Categories
ఆదికాండము

ఆదికాండము 11

1 భూమియందంతట ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను.

2 వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి

3 మనము ఇటికలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటికలును, అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికుండెను.౹

4 మరియు వారు–మనము భూమియందంతట చెదిరిపోకుండ ఒక పట్టణమును ఆకాశమునంటు శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని, పేరు సంపాదించు కొందము రండని మాటలాడుకొనగా

5 యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను.౹

6 అప్పుడు యెహోవా–ఇదిగో జనము ఒక్కటే; వారికందరికి భాష ఒక్కటే; వారు ఈ పని ఆరంభించియున్నారు. ఇకమీదట వారు చేయ దలచు ఏపని యైనను చేయకుండ వారికి ఆటంకమేమియు నుండదు.౹

7 గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండ అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను.౹

8 ఆలాగు యెహోవా అక్కడ నుండి భూమియందంతట వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి.౹

9 దానికి బాబెలుఅను పేరు పెట్టిరి; ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారుచేసెను. అక్కడ నుండి యెహోవా భూమియందంతట వారిని చెదర గొట్టెను.

10 షేము వంశావళి ఇది. షేము నూరేండ్లుగలవాడై జలప్రవాహము గతించిన రెండేండ్లకు అర్పక్షదును కనెను.౹

11 షేము అర్పక్షదును కనినతరువాత ఐదువందలయేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

12 అర్పక్షదు ముప్పది యైదేండ్లు బ్రదికి షేలహును కనెను.౹

13 అర్పక్షదు షేలహును కనినతరువాత నాలుగు వందలమూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

14 షేలహు ముప్పది యేండ్లు బ్రదికి ఏబెరును కనెను.౹

15 షేలహు ఏబెరును కనినతరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

16 ఏబెరు ముప్పది నాలుగేండ్లు బ్రదికి పెలెగును కనెను.౹

17 ఏబెరు పెలెగును కనినతరువాత నాలుగువందల ముప్పది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

18 పెలెగు ముప్పది యేండ్లు బ్రదికి రయూను కనెను.౹

19 పెలెగు రయూను కనినతరువాత రెండువందల తొమ్మిది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

20 రయూ ముప్పది రెండేండ్లు బ్రదికి సెరూగును కనెను.౹

21 రయూ సెరూగును కనినతరువాత రెండు వందల ఏడేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

22 సెరూగు ముప్పది యేండ్లు బ్రదికి నాహోరును కనెను.౹

23 సెరూగు నాహోరును కనినతరువాత రెండువందల యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

24 నాహోరు ఇరువది తొమ్మిది యేండ్లు బ్రదికి తెరహును కనెను.౹

25 నాహోరు తెరహును కనినతరువాత నూటపం దొమ్మిది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.

26 తెరహు డెబ్బది యేండ్లు బ్రదికి అబ్రామును నాహోరును హారానును కనెను.

27 తెరహు వంశావళి ఇది; తెరహు అబ్రామును నాహోరును హారానును కనెను. హారాను లోతును కనెను.౹

28 హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణములో తన తండ్రియైన తెరహు కంటె ముందుగా మృతి బొందెను.౹

29 అబ్రామును నాహోరును వివాహము చేసికొనిరి. అబ్రాము భార్య పేరు శారయి; నాహోరు భార్య పేరు మిల్కా, ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రియైన హారాను కుమార్తె.౹

30 శారయి గొడ్రాలై యుండెను. ఆమెకు సంతానములేదు.౹

31 తెరహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుని కుమారుడు, అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్యయయిన శారయి అను తన కోడలిని తీసికొని కనానుకు వెళ్లుటకు కల్దీయుల ఊరను పట్టణములోనుండి వారితోకూడ బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి.౹

32 తెరహు బ్రదికిన దినములు రెండువందల యైదేండ్లు. తెరహు హారానులో మృతి బొందెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/GEN/11-bd796241ea6ed07f8ff8b721bab2b565.mp3?version_id=1787—

Categories
ఆదికాండము

ఆదికాండము 12

1 యెహోవా–నీవు లేచి నీ దేశమునుండియు నీ బంధువుల యొద్దనుండియు నీ తండ్రి యింటినుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్లుము.౹

2 నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు.౹

3 నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను; భూమియొక్క సమస్తవంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా

4 యెహోవా అతనితో చెప్పినప్రకారము అబ్రాము వెళ్లెను. లోతు అతనితోకూడ వెళ్లెను. అబ్రాము హారానునుండి బయలుదేరినప్పుడు డెబ్బదియైదేండ్ల యీడు గలవాడు.౹

5 అబ్రాము తన భార్యయయిన శారయిని తన సహోదరుని కుమారుడయిన లోతును, హారానులో తానునువారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపా దించిన సమస్తమైనవారిని తీసికొని కనానను దేశమునకు వెళ్లుటకు బయలుదేరి కనానను దేశమునకు వచ్చిరి.౹

6 అప్పుడు అబ్రాము షెకెమునందలి యొక స్థలముదాక ఆ దేశ సంచారముచేసి మోరేదగ్గరనున్న సింధూరవృక్షము నొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి.౹

7 యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయి– నీ సంతానమునకు ఈ దేశ మిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను.౹

8 అక్కడనుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికినిమధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను.౹

9 అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్లెను.

