdd6.mp3?version_id=1787—

Categories
రూతు

రూతు 2

1 నయోమి పెనిమిటికి బంధువు డొకడుండెను. అతడు చాల ఆస్తిపరుడు, అతడు ఎలీమెలెకు వంశపువాడై యుండెను, అతని పేరు బోయజు.౹

2 మోయాబీయు రాలైన రూతు–నీ సెలవైనయెడల నేను పొలములోనికి పోయి, యెవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె నేరుకొందునని నయోమితో చెప్పగా ఆమె–నా కుమారీ పొమ్మనెను.౹

3 కాబట్టి ఆమె వెళ్లి పొలములోనికి వచ్చి చేను కోయువారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపువాడైన బోయజుది.౹

4 బోయజు బేత్లెహేమునుండి వచ్చి–యెహోవా మీకు తోడై యుండునుగాకని చేను కోయువారితో చెప్పగా వారు–యెహోవా నిన్ను ఆశీర్వదించును గాకనిరి.౹

5 అప్పుడు బోయజు కోయువారిమీద ఉంచబడిన తన పనివానిని చూచి–ఈ చిన్నది ఎవరిదని అడుగగా

6 కోయువారిమీద నుంచబడిన ఆ పనివాడు– ఈమె మోయాబుదేశమునుండి నయోమితోకూడ తిరిగి వచ్చిన మోయాబీయురాలైన యౌవనురాలు.౹

7 ఆమె–నేను కోయువారి వెనుకకు పనలమధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగెను. ఆమె వచ్చి ఉదయము మొదలుకొని యిదివరకు ఏరుకొను చుండెను, కొంతసేపు మాత్రము ఆమె యింట కూర్చుండెనని వాడు చెప్పెను.౹

8 అప్పుడు బోయజు రూతుతో– నా కుమారీ, నా మాట వినుము; వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు, ఇచ్చట నా పనికత్తెలయొద్ద నిలకడగా ఉండుము.౹

9 వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యౌవనస్థులకు ఆజ్ఞాపించియున్నాను, నీకు దాహమగునప్పుడుకుండలయొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పెను.౹

10 అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని–ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా బోయజు–నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను.౹

11 నీవు నీ తలి దండ్రులను నీ జన్మభూమిని విడిచి, యింతకుముందు నీవు ఎరుగని జనము నొద్దకు వచ్చితివి.౹

12 యెహోవా నీవు చేసినదానికి ప్రతిఫలమిచ్చును; ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా రెక్కలక్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి; ఆయన నీకు సంపూర్ణమైన బహుమాన మిచ్చునని ఆమెకుత్తరమిచ్చెను.౹

13 అందుకు ఆమె–నా యేలినవాడా, నేను నీ పనికత్తెలలో ఒకదానను కాకపోయినను, నీవు నన్నాదరించి నీ దాసురాలినగు నాయందు ప్రేమ గలిగి మాటలాడితివి గనుక నాయెడల నీకు కటాక్షము కలుగనిమ్మని చెప్పెను.౹

14 బోయజు–భోజనకాలమున నీ విక్కడికి వచ్చి భోజనముచేసి, చిరకలో నీ ముక్క ముంచి, తినుమని ఆమెతో చెప్పగా, చేను కోయువారియొద్ద ఆమె కూర్చుండెను. అతడు ఆమెకు పేలాలు అందియ్యగా ఆమెతిని తృప్తిపొంది కొన్ని మిగిల్చెను.౹

15 ఆమె యేరు కొనుటకు లేచినప్పుడు బోయజు–ఆమె పనలమధ్యను ఏరుకొనవచ్చును, ఆమెను అవమానపరచకుడి

16 మరియు ఆమెకొరకు పిడికెళ్లు పడవేసి ఆమె యేరుకొనునట్లు విడిచిపెట్టుడి, ఆమెను గద్దింపవద్దని తన దాసుల కాజ్ఞాపించెను.౹

17 కాబట్టి ఆమె అస్తమయమువరకు ఆ చేనిలో ఏరుకొనుచు, తాను ఏరుకొనిన దానిని దుల్లకొట్టగా అవి దాదాపు తూమెడు యవలాయెను.౹

18 ఆమె వాటిని ఎత్తికొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె యేరు కొనిన వాటిని చూచెను. ఆమెతిని తృప్తిపొందిన తరువాత తాను మిగిల్చినదానిని చూపించి ఆమెకిచ్చెను.౹

19 అంతట ఆమె అత్త ఆమెతో–నేడు నీవెక్కడ ఏరు కొంటివి? ఎక్కడ పనిచేసితివి? నీయందు లక్ష్యముంచినవాడు దీవింపబడునుగాక అనగా, ఆమె తాను ఎవనియొద్ద పనిచేసెనో అది తన అత్తకు తెలియచెప్పి–ఎవని యొద్ద నేడు పనిచేసితినో అతనిపేరు బోయజు అనెను.౹

20 నయోమి–బ్రదికియున్నవారికిని చచ్చినవారికిని ఉపకారము చేయుట మానని యితడు యెహోవాచేత ఆశీర్వదింపబడునుగాక అని తన కోడలితో అనెను. మరియు నయోమి–ఆ మనుష్యుడు మనకు సమీపబంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా

21 మోయాబీయురాలైన రూతు–అంతేకాదు, అతడు నన్ను చూచి, తనకు కలిగిన పంటకోత అంతయు ముగించువరకు తన పనివారియొద్ద నిలకడగా ఉండుమని నాతో చెప్పెననెను.౹

22 అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో–నా కుమారీ, అతని పనికత్తెలతోకూడనే బయలుదేరుచు వేరొక చేనిలోనివారికి నీవు కనబడక పోవుట మంచిదనెను.౹

23 కాబట్టి యవలకోతయు గోధు మలకోతయు ముగియువరకు ఆమె యేరుకొనుచు బోయజు పనికత్తెలయొద్ద నిలకడగానుండి తన అత్త యింట నివసించెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/RUT/2-3e9a4110fb9f37d5db807cfe65b19c61.mp3?version_id=1787—

Categories
రూతు

రూతు 3

1 ఆమె అత్తయైన నయోమి–నా కుమారీ, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను గదా.౹

2 ఎవని పనికత్తెలయొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో యీ రాత్రి అతడు కళ్లమున యవలు తూర్పారబట్టింప బోవుచున్నాడు.౹

3 నీవు స్నానముచేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్లమునకు వెళ్లుము; అతడు అన్నపానములు పుచ్చు కొనుట చాలించువరకు నీవు అతనికి మరుగైయుండుము.౹

4 అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్లమీద నున్న బట్ట తీసి పండుకొనవలెను; నీవు చేయవలసినదానిని అతడు నీకు తెలియజేయునని ఆమెతో అనగా

5 ఆమె–నీవు సెలవిచ్చినదంతయు చేసెదనని చెప్పి

6 ఆ కళ్లమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను.౹

7 బోయజు మనస్సున సంతోషించునట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్పయొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్లమీదనున్న బట్ట తీసి పండుకొనెను.౹

8 మధ్యరాత్రియందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు, ఒక స్త్రీ అతని కాళ్లయొద్ద పండుకొని యుండెను.౹

9 అతడు–నీ వెవరవని అడుగగా ఆమె– నేను రూతు అను నీ దాసురాలిని; నీవు నాకు సమీప బంధువుడవు గనుక నీ దాసురాలిమీద నీ కొంగు కప్పుమనగా

10 అతడు–నా కుమారీ, యెహోవాచేత నీవు దీవెన నొందినదానవు; కొద్దివారినేగాని గొప్పవారినేగాని యౌవనస్థులను నీవు వెంబడింపక యుండుటవలన నీమునుపటి సత్ ప్రవర్తనకంటె వెనుకటి సత్ ప్రవర్తన మరి ఎక్కువైనది.౹

11 కాబట్టి నా కుమారీ, భయపడకుము; నీవు చెప్పినదంతయు నీకు చేసెదను. నీవు యోగ్యురాలవని నా జనులందరు ఎరుగుదురు.౹

12 నేను నిన్ను విడిపింపగలవాడనను మాట వాస్తవమే; అయితే నీకు నాకంటె సమీపమైన బంధువు డొకడున్నాడు.౹

13 ఈ రాత్రి యుండుము; ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపినయెడల సరి, అతడు విడిపింపవచ్చును. నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టము లేక పోయినయెడల, యెహోవా జీవముతోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపెదను; ఉదయమువరకు పండుకొనుమని చెప్పెను.౹

14 కాబట్టి ఆమె ఉదయమువరకు అతని కాళ్లయొద్ద పండుకొని, ఒకని నొకడు గుర్తించుపాటి వెలుగు రాకముందే లేచెను. అప్పుడు అతడు–ఆ స్త్రీ కళ్లమునకు వచ్చిన సంగతి తెలియజేయకుడని చెప్పెను.౹

15 మరియు అతడు–నీవు వేసికొనిన దుప్పటి తెచ్చిపట్టుకొనుమని చెప్పగా ఆమె దాని పట్టెను. అతడు ఆరు కొలల యవలను కొలచి ఆమె భుజముమీద నుంచగా ఆమె పురములోనికి వెళ్లెను.౹

16 ఆమె తన అత్త యింటికి వచ్చినప్పుడు అత్త–నా కుమారీ, నీ పని యెట్లు జరిగెనని యడుగగా, ఆమె ఆ మనుష్యుడు తనకు చేసినదంతయు తెలియజేసి

17 –నీవు వట్టిచేతులతో నీ అత్త యింటికి పోవద్దని చెప్పి అతడు ఈ ఆరు కొలల యవలను నాకిచ్చెననెను.౹

18 అప్పుడు ఆమె–నా కుమారీ, యీ సంగతి నేటిదినమున నెరవేర్చితేనే కాని ఆ మనుష్యుడు ఊరకుండడు గనుక యిది ఏలాగు జరుగునో నీకు తెలియువరకు ఊరకుండుమనెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/RUT/3-12495539f0140736c83a602835f51e5a.mp3?version_id=1787—

Categories
రూతు

రూతు 4

1 బోయజు పురద్వారమునొద్దకు పోయి అక్కడ కూర్చుండగా, బోయజు చెప్పిన బంధువుడు ఆ త్రోవను పోవుచుండెను గనుక బోయజు–ఓయి, యీతట్టు తిరిగి ఇక్కడ కూర్చుండుమని అతని పిలువగా అతడు వచ్చి కూర్చుండెను.౹

2 బోయజు ఆ ఊరి పెద్దలలో పదిమందిని పిలిపించుకొని, ఇక్కడ కూర్చుండుడని చెప్పగా వారును కూర్చుండిరి.౹

3 అతడు–మోయాబు దేశమునుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలీమెలెకునకు కలిగిన భూభాగమును అమ్మివేయుచున్నది గనుక నీవు చెవులార వినునట్లు నేనొకసంగతి తెలియజేయవలెనని యున్నాను.౹

4 ఈ పురనివాసులయెదుటను నా జనుల పెద్దలయెదుటను ఆ భూమిని సంపాదించుకొనుము; ఏమనగా దాని విడిపించుటకు నీవు ఒప్పుకొనినయెడల విడిపింపుము, దాని విడిపింపనొల్లని యెడల అది స్పష్టముగా నాతో చెప్పుము. నీవు గాక దాని విడిపింపవలసిన బంధువుడెవడును లేడు; నీ తరువాతి వాడను నేనే అని బంధువునితో చెప్పెను. అందుకతడు–నేను విడిపించెదననెను.౹

5 బోయజు–నీవు నయోమి చేతినుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయినవానిపేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయినవాని భార్యయైన రూతు అను మోయాబీయురాలి యొద్ద నుండియు దాని సంపాదింపవలెనని చెప్పగా

6 ఆ బంధువుడు– నేను దానిని విడిపించుకొనలేను, నా స్వాస్థ్యమును పోగొట్టుకొందునేమో, నేను దాని విడిపింపలేను గనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుమని చెప్పెను.౹

7 ఇశ్రాయేలీయులలో బంధు ధర్మమునుగూర్చి గాని, క్రయవిక్రయములనుగూర్చిగాని, ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా, ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువాని కిచ్చుటయే. ఈ పని ఇశ్రాయేలీయులలో ప్రమాణముగా ఎంచబడెను.౹

8 ఆ బంధువుడు–నీవు దానిని సంపాదించుకొను మని బోయజుతో చెప్పి తన చెప్పుతీయగా

9 బోయజు –ఎలీమెలెకునకు కలిగినది యావత్తును కిల్యోనుకును మహ్లో నుకును కలిగినది యావత్తును నయోమి చేతినుండి సంపా దించితినని నేనన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై యున్నారు.౹

10 మరియు చనిపోయినవాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లును, చనిపోయినవాని పేరు అతని సహోదరులలోనుండియు, అతని స్థలముయొక్క ద్వారమునుండియు కొట్టివేయబడక యుండునట్లును, నేను మహ్లోను భార్యయైన రూతను మోయాబీయురాలిని సంపాదించుకొని పెండ్లిచేసికొనుచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులైయున్నారని పెద్దలతోను ప్రజలందరితోను చెప్పెను.౹

11 అందుకు పురద్వారముననుండిన ప్రజలందరును పెద్దలును–మేము సాక్షులము, యెహోవా నీ యింటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్లజేసిన రాహేలును పోలినదానిగాను లేయాను పోలిన దానిగాను చేయును గాక;౹

12 ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగినవాడవై బేత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువు గాక; యెహోవా యీ యౌవనురాలివలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పెరెసు కుటుంబమువలె నుండునుగాక అనిరి.౹

13 కాబట్టి బోయజు రూతును పెండ్లిచేసికొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి యగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారునికనెను.౹

14 అప్పుడు స్త్రీలు–ఈ దినమున నీకు బంధువుడులేకుండ చేయని యెహోవా స్తుతినొందుగాక; ఆయన నామము ఇశ్రాయేలీయులలో ప్రకటింపబడునుగాక.౹

15 నిన్ను ప్రేమించి యేడుగురు కుమారులకంటె నీ కెక్కువగా నున్న నీ కోడలు ఇతని కనెను; ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి.౹

16 అప్పుడు నయోమి–ఆ బిడ్డను తీసికొని కౌగిట నుంచుకొని వానికి దాదిగా నుండెను.౹

17 ఆమె పొరుగు స్త్రీలు–నయోమికొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రియైన యెష్షయియొక్క తండ్రి.

18-19 పెరెసు వంశావళి యేదనగా–పెరెసు హెస్రోనును కనెను, హెస్రోను రామును కనెను, రాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను,౹

20 నయస్సోను శల్మానును కనెను, శల్మాను బోయజును కనెను,౹

21 బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి దావీదును కనెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/RUT/4-4daa88556d37d72ae2de573a07a843ae.mp3?version_id=1787—

Categories
1 సమూయేలు

1 సమూయేలు 1

1 ఎఫ్రాయిము మన్యమందు రామతయిమ్సోఫీము పట్టణపువాడు ఒకడుండెను; అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయీమీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు, అతనికి ఇద్దరు భార్యలుండిరి.౹

2 వీరిలో ఒకదాని పేరు హన్నా రెండవదాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరిగాని హన్నాకు పిల్లలులేకపోయిరి.౹

3 ఇతడు షిలోహునందున్న సైన్యములకధిపతియగు యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేట తన పట్టణము విడిచి అచ్చటికి పోవుచుండెను. ఆ కాలమున ఏలీయొక్క యిద్దరు కుమారులగు హొప్నీ ఫీనెహాసులు యెహోవాకు యాజకులుగా నుండిరి.౹

4 ఎల్కానా తాను బల్యర్పణ చేసిననాడు తన భార్యయగు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాళ్లు ఇచ్చుచు వచ్చెనుగాని

5 హన్నా తనకు ప్రియముగా నున్నందున ఆమెకు రెండుపాళ్లు ఇచ్చుచు వచ్చెను. యెహోవా ఆమెకు సంతులేకుండచేసెను.౹

6 యెహోవా ఆమెకు సంతులేకుండ చేసియున్న హేతువునుబట్టి, ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసికించుటకై, ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను.౹

7 ఎల్కానా ఆమెకు ఏటేట ఆ రీతిగా చేయుచు నుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునపుడెల్ల అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచు వచ్చెను.౹

8 ఆమె పెనిమిటియైన ఎల్కానా–హన్నా, నీ వెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఏల? నీకు మనో విచారమెందుకు కలిగినది? పదిమంది కుమాళ్లకంటె నేను నీకు విశేషమైనవాడను కానా? అని ఆమెతో చెప్పుచు వచ్చెను.౹

9 వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనముమీద కూర్చునియుండగా

10 బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థనచేయుచు బహుగా ఏడ్చుచు

11 –సైన్యములకధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్నశ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసికొని, నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసినయెడల, వాని తలమీదికి క్షౌరపుకత్తి యెన్నటికి రానియ్యక, వాడు బ్రదుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసి కొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను,౹

12 ఏలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను.౹

13 ఆమె పెదవులుమాత్రము కదలుచుండి ఆమె స్వరము వినబడక యుండెను గనుక ఏలీ ఆమె మత్తురాలై యున్నదనుకొని

14 –ఎంతవరకు నీవు మత్తురాలవై యుందువు? నీవు ద్రాక్షారసమును నీయొద్దనుండి తీసివేయుమని చెప్పగా

15 హన్నా–అది కాదు, నా యేలినవాడా, నేను మనోదుఃఖము గలదాననై యున్నాను; నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయ లేదుగాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను.౹

16 నీ సేవకురాలనైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు; అత్యంతమైన కోపకారణమునుబట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీని చెప్పు కొనుచుంటిననెను.౹

17 అంతట ఏలీ–నీవు క్షేమముగా వెళ్లుము; ఇశ్రాయేలు దేవునితో నీవు చేసికొనిన మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా

18 ఆమె అతనితో–నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృప నొందుదునుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్లిపోయి భోజనముచేయుచు నాటనుండి దుఃఖముఖిగా నుండుట మానెను.౹

19 తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ యింటికి వచ్చిరి. అంతట ఎల్కానా తన భార్యయగు హన్నాను కూడెను, యెహోవా ఆమెను జ్ఞాపకము చేసికొనెను

20 గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని–నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలను పేరు పెట్టెను.౹

21 ఎల్కానాయును అతనియింటి వారందరును యెహోవాకు ఏటేట అర్పించు బలినర్పించుటకును మ్రొక్కుబడిని చెల్లించుటకును పోయిరి.౹

22 అయితే హన్నా–బిడ్డ పాలు విడుచువరకు నేను రాను; వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాని తీసికొనివత్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్లక యుండెను.౹

23 కాబట్టి ఆమె పెనిమిటియైన ఎల్కానా–నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము; నీవు వానికి పాలు మాన్పించువరకు నిలిచి యుండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనేయుండి తన కుమారునికి పాలు మాన్పించువరకు అతని పెంచుచుండెను.౹

24 పాలు మాన్పించిన తరువాత అతడు ఇంక చిన్నవాడై యుండగా ఆమె ఆ బాలుని ఎత్తికొని మూడు కోడెలను తూమెడు పిండిని ద్రాక్షారసపు తిత్తిని తీసికొని షిలోహులోని మందిరమునకు వచ్చెను.౹

25 వారు ఒక కోడెను వధించి, పిల్లవానిని ఏలీయొద్దకు తీసికొనివచ్చి నప్పుడు ఆమె అతనితో ఇట్లనెను

26 –నా యేలినవాడా, నా యేలినవాని ప్రాణముతోడు, నీయొద్దనిలిచి, యెహోవాను ప్రార్థనచేసిన స్త్రీని నేనే.౹

27 ఈ బిడ్డను దయచేయుమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నా కనుగ్రహించెను.౹

28 కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను; తాను బ్రదుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1SA/1-32f79deaa811d8237e47c4e789d185e6.mp3?version_id=1787—

Categories
1 సమూయేలు

1 సమూయేలు 2

1 మరియు హన్నా విజ్ఞాపనచేసి యీలాగనెను–

నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది.

యెహోవాయందు నాకు మహా బలముకలిగెను

నీవలని రక్షణనుబట్టి సంతోషించుచున్నాను

నావిరోధులమీద నేను అతిశయపడుదును.

2 యెహోవావంటి పరిశుద్ధ దేవుడు ఒకడునులేడు

నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు

మన దేవునివంటి ఆశ్రయదుర్గమేదియులేదు.

3 యెహోవా అనంతజ్ఞానియగు దేవుడు

ఆయనే క్రియలను పరీక్షించువాడు

ఇకను అంత గర్వముగా మాటలాడకుడి

గర్వపుమాటలు మీ నోట రానియ్యకుడి.

4 ప్రఖ్యాతినొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు

తొట్రిల్లినవారు బలము ధరించుదురు.

5 తృప్తిగా భుజించినవారు అన్నము కావలెనని కూలికి పోవుదురు

ఆకలిగొనినవారు ఆకలితీర తిందురు

గొడ్రాలు ఏడుగురు పిల్లలను కనును

అనేకమైన పిల్లలను కనినది కృశించి పోవును.

6 జనులను సజీవులనుగాను మృతులనుగాను చేయువాడు యెహోవాయే

పాతాళమునకు పంపుచు అందులోనుండి రప్పించుచుండువాడు ఆయనే.

7 యెహోవా దారిద్యమును ఐశ్వర్యమును కలుగజేయు వాడు

క్రుంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే.

8 దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును

మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును

వారిని మంటిలోనుండి యెత్తువాడు ఆయనే

లేమిగలవారిని పెంటకుప్పమీదినుండి లేవనెత్తువాడు ఆయనే.

భూమియొక్క స్తంభములు యెహోవా వశము,

లోకమును వాటిమీద ఆయన నిలిపియున్నాడు.

9 తన భక్తుల పాదములు తొట్రిల్లకుండ ఆయన వారిని కాపాడును

దుర్మార్గులు అంధకారమందు మాటుమణుగుదురు

బలముచేత ఎవడును జయము నొందడు.

10 యెహోవాతో వాదించువారు నాశనమగుదురు

పరమండలములోనుండి ఆయన వారిపైన ఉరుమువలె గర్జించును

లోకపు సరిహద్దులలో నుండువారికి ఆయన తీర్పు తీర్చును

తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును

తాను అభిషేకించినవానికి అధిక బలము కలుగజేయును.

11 తరువాత ఎల్కానా రామాలోని తన యింటికి వెళ్లి పోయెను; అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ యెదుట యెహోవాకు పరిచర్యచేయుచుండెను.

12 ఏలీ కుమారులు యెహోవాను ఎరుగనివారై మిక్కిలి దుర్మార్గులైయుండిరి.౹

13 జనులవిషయమై యాజకులు చేయుచు వచ్చిన పని యేమనగా, ఎవడైన బలిపశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకునివారు మూడు ముండ్లుగల కొంకిని తీసికొనివచ్చి

14 బొరుసులోగాని తపేలలోగాని గూనలోగానికుండలోగాని అది గుచ్చినపుడు ఆ కొంకిచేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తనకొరకు తీసికొనును. షిలోహుకు వచ్చు ఇశ్రాయేలీయులందరికిని వీరు ఈలాగున చేయుచువచ్చిరి.౹

15 ఇదియుగాక వారు క్రొవ్వును దహింపకమునుపు యాజకుని పనివాడు వచ్చి బలిపశువును వధించువానితో– యాజకునికి వండించుటకై మాంసమిమ్ము, ఉడకబెట్టిన మాంసము అతడు నీయొద్ద తీసికొనడు, పచ్చి మాంసమే కావలెను అని చెప్పుచువచ్చెను.౹

16 –ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు, తరువాత నీ మనస్సు వచ్చినంతమట్టుకు తీసికొనవచ్చునని వానితో ఆ మనిషి చెప్పినయెడల వాడు–ఆలాగువద్దు ఇప్పుడే యియ్యవలెను, లేనియెడల బలవంతముచేత తీసికొందుననును.౹

17 అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్య పడుటకు ఆ యౌవనులు కారణమైరి, గనుక వారిపాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయెను.

18 బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను.౹

19 వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి యేటేట బలి అర్పించుటకు తన పెనిమిటితోకూడ వచ్చినప్పుడు దాని తెచ్చి వానికిచ్చుచు వచ్చెను.౹

20 –యెహోవా సన్నిధిని మనవిచేసికొనగా నీకు దొరకిన యీ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానము నిచ్చునుగాక అని ఏలీ ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారు ఇంటికి వెళ్లిరి.౹

21 యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతియై ముగ్గురు కుమాళ్లను ఇద్దరు కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి యెదుగుచుండెను.

22 ఏలీ బహు వృద్ధుడాయెను. ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నియు, వారు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము దగ్గరకు సేవచేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయను మాట చెవిని పడగా వారిని పిలిచి యిట్లనెను

23 ఈ జనులముందర మీరు చేసిన చెడ్డకార్యములు నాకు వినబడినవి. ఈలాటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు?

24 నా కుమారులారా, యీలాగు చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు, యెహోవా జనులను మీరు అతిక్రమింపచేయుచున్నారు.౹

25 నరునికి నరుడు తప్పుచేసినయెడల దేవుడు విమర్శచేయునుగాని యెవరైన యెహోవా విషయములో పాపము చేసినయెడల వానికొరకు ఎవడు విజ్ఞాపనము చేయును? అనెను. అయితే యెహోవావారిని చంప దలచి యుండెను గనుక వారు తమ తండ్రియొక్క మొఱ్ఱను వినకపోయిరి.౹

26 బాలుడగు సమూయేలు ఇంకను ఎదు గుచు యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను.

27 అంతట దైవజనుడొకడు ఏలీయొద్దకు వచ్చి యిట్లనెను –యెహోవా నిన్నుగూర్చి సెలవిచ్చినదేమనగా, నీ పితరుని యింటివారు ఐగుప్తు దేశమందు ఫరో యింటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని.౹

28 అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠముమీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగునట్లు ఇశ్రాయేలు గోత్రములలోనుండి నేనతని ఏర్పరచుకొంటిని. ఇశ్రాయేలీయులు అర్పించిన హోమవస్తువు లన్నిటిని నీ పితరుని యింటివారికిచ్చితిని.౹

29 నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీ రేల తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వబెట్టుకొనుటకై నా జనులగు ఇశ్రాయేలీయులుచేయు నైవేద్యములలో శ్రేష్ఠభాగములను పట్టుకొనుచు, నాకంటె నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు.౹

30 నీ యింటివారును నీ పితరుని యింటివారును నా సన్నిధిని యాజ కత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ యిచ్చియున్నను ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయెనని ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా– నన్ను ఘనపరచువారిని నేను ఘనపరచుదును. నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు.౹

31 ఆలకించుము; రాగల దినములలో నీ బలమును నీ పితరుని యింటి బలమును నేను తక్కువచేతును. నీ యింట ముసలివాడు ఒకడును లేకపోవును.౹

32 యెహోవా ఇశ్రాయేలీయులకు చేయదలచిన మేలువిషయములో నా నివాసస్థలమునకు అపాయము కలుగగా నీవు చూతువు. ఎప్పటికిని నీ యింట ముసలివాడు ఉండడు.౹

33 నా బలిపీఠమునొద్ద నెవడు ఉండకుండ నేనందరిని నశింపజేయక విడుచు వాడను గనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖముచేత క్షయమగుటకును సాధనమగును; నీ సంతానపు వారందరు వయఃకాలమందు మరణమవుదురు.౹

34 నీ యిద్దరు కుమారులైన హొఫ్నీకిని ఫీనెహాసునకును సంభవించునని నేను చెప్పినదానికి నీకు సూచనగా నుండును. ఒక్క నాటియందే వారిద్దరు మరణమవుదురు.౹

35 తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును; అతడు నా యోచననుబట్టి నా కనుకూలముగా యాజకత్వము జరిగించును, అతనికి నేను నమ్మకమైన సంతానము పుట్టిం తును, అతడు నా అభిషిక్తుని సన్నిధిని ఎప్పటికిని యాజ కత్వము జరిగించును.౹

36 అయితే నీ యింటివారిలో శేషించినవారు ఒక వెండిరూకనైనను రొట్టెముక్కనైనను సంపా దించుకొనవలెనని అతనియొద్దకు వచ్చి దండముపెట్టి–నేను రొట్టెముక్క తినునట్లుగా దయచేసి యాజకుల ఉద్యోగములలో ఒకదానియందు నన్ను ఉంచుమని అతని వేడుకొందురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1SA/2-0924d9c1e0dfeda180712032d2979cc0.mp3?version_id=1787—

Categories
1 సమూయేలు

1 సమూయేలు 3

1 బాలుడైన సమూయేలు ఏలీయెదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరుచుగా తటస్థించుటలేదు.౹

2 ఆ కాలమందు ఏలీ కన్నులు మంద దృష్టి గలవైనందున అతడు చూడలేక తనస్థలమందు పండు కొనియుండగాను

3 దీపము ఆరిపోకమునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండు కొనియుండగాను

4 యెహోవా సమూయేలును పిలిచెను. అతడు–చిత్తమండి నేనున్నానని చెప్పి

5 ఏలీదగ్గరకు పోయి–నీవు నన్ను పిలిచితివి గదా నేను వచ్చినాననెను. అతడు–నేను పిలువలేదు, పోయి పండుకొమ్మని చెప్పగా అతడు పోయి పండుకొనెను.౹

6 యెహోవా మరల సమూయేలును పిలువగా సమూయేలు లేచి ఏలీయొద్దకు పోయి –చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చితిననెను. అయితే అతడు నా కుమారుడా, నేను నిన్ను పిలువలేదు, పోయి పండుకొమ్మనెను.౹

7 సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను, యెహోవా వాక్కు అతనికి ఇంక ప్రత్యక్షము కాలేదు.౹

8 యెహోవా మూడవ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి –చిత్తము నీవు నన్ను పిలిచితివే; యిదిగో వచ్చితిననగా, ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచెనని గ్రహించి

9 –నీవు పోయి, పండుకొమ్ము, ఎవరైన నిన్ను పిలిచినయెడల–యెహోవా, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞనిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను.౹

10 తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా–సమూయేలూ సమూయేలూ, అనిపిలువగా సమూయేలు–నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞయిమ్మనెను.౹

11 అంతట యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను–ఇశ్రాయేలులో నేనొకకార్యము చేయబోవుచున్నాను; దానిని వినువారందరి చెవులు గింగురుమనును.౹

12 ఆ దినమున ఏలీయొక్క యింటివారినిగురించి నేను చెప్పినదంతయు వారిమీదికి రప్పింతును. దాని చేయ మొదలుపెట్టి దాని ముగింతును.౹

13 తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులగా చేసికొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని యింటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను.౹

14 కాబట్టి ఏలీ యింటివారి దోషమునకు బలిచేతనైనను నైవేద్యముచేతనైనను ఎన్నటికిని ప్రాయశ్చిత్తము జేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించితిని.౹

15 తరువాత సమూయేలు ఉదయమగువరకు పండుకొని, లేచి యెహోవా మందిరపు తలుపులను తీసెనుగాని, భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలీతో చెప్పక పోయెను.౹

16 అయితే ఏలీ–సమూయేలూ నా కుమారుడా, అని సమూయేలును పిలువగా అతడు– చిత్తము నేనిక్కడ ఉన్నాననెను.౹

17 ఏలీ–నీతో యెహోవా యేమి సెలవిచ్చెనో మరుగుచేయక దయచేసి నాతో చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైన నీవు మరుగుచేసినయెడల అంతకంటె అధికమైన కీడు ఆయన నీకు కలుగజేయునుగాకని చెప్పగా

18 సమూయేలు దేనిని మరుగుచేయక సంగతి అంతయు అతనికి తెలియజెప్పెను. ఏలీ విని–సెలవిచ్చినవాడు యెహోవా; తన దృిష్టికి అనుకూలమైనదానిని ఆయన చేయునుగాక అనెను.౹

19 సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడైయున్నందున అతని మాటలలో ఏదియు తప్పిపోలేదు.౹

20 కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడెనని దాను మొదలుకొని బెయేర్షెబావరకు ఇశ్రాయేలీయులందరు తెలిసికొనిరి

21 మరియు షిలోహులో యెహోవా మరల దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచు వచ్చెను. సమూయేలుమాట ఇశ్రాయేలీయులందరిలో వెల్లడియాయెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1SA/3-d6ddc1a70ec3e480b8e39811789c70dc.mp3?version_id=1787—

Categories
1 సమూయేలు

1 సమూయేలు 4

1 ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి ఎబెనెజరులో దిగగా ఫిలిష్తీయులు ఆఫెకులో దిగిరి.౹

2 ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులమీద తమ్మును యుద్ధపంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల యెదుట ఓడిపోయి యుద్ధభూమిలోనే యెక్కువతక్కువ నాలుగు వేలమంది హతులైరి.౹

3 కాబట్టి జనులు పాళెములోనికి తిరిగిరాగా ఇశ్రాయేలీయుల పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిష్తీయులముందర ఎందుకు ఓడించెను? షిలోహులో నున్న యెహోవా నిబంధనమందసమును మనము తీసికొని మన మధ్యనుంచుకొందము రండి; అది మన మధ్యనుండినయెడల అది మన శత్రువుల చేతిలోనుండి మనలను రక్షించుననిరి.౹

