Categories
ద్వితీయోపదేశకాండము

ద్వితీయోపదేశకాండము 28

1 నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచుకొనినయెడల నీ దేవుడైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను హెచ్చించును.౹

2 నీవు నీ దేవుడైన యెహోవా మాట వినినయెడల ఈ దీవెనలన్నియు నీమీదికి వచ్చి నీకు ప్రాప్తించును.౹

3 నీవు పట్టణములో దీవింపబడుదువు; పొలములో దీవింపబడుదువు;౹

4 నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గొఱ్ఱె మేకల మందలు దీవింపబడును;౹

5 నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును.౹

6 నీవు లోపలికి వచ్చునప్పుడు దీవింపబడుదువు; వెలుపలికి వెళ్లునప్పుడు దీవింపబడుదువు.౹

7 నీ మీదపడు నీ శత్రువులను యెహోవా నీ యెదుట హత మగునట్లు చేయును; వారొక త్రోవను నీమీదికి బయలుదేరి వచ్చి యేడు త్రోవల నీ యెదుటనుండి పారిపోవుదురు.౹

8 నీ కొట్లలోను నీవుచేయు ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును.౹

9 నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞల ననుసరించి ఆయన మార్గములలో నడుచుకొనినయెడల యెహోవా నీకు ప్రమాణము చేసియున్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠితజనముగా నిన్ను స్థాపించును.౹

10 భూప్రజలందరు యెహోవా నామమున నీవు పిలువబడు చుండుట చూచి నీకు భయపడుదురు.౹

11 మరియు యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణముచేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను నీ పశువుల విషయములోను నీ నేలపంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును.౹

12 యెహోవా నీ దేశముమీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవుచేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును, ఆకాశమను తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేకజనములకు అప్పిచ్చెదవు కాని అప్పుచేయవు

13 నేడు నేను మీకాజ్ఞాపించు మాటలన్నిటిలో దేనివిషయములోను కుడికిగాని యెడమకుగాని తొలగి

14 అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్నయెడల, నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకాజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనినయెడల, యెహోవా నిన్ను తలగా నియమించునుగాని తోకగా నియమింపడు. నీవు పైవాడ వుగా ఉందువుగాని క్రింది వాడవుగా ఉండవు.

15 నేను నేడు నీకాజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచు కొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చినమాట విననియెడల ఈ శాపములన్నియు నీకు సంభవించును.౹

16 పట్టణములో నీవు శపింపబడుదువు; పొలములో నీవు శపింపబడుదువు;౹

17 నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపింపబడును;౹

18 నీ గర్భఫలము నీ భూమిపంట నీ ఆవులు నీ గొఱ్ఱె మేకల మందలు శపింపబడును;౹

19 నీవు లోపలికి వచ్చునప్పుడు శపింపబడుదువు; వెలుపలికి వెళ్లునప్పుడును శపింపబడుదువు.౹

20 నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యములచేత నీవు హతము చేయబడి వేగముగా నశించువరకు, నీవు చేయ బూనుకొను కార్యములన్నిటి విషయములోను యెహోవా శాపమును కలవరమును గద్దింపును నీ మీదికి తెప్పించును.౹

21 నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములో నుండకుండ నిన్ను క్షీణింప జేయువరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును.౹

22 యెహోవా క్షయరోగముచేతను జ్వరముచేతను మంటచేతను మహాతాపముచేతను ఖడ్గముచేతను కంకికాటుకచేతను బూజుచేతను నిన్ను కొట్టును; నీవు నశించువరకు అవి నిన్ను తరుమును.౹

23 నీ తలపైని ఆకాశము ఇత్తడివలె ఉండును, నీ క్రిందనున్న నేల యినుమువలె ఉండును.౹

24 యెహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను బుగ్గిగాను చేయును; నీవు నశించువరకు అది ఆకాశమునుండి నీ మీదికి వచ్చును.౹

25 యెహోవా నీ శత్రువుల యెదుట నిన్ను ఓడించును. ఒక్కమార్గమున వారి యెదుటికి బయలుదేరి నీవు యేడు మార్గముల వారి యెదుటనుండి పారిపోయి, భూరాజ్యములన్నిటిలోనికి యిటు అటు చెదరగొట్టబడుదువు.౹

26 నీ కళేబరము సకలమైన ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహారమగును; వాటిని బెదరించు వాడెవడును ఉండడు.౹

27 యెహోవా ఐగుప్తు పుంటిచేతను మూలవ్యాధిచేతను కుష్ఠుచేతను గజ్జిచేతను నిన్ను బాధించును; నీవు వాటిని పోగొట్టుకొనజాలకుందువు.౹

28 వెఱ్ఱితనముచేతను గ్రుడ్డి తనముచేతను హృదయ విస్మయముచేతను యెహోవా నిన్ను బాధించును.౹

29 అప్పుడు గ్రుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్నమందు తడువులాడుదువు; నీ మార్గములను వర్ధిల్లచేసికొనలేవు; నీవు హింసింపబడి నిత్యమును దోచుకొనబడెదవు; నిన్ను తప్పించు వాడెవడును లేకపోవును,౹

30 స్త్రీని ప్రధానము చేసికొందువుగాని వేరొకడు ఆమెను కూడును. ఇల్లుకట్టుదువుగాని దానిలో నివసింపవు. ద్రాక్షతోట నాటుదువుగాని దాని పండ్లు తినవు.౹

31 నీ యెద్దు నీ కన్నులయెదుట వధింపబడునుగాని దాని మాంసము నీవు తినవు. నీ గాడిద నీ యెదుటనుండి బలాత్కారముచేత కొనిపోబడి నీ యొద్దకు మరల తేబడదు. నీ గొఱ్ఱె మేకలు నీ శత్రువులకు ఇయ్యబడును, నిన్ను రక్షించువాడెవడును ఉండడు.౹

32 నీ కుమారులును నీ కుమార్తెలును అన్యజనమునకు ఇయ్యబడుదురు. వారి నిమిత్తము నీ కన్నులు దినమెల్లచూచి చూచి క్షీణించిపోవునుగాని నీచేత నేమియు కాకపోవును.౹

33 నీ వెరుగని జనము నీ పొలము పంటను నీ కష్టార్జితమంతయు తినివేయును. నీవు హింసను బాధను మాత్రమే నిత్యము పొందుదువు.౹

34 నీ కన్నులయెదుట జరుగుదానిని చూచుటవలన నీకు వెఱ్ఱియెత్తును.౹

35 యెహోవా నీ అరకాలు మొదలుకొని నీ నడినెత్తివరకు మోకాళ్లమీదను తొడలమీదను కుదరని చెడుపుండ్లు పుట్టించి నిన్ను బాధించును.౹

36 యెహోవా నిన్నును నీవు నీమీద నియమించు కొను నీ రాజును, నీవేగాని నీ పితరులేగాని యెరుగని జనమున కప్పగించును. అక్కడ నీవు కొయ్యదేవతలను రాతిదేవతలను పూజించెదవు

37 యెహోవా నిన్ను చెదర గొట్టు చోటి ప్రజలలో విస్మయమునకు సామెతకు, నిందకు నీవు హేతువై యుందువు.౹

38 విస్తారమైన విత్తనములు పొలములోనికి తీసికొనిపోయి కొంచెమే యింటికి తెచ్చు కొందువు; ఏలయనగా మిడతలు దాని తినివేయును.౹

39 ద్రాక్ష తోటలను నీవు నాటి బాగుచేయుదువుగాని ఆ ద్రాక్షలరసమును త్రాగవు, ద్రాక్షపండ్లను సమకూర్చుకొనవు; ఏలయనగా పురుగు వాటిని తినివేయును.౹

40 ఒలీవ చెట్లు నీ సమస్త ప్రాంతములలో నుండునుగాని తైలముతో తల నంటుకొనవు; నీ ఒలీవ కాయలు రాలిపోవును.౹

41 కుమారులను కుమార్తెలను కందువుగాని వారు నీయొద్ద నుండరు, వారు చెరపట్టబడుదురు.౹

42 మిడతల దండు నీ చెట్లన్నిటిని నీ భూమి పంటను ఆక్రమించుకొనును.౹

43 నీ మధ్యనున్న పరదేశి నీకంటె మిక్కిలి హెచ్చగును నీవు మిక్కిలి తగ్గిపోదువు.౹

44 అతడు నీకు అప్పిచ్చునుగాని నీవు అతనికి అప్పియ్యలేవు. అతడు తలగానుండును నీవు తోకగా నుందువు.౹

45 నీవు నాశనము చేయబడువరకు ఈ శాపములన్నియు నీమీదికి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొనును; ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞా పించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనునట్లు నీవు ఆయన మాట వినలేదు.౹

46 మరియు అవి చిరకాలమువరకు నీ మీదను నీ సంతానముమీదను సూచనగాను విస్మయ కారణముగాను ఉండును.౹

47 నీకు సర్వసమృద్ధి కలిగియుండియు నీవు సంతోషముతోను హృదయానందముతోను నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు

48 గనుక ఆకలి దప్పులతోను వస్త్రహీనతతోను అన్ని లోపములతోను యెహోవా నీమీదికి రప్పించు నీ శత్రువులకు దాసుడవగుదువు. వారు నిన్ను నశింపజేయువరకు నీ మెడమీద ఇనుపకాడి యుంచుదురు.౹

49 యెహోవా దూరమైయున్న భూదిగంతమునుండి ఒక జనమును, అనగా నీకు రాని భాష కలిగిన జనమును,౹

50 క్రూరముఖము కలిగి వృద్ధులను యౌవనస్థులను కటా క్షింపని జనమును గద్ద యెగిరివచ్చునట్లు నీమీదికి రప్పిం చును.౹

51 నిన్ను నశింపజేయువరకు నీ పశువులను నీ పొలముల ఫలములను వారు తినివేతురు నిన్ను నశింపజేయువరకు ధాన్యమునేగాని ద్రాక్షారసమునేగాని తైలమునేగాని పశువుల మందలనేగాని గొఱ్ఱె మేకమందలనేగాని నీకు నిలువనియ్యరు.౹

52 మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారములుగల నీ కోటలు పడువరకును నీ దేశమందంతటను నీ గ్రామములన్నిటిలోను వారు నిన్ను ముట్టడి వేయుదురు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ దేశ మందంతటను నీ గ్రామములన్నిటిలోను నిన్ను ముట్టడి వేయుదురు.౹

53 అప్పుడు ముట్టడిలోను నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందిలోను నీ గర్భఫలమును, అనగా నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ కుమారులయొక్కయు నీ కుమా ర్తెలయొక్కయు మాంసమును తిందువు.౹

54 మీలో బహు మృదువైన స్వభావమును అతి సుకుమారమునుగల మనుష్యుని కన్ను తన సహోదరునియెడలను తన కౌగిటి భార్య యెడలను తాను చంపక విడుచు తన కడమపిల్లలయెడలను చెడ్డదైనందున

55 అతడు తాను తిను తన పిల్లలమాంసములో కొంచెమైనను వారిలో నెవనికిని పెట్టడు; ఏలయనగా మీ శత్రువులు మీ గ్రామములన్నిటియందు మిమ్మును ఇరుకు పరచుటవలనను ముట్టడివేయుటవలనను వానికి మిగిలిన దేమియు ఉండదు.౹

56-57 నీ గ్రామములలో నీ శత్రువులు నిన్ను ఇరుకుపరచుటవలనను ముట్టడివేయుటవలనను ఏమియు లేకపోవుటచేత మీలో మృదుత్వమును అతి సుకుమారమును కలిగి మృదుత్వముచేతను అతి సుకుమా రముచేతను నేలమీద తన అరకాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్లమధ్యనుండి పడు మావిని తాను కనబోవు పిల్లలను తాను రహస్యముగా తినవలెనని తన కౌగిటి పెనిమిటి యెడలనైనను తన కుమారునియెడలనైనను తన కుమార్తె యెడలనైనను కటాక్షము చూపకపోవును.౹

58 నీవు జాగ్రత్త పడి యీ గ్రంథములో వ్రాయబడిన యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి గైకొనుచు, నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడనియెడల

59 యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగుళ్లను కలుగజేయును. అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్లును చెడ్డ రోగములునై యుండును.౹

60 నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నిటిని ఆయన నీ మీదికి తెప్పించును; అవి నిన్ను వెంటాడును.౹

61 మరియు నీవు నశించువరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడని ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన నీకు కలుగజేయును.౹

62 నీవు నీ దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆకాశనక్షత్రములవలె విస్తారములైన మీరు, లెక్కకు తక్కువై కొద్ది మందే మిగిలియుందురు.౹

63 కాబట్టి మీకు మేలుచేయుచు మిమ్మును విస్తరింపజేయుటకు మీ దేవుడైన యెహోవా మీయందు ఎట్లు సంతో షించెనో అట్లు మిమ్మును నశింపజేయుటకును మిమ్ము సంహరించుటకును యెహోవా సంతోషించును గనుక నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించుచున్న దేశములోనుండి పెల్లగింపబడుదువు.౹

64 దేశముయొక్క యీ కొనమొదలుకొని ఆ కొనవరకును సమస్తజనములలోనికి యెహోవా నిన్ను చెదరగొట్టును. అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరుగని కొయ్యవియు రాతివియునైన అన్యదేవతలను పూజింతువు.౹

65 ఆ జనములలో నీకు నెమ్మది కలుగదు; నీ అరకాలికి విశ్రాంతి కలుగదు. అక్కడ యెహోవా హృదయకంపమును నేత్రక్షీణతయు మనోవేదనయు నీకు కలుగజేయును.౹

66 నీకు ఎల్లప్పుడు ప్రాణభయము కలిగి యుండును.౹

67 నీవు రేయింబగళ్లు భయపడుదువు. నీ ప్రాణము నీకు దక్కునను నమ్మకము నీకేమియు ఉండదు. నీ హృదయములో పుట్టు భయముచేతను, నీ కన్ను చూచువాటిచేతను ఉదయమున–అయ్యో యెప్పుడు సాయంకాలమగునా అనియు, సాయంకాలమున–అయ్యో యెప్పుడు ఉదయమగునా అనియు అనుకొందువు.౹

68 మరియు నీవు మరి ఎప్పుడును దీనిని చూడకూడదని నేను నీతో చెప్పిన మార్గమున యెహోవా ఐగుప్తునకు ఓడలమీద నిన్ను మరల రప్పించును. అక్కడ మీరు దాసులగాను దాసీలగాను నీ శత్రువులకు మిమ్మును అమ్మ జూపుకొనువారుందురుగాని మిమ్మును కొనువాడొకడైన నుండడు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/DEU/28-e5532f83351dd4d24054f088a221c965.mp3?version_id=1787—

Categories
ద్వితీయోపదేశకాండము

ద్వితీయోపదేశకాండము 29

1 యెహోవా హోరేబులో ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధన గాక ఆయన మోయాబుదేశములో వారితో చేయుమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు ఇవే.

2 మోషే ఇశ్రాయేలీయులనందరిని పిలిపించి వారితో ఇట్లనెను–యెహోవా మీ కన్నులయెదుట ఐగుప్తు దేశమున ఫరోకును అతని సేవకులందరికిని అతని సమస్త జనమునకును చేసినదంతయు, అనగా

3 ఆ గొప్ప శోధనలను సూచకక్రియలను మహత్కార్యములను మీరు కన్నులార చూచితిరి.౹

4 అయినను గ్రహించు హృదయమును చూచు కన్నులను విను చెవులను యెహోవా నేటివరకు మీకిచ్చి యుండలేదు.౹

5 నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలిసికొనునట్లు నలువది సంవత్సరములు నేను మిమ్మును అరణ్యములో నడిపించితిని. మీ బట్టలు మీ ఒంటిమీద పాతగిలిపోలేదు; మీ చెప్పులు మీ కాళ్లను పాతగిలి పోలేదు.౹

6 మీరు రొట్టె తినలేదు, ద్రాక్షారసమేగాని మద్యమేగాని త్రాగలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹

7 మీరు ఈ చోటికి చేరినప్పుడు హెష్బోనురాజైన సీహోనును బాషానురాజైన ఓగును యుద్ధమునకు మనమీదికి రాగా

8 మనము వారిని హతము చేసి వారి దేశమును స్వాధీనపరచుకొని రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపువారికిని దాని స్వాస్థ్యముగా ఇచ్చితిమి.౹

9 కాబట్టి మీరు చేయునదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచు కొనవలెను.

