Categories
యెహెజ్కేలు

యెహెజ్కేలు 23

1 మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను

2 –నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన యిద్దరు స్త్రీలు కలరు.౹

3 వీరు ఐగుప్తుదేశములో జారత్వము చేసిరి, యౌవనకాలమందే జారత్వము చేయుచు వచ్చిరి, అక్కడ వారికి ఆలింగనమాయెను, అక్కడ వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి.౹

4 వారిలో పెద్దదాని పేరు ఒహొలా, ఆమె సహోదరి పేరు ఒహొలీబా. వీరు నాకు పెండ్లి చేయబడినవారై కుమారులను కుమార్తెలను కనిరి–ఒహొలాయను పేరు షోమ్రో నునకును, ఒహొలీబాయను పేరు యెరూషలేమునకును చెందుచున్నవి.౹

5 ఒహొలా నాకు పెండ్లిచేయబడినను వ్యభిచారముచేసి

6 తన విటకాండ్రమీద బహుగా ఆశపెట్టుకొని, ధూమ్రవర్ణముగల వస్త్రములు ధరించుకొనిన సైన్యాధిపతులును అధికారులును అందముగల యౌవనులును గుఱ్ఱములెక్కు రౌతులును అగు అష్షూరువారిని మోహించెను.౹

7 అది కాముకురాలిరీతిగా అష్షూరువారిలో ముఖ్యులగు వారందరియెదుట తిరుగుచు, వారందరితో వ్యభిచరించుచు, వారు పెట్టుకొనిన విగ్రహములన్నిటిని పూజించుచు అపవిత్రురాలాయెను.౹

8 మరియు ఐగుప్తులో నేర్చుకొనిన జారత్వమును ఇది మానకయుండెను, అచ్చ టనే దాని యౌవనమందే పురుషులు దానితో శయనించిరి, దాని చనులను ఆలింగనము చేసిరి, కాముకులై దానితో విశేషముగా వ్యభిచారము చేసిరి.౹

9 కావున దాని విటకాండ్రకు నేను దానిని అప్పగించియున్నాను, అది మోహించిన అష్షూరువారికి దానిని అప్పగించియున్నాను.౹

10 వీరు దాని మానాచ్ఛాదనము తీసిరి, దాని కుమారులను కుమార్తెలను పట్టుకొని దానిని ఖడ్గముచేత చంపిరి; యీలాగున ఆమె స్త్రీలలో అపకీర్తిపాలై శిక్ష నొందెను.

11 దాని చెల్లెలైన ఒహొలీబా దానిని చూచి కాము కత్వమందు దానిని మించి అక్కచేసిన జారత్వములకంటె మరి ఎక్కువగా జారత్వము చేసెను.౹

12 ప్రశస్త వస్త్రములు ధరించినవారును సైన్యాధిపతులును అధికారులును గుఱ్ఱములెక్కు రౌతులును సౌందర్యముగల యౌవనులును అగు అష్షూరువారైన తన పొరుగువారిని అది మోహించెను.౹

13 అది అపవిత్రురాలాయెననియు, వారిద్దరును ఏకరీతినే ప్రవర్తించుచున్నారనియు నాకు తెలిసెను.౹

14 మరియు అది యధికముగా వ్యభిచారము చేయవలెనని కోరినదై, మొలలకు నడికట్లును తలలమీద చిత్రవర్ణము గల పాగాలును పెట్టుకొని రాచకళలుగలవారై

15 సిందూరముతో పూయబడి గోడమీద చెక్కబడినవారై, తమ జన్మదేశమైన కల్దీయులదేశపు బబులోను వారివంటి కల్దీయుల పటములను చూచి మోహించెను.౹

16 అది వారిని చూచినవెంటనే మోహించి కల్దీయదేశమునకు వారి యొద్దకు దూతలను పంపి వారిని పిలిపించుకొనగా

17 బబులోను వారు సంభోగము కోరివచ్చి జారత్వముచేత దానిని అపవిత్రపరచిరి; వారిచేత అది అపవిత్రపరచబడిన తరువాత, దాని మనస్సు వారికి యెడమాయెను.౹

18 ఇట్లు అది జారత్వము అధికముగాచేసి తన మానాచ్ఛాదనము తీసి వేసికొనెను గనుక దాని అక్క విషయములో నేను ఆశాభగ్నుడనైనట్టు దాని విషయములోను ఆశాభగ్నుడ నైతిని.౹

19 మరియు యౌవనదినములందు ఐగుప్తు దేశములో తాను జరిగించిన వ్యభిచారము మనస్సునకు తెచ్చుకొని అది మరి ఎక్కువగా వ్యభిచారము చేయుచు వచ్చెను.౹

20 గాడిద గుఱ్ఱములవంటి సిగ్గుమాలిన మోహముగల తన విటకాండ్రయందు అది మోహము నిలుపుచుండెను.౹

21 యౌవనకాలమందు నీవు ఐగుప్తీయులచేత నీ చనులను నలిపించుకొనిన సంగతి జ్ఞాపకము చేసికొని నీ బాల్యకాలపు దుష్కార్యమును చేయవలెనని నీవు చూచుచుంటివి.

22 కావున ఒహొలీబా, ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–నీ మనస్సునకు ఎడమైపోయిన నీ విటకాండ్రను రేపి నలుదిక్కులు వారిని నీమీదికి రప్పించెదను.౹

23 గుఱ్ఱములనెక్కు బబులోనువారిని కల్దీయులను అధిపతులను ప్రధానాధికారులనందరిని అష్షూరీయులను సౌందర్యముగల శ్రేష్ఠులను అధిపతులను అధికారులను శూరులను మంత్రులను అందరిని నీమీదికి నేను రప్పించుచున్నాను.౹

24 ఆయుధములు పట్టుకొని చక్రములుగల రథములతోను గొప్ప సైన్యముతోను వారు నీమీదికి వచ్చి, కేడెములను డాళ్లను పట్టుకొని శిరస్త్రాణములు ధరించుకొని వారు నీమీదికి వచ్చి నిన్ను చుట్టుకొందురు, వారు తమ మర్యాదచొప్పున నిన్ను శిక్షించునట్లు నేను నిన్నుగూర్చిన తీర్పు వారికప్పగింతును.౹

25 ఉగ్రతతో వారు నిన్ను శిక్షించునట్లు నా రోషము నీకు చూపుదును, నీ చెవులను నీ ముక్కును వారు తెగగోయుదురు, నీలో శేషించినవారు ఖడ్గముచేత కూలుదురు, నీ కుమారులను నీ కుమార్తెలను వారు పట్టుకొందురు, నీలో శేషించినవారు అగ్నిచేత దహింపబడుదురు.౹

26 నీ బట్టలను లాగివేసి నీ సొగసైన నగలను అపహరించుదురు.౹

27 ఐగుప్తును నీవిక కోరకయు, అచ్చట నీవు చేసిన వ్యభిచారమిక మనస్సునకు తెచ్చుకొనకయు నుండునట్లు ఐగుప్తుదేశమందుండి నీవు చేసిన వ్యభిచారమును దుష్కార్యమును నీలో నుండకుండ ఈలాగున మాన్పించెదను.౹

28 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–నీవు ద్వేషించినవారికిని నీ మనస్సు ఎడమైన వారికిని నిన్ను అప్పగించుచున్నాను.౹

29 ద్వేషముచేత వారు నిన్ను బాధింతురు, నీ కష్టార్జితమంతయు పట్టుకొని నిన్ను వస్త్రహీనముగాను దిగంబరిగాను విడుతురు; అప్పుడు నీ వేశ్యాత్వమును నీ దుష్కార్యములును నీ జారత్వమును వెల్లడియగును.౹

30 నీవు అన్యజనులతో చేసిన వ్యభిచారమునుబట్టియు నీవు వారి విగ్రహములను పూజించి అపవిత్రపరచుకొనుటనుబట్టియు నీకు ఇవి సంభవించును; నీ అక్క ప్రవర్తించినట్టు నీవును ప్రవర్తించితివి గనుక అది పానము చేసిన పాత్రను నీ చేతికిచ్చెదను.౹

31-32 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–నీ అక్క పానము చేసిన, లోతును వెడల్పునుగల పాత్రలోనిది నీవును పానము చేయవలెను. అందులో పానము చేయ వలసినది చాలయున్నది గనుక ఎగతాళియు అపహాస్యమును నీకు తటస్థించెను.౹

33 నీ అక్కయైన షోమ్రోను పాత్ర వినాశోపద్రవములతో నిండినది, నీవు దానిలో నిది త్రాగి మత్తురాలవై దుఃఖముతో నింపబడుదువు.౹

34 అడుగుమట్టునకు దాని పానముచేసి పాత్రను చెక్కలు చేసి వాటితో నీ స్తనములను పెరుకుకొందువు; నేనే మాటయిచ్చియున్నాను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.౹

35 ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు–నీవు నన్ను మరచి వెనుకకు త్రోసివేసితివి గనుక నీ దుష్కార్యములకును వ్యభిచారమునకును రావలసిన శిక్షను నీవు భరించెదవు.

36 మరియు యెహోవా నాకీలాగు సెలవిచ్చెను–నర పుత్రుడా, ఒహొలాకును ఒహొలీబాకును నీవు తీర్పు తీర్చుదువా? అట్లయితే వారి హేయకృత్యములను వారికి తెలియజేయుము.౹

37 వారు వ్యభిచారిణులును నరహత్య చేయువారునై విగ్రహములతో వ్యభిచరించి, నాకు కనిన కుమారులను విగ్రహములు మ్రింగునట్లు వారిని వాటికి ప్రతిష్ఠించిరి.౹

38 వారీలాగున నాయెడల జరిగించుచున్నారు; అదియుగాక ఆ దినమందే, వారు నా పరిశుద్ధస్థలమును అపవిత్రపరచిన దినమందే, నేను నియమించిన విశ్రాంతిదినములను సామాన్యదినములుగా ఎంచిరి.౹

39 తాము పెట్టుకొనిన విగ్రహములపేరట తమ పిల్లలను చంపిననాడే వారు నా పరిశుద్ధస్థలములో చొచ్చి దాని నపవిత్రపరచి, నామందిరములోనే వారీలాగున చేసిరి.౹

40 మరియు దూరముననున్నవారిని పిలిపించుకొనుటకై వారు దూతను పంపిరి; వారు రాగా వారికొరకు నీవు స్నానముచేసి కన్నులకు కాటుకపెట్టుకొని ఆభరణములు ధరించుకొని

41 ఘనమైన మంచముమీద కూర్చుండి బల్లను సిద్ధపరచి దానిమీద నా పరిమళ ద్రవ్యమును తైలమును పెట్టితివి.౹

42 ఆలాగున జరుగగా, అచ్చట ఆమెతో ఉండిన వేడుకగాండ్ర సమూహముయొక్క సందడి వినబడెను. సమూహమునకు చేరిన త్రాగుబోతులు వారియొద్దకు ఎడారి మార్గమునుండి వచ్చిరి, వారు ఈ వేశ్యల చేతులకు కడియములు తొడిగి వారి తలలకు పూదండలు చుట్టిరి.౹

43 వ్యభిచారము చేయుటచేత బలహీనురాలైన దీనితో నేనీలాగంటిని–అది మరెన్నటికిని వ్యభిచారముచేయక మానదు.౹

44 వేశ్యతో సాంగత్యముచేయునట్లువారు దానితో సాంగత్యము చేయుదురు, ఆలాగుననే వారు కాముకురాండ్రయిన ఒహొలాతోను ఒహొలీబాతోను సాంగత్యము చేయుచువచ్చిరి.౹

45 అయితే వ్యభిచారిణులకును నరహంతకురాండ్రకును రావలసిన శిక్ష నీతిపరులైనవారు వీరికి తగినట్టుగా విధింతురు; వారు వ్యభిచారిణులే, నరహత్యచేయ యత్నించుదురు.౹

46 ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–వారిమీదికి నేను సైన్యమును రప్పింతును, శత్రువులు వారిని బాధించుటకై దోపుడు సొమ్ముగా వారిని అప్పగింతును.౹

47 ఆ సైనికులు రాళ్లు రువ్వి వారిని చంపుదురు, ఖడ్గముచేత హతము చేయుదురు, వారి కుమారులను కుమార్తెలను చంపుదురు, వారి యిండ్లను అగ్నిచేత కాల్చివేయుదురు.౹

48 స్త్రీలందరు మీ కామాతురతచొప్పున చేయకూడదని నేర్చుకొనునట్లు మీ కామాతురతను దేశములో నుండకుండ మాన్పించుదును.౹

49 నేనే యెహోవానని మీరు తెలిసికొనునట్లు మీ కామాతురతకు శిక్ష విధింపబడును, విగ్రహములను పూజించిన పాపమును మీరు భరించుదురు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZK/23-144711f14cf62cd1b4a01f55b3c31b17.mp3?version_id=1787—

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *