1 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
2 –నరపుత్రుడా, ప్రవచించు చున్న ఇశ్రాయేలీయుల ప్రవక్తలకు విరోధముగా ప్రవ చించి, మనస్సువచ్చినట్లు ప్రవచించువారితో నీవీలాగు చెప్పుము–యెహోవా మాట ఆలకించుడి.౹
3 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–దర్శనమేమియు కలుగ కున్నను స్వబుద్ధిననుసరించు అవివేక ప్రవక్తలకు శ్రమ.౹
4 ఇశ్రాయేలీయులారా, మీ ప్రవక్తలు పాడైన స్థలములలో నుండు నక్కలతో సాటిగా ఉన్నారు.౹
5 యెహోవా దినమున ఇశ్రాయేలీయులు యుద్ధమందు స్థిరముగా నిలుచునట్లు మీరు గోడలలోనున్న బీటల దగ్గర నిలువరు, ప్రాకారమును దిట్టపరచరు.౹
6 వారు వ్యర్థమైన దర్శనములు చూచి, అబద్ధపు సోదె చూచి యెహోవా తమ్మును పంపక పోయినను, తాము చెప్పినమాట స్థిరమని నమ్మునట్లు ఇది యెహోవా వాక్కు అని చెప్పుదురు.౹
7 నేను సెలవియ్యకపోయినను–ఇది యెహోవా వాక్కు అని మీరు చెప్పినయెడల మీరు కనినది వ్యర్థమైన దర్శనముగదా? మీరు నమ్మదగని సోదెగాండ్రయితిరి గదా?
8 కావున ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్థకమైన దర్శనములు కనుచున్నారు గనుక నేను మీకు విరోధిని; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹
9 వ్యర్థమైన దర్శనములు కనుచు, నమ్మదగని సోదెగాండ్రయిన ప్రవక్తలకు నేను పగవాడను, వారు నా జనుల సభలోనికి రారు, ఇశ్రాయేలీయుల సంఖ్యలో చేరినవారు కాక పోదురు, వారు ఇశ్రాయేలీయుల దేశములోనికి తిరిగి రారు, అప్పుడు నేను ప్రభువైన యెహోవానని మీరు తెలిసికొందురు.౹
10 సమాధానమేమియు లేకపోయినను వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు; నా జనులు మంటిగోడను కట్టగా వారు వచ్చి దానిమీద గచ్చుపూత పూసెదరు.౹
11 ఇందువలననే పూయుచున్న వారితో నీ విట్లనుము–వర్షము ప్రవాహముగా కురియును, గొప్ప వడగండ్లు పడును, తుపాను దాని పడగొట్టగా అది పడిపోవును.౹
12 ఆ గోడ పడగా జనులు మిమ్మును చూచి–మీరు పూసిన పూత యేమాయెనని అడుగుదురు గదా?
13 ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా – నేను రౌద్రము తెచ్చుకొని తుపానుచేత దానిని పడగొట్టుదును, నాకోపమునుబట్టి వర్షము ప్రవాహముగా కురియును, నా రౌద్రమునుబట్టి గొప్ప వడగండ్లు పడి దానిని లయపరచును,౹
14 దాని పునాది కనబడునట్లు మీరు గచ్చుపూత పూసిన గోడను నేను నేలతో సమముగా కూల్చెదను, అది పడిపోగా దానిక్రింద మీరును నాశనమగుదురు, అప్పుడు నేను యెహోవానని మీరు తెలిసికొందురు.౹
15 ఈలాగున ఆ గోడమీదను దానిమీద గచ్చుపూత పూసినవారిమీదను నాకోపము నేను తీర్చుకొని, ఆ గోడకును దానికి పూత పూసినవారికిని పనితీరెనని మీతో చెప్పుదును.౹
16 యెరూషలేమునకు సమాధానము లేకపోయినను ఆ పూత పూయువారు సమాధానార్థమైన దర్శనములు కనుచు ప్రవచించువారు ఇశ్రాయేలీయుల ప్రవక్తలే; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
17 మరియు నరపుత్రుడా, మనస్సునకు వచ్చినట్టు ప్రవచించు నీ జనుల కుమార్తెలమీద కఠినదృష్టియుంచి వారికి విరోధముగా ఈలాగు ప్రవచింపుము
18 –ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–మనుష్యులను వేటాడ వలెనని చేతుల కీళ్లన్నిటికిని గుడ్డలుకుట్టి, యెవరి యెత్తు చొప్పున వారి తలలకు ముసుకులుచేయుస్త్రీలారా, మీకు శ్రమ; మీరు నా జనులను వేటాడి మిమ్మును రక్షించుకొందురు.౹
19 అబద్ధపుమాటల నంగీకరించు నా జనులతో అబద్ధపుమాటలు చెప్పుచు, చేరెడు యవలకును రొట్టెముక్కలకును ఆశపడి మరణమునకు పాత్రులు కాని వారిని చంపుచు, బ్రదుకుటకు అపాత్రులైన వారిని బ్రదికించుచు నా జనులలో మీరు నన్ను దూషించెదరు.౹
20 కావున ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నేను దుఃఖపరచని నీతిమంతుని మనస్సును అబద్ధములచేత మీరు దుఃఖింపజేయుదురు, దుర్మార్గులు తమ దుష్‌ప్రవర్తన విడిచి తమ ప్రాణములను రక్షించు కొనకుండ మీరు వారిని ధైర్యపరతురు గనుక
21 మనుష్యులను వేటాడుటకై మీరు కుట్టు గుడ్డలకు నేను విరోధినై వారిని విడిపించెదను, మీ కౌగిటిలోనుండి వారిని ఊడ బెరికి, మీరు వేటాడు మనుష్యులను నేను విడిపించి తప్పించుకొననిచ్చెదను.౹
22 మరియు నేను యెహోవానని మీరు తెలిసికొనునట్లు మీరు వేసిన ముసుకులను నేను చింపి మీ చేతిలోనుండి నా జనులను విడిపించెదను, వేటాడుటకు వారికను మీ వశమున ఉండరు.౹
23 మీరికను వ్యర్థమైన దర్శనములు కనకయుందురు, సోదె చెప్పక యుందురు; నేను యెహోవానని మీరు తెలిసికొనునట్లు నా జనులను మీ వశమునుండి విడిపించెదను.
—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZK/13-e09830b5c80204ba5126f28fbe913030.mp3?version_id=1787—