Categories
అపొస్తలుల కార్యములు

అపొస్తలుల కార్యములు 3

1 పగలు మూడు గంటలకు ప్రార్థనకాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్లుచుండగా,౹

2 పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక మనుష్యుడు మోసికొనిపోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్లువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమను దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి.౹

3 పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింప బోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా౹

4 పేతురును యోహానును వానిని తేరి చూచి–మాతట్టు చూడుమనిరి.౹

5 వాడు వారియొద్ద ఏమైన దొరుకునని కనిపెట్టుచు వారియందు లక్ష్యముంచెను.౹

6 అంతట పేతురు–వెండి బంగారములు నాయొద్ద లేవు గాని నాకు కలిగినదే నీ కిచ్చుచున్నాను; నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి౹

7 వాని కుడిచెయ్యి పట్టుకొని లేవ నెత్తెను; వెంటనే వాని పాదములును చీలమండలును బలము పొందెను.౹

8 వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను; నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితోకూడ దేవాలయములోనికి వెళ్లెను.౹

9 వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరు చూచి౹

10 శృంగారమను దేవా లయపు ద్వారమునొద్ద భిక్షముకొరకు కూర్చుండినవాడు వీడే అని గుర్తెరిగి, వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి.

11 వాడు పేతురును యోహానును పట్టుకొని యుండగా, ప్రజలందరు విస్మయమొంది సొలొమోనుదను మంటపములో ఉన్న వారియొద్దకు గుంపుగా పరుగెత్తివచ్చిరి.౹

12 పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను–ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై యెందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంతశక్తి చేతనైనను భక్తిచేతనైనను నడవను వీనికి బలమిచ్చి నట్టుగా మీరెందుకు మాతట్టు తేరి చూచుచున్నారు?౹

13 అబ్రాహాము ఇస్సాకు యాకోబు అనువారి దేవుడు, అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచియున్నాడు; మీరాయనను అప్పగించితిరి, పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతనియెదుట ఆయనను నిరాకరించితిరి.౹

14 మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి, నర హంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగి తిరి.౹

15 మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలోనుండి లేపెను; అందుకుమేము సాక్షులము.౹

16 ఆయన నామమందలి విశ్వాసముమూలముగా ఆయన నామమే మీరు చూచి యెరిగియున్న వీనిని బలపరచెను; ఆయనవలన కలిగిన విశ్వాసమే మీ అందరియెదుట వీనికి ఈ పూర్ణస్వస్థత కలుగజేసెను.౹

17 సహోదరులారా, మీరును మీ అధికారులును తెలియక చేసితిరని నాకు తెలియును.౹

18 అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తలనోట ముందుగా ప్రచురపరచిన విషయములను ఈలాగు నెరవేర్చెను.౹

19 ప్రభువుసముఖము నుండి విశ్రాంతికాలములు వచ్చునట్లును౹

20 మీకొరకు నియమించిన క్రీస్తుయేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారుమనస్సు నొంది తిరుగుడి.౹

21 అన్నిటికి కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆదినుండి తన పరిశుద్ధ ప్రవక్తలనోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసియై యుండుట ఆవశ్యకము.౹

22 మోషే యిట్లనెను–ప్రభువైనదేవుడు నావంటి యొక ప్రవక్తను మీ సహోదరులలోనుండి మీకొరకు పుట్టించును; ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను.౹

23 ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండ సర్వనాశనమగుననెను.౹

24 మరియు సమూయేలు మొదలుకొని యెందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరు ఈ దినమునుగూర్చి ప్రకటించిరి.౹

25 ఆ ప్రవక్తలకును, దేవుడు అబ్రాహాముతో –నీ సంతానమందు భూలోక వంశములన్నియు ఆశీర్వదింపబడునని చెప్పి మీపితరులతో చేసిన నిబంధనకును, మీరు వారసులైయున్నారు.౹

26 దేవుడు తన సేవకుని పుట్టించి,మీలో ప్రతివానిని వాని దుష్టత్వమునుండి మళ్లించుటవలన మిమ్ము నాశీర్వదించుటకు ఆయనను మొదట మీయొద్దకు పంపెనని చెప్పెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ACT/3-56d2cc6fae9dfeb4bb5bfded962468a5.mp3?version_id=1787—

Categories
అపొస్తలుల కార్యములు

అపొస్తలుల కార్యములు 4

1 వారు ప్రజలతో మాటలాడుచుండగా, యాజకులును దేవాలయపు అధిపతియు సద్దూకయ్యులును౹

2 వారు ప్రజ లకు బోధించుటయు, యేసునుబట్టి మృతులలోనుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారిమీదికివచ్చి౹

3 వారిని బలాత్కారముగా పట్టుకొని, సాయంకాలమైనందున మరునాటివరకు వారిని కావలిలో ఉంచిరి.౹

4 వాక్యము వినినవారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్యయించుమించు అయిదువేలు ఆయెను.

5 మరునాడు వారి అధికారులును పెద్దలును శాస్త్రులును యెరూషలేములో కూడుకొనిరి.౹

6 ప్రధానయాజకుడైన అన్నయు కయపయు, యోహానును అలెక్సంద్రును ప్రధానయాజకుని బంధువులందరు వారితోకూడ ఉండిరి.౹

7 వారు పేతురును యోహానునుమధ్యను నిలువబెట్టి– మీరు ఏ బలముచేత ఏ నామమునుబట్టి దీనిని చేసితిరని అడుగగా౹

8 పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై యిట్లనెను –ప్రజల అధికారులారా, పెద్దలారా,౹

9 ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమునుగూర్చి వాడు దేనివలన స్వస్థత పొందెనని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక౹

10 మీరందరును ఇశ్రాయేలు ప్రజలందరును తెలిసికొనవలసినదేమనగా, మీరు సిలువవేసినట్టియు, మృతులలోనుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన యేసుక్రీస్తు నామ ముననే వీడు స్వస్థతపొంది మీ యెదుట నిలుచుచున్నాడు.౹

11 ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే; ఆ రాయి మూలకు తలరాయి ఆయెను.౹

12 మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను.

13 వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులనిగ్రహించి ఆశ్చర్యపడి, వారు యేసుతోకూడ ఉండినవారని గుర్తెరిగిరి.౹

14 స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితోకూడ నిలిచియుండుట చూచి యేమియు ఎదురు చెప్పలేకపోయిరి.౹

15 అప్పుడు –సభ వెలుపలికి పొండని వారికాజ్ఞాపించి తమలోతాము ఆలోచనచేసి౹

16 –ఈ మనుష్యులను మనమేమి చేయుదము? వారిచేత ప్రసిద్ధమైన సూచకక్రియ చేయబడియున్నదని యెరూషలేములో కాపురమున్న వారికందరికి స్పష్టమే, అది జరుగలేదని చెప్పజాలము.౹

17 అయినను ఇది ప్రజలలో ఇంక వ్యాపింపకుండుటకై– ఇకమీదట ఈ నామమునుబట్టి యే మనుష్యులతోనైనను మాటలాడకూడదని మనము వారిని బెదరుపెట్టవలెనని చెప్పుకొనిరి.౹

18 అప్పుడు వారిని పిలిపించి–మీరు యేసు నామమునుబట్టి యెంతమాత్రమును మాటలాడకూడదు, బోధింపనుకూడదని వారికాజ్ఞాపించిరి.౹

19 అందుకు పేతురును యోహానును వారినిచూచి–దేవుని మాట వినుటకంటె మీ మాట వినుట దేవునిదృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి;౹

20 మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక యుండలేమని వారికి ఉత్తరమిచ్చిరి;౹

21 ప్రజలందరు జరిగిన దానినిగూర్చి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి, వీరిని శిక్షించు విధమేమియు కనుగొన లేక వీరిని గట్టిగా బెదరించి విడుదలచేసిరి.౹

22 స్వస్థ పరచుట అను ఆ సూచకక్రియ యెవని విషయములో చేయబడెనో వాడు నలువది ఏండ్లకంటె ఎక్కువ వయస్సు గలవాడు.

23 వారు విడుదల నొంది తమ స్వజనులయొద్దకు వచ్చి, ప్రధానయాజకులును పెద్దలును తమతో చెప్పిన మాటల నన్నిటిని వారికి తెలిపిరి.౹

24 వారు విని, యేక మనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొఱపెట్టిరి. –నాథా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసినవాడవు.

25 –అన్యజనులు ఏల అల్లరి చేసిరి?

26 ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి?

ప్రభువుమీదను ఆయన క్రీస్తుమీదనుభూరాజులు

లేచిరి,

అధికారులును ఏకముగా కూడుకొనిరి

అని నీవు పరిశుద్ధాత్మద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి.౹

27-28 ఏవి జరుగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో, వాటినన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి.౹

29 ప్రభువా, ఈ సమయమునందు వారి బెదరింపులు చూచి౹

30 రోగులను స్వస్థపరచుటకును, నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములనుచేయుటకును నీ చెయ్యి చాచియుండగా, నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించునట్లు అనుగ్రహించుము.౹

31 వారు ప్రార్థనచేయగానే వారు కూడి యున్న చోటు కంపించెను; అప్పుడు వారందరు పరిశుద్ధాత్మతో నిండినవారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి.

32 విశ్వసించినవారందరును ఏకహృదయమును ఏకాత్మయు గలవారై యుండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు; వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను.౹

33 ఇదియుగాక అపొస్తలులు బహుబలముగా ప్రభువైన యేసుపునరుత్థానమునుగూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరియందు అధికముగా ఉండెను.౹

34 భూములైనను ఇండ్లయినను కలిగినవారందరు వాటిని అమ్మి, అమ్మిన వాటి వెలతెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టుచు వచ్చిరి.౹

35 వారు ప్రతివానికి వానివాని అక్కరకొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువలేకపోయెను.

36 కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒక డుండెను. ఇతనికి అపొస్తలులు, హెచ్చరిక పుత్రుడుఅని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టియుండిరి. ఇతడు భూమిగలవాడైయుండి దానిని అమ్మి౹

37 దాని వెల తెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ACT/4-1ae1be59aa35f94b0e3538469a18af86.mp3?version_id=1787—

Categories
అపొస్తలుల కార్యములు

అపొస్తలుల కార్యములు 5

1 అననీయ అను ఒక మనుష్యుడు తన భార్యయైన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను.౹

2 భార్యయెరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తలుల పాదములయొద్ద పెట్టెను.౹

3 అప్పుడు పేతురు –అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను?౹

4 అది నీయొద్ద నున్నపుడు నీదే గదా? అమ్మిన పిమ్మట అది నీ వశమై యుండలేదా? యెందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించు కొన్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను.౹

5 అననీయ యీ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినినవారికందరికిని మిగుల భయము కలిగెను;౹

6 అప్పుడు పడుచు వారు లేచి వానిని బట్టతో చుట్టి మోసికొనిపోయి పాతిపెట్టిరి.

7 ఇంచుమించు మూడు గంటల సేపటికి వానిభార్య జరిగినది యెరుగక లోపలికి వచ్చెను.౹

8 అప్పుడు పేతురు–మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పుమని ఆమెను అడిగెను. అందుకామె–అవును ఇంతకే అని చెప్పెను.౹

9 అందుకు పేతురు–ప్రభువుయొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టినవారి పాదములు వాకిటనే యున్నవి; వారు నిన్నును మోసికొని పోవుదురని ఆమెతో చెప్పెను.౹

10 వెంటనే ఆమె అతని పాదములయొద్దపడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు, లోపలికి వచ్చి, ఆమె చనిపోయినది చూచి, ఆమెను మోసికొనిపోయి, ఆమె పెనిమిటియొద్ద పాతిపెట్టిరి.౹

11 సంఘమంతటికిని, ఈ సంగతులు వినినవారికందరికిని మిగుల భయము కలిగెను.

12 ప్రజలమధ్య అనేకమైన సూచకక్రియలును మహ త్కార్యములును అపొస్తలులచేత చేయబడుచుండెను. మరియు వారందరు ఏకమనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి.౹

13 కడమవారిలో ఎవడును వారితో కలిసి కొనుటకు తెగింపలేదు గాని౹

14 ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. పురుషులును స్త్రీలును అనేకులు మరియెక్కు వగ విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి.౹

15 అందు చేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి, వారిలో ఎవనిమీదనైనను అతని నీడయైనను పడవలెనని మంచములమీదను పరుపులమీదను వారిని ఉంచిరి.౹

16 మరియు యెరూషలేము చుట్టునుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మలచేత పీడింపబడిన వారిని మోసికొని కూడివచ్చిరి. వారందరు స్వస్థత పొందిరి.

17 ప్రధానయాజకుడును అతనితోకూడ ఉన్నవారందరును, అనగా సద్దూకయ్యుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని౹

18 అపొస్తలులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి.౹

19 అయితేప్రభువుదూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసికొని వచ్చి–మీరు వెళ్లి దేవాలయములో నిలువబడి౹

20 ఈ జీవమునుగూర్చిన మాటలన్నియు ప్రజలతో చెప్పుడని వారితో అనెను.౹

21 వారామాట విని, తెల్లవారగానే దేవాలయములోనికి వెళ్లి బోధించుచుండిరి. ప్రధానయాజకుడును అతనితోకూడ నున్నవారును వచ్చి, మహా సభవారిని ఇశ్రాయేలీయుల పెద్దలనందరిని పిలువనంపించి –వారిని తోడుకొని రండని బంట్రౌతులను చెరసాలకు పంపిరి.౹

22 బంట్రౌతులు అక్కడికి వెళ్లినప్పుడు వారు చెరసాలలో కనబడనందున తిరిగివచ్చి౹

23 –చెరసాల బహు భద్రముగా మూసియుండుటయు, కావలివారు తలుపుల ముందర నిలిచియుండుటయు చూచితిమి గాని తలుపులు తీసినప్పుడు లోపల మాకొకడైనను కనబడలేదని వారికి తెలిపిరి.౹

24 అంతట దేవాలయపు అధిపతియు ప్రధానయాజకులును ఆ మాటలు విని–ఇది యేమవునో అని వారి విషయమై యెటుతోచక యుండిరి.౹

25 అప్పుడు ఒకడు వచ్చి–ఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుష్యులు దేవాలయములో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా౹

26 అధిపతి బంట్రౌతులతోకూడ పోయి, ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి, బలాత్కారము చేయకయే వారిని తీసికొని వచ్చెను.౹

27 వారిని తీసికొనివచ్చి సభలో నిలువబెట్టగా౹

28 ప్రధానయాజకుడు వారిని చూచి–మీరు ఈ నామమునుబట్టి బోధింప కూడ దని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి, యీ మనుష్యుని హత్యమామీదికి తేవలెనని ఉద్దేశించుచున్నారని చెప్పెను.౹

29 అందుకు పేతురును అపొస్తలులును–మనుష్యు లకు కాదు దేవునికే మేము లోబడవలెను గదా.౹

30 మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను.౹

31 ఇశ్రాయేలునకు మారుమనస్సును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడాయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణహస్తబలముచేతహెచ్చించియున్నాడు.౹

32 మేమును, దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు, ఈ సంగతులకు సాక్షులమై యున్నామని చెప్పిరి.

33 వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొనివీరిని చంప నుద్దేశించగా౹

34 సమస్త ప్రజలవలన ఘనత నొందినవాడును ధర్మశాస్త్రోపదేశకుడునైన గమలీయేలను ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి–ఈ మనుష్యులను కొంత సేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను౹

35 –ఇశ్రాయేలీయులారా, యీ మనుష్యుల విషయమై మీరేమి చేయబోవుచున్నారో జాగ్రత్తసుమండి.౹

36 ఈ దినములకుమునుపు థూదా లేచి తానొక గొప్ప వాడనని చెప్పుకొనెను; ఇంచుమించు నన్నూరుమంది మనుష్యులు వానితో కలిసి కొనిరి, వాడు చంపబడెను, వానికి లోబడిన వారందరును చెదరి వ్యర్థులైరి.౹

37 వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చి, ప్రజలను తనతోకూడ తిరుగుబాటుచేయ ప్రేరేపించెను; వాడు కూడ నశించెను, వానికి లోబడినవారందరును చెదరి పోయిరి.౹

38 కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా–ఈ మనుష్యుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచనయైనను ఈ కార్యమైనను మనుష్యులవలన కలిగినదాయెనా అది వ్యర్థమగును.౹

39 దేవునివలన కలిగినదాయెనా మీరు వారిని వ్యర్థపరచలేరు; మీరొకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమీ.౹

40 వారతని మాటకు సమ్మతించి, అపొస్తలులను పిలిపించి కొట్టించి–యేసు నామమునుబట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి.౹

41 ఆ నామముకొరకు అవమానము పొందుటకు పాత్రులని యెంచబడినందునవారు సంతోషించుచు మహాసభ యెదుటనుండి వెళ్లిపోయి౹

42 ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ACT/5-49e799b312638bdad75a374d581ea073.mp3?version_id=1787—

Categories
అపొస్తలుల కార్యములు

అపొస్తలుల కార్యములు 6

1 ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీయులమీద గ్రీకుభాష మాట్లాడు యూదులు సణుగసాగిరి.౹

2 అప్పుడు పండ్రెండుగురు అపొస్తలులు తమయొద్దకు శిష్యుల సమూహమును పిలిచి–మేము దేవుని వాక్యము బోధించుట మాని, ఆహారము పంచిపెట్టుటయుక్తముకాదు.౹

3 కాబట్టి సహోదరులారా,ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచిపేరు పొందిన యేడుగురు మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము;౹

4 అయితే మేము ప్రార్థనయందును వాక్యపరిచర్యయందును ఎడతెగక యుందుమని చెప్పిరి.౹

5 ఈ మాట జనసమూహమంతటికి ఇష్టమైనందునవారు, విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనినవాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రొకొరు, నీకా నోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మతప్రవిష్టుడును అంతియొకయవాడును అగు నీకొలాసు అను వారిని ఏర్ప రచుకొని౹

6 వారిని అపొస్తలులయెదుట నిలువబెట్టిరి; వీరు ప్రార్థనచేసి వారిమీద చేతులుంచిరి.

7 దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను; మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి.

8 స్తెఫను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజలమధ్య మహత్కార్యములను గొప్ప సూచకక్రియలను చేయుచుండెను.౹

9 అప్పుడు లిబెర్తీనులదనబడిన సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెక్సంద్రియుల సమాజములోను, కిలికియనుండియు ఆసియనుండియు వచ్చినవారిలోను, కొందరు వచ్చి స్తెఫనుతో తర్కించిరి గాని౹

10 మాటలాడుటయందు అతడు అగపరచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించినఆత్మను వారెదిరింపలేకపోయిరి.౹

11 అప్పుడు వారు–వీడు మోషేమీదను దేవునిమీదను దూషణవాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుష్యులను కుదుర్చుకొని౹

12 ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతనిమీదికి వచ్చి౹

13 అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసికొనిపోయి అబద్ధపు సాక్షులను నిలువబెట్టిరి. వారు–ఈ మనుష్యుడెప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాటలాడుచున్నాడు.౹

14 ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడుచేసి, మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి.౹

15 సభలో కూర్చున్నవారందరు అతనివైపు తేరిచూడగా అతని ముఖము దేవదూత ముఖమువలె వారికి కనబడెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ACT/6-b67d024516feeca9bb8d750cedd57da6.mp3?version_id=1787—

Categories
అపొస్తలుల కార్యములు

అపొస్తలుల కార్యములు 7

1 ప్రధానయాజకుడు–ఈ మాటలు నిజమేనా అని అడిగెను.౹

2 అందుకు స్తెఫను చెప్పినదేమనగా–సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రాహాము హారానులో కాపురముండకమునుపు మెసొపొతమియలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై౹

3 –నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి, నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను.౹

4 అప్పుడతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తరువాత, అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న యీ దేశమందు నివసించుటకై దేవుడతని తీసికొనివచ్చెను.౹

5 ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక, అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని, అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరతునని అతనికి వాగ్దానము చేసెను.౹

6 అయితే దేవుడు–అతని సంతానము అన్యదేశమందు పరవాసులగుదురనియు, ఆ దేశస్థులు నన్నూరు సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధపెట్టుదురనియు చెప్పెను.౹

7 మరియు దేవుడు–ఏ జనమునకు వారు దాసులైయుందురో ఆ జనమును నేను విమర్శచేయుదుననియు, ఆ తరువాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవింతురనియు చెప్పెను.౹

8 మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతని కనుగ్రహించెను. అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున ఎనిమిదవ దినమందు అతనికి సున్నతిచేసెను; ఇస్సాకు యాకోబును యాకోబు పన్నిద్దరు గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసిరి.౹

9 ఆ గోత్రకర్తలు మత్సరపడి, యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరిగాని, దేవుడతనికి తోడైయుండి అతని శ్రమలన్నిటిలోనుండి తప్పించి౹

10 దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరోయెదుట అతనికి అ నుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన యింటికంతటికిని అతనిని అధిపతిగా నియమించెను.౹

11 తరువాత ఐగుప్తు దేశమంతటికిని కనాను దేశమంతటికిని కరవును బహుశ్రమయువచ్చెను గనుక మన పితరులకు ఆహారము లేకపోయెను.౹

12 ఐగుప్తులో ధాన్యము కలదని యాకోబు విని, మన పితరులను అక్క డికి మొదటి సారి పంపెను.౹

13 వారు రెండవసారి వచ్చి నప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తన్ను తెలియజేసి కొనెను; అప్పుడు యోసేపుయొక్క వంశము ఫరోకు తెలియవచ్చెను.౹

14 యోసేపు తన తండ్రియైన యాకోబును తన స్వజనులందరిని పిలువనంపెను; వారు డెబ్బదియయిదు గురు౹

15 యాకోబు ఐగుప్తునకు వెళ్లెను; అక్కడ అతడును మన పితరులును చనిపోయి అక్కడ నుండి షెకెమునకు తేబడి,౹

16 షెకెములోని హమోరు కుమారులయొద్ద అబ్రా హాము వెలయిచ్చికొనిన సమాధిలో ఉంచబడిరి.౹

17 అయితే దేవుడు అబ్రాహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించినకొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపును ఎరుగని వేరొకరాజు ఐగుప్తును ఏలనారంభించెను.౹

18 ఇతడు మన వంశస్థుల యెడల కపటముగా ప్రవర్తించి౹

19 తమ శిశువులు బ్రదుకకుండ వారిని బయట పారవేయవలెనని మన పితరులను బాధపెట్టెను.౹

20 ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్యసుందరుడై తన తండ్రి యింట మూడు నెలలు పెంచ బడెను.౹

21 తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసికొని తన కుమారునిగా పెంచు కొనెను.౹

22 మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్య సించి, మాటలయందును కార్యములయందును ప్రవీణుడై యుండెను.౹

23 అతనికి నలువది ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను.౹

24 అప్పుడు వారిలో ఒకడు అన్యాయము ననుభవించుట అతడు చూచి, వానిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తీయుని చంపి ప్రతికారముచేసెను.౹

25 తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలం చెను గాని వారు గ్రహింపరైరి.౹

26 మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి–అయ్యలారా, మీరు సహోదరులు; మీరెందుకు ఒకనికొకడు అన్యా యము చేసికొనుచున్నారని చెప్పి వారిని సమాధానపరచ జూచెను.౹

27 అయినను తన పొరుగువానికి అన్యాయము చేసినవాడు–మా మీద అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడు?౹

28 నీవు నిన్న ఐగుప్తీయుని చంపినట్టు నన్నును చంపదలచియున్నావా అని అతనిని త్రోసివేసెను.౹

29 మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశములో పరదేశియైయుండి, అక్కడ ఇద్దరు కుమారులను కనెను.౹

30 నలువది ఏండ్లయిన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికగపడెను.౹

31 మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా౹

32 –నేను నీ పితరుల దేవుడను, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అనిప్రభువువాక్కు వినబడెను గనుక మోషే వణకి, నిదానించి చూచుటకు తెగింపలేదు.౹

33 అందుకు ప్రభువు–నీ చెప్పులు విడువుము; నీవు నిలిచియున్నచోటు పరిశుద్ధభూమి.౹

34 ఐగుప్తులో నున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని; వారి మూలుగు వింటిని; వారిని విడిపించుటకు దిగివచ్చియున్నాను; రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదు నని అతనితో చెప్పెను.౹

35 –అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించినవాడెవడని వారు నిరాకరించిన యీ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపెను.

36 ఇతడు ఐగుప్తులోను ఎఱ్ఱసముద్రములోను నలువది ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను.

37 –నావంటి యొక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును

అని ఇశ్రాయేలీయులతో చెప్పిన మోషే యితడే.౹

38 సీనాయి పర్వతముమీద తనతో మాటలాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసికొనినవాడితడే.౹

39 ఇతనికి మన పితరులు లోబడనొల్లక యితనిని త్రోసివేసి, తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారై౹

40 – మాకు ముందు నడుచునట్టి దేవతలను మాకు చేయుము; ఐగుప్తు దేశములోనుండి మనలను తోడుకొని వచ్చిన యీ మోషే యేమాయెనో మాకు తెలియదని అహరోనుతో అనిరి.౹

41 ఆ దినములలో వారొక దూడను చేసికొని ఆ విగ్రహమునకు బలి నర్పించి, తమ చేతులతో నిర్మించిన వాటియందు ఉల్లసించిరి.౹

42 అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశసైన్యమును సేవించుటకు వారిని విడిచి పెట్టెను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఈలాగు వ్రాయబడియున్నది.

–ఇశ్రాయేలు ఇంటివారలారా

మీరు అరణ్యములో నలువది యేండ్లు

బలి పశువులను అర్పణములను నాకు అర్పించితిరా?

43 మీరు పూజించుటకు చేసికొనిన ప్రతిమలైన మొలొకు

గుడారమును

రొంఫాయను దేవతయొక్క నక్షత్రమును మోసికొని

పోతిరి

గనుక బబులోను ఆవలికి మిమ్మును కొనిపోయెదను.

44 అతడు చూచిన మాదిరిచొప్పున దాని చేయవలెనని మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారము, సాక్ష్యపుగుడారము అరణ్యములో మన పితరులయొద్ద ఉండెను.౹

45 మన పితరులు తమ పెద్దలచేత దానిని తీసికొనినవారై, దేవుడు తమ యెదుటనుండి వెళ్లగొట్టిన జనములను వారు స్వాధీనపరచుకొన్నప్పుడు, యెహోషువతోకూడ ఈ దేశములోనికి దానిని తీసికొనివచ్చిరి. అది దావీదు దినములవరకు ఉండెను.౹

46 అతడు దేవుని దయపొంది యాకోబుయొక్క దేవుని నివాసస్థలము కట్టగోరెను.౹

47-50 అయితే సొలొమోను ఆయనకొరకు మందిరముకట్టించెను. అయినను

–ఆకాశము నా సింహాసనము

భూమి నా పాదపీఠము

మీరు నాకొరకు ఏలాటి మందిరము కట్టుదురు?

నా విశ్రాంతి స్థలమేది?

ఇవన్నియు నా హస్తకృతములు కావా?

అనిప్రభువుచెప్పుచున్నాడు

అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్త కృతాలయములలో నివసింపడు.

51 ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లనివారలారా,మీపితరులవలె మీరును ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు.౹

52 మీపితరులు ప్రవక్తలలో ఎవనిని హింసింపక యుండిరి? ఆ నీతిమంతుని రాకనుగూర్చి ముందు తెలిపినవారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసినవారైతిరి.౹

53 దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరిగాని దానిని గైకొనలేదని చెప్పెను.

54 వారీ మాటలు విని కోపముతో మండిపడిఅతనిని చూచి పండ్లుకొరికిరి.౹

55 అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశమువైపు తేరిచూచి, దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటను చూచి౹

56 –ఆకాశము తెరవబడుటయు, మనుష్యకుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటయు చూచుచున్నానని చెప్పెను.౹

57 అప్పుడు వారు పెద్ద కేకలువేసి చెవులు మూసికొని యేకముగా అతనిమీదపడి౹

58 పట్టణపు వెలుపలికి అతనిని వెళ్లగొట్టి, రాళ్లు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యౌవనుని పాదములయొద్ద తమ వస్త్రములుపెట్టిరి.౹

59 ప్రభువునుగూర్చి మొరపెట్టుచు–యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి.౹

60 అతడు మోకాళ్లూని – ప్రభువా, వారిమీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను; ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ACT/7-489785e9c307266dad54ce03d0f47ce6.mp3?version_id=1787—

Categories
అపొస్తలుల కార్యములు

అపొస్తలుల కార్యములు 8

1 ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున, అపొస్తలులు తప్ప అందరు యూదయ సమరయ దేశములయందు చెదరిపోయిరి.౹

2 భక్తిగల మనుష్యులు స్తెఫనును సమాధిచేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి.౹

3 సౌలయితే ఇంటింట జొచ్చి, పురుషులను స్త్రీలను ఈడ్చుకొనిపోయి, చెరసాలలో వేయించి సంఘమును పాడుచేయుచుండెను.

4 కాబట్టి చెదరిపోయివారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారముచేసిరి.౹

5 అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణమువరకును వెళ్లి క్రీస్తును వారికి ప్రకటించు చుండెను.౹

6 జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలయందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా౹

7 అనేకులను పెట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలువేసి వారిని వదలిపోయెను; పక్షవాయువుగలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి.౹

8 అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను.

9 సీమోనను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడీచేయుచు, తానెవడో యొక గొప్పవాడని చెప్పుకొనుచు, సమరయ జనులను విభ్రాంతిపరచుచుండెను.౹

10 కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరు– దేవుని మహాశక్తి యనబడినవాడు ఇతడే అని చెప్పు కొనుచు అతని లక్ష్యపెట్టిరి.౹

11 అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతిపరచినందున వారతని లక్ష్య పెట్టిరి.౹

12 అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమునుగూర్చియు యేసుక్రీస్తు నామమునుగూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి, పురుషులును స్త్రీలును బాప్తిస్మము పొందిరి.౹

13 అప్పుడు సీమోను కూడ నమ్మి బాప్తిస్మముపొంది ఫిలిప్పును ఎడబాయకుండి, సూచక క్రియలును గొప్ప అద్భుతములును జరుగుట చూచి విభ్రాంతి నొందెను.

14 సమరయవారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపొస్తలులు విని, పేతురును యోహానును వారియొద్దకు పంపిరి.౹

15 వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారికొరకు ప్రార్థనచేసిరి.౹

16 అంతకు ముందు వారిలో ఎవనిమీదను ఆయన దిగియుండలేదు, వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రము పొందియుండిరి.

17 అప్పుడు పేతురును యోహానును వారిమీద చేతు లుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి.౹

18 అపొస్తలులు చేతులుంచుటవలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడెనని సీమోను చూచి౹

19 వారియెదుట ద్రవ్యము పెట్టి–నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకియ్యుడని అడిగెను.౹

20 అందుకు పేతురు–నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించు కొందునని తలంచుకొనినందున నీ వెండి నీతోకూడ నశించునుగాక.౹

21 నీ హృదయము దేవునియెదుట సరియైనది కాదు గనుక యీ కార్యమందు నీకు పాలుపంపులు లేవు.౹

22 కాబట్టి యీ నీ చెడుతనము మానుకొని మారుమనస్సునొంది ప్రభువును వేడుకొనుము; ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును;౹

23 నీవు ఘోర దుష్టత్వములోనుదుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పెను.౹

24 అందుకు సీమోను –మీరు చెప్పినవాటిలో ఏదియు నా మీదికి రాకుండ మీరే నాకొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పెను.

25 అంతట వారు సాక్ష్యమిచ్చుచు ప్రభువు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్లుచు, సమరయుల అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచు వచ్చిరి.

26 ప్రభువుదూత–నీవు లేచి, దక్షిణముగా వెళ్లి, యెరూషలేమునుండి గాజాకు పోవు అరణ్యమార్గమును కలసి కొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్లెను.౹

27 అప్పుడు ఐతియొపీయుల రాణియైన కందాకేక్రింద మంత్రియై ఆమెయొక్క ధనాగారమంతటి మీదనున్న ఐతియొపీయుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చియుండెను.౹

28 అతడు తిరిగి వెళ్లుచు, తన రథముమీద కూర్చుండి ప్రవక్తయైన యెషయా గ్రంథము చదువుచుండెను.౹

29 అప్పుడుఆత్మఫిలిప్పుతో–నీవు ఆ రథము దగ్గరకుపోయి దానిని కలిసికొనుమని చెప్పెను.౹

30 ఫిలిప్పు దగ్గరకు పరుగెత్తికొనిపోయి అతడు ప్రవక్తయైన యెషయా గ్రంథము చదువుచుండగా విని–నీవు చదువునది గ్రహించుచున్నావా? అని అడుగగా౹

31 అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఏలాగు గ్రహింపగలనని చెప్పి, రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకొనెను.౹

32 అతడు లేఖనమందు చదువుచున్న భాగ మేదనగా–

ఆయన గొఱ్ఱెవలె వధకు తేబడెను బొచ్చు కత్తిరించువాని

యెదుట గొఱ్ఱెపిల్ల ఏలాగు మౌనముగా ఉండునో

ఆలాగే ఆయన నోరు తెరవకుండెను.

33 ఆయన దీనత్వమునుబట్టి ఆయనకు న్యాయవిమర్శ దొరకక

పోయెను ఆయన సంతానమును ఎవరు వివరింతురు?

ఆయన జీవము భూమిమీదనుండి తీసివేయబడినది.

34 అప్పుడు నపుంసకుడు – ప్రవక్త యెవనిగూర్చి యీలాగు చెప్పుచున్నాడు? తన్నుగూర్చియా, వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పు నడిగెను.౹

35 అందుకు ఫిలిప్పు నోరు తెరచి, ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసునుగూర్చిన సువార్త ప్రకటించెను.౹

36 వారు త్రోవలో వెళ్లుచుండగా నీళ్లున్న యొక చోటికి వచ్చి నప్పుడు నపుంసకుడు–ఇదిగో నీళ్లు; నాకు బాప్తిస్మ మిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను.౹

37 ఫిలిప్పు–నీవు పూర్ణహృదయముతో విశ్వసించినయెడల పొందవచ్చునని చెప్పెను. అతడు–యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని యుత్తరమిచ్చెను.౹

38 ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతట ఫిలిప్పు అతనికి బాప్తిస్మ మిచ్చెను.౹

39 వారు నీళ్లలోనుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువుఆత్మఫిలిప్పును కొనిపోయెను, నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్లెను; అతడు ఫిలిప్పును మరి యెన్నడును చూడలేదు.౹

40 అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. అక్కడనుండి కైసరయకు వచ్చువరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ACT/8-226050be349062290d6f831922293a65.mp3?version_id=1787—

Categories
అపొస్తలుల కార్యములు

అపొస్తలుల కార్యములు 9

1 సౌలు ఇంకను ప్రభువుయొక్క శిష్యులను బెదరించు టయును హత్యచేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధానయాజకునియొద్దకు వెళ్లి౹

2 యీ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనినయెడల, వారిని బంధించి యెరూషలేమునకు తీసికొని వచ్చుటకు దమస్కులోని సమాజములవారికి పత్రికలిమ్మని అడిగెను.౹

3 అతడు ప్రయాణము చేయుచు దమస్కుదగ్గరకు వచ్చి నప్పుడు, అకస్మాత్తుగా ఆకాశమునుండి యొక వెలుగు అతనిచుట్టు ప్రకాశించెను.౹

4 అప్పుడతడు నేలమీదపడి –సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను.౹

5 –ప్రభువా, నీవెవడవని అతడడుగగా ఆయన–నేను నీవు హింసించు చున్న యేసును;౹

6 లేచి పట్టణములోనికి వెళ్లుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పెను.౹

7 అతనితో ప్రయాణము చేసిన మనుష్యులు ఆ స్వరము వినిరి గాని యెవనిని చూడక మౌనులై నిలువ బడిరి.౹

8 సౌలు నేలమీదనుండి లేచి కన్నులు తెరచినను ఏమియు చూడలేక పోయెను గనుక వారతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి.౹

9 అతడు మూడుదినములు చూపులేక అన్నపానము లేమియు పుచ్చుకొనకుండెను.

10 దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు–అననీయా, అని అతనిని పిలువగా౹

11 అతడు–ప్రభువా, యిదిగో నేనున్నాననెను. అందుకు ప్రభువు–నీవు లేచి, తిన్ననిదనబడిన వీధికి వెళ్లి, యూదా అనువాని యింట తార్సువాడైన సౌలు అనువానికొరకు విచారించుము; ఇదిగో అతడు ప్రార్థనచేయుచున్నాడు.౹

12 అతడు అననీయ అను నొక మనుష్యుడు లోపలికివచ్చి, తాను దృష్టిపొందునట్లు తలమీద చేతులుంచుట చూచియున్నాడని చెప్పెను.౹

13 అందుకు అననీయ–ప్రభువా, యీ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసియున్నాడని అతనిగూర్చి అనేకులవలన వింటిని.౹

14 ఇక్కడను నీ నామమునుబట్టి ప్రార్థనచేయు వారినందరిని బంధించుటకు అతడు ప్రధానయాజకులవలన అధికారము పొంది యున్నాడని ఉత్తరమిచ్చెను.౹

15 అందుకు ప్రభువు–నీవు వెళ్లుము, అన్యజనుల యెదుటను రాజుల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై యున్నాడు౹

16 ఇతడు నా నామముకొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను.౹

17 అననీయ వెళ్లి ఆ యింట ప్రవేశించి, అతని మీద చేతులుంచి–సౌలా, సహోదరుడా నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు, నీవు దృిష్టిపొంది, పరిశుద్ధాత్మతో నింపబడునట్లు నన్ను పంపి యున్నాడని చెప్పెను.౹

18 అప్పుడే అతని కన్నులనుండి పొరలవంటివి రాలగా దృష్టికలిగి, లేచి బాప్తిస్మము పొందెను; తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను.

19 పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతోకూడ కొన్ని దినములుండెను.౹

20 వెంటనే సమాజమందిరములలో –యేసే దేవుని కుమారుడని ఆయననుగూర్చి ప్రకటించుచు వచ్చెను.౹

21 వినినవారందరు విభ్రాంతినొంది, యెరూషలేములో ఈ నామమునుబట్టి ప్రార్థన చేయువారిని నాశనము చేసినవాడితడే కాడా? వారిని బంధించి ప్రధానయాజకులయొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడ వచ్చియున్నాడని చెప్పుకొనిరి.౹

22 అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి–ఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను.

23 అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంప నాలోచింపగా౹

24 వారి ఆలోచన సౌలునకు తెలియ వచ్చెను. వారు అతని చంపవలెనని రాత్రింబగళ్లు ద్వారములయొద్ద కాచుకొనుచుండిరి౹

25 గనుక అతని శిష్యులు రాత్రివేళ అతనిని తీసికొనిపోయి గంపలో ఉంచి, గోడ గుండ అతనిని క్రిందికి దింపిరి.

26 అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలిసి కొనుటకు యత్నముచేసెను గాని, అతడు శిష్యుడని నమ్మక అందరును అతనికి భయపడిరి.౹

27 అయితే బర్నబా అతనిని దగ్గరతీసి అపొస్తలులయొద్దకు తోడుకొనివచ్చి–అతడు త్రోవలో ప్రభువును చూచెననియు, ప్రభువు అతనితో మాటలాడెననియు, అతడు దమస్కులో యేసు నామమునుబట్టి ధైర్యముగా బోధించెననియు, వారికి వివరముగా తెలియపరచెను.౹

28-29 అతడు యెరూషలేములో వారితోకూడ వచ్చుచు పోవుచు, ప్రభువు నామమునుబట్టి ధైర్యముగా బోధించుచు, గ్రీకుభాషను మాట్లాడు యూదులతో మాటలాడుచు తర్కించుచునుండెను. వారు అతనిని చంప ప్రయత్నము చేసిరి గాని౹

30 సహోదరులు దీనిని తెలిసికొని అతనిని కైసరయకు తోడుకొనివచ్చి తార్సునకు పంపిరి.

31 కావున యూదయ గలిలయ సమరయ దేశములం దంతట సంఘము క్షేమాభివృద్ధినొందుచుసమాధానము కలిగియుండెను; మరియు ప్రభువునందు భయమును పరిశు ద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను.

32 ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారముచేయుచు, లుద్దలో కాపురమున్న పరిశుద్ధులయొద్దకు వచ్చెను.౹

33 అక్కడ పక్షవాయువు కలిగి యెనిమిది ఏండ్లనుండి మంచము పెట్టియుండిన ఐనెయ అను ఒక మనుష్యుని చూచి,౹

34 పేతురు–ఐనెయా, యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరచుకొనుమని అతనితో చెప్పగా౹

35 వెంటనే అతడు లేచెను. లుద్దలోను షారోనులోను కాపురమున్నవారందరు అతనిచూచి ప్రభువుతట్టు తిరిగిరి.

36 మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను; ఆమెకు భాషాంతరమున దొర్కాఅని పేరు. ఆమె సత్‌క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి యుండెను.౹

37 ఆ దినములయందామె కాయిలాపడి చనిపోగా, వారు శవమును కడిగి మేడ గదిలో పరుండ బెట్టిరి.౹

38 లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుటచేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని, అతడు తడవుచేయక తమయొద్దకు రావలెనని వేడుకొనుటకు ఇద్దరు మనుష్యులను అతని యొద్దకు పంపిరి.౹

39 పేతురు లేచి వారితోకూడ వెళ్లి అక్కడ చేరినప్పుడు, వారు మేడగదిలోనికి అతనిని తీసికొనివచ్చిరి; విధవరాండ్రందరు వచ్చి యేడ్చుచు, దొర్కా తమతోకూడ ఉన్నప్పుడు కుట్టిన అంగీలును వస్త్రములును చూపుచు అతని యెదుట నిలిచిరి.౹

40 పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్లూని ప్రార్థనచేసి శవమువైపు తిరిగి–తబితా, లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను.౹

41 అతడామెకు చెయ్యి యిచ్చి లేవనెత్తి, పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలనుగా వారికి అప్పగించెను.౹

42 ఇది యొప్పేయందంతట తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసముంచిరి.౹

43 పేతురు యొప్పేలో సీమోనను ఒక చర్మకారునియొద్ద బహుదినములు నివసించెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ACT/9-879cef572b5c69785f81eeb04f67cb8c.mp3?version_id=1787—

Categories
అపొస్తలుల కార్యములు

అపొస్తలుల కార్యములు 10

1 ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి . యైన కొర్నేలీ అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను.౹

2 అతడు తన యింటివారందరితోకూడ దేవునియందు భయభక్తులు గలవాడైయుండి, ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడును దేవునికి ప్రార్థనచేయు వాడు.౹

3 పగలు ఇంచుమించు మూడు గంటలవేళ దేవుని దూత అతనియొద్దకు వచ్చి–కొర్నేలీ, అనిపిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను.౹

4 అతడు దూతవైపు తేరి చూచి భయపడి–ప్రభువా, యేమని అడిగెను. అందుకు దూత–నీ ప్రార్థనలును నీ ధర్మకార్యములును దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి.౹

5 ఇప్పుడు నీవు యొప్పేకు మనుష్యులను పంపి, పేతురు అను మారు పేరుగల సీమోనును పిలిపించుము;౹

6 అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని యింట దిగియున్నాడని అతనితో చెప్పెను.౹

7 అతనితో మాటలాడిన దూత వెళ్లిన పిమ్మట అతడు తన యింటి పనివారిలో ఇద్దరిని, తన యొద్ద ఎల్లప్పుడు కనిపెట్టుకొని యుండువారిలో భక్తి పరుడగు ఒక సైనికుని పిలిచి౹

8 వారికి ఈ సంగతులన్నియు వివరించి వారిని యొప్పేకు పంపెను.

9 మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు పండ్రెండు గంట లకు పేతురు ప్రార్థనచేయుటకు మిద్దెమీది కెక్కెను.౹

10 అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను; ఇంటివారు సిద్ధముచేయుచుండగా అతడు పరవశుడై౹

11 ఆకాశము తెరవబడుటయు, నాలుగు చెంగులుపెట్టి దింప బడిన పెద్ద దుప్పటివంటి యొకవిధమైన పాత్ర భూమి మీదికి దిగివచ్చుటయు చూచెను.౹

12 అందులో భూమియందుండు సకల విధములైన చతుష్పాద జంతువులును, ప్రాకుపురుగులును, ఆకాశపక్షులును ఉండెను.౹

13 అప్పుడు –పేతురూ, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దమత నికి వినబడెను.౹

14 అయితే పేతురు–వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనను నేనెన్నడును తినలేదని చెప్పగా౹

15 –దేవుడు పవిత్రము చేసినవాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరల రెండవ మారు ఆ శబ్దము అతనికి వినబడెను.౹

16 ఈలాగు ముమ్మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకెత్తబడెను.

