Categories
1 యోహాను

1 యోహాను 2

1 నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవ డైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాదితండ్రియొద్ద మనకున్నాడు.౹

2 ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు;మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు.౹

3 మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనినయెడల, దీనివలననే ఆయనను ఎరిగియున్నామని తెలిసి కొందుము.౹

4 ఆయనను ఎరిగియున్నానని చెప్పుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు; వానిలో సత్యములేదు.౹

5-6 ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను; ఆయనయందు నిలిచియున్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఏలాగు నడుచుకొనెనో ఆలాగే తానును నడుచు కొన బద్ధుడైయున్నాడు. మనమాయనయందున్నామని దీనివలన తెలిసికొనుచున్నాము.

7 ప్రియులారా, మొదటనుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనేగాని క్రొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయుటలేదు; ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే.౹

8 మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయుచున్నాను. చీకటి గతించు చున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయనయందును మీయందును సత్యమే.౹

9 వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటివరకును చీకటిలోనే యున్నాడు.౹

10 తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు; అతనియందు అభ్యంతరకారణమేదియు లేదు.౹

11 తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి, చీకటిలో నడుచుచున్నాడు; చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగజేసెను గనుక తానెక్కడికి పోవు చున్నాడో అతనికి తెలియదు.

12 చిన్నపిల్లలారా, ఆయన నామముబట్టి మీ పాపములు క్షమింపబడినవి గనుక మీకు వ్రాయుచున్నాను.౹

13 తండ్రులారా, మీరు ఆదినుండి యున్నవానిని ఎరిగి యున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యౌవనస్థులారా, మీరు దుష్టుని జయించియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను.౹

14 చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. తండ్రులారా, మీరు ఆదినుండి యున్నవానిని ఎరిగి యున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను. యౌవనస్థులారా, మీరు బలవంతులు, దేవునివాక్యము మీయందు నిలుచుచున్నది; మీరు దుష్టుని జయించియున్నారు గనుక మీకు వ్రాయుచున్నాను.౹

15 ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినయెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు.౹

16 లోకములో ఉన్నదంతయు, అనగా శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే.౹

17 లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును.

18 చిన్నపిల్లలారా, యిది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరియున్నారు; ఇది కడవరి గడియ అని దీనిచేత తెలిసికొనుచున్నాము.౹

19 వారు మనలోనుండి బయలువెళ్లిరి గాని వారు మన సంబంధులు కారు; వారు మన సంబంధులైతే మనతోకూడ నిలిచియుందురు; అయితే వారందరు మన సంబంధులు కారని ప్రత్యక్ష పరచబడునట్లువారు బయలువెళ్లిరి.౹

20 అయితే మీరు పరిశుద్ధునివలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు.౹

21 మీరు సత్యమెరుగనివారైనందున నేను వ్రాయలేదు గాని, మీరు దానిని ఎరిగియున్నందునను, ఏ అబద్ధమును సత్యసంబంధమైనది కాదని యెరిగి యున్నందునను మీకు వ్రాయుచున్నాను.౹

22 యేసు, క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తువిరోధి.౹

23 కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడుకాడు; కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించు వాడు.౹

24 అయితే మీరు మొదటనుండి దేనిని వింటిరో అది మీలో నిలువనియ్యుడి; మీరు మొదటనుండి వినినది మీలో నిలిచినయెడల, మీరు కూడ కుమారునియందును తండ్రియందును నిలుతురు.౹

25 నిత్యజీవము అనుగ్రహింతు ననునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము.౹

26 మిమ్మును మోసపరచువారినిబట్టి యీ సంగతులు మీకు వ్రాసియున్నాను.౹

27 అయితే ఆయనవలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు; ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు; అది అన్నిటినిగూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను, ఆయన మీకు బోధించిన ప్రకారముగాను, ఆయనలో మీరు నిలుచుచున్నారు౹

28 కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్ష మగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన యెదుట సిగ్గుపడక ధైర్యము కలిగియుండునట్లు మీరాయనయందు నిలిచియుండుడి.౹

29 ఆయన నీతిమంతుడని మీరెరిగి యున్నయెడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టియున్నాడని యెరుగుదురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1JN/2-c95e3adce1fb820e8dd5d1ea9075397b.mp3?version_id=1787—

Categories
1 యోహాను

1 యోహాను 3

1 మనము దేవుని పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మన కెట్టి ప్రేమ ననుగ్రహించెనోచూడుడి; మనము దేవుని పిల్లలమే. ఈ హేతువుచేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు.౹

2 ప్రియులారా, యిప్పుడు మనము దేవుని పిల్లలమై యున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగు దుము.౹

3 ఆయనయందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై యున్నట్టుగా తన్ను పవి త్రునిగా చేసికొనును.౹

4 పాపముచేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును; ఆజ్ఞాతిక్రమమే పాపము.౹

5 పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెనని మీకు తెలియును; ఆయనయందు పాపమేమియు లేదు.౹

6 ఆయనయందు నిలిచియుండువాడెవడును పాపము చేయడు; పాపము చేయువాడెవడును ఆయనను చూడను లేదు ఎరుగనులేదు.౹

7 చిన్నపిల్లలారా, యెవనిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడైయున్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు.౹

8 అపవాదిమొదటనుండి పాపము చేయుచున్నాడు గనుక పాపముచేయు వాడు అపవాది సంబంధి; అపవాదియొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను.౹

9 దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపముచేయడు; వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు.౹

10 దీనినిబట్టి దేవుని పిల్లలెవరో అపవాదిపిల్లలెవరో తేట పడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు.౹

11 మనమొకని నొకడు ప్రేమింపవలెననునది మొదటనుండి మీరు వినిన వర్తమానమేగదా౹

12 మనము కయీను వంటి వారమై యుండరాదు. వాడు దుష్టుని సంబంధియై తన సహోదరుని చంపెను; వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై యుండెను గనుకనే గదా?

13 సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించినయెడల ఆశ్చర్యపడకుడి.౹

14 మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములోనుండి జీవములోనికి దాటియున్నామని యెరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచియున్నాడు.౹

15 తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు; ఏ నరహంతకునియందును నిత్యజీవముండదని మీరెరుగుదురు.౹

16 ఆయన మన నిమిత్తము తన ప్రాణముపెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము. మనము కూడ సహోదరులనిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై యున్నాము.౹

17 ఈ లోకపు జీవనోపాధిగలవాడైయుండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అతనియెడల ఎంతమాత్రమును కనికరము చూపనివానియందు దేవుని ప్రేమ యేలాగు నిలుచును?౹

18 చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతము.౹

19-20 ఇందు వలన మనము సత్యసంబంధులమని యెరుగుదుము. దేవుడు మన హృదయముకంటె అధికుడై, సమస్తమును ఎరిగి యున్నాడు గనుక మన హృదయము ఏ యే విషయములలో మనయందు దోషారోపణ చేయునో ఆయా విష యములలో ఆయన యెదుట మన హృదయములను సమ్మతి పరచుకొందము.౹

21 ప్రియులారా, మన హృదయము మనయందు దోషారోపణ చేయనియెడల దేవుని యెదుట ధైర్యముగలవారమగుదుము.౹

22 మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక, మనమేమి అడిగినను అది ఆయనవలన మనకు దొరుకును.౹

23 ఆయన ఆజ్ఞ యేదనగా–ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని, ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింపవలెననునదియే.౹

24 ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయనయందు నిలిచియుండును, ఆయన వానియందు నిలిచి యుండును; ఆయన మనయందు నిలిచియున్నాడని ఆయన మనకనుగ్రహించినఆత్మమూలముగా తెలిసికొనుచున్నాము.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1JN/3-495b9e0ee764c684a4f8ef3c5490799c.mp3?version_id=1787—

Categories
1 యోహాను

1 యోహాను 4

1 ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి.౹

2-3 యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని, యే ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది; యే ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు; దీనినిబట్టియే దేవునిఆత్మను మీరెరుగుదురు. క్రీస్తువిరోధి ఆత్మ వచ్చునని మీరు వినినసంగతి ఇదే; యిదివరకే అది లోకములో ఉన్నది.౹

4 చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు; మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటె గొప్పవాడు గనుక మీరు వారిని జయించియున్నారు.౹

5 వారు లోకసంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాటలాడుదురు, లోకము వారి మాట వినును.౹

6 మనము దేవుని సంబంధులము; దేవుని ఎరిగినవాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ యేదో, భ్రమపరచు ఆత్మ యేదో తెలిసికొనుచున్నాము.

7 ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము; ఏలయనగా ప్రేమ దేవునిమూలముగా కలుగుచున్నది; ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును.౹

8 దేవుడు ప్రేమాస్వరూపి,ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు.౹

9 మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయకుమారుని లోకములోనికి పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను.౹

10 మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది.౹

11 ప్రియులారా, దేవుడు మన లను ఈలాగు ప్రేమింపగా మనమొకనినొకడు ప్రేమింప బద్ధులమై యున్నాము.౹

12 ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచియుండ లేదు; మన మొకనినొకడు ప్రేమించినయెడల దేవుడు మనయందు నిలిచియుండును; ఆయన ప్రేమ మనయందు సంపూర్ణమగును.౹

13 దీనివలన మనము ఆయనయందు నిలిచియున్నామనియు ఆయన మనయందున్నాడనియు తెలిసికొనుచున్నాము; ఏలయనగా ఆయన మనకు తనఆత్మలో పాలు దయచేసియున్నాడు.౹

14 మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి, సాక్ష్యమిచ్చుచున్నాము.౹

15 యేసు దేవుని కుమారుడని యెవడు ఒప్పు కొనునో, వానిలో దేవుడు నిలిచియున్నాడు, వాడు దేవునియందున్నాడు.౹

16 మనయెడల దేవునికి ఉన్న ప్రేమను మనమెరిగినవారమై దాని నమ్ముకొనియున్నాము; దేవుడు ప్రేమాస్వరూపియై యున్నాడు,ప్రేమయందు నిలిచి యుండువాడు దేవునియందు నిలిచియున్నాడు, దేవుడు వానియందు నిలిచియున్నాడు.౹

17 తీర్పుదినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి యున్నది; ఏలయనగా ఆయన ఎట్టివాడై యున్నాడో మనము కూడ ఈ లోకములో అట్టివారమై యున్నాము.౹

18 ప్రేమలో భయముండదు; అంతేకాదు; పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్లగొట్టును; భయము దండ నతోకూడినది; భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు.౹

19 ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము.౹

20 ఎవడైనను–నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, తన సహోదరుని ద్వేషించినయెడల అతడు అబద్ధికుడగును; తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు౹

21 దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడ ప్రేమింపవలెనను ఆజ్ఞను మనమాయనవలన పొందియున్నాము.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1JN/4-67f6da5e0c94bd7919435b64fe360ec7.mp3?version_id=1787—

Categories
1 యోహాను

1 యోహాను 5

1 యేసే క్రీస్తయి యున్నాడని నమ్ము ప్రతివాడును దేవునిమూలముగా పుట్టియున్నాడు. పుట్టించినవానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును.౹

2 మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దానివలననే యెరుగుదుము.౹

3 మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.౹

4 దేవుని మూలముగా పుట్టినవారందరునులోకమును జయించుదురు; లోకమును జయించిన విజయము మన విశ్వాసమే౹

5 యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు?౹

6 నీళ్లద్వారాను రక్తముద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతోమాత్రమేగాక నీళ్లతోను5 రక్తముతోను వచ్చెను.ఆత్మసత్యము గనుక సాక్ష్యమిచ్చువాడుఆత్మయే.౹

7-8 సాక్ష్య మిచ్చువారు ముగ్గురు, అనగాఆత్మయు, నీళ్లును, రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించియున్నారు.౹

9 మనము మనుష్యుల సాక్ష్యము అంగీకరించుచున్నాము గదా! దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి యిచ్చినదే.౹

10 దేవుని కుమారునియందు విశ్వాసముంచువాడు తనలోనే యీ సాక్ష్యము కలిగియున్నాడు; దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారునిగూర్చి యిచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసినవాడే.౹

11 ఆ సాక్ష్యమేమనగా–దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను; ఈ జీవము ఆయన కుమారునియందున్నది.౹

12 దేవుని కుమారుని అంగీకరించువాడు జీవముగలవాడు; దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవములేని వాడే.

13 దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవముగలవారని తెలిసికొనునట్లు నేను ఈ సంగతు లను మీకు వ్రాయుచున్నాను.౹

14 ఆయననుబట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మన మేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే.౹

15 మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మన మెరిగినయెడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగిన వని యెరుగుదుము.౹

16 తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచినయెడల అతడు వేడు కొనును; అతనిబట్టి దేవుడు మరణకరముకాని పాపము చేసినవారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు. అట్టిదానిగూర్చి వేడుకొనవలెనని నేను చెప్పుట లేదు.౹

17 సకల దుర్నీతియు పాపము; అయితే మరణకరము కాని పాపము కలదు.

18 దేవుని మూలముగా పుట్టియున్నవాడెవడును పాపము చేయడని యెరుగుదుము. దేవునిమూలముగా పుట్టినవాడు తన్ను భద్రముచేసికొనును గనుక దుష్టుడు వాని ముట్టడు.౹

19 మనము దేవుని సంబంధులమనియు, లోకమంతయుదుష్టునియందున్నదనియుఎరుగుదుము.౹

20 మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చిమనకు వివేక మనుగ్రహించియున్నాడని యెరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్నవారమై సత్యవంతునియందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్యజీవమునై యున్నాడు.౹

21 చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండ జాగ్రత్తగా ఉండుడి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/1JN/5-7435293a9b781d7c4b1f139dd0c4129f.mp3?version_id=1787—

Categories
2 యోహాను

2 యోహాను 1

1 పెద్దైనెన నేను, ఏర్పరచబడినదైన అమ్మగారికిని, ఆమె పిల్లలకును శుభమని చెప్పి వ్రాయునది.౹

2 నేనును, నేను మాత్రమే గాక సత్యము ఎరిగినవారందరును, మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడుఉండు సత్యమునుబట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము.౹

3 సత్యప్రేమలు మనయందుండగా తండ్రియైన దేవుని యొద్దనుండియు, తండ్రియొక్క కుమారుడగు యేసుక్రీస్తునొద్దనుండియు కృపయు కనికరమును సమాధానమును మనకు తోడగును.

4 తండ్రివలన మనము ఆజ్ఞను పొందినప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించినడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను.౹

5 కాగా అమ్మా, క్రొత్త ఆజ్ఞ నీకు వ్రాసినట్టు కాదు గాని మొదటనుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయుచు, మనము ఒకరి నొకరము ప్రేమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను.౹

6 మనమాయన ఆజ్ఞలప్రకారము నడుచుటయే ప్రేమ; మీరు మొదటనుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలెను అనునదియే ఆ ఆజ్ఞ.౹

7 యేసుక్రీస్తు శరీరధారియై వచ్చెనని యొప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి యున్నారు.౹

8 అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునై యున్నాడు. మేము మీమధ్యను నెర వేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.౹

9 క్రీస్తుబోధయందు నిలిచియుండక దానిని విడిచి ముందునకుసాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు; ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించు వాడు.౹

10 ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చినయెడల వానిని మీ యింట చేర్చుకొనవద్దు; శుభమని వానితో చెప్పను వద్దు.౹

11 శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును.

12 అనేక సంగతులు మీకు వ్రాయవలసియుండియు సిరాతోను కాగితముతోను వ్రాయ మనస్సులేక మీ సంతోషము పరిపూర్ణమవునట్లు మిమ్మును కలిసికొని ముఖాముఖిగా మాటలాడ నిరీక్షించుచున్నాను.౹

13 ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/2JN/1-9f00639c952735b7e1ddde977b816ea4.mp3?version_id=1787—

Categories
3 యోహాను

3 యోహాను 1

1 పెద్దైనెన నేను సత్యమునుబట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునది.

2 ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోను వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండ వలెనని ప్రార్థించుచున్నాను.౹

3 నీవు సత్యమును అనుసరించినడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్యప్రవర్తననుగూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని.౹

4 నా పిల్లలు సత్యమును అనుసరించినడుచుకొనుచున్నారని వినుటకంటె నాకు ఎక్కువైన సంతోషము లేదు.

5 ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్ల విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు.౹

6-7 వారు నీ ప్రేమనుగూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్యజనులవలన ఏమియు తీసి కొనక ఆయన నామము నిమిత్తము బయలు దేరిరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపినయెడల నీకు యుక్తముగా ఉండును.౹

8 మనము సత్యమునకు సహాయ కులమవునట్టుఅట్టివారికి ఉపకారముచేయ బద్ధులమై యున్నాము.

9 నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని. అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియొత్రెఫే మమ్మును అంగీకరించుటలేదు.౹

10 వాడు మమ్మునుగూర్చి చెడ్డమాటలు వదరుచు, అది చాలనట్టుగా, సహోదరులను తానే చేర్చు కొనక, వారిని చేర్చుకొన మనస్సుగలవారిని కూడ ఆటంక పరచుచు సంఘములోనుండి వారిని వెలివేయుచున్నాడు; అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియ లను జ్ఞాపకము చేసికొందును.౹

11 ప్రియుడా, చెడుకార్యమును కాక మంచికార్యము ననుసరించి నడుచుకొనుము. మేలుచేయువాడు దేవుని సంబంధి, కీడుచేయువాడు దేవుని చూచినవాడుకాడు.౹

12 దేమేత్రియు అందరివలనను సత్యమువలనను మంచి సాక్ష్యము పొందినవాడు, మేము కూడ అతనికి సాక్ష్యమిచ్చుచున్నాము; మా సాక్ష్యము సత్యమైనదని నీ వెరుగుదువు.

13 అనేక సంగతులు నీకు వ్రాయవలసియున్నది గాని సిరాతోను కలముతోను నీకు వ్రాయ నాకిష్టము లేదు;౹

14 శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుచున్నాను; అప్పుడు ముఖాముఖిగా మాటలాడు కొనెదము. నీకు సమాధానము కలుగును గాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. నీ యొద్దనున్న స్నేహితులకు పేరు పేరు వరుసను వందనములు చెప్పుము.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/3JN/1-bb3db52e0476a5b17a1ca35c650944ec.mp3?version_id=1787—

Categories
యూదా

యూదా 1

1 యేసుక్రీస్తుదాసుడును, యాకోబు సహోదరుడునైన యూదా, తండ్రియైన దేవునియందు ప్రేమింపబడి, యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడినవారికి శుభమని చెప్పి వ్రాయునది.౹

2 మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక.

3 ప్రియులారా, మనకందరికి కలిగెడు రక్షణనుగూర్చి మీకు వ్రాయవలెనని విశేషాసక్తిగలవాడనై ప్రయత్నపడు చుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసివచ్చెను.౹

4 ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడియున్నారు. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగ పరచుచు, మన అద్వితీయనాధుడును ప్రభువునైన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు; ఈ తీర్పుపొందుటకు వారు పూర్వమందే సూచింపబడినవారు.

5 ఈ సంగతులన్నియు మీరు ముందటనే యెరిగి యున్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులోనుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయినవారిని తరువాత నాశనము చేసెను.౹

6 మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక, తమ నివాసస్థలమును విడిచిన దేవదూతలను, మహాదినమున జరుగు తీర్పువరకు కటికచీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి భద్రము చేసెను.౹

7 ఆప్రకారముగానే సొదొమ గొమొఱ్ఱాలును వాటి చుట్టుపెట్లనున్న పట్టణములును వీరివలెనే వ్యభిచారముచేయుచు, పరశరీరాను సారులైనందున నిత్యాగ్నిదండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడెను.౹

8 అటువలెనే వీరును కలలు కనుచు, శరీరమును అపవిత్రపరచుకొనుచు, ప్రభుత్వమును నిరాక రించుచు, మహాత్ములనుదూషించుచు ఉన్నారు.౹

9 అయితే ప్రధానదూతయైన మిఖాయేలు అపవాదితోవాదించుచు మోషేయొక్క శరీరమునుగూర్చి తర్కించి నప్పుడు, దూషించి తీర్పుతీర్చ తెగింపక–ప్రభువునిన్ను గద్దించును గాక అనెను.౹

10 వీరైతే తాము గ్రహింపని విషయములనుగూర్చి దూషించువారై, వివేకశూన్యములగు మృగములవలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటివలన తమ్మునుతాము నాశనముచేసికొనుచున్నారు.౹

11 అయ్యో వారికి శ్రమ. వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పుత్రోవలో ఆతురముగా పరుగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి.౹

12 వీరు నిర్భయముగా మీతో సుభోజనముచేయుచు, తమ్మునుతాము నిర్భయముగా పోషించుకొనుచు,మీ ప్రేమవిందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలిచేత ఇటు అటు కొట్టుకొనిపోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక, రెండు మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింప బడిన చెట్లుగాను,౹

13 తమ అవమానమను నురుగు వెళ్ల గ్రక్కువారై, సముద్రముయొక్క ప్రచండమైన అలలుగాను, మార్గముతప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు; వారికొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి యున్నది.౹

14-15 ఆదాము మొదలుకొని యేడవ వాడైన హనోకు కూడ వీరినిగూర్చి ప్రవచించి యిట్లనెను –ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును, వారిలో భక్తి హీనులందరును భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటినిగూర్చియు వారిని ఒప్పించుటకును,ప్రభువుతన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను.౹

16 వారు తమ దురాశలచొప్పున నడుచుచు, లాభమునిమిత్తము మనుష్యులను కొనియాడుచు,సణుగువారును తమ గతినిగూర్చి నిందించువారునై యున్నారు; వారి నోరు డంబమైన మాటలు పలుకును.

17-18 అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశలచొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపొస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసికొనుడి.౹

19 అట్టివారు ప్రకృతి సంబంధులునుఆత్మలేనివారునైయుండి భేదములు కలుగజేయుచున్నారు.౹

20-21 ప్రియులారా, మీరు విశ్వసించు అతిపరిశుద్ధమైనదానిమీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థనచేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరముకొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలొ నిలుచునట్లు కాచుకొని యుండుడి.౹

22 సందేహపడువారిమీద కనికరము చూపుడి.౹

23 అగ్నిలోనుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైనవారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పు కొనక దానినిఅసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి.

24-25 తొట్రిల్లకుండ మిమ్మును కాపాడుటకును, తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువ బెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా, మహిమయు మాహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములును కలుగును గాక. ఆమేన్.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JUD/1-a5f151c1c23620a4732e335727afb8a1.mp3?version_id=1787—

Categories
ప్రకటన

ప్రకటన 1

1 యుసుక్రీస్తుతన దాసులకు కనుపరచుటకు దేవుడాయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత.ఈ సంగతులు త్వరలో సంభవింపనైయున్నవి; ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను.౹

2 అతడు దేవుని వాక్యమునుగూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమునుగూర్చియు తాను చూచినంత మట్టుకుసాక్ష్యమిచ్చెను.౹

3 సమయము సమీపించినది గనుక ఈ ప్రవచనవాక్యములు చదువువాడును, వాటిని విని యిందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు.

4 యోహాను ఆసియలో ఉన్న యేడు సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. వర్తమాన భూతభవిష్య త్కాలములలో ఉన్నవానినుండియు, ఆయన సింహాసనము ఎదుటనున్న యేడు ఆత్మలనుండియు,౹

5 నమ్మకమైన సాక్షియు, మృతులలోనుండి ఆదిసంభూతుడుగా లేచినవాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండియు, కృపాసమాధానములు మీకు కలుగునుగాక.౹

6 మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపముల నుండి మనలను విడిపించినవానికిమహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను.౹

7 ఇదిగో ఆయన మేఘా రూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్.

8 అల్ఫాయు ఓమెగయు నేనే. వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధి కారియు దేవుడునగుప్రభువుసెలవిచ్చుచున్నాడు.

9 మీ సహోదరుడను, యేసునుబట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసునుగూర్చిన సాక్ష్యము నిమిత్తమును పత్మాసు ద్వీపమున పరవాసినైతిని.౹

10-11 ప్రభువు దినమందుఆత్మవశుడనై యుండగా బూరధ్వనివంటి గొప్పస్వరము–నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియ, లవొదికయ అను ఏడు సంఘములకు పంపుమని చెప్పుట నావెనుక వింటిని.౹

12 ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగితిని.౹

13 తిరుగగా ఏడు సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభములమధ్యను మనుష్యకుమారునిపోలిన యొకనిని చూచితిని. ఆయన తన పాదములమట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారుదట్టి కట్టుకొనియుండెను.౹

14 ఆయన తలయు తలవెండ్రుకలును తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలె ఉండెను;౹

15 ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయు చున్న అపరంజితో సమానమై యుండెను; ఆయన కంఠ స్వరము విస్తార జలప్రవాహముల ధ్వనివలె ఉండెను.౹

16 ఆయన తన కుడిచేత ఏడు నక్షత్రములు పట్టుకొని యుండెను; ఆయన నోటినుండి రెండంచులుగల వాడియైన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను; ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునివలె ఉండెను.౹

17 నేనాయనను చూడగానే చచ్చినవానివలె ఆయన పాదములయొద్ద పడితిని. ఆయన తన కుడిచేతిని నామీద ఉంచి నాతో ఇట్లనెను – భయపడకుము;౹

18 నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను. మరియు మరణముయొక్కయు పాతాళ లోకముయొక్కయు తాళపుచెవులు నా స్వాధీనములో ఉన్నవి.౹

19-20 కాగా నీవు చూచినవాటిని, ఉన్నవాటిని, వీటివెంట కలుగబోవువాటిని, అనగా నా కుడిచేతిలో నీవు చూచిన యేడు నక్షత్రములనుగూర్చిన మర్మమును, ఆ యేడు సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ యేడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు. ఆ యేడు దీపస్తంభములు ఏడు సంఘములు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/REV/1-abdb5b9456144c3168184e306360b61c.mp3?version_id=1787—

Categories
ప్రకటన

ప్రకటన 2

1 ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము–

ఏడు నక్షత్రములు తన కుడిచేతపట్టుకొని యేడు దీపస్తంభములమధ్య సంచరించువాడు చెప్పు సంగతు లేవనగా౹

2 –నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేనెరుగుదును; నీవు దుష్టులను సహింపలేవనియు, అపొ స్తలులు కాకయే తాము అపొస్తలులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు,౹

3 నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును.౹

4 అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీమీద తప్పు ఒకటి మోపవలసియున్నది.౹

5 నీవు ఏ స్థితిలోనుండి పడితివో అది జ్ఞాపకము చేసికొని మారుమనస్సుపొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారుమనస్సు పొందితేనే సరి; లేనియెడల నేను నీయొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటనుండి తీసివేతును.౹

6 అయితే ఈ యొకటి నీలో ఉన్నది, నీకొలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు; నేను కూడ వీటిని ద్వేషించుచున్నాను.౹

7 చెవిగలవాడుఆత్మసంఘములతో చెప్పుచున్నమాట వినునుగాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింప నిత్తును.

8 స్ముర్నలో ఉన్న సంఘపుదూతకు ఈలాగు వ్రాయుము–

మొదటివాడును కడపటివాడునైయుండి, మృతుడై మరల బ్రదికినవాడు చెప్పు సంగతులేవనగా౹

9 –నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే; తాము యూదులమని చెప్పుకొనుచు, యూదులు కాక సాతాను సమాజపు వారివలన నీకు కలుగు దూషణ నే నెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడ కుము.౹

10 ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాదిమీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు; పది దినములు శ్రమ కలుగును; మరణమువరకునమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీటమిచ్చెదను.౹

11 సంఘములతోఆత్మచెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించువాడు రెండవ మరణమువలన ఏ హానియుచెందడు.

12 పెర్గములోఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము– వాడియైన రెండంచులుగల ఖడ్గముగలవాడు చెప్పు సంగతులేవనగా౹

13 –సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో, నాయందు విశ్వాసియైయుండి నన్నుగూర్చి సాక్షియైన అంతిపయనువాడు మీమధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపెట్టి నాయందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును.౹

14 అయినను నేను నీమీద కొన్ని తప్పిదములు మోపవలసియున్నది. అవేవనగా, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి యొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాముబోధను అనుసరించువారు నీలోఉన్నారు.౹

15 అటువలెనే నీకొలాయితుల బోధననుసరించు వారును నీలో ఉన్నారు.౹

16 కావున మారుమనస్సు పొందుము; లేనియెడల నేను నీయొద్దకు త్వరగా వచ్చి నా నోటనుండి వచ్చు ఖడ్గముచేత వీరితో యుద్ధముచేసెదను.౹

17 సంఘములతోఆత్మచెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింప నిత్తును. మరియు అతనికి తెల్లరాతినిత్తును; ఆ రాతిమీద చెక్కబడిన యొక క్రొత్తపేరుండును; పొందిన వానికే గాని అది మరి యెవనికిని తెలియదు.

18 తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము–

అగ్నిజ్వాలవంటి కన్నులును అపరంజినిపోలిన పాదములునుగల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా

19 –నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరి చర్యను, నీ సహనమును నేనెరుగుదును; నీ మొదటి క్రియలకన్న నీ కడపటి క్రియలు మరియెక్కువైనవని యెరుగుదును.౹

20 అయినను నీమీద తప్పు ఒకటి నేను మోపవలసియున్నది; ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీ వుండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది.౹

21 మారుమనస్సు పొందుటకు నేను దానికి సమయమిచ్చితినిగాని అది తన జారత్వము విడిచిపెట్టి మారుమనస్సు పొందనొల్లదు.౹

22 ఇదిగో నేను దానిని మంచము పెట్టించి దానితోకూడ వ్యభిచరించువారు దానిక్రియలవిషయమై మారుమనస్సు పొందితేనే గాని వారిని బహు శ్రమలపాలు చేతును,౹

23 దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నియు తెలిసికొనును. మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను.౹

