Categories
ద్వితీయోపదేశకాండము

ద్వితీయోపదేశకాండము 18

1 యాజకులైన లేవీయులకు, అనగా లేవీగోత్రీయులకందరికి ఇశ్రాయేలీయులతో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు, వారు యెహోవా హోమద్రవ్యములను తిందురు; అది వారి హక్కు.౹

2 వారి సహోదరులతో వారికి స్వాస్థ్యము కలుగదు; యెహోవావారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము. జనులవలన, అనగా ఎద్దుగాని గొఱ్ఱెగాని మేకగాని బలిగా అర్పించువారి వలన

3 యాజకులు పొందవలసిన దేదనగా, కుడిజబ్బను రెండు దవడలను పొట్టను యాజకుని కియ్యవలెను.౹

4 నీ ధాన్యములోను నీ ద్రాక్షారసములోను నీ నూనెలోను ప్రథమ ఫలములను నీ గొఱ్ఱెల మొదటి బొచ్చును అతని కియ్యవలెను.౹

5 నిత్యము యెహోవా నామమున నిలిచి సేవచేయుటకు నీ గోత్రములన్నిటిలోను అతనిని అతని సంతతివారిని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొని యున్నాడు.

6 ఒక లేవీయుడు ఇశ్రాయేలీయుల దేశమున తాను విదేశిగా నివసించిన నీ గ్రామములలో ఒకదానినుండి యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు మిక్కిలి మక్కువతో వచ్చినప్పుడు

7 అక్కడ యెహోవా సన్నిధిని నిలుచు లేవీయులైన తన గోత్రపువారు చేయునట్లు అతడు తన దేవుడైన యెహోవా నామమున సేవచేయవలెను.౹

8 అమ్మబడిన తన పిత్రార్జితమువలన తనకు వచ్చినది గాక అతడు ఇతరులవలె వంతు అనుభవింపవలెను.

9 నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయకృత్యములను నీవు చేయ నేర్చుకొనకూడదు.౹

10 తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను, శకునముచెప్పు సోదెగానినైనను, మేఘ శకునములనుగాని సర్ప శకునములనుగాని చెప్పువానినైనను, చిల్లంగివానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలకునినైనను

11 కర్ణపిశాచి నడుగువానినైనను, దయ్యములయొద్ద విచారణచేయు వానినైనను మీ మధ్య ఉండనియ్యకూడదు.౹

12 వీటినిచేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటినిబట్టి నీ దేవుడైన యెహోవా నీ యెదుటనుండి ఆ జనములను వెళ్లగొట్టుచున్నాడు.౹

13 నీవు నీ దేవుడైన యెహోవాయొద్ద యథార్థపరుడవై యుండవలెను.౹

14 నీవు స్వాధీనపరచుకొనబోవు జనములు మేఘశకునములను చెప్పువారి మాటను సోదెగాండ్ర మాటను విందురు. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆలాగున చేయనియ్యడు.౹

15 హోరేబులో ఆ సమాజదినమున నీవు–నేను చావక యుండునట్లు మళ్లి నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండునుగాక,౹

16 ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండునుగాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీమధ్యను నావంటి ప్రవక్తను నీ సహోదరులలో నీకొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను.౹

17 మరియు యెహోవా నాతో ఇట్లనెను. వారు చెప్పిన మాట మంచిది;౹

18 వారి సహోదరులలోనుండి నీవంటి ప్రవక్తను వారికొరకు పుట్టించెదను; అతని నోట నా మాటల నుంచుదును; నేను అతని కాజ్ఞాపించునది యావత్తును అతడు వారితో చెప్పును.౹

19 అతడు నా నామమున చెప్పు నా మాటలను విననివానిని దాని గూర్చి విచారణచేసెదను.౹

20 అంతేకాదు, ఏ ప్రవక్తయు అహంకారము పూని, నేను చెప్పుమని తన కాజ్ఞాపించని మాటను నా నామమున చెప్పునో, యితరదేవతల నామమున చెప్పునో ఆ ప్రవక్తయును చావవలెను.౹

21 మరియు –ఏదొకమాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలిసికొనగలమని మీరనుకొనినయెడల,౹

22 ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరుగక పోయినయెడలను ఎన్నడును నెరవేరకపోయినయెడలను అది యెహోవా చెప్పిన మాట కాదు, ఆ ప్రవక్త అహంకారముచేతనే దాని చెప్పెను గనుక దానికి భయపడవద్దు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/DEU/18-58a451181dc95dfdc1940947e3dbd54d.mp3?version_id=1787—

Categories
ద్వితీయోపదేశకాండము

ద్వితీయోపదేశకాండము 19

1 నీ దేవుడైన యెహోవా యెవరి దేశమును నీకిచ్చుచున్నాడో ఆ జనములను నీ దేవుడైన యెహోవా నాశనము చేసిన తరువాత నీవు వారి దేశమును స్వాధీనపరచుకొని, వారి పట్టణములలోను వారి యిండ్లలోను నివసించునప్పుడు

2 నీవు స్వాధీనపరచుకొనునట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో మూడు పురములను వేరుపరచవలెను.౹

3 ప్రతి నరహంతకుడు పారిపోవునట్లుగా నీవు త్రోవను ఏర్పరచుకొని, నీవు స్వాధీనపరచుకొనునట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశముయొక్క సరిహద్దులలోగా ఉన్న పురములను మూడు భాగములు చేయవలెను.౹

4 పారిపోయి బ్రదుకగల నరహంతకుని గూర్చిన పద్ధతి యేదనగా, ఒకడు అంతకుముందు తన పొరుగువానియందు పగపట్టక

5 పొరబాటున వాని చంపినయెడల, అనగా ఒకడు చెట్లు నరుకుటకు తన పొరుగువానితోకూడ అడవికిపోయి చెట్లు నరుకుటకు తన చేతితో గొడ్డలిదెబ్బ వేసినప్పుడు, గొడ్డలి పిడి ఊడి వాని పొరుగువానికి తగిలివాడు చనిపోయినయెడల,వాడు అంతకు ముందు తన పొరుగువానియందు పగపట్టలేదు గనుక

6 వానికి మరణదండన విధిలేదు. అయితే హత్య విషయములో ప్రతిహత్య చేయువాని మనస్సు కోపముతో మండు చుండగా, మార్గము దూరమైనందునవాడు నరహంతకుని తరిమి వాని కలిసికొని వాని చావగొట్టకయుండునట్లు ఆ నరహంతకుడు పారిపోయి ఆ పురములలో ఒకదానియందు జొచ్చి బ్రదుకును.౹

7 అందుచేతను–మూడు పురములను నీకు ఏర్పరచుకొనవలెనని నేను నీకాజ్ఞాపించుచున్నాను.౹

8 మరియు నీ దేవుడైన యెహోవా నీ పితరులతో ప్రమాణముచేసినట్లు ఆయన నీ సరిహద్దులను విశాలపరచి, నీ పితరులకు ఇచ్చెదనని చెప్పిన సమస్తదేశమును నీకిచ్చినయెడల నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు

9 నిత్యమును ఆయన మార్గములలో నడుచుటకు నేడు నేను నీకాజ్ఞాపించిన యీ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుచు, ఈ మూడు పురములు గాక మరి మూడు పురములను ఏర్పరచుకొనవలెను.౹

10 ప్రాణము తీసిన దోషము నీమీద మోపబడకుండునట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న నీ దేశమున నిర్దోషియొక్క ప్రాణము తీయకుండవలెను.౹

11 ఒకడు తన పొరుగువానియందు పగ పెట్టి వానికొరకు పొంచియుండి వానిమీదపడివాడు చచ్చునట్లు కొట్టి

12 ఆ పురములలో ఒకదానిలోనికి పారిపోయినయెడల, వాని ఊరిపెద్దలు మనుష్యులను పంపి అక్కడనుండి వానిని రప్పించి వానిని చంపుటకై హత్య విషయములో ప్రతిహత్యచేయువానిచేతికి వాని నప్పగింపవలెను.౹

13 వాని కటాక్షింపకూడదు; నీకు మేలు కలుగునట్లు ఇశ్రాయేలీయులమధ్యనుండి నిర్దోషి ప్రాణవిషయమైన దోషమును పరిహరింపవలెను.

14 నీవు స్వాధీనపరచుకొనునట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో నీకు కలుగు నీ స్వాస్థ్యములో పూర్వికులు నియమించిన నీ పొరుగువాని సరిహద్దు రాతిని నీవు తీసివేయకూడదు.

15 ఒకడుచేయు సమస్త పాపములలో ఏ అపరాధమునుగూర్చియేగాని యే పాపమునుగూర్చియేగాని ఒక సాక్షియొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. ఇద్దరు సాక్షుల మాటమీదనైనను ముగ్గురు సాక్షుల మాటమీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును.౹

16 అన్యాయపు సాక్ష్యము ఒకనిమీద చెప్పుటకు ఒకడు నిలువబడి నేరము మోపుటకై అబద్ధమాడినయెడల

17 ఆ వివాదముగల ఇద్దరు మనుష్యులు యెహోవా సన్నిధిని, అనగా ఆ కాలములోనున్న యాజకుల యెదుటను న్యాయాధిపతుల యెదుటను నిలువవలెను.౹

18 ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తరువాత వాని సాక్ష్యము అబద్ధసాక్ష్యమై తన సహోదరునిమీదవాడు అబద్ధసాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడి యైనయెడల,వాడు తన సహోదరునికి చేయ తలంచినట్లే వానికి చేయవలెను.౹

19 అట్లు మీ మధ్యనుండి ఆ చెడుతనమును పరిహరించుదురు.౹

20 మిగిలినవారు విని భయపడి నీ దేశమున అట్టి దుష్కార్యము ఇకను చేయకుందురు.౹

21 నీవు ఎవనిని కటాక్షింపకూడదు, ప్రాణమునకు ప్రాణము కంటికి కన్ను పంటికి పల్లు చేతికి చెయ్యి కాలికి కాలు మీకు విధి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/DEU/19-277bcb19cd54f128a7f92a0a0e7fdb05.mp3?version_id=1787—

Categories
ద్వితీయోపదేశకాండము

ద్వితీయోపదేశకాండము 20

1 నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుఱ్ఱములను రథములను మీకంటె విస్తారమైన జనమును చూచు నప్పుడు వారికి భయపడవద్దు; ఐగుప్తు దేశములోనుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై యుండును.౹

2 అంతేకాదు, మీరు యుద్ధమునకు సమీపించునప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఈలాగు చెప్పవలెను

3 –ఇశ్రాయేలీయులారా, వినుడి; నేడు మీరు మీశత్రువులతో యుద్ధము చేయుటకు సమీ పించుచున్నారు. మీ హృదయములు జంకనియ్యకుడి, భయపడకుడి,౹

4 వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి, మీకొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే.౹

5 మరియు నాయకులు జనులతో చెప్పవలసినదేమనగా, క్రొత్తయిల్లు కట్టుకొనినవాడు గృహప్రవేశము కాకమునుపే యుద్ధములో చనిపోయినయెడల వేరొకడు దానిలో ప్రవేశిం చును గనుక అట్టివాడు తన యింటికి తిరిగి వెళ్లవచ్చును.౹

6 ద్రాక్షతోటవేసి యింక దాని పండ్లు తినక ఒకడు యుద్ధములో చనిపోయినయెడల వేరొకడు దాని పండ్లు తినును గనుక అట్టివాడును తన యింటికి తిరిగి వెళ్లవచ్చును.౹

7 ఒకడు స్త్రీని ప్రధానము చేసికొని ఆమెను ఇంకనుపరిగ్రహింపకమునుపే యుద్ధములో చనిపోయినయెడల వేరొకడు ఆమెను పరిగ్రహించును గనుక అట్టివాడును తన యింటికి తిరిగి వెళ్లవచ్చును.౹

8 నాయకులు జనులతో –యెవడు భయపడి మెత్తని గుండెగల వాడగునోవాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచకుండునట్లు తన యింటికి తిరిగి వెళ్లవచ్చునని చెప్పవలెను.౹

9 నాయకులు జనులతో మాటలాడుట చాలించిన తరువాత జనులను నడిపించుటకు సేనాధిపతులను నియమింపవలెను.

10 యుద్ధము చేయుటకు మీరొక పురముమీదికి సమీ పించునప్పుడు సమాధానము నిమిత్తము రాయబారమును పంపవలెను. సమాధానమని అది నీకు ఉత్తరమిచ్చి

11 గుమ్మములను తెరచినయెడల దానిలో నున్న జనులందరు నీకు పన్ను చెల్లించి నీ దాసులగుదురు.౹

12 అది మీతో సమాధానపడక యుద్ధమే మంచిదని యెంచినయెడల దాని ముట్టడివేయుడి.౹

13 నీ దేవుడైన యెహోవా దాని నీ చేతి కప్పగించునప్పుడు దానిలోని మగవారినందరిని కత్తివాత హతము చేయవలెను.౹

14 అయితే స్త్రీలను చిన్నవారిని పశువులను ఆ పురములోనున్నది యావత్తును దాని కొల్ల సొమ్మంతటిని నీవు తీసికొనవచ్చును; నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ శత్రువుల కొల్లసొమ్మును నీవు అనుభవించు దువు.౹

15-18 ఈ జనముల పురములు గాక నీకు బహు దూరముగా ఉండిన సమస్త పురములకు మాత్రమే యీలాగున చేయవలెను. అయితే నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న యీ జనముల పురములలో ఊపిరి గల దేనిని బ్రదుకనియ్యకూడదు. వీరు, అనగా హిత్తీయులు అమోరీయులు కనానీయులు పెరిజ్జీయులు హివ్వీయులు యెబూసీయులనువారు తమతమ దేవతల విషయమై చేసిన సమస్త హేయకృత్యములరీతిగా మీరు చేసి, నీ దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేయుటకు వారు మీకు నేర్పకుండునట్లు నీ దేవుడైన యెహోవా నీ కాజ్ఞాపించిన ప్రకారముగా వారిని నిర్మూలము చేయవలెను.

19 నీవు ఒక పురమును లోపరచుకొనుటకు దానిమీద యుద్ధము చేయుచు అనేక దినములు ముట్టడివేయు నప్పుడు, దాని చెట్లు గొడ్డలిచేత పాడుచేయకూడదు; వాటి పండ్లు తినవచ్చునుగాని వాటిని నరికివేయకూడదు; నీవు వాటిని ముట్టడించుటకు పొలములోని చెట్లు నరులా? అట్టి చెట్లను నీవు కొట్టకూడదు.౹

20 ఏ చెట్లు తినదగిన ఫలములనిచ్చునవికావని నీవెరుగుదువో వాటిని పాడుచేసి నరికి, నీతో యుద్ధముచేయు పురము పడువరకు వాటితో దానికి ఎదురుగా ముట్టడిదిబ్బ కట్ట వచ్చును.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/DEU/20-e61b179c5eb87aa2a1d7e0f4a714daa2.mp3?version_id=1787—

Categories
ద్వితీయోపదేశకాండము

ద్వితీయోపదేశకాండము 21

1 నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఒకడు చంపబడి పొలములో పడియుండుట కనబడునప్పుడు, వాని చంపినవాడెవడో అది తెలియక యుండినయెడల

2 నీ పెద్దలును నీ న్యాయాధిపతులును వచ్చి చంపబడినవాని చుట్టునున్న పురముల దూరము కొలిపింపవలెను.౹

3 ఏ ఊరు ఆ శవమునకు సమీపముగా ఉండునో ఆ ఊరి పెద్దలు ఏ పనికిని పెట్టబడక కాడి యీడ్వని పెయ్యను తీసికొని

4 దున్నబడకయు విత్తబడకయునున్న యేటి లోయలోనికి ఆ పెయ్యను తోలుకొనిపోయి అక్కడ, అనగా ఆ లోయలో ఆ పెయ్యమెడను విరుగ తియ్యవలెను.౹

5 అప్పుడు యాజకులైన లేవీయులు దగ్గరకు రావలెను. యెహోవాను సేవించి యెహోవా నామమున దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకొనెను గనుక వారి నోటిమాటచేత ప్రతి వివాదమును దెబ్బవిషయమైన ప్రతి వ్యాజ్యెమును విమర్శింపబడవలెను.౹

6 అప్పుడు ఆ శవమునకు సమీపమందున్న ఆ ఊరి పెద్దలందరు ఆ యేటి లోయలో మెడ విరుగతీయబడిన ఆ పెయ్యపైని తమ చేతులు కడుగుకొని

7 –మా చేతులు ఈ రక్తమును చిందింపలేదు, మా కన్నులు ఇది చూడలేదు.౹

8 యెహోవా, నీవు విమోచించిన నీ జనమైన ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగనిమ్ము; నీ జనమైన ఇశ్రాయేలీయులమీద నిర్దోషియొక్క ప్రాణము తీసిన దోషమును మోపవద్దని చెప్పవలెను. అప్పుడు ప్రాణము తీసిన దోషమునకు వారినిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగును.౹

9 అట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది చేయునప్పుడు నీ మధ్యనుండి నిర్దోషియొక్క ప్రాణము విషయమైన దోషమును పరిహరించెదవు.

10 నీవు నీ శత్రువులతో యుద్ధముచేయ బోవునప్పుడు నీ దేవుడైన యెహోవా నీ చేతికి వారిని అప్పగించిన తరువాత

11 వారిని చెరపెట్టి ఆ చెరపట్టబడినవారిలో రూపవతియైనదానిని చూచి ఆమెను మోహించి ఆమెను పెండ్లి చేసికొన మనస్సయి

12 నీ యింట ఆమెను చేర్చుకొనిన తరువాత ఆమె తల క్షౌరము చేయించుకొని

13 గోళ్లను తీయించుకొని తన చెరబట్టలు తీసివేసి నీ యింట నివసించి యొక నెలదినములు తన తండ్రులనుగూర్చి ప్రలాపన చేయుటకు నీవు ఆమెకు సెలవియ్యవలెను. తరువాత నీవు ఆమెయొద్దకు పోయి ఆమెను పెండ్లిచేసికొనవచ్చును; ఆమె నీకు భార్యయగును.౹

14 నీవు ఆమెవలన సంతుష్టి నొందనియెడల ఆమె మనస్సువచ్చిన చోటికి ఆమెను సాగనంపవలెనేగాని ఆమెను ఎంతమాత్రమును వెండికి అమ్మకూడదు; నీవు ఆమెను అవమానపరచితివి గనుక ఆమెను దాసివలె చూడకూడదు.

15 ప్రేమింపబడునదొకతెయు ద్వేషింపబడునదొక తెయు ఇద్దరు భార్యలు ఒక పురుషునికి కలిగియుండి, ప్రేమింపబడినదియు ద్వేషింపబడినదియు వానివలన బిడ్డలు కని

16 జ్యేష్ఠకుమారుడు ద్వేషింపబడినదాని కొడుకైనయెడల, తండ్రి తనకు కలిగినదానిని తన కుమారులకు స్వాస్థ్యముగా ఇచ్చునాడు ద్వేషింపబడినదాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడినదాని కుమారుని జ్యేష్ఠునిగా చేయకూడదు.౹

17 ద్వేషింపబడినదాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగమిచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచవలెను. వీడు వాని బలప్రారంభము గనుక జ్యేష్ఠత్వాధికారము వీనిదే.

18 ఒకని కుమారుడు మొండివాడై తిరుగబడి తండ్రిమాటగాని తల్లిమాటగాని వినకయుండి, వారు అతని శిక్షించిన తరువాతయును అతడు వారికి విధేయుడు కాక పోయినయెడల

19 అతని తలిదండ్రులు అతని పట్టుకొని ఊరి గవినియొద్ద కూర్చుండు పెద్దలయొద్దకు అతని తీసికొని వచ్చి

20 –మా కుమారుడైన వీడు మొండివాడై తిరుగబడియున్నాడు; మా మాట వినక తిండిబోతును త్రాగుబోతును ఆయెనని ఊరి పెద్దలతో చెప్పవలెను.౹

21 అప్పుడు ఊరి ప్రజలందరు రాళ్లతో అతని చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును నీ మధ్యనుండి పరిహరించుదువు. అప్పుడు ఇశ్రాయేలీయులందరు విని భయపడుదురు.