17 పేతురు తనకు కలిగిన దర్శనమేమై యుండునో అని తనలో తనకు ఎటుతోచక యుండగా, కొర్నేలి పంపిన మనుష్యులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలిసికొని, వాకిట నిలిచి యింటివారిని పిలిచి౹

18 –పేతురు అను మారుపేరుగల సీమోను ఇక్కడ దిగియున్నాడా? అని అడిగిరి౹

19 పేతురు ఆ దర్శనమునుగూర్చి యోచించుచుండగా ఆత్మ–ఇదిగో ముగ్గురు మనుష్యులు నిన్ను వెదకుచున్నారు.౹

20 నీవు లేచి క్రిందికిదిగి, సందేహింపక వారితోకూడ వెళ్లుము; నేను వారిని పంపియున్నానని అతనితో చెప్పెను.౹

21 పేతురు ఆ మనుష్యులయొద్దకు దిగి వచ్చి–ఇదిగో మీరు వెదకువాడను నేనే; మీరు వచ్చిన కారణ మేమని అడిగెను.౹

22 అందుకు వారు–నీతిమంతుడును, దేవునికి భయపడువాడును, యూద జనులందరివలన మంచిపేరు పొందినవాడునైన శతాధిపతియగు కొర్నేలి యను ఒక మనుష్యుడున్నాడు; అతడు నిన్ను తన యింటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధదూత వలన బోధింపబడెనని చెప్పిరి; అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యమిచ్చెను.

23 మరునాడు అతడు లేచి, వారితోకూడ బయలుదేరెను; యొప్పేవారైన కొందరు సహోదరులును వారితోకూడ వెళ్లిరి.౹

24 మరునాడు వారు కైసరయలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారికొరకు కనిపెట్టుకొని యుండెను.౹

25 పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదములమీదపడి నమస్కారము చేసెను.౹

26 అందుకు పేతురు–నీవు లేచి నిలువుము, నేను కూడ నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి౹

27 అతనితో మాటలాడుచు లోపలికి వచ్చి, అనేకులు కూడియుండుట చూచెను.౹

28 అప్పుడతడు–అన్యజాతివానితో సహవాసము చేయుటయైనను, అట్టివానిని ముట్టుకొనుటయైనను యూదునికి ధర్మముకాదని మీకు తెలియును. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగినవాడనియైనను అపవిత్రుడనియైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించియున్నాడు.౹

29 కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమియు చెప్పక వచ్చితిని గనుక, ఎందునిమిత్తము నన్ను పిలువనంపితిరో దానినిగూర్చి అడుగు చున్నానని వారితో చెప్పెను.౹

30 అందుకు కొర్నేలి– నాలుగు దినముల క్రిందట పగలు మూడుగంటలు మొదలుకొని యీ వేళవరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా యెదుట నిలిచి౹

31 –కొర్నేలీ, నీ ప్రార్థన వినబడెను; నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి యున్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి౹

32 పేతురు అను మారుపేరుగల సీమోనును పిలిపించుము; అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగియున్నాడని నాతో చెప్పెను.౹

33 వెంటనే నిన్ను పిలిపించితిని; నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞా పించినవన్నియు వినుటకై యిప్పుడు మేమందరము దేవుని యెదుట ఇక్కడ కూడియున్నామని చెప్పెను. అందుకు పేతురు నోరుతెరచి ఇట్లనెను౹

34 –దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించియున్నాను.౹

35 ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.౹

36 యేసుక్రీస్తు అందరికి ప్రభువు. ఆయనద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు.౹

37 యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలిలయమొదలుకొని యూదయ యందంతట ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియును౹

38 అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెనను నదియే. దేవుడాయనకు తోడైయుండెను గనుక ఆయన మేలుచేయుచు, అపవాదిచేతపీడింపబడిన వారినందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను.౹

39 ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసినవాటికన్నిటికిని మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వ్రేలాడ దీసి చంపిరి.౹

40 దేవుడాయనను మూడవదినమున లేపి౹

41 ప్రజలకందరికి కాక దేవునిచేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలోనుండి లేచిన తరు వాత ఆయనతోకూడ అన్నపానములు పుచ్చుకొనిన మాకే, ఆయన ప్రత్యక్షముగా కనబడునట్లు అనుగ్రహించెను.౹

42 ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించినవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢసాక్ష్యమియ్యవలెనని మాకు ఆజ్ఞాపించెను.౹

43 ఆయనయందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరు ఆయననుగూర్చి సాక్ష్య మిచ్చుచున్నారనెను.

44 పేతురు ఈ మాటలు ఇంక చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరిమీదికి పరిశుద్ధాత్మ దిగెను.౹

45-46 సున్నతి పొందినవారిలో పేతురుతోకూడ వచ్చిన విశ్వాసులందరు, పరిశుద్ధాత్మ వరము అన్యజనులమీద సయితము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతినొందిరి. ఏలయనగా వారు భాషలతో మాటలాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి.౹

47 అందుకు పేతురు–మనవలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండ ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి౹

48 యేసు క్రీస్తు నామమందువారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు తమయొద్ద ఉండుమని వారతని వేడుకొనిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ACT/10-36f4d129e04fac737dabb36bd1873ecc.mp3?version_id=1787—

Categories
అపొస్తలుల కార్యములు

అపొస్తలుల కార్యములు 11

1 అన్యజనులును దేవుని వాక్యమంగీకరించిరని అపొస్తలులును యూదయ యందంతటనున్న సహోదరులును వినిరి.౹

2 పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందినవారు౹

3 –నీవు సున్నతి పొందనివారియొద్దకు పోయి వారితోకూడ భోజనముచేసితివని అతనితో వాదము పెట్టుకొనిరి.

4 అందుకు పేతురు మొదటనుండి వరుసగా వారికి ఆ సంగతి ఈలాగు వివరించి చెప్పెను౹

5 –నేను యొప్పే పట్టణములో ప్రార్థనచేయుచుండగా పరవశుడనైతిని, అప్పుడొక దర్శనము నాకు కలిగెను; అది ఏదనగా నాలుగు చెంగులుపెట్టి దింపబడిన పెద్ద దుప్పటివంటి యొక విధమైన పాత్ర ఆకాశమునుండి దిగి నాయొద్దకు వచ్చెను.౹

6 దానివైపు నేను తేరి చూచి పరీక్షింపగా భూమియందుండు చతుష్పాద జంతువులును అడవి మృగములును ప్రాకెడు పురుగులును ఆకాశపక్షులును నాకు కనబడెను.౹

7 అప్పుడు –పేతురూ, నీవు లేచి చంపుకొని తినుమని యొక శబ్దము నాతో చెప్పుట వింటిని.౹

8 అందుకు నేను–వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదియు నా నోట ఎన్నడును పడలేదని చెప్పగా౹

9 రెండవమారు ఆ శబ్దము ఆకాశము నుండి–దేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దని ఉత్తరమిచ్చెను.౹

10 ఈలాగు ముమ్మారు జరిగెను; తరువాత అదంతయు ఆకాశమునకు తిరిగి తీసికొని పోబడెను.౹

11 వెంటనే కైసరయనుండి నాయొద్దకు పంప బడిన ముగ్గురు మనుష్యులు మేమున్న యింటియొద్ద నిలిచి యుండిరి.౹

12 అప్పుడుఆత్మ–నీవు భేదమేమియు చేయక వారితోకూడ వెళ్లుమని నాకు సెలవిచ్చెను. ఈ ఆరుగురు సహోదరులు నాతోకూడ వచ్చిరి; మేము కొర్నేలి యింట ప్రవేశించితిమి.౹

13 అప్పుడతడు–నీవు యొప్పేకు మనుష్యు లను పంపి పేతురు అను మారుపేరుగల సీమోనును పిలిపించుము;౹

14 నీవును నీ యింటివారందరును ఏ మాటలవలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని, తన యింట నిలిచి తనతో చెప్పిన యొక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపెను.౹

15 నేను మాటలాడ నారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికిని దిగెను.౹

16 అప్పుడు–యోహాను నీళ్లతో బాప్తిస్మమిచ్చెను గాని మీరు పరిశుద్ధాత్మలోబాప్తి స్మము పొందుదురని ప్రభువు చెప్పినమాట నేను జ్ఞాపకము చేసికొంటిని.౹

17 కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడ సమానవరము అనుగ్రహించి యుండగా, దేవుని అడ్డగించుటకు నేను ఏపాటివాడనని చెప్పెను.౹

18 వారు ఈ మాటలు విని మరేమి అడ్డము చెప్పక–అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారుమనస్సు దయచేసియున్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి.

19 స్తెఫను విషయములో కలిగినశ్రమనుబట్టి చెదరి పోయినవారు యూదులకు తప్ప మరి ఎవనికిని వాక్యము బోధింపక, ఫేనీకే, కుప్ర, అంతియొకయ ప్రదేశములవరకు సంచరించిరి.౹

20 కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంతియొకయకు వచ్చి గ్రీసు దేశపువారితో మాటలాడుచు ప్రభువైన యేసునుగూర్చిన సువార్త ప్రకటించిరి;౹

21 ప్రభువు హస్తము వారికి తోడైయుండెను గనుక నమ్మిన వారనేకులు ప్రభువుతట్టు తిరిగిరి.౹

22 వారినిగూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపువారు విని బర్నబాను అంతియొకయవరకు పంపిరి.౹

23 అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి, ప్రభువును స్థిరహృదయముతో హత్తుకొనవలెనని అందరిని హెచ్చరించెను.౹

24 అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు; బహుజనులు ప్రభువు పక్షమున చేరిరి.౹

25 అంతట అతడు సౌలును వెదకు టకు తార్సునకు వెళ్లి అతనిని కనుగొని అంతియొకయకు తోడుకొని వచ్చెను.౹

26 వారు కలిసి యొక సంవత్సర మంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులనబడిరి.

27 ఆ దినములయందు ప్రవక్తలు యెరూషలేమునుండి అంతియొకయకు వచ్చిరి.౹

28 వారిలో అగబు అను ఒకడు నిలువబడి, భూలోకమంతట గొప్ప కరవు రాబోవుచున్నదనిఆత్మద్వారా సూచించెను. అది క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించెను.౹

29 అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన తన శక్తికొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను.౹

30 ఆలాగున చేసి బర్నబా సౌలు అను వారిచేత పెద్దలయొద్దకు దానిని పంపిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ACT/11-8195cd5d0c6037b4aa54ec3125e74f60.mp3?version_id=1787—

Categories
అపొస్తలుల కార్యములు

అపొస్తలుల కార్యములు 12

1 దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు . సంఘపువారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని౹

2 యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను.౹

3 ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలిసికొని పేతురును కూడ పట్టుకొనెను. ఆ దినములు పులియనిరొట్టెల పండుగ దినములు.౹

4 అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి, పస్కా పండు గైన పిమ్మట ప్రజలయొద్దకు అతని తేవలెనని ఉద్దేశించి, అతనికి కావలియుండుటకు నాలుగు చతుష్టయములసైనికులకు అతనిని అప్పగించెను.౹

5 పేతురు చెరసాలలో ఉంచ బడెను, సంఘమయితే అతనికొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థనచేయుచుండెను.౹

6 హేరోదు అతనిని వెలుపలికి తీసికొని రావలెననియుండగా, ఆ రాత్రియే పేతురు రెండు సంకెళ్లతో బంధింపబడి యిద్దరు సైనికులమధ్య నిద్రించు చుండెను; మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి.౹

7 ఇదిగోప్రభువుదూత అతనిదగ్గర నిలిచెను; అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి–త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్లు అతనిచేతులనుండి ఊడిపడెను.౹

8 అప్పుడు దూత అతనితో–నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను. అతడాలాగు చేసిన తరువాత దూత –నీ వస్త్రము పైన వేసికొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను.౹

9 అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్లి, దూతవలన జరిగినది నిజముగా జరిగెనని గ్రహింపక, తనకు దర్శనము కలిగెనని తలంచెను.౹

10 మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవినియొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరచుకొనెను. వారు బయలుదేరి యొక వీధి దాటినవెంటనే దూత అతనిని విడిచిపోయెను.

11 పేతురుకు తెలివివచ్చి–ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలోనుండియు, యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటినుండియు నన్ను తప్పించియున్నాడని యిప్పుడు నాకు నిజముగా తెలియునని అనుకొనెను.౹

12 ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరుగల యోహాను తల్లియైన మరియ యింటికి వచ్చెను; అక్కడ అనేకులుకూడి ప్రార్థనచేయుచుండిరి.౹

13 అతడు తలవాకిటి తలుపుతట్టుచుండగా, రొదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను.౹

14 ఆమె పేతురు స్వరము గుర్తుపెట్టి, సంతోషముచేత తలుపుతీయక లోపలికి పరుగెత్తి కొనిపోయి–పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను.౹

15 అందుకు వారు–నీవు పిచ్చిదానవనిరి; అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు–అతని దూత అనిరి.౹

16 పేతురు ఇంకనుతట్టుచున్నందునవారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి.౹

17 అతడు–ఊరకుండుడని వారికి చేసైగచేసి, ప్రభువు తన్ను చెరసాలలోనుండి యేలాగు తీసికొనివచ్చెనో వారికి వివరించి – యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయుడని చెప్పి బయలుదేరి వేరొకచోటికి వెళ్లెను.౹

18 తెల్లవారగనే పేతురు ఏమాయెనో అని సైనికులలో కలిగిన గలిబిలి యింతంతకాదు.౹

19 హేరోదు అతనికోసరము వెదకినప్పుడు అతడు కనబడనందున కావలివారిని విమర్శించి వారిని చంప నాజ్ఞాపించెను. అటు తరువాత హేరోదు యూదయ నుండి కైసరయకు వెళ్లి అక్కడ నివసించెను.

20 తూరీయులమీదను సీదోనీయులమీదను అతనికి అత్యా గ్రహము కలిగినందున వారేకమనస్సుతో రాజునొద్దకు వచ్చి అంతఃపురమునకు పైవిచారణకర్తయగు బ్లాస్తును తమ పక్షముగా చేసికొని సమాధాన పడవలెనని వేడుకొనిరి; ఎందుకనగా రాజుయొక్క దేశమునుండి వారి దేశమునకు గ్రాసము వచ్చుచుండెను.౹

21 నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి యెదుట ఉపన్యాసముచేయగా౹

22 జనులు–ఇది దైవస్వరమేకాని మానవస్వరముకాదని కేకలు వేసిరి.౹

23 అతడు దేవుని మహిమపరచనందున వెంటనేప్రభువుదూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను.

24 దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను.

25 బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అను మారు పేరుగల యోహానును వెంటబెట్టుకొని యెరూషలేమునుండి తిరిగి వచ్చిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ACT/12-c71455c9587c36bfee1b9d79ad96c20a.mp3?version_id=1787—