10-13 నీ దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారముగాను నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసిన ప్రకారముగాను, నేడు నిన్ను తనకు స్వజనముగా నియమించుకొని తానే నీకు దేవుడైయుండునట్లు నీ దేవుడైన యెహోవా నేడు నీకు నియమించుచున్న నీ దేవుడైన యెహోవా నిబంధనలోను ఆయన ప్రమాణము చేసినదానిలోను నీవు పాలుపొందుటకై ఇశ్రాయేలీయులలో ప్రతివాడు, అనగా మీలో ముఖ్యులేమి, మీ గోత్రపువారేమి మీ పెద్దలేమి, మీ నాయకు లేమి మీ పిల్లలేమి, మీ భార్యలేమి, నీ పాళెములోనున్న పరదేశులేమి, నీ కట్టెలను నరుకువారు మొదలుకొని నీ నీళ్లు తోడువారివరకును మీరందరు నేడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచియున్నారు.౹

14 నేను మీతో మాత్రము కాదు, ఇక్కడ మనతోకూడను ఉండి, నేడు మన దేవుడైన యెహోవా సన్నిధిని నిలుచుచున్నవారితోను

15 ఇక్కడ నేడు మనతోకూడ నుండని వారితోను ఈ నిబంధనను ప్రమాణమును చేయుచున్నాను.౹

16 మనము ఐగుప్తు దేశమందు ఎట్లు నివసించితిమో, మీరు దాటి వచ్చిన జనములమధ్యనుండి మనమెట్లు దాటివచ్చితిమో మీరెరుగుదురు.౹

17 వారి హేయక్రియలను, కఱ్ఱతోను రాతితోను వెండితోను బంగారముతోను చేయబడిన వారి విగ్రహములను మీరు చూచితిరిగదా.౹

18 ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యెహోవాయొద్ద నుండి తొలగు హృదయముగల పురుషుడేగాని స్త్రీయేగాని కుటుంబమేగాని గోత్రమేగాని నేడు మీలో ఉండకుండునట్లును, మరణకరమైన దుష్కృత్యమునకు అట్టి మూలమైనది మీలో ఉండకుండునట్లును, నేడు ఈ నిబంధనను మీతో చేయుచున్నాను.౹

19 అట్టి పనులను చేయువాడు ఈ శాపవాక్యములను వినునప్పుడు, మద్యముచేత దప్పి తీర్చుకొనవలెనని నేను నా హృదయ కాఠిన్యమున నడుచుచుండినను నాకు క్షేమము కలుగునని, నేను ఆశీర్వాదము నొందెదనని అనుకొనును.౹

20 అయితే యెహోవా వానిని క్షమింపనొల్లడు; అట్టివాడు మీలోనుండినయెడల నిశ్చయముగా యెహోవా కోపమును ఓర్వమియు ఆ మనుష్యునిమీద పొగరాజును; ఈ గ్రంథములో వ్రాయ బడిన శాపములన్నియువానికి తగులును. యెహోవా అతని పేరు ఆకాశము క్రిందనుండకుండ తుడిచివేయును.౹

21 ఈ ధర్మశాస్త్రగ్రంథములో వ్రాయబడిన నిబంధన శాపములన్నిటినిబట్టి వానికి కీడు కలుగజేయుటకై యెహోవా ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలోనుండి వాని వేరుపర చును.౹

22 కాబట్టి మీ తరువాత పుట్టు మీ సంతతివారును దూరదేశమునుండి వచ్చు పరదేశులును సమస్త జనములును ఆ దేశముయొక్క తెగుళ్లను యెహోవా దానిమీదికి తెప్పించిన సంకటములను చూచి

23 వారు, యెహోవా తన కోపోద్రేకముచేత నశింపజేసిన సొదొమ గొమొఱ్ఱా అద్మా సెబోయీములవలె ఆ సమస్త దేశమును గంధకముచేతను ఉప్పుచేతను చెడిపోయి, విత్తబడకయు దానిలో ఏదియు బుట్టకయు దానిలో ఏ కూరయు మొలవకయు ఉండుట చూచి

24 –యెహోవా దేని బట్టి యీ దేశమును ఇట్లు చేసెనో? యీ మహా కోపాగ్నికి హేతువేమో? అని చెప్పుకొందురు.౹

25 మరియు వారు–వారి పితరుల దేవుడైన యెహోవా ఐగుప్తు దేశములోనుండి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు నిరాకరించిరి

26 తామెరుగని అన్యదేవతలను, ఆయన వారికి నియమింపని దేవతలను, పూజించి వాటికి నమస్క రించిరి

27 గనుక యీ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నిటిని యీ దేశముమీదికి తెప్పించుటకు దానిమీద యెహోవా కోపము రవులుకొనెను.౹

28 యెహోవా తన కోపోద్రేకముచేతను అత్యుగ్రతచేతను తమ దేశములోనుండి వారిని పెల్లగించి, నేడున్నట్లుగా వారిని వెళ్లగొట్టి పరదేశము పాలుచేసెను.౹

29 రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటి ననుసరించి నడుచుకొనునట్లు బయలుపరచబడినవి యెల్లప్పుడు మనవియు మన సంతతి వారివియునగునని చెప్పుదురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/DEU/29-5e1764db8caf045bcb7bada0860f8f79.mp3?version_id=1787—

Categories
ద్వితీయోపదేశకాండము

ద్వితీయోపదేశకాండము 30

1 నేను నీకు వినిపించిన యీ సంగతులన్నియు, అనగా దీవెనయు శాపమును నీమీదికి వచ్చిన తరువాత నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్లగొట్టించిన

2 సమస్త జనములమధ్యను వాటిని జ్ఞాపకము చేసికొని, నీ దేవుడైన యెహోవావైపు తిరిగి, నేడు నేను నీ కాజ్ఞాపించు సమస్తమునుబట్టి నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను ఆయన మాట నీవును నీ సంతతివారును వినినయెడల

3 నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి, నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలోనుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును.౹

4 మీలో నెవరైన ఆకాశ దిగంతములకు వెళ్లగొట్టబడినను అక్కడనుండి నీ దేవుడైన యెహోవా మిమ్మును సమకూర్చి అక్కడనుండి రప్పిం చును.౹

5 నీ పితరులకు స్వాధీన పరచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును, నీవు దాని స్వాధీనపరచు కొందువు; ఆయన నీకు మేలుచేసి నీ పితరులకంటె నిన్ను విస్తరింప జేయును.౹

6 మరియు నీవు బ్రదుకుటకై నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను, నీ దేవుడైన యెహోవాను ప్రేమించునట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతివారి హృదయమునకును సున్నతి చేయును.౹

7 అప్పుడు నిన్ను హింసించిన నీ శత్రువులమీదికిని నిన్ను ద్వేషించినవారిమీదికిని నీ దేవుడైన యెహోవా ఆ సమస్త శాపములను తెప్పిం చును.౹

8 నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని, నేను నేడు నీ కాజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటిని గైకొను చుందువు.౹

9-10 మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని, నీ దేవుడైన యెహోవా మాట విని, నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ దేవుడైన యెహోవావైపు మళ్లునప్పుడు యెహోవా నీ పితరులయందు ఆనందించినట్లు నీకు మేలుచేయుటకు నీయందును ఆనందించి నీవైపు మళ్లును.

11 నేడు నేను నీ కాజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు.౹

12 మనము దానిని విని గైకొనునట్లు, ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మనయొద్దకు దాని తెచ్చును? అని నీ వనుకొనుటకు అది ఆకాశమందు ఉండునది కాదు;౹

13 మనము దాని విని గైకొనునట్లు, ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాని తెచ్చును అని నీవను కొననేల? అది సముద్రపు అద్దరి మించునది కాదు.౹

14 నీవు దాని ననుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా నున్నది; నీ హృదయమున నీ నోట నున్నది.

15 చూడుము; నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ యెదుట ఉంచియున్నాను.౹

16 నీవు బ్రదికి విస్తరించునట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకాజ్ఞాపించుచున్నాను. అట్లు చేసినయెడల నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును.౹

17 అయితే నీ హృదయము తిరిగిపోయి, నీవు విననొల్లక యీడ్వబడినవాడవై అన్యదేవతలకు నమస్కరించి పూజించినయెడల

18 మీరు నిశ్చయముగా నశించిపోవుదురనియు, స్వాధీనపరచుకొనుటకు యొర్దానును దాటపోవుచున్న దేశములో మీరు అనేకదినములు ఉండరనియు నేడు నేను నీకు తెలియజెప్పుచున్నాను.౹

19 నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ యెదుటను ఉంచి, భూమ్యాకాశములను మీమీద సాక్షులుగా పిలుచుచున్నాను.౹

20 నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించునట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్షుకును మూలమై యున్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రదుకుచు, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనునట్లును జీవమును కోరుకొనుడి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/DEU/30-7e29cfc7c827944d7db35b0fada4b11f.mp3?version_id=1787—

Categories
ద్వితీయోపదేశకాండము

ద్వితీయోపదేశకాండము 31

1 మోషే ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరల ఇట్లనెను–నేడు నేను నూట ఇరువది యేండ్లవాడనై యున్నాను.౹

2 ఇకమీదట నేను వచ్చుచుపోవుచు నుండలేను, యెహోవా ఈ యొర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చెను.౹

3 నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ యెదుట నుండకుండ నశింపజేయును, నీవు వారి దేశమును స్వాధీనపరచుకొందువు. యెహోవా సెలవిచ్చియున్నట్లు యెహోషువ నీ ముందుగా దాటిపోవును.౹

4 యెహోవా నశింపజేసిన అమోరీయుల రాజులైన సీహోనుకును ఓగుకును వారి దేశమునకును ఏమి చేసెనో ఆప్రకారముగానే యీ జనములకును చేయును.౹

5 నేను మీకాజ్ఞాపించిన దానినంతటినిబట్టి మీరు వారికి చేయునట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుడి

6 భయపడకుడి, వారిని చూచి దిగులుపడకుడి, నీతోకూడ వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే; ఆయన నిన్ను విడువడు నిన్నెడబాయడు.౹

7 మరియు మోషే యెహోషువను పిలిచి–నీవు నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము. యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణముచేసిన దేశమునకు నీవు వీరితోకూడ పోయి దానిని వారికి స్వాధీన పరచవలెను.౹

8 నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై యుండును, ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు. భయపడకుము విస్మయమొందకుమని ఇశ్రాయేలీయులందరియెదుట అతనితో చెప్పెను.

9 మోషే ఈ ధర్మశాస్త్రమును వ్రాసి యెహోవా నిబంధనమందసమును మోయు యాజకులైన లేవీయులకును ఇశ్రాయేలీయుల పెద్దలందరికిని దాని నప్పగించి

10 వారితో ఇట్లనెను–ప్రతి యేడవ సంవత్సరాంతమున, అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున

11 నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమందు ఇశ్రాయేలీయులందరు ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించునప్పుడు ఇశ్రాయేలీయులందరి యెదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలెను.౹

12 మీ దేవుడైన యెహోవాకు భయపడి యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనునట్లు పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి నీ పురములలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరిని పోగుచేయవలెను.౹

13 ఆలాగు నేర్చుకొనినయెడల దాని నెరుగని వారి సంతతివారు దానిని విని, మీరు స్వాధీనపరచుకొనుటకు యొర్దానును దాటబోవుచున్న దేశమున మీరు బ్రదుకు దినములన్నియు మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చు కొందురు.

14 మరియు యెహోవా–చూడుము; నీ మరణదినములు సమీపించెను; నీవు యెహోషువను పిలిచి నేనతనికి ఆజ్ఞలిచ్చినట్లు ప్రత్యక్షపు గుడారములో నిలువుడని మోషేతో సెలవియ్యగా,౹

15 మోషేయు యెహోషువయు వెళ్లి ప్రత్యక్షపు గుడారములో నిలిచిరి. అచ్చట యెహోవా మేఘస్తంభములో ప్రత్యక్షమాయెను; ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారముపైని నిలువగా

16 యెహోవా మోషేతో యిట్లనెను–ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోవుచున్నావు. ఈ జనులు లేచి, యెవరి దేశమున తాము చేరి వారి నడుమ నుందురో ఆ జనులమధ్యను వ్యభిచారులై, ఆ అన్యుల దేవతల వెంట వెళ్లి నన్ను విడిచి, నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు.౹

17 కావున నాకోపము ఆ దినమున వారిమీద రగులు కొనును. నేను వారిని విడిచి వారికి విరోధినగుదును, వారు క్షీణించిపోవుదురు. విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమునవారు, మన దేవుడు మన మధ్యనుండకపోయినందున గదా యీ కీడులు మనకు ప్రాప్తించెననుకొందురు.౹

18 వారు అన్యదేవతలతట్టు తిరిగి చేసిన కీడంతటినిబట్టి ఆ దినమున నేను నిశ్చయముగా వారికి విరోధినగుదును.౹

19 కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పుడి. ఈ కీర్తన ఇశ్రాయేలీయులమీద నాకు సాక్ష్యార్థముగా నుండునట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించుము.౹

20 నేను వారి పితరులతో ప్రమాణము చేసినట్లు, పాలు తేనెలు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తరువాత, వారుతిని త్రాగి తృప్తిపొంది క్రొవ్వినవారై అన్యదేవతలతట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు.౹

21 విస్తారమైన కీడులు ఆపదలు వారికి సంభవించిన తరువాత ఈ కీర్తన వారియెదుట సాక్షిగానుండి సాక్ష్యము పలుకును. అది మరువబడక వారి సంతతివారి నోట నుండును. నేను ప్రమాణము చేసిన దేశమున వారిని ప్రవేశపెట్టకమునుపే, నేడే వారుచేయు ఆలోచన నేనెరుగుదును అనెను.౹

22 కాబట్టి మోషే ఆ దినమందే యీ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పెను.౹

23 మరియు యెహోవా నూను కుమారుడైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెను–నీవు నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము; నేను ప్రమాణ పూర్వకముగా వారికిచ్చిన దేశమునకు ఇశ్రాయేలీయులను నీవు తోడుకొని పోవలెను, నేను నీకు తోడై యుందును.

24 ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు సాంతముగా వ్రాయుట ముగించిన తరువాత

25 మోషే యెహోవా నిబంధనమందసమును మోయు లేవీయులను చూచి ఆజ్ఞాపించినదేమనగా–మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసికొని మీ దేవుడైన యెహోవా నిబంధనమందసపు ప్రక్కన ఉంచుడి.౹

26 అది అక్కడ నీమీద సాక్ష్యార్థముగా ఉండును.౹

27 నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేనెరుగుదును. నేడు నేను ఇంక సజీవుడనై మీతో ఉండగానే, ఇదిగో మీరు యెహోవామీద తిరుగుబాటుచేసితిరి.౹

28 నేను చనిపోయిన తరువాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేయుదురుకదా. మీ గోత్రముల పెద్దలనందరిని మీ నాయకులను నాయొద్దకు పోగు చేయుడి. ఆకాశమును భూమిని వారిమీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పెదను.౹

29 ఏలయనగా నేను మరణమైన తరువాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకాజ్ఞాపించిన మార్గమును తప్పుదురనియు, ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తమగుననియు నేనెరుగుదును. మీరుచేయు క్రియలవలన యెహోవాకు కోపము పుట్టించునట్లుగా ఆయన దృష్టికి కీడైనదాని చేయుదురు.౹

30 అప్పుడు మోషే ఇశ్రాయేలీయుల సర్వ సమాజముయొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు సాంతముగా పలికెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/DEU/31-0526650630f3cdec875b1a0eccc30e95.mp3?version_id=1787—

Categories
ద్వితీయోపదేశకాండము

ద్వితీయోపదేశకాండము 32

1 ఆకాశమండలమా, చెవినొగ్గుము; నేను మాటలాడుదును

భూమండలమా, నా నోటిమాట వినుము.

2 నా ఉపదేశము వానవలె కురియును

నా వాక్యము మంచువలెను

లేతగడ్డిమీద పడు చినుకులవలెను

పచ్చికమీద కురియు వర్షమువలెను ఉండును.

3 నేను యెహోవా నామమును ప్రకటించెదను

మన దేవుని మహాత్మ్యమును కొనియాడుడి.

4 ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు; ఆయన

కార్యము సంపూర్ణము

ఆయన చర్యలన్నియు న్యాయములు

ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు.

ఆయన నీతిపరుడు యథార్థవంతుడు.

5 వారు తమ్ము చెరుపుకొనిరి; ఆయన పుత్రులుకారు;వారు కళంకులు

మూర్ఖతగల వక్రవంశము.

6 బుద్ధిలేని అవివేకజనమా,

ఇట్లు యెహోవాకు ప్రతికారము చేయుదురా?

ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా?

ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను.

7 పూర్వదినములను జ్ఞాపకము చేసికొనుము

తరతరముల సంవత్సరములను తలంచుకొనుము

నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును;

నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు.

8 మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభా గించినప్పుడు

నరజాతులను ప్రత్యేకించినప్పుడు

ఇశ్రాయేలీయుల లెక్కనుబట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను.

9 యెహోవా వంతు ఆయన జనమే

ఆయన స్వాస్థ్యభాగము యాకోబే.

10 అరణ్యప్రదేశములోను

భీకరధ్వనిగల పాడైన యెడారిలోను

వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను.

11 పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు

రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల

మీద వాటిని మోయునట్లు

యెహోవా వానిని నడిపించెను.

12 యెహోవా మాత్రము వాని నడిపించెను

అన్యులయొక్క దేవుళ్లలో ఏ దేవుడును ఆయనతోకూడ ఉండలేదు.

13 భూమియొక్క ఉన్నతస్థలములమీద వాని నెక్కిం చెను

పొలముల పంట వానికి తినిపించెను

కొండబండనుండి తేనెను

చెకుముకి రాతిబండనుండి నూనెను

అతనికి జుఱ్ఱించెను.

14 ఆవు మజ్జిగను గొఱ్ఱెమేకల పచ్చిపాలను

గొఱ్ఱెపిల్లల క్రొవ్వును బాషాను పొట్టేళ్లను మేకలను

గోధుమల మెరికెల సారమును నీకిచ్చెను.

నీవు త్రాగిన మద్యము ద్రాక్షలరసము.

15 యెషూరూనుక్రొవ్వినవాడై కాలు జాడించెను

నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి.

వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను

తన రక్షణ శైలమును తృణీకరించెను.

16 వారు అన్యుల దేవతలచేత ఆయనకు రోషము పుట్టించిరి

హేయకృత్యములచేత ఆయనను కోపింపజేసిరి

17 వారు దేవత్వములేని దయ్యములకు

తామెరుగని దేవతలకు

క్రొత్తగా పుట్టిన దేవతలకు

తమపితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి.

18 నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి.

నిన్ను కనిన దేవుని మరచితివి.

19 యెహోవా దానిని చూచెను.

తన కుమారులమీదను కుమార్తెలమీదను క్రోధపడెను

వారిని అసహ్యించుకొనెను.

20 ఆయన ఇట్లనుకొనెను–

నేను వారికి విముఖుడనై వారి కడపటిస్థితి యేమగునో చూచెదనువారు మూర్ఖచిత్తముగలవారు విశ్వాసములేని పిల్లలు.

21 వారు దైవము కానిదానివలన నాకు రోషము పుట్టిం చిరి

తమ వ్యర్థప్రవర్తనవలన నాకు ఆగ్రహము పుట్టించిరి

కాబట్టి జనముకానివారివలన వారికి రోషము పుట్టిం తును

అవివేక జనమువలన వారికి కోపము పుట్టింతును.

22 నా కోపాగ్ని రగులుకొనును

పాతాళాగాధమువరకు అది దహించును

అది భూమిని దాని పంటను కాల్చును

పర్వతముల పునాదులను రవులబెట్టును.

23 వారికి ఆపదలను విస్తరింపజేసెదనువారిమీద నా బాణములన్నిటిని వేసెదను.

24 వారు కరవుచేత క్షీణించుదురు

మంటచేతను క్రూరమైన హత్యచేతను హరించి పోవుదురు

బురదలో ప్రాకు పాముల విషమును

మృగముల కోరలను వారిమీదికి రప్పించెదను.

25 బయట ఖడ్గమును లోపట భయమును

యౌవనులను కన్యకలను శిశువులను నెరిసిన తలవెండ్రు

కలు గలవారిని నశింపజేయును.

26 వారిని దూరమునకు చెదరగొట్టెదను

27 వారి పేరు మనుష్యులలోలేకుండచేసెదననుకొందునువారి విరోధులు నిజము గ్రహింపకుందురేమో

–ఇదంతయు యెహోవా చేసినదికాదు

మా బలముచేత వారిని గెలిచితిమి అని వారనుకొందురేమో

విరోధి గర్వమునకు భయపడి చెదరగొట్టలేదు.

28 వారు ఆలోచనలేని జనమువారిలో వివేచనలేదు.

29 వారు జ్ఞానము తెచ్చుకొని దీని తలపోసి తమ కడవరి

స్థితి యోచించుట మేలు.

30 తమ ఆశ్రయదుర్గము వారిని అమ్మివేయనియెడల

యెహోవావారిని అప్పగింపనియెడల

ఒక్కడు ఎట్లు వేయిమందిని తరుమును?

ఇద్దరు ఎట్లు పదివేలమందిని పారదోలుదురు?

31 వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గమువంటిది కాదు

ఇందుకు మన శత్రువులే తీర్పరులు.

32 వారి ద్రాక్షావల్లి సొదొమ ద్రాక్షావల్లి

అది గొమొఱ్ఱా పొలములలో పుట్టినది.

వారి ద్రాక్షపండ్లు పిచ్చి ద్రాక్షపండ్లు

వాటి గెలలు చేదైనవి.

వారి ద్రాక్షారసము క్రూరసర్పముల విషము

నాగుపాముల క్రూరవిషము.

33 ఇది నాయొద్ద మరుగుపడి యుండలేదా?

నా నిధులలో ముద్రింపబడి యుండలేదా?

34 వారి కాలు జారుకాలమున

పగతీర్చుటయు ప్రతిఫలమిచ్చుటయు నావే;

35 వారి ఆపద్దినము సమీపించునువారి గతి త్వరగా వచ్చును.

36 వారి కాధారము లేకపోవును.

37 నిర్బంధింపబడినవాడును స్వతంత్రుడును లేకపోవును

యెహోవా చూచును

తన సేవకులనుగూర్చి సంతాపపడును.

38 నిజముగా తన ప్రజలకు తీర్పుచేయును.

ఆయన–వారి నైవేద్యముల క్రొవ్వునుతిని వారి పానీ

యార్పణమైన ద్రాక్షారసమును త్రాగినవారి దేవత లేమైరి?వారు ఆశ్రయించిన దుర్గములే

లేచి మీకు సహాయము చేయవచ్చునువారు మీకు శరణము కానియ్యుడి అని చెప్పును.

39 ఇదిగో నేను నేనే దేవుడను

నేను తప్ప వేరొక దేవుడు లేడు

మృతినొందించువాడను బ్రదికించువాడను నేనే

గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే

నా చేతిలోనుండి విడిపించువాడెవడును లేడు

40-41 నేను తళతళలాడు నా ఖడ్గము నూరి

నా చేత న్యాయమును పట్టుకొనినయెడల

నా శత్రువులకు ప్రతీకారము కలుగజేసెదను

నన్ను ద్వేషించువారికి ప్రతిఫలమిచ్చెదను

రక్తముచేత నా బాణములను మత్తిల్ల చేసెదను.

42 చంపబడినవారి రక్తమును చెరపట్టబడినవారి రక్తమును

శత్రువులలో వీరుల తలలను

నా ఖడ్గము భక్షించును

నేను ఆకాశముతట్టు నా హస్తమెత్తి నా శాశ్వత

జీవముతోడని ప్రమాణము చేయుచున్నాను.

43 జనములారా, ఆయన ప్రజలతోకూడ ఆనందించుడి.

హతులైన తన సేవకులనుబట్టి ఆయన ప్రతి దండన చేయును

తన విరోధులకు ప్రతీకారము చేయును

తన దేశము నిమిత్తమును తన ప్రజలనిమిత్తమును

ప్రాయశ్చిత్తము చేయును.

44 మోషేయు నూను కుమారుడైన యెహోషువయుఈ కీర్తన మాటలన్నియు ప్రజలకు వినిపించిరి.౹

45 మరియు మోషే యీ మాటలన్నియు ఇశ్రాయేలీయులందరితో చెప్పి చాలించి

46 మరల వారితో ఇట్లనెను–మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటిని మీ మన స్సులలో పెట్టుకొని, మీ సంతతివారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనవలెనని వారికాజ్ఞాపింపవలెను.౹

47 ఇది మీకు నిరర్థకమైన మాటకాదు, ఇది మీకు జీవమే. మరియు మీరు స్వాధీనపరచుకొనుటకు యొర్దానును దాటబోవుచున్న దేశములో దీనినిబట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు.

