Categories
లేవీయకాండము

లేవీయకాండము 21

1 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను.౹

2 యాజకులగు అహరోను కుమారులతో ఇట్లనుము–మీలో ఎవడును తన ప్రజలలో శవమును ముట్టుటవలన తన్ను అపవిత్రపరచుకొనరాదు. అయితే తనకు సమీప రక్తసంబంధులు, అనగా తన తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె, సహోదరుడు,౹

3 తనకు సమీపముగానున్న శుద్ధ సహోదరియగు అవివాహిత కన్యక, అను వీరియొక్క శవమునుముట్టి తన్ను అపవిత్రపరచు కొనవచ్చును.౹

4 అతడు తన ప్రజలలో యజమానుడు గనుక తన్ను అపవిత్రపరచుకొని సామాన్యునిగా చేసికొనరాదు.౹

5 వారు తమ తలలు బోడిచేసికొనరాదు. గడ్డపు ప్రక్కలను క్షౌరము చేసికొన రాదు, కత్తితో దేహమును కోసికొనరాదు.౹

6 వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైనవారుగా ఉండవలెను. కావునవారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. ఏలయనగా వారు తమ దేవునికి అహారమును, అనగా యెహోవాకు హోమద్రవ్యములను అర్పించువారు; కావునవారు పరిశుద్ధులై యుండవలెను.౹

7 వారు జారస్త్రీనేగాని భ్రష్టురాలినేగాని పెండ్లిచేసికొనకూడదు. పెనిమిటి విడనాడిన స్త్రీని పెండ్లిచేసికొనకూడదు. ఏలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు.౹

8 అతడు నీ దేవునికి ఆహారమును అర్పించువాడు గనుక నీవు అతని పరిశుద్ధపరచవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవా అను నేను పరిశుద్ధుడను గనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావ లెను.౹

9 మరియు యాజకుని కుమార్తె జారత్వమువలన తన్ను అపవిత్రపరచుకొనినయెడల ఆమె తన తండ్రిని అపవిత్ర పరచునది. అగ్నితో ఆమెను దహింపవలెను.

10 ప్రధానయాజకుడగుటకై తన సహోదరులలో ఎవరి తలమీద అభిషేకతైలము పోయబడునో, యాజకవస్త్రములు వేసికొనుటకు ఎవరు ప్రతిష్ఠింపబడునో అతడు తన తలకప్పును తీయరాదు; తన బట్టలను చింపుకొనరాదు;౹

11 అతడు శవముదగ్గరకు పోరాదు; తన తండ్రి శవమువలననేగాని తన తల్లి శవమువలననేగాని తన్ను అపవిత్రపరచుకొన రాదు.౹

12 దేవుని అభిషేకతైలము అనెడు కిరీటముగా అతనిమీద ఉండును గనుక అతడు పరిశుద్ధమందిరమును విడిచి వెళ్లరాదు; తన దేవుని పరిశుద్ధమందిరమును అపవిత్రపరచ రాదు; నేను యెహోవాను

13 అతడు కన్యకను పెండ్లిచేసి కొనవలెను.౹

14 విధవరాలినైనను విడనాడబడినదానినైనను భ్రష్టురాలినైనను, అనగా జారస్త్రీనైనను అట్టివారిని పెండ్లిచేసికొనక తన ప్రజలలోని కన్యకనే పెండ్లి చేసికొనవలెను.౹

15 యెహోవా అను నేను అతని పరిశుద్ధపరచు వాడను గనుక అతడు తన ప్రజలలో తన సంతానమును అపవిత్రపరచకూడదని వారితో చెప్పుము.

16 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.౹

17 –నీవు అహరోనుతో ఇట్లనుము–నీ సంతతివారిలో ఒకనికి కళంకమేదైనను కలిగినయెడల అతడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు.౹

18 ఏలయనగా ఎవనియందు కళంకముండునోవాడు గ్రుడ్డివాడేగాని కుంటివాడేగాని ముక్కిడివాడేగాని విపరీతమైన అవ యవముగల వాడేగాని

19 కాలైనను చేయైనను విరిగినవాడేగాని

20 గూనివాడేగాని గుజ్జువాడేగాని కంటిలో పువ్వు గలవాడేగాని గజ్జిగలవాడేగాని చిరుగుడుగలవాడేగాని వృషణములు నలిగినవాడేగాని సమీపింపకూడదు.౹

21 యాజకుడైన అహరోను సంతానములో కళంకముగల యే మనుష్యుడును యెహోవాకు హోమద్రవ్యములను అర్పించుటకు సమీపింపకూడదు. అతడు కళంకముగలవాడు; అట్టివాడు తన దేవునికి ఆహారము అర్పించుటకు సమీపింపకూడదు.౹

22 అతి పరిశుద్ధమైనవేగాని, పరిశుద్ధమైనవేగాని, తన దేవునికి అర్పింపబడు ఏ ఆహారవస్తువులనైనను అతడు తినవచ్చును.౹

23 మెట్టుకు అతడు కళంకముగలవాడు గనుక అడ్డతెరయెదుటికి చేరకూడదు; బలిపీఠమును సమీపింపకూడదు; నా పరిశుద్ధస్థలములను అపవిత్రపరచకూడదు; వారిని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని వారితో చెప్పుము. అట్లు మోషే అహరోనుతోను, అతని కుమారులతోను ఇశ్రాయేలీయులందరితోను చెప్పెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/LEV/21-47f3d9737be724529ebb9ea24e85be9e.mp3?version_id=1787—

Categories
లేవీయకాండము

లేవీయకాండము 22

1 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

2 –ఇశ్రాయేలీయులు నాకు ప్రతిష్ఠించువాటి వలన అహరోనును అతని కుమారులును నా పరిశుద్ధనామమును అపవిత్రపరచకుండునట్లువారు ఆ పరిశుద్ధమైన వాటిని ప్రతిష్ఠితములుగా ఎంచవలెనని వారితో చెప్పుము; నేను యెహోవాను.౹

3 నీవు వారితో ఇట్లనుము–మీ తరతరములకు మీ సమస్త సంతానములలో ఒకడు అపవిత్రత గలవాడై, ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించు వాటిని సమీపించినయెడల అట్టివాడు నా సన్నిధిని ఉండకుండ కొట్టివేయబడును; నేను యెహోవాను.౹

4 అహరోను సంతానములో ఒకనికి కుష్ఠయినను స్రావమై నను కలిగినయెడల అట్టివాడు పవిత్రత పొందువరకు ప్రతిష్ఠితమైనవాటిలో దేనిని తినకూడదు. శవమువలని అపవిత్రతగల దేనినైనను ముట్టువాడును స్ఖలితవీర్యుడును,౹

5 అపవిత్రమైన పురుగునేమి యేదో ఒక అపవిత్రతవలన అపవిత్రుడైన మనుష్యునినేమి ముట్టువాడును, అట్టి అప విత్రత తగిలినవాడును సాయంకాలమువరకు అపవిత్రుడగును.౹

6 అతడు నీళ్లతో తన దేహమును కడుగుకొనువరకు ప్రతిష్ఠితమైనవాటిని తినకూడదు.౹

7 సూర్యుడు అస్త మించినప్పుడు అతడు పవిత్రుడగును; తరువాత అతడు ప్రతిష్ఠితమైనవాటిని తినవచ్చును, అవి వానికి ఆహారమే గదా.౹

8 అతడు కళేబరమునైనను చీల్చబడినదానినైననుతిని దానివలన అపవిత్రపరచుకొనకూడదు; నేను యెహోవాను.౹

9 కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరచి, దాని పాపభారమును మోసికొని దానివలన చావకుండునట్లు ఈ విధిని ఆచరించవలెను; నేను వారిని పరిశుద్ధపరచు యెహోవాను.౹

10 అన్యుడు ప్రతిష్ఠితమైనదానిని తినకూడదు, యాజకునియింట నివసించు అన్యుడేగాని జీతగాడేగాని ప్రతిష్ఠితమైనదానిని తినకూడదు,౹

11 అయితే యాజకుడు క్రయధనమిచ్చి కొనినవాడును అతని యింట పుట్టినవాడును అతడు తిను ఆహారమును తినవచ్చును.౹

12 యాజకుని కుమార్తె అన్యుని కియ్యబడినయెడల ఆమె ప్రతిష్ఠితమైనవాటిలో ప్రతిష్ఠార్పణమును తినకూడదు.౹

13 యాజకుని కుమార్తెలలో విధవరాలేకాని విడనాడబడినదే కాని సంతానము లేనియెడల ఆమె తన బాల్యమందువలె తన తండ్రి యింటికి తిరిగి చేరి తన తండ్రి ఆహారమును తినవచ్చునుగాని అన్యుడెవడును దాని తినకూడదు.౹

14 ఒకడు పొరబాటున ప్రతిష్ఠితమైనదానిని తినినయెడలవాడు ఆ ప్రతిష్ఠితమైనదానిలో అయిదవవంతు కలిపి దానితో యాజకునికియ్యవలెను.౹

15 ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠితమైనవాటిని తినుటవలన అపరాధమును భరింపకుండునట్లు తాము యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధ ద్రవ్యములను అపవిత్రపరచకూడదు.౹

16 నేను వాటిని పరిశుద్ధపరచు యెహోవానని చెప్పుము.

17 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

18 –నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇశ్రాయేలీయులందరితోను ఇట్లు చెప్పుము–ఇశ్రాయేలీయుల యింటివారిలోనేగాని ఇశ్రాయేలీయులలో నివసించు పరదేశులలోనేగాని యెవడు యెహోవాకు దహనబలిగా స్వేచ్ఛార్పణములనైనను మ్రొక్కుబళ్లనైనను అర్పించునో

19 వాడు అంగీకరింపబడినట్లు, గోవులలోనుండి యైనను గొఱ్ఱెమేకలలోనుండియైనను దోషములేని మగ దానిని అర్పింపవలెను.౹

20 దేనికి కళంకముండునో దానిని అర్పింపకూడదు; అది మీ పక్షముగా అంగీకరింపబడదు.౹

21 ఒకడు మ్రొక్కుబడిని చెల్లించుటకేగాని స్వేచ్ఛార్పణము అర్పించుటకేగాని సమాధానబలిరూపముగా గోవునైనను గొఱ్ఱెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడునట్లు దోషము లేనిదై యుండవలెను; దానిలో కళంకమేదియు నుండకూడదు.౹

22 గ్రుడ్డిదేమి కుంటిదేమి కొరతగలదేమి గడ్డగలదేమి గజ్జిరోగముగలదేమి చిరుగుడుగలదేమి అట్టివాటిని యెహోవాకు అర్పింపకూడదు; వాటిలో దేనిని బలిపీఠముమీద యెహోవాకు హోమము చేయకూడదు.౹

23 కురూపియైన కోడెనైనను గొఱ్ఱె మేకల మందలోని దానినైనను స్వేచ్ఛార్పణముగా అర్పింప వచ్చునుగాని అది మ్రొక్కుబడిగా అంగీకరింప బడదు.౹

24 విత్తులు నులిపిన దానినేగాని విరిగినదానినేగాని చితికినదానినేగాని కోయబడినదానినేగాని యెహోవాకు అర్పింపకూడదు; మీ దేశములో అట్టికార్యము చేయకూడదు;౹

25 పరదేశి చేతినుండి అట్టివాటిలో దేనిని తీసికొని మీ దేవునికి ఆహారముగా అర్పింపకూడదు; అవి లోపము గలవి, వాటికి కళంకములుండును, అవి మీ పక్షముగా అంగీకరింపబడవని చెప్పుము.

26 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

27 –దూడయేగాని, గొఱ్ఱెపిల్లయేగాని, మేకపిల్లయేగాని, పుట్టినప్పుడు అదియేడు దినములు దాని తల్లితో నుండవలెను. ఎనిమిదవనాడు మొదలుకొని అది యెహోవాకు హోమముగా అంగీకరింప తగును.౹

28 అయితే అది ఆవైనను గొఱ్ఱె మేకలలోనిదైనను మీరు దానిని దానిపిల్లను ఒక్క నాడే వధింపకూడదు.౹

29 మీరు కృతజ్ఞతాబలియగు పశువును వధించినప్పుడు అది మీకొరకు అంగీకరింపబడునట్లుగా దానిని అర్పింపవలెను.౹

30 ఆనాడే దాని తినివేయవలెను; మరునాటివరకు దానిలో కొంచెమైనను మిగిలింపకూడదు; నేను యెహోవాను.౹

31 మీరు నా ఆజ్ఞలననుసరించి వాటి ప్రకారము నడుచుకొనవలెను; నేను యెహోవాను.౹

32 నా పరిశుద్ధనామమును అపవిత్రపరచకూడదు, నేను ఇశ్రాయేలీయులలో నన్ను పరిశుద్ధునిగా చేసికొందును;౹

33 నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను. నేను మీకు దేవుడనై యుండునట్లు ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించిన యెహోవానని చెప్పుము.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/LEV/22-9fb777fc30b40b65a6cbdcaee08801cd.mp3?version_id=1787—

Categories
లేవీయకాండము

లేవీయకాండము 23

1 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

2 –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–మీరు చాటింపవలసిన యెహోవా నియామకకాలములు ఇవే; ఈ కాలములయందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను; నా నియామకకాలములు ఇవి.౹

3 ఆరు దినములు పనిచేయవలెను; వారము వారము ఏడవ దినము విశ్రాంతిదినము; అది పరిశుద్ధసంఘపు దినము. అందులో మీరు ఏ పనియైనను చేయకూడదు. మీ సమస్త నివాసములయందు అది యెహోవా నియమించిన విశ్రాంతిదినము.

4 ఇవి యెహోవా నియామకకాలములు, నియమించిన కాలములనుబట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధసంఘపు దినములు ఇవి.౹

5 మొదటి నెల పదునాలుగవదినమున సాయంకాలమందు యెహోవా పస్కాపండుగ జరుగును.౹

6 ఆ నెల పదునయిదవదినమున యెహోవాకు పొంగనిరొట్టెల పండుగ జరుగును; ఏడు దినములు మీరు పొంగని వాటినే తినవలెను

7 మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి యైన ఏ పనియు చేయకూడదు.౹

8 ఏడు దినములు మీరు యెహోవాకు హోమార్పణము చేయవలెను. ఏడవదినమున పరిశుద్ధసంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైన ఏ పనియు చేయకూడదని వారితో చెప్పుము.

9 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

10 –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–నేను మీ కిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయు నప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను.౹

11 యెహోవా మిమ్ము నంగీకరించునట్లు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతిదినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను.౹

12 మీరు ఆ పనను అర్పించుదినమున నిర్దోషమైన యేడాది పొట్టేలును యెహోవాకు దహనబలిగా అర్పింపవలెను

13 దాని నైవేద్యము నూనెతో కలిసిన రెండు పదియవ వంతుల గోధుమపిండి. అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమము. దాని పానార్పణము ముప్పావు ద్రాక్షారసము.౹

14 మీరు మీ దేవునికి అర్పణము తెచ్చువరకు ఆ దినమెల్ల మీరు రొట్టె యేమి పేలాలేమి పచ్చని వెన్నులేమి తినకూడదు. ఇది మీ తర తరములకు మీ నివాసస్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ.

15 మీరు విశ్రాంతిదినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలుకొని యేడు వారములు లెక్కింపవలెను; లెక్కకు తక్కువ కాకుండ ఏడు వారములు ఉండవలెను.౹

16 ఏడవ విశ్రాంతిదినపు మరుదినమువరకు మీరు ఏబది దినములు లెక్కించి యెహోవాకు క్రొత్తఫలముతో నైవేద్యము అర్పింపవలెను.౹

17 మీరు మీ నివాసములలోనుండి తూములో రెండేసి పదియవవంతుల పిండిగల రెండు రొట్టెలను అల్లా డించు అర్పణముగా తేవలెను. వాటిని గోధుమపిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. అవి యెహోవాకు ప్రథమఫలముల అర్పణము.౹

18 మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన యేడు ఏడాది మగ గొఱ్ఱెపిల్లలను ఒక కోడెదూడను రెండు పెద్ద పొట్టేళ్లను అర్పింపవలెను. అవి వారి నైవేద్యములతోను వారి పానార్పణములతోను దహనబలియై యెహోవాకు ఇంపైన సువాసనగల హోమమగును.౹

19 అప్పుడు మీరు మేకలలో ఒక పోతును పాపపరిహారార్థబలిగా అర్పించి రెండు ఏడాది గొఱ్ఱెపిల్లలను సమాధానబలిగా అర్పింపవలెను.౹

20 యాజకుడు ప్రథమఫలముల రొట్టెలతో వాటిని ఆ రెండు పొట్టేళ్లను యెహోవా సన్నిధిని అల్లాడింపవలెను. అవి యెహోవాకు ప్రతి ష్ఠింపబడినవై యాజకునివగును.౹

21 ఆనాడే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెనని చాటింపవలెను. అందులో మీరు జీవనోపాధియైన ఏ పనియు చేయకూడదు. ఇది మీ సమస్తనివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ.

22 మీరు మీ పంటచేను కోయునప్పుడు నీ పొలముయొక్క ఓరలను పూర్తిగా కోయకూడదు, నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను; నేను మీ దేవుడనైన యెహోవాను.

23 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.౹

24 –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–ఏడవ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతిదినము. అందులో జ్ఞాపకార్థశృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను.౹

25 అందులో మీరు జీవనోపాధియైన ఏ పనియు చేయుట మాని యెహోవాకు హోమము చేయవలెను.

26 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.౹

27 –ఈ యేడవ నెల పదియవ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము; అందులో మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరచుకొని యెహోవాకు హోమము చేయవలెను.౹

28 ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు; మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసికొనుటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము.౹

29 ఆ దినమున తన్నుతాను దుఃఖపరచుకొనని ప్రతివాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును.౹

30 ఆ దినమున ఏ పనినైననుచేయు ప్రతివానిని వాని ప్రజలలోనుండకుండ నాశము చేసెదను.౹

31 అందులో మీరు ఏ పనియు చేయకూడదు. అది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ.౹

32 అది మీకు మహా విశ్రాంతిదినము, మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలెను. ఆ నెల తొమ్మిదవనాటి సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలమువరకు మీరు విశ్రాంతిదినముగా ఆచరింపవలెను.

33 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

34 –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–ఈ యేడవ నెల పదునయిదవ దినము మొదలుకొని యేడు దినములవరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరుపవలెను.౹

35 వాటిలో మొదటి దినమున మీరు పరిశుద్ధసంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైన యే పనియు చేయకూడదు.౹

36 ఏడు దినములు మీరు యెహోవాకు హోమము చేయవలెను. ఎనిమిదవదినమున మీరు పరిశుద్ధసంఘముగా కూడి యెహోవాకు హోమార్పణము చేయవలెను. అది మీకు వ్రతదినముగా ఉండును. అందులో మీరు జీవనోపాధియైన యే పనియు చేయకూడదు.

37 యెహోవా నియమించిన విశ్రాంతిదినములు గాకయు, మీరు దానములనిచ్చు దినములుగాకయు, మీ మ్రొక్కు బడి దినములుగాకయు, మీరు యెహోవాకు స్వేచ్ఛార్పణములనిచ్చు దినములుగాకయు, యెహోవాకు హోమ ద్రవ్యమునేమి దహనబలి ద్రవ్యము నేమి నైవేద్యమునేమి బలినేమి పానీయార్పణములనేమి అర్పించుటకై పరిశుద్ధ సంఘపు దినములుగా మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవి.౹

38 ఏ అర్పణదినమున ఆ అర్పణమును తీసికొని రావలెను.

39 అయితే ఏడవ నెల పదునయిదవదినమున మీరు భూమిపంటను కూర్చుకొనగా ఏడు దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. మొదటి దినము విశ్రాంతిదినము, ఎనిమిదవ దినము విశ్రాంతిదినము.౹

40 మొదటి దినమున మీరు దబ్బపండ్లను ఈతమట్టలను గొంజి చెట్లకొమ్మలను కాలువలయొద్దనుండు నిరవంజి చెట్లను పట్టుకొని యేడుదినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను.౹

41 అట్లు మీరు ఏటేట ఏడు దినములు యెహోవాకు పండుగగా ఆచరింపవలెను. ఇది మీ తరతరములలో నిత్యమైన కట్టడ. ఏడవ నెలలో దానిని ఆచరింపవలెను.౹

42 నేను ఐగుప్తుదేశములోనుండి ఇశ్రాయేలీయులను రప్పించినప్పుడు వారిని పర్ణశాలలో నివసింప చేసితినని మీ జనులు ఎరుగునట్లు ఏడు దినములు మీరు పర్ణశాలలలో నివసింపవలెను. ఇశ్రాయేలీయులలో పుట్టిన వారందరు పర్ణశాలలలో నివసింపవలెను.౹

43 నేను మీ దేవుడనైన యెహోవాను.౹

44 అట్లు మోషే ఇశ్రాయేలీయులకు యెహోవా నియామక కాలములను తెలియ చెప్పెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/LEV/23-a531ac82e2997fbce31ffb0569157c7d.mp3?version_id=1787—

Categories
లేవీయకాండము

లేవీయకాండము 24

1 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

2 –దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము.౹

3 ప్రత్యక్షపు గుడారములో శాసనముల అడ్డతెరకు వెలుపల అహరోను సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు అది వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దాని చక్కపరచవలెను. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ.౹

4 అతడు నిర్మలమైన దీపవృక్షముమీద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలెను.

5 నీవు గోధుమలపిండిని తీసికొని దానితో పండ్రెండు భక్ష్యములను వండవలెను. ఒక్కొక్క భక్ష్యమున సేరు సేరు పిండి యుండవలెను.౹

6 యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్లమీద ఆరేసి భక్ష్యములుగల రెండు దొంతులుగా వాటిని ఉంచవలెను.౹

7 ఒక్కొక్క దొంతిమీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలెను. అది యెహోవా యెదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును.౹

8 యాజకుడు ప్రతి విశ్రాంతిదినమున నిత్య నిబంధననుబట్టి ఇశ్రాయేలీయులయొద్ద దాని తీసికొని నిత్యము యెహోవా సన్నిధిని చక్కపరచవలెను.౹

9 అది అహరోనుకును అతని సంతతివారికి ఉండవలెను. వారు పరిశుద్ధస్థలములో దాని తినవలెను. నిత్యమైన కట్టడ చొప్పున యెహోవాకుచేయు హోమములలో అది అతి పరిశుద్ధము.

10 ఇశ్రాయేలీయురాలగు ఒక స్త్రీకిని ఐగుప్తీయుడగు ఒక పురుషునికిని పుట్టినవాడొకడు ఇశ్రాయేలీయులమధ్యకు వచ్చెను.౹

11 ఆ ఇశ్రాయేలీయురాలి కుమారునికిని ఒక ఇశ్రాయేలీయునికిని పాళెములో పోరుపడగా ఆ ఇశ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషేయొద్దకు వాని తీసికొనివచ్చిరి. వాని తల్లిపేరు షెలోమీతు; ఆమె దాను గోత్రికుడైన దిబ్రీకుమార్తె

12 యెహోవా యేమి సెలవిచ్చునో తెలిసికొనువరకు వానిని కావలిలో ఉంచిరి.

13 అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.౹

14 –శపించినవానిని పాళెము వెలుపలికి తీసికొనిరమ్ము; వాని శాపవచనమును వినినవారందరు వాని తలమీద తమ చేతులుంచిన తరువాత సర్వసమాజము రాళ్లతో వాని చావ గొట్టవలెను.౹

15 మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–తన దేవుని శపించువాడు తన పాపశిక్షను భరింపవలెను.౹

16 యెహోవా నామమును దూషించువాడు మరణశిక్ష నొందవలెను; సర్వసమాజము రాళ్లతో అట్టి వానిని చావ గొట్టవలెను. పరదేశియేగాని స్వదేశియేగానియెహోవా నామమునుదూషించినయెడల వానికి మరణశిక్ష విధింపవలెను.౹

17 ఎవడైనను ఒకనిని ప్రాణహత్యచేసినయెడల వానికి మరణశిక్ష విధింపవలెను.౹

18 జంతు ప్రాణహత్య చేసినవాడు ప్రాణమునకు ప్రాణమిచ్చి దాని నష్టము పెట్టుకొనవలెను.౹

19 ఒకడు తన పొరుగువానికి కళంకము కలుగజేసినయెడలవాడు చేసినట్లు వానికి చేయవలెను.౹

20 విరుగగొట్టబడిన దాని విషయములో విరుగగొట్టబడుటయే శిక్ష. కంటికి కన్ను పంటికి పల్లు, చెల్లవలెను.వాడు ఒకనికి కళంకము కలుగజేసినందున వానికి కళంకము కలుగజేయవలెను.౹

21 జంతువును చావగొట్టినవాడు దాని నష్టము నిచ్చుకొనవలెను. నరహత్య చేసినవానికి మరణశిక్ష విధింపవలెను.౹

22 మీరు పక్షపాతము లేక తీర్పుతీర్చవలెను. మీలోనున్న పరదేశికి మీరు చేసినట్టు మీ స్వదేశికిని చేయవలెను. నేను మీ దేవుడనైన యెహోవానని వారితో చెప్పుము అనెను.౹

23 కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పెను–శపించిన వానిని పాళెము వెలుపలికి తీసికొనిపోయి రాళ్లతో వాని చావగొట్టవలెను, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఇశ్రాయేలీయులు చేసిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/LEV/24-3fbba71c62f6b714dea9cc3831582ac9.mp3?version_id=1787—

Categories
లేవీయకాండము

లేవీయకాండము 25

1 మరియు యెహోవా సీనాయికొండమీద మోషేకు ఈలాగు సెలవిచ్చెను

2 –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–నేను మీకిచ్చుచున్న దేశములోనికి మీరు వచ్చిన తరువాత ఆ భూమి కూడ యెహోవా పేరట విశ్రాంతి కాలమును, ఆచరింపవలెను.౹

3 ఆరుసంవత్సరములు నీ చేను విత్తవలెను. ఆరుసంవత్సరములు నీ ఫలవృక్షములతోటను బద్దించి దాని ఫలములను కూర్చుకొన వచ్చును.౹

4 ఏడవ సంవత్సరము భూమికి మహా విశ్రాంతి కాలము, అనగా యెహోవా పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలెను. అందులో నీ చేను విత్తకూడదు; నీ ఫలవృక్షములతోటను శుద్దిపరచకూడదు.౹

5 నీ కారుచేల పంటను కోసికొనకూడదు, శుద్దిపరచని నీ వృక్షఫలములను ఏరుకొనకూడదు; అది భూమికి విశ్రాంతి సంవత్సరము.౹

6 అప్పుడు భూమియొక్క విశ్రాంతి సంవత్సర సస్యము నీకును నీ దాసునికిని నీ దాసికిని నీ జీతగానికిని నీతో నివసించు పరదేశికిని ఆహారమగును.౹

7 మరియు నీ పశువులకును నీ దేశజంతువులకును దాని పంట అంతయు మేతగా ఉండును.

8 మరియు ఏడు విశ్రాంతి సంవత్సరములను, అనగా ఏడేసి యేండ్లుగల సంవత్సరములను లెక్కింపవలెను. ఆ యేడు విశ్రాంతి సంవత్సరములకాలము నలుబది తొమ్మిది సంవత్సరములగును.౹

9 ఏడవ నెల పదియవనాడు మీ స్వదేశమంతట శృంగనాదము చేయవలెను. ప్రాయశ్చి త్తార్థదినమున మీ దేశమంతట ఆ శృంగనాదము చేయవలెను.౹

10 మీరు ఆ సంవత్సరమును, అనగా ఏబదియవ సంవత్సరమును పరిశుద్ధపరచి మీ దేశవాసులకందరికి విడుదల కలిగినదని చాటింపవలెను; అది మీకు సునాదముగానుండును; అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను; ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను.౹

11 ఆ సంవత్సరము, అనగా ఏబదియవ సంవత్సరము మీకు సునాదకాలము. అందులో మీరు విత్తకూడదు కారుపంటను కోయకూడదు శుద్దిపరచని నీ ఫల వృక్షముల పండ్లను ఏరుకొనకూడదు.౹

12 అది సునాద కాలము; అది మీకు పరిశుద్ధమగును, పొలములో దానంతట అదే పండిన పంటను మీరు తినెదరు.౹

13 ఆ సునాద సంవత్సరమున మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును మరల పొందవలెను.౹

14 నీవు నీ పొరుగువానికి వెలకు ఇచ్చిన దేని విషయములోకాని నీ పొరుగువాని దగ్గర నీవు కొనిన దేని విషయములో కాని మీరు ఒకరినొకరు బాధింపకూడదు.౹

15 సునాద సంవత్సరమైన తరువాత గడచిన యేండ్ల లెక్క చొప్పున నీ పొరుగువానియొద్ద నీవు దానిని కొనవలెను. పంటల లెక్కచొప్పున అతడు నీకు దానిని అమ్మవలెను.౹

16 ఆ సంవత్సరముల లెక్క హెచ్చినకొలది దాని వెల హెచ్చింపవలెను, ఆ సంవత్సరముల లెక్క తగ్గినకొలది దాని వెల తగ్గింపవలెను. ఏలయనగా పంటల లెక్క చొప్పున అతడు దాని నీకు అమ్మెనుగదా.౹

17 మీరు ఒకరి నొకరు బాధింపక నీ దేవునికి భయపడవలెను. నేను మీ దేవుడనైన యెహోవాను.౹

18 కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిననుసరించి నడుచుకొనవలెను.౹

19 అప్పుడు మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించె దరు, ఆ భూమి ఫలించును. మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు.౹

20 ఏడవయేట మేము ఏమి తిందుము? ఇదిగో మేము చల్లను పంటకూర్చను వల్లగాదే అనుకొందురేమో.౹

21 అయితే నేను ఆరవయేట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించెదను; అది మూడేండ్ల పంటను మీకు కలుగజేయును.౹

22 మీరు ఎనిమిదవ సంవత్సరమున విత్తనములు విత్తి తొమ్మిదవ సంవత్సరమువరకు పాత పంట తినెదరు; దాని పంటను కూర్చువరకు పాత దానిని తినెదరు.

23 భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. ఆ భూమి నాదే, మీరు నాయొద్ద కాపురమున్న పరదేశులు.౹

24 మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరల విడిపింపబడునట్లుగా దాని అమ్ముకొనవలెను.

25 నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తరువాత అతనికి సమీప బంధువుడు విడిపింప వచ్చినయెడల తన సహోదరుడు అమ్మినదానిని అతడు విడి పించును.౹

26 అయితే ఒకడు సమీప బంధువుడు లేకయే దాని విడిపించుకొనుటకు కావలసిన సొమ్ము సంపాదించినయెడల

27 దానిని అమ్మినది మొదలుకొని గడచిన సంవత్సరములు లెక్కించి యెవరికి దానిని అమ్మెనో వారికి ఆ శేషము మరల ఇచ్చి తన స్వాస్థ్యమును పొందును.౹

28 అతనికి దాని రాబట్టుకొనుటకై కావలసిన సొమ్ము దొరకని యెడల అతడు అమ్మిన సొత్తు సునాదసంవత్సరమువరకు కొనిన వాని వశములో ఉండవలెను. సునాదసంవత్సరమున అది తొలగిపోవును; అప్పుడతడు తన స్వాస్థ్యమును మరల నొందును.

29 ఒకడు ప్రాకారముగల ఊరిలోని నివాసగృహమును అమ్మినయెడల దాని అమ్మినదినము మొదలుకొని నిండు సంవత్సరములోగా దాని విడిపింపవచ్చును; ఆ సంవత్సర దినములోనే దాని విడిపించుకొనవచ్చును.౹

30 అయితే ఆ సంవత్సరదినములు నిండకమునుపు దాని విడిపింపనియెడల ప్రాకారముగల ఊరిలోనున్న ఆ యిల్లుకొనినవానికి వాని తరతరములకు అది స్థిరముగానుండును. అది సునాద కాలమున తొలగిపోదు.౹

31 చుట్టును ప్రాకారములులేని గ్రామములలోని యిండ్లను వెలిపొలములుగా ఎంచవలెను. అవి విడుదల కావచ్చును; అవి సునాదకాలములో తొలగి పోవును.౹

32 అయితే లేవీయుల పట్టణములు, అనగా వారి స్వాధీన పట్టణములలోని యిండ్లను విడిపించుటకు అధికారము లేవీయులకు శాశ్వతముగా ఉండును.౹

33 లేవీయుల పట్టణములయిండ్లు ఇశ్రాయేలీయులమధ్యనున్న వారి స్వాస్థ్యము గనుక ఒకడు లేవీయులయొద్ద ఇల్లు సంపా దించినయెడల పిత్రార్జిత పట్టణములో అమ్మబడిన ఆ యిల్లు సునాదసంవత్సరమున తొలగిపోవును.౹

34 వారు తమ పట్టణముల ప్రాంతభూములను అమ్ముకొనకూడదు; అవి వారికి శాశ్వత స్వాస్థ్యము.

35 పరవాసియైనను అతిథియైనను నీ సహోదరుడొకడు బీదవాడై నిరాధారుడై నీయొద్దకు వచ్చినయెడల నీవు వానికి సహాయము చేయవలెను; అతడు నీవలన బ్రదుకవలెను.౹

36 నీ దేవునికి భయపడి వానియొద్ద వడ్డినైనను తీసి కొనకూడదు; నీ సహోదరుడు నీవలన బ్రదుకవలెను.౹

37 నీ రూకలు వానికి వడ్డికియ్యకూడదు; నీ ఆహారమును వానికి లాభమున కియ్యకూడదు.౹

38 నేను మీకు కనాను దేశమునిచ్చి మీకు దేవుడగునట్లు ఐగుప్తుదేశములోనుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను.

39 నీయొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీకు అమ్మబడినయెడల వానిచేత బానిససేవ చేయించుకొనకూడదు.౹

40 వాడు జీతగానివలెను పరవాసివలెను నీయొద్ద నివసించు సునాదసంవత్సరమువరకు నీ యొద్ద దాసుడుగా ఉండవలెను.౹

41 అప్పుడతడు తన పితరుల స్వాస్థ్యమును మరల అనుభవించునట్లు తన పిల్లలతోకూడ నీయొద్దనుండి బయలుదేరి తన వంశస్థులయొద్దకు తిరిగి వెళ్లవలెను.౹

42 ఏలయనగా వారు నాకే దాసులైయున్నారు, నేను ఐగుప్తులోనుండి వారిని రప్పించితిని; దాసులను అమ్మినట్లు వారిని అమ్మకూడదు;౹

43 నీ దేవునికి భయపడి అట్టివానిని కఠినముగా చూడకుము.౹

44 మీ చుట్టుపెట్లనున్న జనములలోనుండి దాసీలను దాసులను కొనవచ్చును.౹

45 మరియు మీ మధ్య నివసించు పరదేశులను నీ దేశములో వారికి పుట్టిన వారిని కొనవచ్చును; వారు మీ సొత్తగుదురు.౹

46 మీ తరువాత మీ సంతతివారికి స్వాస్థ్యముగా ఉండునట్లు మీరు ఇట్టివారిని స్వతంత్రించుకొనవచ్చును; వారు శాశ్వతముగా మీకు దాసులగుదురు కాని, ఇశ్రాయేలీయులైన మీరు సహోదరులు గనుక ఒకని చేత ఒకడు కఠినసేవ చేయించు కొనకూడదు.

47 పరదేశియేగాని నీయొద్ద నివసించువాడేగాని ధనసంపా దనము చేసికొనునప్పుడు అతనియొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీయొద్ద నివసించు ఆ పరదేశికైనను ఆ పరదేశి కుటుంబములో వేరొకనికైనను తన్ను అమ్ముకొనినయెడల

48 తన్ను అమ్ముకొనిన తరువాత వానికి విడుదల కావచ్చును. వాని సహోదరులలో ఒకడు వానిని విడిపింపవచ్చును.౹

49 వాని పినతండ్రియేగాని పినతండ్రి కుమారుడేగాని వాని వంశములో వాని రక్తసంబంధియేగాని వాని విడిపింపవచ్చును. కావలసిన క్రయధనము వానికి దొరికినయెడల తన్నుతాను విడిపించుకొనవచ్చును.౹

50 అప్పుడువాడు అమ్మబడిన సంవత్సరము మొదలుకొని సునాద సంవత్సరమువరకు తన్ను కొనినవానితో లెక్కచూచుకొనవలెను. వాని క్రయధనము ఆ సంవత్సరముల లెక్క చొప్పున ఉండవలెను. తాను జీతగాడైయుండిన దినముల కొలది ఆ క్రయధనమును తగ్గింపవలెను.౹

51 ఇంక అనేక సంవత్సరములు మిగిలియుండినయెడల వాటినిబట్టి తన్ను అమ్మిన సొమ్ములో తన విమోచనక్రయధనమును మరల ఇయ్యవలెను.౹

52 సునాద సంవత్సరమునకు కొన్ని సంవత్సరములే తక్కువైనయెడల అతనితో లెక్క చూచుకొని సంవత్సరముల లెక్కచొప్పున తన విమోచనక్రయధనమును అతనికి చెల్లింపవలెను.౹

53 ఏటేటికి జీతగానివలె వాడతనియొద్ద ఉండవలెను. అతడు మీ కన్నులయెదుట వానిచేత కఠినముగా సేవ చేయించకూడదు.౹

54 అతడు ఈ రీతిగా విడిపింపబడనియెడల సునాదసంవత్సరమునవాడు తన పిల్లలతోకూడ విడుదలనొందును.౹

55 ఏలయనగా ఇశ్రాయేలీయులు నాకే దాసులు; నేను ఐగుప్తుదేశములోనుండి రప్పించిన నా దాసులే. నేను మీ దేవుడనైన యెహోవాను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/LEV/25-0b894b88a24d2f953698ad61685d98fd.mp3?version_id=1787—

Categories
లేవీయకాండము

లేవీయకాండము 26

1 మీరు విగ్రహములను చేసికొనకూడదు. చెక్కిన. ప్రతిమనుగాని బొమ్మనుగాని నిలువపెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశములో నిలుపకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను.౹

2 నేను నియమించిన విశ్రాంతిదినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధమందిరమును సన్మానింపవలెను, నేను యెహోవాను.

3 మీరు నా కట్టడలనుబట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించినయెడల

4 మీ వర్షకాలములలో మీకు వర్షమిచ్చెదను, మీ భూమి పంటల నిచ్చును, మీ పొలములచెట్లు ఫలించును,౹

5 మీ ద్రాక్ష పండ్ల కాలమువరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు.౹

6 ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసెదను. మీరు పండుకొనునప్పుడు ఎవడును మిమ్మును భయ పెట్టడు, ఆ దేశములో దుష్టమృగములులేకుండ చేసెదను, మీ దేశములోనికి ఖడ్గమురాదు;౹

7 మీరు మీ శత్రువులను తరిమెదరు; వారు మీ యెదుట ఖడ్గముచేత పడెదరు.౹

8 మీలో అయిదుగురు నూరుమందిని తరుముదురు; నూరుమంది పదివేలమందిని తరుముదురు, మీ శత్రువులు మీయెదుట ఖడ్గముచేత కూలుదురు.౹

9 ఏలయనగా నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మును విస్త రింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను.౹

10 మీరు చాలాకాలము నిలువైయున్న పాతగిలిన ధాన్యమును తినెదరు; క్రొత్తది వచ్చినను పాతది మిగిలియుండును.౹

11 నా మందిరమును మీ మధ్య ఉంచెదను; మీయందు నా మనస్సు అసహ్యపడదు.౹

12 నేను మీ మధ్య నడిచెదను మీకు దేవుడనైయుందును; మీరు నాకు ప్రజలైయుందురు.౹

13 మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండ వారి దేశములోనుండి మిమ్మును రప్పించితిని; నేను మీ దేవుడనైన యెహోవాను. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవచేసితిని.

14 మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక

15 నా కట్టడలను నిరాకరించినయెడలను, నా ఆజ్ఞలన్నిటిని అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహ్యించుకొనినయెడలను,౹

16 నేను మీకు చేయునదేమనగా, మీ కన్నులను క్షీణింపచేయునట్టియు ప్రాణమును ఆయాసపరచునట్టియు తాపజ్వరమును క్షయ రోగమును మీ మీదికి రప్పించెదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంటను తినెదరు;౹

17 నేను మీకు పగవాడనవుదును; మీ శత్రువుల యెదుట మీరు చంపబడెదరు; మీ విరోధులు మిమ్మును ఏలెదరు; మిమ్మును ఎవరును తరుమకపోయినను మీరు పారిపోయెదరు.౹

18 ఇవన్నియు సంభవించినను మీరింక నా మాటలు విననియెడల నేను మీ పాపములనుబట్టి మరి ఏడంతలుగా మిమ్మును దండించెదను.౹

19 మీ బల గర్వమును భంగపరచి, ఆకాశము ఇనుమువలెను భూమి ఇత్తడివలెను ఉండచేసెదను.౹

20 మీ బలము ఉడిగిపోవును; మీ భూమి ఫలింపకుండును; మీ దేశవృక్షములు ఫల మియ్యకుండును.౹

21 మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచినయెడల నేను మీ పాపములనుబట్టి మరి ఏడంతలుగా మిమ్మును బాధించెదను.౹

22 మీ మధ్యకు అడవిమృగములను రప్పించెదను; అవి మిమ్మును సంతాన రహితులగా చేసి మీ పశువులను హరించి మిమ్మును కొద్ది మందిగా చేయును. మీ మార్గములు పాడైపోవును.౹

23 శిక్షలమూలముగా మీరు నాయెదుట గుణపడక నాకు విరోధముగా నడిచినయెడల

24 నేను కూడ మీకు విరోధముగా నడిచెదను; మీ పాపములనుబట్టి ఇక ఏడంతలుగా మిమ్మును దండించెదను.౹

25 మీమీదికి ఖడ్గమును రప్పించెదను; అది నా నిబంధనవిషయమై ప్రతి దండన చేయును; మీరు మీ పట్టణములలో కూడియుండగా మీ మధ్యకు తెగులును రప్పించెదను; మీరు శత్రువులచేతికి అప్పగింప బడెదరు.౹

26 నేను మీ ఆహారమును, అనగా మీ ప్రాణా ధారమును తీసివేసిన తరువాత పదిమంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనికెచొప్పున మీ ఆహారమును మీకు మరల ఇచ్చెదరు, మీరు తినెదరుగాని తృప్తి పొందరు.

27 నేను ఈలాగు చేసినతరువాత మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచినయెడల

28 నేను కోపపడి మీకు విరోధముగా నడిచెదను. నేనే మీ పాపములనుబట్టి యేడంతలుగా మిమ్మును దండించెదను.౹

29 మీరు మీ కుమారుల మాంసమును తినెదరు, మీ కుమార్తెల మాంసమును తినెదరు.౹

30 నేను మీ యున్నతస్థలములను పాడు చేసెదను; మీ విగ్రహములను పడగొట్టెదను; మీ బొమ్మల పీనుగులమీద మీ పీనుగులను పడవేయించెదను.౹

31 నా మనస్సు మీయందు అసహ్యపడును, నేను మీ పట్టణములను పాడు చేసెదను; మీ పరిశుద్ధస్థలములను పాడు చేసెదను; మీ సువాసనగల వాటి సువాసనను ఆఘ్రా ణింపను.౹

32 నేనే మీ దేశమును పాడుచేసిన తరువాత దానిలో కాపురముండు మీ శత్రువులు దాని చూచి ఆశ్చర్యపడెదరు.౹

33 జనములలోనికి మిమ్మును చెదరగొట్టి మీవెంట కత్తి దూసెదను, మీ దేశము పాడైపోవును, మీ పట్టణములు పాడుపడును.౹

34 మీరు మీ శత్రువుల దేశములో ఉండగా మీ దేశము పాడైయున్న దినములన్నియు అది తన విశ్రాంతికాలములను అనుభవించును.౹

35 అది పాడైయుండు దినములన్నియు అది విశ్రమించును. మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతికాలములో పొందకపోయిన విశ్రాంతిని అది పాడైయుండు దినములలో అనుభవించును.౹

36 మీలో మిగిలినవారు తమ శత్రువుల దేశములలో ఉండగా వారి హృదయములలో అధై ర్యము పుట్టించెదను; కొట్టుకొని పోవుచున్న ఆకు చప్పుడు వారిని తరుమును, ఖడ్గము ఎదుటనుండి పారిపోవునట్లువారు ఆ చప్పుడు విని పారిపోయెదరు; తరుమువాడు లేకయే పడెదరు.౹

37 తరుమువాడు లేకయే వారు ఖడ్గమును చూచినట్టుగా ఒకనిమీద నొకడు పడెదరు; మీ శత్రువులయెదుట మీరు నిలువలేక పోయెదరు.౹

38 మీరు జనముగానుండక నశించెదరు. మీ శత్రువుల దేశము మిమ్మును తినివేయును.౹

39 మీలో మిగిలినవారు మీ శత్రువుల దేశములలో తమ దోషములనుబట్టి క్షీణించిపోయెదరు. మరియు వారు తమమీదికి వచ్చిన తమ తండ్రుల దోషములనుబట్టి క్షీణించిపోయెదరు.౹

40 వారు నాకు విరో ధముగా చేసిన తిరుగుబాటును తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని, తాము నాకు విరోధముగా నడిచితిమనియు

41 నేను తమకు విరోధముగా నడిచితిననియు, తమ శత్రువుల దేశములోనికి తమ్మును రప్పించితిననియు, ఒప్పుకొనినయెడల, అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండనను అనుభవించితిమని ఒప్పుకొనినయెడల,౹

42 నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసి కొందును; నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను నేను అబ్రాహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసి కొందును; ఆ దేశమును కూడ జ్ఞాపకము చేసికొందును.౹

43 వారిచేత విడువబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తన విశ్రాంతిదినములను అనుభవించును. వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టడలను అసహ్యించుకొనిరి. ఆ హేతువుచేతనే వారు తమ దోషశిక్ష న్యాయ మని ఒప్పుకొందురు.౹

44 అయితే వారు తమ శత్రువుల దేశములో ఉన్నప్పుడు వారిని నిరాకరింపను; నా నిబంధనను భంగపరచి వారిని కేవలము నశింపజేయునట్లు వారియందు అసహ్యపడను. ఏలయనగా నేను వారి దేవుడనైన యెహోవాను.౹

45 నేను వారికి దేవుడనైయుండునట్లు వారి పూర్వికులను జనములయెదుట ఐగుప్తులోనుండి రప్పించి వారితో చేసిన నిబంధనను ఆ పూర్వికులనుబట్టి జ్ఞాపకము చేసికొందును. నేను యెహోవాను అని చెప్పుము అనెను.

46 యెహోవా మోషేద్వారా సీనాయికొండమీద తనకును ఇశ్రాయేలీయులకును మధ్య నియమించిన కట్టడలును తీర్పులును ఆజ్ఞలును ఇవే.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/LEV/26-1ce99fbf2b4607a4c923559aa135e2ea.mp3?version_id=1787—

Categories
లేవీయకాండము

లేవీయకాండము 27

1 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

2 –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–ఒకడు విశేషమైన మ్రొక్కుబడి చేసినయెడల నీవు నిర్ణయించిన వెలచొప్పునవారు యెహోవాకు దాని చెల్లింపవలెను.౹

3 నీవు నిర్ణయింపవలసిన వెల యేదనగా, ఇరువది ఏండ్లు మొదలుకొని అరువది ఏండ్ల వయస్సువరకు మగవానికి పరిశుద్ధస్థలముయొక్క తులమువంటి యేబది తులముల వెండి నిర్ణయింపవలెను.౹

4 ఆడుదానికి ముప్పది తులములు నిర్ణయింపవలెను.౹

5 అయిదేండ్లు మొదలుకొని యిరువది ఏండ్లలోపలి వయస్సుగల మగవానికి ఇరువది తులముల వెలను, ఆడుదానికి పది తులముల వెలను నిర్ణయింపవలెను.౹

6 ఒక నెల మొదలుకొని అయిదేండ్లలోపలి వయస్సుగల మగవానికి అయిదు తులముల వెండి వెలను ఆడుదానికి మూడు తులముల వెండి వెలను నిర్ణయింపవలెను.౹

7 అరువది ఏండ్ల ప్రాయముదాటిన మగవానికి పదునైదు తులముల వెలను ఆడుదానికి పది తులముల వెలను నిర్ణయింపవలెను.౹

8 ఒకడు నీవు నిర్ణయించినవెలను చెల్లింపలేనంత బీదవాడైనయెడల అతడు యాజకుని యెదుట నిలువవలెను; అప్పుడు యాజకుడు అతని వెలను నిర్ణయించును. మ్రొక్కుకొనిన వాని కలిమి చొప్పున వానికి వెలను నిర్ణయింపవలెను.

9 యెహోవాకు అర్పణముగా అర్పించు పశువులలో ప్రతిదానిని యెహోవాకు ప్రతిష్ఠితముగా ఎంచవలెను.౹

10 అట్టిదానిని మార్చకూడదు; చెడ్డదానికి ప్రతిగా మంచిదానినైనను మంచిదానికి ప్రతిగా చెడ్డదానినైనను, ఒకదానికి ప్రతిగా వేరొకదానిని ఇయ్యకూడదు. పశువుకు పశువును మార్చినయెడల అదియు దానికి మారుగా ఇచ్చి నదియు ప్రతిష్ఠితమగును.౹

11 జనులు యెహోవాకు అర్పింప కూడని అపవిత్ర జంతువులలో ఒకదానిని తెచ్చినయెడల ఆ జంతువును యాజకుని యెదుట నిలువబెట్టవలెను.౹

12 అది మంచిదైతేనేమి చెడ్డదైతేనేమి యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను; యాజకుడవగు నీవు నిర్ణయించిన వెల స్థిరమగును.౹

13 అయితే ఒకడు అట్టిదానిని విడిపింప గోరినయెడల నీవు నిర్ణయించిన వెలలో అయిదవవంతు వానితో కలుపవలెను.

14 ఒకడు తన యిల్లు యెహోవాకు ప్రతిష్ఠితమగుటకై దానిని ప్రతిష్ఠించినయెడల అది మంచిదైనను చెడ్డదైనను యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను; యాజకుడు నిర్ణయించిన వెల స్థిరమగును.౹

15 తన యిల్లు ప్రతిష్ఠించినవాడు దాని విడిపింపగోరినయెడల అతడు నీవు నిర్ణయించిన వెలలో అయిదవవంతు దానితో కలుపవలెను; అప్పుడు ఆ యిల్లు అతనిదగును.

16 ఒకడు తన పిత్రార్జితమైన పొలములో కొంత యెహోవాకు ప్రతిష్ఠించినయెడల దాని చల్లబడు విత్తనముల కొల చొప్పున దాని వెలను నిర్ణయింపవలెను. పందుము యవల విత్తనములు ఏబది తులముల వెండి వెలగలది.౹

17 అతడు సునాదసంవత్సరము మొదలుకొని తన పొలమును ప్రతిష్ఠించినయెడల నీవు నిర్ణయించు వెల స్థిరము.౹

18 సునాద సంవత్సరమైన తరువాత ఒకడు తన పొలమును ప్రతిష్ఠించినయెడల యాజకుడు మిగిలిన సంవత్సరముల లెక్క చొప్పున, అనగా మరుసటి సునాదసంవత్సరమువరకు వానికి వెలను నిర్ణయింపవలెను. నీవు నిర్ణయించిన వెలలో దాని వారడి తగ్గింపవలెను.౹

19 పొలమును ప్రతిష్ఠించినవాడు దాని విడిపింపగోరినయెడల నీవు నిర్ణయించిన వెలలో అయిదవ వంతును అతడు దానితో కలుపవలెను. అప్పుడు అది అతనిదగును.౹

20 అతడు ఆ పొలమును విడిపింపనియెడలను వేరొకనికి దాని అమ్మినయెడలను మరి ఎన్నటికిని దాని విడిపింప వీలుకాదు.౹

21 ఆ పొలము సునాదసంవత్సరమున విడుదలకాగా అది ప్రతిష్ఠించిన పొలమువలె యెహోవాకు ప్రతిష్ఠితమగును; ఆ స్వాస్థ్యము యాజకునిదగును.౹

22 ఒకడు తాను కొనిన పొలమును, అనగా తన స్వాస్థ్యములో చేరనిదానిని యెహోవాకు ప్రతిష్ఠించినయెడల

23 యాజకుడు సునాదసంవత్సరమువరకు నిర్ణయించిన వెల చొప్పున అతనికి నియమింపవలెను. ఆ దినమందే నీవు నిర్ణయించిన వెల మేరచొప్పున యెహోవాకు ప్రతిష్ఠితముగా దాని చెల్లింపవలెను.౹

24 సునాదసంవత్సరమున ఆ భూమి యెవని పిత్రార్జితమైనదో వానికి, అనగా ఆ పొలమును అమ్మిన వానికి అది తిరిగిరావలెను.౹

25 నీ వెలలన్నియు పరిశుద్ధ స్థలముయొక్క వెలచొప్పున నిర్ణయింపవలెను. ఒక తులము ఇరువది చిన్నములు.

26 అయితే జంతువులలో తొలిపిల్ల యెహోవాది గనుక యెవడును దాని ప్రతిష్ఠింపకూడదు; అది ఎద్దయిననేమి గొఱ్ఱెమేకల మందలోనిదైననేమి యెహోవాదగును.౹

27 అది అపవిత్రజంతువైనయెడలవాడు నీవు నిర్ణయించు వెలలో అయిదవవంతు దానితో కలిపి దాని విడిపింప వచ్చును. దాని విడిపింపనియెడల నీవు నిర్ణయించిన వెలకు దాని అమ్మవలెను.

28 అయితే మనుష్యులలోగాని జంతువులలోగాని స్వాస్థ్యమైన పొలములలోగాని తనకు కలిగినవాటన్నిటిలో దేనినైనను ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించినయెడల ప్రతిష్ఠించినదానిని అమ్మకూడదు, విడిపింపనుకూడదు, ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును.౹

29 మనుష్యులు ప్రతిష్ఠించు వాటిలో దేనినైనను విడిపింపక హతము చేయవలెను.

30 భూధాన్యములలోనేమి వృక్షఫలములోనేమి భూఫలములన్నిటిలో దశమభాగము యెహోవా సొమ్ము; అది యెహోవాకు ప్రతిష్ఠితమగును.౹

31 ఒకడు తాను చెల్లింపవలసిన దశమభాగములలో దేనినైనను విడిపింప గోరినయెడల దానిలో అయిదవ వంతును దానితో కలుపవలెను.౹

32 గోవులలోనేగాని గొఱ్ఱెమేకలలోనేగాని, కోలక్రింద నడుచునన్నిటిలో దశమభాగము ప్రతిష్ఠితమగును.౹

33 అది మంచిదో చెడ్డదో పరిశోధింపకూడదు, దాని మార్చకూడదు. దాని మార్చినయెడల అదియు దానికి మారుగా నిచ్చినదియు ప్రతిష్ఠితములగును; అట్టిదాని విడిపింప కూడ దని చెప్పుము.

34 ఇవి యెహోవా సీనాయికొండమీద ఇశ్రాయేలీయుల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/LEV/27-4ac3f6855101f85c6cab8b7894f2c27e.mp3?version_id=1787—

Categories
సంఖ్యాకాండము

సంఖ్యాకాండము 1

1 వారు ఐగుప్తుదేశమునుండి బయలువెళ్లిన రెండవ సంవత్సరము రెండవనెల మొదటి తేదిని, సీనాయి అరణ్య మందలి ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోషేతో ఇట్లనెను

2 –ఇశ్రాయేలీయుల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములనుబట్టి వారి వారి పెద్దలచొప్పున మగవారినందరిని లెక్కించి సర్వసమాజసంఖ్యను వ్రాయించుము.౹

3 ఇశ్రాయేలీయులలో సైన్యముగా వెళ్లువారిని, అనగా ఇరువది యేండ్లు మొదలుకొని పైప్రాయముగల వారిని, తమతమ సేనలనుబట్టి నీవును అహరోనును లెక్కింపవలెను.౹

4 మరియు ప్రతి గోత్రములో ఒకడు, అనగా తన పితరుల కుటుంబములో ముఖ్యుడు, మీతోకూడ ఉండవలెను.౹

5 మీతోకూడ ఉండవలసినవారి పేళ్లు ఏవేవనగా–రూబేను గోత్రములో షెదేయూరు కుమారుడైన ఏలీసూరు;౹

6 షిమ్యోను గోత్రములో సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు

7 యూదా గోత్రములో అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను

8 ఇశ్శాఖారు గోత్రములో సూయారు కుమారుడైన నెతనేలు

9 జెబూలూను గోత్రములో హేలోను కుమారుడైన ఏలీయాబు

10 యోసేపు సంతానమందు, అనగా ఎఫ్రాయిము గోత్రములో అమీహూదు కుమారుడైన ఎలీషామా; మనష్షే గోత్రములో పెదాసూరు కుమారుడైన గమలీయేలు

11 బెన్యామీను గోత్రములో గిద్యోనీ కుమారుడైన అబీదాను

12 దాను గోత్రములో అమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు

13 ఆషేరు గోత్రములో ఒక్రాను కుమారుడైన పగీయేలు

14 గాదు గోత్రములో దెయూవేలు కుమారుడైన ఎలీయాసాపు

15 నఫ్తాలి గోత్రములో ఏనాను కుమారుడైన అహీర అనునవి.౹

16 వీరు సమాజములో పేరు పొందినవారు. వీరు తమతమపితరుల గోత్రములలో ప్రధానులు ఇశ్రాయేలీయుల కుటుంబములకు పెద్దలును.౹

17 పేళ్ల చేత వివరింపబడిన ఆ మనుష్యులను మోషే అహరోనులు పిలుచుకొని రెండవనెల మొదటి తేదిని సర్వసమాజమును కూర్చెను.౹

18 ఇరువది ఏండ్లు మొదలుకొని పై ప్రాయముగలవారు తమతమ వంశావళులనుబట్టి తమతమ వంశములను తమతమపితరుల కుటుంబములను తమతమ పెద్దల సంఖ్యను తెలియచెప్పగా

19 యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సీనాయి అరణ్యములో మోషే వారిని లెక్కించెను.

20 ఇశ్రాయేలు ప్రథమ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియ చెప్పగా రూబేను గోత్రములో లెక్కింపబడినవారు నలుబది యారువేల ఐదువందలమంది యైరి.

21-22 షిమ్యోను పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి పెద్దల సంఖ్యను తెలియచెప్పగా

23 షిమ్యోను గోత్రములో లెక్కింపబడినవారు ఏబది తొమ్మిదివేల మూడు వందలమంది యైరి.

24 గాదు పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా

25 గాదు గోత్రములో లెక్కింప బడినవారు నలుబది యయిదువేల ఆరువందల ఏబదిమంది యైరి.

26 యూదా పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా

27 యూదా గోత్రములో లెక్కింపబడినవారు డెబ్బది నాలుగువేల ఆరువందలమంది యైరి.

28 ఇశ్శాఖారు పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా

29 ఇశ్శాఖారు గోత్రములో లెక్కింపబడినవారు ఏబది నాలుగువేల నాలుగువందలమంది యైరి.

30 జెబూలూను పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా

31 జెబూలూను గోత్రములో లెక్కింపబడినవారు ఏబదియేడువేల నాలుగువందలమంది యైరి.

32 యోసేపు పుత్రుల వంశావళి, అనగా ఎఫ్రాయిము పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లు వారందరి సంఖ్యను తెలియచెప్పగా

33 యోసేపు గోత్రములో లెక్కింపబడినవారు నలుబదివేల ఐదువందలమంది యైరి.

34 మనష్షే పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా

35 మనష్షే గోత్రములో లెక్కింప బడినవారు ముప్పది రెండువేల రెండువందలమంది యైరి.

36 బెన్యామీను పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా

37 బెన్యామీను గోత్రములో లెక్కింపబడినవారు ముప్పది యైదువేల నాలుగువందలమంది యైరి.

38 దాను పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా

39 దానుగోత్రములో లెక్కింప బడినవారు అరువది రెండువేల ఏడువందలమంది యైరి.

40 ఆషేరు పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా

41 ఆషేరు గోత్రములో లెక్కింప బడినవారు నలువది యొకవేయి ఐదువందలమంది యైరి.

42 నఫ్తాలి పుత్రుల వంశావళి. తమతమ వంశములలో తమతమపితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా

43 నఫ్తాలి గోత్రములో లెక్కింప బడినవారు ఏబది మూడువేల నాలుగువందలమంది యైరి.

44 వీరు లెక్కింపబడినవారు, అనగా మోషేయు అహరోనును తమతమపితరుల కుటుంబములనుబట్టి ఒక్కొక్కడుగా ఏర్పడిన ప్రధానులును లెక్కించినవారు.౹

45 అట్లు ఇశ్రాయేలీయులలో తమతమపితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరు, అనగా ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా బయలు వెళ్లిన ఇశ్రాయేలీయులందరు

46 లెక్కింపబడి ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబదిమంది యైరి.

47 అయితే లేవీయులు తమపితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు.౹

48 ఏలయనగా యెహోవా మోషేతో ఈలాగు సెలవిచ్చియుండెను –నీవు లేవీగోత్రమును లెక్కింపకూడదు.౹

49 ఇశ్రాయేలీయుల మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు.౹

50 నీవు సాక్ష్యపు గుడారము మీదను దాని ఉపకరణములన్నిటిమీదను దానిలో చేరిన వాటన్నిటిమీదను లేవీయులను నియమింపుము. వారే మందిరమును దాని ఉపకరణములన్నిటిని మోయవలెను. వారు మందిరపు సేవచేయుచు దానిచుట్టు దిగవలసినవారై యుందురు.౹

51 మందిరము సాగబోవునప్పుడు లేవీయులే దాని విప్పవలెను, మందిరము దిగునప్పుడు లేవీయులే దాని వేయవలెను. అన్యుడు సమీపించినయెడలవాడు మరణశిక్ష నొందును.౹

52 ఇశ్రాయేలీయులు తమతమ సేనల చొప్పున ప్రతివాడును తన తన పాళెములో తన తన ధ్వజము నొద్ద దిగవలెను.౹

53 ఇశ్రాయేలీయుల సమాజముమీద కోపము రాకుండునట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము చుట్టు దిగవలెను; వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలెను.౹

54 యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని తప్పకుండ ఇశ్రాయేలీయులు చేసిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/NUM/1-3beb059867f4db975fba7eb1f684342b.mp3?version_id=1787—

Categories
సంఖ్యాకాండము

సంఖ్యాకాండము 2

1 మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను.౹

2 –ఇశ్రాయేలీయులందరు తమతమపితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకొని తమతమ ధ్వజము నొద్ద దిగవలెను, వారు ప్రత్యక్షపు గుడారమున కెదురుగా దానిచుట్టు దిగవలెను.౹

3 సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదా పాళెపు ధ్వజము గలవారు తమతమ సేనలచొప్పున దిగవలెను. అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను యూదా కుమారులకు ప్రధానుడు.౹

4 అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు డెబ్బదినాలుగువేల ఆరువందలమంది.౹

5 అతని సమీపమున ఇశ్శాఖారు గోత్రికులు దిగవలెను. సూయారు కుమారుడైన నెతనేలు ఇశ్శాఖారు కుమారులకు ప్రధానుడు.౹

6 అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడిన పురుషులు ఏబది నాలుగు వేల నాలుగువందలమంది.౹

7 అతని సమీపమున జెబూలూను గోత్రికులుండవలెను. హేలోను కుమారుడైన ఏలీయాబు జెబూలూనీయులకు ప్రధానుడు.౹

8 అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు ఏబదియేడువేల నాలుగువందలమంది.౹

9 యూదా పాళెములో లెక్కింప బడిన వారందరు వారి సేనలచొప్పున లక్షయెనుబది యారువేల నాలుగువందలమంది. వారు ముందర సాగి నడవవలెను.

10 రూబేను పాళెపు ధ్వజము వారి సేనలచొప్పున దక్షిణ దిక్కున ఉండవలెను. షెదేయూరు కుమారుడైన ఏలీసూరు రూబేను కుమారులకు ప్రధానుడు.౹

11 అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు నలుబది యారువేల ఐదువందలమంది.౹

12 అతని సమీపమున షిమ్యోను గోత్రికులు దిగవలెను. సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు షిమ్యోను కుమారులకు ప్రధానుడు.౹

13 అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ఏబది తొమ్మిది వేల మూడువందలమంది.౹

14 అతని సమీపమున గాదు గోత్రముండవలెను. రగూయేలు కుమారుడైన ఎలీయాసాపు గాదు కుమారులకు ప్రధానుడు.౹

15 అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబది యయిదువేల ఆరువందల ఏబదిమంది.౹

16 రూబేను పాళెములో లెక్కింపబడిన వారందరు వారి సేనలచొప్పున లక్షయేబదియొకవేయి నాలుగువందల ఏబదిమంది. వారు రెండవ తెగలో సాగినడవవలెను.

17 ప్రత్యక్షపు గుడారము లేవీయుల పాళెముతో పాళెముల నడుమను సాగి నడవవలెను. వారెట్లు దిగుదురో అట్లే తమతమ ధ్వజములనుబట్టి ప్రతివాడును తన తన వరుసలో సాగి నడవవలెను.

18 ఎఫ్రాయిము సేనలచొప్పున వారి పాళెపుధ్వజము పడమటిదిక్కున ఉండవలెను. అమీహూదు కుమారుడైన ఎలీషామా ఎఫ్రాయిము కుమారులకు ప్రధానుడు.౹

19 అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబదివేల ఐదువందలమంది.౹

20 అతని సమీపమున మనేష్ష గోత్రముండవలెను. పెదాసూరు కుమారుడైన గమలీయేలు మనష్షే కుమారులలో ప్రధానుడు.౹

21 అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు ముప్పది రెండువేల రెండువందలమంది.౹

22 అతని సమీపమున బెన్యామీను గోత్రముండవలెను. గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీను కుమారులకు ప్రధానుడు.౹

23 అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ముప్పది యయిదువేల నాలుగువందలమంది.౹

24 ఎఫ్రాయిము పాళెములో లెక్కింపబడిన వారందరు వారి సేనలచొప్పున లక్షయెనిమిదివేల నూరుమంది. వారు మూడవగుంపులో సాగి నడవవలెను.

25 దాను పాళెపుధ్వజము వారి సేనలచొప్పున ఉత్తర దిక్కున ఉండవలెను. అమీషద్దాయి కుమారుడైన అహీ యెజెరు దాను కుమారులకు ప్రధానుడు.౹

26 అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు అరువది రెండువేల ఏడువందలమంది.౹

27 అతని సమీపమున ఆషేరు గోత్రికులు దిగవలెను. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరు కుమారులకు ప్రధానుడు.౹

28 అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబదియొకవేయి ఐదువందలమంది.౹

29 అతని సమీపమున నఫ్తాలి గోత్రికు లుండవలెను. ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలి కుమారులకు ప్రధానుడు.౹

30 అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ఏబదిమూడువేల నాలుగువందలమంది.౹

31 దాను పాళెములో లెక్కింపబడినవారందరు లక్ష యేబదియేడువేల ఆరువందలమంది. వారు తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో నడవవలెను.

32 వీరు ఇశ్రాయేలీయులలో తమతమపితరుల కుటుంబముల ప్రకారము లెక్కింపబడినవారు. తమతమ సేనల చొప్పున తమతమ పాళెములలో లెక్కింపబడినవారందరు ఆరులక్షల మూడువేల ఐదువందల ఏబదిమంది.౹

33 అయితే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీయులు ఇశ్రాయేలీయులలో తమ్మును లెక్కించుకొనలేదు.౹

34 అట్లు ఇశ్రాయేలీయులు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సమస్తమును చేసిరి. అట్లువారు తమతమ వంశములచొప్పునను తమతమపితరుల కుటుంబముల చొప్పునను ప్రతివాడు తన తన ధ్వజమునుబట్టి దిగుచు సాగుచునుండిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/NUM/2-35ec383dd2a7a44821e2440b925db885.mp3?version_id=1787—

Categories
సంఖ్యాకాండము

సంఖ్యాకాండము 3

1 యెహోవా సీనాయికొండమీద మోషేతో మాటలాడిన నాటికి అహరోను మోషేల వంశావళులు ఇవే.౹

2 అహరోను కుమారుల పేరులు ఏవనగా, తొలుతపుట్టిన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు అనునవే.౹

3 ఇవి అభిషేకమునొంది యాజకులైన అహరోను కుమారుల పేరులు; వారు యాజకులగునట్లు అతడు వారిని ప్రతిష్ఠించెను.౹

4 నాదాబు అబీహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగ్ని నర్పించినందునవారు యెహోవా సన్నిధిని చనిపోయిరి. వారికి కుమారులు కలుగలేదు గనుక ఎలియాజరు ఈతామారును తమ తండ్రియైన అహరోను ఎదుట యాజకసేవ చేసిరి.