10 అప్పుడు ఆ దేశములో కరవు వచ్చెను. ఆ దేశములో కరవు భారముగా నున్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్లెను.౹

11 అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్యయయిన శారయితో–ఇదిగో నీవు చక్కనిదానివని యెరుగుదును.౹

12 ఐగుప్తీయులు నిన్ను చూచి యీమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రదుక నిచ్చెదరు.౹

13 నీవలన నాకు మేలుకలుగునట్లును నిన్నుబట్టి నేను బ్రదుకు నట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను.౹

14 అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియయి యుండుట చూచిరి

15 ఫరోయొక్క అధిపతులు ఆమెను చూచి ఫరోయెదుట ఆమెను పొగడిరి గనుక ఆ స్త్రీ ఫరో యింటికి తేబడెను.౹

16 అతడామెనుబట్టి అబ్రామునకు మేలుచేసెను; అందువలన అతనికి గొఱ్ఱెలు గొడ్లు మగ గాడిదలు దాసులు పనికత్తెలు ఆడుగాడిదలు ఒంటెలు ఇయ్యబడెను.౹

17 అయితే యెహోవా అబ్రాము భార్యయయిన శారయినిబట్టి ఫరోను అతని యింటివారిని మహావేదనలచేత బాధించెను.౹

18 అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి–నీవు నాకు చేసినది యేమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు?

19 ఈమె నా సహోదరి అని యేల చెప్పితివి? నేనామెను నా భార్యగా చేసికొందునేమో అయితే నేమి, ఇదిగో నీ భార్య; ఈమెను తీసికొనిపొమ్మని చెప్పెను.౹

20 మరియు ఫరో అతని విషయమై తన జనుల కాజ్ఞాపించినందునవారు అతనిని అతని భార్యను అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/GEN/12-db85884ebcccee010e152217b72a66e4.mp3?version_id=1787—

Categories
ఆదికాండము

ఆదికాండము 13

1 అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతోకూడనున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులోనుండి నెగెబునకువెళ్లెను.౹

2 అబ్రాము వెండి బంగారము పశువులుకలిగి బహు ధనవంతుడై యుండెను.౹

3 అతడు ప్రయాణము చేయుచు దక్షిణమునుండి బేతేలువరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలమువరకు వెళ్లి

4 తాను మొదట బలిపీఠమును కట్టినచోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను.౹

5 అబ్రాముతోకూడ వెళ్లిన లోతుకును గొఱ్ఱెలు గొడ్లు గుడారములు ఉండెను గనుక

6 వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలక పోయెను; ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమైయుండెను.౹

7 అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశములో కాపురముండిరి.౹

8 కాబట్టి అబ్రాము –మనము బంధువులము గనుక నాకు నీకును, నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహముండకూడదు.౹

9 ఈ దేశమంతయు నీ యెదుట నున్నదిగదా, దయచేసి నన్ను విడిచి వేరుగానుండుము. నీవు ఎడమతట్టునకు వెళ్లినయెడల నేను కుడితట్టుకును, నీవు కుడితట్టునకు వెళ్లినయెడల నేను యెడమతట్టునకును వెళ్లుదునని లోతుతో చెప్పగా

10 లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొఱ్ఱా అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చువరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశమువలెను నీళ్లు పారు దేశమైయుండెను.౹

11 కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణముచేసెను. అట్లువారు ఒకరి కొకరు వేరై పోయిరి.౹

12 అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమదగ్గర తన గుడారము వేసికొనెను.౹

13 సొదొమ మనుష్యులు దుష్టులును, యెహోవా దృష్టికి బహు పాపులునైయుండిరి.౹

14 లోతు అబ్రామును విడిచి పోయినతరువాత యెహోవా–ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్నచోటనుండి ఉత్తరపుతట్టు దక్షిణపుతట్టు తూర్పుతట్టు పడమరతట్టును చూడుము;౹

15 ఎందుకనగా నీవు చూచుచున్న యీ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను.౹

16 మరియు నీ సంతానమును భూమిమీదనుండు రేణువులవలె విస్తరింప చేసెదను; ఎట్ల నగా ఒకడు భూమిమీదనుండు రేణువులను లెక్కింప గలిగినయెడల నీ సంతానమును కూడ లెక్కింపవచ్చును.౹

17 నీవు లేచి యీ దేశముయొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము; అది నీకిచ్చెదనని అబ్రాముతో చెప్పెను.౹

18 అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రేదగ్గరనున్న సింధూరవృక్షవనములోదిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/GEN/13-f69689cf6fce3c912fb1c2b40bd5df60.mp3?version_id=1787—

Categories
ఆదికాండము

ఆదికాండము 14

1 షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఏలాము రాజైన కదొర్లాయోమెరు, గోయీయుల రాజైన తిదాలు అనువారి దినములలో

2 వారు సొదొమరాజైన బెరాతోను, గొమొఱ్ఱా రాజైన బిర్షాతోను, అద్మా రాజైన షినాబుతోను, సెబోయీయుల రాజైన షెమేబెరుతోను, సోయరను బెలరాజుతోను యుద్ధము చేసిరి.౹

3 వీరందరు ఉప్పు సముద్రమైన సిద్దీములోయలో ఏకముగా కూడి

4 పండ్రెండు సంవత్సరములు కదొర్లా యోమెరుకు లోబడి పదమూడవ సంవత్సరమున తిరుగు బాటు చేసిరి.౹

5 పదునాలుగవ సంవత్సరమున కదొర్లా యోమెరును అతనితోకూడనున్న రాజులును వచ్చి అష్తా రోత్ కర్నాయిములో రెఫాయీయులను హాములో జూజీయులను షావే కిర్యతాయిము మైదానములో

6 ఏమీయులను కొట్టిరి. మరియు హోరీయులను అరణ్యము దగ్గరనున్న ఏల్పారానువరకు తరిమి శేయీరు పర్వత ప్రదేశములో వారిని కొట్టిన తరువాత

7 తిరిగి కాదేషను ఏన్మిష్పతుకువచ్చి అమాలేకీయుల దేశమంతటిని హససోన్ తామారులో కాపురమున్న అమోరీయులను కూడ కొట్టిరి.౹

8 అప్పుడు సొదొమ రాజును గొమొఱ్ఱా రాజును అద్మా రాజును సెబోయీము రాజును సోయరను బెల రాజును బయలుదేరి సిద్దీము లోయలో వారితో,౹

9 అనగా ఏలాము రాజైన కదొర్లాయోమెరు గోయీయుల రాజైన తిదాలు, షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు అను నలుగురితో ఆ యైదుగురు రాజులు యుద్ధము చేసిరి.౹

10 ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొఱ్ఱాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించినవారు కొండకు పారిపోయిరి.౹

11 అప్పుడు వారు సొదొమ గొమొఱ్ఱాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నియు పట్టుకొనిపోయిరి.౹

12 మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొనిపోగా

13 తప్పించుకొనిన యొకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరీయుని ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసికొనినవారు.౹

14 అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడెనని విని తన యింట పుట్టి అలవరచ బడిన మూడువందల పదునెనమండుగురిని వెంటబెట్టుకొని దానుమట్టుకు ఆ రాజులను తరిమెను.౹

15 రాత్రివేళ అతడును అతని దాసులును వారికెదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమతట్టున్న హోబా మట్టుకు తరిమి

16 ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసికొని వచ్చెను.౹

17 అతడు కదొర్లాయోమెరును అతనితోకూడ నున్న రాజులను ఓడించితిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు, రాజులోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను.౹

18 మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసికొనివచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు.౹

19 అప్పుడతడు అబ్రామును ఆశీర్వదించి–ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవునివలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక అనియు,౹

20 నీ శత్రువులను నీ చేతి కప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడతడు అన్నిటిలో ఇతనికి పదియవవంతు ఇచ్చెను.౹

21 సొదొమ రాజు–మనుష్యులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసికొనుమని అబ్రాముతో చెప్పగా

22-23 అబ్రాము–నేనే అబ్రామును ధనవంతునిగా చేసితినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పులవారైనను నీవాటిలో ఏదైనను తీసికొననని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవాయెదుట నా చెయ్యియెత్తి ప్రమాణము చేసియున్నాను.౹

24 అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతోకూడ వచ్చిన ఆనేరు ఎష్కోలు మమ్రే అను వారికి ఏయే భాగములు రావలెనో ఆయా భాగములు మాత్రము వారిని తీసికొననిమ్మని సొదొమ రాజుతో చెప్పెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/GEN/14-b89d89dd9b6438108dcf450c393cfb52.mp3?version_id=1787—

Categories
ఆదికాండము

ఆదికాండము 15

1 ఇవి జరిగినతరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి–అబ్రామా, భయపడకుము; నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను.౹

2 అందుకు అబ్రాము–ప్రభువైన యెహోవా నాకేమి యిచ్చిననేమి? నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే; దమస్కు ఎలీయెజెరే నాయింటి ఆస్తి కర్తయగును గదా

3 మరియు అబ్రాము–ఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా

4 యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి –ఇతడు నీకు వారసుడు కాడు; నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను.౹

5 మరియు ఆయన వెలుపలికి అతని తీసికొని వచ్చి–నీవు ఆకాశమువైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి–నీ సంతానము ఆలాగవునని చెప్పెను.౹

6 అతడు యెహోవాను నమ్మెను; ఆయన అది అతనికి నీతిగా ఎంచెను.౹

7 మరియు ఆయన–నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనునట్లు దాని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములోనుండి నిన్ను ఇవతలకు తీసికొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు

8 అతడు–ప్రభువైన యెహోవా, నేను దీని స్వతంత్రించుకొనెదనని నాకెట్లు తెలియుననగా

9 ఆయన–మూడేండ్ల పెయ్యను మూడేండ్ల మేకను మూడేండ్ల పొట్టేలును ఒక తెల్లగువ్వను ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను.౹

10 అతడు అవన్నియు తీసికొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను; పక్షులను అతడు ఖండింపలేదు

11 గద్దలు ఆ కళేబరములమీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను.౹

12 ప్రొద్దుగ్రుంక బోయినప్పుడు అబ్రామునకు గాఢనిద్ర పట్టెను. భయంకరమైన కటికచీకటి అతని కమ్మగా

13 ఆయన–నీ సంతతివారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపువారికి దాసులుగా నుందురు.౹

14 వారు నాలుగు వందల యేండ్లు వీరిని శ్రమ పెట్టుదురు; వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు.౹

15 నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయె దవు; మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడుదువు.౹

16 అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరమువారు ఇక్కడికి మరల వచ్చెదరని నిశ్చయముగా తెలిసికొనుమని అబ్రాముతో చెప్పెను.

17 మరియు ప్రొద్దు గ్రుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్నపొయ్యియు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండములమధ్య నడిచిపోయెను.౹

18 ఆ దినమందే యెహోవా–ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నదియైన యూఫ్రటీసునదివరకు ఈ దేశమును, అనగా

19 కేనీయులను కనిజ్జీయులను కద్మోనీయులను

20 హిత్తీయులను పెరి జ్జీయులను రెఫాయీయులను

21 అమోరీయులను కనానీయులను గిర్గాషీయులను యెబూసీయులను నీ సంతానమున కిచ్చియున్నానని అబ్రాముతో నిబంధన చేసెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/GEN/15-ea118926e8c07d41d232ee3a76b32a6c.mp3?version_id=1787—

Categories
ఆదికాండము

ఆదికాండము 16

1 అబ్రాము భార్యయైన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి యుండెను.౹

2 కాగా శారయి–ఇదిగో నేను పిల్లలు కనకుండ యెహోవా చేసియున్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము; ఒకవేళ ఆమెవలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాముతో చెప్పెను; అబ్రాము శారయి మాట వినెను.౹

3 కాబట్టి అబ్రాము కనాను దేశములో పదియేండ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్యయైన శారయి తన దాసియైన హాగరను ఐగుప్తీయురాలిని తీసికొని తన పెనిమిటియైన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను.౹

4 అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయెను. అది తాను గర్భవతి నైతినని తెలిసికొనినప్పుడు దాని యజమానురాలు దానిదృష్టికి నీచమైనదాయెను.౹

5 అప్పుడు శారయి– నా ఉసురు నీకు తగులును; నేనే నా దాసిని నీ కౌగిటి కిచ్చిన తరువాత తాను గర్భవతినైతినని తెలిసికొనినప్పుడు నేను దానిదృష్టికి నీచమైనదాననైతిని; నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాముతో అనెను.౹

6 అందుకు అబ్రాము–ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది; నీ మనస్సు వచ్చినట్లు దాని చేయుమని శారయితో చెప్పెను. శారయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్దనుండి అది పారిపోగా

7 యెహోవాదూత అరణ్యములో నీటిబుగ్గయొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద, ఆమెను కనుగొని

8 –శారయి దాసివైన హాగరూ, ఎక్కడనుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్లుచున్నావని అడిగినందుకు అది–నా యజమానురాలైన శారయియొద్దనుండి పారిపోవుచున్నాననెను.౹

9 అప్పుడు యెహోవాదూత– నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్లి ఆమె చేతి క్రింద అణగియుండుమని దానితో చెప్పెను.౹

10 మరియు యెహోవాదూత–నీ సంతానమును నిశ్చయముగా విస్త రింపజేసెదను; అది లెక్కింప వీలులేనంతగా విస్తారమవు నని దానితో చెప్పెను.౹

11 మరియు యెహోవాదూత– ఇదిగో యెహోవా నీ మొరను వినెను. నీవు గర్భవతివై యున్నావు; నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలుఅను పేరు పెట్టుదువు;౹

12 అతడు అడవిగాడిదవంటి మనుష్యుడు. అతని చెయ్యి అందరికిని అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి యెదుట నివసించునని దానితో చెప్పగా

13 అది–చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను ఏలయనగా నన్ను చూచిన వాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను.౹

14 అందుచేత ఆ నీటిబుగ్గకు బెయేర్ లహాయిరోయిఅను పేరు పెట్టబడెను. అది కాదేషుకును బెరెదుకును మధ్య నున్నది.౹

15 తరువాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను. అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలను పేరు పెట్టెను.౹

16 హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము ఎనుబదియారు ఏండ్ల వాడు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/GEN/16-a5a921c00cd229ee0f23ada11e9ca58f.mp3?version_id=1787—

Categories
ఆదికాండము

ఆదికాండము 17

1 అబ్రాము తొంబదితొమ్మిది యేండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై–నేను సర్వశక్తిగల దేవుడను; నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము.౹

2 నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదనని అతనితో చెప్పెను.౹

3-4 అబ్రాము సాగిలపడియుండగా దేవుడతనితో మాటలాడి–ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసియున్నాను; నీవు అనేక జనములకు తండ్రివగుదువు.౹

5 మరియు ఇకమీదట నీ పేరు అబ్రాము అనబడదు; నిన్ను అనేక జనములకు తండ్రి నిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రాహాము అనబడును.౹

6 నీకు అత్యధికముగా సంతానవృద్ధి కలుగజేసి నీలోనుండి జనములు వచ్చునట్లు నియమించుదును, రాజులును నీలోనుండి వచ్చెదరు.౹

7 నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై యుండునట్లు, నాకును నీకును, నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్యనిబంధనగా స్థిరపరచెదను.౹

8 నీకును నీ తరువాత నీ సంతతికిని నీవు పరదేశివైయున్న దేశమును, అనగా కనానను దేశమంతటిని నిత్యస్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుందునని అతనితో చెప్పెను.౹

9 మరియు దేవుడు–నీవును, నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను.౹

10 నాకును నీకును నీ తరువాత నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన యేదనగా–మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను.౹

11 మీరు మీ గోప్యాంగచర్మమున సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును.౹

12 ఎనిమిది దినముల వయస్సుగలవాడు, అనగా నీ యింట పుట్టినవాడైనను, నీ సంతానము కాని అన్యునియొద్ద వెండితో కొనబడినవాడైనను, మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను.౹

13 నీ యింట పుట్టినవాడును నీ వెండితో కొనబడినవాడును, తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును.౹

14 సున్నతి పొందని మగవాడు, అనగా ఎవని గోప్యాంగచర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలోనుండి కొట్టివేయబడును.వాడు నా నిబంధనను మీరియున్నాడని అబ్రాహాముతో చెప్పెను.

15 మరియు దేవుడు–నీ భార్యయైన శారయి పేరు శారయి అనవద్దు; ఏలయనగా ఆమె పేరు శారా

16 నేనామెను ఆశీర్వదించి ఆమెవలన నీకు కుమారుని కలుగ జేసెదను; నేనామెను ఆశీర్వదించెదను; ఆమె జనములకు తల్లియై యుండును; జనముల రాజులు ఆమెవలన కలుగుదురని అబ్రాహాముతో చెప్పెను.౹

17 అప్పుడు అబ్రాహాము సాగిలపడి నవ్వి–నూరేండ్లవానికి సంతానము కలుగునా? తొంబదియేండ్ల శారా కనునా? అని మనస్సులో అను కొనెను.౹

18 అబ్రాహాము–ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రదుక ననుగ్రహించుము అని దేవునితో చెప్పగా

19 దేవుడు–నీ భార్యయైన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును; నీవతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు; అతని తరువాత అతని సంతానముకొరకు నిత్యనిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను.౹

20 ఇష్మాయేలునుగూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేనతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతని విస్తరింపజేసెదను; అతడు పండ్రెండుమంది రాజులను కనును; అతనిని గొప్ప జనముగా చేసెదను;౹

21 అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచెదనని చెప్పెను.౹

22 దేవుడు అబ్రాహాముతో మాటలాడుట చాలించిన తరువాత అతని యొద్దనుండి పరమునకు వెళ్లెను.౹

23 అప్పుడు అబ్రాహాము తన కుమారుడైన ఇష్మాయేలును, తన యింట పుట్టిన వారినందరిని, తన వెండితో కొనబడిన వారినందరిని, అబ్రాహాము ఇంటి మనుష్యులలో ప్రతివానిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగచర్మమున సున్నతి చేసెను.౹

24 అబ్రాహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు తొంబది తొమ్మిది యేండ్లవాడు.౹

25 అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగచర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు పదుమూడేండ్లవాడు.౹

26 ఒక్కదినమందే అబ్రాహామును అతని కుమారుడైన ఇష్మాయేలును సున్నతి పొందిరి.౹

27 అతని యింట పుట్టినవారును అన్యునియొద్ద వెండితో కొనబడినవారును అతని యింటిలోని పురుషులందరును అతనితోకూడ సున్నతి పొందిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/GEN/17-b2f3b662669132d243ef51e7335d640b.mp3?version_id=1787—

Categories
ఆదికాండము

ఆదికాండము 18

1 మరియు మమ్రేదగ్గరనున్న సింధూరవనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని యున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను.౹

2 అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని యెదుట నిలువబడి యుండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటనుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి, నేలమట్టుకు వంగి

3 –ప్రభువా, నీ కటాక్షము నామీద నున్నయెడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు.౹

4 నేను కొంచెము నీళ్లు తెప్పించెదను; దయచేసి కాళ్లు కడుగు కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి.౹

5 కొంచెము ఆహారము తెచ్చెదను; మీ ప్రాణములను బలపరచు కొనుడి; తరువాత మీరు వెళ్లవచ్చును; ఇందు నిమిత్తము గదా మీ దాసునియొద్దకు వచ్చితిరనెను. వారు–నీవు చెప్పినట్లు చేయుమనగా

6 అబ్రాహాము గుడారములోనున్న శారాయొద్దకు త్వరగా వెళ్లి–నీవు త్వరపడి మూడు మానికల మెత్తనిపిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయుమని చెప్పెను.౹

7 మరియు అబ్రాహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివాని కప్ప గించెను.వాడు దాని త్వరగా సిద్ధపరచెను.౹

8 తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారియెదుట పెట్టి వారు భోజనముచేయుచుండగా వారియొద్ద ఆ చెట్టుక్రింద నిలుచుండెను.౹

9 వారతనితో నీ భార్యయైన శారా ఎక్కడనున్నదని అడుగగా అతడు–అదిగో గుడారములోనున్నదని చెప్పెను.౹

10 అందుకాయన–మీదటికి ఈ కాలమున నీయొద్దకు నిశ్చయముగా మరల వచ్చెదను. అప్పడు నీ భార్యయైన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు విను చుండెను.౹

11 అబ్రాహామును శారాయును బహుకాలము గడచిన వృద్ధులై యుండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచి పోయెను గనుక

12 శారా–నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడును వృద్ధుడై యున్నాడుగదా అని తనలో నవ్వు కొనెను.౹

13 అంతట యెహోవా అబ్రాహాముతో–వృద్ధు రాలనైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని శారా నవ్వనేల?

14 యెహోవాకు అసాధ్యమైనది ఏదైన నున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను.౹

15 శారా భయపడి–నేను నవ్వలేదని చెప్పగా ఆయన–అవును నీవు నవ్వితివనెను.

16 అప్పుడా మనుష్యులు అక్కడనుండి లేచి సొదొమతట్టు చూచిరి. అబ్రాహాము వారిని సాగనంపుటకు వారితోకూడ వెళ్లెను.౹

17 అప్పుడు యెహోవా–నేను చేయబోవు కార్యము అబ్రాహామునకు దాచెదనా?

18 అబ్రాహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములును ఆశీర్వదింపబడును.౹

19 ఎట్లనగా యెహోవా అబ్రాహామునుగూర్చి చెప్పినది అతనికి కలుగ జేయునట్లు తన తరువాత తన పిల్లలును తన యింటివారును నీతి న్యాయములు జరిగించుచు, యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికాజ్ఞాపించినట్లు నేనతని నెరిగియున్నాననెను.

20 మరియు యెహోవా–సొదొమ గొమొఱ్ఱాలనుగూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను

21 నేను దిగిపోయి నాయొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను; చేయనియెడల నేను తెలిసికొందుననెను.౹

22 ఆ మనుష్యులు అక్కడనుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్లిరి. అబ్రాహాము ఇంక యెహోవా సన్నిధిని నిలుచుండెను.౹

23 అప్పుడు అబ్రాహాము సమీపించి యిట్లనెను–దుష్టులతోకూడ నీతిమంతులను నాశనము చేయుదువా?

24 ఆ పట్టణములో ఒకవేళ ఏబదిమంది నీతిమంతులుండినయెడల దానిలోనున్న యేబదిమంది నీతిమంతులనిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా?

25 ఆ చొప్పున చేసి దుష్టులతోకూడ నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవు గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు

26 యెహోవా–సొదొమ పట్టణములో ఏబదిమంది నీతిమంతులు నాకు కనబడినయెడల వారినిబట్టి ఆ స్థలమంతటిని కాయుదుననెను

27 అందుకు అబ్రాహాము–ఇదిగో ధూళియు బూడిదెయునైన నేనుప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను.౹

28 ఏబదిమంది నీతిమంతులలో ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువై నందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరల అడిగెను. అందుకాయన–అక్కడ నలుబదియైదు గురు నాకు కనబడినయెడల నాశనము చేయననెను;౹

29 అతడింక ఆయనతో మాటలాడుచు–ఒకవేళ అక్కడ నలుబదిమందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన–ఆ నలుబదిమందిని బట్టి నాశనముచేయక యుందునని చెప్పగా

30 అతడు–ప్రభువు కోపపడనియెడల నేను మాటలాడెదను; ఒకవేళ అక్కడ ముప్పదిమందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన–అక్కడ ముప్పదిమంది నాకు కనబడినయెడల నాశనము చేయననెను.౹

31 అందుకతడు–ఇదిగోప్రభువుతో మాటలాడ తెగించితిని; ఒకవేళ అక్కడ ఇరువదిమంది కనబడుదురేమో అని నప్పుడు ఆయన –ఆ యిరువదిమందినిబట్టి నాశనము చేయకుందుననగా

32 అతడు–ప్రభువు కోపపడనియెడల నే నింకొకమారే మాటలాడెదను; ఒకవేళ అక్కడ పదిమంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన–ఆ పదిమందినిబట్టి నాశనము చేయక యుందుననెను.౹

33 యెహోవా అబ్రాహాముతో మాటలాడుట చాలించి వెళ్లిపోయెను. అబ్రాహాము తన యింటికి తిరిగి వెళ్లెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/GEN/18-4ad4fd596a6a002ad2364b034efe82d8.mp3?version_id=1787—

Categories
ఆదికాండము

ఆదికాండము 19

1 ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికి లోతు సొదొమ గవినియొద్ద కూర్చుండియుండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి

2 –నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని యింటికి వచ్చి రాత్రి వెళ్లబుచ్చి కాళ్లు కడుగుకొనుడి, మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్లవచ్చుననెను. అందుకు వారు–ఆలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్లబుచ్చెదమని చెప్పిరి.౹