48-49 ఆ దినమున యెహోవా మోషేతో ఇట్లనెను– యెరికో యెదుటనున్న మోయాబుదేశమందలి అబారీమను ఈ పర్వతము, అనగా నెబోకొండ యెక్కి నేను ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న కనాను దేశమును చూచి

50 నీ సహోదరుడైన అహరోను హోరు కొండమీద మృతిబొంది తన స్వజనులయొద్దకు చేరినట్లు నీవు ఎక్కబోవుచున్న కొండమీద మృతిబొంది నీ స్వజనులయొద్దకు చేరుదువు.౹

51 ఏలయనగా మీరు సీను అరణ్యములో కాదేషు మెరీబా నీళ్లయొద్ద ఇశ్రాయేలీయులమధ్యను నన్ను పరిశుద్ధపరచక ఇశ్రాయేలీయులమధ్యను నామీద తిరుగుబాటు చేసితిరి.౹

52 ఎదురుగా ఆ దేశమును చూచెదవు కాని నేను ఇశ్రాయేలీయుల కిచ్చుచున్న ఆ దేశమున నీవు ప్రవేశింపవు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/DEU/32-27161a88d4a09f1a3909e9ea7eb7c6b6.mp3?version_id=1787—

Categories
ద్వితీయోపదేశకాండము

ద్వితీయోపదేశకాండము 33

1 దైవజనుడైన మోషే మృతినొందకమునుపు అతడు ఇశ్రాయేలీయులను దీవించిన విధము ఇది; అతడిట్లనెను–

2 యెహోవా సీనాయినుండి వచ్చెను

శేయీరులోనుండి వారికి ఉదయించెను

ఆయన పారాను కొండనుండి ప్రకాశించెను

వేవేల పరిశుద్ధ సమూహములమధ్యనుండి ఆయన వచ్చెను

ఆయన కుడిపార్శ్వమున అగ్నిజ్వాలలు మెరియు

చుండెను.

3 ఆయన జనములను ప్రేమించును

ఆయన పరిశుద్ధులందరు నీ వశమున నుందురువారు నీ పాదములయొద్ద సాగిలపడుదురు

నీ ఉపదేశమును అంగీకరింతురు.

4 మోషే మనకు ధర్మశాస్త్రమును విధించెను

అది యాకోబు సమాజ స్వాస్థ్యము.

5 జనులలో ముఖ్యులును ఇశ్రాయేలు గోత్రములును కూడగా

అతడు యెషూరూనులో రాజు ఆయెను.

6 రూబేను బ్రదికి చావక యుండునుగాక

అతనివారు లెక్కింపలేనంతమందిఅగుదురు.

7 యూదానుగూర్చి అతడిట్లనెను–

యెహోవా, యూదా మనవి విని, అతని ప్రజల

యొద్దకు అతనిని చేర్చుము.

యూదా బాహుబలము అతనికి చాలునట్లుచేసి అతని

శత్రువులకు విరోధముగా నీవతనికి సహాయుడవై

యుందువు.

8 లేవినిగూర్చి యిట్లనెను–

నీ తుమ్మీము నీ ఊరీము నీ భక్తునికి కలవు

మస్సాలో నీవు అతని పరిశోధించితివి

మెరీబా నీళ్లయొద్ద అతనితో వివాదపడితివి.

9 అతడు–నేను వానినెరుగనని తన తండ్రిని గూర్చియు

తన తల్లినిగూర్చియు అనెను

తన సహోదరులను లక్ష్యపెట్టలేదు

తన కుమారులను కుమారులని యెంచలేదువారు నీ వాక్యమునుబట్టి నీ నిబంధనను గైకొనిరి.

10 వారు యాకోబునకు నీ విధులను

ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు

నీ సన్నిధిని ధూపమును

నీ బలిపీఠముమీద సర్వాంగబలిని అర్పించుదురు

11 యెహోవా, అతని బలమును అంగీకరించుము

అతడుచేయు కార్యమును అంగీకరించుమీ

అతని విరోధులును అతని ద్వేషించువారును లేవకుండునట్లువారి నడుములను విరుగగొట్టుము.

12 బెన్యామీనునుగూర్చి యిట్లనెను–

బెన్యామీను యెహోవాకు ప్రియుడు

ఆయనయొద్ద అతడు సురక్షితముగా నివసించును

దినమెల్ల ఆయన అతనికి ఆశ్రయమగును

ఆయన భుజములమధ్యఅతడు నివసించును

13 యోసేపునుగూర్చి యిట్లనెను–

ఆకాశ పరమార్థములవలన మంచువలన

క్రింద క్రుంగియున్న అగాధ జలములవలన

14 సూర్యునివలన కలుగు ఫలములోని శ్రేష్ఠపదార్థములవలన

చంద్రుడు పుట్టించు శ్రేష్ఠపదార్థములవలన

15 పురాతన పర్వతముల శ్రేష్ఠపదార్థములవలన

నిత్యపర్వతముల శ్రేష్ఠపదార్థములవలన

16 సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠపదార్థములవలన

యెహోవా అతని భూమిని దీవించును

పొదలోనుండినవాని కటాక్షము యోసేపు తలమీదికి వచ్చును

తన సహోదరులలో ప్రఖ్యాతినొందినవాని నడినెత్తి

మీదికి అది వచ్చును.

17 అతని వృషభమునకు మొదట పుట్టినదానికి ఘనత కలదు.

అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు

వాటివలన అతడు భూమ్యంతములవరకు జనులను

త్రోసివేయును

ఎఫ్రాయిముయొక్క పదివేలును మనష్షేయొక్క

వేలును ఆలాగున నుందురు.

18 జెబూలూనునుగూర్చి యిట్లనెను–

జెబూలూనూ, నీవు బయలు వెళ్లు స్థలమందు సంతో

షించుము

ఇశ్శాఖారూ, నీ గుడారములయందు సంతోషించుము.

19 వారు జనములను కొండకు పిలిచిరి

అక్కడ నీతి బలులనర్పింతురువారు సముద్రముల సమృద్ధిని

ఇసుకలో దాచబడిన రహస్యద్రవ్యములను పీల్చుదురు.

20 గాదునుగూర్చి యిట్లనెను–

గాదును విశాలపరచువాడు స్తుతింపబడును

అతడు ఆడుసింహమువలె పొంచియుండును బాహు

వును నడినెత్తిని చీల్చివేయును.

21 అతడు తనకొరకు మొదటిభాగము చూచుకొనెను

అక్కడ నాయకుని భాగము కాపాడబడెను.

అతడు జనములోని ముఖ్యులతోకూడ వచ్చెను

యెహోవా తీర్చిన న్యాయమును జరిపెను

ఇశ్రాయేలీయులయొద్ద యెహోవా విధులను ఆచ

రించెను.

22 దానునుగూర్చి యిట్లనెను–

దాను సింహపుపిల్ల

అది బాషానునుండి దుమికి దాటును.

23 నఫ్తాలినిగూర్చి యిట్లనెను–

కటాక్షముచేత తృప్తిపొందిన నఫ్తాలి,

యెహోవా దీవెనచేత నింపబడిన నఫ్తాలి,

పశ్చిమదక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొనుము.

24 ఆషేరునుగూర్చి యిట్లనెను–

ఆషేరు తన సహోదరులకంటె ఎక్కువగా ఆశీర్వ

దింపబడును.

అతడు తన సహోదరులకంటె కటాక్షము నొందును

తన పాదములను తైలములో ముంచుకొనును.

25 నీ కమ్ములుఇనుపవియు ఇత్తడివియునై యుండును.

నీవు బ్రదుకు దినములలో నీకు విశ్రాంతికలుగును.

26 యెషూరూనూ, దేవుని పోలినవాడెవడును లేడు

ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశవాహనుడై

వచ్చును

మహోన్నతుడై మేఘవాహనుడగును.

27 శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలము

నిత్యముగనుండు బాహువులు నీ క్రిందనుండును

ఆయన నీ యెదుటనుండి శత్రువును వెళ్లగొట్టి–

నశింపజేయుమనెను.

28 ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును

యాకోబు ఊట ప్రత్యేకింపబడును

అతడు ధాన్య ద్రాక్షారసములుగల దేశములోనుండును

అతనిపై ఆకాశము మంచును కురిపించును.

29 ఇశ్రాయేలూ, నీ భాగ్యమెంత గొప్పది

యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు?

ఆయన నీకు సహాయకరమైన కేడెము

నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము

నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము

వేయుదురు

నీవు వారి ఉన్నతస్థలములను త్రొక్కుదువు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/DEU/33-bff0c615b5b7bff6e63734b54902ea45.mp3?version_id=1787—

Categories
ద్వితీయోపదేశకాండము

ద్వితీయోపదేశకాండము 34

1 మోషే మోయాబు మైదానమునుండి యెరికో యెదుటనున్న పిస్గాకొండవరకు పోయి నెబోశిఖరమున కెక్కెను.౹

2 అప్పుడు యెహోవా దానువరకు గిలాదు దేశమంతయు నఫ్తాలిదేశమంతయు ఎఫ్రాయిము మనష్షేల దేశమును పశ్చిమ సముద్రమువరకు యూదా దేశమంతయు దక్షిణ దేశమును

3 సోయరువరకు ఈతచెట్లుగల యెరికో లోయ చుట్టు మైదానమును అతనికి చూపించెను.౹

4 మరియు యెహోవా అతనితో ఇట్లనెను–నీ సంతానమున కిచ్చెదనని అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశము ఇదే. కన్నులార నిన్ను దాని చూడనిచ్చితినిగాని నీవు నది దాటి అక్కడికి వెళ్లకూడదు.౹

5 యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాటచొప్పున మోయాబు దేశములో మృతినొందెను.౹

6 బెత్పయోరు యెదుట మోయాబు దేశములోనున్న లోయలో అతడు పాతిపెట్టబడెను. అతని సమాధి యెక్కడనున్నదో నేటివరకు ఎవరికి తెలియదు.౹

7 మోషే చనిపోయినప్పుడు నూట ఇరువది సంవత్సరముల యీడుగలవాడు. అతనికి దృష్టి మాంద్యములేదు, అతని సత్తువ తగ్గలేదు.౹

8 ఇశ్రాయేలీయులు మోయాబు మైదానములలో మోషేనుబట్టి ముప్పది దినములు దుఃఖము సలుపగా మోషేనుగూర్చిన దుఃఖము సలిపిన దినములు సమాప్తమాయెను.౹

9 మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువమీద ఉంచి యుండెను గనుక అతడు జ్ఞానాత్మపూర్ణుడాయెను; కాబట్టి ఇశ్రాయేలీయులు అతనిమాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి.౹

10-11 ఐగుప్తు దేశములో ఫరోకును అతని సేవకులకందరికిని అతని దేశమంతటికిని యే సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతని పంపెనో

12 వాటి విషయములోను, ఆ బాహుబల మంతటి విషయములోను, మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల యెదుట కలుగజేసిన మహా భయంకర కార్యముల విషయములోను, యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషేవంటి యింకొక వ్రవక్త ఇశ్రాయేలీయులలో ఇదివరకు పుట్టలేదు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/DEU/34-2525c654a3bf84075387efe9b9e0dfd9.mp3?version_id=1787—

Categories
యెహోషువ

యెహోషువ 1

1 యెహోవా సేవకుడైన మోషే మృతినొందిన తరువాత, యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెను–నా సేవకుడైన మోషే మృతినొందెను.౹

2 కాబట్టి నీవు లేచి, నీవును ఈ జనులందరును ఈ యొర్దానునది దాటి నేను ఇశ్రాయేలీయులకిచ్చుచున్న దేశమునకు వెళ్లుడి.౹

3 నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను.౹

4 అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానదియైన యూఫ్రటీసు నదివరకును హిత్తీయుల దేశమంతయు పడమట మహా సముద్రమువరకును మీకు సరిహద్దు.౹

5 నీవు బ్రదుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ యెదుట నిలువలేక యుండును; నేను మోషేకు తోడై యుండినట్లు నీకును తోడైయుందును.౹

6 నిన్ను విడువను నిన్ను ఎడబాయను, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన యీ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు.౹

7 అయితే నీవు నిబ్బరముగలిగి జాగ్రత్తపడి బహు ధైర్యముగానుండి, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించునట్లు నీవు దానినుండి కుడికిగాని యెడమకుగాని తొలగకూడదు.౹

8 ఈ ధర్మశాస్త్రగ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తపడునట్లు దివారాత్రము దాని ధ్యానించినయెడల నీ మార్గమును వర్ధిల్లజేసికొని చక్కగా ప్రవర్తించెదవు.౹

9 నేను నీ కాజ్ఞయిచ్చియున్నాను గదా, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము, దిగులుపడకుము జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై యుండును.

10 కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఈలాగు ఆజ్ఞాపించెను–మీరు పాళెములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి

11 –మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనబోవుటకై మూడుదినములలోగా మీరు ఈ యొర్దానును దాటవలెను. గనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి.

12 మరియు రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపువారికిని యెహోషువ యీలాగు ఆజ్ఞాపించెను.౹

13 యెహోవా సేవకుడైన మోషే మీ కాజ్ఞాపించిన సంగతి జ్ఞాపకము చేసికొనుడి; ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగజేయుచున్నాడు; ఆయన ఈ దేశమును మీకిచ్చును.౹

14 మీ భార్యలును మీ పిల్లలును మీ ఆస్తియు యొర్దాను అవతల మోషే మీకిచ్చిన యీ దేశమున నివసింపవలెనుగాని, పరాక్రమవంతులును శూరులునైన మీరందరు యుద్ధసన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా

15 నది దాటి, యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకును విశ్రాంతి దయచేయువరకు, అనగా మీ దేవుడైన యెహోవావారికిచ్చు దేశమును స్వాధీనపరచుకొనువరకు మీరును సహాయము చేయవలెను. అప్పుడు తూర్పున యొర్దాను ఇవతల యెహోవా సేవకుడైన మోషే మీకిచ్చిన మీ స్వాస్థ్యమైన దేశమునకు మీరు తిరిగి వచ్చి దాని స్వాధీనపరచుకొందురు.౹

16 అందుకు వారు–నీవు మా కాజ్ఞాపించినదంతయు మేము చేసెదము, నీవు మమ్ము నెక్కడికి పంపుదువో అక్కడికి పోదుము;౹

17 మోషే చెప్పిన ప్రతిమాట మేము వినినట్లు నీ మాట విందుము; నీ దేవుడైన యెహోవా మోషేకు తోడైయుండినట్లు నీకును తోడై యుండును గాక.౹

18 నీమీద తిరుగబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయములో నీ మాట వినని వారందరు మరణశిక్ష నొందుదురు; నీవు నిబ్బరముగలిగి ధైర్యము తెచ్చుకొనవలెనని యెహోషువకు ఉత్తరమిచ్చిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOS/1-47eb2d508eea16dd6483ec806fe8a0c8.mp3?version_id=1787—

Categories
యెహోషువ

యెహోషువ 2

1 నూను కుమారుడైన యెహోషువ వేగులవారైన యిద్దరు మనుష్యులను పిలిపించి–మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి, షిత్తీమునొద్దనుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్లి రాహాబను నొక వేశ్యయింట చేరి అక్కడ దిగగా

2 దేశమును వేగుచూచుటకు ఇశ్రాయేలీయులయొద్దనుండి మనుష్యులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను.౹

3 అతడు–నీయొద్దకు వచ్చి నీ యింట చేరిన ఆ మనుష్యులను వెలుపలికి తీసికొనిరమ్ము; వారు ఈ దేశమంతటిని వేగు చూచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుష్యులను పంపగా

4 ఆ స్త్రీ ఆ యిద్దరు మనుష్యులను తోడుకొని వారిని దాచిపెట్టి –మనుష్యులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే,౹

5 వారెక్కడనుండి వచ్చిరో నేనెరుగను; చీకటిపడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుష్యులు వెలుపలికి వెళ్లిరి, వారెక్కడికిపోయిరో నేనెరుగను; మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు

6 అని చెప్పి తన మిద్దెమీదికి ఆ యిద్దరిని ఎక్కించి దానిమీద రాశివేసి యున్న జనుపకట్టెలో వారిని దాచి పెట్టెను.౹

7 ఆ మనుష్యులు యొర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి; తరుమపోయిన మనుష్యులు బయలు వెళ్లినతోడనే గవిని వేయబడెను.౹

8 ఆ వేగులవారు పండుకొనకమునుపు, ఆమె వారున్న మిద్దెమీదికెక్కి వారితో ఇట్లనెను.౹

9 –యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు, మీవలన మాకు భయము పుట్టుననియు, మీ భయమువలన ఈ దేశనివాసులందరికి ధైర్యము చెడుననియు నేనెరు గుదును.౹

10 మీరు ఐగుప్తు దేశములోనుండి వచ్చినప్పుడు మీ యెదుట యెహోవా యెఱ్ఱసముద్రపు నీరును ఏలాగు ఆరిపోచేసెనో, యొర్దాను తీరముననున్న అమోరీయుల యిద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఏలాగు నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి.౹

11 మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమియందును దేవుడే. మీ యెదుట ఎట్టి మనుష్యులకైనను ధైర్యమేమాత్రము ఉండదు.౹

12 నేను మీకు ఉపకారము చేసితిని గనుక మీరును నా తండ్రియింటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలును ఇచ్చి

13 నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములును నా అక్కచెల్లెండ్రును వారికి కలిగి యున్నవారందరును చావకుండ బ్రదుకనిచ్చి రక్షించునట్లుగా దయచేసి యెహోవాతోడని ప్రమాణము చేయుడనెను.౹

14 అందుకు ఆ మనుష్యులు ఆమెతో–నీవు మా సంగతి వెల్లడి చేయనియెడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణమిచ్చెదము, యెహోవా ఈ దేశమును మాకిచ్చునప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసెదమనిరి.౹

15 ఆమె యిల్లు పట్టణపు ప్రాకారముమీద నుండెను, ఆమె ప్రాకారము మీద నివసించునది గనుక త్రాడువేసి కిటికిద్వారా వారిని దింపెను.౹

16 ఆమె–మిమ్మును తరుమబోయినవారు మీకెదు రుగా వచ్చెదరేమో, మీరు కొండలకువెళ్లి తరుమబోయినవారు తిరిగి వచ్చువరకు మూడుదినములు అచ్చట దాగి యుండుడి, తరువాత మీ త్రోవను వెళ్లుడని వారితో అనగా

17 ఆ మనుష్యులు ఆమెతో ఇట్లనిరి–యిదిగో మేము ఈ దేశమునకు వచ్చువారము గనుక నీవు మాచేత చేయించిన యీ ప్రమాణము విషయమై మేము నిర్దోషుల మగునట్లు

18 నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఈ ఎఱ్ఱని దారమును కట్టి, నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి యింటివారినందరిని నీయింట చేర్చుకొనుము.౹

19 నీ యింటి ద్వారములలోనుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది, మేము నిర్దోషులమగుదుము. అయితే నీయొద్ద నీ యింటనున్న యెవనికేగాని యే అపాయమైనను తగిలినయెడల దానికి మేమే ఉత్తర వాదులము.౹

20 నీవు మా సంగతి వెల్లడిచేసినయెడల నీవు మాచేత చేయించిన యీ ప్రమాణము విషయములో మేము దోషులము కామనిరి.౹

21 అందుకు ఆమె–మీ మాటచొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్ల నంపెను. వారు వెళ్లినతరువాత ఆమె ఆ తొగరుదారమును కిటికీకి కట్టెను.౹

22 వారు వెళ్లి కొండలను చేరి తరుము వారు తిరిగి వచ్చువరకు మూడుదినములు అక్కడ నివసించిరి. తరుమువారు ఆ మార్గమందంతటను వారిని వెద కిరిగాని వారు కనబడలేదు.౹

23 ఆ యిద్దరు మనుష్యులు తిరిగి కొండలనుండి దిగి నది దాటి నూను కుమారుడైన యెహోషువయొద్దకు వచ్చి తమకు సంభవించినదంతయు అతనితో వివరించి చెప్పిరి.౹

24 మరియు వారు–ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మన భయముచేత ఆ దేశనివాసులందరికి ధైర్యము చెడి యున్నదని యెహోషువతో ననిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOS/2-5c4d44dc2745144227684a27921ad0b8.mp3?version_id=1787—

Categories
యెహోషువ

యెహోషువ 3

1 యెహోషువ వేకువను లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరును షిత్తీమునుండి బయలుదేరి యొర్దానుకు వచ్చి దానిని దాటకమునుపు అక్కడ నిలిచిరి.౹

2 మూడుదినములైన తరువాత నాయకులు పాళెములో తిరుగుచు జనులకు ఈలాగున ఆజ్ఞాపించిరి

3 –మీరు మీ దేవుడైన యెహోవా నిబంధనమందసమును యాజకులైన లేవీయులు మోసికొని పోవుట చూచునప్పుడు మీరున్న స్థలములోనుండి బయలుదేరి దాని వెంబడి వెళ్లవలెను.౹

4 మీకును దానికిని దాదాపు రెండువేల కొలమూరల యెడముండవలెను. మీరు వెళ్లుత్రోవ మీరింతకుముందుగా వెళ్లి నది కాదు, మీరు దానిని గురుతుపట్టవలెను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడవరాదు.౹

5 మరియు యెహోషువ–రేపు యెహోవా మీ మధ్య అద్భుతకార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచు కొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను.౹

6 –మీరు నిబంధనమందసమును ఎత్తికొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవియ్యగా వారు నిబంధనమందసమును ఎత్తికొని ప్రజలముందర నడచిరి.

7 అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను– నేను మోషేకు తోడైయుండినట్లు నీకును తోడైయుందునని ఇశ్రాయేలీయులందరు ఎరుగునట్లు నేడు వారి కన్నులయెదుట నిన్ను గొప్పచేయ మొదలు పెట్టెదను.౹

8 మీరు యొర్దాను నీళ్లదరికి వచ్చి యొర్దానులో నిలువుడని నిబంధనమందసమును మోయు యాజకులకు ఆజ్ఞా పించుము.౹

9 కాబట్టి యెహోషువ–మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి

10 వారితో యిట్లనెను–సర్వలోక నాధుని నిబంధనమందసము మీకు ముందుగా యొర్దానును దాటబోవుచున్నది గనుక

11 జీవముగల దేవుడు మీ మధ్య నున్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ యెదుటనుండి కనానీయులను హిత్తీయులను హివ్వీయులను పెరిజ్జీయులను గెర్గేషీయులను అమోరీయులను యెబూసీయులను వెళ్లగొట్టుననియు దీనివలన మీరు తెలిసికొందురు.౹

12 కాబట్టి ప్రతిగోత్రమునకు ఒక్కొక మనుష్యుని ఇశ్రాయేలీయుల గోత్రములలోనుండి పన్నిద్దరు మనుష్యులను ఏర్పరచు కొనుడి.౹

13 సర్వలోక నాధుడగు యెహోవా నిబంధనమందసమును మోయు యాజకుల అరకాళ్లు యొర్దాను నీళ్లను ముట్టగానే యొర్దాను నీళ్లు, అనగా ఎగువనుండి పారు నీళ్లు ఆపబడి యేకరాశిగా నిలుచును.౹

14 కోత కాలమంతయు యొర్దాను దాని గట్లన్నిటిమీద పొర్లి పారును; నిబంధనమందసమును మోయు యాజకులు జనులకు ముందు వెళ్లగా యొర్దానును దాటుటకై జనులు తమ గుడారములలోనుండి బయలుదేరిరి.౹

15 అప్పుడు ఆ మందసమును మోయువారు యొర్దానులో దిగినతరువాత మందసమును మోయు యాజకుల కాళ్లు నీటి అంచునమునగగానే

16 పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారెతానునొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏక రాశిగా నిలిచెను. లవణసముద్రమను అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను.౹

17 జనులు యెరికో యెదుటను దాటగా యెహోవా నిబంధనమందసమును మోయు యాజకులు యొర్దానుమధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరు యొర్దానును దాటుట తుద ముట్టువరకు ఇశ్రాయేలీయులందరు ఆరిన నేలమీద దాటుచు వచ్చిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JOS/3-1910434e52157e4d87308400d3b3710f.mp3?version_id=1787—