5 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –నీవు లేవి గోత్రికులను తీసికొనివచ్చి

6 వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలువబెట్టుము.౹

7 వారు ప్రత్యక్షపు గుడారము నెదుట మందిరపుసేవ చేయవలెను. తాము కాపాడ వలసినదానిని, సర్వసమాజము కాపాడ వలసినదానిని, వారు కాపాడవలెను.౹

8 మందిరపు సేవచేయుటకు ప్రత్యక్షపు గుడారముయొక్క ఉపకరణములన్నిటిని, ఇశ్రాయేలీయులు కాపాడవలసినదంతటిని, వారే కాపాడవలెను.౹

9 కాగా నీవు లేవీయులను అహరోనుకును అతని కుమారులకును అప్పగింపవలెను. వారు ఇశ్రాయేలీయులలోనుండి అతని వశము చేయబడినవారు.౹

10 నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలెను. వారు తమ యాజకధర్మము ననుసరించి నడుచుకొందురు. అన్యుడు సమీపించినయెడలవాడు మరణశిక్ష నొందును.

11 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –ఇదిగో నేను ఇశ్రాయేలీయులలో తొలిచూలియైన ప్రతి మగపిల్లకు మారుగా

12 ఇశ్రాయేలీయులలోనుండి లేవీయులను నా వశము చేసికొని యున్నాను. ప్రతి తొలిచూలియు నాది గనుక లేవీయులు నావారైయుందురు.౹

13 ఐగుప్తుదేశములో నేను ప్రతి తొలిచూలును సంహరించిన నాడు మనుష్యుల తొలిచూలులనేమి పశువుల తొలి చూలులనేమి ఇశ్రాయేలీయులలో అన్నిటిని నాకొరకు ప్రతిష్ఠించుకొంటిని; వారు నావారైయుందురు. నేనే యెహోవాను.

14 మరియు సీనాయి అరణ్యమందు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.౹

15 –లేవీయుల పితరుల కుటుంబములను వారివారి వంశములను లెక్కింపుము. ఒక నెల మొదలుకొని పైప్రాయముగల మగవారినందరిని లెక్కింపవలెను.౹

16 కాబట్టి మోషే యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు ఆయన మాటచొప్పున వారిని లెక్కించెను.౹

17 లేవి కుమారుల పేళ్లు గెర్షోను కహాతు మెరారి అనునవి.౹

18 గెర్షోను కుమారుల వంశకర్తల పేళ్లు లిబ్నీ షిమీ అనునవి.౹

19 కహాతు కుమారుల వంశకర్తల పేళ్లు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జీయేలు అనునవి.౹

20 మెరారి కుమారుల వంశకర్తల పేళ్లు మహలి మూషి. వారివారి పితరుల కుటుంబముల చొప్పున ఇవి లేవీయుల వంశములు.౹

21 లిబ్నీయులు షిమీయులు గెర్షోను వంశస్థులు గెర్షోనీయుల వంశపువారు వీరే.౹

22 వారిలో లెక్కింప బడినవారు అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయముగల మగవారందరిలో లెక్కింపబడినవారు ఏడువేల ఐదువందలమంది.౹

23 గెర్షోనీయుల వంశములు మందిరము వెనుకను, అనగా పడమటి దిక్కున దిగవలెను.౹

24 గెర్షోనీయుల పితరుల కుటుంబములో లాయేలు కుమారుడైన ఎలీయాసాపు ప్రధానుడు.౹

25 ప్రత్యక్షపు గుడారములో గెర్షోను కుమారులు కాపాడవలసిన వేవనగా, మందిరము గుడారము దాని పైకప్పు ప్రత్యక్షపు గుడారము ద్వారపు తెరయు

26 ప్రాకారయవనికలు మందిరమునకును బలిపీఠమునకును చుట్టునున్న ప్రాకార ద్వారపు తెరయు దాని సమస్త సేవకొరకైన త్రాళ్లును.

27 కహాతు వంశమేదనగా, అమ్రామీయుల వంశము ఇస్హారీయుల వంశము హెబ్రోనీయుల వంశము ఉజ్జీయేలీయుల వంశము; ఇవి కహాతీయుల వంశములు.౹

28 ఒక నెల మొదలుకొని పైప్రాయముగల మగవారందరి లెక్క చూడగా ఎనిమిదివేల ఆరువందలమంది పరిశుద్ధ స్థలమును కాపాడవలసినవారైరి.౹

29 కహాతు కుమారుల వంశములు మందిరముయొక్క ప్రక్కను, అనగా దక్షిణదిక్కున దిగవలసినవారు.౹

30 కహాతీయుల వంశముల పితరుల కుటుంబమునకు ప్రధానుడు ఉజ్జీయేలు కుమారుడైన ఎలీషాపాను.౹

31 వారు మందసము బల్ల దీపవృక్షము వేదికలు తాము సేవచేయు పరిశుద్ధస్థలములోని ఉపకరణములు అడ్డతెరయు కాపాడి దాని సమస్త సేవయు జరుపవలసినవారు.౹

32 యాజకుడైన అహరోను కుమారుడగు ఎలియాజరు లేవీయుల ప్రధానులకు ముఖ్యుడు. అతడు పరిశుద్ధస్థలమును కాపాడు వారిమీద విచారణకర్త.

33 మెరారి వంశమేదనగా, మహలీయుల వంశము మూషీయుల వంశము; ఇవి మెరారి వంశములు.౹

34 వారిలో లెక్కింపబడినవారెందరనగా, ఒక నెల మొదలుకొని పైప్రాయముగల మగవారందరు ఆరువేల రెండువందలమంది.౹

35 మెరారీయుల పితరుల కుటుంబములో అబీహా యిలు కుమారుడైన సూరీయేలు ప్రధానుడు. వారు మందిరమునొద్ద ఉత్తరదిక్కున దిగవలసినవారు.౹

36 మెరారి కుమారులు మందిరముయొక్క పలకలను దాని అడ్డకఱ్ఱలను దాని స్తంభములను దాని దిమ్మలను దాని ఉపకరణములన్నిటిని దాని సేవకొరకైనవన్నిటిని

37 దాని చుట్టునున్న ప్రాకార స్తంభములను వాటి దిమ్మలను వాటి మేకులను వాటి త్రాళ్లను కాపాడవలసినవారు.౹

38 మందిరము ఎదుటి తూర్పుదిక్కున, అనగా ప్రత్యక్షపు గుడారము ఎదుటి పూర్వదిశయందు దిగవలసినవారు మోషే అహరోనులు అహరోను కుమారులు; ఇశ్రాయేలీయులు కాపాడ వలసిన పరిశుద్ధస్థలమును వారే కాపాడవలెను. అన్యుడు సమీపించినయెడల అతడు మరణశిక్ష నొందును.౹

39 మోషే అహరోనులు యెహోవా మాటనుబట్టి, తమతమ వంశములచొప్పున లెక్కించిన లేవీయులలో లెక్కింపబడిన వారందరు, అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరు ఇరువది రెండువేలమంది.

40 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను –నీవు ఇశ్రాయేలీయులలో ఒక నెల మొదలుకొని పై ప్రాయముగల తొలిచూలియైన ప్రతిమగవానిని లెక్కించి వారి సంఖ్యను వ్రాయించుము.౹

41 నేనే యెహోవాను; నీవు ఇశ్రాయేలీయులలో తొలిచూలియైన ప్రతి మగపిల్లకు మారుగా లేవీయులను ఇశ్రాయేలీయుల పశువులలో తొలిచూలియైన ప్రతి దానికి మారుగా లేవీయుల పశువులను నా నిమిత్తము తీసికొనవలెను.౹

42 కాబట్టి యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలీయులలో తొలుత పుట్టినవారినందరిని లెక్కించెను.౹

43 వారిలో లెక్కింపబడిన వారి సంఖ్య, అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయము గల తొలిచూలి మగవారందరి సంఖ్య యిరువది రెండువేల రెండువందల డెబ్బదిమూడు.

44 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

45 –నీవు ఇశ్రాయేలీయులలో తొలిచూలియైన ప్రతివానికి మారుగా లేవీయులను వారి పశువులకు ప్రతిగా లేవీయుల పశువులను తీసికొనుము. లేవీయులు నా వారైయుందురు; నేనే యెహోవాను.౹

46 ఇశ్రాయేలీయులకు తొలుత పుట్టిన వారిలో లేవీయులకంటె రెండువందల డెబ్బది ముగ్గురు ఎక్కువైనందున శేషించినవారియొద్ద తలకొక అయిదేసి తులముల వెండిని తీసికొనవలెను.౹

47 పరిశుద్ధమైన తులము చొప్పున వాటిని తీసికొనవలెను.౹

48 తులము ఇరువది చిన్నములు. వారిలో ఎక్కువ మంది విమోచనకొరకు ఇయ్య బడిన ధనమును అహరోనుకును అతని కుమారులకును ఇయ్యవలెను.౹

49 కాబట్టి మోషే లేవీయులవలన విడిపింప బడినవారికంటె ఆ యెక్కువైన వారియొక్క విమోచన ధనమును తీసికొనెను.౹

50 పరిశుద్ధమైన తులముచొప్పున వెయ్యి మూడువందల అరువదియైదు తులముల ధనమును ఇశ్రాయేలీయుల జ్యేష్ఠకుమారులయొద్ద తీసికొనెను.౹

51 యెహోవా మోషే కాజ్ఞాపించినట్లు యెహోవా నోటి మాటచొప్పున అహరోనుకును అతని కుమారులకును విడిపింపబడిన వారి విమోచన ధనమును మోషే యిచ్చెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/NUM/3-0ff3497fcab71910c9d6defb8341ad7f.mp3?version_id=1787—