Categories
యోహాను

యోహాను 14

1 మీ హృదయమును కలవరపడనియ్యకుడి; దేవుని .యందు విశ్వాసముంచుచున్నారునాయందును విశ్వాసముంచుడి.౹

2 నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును; మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను.౹

3 నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరునుఉండు లాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసి కొని పోవుదును.౹

4 నేను వెళ్లుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియునని చెప్పెను.౹

5 అందుకు తోమా– ప్రభువా, యెక్కడికి వెళ్లుచున్నావో మాకు తెలియదే; ఆ మార్గమేలాగు తెలియునని ఆయన నడుగగా౹

6 యేసు –నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.౹

7 మీరు నన్ను ఎరిగియుంటే నా తండ్రిని ఎరిగియుందురు; ఇప్పటినుండి మీరాయనను ఎరుగుదురు, ఆయనను చూచియున్నారని చెప్పెను.౹

8 అప్పుడు ఫిలిప్పు–ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా౹

9 యేసు–ఫిలిప్పూ, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని యేల చెప్పుచున్నావు?౹

10 తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంతట నేనే చెప్పుట లేదు, తండ్రి నాయందు నివసించుచు తన క్రియలుచేయుచున్నాడు.౹

11 తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి; లేదా యీ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి.౹

12 నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నాను గనుక నేనుచేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటె మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.౹

13 మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారునియందు మహిమపరచబడుటకై దానిని చేతును.౹

14 నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును.౹

15 మీరు నన్ను ప్రేమించినయెడల నా ఆజ్ఞలను గైకొందురు.౹

16 నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను,అనగా సత్యస్వరూపియగుఆత్మను మీకనుగ్రహించును.౹

17 లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొంద నేరదు; మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతోకూడ నివసించును, మీలో ఉండును.౹

18 మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు;౹

19 అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు.౹

20 నేను నా తండ్రియందును, మీరు నాయందును, నేను మీయందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు.౹

21 నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు; నన్ను ప్రేమించువాడు నా తండ్రివలన ప్రేమింపబడును; నేనును వానిని ప్రేమించి, వానికి నన్ను కనబరచుకొందు నని చెప్పెను.౹

22 ఇస్కరియోతు కాని యూదా– ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనబరచుకొనుటకేమి సంభవించెనని అడుగగా౹

23 యేసు–ఒకడు నన్ను ప్రేమించినయెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకువచ్చి వానియొద్ద నివాసము చేతుము.౹

24 నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు; మీరు వినుచున్న మాట నామాట కాదు, నన్ను పంపిన తండ్రిదే.

25 నేను మీయొద్ద ఉండగానే యీ మాటలు మీతో చెప్పితిని.౹

26 ఆదరణకర్త, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మసమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీకు జ్ఞాపకము చేయును.౹

27 శాంతిమీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినేమీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చు నట్టుగా నేను మీ కనుగ్రహించుటలేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి.౹

28 నేను వెళ్లి మీయొద్దకు వచ్చెదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరిగదా. తండ్రి నాకంటె గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించినయెడల నేను తండ్రియొద్దకు వెళ్లు చున్నానని మీరు సంతోషింతురు.౹

29 ఈ సంగతి సంభవించినప్పుడు, మీరు నమ్మవలెనని అది సంభవింపకముందే మీతో చెప్పుచున్నాను.౹

30 ఇకను మీతో విస్తరించి మాటలాడను; ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. నాతో వానికి సంబంధమేమియులేదు.౹

31 అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలిసికొనునట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేనీలాగు చేయుచున్నాను. లెండి, యిక్కడనుండి వెళ్లుదము.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JHN/14-882b1182d8a0fb56ad357b7effb79114.mp3?version_id=1787—

Categories
యోహాను

యోహాను 15

1 నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవ సాయకుడు.౹

2 నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును; ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును.౹

3 నేను మీతో చెప్పిన మాటనుబట్టి మీరిప్పుడు పవిత్రులై యున్నారు.౹

4 నాయందు నిలిచియుండుడి, మీయందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి యుంటేనేగాని తనంతట తానే యేలాగు ఫలింపదో, ఆలాగే నాయందు నిలిచియుంటేనేకాని మీరును ఫలిం పరు.౹

5 ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు.౹

6 ఎవడైనను నాయందు నిలిచియుండని యెడల వాడు తీగెవలె బయట పారవేయబడి యెండిపోవును; మనుష్యులు అట్టివాటిని పోగుచేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును.౹

7 నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండినయెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును.౹

8 మీరు బహుగా ఫలించుటవలన నా తండ్రి మహిమపరచబడును; ఇందువలన మీరు నా శిష్యులగుదురు.౹

9 తండ్రి నన్ను ఏలాగు ప్రేమించెనో నేనును మిమ్మును ఆలాగు ప్రేమించితిని, నా ప్రేమయందు నిలిచి యుండుడి.౹

10 నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనినయెడల నా ప్రేమయందు నిలిచి యుందురు.౹

11 మీయందు నా సంతోషము ఉండవలెననియు, మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు, ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను.౹

12 నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము, మీ రొకని నొకడు ప్రేమించ వలెననుటయే నా ఆజ్ఞ౹

13 తన స్నేహితులకొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు.౹

14 నేను మీ కాజ్ఞాపించువాటినిచేసినయెడల, మీరు నా స్నేహితులైయుందురు.౹

15 దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను, ఎందుకనగా నేను నా తండ్రివలన వినిన సంగతులన్నిటిని మీకు తెలియజేసితిని.౹

16 మీరు నన్ను ఏర్పరచుకొనలేదు; మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకనుగ్రహించునట్లు మీరు వెళ్లి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని.౹

17 మీరు ఒకనినొకడు ప్రేమింపవలెనని యీ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను.౹

18 లోకము మిమ్మును ద్వేషించినయెడల మీకంటె ముందుగా నన్ను ద్వేషించెనని మీరెరుగుదురు.౹

19 మీరు లోక సంబంధులైనయెడల లోకము తన వారిని స్నేహించును; అయితే మీరు లోకసంబంధులు కారు; నేను మిమ్మును లోకములోనుండి ఏర్పరచుకొంటిని; అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది.౹

20 – దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కాడని నేను మీతో చెప్పినమాట జ్ఞాపకము చేసికొనుడి. లోకులు నన్ను హింసించినయెడల మిమ్మును కూడ హింసింతురు; నా మాట గైకొనినయెడల, మీ మాట కూడ గైకొందురు.౹

21 అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటినన్నిటిని మీకు చేయుదురు.౹

22 నేను వచ్చి వారికి బోధింపకుండినయెడల, వారికి పాపము లేకపోవును; ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు.౹

23 నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడ ద్వేషించుచున్నాడు.౹

24 ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండినయెడల వారికి పాపము లేకపోవును; ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించియున్నారు.౹

25 అయితే

–నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి

అని వారి ధర్మశాస్త్రములో వ్రాయబడిన వాక్యము నెర వేరునట్లు ఈలాగు జరిగెను.౹

26 తండ్రియొద్దనుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త,అనగా తండ్రి యొద్దనుండి బయలుదేరు సత్యస్వరూపియైనఆత్మవచ్చి నప్పుడు ఆయన నన్నుగూర్చి సాక్ష్యమిచ్చును.౹

27 మీరు మొదటనుండి నాయొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JHN/15-c085d433741a79caeea2da4632c9fce3.mp3?version_id=1787—

Categories
యోహాను

యోహాను 16

1 మీరు అభ్యంతరపడకుండవలెనని యీ మాటలు మీతో చెప్పుచున్నాను.౹

2 వారు మిమ్మును సమాజమందిరములలోనుండి వెలివేయుదురు; మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవచేయుచున్నానని అనుకొను కాలమువచ్చుచున్నది.౹

3 వారు తండ్రిని నన్నును తెలిసికొనలేదు గనుక ఈలాగు చేయుదురు.౹

4 అవి జరుగుకాలము వచ్చినప్పుడు నేను వాటినిగూర్చి మీతో చెప్పితినని మీరు జ్ఞాపకము చేసికొనులాగున యీ సంగతులు మీతో చెప్పుచున్నాను; నేను మీతోకూడ ఉంటిని గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు.౹

5 ఇప్పుడు నన్ను పంపినవాని యొద్దకు వెళ్లుచున్నాను –నీవు ఎక్కడికి వెళ్లు చున్నావని మీలో ఎవడును నన్నడుగుటలేదు గాని౹

6 నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండియున్నది.౹

7 అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవుటవలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్లనియెడల ఆదరణకర్తమీయొద్దకు రాడు; నేను వెళ్లినయెడల ఆయనను మీయొద్దకు పంపుదును.౹

8 ఆయన వచ్చి, పాపమునుగూర్చియు నీతిని గూర్చియు తీర్పునుగూర్చియు లోకమును ఒప్పుకొనజేయును.౹

9-11 లోకులు నాయందు విశ్వాసముంచలేదు గనుక పాపమునుగూర్చియు, నేను తండ్రి యొద్దకు వెళ్లుటవలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు, ఈ లోకాధికారి తీర్పు పొంది యున్నాడు గనుక తీర్పునుగూర్చియు ఒప్పుకొన జేయును.౹

12 నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని యిప్పుడు మీరు వాటిని సహింప లేరు.౹

13 అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైనఆత్మవచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును.౹

14 ఆయన నా వాటిలోనివి తీసికొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమ పరచును.౹

15 తండ్రికి కలిగినవన్నియు నావి, అందుచేత ఆయన నావాటిలోనివి తీసికొని మీకు తెలియజేయునని నేను చెప్పితిని.౹

16 కొంచెము కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు; మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని చెప్పెను.౹

17 కాబట్టి ఆయన శిష్యులలో కొందరు–కొంచెము కాలమైన తరువాత నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు, నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నాననియు, ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని యొకనితో ఒకరు చెప్పుకొనిరి.౹

18 –కొంచెము కాలమని ఆయన చెప్పుచున్న దేమిటి? ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకొనిరి.౹

19 వారు తన్ను అడుగ గోరుచుండిరని యేసు యెరిగి వారితో ఇట్లనెను–కొంచెము కాలమైన తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని నేను చెప్పిన మాటనుగూర్చి మీరు ఒకనితో ఒకడు ఆలోచించుకొనుచున్నారా?౹

20 మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును; మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.౹

21 స్త్రీ ప్రసవించునప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదనపడును; అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషముచేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసికొనదు.౹

22 అటువలె మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరల చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీయొద్దనుండి తీసివేయడు.౹

23 ఆ దినమున మీరు దేని గూర్చియు నన్ను అడుగరు; మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.౹

24 ఇదివరకు మీరేమియు నా పేరట అడుగలేదు; మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును.

25 ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పితిని; అయితే నేనిక యెన్నడును గూఢార్థముగా మీతో మాటలాడక తండ్రినిగూర్చి మీకు స్పష్టముగా తెలియ జెప్పుగడియ వచ్చుచున్నది.౹

26 ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు.౹

27 మీరు నన్ను ప్రేమించి, నేను దేవునియొద్దనుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు.౹

28 నేను తండ్రియొద్దనుండి బయలుదేరి లోకమునకు వచ్చియున్నాను; మరియు లోకమును విడిచి తండ్రియొద్దకు వెళ్లుచున్నానని వారితో చెప్పెను.

29 ఆయన శిష్యులు–ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమియు చెప్పక స్పష్టముగా మాటలాడుచున్నావు.౹

30 సమస్తము ఎరిగినవాడవనియు, ఎవడును నీకు ప్రశ్నవేయ నగత్యము లేదనియు, ఇప్పుడెరుగుదుము; దేవునియొద్దనుండి నీవు బయలుదేరి వచ్చితివని దీనివలన నమ్ముచున్నామని చెప్పగా౹

31 యేసు వారిని చూచి–మీరిప్పుడు నమ్ము చున్నారా?౹

32 యిదిగో మీలో ప్రతివాడును ఎవని యింటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది; అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను.౹

33 నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాననెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JHN/16-63a95cf62d2402aa44641bfa6deacfa3.mp3?version_id=1787—

Categories
యోహాను

యోహాను 17

1 యేసు ఈ మాటలు చెప్పి ఆకాశమువైపు కన్నులెత్తి యిట్లనెను–తండ్రీ, నా గడియ వచ్చియున్నది.౹

2 నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమ పరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారికందరికిని ఆయన నిత్యజీవము అనుగ్రహించునట్లు సర్వశరీరులమీదను ఆయనకు అధికారమిచ్చితివి.౹

3 అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము.౹

4 చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమ పరచితిని.౹

5 తండ్రీ, లోకము పుట్టకమునుపు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమ పరచుము.౹

6 లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. వారు నీవారై యుండిరి, నీవు వారిని నాకనుగ్రహించితివి; వారు నీ వాక్యము గైకొని యున్నారు.౹

7 నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చియున్నాను; వారామాటలను అంగీకరించి, నేను నీయొద్దనుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి, నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక౹

8 నీవు నాకు అనుగ్ర హించినవన్నియు నీవలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి యున్నారు.౹

9 నేను వారికొరకు ప్రార్థన చేయుచున్నాను; లోకముకొరకు ప్రార్థన చేయుటలేదు, నీవు నాకు అనుగ్ర హించియున్నవారు నీవారైనందున వారికొరకే ప్రార్థన చేయుచున్నాను.౹

10 నావన్నియు నీవి, నీవియు నావి; వారియందు నేను మహిమపరచబడి యున్నాను.౹

11 నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు; నేను నీయొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రీ, మనము ఏకమై యున్నలాగునవారును ఏకమై యుండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము.౹

12 నేను వారియొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించినవారిని నీ నామమందు కాపాడితిని; నేను వారిని భద్రపరచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు.౹

13 ఇప్పుడు నేను నీయొద్దకు వచ్చుచున్నాను; నా సంతోషము వారియందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను.౹

14 వారికి నీ వాక్యమిచ్చియున్నాను. నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును.

15 నీవు లోకములోనుండి వారిని తీసికొనిపొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టునినుండివారిని కాపాడు మని ప్రార్థించుచున్నాను.౹

16 నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు.౹

17 సత్యమందువారిని ప్రతిష్ఠ చేయుము; నీ వాక్యమే సత్యము.౹

18 నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని.౹

19 వారును సత్యమందుప్రతిష్ఠచేయబడునట్లు వారికొరకై నన్ను ప్రతిష్ఠ చేసికొనుచున్నాను.౹

20-21 మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున, వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమైయుండ వలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను.౹

22 మనము ఏకమై యున్నలాగున, వారును ఏకమై యుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని.౹

23 వారియందు నేనును నాయందు నీవును ఉండుటవలనవారు సంపూర్ణులుగా చేయబడి యేకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడ ప్రేమించితివనియు, లోకము తెలిసికొనునట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని.౹

24 తండ్రీ, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించినవారును నాతోకూడ ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడకమునుపే నీవు నన్ను ప్రేమించితివి.౹

25 నీతి స్వరూపుడవగు తండ్రీ, లోకము నిన్ను ఎరుగలేదు; నేను నిన్ను ఎరుగుదును; నీవు నన్ను పంపితివని వీరెరిగి యున్నారు.౹

26 నీవు నాయందు ఉంచిన ప్రేమ వారియందు ఉండునట్లును, నేను వారియందు ఉండునట్లును, వారికి నీ నామమును తెలియజేసితిని, ఇంకను తెలియ జేసెదనని చెప్పెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JHN/17-352c96852add0ec9582e6ba055492ed1.mp3?version_id=1787—

Categories
యోహాను

యోహాను 18

1 యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతోకూడ కెద్రోను వాగు దాటి పోయెను. అక్కడ ఒక తోట యుండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతోకూడ వెళ్లెను.౹

2 యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్లు చుండువాడు గనుక, ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసియుండెను.౹

3 కావున యూదా సైనికులను, ప్రధానయాజకులు పరిసయ్యులు పంపిన బంట్రౌతులను వెంటబెట్టుకొని, దివిటీలతోను దీపములతోను ఆయుధములతోను అక్కడికి వచ్చెను.౹

4 యేసు తనకు సంభవింపబోవున వన్నియు ఎరిగినవాడై వారియొద్దకు వెళ్లి–మీరెవని వెదకుచున్నారని వారిని అడిగెను.౹

5 వారు–నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా యేసు–ఆయనను నేనే అని వారితో చెప్పెను; ఆయనను అప్పగించిన యూదాయు వారియొద్ద నిలుచుండెను.౹

6 ఆయన–నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేలమీద పడిరి.౹

7 మరల ఆయన–మీరు ఎవనిని వెదకుచున్నారని వారిని అడిగెను. అందుకు వారు–నజరేయుడైన యేసునని చెప్పగా౹

8 యేసు వారితో–నేనే ఆయనని మీతో చెప్పితిని గనుక మీరు నన్ను వెదకుచున్నయెడల వీరిని పోనియ్యుడని చెప్పెను.౹

9 –నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు చెప్పెను.౹

10 సీమోను పేతురునొద్ద కత్తియుండినందున అతడు దానిని దూసి, ప్రధానయాజకుని దాసుని కొట్టి అతని కుడిచెవి తెగ నరికెను.౹

11 ఆ దాసునిపేరు మల్కు. యేసు–కత్తి ఒరలో ఉంచుము; తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నె లోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను.

12 అంతట సైనికులును సహస్రాధిపతియు, యూదుల బంట్రౌతులును యేసును పట్టుకొని ఆయనను బంధించి, మొదట అన్నయొద్దకు ఆయనను తీసికొనిపోయిరి.౹

13 అతడు ఆ సంవత్సరము ప్రధానయాజకుడైన కయపకు మామ.౹

14 కయప–ఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు.

15 సీమోను పేతురును మరియొక శిష్యుడును యేసు వెంబడి పోవుచుండిరి. ఆ శిష్యుడు ప్రధానయాజకునికి నెళవైనవాడు గనుక అతడు ప్రధానయాజకుని యింటి ముంగిటిలోనికి యేసుతోకూడ వెళ్లెను.౹

16 పేతురు ద్వారము నొద్ద బయట నిలుచుండెను గనుక ప్రధానయాజకునికి నెళవైన ఆ శిష్యుడు బయటికి వచ్చి ద్వారపాలకురాలితో మాటలాడి పేతురును లోపలికి తోడుకొనిపోయెను.౹

17 ద్వారమునొద్ద కావలియున్న యొక చిన్నది పేతురుతో నీవును ఈ మనుష్యుని శిష్యులలో ఒకడవు కావా? అని చెప్పగా అతడు–కాననెను.౹

18 అప్పుడు చలివేయుచున్నందున దాసులును బంట్రౌతులును మంటవేసి చలి కాచుకొనుచు నిలుచుండగా పేతురును వారితో నిలువబడి చలికాచుకొనుచుండెను.

19 ప్రధానయాజకుడు ఆయన శిష్యులనుగూర్చియు ఆయన బోధనుగూర్చియు యేసును అడుగగా౹

20 యేసు–నేను బాహాటముగా లోకము ఎదుట మాటలాడితిని; యూదులందరు కూడివచ్చు సమాజమందిరములలోను దేవాలయములోను ఎల్లప్పుడును బోధించితిని; రహస్యముగా నేనేమియు మాటలాడలేదు.౹

21 నీవు నన్ను అడుగనేల? నేను వారికేమి బోధించినది విన్నవారిని అడుగుము; ఇదిగో నేను చెప్పినది వీరెరుగుదురని అతనితో అనెను.౹

22 ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచియున్న బంట్రౌతులలో ఒకడు – ప్రధానయాజకునికి ఈలాగు ఉత్తరమిచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను.౹

23 అందుకు యేసు–నేను కాని మాట ఆడినయెడల ఆ కాని మాట ఏదో చెప్పుము; మంచిమాట ఆడినయెడల నన్నేల కొట్టుచున్నావనెను.౹

24 అంతట అన్న, యేసును బంధింపబడియున్నట్టుగానే ప్రధానయాజకుడైన కయప యొద్దకు పంపెను.

25 సీమోను పేతురు నిలువబడి చలి కాచుకొనుచుండగా వారతని చూచి–నీవును ఆయన శిష్యులలో ఒకడవుకావా? అని చెప్పగా అతడు–నేను కాను, నేనెరుగననెను.౹

26 పేతురు ఎవని చెవి తెగనరికెనో వాని బంధువును ప్రధానయాజకుని దాసులలో ఒకడును–నీవు తోటలో అతనితోకూడ ఉండగా నేను చూడలేదా? అని చెప్పినందుకు౹

27 పేతురు నేనెరుగనని మరియొకసారి చెప్పెను; వెంటనే కోడి కూసెను.

28 వారు కయపయొద్దనుండి అధికారమందిరమునకు యేసును తీసికొనిపోయిరి. అప్పుడు ఉదయమాయెను గనుక వారు మైలపడకుండ పస్కాను భుజింపవలెనని అధికారమందిరములోనికి వెళ్లలేదు.౹

29 కావున పిలాతు బయట ఉన్నవారియొద్దకు వచ్చి–ఈ మనుష్యునిమీద మీరు ఏ నేరము మోపుచున్నారనెను.౹

30 అందుకు వారు–వీడు దుర్మార్గుడు కానియెడల వీనిని నీకు అప్పగించియుండ మని అతనితో చెప్పిరి.౹

31 పిలాతు–మీరతని తీసికొనిపోయి మీ ధర్మశాస్త్రముచొప్పున అతనికి తీర్పుతీర్చుడనగా౹

32 యూదులు–ఎవనికిని మరణశిక్ష విధించుటకు మాకు అధికారములేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టిమరణము పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరెను.

33 పిలాతు తిరిగి అధికారమందిరములో ప్రవేశించి యేసును పిలిపించి–యూదుల రాజువు నీవేనా? అని ఆయన నడుగగా౹

34 యేసు–నీ అంతట నీవే యీ మాట అనుచున్నావా? లేక యితరులు నీతో నన్నుగూర్చి యిది చెప్పిరా? అని అడిగెను.౹

35 అందుకు పిలాతు–నేను యూదు డనా యేమి? నీ స్వజనమును ప్రధానయాజకులును నిన్ను నాకు అప్పగించిరిగదా; నీవేమి చేసితివని అడుగగా౹

36 యేసు–నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు; నా రాజ్యము ఈ లోకసంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహసంబంధమైనది కాదనెను.౹

37-38 అందుకు పిలాతు–నీవు రాజువా? అని ఆయనను అడుగగా యేసు–నీవన్నట్టు నేను రాజునే; సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని; సత్యసంబంధియైన ప్రతివాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు–సత్యమనగా ఏమిటి? అని ఆయనతో చెప్పెను.

అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్లి–అతనియందు ఏ దోషమును నాకు కనబడలేదు;౹

39 అయినను పస్కాపండుగలో నేనొకని మీకు విడుదల చేయువాడుక కలదు గదా; నేను యూదుల రాజును విడుదల చేయుట మీకిష్టమా? అని వారినడిగెను.౹

40 అయితే వారు–వీనిని వద్దు, బరబ్బను విడుదలచేయుమని మరల కేకలువేసిరి. ఈ బరబ్బ బందిపోటుదొంగ.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JHN/18-91f36f2363fa8ac980075eecc5683786.mp3?version_id=1787—

Categories
యోహాను

యోహాను 19

1 అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను.౹

2 సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తలమీద పెట్టి౹

3 ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయనయొద్దకు వచ్చి–యూదుల రాజా, శుభమని చెప్పి ఆయనను అర చేతులతో కొట్టిరి.౹

4 పిలాతు మరల వెలుపలికి వచ్చి–ఇదిగో ఈయనయందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియునట్లు ఈయనను మీయొద్దకు వెలుపలికి తీసికొని వచ్చుచున్నానని వారితో అనెను.౹

5 ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించినవాడై, యేసు వెలుపలికి రాగా, పిలాతు–ఇదిగో ఈ మనుష్యుడుఅని వారితో చెప్పెను.౹

6 ప్రధానయాజకులును బంట్రౌతులును ఆయనను చూచి–సిలువవేయుము సిలువవేయుము అని కేకలువేయగా పిలాతు–ఆయనయందు ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసికొనిపోయి సిలువవేయుడని వారితో చెప్పెను.౹

7 అందుకు యూదులు–మాకొక నియ మము కలదు; తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పు కొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెనని అతనితో చెప్పిరి.౹

8 పిలాతు ఆ మాట విని మరి యెక్కు వగా భయపడి, తిరిగి అధికారమందిరములో ప్రవేశించి౹

9 –నీవెక్కడ నుండి వచ్చితివని యేసును అడిగెను; అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు౹

10 గనుక పిలాతు–నాతో మాటలాడవా? నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువవేయుటకు నాకు అధికారము కలదనియు నీ వెరుగవా? అని ఆయనతో అనెను.౹

11 అందుకు యేసు–పైనుండి నీకు ఇయ్యబడి యుంటేనే తప్ప నామీద నీకు ఏ అధికారమును ఉండదు; అందుచేత నన్ను నీకు అప్పగించినవానికి ఎక్కువ పాపము కలదనెను.౹

12 ఈ మాటనుబట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నముచేసెను గాని యూదులు–నీవు ఇతని విడుదల చేసితివా కైసరునకు స్నేహితుడవు కావు; తాను రాజునని చెప్పుకొను ప్రతివాడును కైసరునకు విరోధముగా మాటలాడుచున్నవాడే అని కేకలువేసిరి.౹

13 పిలాతు ఈ మాటలు విని, యేసును బయటికి తీసికొనివచ్చి, రాళ్లు పరచిన స్థలమందు న్యాయపీఠముమీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బతా అని పేరు.౹

14 ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము; అప్పుడు ఉదయము ఆరు గంటలు కావచ్చెను. అతడు–ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా౹

15 అందుకు వారు–ఇతనిని సంహరించుము, సంహరించుము, సిలువవేయుము అని కేకలు వేసిరి. పిలాతు–మీ రాజును సిలువవేయుదునా? అని వారిని అడుగగా ప్రధానయాజకులు–కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి.౹

16 అప్పుడు సిలువవేయబడుటకై అతడాయనను వారికి అప్పగించెను.

17 వారు యేసును తీసికొనిపోయిరి. ఆయన తన సిలువ మోసికొని కపాలస్థలమను చోటికి వెళ్లెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు.౹

18 అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకనినిమధ్యను యేసును ఉంచి ఆయనతోకూడ ఇద్దరిని సిలువవేసిరి.౹

19 మరియు పిలాతు–యూదులరాజైన నజరేయుడగు యేసు అను పైవిలాసము వ్రాయించి సిలువమీద పెట్టించెను.౹

20 యేసు సిలువవేయబడిన స్థలము పట్టణమునకు సమీపమైయుండెను, అది హెబ్రీ గ్రీకు రోమా భాషలలో వ్రాయబడెను గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి.౹

21 –నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయుము గాని–యూదులరాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధానయాజకులు పిలాతుతో చెప్పగా౹

22 పిలాతు–నేను వ్రాసిన దేమో వ్రాసితిననెను.

23 సైనికులు యేసును సిలువవేసిన తరువాత ఆయన వస్ర్తములు తీసికొని,యొక్కొక్క సైనికునికి ఒక్కొక భాగము వచ్చునట్లు వాటిని నాలుగు భాగములు చేసిరి. ఆయన అంగీని కూడ తీసికొని, ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది గనుక౹

24 వారు–దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసరము చీట్లు వేయుదమని యొకరితో ఒకరు చెప్పుకొనిరి.వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ

కోసరము చీట్లు వేసిరి

అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను; ఇందుకే సైనికులు ఈలాగు చేసిరి.౹

25 ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్యయైన మరియయు, మగ్దలేనే మరియయు యేసు సిలువయొద్ద నిలుచుండిరి.౹

26 యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలు చుండుట చూచి–అమ్మా, యిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను,౹

27 తరువాత శిష్యుని చూచి–యిదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియనుండి ఆ శిష్యుడు ఆమెను తన యింట చేర్చుకొనెను.

28 అటుతరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు–నేను దప్పిగొనుచున్నాననెను.౹

29 చిరకతో నిండియున్న యొక పాత్ర అక్కడ పెట్టియుండెను గనుక వారు ఒక స్పంజీ చిరకతో నింపి, హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందిచ్చిరి.౹

30 యేసు ఆ చిరక పుచ్చుకొని–సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించెను.

31 ఆ దినము సిద్ధపరచుదినము; మరుసటి విశ్రాంతిదినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతిదినమున సిలువ మీద ఉండకుండునట్లు, వారి కాళ్లు విరుగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి.౹

32 కాబట్టి సైనికులు వచ్చి ఆయనతోకూడ సిలువవేయబడిన మొదటి వాని కాళ్లను రెండవవాని కాళ్లను విరుగగొట్టిరి.౹

33 వారు యేసునొద్దకు వచ్చి, అంతకుముందే ఆయన మృతిపొంది యుండుట చూచి ఆయన కాళ్లు విరుగగొట్టలేదు గాని౹

34 సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడి చెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను.౹

35 ఇది చూచినవాడు సాక్ష్యమిచ్చుచున్నాడు; అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయ నెరుగును.

36 –అతని యెముకలలో ఒకటైనను విరువబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను.

37 మరియు –తాము పొడిచినవానితట్టు చూతురు

అని మరియొక లేఖనము చెప్పుచున్నది.

38 అటుతరువాత, యూదుల భయమువలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయియ యోసేపు, తాను యేసు దేహమును తీసికొనిపోవుటకు పిలాతు నొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను. గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసికొనిపోయెను.౹

39 మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నీకొదేము కూడ బోళముతో కలిపిన అగరు రమారమి నూట ఏబది సేర్ల యెత్తు తెచ్చెను.౹

40 అంతట వారు యేసు దేహమును ఎత్తికొని వచ్చి, యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి.౹

41 ఆయనను సిలువవేసిన స్థలములో ఒక తోట యుండెను; ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్తసమాధియొకటి యుండెను.౹

42 ఆ సమాధి సమీపములో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందునవారు అందులో యేసును పెట్టిరి.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JHN/19-d6f198cff9df0a29fe5d5b85fd8a7f59.mp3?version_id=1787—

Categories
యోహాను

యోహాను 20

1 ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్ద లేనే మరియ పెందలకడ సమాధియొద్దకు వచ్చి, సమాధి మీద ఉండిన రాయి తీయబడియుండుట చూచెను.౹

2 గనుక ఆమె పరుగెత్తికొని సీమోను పేతురునొద్దకును యేసు ప్రేమించిన ఆ మరియొక శిష్యునియొద్దకును వచ్చి –ప్రభువును సమాధిలోనుండి యెత్తికొనిపోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో యెరుగమని చెప్పెను.౹

3 కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధియొద్దకు వచ్చిరి.౹

4 వారిద్దరును కూడి పరుగెత్తుచుండగా, ఆ శిష్యుడు పేతురుకంటే త్వరగా పరుగెత్తి ముందుగా సమాధియొద్దకు వచ్చి౹

5 వంగి నారబట్టలు పడియుండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు.౹

6 అంతట సీమోను పేతురు అతని వెంబడి వచ్చి, సమాధిలో ప్రవేశించి,౹

7 నారబట్టలు పడియుండుటయు, ఆయన తల రుమాలు నార బట్టలయొద్ద ఉండక వేరుగా ఒకటచోట చుట్టిపెట్టియుండుటయు చూచెను.౹

8 అప్పుడు మొదట సమాధియొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను.౹

9 ఆయన మృతులలోనుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి.౹

10 అంతట ఆ శిష్యులు తిరిగి తమ వారియొద్దకు వెళ్లిపోయిరి.

11 అయితే మరియ సమాధి బయట నిలిచి యేడ్చు చుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా,౹

12 తెల్లని వస్త్రములు ధరించిన యిద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ల వైపున ఒకడును కూర్చుండుట కనబడెను.౹

13 వారు– అమ్మా, యెందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె–నా ప్రభువును ఎవరో యెత్తికొనిపోయిరి; ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను.౹

14 ఆమె యీ మాట చెప్పి వెనుకతట్టు తిరిగి, యేసు నిలిచియుండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు.౹

15 యేసు–అమ్మా యెందుకు ఏడ్చుచున్నావు, ఎవనిని వెదకు చున్నావు? అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని–అయ్యా, నీవు ఆయనను మోసికొనిపోయినయెడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తికొని పోదునని చెప్పెను.౹

16 యేసు ఆమెను చూచి–మరియా అనిపిలిచెను. ఆమె ఆయనవైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూనీ అనిపిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము.౹

17 యేసు ఆమెతో నేను ఇంకను తండ్రియొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరులయొద్దకు వెళ్లి–నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను.౹

18 మగ్దలేనే మరియ వచ్చి–నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను.

19 ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, తాము కూడియున్న యింటి తలుపులు మూసి కొనియుండగా యేసు వచ్చిమధ్యను నిలిచి–మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను.౹

20 ఆయన ఆలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి.౹

21 అప్పుడు యేసు–మరల మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపినప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పెను.౹

22 ఆయన ఈ మాట చెప్పి వారిమీద ఊది–పరిశుద్ధాత్మను పొందుడి.౹

23 మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును; ఎవరి పాపములు మీరు నిలిచియుండ నిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను.

24 యేసు వచ్చినప్పుడు, పండ్రెండుమందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేకపోయెను౹

25 గనుక తక్కిన శిష్యులు–మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు–నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి, నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పెను.

26 ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితోకూడ ఉండెను. తలుపులు మూయబడియుండగా యేసు వచ్చిమధ్యను నిలిచి–మీకు సమాధానము కలుగును గాక అనెను.౹

27 తరువాత తోమాను చూచి–నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము; నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను.౹

28 అందుకు తోమా ఆయనతో–నా ప్రభువా, నా దేవా అనెను.౹

29 యేసు–నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులని అతనితో చెప్పెను.

30 మరియు అనేకమైన యితర సూచకక్రియలను యేసు తన శిష్యులయెదుట చేసెను; అవి యీ గ్రంథమందు వ్రాయబడియుండలేదు గాని౹

31 యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JHN/20-07602eb3832b884d6f95e55feddb94be.mp3?version_id=1787—

Categories
యోహాను

యోహాను 21

1 అటుతరువాత యేసు తిబెరియ సముద్రతీరమున శిష్యులకు మరల తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా౹

2 సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతనయేలును, జెబెదయి కుమారులును, ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి యుండిరి.౹

3 సీమోను పేతురు–నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు–మేమును నీతోకూడ వచ్చెదమనిరి. వారు వెళ్లి దోనె ఎక్కిరి కాని ఆ రాత్రి యేమియు పట్టలేదు.౹

4 సూర్యోదయమగుచుండగా యేసు దరిని నిలిచెను, అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు.౹

5 యేసు– పిల్లలారా, భోజనమునకు మీయొద్ద ఏమైన ఉన్నదా? అని వారిని అడుగగా,౹

6 లేదని వారాయనతో చెప్పిరి . అప్పుడాయన–దోనె కుడిప్రక్కను వల వేయుడి మీకు దొరుకునని చెప్పెను గనుక వారాలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి.౹

7 కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు–ఆయన ప్రభువు సుమీ అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభువని సీమోను పేతురు విని, వస్ర్తహీనుడై యున్నందున పైబట్టవేసి సముద్రములో దుమికెను.౹

8 దరియించుమించు ఇన్నూరు మూరల దూరమున్నందున తక్కిన శిష్యులు చేపలుగల వల లాగుచు ఆ చిన్న దోనెలో వచ్చిరి.౹

9 వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులును వాటిమీద ఉంచబడిన చేపలును రొట్టెయు కనబడెను.౹

10 యేసు–మీరిప్పుడు పెట్టిన చేపలలో కొన్ని తీసికొని రండని వారితో చెప్పగా౹

11 సీమోను పేతురు దోనె ఎక్కి వలను దరికిలాగెను; అది నూట ఏబది మూడు గొప్ప చేపలతో నిండియుండెను;౹

12 చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు–రండి భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున–నీవెవడవని శిష్యులలో ఎవడును ఆయనను అడుగ తెగింపలేదు.౹

13 యేసు వచ్చి ఆ రొట్టెను తీసికొని వారికి పంచిపెట్టెను. ఆలాగే చేపలను కూడ పంచిపెట్టెను.౹

14 యేసు మృతులలోనుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది యిది మూడవసారి.