3 అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతనితట్టు తిరిగి అతని యింట ప్రవేశించిరి. అతడు వారికి విందుచేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనముచేసిరి.౹

4 వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు, అనగా సొదొమ మనుష్యులు, బాలురును వృద్ధులును ప్రజలందరును నలుదిక్కులనుండి కూడివచ్చి ఆ యిల్లు చుట్టవేసి

5 లోతును పిలిచి–ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుష్యులు ఎక్కడ? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసికొని రమ్మని అతనితో చెప్పగా

6 లోతు వెలుపల ద్వారము నొద్దనున్న వారి దగ్గరకు వెళ్లి తన వెనుక తలుపువేసి

7 – అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనకుడి;౹

8 ఇదిగో పురుషుని కూడని యిద్దరు కుమార్తెలు నాకున్నారు. సెల వైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసికొని వచ్చెదను, వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి.౹

9 ఈ మనుష్యులు నా యింటినీడకు వచ్చియున్నారు గనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు–నీవు అవతలికి పొమ్మనిరి. మరియు వారు–వీడెవడో మనలోనికి పరదేశిగావచ్చి తీర్పరిగానుండ చూచుచున్నాడు; కాగా వారికంటె నీకు ఎక్కువ కీడు చేసెదమని చెప్పి లోతు అను ఆ మనుష్యునిమీద దొమ్మిగాపడి తలుపు పగులగొట్టుటకు సమీపించిరి.౹

10 అయితే ఆ మనుష్యులు తమ చేతులు చాపి లోతును ఇంటిలోపలికి తమ యొద్దకు తీసికొని తలుపు వేసిరి.౹

11 అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దలవరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుమబ్బు కలుగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి.౹

12 అప్పుడామనుష్యులు లోతుతో–ఇక్కడ నీకు మరియెవ రున్నారు? నీ అల్లుని నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగినవారినందరిని వెలుపలికి తీసికొని రమ్ము;౹

13 మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి; వారినిగూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్ప దాయెను గనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెనని చెప్పగా

14 లోతు బయటికి వెళ్లి తన కుమార్తెలను పెండ్లాడనైయున్న తన అల్లుళ్లతో మాటలాడి–లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి; యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోవుచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్లదృష్టికి ఎగతాళి చేయువానివలె నుండెను.౹

15 తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి–లెమ్ము; ఈ ఊరి దోషశిక్షలో నశించిపోకుండ నీ భార్యను ఇక్కడనున్న నీ యిద్దరు కుమార్తెలను తీసికొని రమ్మని చెప్పిరి.౹

16 అతడు తడవు చేసెను. అప్పుడు అతనిమీద యెహోవా కనికరపడుటవలన ఆ మనుష్యులు అతనిచేతిని అతని భార్యచేతిని అతని యిద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసికొని వచ్చి ఆ ఊరి బయటనుంచిరి.౹

17 ఆ దూతలు వారిని వెలుపలికి తీసికొని వచ్చిన తరువాత ఆయన–నీ ప్రాణమును దక్కించుకొనునట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకుము, ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించి పోకుండ ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా

18-19 లోతు–ప్రభువా ఆలాగు కాదు. ఇదిగో నీ కటాక్షము నీ దాసునిమీద వచ్చినది; నా ప్రాణము రక్షిం చుటవలన నీవు నాయెడల కనుపరచిన నీ కృపను ఘనపర చితివి; నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను; ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదు నేమో

20 ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది, అది చిన్నది, నన్నక్కడికి తప్పించుకొని పోనిమ్ము. అది చిన్నది గదా, నేను బ్రదుకుదునని చెప్పినప్పుడు

21 ఆయన– ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను. ఈ విషయములో నీ మనవి అంగీకరించితిని;౹

22 నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము; నీ వక్కడ చేరువరకు నేనేమియు చేయలేననెను. అందుచేత ఆ ఊరికి సోయరుఅను పేరు పెట్టబడెను.

23 లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను.౹

24 అప్పుడు యెహోవా సొదొమమీదను గొమొఱ్ఱామీదను యెహోవాయొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశమునుండి కురిపించి

25 ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములలో నివసించినవారినందరిని నేల మొలకలను నాశనము చేసెను.౹

26 అయితే లోతు భార్య అతని వెనుకనుండి తిరిగి చూచి ఉప్పుస్తంభమాయెను.౹

27 తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి

28 సొదొమ గొమొఱ్ఱాలతట్టును ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలె లేచుచుండెను.౹

29 దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడుచేసినప్పుడు దేవుడు అబ్రాహామును జ్ఞాపకము చేసికొని, లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనముమధ్యన లోతు నశించకుండ అతని తప్పించెను.