22 మరణశిక్షకు తగిన పాపము ఒకడుచేయగా అతని చంపి మ్రానుమీద వ్రేలాడదీసినయెడల

23 అతని శవము రాత్రి వేళ ఆ మ్రానుమీద నిలువకూడదు. వ్రేలాడదీయ బడినవాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండునట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతిపెట్టవలెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/DEU/21-089ce282f8e28a184e27878f47cbb3e6.mp3?version_id=1787—

Categories
ద్వితీయోపదేశకాండము

ద్వితీయోపదేశకాండము 22

1 నీ సహోదరుని యెద్దుగాని గొఱ్ఱెగాని త్రోవ తప్పిపోవుట చూచినయెడల నీవు వాటిని చూడనట్లు కన్నులు మూసికొనక అగత్యముగా వాటిని నీ సహోదరుని యొద్దకు మళ్లింపవలెను.౹

2 నీ సహోదరుడు నీ దగ్గర లేక పోయినయెడలను, నీవు అతని నెరుగకపోయినయెడలను దానిని నీ యింటికి తోలుకొని పోవలెను. నీ సహోద రుడు దాని వెదకుచువచ్చువరకు అది నీ యొద్దనుండవలెను, అప్పుడు అతనికి దాని మరల అప్పగింపవలెను.౹

3 అతని గాడిదనుగూర్చియు వస్త్రమునుగూర్చియు నీవు ఆలాగుననే చేయవలెను. నీ సహోదరుడు పోగొట్టుకొనినది ఏదైనను నీకు దొరకినయెడల అతడు పోగొట్టుకొనిన దానినిగూర్చి ఆలాగుననే చేయవలెను; నీవు దానిని చూచి చూడనట్టుగా ఉండకూడదు.౹

4 నీ సహోదరుని గాడిదగాని యెద్దుగాని త్రోవలో పడియుండుట నీవు చూచినయెడల వాటిని చూడనట్లు కన్నులు మూసికొనక వాటిని లేవనెత్తుటకు అగత్యముగా సహాయము చేయవలెను.

5 స్త్రీ పురుషవేషము వేసికొనకూడదు; పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు; ఆలాగు చేయువారందరు నీ దేవుడైన యెహోవాకు హేయులు.

6 గుడ్లయినను పిల్లలైననుగల పక్షిగూడు చెట్టుమీదనేగాని నేలమీదనేగాని త్రోవలోనేగాని నీకు కనబడినయెడల తల్లి ఆ పిల్లలనైనను ఆ గుడ్లనైనను పొదిగియున్నయెడల పిల్లలతోకూడ తల్లిని తీసికొనక నీకు మేలు కలుగునట్లును

7 నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లును అగత్యముగా తల్లిని విడిచి పిల్లలనే తీసికొనవచ్చును.

8 క్రొత్త యిల్లు కట్టించునప్పుడు దానిమీదనుండి యెవ డైనను పడుటవలన నీ యింటిమీదికి హత్యదోషము రాకుండుటకై నీ యింటి పైకప్పునకు చుట్టు పిట్టగోడ కట్టింపవలెను.౹

9 నీవు విత్తు విత్తనముల పైరును నీ ద్రాక్ష తోట వచ్చుబడియు ప్రతిష్ఠితములు కాకుండునట్లు నీ ద్రాక్షతోటలో వివిధమైనవాటిని విత్తకూడదు.

10 ఎద్దును గాడిదను జతచేసి భూమిని దున్నకూడదు.౹

11 ఉన్నియు జనుపనారయు కలిపినేసిన బట్టను వేసికొనకూడదు.

12 నీవు కప్పుకొను నీ బట్ట నాలుగు చెంగులకు అల్లికలను చేసికొనవలెను.

13 ఒకడు స్త్రీని పెండ్లిచేసికొని ఆమెను కూడిన తరువాత ఆమెను ఒల్లక ఆమెమీద అవమాన క్రియలు మోపి

14 ఆమె చెడ్డదని ప్రచురపరచి–ఈ స్త్రీని నేను పరిగ్రహించి యీమె దగ్గరకు వచ్చినప్పుడు ఈమెయందు కన్యాత్వము నాకు కనబడలేదని చెప్పినయెడల

15 ఆ చిన్నదాని తలిదండ్రులు ద్వారమందున్న ఆ ఊరి పెద్దలయొద్దకు ఆ చిన్నదాని కన్యాత్వలక్షణములను తీసికొని రావలెను.౹

16 అప్పుడు ఆ చిన్నదాని తండ్రి–నా కుమార్తెను ఈ మనుష్యునికి పెండ్లిచేయగా

17 ఇదిగో ఇతడీమె నొల్లక–నీ కుమార్తెయందు కన్యాత్వము నాకు కనబడ లేదనియు అవమానక్రియలు చేసినదనియు ఆమెమీద నింద మోపెను; అయితే నా కుమార్తె కన్యాత్వమునకు గురుతులివే అని పెద్దలతో చెప్పి పట్టణపుపెద్దల యెదుట ఆ బట్టను పరచవలెను.౹

18 అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆ మనుష్యుని పట్టుకొని శిక్షించి నూరు వెండి రూకలు అపరాధముగా వానియొద్ద తీసికొని

19 ఆ చిన్నదాని తండ్రికియ్యవలెను. ఏలయనగా అతడు ఇశ్రాయేలీయురాలైన కన్యకను అవమానపరచియున్నాడు. అప్పుడామె అతనికి భార్యయై యుండును; అతడు తాను బ్రదుకు దినములన్నిటను ఆమెను విడువకూడదు.౹

20 అయితే ఆ మాట నిజమైనయెడల, అనగా ఆ చిన్నదానియందు కన్యకా లక్షణములు కనబడనియెడల

21 వారు ఆమె తండ్రి యింటి యొద్దకు ఆ చిన్నదానిని తీసికొని రావలెను. అప్పుడు ఆమె ఊరివారు ఆమెను రాళ్లతో చావగొట్టవలెను. ఏలయనగా ఆమె తన తండ్రియింట వ్యభిచరించి ఇశ్రాయేలీయులలో దుష్కార్యము చేసెను. అట్లు ఆ చెడుతనమును మీ మధ్యనుండి మీరు పరిహరించుదురు.

22 ఒకడు మగనాలితో శయనించుచుండగా కనబడినయెడల వారిద్దరు, అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీయును చంపబడవలెను. అట్లు ఆ చెడు తనమును ఇశ్రాయేలులోనుండి పరిహరించుదురు.

23 కన్యకయైన చిన్నది ప్రధానము చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలిసికొని ఆమెతో శయనించినయెడల

24 ఆ ఊరి గవినియొద్దకు వారిద్దరిని తీసికొనివచ్చి, ఆ చిన్నది ఊరిలో కేకలు వేయకయున్నందున ఆమెను, తన పొరుగువాని భార్యను అవమానపరచినందున ఆ మనుష్యుని, రాళ్లతో చావగొట్టవలెను. అట్లు ఆ చెడు తనమును మీలోనుండి పరిహరించుదురు.

25 ఒకడు ప్రధానముచేయబడిన చిన్నదానిని పొలములో కలిసికొనినప్పుడు ఆ మనుష్యుడు ఆమెను బలిమిని పెట్టి ఆమెతో శయనించినయెడల ఆమెతో శయనించిన మనుష్యుడు మాత్రమే చావవలెను.౹

26 ఆ చిన్నదాని నేమియు చేయకూడదు, ఆ చిన్నదానియందు మరణపాత్రమైన పాపములేదు. ఒకడు తన పొరుగువాని మీదికి లేచి ప్రాణహాని చేసినట్టే యిది జరిగినది.౹

27 అతడు ఆమెను పొలములో కలిసికొనగా ప్రధానము చేయబడిన ఆ చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయెను.౹

28 ఒకడు ప్రధానము చేయబడని కన్యకయైన చిన్నదానిని కలిసికొని ఆమెను పట్టుకొని ఆమెతో శయనింపగా వారు కనబడినయెడల

29 ఆమెతో శయనించినవాడు ఆ చిన్నదాని తండ్రికి ఏబది వెండి రూకలిచ్చి ఆమెను పెండ్లిచేసి కొనవలెను. అతడు ఆమెను ఆవమానపరచెను గనుక అతడు తాను బ్రదుకు దినములన్నిటను ఆమెను విడిచి పెట్టకూడదు.

30 ఎవడును తన తండ్రిభార్యను పరిగ్రహింపకూడదు, తన తండ్రి విప్పతగిన కోకను విప్పకూడదు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/DEU/22-37772cdff01983db2227c3c73a2f4089.mp3?version_id=1787—

Categories
ద్వితీయోపదేశకాండము

ద్వితీయోపదేశకాండము 23

1 గాయమునొందిన వృషణములుగలవాడేగాని మర్మాంగము కోయబడినవాడేగాని యెహోవా సమాజములో చేరకూడదు.కుండుడు యెహోవా సమాజములో చేరకూడదు.౹

2 వానికి పదియవ తరమువాడైనను యెహోవా సమాజములో చేరకూడదు.

3 అమ్మోనీయుడేగాని మోయాబీయుడేగాని యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో పదియవ తరము వారైనను ఎన్నడును యెహోవా సమాజములో చేరకూడదు.౹

4 ఏలయనగా మీరు ఐగుప్తులోనుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసికొని మిమ్మును ఎదుర్కొనరాక, నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి నదుల యరాములోనిపెతోరులోనుండి నీకు విరోధముగా బెయోరు కుమారుడైన బిలామును పిలిపించిరి.౹

5 అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విన నొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను.౹

6 నీ దినములన్నిట ఎన్నడును వారి క్షేమమునైనను మేలునైనను విచారింపకూడదు.

7 ఎదోమీయులు నీ సహోదరులు గనుక వారిని ద్వేషింపకూడదు. ఐగుప్తుదేశములో నీవు పరదేశివై యుంటివి గనుక ఐగుప్తీయులను ద్వేషింపకూడదు.౹

8 వారికి పుట్టిన పిల్లలలో మూడవ తరమువారు యెహోవా సమాజములో చేరవచ్చును.

9 నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరునప్పుడు ఏ దుష్కార్యమును చేయకుండ జాగ్రత్త పడవలెను.

10 రాత్రి జరిగినదానివలన మైలపడినవాడు మీలో ఉండినయెడలవాడు పాళెము వెలుపలికి వెళ్లిపోవలెను.౹

11 అతడు పాళెములో చేరకూడదు; సాయంకాలమున అతడు నీళ్లతో స్నానముచేసి సూర్యుడు అస్తమించిన తరువాత పాళెములో చేరవచ్చును.౹

12 పాళెము వెలుపల నీకు ఒక చోటు ఉండవలెను, ఆ బహిర్భూమికి నీవు వెళ్లవలెను.౹

13 మరియు నీ ఆయుధములుగాక గసిక యొకటి నీ యొద్ద ఉండవలెను. నీవు బహిర్భూమికి వెళ్లునప్పుడు దానితో త్రవ్వి వెనుకకు తిరిగి నీ మలమును కప్పివేయవలెను.౹

14 నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాళెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడువకుండునట్లు నీ పాళెము పరిశుద్ధముగా ఉండవలెను.

15 తన యజమానునియొద్దనుండి తప్పించుకొని నీయొద్దకు వచ్చిన దాసుని వాని యజమానునికి అప్పగింపకూడదు.౹

16 అతడు తన యిష్టప్రకారము నీ గ్రామములలో ఒకదానియందు తాను ఏర్పరచుకొనిన చోట మీతో కలిసి మీ మధ్య నివసింపవలెను; నీవు వాని బాధింపకూడదు.

17 ఇశ్రాయేలు కుమార్తెలలో ఎవతెయు వేశ్యగాఉండకూడదు. ఇశ్రాయేలు కుమారులలో ఎవడును పురుష గామిగా ఉండకూడదు.౹

18 పడుపుసొమ్మునేగాని కుక్క విలువనేగాని మ్రొక్కుబడిగా నీ దేవుడైన యెహోవా యింటికి తేకూడదు. ఏలయనగా ఆ రెండును నీ దేవుడైన యెహోవాకు హేయములు.

19 నీవు వెండినేగాని ఆహారద్రవ్యమునేగాని, వడ్డికి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డికియ్యకూడదు.౹

20 అన్యు నికి వడ్డికి బదులు ఇయ్యవచ్చునుగాని నీవు స్వాధీనపరచు కొనునట్లు చేరబోవుచున్న దేశములో నీ దేవుడైన యెహోవా నీవుచేయు ప్రయత్నములన్నిటి విషయములోను నిన్ను ఆశీర్వదించునట్లు నీ సహోదరులకు వడ్డికి బదులు ఇయ్యకూడదు.

21 నీవు నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన తరువాత ఆ మ్రొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీవలన దాని రాబట్టుకొనును, అది నీకు పాపమగును.౹

22 నీవు మ్రొక్కు కొననియెడల నీయందు ఆ పాపముండదు.౹

23 నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని, నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణము నర్పింపవలెను.

24 నీవు నీ పొరుగువాని ద్రాక్షతోటకు వచ్చునప్పుడు నీ యిష్టప్రకారము నీకు చాలినంతవరకు ద్రాక్షపండ్లు తిన వచ్చునుగాని నీ పాత్రలో వాటిని వేసికొనకూడదు.౹

25 నీ పొరుగువాని పంటచేనికి వచ్చునప్పుడు నీ చేతితో వెన్నులు త్రుంచుకొనవచ్చునుగాని నీ పొరుగువాని పంటచేనిమీద కొడవలి వేయకూడదు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/DEU/23-a5232904dd04fa7b621fe7d39562b7e2.mp3?version_id=1787—

Categories
ద్వితీయోపదేశకాండము

ద్వితీయోపదేశకాండము 24

1 ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లిచేసికొనిన తరువాత ఆమెయందు మానభంగసూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమెమీద అతనికి ఇష్టము తప్పినయెడల, అతడు ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమెచేతికిచ్చి తన యింటనుండి ఆమెను పంపివేయవలెను.౹

2 ఆమె అతని యింటనుండి వెళ్లినతరువాత ఆమె వేరొక పురుషుని పెండ్లిచేసికొనవచ్చును.౹

3 ఆ రెండవ పురుషుడు ఆమెను ఒల్లక ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన యింటనుండి ఆమెను పంపివేసినయెడల నేమి, ఆమెను పెండ్లిచేసికొనిన పిమ్మట ఆ రెండవ పురుషుడు చనిపోయినయెడలనేమి

4 ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను పెండ్లిచేసికొనుటకై ఆమెను మరల పరిగ్రహింపకూడదు. ఏలయనగా ఆమె తన్ను అపవిత్రపరచుకొనెను, అది యెహోవా సన్నిధిని హేయము గనుక నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు పాపము కలుగకుండునట్లు మీరు ఆలాగు చేయకూడదు.

5 ఒకడు క్రొత్తగా ఒకదానిని పెండ్లిచేసికొని సేనలోచేరి పోకూడదు. అతనిపైన యే వ్యాపారభారమును మోపకూడదు. ఏడాదివరకు తీరికగా అతడు తన యింట ఉండి తాను పరిగ్రహించిన భార్యను సంతోష పెట్టవలెను.

6 తిరగటినైనను తిరగటిమీద దిమ్మనైనను తాకట్టు పెట్టకూడదు. అది ఒకని జీవనాధారమును తాకట్టు పెట్టినట్లే.

7 ఒకడు ఇశ్రాయేలు కుమారులైన తన సహోదరులలో నొకని దొంగిలుట కనుగొనబడినయెడల అతడు వానిని తన దాసునిగా చేసికొనినను అమ్మినను ఆ దొంగ చావవలెను. ఆలాగు చేసినయెడల ఆ చెడుతనమును మీ మధ్యనుండి పరిహరించుదురు.

8 కుష్ఠరోగవిషయము యాజకులైన లేవీయులు మీకు బోధించు సమస్తమును చేయుటకు బహు జాగ్రత్తగా ఉండుడి. నేను వారికాజ్ఞాపించినట్లు చేయుటకు మీరు జాగ్రత్తగా నుండుడి.౹

9 మీరు ఐగుప్తులోనుండి వచ్చి నప్పుడు త్రోవలో నీ దేవుడైన యెహోవా మిర్యామునకు చేసిన దానిని జ్ఞాపకముంచుకొనుడి.

10 నీ పొరుగువానికి ఏదైనను నీవు ఎరువిచ్చినయెడల అతనియొద్ద తాకట్టు వస్తువు తీసికొనుటకు అతని యింటికి వెళ్లకూడదు

11 నీవు బయట నిలువవలెను. నీవు ఎరువిచ్చినవాడు బయటనున్న నీయొద్దకు ఆ తాకట్టు వస్తువును తెచ్చియిచ్చును.౹

12 ఆ మనుష్యుడు బీదవాడైనయెడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు. అతడు తన బట్టను వేసికొని పండుకొని నిన్ను దీవించునట్లు సూర్యుడు అస్తమించునప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తువును అతనికి మరల అప్పగింపవలెను.౹

13 అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీకు నీతి యగును.

14 నీ సహోదరులలోనేమి నీ దేశమందలి నీ గ్రామములలోనున్న పరదేశులలోనేమి దీనదరిద్రుడైన కూలివానిని బాధింపకూడదు. ఏనాటికూలి ఆ నాడియ్యవలెను.౹

15 సూర్యుడు అస్తమింపకమునుపు వానికియ్యవలెను.వాడు బీదవాడు గనుక దానిమీద ఆశపెట్టుకొనియుండును.వాడు నిన్నుబట్టి యెహోవాకు మొఱ్ఱపెట్టు నేమో అది నీకు పాపమగును.

16 కుమారుల దోషమునుబట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు, తండ్రుల దోషమునుబట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవనిపాపము నిమిత్తమువాడే మరణశిక్ష నొందును.

17 పరదేశికేగాని తండ్రిలేనివానికేగాని న్యాయము తప్పి తీర్పుతీర్చకూడదు. విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసికొనకూడదు.౹

18 నీవు ఐగుప్తులో దాసుడవైయుండగా నీ దేవుడైన యెహోవా నిన్ను అక్కడనుండి విమోచించె నని జ్ఞాపకము చేసికొనవలెను. అందుచేత ఈ కార్యము చేయవలెనని నీ కాజ్ఞాపించుచున్నాను.

19 నీ పొలములో నీ పంట కోయుచున్నప్పుడు పొలములో ఒక పన మరచిపోయినయెడల అది తెచ్చుకొనుటకు నీవు తిరిగి పోకూడదు. నీ దేవుడైన యెహోవా నీవుచేయు పనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించునట్లు అది పరదేశులకును తండ్రి లేనివారికిని విధవరాండ్రకును ఉండవలెను.

20 నీ ఒలీవపండ్లను ఏరునప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు; అవి పరదేశులకును తండ్రిలేని వారికిని విధవరాండ్రకును ఉండవలెను.౹

21 నీ ద్రాక్షపండ్లను కోసి కొనునప్పుడు నీ వెనుకనున్న పరిగెను ఏరుకొనకూడదు; అది పరదేశులకును తండ్రిలేనివారికిని విధవరాండ్రకును ఉండవలెను.౹

22 నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై యుంటి వని జ్ఞాపకముచేసికొనుము. అందుచేత ఈ కార్యము చేయవలెనని నీకాజ్ఞాపించుచున్నాను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/DEU/24-9f5b3a728fe7f6730db94d54322e53f7.mp3?version_id=1787—

Categories
ద్వితీయోపదేశకాండము

ద్వితీయోపదేశకాండము 25

1 మనుష్యులకు వివాదము కలిగి న్యాయసభకు వచ్చు నప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుని నీతిమంతుడనియు దోషిని దోషియనియు తీర్పు తీర్చవలెను.౹

2 ఆ దోషి శిక్షకు పాత్రుడుగా కనబడినయెడల న్యాయాధిపతి వాని పండుకొనబెట్టి వాని నేరముకొలది దెబ్బలు లెక్కపెట్టి తనయెదుట వాని కొట్టింపవలెను.౹

3 నలువది దెబ్బలు కొట్టింపవచ్చును అంతకు మించకూడదు. వీటి కంటే విస్తారమైన దెబ్బలు కొట్టించినయెడల నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడుగా కనబడునేమో.

4 నూర్చెడియెద్దుమూతికి చిక్కము వేయకూడదు.

5 సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానములేక చనిపోయినయెడల చనిపోయిన వాని భార్య అన్యుని పెండ్లిచేసికొనకూడదు; ఆమె పెని మిటి సహోదరుడు ఆమెయొద్దకు పోయి ఆమెను పెండ్లి చేసికొని తన సహోదరునికి మారుగా ఆమెయెడల భర్త ధర్మము జరపవలెను.౹

6 చనిపోయిన సహోదరుని పేరు ఇశ్రాయేలీయులలోనుండి తుడిచి వేయబడకుండునట్లు ఆమె కను జ్యేష్ఠకుమారుడు చనిపోయిన సహోదరునికి వారసుడుగా ఉండవలెను.౹

7 అతడు తన సహోదరుని భార్యను పరిగ్రహింప నొల్లనియెడల వాని సహోదరుని భార్య పట్టణపు గవినికి, అనగా పెద్దలయొద్దకు పోయి– నా పెనిమిటి సహోదరుడు ఇశ్రాయేలీయులలో తన సహోదరునికి పేరు స్థాపింపనని చెప్పి దేవరధర్మము చేయ నొల్లడని తెలుపుకొనవలెను.౹

8 అప్పుడు అతని యూరి పెద్దలు అతని పిలిపించి అతనితో మాటలాడిన తరువాత అతడు నిలువబడి–ఆమెను పరిగ్రహించుటకు నా కిష్టము లేదనినయెడల అతని సహోదరుని భార్య

9 ఆ పెద్దలు చూచుచుండగా, అతని దాపున పోయి అతని కాలినుండి చెప్పు ఊడదీసి అతని ముఖము నెదుట ఉమ్మివేసి–తన సహోదరుని యిల్లు నిలుపని మనుష్యునికి ఈలాగు చేయబడునని చెప్పవలెను.౹

10 అప్పుడు ఇశ్రాయేలీయులలో చెప్పు ఊడదీయబడిన వాని యిల్లని వానికి పేరు పెట్టబడును.

11 మనుష్యులు ఒకనితో నొకడు పోట్లాడుచుండగా వారిలో ఒకని భార్య వాని కొట్టుచున్నవాని చేతిలోనుండి తన పెనిమిటిని విడిపించుటకు వచ్చి చెయ్యి చాచి వాని మానము పట్టుకొనినయెడల ఆమె చేతిని ఛేదింపవలెను.౹

12 నీ కన్ను కటాక్షింపకూడదు.

13 హెచ్చుతగ్గులుగల వేరువేరు తూనికె రాళ్లు నీ సంచిలో నుంచుకొనకూడదు.౹

14 హెచ్చుతగ్గులుగల వేరు వేరు తూములు నీ యింట ఉంచుకొనకూడదు.౹

15 నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘా యుష్మంతుడవగునట్లు తక్కువవికాని న్యాయమైన తూనికె రాళ్లు నీవు ఉంచుకొనవలెను. తక్కువదికాని న్యాయమైన తూము నీకు ఉండవలెను.౹

16 ఆలాగు చేయని ప్రతివాడును, అనగా అన్యాయముచేయు ప్రతివాడును నీ దేవుడైన యెహోవాకు హేయుడు.

17 మీరు ఐగుప్తులోనుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసినదానిని జ్ఞాపకము చేసికొనుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీ కెదురుగా వచ్చి

18 నీవు ప్రయాసవడి అలసియున్నప్పుడు నీవారిలో నీ వెనుక నున్న బలహీనులనందరిని హతముచేసెను.౹

19 కాబట్టి నీవు స్వాధీనపరచుకొనునట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశములో చుట్టుపెట్లనున్న నీ సమస్త శత్రువులనులేకుండచేసి, నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తరువాత ఆకాశము క్రింద నుండి అమాలేకీయుల పేరు తుడిచివేయవలెను. ఇది మరచిపోవద్దు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/DEU/25-f8728439accd7b16420f9249e0a69c50.mp3?version_id=1787—

Categories
ద్వితీయోపదేశకాండము

ద్వితీయోపదేశకాండము 26

1 నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమునకు నీవు వచ్చి దాని స్వాధీనపరచుకొని దానిలో నివసించుచున్నప్పుడు

2 నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ భూమిలోనుండి నీవు కూర్చుకొను భూఫలములన్నిటిలోను ప్రథమ ఫలములను తీసికొని గంపలో ఉంచి, నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకొను స్థలమునకు వెళ్లి

3 ఆ దినములలోనుండు యాజకునియొద్దకు పోయి–యెహోవా మన పితరుల కిచ్చెదనని ప్రమాణము చేసిన దేశమునకు నేను వచ్చియున్న సంగతి నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పవలెను.౹

4 యాజకుడు ఆ గంపను నీ చేతిలోనుండి తీసికొని నీ దేవుడైన యెహోవా బలిపీఠమునెదుట ఉంచగా

5 నీవు–నా తండ్రి నశించుచున్న అరామీదేశస్థుడు; అతడు ఐగుప్తునకు వెళ్లెను. కొద్దిమందితో అక్కడికి పోయి పరవాసియై, గొప్పదియు బలమైనదియు విస్తారమైనదియునగు జనమాయెను.౹

6 ఐగుప్తీయులు మనలను హింసపెట్టి మనలను బాధపరచి మనమీద కఠిన దాస్యము మోపగా

7 మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొఱ్ఱపెట్టి నప్పుడు యెహోవా మన మొఱ్ఱను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను.౹

8 అప్పుడు యెహోవా బాహుబలమువలనను చాపిన చేతి వలనను మహా భయమువలనను సూచక క్రియలవలనను మహత్కార్యములవలనను ఐగుప్తులోనుండి మనలను రప్పించి

9 యీ స్థలమునకు మనలను చేర్చి, పాలు తేనెలు ప్రవహించు దేశమైయున్న యీ దేశమును మనకిచ్చెను.౹

10 కాబట్టి యెహోవా, నీవే నాకిచ్చిన భూమియొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చియున్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధిని చెప్పి

11 నీ దేవుడైన యెహోవా సన్నిధిని దానిపెట్టి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారముచేసి, నీకును నీ యింటివారికిని నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీయులును నీ దేశములో ఉన్న పరదేశులును సంతోషింపవలెను.

12 పదియవ భాగమిచ్చు సంవత్సరమున, అనగా మూడవ సంవత్సరమున నీ వచ్చుబడిలో పదియవ వంతును చెల్లించి, అది లేవీయులకును పరదేశులకును తండ్రి లేనివారికిని విధవరాండ్రకును ఇయ్యవలెను. వారు నీ గ్రామములలోతిని తృప్తిపొందినతరువాత

13 నీవు నీ దేవుడైన యెహోవా సన్నిధిని–నీవు నాకాజ్ఞాపించిన నీ ఆజ్ఞలన్నిటి చొప్పున నా యింటనుండి ప్రతిష్ఠితమైనదానిని తీసివేసి, లేవీయులకును పరదేశులకును తండ్రిలేనివారికిని విధవరాండ్రకును నేనిచ్చియున్నాను. నీ ఆజ్ఞలలో దేనిని నేను మీరలేదు, దేనిని మరచిపోలేదు.౹

14 నేను దుఃఖములోనుండగా దానిలో కొంచెమైనను తినలేదు, అపవిత్రుడనై యుండగా దానిలో దేనిని తీసివేయలేదు, చనిపోయినవారి విషయమై దానిలో ఏదియు నేనియ్య లేదు, నా దేవుడైన యెహోవా మాట విని నీవు నా కాజ్ఞాపించినట్లు సమస్తము జరిపి యున్నాను.౹

15 నీ పరిశుద్ధాలయమగు ఆకాశములోనుండి చూచి, నీ జనులైన ఇశ్రాయేలీయులను–పాలు తేనెలు ప్రవహించు దేశము అని నీవు మా పితరులతో ప్రమాణము చేసినట్లు మాకిచ్చియున్న దేశమును ఆశీర్వదింపుమని చెప్పవలెను.

16 ఈ కట్టడలను విధులను గైకొనుమని నీ దేవుడైన యెహోవా నీకాజ్ఞాపించియున్నాడు గనుక నీవు నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను వాటిననుసరించి నడుచుకొనవలెను.౹

17 యెహోవాయే నీకు దేవుడై యున్నాడనియు, నీవు ఆయన మార్గములయందు నడిచి, ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి, ఆయన మాట విందుననియు నేడు ఆయనతో మాట యిచ్చితివి.౹

18 మరియు యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమైయుండి తన ఆజ్ఞలన్నిటిని గైకొందువనియు,౹

19 తాను సృజించిన సమస్త జనముల కంటె నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చిం చుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై యుందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/DEU/26-23a57324a12c24f662af47a87eafb7eb.mp3?version_id=1787—

Categories
ద్వితీయోపదేశకాండము

ద్వితీయోపదేశకాండము 27

1 మోషేయు ఇశ్రాయేలీయుల పెద్దలును ప్రజలతో.. ఇట్లనిరి–నేడు నేను మీకు విధించుచున్న ధర్మమును మీరాచరింపవలెను.౹

2 మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమున ప్రవేశించుటకు మీరు యొర్దాను దాటు దినమున మీరు పెద్దరాళ్లను నిలువబెట్టి వాటిమీద సున్నము పూసి

3 నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నీవు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పాలు తేనెలు ప్రవహించు దేశమున ప్రవేశించుటకు నీవు ఏరు దాటినతరువాత ఈ ధర్మశాస్త్రవాక్యములన్నిటిని వాటిమీద వ్రాయవలెను.౹

4 మీరు ఈ యొర్దాను దాటిన తరువాత నేను నేడు మీ కాజ్ఞాపించినట్టు ఈ రాళ్లను ఏబాలు కొండమీద నిలువబెట్టి వాటిమీద సున్నము పూయవలెను.౹

5 అక్కడ నీ దేవుడైన యెహోవాకు బలిపీఠమును కట్టవలెను. ఆ బలిపీఠమును రాళ్లతో కట్టవలెను; వాటిమీద ఇనుపపనిముట్టు పడకూడదు.౹

6 చెక్కని రాళ్లతో నీ దేవుడైన యెహోవాకు బలిపీఠమును కట్టి దానిమీద నీ దేవుడైన యెహోవాకు దహనబలులనర్పింపవలెను.౹

7 మరియు నీవు సమాధానబలులనర్పించి అక్కడ భోజనముచేసి నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను.౹

8 ఈ విధికి సంబంధించిన వాక్యములన్నిటిని ఆ రాళ్లమీద బహు విశదముగా వ్రాయవలెను.

9 మరియు మోషేయు యాజకులైన లేవీయులును ఇశ్రాయేలీయులందరితో ఇట్లనిరి–ఇశ్రాయేలీయులారా, మీరు ఊరకొని ఆలకించుడి.౹

10 నేడు మీరు మీ దేవుడైన యెహోవాకు స్వజనమైతిరి గనుక మీ దేవుడైన యెహోవా మాట విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకొనవలెను.

11 ఆ దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించిన దేమనగా –మీరు యొర్దాను దాటినతరువాత షిమ్యోను లేవి యూదా ఇశ్శాఖారు యోసేపు

12 బెన్యామీను గోత్రములవారు ప్రజలనుగూర్చి దీవెనవచనములను పలుకుటకై గెరిజీము కొండమీద నిలువవలెను.౹

13 రూబేను గాదు ఆషేరు జెబూలూను దాను నఫ్తాలి గోత్రములవారు శాప వచనములను పలుకుటకై ఏబాలు కొండమీద నిలువవలెను.౹

14 అప్పుడు లేవీయులు

15 –యెహోవాకు హేయముగా శిల్పిచేతులతో మలి చిన విగ్రహమునేగాని పోతవిగ్రహమునేగాని చేసి చాటున నుంచువాడు శాపగ్రస్తుడని యెలుగెత్తి ఇశ్రాయేలీయులందరితోను చెప్పగా–ఆమేన్ అనవలెను.

16 –తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు–ఆమేన్ అనవలెను.

17 –తన పొరుగువాని సరిహద్దురాయిని తీసివేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు–ఆమేన్ అనవలెను.

18 –గ్రుడ్డివాని త్రోవను తప్పించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు–ఆమేన్ అనవలెను.

19 –పరదేశికేగాని తండ్రిలేనివానికేగాని విధవరాలికేగాని న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు–ఆమేన్ అనవలెను.

20 –తన తండ్రి భార్యతో శయనించువాడు తన తండ్రి కోకను విప్పినవాడు గనుకవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు–ఆమేన్ అనవలెను.

21 –ఏ జంతువుతోనైనను శయనించువాడు శాపగ్రస్తు డని చెప్పగా ప్రజలందరు–ఆమేన్ అనవలెను.

22 –తన సహోదరితో, అనగా తన తండ్రికుమార్తెతోగాని తన తల్లికుమార్తెతోగాని శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు–ఆమేన్ అనవలెను.

23 –తన అత్తతో శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు–ఆమేన్ అనవలెను.

24 –చాటున తన పొరుగువానిని కొట్టువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు–ఆమేన్ అనవలెను.

25 –నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచము పుచ్చు కొనువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు–ఆమేన్ అనవలెను.

26 –ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనక పోవుటవలన వాటిని స్థిరపరచనివాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరు–ఆమేన్ అనవలెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/DEU/27-5b7284b20600ded1a544c3a204098b1c.mp3?version_id=1787—