15 వారు భోజనముచేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి–యోహాను కుమారుడవైన సీమోనూ, వీరికంటె నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అని అడుగగా అతడు–అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను; యేసు–నా గొఱ్ఱెపిల్లలను మేపుమని అతనితో చెప్పెను.౹

16 మరల ఆయన–యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమించుచున్నావా? అని రెండవసారి అతనిని అడుగగా అతడు–అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను; ఆయన–నా గొఱ్ఱెలను కాయుమని చెప్పెను.౹

17 మూడవసారి ఆయన–యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమించుచున్నావా? అని అతనిని అడిగెను. – నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి–ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను.౹

18 యేసు – నా గొఱ్ఱెలను మేపుము. నీవు యౌవనుడవై యుండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెళ్లుచుంటివి; నీవు ముసలివాడవైనప్పుడు నీచేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుముకట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసికొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను.౹

19 అతడు ఎట్టి మరణమువలన దేవుని మహిమపరచునో దాని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. ఇట్లు చెప్పి–నన్ను వెంబడించుమని అతనితో అనెను.౹

20 పేతురు వెనుకకు తిరిగి, యేసు ప్రేమించినవాడును, భోజనపంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని–ప్రభువా, నిన్ను అప్పగించువాడెవడని అడిగినవాడునైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను.౹

21 పేతురు అతనిని చూచి–ప్రభువా, యితని సంగతి ఏమగునని యేసును అడిగెను.౹

22 యేసు–నేను వచ్చువరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి? నీవు నన్ను వెంబడించు మనెను.౹

23 కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులలో ప్రచురమాయెను. అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు గాని–నేను వచ్చువరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమని చెప్పెను.

24 ఈ సంగతులనుగూర్చి సాక్ష్యమిచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే; ఇతని సాక్ష్యము సత్యమని యెరు గుదుము.

25 యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసినయెడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/JHN/21-999b045c4e9e65b1908f28fd5f8420e9.mp3?version_id=1787—

Categories
అపొస్తలుల కార్యములు

అపొస్తలుల కార్యములు 1

1 ఓ థెయొఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపొస్తలులకు పరిశుద్ధాత్మద్వారా ఆజ్ఞాపించిన౹

2 తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినమువరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటినిగూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని.౹

3 ఆయన శ్రమపడిన తరువాత నలువది దినములవరకు వారి కగపడుచు, దేవుని రాజ్యవిషయములనుగూర్చి బోధించుచు, అనేక ప్రమాణములనుచూపి వారికి తన్నుతాను సజీవునిగా కనుపరచుకొనెను.౹

4 ఆయన వారిని కలిసికొని యీలాగు ఆజ్ఞాపించెను–మీరు యెరూషలేమునుండి వెళ్లక, నావలన వినిన తండ్రియొక్క వాగ్దానముకొరకు కనిపెట్టుడి;౹

5 యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలోబాప్తిస్మము పొందెదరనెను.

6 కాబట్టి వారు కూడివచ్చినప్పుడు–ప్రభువా, యీ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించెదవా? అని ఆయనను అడుగగా ఆయన౹

7 –కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని యున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పనికాదు.౹

8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చునప్పుడు మీరు శక్తినొందెదరు గనుక మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురని వారితో చెప్పెను.౹

9 ఈ మాటలు చెప్పి, వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను, అప్పుడు వారి కన్నులకు కనబడకుండ ఒక మేఘము ఆయనను కొనిపోయెను.౹

10 ఆయన వెళ్లుచుండగా, వారు ఆకాశమువైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన యిద్దరు మనుష్యులు వారియొద్ద నిలిచి౹

11 –గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచుచున్నారు? మీయొద్దనుండి పరలోకమునకు చేర్చుకొన బడిన యీ యేసే, ఏ రీతిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి.

12 అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండనుండి యెరూషలేమునకు తిరిగి వెళ్లిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతిదినమున నడవదగినంత సమీపమున ఉన్నది.౹

13 వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతేఅనబడిన సీమోను, యాకోబు కుమారుడగుయూదా అనువారు.౹

14 వీరందరును, వీరితోకూడ కొందరు స్త్రీలును, యేసు తల్లియైన మరియయు ఆయన సహోదరులును ఏకమనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి.

15 ఆ కాలమందు ఇంచుమించు నూట ఇరువదిమంది సహోదరులు కూడియుండగా పేతురు వారి మధ్యనిలిచి ఇట్లనెను౹

16 –సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదానుగూర్చి పరిశుద్ధాత్మ దావీదుద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి యుండెను.౹

17 అతడు మనలో ఒకడుగా ఎంచబడినవాడై యీ పరిచర్యలో పాలుపొందెను.౹

18 ఈ యూదా ద్రోహమువలన సంపాదించిన రూకల నిచ్చియొక పొలము కొనెను. అతడు తలక్రిందుగాపడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నియు బయటికి వచ్చెను.౹

19 ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికందరికి తెలియ వచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దమ అన బడియున్నది; దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా

20 –అతని యిల్లు పాడైపోవునుగాక

దానిలో ఎవడును కాపురముండక పోవునుగాక

అతని యుద్యోగము వేరొకడు తీసికొనునుగాక

అని కీర్తనల గ్రంథములో వ్రాయబడియున్నది.౹

21-22 కాబట్టి యోహాను బాప్తిస్మమిచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మనయొద్దనుండి పరమునకు చేర్చుకొనబడిన దినమువరకు, ఆయన మన మధ్య సంచరించుచుండిన కాల మంతయు మనతో కలిసియున్న వీరిలో ఒకడు, మనతోకూడ ఆయన పునరుత్థానమునుగూర్చి సాక్షియై యుండుట ఆవశ్యకమని చెప్పెను.౹

23 అప్పుడు వారు యూస్తు అను మారుపేరుగల బర్సబ్బా అనబడిన యోసేపు, మత్తీయ అను ఇద్దరిని నిలువబెట్టి౹

24 ఇట్లని ప్రార్థనచేసిరి–అందరి హృదయములను ఎరిగియున్న ప్రభువా,౹

25 తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన యీ పరి చర్యలోను అపొస్తలత్వములోను పాలుపొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనినవానిని కనబరచుమనిరి.౹

26 అంతట వారు వీరినిగూర్చి చీట్లువేయగా మత్తీయపేరట చీటి వచ్చెను గనుక అతడు పదునొకండుమంది అపొస్తలులతోకూడ లెక్కింపబడెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ACT/1-13fe834e0f84c97f746488d3eafd778a.mp3?version_id=1787—

Categories
అపొస్తలుల కార్యములు

అపొస్తలుల కార్యములు 2

1 పెంతెకొస్తను పండుగదినము వచ్చినప్పుడు అందరు ఒకచోట కూడియుండిరి.౹

2 అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యొకధ్వని ఆకాశమునుండి అకస్మాత్తుగా, వారు కూర్చుండియున్న యిల్లంతయు నిండెను.౹

3 మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ౹

4 అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి.

5 ఆ కాలమున ఆకాశము క్రిందనుండు ప్రతి జనములోనుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి.౹

6 ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడివచ్చి, ప్రతిమనుష్యుడు తన తన స్వభాషతో వారు మాటలాడుట విని కలవరపడిరి.౹

7 అంతట అందరు విభ్రాంతినొంది ఆశ్చర్యపడి–ఇదిగో మాటలాడుచున్న వీరందరు గలిలయులు కారా?౹

8 మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపుభాషతో వీరు మాటలాడుట మనము వినుచున్నామే; ఇదేమి?౹

9 పార్తీయులు మాదీయులు ఏలామీయులు, మెసొపొతమియ యూదయ కప్పదొకియ, పొంతు ఆసియ ఫ్రుగియ పంఫూలియ ఐగుప్తు అను దేశములయందలివారు,౹

10 కురేనేదగ్గర లిబియ ప్రాంతములయందు కాపురమున్నవారు, రోమానుండి పరవాసులుగా వచ్చినవారు, యూదులు, యూదమత ప్రవిష్టులు,౹

11 క్రేతీయులు అరబీయులు మొదలైన మన మందరమును, వీరు మన భాషలతో దేవుని గొప్పకార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి.౹

12 అందరు విభ్రాంతినొంది యెటుతోచక యిదేమగునో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి.౹

13 కొందరైతే–వీరు క్రొత్త మద్యముతో నిండియున్నారని అపహాస్యము చేసిరి.

14 అయితే పేతురు ఆ పదునొకరితోకూడ లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను–యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, యిది మీకు తెలియుగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి.౹

15 మీరు ఊహించునట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుబొడిచి జామయిన కాలేదు.౹

16 యోవేలు ప్రవక్త ద్వారా చెప్ప బడిన సంగతి యిదే, ఏమనగా

17 –అంత్యదినములయందు నేను

మనుష్యులందరిమీద నాఆత్మను కుమ్మరించెదను

మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచించెదరు

మీ యౌవనులకు దర్శనములు కలుగును

మీ వృద్ధులు కలలు కందురు.

18 ఆ దినములలో నా దాసులమీదను నా దాసురాండ్ర మీదను

నాఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు.

19 పైన ఆకాశమందు మహత్కార్యములను

క్రింద భూమిమీద సూచకక్రియలను

రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగజేసెదను.

20 ప్రభువుప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు

సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు.

21 అప్పుడుప్రభువునామమునుబట్టి ప్రార్థనచేయు

వారందరును రక్షణపొందుదురు

అని దేవుడు చెప్పుచున్నాడు.

22 ఇశ్రాయేలువారలారా, యీ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసుచేత అద్భుతములను మహత్కార్యములను సూచకక్రియలను మీమధ్యను చేయించి, ఆయనను తనవలన మెప్పుపొందినవానిగా మీకు కనబర చెను; ఇది మీరే యెరుగుదురు.౹

23 దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యద్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యీయనను మీరు దుష్టులచేతసిలువ వేయించి చంపితిరి.౹

24 మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపెను.

25 ఆయననుగూర్చి దావీదు ఇట్లనెను

–నేనెల్లప్పుడు నా యెదుటప్రభువును చూచు చుంటిని

ఆయన నా కుడిపార్శ్వముననున్నాడు గనుక నేను కదల్చబడను.

26 కావున నా హృదయము ఉల్లసించెను; నా నాలుక ఆనందించెను

మరియు నా శరీరము కూడ నిరీక్షణ గలిగి నిలకడగా ఉండును.

27 నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు

నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు.

28 నాకు జీవమార్గములు తెలిపితివి

నీ దర్శన మనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు.

29 సహోదరులారా, మూలపురుషుడగు దావీదునుగూర్చి మీతో నేను ధారాళముగ మాటలాడవచ్చును. అతడు చనిపోయి సమాధిచేయబడెను;౹

30 అతని సమాధి నేటివరకు మన మధ్య నున్నది. అతడు ప్రవక్తయైయుండెను గనుక

–అతని గర్భఫలములోనుండి అతని సింహాసనముమీద

ఒకని కూర్చుండబెట్టుదును

అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టుపెట్టుకొనిన సంగతి అతడెరిగి,౹

31 క్రీస్తుపాతాళములో విడువబడలేదనియు, ఆయన శరీరము కుళ్లిపోలేదనియు దావీదు ముందుగా తెలిసికొని ఆయన పునరుత్థానమునుగూర్చి చెప్పెను.౹

32 ఈ యేసును దేవుడు లేపెను; దీనికిమేమందరము సాక్షులము.౹

33 కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి, పరిశుద్ధాత్మనుగూర్చిన వాగ్దానమును తండ్రివలన పొంది, మీరు చూచుచు వినుచునున్న దీనిని కుమ్మరించియున్నాడు.౹

34 దావీదు పరలోకమునకు ఎక్కి పోలేదు; అయితే అతడిట్లనెను–

నేను నీ శత్రువులను నీ పాదములక్రింద పాదపీఠ

ముగా ఉంచువరకు

35 నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని

ప్రభువునా ప్రభువుతో చెప్పెను.

36 మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశ మంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను.

37 వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని–సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడుగగా౹

38 పేతురు–మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.౹

39 ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికిని, అనగాప్రభువైనమన దేవుడు తనయొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను.౹

40 ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి–మీరు మూర్ఖులగుఈ తరమువారికి వేరై రక్షణపొందుడని వారిని హెచ్చరించెను.౹

41 కాబట్టి అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు మూడువేలమంది చేర్చబడిరి.౹

42 వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి.

43 అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములును సూచకక్రియలును అపొస్తలుల ద్వారా జరిగెను.౹

44 విశ్వసించినవారందరు ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి.౹

45 ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి, అందరికిని వారి వారి అక్కరకొలది పంచిపెట్టిరి.౹

46 మరియు వారేకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరివలన దయపొందినవారై౹

47 ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్నవారిని అనుదినము వారితో చేర్చుచుండెను.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/ACT/2-55a56797364608570253f193c02f79b6.mp3?version_id=1787—