30 లోతు సోయరులో నివసించుటకు భయపడి, తన యిద్దరు కుమార్తెలతోకూడ సోయరునుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అతడును అతని యిద్దరు కుమార్తెలును ఒక గుహలో నివసించిరి.౹

31 అట్లుండగా అక్క తన చెల్లెలితో–మన తండ్రి ముసలివాడు; సర్వ లోకమర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు.౹

32 మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రివలన సంతానము కలుగచేసికొందము రమ్మని చెప్పెను.౹

33 ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత అతని పెద్దకుమార్తె లోపలికి వెళ్లి తన తండ్రితో శయనించెను. కాని ఆమె ఎప్పుడు శయనించెనో యెప్పుడు లేచిపోయెనో అతనికి తెలియలేదు.౹

34 మరునాడు అక్క తన చెల్లెలిని చూచి–నిన్నటి రాత్రి నా తండ్రితో నేనుశయ నించితిని; ఈ రాత్రి అతనికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత నీవు లోపలికి వెళ్లి అతనితో శయనించుము; ఆలాగున మన తండ్రివలన సంతానము కలుగజేసికొందమని చెప్పెను.౹

35 ఆ రాత్రియు వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిరి. అప్పుడా చిన్నది లేచి అతనితో శయనించెను. ఆమె యెప్పుడు శయనించెనో యెప్పుడు లేచిపోయెనో అతనికి తెలియలేదు.౹

36 ఆలాగున లోతుయొక్క యిద్దరు కుమార్తెలు తమ తండ్రివలన గర్భవతులైరి.౹

37 వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను. అతడు నేటివరకు మోయాబీయులకు మూలపురుషుడుగా ఎంచబడును.౹

38 చిన్నది కూడ కుమారుని కని వానికి బెన్నమ్మి అను పేరు పెట్టెను. అతడు నేటివరకు అమ్మోనీయులకు మూలపురుషుడుగా ఎంచబడును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/GEN/19-40aadab72baf528b7a8a4f120489e759.mp3?version_id=1787—

Categories
ఆదికాండము

ఆదికాండము 20

1 అక్కడనుండి అబ్రాహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేషుకును షూరుకును మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్లు ఉండెను.౹

2 అప్పుడు అబ్రాహాము తన భార్యయైన శారానుగూర్చి–ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన యింట చేర్చుకొనెను.౹

3 అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి –నీవు నీ యింట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడవు సుమా అని చెప్పెను.౹

4 అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు–ప్రభువా ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా?

5 –ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడ–అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసితిననెను.౹

6 అందుకు దేవుడు–అవును, యథార్థహృదయముతో దీని చేసితివని నేనెరుగుదును; మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండ నేను నిన్ను అడ్డగించితిని; అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనియ్యలేదు.౹

7 కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతని కప్పగించుము; అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థనచేయును, నీవు బ్రదుకుదువు. నీవు ఆమెను అతని కప్పగించని యెడల నీవును నీవారందరును నిశ్చయముగా చచ్చెదరని తెలిసికొనుమని స్వప్నమందు అతనితో చెప్పెను.౹

8 తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరిని పిలిపించి ఈ సంగతు లన్నియు వారికి వినిపించినప్పుడు ఆ మనుష్యులు మిగుల భయపడిరి.౹

9 అబీమెలెకు అబ్రాహామును పిలిపించి–నీవు మాకు చేసిన పని యేమిటి? నీవు నా మీదికిని నా రాజ్యము మీదికిని మహాపాతకము తెప్పించునట్లు నేను నీయెడల చేసిన పాపమేమిటి? చేయరాని కార్యములు నాకు చేసితివని అతనితో చెప్పెను.౹

10 మరియు అబీమెలెకు–నీవేమి చూచి ఈ కార్యము చేసితివని అబ్రాహాము నడుగగా

11 అబ్రాహాము–ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదు రనుకొని చేసితిని.౹

12 అంతేకాక–ఆమె నా చెల్లెలనుమాట నిజమే; ఆమె నా తండ్రి కుమార్తెగాని నా తల్లి కుమార్తె కాదు; ఆమె నాకు భార్యయైనది.౹

13 దేవుడు నన్ను నా తండ్రియిల్లు విడిచి దేశాంతరము పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి–మనము పోవు ప్రతి స్థలమందు– ఇతడు నా సహోదరుడని నన్నుగూర్చి చెప్పుము; నీవు నాకు చేయవలసిన ఉపకారమిదేయని చెప్పితిననెను.౹

14 అబీమెలెకు గొఱ్ఱెలను గొడ్లను దాసదాసీ జనులను రప్పించి, అబ్రాహాముకిచ్చి అతని భార్యయైన శారాను అతనికి తిరిగి అప్పగించెను.౹

15 అప్పుడు అబీమెలెకు–ఇదిగో నా దేశము నీ యెదుట నున్నది. నీకిష్టమైన స్థలమందు కాపురముండుమనెను.౹

16 మరియు అతడు శారాతో– ఇదిగో నీ అన్నకు నేను వెయ్యి రూపాయలిచ్చియున్నాను. ఇది నీ యొద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా నుండుటకై యిది నీ పక్షముగా ఇచ్చియున్నాను. ఈ విషయమంతటిలో నీకు న్యాయము తీరిపోయినదనెను.౹

17 అబ్రాహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగుచేసెను; వారు పిల్లలుకనిరి.౹

18 ఏలయనగా అబ్రాహాము భార్యయైన శారానుబట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసియుండెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/GEN/20-60da35694ecaab48b4f2e4c5121a8862.mp3?version_id=1787—