Categories
యెహెజ్కేలు

యెహెజ్కేలు 47

1 అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని . వచ్చెను; మందిరము తూర్పుముఖముగా ఉండెను, నేను చూడగా మందిరపు గడపక్రిందనుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడిప్రక్కను క్రిందనుండి పారు చుండెను,౹

2 పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపుమార్గముగా నన్ను నడిపించి చుట్టు త్రిప్పి తూర్పునకు పోవుదారిని బయటిగుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడిప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను.౹

3 ఆ మనుష్యుడు కొలనూలు చేతపట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్లి వెయ్యి మూరలు కొలిచి ఆ నీళ్లగుండ నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను.౹

4 ఆయన మరి వెయ్యి మూరలు కొలిచి నీళ్లగుండ నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ల లోతుండెను, ఇంక ఆయన వెయ్యిమూరలు కొలిచి నీళ్లగుండ నన్ను నడిపింపగా నీళ్లు మొల లోతుండెను.౹

5 ఆయన ఇంకను వెయ్యి మూరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాట లేనంత నది కనబడెను, దాట వీలులేకుండ ఈదవలసినంత నీరుగల నదియాయెను.౹

6 అప్పుడాయన నాతో ఇట్లనెను–నరపుత్రుడా, నీవు చూచితివిగదా అని చెప్పి నన్ను మరల నది యిద్దరికి తోడుకొనివచ్చెను.౹

7 నేను తిరిగిరాగా నదీతీరమున ఇరు ప్రక్కల చెట్లు విస్తారముగా కనబడెను.౹

8 అప్పుడాయన నాతో ఇట్లనెను–ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరబాలోనికి దిగి సముద్రములో పడును, అప్పుడు సముద్రపునీళ్లు మంచినీళ్లు అగును.౹

9 వడిగా పారు ఈ నది వచ్చుచోట్లనెల్ల జలచరములన్నియు బ్రదుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుటవలన ఆ నీరు మంచి నీళ్లగును గనుక చేపలు బహు విస్తారములగును; ఈ నది యెక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రదుకును.౹

10 మరియు దానియొద్ద ఏన్గెదీ పట్టణము మొదలుకొని ఏనెగ్లా యీము పట్టణమువరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు; మహాసముద్రములోనున్నట్లు సకల జాతి చేపలును దానియందు బహు విస్తారముగా నుండును.౹

11 అయితే ఆ సముద్రపు బురద స్థలములును ఊబిస్థలములును ఉప్పుగలవైయుండి బాగుకాక యుండును.౹

12 నదీతీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకలజాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికిని రాలవు. ఈ నదినీరు పరిశుద్ధ స్థలములోనుండి పారుచున్నది గనుక ఆచెట్లు నెల నెలకు కాయలు కాయును, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును.

13 ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–సరిహద్దులనుబట్టి ఇశ్రాయేలీయుల పండ్రెండు గోత్రముల ప్రకారము మీరు స్వాస్థ్యముగా పంచుకొనవలసిన భూమి యిది; యోసేపు సంతతికి రెండు భాగములియ్యవలెను.౹

14 నేను ప్రమాణముచేసి మీపితరులకు ఈ దేశము ఇచ్చితిని గనుక ఏమియు భేదములేకుండ మీలో ప్రతివాడును దానిలో స్వాస్థ్యమునొందును; ఈలాగున అది మీకు స్వాస్థ్యమగును.౹

15 ఉత్తర దిక్కున సెదాదునకు పోవు మార్గమున మహాసముద్రము మొదలుకొని హెత్లోనువరకు దేశమునకు సరిహద్దు.౹

16 అది హమాతునకును బేరోతా యునకును దమస్కు సరిహద్దునకును హమాతు సరిహద్దునకును మధ్యనున్న సిబ్రయీమునకును హవ్రాను సరిహద్దును ఆనుకొను మధ్యస్థలమైన హాజేరునకును వ్యాపిం చును.౹

17 పడమటి సరిహద్దు హసరేనాను అను దమస్కు సరిహద్దు పట్టణము, ఉత్తరపు సరిహద్దు హమాతు; ఇది మీకు ఉత్తరపు సరిహద్దు.౹

18 తూర్పుదిక్కున హవ్రాను దమస్కు గిలాదులకును ఇశ్రాయేలీయుల దేశమునకును మధ్య యొర్దానునది సరిహద్దుగా ఉండును; సరిహద్దు మొదలుకొని తూర్పు సముద్రమువరకు దాని కొలువవలెను; ఇది మీకు తూర్పు సరిహద్దు.౹

19 దక్షిణదిక్కున తామారు మొదలుకొని కాదేషునొద్దనున్న మెరీబా ఊటలవరకును నది మార్గమున మహాసముద్రమునకు మీ సరిహద్దు పోవును; ఇది మీకు దక్షిణపు సరిహద్దు.౹

20 పశ్చిమదిక్కున సరిహద్దు మొదలుకొని హమాతునకు పోవు మార్గమువరకు మహాసముద్రము సరిహద్దుగా ఉండును; ఇది మీకు పశ్చిమదిక్కు సరిహద్దు.౹

21 ఇశ్రాయేలీయుల గోత్రముల ప్రకారము ఈ దేశమును మీరు పంచుకొనవలెను.౹

22 మీరు చీట్లువేసి మీకును మీలో నివసించి పిల్లలు కనిన పరదేశులకును స్వాస్థ్యములను విభజించు నప్పుడు ఇశ్రాయేలీయులలో దేశమందు పుట్టినవారినిగా ఆ పరదేశులను మీరు ఎంచవలెను, ఇశ్రాయేలు గోత్రికులతో పాటు తామును స్వాస్థ్యము నొందునట్లు మీవలె వారును చీట్లు వేయవలెను.౹

23 ఏ గోత్రములో పరదేశులు కాపురముందురో ఆ గోత్ర భాగములో మీరు వారికి స్వాస్థ్యము ఇయ్యవలెను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.

—https://api-cdn.youversionapi.com/audio-bible-youversionapi/672/32k/EZK/47-28940105f8f625fdf7389782a3a6049e.mp3?version_id=1787—

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *