Categories
యెహెజ్కేలు

యెహెజ్కేలు 6

1 యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

2 –నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల పర్వతములతట్టు చూచి వాటివిషయమై యీ మాటలు ప్రకటించుము

3 –ఇశ్రాయేలీయుల పర్వతములారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి; పర్వతములతోను కొండలతోను వాగులతోను లోయలతోను ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–ఇదిగో నేను నిజముగా మీ మీదికి ఖడ్గమును రప్పించి మీ ఉన్నతస్థలములను నాశనము చేసెదను.౹

4 మీ బలిపీఠములు పాడై పోవును, సూర్యదేవతకు నిలిపిన స్తంభములు ఛిన్నా భిన్నములవును, మీ బొమ్మల యెదుట మీ జనులను నేను హతము చేసెదను.౹

5 ఇశ్రాయేలీయుల కళేబరములను వారి బొమ్మలయెదుట పడవేసి, మీ యెముకలను మీ బలిపీఠములచుట్టు పారవేయుదును.౹

6 నేనే యెహోవానై యున్నానని మీరు తెలిసికొనునట్లు మీ బలిపీఠములు విడువబడి పాడైపోవును, మీ విగ్రహములు ఛిన్నా భిన్నములగును, సూర్యదేవతకు మీరు నిలిపిన స్తంభములు పడ గొట్టబడును, మీ పనులు నాశనమగును, మీ నివాస స్థలములన్నిటిలో నున్న మీ పట్టణములు పాడైపోవును, మీ ఉన్నతస్థలములు విడువబడును,౹

7 మీ జనులు హతులై కూలుదురు.౹

8 అయినను మీరు ఆయా దేశములలో చెదరిపోవునప్పుడు ఖడ్గమును తప్పించుకొను కొందరిని నేను మీలో శేషముగా అన్యజనులమధ్య ఉండనిచ్చెదను.౹

9 మరియు నన్ను విసర్జించినవారి విశ్వాసఘాతకమైన వ్యభిచారమనస్సును, విగ్రహముల ననుసరించిన వ్యభిచారదృష్టిని నేను మార్చి నాతట్టు తిరుగజేయగా, చెరపట్టబడినవారై శేషించినవారు అన్యజనులమధ్య నన్ను జ్ఞాపకము చేసికొని, తామనుసరించిన హేయకృత్యములన్నిటినిబట్టి తాము చేసిన దుష్క్రియలను కనుగొని తమ్మును తామే అసహ్యించుకొనుచు

10 నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు; ఈ కీడు వారికి చేసెదనని నేను చెప్పినమాట వ్యర్థము కాదు.

11 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా – నీచేతులు చరిచి నేల తన్ని ఇశ్రాయేలీయుల దుష్టమైన హేయకృత్యములనుబట్టి అయ్యో అని అంగలార్చుము; ఖడ్గముచేతను క్షామముచేతను తెగులుచేతను వారు కూలుదురు.౹

12 దూరముననున్నవారు తెగులుచేత చత్తురు, దగ్గర నున్నవారు ఖడ్గముచేత కూలుదురు, శేషించి ముట్టడి వేయబడినవారు క్షామముచేత చత్తురు; ఈ ప్రకారము నేను వారి మీద నా క్రోధము తీర్చుకొందును.౹

13 తమ విగ్రహములమధ్యను తాముకట్టిన బలిపీఠములచుట్టును ఎత్తయిన కొండలన్నిటిమీదను సకల పర్వతముల నడి కొప్పులమీదను పచ్చని చెట్లన్నిటి క్రిందను, పుష్టిపారిన మస్తకి వృక్షములన్నిటిక్రిందను, తమ విగ్రహములన్నిటికి పరిమళ ధూపమువేసిన చోటులన్నిటిలోను పడి వారి జనులు హతులైయుండు కాలమున నేనే యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు.౹

14 నేను వారికి విరోధినై వారు నివసించు స్థలములన్నిటిలో వారి దేశమును దిబ్లాతు అరణ్యము కంటె మరి నిర్జనముగాను పాడుగానుచేయగా నేనే యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZK/6-14ce563c43db601af431f4d1cc9ea170.mp3?version_id=1787—

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *