Categories
సంఖ్యాకాండము

సంఖ్యాకాండము 14

1 అప్పుడు ఆ సర్వసమాజము ఎలుగెత్తి కేకలు వేసెను; ప్రజలు ఆ రాత్రి యెలుగెత్తి యేడ్చిరి.౹

2 మరియు ఇశ్రాయేలీయులందరు మోషే అహరోనుల పైని సణుగుకొనిరి.౹

3 ఆ సర్వసమాజము–అయ్యో ఐగుప్తులో మేమేల చావ లేదు? ఈ అరణ్యమందు మేమేల చావలేదు? మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మును ఈ దేశములోనికి ఏల తీసికొని వచ్చెను? మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు; తిరిగి ఐగుప్తుకు వెళ్లుట మాకు మేలుకాదా? అని వారితో అనిరి.౹

4 వారు–మనము నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్లుదమని ఒకనితో ఒకడు చెప్పుకొనగా

5 మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల సర్వసమాజసంఘము ఎదుట సాగిలపడిరి.౹

6 అప్పుడు దేశమును సంచరించి చూచినవారిలోనుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని

7 ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో–మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము.౹

8 యెహోవా మనయందు ఆనం దించినయెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మన కిచ్చును; అది పాలు తేనెలు ప్రవహించుదేశము.౹

9 మెట్టుకు మీరు యెహోవామీద తిరుగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీదనుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడై యున్నాడు, వారికి భయపడకుడనిరి. ఆ సర్వసమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా

10 ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలీయులకందరికి కనబడెను.

11 యెహోవా–ఎన్నాళ్లవరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్లవరకు నేను వారిమధ్యను చేసిన సూచకక్రియలన్నిటిని చూచి నన్ను నమ్మక యుందురు?

12 నేను వారికి స్వాస్థ్యమియ్యక తెగులుచేత వారిని హతముచేసి, యీ జనముకంటె మహా బలముగల గొప్ప జనమును నీవలన పుట్టించెదనని మోషేతో చెప్పగా

13 మోషే యెహోవాతో ఇట్లనెను–ఆలాగైతే ఐగుప్తీయులు దానిగూర్చి విందురు; నీవు నీ బలముచేత ఈ జనమును ఐగుప్తీయులలోనుండి రప్పించితివిగదా; వీరు ఈ దేశనివాసులతో ఈ సంగతి చెప్పియుందురు.౹

14 యెహోవా అను నీవు ఈ ప్రజలమధ్యనున్నావనియు, యెహోవా అను నీవు ముఖాముఖిగా కనబడినవాడవనియు, నీ మేఘము వారిమీద నిలుచుచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను వారి ముందర నడుచుచున్నావనియు వారు వినియున్నారు గదా.౹

15 కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనులను చంపినయెడల నీ కీర్తినిగూర్చి వినిన జనములు

16 –ప్రమాణ పూర్వకముగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు వారిని చేర్చుటకు శక్తిలేక యెహోవావారిని అరణ్యములో సంహరించెనని చెప్పుకొందురు.౹

17 యెహోవా దీర్ఘశాంతు డును, కృపాతిశయుడును

18 దోషమును అతిక్రమమును పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమారులమీదికి తెచ్చువాడునై యున్నాడని నీవు చెప్పిన మాటచొప్పున నా ప్రభువుయొక్క బలము ఘనపరచబడును గాక

19 ఐగుప్తులోనుండి వచ్చినది మొదలుకొని యిదివరకు నీవు ఈ ప్రజలదోషమును పరిహరించియున్నట్లు నీ కృపాతిశయమునుబట్టి ఈ ప్రజలదోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా

20 యెహోవా–నీ మాటచొప్పున నేను క్షమించియున్నాను.౹

21 అయితే నా జీవముతోడు, భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొనియుండును.౹

22 నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన యీ మనుష్యులందరు ఈ పది మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి.౹

23 కాగా వారి పితరులకు ప్రమాణ పూర్వకముగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు; నన్ను అలక్ష్యము చేసినవారిలో ఎవరును దానిని చూడరు.౹

24 నా సేవకుడైన కాలేబు మంచిమనస్సు కలిగి పూర్ణమనస్సుతో నన్ను అనుసరించిన హేతువుచేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను.౹

25 అతని సంతతి దాని స్వాధీనపరచుకొనును. అమాలేకీయులును కనానీయులును ఆ లోయలో నివసించుచున్నారు. రేపు మీరు తిరిగి ఎఱ్ఱసముద్రపు మార్గముగా అరణ్యమునకు ప్రయాణమై పొండనెను.

26 మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను

27 –నాకు విరోధముగా సణుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహింపవలెను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సణుగుచున్న సణుగులను వినియున్నాను.౹

28 నీవు వారితో–యెహోవా వాక్కు ఏదనగా–నా జీవముతోడు; మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీయెడల చేసెదను.౹

29 మీ శవములు ఈ అరణ్యములోనే రాలును; మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడినవారందరు, అనగా ఇరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయము గలిగి నాకు విరోధముగా సణగినవారందరు రాలిపోవుదురు.౹

30 యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణముచేసిన దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు; ఇది నిశ్చయము.౹

31 అయితే–వారు కొల్లపోవుదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశములోపలికి రప్పించెదను; మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకొనెదరు;౹

32 అయితే మీ శవములు ఈ అరణ్యములో రాలును.౹

33 మీ శవములు ఈ అరణ్యములో క్షయమగువరకు మీ పిల్లలు ఈ అరణ్యములో నలుబది ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచారశిక్షను భరించెదరు.౹

34 మీరు ఆ దేశమును సంచరించి చూచిన నలుబది దినముల లెక్క ప్రకారము దినమునకు ఒక సంవత్సరము చొప్పున నలుబది సంవత్సరములు మీ దోషశిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్టు తెలిసికొందురు.౹

35 ఇది యెహోవా అను నేను చెప్పిన మాట; నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వసమాజమునకు నిశ్చయముగా దీని చేసెదను. ఈ అరణ్యములో వారు క్షీణించిపోవుదురు; ఇక్కడనే చనిపోవుదురు అనెను.౹

36 ఆ దేశమును సంచరించి చూచుటకై మోషేచేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమునుగూర్చి చెడ్డసమాచారము చెప్పుటవలన సర్వ సమాజము అతనిమీద సణుగునట్లు చేసిన మనుష్యులు,౹

37 అనగా ఆ దేశమునుగూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుష్యులు యెహోవా సన్నిధిని తెగులుచేత చనిపోయిరి.౹

38 అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుష్యులలో నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బ్రదికిరి.౹

39 మోషే ఇశ్రాయేలీయులందరితో ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాల దుఃఖించిరి.౹

40 వారు ఉదయమున లేచి ఆ కొండ కొనమీదికెక్కి–చిత్తమండి, మేము పాపము చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్లుదుము అనిరి.౹

41 అప్పుడు మోషే–ఇది ఏల? మీరు యెహోవా మాట మీరు చున్నారేమి?

42 అది కొనసాగదు. యెహోవా మీమధ్యను లేడు గనుక మీ శత్రువులయెదుట హతము చేయబడుదురు; మీరు సాగిపోకుడి.౹

43 ఏలయనగా అమాలేకీయులు కనానీయులు మీకంటె ముందుగా అక్కడికి చేరియున్నారు; మీరు ఖడ్గముచేత కూలుదురు; మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడైయుండడని చెప్పెను.౹

44 అయితే వారు మూర్ఖించి ఆ కొండకొన కెక్కిపోయిరి; అయినను యెహోవా నిబంధనమందసమైనను మోషేయైనను పాళెములోనుండి బయలు వెళ్లలేదు.౹

45 అప్పుడు ఆ కొండమీద నివాసముగానున్న అమాలేకీయులును కనానీయులును దిగి వచ్చి వారిని కొట్టి హోర్మావరకు వారిని తరిమి హతము చేసిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/NUM/14-a4a07877875778962e8aaa44dd620c47.mp3?version_id=1787—

Categories
సంఖ్యాకాండము

సంఖ్యాకాండము 15

1 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

2 –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–నేను మీ కిచ్చుచున్న దేశనివాసములలో మీరు ప్రవేశించిన తరువాత

3 యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లుగా గోవులలోనిదానినేకాని, గొఱ్ఱె మేకలలోనిదానినేకాని, దహనబలిగానైనను, బలిగానైనను తెచ్చి, మ్రొక్కుబడి చెల్లించుటకనియో, స్వేచ్ఛార్పణగాననియో, నియామక కాలమందు అర్పించునదియనియో, దేనినైనను మీరు అర్పింపగోరినయెడల

4 యెహోవాకు ఆ అర్పణము నర్పించువాడు ముప్పావు నూనెతో కలుపబడిన రెండు పళ్ల పిండిని నైవేద్యముగా తేవలెను.౹

5 ఒక్కొక్క గొఱ్ఱెపిల్లతోకూడ దహనబలిమీదనేమి బలిమీదనేమి పోయుటకై ముప్పావు ద్రాక్షారసమును పానార్పణముగా సిద్ధపరచవలెను.౹

6 పొట్టేలుతోకూడ పడి నూనెతో కలుపబడిన నాలుగు పళ్ల పిండిని నైవేద్యముగా సిద్ధపరచవలెను.౹

7 పడి ద్రాక్షారసమును పానార్పణముగా తేవలెను; అది యెహోవాకు ఇంపైన సువాసన.౹

8 మ్రొక్కుబడిని చెల్లించుటకైనను యెహోవాకు సమాధానబలి నర్పించుటకైనను నీవు దహనబలిగానైనను బలిగానైనను కోడెదూడను సిద్ధపరచినయెడల

9 ఆ కోడెతోకూడ పడిన్నరనూనె కలుపబడిన ఆరుపళ్ల గోధుమపిండిని నైవేద్యముగా అర్పింపవలెను.౹

10 మరియు యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా

11 పడిన్నర ద్రాక్షారసమును పానీయార్పణముగా తేవలెను; ఒక్కొక్క కోడెతోకూడను ఒక్కొక్క పొట్టేలుతోకూడను, గొఱ్ఱెలలోనిదైనను మేకలలోనిదైనను ఒక్కొక్క పిల్లతోకూడను, ఆలాగు చేయవలెను.౹

12 మీరు సిద్ధపరచువాటి లెక్కనుబట్టి వాటి లెక్కలో ప్రతిదానికిని అట్లు చేయవలెను.౹

13 దేశములో పుట్టినవారందరు యెహోవాకు ఇంపైన సువాసనగల హోమార్పణమును తెచ్చునప్పుడు ఆలాగుననే చేయవలెను.౹

14 మీయొద్ద నివసించు పరదేశిగాని మీ తరతరములలో మీ మధ్యనున్నవాడెవడుగాని యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము అర్పింప గోరినప్పుడు మీరు చేయునట్లే అతడును చేయవలెను.౹

15 సంఘమునకు, అనగా మీకును మీలో నివసించు పరదేశికిని ఒక్కటే కట్టడ; అది మీ తరతరములకుండు నిత్యమైన కట్టడ; యెహోవా సన్నిధిని మీరున్నట్లే పరదేశియు ఉండును.౹

16 మీకును మీయొద్ద నివసించు పరదేశికిని ఒక్కటే యేర్పాటు, ఒక్కటే న్యాయవిధి యుండవలెను.

17 యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను–నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము

18 –నేను మిమ్మును కొని పోవుచున్న దేశములో మీరు ప్రవేశించిన తరువాత

19 మీరు ఆ దేశపు ఆహారమును తినునప్పుడు ప్రతిష్ఠార్పణమును యెహోవాకు అర్పింపవలెను.౹

20 మీరు మీ మొదటి పిండిముద్ద రొట్టెను ప్రతిష్ఠార్పణముగా అర్పింపవలెను; కళ్లపు అర్పణమువలె దాని అర్పింపవలెను.౹

21 మీ తరతరములకు మీ మొదటి పిండిముద్దలోనుండి ప్రతిష్ఠార్పణమును యెహోవాకు అర్పింపవలెను.

22 యెహోవా మోషేతో చెప్పిన యీ ఆజ్ఞలన్నిటిలో, అనగా

23 యెహోవా ఆజ్ఞాపించిన దినము మొదలుకొని అటుపైని మీ తరతరములకు యెహోవా మోషే ద్వారా మీకు ఆజ్ఞాపించినవాటిలో పొరబాటున దేనినైనను మీరు చేయకపోయినప్పుడు, అది సమాజమునకు తెలియ బడనియెడల

24 సర్వసమాజము యెహోవాకు ఇంపైన సువాసనగా నుండుటకై దహనబలిగా ఒక కోడెదూడను, విధిచొప్పున దాని నైవేద్యమును దాని పానీయార్పణమును పాపపరిహారార్థబలిగా ఒక మేకపిల్లను సిద్ధపరచవలెను.౹

25 యాజకుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను; తెలియకయే దాని చేసెను గనుక క్షమింపబడును. వారు పొరబాటున చేసిన పాపములనుబట్టి తమ అర్పణమును, అనగా యెహోవాకు చెందవలసిన హోమమును పాపపరిహారార్థబలిని యెహోవా సన్నిధికి తీసికొని రావలెను.౹

26 అప్పుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజమేమి, వారిమధ్యను నివసించు పరదేశియేమి క్షమాపణ నొందును; ఏలయనగా ప్రజలందరు తెలియకయే దాని చేయుట తటస్థించెను.౹

27 ఒకడు పొరబాటున పాపము చేసినయెడలవాడు పాప పరిహారార్థబలిగా ఏడాది ఆడుమేక పిల్లను తీసికొని రావలెను.౹

28 పొరబాటున యెహోవా సన్నిధిని దాని చేసెను గనుక తెలియకయే పాపముచేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయును; వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటవలనవాడు క్షమాపణ నొందును.౹

29 ఇశ్రాయేలీయులలో పుట్టినవాడేగాని వారిమధ్యను నివసించు పరదేశియేగాని పొరబాటున ఎవడైనను పాపము చేసినయెడల వానికిని మీకును విధి ఒక్కటే ఉండవలెను.౹

30 అయితే దేశమందు పుట్టినవాడేగాని పరదేశియేగాని యెవడైనను సాహసించి పాపముచేసినయెడల

31 వాడు యెహోవాను తృణీకరించినవాడగును గనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో నుండకుండ కొట్టి వేయబడును;వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును; వాని దోషశిక్షకు వాడే కారకుడు.

32 ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతిదినమున కట్టెలు ఏరుట చూచిరి.౹

33 వాడు కట్టెలు ఏరుట చూచినవారు మోషేయొద్దకును అహరోనునొద్దకును సర్వసమాజమునొద్దకును వానిని తీసికొని వచ్చిరి.౹

34 వానికి ఏమి చేయవలెనో అది విశదపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి.౹

35 తరువాత యెహోవా–ఆ మనుష్యుడు మరణశిక్ష నొందవలెను.౹

36 సర్వసమాజము పాళెము వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలెనని మోషేతో చెప్పెను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాళెము వెలుపలికి వాని తీసికొనిపోయి రాళ్లతో వాని చావగొట్టెను.

37 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

38 –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము. వారు తమ తర తరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసికొని అంచుల కుచ్చులమీద నీలిసూత్రము తగిలింపవలెను.౹

39-41 మీరు నా ఆజ్ఞలన్నిటిని జ్ఞాపకముచేసికొని మీ దేవునికి ప్రతిష్ఠితులైయుండునట్లుమునుపటివలె కోరినవాటినిబట్టియు చూచినవాటినిబట్టియు వ్యభిచరింపక, దాని చూచి యెహోవా ఆజ్ఞలన్నిటిని జ్ఞాపకముచేసికొని వాటి ననుసరించుటకే అది మీకు కుచ్చుగానుండును. నేను మీకు దేవుడనై యుండునట్లుగా ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను; మీ దేవుడనైన యెహోవాను నేనే.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/NUM/15-1215dd56092c7f9f4146f51bd9091498.mp3?version_id=1787—

Categories
సంఖ్యాకాండము

సంఖ్యాకాండము 16

1 లేవికి మునిమనుమడును కహాతుకు మనుమడును ఇస్హారు కుమారుడునగు కోరహు, రూబేనీయులలో ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములును, పేలెతు కుమారుడైన ఓనును యోచించుకొని

2 ఇశ్రాయేలీయులలో పేరుపొందిన సభికులును సమాజప్రధానులునైన రెండువందలయేబదిమందితో మోషేకు ఎదురుగా లేచి

3 మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి–మీతో మాకిక పనిలేదు; ఈ సర్వసమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే యెహోవావారి మధ్యనున్నాడు; యెహోవా సంఘముమీద మిమ్మును మీరేల హెచ్చించుకొనుచున్నారనగా,౹

4 మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరహుతోను వాని సమాజముతోను ఇట్లనెను

5 –తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకొనినవానిని తనయొద్దకు చేర్చు కొనును.౹

6 ఈలాగు చేయుడి; కోరహును అతని సమస్త సమూహమునైన మీరును ధూపార్తులను తీసికొని వాటిలో అగ్నియుంచి రేపు యెహోవా సన్నిధిని వాటిమీద ధూపద్రవ్యము వేయుడి.౹

7 అప్పుడు యెహోవా యే మనుష్యుని యేర్పరచుకొనునో వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకిక పనిలేదు.౹

8 మరియు మోషే కోరహుతో ఇట్లనెను–లేవి కుమారులారా వినుడి.౹

9 తన మందిరసేవచేయుటకు యెహోవా మిమ్మును తనయొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజములోనుండి మిమ్మును వేరు పరచుటయు మీకు అల్పముగా కనబడునా?

10 ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపువారినందరిని చేర్చుకొనెను గదా. అయితే మీరు యాజకత్వము కూడ కోరుచున్నారు.౹

11 ఇందు నిమిత్తము నీవును నీ సమస్తసమాజమును యెహోవాకు విరోధముగా పోగైయున్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సణుగ నేల అనెను.౹

12 అప్పుడు మోషే ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములను పిలువనంపించెను.౹

13 అయితే వారు–మేము రాము; ఈ అరణ్యములో మమ్మును చంపవలెనని పాలు తేనెలు ప్రవహించు దేశములోనుండి మమ్మును తీసికొనివచ్చుట చాలనట్టు, మామీద ప్రభుత్వము చేయుటకును నీకధికారము కావలెనా?

14 అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి మమ్మును తీసికొని రాలేదు; పొలములు ద్రాక్షతోటలుగల స్వాస్థ్యము మాకియ్యలేదు; ఈ మనుష్యుల కన్నులను ఊడదీయుదువా? మేము రాము అనిరి.౹

15 అందుకు మోషే మిక్కిలి కోపించి–నీవు వారి నైవేద్యమును లక్ష్యపెట్టకుము. ఒక్క గాడిదనైనను వారియొద్ద నేను తీసికొనలేదు; వారిలో ఎవనికిని నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవిచేసెను.౹

16 మరియు మోషే కోరహుతో– నీవును నీ సర్వసమూహమును, అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధిని నిలువవలెను.౹

17 మీలో ప్రతివాడును తన తన ధూపార్తిని తీసికొని వాటిమీద ధూపద్రవ్యము వేసి, ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకొని రెండువందల ఏబది ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవలెను, నీవును అహరోనును ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవలెనని చెప్పెను.౹

18 కాబట్టి వారిలో ప్రతివాడును తన ధూపార్తిని తీసికొని వాటిలో అగ్నియుంచి వాటిమీద ధూప ద్రవ్యము వేసినప్పుడు, వారును మోషే అహరోనులును ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్ద నిలిచిరి.౹

19 కోరహు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునొద్దకు సర్వసమాజమును వారికి విరోధముగా పోగుచేయగా యెహోవా మహిమ సర్వసమాజమునకు కనబడెను.౹

20 అప్పుడు యెహోవా–మీరు ఈ సమాజములోనుండి అవతలికి వెళ్లుడి.౹

21 క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగా

22 వారు సాగిలపడి–సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, యీయొక్కడు పాపముచేసినందున ఈ సమస్త సమాజముమీద నీవు కోపపడుదువా? అని వేడు కొనిరి.౹

23-24 అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను–కోరహు దాతాను అబీరాములయొక్క నివాసముల చుట్టుపెట్లనుండి తొలగిపోవుడని జనసమాజముతో చెప్పుము.౹

25 అప్పుడు మోషే లేచి దాతాను అబీరాముల యొద్దకు వెళ్లగా ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్లిరి.౹

26 అతడు–ఈ దుష్టుల గుడారములయొద్దనుండి తొలగిపోవుడి; మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక యుండునట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను.౹

27 కాబట్టి వారు కోరహు దాతాను అబీరాముల నివాసములయొద్దనుండి ఇటు అటు లేచిపోగా, దాతాను అబీరాములును వారి భార్యలును వారి కుమారులును వారి పసిపిల్లలును తమ గుడారముల ద్వారమున నిలిచిరి.౹

28 మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెననియు, నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీనివలన మీరు తెలిసికొందురు.౹

29 మనుష్యులందరికి వచ్చు మరణమువంటి మరణము వీరు పొందినయెడలను, సమస్త మనుష్యులకు కలుగునదే వీరికి కలిగినయెడలను, యెహోవా నన్ను పంపలేదు.౹

30 అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుటవలనవారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరుతెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మ్రింగి వేసినయెడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియుననెను.౹

31 అతడు ఆ మాటలన్నియు చెప్పి చాలించ గానే వారి క్రింది నేల నెరవిడిచెను.౹

32 భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరిని వారి సమస్త సంపాద్యమును మ్రింగివేసెను.౹

33 వారును వారి సంబంధులందరును ప్రాణముతో పాతాళములో కూలిరి; భూమి వారిని మ్రింగివేసెను; వారు సమాజములో ఉండకుండ నశించిరి.౹

34 వారి చుట్టునున్న ఇశ్రాయేలీయులందరు వారి ఘోష విని–భూమి మనలను మ్రింగివేయునేమో అనుకొనుచు పారిపోయిరి.౹

35 మరియు యెహోవాయొద్దనుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ రెండువందల ఏబదిమందిని కాల్చి వేసెను.౹

36 అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను–నీవు యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుతో ఇట్లనుము–ఆ అగ్నిమధ్యనుండి ఆ ధూపార్తులను ఎత్తుము, అవి ప్రతిష్ఠితమైనవి.౹

37 ఆ అగ్నిని దూరముగా చల్లుము.౹

38 పాపముచేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకొనిన వీరి ధూపార్తులను తీసికొని బలిపీఠమునకు కప్పుగా వెడల్పయిన రేకులను చేయవలెను. వారు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి; అవి ఇశ్రాయేలీయులకు ఆనవాలుగా ఉండును.౹

39-40 అహరోను సంతాన సంబంధికాని అన్యుడెవడును యెహోవా సన్నిధిని ధూపము అర్పింప సమీపించి, కోరహువలెను అతని సమాజమువలెను కాకుండునట్లు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకసూచనగా ఉండుటకై యాజకుడైన ఎలియాజరు కాల్చబడినవారు అర్పించిన యిత్తడి ధూపార్తులను తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠమునకు కప్పుగా వెడల్పయిన రేకులు చేయించెను.

41 మరునాడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము మోషే అహరోనులకు విరోధముగా సణుగుచు–మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి

42 సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారమువైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను; యెహోవా మహిమయు కనబడెను.౹

43 మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి రాగా

44 యెహోవా–మీరు ఈ సమాజము మధ్యనుండి తొలగి పోవుడి,౹

45 క్షణములో నేను వారిని నశింపజేయుదునని మోషేకు సెలవియ్యగా వారు సాగిలపడిరి.౹

46 అప్పుడు మోషే–నీవు ధూపార్తిని తీసికొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపమువేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్లి వారినిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము; కోపము యెహోవా సన్నిధినుండి బయలుదేరెను; తెగులు మొదలు పెట్టెనని అహరోనుతో చెప్పగా

47 మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసికొని సమాజముమధ్యకు పరుగెత్తి పోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి యుండెను; కాగా అతడు ధూపమువేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను.౹

48 అతడు చచ్చినవారికిని బ్రతికియున్న వారికినిమధ్యను నిలువబడగా తెగులు ఆగెను.౹

49 కోరహు తిరుగుబాటున చనిపోయినవారు గాక పదునాలుగువేల ఏడువందలమంది ఆ తెగులుచేత చచ్చిరి.౹

50 ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము దగ్గరనున్న మోషేయొద్దకు తిరిగి వచ్చెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/NUM/16-b5637ec335aa1229c3a39f284df5a5dd.mp3?version_id=1787—

Categories
సంఖ్యాకాండము

సంఖ్యాకాండము 17

1 యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.౹

2 –నీవు ఇశ్రాయేలీయులతో మాటలాడి వారియొద్ద నొక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కఱ్ఱగా, అనగా వారి ప్రధానులందరియొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున పండ్రెండు కఱ్ఱలను తీసికొని యెవరి కఱ్ఱమీద వారిపేరు వ్రాయుము.౹

3 లేవికఱ్ఱమీద అహరోను పేరు వ్రాయవలెను; ఏలయనగా పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక్క కఱ్ఱయే యుండవలెను.౹

4 నేను మిమ్మును కలిసికొను ప్రత్యక్షపు గుడారములోని శాసనములయెదుట వాటిని ఉంచవలెను.౹

5 అప్పుడు నేను ఎవని ఏర్పరచుకొందునో వాని కఱ్ఱ చిగిరించును. ఇశ్రాయేలీయులు మీకు విరోధముగా సణుగుచుండు సణుగులు నాకు వినబడకుండ మాన్పివేయుదును.౹

6 కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో చెప్పగా వారి ప్రధానులందరు తమతమపితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కఱ్ఱ చొప్పున పండ్రెండు కఱ్ఱలను అతనికిచ్చిరి; అహరోను కఱ్ఱయు వారి కఱ్ఱలమధ్యనుండెను.౹

7 మోషే వారి కఱ్ఱలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను.౹

8 మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్లి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కఱ్ఱ చిగిర్చి యుండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లుగలదాయెను.

9 మోషే యెహోవా సన్నిధినుండి ఆ కఱ్ఱలన్నిటిని ఇశ్రాయేలీయులందరి యెదుటికి తేగా వారు వాటిని చూచియొక్కొక్కడు ఎవరి కఱ్ఱను వారు తీసికొనిరి.౹

10 అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను–తిరుగబడిన వారినిగూర్చి ఆనవాలుగా కాపాడబడునట్లు, అహరోను కఱ్ఱను మరల శాసనముల యెదుట ఉంచుము. వారు చావకుండునట్లు నాకు వినబడకుండ వారి సణుగులను కేవలము అణచి మాన్పివేసిన వాడవౌదువు.౹

11 అప్పుడు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను; ఆలాగుననే చేసెను.౹

12 అయితే ఇశ్రాయేలీయులు మోషేతో ఇట్లనిరి–ఇదిగో మా ప్రాణములు పోయినవి; నశించిపోతిమి మేమందరము నశించిపోతిమి.౹

13 యెహోవా మందిరమునకు సమీపించు ప్రతివాడును చచ్చును; మేము అందరము చావవలసియున్నదా? అని పలికిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/NUM/17-d5811436c242cc36024bf99cf4f06233.mp3?version_id=1787—

Categories
సంఖ్యాకాండము

సంఖ్యాకాండము 18

1 యెహోవా అహరోనుతో ఇట్లనెను–నీవును నీ కుమారులును నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధస్థలపు సేవ లోని దోషములకు ఉత్తరవాదులు; నీవును నీ కుమారులును మీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు

2 మరియు నీ తండ్రి గోత్రమును, అనగా లేవీ గోత్రికులైన నీ సహోదరులను నీవు దగ్గరకు తీసికొని రావలెను; వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు. అయితే నీవును నీ కుమారులును సాక్ష్యపు గుడారము ఎదుట సేవచేయవలెను

3 వారు నిన్నును గుడారమంతటిని కాపాడుచుండవలెను. అయితే వారును మీరును చావకుండునట్లువారు పరిశుద్ధస్థలముయొక్క ఉపకరణములయొద్దకైనను బలిపీఠము నొద్దకైనను సమీపింపవలదు.౹

4 వారు నీతో కలిసి ప్రత్యక్షపు గుడారములోని సమస్త సేవవిషయములో దాని కాపాడవలెను.౹

5 అన్యుడు మీయొద్దకు సమీపింపకూడదు; ఇకమీదట మీరు పరిశుద్ధస్థలమును బలిపీఠమును కాపాడవలెను; అప్పుడు ఇశ్రాయేలీయులమీదికి కోపము రాదు.౹

6 ఇదిగో నేను ఇశ్రాయేలీయులమధ్యనుండి లేవీయులైన మీ సహోదరులను తీసికొని యున్నాను; ప్రత్యక్షపు గుడారముయొక్క సేవచేయుటకు వారు యెహోవావలన మీ కప్పగింపబడియున్నారు.౹

7 కాబట్టి నీవును నీ కుమారులును బలిపీఠపు పనులన్నిటి విషయములోను అడ్డతెరలోపలి దాని విషయములోను యాజకత్వము జరుపుచు సేవచేయవలెను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకిచ్చియున్నాను; అన్యుడు సమీపించినయెడల మరణశిక్ష నొందును.

8 మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను–ఇదిగో ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠించువాటన్నిటిలో నా ప్రతి ష్ఠార్పణములను కాపాడు పని నీకిచ్చియున్నాను; అభిషేకమునుబట్టి నిత్యమైన కట్టడవలన నీకును నీ కుమారులకును నేనిచ్చియున్నాను.౹

9 అగ్నిలో దహింపబడని అతి పరిశుద్ధమైన వాటిలో నీకు రావలసినవేవనగా, వారి నైవేద్యములన్నిటిలోను, వారి పాపపరిహారార్థ బలులన్ని టిలోను, వారి అపరాధ పరిహారార్థ బలులన్నిటిలోను వారు నాకు తిరిగి చెల్లించు అర్పణములన్నియు నీకును నీ కుమారులకును అతిపరిశుద్ధమైనవగును, అతిపరిశుద్ధస్థలములో మీరు వాటిని తినవలెను.౹

10 ప్రతి మగవాడును దానిని తినవలెను; అది నీకు పరిశుద్ధముగా ఉండును.౹

11 మరియు వారి దానములలో ప్రతిష్ఠింపబడినదియు, ఇశ్రాయేలీయులు అల్లాడించు అర్పణములన్నియు నీవగును. నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడవలన వాటి నిచ్చితిని; నీ యింటిలోని పవిత్రులందరును వాటిని తినవచ్చును.౹

12 వారు యెహోవాకు అర్పించు వారి ప్రథమ ఫలములను, అనగా నూనెలో ప్రశస్తమైనదంతయు, ద్రాక్షారస ధాన్యములలో ప్రశస్తమైనదంతయు నీకిచ్చితిని.౹

13 వారు తమ దేశపు పంటలన్నిటిలో యెహోవాకు తెచ్చు ప్రథమ ఫలములు నీవి యగును; నీ యింటిలోని పవిత్రులందరు వాటిని తినవచ్చును.౹

14 ఇశ్రాయేలీయులలో మీదు కట్టబడిన ప్రతి వస్తువు నీదగును.౹

15 మనుష్యులలోనిదేమి జంతువులలోనిదేమి, వారు యెహోవాకు అర్పించు సమస్త ప్రాణులలోని ప్రతి తొలిచూలు నీదగును. అయితే మనుష్యుని తొలిచూలి పిల్లను వెలయిచ్చి విడిపింపవలెను.౹

16 అపవిత్ర జంతువుల తొలిచూలిపిల్లను వెలయిచ్చి విడిపింపవలెను. విడిపింపవలసిన వాటిని పుట్టిన నెలనాటికి నీవు ఏర్పరచిన వెలచొప్పున, పరిశుద్ధమందిరముయొక్క తులపు పరిమాణమునుబట్టి అయిదు తులముల వెండియిచ్చి వాటిని విడిపింపవలెను. తులము ఇరువది చిన్నములు.౹

17 అయితే ఆవుయొక్క తొలిచూలిని గొఱ్ఱెయొక్క తొలిచూలిని మేకయొక్క తొలిచూలిని విడిపింపకూడదు; అవి ప్రతిష్ఠితమైనవి; వాటి రక్తమును నీవు బలిపీఠముమీద ప్రోక్షించి యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు వాటి క్రొవ్వును దహింపవలెనుగాని వాటి మాంసము నీదగును.౹

18 అల్లాడింపబడు బోరయు కుడిజబ్బయు నీదైనట్లు అదియు నీదగును.౹

19 ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్ఠార్పణములన్నిటిని నేను నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నిత్యమైన కట్టడనుబట్టి యిచ్చితిని. అది నీకును నీతోపాటు నీ సంతతికిని యెహోవా సన్నిధిని నిత్యమును స్థిరమైన నిబంధన.౹

20 మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను–వారి దేశములో నీకు స్వాస్థ్యము కలుగదు; వారిమధ్యను నీకు పాలు ఉండదు; ఇశ్రాయేలీయులమధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే.

21 ఇదిగో లేవీయులుచేయు సేవకు, అనగా ప్రత్యక్షపు గుడారముయొక్క సేవకు నేను ఇశ్రాయేలీయులయొక్క దశమభాగములన్నిటిని వారికి స్వాస్థ్యముగా ఇచ్చితిని.౹

22 ఇశ్రాయేలీయులు పాపము తగిలి చావకుండునట్లువారు ఇకమీదట ప్రత్యక్షపు గుడారమునకు రాకూడదు.౹

23 అయితే లేవీయులు ప్రత్యక్షపు గుడారముయొక్క సేవ చేసి, వారి సేవలోని దోషములకు తామే ఉత్తరవాదులైయుందురు. ఇశ్రాయేలీయులమధ్యను వారికి స్వాస్థ్య మేమియు ఉండదు. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ.౹

24 అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా అర్పించు దశమభాగములను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చితిని. అందుచేతను వారు ఇశ్రాయేలీయులమధ్యను స్వాస్థ్యము సంపాదింపకూడదని వారితో చెప్పితిని.

25 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

26 –నీవు లేవీయులతో ఇట్లనుము–నేను ఇశ్రాయేలీయులచేత మీకు స్వాస్థ్యముగా ఇప్పించిన దశమభాగమును మీరు వారియొద్ద పుచ్చుకొనునప్పుడు మీరు దానిలో, అనగా ఆ దశమభాగములో దశమభాగమును యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా చెల్లింపవలెను.౹

27 మీకు వచ్చు ప్రతిష్ఠార్పణము కళ్లపు పంటవలెను ద్రాక్షల తొట్టి ఫలమువలెను ఎంచవలెను.౹

28 అట్లు మీరు ఇశ్రాయేలీయులయొద్ద పుచ్చుకొను మీ దశమభాగములన్నిటిలోనుండి మీరు ప్రతిష్ఠార్పణమును యెహోవాకు చెల్లింపవలెను. దానిలోనుండి మీరు యెహోవాకు ప్రతిష్ఠించు అర్పణమును యాజకుడైన అహరోనుకు ఇయ్యవలెను.౹

29 మీకియ్యబడు వాటన్నిటిలో ప్రశస్తమైన దానిలోనుండి యెహోవాకు ప్రతిష్ఠించు ప్రతి అర్పణమును, అనగా దాని ప్రతిష్ఠితభాగమును దానిలోనుండి ప్రతిష్ఠింపవలెను.౹

30 మరియు నీవు వారితో మీరు దానిలోనుండి ప్రశస్తభాగమును అర్పించిన తరువాత మిగిలినది కళ్లపువచ్చుబడివలెను ద్రాక్షతొట్టి వచ్చుబడివలెను లేవీయులదని యెంచవలెను.౹

31 మీరును మీ కుటుంబికులును ఏ స్థలమందైనను దానిని తినవచ్చును; ఏలయనగా ప్రత్యక్షపు గుడారములో మీరుచేయు సేవకు అది మీకు జీతము.౹

32 మీరు దానిలోనుండి ప్రశస్తభాగమును అర్పించిన తరువాత దానినిబట్టి పాపశిక్షను భరింపకుందురు; మీరు చావకుండునట్లు ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠితమైనవాటిని అపవిత్రపరచకూడదని చెప్పుము.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/NUM/18-cb51369ba8bf347241e5313ddc10b5ef.mp3?version_id=1787—

Categories
సంఖ్యాకాండము

సంఖ్యాకాండము 19

1 యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను

2 –యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి యేదనగా, ఇశ్రాయేలీయులు కళంకములేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడును కాడి మోయనిదియునైన యెఱ్ఱని పెయ్యను నీయొద్దకు తీసికొని రావలెనని వారితో చెప్పుము.౹

3 మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపవలెను. ఒకడు పాళెము వెలుపలికి దాని తోలుకొనిపోయి అతని యెదుట దానిని వధింపవలెను.౹

4 యాజకుడైన ఎలియాజరు దాని రక్తములోనిది కొంచెము వ్రేలితో తీసి ప్రత్యక్షపు గుడారము ఎదుట ఆ రక్తములో కొంచెము ఏడుమారులు ప్రోక్షింపవలెను;౹

5 అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలెను. దాని చర్మమును మాంసమును రక్తమును పేడయును దహింపవలెను.౹

6 మరియు ఆయాజకుడు దేవదారు కఱ్ఱను హిస్సోపును రక్తవర్ణపునూలును తీసికొని, ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలెను.౹

7 అప్పుడు ఆయాజకుడు తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో శిరస్స్నానము చేసిన తరువాత పాళెములో ప్రవేశించి సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును.౹

8 దాని దహించినవాడు నీళ్లతో తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో శిరస్స్నానము చేసి సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును.౹

9 మరియు పవిత్రుడైన యొకడు ఆ పెయ్యయొక్క భస్మమును పోగుచేసి పాళెము వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాపపరిహార జలముగా ఇశ్రాయేలీయుల సమాజమునకు దాని భద్రముచేయవలెను; అది పాపపరిహారార్థబలి.౹

10 ఆ పెయ్యయొక్క భస్మమును పోగుచేసినవాడు తన బట్టలు ఉదుకుకొని సాయంకాలమువరకు అపవిత్రుడైయుండును. ఇది ఇశ్రాయేలీయులకును వారిలో నివసించు పరదేశులకును నిత్యమైన కట్టడ.౹

11 ఏ నరశవమునైనను ముట్టినవాడు ఏడు దినములు అప విత్రుడైయుండును.౹

12 అతడు మూడవదినమున ఆ జలముతో పాపశుద్ధి చేసికొని యేడవదినమున పవిత్రుడగును. అయితేవాడు మూడవదినమున పాపశుద్ధి చేసికొనని యెడల ఏడవదినమున పవిత్రుడుకాడు.౹

13 నరశవమును ముట్టినవాడు అట్లు పాపశుద్ధి చేసికొననియెడలవాడు యెహోవా మందిరమును అపవిత్రపరచువాడగును. ఆ మనుష్యుడు ఇశ్రాయేలీయులలోనుండి కొట్టివేయబడును. పాపపరిహార జలము వానిమీద ప్రోక్షింపబడలేదు గనుకవాడు అపవిత్రుడు, వాని అపవిత్రత యింక వానికుండును.౹

14 ఒకడు ఒక గుడారములో చచ్చినయెడల దానిగూర్చిన విధి యిది. ఆ గుడారములో ప్రవేశించు ప్రతివాడును ఆ గుడారములోనున్నది యావత్తును ఏడు దినములు అపవిత్రముగా నుండును.౹

15 మూత వేయబడక తెరచియున్న ప్రతిపాత్రయు అపవిత్రమగును.౹

16 బయట పొలములో ఖడ్గముతో నరకబడినవానినైనను, శవమునైనను మనుష్యుని యెముకనైనను సమాధినైనను ముట్టువాడు ఏడు దినములు అపవిత్రుడైయుండును.౹

17 అపవిత్రుని కొరకు వారు పాప పరిహారార్థమైన హోమభస్మము లోనిది కొంచెము తీసికొనవలెను; పాత్రలో వేయబడిన ఆ భస్మముమీద ఒకడు పారు నీళ్లు పోయవలెను.౹

18 తరువాత పవిత్రుడైన యొకడు హిస్సోపు తీసికొని ఆ నీళ్లలో ముంచి, ఆ గుడారముమీదను దానిలోని సమస్తమైన ఉపకరణములమీదను అక్కడనున్న మనుష్యులమీదను, ఎముకనేగాని నరకబడిన వానినేగాని శవమునేగాని సమాధినేగాని ముట్టినవాని మీదను దానిని ప్రోక్షింపవలెను.౹

19 మూడవదినమున ఏడవదినమున పవిత్రుడు అపవిత్రునిమీద దానిని ప్రోక్షింపవలెను. ఏడవ దినమునవాడు పాపశుద్ధి చేసికొని తన బట్టలు ఉదుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలమున పవిత్రుడగును.౹

20 అపవిత్రుడు పాపశుద్ధిచేసికొనని యెడల అట్టి మనుష్యుడు సమాజములోనుండి కొట్టివేయబడును;వాడు యెహోవా పరిశుద్ధస్థలమును అపవిత్రపరచెను; పాపపరిహార జలము వానిమీద ప్రోక్షింపబడలేదు;వాడు అపవిత్రుడు.౹

21 వారికి నిత్యమైన కట్టడ ఏదనగా, పాపపరిహార జలమును ప్రోక్షించువాడు తన బట్టలు ఉదుకుకొనవలెను; పాపపరి హార జలమును ముట్టువాడు సాయంకాలమువరకు అప విత్రుడైయుండును; అపవిత్రుడు ముట్టునది యావత్తును అపవిత్రము.౹

22 దాని ముట్టు మనుష్యులందరు సాయంకాలమువరకు అపవిత్రులైయుందురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/NUM/19-6a4b3ac697fd9583939883e79adb3c19.mp3?version_id=1787—

Categories
సంఖ్యాకాండము

సంఖ్యాకాండము 20

1 మొదటి నెలయందు ఇశ్రాయేలీయుల సర్వసమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేషులో దిగిరి. అక్కడ మిర్యాము చనిపోయి పాతిపెట్టబడెను.౹

2 ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందునవారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి.౹

3 జనులు మోషేతో వాదించుచు–అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయినయెడల ఎంతో మేలు

4 అయితే మేమును మా పశువులును ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరేల తెచ్చితిరి?

5 ఈ కానిచోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులోనుండి మమ్మును ఏల రప్పించితిరి? ఈ స్థలములో గింజలు లేవు అంజూరలు లేవు ద్రాక్షలు లేవు దానిమ్మలు లేవు త్రాగుటకు నీళ్లే లేవనిరి.౹

6 అప్పుడు మోషే అహరోనులు సమాజము ఎదుటనుండి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారములోనికి వెళ్లి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను.౹

7 అంతట యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను

8 –నీవు నీ కఱ్ఱను తీసికొని, నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగుచేసి వారి కన్నుల యెదుట ఆ బండతో మాటలాడుము. అది నీళ్లనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలోనుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము.౹

9 యెహోవా అతని కాజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధినుండి ఆ కఱ్ఱను తీసికొని పోయెను.౹

10 తరువాత మోషే అహరోనులు ఆ బండ యెదుట సమాజమును పోగుచేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి; మేము ఈ బండలోనుండి మీకొరకు నీళ్లు రప్పింపవలెనా? అనెను.౹

11 అప్పుడు మోషే తన చెయ్యి యెత్తి రెండుమారులు తన కఱ్ఱతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను; సమాజమును పశువులును త్రాగెను.౹

12 అప్పుడు యెహోవా మోషే అహరోనులతో మీరు ఇశ్రాయేలీయుల కన్నుల యెదుట నా పరిశుద్ధతను సన్మానించునట్లు నన్ను నమ్ము కొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను.౹

13 అవి మెరీబాజలమనబడెను; ఏలయనగా ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారిమధ్యను తన్ను పరిశుద్ధపరచుకొనెను.

14 మోషే కాదేషునుండి ఎదోము రాజునొద్దకు దూతలను పంపి–నీ సహోదరుడగు ఇశ్రాయేలు అడుగున దేమనగా–మాకు వచ్చిన కష్టము యావత్తును నీకు తెలిసినది;౹

15 మా పితరులు ఐగుప్తునకు వెళ్లిరి; మేము చాలాదినములు ఐగుప్తులో నివసించితిమి; ఐగుప్తీయులు మమ్మును మా పితరులను శ్రమపెట్టిరి.౹

16 మేము యెహోవాకు మొఱ పెట్టగా ఆయన మా మొఱను విని, దూతను పంపి ఐగుప్తులోనుండి మమ్మును రప్పించెను. ఇదిగో మేము నీ పొలిమేరల చివర కాదేషు పట్టణములో ఉన్నాము.౹

17 మమ్మును నీ దేశమును దాటి పోనిమ్ము; పొలములలో బడియైనను ద్రాక్షతోటలలో బడియైనను వెళ్లము; బావుల నీళ్లు త్రాగము; రాజమార్గమున నడిచిపోయెదము. నీ పొలిమేరలను దాటువరకు కుడివైపునకైనను ఎడమవైపున కైనను తిరుగకుండ పోయెదమని చెప్పించెను.౹

18 ఎదోమీయులు –నీవు నా దేశములోబడి వెళ్లకూడదు; నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వచ్చెదను సుమీ అని అతనితో చెప్పగా

19 ఇశ్రాయేలీయులు–మేము రాజమార్గముననే వెళ్లెదము; నేనును నా పశువులును నీ నీళ్లు త్రాగునెడల వాటి విలువ నిచ్చుకొందును మరేమి లేదు, కాలినడకనే దాటిపోవుదును; అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు–నీవు రానేకూడదనెను.౹

20 అంతట ఎదోము బహుజనముతోను మహా బలముతోను బయలుదేరి వారి కెదురుగా వచ్చెను.౹

21 ఎదోము ఇశ్రాయేలు తన పొలి మేరలలోబడి దాటిపోవుటకు సెలవియ్యలేదు గనుక ఇశ్రాయేలీయులు అతనియొద్దనుండి తొలగిపోయిరి.

22 అప్పుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము కాదేషులోనుండి సాగి హోరు కొండకు వచ్చెను.౹

23 యెహోవా ఎదోము పొలిమేరలయొద్దనున్న హోరు కొండలో మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను

24 –అహరోను తన పితరులతో చేర్చబడును; ఏలయనగా మెరీబా నీళ్లయొద్ద మీరు నా మాట వినక నామీద తిరుగుబాటు చేసితిరి గనుక నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు.౹

25-26 నీవు అహరోనును అతని కుమారుడైన ఎలియాజరును తోడుకొని హోరు కొండయెక్కి, అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించుము. అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును.౹

27 యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేసెను. సర్వసమాజము చూచుచుండగా వారు హోరు కొండ నెక్కిరి.౹

28 మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించెను. అహరోను కొండశిఖరమున చనిపోయెను. తరువాత మోషేయు ఎలియాజరును ఆ కొండదిగివచ్చిరి.౹

29 అహరోను చనిపోయెనని సర్వసమాజము గ్రహించినప్పుడు ఇశ్రాయేలీయుల కుటుంబికులందరును అహరోనుకొరకు ముప్పది దినములు దుఃఖము సలిపిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/NUM/20-8ee639ba445cfbd98628d0c7da35886d.mp3?version_id=1787—

Categories
సంఖ్యాకాండము

సంఖ్యాకాండము 21

1 ఇశ్రాయేలీయులు అతారీయుల మార్గమున వచ్చుచున్నారని దక్షిణదిక్కున నివసించిన కనానీయుడైన అరాదు రాజు విని, అతడు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసి వారిలో కొందిరిని చెరపట్టగా

2 ఇశ్రాయేలీయులు యెహోవాకు మ్రొక్కుకొని – నీవు మా చేతికి ఈ జనమును బొత్తిగా అప్పగించినయెడల మేము వారి పట్టణములను నీ పేరట నిర్మూలము చేసెదమనిరి.౹

3 యెహోవా ఇశ్రాయేలీయుల మాట ఆలకించి ఆ కనానీయులను అప్పగింపగా ఇశ్రాయేలీయులు వారిని వారి పట్టణములను నిర్మూలము చేసిరి. అందువలన ఆ చోటికి హోర్మాఅను పేరు పెట్టబడెను.

4 వారు ఎదోముదేశమును చుట్టి పోవలెనని హోరు కొండనుండి ఎఱ్ఱసముద్రమార్గముగా సాగినప్పుడు మార్గా యాసముచేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను.౹

5 కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి– ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులోనుండి మీరు మమ్ము నెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని యీ అన్నము మాకు అసహ్యమైనదనిరి.౹

6 అందుకు యెహోవా ప్రజలలోనికి తాప కరములైన సర్పములను పంపెను; అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి.౹

7 కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి–మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపము చేసితిమి; యెహోవా మా మధ్యనుండి ఈ సర్పములను తొలగించునట్లు ఆయనను వేడుకొనుమనిరి.౹

8 మోషే ప్రజలకొరకు ప్రార్థనచేయగా యెహోవా–నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభముమీద పెట్టుము; అప్పుడు కరవబడిన ప్రతివాడును దానివైపుచూచి బ్రదుకు నని మోషేకు సెలవిచ్చెను.౹

9 కాబట్టి మోషే ఇత్తడి సర్ప మొకటి చేయించి స్తంభముమీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపుకాటు తినిన ప్రతివాడు ఆ యిత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రదికెను.౹

10 తరువాత ఇశ్రాయేలీయులు సాగి ఓబోతులో దిగిరి.౹

11 ఓబోతులోనుండి వారు సాగి సూర్యోదయదిక్కున, అనగా మోయాబు ఎదుట అరణ్యమందలి ఈయ్యె అబారీమునొద్ద దిగిరి.౹

12 అక్కడనుండి వారు సాగి జెరెదు లోయలో దిగిరి.౹

13 అక్కడనుండి వారు సాగి అమోరీయుల పొలిమేరలనుండి వచ్చి ప్రవహించి అరణ్యమందు సంచరించు అర్నోను అద్దరిని దిగిరి. అర్నోను మోయాబీయులకును అమోరీయులకును మధ్యనుండు మోయాబు సరిహద్దు.౹

14-15 కాబట్టి –యెహోవా సుడిగాలిచేతనైనట్టు వాహేబును అర్నో నులో పడు ఏరులను ఆరు దేశ నివాసస్థలమునకు తిరిగి మోయాబు ప్రాంతములకు సమీపముగా ప్రవహించు ఏరుల మడుగులను పట్టుకొనెననుమాట యెహోవా యుద్ధముల గ్రంథములో వ్రాయబడియున్నది.౹

16 అక్కడనుండి వారు బెయేరుకు వెళ్లిరి. యెహోవా జనులను పోగు చేయుము, నేను వారికి నీళ్ల నిచ్చెదనని మోషేతో చెప్పిన బావి అది.౹

17 అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడిరి–

బావీ ఉబుకుము. దాని కీర్తించుడి

బావీ; యేలికలు దాని త్రవ్విరి

18 తమ అధికార దండములచేతను కఱ్ఱలచేతను

జనుల అధికారులు దాని త్రవ్విరి.

19 వారు అరణ్యమునుండి మత్తానుకును మత్తానునుండి నహలీయేలుకును నహలీయేలునుండి బామోతుకును

20 మోయాబు దేశమందలి లోయలోనున్న బామోతునుండి యెడారికి ఎదురుగానున్న పిస్గాకొండకు వచ్చిరి.

21 ఇశ్రాయేలీయులు అమోరీయుల రాజైన సీహోను నొద్దకు దూతలను పంపి–మమ్మును నీ దేశములో బడి వెళ్లనిమ్ము.౹

22 మేము పొలములకైనను ద్రాక్ష తోటలకైనను పోము; బావుల నీళ్లు త్రాగము; మేము నీ పొలిమేరలను దాటువరకు రాజమార్గములోనే నడిచి పోదుమని అతనితో చెప్పించిరి.౹

23 అయితే సీహోను ఇశ్రాయేలీయులను తన పొలిమేరలను దాటనియ్యలేదు. మరియు సీహోను తన సమస్త జనమును కూర్చుకొని ఇశ్రాయేలీయులను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్లి, యాహజుకు వచ్చి ఇశ్రాయేలీయులతో యుద్ధముచేసెను.౹

24 ఇశ్రాయేలీయులు వానిని కత్తివాత హతముచేసి, వాని దేశమును అర్నోను మొదలుకొని యబ్బోకువరకు, అనగా అమ్మోనీయుల దేశమువరకు స్వాధీనపరచుకొనిరి. అమ్మోనీయుల పొలి మేర దుర్గమమైనది.౹

25 అయినను ఇశ్రాయేలీయులు ఆ పట్టణములన్నిటిని పట్టుకొనిరి. ఇశ్రాయేలీయులు అమోరీయుల పట్టణములన్నిటిలోను హెష్బోనులోను దాని పల్లె లన్నిటిలోను దిగిరి.౹

26 హెష్బోను అమోరీయుల రాజైన సీహోను పట్టణము; అతడు అంతకుమునుపు మోయాబు రాజుతో యుద్ధముచేసి అర్నోనువరకు వాని దేశమంతయు పట్టుకొనెను.౹

27 కాబట్టి సామెతలు పలుకు కవులు ఇట్లు చెప్పుదురు–

హెష్బోనుకు రండి

సీహోను పట్టణమును కట్టవలెను

దానిని స్థాపింపవలెను

28 హెష్బోనునుండి అగ్ని బయలువెళ్లెను

సీహోను పట్టణమునుండి జ్వాలలు బయలువెళ్లెను

అది మోయాబునకు చేరిన ఆరు దేశమును కాల్చెను

అర్నోనుయొక్క ఉన్నతస్థలముల ప్రభువులను కాల్చెను.

29 మోయాబూ, నీకు శ్రమ

కెమోషు జనులారా, మీరు నశించితిరి

తప్పించుకొనిన తన కుమారులను తన కుమార్తెలను

అతడు అమోరీయులరాజైన సీహోనుకు చెరగా ఇచ్చెను.

30 వాటిమీద గురిపెట్టి కొట్టితిమి

దీబోనువరకు హెష్బోను నశించెను

నోఫహువరకు దాని పాడు చేసితిమి.

అగ్నివలన మేదెబావరకు పాడుచేసితిమి.

31 అట్లు ఇశ్రాయేలీయులు అమోరీయుల దేశములో దిగిరి.౹

32 మరియు యాజెరు దేశమును సంచరించి చూచుటకై మోషే మనుష్యులను పంపగా వారు దాని గ్రామములను వశము చేసికొని అక్కడనున్న అమోరీయులను తోలివేసిరి.౹

33 వారు తిరిగి బాషాను మార్గముగా వెళ్లినప్పుడు బాషానురాజైన ఓగును అతని సమస్త జనమును ఎద్రెయీలో యుద్ధము చేయుటకు వారిని ఎదుర్కొన బయలుదేరగా

34 యెహోవా మోషేతో నిట్లనెను–అతనికి భయపడకుము; నేను అతనిని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించితిని; నీవు హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్లు ఇతనికిని చేయుదువు.౹

35 కాబట్టి వారు అతనిని అతని కుమారులను అతనికి ఒక్కడైనను శేషించకుండ అతని సమస్త జనమును హతముచేసి అతని దేశమును స్వాధీనపరచుకొనిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/NUM/21-0ef0d4ec941c46e20fd503810ae88322.mp3?version_id=1787—

Categories
సంఖ్యాకాండము

సంఖ్యాకాండము 22

1 తరువాత ఇశ్రాయేలీయులు సాగి యెరికోకు ఎదురుగా యొర్దాను తీరముననున్న మోయాబు మైదానములలో దిగిరి.౹

2 సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయులకు చేసినదంతయు చూచెను.౹

3 జనము విస్తారముగా నున్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడిరి; మోయాబీయులు ఇశ్రాయేలీయులకు జంకిరి.౹

4 మోయాబీయులు మిద్యాను పెద్దలతో –ఎద్దు బీటి పచ్చికను నాకివేయునట్లు ఈ జనసమూహము మన చుట్టు ఉన్నది యావత్తును ఇప్పుడు నాకివేయు ననిరి. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు.౹

5 కాబట్టి అతడు బెయోరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నదియొద్దనున్న పెతోరుకు దూతలచేత ఈ వర్తమానము పంపెను–చిత్తగించుము; ఒక జనము ఐగుప్తులోనుండి వచ్చెను; ఇదిగో వారు భూతలమును కప్పి నా యెదుట దిగియున్నారు.౹

6 కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము; వారు నాకంటె బలవంతులు; వారిని హతము చేయుటకు నేను బలమొందుదునేమో; అప్పుడు నేను ఈ దేశములోనుండి వారిని తోలివేయుదును; ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు శపించువాడు శపించబడుననియు నేనెరుగుదును.౹

7 కాబట్టి మోయాబు పెద్దలును మిద్యాను పెద్దలును సోదె సొమ్మును చేతపట్టుకొని బిలామునొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా

8 అతడు వారితో–యీ రాత్రి ఇక్కడనే ఉండుడి; యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పెదననెను. అప్పుడు మోయాబు అధికారులు బిలాము నొద్ద బసచేసిరి.౹

9 దేవుడు బిలామునొద్దకు వచ్చి–నీ యొద్దనున్న యీ మనుష్యులు ఎవరని అడుగగా

10 బిలాము దేవునితో యిట్లనెను–సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు

11 –చిత్తగించుము; ఒక జనము ఐగుప్తునుండి బయలుదేరి వచ్చెను; వారు భూతలమును కప్పుచున్నారు; నీవు ఇప్పుడేవచ్చి నా నిమిత్తము వారిని శపింపుము; నేను వారితో యుద్ధముచేసి వారిని తోలివేయుదునేమో అని వీరిచేత నాకు వర్తమానము పంపెను.౹

12 అందుకు దేవుడు–నీవు వారితో వెళ్లకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడినవారు అని బిలాముతో చెప్పెను.౹

13 కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో–మీరు మీ స్వదేశమునకు వెళ్లుడి; మీతోకూడ వచ్చుటకు యెహోవా నాకు సెలవియ్యనని చెప్పుచున్నాడనగా

14 మోయాబు అధికారులు లేచి బాలాకు నొద్దకు వెళ్లి–బిలాము మాతోకూడ రానొల్లడాయెననిరి.౹

15 అయినను బాలాకు వారి కంటె బహు ఘనతవహించిన మరి యెక్కువ మంది అధికారులను మరల పంపెను.౹

16 వారు బిలామునొద్దకు వచ్చి అతనితో–నీవు దయచేసి నాయొద్దకు వచ్చుటకు ఏమియు అడ్డము చెప్పకుము.౹

17 నేను నీకు బహు ఘనత కలుగజేసెదను; నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసెదను గనుక నీవు దయచేసి వచ్చి, నా నిమిత్తము ఈ జనమును శపించుమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పెననిరి.౹

18 అందుకు బిలాము–బాలాకు తన యింటెడు వెండి బంగారములను నాకిచ్చినను కొద్దిపనినైనను గొప్పపనినైనను చేయునట్లు నేను నా దేవుడైన యెహోవా నోటిమాట మీరలేను.౹

19 కాబట్టి మీరు దయచేసి యీ రాత్రి ఇక్కడ నుండుడి; యెహోవా నాతోనిక నేమి చెప్పునో నేను తెలిసికొందునని బాలాకు సేవకులకు ఉత్తరమిచ్చెను.౹

20 ఆ రాత్రి దేవుడు బిలామునొద్దకువచ్చి–ఆ మనుష్యులు నిన్ను పిలువవచ్చినయెడల నీవు లేచి వారితో వెళ్లుము; అయితే నేను నీతో చెప్పిన మాటచొప్పుననే నీవు చేయవలెనని అతనికి సెలవిచ్చెను.౹

21 ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతోకూడ వెళ్లెను.౹

22 అతడు వెళ్లుచుండగా దేవుని కోపము రగులుకొనెను; యెహోవాదూత అతనికి విరోధియై త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితోకూడ నుండిరి.౹

23 యెహోవాదూత ఖడ్గము దూసి చేతపట్టుకొని త్రోవలో నిలిచి యుండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. బిలాము గాడిదను దారికి మలుపవలెనని దాని కొట్టగా

24 యెహోవాదూత యిరుప్రక్కలను గోడలుగల ద్రాక్షతోటల సందులో నిలిచెను.౹

25 గాడిద యెహోవాదూతను చూచి గోడమీదపడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాని మరల కొట్టెను.౹

26 యెహోవాదూత ముందు వెళ్లుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారిలేని యిరుకు చోటను నిలువగా

27 గాడిద యెహోవాదూతను చూచి బిలాముతోకూడ క్రింద కూలబడెను గనుక బిలాము కోపముమండి తన చేతి కఱ్ఱతో గాడిదను కొట్టెను.౹

28 అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కు నిచ్చెను గనుక అది–నీవు నన్ను ముమ్మారు కొట్టితివి; నేను నిన్నేమి చేసితినని బిలాముతో అనగా

29 బిలాము–నీవు నామీద తిరుగబడితివి; నాచేత ఖడ్గమున్నయెడల నిన్ను చంపియుందునని గాడిదతో అనెను.౹

30 అందుకు గాడిద– నేను నీదాననైనది మొదలుకొని నేటివరకు నీవు ఎక్కుచు వచ్చిన నీ గాడిదను కానా? నేనెప్పుడైన నీకిట్లు చేయుట కద్దా? అని బిలాముతో అనగా అతడు–లేదనెను.౹

31 అంతలో యెహోవా బిలాము కన్నులు తెరచెను గనుక, దూసిన ఖడ్గము చేతపట్టుకొని త్రోవలో నిలిచియున్న యెహోవాదూతను అతడు చూచి తలవంచి సాష్టాంగ నమస్కారముచేయగా

32 యెహోవాదూత–యీ ముమ్మారు నీ గాడిదను నీవేల కొట్టితివి? ఇదిగో నా యెదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చితిని.౹

33 ఆ గాడిద నన్ను చూచి యీ ముమ్మారు నా యెదుటనుండి తొలిగెను; అది నా యెదుటనుండి తొలగని యెడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి యుందునని అతనితో చెప్పెను.౹

34 అందుకు బిలాము–నేను పాపముచేసితిని; నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలి సినది కాదు. కాబట్టి యీ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్లెదనని యెహోవాదూతతో చెప్పగా

35 యెహోవాదూత–నీవు ఆ మనుష్యులతోకూడ వెళ్లుము. అయితే నేను నీతో చెప్పు మాటయేకాని మరేమియు పలుకకూడదని బిలాముతో చెప్పెను. అప్పుడు బిలాము బాలాకు అధికారులతోకూడ వెళ్లెను.౹

36 బిలాము వచ్చెనని బాలాకు విని, ఆ పొలిమేరల చివరనున్న అర్నోను తీరమునందలి మోయాబు పట్టణమువరకు అతనిని ఎదుర్కొన బయలువెళ్లగా

37 బాలాకు బిలాముతో నిన్ను పిలుచుటకు నేను నీయొద్దకు దూతలను పంపియుంటిని గదా. నాయొద్దకు నీవేల రాకపోతివి? నిన్ను ఘనపరచ సమర్థుడను కానా? అనెను.౹

38 అందుకు బిలాము–ఇదిగో నీయొద్దకు వచ్చితిని; అయిన నేమి? ఏదైనను చెప్పుటకు నాకు శక్తి కలదా? దేవుడు నా నోట పలికించు మాటయే పలికెదనని బాలాకుతో చెప్పెను.౹

39 అప్పుడు బిలాము బాలాకుతోకూడ వెళ్లెను. వారు కిర్యత్ హుచ్చోతుకు వచ్చినప్పుడు

40 బాలాకు ఎడ్లను గొఱ్ఱెలను బలిగా అర్పించి, కొంతభాగము బిలాముకును అతనియొద్దనున్న అధికారులకును పంపెను.౹

41 మరునాడు బాలాకు బిలామును తోడుకొనిపోయి, బయలుయొక్క ఉన్నతస్థలములమీదనుండి జనులను చివరవరకు చూడవలెనని అతనిని అచ్చోట ఎక్కించెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/NUM/22-34ef57932153d9c6fbcbb5ff6abacd67.mp3?version_id=1787—

Categories
సంఖ్యాకాండము

సంఖ్యాకాండము 23

1 అప్పుడు బిలాము–ఇక్కడ నేను బలి అర్పించుటకు ఏడు బలిపీఠములను కట్టించి, ఇక్కడ ఏడు కోడెలను ఏడు పొట్టేళ్లను సిద్ధపరచుమని బాలాకుతో చెప్పెను.౹

2 బిలాము చెప్పినట్లు బాలాకు చేయగా, బాలాకును బిలామును ప్రతి బలిపీఠముమీద ఒక కోడెను ఒక పొట్టేలును దహనబలిగా అర్పించిరి.౹

3 మరియు బిలాము బాలాకుతో–బలిపీఠము మీది నీ దహనబలియొద్ద నిలిచియుండుము, నేను వెళ్లెదను; ఒకవేళ యెహోవా నన్ను ఎదుర్కొను నేమో; ఆయన నాకు కనుపరచునది నీకు తెలియచేసెదనని చెప్పి మెట్ట యెక్కెను.౹

4 దేవుడు బిలాముకు ప్రత్యక్షముకాగా అతడు–నేను ఏడు బలిపీఠములను సిద్ధపరచి ప్రతి దానిమీదను ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించితినని ఆయనతో చెప్పగా,౹

5 యెహోవా ఒకమాట బిలాము నోట ఉంచి–నీవు బాలాకునొద్దకు తిరిగివెళ్లి యిట్లు చెప్పుమనెను.౹

6 అతడు బాలాకునొద్దకు తిరిగివెళ్లినప్పుడు అతడు మోయాబు అధికారులందరితో తన దహనబలి యొద్ద నిలిచియుండెను.౹

7 అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను –

అరామునుండి బాలాకు

తూర్పు పర్వతములనుండి మోయాబురాజు నన్ను రప్పించి

–రమ్ము; నా నిమిత్తము యాకోబును శపింపుము

రమ్ము; ఇశ్రాయేలును భయపెట్టవలెను అనెను.

8 ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే

ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే.

9 మెట్టల శిఖరమునుండి అతని చూచుచున్నాను

కొండలనుండి అతని కనుగొనుచున్నాను

ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును

జనములలో లెక్కింపబడరు.

10 యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు?

ఇశ్రాయేలు నాల్గవపాలును ఎవరు లెక్కపెట్ట గలరు?

నీతిమంతుల మరణమువంటి మరణము నాకు లభించును గాక.

నా అంత్యదశ వారి అంతమువంటి దగును గాక అనెను.

11 అంతట బాలాకు బిలాముతో నీవు నాకేమి చేసితివి? నా శత్రువులను శపించుటకు నిన్ను రప్పించితిని; అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివనెను.౹

12 అందుకతడు– యెహోవా నా నోట ఉంచినదాని నేను శ్రద్ధగా పలుక వద్దా? అని ఉత్తరమిచ్చెను.౹

13 అప్పుడు బాలాకు–దయచేసి నాతోకూడ మరియొక చోటికి రమ్ము. అక్కడనుండి వారిని చూడవచ్చును; వారి చివరమాత్రమే కనబడునుగాని వారందరు నీకు కనబడరు; అక్కడనుండి నా నిమిత్తము వారిని శపింపవలెనని అతనితో చెప్పి

14 పిస్గా కొన నున్న కావలివారి పొలమునకు అతని తోడుకొనిపోయి, యేడు బలిపీఠములను కట్టించి, ప్రతి బలిపీఠముమీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించెను.౹

15 అతడు–నీవు ఇక్కడ నీ దహనబలియొద్ద నిలిచియుండుము; నేను అక్కడ యెహోవాను ఎదుర్కొందునని బాలాకుతో చెప్పగా,౹

16 యెహోవా బిలామును ఎదుర్కొని ఒక మాటను అతని నోట ఉంచి–నీవు బాలాకునొద్దకు తిరిగి వెళ్లి యిట్లు చెప్పుమనెను.౹

17 అతడు బాలాకు నొద్దకు వెళ్లినప్పుడు అతడు తన దహనబలియొద్ద నిలిచియుండెను. మోయాబు అధికారులును అతనియొద్ద నుండిరి. బాలాకు –యెహోవా యేమి చెప్పెనని అడుగగా

18 బిలాము ఉపమానరీతిగా నిట్లనెను–

బాలాకూ, లేచి వినుము

సిప్పోరు కుమారుడా, చెవినొగ్గి నా మాట ఆలకించుము.

19 దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు

పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు

ఆయన చెప్పి చేయకుండునా?

ఆయన మాట యిచ్చి స్థాపింపకుండునా?

20 ఇదిగో దీవించుమని నాకు సెలవాయెను

ఆయన దీవించెను; నేను దాని మార్చలేను.

21 ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు

ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు

అతని దేవుడైన యెహోవా అతనికి తోడైయున్నాడు.

22 రాజుయొక్క జయధ్వని వారిలో నున్నది

దేవుడు ఐగుప్తులోనుండి వారిని రప్పించెను

గురుపోతు వేగమువంటి వేగము వారికి కలదు.

23 నిజముగా యాకోబులో మంత్రము లేదు

ఇశ్రాయేలులో శకునము లేదు

ఆయాకాలములందు దేవుని కార్యములు

యాకోబు వంశస్థులగు ఇశ్రాయేలీయులకు తెలియ చెప్పబడును.

24 ఇదిగో ఆ జనము ఆడుసింహమువలె లేచును

అది సింహమువలె నిక్కి నిలుచును

అది వేటనుతిని చంపబడిన వాటి రక్తము త్రాగు

వరకు పండుకొనదు.

25 అంతట బాలాకు–నీవు ఏ మాత్రమును వారిని శపింపను వద్దు, దీవింపను వద్దు అని బిలాముతో చెప్పగా

26 బిలాము యెహోవా చెప్పినదంతయు నేను చేయవలెనని నేను నీతో చెప్పలేదా? అని బాలాకుకు ఉత్తరమియ్యగా

27 బాలాకు నీవు దయచేసి రమ్ము; నేను వేరొకచోటికి నిన్ను తోడుకొని పోయెదను; అక్కడ నుండి నా నిమిత్తము నీవు వారిని శపించుట దేవునిదృష్టికి అనుకూలమగునేమో అని బిలాముతో చెప్పెను.౹

28 బాలాకు ఎడారికి ఎదురుగా నున్న పెయోరు శిఖరమునకు బిలామును తోడుకొనిపోయిన తరువాత

29 బిలాము–ఇక్కడ నాకు ఏడు బలిపీఠములను కట్టించి, యిక్కడ ఏడు కోడెలను ఏడు పొట్టేళ్లను సిద్ధపరచుమని బాలాకుతో చెప్పెను.౹

30 బిలాము చెప్పినట్లు బాలాకు చేసి ప్రతి బలిపీఠముమీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/NUM/23-61522680e2fddffff9dea1cc2737b24c.mp3?version_id=1787—