4 కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడనుండి కెరూబులమధ్య ఆసీనుడైయుండు సైన్యములకధిపతియగు యెహోవా నిబంధనమందసమును తెప్పించిరి. ఏలీయొక్క యిద్దరు కుమారులైన హొఫ్నీయును ఫీనెహాసును అక్కడనే దేవుని నిబంధనమందసమునొద్ద ఉండిరి.౹

5 యెహోవా నిబంధనమందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీయులందరు భూమి ప్రతిధ్వని నిచ్చునంత గొప్పకేకలు వేసిరి.౹

6 ఫిలిష్తీయులు ఆ కేకలు విని, హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకలధ్వని యేమని అడిగి, యెహోవా నిబంధనమందసము దండులోనికి వచ్చెనని తెలిసికొని

7 జడిసి దేవుడు దండులోనికి వచ్చెనని అనుకొని–అయ్యో మనకు శ్రమ, ఇంతకుమునుపు వారీలాగు సంభ్రమింపలేదు,౹

8 అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలోనుండి మనలను ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్లచేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే గదా.౹

9 ఫిలిష్తీయులారా, ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండ బలాఢ్యులై యుద్ధము చేయుడని చెప్పుకొనిరి.౹

10 ఫిలిష్తీయులు యుద్ధముచేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరు తమ డేరాలకు పరుగెత్తివచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను; ఇశ్రాయేలీయులలో ముప్పదివేల కాల్బలము కూలెను.౹

11 మరియు దేవుని మందసము పట్టబడెను; అదికాకను హొఫ్నీ ఫీనెహాసులను ఏలీయొక్క యిద్దరు కుమారులు హతులైరి.౹

12 ఆ నాడే బెన్యామీనీయుడొకడు యుద్ధభూమిలోనుండి పరుగెత్తివచ్చి, చినిగిన బట్టలతోను తలమీద ధూళితోను షిలోహులో ప్రవేశించెను.౹

13 అతడు వచ్చినప్పుడు ఏలీ మందసము విషయమై గుండె అవియుచు త్రోవప్రక్కను పీఠముమీద కూర్చుండి యెదురుచూచుచుండెను. ఆ మనుష్యుడు పట్టణములోనికి వర్తమానము తేగా పట్టణస్థులందరు కేకలు వేసిరి.౹

14 ఏలీ ఆ కేకలు విని–ఈ గల్లత్తు యేమని అడుగగా ఆ మనుష్యుడు త్వరగా వచ్చి ఏలీతో సంగతి తెలియచెప్పెను.౹

15 ఏలీ తొంబది యెనిమిదేండ్లవాడై యుండెను. అతనికి దృష్టి మందగిలినందున అతని కండ్లు కానరాకుండెను.౹

16 ఆ మనుష్యుడు–యుద్ధములోనుండి వచ్చినవాడను నేనే, నేడు యుద్ధములోనుండి పరుగెత్తి వచ్చితినని ఏలీతో అనగా అతడు–నాయనా, అక్కడ ఏమి జరిగెనని అడిగెను.౹

17 అందుకు అతడు–ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులముందర నిలువలేక పారిపోయిరి; జనులలో అనేకులు హతులైరి; హొఫ్నీ ఫీనెహాసు అను నీ యిద్దరు కుమారులు మృతులైరి; మరియు దేవుని మందసము పట్టబడెను అని చెప్పెను

18 దేవుని మందసమను మాట అతడు పలుకగానే ఏలీ ద్వారముదగ్గర నున్న పీఠము మీదనుండి వెనుకకు పడి మెడవిరిగి చనిపోయెను; ఏలయనగా అతడు వృద్ధుడై బహు స్థూలదేహియైయుండెను. అతడు నలువది సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చెను.౹

19 ఏలీ కోడలగు ఫీనెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులైయుండగా దేవునియొక్క మందసము పట్టబడెననియు, తన మామయు తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పులుతగిలి మోకాళ్లమీదికి క్రుంగి ప్రసవమాయెను.౹

20 ఆమె మృతినొందుచుండగా దగ్గర నిలిచియున్న స్త్రీలు ఆమెతో–భయపడవద్దు, కుమారుని కంటివనిరిగాని ఆమె ప్రత్యుత్తరమియ్యకయు లక్ష్యపెట్టకయు నుండినదై

21 దేవుని మందసము పట్టబడినదను సంగతిని, తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలిసికొని ప్రభావము ఇశ్రాయేలీయులలోనుండి పోయెనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదుఅను పేరు పెట్టెను.౹

22 దేవుని మందసము పట్టబడి పోయినందున ప్రభావము ఇశ్రాయేలీయులలోనుండి చెరపట్టబడి పోయెనని ఆమె చెప్పెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1SA/4-afcafa6c5fe1a62c1ac966ac812992c1.mp3?version_id=1787—