24 అయితే తుయతైరలో కడమవారైన మీతో, అనగా ఈ బోధను అంగీకరింపక సాతానుయొక్క గూఢమైన సంగతులనుఎరుగమని చెప్పుకొనువారందరితో నేను చెప్పు చున్నదేమనగా–మీపైని మరి ఏ భారమును పెట్టను.౹

25 నేను వచ్చువరకు మీకు కలిగియున్నదానిని గట్టిగా పట్టుకొనుడి.౹

26-27 నేను నా తండ్రివలన అధికారము పొందినట్టు జయించుచు, అంతమువరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికిజనులమీద అధికారము ఇచ్చెదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును; వారు కుమ్మరవాని పాత్రలవలె పగులగొట్టబడుదురు;౹

28 మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను.౹

29 సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినునుగాక.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/REV/2-a7e9f0840e64f0321e21d249d9f40991.mp3?version_id=1787—

Categories
ప్రకటన

ప్రకటన 3

1 సార్దీస్‍లో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము–

ఏడు నక్షత్రములును దేవుని యేడాత్మలునుగలవాడు చెప్పు సంగతులేవనగా–నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరుమాత్రమున్నది గాని నీవు మృతుడవే౹

2 నీ క్రియలు నా దేవుని యెదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై, చావనైయున్న మిగిలినవాటిని బలపరచుము.౹

3 నీవేలాగు ఉపదేశము పొందితివో యేలాగు వింటివో జ్ఞాపకము చేసికొని దానిని గైకొనుచు మారుమనస్సు పొందుము. నీవు జాగరూకుడవై యుండనియెడల నేను దొంగవలె వచ్చెదను; ఏ గడియను నీ మీదికి వచ్చెదనో నీకు తెలియనే తెలియదు.౹

4 అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్‍లో నీయొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతోకూడ సంచరించెదరు.౹

5 జయించు వాడు ఆలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును; జీవ గ్రంథములోనుండి అతని పేరెంతమాత్రమును తుడుపు పెట్టక, నాతండ్రి యెదుటను ఆయన దూతల యెదుటను అతని పేరు ఒప్పుకొందును.౹

6 సంఘములతోఆత్మచెప్పు చున్న మాట చెవిగలవాడు వినునుగాక.

7 ఫిలదెల్ఫియలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము–

దావీదు తాళపుచెవి కలిగి, యెవడును వేయలేకుండ తీయువాడును, ఎవడును తీయలేకుండ వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా౹

8 –నీ క్రియలను నేనెరుగుదును; నీకున్న శక్తి కొంచెమై యుండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీయెదుట తీసియుంచియున్నాను; దానిని ఎవడును వేయ నేరడు.౹

9 యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను; వారు వచ్చి నీ పాదముల యెదుట పడి నమస్కారముచేసి, ఇదిగో, నేను నిన్ను ప్రేమించితినని తెలిసికొనునట్లు చేసెదను.౹

10 నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూ నివా సులను శోధించుటకు లోకమంతటిమీదికి రాబోవు శోధన కాలములోనేనును నిన్ను కాపాడెదను.౹

11 నేను త్వరగా వచ్చుచున్నాను; ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగినదానిని గట్టిగా పట్టుకొనుము.౹

12 జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను; అందులోనుండి వాడు ఇకమీదట ఎన్నటికిని వెలు పలికిపోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వానిమీద వ్రాసెదను.౹

13 సంఘములతోఆత్మచెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక.

14 లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము–

ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతులేవనగా౹

15 –నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు; నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు.౹

16 నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటనుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను.౹

17 నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గ్రుడ్డివాడవును దిగంబరుడవునై యున్నావని యెరుగక– నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసియున్నాను, నాకేమియు కొదువలేదని చెప్పుకొనుచున్నావు.౹

18 నీవు ధనవృద్ధి చేసి కొనునట్లు అగ్నిలో పుటమువేయబడిన బంగారమును, నీ దిసమొల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టికలుగునట్లు నీ కన్నులకు కాటుకను నాయొద్దకొనుమని నీకు బుద్ధిచెప్పుచున్నాను.౹

19 నేను ప్రేమించువారినందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారుమనస్సు పొందుము.౹

20 ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండితట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసినయెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము.౹

21 నేను జయించి నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండి యున్న ప్రకారము జయించువానిని నాతోకూడ నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను.౹

22 సంఘములతోఆత్మచెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/REV/3-ba4c97eebe87de694044f4262a01711c.mp3?version_id=1787—