Categories
సంఖ్యాకాండము

సంఖ్యాకాండము 24

1 ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలిసికొనినప్పుడు అతడుమునుపటివలె శకునములను చూచుటకు వెళ్లక అరణ్యమువైపు తన ముఖమును త్రిప్పుకొనెను.౹

2 బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలీయులు తమతమ గోత్రముల చొప్పున దిగియుండుట చూచినప్పుడు దేవుని ఆత్మ అతనిమీదికి వచ్చెను

3 గనుక అతడు ఉపమానరీతిగా ఇట్లనెను–

బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి

కన్నులు తెరచినవానికి వచ్చిన దేవోక్తి.

4 దేవవాక్కులను వినినవాని వార్త.

అతడు పరవశుడై కన్నులు తెరచినవాడై

సర్వశక్తుని దర్శనము పొందెను.

5 యాకోబూ, నీ గుడారములు

ఇశ్రాయేలూ, నీ నివాసస్థలములు

ఎంతో రమ్యమైనవి.

6 వాగులవలె అవి వ్యాపించియున్నవి

నదీతీరమందలి తోటలవలెను యెహోవా నాటిన అగరు చెట్లవలెను

నీళ్లయొద్దనున్న దేవదారు వృక్షములవలెను అవి యున్నవి.

7 నీళ్లు అతని బొక్కెనలనుండి కారును

అతని సంతతి బహు జలములయొద్ద నివసించును

అతనిరాజు అగగుకంటె గొప్పవాడగును

అతని రాజ్యము అధికమైనదగును.

8 దేవుడు ఐగుప్తులోనుండి అతని రప్పించెను

గురుపోతు వేగమువంటి వేగము అతనికి కలదు

అతడు తన శత్రువులైన జనులను భక్షించునువారి యెముకలను విరుచును

తన బాణములతో వారిని గుచ్చును.

9 సింహమువలెను ఆడుసింహమువలెను

అతడు క్రుంగి పండుకొనెను

అతనిని లేపువాడెవడు?

నిన్ను దీవించువాడు దీవింపబడును

నిన్ను శపించువాడు శపింపబడును.

10 అప్పుడు బాలాకు కోపము బిలాముమీద మండెను గనుక అతడు తన చేతులు చరుచుకొని బిలాముతో–నా శత్రువులను శపించుటకు నిన్ను పిలిపించితిని కాని నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి. కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటికి వేగముగా వెళ్లుము.౹

11 నేను నిన్ను మిక్కిలి ఘనపరచెదనని చెప్పితినిగాని యెహోవా నీవు ఘనత పొందకుండ ఆటంకపరచెననెను.౹

12 అందుకు బిలాము బాలాకుతో–బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకిచ్చినను నా యిష్టము చొప్పున మేలైనను కీడైనను చేయుటకు యెహోవా సెలవిచ్చిన మాటను మీరలేను.౹

13 యెహోవా యేమి సెలవిచ్చునో అదే పలికెదనని నీవు నాయొద్దకు పంపిన నీ దూతలతో నేను చెప్పలేదా?

14 చిత్తగించుము; నేను నా జనులయొద్దకు వెళ్లుచున్నాను. అయితే కడపటి దినములలో ఈ జనులు నీ జనులకేమి చేయుదురో అది నీకు విశదపరచెదను రమ్మని చెప్పి

15 ఉపమానరీతిగా ఇట్లనెను–

బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి.

కన్నులు తెరచినవానికివచ్చిన దేవోక్తి.

16 దేవవాక్కులను వినిన వాని వార్త

మహోన్నతుని విద్య నెరిగినవాని వార్త.

అతడు పరవశుడై కన్నులు తెరచినవాడై

సర్వశక్తుని దర్శనము పొందెను.

17 ఆయనను చూచుచున్నానుగాని

ప్రస్తుతమున నున్నట్టు కాదు

ఆయనను చూచుచున్నానుగాని

సమీపమున నున్నట్టు కాదు

నక్షత్రము యాకోబులో ఉదయించును

రాజదండము ఇశ్రాయేలులోనుండి లేచును

అది మోయాబు ప్రాంతములను కొట్టును

కలహవీరులనందరిని నాశనము చేయును.

18 ఎదోమును శేయీరును ఇశ్రాయేలుకు శత్రువులువారు స్వాధీనపరచబడుదురు

ఇశ్రాయేలు పరాక్రమమొందును.

19 యాకోబు సంతానమున యేలిక పుట్టును.

అతడు పట్టణములోని శేషమును నశింపజేయును.

20 మరియు అతడు అమాలేకీయులవైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లనెను –

అమాలేకు అన్యజనములకు మొదలు

వాని అంతము నిత్యనాశనమే.

21 మరియు అతడు కేనీయులవైపు చూచి ఉపమానరీతిగా ఇట్లనెను –

నీ నివాసస్థలము దుర్గమమైనది.

నీ గూడు కొండమీద కట్టబడియున్నది.

22 అష్షూరు నిన్ను చెరగా పట్టువరకు

కయీను నశించునా?

23 మరియు అతడు ఉపమానరీతిగా–

అయ్యో దేవుడు ఇట్లు చేయునప్పుడు ఎవడు బ్రదుకును?

24 కిత్తీము తీరమునుండి ఓడలు వచ్చును.

అవి అష్షూరును ఏబెరును బాధించును.

కిత్తీయులు కూడ నిత్యనాశనము పొందుదురనెను.

25 అంతట బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్లెను; బాలాకును తన త్రోవను వెళ్లెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/NUM/24-6118c73e540e62fcb232f2f4c7555237.mp3?version_id=1787—

Categories
సంఖ్యాకాండము

సంఖ్యాకాండము 25

1 ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి.౹

2 ఆ స్ర్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనముచేసి వారి దేవతలకు నమస్కరించిరి.౹

3 అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలిసికొనినందున వారిమీద యెహోవా కోపము రగులుకొనెను.౹

4 అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను–నీవు ప్రజల అధిపతుల నందరిని తోడుకొని, యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయులమీదనుండి తొలగిపోవునని చెప్పెను.౹

5 కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులను పిలిపించి మీలో ప్రతివాడును బయల్పెయో రుతో కలిసికొనిన తన తన వశములోనివారిని చంపవలెనని చెప్పెను.౹

6 ఇదిగో మోషే కన్నులయెదుటను, ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీయుల సర్వసమాజముయొక్క కన్నులయెదుటను, ఇశ్రాయేలీయులలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొనివచ్చెను.౹

7 యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు అది చూచి,౹

8 సమాజమునుండి లేచి, యీటెను చేతపట్టుకొని పడకచోటికి ఆ ఇశ్రాయేలీయుని వెంబడి వెళ్లి ఆ యిద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండ దూసిపోవునట్లు పొడిచెను; అప్పుడు ఇశ్రాయేలీయులలోనుండి తెగులు నిలిచిపోయెను.౹

9 ఇరువది నాలుగువేలమంది ఆ తెగులుచేత చనిపోయిరి.౹

10 అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను–యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు,౹

11 వారిమధ్యను నేను ఓర్వలేనిదానిని తాను ఓర్వలేకపోవుటవలన ఇశ్రాయేలీయులమీదనుండి నాకోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలీయులను నశింపజేయలేదు.౹

12 కాబట్టి నీవు అతనితో ఇట్లనుము– అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను.౹

13 అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగియుండును; ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తిగలవాడై ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను.౹

14 చంప బడిన వాని పేరు జిమ్రీ, అతడు షిమ్యోనీయులలో తన పితరుల కుటుంబమునకు ప్రధానియైన సాలూ కుమారుడు.౹

15 చంపబడిన స్త్రీ పేరు కొజ్బీ, ఆమె సూరు కుమార్తె. అతడు మిద్యానీయులలో ఒక గోత్రమునకును తన పితరుల కుటుంబమునకును ప్రధానియైయుండెను.

16 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –మిద్యానీయులు తమ తంత్రములవలన మీకు బాధకులై యున్నారు; వారిని బాధపెట్టి హతము చేయుడి;౹

17 వారు తంత్రములు చేసి పెయోరు సంతతిలోను, తెగులు దినమందు పెయోరు విషయములో చంపబడిన తమ సహో దరియు మిద్యానీయుల అధిపతి కుమార్తెయునైన కొజ్బీ సంగతిలోను, మిమ్మును మోసపుచ్చిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/NUM/25-7c9bdf60231c53a7d19664a0b9672c51.mp3?version_id=1787—

Categories
సంఖ్యాకాండము

సంఖ్యాకాండము 26

1 ఆ తెగులు పోయిన తర్వాత యెహోవా మోషేకును యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుకును ఈలాగు సెలవిచ్చెను

2 –మీరు ఇశ్రాయేలీయుల సర్వసమాజములోను ఇరువది ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి ఇశ్రాయేలీయులలో సేనగా బయలు వెళ్లువారందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబములనుబట్టి వ్రాయించుడి.౹

3-4 కాబట్టి–యిరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయముగలవారిని లెక్కింపుడని యెహోవా మోషేకును ఐగుప్తుదేశమునుండి వచ్చిన ఇశ్రాయేలీయులకును ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలీయులు మోయాబు మైదానములలో యెరికోయొద్దనున్న యొర్దాను దగ్గర నుండగా జన సంఖ్యను చేయుడని వారితో చెప్పిరి.౹

5 ఇశ్రాయేలు తొలిచూలు రూబేను. రూబేను పుత్రులలో హనోకీయులు హనోకు వంశస్థులు;౹

6 పల్లువీయులు పల్లువంశస్థులు; హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు; కర్మీయులు కర్మీ వంశస్థులు;౹

7 వీరు రూబేనీయుల వంశస్థులు, వారిలో లెక్కింపబడినవారు నలుబది మూడువేల ఏడువందల ముప్పదిమంది.౹

8 పల్లు కుమారుడు ఏలీయాబు. ఏలీయాబు కుమారులు నెమూయేలు దాతాను అబీరాము.౹

9 కోరహు తన సమూహములో పేరు పొందినవాడు; అతని సమాజము యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజములో మోషే అహరోనులకు విరోధముగా వాదించిన దాతాను అబీరాములు వీరు.౹

10 ఆ సమూహపువారు మృతిబొంది నప్పుడు అగ్ని రెండువందల ఏబదిమందిని భక్షించినందునను, భూమి తన నోరు తెరచి వారిని కోరహును మ్రింగి వేసినందునను, వారు దృష్టాంతములైరి.౹

11 అయితే కోరహు కుమారులు చావలేదు.౹

12 షిమ్యోను పుత్రుల వంశములలో నెమూయేలీయులు నెమూయేలు వంశస్థులు; యామీనీయులు యామీను వంశస్థులు; యాకీనీయులు యాకీను వంశస్థులు;౹

13 జెరహీయులు జెరహు వంశస్థులు; షావూలీయులు షావూలు వంశస్థులు.౹

14 ఇవి షిమ్యోనీయుల వంశములు. వారు ఇరువదిరెండువేల రెండువందలమంది.౹

15 గాదు పుత్రుల వంశములలో సెపోనీయులు సెపోను వంశస్థులు; హగ్గీయులు హగ్గీ వంశస్థులు; షూనీయులు షూనీ వంశస్థులు,౹

16 ఓజనీయులు ఓజని వంశస్థులు; ఏరీయులు ఏరీ వంశస్థులు;౹

17 ఆరోదీయులు ఆరోదు వంశస్థులు; అరేలీయులు అరేలీ వంశస్థులు.౹

18 వీరు గాదీయుల వంశస్థులు; వ్రాయబడినవారి సంఖ్య చొప్పున వీరు నలుబది వేల ఐదువందలమంది.౹

19 యూదా కుమారులు ఏరు ఓనాను; ఏరును ఓనానును కనాను దేశములో మృతి బొందిరి.౹

20 యూదావారి వంశములలో షేలాహీయులు షేలా వంశస్థులు; పెరెసీయులు పెరెసు వంశస్థులు జెరహీయులు జెరహు వంశస్థులు;౹

21 పెరెసీయులలో హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు హామూలీయులు హామూలు వంశస్థులు

22 వీరు యూదీయుల వంశస్థులు; వ్రాయ బడినవారి సంఖ్యచొప్పున వీరు డెబ్బదియారువేల ఐదు వందలమంది.౹

23 ఇశ్శాఖారు పుత్రుల వంశస్థులలో తోలా హీయులు తోలా వంశస్థులు; పువ్వీయులు పువ్వా వంశస్థులు; యాషూబీయులు యాషూబు వంశస్థులు; షిమ్రో నీయులు షిమ్రోను వంశస్థులు; వీరు ఇశ్శాఖారీయుల వంశస్థులు.౹

24 వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు అరువది నాలుగువేల మూడువందలమంది.౹

25-26 జెబూలూను పుత్రుల వంశస్థులలో సెరెదీయులు సెరెదు వంశస్థులు; ఏలోనీయులు ఏలోను వంశస్థులు;యహలేలీయులు యహ లేలు వంశస్థులు;౹

27 వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు అరువదివేల ఐదువందలమంది.౹

28 యోసేపు పుత్రుల వంశస్థులు అతని కుమారులు మనష్షే ఎఫ్రాయిము.౹

29-32 మనష్షే కుమారులలో మాకీరీయులు మాకీరు వంశస్థులు; మాకీరు గిలాదును కనెను; గిలాదీయులు గిలాదు వంశస్థులు; వీరు గిలాదుపుత్రులు. ఈజరీయులు ఈజరు వంశస్థులు; హెలకీయులు హెలకు వంశస్థులు; అశ్రీయేలీయులు అశ్రీయేలు వంశస్థులు; షెకెమీయులు షెకెము వంశస్థులు; షెమీదాయీయులు షెమీదా వంశస్థులు; హెపెరీయులు హెపెరు వంశస్థులు.౹

33 హెపెరు కుమారుడైన సెలోపెహాదుకు కుమార్తెలేగాని కుమారులు పుట్టలేదు. సెలోపెహాదు కుమార్తెల పేరులు మహలా నోయా హొగ్లా మిల్కా తిర్సా.౹

34 వీరు మనష్షీయుల వంశస్థులు; వ్రాయ బడినవారి సంఖ్యచొప్పున వీరు ఏబదిరెండువేల ఏడు వందలమంది.౹

35 ఎఫ్రాయిము పుత్రుల వంశములు ఇవి; షూతలహీయులు షూతలహు వంశస్థులు; బేకరీయులు బేకరు వంశస్థులు; తహనీయులు తహను వంశస్థులు,౹

36 వీరు షూతలహు కుమారులు; ఏరానీయులు ఏరాను వంశస్థులు.౹

37 వీరు ఎఫ్రాయిమీయుల వంశస్థులు. వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు ముప్పదిరెండువేల ఐదువందలమంది; వీరు యోసేపు పుత్రుల వంశస్థులు.౹

38 బెన్యామీను పుత్రుల వంశములలో బెలీయులు బెల వంశస్థులు; అష్బేలీయులు అష్బేల వంశస్థులు;౹

39 అహీరామీయులు అహీరాము వంశస్థులు;౹

40 షూపామీయులు షూపాము వంశస్థులు; బెల కుమారులు ఆర్దు నయమాను; ఆర్దీయులు ఆర్దు వంశస్థులు; నయమానీయులు నయమాను వంశస్థులు.౹

41 వీరు బెన్యామీనీయుల వంశస్థులు; వారిలో వ్రాయబడిన లెక్కచొప్పున నలుబదియయిదువేల ఆరువందలమంది.౹

42 దాను పుత్రుల వంశములలో షూషామీయులు షూషాము వంశస్థులు;౹

43 వీరు తమ వంశములలో దానీయుల వంశస్థులు. వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు అరువది నాలుగువేల నాలుగువందలమంది.౹

44 ఆషేరు పుత్రుల వంశములలో యిమ్నీయులు యిమ్నా వంశస్థులు, ఇష్వీయులు ఇష్వీ వంశస్థులు; బెరీయులు బెరీయా వంశస్థులు;౹

45 బెరీయానీయులలో హెబెరీయులు హెబెరు వంశస్థులు; మల్కీయేలీయులు మల్కీయేలు వంశస్థులు;౹

46 ఆషేరు కుమార్తె పేరు శెరహు.౹

47 వ్రాయబడినవారి సంఖ్య చొప్పున వీరు ఆషేరీయుల వంశస్థులు; వీరు ఏబదిమూడువేల నాలుగువందలమంది.౹

48 నఫ్తాలీ పుత్రుల వంశములలో యహసయేలీయులు యహసయేలు వంశస్థులు; గూనీయులు గూనీ వంశస్థులు;౹

49 యేసెరీయులు యేసెరు వంశస్థులు; షిల్లేమీయులు షిల్లేము వంశస్థులు.౹

50 వీరు నఫ్తాలీయుల వంశస్థులు; వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు నలుబదియయిదువేల నాలుగువందలమంది

51 ఇశ్రాయేలీయులలో లెక్కింపబడిన వీరు ఆరులక్షల వెయ్యిన్ని ఏడు వందల ముప్పదిమంది.

52 యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను–వీరి పేళ్ల లెక్క చొప్పున ఆ దేశమును వీరికి స్వాస్థ్యముగా పంచిపెట్టవలెను.౹

53 ఎక్కువమందికి ఎక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను;౹

54 తక్కువమందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను. దాని దాని జనసంఖ్యనుబట్టి ఆయా గోత్రములకు స్వాస్థ్యము ఇయ్యవలెను.౹

55 చీట్లువేసి ఆ భూమిని పంచిపెట్టవలెను. వారు తమతమపితరుల గోత్రముల జనసంఖ్యచొప్పున స్వాస్థ్యమును పొందవలెను.౹

56 ఎక్కువ మందికేమి తక్కువమందికేమి చీట్లు వేసి యెవరి స్వాస్థ్యమును వారికి పంచిపెట్టవలెను.

57 వారి వారి వంశములలో లెక్కింపబడిన లేవీయులు వీరు. గెర్షోనీయులు గెర్షోను వంశస్థులు; కహాతీయులు కహాతు వంశస్థులు; మెరారీయులు మెరారి వంశస్థులు.౹

58 లేవీయుల వంశములు ఏవనగా, లిబ్నీయుల వంశము హెబ్రోనీయుల వంశము మహలీయుల వంశము మూషీయుల వంశము కోరహీయుల వంశము.౹

59 కహాతు అమ్రామును కనెను; అమ్రాము భార్యపేరు యోకెబెదు. ఆమె లేవీ కుమార్తె; ఐగుప్తులో ఆమె లేవీకి పుట్టెను. ఆమె అమ్రామువలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిర్యామును కనెను.౹

60 అహరోనువలన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు పుట్టిరి.౹

61 నాదాబు అబీహులు యెహోవా సన్నిధికి అన్యాగ్ని తెచ్చినప్పుడు చనిపోయిరి.౹

62 వారిలో నెల మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కింపబడినవారందరు ఇరువదిమూడువేలమంది. వారు ఇశ్రాయేలీయులలో లెక్కింపబడినవారు కారు గనుక ఇశ్రాయేలీయులలో వారికి స్వాస్థ్యమియ్యబడలేదు.

63 యెరికో ప్రాంతములయందలి యొర్దానునొద్దనున్న మోయాబు మైదానములలో మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలీయుల జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడినవారు వీరు.౹

64 మోషే అహరోనులు సీనాయి అరణ్యములో ఇశ్రాయేలీయుల సంఖ్యను చేసి నప్పుడు లెక్కింపబడినవారిలో ఒక్కడైనను వీరిలో ఉండలేదు.౹

65 ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోవుదురని యెహోవావారినిగూర్చి సెలవిచ్చెను. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/NUM/26-d291a8261d71c102dc0015a6ae39d8c5.mp3?version_id=1787—

Categories
సంఖ్యాకాండము

సంఖ్యాకాండము 27

1 అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహాదు హెపెరు కుమారుడును గిలాదు మనుమడును మాకీరు మునిమనుమడునై యుండెను. అతని కుమార్తెల పేళ్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా అనునవి.౹

2 వారు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద మోషే యెదుటను యాజకుడైన ఎలియాజరు ఎదుటను ప్రధానుల యెదుటను సర్వసమాజము యెదుటను నిలిచి చెప్పినదేమనగా–మా తండ్రి అరణ్యములో మరణమాయెను.౹

3 అతడు కోరహు సమూహములో, అనగా యెహోవాకు విరోధముగా కూడినవారి సమూహములో ఉండలేదుగాని తన పాపమునుబట్టి మృతిబొందెను.౹

4 అతనికి కుమారులు కలుగలేదు; అతనికి కుమారులు లేనంత మాత్రముచేత మా తండ్రిపేరు అతని వంశములోనుండి మాసిపోనేల? మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయుమనిరి.౹

5 అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవిచేయగా

6 యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. –సెలోపెహాదు కుమా ర్తెలు చెప్పినది యుక్తము.౹

7 నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి అధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెందచేయవలెను.౹

8 మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లు చెప్పవలెను– ఒకడు కుమారుడు లేక మృతి బొందినయెడల మీరు వాని భూస్వాస్థ్యమును వాని కుమార్తెలకు చెందచేయవలెను.౹

9 వానికి కుమార్తె లేనియెడల వాని అన్నదమ్ములకు వాని స్వాస్థ్యము ఇయ్యవలెను.౹

10 వానికి అన్నదమ్ములు లేనియెడల వాని భూస్వాస్థ్యమును వాని తండ్రి అన్న దమ్ములకు ఇయ్యవలెను.౹

11 వాని తండ్రికి అన్నదమ్ములు లేనియెడల వాని కుటుంబములో వానికి సమీపమైన జ్ఞాతికి వాని స్వాస్థ్యము ఇయ్యవలెను;వాడు దాని స్వాధీనపరచు కొనును. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇశ్రాయేలీయులకు విధింపబడిన కట్టడ.

12 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను–నీవు ఈ అబారీము కొండయెక్కి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమును చూడుము.౹

13 నీవు దాని చూచిన తరువాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజ నులలో చేర్చబడుదువు.౹

14 ఏలయనగా సీను అరణ్యములో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్లయొద్ద వారి కన్నుల యెదుట నన్ను పరిశుద్ధపరచక నామీద తిరుగబడితిరి. ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేషులోనున్న మెరీబా నీళ్లే.౹

15 అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను– యెహోవా, సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరిలేని గొఱ్ఱెలవలె ఉండకుండునట్లు ఈ సమాజముమీద ఒకని నియమించుము.౹

16 అతడు వారి యెదుట వచ్చుచు, పోవుచునుండి,౹

17 వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై యుండవలెను.౹

18 అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను–నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతని తీసికొని అతనిమీద నీ చెయ్యి యుంచి

19 యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వసమాజము ఎదుటను అతని నిలువబెట్టి వారి కన్నుల యెదుట అతనికి ఆజ్ఞ యిమ్ము;౹

20 ఇశ్రాయేలీయుల సర్వ సమాజము అతని మాట వినునట్లు అతనిమీద నీ ఘనతలో కొంత ఉంచుము.౹

21 యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పువలన అతనికొరకు విచారింపవలెను. అతడును అతనితోకూడ ఇశ్రాయేలీయులందరును, అనగా సర్వసమా జము అతని మాటచొప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండవలెను.౹

22 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. అతడు యెహోషువను తీసికొని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వసమాజము ఎదుటను అతని నిలువ బెట్టి

23 అతనిమీద తన చేతులుంచి యెహోవా మోషేద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ యిచ్చెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/NUM/27-7391de5786382af44b59fa7e8f8b8b9f.mp3?version_id=1787—

Categories
సంఖ్యాకాండము

సంఖ్యాకాండము 28

1 యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

2 –నీవు ఇశ్రాయేలీయులకు ఈలాగు ఆజ్ఞాపించుము – నాకు సువాసన కలుగుటకై మీరు హోమరూపములుగా నాకు అర్పించు ఆహారమును నియామక కాలమున నాయొద్దకు తెచ్చుటకు జాగ్రత్తపడవలెను.౹

3 మరియు నీవు వారికీలాగు ఆజ్ఞాపించుము–మీరు యెహోవాకు నిత్యమైన దహనబలి రూపముగా ప్రతిదినము నిర్దోషమైన యేడాదివగు రెండు మగ గొఱ్ఱెపిల్లలను అర్పింపవలెను.౹

4 వాటిలో ఒక గొఱ్ఱెపిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలమందు రెండవదానిని అర్పింపవలెను.౹

5 దంచితీసిన మూడు పళ్లలోనిది పావు నూనెతో కలుప బడిన తూమెడు పిండిలో పదియవవంతు నైవేద్యము చేయవలెను.౹

6 అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా సీనాయికొండమీద నియమింపబడిన నిత్యమైన దహనబలి.౹

7 ఆ మొదటి గొఱ్ఱెపిల్లతో అర్పింపవలసిన పానార్పణము ముప్పావు; పరిశుద్ధస్థలములో మద్యమును యెహోవాకు పానార్పణముగా పోయింపవలెను.౹

8 ఉదయ నైవేద్యమును దాని పానార్పణమును అర్పించినట్లు యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా ఆ రెండవ గొఱ్ఱెపిల్లను సాయంకాలమందు అర్పింపవలెను.

9 విశ్రాంతిదినమున నిర్దోషమైన యేడాదివగు రెండు గొఱ్ఱెపిల్లలను నైవేద్యరూపముగాను, దాని పానార్పణముగాను నూనెతో కలపబడిన తూమెడు పిండిలో రెండు పదియవవంతులను అర్పింవవలెను.౹

10 నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక యిది ప్రతి విశ్రాంతిదినమున చేయవలసిన దహనబలి.

11 నెలనెలకు మొదటిదినమున యెహోవాకు దహనబలి అర్పించవలెను. రెండు కోడెదూడలను ఒక పొట్టేలును నిర్దోషమైన యేడాదివగు ఏడు గొఱ్ఱెపిల్లలను వాటిలో ప్రతి కోడెదూడతోను,౹

12 నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో మూడు పదియవవంతులను నైవేద్యముగాను ఒక్కొక్క పొట్టేలుతోను, నూనెతో కలుపబడి తూమెడు పిండిలో రెండు పదియవ వంతులను నైవేద్యముగాను, ఒక్కొక్క గొఱ్ఱెపిల్లతో నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో నొక పదియవవంతును నైవేద్యముగాను చేయవలెను.౹

13 అది యెహోవాకు ఇంపైన సువాసనగల దహన బలి.౹

14 వాటి పానార్పణములు ఒక్కొక్క కోడెతో పడిన్నర ద్రాక్షారసమును పొట్టేలుతో పడియు గొఱ్ఱెపిల్లతో ముప్పావును ఉండవలెను. ఇది సంవత్సరములో మాస మాసమునకు జరుగవలసిన దహనబలి.౹

15 నిత్యమైన దహనబలియు దాని పానార్పణమును గాక యొక మేక పిల్లను పాపపరిహారార్థబలిగా యెహోవాకు అర్పింపవలెను.

16 మొదటి నెల పదునాలుగవ దినము యెహోవాకు పస్కాపండుగ.౹

17 ఆ నెల పదునయిదవ దినము పండుగ జరుగును. ఏడు దినములు పొంగని భక్ష్యములనే తినవలెను.౹

18 మొదటి దినమున పరిశుద్ధ సంఘము కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైన పనులేమియు చేయకూడదు

19 అయితే యెహోవాకు దహనబలిగా మీరు రెండు కోడెదూడలను ఒక పొట్టేలును ఏడాదివగు ఏడు మగ గొఱ్ఱెపిల్లలను అర్పింపవలెను. అవి మీకు కలిగిన వాటిలో నిర్దోషమైనవై యుండవలెను

20 వాటి నైవేద్యము నూనెతో కలపబడిన గోధుమల పిండి.౹

21 ఒక్కొక్క కోడెతో తూములో మూడు పదియవవంతులను, పొట్టేలుతో రెండు పదియవ వంతులను ఆ యేడు గొఱ్ఱెపిల్లలలో ఒక్కొక్క గొఱ్ఱెపిల్లతో ఒక్కొక్క పదియవవంతును

22 మీకు ప్రాయశ్చిత్తము కలుగుటకై పాపపరిహారార్థబలిగా ఒక మేకను అర్పింపవలెను.౹

23 ఉదయమున మీరు అర్పించు నిత్యమైన దహనబలి గాక వీటిని మీరు అర్పింపవలెను.౹

24 అట్లే ఆ యేడు దినములలో ప్రతిదినము యెహోవాకు ఇంపైన సువాసనగల హోమద్రవ్యమును ఆహారముగా అర్పించవలెను. నిత్యమైన దహనబలియు దాని పానార్పణమును గాక దానిని అర్పించవలెను.౹

25 ఏడవదినమున పరిశుద్ధసంఘము కూడవలెను. ఆ దినమున మీరు జీవనో పాధియైన పనులేమియు చేయకూడదు.

26 మరియు ప్రథమ ఫలములను అర్పించుదినమున, అనగా వారముల పండుగదినమున మీరు యెహోవాకు క్రొత్త పంటలో నైవేద్యము తెచ్చునప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. నాడు మీరు జీవనోపాధి యైన పనులేమియు చేయకూడదు.౹

27 యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా మీరు రెండు కోడె దూడలను ఒక పొట్టేలును ఏడాదివైన యేడు మగ గొఱ్ఱెపిల్లలను వాటికి నైవేద్యముగా ప్రతి కోడెదూడతోను

28 నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో మూడు పదియవ వంతులను, ప్రతి పొట్టేలుతో రెండు పదియవవంతులను

29 ఆ యేడు గొఱ్ఱెపిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదియవవంతును

30 మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకై యొక మేకపిల్లను అర్పింపవలెను.౹

31 నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమునుగాక వాటిని వాటి పానార్పణములను అర్పింపవలెను. అవి నిర్దోషములుగా నుండవలెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/NUM/28-1eb3dcbc572f2a256715910ef792368d.mp3?version_id=1787—

Categories
సంఖ్యాకాండము

సంఖ్యాకాండము 29

1 ఏడవ నెల మొదటితేదిన మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను.౹

2-6 మీరు జీవనోపాధియైన పనులేమియు చేయకూడదు; అది మీకు శృంగధ్వని దినము. నిర్దోషమైన ఒక కోడెదూడను ఒక పొట్టేలును యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా అర్పింపవలెను. వాటి వాటి విధిప్రకారముగా అమావాస్యకు అర్పించు దహనబలియు దాని నైవేద్యమును, నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును వాటి పానార్పణములును గాక మీరు నిర్దోషమైన యేడాదివగు ఏడు మగ గొఱ్ఱెపిల్లలను యెహోవాకు, ఇంపైన సువాసనగల దహనబలిగా అర్పింపవలెను. వాటి నైవేద్యము నూనెతో కలుపబడిన గోధుమపిండి ప్రతి కోడెదూడతో తూములో మూడు పదియవవంతులను, పొట్టేలుకు రెండు పదియవవంతులను, ఏడు గొఱ్ఱెపిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదియవ వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకై పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.

7 ఈ యేడవ నెల పదియవదినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అప్పుడు మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను; ఏపనియు చేయకూడదు.౹

8 ప్రాయశ్చిత్తము కలుగుటకై పాపపరిహారార్థబలియు నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును వాటి వాటి పానార్పణములునుగాక, మీరు ఒక కోడెదూడను ఒక పొట్టేలును ఏడాదివైన యేడు గొఱ్ఱెపిల్లలను యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా అర్పింపవలెను. అవి మీకున్న వాటిలో నిర్దోషమైనవై యుండవలెను.౹

9 నూనెతో కలుప బడిన పిండిని నైవేద్యముగాను ప్రతి కోడెతో తూములో మూడు పదియవవంతులను ఒక పొట్టేలుతో రెండు పదియవవంతులను

10 ఆ యేడు గొఱ్ఱెపిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదియవవంతును

11 పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.

12 మరియు ఏడవ నెల పదునయిదవదినమున మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను. అప్పుడు మీరు జీవనో పాధియైన పనులేమియు చేయక యేడు దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను.౹

13 నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును దాని పానార్పణమునుగాక, యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా పదమూడు కోడెదూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱెపిల్లలను అర్పింపవలెను. అవి నిర్దోషమైనవై యుండవలెను.౹

14 నూనెతో కలుపబడిన గోధుమపిండిని నైవేద్యముగాను ఆ పదమూడు కోడెదూడలలో ప్రతి దూడతో తూములో మూడు పదియవవంతులను ఆ రెండు పొట్టేళ్లలో ప్రతి పొట్టేలుతో రెండు పదియవవంతులను

15 ఆ పదునాలుగు గొఱ్ఱెపిల్లలలో ప్రతి పిల్లతో ఒక్కొక్క పదియవవంతును పాపపరిహారార్థబలిగా

16 ఒక మేక పిల్లను అర్పింవలెను.

17 రెండవదినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును వాటి పానార్పణములును గాక మీరు నిర్దోషమైన పండ్రెండు కోడెదూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱెపిల్లలను విధిప్రకారముగా,౹

18 వాటి వాటి లెక్కచొప్పున, ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱెపిల్లలతోను వాటి వాటి నైవేద్యమును

19 పానార్పణములను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.

20 మూడవదినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును గాక నిర్దోషమైన పదకొండు కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదు నాలుగు గొఱ్ఱెపిల్లలను

21 విధి ప్రకారముగా వాటి వాటి లెక్కచొప్పున, ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱెపిల్లలతోను వాటి నైవేద్యమును పానార్పణములను

22 పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.

23 నాలుగవదినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన పది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱెపిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్క చొప్పున,౹

24 ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱెపిల్లలతోను వాటి నైవేద్యమును పానార్పణములను

25 పాప పరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.

26 అయిదవదినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన తొమ్మిది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱెపిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్క చొప్పున,౹

27 ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱెపిల్లలతోను

28 వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.

29 ఆరవదినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన యెనిమిది కోడెలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱెపిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్కచొప్పున,

30 ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱెపిల్లలతోను వాటి వాటి నైవేద్యమును పానార్పణములను

31 పాపపరిహారార్థబలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను.

32 ఏడవదినమున నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమును గాక నిర్దోషమైన యేడు దూడలను రెండు పొట్టేళ్లను ఏడాదివైన పదునాలుగు గొఱ్ఱెపిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్కచొప్పున,౹

33 ఆ కోడెలతోను పొట్టేళ్లతోను గొఱ్ఱెపిల్లలతోను వాటి వాటి నైవేద్యమును పానార్పణములను

34 పాపపరిహారార్థబలిగా ఒక మేక పిల్లను అర్పింపవలెను.

35 ఎనిమిదవ దినము మీకు వ్రతదినముగా నుండును. అప్పుడు మీరు జీవనోపాధియైన పనులనేమియు చేయకూడదు.౹

36 అందులో నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును పానార్పణమునుగాక మీరు యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా నిర్దోషమైన యొక కోడెదూడను ఒక పొట్టేలును ఏడాదివైన యేడు గొఱ్ఱెపిల్లలను విధి ప్రకారముగా, వాటి వాటి లెక్కచొప్పున,౹

37-38 ఆ కోడెదూడతోను పొట్టేలుతోను గొఱ్ఱెపిల్లలతోను వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాపపరి హారార్థబలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను.

39 మీ మ్రొక్కుబళ్లను మీ స్వేచ్ఛార్పణములను మీ దహనబలులను మీ నైవేద్యములను మీ పానార్పణములను మీ సమాధానబలులను గాక వీటిని నియామక కాలములందు యెహోవాకు అర్పింపవలెను.౹

40 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలీయులతో సమస్తమును తెలియజెప్పెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/NUM/29-16fdb7d004e81139be9832ba4b75a6f4.mp3?version_id=1787—

Categories
సంఖ్యాకాండము

సంఖ్యాకాండము 30

1 మోషే ఇశ్రాయేలీయులయొక్క గోత్రాధిపతులతో ఇట్లనెను

2 –ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి. ఒకడు యెహోవాకు మ్రొక్కుకొనినయెడల, లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసినయెడల, అతడు తన మాటతప్పక తన నోటనుండి వచ్చినదంతయు నెరవేర్చవలెను.౹

3-6 మరియు ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి యింటనుండగా యెహోవాకు మ్రొక్కుకొని బద్ధురా లైనయెడల, ఆమె తండ్రి ఆమె మ్రొక్కుబడిని ఆమె కలుగజేసికొనిన బాధ్యతను విని దానిగూర్చి ఊరకొనినయెడల, ఆమె మ్రొక్కుబడులన్నియు నిలుచును. ఆమె తాను బద్ధురాలగుటకు పెట్టుకొనిన ఒట్టు నిలుచును. ఆమె తండ్రి వినినదినమున ఆక్షేపణచేసినయెడల, ఆమె మ్రొక్కుబడులలో ఏదియు, ఆమె తనమీద పెట్టుకొనిన బాధ్యతలో ఏదియు నిలువకపోవును. ఆమె తండ్రి దానికి ఆక్షేపణచేసెను గనుక యెహోవా ఆమెను క్షమించును.౹

7 ఆమెకు వివాహమైన తరువాత ఆమె మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లయినను, నిరాలోచనగా ఆమె తనమీద పెట్టుకొనిన ఒట్టులైనను ఆమెమీదనుండుట ఆమె భర్త విని, దాని గూర్చి వినిన దినమున అతడు ఊరకుండుట తటస్థించినయెడల, ఆమె మ్రొక్కుబళ్లును ఆమె తనమీద పెట్టుకొనిన ఒట్టును నిలుచును.౹

8 ఆమె భర్త వినిన దినమందే ఆక్షేపణ చేసినయెడల, అతడు ఆమె మ్రొక్కుకొనిన మ్రొక్కుబడిని ఆమె నిరాలోచనగా తనమీద పెట్టుకొనిన ఒట్టులను రద్దుచేసినవాడగును; యెహోవా ఆమెను క్షమించును.౹

9 విధవరాలుగాని విడనాడబడినదిగాని తనమీద పెట్టుకొనిన ప్రతి మ్రొక్కుబడి నిలుచును.౹

10 ఆమె తన భర్తయింట ఉండి మ్రొక్కుకొనినయెడలనేమి, ప్రమాణముచేసి తనమీద ఒట్టు పెట్టుకొనినయెడలనేమి,

11 తరువాత ఆమె భర్త విని దానిగూర్చి ఆక్షేపణచేయక ఊరకుండినయెడల, ఆమె మ్రొక్కుబడులన్నియు నిలుచును; ఆమె తనమీద పెట్టుకొనిన ప్రతి ఒట్టును నిలుచును.౹

12 ఆమె భర్త వినిన దినమందే వాటిని బొత్తిగా రద్దు చేసినయెడల, ఆమె మ్రొక్కుబళ్లనుగూర్చియు, ఆమె మీది ఒట్టునుగూర్చియు ఆమె పలికినదేదియు నిలువక పోవును; ఆమెభర్త వాటిని రద్దుచేసెను గనుక యెహోవా ఆమెను క్షమించును.౹

13 ప్రతి మ్రొక్కుబడిని, తన్నుతాను దుఃఖపరచుకొందునని ప్రమాణపూర్వకముగా తనమీద పెట్టుకొనిన ప్రతి బాధ్యతను ఆమె భర్త స్థిరపరచ వచ్చును, రద్దుచేయవచ్చును.౹

14 అయితే ఆమె భర్త నానాట దానిగూర్చి ఊరకొనుచు వచ్చినయెడల,వాడు ఆమెమీదనున్న ఆమె మ్రొక్కుబడులన్నిటిని ఆమె ఒట్టులన్నిటిని స్థిరపరచినవాడగును. అతడు వినిన దినమున దానిగూర్చి ఊరకుండుటవలన వాటిని స్థిరపరచెను.౹

15 అతడు వినిన తరువాత వాటిని బొత్తిగా రద్దుచేసినయెడల, తానే ఆమె దోషశిక్షను భరించును.౹

16 ఇవి భర్తనుగూర్చియు, భార్యనుగూర్చియు, తండ్రినిగూర్చియు, బాల్యమున తండ్రి యింటనున్న కుమార్తెనుగూర్చియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన కట్టడలు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/NUM/30-517dc576fe1412dd6b6be2d5b7fa82f9.mp3?version_id=1787—

Categories
సంఖ్యాకాండము

సంఖ్యాకాండము 31

1 మరియు యెహోవా–మిద్యానీయులు ఇశ్రాయేలీయులకు చేసిన హింసకు ప్రతి హింస చేయుడి.౹

2 తరువాత నీవు నీ స్వజనులయొద్దకు చేర్చబడుదువని మోషేకు సెలవియ్యగా

3 మోషే ప్రజలతో–మీలో కొందరు యుద్ధసన్నద్ధులై మిద్యానీయులమీదికిపోయి మిద్యానీయులకు యెహోవా విధించిన ప్రతి దండన చేయునట్లు

4 ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలోను ప్రతి గోత్రములోనుండి వేయేసిమందిని ఆ యుద్ధమునకు పంపవలెననెను.౹

5 అట్లు గోత్రమొక్కంటికి వేయిమందిచొప్పున, ఇశ్రాయేలీయుల సేనలలోనుండి పండ్రెండువేల యుద్ధ వీరులు ఏర్పరచబడగా

6 మోషే వారిని, అనగా ప్రతి గోత్రమునుండి వేయేసిమందిని, యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపెను. అతనిచేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బూరలను యుద్ధమునకు పంపెను.౹

7 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లువారు మిద్యానీయులతో యుద్ధముచేసి మగవారినందరిని చంపిరి.౹

8 చంపబడిన యితరులుగాక మిద్యానురాజులను, అనగా మిద్యాను అయిదుగురు రాజులైన ఎవీని, రేకెమును, సూరును, హూరును, రేబను చంపిరి. బెయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి.౹

9 అప్పుడు ఇశ్రాయేలీయులు మిద్యాను స్త్రీలను వారి చిన్నపిల్లలను చెరపట్టుకొని, వారి సమస్త పశువులను వారి గొఱ్ఱె మేకలన్నిటిని వారికి కలిగినది యావత్తును దోచుకొనిరి.౹

10 మరియు వారి నివాస పట్టణములన్నిటిని వారి కోటలన్నిటిని అగ్నిచేత కాల్చివేసిరి.౹

11 వారు మనుష్యులనేమి పశువులనేమి సమస్తమైన కొల్లసొమ్మును మిద్యానీయుల ఆస్తిని యావత్తును తీసికొనిరి.౹

12 తరువాత వారు మోయాబు మైదానములలో యెరికో యొద్దనున్న యొర్దాను దగ్గర దిగియున్న దండులో మోషే యొద్దకును యాజకుడైన ఎలియాజరు నొద్దకును ఇశ్రాయేలీయుల సమాజము నొద్దకును చెరపట్టబడినవారిని అపహరణములను ఆ కొల్ల సొమ్మును తీసికొని రాగా

13 మోషేయు యాజకుడైన ఎలియాజరును సమాజ ప్రధానులందరును వారిని ఎదుర్కొనుటకు పాళెములోనుండి వెలుపలికి వెళ్లిరి.౹

14 అప్పుడు మోషే యుద్ధసేనలోనుండి వచ్చిన సహస్రాధిపతులును శతాధిపతులునగు సేనానాయకులమీద కోపపడెను.౹

15 మోషే వారితో–మీరు ఆడువారినందరిని బ్రదుకనిచ్చి తిరా?

16 ఇదిగో బిలాము మాటనుబట్టి పెయోరు విషయములో ఇశ్రాయేలీయులచేత యెహోవామీద తిరుగు బాటు చేయించినవారు వీరు కారా? అందుచేత యెహోవా సమాజములో తెగులు పుట్టియుండెను గదా.౹

17 కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవానిని పురుషసంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి;౹

18 పురుషసంయోగము ఎరుగని ప్రతి ఆడుపిల్లను మీ నిమిత్తము బ్రతుకనీయుడి.౹

19 మీరు ఏడు దినములు పాళెము వెలుపల ఉండవలెను; మీలో నరుని చంపిన ప్రతివాడును చంపబడిన నరుని ముట్టిన ప్రతివాడును, మీరును మీరు చెరపెట్టినవారును మూడవదినమున ఏడవదినమున మిమ్మును మీరే పవిత్ర పరచుకొనవలెను.౹

20 మీరు బట్టలన్నిటిని చర్మవస్తువులన్నిటిని మేక వెండ్రుకల వస్తువులన్నిటిని కొయ్యవస్తువులన్నిటిని పవిత్రపరచవలెననెను.౹

21 అప్పుడు యాజకుడగు ఎలియాజరు యుద్ధమునకు పోయిన సైనికులతో–యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధి యేదనగా

22 మీరు బంగారును వెండిని ఇత్తడిని ఇనుమును తగరమును సీసమును

23 అనగా అగ్నిచేత చెడని సమస్త వస్తువులనుమాత్రము అగ్నిలో వేసి తీయవలెను; అప్పుడు అవి పవిత్రమగును. అయితే పాపపరిహార జలముచేతను వాటిని పవిత్ర పరచవలెను. అగ్నిచేత చెడునట్టి ప్రతి వస్తువును నీళ్లలో వేసి తీయవలెను.౹

24 ఏడవదినమున మీరు మీ బట్టలు ఉదుకుకొని పవిత్రులైన తరువాత పాళెములోనికి రావచ్చుననెను.

25 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.౹

26 –నీవును యాజకుడైన ఎలియాజరును సమాజముయొక్క పితరుల కుటుంబములలో ప్రధానులును మనుష్యులలోనేమి, పశువులలోనేమి, చెరపట్టబడిన దోపుడుసొమ్ము మొత్తమును లెక్కించి రెండు భాగములుగాచేసి

27 యుద్ధమునకు పూనుకొని సేనగా బయలుదేరినవారికి సగమును సర్వసమాజమునకు సగమును పంచిపెట్టవలెను.౹

28 మరియు సేనగా బయలుదేరిన యోధులమీద యెహోవాకు పన్ను కట్టి, ఆ మనుష్యులలోను పశువులలోను గాడిదలలోను గొఱ్ఱె మేకలలోను ఐదువందలకు ఒకటిచొప్పున వారి సగములోనుండి తీసికొని

29 యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా యాజకుడైన ఎలియాజరుకు ఇయ్యవలెను.౹

30 మనుష్యులలోను పశువులలోను గాడిదలలోను గొఱ్ఱెమేకలలోను సమస్తవిధముల జంతువులలోను ఏబదింటికి ఒకటిచొప్పున, ఇశ్రాయేలీయులు సగములోనుండి తీసికొని యెహోవా మందిరమును కాపాడు లేవీయులకు ఇయ్యవలెను.౹

31 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడైన ఎలియాజరును చేసిరి.౹

32 ఆ దోపుడుసొమ్ము, అనగా ఆ సైనికులు కొల్లబెట్టిన సొమ్ములో మిగిలినది

33 ఆరులక్షల డెబ్బదియయిదు గొఱ్ఱె మేకలును,౹

34 డెబ్బది రెండువేల పశువులును, అరువది యొకవేయి గాడిదలును,౹

35 ముప్పది రెండు వేలమంది పురుషసంయోగమెరుగని స్త్రీలును,౹

36 అందులో అరవంతు, అనగా సైన్యముగా పోయినవారి వంతు, గొఱ్ఱె మేకల లెక్కయెంతనగా మూడులక్షల ముప్పదియేడువేల ఐదువందలు. ఆ గొఱ్ఱె మేకలలో యెహోవాకు చెల్లవలసిన పన్ను ఆరువందల డెబ్బది యయిదు, ఆ పశువులు ముప్పదియారువేలు.౹

37-39 వాటిలో యెహోవా పన్ను డెబ్బదిరెండు. ఆ గాడిదలు ముప్పది వేల ఐదువందలు, వాటిలో యెహోవా పన్ను అరువది యొకటి.౹

40-42 మనుష్యులు పదునారు వేలమంది. వారిలో యెహోవా పన్ను ముప్పది ఇద్దరు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే పన్నును, అనగా యెహోవాకు చెల్లవలసిన ప్రతిష్ఠార్పణమును యాజకుడైన ఎలియాజరున కిచ్చెను. సైనికులయొద్ద మోషే తీసికొని ఇశ్రాయేలీయుల కిచ్చిన సగమునుండి లేవీయులకిచ్చెను.౹

43 మూడులక్షల ముప్పదియేడువేల ఐదువందల గొఱ్ఱెమేకలును

44 ముప్పది ఆరువేల గోవులును ముప్పదివేల ఐదువందల గాడిదలును

45 పదునారు వేలమంది మనుష్యులును సమాజమునకు కలిగిన సగమైయుండగా, మోషే

46 ఇశ్రాయేలీయులకు వచ్చిన ఆ సగమునుండి మనుష్యులలోను జంతువులలోను

47 ఏబదింటికి ఒకటిచొప్పున తీసి, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు యెహోవా మందిరమును కాపాడు లేవీయుల కిచ్చెను.౹

48 అప్పుడు సేనా సహస్రముల నియామకులు, అనగా సహస్రాధిపతులును శతాధిపతులును మోషే యొద్దకు వచ్చి

49 –నీ సేవకులమైన మేము మా చేతిక్రింద నున్న యోధులను లెక్కించి మొత్తము చేసితిమి; మాలో ఒక్కడైనను మొత్తమునకు తక్కువ కాలేదు.౹

50 కాబట్టి యెహోవా సన్నిధిని మా నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు మేము మాలో ప్రతిమనుష్యునికి దొరికిన బంగారు నగలను గొలుసులను కడియములను ఉంగరములను పోగులను పతకములను యెహోవాకు అర్పణముగా తెచ్చియున్నామని చెప్పగా

51 మోషేయు యాజకుడైన ఎలియాజరు నగలుగా చేయబడిన ఆ బంగారును వారి యొద్ద తీసికొనిరి.౹

52 సహస్రాధిపతులును శతాధిపతులును ప్రతిష్ఠార్పణముగా యెహోవాకు అర్పించిన బంగార మంతయు పదునారువేల ఏడువందల ఏబది తులములు.౹

53 ఆ సైనికులలో ప్రతివాడును తన మట్టుకు తాను కొల్ల సొమ్ము తెచ్చుకొనియుండెను.౹

54 అప్పుడు మోషేయు యాజకుడైన ఎలియాజరును సహస్రాధిపతులయొద్ద నుండియు శతాధిపతులయొద్దనుండియు ఆ బంగారును తీసికొని యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా ప్రత్యక్షపు గుడారమున ఉంచిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/NUM/31-021b08f90ac2fdbf58d7b4e8fe34adca.mp3?version_id=1787—

Categories
సంఖ్యాకాండము

సంఖ్యాకాండము 32

1 రూబేనీయులకును గాదీయులకును అతివిస్తారమైన మందలుండెను గనుక యాజెరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలిసికొని

2 వారు వచ్చి మోషేను యాజకుడగు ఎలియాజరును సమాజ ప్రధానులతో

3 –అతారోతు దీబోను యాజెరు నిమ్రా హెష్బోను ఏలాలే షెబాము నెబో బెయోను అను స్థలములు, అనగా

4 ఇశ్రాయేలీయుల సమాజము ఎదుట యెహోవా జయించిన దేశము మందలకు తగిన ప్రదేశము. నీ సేవకులమైన మాకు మందలు కలవు.౹

5 కాబట్టి మా యెడల నీకు కటాక్షము కలిగినయెడల, మమ్మును యొర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మనగా

6 మోషే గాదీయులతోను రూబే నీయులతోను– మీ సహోదరులు యుద్ధమునకు పోవుచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా?

7 యెహోవా ఇశ్రాయేలీయులకిచ్చిన దేశమునకు వారు వెళ్లకయుండునట్లు మీరేల వారి హృదయములను అధైర్య పరచుదురు?

8 ఆ దేశమును చూచుటకు కాదేషు బర్నేయలోనుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారును ఆలాగు చేసిరిగదా

9 వారు ఎష్కోలు లోయలోనికి వెళ్లి ఆ దేశమును చూచి ఇశ్రాయేలీయుల హృదయమును అధైర్యపరచిరి గనుక యెహోవా తమకిచ్చిన దేశమునకు వారు వెళ్లకపోయిరి.౹

10 ఆ దినమున యెహోవా కోపము రగులుకొని

11 –ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఐగుప్తుదేశములోనుండి వచ్చిన మనుష్యులలో పూర్ణమనస్సుతో యెహోవాను అనుసరించిన కెనెజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబును నూనుకుమారుడైన యెహోషువయు తప్ప

12 మరి ఎవడును పూర్ణమనస్సుతో నన్ను అనుసరింపలేదు గనుక నేను అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణపూర్వకముగా నిచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరును చూడనే చూడరని ప్రమాణము చేసెను.౹

13 అప్పుడు యెహోవా కోపము ఇశ్రాయేలీయులమీద రగులుకొనగా యెహోవా దృష్టికి చెడునడత నడిచిన ఆ తరమువారందరు నశించువరకు అరణ్యములో నలుబది ఏండ్లు ఆయన వారిని తిరుగులాడచేసెను.౹

14 ఇప్పుడు ఇశ్రాయేలీయులయెడల యెహోవాకు కోపము మరి ఎక్కువగా పుట్టించునట్లుగా ఆ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరి యున్నారు.౹

15 మీరు ఆయనను అనుసరింపక వెనుకకు మళ్లినయెడల ఆయన ఈ అరణ్యములో జనులను ఇంక నిలువచేయును. అట్లు మీరు ఈ సర్వజనమును నశింప చేసెదరనెను.౹

16 అందుకు వారు అతనియొద్దకు వచ్చి– మేము ఇక్కడ మా మందలకొరకు దొడ్లను మా పిల్లల కొరకు పురములను కట్టుకొందుము.౹

17 ఇశ్రాయేలీయులను వారి వారి స్థలములకు చేర్చువరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదుము. అయితే మా పిల్లలు ఈ దేశనివాసుల భయముచేత ప్రాకారముగల పురములలో నివసింపవలెను.౹

18 ఇశ్రాయేలీయులలో ప్రతివాడును తన తన స్వాస్థ్యమును పొందువరకు మా యిండ్లకు తిరిగి రాము.౹

19 తూర్పుదిక్కున యొర్దాను ఇవతల మాకు స్వాస్థ్యము దొరికెను గనుక యొర్దాను అవతల దూరముగా వారితో స్వాస్థ్యము పొందమనిరి.

20 అప్పుడు మోషే వారితో–మీరు మీ మాటమీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యెహోవా తన యెదుటనుండి తన శత్రువులను వెళ్ల గొట్టువరకు

21 యెహోవా సన్నిధిని మీరందరు యుద్ధ సన్నద్ధులై యొర్దాను అవతలికి వెళ్లినయెడల

22 ఆ దేశము యెహోవా సన్నిధిని జయింపబడిన తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికిని ఇశ్రాయేలీయుల దృష్టికిని నిర్దోషులైయుందురు; అప్పుడు ఈ దేశము యెహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యమగును.౹

23 మీరు అట్లు చేయని యెడల యెహోవా దృష్టికి పాపముచేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనునుఅని తెలిసి కొనుడి.౹

24 మీరు మీ పిల్లలకొరకు పురములను మీ మందల కొరకు దొడ్లను కట్టుకొని మీ నోటనుండి వచ్చిన మాటచొప్పున చేయుడనెను.౹

25 అందుకు గాదీయులును రూబే నీయులును మోషేతో –మా యేలినవాడు ఆజ్ఞాపించినట్లు నీ దాసులమైన మేము చేసెదము.౹

26 మా పిల్లలు మా భార్యలు మా మందలు మా సమస్త పశువులు అక్కడ గిలాదు పురములలో ఉండును.౹

27 నీ దాసులమైన మేము, అనగా మా సేనలో ప్రతి యోధుడును మా యేలినవాడు చెప్పినట్లు యెహోవా సన్నిధిని యుద్ధము చేయుటకు యొర్దాను అవతలికి వచ్చెదమనిరి.

28 కాబట్టి మోషే వారినిగూర్చి యాజకుడైన ఎలియాజరుకును, నూను కుమారుడైన యెహోషువకును, ఇశ్రాయేలీయుల గోత్రములలో పితరుల కుటుంబముల ప్రధానులకును ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను

29 –గాదీయులును రూబే నీయులును అందరు యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి మీతోకూడ యొర్దాను అవతలికి వెళ్లినయెడల ఆ దేశము మీచేత జయింపబడిన తరువాత మీరు గిలాదు దేశమును వారికి స్వాస్థ్యముగా ఇయ్యవలెను.౹

30 అయితే వారు మీతో కలిసి యోధులై ఆవలికి వెళ్లనియెడల వారు కనాను దేశమందే మీమధ్యను స్వాస్థ్యములను పొందు దురనగా

31 గాదీయులును రూబేనీయులును–యెహోవా నీ దాసులమైన మాతో చెప్పినట్లే చేసెదము.౹

32 మేము యెహోవా సన్నిధిని యుద్ధసన్నద్ధులమై నది దాటి కనానుదేశములోనికి వెళ్లెదము. అప్పుడు యొర్దాను ఇవతల మేము స్వాస్థ్యమును పొందెదమని ఉత్తరమిచ్చిరి.౹

33 అప్పుడు మోషే వారికి, అనగా గాదీయులకును రూబే నీయులకును యోసేపు కుమారుడైన మనష్షే అర్ధగోత్రపు వారికిని, అమోరీయుల రాజైన సీహోను రాజ్యమును, బాషానురాజైన ఓగు రాజ్యమును, దాని ప్రాంతపురములతో ఆ దేశమును చుట్టునుండు ఆ దేశపురములను ఇచ్చెను.౹

34-35 గాదీయులు దీబోను అతారోతు అరోయేరు అత్రోతు షోపాను యాజెరు యొగ్బెహ బేత్నిమ్రా బేత్హారాను

36 అను ప్రాకారములుగల పురములను మందల దొడ్లను కట్టుకొనిరి.౹

37 రూబేనీయులు మారుపేరుపొందిన హెష్బోను ఏలాలే కిర్యతాయిము నెబో బయల్మెయోను

38 షిబ్మా అను పురములను కట్టి, తాముకట్టిన ఆ పురములకు వేరు పేరులుపెట్టిరి.౹

39 మనష్షే కుమారులైన మాకీరీయులు గిలాదుమీదికి పోయి దాని పట్టుకొని దానిలోనున్న అమోరీయులను వెళ్లగొట్టిరి.౹

40 మోషే మనష్షే కుమారుడైన మాకీరుకు గిలాదునిచ్చెను

41 అతడు అక్కడ నివసించెను. మనష్షే కుమారుడైన యాయీరు వెళ్లి వారి పల్లెలను పట్టుకొని వాటికి యాయీరు పల్లెలను పేరు పెట్టెను.౹

42 నోబహు వెళ్లి కెనాతును దాని గ్రామములను పట్టుకొని దానికి నోబహు అని తన పేరు పెట్టెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/NUM/32-d8435c2d48469aaa89049813c3178273.mp3?version_id=1787—

Categories
సంఖ్యాకాండము

సంఖ్యాకాండము 33

1 మోషే అహరోనులవలన తమతమ సేనలచొప్పున ఐగుప్తుదేశములోనుండి బయలుదేరివచ్చిన ఇశ్రాయేలీయులు చేసిన ప్రయాణములు ఇవి.౹

2 మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము, వారి ప్రయాణములనుబట్టి వారి సంచారక్రమములను వ్రాసెను. వారి సంచారక్రమముల ప్రకారము వారి ప్రయాణములు ఇవి.౹

3 మొదటి నెల పదునయిదవదినమునవారు రామెసేసులోనుండి ప్రయాణమై పస్కాపండుగకు మరునాడు వారిమధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలుల నందరిని ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులందరి కన్నులయెదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి.౹

4 అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చెను.౹

5 ఇశ్రాయేలీయులు రామె సేసులోనుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి.౹

6 సుక్కో తులోనుండి వారు బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతాములో దిగిరి.౹

7 ఏతాములోనుండి బయలుదేరి బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతుతట్టు తిరిగి మిగ్దోలు ఎదుట దిగిరి.౹

8 పీహహీరోతులోనుండి బయలుదేరి సముద్రము మధ్యనుండి అరణ్యములోనికి చేరి ఏతాము అరణ్యమందు మూడుదినముల ప్రయాణముచేసి మారాలో దిగిరి. మారాలోనుండి బయలుదేరి ఏలీముకు వచ్చిరి.౹

9 ఏలీములో పండ్రెండు నీటిబుగ్గలును డెబ్బది యీతచెట్లును ఉండెను; అక్కడ దిగిరి.౹

10 ఏలీములోనుండి వారు బయలుదేరి ఎఱ్ఱసముద్రము నొద్ద దిగిరి.౹

11 ఎఱ్ఱసముద్రము నొద్దనుండి బయలుదేరి సీను అరణ్యమందు దిగిరి.౹

12 సీను అరణ్యములోనుండి బయలుదేరి దోపకాలో దిగిరి

13 దోపకాలోనుండి బయలుదేరి ఆలూషులో దిగిరి.౹

14 ఆలూషులోనుండి బయలుదేరి రెఫీదీములో దిగిరి. అక్కడ జనులు త్రాగుటకై నీళ్లు లేకపోయెను.౹

15 రెఫీదీములోనుండి బయలుదేరి సీనాయి అరణ్యమందు దిగిరి.౹

16 సీనాయి అరణ్యమునుండి బయలుదేరి కిబ్రోతుహత్తావాలో దిగిరి.౹

17 కిబ్రోతుహత్తా వాలోనుండి బయలుదేరి హజేరోతులో దిగిరి.౹

18 హజే రోతులోనుండి బయలుదేరి రిత్మాలో దిగిరి.౹

19 రిత్మాలోనుండి బయలుదేరి రిమ్మోను పారెసులో దిగిరి.౹

20 రిమ్మోను పారె సులోనుండి బయలుదేరి లిబ్నాలో దిగిరి.౹

21 లిబ్నాలోనుండి బయలుదేరి రీసాలో దిగిరి.౹

22 రీసాలోనుండి బయలుదేరి కెహేలాతాలో దిగిరి.౹

23 కెహేలాతాలోనుండి బయలుదేరి షాపెరు కొండనొద్ద దిగిరి.౹

24 షాపెరు కొండ నొద్దనుండి బయలుదేరి హరాదాలో దిగిరి.౹

25 హరాదాలోనుండి బయలుదేరి మకెలోతులో దిగిరి.౹

26 మకెలోతులోనుండి బయలుదేరి తాహతులో దిగిరి.౹

27 తాహతులోనుండి బయలుదేరి తారహులో దిగిరి.౹

28 తారహులోనుండి బయలుదేరి మిత్కాలో దిగిరి.౹

29 మిత్కాలోనుండి బయలుదేరి హష్మోనాలో దిగిరి.౹

30 హష్మోనాలోనుండి బయలుదేరి మొసేరోతులో దిగిరి.౹

31 మొసేరోతులోనుండి బయలుదేరి బెనేయాకానులో దిగిరి.౹

32 బెనేయాకానులోనుండి బయలుదేరి హోర్‌హగ్గిద్గాదులో దిగిరి.౹

33 హోర్‌హగ్గిద్గా దులోనుండి బయలుదేరి యొత్బాతాలో దిగిరి.౹

34 యొత్బా తాలోనుండి బయలుదేరి ఎబ్రోనాలో దిగిరి.౹

35 ఎబ్రో నాలోనుండి బయలుదేరి ఎసోన్గెబెరులో దిగిరి.౹

36 ఎసోన్గె బెరులోనుండి బయలుదేరి కాదేషు అనబడిన సీను అరణ్యములో దిగిరి.౹

37 కాదేషులోనుండి బయలుదేరి ఎదోము దేశముకడనున్న హోరుకొండ దగ్గర దిగిరి.౹

38 యెహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు కొండనెక్కి, ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశములోనుండి బయలుదేరి వచ్చిన నలువదియవ సంవత్సరమున అయిదవ నెల మొదటి దినమున అక్కడ మృతినొందెను.౹

39 అహరోను నూటఇరువదిమూడేండ్ల యీడుగలవాడై హోరు కొండమీద మృతినొందెను.౹

40 అప్పుడు దక్షిణదిక్కున కనానుదేశమందు నివసించిన అరాదురాజైన కనానీయుడు ఇశ్రాయేలీయులు వచ్చిన సంగతి వినెను.౹

41 వారు హోరు కొండనుండి బయలుదేరి సల్మానాలో దిగిరి.౹

42 సల్మానాలోనుండి బయలుదేరి పూనొనులో దిగిరి.౹

43 పూనొనులోనుండి బయలుదేరి ఓబోతులో దిగిరి.౹

44 ఓబోతులోనుండి బయలుదేరి మోయాబు పొలిమేరయొద్దనున్న ఈయ్యె అబారీములో దిగిరి.౹

45 ఈయ్యె అబారీములోనుండి బయలుదేరి దీబోనుగాదులో దిగిరి.౹

46 దీబోనుగాదులోనుండి బయలుదేరి అల్మోను దిబ్లాతాయిములో దిగిరి.౹

47 అల్మోను దిబ్లాతాయిములోనుండి బయలుదేరి నెబోయెదుటి అబారీము కొండలలో దిగిరి.౹

48 అబారీము కొండలలోనుండి బయలుదేరి యెరికో దగ్గర యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో దిగిరి.౹

49 వారు మోయాబు మైదానములలో బెత్యేషిమోతు మొదలుకొని ఆబేలు షిత్తీమువరకు యొర్దానుదగ్గర దిగిరి.౹

50 యెరికోయొద్ద, అనగా యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.౹

51 –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–మీరు యొర్దానును దాటి కనానుదేశమును చేరిన తరువాత

52 ఆ దేశనివాసులందరిని మీ యెదుటనుండి వెళ్లగొట్టి, వారి సమస్త ప్రతిమలను నాశనముచేసి వారి పోతవిగ్రహములనన్నిటిని నశింపచేసి వారి ఉన్నతస్థలములనన్నిటిని పాడుచేసి

53 ఆ దేశమును స్వాధీనపరచుకొని దానిలో నివసింపవలెను; ఏలయనగా దాని స్వాధీనపరచుకొనునట్లు ఆ దేశమును మీకిచ్చితిని.౹

54 మీరు మీ వంశములచొప్పున చీట్లువేసి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచుకొనవలెను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యమును తక్కువమందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను. ఎవని చీటి యే స్థలమున పడునో వానికి ఆ స్థలమే కలుగును. మీ తండ్రుల గోత్రముల చొప్పున మీరు స్వాస్థ్యములు పొందవలెను.౹

55 అయితే మీరు మీ యెదుటనుండి ఆ దేశనివాసులను వెళ్లగొట్టనియెడల, మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి, మీరు నివసించు ఆ దేశములో మిమ్మును బాధపెట్టెదరు.౹

56 మరియు నేను వారికి చేయ తలంచినట్లు మీకు చేసెదనని వారితో చెప్పుము.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/NUM/33-cd6f2722775eba35876d832a4a2a719f.mp3?version_id=1787—